కాశీమజిలీకథలు/ఏడవ భాగము/132వ మజిలీ

వికీసోర్స్ నుండి

132 వ మజిలీ

కుశలవులకథ

అయ్య వనధంబొక పట్టణము అందలి వింతలం జూచివచ్చి గోపకుమారుండు మణిసిద్ధునకు నమస్క రించుచు స్వామీ ! యిన్న గరంబున నొక చతుష్పధంబున నొక శిలావిగ్రహము గలదు. దాని ఫాలభాగంబున వికటదంతుఁడని వ్రాయఁ బడియున్నది. దంతములు నిమ్నోన్నతములుగా నుండ టంబట్టి యట్టిపేరు పెట్టియుందురు. అది యొకవింతగాదు వినుండు. ఆవీధిని వచ్చుచుపోవువారెల్ల నావిగ్రహముపై నుమిసి పోవు చుందురు. అందుల కారణమేమియో తెలిసినదికాదు. మీవలనం దెలియఁగోరి వేగముగా వచ్చితిని. తత్కారణంబరసి యావృత్తాంత మెరింగింపుఁడు నేడింతకంటె వేరొకవింత గనంబడలేదని ప్రార్థించిన నాయోగిపుంగవుండు మణిప్రభావంబునఁ దత్కధావిశే షంబాకలించుకొని యిట్లు చెప్పందొడంగెను.

వత్సా ! విను మిప్పురంబునకుఁ బూర్వము కాంచీపురంబని పేరుగలదు. ఇందుఁ బూర్వము చంద్రగుప్తుండను రాజు ప్రజలం బాలింపుచుండెను? అతనికి ధర్మపతి యను భార్యగలదు ఆమె సుగుణంబులు గణనాతీతంబులు సంతతము వేదాంతగోష్టి జేయుచుండెను. మిక్కిలి చక్కనిది. సౌభాగ్యమునకే యలంకారప్రీతి భోగేచ్చబూ నదు. భర్త ప్రవృత్తి నిరతుండగుట నతని మనసు రంజించునట్లు మాట్లాడును.

ఒక వసంతకాలమున నానృపాలుండు భార్యతోఁ గూడ బహువిధ కుసుమఫల దళ విలసితంబగు నుద్యానవనంబున కరిగి యందలి విశేషంబులు భార్య కెరింగించుచు విహరించెను.


చ. వరలు వియోగినీ విరహవహ్నికి నాహుతివేల్చఁ బొల్చు భా
    సుర సహకారమంజరులుచూచి మడించెఁ బికంబులి త్తరిన్
    సురత పరిశ్రమాతిశయ సూదనముల్‌ విహరించెఁ బాటలీ
    పరిమళ బారచోరములు బంధుర చందనశై లవాతముల్‌.

మనోహారిణీ ! యీ వసంతకాలములో నీవెన్నెల రాత్రులందు మలయమారుత ములు మేనికి హాయిసేయ విలాసాలసలగు కిసలయ పాణులతో లతామంటపములఁ గ్రీడించు పురుషుల కిందఁభోగములేమిటికి? అనుటయు నాతరుణి చిఱునగవు మొగము నకు నగయై మెఱయ భర్తకిట్లనియె.


శ్లో. రమ్యాశ్చంద్రమరీచయ స్తృణవతీ రమ్యావనాంతస్థలీ
    రమ్యం సాధుమహాసమాగతసుఖ౦ కావ్యేషు రమ్యాః కధాః


    కోపోపాహితబాష్పబిందుతరళం రమ్యం ప్రియాయా ముఖం
    సర్వం రమ్య మనిత్యతాముపగతె చిత్తైన కించిత్పునః.

మనోహరా ? వెన్నెలరాత్రులు మలయమారుతములు లతామంటపములు శృంగారచేష్టలు కధలు ప్రియురాండ్రమొగములో నగునవి యన్నియు రమ్యము లనియే చెప్పఁదగినది. కాని భూతములయొక్క యనిత్యత దెలిసినచిత్తమునకివి యేమియు రుచింపవుసుడీ అనిపలికిన నాఱేఁడు చాలు చాలు వృద్దులాడు మాటలాడు చుంటివేమిటికి? వికసించియున్న యీపలాశకుసుమ మెట్లున్నదియో యుత్ప్రేక్షింపుము అనుటయు నవ్వనితారత్నము విద్యారహితుల సౌందర్యము దర్శనీయమైనను స్తోత్ర పాత్రము గాదని పరిమళశూన్యములగునీపూవుల దెలుపు చున్నవని యుత్తరముజెప్పినది.

అతండప్పుడు ఔరా? నీదారి మారిపోవుచున్నది. వినుము “సీ. పూచె మోదుగులు సొంపుగఁగానలచ్చికిఁ జైత్రుఁడుంచిన నఖక్షతములనఁగ” సరిగానున్న దియా? అని యడిగిన నప్పడఁతి యప్రతిహత ప్రతిభగల మీ వాక్యమునకుఁ దప్పులు పట్టువారెవ్వరు? అని యుత్తరముఁజెప్పినది. ప్రేయసీ! పండుటాకురాలిచి కొత్త చిగురు ధరించిన యీ గున్నమామిడిచెట్టు శోభయెట్లున్నదియో చెప్పుమనుటయు నాజవరాలు -


గీ. తను విపాతంబుగ్రాగ నుత్పత్తి మరల
   గలుగు దేహుల కిట్లని తెలుపుచుండె
   పండుటాకులు రాలినపట్ల మరల
   చిగురులెత్తుట సృష్టివైచిత్ర్యమిదియె.

అని పలికిన విని నవ్వుచు నానృపాలుఁ డట్లుకాదు వినుము.

గీ. పండుటాకు రాల గన్పండువుగను
   మొలకలెత్తెడు పల్ల వములు నెలంత
   ప్రాతనగలను విడిచి హొంబట్ట క్రొత్త
   భూషణంబుల గైసేయు పొలుపుదోచె.

అట్లు భర్త శృంగారలీలాతరంగిణి తాంతరంగుండై పలుకుచుండ నయ్యండ జయాన వైరాగ్యోదయ సూచకములగు మాటలచే నుత్తరము జెప్పుచుండియు నొచ్చు నేమోయని కమ్మర నమ్మనుజపతి సమ్మోదమందునట్లు సంభాషించుచుండెను.

నృపతియుఁ దన సతి విరక్తియెఱింగి అయ్యో? యీతొయ్యలి యనన్యసా మాన్య సౌందర్యాభిరామయయ్యు శృంగార విలాసలాలస గాక విరాగిణియైయున్నది దీనిబుద్ధి మరల్పవలయుననితలంచి శృంగార ప్రబంధములు దెప్పించి చదివింపు చుండును. అమ్మ త్తకాశినియు భర్త చిత్తవృత్తియరసి అయ్యో యీతండు సకలవిద్యా పారంగతుడయ్యుఁ బ్రవృత్తి మార్గనిరంతుండయ్యెఁ గొంతకాల మరిగినంగాని వీరిబుద్ది మరల్చవశముగాదు అని తలంచుచు నతని మనసు దెలిసి క్రీడింపుచుండెను.

అట్లుండఁగా క్రమంబున నయ్యంబుజాక్షికి నిరువురు మగపిల్ల లును, నిద్ద రాఁడుపిల్లలును జంటగా నుదయించిరి. మగవారికిఁ గుశలవులనియు నాఁడువారికి రతివిరతులనియుఁ బేరులు పెట్టిరి. అందు లవునకును, విరతికినిఁ తల్లి పోలికయుఁ గుశు నకుఁ రతికినిఁ దండ్రిపోలికయు వచ్చినది.

దివ్యాకారభాసురులగు పిల్లలంగాంచి భూవల్ల భు డుల్లమున నానంద౦బు వెల్లివిరియఁ దదీయక్రీడాలాపములతోఁ గాలక్షేపము జేయుచు యుక్తకాలంబున వారి నందఱం జదువనేసెను.

అక్షరజ్ఞానము గలిగినది మొదలు కావ్యములు, నాటకములు, శాస్త్రములు, సంగీతములు, దండనీతి, వ్యాయామము ధనుర్విద్య లోనగు విద్యలెల్లఁ జెప్పుటకు నారాజు వారికి వేరువేర గుంపుల నిరూపించెను. గంటకొక గురువు వారికి విద్యలం గఱపుచుండెను. సూక్ష్మబుద్ది గల పిల్లలు నొజ్జలవలన గళావిశేషముల నతిలాఘవ ముగా గ్రహింపుచుండిరి.

రాజపత్ని భర్తకుఁ దెలియకుండ వారికి వేదాంతవిద్య నుపదేశింప వేరొక గురువును నియోగించినది. తత్వశాస్త్రము నాతనియొద్ద నలువురు జదివికొనిరి. కాని లవునకును విరతికిని లెస్సగాఁ బట్టుబడినది. కుశుఁడును రతియు అందలి విషయం బులఁ బరిహసింప మొదలు పెట్టిరి.

ఒకనాఁడు గురుఁడు ప్రబోథచంద్రోదయమను వేదాంతనాటకము వారికిఁ బాఠకముగాఁ జెప్పి అందలి విషయంబు లుపన్యసించుచుఁ గామక్రోధాదులు పరమ శత్రువులనియు శమదమాది గుణములచే వాని నడఁగద్రొక్కి వివేకముగలిగి వర్తించినచో మోహముడిగి యాత్మప్రబోధమువలన ముక్తులయ్యెదరని యెఱింగించిన నవ్వుచుఁ గుశుండిట్లనియె.

ఆచార్యా ! మీరెఱింగించిన విషయంబులు చెప్పుటకు వినుటకును జాల నింపుగా నుండును. అట్లాచరించువా రెవ్వరునులేరు. దేహధారు లాచరింపనులేరు, శరీరికిఁ గామక్రోధాదులు ముఖ్యముగా నుండవలసినదే? సృష్టికర్త వస్తువును సృష్టించునప్పు డుపయోగశూన్యమైన గుణమేమిటికి జేసెడిని చెఱుకునకుఁ తీపిగలిగించినట్లే వేమునకుఁ జేదుగల్పించెను. మేము స్వయముగా నాగుణము సంపాదించుకొనలేదు సహజంబైన యాగుణమును వదలనులేదు. అట్లె కామకోధాదులు సహజములు అవి లేక దేహముండ నేరఁడు మఱియు రాజునకు బరిచారకులు లేనిచో వ్యాపారము లెట్లుసాగవో దేహికిఁ గామక్రోధాదులువిడిచినచో దేహయాత్రయే సాగదు. కోపములేని వాని నెవ్వరుమన్నిం పరు. కోపమనునది యాయుధమువంటిది దానిని దేశకాలానుగుణ్యముగా వినియోగింప వలయుంగాని విడువమనుట యసామర్థ్యమును సూచించెడిని కామము లేకున్న జన్మమే నిరర్దకము.

మఱియొక విశేషంబు వినుండు. కామ క్రోధాదుల విడచినవారు పూర్వము కాని యిప్పుడుగాని యెవ్వరేని గలరేమో నిరూపించి చూపుఁడు పురాణములు శాస్త్ర ములన్నియు విడువవలయు ననిమాత్రము ఘోషింపుచున్నవి. ఆకలములు దినియెడి మునులు విడిచితిరా? పరాశర మహర్షికధ యించుక విమర్శింపుఁడు. యమునానదిని దాటునపుడు ఓడనడిపెడు పల్లెదానిజూచి కామాతురుండై క్రీడింపఁడే అందులకుఁ గారణమాచిన్నది యొంటరిగా నుండుటయేగదా? దాని కితరపరము లెన్నేని యిచ్చెను గాని తనకామ మడంచుకొనలేక పోయెను. వారువ్రాసిన ధర్మశాస్త్రము కామాక్రోదా దుల విడువుమని యిప్పుడు ఘోషింపుచున్నవి. వ్యాసుని చరిత్ర మనము వర్ణించిన బరిహాసాస్పదమే భాతృభార్యలవిశ్వస్థల సంతానవతుఁలఁగావించి మహాభారతము రచిం చెను. విశ్వామిత్రాదుల కామక్రోధములు లోక విదితములేకదా? వసిష్టునందుఁగల వైరంబునంచేసి హరిశ్చంద్రుని నానాకష్టములంగుడిపించెను రాజ్యాభిలాషులగు నృపులమాట చెప్పనేల? తండ్రీ! అంతయేల? తత్వశాస్త్రమంతయు సాంగముగాఁ జదివిన మీరు కామాక్రోధాదుల విడిచితిరా? వేతనము. బుచ్చుకొని మాకుపదేశము జేయుచుండిరి. ఇఁక మేమెట్లువిడుతుమో చెప్పుఁడు. మాతల్లి వెఱ్ఱియె కాని మాకీప్రాం బున నీయుపదేశ మేమిటికి? బాపురే? అద్వైతమఁట. అదియెవ్వరికైనం దెలియు నదియే? అది దేహియాచరించుటయెట్లు? శాస్త్రకారుల కేమియుం బనిలేక ప్రజలం బాధించుట కిట్టివి వ్రాయుచుందురు. అందఱు వేదాంతులై జన్మరాహిత్యమునే కోరి నచో నీప్రపంచకము శూన్యమైపోవును సూర్యచంద్రాదులు‌ పంచభూతములు మఱి యెవ్వరి కుపయుక్తములు? సృష్టికర్తచేసిన పనులన్నియు వ్యర్థములై పోవునుగదా? కావున మాకిట్టి యుపదేశమెన్నఁడును జేయకుఁడు, లోకోపకారములగు గ్రంధ ములుపదేశింపుఁడు అని గురుని వాదము ఖండించుచుఁ బెద్దగా నుపన్యసించెను.

ఆరాజకుమారుని యుపన్యాసము విని తెల తెల్లబోవుచు లవుని మొగము జూచి నీయభిప్రాయమేమని యడిగిన నంతడు గురునకు నమస్కరించుచుఁ గురు నుద్దే శించి తమ్ముడా? నీవిట్లు చార్వాకమతము ననుసరించి వాదించుచుంటివేల? కామక్రోధా దుల విడువుమని చెప్పిన శాస్త్రకారులంత మూఢురా? ఏమి నీయవివేకము? వినుము.

అజ్ఞానమువలన శరీరము గలుగుచున్నది.


శ్లో. క్రోధోహర్షో విషాదశ్చ జాయతేహీ పరస్పరం
    పంచభూతాత్మ కేదేహే సత్వె రాజస తామసె
    చక్రవత్పరివర్తం తె వ్యాజ్ఞానాజ్జంతవోభృశం
    తస్మాత్స మ్యక్పరీక్షేత దోషా నజ్ఞాన సంభవాన్,

పంచభూతాత్మకమగు దేహంబున సత్వరజస్తమోగుణానుగుణ్యముగా నజ్ఞా నంబునఁ కామక్రోధాదులు జనించుచుండును వానిని శమదమాది గుణవిశేషములచే నణఁచుకొన వలయును. దానికే జ్ఞానమనిపేరు. అహంకార మముకారములే సంసార మునకు మూలమగుచున్నవి.


శ్లో. కామక్రోధశ్చ లోభశ్చ వైరిణో బలవత్తరాః
    కృతా కృతం నజానంతి ప్రాణినస్తద్వశంగతాః

కామక్రోధాదులు బలవత్తరములగు నాంతరంగిక శత్రువులు తద్వసులు కృతాగృతములఁ దెలిసికొనఁజాలరు.


శ్లో. ముత్యతె లోహనిగళైః బద్ధః కాష్టమయై స్తధా
    అహంకార నిబద్ధస్తునకదాచిద్విముచ్యతె.

ఇనుము దారువు మొదలగుసంకెళ్లచేఁ గట్టఁబడినవాఁడు విడువఁబడును కాని యహంకార మమకారములచేఁ గట్టఁబడినవాఁడు ఎన్నటికిని విడువఁబడఁడు. కామ క్రోధాది దుర్గుణములలో నొక్కొక్క గుణము విడిచినవానికిఁ గలుగు సుఖమను భవైకవేద్యము. మహానుభావుఁడైన ప్రబోధచంద్రోదయ నాటకకర్త కామక్రోధాది దోషగుణంబులకు విరుగుడుగా శమదమాది గుణంబుల శత్రువులుగా నిరూపించి వ్రాసెను. అగ్రంథము జ్ఞానోదయమునకు మంచి సాధనముగానున్నది. నీవు దానిని గురువును పూర్వులను గూడ నాక్షేపించుచున్నావు. మహర్షుల ప్రభావములు మన మాక్షేపింపరాదు. వారు త్రికాలవేదులగుట భవిష్యచ్చర్య ననుసరించి వ్యాపారములు సేయుచుందురు. అంతియకాని జితేంద్రియులగువారి మదులకు వికారములులేవు. పరాశరప్రభౄతి మునుల దుర్గుణమువలె నిరూపించితివికాని వారిప్రభావముల వర్ణించి తివికావు సృష్టికి బ్రతిసృష్టిజేసిన విశ్వాఁమిత్రుని సామర్థ్యము నీమది కేమిటి కచ్చెరువు గొలిపినదికాదు? అయ్యయో? అద్వైతత్వమునుగూడఁ బరిహసింపుచుంటివే! మహాను భావుడైన శ్రీశంకరగురుం డతనిగూఢ మగు నామార్గమును వెల్లడించెను.


శ్లో. ప్రబుద్దోహం స్వప్నాదితి కృతమతి స్వప్న మపరం
    యథామూఢస్స్వప్నె కలయతి తధామోహవశగాః
    విముక్తిం మన్యంతె కతిచిదిహతో కాంతరగతిం
    హసంత్యేయన్‌ దసాన్తగపగళిత మాయాః పరగురొ.

స్వప్నమందుండియే మేల్కొంటినని తలంచుచు వేరొకస్వప్నమునుగాంచు

మూఢుని పగిదిఁ గొందఱు లోకాంతరగమనమే ముక్తియని తలంతురు. అట్టివారిం గాంచి అద్వైతవాదులు నవ్వుచుందురుగదా అనిమండనమిశ్రుఁడు అధ్వైతబోధనయైన పిమ్మట శంకరాచార్యునిస్తుతియించెను. తెలియనివాఁ డందఱి నాక్షేపించును. నీవు గ్రంథముల బాగుగా విమర్శించి శాస్త్రరహస్యముల గ్రహింపుము. గురువుల నాక్షే పింపకుము. మన తల్లి వినినఁ గోపించునని పలికిన విని నవ్వుచు గుశుం డిట్లనియె.

అన్నా ! నీకేమన్నను గోపము వచ్చునుకాని నామతము దెలిసికొనలేకున్నావు. గ్రంధములలో వ్రాయలేదని నేజెప్పలేదు. అట్లునడుచువారు లేరని చెప్పుచుంటిని. నడిచినం బ్రయోజనములేదు. దేహసుఖంబులనుభవింపక యీనాలుగుదినములు పురమువిడిచి అడవులం దిఱుఁగుమనియెదవాయేమి? ఆకాశ కుసుమమువలె దేహానం తర మేమిజరుగునో యెవ్వఁడు చూచెను. మరణానంతరమందిట్లు జరుగునని నిశ్చయ ముగాఁ జెప్పినవాఁడులేడు పూర్వగ్రంథములలో నిట్లువ్రాయఁబడియున్నదని ప్రతి మహర్షియు నుదాహరణములు చూపుచుందురు. కావున నీవు వెఱ్ఱివేదాంతము పెట్టు కొనక స్వేచ్చగా నింద్రియ సుఖంబు లనుభవింపుము. మనకీసమయమున వేదాంత మవసరములేదని యుక్తియుక్తముగా వాదించెను.

లవుడు - ఓహొహో! నీబుద్ధిబలము కొనియాడఁ దగినదే క్షణభంగురమైన యీశరీరమునకు సుఖంబేదియో నిరూపింపుము.

కుశుడు - ఏయింద్రి యమేసుఖంబనుభవించుటకు భగవంతుఁడు సృజించెనో యా యింద్రియముద్వారా నాసుఖం బనుభవింపవలయును. తెలిసినదియా!

లవుఁడు - సుఖంబననేమి?

కుశుడు - ఇంద్రియానందము.


లవుఁడు శ్లో. అవిశ్రాంత మనాలంబ మపాధేయ మదైశికం
                తమకాంతా రమధ్వానం కథమేకో గమిష్యసి
                సహిత్వాం ప్రస్థితంకశ్చి త్పృష్ఠతోను గమిష్యతి
                సుకృతం దుష్కృతం చత్యాంయాస్యంత మునుయాస్యతి.

మూఁఢుడా ! విశ్రాంతి శూన్యమైపాదేయరహితమైయనంతమై యొప్పు మార్గం బునం బడి నీవు పోవుచుండ నీవెంట నెవ్వరును రారుసుమీ? నీవొక్కఁడవే పోవలయు నప్పుడు నీయింద్రియములు నిన్ను రక్షింపఁజాలవు. నీవుజేసిన సుకృతదుష్కృత ములు మాత్రము నీవెంటవచ్చును. కావున సుకృతములాచరింపుము. చెడుబుద్ధి విడువుము. కుశుఁడు - అన్నా! నీవు చెప్పినదంతయుఁ బుస్తకములలో వ్రాయఁబడి యున్నది. నిజము చూచినవారెవ్వరును లేరు. సుకృత మనియు దుష్కృతమనియు బెదరింపుమాటలు సత్యములుకావు. వెఱ్ఱి ఛాందసము విడిచి సుఖింపుము

లవుఁడు - ఛీ: బాలిశా నాస్తికా! వాదము చేయుచున్నావు. నీతో సంభాషింప రాదు.

కుశుఁడు - (పకపకనవ్వుచు) అన్నా కోపము వదలమని చెప్పుచు నిప్పుడే కోపము జెందుచుంటివేమి? ఇట్లే అందఱు జెప్పుచుందురు కాని చేయువారు లేరనియే నే ననుచుంటిని వినుము.


శ్లో. కామః క్రోధశ్చ లోభశ్చ సర్వేదేహగతాగుణాః
    రాగద్వేషా దయోభావాస్సర్గెపి ప్రభవంతిహీ

కామక్రోధాదులు రాగద్వేషాదులు స్వర్గమందున్ననువిడుచునవికావు. దేవతల కవి పోయినవియా?

లవుఁడు - అక్కటా! నిక్కము దెలియక నీవిటు దుర్మార్గము ననుసరించు చుంటి వేమిజేయుదును.

కుశుఁడు - నీదియే దుర్మార్గము. నాదికాదు తెలియ కట్లను చున్నావు.

అని యీరీతి అన్నదమ్ములిద్దరు పెద్దతడవు వాదించిరి. విరతిలవునిపక్షము రతి కుశునిపక్షము జేరినది. తగవులు చివరకుఁ దండ్రికిం దెలిసినవి. కుమారుల నిరువుర రప్పించి వారి సంవాదప్రకారమంతయు విని పండితుల రప్పించి సభజే యించి యెవ్వరివాదము న్యాయమైనదో చెప్పుఁడని కోరుటయు ద్రవ్యలాలసులగు నీపండితులు కుశుని దుర్భోధచేఁ గుశుని వాదమే సత్యమైనదని నిర్థారణచేసిరి.

దానంజేసి లవుండు కోపించుచు దుర్జనభూయిష్టమగు దేశంబున నుండఁగూడ దని తలంచి యెవ్వరికిం జెప్పకుండ నొకనాఁడు దేశాంతరము లేచిపోయెను.

కొన్నిదినంబులకు నృపతి యవ్విధం బెఱింగి యంతిపురి కరిగి భార్యతో నావిషయము ముచ్చటించుచు నీవు బిడ్డల సన్యాసులంజేసితివి, లవుఁడు విరక్తుడై తమ్మునితో వెఱ్ఱివాదముజేసి యెందో పోయెను. వానికొఱకు దేశమంతయు వెదకించు చున్నాను. వానివృత్తాంతము నీవేమైన నెఱిగుఁదువా అని‌ అడిగిన విని ధర్మపత్ని నిట్టూర్పు నిగుడించుచు నేమియు మాటాడినదికాదు. విరతి తండ్రితో బాబా ! చిన్న న్నయు అక్కయుఁ బెద్దన్నతో నాస్తికవాదము జేసిరి. నీవును వారితోఁగలిసి పండితులచే నావాదమే యుక్తమైనదని నిర్దారణచేయించితివి. దాన౦జేసి వానికిఁ గోపము వచ్చి యిందుండుట కిష్టములేక లేచిపోయెనని చెప్పిన విని తండ్రి యోహో! నీవును వేదాంతురాలవే కాఁబోలు చాలు చాలు మీయమ్మ శిక్ష చక్కగానున్నది. అని యాక్షేపించుటయు నాచిన్నది తండ్రీ! దేహములు క్షణభంగురములు పుట్టినది మొదలు జంతువులకు మృత్యువు నెత్తిమీఁదనుండి యెప్పుడో గుటుక్కున మ్రింగి వైచును. కావున మంచిమార్గముగ్రహించుటకు నొక సమయము లేదు. చిన్నతనము నుండియే యభ్యసింపవలయును. కామక్రోధాదుల అడఁచుకొని జ్ఞానము గలిగయుండ వలెను. ఎన్నఁడో వృద్దాప్యమునఁ దత్వవిచారణ చేయుదమన్న అంతదనుక మృత్యు దేవత కబళింపక యుండవలదా? మీవాదముసమంజసముకాదని పెద్దగా నుపన్యసి౦చిన రాజునకుఁ గోపమువచ్చి యేమియు మాటాడక వెళ్ళిపోయెను. ఆతండు మరికొన్ని దినములకు కూతుండ్రకు వివాహ ప్రయత్నము గావించుటయు నావిషయముమై వకుళా ముకుళలకును పరిచారకల కిట్టి సంవాదము జరిగినది.

వకుళ - ముకుళా! నీసఖురాలు విరతిని వీర్యవంతుని కుమారుఁడు వత్సున కిచ్చుటకు నిశ్చయించిరఁట. విరతి యంగీకరించినదియా? ఆమెకుఁ దగినమగఁడే దొరకెనులే?

ముకుళ - ఏమి? నీపరిహాసము. అప్పుడే పెండ్లియైనట్లే వెక్కిరించుచుంటివి. మావిరతి వాని నంగీకరింపదు మీరతని కేయూరదత్తుని కుమారుఁడు సుకుమారుని కిచ్చుటకు నిశ్చయించిరా?

వకుళ - అవును సుకుమారుని సౌందర్య మెట్టిదో యిదిగో చిత్రపలకము చూడును. పరాక్రమమున నర్జునుఁడే విద్యచే బృహస్పతిని మించియున్నవాఁడు అన్నిటికి రతికిఁ దగియున్నవాఁడు రతి నతనికిచ్చి సహాయముగా నిందే యుంచు కొందుఁరట పాపము విరతికే మంచి మగఁడు దొరకలేదు.

ముకుళ - పోనిమ్ము నీరతిపతితో సుఖించినంజాలు మా విరతి యవధూతయై పెండ్లియే యాడక యద్వైతానంద మనుభవించును.

వకుళ - మీవిరతి జోగురాలనియే యామెకు మంచి సంబంధమేదియు రాకున్నది. శృంగారలీలాతరంగి తాంతరంగులగు రాజకుమారులు వైరాగ్యప్రవృత్తి గల మత్తకాశిని నెట్లు వరింతుర? వత్సుఁడు గుణహీనుఁడు కావున నంగీకరించెను.

ముకుళ - నీవు కండకావరము జూచికొని మురియుచుంటివి. శృంగారరీలలు బుద్బుదములవంటివి. వైరాగ్యమే నిలుచునది తినఁగూడులేక యత్తవారింట నిల్లరిక ముండుటకు సిద్ధపడుచున్న సుకుమారునూరక పొగడుచురతినభినందించుచు విరతి నాక్షేపించుచుంటివి చాలు జాలు. నోరు మూయుము.

వకుళ - ఏమి? సుకుమారుఁ డన్నములేనివాఁడా? ఈమాట జ్ఞాపకముంచుకో. పెండ్లికానిమ్ము వానిచే నీముక్కును జెవులును జెక్కింపకున్న నన్నీపేరఁ బిలువ వద్దు.

ముకుళ - అబ్బో? నీయరచేతికిఁ బండ్లువచ్చినప్పుడు చూతుములే. విరతిని జోగురాలని యాక్షేపించితివికాదా? ఆమాట జ్ఞాపకముంచుకొనుము. ఆజోగురాలి మగనిచేతనే నిన్ను విరూపను జేయి౦పకపోవుదునా?

వకుళ - ఛీ రండా! ప్రేలకుము.

ముకుళ - అని యామాటయే యనిపించుకొనిన గౌరవమేమి.

వకుళ - అమ్మగారి యూతజూచికొని నోటికివచ్చినట్లు ప్రేలుచుంటివి. కానిమ్ము నీవును విరతియు వత్సునివలన నీడుములం గుడుచునప్పుడు నామాట పథ్యముగాఁ దలంపక పోవుదువా.

అని యిద్దఱు పెద్దగాఁ గ్రుద్ధులాడిరి, వకుళ రతియొద్దకు ముకుళ నిరతి యొద్దకుం బోయిరి. కన్నీరుగార్చుచుఁ దనయొద్ద కరుదెంచిన ముకుళం జూచి విరతి ఏమేయిట్లు వెక్కి. వెక్కి యేడ్చుచుంటివి? నిన్నెవ్వరవమానపరచిరి. చెప్పుము చెప్పము అని గన్నీరు దుడుచుచు నడిగిన విని అది యిట్లనియె.

అమ్మా! కుశుఁడు తండ్రిని వశపరచుకొని విద్యారూప పరాక్రమవంతుఁడగు సుకుమారుఁడను రాజకుమారులకు రతినిచ్చి వివాహము చేయుటకు నిశ్చయించెను. వీర్యవంతుఁడను వాని కుమారుఁడు వత్సుఁడనువాడు. వట్టిశుంఠ. దుర్వ్యసనాసక్తుండు కోపశీలుఁడు. విద్యాగంథరహితుఁడు రూపహీనుఁడు అట్టివానికి నిన్నిచ్చుటకు నిశ్చ యించిరట రతి సఖురాలు వకుళ గరువముతో మిమ్మాక్షేపించినది. అందుల కై మాయిద్దఱికిని బెద్దజగడము జరిగినది. తల్లీ! యేదియెట్లైనను వత్సుని నీవంగీకరింప వలదు. అని యావృత్తాంత మంతయు నెఱింగించినది.

విరతి నవ్వుచు ముకుళా! నీకు నాయందుఁగల యభిమానము జూపితివి, మన మెట్టికర్మబీజము నాటుదుమో తదనుగుణమైన ఫలమనుభవింతుము. అంతియకాని మంచిచెడ్డలకు నొరులు హేతువులు కారు. వారి గరువము వారినే చెరుచును. మనల నేమియుం జేయఁజాలవు. ఊరుకొనుమని యోదార్చినది. అంతలోఁ తల్లి యచ్చటికి వచ్చి ముకళ వలన నావృత్తాంతమంతయు విని ఛీ ఛీ వత్సుఁడు నిర్భాగ్యుఁడు వాని కిచ్చుటకు నేనంగీకరింపనని పలికినది. అట్టిసమయమునఁ జంద్రగుప్తుఁ డంతః పురమున కరుదెంచి సుఖాసనోపవిష్టుండై భార్యంజూచి యిట్లనియె.

ప్రేయసీ ! పిల్లలిద్దరికిని వివాహములు నిశ్చయించితిని. వినుము కేయూర దత్తుని నాలుగవకుమారుఁడు సుకుమారుఁడనువాఁడు విద్యా బలరూపశీలములలో నన వద్యుఁడు రతిని వానికిచ్చుటకు నిశ్చయించితిని. అందుల కంగీకరించెను. విరతిని వీర్యవంతుని కుమారుఁడు వత్సుడను వానికిచ్చుటకు నిశ్చయించితిని వీర్యవంతుఁడు మంచిబలశాలిథనికుఁడు పలుకుపడిగలవాఁడు వత్సుఁడతని కేకపుత్రుడగుట గారాముగాఁ బెరిగెను చదువంతగా వచ్చినదికాదఁట. రూప మొకమాదిరిగానుండును. సర్వగుణములు కాంచనమునాశ్రయించి యుండును వాని కేకొదవయును లేదు కావలసినంతద్రవ్య మున్నది. సుముహూర్తము యెల్లుండియే నిశ్చయించితిని ఈవార్తనీకు జెప్పుటకువచ్చి తినని చెప్పినవిని అతనిభార్య సంభ్రమశోక గ్రోధవశయై యొక్కింత తడవూర కొని భర్తతో నిట్లనియె.

మనోహరా! వత్సుని చరిత్రము మీరెఱింగిన నంగీకరింపరు. వాఁడు విద్యా గంథరహితుఁడనియు దుష్క్రియాచరణ నిరతమతిఅనియు ఘాతకుఁడనియు నెల్ల రుం జెప్పుకొనుచున్నారు. సప్తవ్యసనములు వానిపాలఁట. వానియం దొక్కసుగుణ మైన లేఁదట చూచి చూచి రత్నమువంటి పిల్లను వాని కెట్లీయఁదగును? దుష్టునిం బెండ్లి యాడి‌ యిడుములం గుడుచుటకంటె నాబిడ్డ యోగినియై యిట్లే యుండును. పెండ్లి అక్కరలేదని చెప్పిన విని యారాజు వెండియు నిట్లనియె.

కామినీ ! వాని గుణంబులు నీవు విన్నవన్నియు నసత్యములు విద్యలేని లోప మొక్కటియే యున్నది. విరతి వేదాంతురాలుగదా ఎట్లున్నను సవరించుకొనఁగలదు. దేశమంతయు దిఱిగితిని మరియొక సంబంధమేదియును లేదు. అదియునుంగాక వీర్యవంతునకుఁ దరలి రమ్మని శుభలేఖ వ్రాసి యంపితిమి. ఇవ్పుడు వలదన్న నతఁడు కోపింపఁడా? ఎట్లైన నాసంబంధ మంగీకరింపుమని బ్రతిమాలికొనియెను. ఆమె అంగీకరించినదికాదు. ఆవిషయమై భార్యా భర్తలకుఁ బెద్ద సంవాదము జరిగినది. బిచ్చగాని కిచ్చినను సంతోషింతును గాని వత్సునకిచ్చుట కంగీకరింపనని కచ్చితముగా నుత్తరముజెప్పిన రాజిట్లనియె.

కానిమ్ము నీవన్నమాట నిలుపుకొనుము. ఇకసంబంధములకు దేశములు దిఱుఁగ జాలము ఎల్లుండియుదయమునఁ నుత్తరగోపురము దాపునకుఁబోయి తొలుత నెవ్వఁడు వీటిలోనికి వచ్చువాఁడు గనంబడునో వానికి విరతినిచ్చెద నంగీకరింతువా అని అడిగిన నామెతప్పక అట్లే చేయుఁడు దైవమేతీసికొని వచ్చునని పలికినది. ఆమాట వారిద్ద రికింగాక మరియెవ్వరికిందెలియదు.

ఆమాటయే నిశ్చయించుకొని భూపతి అంతఃపురమునుండి యీవలకు వచ్చు నంతఁ గుశుఁడుగలిసికొని తండ్రీ! శౌర్యవంతుఁడిప్పుడే శుభలేక వ్రాసి అంపెను. రేపురాత్రికే వత్తురఁట. విడుదల నెందు నియమింతుము కేయూరదత్తునకుఁ బెద్దమేడ యిచ్చుటకు నిశ్చయించితిమి అని యేమేమో చెప్పఁబోయిన నలుకమెయిఁ జాలుఁజాలు నీకతంబున నీముప్పు వాటిల్లినది శౌర్యవంతుని సంబంధము దెచ్చినవాఁడవు నీవు వత్సుఁడు వట్టి నిర్భాగ్యుఁడట. దర్మరతి విరతిని వానికిచ్చుట కంగీకరించినదికాదు. ఇప్పుడు శౌర్యవంతుని రావలదని ప్రత్యుత్తరము వ్రాయుము.

అనుటయుఁ గుశుఁడు తండ్రీ ! యిట్లువ్రాసిన నతనికిఁ గోపము రాదా! వాఁడలి గిన మనము నిలువఁగలమా? వాని కుమారుఁడు క్రూరుఁడని చెప్పినవారు శత్రువులు వాఁడు శౌర్యముకలవాఁడు మంధుఁడుగాడు దానంజేసి తీవ్రచిత్తుఁడువలెఁ గనంబడు నని మందస్వరముతోఁజెప్పిన విని చంద్రగుప్తుండు పోపొమ్ము నీకపటమంతయుం దెలిసినది. పెద్దవాని దేశముల పాలుజేసితివి. విరతికి నీచుం దెచ్చితివి. తెలియక నీమా యలకుఁ జిక్కితినని పలుకుచు వానిమాటలు వినిపించుకొనక తాను జేయఁదలచుకొనిన పని యొరులకుం దెలియనీయక విచారముఖముతో నిజనివాసమునకు బోయెను.

అని యెఱింగించువఱకు వేళ అతిక్రమించుటయు మణిసిద్దుండు తదనంత రోదంతం బవ్వలిమజలీయం డిట్లు చెప్పందొడంగెను.

133 వ మజిలీ.

జంగమ దేవరకథ

తెల్లవారి యెనిమిది గడియలకు ముహూర్తముంచఁబడినది. నిరూపించిన వత్సున శౌర్యవంతుని రావలదని యుత్తరములు వ్రాసిరి. వారెవ్వరును రాలేదు. రతిం బరిగ్రహింప సుకుమారుఁడు మహావైభవముతో నూరేగుచున్నవాఁడు మంగళవాద్యము లచేఁ బట్టణమంతయుఁ బ్రతిధ్వనులలిచ్చుచున్నది. విరంతిగూడ బెండ్లి కూతుం జేసిరి. పురోహితులు వివాహవేదికలపైఁ బెండ్లి పీటలు రెండునువైచి మంగళ సంస్కారములు గావించుచున్నారు విరతికి వరుఁడెవ్వఁడో తెలియదు. విడిది యెరుకపడదు. ఊరేగింపు జాడఁ గన౦బడదు ఇది కడువింతగా నున్నదని పరిజనులు బంధువులు ఆప్తులు గుజ గుజలాడుచుండిరి. కొందరు అడుఁగబోయి, నృపతి ముఖవైలక్ష్యము గనిపెట్టి యూర కొనిరి. కొందరు తొందరయేల పెండ్లి వేళ చూడమాయని యుపేక్షించు చుండిరి.

అరుణోదయమైనది. దెసల జీకటులంతరించుచున్నవి. పక్షులు గూయుచున్నవి హజారమున కాలసూచకములగు భేరీథ్వనులుమ్రోగుచున్నవి. అట్టితరి జంద్రగుప్తుఁడు స్నానముజేసి నిత్యకృత్యములు దీర్చుకొని తురగారూఢుండై మంగళవాద్యములతో రత్నాలపల్లకీ దనవెనుక వచ్చునట్లు నియమించి యుత్తరగోపురము దెసకరిగెను.

ఎక్కడనుండియో క్రొత్త పెండ్లి వారు రాఁగలరని వారిం దోడితేర రాజరుగు చున్నాడని నిశ్చయించి తమ్మెవ్వరిం బిలువకున్కి శంకించుకొనుచుఁ గొందరు బంధు