కాశీమజిలీకథలు/ఏడవ భాగము/120వ మజిలీ
గూఢచారినై పాతాళలోకమంతయుఁ దిరిగితిని. జయసింహునిగురించి వితర్కించితిని వినుండు జయసింహుని తేజోవతివరించి తన్నవమానపరచెను కోపముతోఁ బారిజాతుండు కొందఱ రాక్షసుల సహాయంబున నొకనాడు నిద్రించుచుండ జయసింహుని బట్టుకొని యొడలెల్ల గట్టి యొక పాడునూతిలోఁ బడవైచి చంపించెనని తెలిసినది. హర హరా"? యెంత ఘోరకృత్యయు గావించెనో వింటిరా? అట్టివానిఁ బుత్రమిత్ర కళత్ర యుక్తముగా నాశనముజేయక తీరదని చెప్పి యవ్వలకుఁ బోయెను. అని యెఱింగించిరి.
120 వ మజిలీ
కలభాషిణికథ
ఆహా ! నాపురాకృత భాగధేయము ఫలించినది చంపక చామరికతోఁ జెప్పిన మాటలు వినుటచే నేను గృతార్థుండనైతిని నన్ను జూచి జయసింహుడు తేజోవతి భ్రమపడినది జయసింహుండు నా పోలికగా నున్నవాఁడుకాబోలు. అతండు మదీయ సోదరుఁడు కాడుగద. అట్టిభాగ్యము నాకు భట్టునా? నన్నీ లంకాపురమునకుఁ దీసికొనివచ్చిన భగవంతుని యె త్తికోలు ఎవ్వనికిఁ దెలియును. ఎట్లయినను నేను బాతాళలోకమున కరుగవలయుంగదా? విభీషణుఁడు నేఁటి రాత్రియే దండయాత్ర వెడలుటకు నిశ్చయించుకొనియెను. వారితోఁ భోయెదంగాక. అంతదనుక మఱియొకచోట నుండ నేల? చంపక యంతఃపురమునకుఁబోయి వారి సంభాషణ మాలింపుచుఁ గర్ణపర్వము గావించుకొనియెదను. అని తలంచి వీరసింహుఁడు ద్వారపాలురఁ దప్పించుకొనుచుఁ జంకక యంతఃపురమున కరిగెను.
అప్పుడు శుద్ధాంతమంతయు హల్లకల్లోలముగా నుండెను. హా! జయసింహా హాపురుషసింహా? సింహకిశోరములభాతి నురుగులనడుమఁ బ్రకాశించుచుందువు. నీకీ మృత్యువు విధియెట్లు విధించెనురా? దుర్మతీ? పారిజాతా? వానిం జపించినంతనే నిన్ను వరింతుననుకొంటివిరా? నాకుఁగూడ వానితోడిద గతియనియెఱుంగవు. అమ్మా ! ఇఁక బ్రాణములతోఁ బనిలేదు సఖీ! చంపకా! నాబ్రతుకు నేఁటితోఁ దీరినది దుఃఖింపుచుండ జంపక తేజోవతీ! యారడిల్లుము. ఆమాట సత్యమో యసత్యమో విచారింపక నక్కరలేదా? నిన్న మన యంతః పురమునకు వచ్చినవాఁడు జయసింహుఁ డననాయని యోదార్చిన నామె యిట్లనియె.
సఖీ! రూపసాదృశ్య మున్నది కాని స్వరభేదము గలుగుటం బట్టి మొదటనే సందేహించితిని. అతండు జయసింహుఁడుకాఁడు. నాలుగు నెలలనుండియుఁ గనం బడుటలేదు. ఎక్కడికో విహరింపనేగె ననుకొంటిని. ఆపాపాత్ముడు వానింజంపిన మాట వాస్తవమే. అసత్యము గాదు. వాఁడే జీవించియుండిన మాకీ యిక్కట్టు రాకపోవును. కోటదావునకు శత్రువుల రానిచ్చునాయని పెద్దయెలుంగున నేడువఁ దొడంగెను.
బద్మావతియుఁ గన్నీరునించుచుండెను. చామరికయు రేవతియు దేజోవతిం బట్టుకొని యూరడింపుచుండిరి. ఇంతలో లోవలినుండి జయసింహునితల్లి కళావతి యక్కడికివచ్చి యడలుచు హా? పుత్రరత్నమా హా? విక్రమాదిత్యకులరత్నాకర నిశాకరా! విజయభాస్కరతనూభవా! అస్తమించితివి? యని తన వృత్తాంత మంతయుఁ తలంచుకొని చింతింపదొడగెను.
అప్పుడు వీరసింహుడా యల్లరియంతయుంజూచి గుండెపగుల నౌరా ! తేజోవతి సంతోషమునకు విధి యంతరాయము గలుగఁజేసెనే ? జయసింహునితల్లి దుఃఖముజూడలేకుంటిగదా ? మఱియు విక్రమాదిత్యకులదీపిక విజయభాస్కరతనూభవ యని వగచుచున్నది. నా మనంబునంగల అనుమానము దీరినది. యీమె కళాభాషిణియే జయసింహుఁడు నాసహోదరుడగుట సత్యము. వాని మరణవార్త నిన్న వేగులవారు తీసికొనివచ్చియందురు. చంపకాసక్తుండనై నిన్న నేను రాక్షస సభకు బోలేదు. మంచివార్తయే వినంబడినది. నన్ను విధి పైకెత్తి నేలఁబడఁద్రొబ్బెనే అయ్యో? నాసోదరునిఁ జూచుభాగ్యము పట్టినది కాదుగదా ? శుభపరంపరలభించున్నదని యానందించుచుంటిని. ఇప్పుడు నాతల్లి నేమని యోదార్చుదును. నేను శత్రువులఁ బరిభవించి విజయము గైకొనిన లాభమేమి? ఇందుల కానందించువారెవ్వరు ? అక్కటా ? మా విధీ ? నాసంతోషమంతయు నెంతలో నంతమునొందించితివి ఇఁక నాకుఁ జంపకతోఁ బనియేమి ? మాతల్లినోదార్చి యింటికిం దీసికొనిపోవుట కర్జము. ఈ రాక్షసస్త్రీ మధ్యంబునఁ గురరియుంబోలె నూరక శోకించుచున్నది. అని తలంచుచు వీరసింహుఁడు నిలువలేక నాహార మొకచోట దాచి హాతల్లీ ? వగవకుము నీపుత్రుండ నేనిదిగో వచ్చితినని పలుకుచుఁ గలభాషిణిదాపునకుఁ బోయెను.
అతనింజూచియెల్లరు తెల్లపోయిచూచుచుండిరి. జయసింహుడు,జయసింహుఁడు అనికొందఱు కేకలు పెట్టిరి. తేజోవతిజూచియు నిన్నటివాడే అని యుపేక్షజేసి లోపలికిఁ బోయినది చంపకయు సఖులతో నొక గదిలోనికింబోయి గవాక్షమునుండి చూచుచుండెను. ఇతరకాంతలెల్ల దూరముగాఁ బోయిరి. కలభాషిణియుఁ బద్మావతియుఁ గాక మరి యెవ్వరును లేరు.
కలభాషిణి వీరసి౦హునింజూచి అదరిపడి నాయనా ? నీవు మాజయసింహు డవే ? యెట్లువచ్చితివి బాబూ ? నీపైఁ బడినవార్త యసత్యమా ? తండ్రీ అని లేచి వానిం గ్రుచ్చియెత్తికొనియెను. అప్పుడతండు తల్లీ! నేను జయసింహుడనుకాను వీరసింహుడ హేమప్రభానందనుండ నిన్నును మాతండ్రిని రక్కసుఁ డెత్తికొనిపోయెనని తెలిసి మీకొరకు దేశములు దిఱుగుచు నీలంకాపురమున కెట్లోవచ్చితిని. నా సోదరుని మరణవార్తనిప్పుడే వింటిని నేను నిర్భాగ్యుడ ? వానిం జాడలేకపోయితిని మాతండ్రి యెందున్నవాఁడు తల్లీ ! యెఱింగింపుమని యామెం గౌఁగలించుకొని వీరసింహుడు దుఃఖింప దొడగెను.
ఆవార్తవిని యామె యొక్కింతతడవు పుత్రశోకము మరచి యబ్బురపాటుతో నేమీ ? నీవు హేమప్రభపుత్రుడవా ? మానిమిత్తమై యిక్కడికి వచ్చితివా బాబూ ? నిన్ను జూచుటచే దుఃఖము పోయి యానందము గలుగుచున్నది పుత్రా ! మీతండ్రి జీవించియే యున్నారు. ఎందుండిరో తెలియదు. నా కిట్టి నిమిత్తములు గలుగుచున్నవి. వత్సా ! వీరసింహా ! రాజ్యసుఖంబులు విడిచి కష్టములకోర్చి మా నిమిత్తము దేశాటనము జేయుచుంటివా ! సామాన్యుఁడీ దీవికి రాఁగలఁడా ? నీ శౌర్య ధైర్యాదు లనన్య సామాన్యములే తండ్రీ?. నీ సోదరుఁడు అట్టివాఁడే. మీ యిరువురకు రూప సాదృశ్యమున్నది. వాఁడు చిన్నతనమునందే యుక్కు గలిగి పెక్కండ్రం జావమోదెను. అని తానుజ్జయినీపురంబు వదలినది మొదలు నాటిఁ తుదదనుక్ జరిగిన కథ యెఱింగించి పుత్రా ! వాని విద్యా సంపత్తియు సౌందర్యాతిశయము పరాక్రమ ప్రకారముజూచి తేజోవతి వరించినది. కౌరవ్యుండు నీ పద్మావతియు అంగీకరించిరి.
పారిజాతుఁడు వీనికతంబునఁ దేజోవతి తన్ను వరించినదికాదని యీసుబూని అతండు నిద్రించుచుండ గాలుసేతులు బిగియఁగట్టి నూతిలోఁ బారవేయించి చంపించెనఁట. ఇప్పడే యా వార్త వేగుల వారు దీసికొనివచ్చిరి. తండ్రి యని పెద్ద యెలుంగన దఃఖించుండెను.
అప్పుడతండామె కన్నీరు దుడుచుచు అమ్మా ! నీవు శోకింపకుము. నా సోదరుఁడును దైవబలము గలవాఁడు. మా తండ్రిగారి నిశ్చయ ప్రకారము మరణ మకాలమున గలుగదు నూతిలోఁ బడినను దప్పించుకొని బ్రతుకవచ్చును. అదియునుం గాక వేగులవాండ్రు దెచ్చువార్తలన్నియు సత్యములుగావు. శత్రువులను వంచించుటకై రాజు లసత్యవార్తలఁ బ్రకటింతురు. మనకుఁ బరమోపకారియైన కౌరవ్యుండు శత్రుహస్తగతుండై యాపదజెందియున్నవాఁడని తెలియుచున్నదిగదా ? నేనిప్పుడుపోయి ఆతని చెరవిడిపించెదను. ఏలాపుత్రునిఁ బుత్ర మిత్ర కళత్రాదు లతోఁ బరిభవించెదను. నిన్న నీ కోడలితో శపధము జేసియుంటిని నా సోదరుఁ డెందో చిక్కుపడియున్నవాఁడు. కాకున్న గౌరవ్యునికి యాపద రానిచ్చునా ? విభీషణ బలంబులతోఁ బాతాళమున కఱిగెద అనుజ్ఞయిమ్ము దీవింపుము. నా సోదరుని వెదకిఁ తీసికొని వచ్చెదనని పలికిన విని యా యిల్లాలు నిట్టూర్పు నిగుడింపుచు నిట్లనియె.
పుత్రా ! నీవాసంగరమునకుఁ బోవలదు. మహావీరుఁ డెవ్వడో. శత్రుపక్ష పాతియై పోరుచున్నవాఁడట. సురా సురులు వానింగెలువఁ జాలరని చెప్పుకొనుచున్నారు. జయాపజయంబులు దైవాయత్తములు వంశా౦కురమైన నీవి౦టికిఁ బోయి రాజ్యమేలుకొమ్ము. రాక్షస మాయలు కడు విపరీతములు మనుష్యులకుఁ దెలియవు. రామభక్తాగ్రేసరుండీ విభీషణుండు కౌరవ్యుని విడిచిపెట్టఁడు. ఎట్లో వానికి రాజ మిప్పింపక మానఁడు. మాగతి యేమగునో తరువాత విమర్శింపవచ్చును. నీవుగూడఁ జిక్కుపడనేల ? జయసింహుఁడు బ్రతికియుండెనా సంతసముతో నెప్పటికైన నింటికివత్తుము లేకున్నఁ జెప్పవలసినదేమియున్నది. అని కన్నీరు స్రవింపఁ బలికిన విని వీరసింహుఁడిట్లనియె.
తల్లీ! నీవు వీరమాతవైనను నాయందుఁగల వాత్సల్యంబున నిట్లను చున్నావు. ఆ వీరుఁడు కాదు దేవాసురులు వచ్చినను నేనవలీల గెలువఁజాలుదును. నీవు సందియ మందవలదు నన్ను దీవించి యంపుము. నీవు దుఃఖింపకుము. మనకు మంగళము గలుగు నిమిత్తములు బొడజూపుచున్నవి. అని ప్రార్థించిన నారాజపత్ని బాష్పములచే అతని శిరము దడుపుచు గ్రుచ్చియెత్తి శిరము మూర్కొని విజయమందుమని దీవించి యంపినది.
విభీషణుండు చతురంగ బలములతోఁ గూడికొని పుత్రుండు చిన్న విభీషణుండు సర్వ సేనాధిపత్యము వహింపఁ బ్రహస్తాదిమంత్రులు సేవింప భేరీభాంకారములు రోదసీకుహరమునిండ దండు వెడలి దక్షిణముగాఁ బయనము సాగింపుచుండ వీరసింహుఁడు వానితోఁ గలిసికొని నడుచుచుండెను.
ఆ బలములు దక్షిణముగాఁ బోయిపోయి యొక బిలంబునఁ బ్రవేశించినవి. అందుఁ గ్రిందికి సోపానములున్నవి. బలములన్నియు వాని వెంబడి అడుగునకు, బోవుచుండెను. పెద్దదూరము పోయిన వెనుక బిలావసానము గనంబడినవి అందొక పాషాణము కమ్మివలె నడ్డముగా వేయఁ బడియున్నది. దానిక్రింద నవకాశముగాని మఱియేమియునులేదు. రాక్షసులు పక్షులవలె నెగయఁ గలరు. కావున నారాతిపలక నుండి క్రిందికి దుమికి పాతాళమున కరుగుచుండిరి. వీరసింహుడు దళములవెనుక నడుచుచున్న కతంబున నందఱు దుమికిన పిమ్మట నారాతిపలక చేరెను. క్రిందికిఁ జాడ నేమియుఁ గనంబడదు. అందుఁ గూర్చుండి అయ్యో? రక్కసులందఱు దుమికి క్రిందికిఁ బోయిరి. ఆధారమేదియును లేదు నేనెట్లుదిగువాఁడ? నేను వట్టి మూఢుఁడ. విభీషణుని యెదురఁ బడి నా వృత్తాంతము జెప్పి యద్ధమునకుఁ దోడువత్తుననిన శిరముపైఁ గూర్చుండఁ బెట్టుకొని తీసి కొనక పోవునా? నా బుద్ది సురిగినది ఇఁక నేనేమి జేయుదును. వీండ్రవలె దుమికితినేని క్రిందఁబడి ప్రాణములు విడుతును అందులకు నా పరాక్రమమేమిటికిఁ బనికి వచ్చెఁడిని అని తలంచుచు నారాతిపై నిలిచి మరల దుముకుటకు సాహసించి కాళులు క్రిందికిఁ జాపుచు మఱల నురక వెరచుచు నీరీతి డోలాయితహృదయుండై యున్న సమయంబున వెనుక యెవ్వరో వచ్చుచున్న ట్లలుకుఁ డై నది.
ధైర్యముతో నెవరువారని కేకవైచెను. నేను విరూపాక్షుఁ డనని యతఁడు ప్రత్యుత్తరమిచ్చెను. ఓహో వచ్చితివా? ఇంత యాలస్యము చేసితివేల? నీ నిమిత్త మే మహారాజు నన్నిందు నిలువఁ బెట్టెను పోదము రమ్మని పలికిన జడియుచు నా బడుగు అయ్యా కొంచెము పనియుండి యాలసించితిని. మహారాజునకే తెలిసినదా అయ్యో యేమి చేయునో కదా యని వెరచుచుండ రమ్ము రమ్ము ఏమియు, జేయఁడు అని పిలిచి వాని మెడ బిగ్గరగఁ బట్టుకొని వానితోఁ గూడఁ బాతాళలోకమున కురికి రాక్షసబలంబులం గలసికొనియెను.
అందు విభీషణునిజూడ నరయుచుండ నతండు బలిదర్శనమునకుఁ బోయినట్లు ఎవ్వరో చెప్పుకొనుచుండఁ దెలిసికొని తానుగూడఁ బోవఁదలంచి యా ప్రదేశమంతయు దిరుగ నొకచోట బలి భవనద్వారమని వ్రాయబఁడియున్న ప్రకటనఁజదివికొని అల్లన నాద్వారముగుండ లోనఁ బ్రవేశించెను.
ఊర్ధ్వపుండముల ధరించిన వైష్ణవభటులు పెక్కండ్రా గుమ్మమును గాచు చుండిరి. వారిం దప్పించుకొని లోనికిఁబోవఁ బ్రయత్నించుచుండ నొకవైష్ణవుఁడు నా చేయి బట్టికొని నీవెవ్వఁడవు? ఇట్ల దృశ్యుఁడవై పోవుచుంటివేమి? చెప్పుమని అడిగిన భయపడుచు స్వామీ ! నేను వీభీషణ పరిచారకుండ. బలిచక్రవర్తిం జూడబోవుచున్నాఁడ నన్ననుగ్రహింపుఁడని వేడికొనిన నతండు నవ్వుచు పోపొమ్మని చేయి విడిచెను. ఒకటవవాకిలి రెండవవాకిలి అని ప్రతిద్వారమునకును సంఖ్య వేయబడి యున్నది అట్టివాకిళులు నాలుగుదాటి వీరసింహుడుఁ విస్మయావేశహృదయుండై దిగ్భ్రమజెంది వచ్చినదారియుం బోవలసిన దారియుం దెలియక తిరుగుచుండెను. అందుఁగల విశేషముల వర్ణింప ననంతునికైనను బెద్దకాలము పట్టును. అది యింద్ర లోకమా ! వైకుంఠమా యని తలంచుచు వీరసింహుఁడు తాను వచ్చిన పనియేదియో మరచిపోయెను. చూచినవింతయే చూచుచుఁ బోయినచోటునకే 'పోవుచునాలుగవ వాకిలియందుఁ బరిభ్రమించుచుండఁ నింతలో విభీషణుఁడు బలిచక్రవర్తి దర్శనముజేసి తిరిగి వచ్చుచుండం గాంచి ప్రహర్షము జెందిమఱి లోపలికిఁ బోవక యతనితోఁగూడి సేనానివేసము చేరెను. మొదటిద్వారమునందు మునుపు గనంబడిన వైష్ణవులెవ్వరు గనంబడలేదు.
అప్పుడు వీరసింహుఁడాత్మగతంబున బలిచక్రవర్తి ద్వారము మహావిష్ణుండు గాచుచున్నాడని పురాణములుచెప్పుచున్నవి. నాచేయి పట్టుకొనినవైష్ణవుఁడు జగదీశ్వరుఁడైన నారాయణుఁడు కాడుగదా. అవును సందియమేలా? బరులకదృశ్యుండనగు నన్నుఁ దెలిసికొనుట వశమా! ఛీ! ఛీ! నేను వట్టి మూర్టుండ. దర్శనమిచ్చినను దెలిసికొనలేకపోయితిని. నేనువట్టిపాపాత్ముడనని పశ్చాత్తాపము జెందుచుండ నింతలో దళంబులు రాజు నానతి పయనము సాగించుటయు వీరసింహుఁడు వారితోఁకూడ భోగవతీనగర ప్రాంతదేశమునకరిగెను. అనియెఱింగించెను.
121 వ మజిలీ.
భుజగాసురుల యుద్ధము
లంబకర్ణిక - దీర్ఘ జిహ్వికా ! యిటురా ! చెవులో మాట! నీకు మంచి యేకాంతము జెప్పెదను
దీర్ఘ జిహ్విక - ఇక్కడనుండఁగ జెప్పవచ్చును. ఎవ్వరివినకుండక నాలుక అడ్డము పెట్టెదనులే. చెప్పుము.
లంబ - ఇఁక మనలంకకు రాజు వజ్రకంఠుఁడగునఁట వింటివా?
దీర్ఘ - ఎట్లు విభీషణమహారాజో.
లంబ - వానిపని యైనదఁట. యిప్పుడే నాకొడుకు దీర్ఘజంఘుండు పాతాళము నుండి యొకజాబు తీసికొనివచ్చెను. భుజించి చంపక యొద్దకు బోవును.
దీర్ఘ - ఆ జాబులో నేమనియున్నది?
లంబ - (మెల్లగా) వభీషణుం డాయుద్ధములో మూర్ఛపోయినాఁడని చెప్పినాఁడు కాని అది చావనియె తలంపవలయును. అంతఃపురకాంతలనెల్ల బారిపోయి మానములఁ గాపాడుకొనవలయునని జాబులోనున్నదఁట చావుకానిచో నట్లు వ్రాయుదురా?
దీర్ఘ - మఱి చిన్నవిభీషణుఁ డేమయ్యెను? తక్కిన రాక్షస వీరులందరు మడిసిరాయేమి?