Jump to content

కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/157వ మజిలీ

వికీసోర్స్ నుండి

అదియే మందమతియని సరస్వతి తలంచినది.

సారసిక యరిగిన వెనుక శంబరుడు అయ్యో! నేను దెలివితక్కువ పని గావించితిని తిరుగాఁ బరీక్షింపరనియు సరస్వతినిఁ బెండ్లియాడ వచ్చుననియుఁ దలంచితిని. నాప్రయత్న మంతయు వ్యర్థమైనది. వీరికిఁ దెలియకుండఁ బారిపోవుటయే లెస్స. ఇందుండిన నాగుట్టు బయలుకాక మానదు. అని యాలోచించుచుండ మంగళవాద్యములు వినంబడినవి. ఆధ్వని విని శంబరుండు వాకిటకు వచ్చెను.

మంత్రిసామంతపురోహితాదులు ముందు నడువ మనోహరాలంకారభూషితమగు భద్రగజం బొండు వచ్చుచుండెను అది యెవ్వరి నిమిత్తమో యని యాలోచించుచుండ నందు నిలువంబెట్టి కుచుమారుం డిందేయున్నవాఁడు. వారిబస యిదియే యని కొందఱు పలికిరి. కుచుమారుం డెందుండెనని యడిగిన నేనే కుచుమారుండనని శంబరుఁడు తెలియఁజేసెను.

అప్పుడు మంత్రు లతని సకలాలంకారభూషితుం జేసి యా యేనుఁగుపై నెక్కించి య రేగింపుచుం దీసికొనిపోయి యొక దివ్య సౌధంబునం బ్రవేశపెట్టిరి. ఆసంతోషములో నతండు పారిపోవు మాటయే మఱచిపోయెను. పరిజను లతనికి రాజోపచారములు సేయుచుండిరి కాని వానికి సంతోషముమాత్రము లేదు. ఎవ రేమన్నను బెదరుతో మాట్లాడుచుండును. అని యెఱింగించునంత వేళ యతిక్రమించినది.

157 వ మజిలీ.

−♦ పల్లెవాండ్ర కథ. ♦−

పురందరపురమునకుఁ గ్రోశముదూరములో నొకపల్లె గలదు. అం దున్నవాండ్రందఱు పల్లెవాండ్రే. వాండ్రు వలలు వైచి చేఁపలఁ బట్టియు నోడలఁ ద్రోసియుఁ దమకు జీవనమే జీవనాధారముగాఁ గాలక్షేపము చేయుచుండిరి. ఆపల్లెలోనివారికెల్ల నొకపురోహితుఁడు గలఁడు. వా రాపురోహితు నడుగక క్రొత్తవలవేయుటగాని క్రొత్తయోడ నీటిలోఁ ద్రోయుటగాని నీటిలోనియోడల బాగుచేయుటకుఁ దీరము జేర్చుటగాని చేయరు.

ఒకనాఁడు నల్వురుబెస్తలు పురోహితునొద్దకుఁ బోయి జోహారు సేయుచు స్వామీ! మేము పెద్దవల నొకదాని నల్లుకొంటిమి. దాని నుపయోగించుటకు మంచివేళ నెప్పుఁడని యడిగిన నాబ్రాహ్మణుఁడు పంచాంగముజూచి యంకెలువైచి లగ్నముగట్టి నాఁటియర్ధరాత్ర మనుకూలముగా నున్నదని తెలియఁజేసెను.

స్వామీ ! పురందరపురము కోటయగడ్తలోనికిఁ గ్రొత్తనీరు వచ్చినదని తెలిసినది. ఆది మిక్కిలి లోతుగలది. అందు గొప్ప గొప్ప చేఁపలున్నవని చెప్పుచున్నారు పగ లందు వలవేయనీయరు. ఈరాత్రి మేము పోయి మీరుసెప్పినవేళకు వల వేయుదుము. ముందుగా నందులోఁ బడ్డవస్తువు మీదేను. దాన వచ్చినసొమ్ము మీకిత్తుము. అని మ్రొక్కి కొని వాండ్రు పురోహితుని సెలవుతీసికొని నాఁటిరేయి పెందలకడ భోజనములుసేసి వల మోచుకొనిపోయి చుక్కగుఱుతు చూచుకొని కోట వెనుక మారుమూలగానున్న కందకములో జే పరమేశ్వరా ! అని పలుకుచుఁ గొత్తవల గుభాలున నాపరిఖలో వైచిరి. నూఱుగజముల త్రాడు మునిఁగినది.

గీ. తల్లి ! భాగీరధీ గంగ దండమమ్మ
    వరుణదేవర మమ్ముఁ గాపాడవయ్య
    నీటివేలుపులార మన్నింపు డిపుడు
    కృపను వలనిండఁ జేఁప లెక్కింపరయ్య.

అని పాడుచుఁ ద్రాడు లాగుట ప్రారంభించిరి. బరువుగాఁ దోఁచి నంత గంతులువైచుచు,

ఒకఁడు - శా. గంగానమ్మకుఁ బప్పుపానకము లీగాఁ దెప్పగట్టింప నాదిం గావింపవలెన్ సరాసరిగ మఱియొకఁడు - నంతేకాదురా ఇంటి కేగం గొట్టింపఁగ నౌ గణేశునకు టెంకాయల్

ఇంకొకఁడు - బలే బాపనయ్యం గాదందువు రా?

వేరొకఁడు – సెబా సదియే ముఖ్యం బాదితీర్చంగఁ

అందఱు - జెప్పంగా నేటికి వారిదే ముడుపు ప్రాప్తం బిందు ముమ్మాటికిన్ .

శా. గంగానమ్మకుఁ బప్పుపానకము లీగాఁ దెప్పఁ గట్టింప నా
    దిం గావింపవలెన్ సరాసరిగ నంతేకాదురా యింటి కే
    గం గొట్టింపఁగ నౌ గణేశునకు టెంకాయల్ బలే బాపన
    య్యం గాదందువురా సెబా సదియ ముఖ్యం బాది దీర్పంగఁ జె
    ప్పంగానేటికి వారిదే ముడుపు ప్రాప్తం బిందు ముమ్మాటికిన్ .

అని యీరీతి వాండ్రు మాటలాడికొనుచు సంతసముతో నాజాలమును లాగి యొడ్డున దులిపిరి.

బాబో శపమురో శపమురో యని భయపడుచు నలువురు వలవిడిచి దూరముగాఁ బరుగిడిరి. అల్లరిజేసిన రాజభటులు పట్టుకొందురని యాలోచించి గడ్డితుంట వెలిగించి మెల్లగా దాపునకుఁ బోయి యాశవమును బరీక్షించి చూచిరి. దానిమెడకు రాయి గట్టఁబడియున్నది.

అందొకఁడు ఒరే పాపము వీని నెవ్వరో తల నలియఁగొట్టి మెడకు రాయిగట్టి చచ్చెననితలంచి యింతకుముందే యీకందకములోఁ బారవేసియుందురు. వీనియాయువు గట్టిది. యూపిరి యాడుచున్నది. వీనిం బ్రతికించిన మనకు మంచిపున్నెము రాగలదు, వీని మెడలో దందెములున్న వి. భేమ్మఁడు కాఁబోలుననిన మఱియొకఁడు నవ్వుచు మన కిందు మొదటదొరకినవస్తువును మనభేమ్మడికిత్తుమని చెప్పివచ్చితిమిగదా. ఈ భేమ్మడి నాభేమ్మడి కిత్తము అనుటయు వేరొకఁడు సరిసరి, వీనినిచ్చిన నాయన యేమిచేసికొనును ? పై పెచ్చు తెగులుకుదురువఱకు తిండిపెట్ట వలయును. అనిన నింకొకఁడు వీనిమెడలో నేదియో మాలికయున్నది చూడుఁడు అని పరీక్షించి ఇసిరో యెముకలు ఎముకలు. వీఁడెవఁడో దరిద్రుఁడు. చిన్న మెత్తుబంగారమైన మేనలేదే అని పరిహసించెను.

ఎట్లైనను బేమ్మడిని రచ్చించుట పున్నెముగదా. మన మీవల వై వనిచో నీపఆటికి వీఁడు కడతేరియేయుండును. మనము వీనిం దీసికొని మనబేమ్మడి కప్పగింతము. చ స్తత పడువరకు నాయనచే నుపచారములు సేయింతము. అందులకైన సొమ్ము మనమేయిత్తము. కుదిరిన తరువాత నంతయు వీనియొద్దఁ బుచ్చుకొందము అని నిశ్చయించుకొని యానలువురు వలమడతబెట్టి యందు వానిం బరుండఁబెట్టి యుయ్యలవలెఁ గొయ్యకుఁ దగిల్చి నలువురు మోసికొనిపోయి పురోహితునింటికిం జని కేకపెట్టిరి.

ఆయన వచ్చి తలుపుతీసి యిదియేమియని యడిగెను. వాండ్రు నవ్వుచు మీకు ముడుపు తీసికొనివచ్చితిమి కైకొనుఁడు అని పలికిన నప్పాఱుండు దీపముదెచ్చి చూచి యితఁ డెవ్వఁడు? అని యడిగిన వాండ్రు జరగినకథయంతయుం జెప్పిరి. అయ్యో ! వాని నా కేమిటికి ? బ్రదుకునో బ్రదుకఁడో ఈగొడవ నా కేల ? తీసికొనిపొండు అని ఫలికినఁ బెద్దవాఁడు సామీ ! మీ కింత దయలేదేమి? మీకులమువానికి మాకూడు బెట్టిన నొప్పుకొందురా ? మీ రుపసారములు సేయుఁడు, అందులకైనసొమ్ము మే మిచ్చుచుందుము. బాగుపడినపిమ్మటఁ గూలిపని యైనం జేసి మనరుణము తీర్చకుండునా ? పోనిండు. తీర్చనిచో' మన దాసుండని పిలువఁబడుచుండును. అని యుపదేశించి యావిప్రు నంగీక రింపఁజేసెను.

లోపలికిఁ దీసికొనిపోయి మంచముపైఁ బరుండఁబెట్టిరి. మంట వైచి తడియార్చిరి. నలిగి రక్తముగారుచున్న తలకుఁ జేఁపపొట్టుతోఁ గలిపినూరిన వేపాకు పట్టువైచిరి. విధిపరిపాకము కడువిచిత్రమైనదికదా! ఆపదలు గలుగఁజేయుటయు వానిం బోఁగొట్టుటయు భగవంతునిపనియై యున్నది. అందులకే “భయకృద్భయనాశనః" అని భగవంతునిఁ బొగడి యున్నారు. వారియుపచారమువలన నారోగి మఱునాఁ డుదయమునకు బాగుగా నూపిరి విడుచుచుండెను. బెస్తలు సంతసించుచు నామంచము విడువక మఱియు ననేకములగు చికిత్సలు సేయుచుండిరి. మూఁడు దినములవఱకుఁ గన్నులు తెఱవలేదు. నాలుగవనాఁడు కనులఁదెఱచి దాహ మిమ్మని సూచించెను. పాలు దాహమిచ్చిరి. పిలిచినఁ బలుక లేదు.

ఆవుపా లాహారముగా నిచ్చుచుండ మఱినాలుగుదివసముల కతనికి స్మృతిగలిగినది. అప్పుడు పల్లెవాండ్రు అయ్యా ! మీ దేదేశము ? కందకములోఁ బడియుంటిరేల ? మి మ్మెవ్వ రిట్లు చేసిరి ? మీవృత్తాంతము సెప్పుఁడని యడిగిన నతండు మందస్వరముతో నా కిప్పు డేమియు జ్ఞాపకములేదు. మీరు నన్ను బ్రతికించితిరి. మీకు నేను దాసుండనై యుండెదననిమాత్రము సెప్పెను.

పల్లెవాండ్రు సొమ్మిచ్చుచున్నవారు కావునఁ బురోహితుఁడు వానికి నుపచారములు చక్కఁగాఁ జేయుచుండెను. క్రమంబున మెదడు పూడికొనుటచే నతనికిఁ బూర్వపువ్య క్తి గలుగఁ బ్రారంభించెను. తన్ను శంబరుండు నిద్రించుచుండఁ దల నలియఁగొట్టి కందకములోఁ బార వై చెనని తెలిసికొనియెను. పల్లెవాండ్రుచేసిన యుపచారములగుఱించి యూరక స్తుతియించుచుండెను.

తెలిసినతరువాతనైనఁ దనభంగపాటు వాండ్రకుఁ జెప్పలేదు. కూర్చుండుటకు శక్తిగలిగినప్పుడు పల్లెవాండ్ర కేమియుపకారము చేయుదునని యాలోచించుచుండును. పల్లెవాండ్రు ఆయననిమిత్తమై చెక్కలకును వేరులకును బసరులకుఁ దిరుగుచుండుటచేఁ దమవృత్తిసేసికొనుట కవకాశము గలిగినది కాదు.

ఆరోగినిమిత్తమైన ఋణము నలుగురు సమముగాఁ బంచుకొన వలసియున్నది. ఒకనాఁడు నలువురు నాఋణవిభేద మేర్పఱుచుకొనుటలో నొకఁడు స్వకుటుంబము నిమిత్తము తెచ్చిన పంచదార నారోగికైన వ్యయపట్టికలో వ్రాయుటచే వారిలో వారికిఁ దగవు వచ్చినది. వా రా విషయమై కలహించుచు నిజము తెలిసికొనుటకై పురోహితునింటికి వచ్చి యామర్మ మాయనతోఁ జెప్పికొనిరి.

ఆకలహప్రకారమంతయును విని యారోగి వారినెల్లరఁ బిలిచి బాబులారా ! మీరు నాకొఱకుఁ జాలశ్రమపడుటయేకాక సొమ్ముకూడ సెలవుచేసిరి. అందులకుఁ గృతజ్ఞుఁడనగుటయేకాక మీకైన ఋణమున కిబ్బడి యిచ్చివేయుదును. ప్రస్తుత మంతకన్నఁ జెప్పజాలను. బ్రతికియుండిన మిమ్ముల సమానులలో నత్యధికులఁ జేయుదునని చెప్పుట ముఖ ప్రీతిమాట యగును. లేచి తిరుగుటకుఁ గొంచెముశక్తి వచ్చుచున్నది. కొలఁదిదినములలో మీఋణము తీర్తును. మీరు నానిమిత్తమై తగవు లాడవలదని గడ్డములు పట్టుకొని బ్రతిమాలుకొనియెను. వా రంగీకరించి వెనుకటిరీతిగా మైత్రితో మెలఁగుచుండిరి.

ఒకనాఁడు కొందఱువర్తకు లాపల్లెకు వచ్చి తమకు నోడనడుపుటకై చదివికొన్నపల్లెవాఁడు కావలయును. వానికిఁ దగినవేతన మిత్తుము. మే మొకయేటిరేవు గుత్తకొంటిమి. అందు దాటు మార్గస్థులకడఁ బుచ్చికొనిన సొమ్ము నమ్మకముగాఁ బద్దులువ్రాసి యప్పగించవలయును. అందలి యధికారమంతయు వాని కిచ్చివేయుదుము. నదియొడ్డుననే కాపురముండవలయునని యానిబంధనము లన్నియుఁ దెలియఁ జేసిరి,

అట్టిపనికిఁ దగినవాఁడొక్కఁడు నందు లేడు. పురోహితునింట నున్న బ్రాహ్మణుఁడావార్త విని నే నప్పనులన్నియు నమ్మకముగాఁ జేయుదును. నాకు మొత్తముగాఁ గొంతవిత్త మీయవలయును. నెలనెలకు వేతనములోఁ గొంత దీసికొనుచుండవలయునని తన సామర్థ్యమంతయు నక్కజమందునట్లు వారికిఁ దెలియఁ జేసెను. ఆబేహారు లతఁడుకోరిన సొమ్మిచ్చుట కొప్పుకొనిరి. అతండు పల్లెవాండ్రం జీరి తననిమిత్తమై వాండ్రువాడిన విత్తపు పట్టికం దీసికొని దాని కిబ్బడిగా వర్తకులచేత వారి కిష్పించెను. వాండ్రు మిగుల సంతసించు చుండ నోరీ ! మీకు నాకుఁ బ్రాణదానము గావించితిరి. నే నేమిచ్చినను మీయుపకృతికి సరిపడదు. ఇప్పుడు చెప్పరాదు కాని నే నొకప్పు డీదేశమునకు రాజును గావచ్చును అప్పు డేమైన నుపకారము సేయఁ జాలుదునేమో యని పెద్దగా వాండ్రం బొగడి పురోహితునిగీర్తించి వారి వలన నామంత్రణంబు వడసి వర్తకులవెంట నేటియొడ్డునకుఁ బోయెను.

అది గొప్పరేవు. బాటసారులు వేలకొలఁది నిత్యమారేవు దాటి పోవుచుదురు. ఆయిజారాదారు బాటసారులవల్ల సొమ్ము సేకరించుటకును పద్దులు వ్రాయుటకును నావికులకెల్లఁ దగినపనులు సెప్పుటకును నాబ్రాహ్మణునకు సర్వాధికార మిచ్చి యందుఁ గాపురముండునట్లు చేసెను.

అతండు మార్గస్థులవలనఁ గాసైన బీరువోకుండఁ గైకొనుచు బాటసారుల కాటంకములేకుండ వెంట వెంటనే యోడల నడిపించుచు సత్యమైనలెక్కలు వ్రాసి యానెలలోఁ దనయజమానుని కెక్కుడు లాభము చూపించెను. అతనిసత్యప్రవర్తనము దెలిసికొని గుత్తదారుఁడు వేతన మభివృద్ధిచేసి యన్ని పనులు నతనిమీఁదనే వదలివైచెను;

మఱికొన్నిదినములు గడిచినంతఁ గొందఱువిద్వాంసు లారేవు దాటుటకై యక్కడికివచ్చి సొమ్ముపుచ్చుకొనుచున్న యావిప్రుం జూచి అయ్యా ! మేము పండితులము. పురందరపురమున కరుగుచుంటిమి. తన్నగరాధీశ్వరునికూఁతుకు సరస్వతి కుచుమారుండను సూరిసత్తముని వివాహమాడుచున్నది. అమ్మహెూత్సవమునకుఁ బండితులనెల్ల రమ్మని శుభలేఖలు వ్రాసిరి. మేము దూరమునుండి వచ్చుచుంటిమి. మమ్మూరకయే రేవు దాటింపవలయునని కోరుచు నాశీర్వచనశ్రుతి యొకటి చదివి యర్థము చెప్పిరి.

అందు స్వరభేదము అర్థస్ఖాలిత్య ముండుట నవ్వుచు నాబ్రాహ్మణుఁడు ఆవిపరీతము వారికిఁ దెలియఁజేసి గంభీరోపన్యాసపూర్వకముగ సత్యార్థము జెప్పి యప్పండితులనెల్ల విస్మయసముద్రములో ముంచి వైచెను.

అప్పుడు వారు అయ్యా రే ! నీయుపన్యాసము విన చతుశ్శాస్త్ర పాండిత్యముగలవాఁడవుగాఁ దోఁచుచున్నావు. ఈయల్పాధికార మేల వహించితివి ? మాతోఁ బురందరపురమునకు రమ్ము. అందుఁ బెక్కు విద్వత్సభలు జరుగును. జయమందినవారికి గొప్పకానుక లితురఁట. మఱియు గోనర్దీయుఁడను విద్వత్ప్రభువుగూడ నానగరమునకు వచ్చుచున్నాఁడు. అనేకవిశేషములు జరగఁగలవు. ఈహైన్యజీవన మేమిటికి ? రమ్మని పలికిన విని యతండు కుచుమారుఁడు బ్రాహ్మణుఁడుగదా ? రాజపుత్రిక నెట్లు వివాహమాడుచున్నాఁడు ? వానికిఁగూడ రాజ్యము గలదాయేమి ? యనియడిగిన నాభూసురు లిట్లనిరి.

అయ్యా ! అది పెద్దగాథ యున్నది. సరస్వతి మహాపండితురాలు. తన్ను విద్యలలో నోడించినవానిం బెండ్లియాడెదనని శపథముచేసినదఁట. కుచుమారుం డోడించెను. తక్కినవిషయములన్నియు మన కేల ? అని సంక్షేపముగాఁ దెలియఁజేసిరి.

అట్లు వారు మాట్లాడుకొనుచుండఁగనే గుత్తదారుఁ డొకచీటి నాబ్రాహ్మణునొద్ద కనిపెను. జయపురాధీశ్వరుఁడగు గోనర్దీయుఁడను మహారాజు మనరేవుదాటి పురందరపురమున కరుగునఁట. పెక్కుసిబ్బందితో వచ్చును కావునఁ దగిననావల నియమించి కడుమర్యాదగా వారిం దాటించి మాట దక్కింతురని నమ్ముచున్నాను. రేపు సూర్యోదయసమయమునకే వత్తురు కావున సర్వము సిద్ధము చేయించవలయును.

అనియున్నచీటిం జదివికొని యాబ్రాహ్మణుఁడు దండనున్న పం డితులతో నార్యులారా ! ఆగోనర్దీయుఁడు క్షత్రియుఁడా ? అని యడిగిన వారు నవ్వుచు క్షత్రియుఁడుకాఁడు. బ్రాహ్మణుఁడే. మహావిద్వాంసుఁడు. మంత్రశాస్త్రములో నాయనకుఁ జాలినవాఁడులేఁడు. జయపురాధీశ్వరునిపుత్రికను బట్టినభూతమును వదల్చి యామెం బెండ్లియాడి యా దేశమునకు రాజయ్యెను. అని సంక్షేపముగా నాతనివృత్తాంతము జెప్పిరి. అతని కంతకంటె నప్పుడు తెలిసికొనుట కవకాశము గలిగినదికాదు.

ఆవిద్యాంసుల నూరకయే రేవు దాటించి యేనుఁగులు గుఱ్ఱములు లోనగు జంతువులు దాటుటకుఁ దగిన యోడలఁ బెక్కు నియమించి నావికులనెల్ల నాయత్తముగానుండుమని యానృపతిరాక కెదురుచూచు చుండె. అమ్మఱునాఁడు యథాకాలముకే గోనర్దీయుఁడు సపరివారముగా వచ్చి యందు విడిసెను. రాజభటులు కొందఱు తొందరగా నేటి యొద్దకు వచ్చి గుత్తదా రెవ్వఁడు? నావల సిద్ధపఱచెనా? యని యడిగిరి.

బ్రాహ్మణుఁడు లేచి అన్నియు సిద్ధముగా నున్నవి. అవి యేనుఁగులు దాటునవి, అవి గుఱ్ఱములకు, నవి మనుష్యులకు, నది రాజుగారి కని వేఱువేఱ నిరూపించిచూపించెను. రాజభటులు సంతసించుచు అయ్యా ! మీరొకసారి మారాజుగారియొద్దకు రండు. కర్తవ్య మెఱింగింతురని పలికిన వల్లెయని యావిప్రుండు వారివెంట గోనర్దీయుచెంత కరుగుచుండెను. అప్పుడే యేనుఁగును దిగి నదీతీరమునకు విహారార్ధమై గోనర్దీయుఁడు వచ్చుచుండెను. ఇరువురు దారిలోఁదారసిల్లిరి.

రాజభటులు వంగి సలాముసేయుచు మహారాజా ! యీతడే నావికాధిపతి. మంచినావల పెక్కు సిధ్ధపఱచియుంచెను. దేవరదర్శనార్థమై తీసికొనివచ్చితిమని పలికిరి. అప్పు డతం డాపాఱు నెగాదిగా చూచి విస్మయముతో నీపేరేమి ? మీ కాపుర మెందు ? జన్మభూమి యేది ? అని యడిగిన నావిప్రుండు నవ్వుచు నాపేరు కుచుమారుఁ డందురు. అని చెప్పుచుండఁగనే యారాజు ఓహోహో ! మిత్రుఁడా ! నన్ను గురుతుపట్టలేకపోయితివా ? గోనర్దీయుఁడనని బిగ్గరగా గౌఁగిలించుకొని యానందాశ్రువులచే నతనిం దడుపుచు అయ్యో ! నీవిట్లు చిక్కిపోయితివేమి ? రూపము చాలా మారియున్నది. ఈనావికాధి పత్య మెక్కడ సంపాదించితివి ? నీవు పురందరపురాధిపతికూఁతురు సరస్వతిని విద్యలలో నోడించి యామెం బెండ్లియాడుచుంటివని పత్రికలలోఁ జూచి యక్కడికే పోవుచుంటిని మఱియు యాకుచుమారుఁ డెవ్వఁడు ? ఇది వింతగానున్నదే. నీవృత్తాంతమంతయు నెఱింగించుమని యడిగెను.

అందున్న వారెల్ల రాజుగా రావిప్రునితోఁ జనువుగా మాటాడు చుండుట చూచి విస్మయము జెందుచుండిరి. కుచుమారుండు గోనర్దీయుని కైదండఁగొని యొకవిజనసైకతస్థలమునకుఁ దీసికొనిపోయి యందుఁ గూర్చుండఁబెట్టి ముందు తనకథ యిట్లు చెప్పెను.

వయస్యా ! భగవత్సంకల్పము కడు చిత్రమైనది. మనతలంపొక్కటియును సాగదు. ఉత్తరదేశారణ్యములు సూడవలయునని సువర్ణనాభునితోఁ గొంతదూరము పోయితిని. ఆబాధ కోర్వలేక మఱలి దైవవశంబుస సిద్ధాశ్రమవిశేషములఁ దెలిసికొని నూతనవిద్య సంపాదించి సరస్వతిని వాదములో నోడించి వరింపఁబడితిని. శుబరుండు దుష్టుండని యెఱుఁగక గుట్టుచెప్పితిని. వాఁడు సూడుపట్టి నన్నుఁ దలఁ జిదియఁగొట్టి కందకములోఁ బారవై చెను. . 'ఆయుర్మర్మాణిరక్షతి' అను శాస్త్రమువలనఁ బల్లెవాండ్రవలన నేను రక్షింపఁబడితిని. వాండ్రు నాకుఁగావించిన యుపచారములు జన్మములో మఱువఁదగినవికావు. దయార్ద్రహృదయు లన్నికులములలో నుందురుగదా? పాపము వారునా నిమిత్తము కొంతఋణము జేసిరి. ఆఋణము కొంతతీర్చి యిం దీయుద్యోగములోఁ బ్రవేశించితినని తనయుదంత మాద్యంత మెఱింగించెను.

అప్పుడు గోనర్దీయుఁ డతనిఁ గౌఁగిలించుకొని వెక్కి వెక్కి యేడ్చుచు నమ్మయ్యో ! యెంతయాపదదాటినది? క్షణముదప్పిన ని న్నీ జన్మమునకుఁ జూచుట తటస్థింపకపోవును గదా ? ఆహా మహాను భావులు పల్లెవాండ్రు. వారినెల్ల నిటు రప్పింపుము. వారిగేహములెల్ల బంగారుమయము గావించెదను. నిన్న గాధహ్రదమునుండి పైకిలాగిన జాలము నొకసారి నాకన్నులం బెట్టింపుము. దానిపై బంగారుతీగెలతో నల్లించి కులదేవతవలెఁ బూజించుచుందును. అని మఱియు నలుకదోప నిన్నుఁ జంపబూనిన యాదుఃష్టుం డాకృతఘ్నుఁడు ఆపాపాత్ముఁ డిందే యున్నవాఁడా? వాని నిప్పుడేపోయి శిరచ్ఛేదము గావించెద నాన తీయుము అని దుఃఖోన్మాదంబునం బలుకుచున్న గోనర్దీయునూఱడించుచుఁ గుచుమారుండు తనయుత్తరీయమున నతని కన్నీరు దుడుచుచు వయస్యా ! నేను బ్రతికితినికాదా? విచారించెదవేమిటికి ? ఊఱడిల్లుము శంబరుని కాలమే శిక్షింపఁగలదు. వానితండ్రి గావించిన సహాయమునకై విశ్వాసము హృదయంబున బాధించుచున్నది. అందులకై వాని నేమి చేయుటకు మనసు రాకున్నది. అది యట్లుండె. నీ వీరాజ్య మెట్లు సంపాదించితివి ? నీవృతాంతము జెప్పుమని యడిగిన నతండు కన్నులం దుడిచి కొనుచు నిట్లనియె.

మిత్రమా ! నీపాటు వినిన దుఃఖ మాగినదికాదు. దుర్జనులఁ జేరనిచ్చిన విపత్తు గలుగకమానదు. నిన్నట్లు పరాభవించి తానే కుచుమారుండనని ప్రకటించుచున్నవాఁడు గాఁబోలు. అయ్యో ! తొందరపడి తెలియక సరస్వతి వానిం బెండ్లియాడదుగదా? నీవు చెప్పినమాటలు విన నారమణి యసామాన్యప్రజ్ఞ కలదిగాఁ దోఁచుచున్నది. మఱలఁ బరీక్షింపక యంగీకరింపదు. కానిమ్ము దైవసంకల్పము మార్ప మనతరమా ? ఇఁక నావృత్తాంతము జెప్పెద నాలింపుమని యిట్లు చెప్పు చుండెను.

అని యెఱింగించునంతఁ గాలాతీతమైనది. తరువాత వృత్తాంతము పైమజిలీయం దెఱింగించెద.