Jump to content

కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/158వ మజిలీ

వికీసోర్స్ నుండి

158 వ మజిలీ

గోనర్దీయుని కథ.

మ. నగముల్ ధూళిగ ధూలి శైలముగ సంద్రంబు న్విలాసస్థలం
     బుగఁ దెప్పన్ సుగభీరవార్ధిగఁ దృణంబు న్సారవజ్రాయుధం
     బుగ వజ్రంబు దృణంబుగాఁగను హిమంబు న్వహ్నిగా వహ్ని మం
     చుగఁ గావించెఁడు నద్భుతాచరణదక్షుం డీశ్వరుం డెప్పుడున్ .

మిత్రమా ! అఘటితఘటనాసమర్ధుండగు భగవంతుని విలాసములు కడు చిత్రములు. వినుము. మనమందఱ మొకసారియే. కాశీపురంబు విడిచితిమి. నేను బశ్చిమదిక్కుగాఁ బోయిపోయి యనేకపురనదీపక్క ణారణ్యములు సూచుచు నందందుఁగల వింతలఁ బరికించుచు రెండు నెలలు గడపితిని. ఆలోపలఁ జెప్పఁదగిన విశేష మేదియు నాకుఁ గనంబడ లేదు.

ఇఁక ధారానగరంబుమార్గంబుపట్టి పోఁదగునని నిశ్చయించుకొని యొకగ్రామములో నామార్గ మడిగి తెలిసికొని దక్షిణాభిముఖుండనై పోవుచుంటిని. పుడమితెరపికన్న నడవిగలదేశమే యెక్కువగా నున్నదని తలంచెదను. నేనుబోవుదారి నరమృగపక్షిశూన్యంబగు నొకమహారణ్యములో దింపినది. ఎన్నిదినములు నడిచినను నాయడవికిఁ దుదిమొదలు గనంబడలేదు. ఎన్నిదినములు నడిచితినో యేదిక్కునకుఁ బోవుచుంటినో తెలియక దిగ్భ్రమజెంది తిరిగినచోటే మరలఁ దిరుగు చుంటిని.

కందమూలఫలాదులచే నాకలి యడంచుకొనుచుంటిని గాని క్రమంబున మేనిలో బలము తరుగుచుండెను. ఇఁక నాయరణ్యము దాటి పోవఁజాలనని యధైర్యము గలిగినది. మిత్రదర్శనము లభింపదని విచారించుచుంటిని. అక్కాంతారములో మరణము నాకు విధి విధించెనని నిశ్చయించుకొంటిని. నాకు మొదటినుండియు నడవులనిన భయము. అందులకే మీతో నుత్తరదేశారణ్యములకు రమ్మనిన రానైతిని. నీవును గొంత యరణ్యసంచారశ్రమ మనుభవించితివి కావున విస్తరించి చెప్పనవసరము లేదు.

ఒకనాఁడు చీఁకటిపడునప్పటి కొకరావిచెట్టుక్రిందఁ జేరితిని. అది సమతలమగుట నాతరుమూలము పవిత్రమని తలంచి యుడు శుభ్ర పఱచుకొని,

శ్లో॥ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే।
      అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతె నమః॥

అని నమస్కరించుచు నాతరుమూలమునఁ బండుకొని వృక్షములలో నశ్వత్థవృక్ష మైతినని చెప్పిన భగవద్గీతావాక్యమును స్మరించు కొనుచు నాతరురాజమునే భగవంతునిగాఁ దలంచుచుఁ దచ్ఛాఖల యందుఁ జూట్కులిడి ధ్యానించుచుంటిని. అప్పటి యథాస్థితిఁ దలంప మేను గంపమునొందుచున్నది, చూడుము. నాఁ డమావాస్య. కొంచెము మబ్బుకూడ పట్టినది, మహాంధకారము వృక్షచ్ఛాయలతో మిళితమై ఇది తెరువు ఇది యడవి ఇది మిన్ను అనుభేదము తెలియక కన్నులు మూసి కొనినను దెఱచినను నొకవిధముగానే కనంబడఁజొచ్చినది. ఝల్లరీ ధ్వానములచేఁ జెవులు బీటలువాఱుచుండెను. నిద్రబట్టక యొంటిప్రాణముతో నాచెట్టుక్రిందఁ బండుకొనియుంటిని. అర్ధరాత్ర మైనప్పుడు,

గీ. భైరవాట్టహాసభంగి భీకరముగ
    బొబ్బవెట్టికొనుచు భూత మొకటి
    భూరివాతఘాతమునఁబోలెఁ గొమ్మలు
    బొదల నాద్రుమాగ్రమునకు నుఱికె.

మేను ఝల్లుమన నాభూతంబు నాపైఁబడి ప్రాణంబు పీల్చు చున్నట్లుగాఁ దలంచి మేను వివశమునొంద నందుఁబడియుండి యంతలోఁ దెలిసికొని యోహో ! తెలిసినది. రావిచెట్టుపై బ్రహ్మరాక్షసు లుండునని చెప్పుదురు. తద్భయంకరధ్వన్యంతరమున వేదఘోషము వినంబడుచున్నది. తప్పక యిది బ్రహ్మరాక్షసియే. ఇఁక నాయాయుర్దాయము గడియలలోనున్నది. అంత్యకాలమున వేదోచ్చారణ గావించుట ముక్తిప్రదంబని ధైర్యముదెచ్చుకొని నే నధికోత్సాహంబునఁ జెట్టుక్రిందఁ గూర్చుండి నడుముగట్టుకొని పదస్వరానుస్వారభేదములు లేకుండఁ దత్స్వరానుసారముగా,

సీ. సంహిత నున్నతస్వరమునఁ బఠియిుప
                స్వస్తి జెప్పితి సమస్వరముగదుర
    వరపరాయితము నేకరువువెట్ట నతండు
                కలిపి చెప్పితిని సక్రమముగాఁగఁ
    బదము వల్లింపఁ దప్పక నేను గవు లందు
                కొని సమంబుగఁ జెప్పితిని పదంబు
    క్రమము జెప్పిన నేను గ్రమము చెప్పితి జట
               నుచ్చరింపఁగ జట నుచ్చరించి

గీ. తిని ఘనఁ బఠింపఁ జదివితి ఘనను దులగ
    నుపనిషత్తులఁ జదువంగ నుపనిషత్తు
    లనె పఠించితి శ్రుతులెల్ల ననువదింప
    ననువదించితి సమముగా నతనితోడ.

అట్లు కవులు తప్పకుండ ముందరివార్యము లందిచ్చుచు సమముగా స్వస్తి చెప్పుచుంటిని. నాకంఠధ్వని విని యాభూతంబు క్రిందికి చూచి ఎవఁడవురా ? నీ విట్లు వెఱపులేక నాతో సమముగా వేద ముచ్చరింపుచుంటివి ? అని పెద్దకేకపెట్టి యడిగెను.

అప్పుడు వెఱపుడిపికొని మొండిసాహసముతో అయ్యా ! నా వృత్తాంతము వినవలయును. నేను గోనర్దీయుఁడను బ్రాహ్మణుఁడ. కాశిలో సమస్తవిద్యలుం జదివితిని. అందు నాకుఁ గ్రొత్తవిద్యఁ గఱపు నుపాధ్యాయుండు దొరకమి నూత్న విద్యాభ్యాసలాలసత్వంబుతో నా పట్టణంబు విడిచి పెక్కుదేశములు దిరిగితిని. ఎందుఁబోయిన నెవ్వరుఁ గనంబడలేదు.

ఇక్కడి కుత్తరముగాఁ బదియోజనములలో నొకయగ్రహారము గలదు, నేనక్కడికిఁ బోయి నాకువచ్చిన విద్యలఁ బేర్కొని క్రొత్తవిద్యఁ గఱపువా రెవ్వరైన నీయూర నుండిరా ? అని యడిగితిని. ఒక బ్రాహ్మణుఁడు నన్నుఁజూచి యోయీ ! నీవు చిఱుతవాఁడవైనను ననేకవిద్యల యందుఁ బాండిత్యము సంపాదించితివి. నీకంటెఁ జదివికొన్నవారీయగ్రహారమున లేరు. ఇక్కడికి దక్షిణముగాఁ బది యోజనములదూరములో మహారణ్యము గలదు అందొక రావిచెట్టు నాశ్రయించి యొక బ్రహ్మరాక్షసుఁ డున్నవాఁడు. అతనికి రానివిద్యలు లేవు. నీ వక్కడికిఁ బొమ్ము క్రొత్తవిద్య నుపదేశింపగలఁడని యెఱింగించిన సంతసించుచు నక్కడికిఁ బోవు మార్గ మెట్లని యడిగితిని.

అప్పుడు మఱియొకవిప్రుఁడు నామాట విని అయ్యో ! వెఱ్ఱి పారుఁడా! అక్కడికిఁ బోయెదవుచుమీ ? ఇతఁడు పరిహాసమున కట్లనెను. మనుష్యగాత్రముల గారిముక్కలవలె విఱుచుకొనితినియెడు బ్రహ్మరాక్షసుఁడు నీకు విద్యోపదేశము చేయునా ? వలదు వలదు. మఱి యొకదేశమున కరుగుమని యుపదేశించెను.

ఆహా ! సర్వవిద్యాపారంగతుఁడైన యాయన నన్నేమిటికిం జంపును ? శిష్యరికము గావింప విద్యోపదేశ మేల చేయకుండెడిని ? చచ్చినఁ జత్తుఁగాక నందుఁ బోవకమాననని సంకల్పించుకొని వారి కెవ్వరకిం జెప్పక గుఱుతులుజూచుకొనుచు వెదకి వెదకి తిరిగి తిరిగి యతికష్టమున నేటిసాయంకాలమున మాయింటి కతిథినైవచ్చితిని. మత్పురాకృతసుకృతవిశేశంబున మిమ్ముఁ బొడఁగంటి. ఇక కృతకృత్యుండ నగుటకు సందియము లేదు. ఏమిచేసినను లెస్సయే. క్రొత్తవిద్య లుపదేశించిన సంత సమే. కానిచో నన్ను భక్షించి నీయాకలి యడంచుకొనుము. ఎట్లైనను జరితార్థుఁడనే యని వానికి జూలివొడమున ట్లుపన్యసించితిని.

నాయుపన్యాసము విని యాభూతం బోహొహో! యెంత మాట పలికితివి ? విద్యాభ్యాసముచేయ న న్నాశ్రయింపవచ్చిన నిన్నుఁ జంపుదునా ! ఎంతబ్రహ్మరాక్షసుండనైనను బుణ్యపాపవివక్షత తెలియదా? నీస్వల్ప దేహమున నాయాకలి యేమాత్ర మడంగఁగలదు ? అదియునుంగాక,

శ్లో. బాలోవాయదివావృద్ధోయునావాగృహమాగతః।
    తస్యపూజావిధాతవ్యా సర్వప్యాభ్యాగతో గురుః॥
    ఉత్తమస్యాపివర్ణస్య నీచోపిగృహమాగతః।
    పూజనీయో యథాయోగ్య స్సర్వదేవమయోతిథిః॥

బాలుండైనను వృద్ధుండైనను తనయింటి కతిథిగాఁవచ్చినచో దప్పక వానిఁ బూజింపవలయును. ఎల్లరకు సభ్యాగతుండు గురువువంటివాఁడు. మఱియు నీచకులుండైనఁ దనయింటి కతిథిగావచ్చిన వానిం గూడ యథాయోగ్యముగాఁ బూజింపవలయును. అతిథి సర్వదేవమయుండై యుండును అని శాస్త్రములు ఘోషింపుచుండ నిన్నుఁ జంపుటకు నాకు నో రెట్లువచ్చును ? శరణాగతుండవైన నీయభీష్టము దీర్పకున్న నాపాప మెట్లుపోఁగలదు ? నన్నుఁ దరింపఁజేయుట కే నీ విక్కడికి వచ్చితివి. నీతో సంభాషించుటచే నాపూర్వోదంతమంతయు నంతఃకరణ గోచర మగుచున్నది. నాయోపిన యుపకారము గావించి నే నీజన్మము నుండి విముక్తినొందెదనని పలికిన విని నే నాత్మగతంబునఁ దిరుగా జన్మించినట్లు తలంచుచు మహాత్మా ! నీపూర్వజన్మవృత్తాంత మెట్టిది? ఏమి కారణంబున నిట్టిరూపము వహించితివి ? వినుటకుఁ బాత్రుఁడనేని నీవృత్తాంత మెఱింగించి నన్నుఁ గృతార్థుఁ గావింపుమని మిక్కిలి వినయముతోఁ బ్రార్థించితిని. అతండు చెట్లుపైఁగూర్చుండియే తనవృత్తాంత మిట్లు చెప్పఁదొడంగెను.

−♦ దేవభూతికథ. ♦−

కుమారనగరంబున విష్ణుభూతియను బ్రాహ్మణుఁడు గలఁడు. అతఁడు వేద వేదాంగములు నెఱింగిన శ్రోత్రియుఁడు అగ్నిష్టోమాది క్రతువులుసేసిన యాహితాగ్ని; అభ్యాగతుల నర్చించిన యన్నదాత. అనూచానసంపత్తి గలిగి యథాన్యాయంబుగ గౌర్హ స్త్యధర్మంబులు నడుపుచుండఁ గొండొకకాలంబునకు నప్పుణ్యాత్మునకుఁ గులపాంసనుండనై కుమారుండనై నే నుదయించితిని. నాకు దేవభూతియని పేరుపెట్టను. నేను మిక్కిలి చక్కనివాఁడని చెప్పికొనుటకు సిగ్గగుచున్నది. నా కై దేఁడులు వచ్చినదిమొదలు మాతండ్రి నాకు విద్యగఱపించుటకుఁ బెద్దయత్నము గావించెను. పదుగురు గురువుల నియమించి యన్ని విద్యలు పాఠములు సెప్పించుచుండెను. నాబుద్ధి మిగుల సూక్ష్మమైనది. నాగ్రహణధారణశక్తికి నుపాధ్యాయు లచ్చెరుపడఁజొచ్చిరి. నాలుగు వేదములు నాఱుశాస్త్రములు, పాఠములుజెప్పుకొంటి నచిరకాలములోఁ దండ్రికంటె గొప్పపండితుండ నై తినని వాడుకపొందితిని. మా తండ్రి కొలదికాలములో స్వర్గసుఁడయ్యెను. పిమ్మటఁ జెప్పునదేమున్నది?

శ్లో॥ యౌవనం ధనసంపత్తిః ప్రభుత్వ మవివేకితా।
      ఏకైకమప్యనర్ధాయ కిముయత్రచతుష్టయం॥

యౌవనము, ధనము, ప్రభుత్వము, వివేకశూన్యత, ఈనాలుగు గుణములలో నేది గలిగినను ననర్థమునకుఁ గారణమగుచున్నది. నాలుగు నొకచోటనే యుండినచోఁ జెప్పఁదగినదేమి ? యౌవనమదము విద్యా మదము రూపమదము ధనమదము నన్నాశ్రయించినవి. నావంటివాఁడు పుడమిలో లేడని గర్వపడుచుంటిని. పండితులు వచ్చిన సత్కరింపక తృణప్రాయముగాఁ దలంచి యవమానించి పంపుచుంటిని. అభ్యాగతుల విద్యాగంధరహితులని పరిహసించి పూజంపనైతిని. మాతండ్రిగారివాడుక క్రమంబున సంతరించిపోవుచుండెను. దుర్వ్యసనములపాలై విద్యార్థులకు విద్యలు గఱపలేదు. సంతతము క్రీడాసక్తుండనై తిరుగుచుంటిని.

నాకు మాతండ్రియున్నప్పుడే శుద్ధశ్రోత్రియునిపుత్రిక నొక దానిం గట్టిపెట్టిరి. అది కాపురమునకువచ్చినది కాని దానికి శృంగారమునం దభినివేశ మేమియును లేదు.

క. మడికచ్చ పెద్దబొట్టును
    నడికొప్పును బెట్టికొనుచు నవ్వ విభూషల్
    దొడకగ పూర్వాచారపు
    నడవడి వర్తించుఁ బెద్దనాఁతియవోలెన్ .

నామదికి దానివేషభాషావిశేషము లేమియు సంతోషము గలుగఁజేయకున్నవి. నేనును కామసూత్రము, కందర్పచూడామణి, అనంగరంగము, రతిరహస్యము, నాగరవల్లభము, నాగరసర్వస్వము, కామరత్నము, మన్మథసంహిత, మనసిజసూత్రము, కాదంబరీస్వీకరణసూత్రము, కాదంబరీస్వీకరణ కారిక, నర్మ కేళీకౌతుకసంవాదము, రతిమంజరి, కామతంత్రము, రతికల్లోలిని, పంచసాయకవిజయము, స్మరదీపిక, లోనగు కామశాస్త్రములు నెన్ని యో చదివితిని. కొన్నిటికి వ్యాఖ్యానములు రచించితిని. నాభార్య కీవిలాసము లేమియు నవసరములేదు. నాచక్కఁదనమునకు నావిద్యకు సార్థకమేమి ? అని సర్వదా విచారించుచుందును.

నామిత్రులు కొందఱు వేశ్యాలంపటుఁడవుకమ్మని నాకు బోధించిరి. వేశ్యల వలపులు సహజములు కామింజేసి యందులకు నాబుద్ధి యొడంబడినదికాదు. సహజానురాగము గలిగి దివ్యరూపకళావతియగు లావణ్యవతితోఁ గూడనివానిజన్మ మొక జన్మమా ? అని సర్వదా తలంచుచుందును. నాలోపమునకు నేన వగచుచు సంకల్పశతములచే సుందర స్త్రీసంభోగ మనుభవించుచుఁ గొన్నిదినములు గడిపితిని.

మాప్రక్క నొక్క శ్రోత్రియబ్రాహ్మణుఁడు కాపురము సే యుచుండెను. ఆయనకుమారుఁడు వేదమంతయు గట్టిగా వల్లించినాఁడు ఇతరవిద్య లేవియు రావు అతనికిఁ జంద్రముఖియను భార్య క్రొత్తగాఁ గాపురమునకు వచ్చినది.

చంద్రముఖి మిక్కిలి చక్కనిది. నాసంకల్పానుగుణ్యములైన లక్షణములన్నియు నాపొన్నికొమ్మయం దున్నవి. చంద్రబింబమువంటి మొగము, తెలిసోగకన్నులు, బారెడేసి నల్లవెండ్రుకలు, ముత్యాలకోవ వంటి పలువరుస, అద్దమువంటి చెక్కులు, సన్ననినడుము, పలుచనిదేహము, బంగారమువంటి దేహచ్ఛాయయుఁ గలిగి లావణ్యపూర్ణములైన యంగకములతో నొప్పుచున్న యాయొప్పులకుప్పం జూచి నే నువ్విళ్లూరుచుంటిని.

భగవంతుఁ డెపుడు నసదృశసంఘటనమే చేయుచుండును. వేద జడునకుఁ జక్కనిభార్యం గూర్చి నాకు వట్టియెడ్డిదానిం గట్టిపెట్టెను. ఆచంద్రముఖియే నాభార్యయైనచో సంవత్సర మొకగడియవలె వెళ్లించుచుఁ సంతసింపకపోవుదునా ? అని దానింజూచినప్పుడెల్ల తలంచుచుందును.

చంద్రముఖి క్రొత్తగాఁ గాపురమునకువచ్చినది. అత్తమామల చాటున నాఁడుబిడ్డలసందున మెలఁగవలయును. ఇల్లు కదలుటకు నవకాశములేదు. అట్టియువతి నా కెట్లులభ్యమగునని తలంచినను నాయుత్సుకత్వము వదలినదికాదు. నాచదివిన గ్రంథములన్నియు విమర్శించి దానిగుఱించి యనేకతంత్రము లుపయోగించితిని.

కొన్నిదినములకుఁ జంద్రముఖిమామగారు కాలముచేసిరి. అత్తగారు మూలబడినది. ఆఁడుబిడ్డ లత్తవారింటి కరిగిరి. చివరకుఁ జంద్రముఖియే యింటికి యజమానురాలయ్యెను. కాల మెంతలో మాఱినదోచూడుము. స్వతంత్రము వచ్చిన తరువాత నేదోపనిమీద మాయింటికిఁ బలుమారు వచ్చుచుండును. కొన్నిదినములు నన్నుఁజూచి తొలఁ గుచుండునది. క్రమక్రమముగాఁ జనువు గలుగఁజేసి నేనే పల్కరించుటకుఁ బ్రారంభించితిని.

ఒకనాఁడు మాయింటి కెందుకో వచ్చి నాభార్యతో మాటాడుచుండ నోసీ ! చంద్రముఖిం జూడుము, దానిముఖము కలకలలాడుచుండ లక్ష్మి తాండవమాడుచున్నది. దానియొప్పు దానియొయారములో నీ కొకటియైన లేదుగదా ! ఆహా దానిమగనియదృష్టము ! అని పొగడుచుండ ముసిముసినగవు నవ్వుచు వెళ్లిపోయినది.

చంద్రముఖిమగఁ డద్వయనసంపన్నుఁడగుట నేను వానియింటి కప్పుడప్పుడు పోయి వేదములోఁ దెలియనివిషయము లడుగువాఁడుంబోలేఁ బదమో క్రమమో యడుగుచుందును. ఆ సమయమునఁ జంద్రముఖి యేదియో పనికల్పించుకొని పదిసారులు నాకంటఁబడునది.

ఓయీ ! మనమిద్దఱ మొక్కయీడువారము. ఇరువురకు సంతానము లేకపోయినది. అందులకుఁ గొన్నితంత్రము లున్నవి యాచరింతమా? అని పలికినఁ జంద్రముఖిభర్త నావిలాసము లెఱింగియున్న వాఁడగుట రానినవ్వు ప్రకటించి నా కవసరములేదు. నీవే కావించుకొనుమని యుత్తర మిచ్చువాఁడు.

మఱియొకనాఁడు చంద్రముఖిభర్తకు సొమ్మవసరమువచ్చి తొట్రుపడుచుండఁ జూచి చంద్రముఖి మీరు దేవభూతికి మిత్రులుగదా? పోయి యప్పడుఁగుఁడు. ఈమాత్రము సహాయము చేయఁడా! అని ప్రోత్సాహపఱచుటయు నతం డిష్టములేకున్నను గార్యావసరమునుబట్టి నాయొద్దకువచ్చి తనయవసర మెఱిఁగించెను.

అప్పుడు నేను మిగుల సంతసించుచు రెండుగడియలలో నొకఁడు కొంతసొమ్ము తీసికొనిరాఁగలఁడు. నా కొకచోటికిఁ బోవలసిన యగత్యమున్నది. నాభార్యతోఁ జెప్పి పోయెదను. నీభార్యను గడియతాళి పంపుమని చెప్పితిని. అతం డింటికిఁబోయి రెండుగడియ లైసతరువాత భార్యను మాయింటికిఁ బంపెను. నే నింటిలోనే డాగియుంటిని. నాభార్య పెరటిలో నూఁతిలో నీరు చేదుచున్నది.

చంద్రముఖి వచ్చి మెల్లగా అక్కా! అక్కా ! అని నాభార్యం బిలిచినది. నేను, దలుపు తీసితిని. లోపలకు వచ్చినది. మాయక్క యెందున్నదని నన్నడిగినది. దొడ్డిలో నున్నదని, ఆ పనియేదియో నాకుఁ జెప్పరాదా? అని యడిగితిని. మీ రెఱుంగనిదికాదు. మీతమ్మునికి సొమ్మిత్తుమని చెప్పి నన్నుఁ బంపమంటిరఁట కాదా ! ఎఱుఁగన ట్లడుగుచుంటిరేల ? అని యెత్తిపొడిచినది.

నాకు మోహ మగ్గలమగుచుండెను. మేను సాత్వికవికార మందినది. కంపముతో నేను జంద్రముఖీ ! నీకు బదులేల? కావలసినంత ద్రవ్యము తీసికొనివెళ్ళుము అని రూపాయిలసంచి ముంగలవైచితిని. నే నంతయాసగలదానను గాను మీ రిత్తుమన్నవిత్తమే కొనిపోయెద లెక్క బెట్టి యిండు. అని చిఱునగవుతోఁ గ్రేఁగంటిచూపులు నాపై వ్యాపింపఁ జేసినది. ఆచూపులే మరునితూపులై నాయేపడఁగించినవి. అప్పుడు తమినిలుపలేక నేను గాఢముగా నయ్యంగనను బరిష్వంగము జేసికొంటిని.

అదియే నాజన్మావధిలో ననుభవించిన మొదటిసుఖము. చంద్రముఖ లజ్జావిశేషంబునంజేసి యంగీకారసూచకమైన యంతరాయము కొంత గలుగఁజేసినది. అదియు నాకుఁ జాల యింపుగా నుండెను.

నాభర్త వాకిటఁ గాచియున్నాఁడు వేగఁ బోవలె నాలస్యమైన ననుమానముజెందును సొమ్మిచ్చి పంపుఁడు అని బ్రతిమాలికొనినది. వెంటనే సొమ్మిచ్చి యంపితిని. మా కది స్వల్పకాలముగాఁ దోఁచినది కాని చంద్రముఖికై వేచియున్నమగని కది దీర్ఘ కాలమైనది. అతండు భార్యపై నలుగుచు నింతయాలసించితివేల? అనియడిగిన నామె బాగుబాగు, ఒకరి చేతిలోనుండి సొమ్ము సులభముగావచ్చునా ? మనకున్నతొందర వారి కుండునా ? ఆయనభార్య మడిగట్టికొని నీరుతోడుచున్నది. చే యూరు కొనువఱకు నుపేక్షించితినని బొంకినది.

శ్లో॥ అనుచిత కార్యారంభ స్స్వజనవిరోధో బలీయసా స్పర్ధా
     ప్రమదాజన విశ్వాసౌ మృత్యోర్ద్వారాణి చత్వారి॥

తగనికార్యమున కారంభించుట, బంధుజనవిరోధము, గొప్పవానితో స్పర్ధ, ఆఁడువాండ్ర నమ్ముట ఈనాలుగుపనులు మృత్యుముఖములని చెప్పుదురు. విప్రవరా ! పైచర్యలఁ జెప్పనేల ? మాయిరువురు మనసులుగలసినవి. సాంకేతికము లేర్పడినవి. నిత్యముగలసికొనుచుంటిమి.

అపారస్మారవికారములతో నొడ లెఱుంగనికూటములచేఁ జతుష్షష్టికళానైపుణ్యముమీఱ మమ్మంటియున్న మనోభవుం గృతార్థుం గావింపుచుంటిమి.

ఆహా ! ఆమోహనాంగి శృంగారలీలాచాతుర్యము లేమని చెప్పుదును. కామసూత్రము లన్నియుం జదివినప్రోడ క్రీడ లెట్లుండునో మీకుఁ దెలియదా ? క్రమంబున భయము విడచితిమి. సిగ్గు వదలితిమి. మర్యాద వీటిబుచ్చితిమి. చంద్రముఖి మాయింటికో నేను దానియింటికో పోయిచూచినంగాని యేపనిచేయుటకుం బూనము. లోకాపవాదమునకు జంకక తెగించి మెలఁగఁజొచ్చితిమి.

జనులు మాచేష్టలఁ గొన్నిదినములు చాటుగాఁ జెప్పికొనుచుండిరి. కొన్నిదినములు రచ్చల నిందింపుచుండిరి. చివరకు మాయెదుటనే నిందింపమొదలుపెట్టిరి. ఎవ్వరినీతులు మామది కెక్కినవికావు. చంద్రముఖిమగఁడు కొన్నిదినము లనుమానముజెంది మాయింటికిఁ బోవలదని నిర్బంధించెను. కాని మాటవినక ధిక్కరించి వచ్చుచునే యుండునది. నన్నుఁ దనయింటికి రావలదని యొకనాఁడు నాతోఁ బలికిన వెక్కిరించివచ్చితిని. అతనిమాట లక్ష్యపెట్టక మేము స్వేచ్ఛావిహారంబుల మెలఁగుచుండ గ్రామమంతయు హల్లకల్లోలముగాఁ జెప్పికొనుచుండిరి.

ఒకనాఁడు చంద్రముఖి రాత్రి మాయింటికి వచ్చి తిరుగా నింటికి పోయినదికాదు. పోకుంటివేమని యడిగిన మనోహరా! నామగఁడు వేదజడుఁడు. అతనిమాట యటుండనిండు. నాయత్తగారును బంధువులును బెట్టురట్టునకు మేఱలేదు. వచ్చినరట్టు రానేవచ్చినది. ఇఁక రహస్య మేమియును లేదు. వ్రతముచెడినను సుఖము దక్కవలయును. పగలుమాత్రము మిమ్ము విడిచియుండనేల ? ఇఁక నే నింటికిఁ బోవను. ఇందే యుండెదనని చెప్పిన నే నంగీకరించితిని.

మఱునాఁడు వాడుకప్రకారము వారింటికిఁ బోలేదు. జాముప్రొద్దెక్కినది. వంటవేళ మిగిలినది. దానియత్తగారు మాయింటికివచ్చి నా భార్యతోఁ జంద్రముఖి మీయింట నున్న దా ? అనియడిగిన లోపలగదిలో నున్నదని సంజ్ఞ చేసినది. లోపలికివచ్చి నాకడనున్న చంద్రముఖిం జూచి ఏమేరండా ! నీవింత సిగ్గువిడిచి సంచరించుచుంటివి ? కాపురము వదలుకొంటివా ? అని యేమేమో దుర్భాషలాడినది.

చంద్రముఖి నాకుఁ గాపురమక్కఱలేదు. ఇఁక మీయింటికి రాను. మఱియొకకోడలినిఁ జేసికొమ్ము. అని మూఁడేమాటలు చెప్పి యూరకొన్నది. అప్పు డామె పోయి కాపును గరణమును వెంటఁబెట్టికొనివచ్చి యిది నీకు నీతికాదని నాకుఁ జెప్పించినది. పదుగు రేకమైవచ్చిన నే నేమి సేయుదును? అధికారులమాట ద్రోయలేక చంద్రముఖిఁ జెప్పి బలవంతమున వారింటి కనిపితిని. చెప్పిపెట్టినబుద్ధి యెంతవఱకు నిలుచును ? మఱియొకనాఁడు చంద్రముఖి నాయొద్దకువచ్చి మనోహరా ! ఈగ్రామస్థులందఱు నాలోచించుకొని మనల శిక్షింపఁజూచుచున్నారఁట. మనమిఁక నిందుండిన మాటదక్కదు. మనము విదేశమునకు లేచిపోయిన హాయిగా సుఖింపవచ్చును. ఏరట్టును గలుగదని బోధించిన నందులకు నే నంగీకరించితిని. అప్పుడు చంద్రముఖి మఱియొకమాటఁ జెప్పినది.

నాభర్త బ్రదికియున్న చో గ్రామస్థుల వెంటఁబెట్టుకొని మనవెంట దఱిమికొనివచ్చి మనలం బట్టించి రట్టుజేయఁగలఁడు. కావున వానిం గడతేర్చిపోవుటయే లెస్స. మన కేయాటంకము నుండదని చెప్పిన నే నొప్పికొని యప్పని యెట్లుసేయవలయునని యడిగితిని. నేఁ జెప్పెదనుకాదా? అని యొకనాఁటిరాత్రి భర్తను నిద్రబుచ్చి నాయొద్దకు వచ్చి మనోహరా! ఇదేసమయము; గాఢనిద్ర బోవుచున్నాఁడు. తల్లి దూరముగానున్నది. కత్తి తీసికొనిరమ్మని యుపదేశించినది. ఆహా ! మోహావేశ మెట్టిదో విచారింపుము.

గీ. తల్లిఁ దండ్రి నన్నఁ దమ్మునిఁ బుత్రుని
    ప్రాణనాథు నెట్టిబంధువైన
    జారవాంఛజేసి చంపుదు రంగనల్
    వృజినమునకు నింత వెఱవ రెపుడు.

సకలవిద్యలు జదివిన నేనై న నించుక వివేకించితినా ? ఎల్లకాల మట్లే యుండుననుకొంటిని. సీ! కామాంధులకు యుక్తాయుక్తవివేక మించుకయు నుండదు. చంద్రముఖి యట్లుచెప్పినంతనే నూరియుంచిన కత్తిదీసికొని దానివెంట వారింటికింబోయి నిద్రావ్యామోహంబున నొడ లెఱుంగక గుఱ్ఱుపట్టుచున్న యాశ్రోత్రియబ్రాహ్మణుని కంఠముపై నొక్కవ్రేటువేసి గతాసుం జేసితిని. చీ, చీ, నావంటిపాపాత్ముం డెందైనం గలఁడా? అట్లు వానింజంపి చంద్రముఖిం గ్రుచ్చియెత్తి ముద్దాడుచు ప్రేయసీ ! మనకంటకము వదలినది మన మిఁక పోవచ్చును. లెమ్ము, లెమ్ము. వస్తువులు సవరించియుంచితిగదా ! అని పలికితిని.

అది యంతకుముందే ప్రయాణమైయున్నది. అప్పుడు మే మిద్దఱము నొరులకుఁ దెలియకుండ నగలు మూటఁగట్టికొని యాచీఁకటిలో నిల్లువిడిచి యూరు దాటి యుత్తరాభిముఖముగాఁ బోవఁదొడంగితిమి. ఉత్తమబ్రాహ్మణుని జంపినపాతక మూరకపోవునా ? మా వెంటఁ దరిమికొనివచ్చినది. కొంతదూరము పోయినంతఁ గృతాంతకికరులవంటి తస్కరులుకొంద రెదురై మమ్ము నదలించిరి. నేను బెదరక మూటలీయక వారి నెదిరించితిని. వారిలో నొకఁడు గుడ్డుకర్రతో నానెత్తి పఠేలుమన బ్రద్దలుగొట్టి చంపి చంద్రముఖిని చేరఁదీసికొనిపోయెను.

అప్పుడు నాకు బ్రహ్మహత్యాపాతకము ప్రత్యక్షమై నన్నా వేశించి బ్రహ్మరాక్షసుని గావించినది. నేను జంద్రముఖితో ననుభవించినసుఖంబు కడుస్వల్పము. మహాత్మా ! నరమృగపశుపక్షిసలిలరహితమగు నీయరణ్యమున క్షుత్పిపాసలు బాధింపఁ బెద్దకాలము బాధపడితిని. పడుచుంటిని. నేనుబడిన యిడుము లిట్టివని చెప్పుటకు శక్యములు కావు. మహావిద్వాంసుఁడవగు నీదర్శనము చేయుటచే నా కీపూర్వోదంతమంతయు నేఁడు జ్ఞాపకమువచ్చినది. ఇదియే నావృత్తాంతమని యెఱింగించుటయు నేను విస్మయముజెందుచు భూతేంద్రా ! పారదారికక్రియ యం దట్టిశక్తి యున్నది. నీవుకాదు ఎవ్వరైన నాసమయమం దట్లు కావించితీరుదురు. అని యుత్తరము జెప్పితిని.

అప్పు డాభూతపతి ఆర్యా ! నీవు నావలన విద్యలు గ్రహింపవలయుననిగదా వచ్చితివి ? నీ కేవిద్య రాదో చెప్పికొనఁదగినవిద్య యేదియో పేర్కొనుము. అని యడిగిన నేను మహాత్మా ! అది మీరే చెప్పవలయును. నేను జదివినవిద్య లివియని వానినెల్లఁ బేర్కొంటిని. అప్పు డతం డురముపైఁ జేయివైచుకొని ఔరా ! నీవెంతవాఁడవు ! నయమే నిన్నుఁగూడ భక్షించితినికాను. ఇంతకన్నఁ బెద్దపాప మనుభవింపవలసి వచ్చును. ఆహా ! నీపాండిత్యము ! నీకువచ్చిన విద్యలలో నాకు సగమైన రావే ? నేను నీ కేవిద్య జెప్పఁగలను ? అని నన్ను మెచ్చికొనుచుగోనర్దీయా ! నీకొక మహోపకారము సేసి నేను గృతకృత్యుఁడఁగాదలంచికొంటిని. నీదర్శనమువలన నీయరణ్యము దాటి దేశసంచారము సేయు సామర్థ్యము గలిగినది. నీ కుపకారముసేసితినేని పాపవిముక్తుండ నగుదునని తలంచుచుంటినని నా చెవులో నేదియో రహస్యము చెప్పి యీరూపముగా నీకురాజ్య వైభవముగలుగునట్లు చేసెదనని యుపాయముచెప్పెను.

రాజ్యముమాట పిమ్మటఁ జూచికొనవచ్చును, నేఁటికి బ్రతికితిని గదా? అని సంతసించుచు నాబ్రహ్మరాక్షసు ననేకస్తోత్రములు చేసితిని. అంతలోఁ దెల్లవాఱుసమయమైనది. అప్పు డాబ్రహ్మరాక్షసుఁ డారావిచెట్టుకొమ్మలు గలగలలాడఁ జప్పుడుసేయుచు నెగిరి యెక్కడికో పోయెను. నేనును బ్రతుకుజీవుఁడా ! అని యటఁగదలి దక్షిణాభిముఖముగాఁ బోయిపోయి కొన్ని దినము లాయడవి గడచితిని. అని యెఱింగించి యవ్వలికథ తరువాతిమజిలీయందుఁ జెప్పుచుండెను.

159 వ మజిలీ.

−♦ మదయంతికథ. ♦−

శ్లో॥ నాకాలె మ్రియతె జంతు ర్విద్ధశ్శరశ తైరపి
     కుశాగ్రేణైవ సంస్పృష్టః ప్రాప్త కాలోనజీవతి.॥

నూఱుబాణములచేఁ గొట్టినను కాలముమూడనివాఁడు చావఁడు, కాలమువచ్చినవాడు దర్భగ్రుచ్చికొనినను చచ్చును

అనునట్లు అయ్యడవినుండియు బ్రహ్మరాక్షసునినోటినుండియు నాయు శ్శేష ముండఁబట్టి యీవలఁ బడితిని,

శ్లో॥ ధనాశా జీవితాశాచ గుర్వీ ప్రాణ భృతాంసదా॥

ప్రాణధారులకు జీవితాశయు, ధనాశయు, నన్నిటిలో గొప్పవి కదా? నేనంతటితోవిడువక బ్రహ్మరాక్షసుం డెఱింగించినవిషయంబు పరిశీలించుటకై కొన్నిదినము లాప్రాంతదేశములు దిరిగితిని. నీవలెనే నేనును నొకనాఁ డొకయగ్రహారములో నొకవిప్రునింటి కతిథినై భుజించుచున్న