కాశీమజిలీకథలు/ఆరవ భాగము/98వ మజిలీ
అర్జునుండు దివ్యవృక్షములతో నొప్పుచున్న ఖాండవనమును, హనుమఁతుండు స్వర్గతుల్యమైన లంకాపురమును, శంకరుడు సర్వజన సుఖాస్పదుండగు మన్మధుని దహింపఁజేసిరి. సర్వజనతాపకమైన చంద్ర దేవత నెవ్వఁడును గాల్పలేక పోయెను కావున దేవా! నీవు నా దారిద్ర్యమును నీ కట్టెలతోఁ గాల్చివేయుమని తెల్పుటకై యిట్టి కట్టెలం దెచ్బెను. అని కాళిదాసు సవరించి చెప్పెను. బోజుం డాతని సమయస్ఫూర్తికి సంతసించుచుఁ గాళిదాసుం గౌగలించుకొని కవీంద్రా ! యాతని యభిప్రాయ మేమియో నాకుఁ దెలియదు. కాని నీవిట్లు సవరించినందులకుఁ జాల సంతసించితిని అని పలుకుచు నా స్లోకమున కక్షరలక్షలు కానుకగా నిచ్చెను. కాళిదాసా విత్తమంతయుఁ గుంభున కిచ్చి నీ విట్టి బొగ్గులం దెచ్చితి వేమిటికి ? నా కప్పటి కా యుక్తి స్పురింపక పోయినచో జాలయవమానము వచ్చుంగదా. పో పొమ్ము. ఈ సొమ్ముతో సుఖముగా జీవించుమని చెప్పి యావిప్రు నంపివేసెను.
కాళిదాసు అట్టివాండ్రు బెక్కండ్ర కుపకారములు చేయుచు నర్ధికల్పభూజమగు భోజునికన్న నెక్కుడు వాడుక వడ సెను.
అని చెప్పి మణిసిద్ధుం డవ్వలిమజిలీ యందిట్లుఁ జెప్పఁదొడంగెను.
తొంబది యెనుబదవ మజిలి
యజ్ఞశర్మకథ
ఈ నిప్పచ్చరము నేను భరింపలేకుంటి నెన్నినాళ్ళిట్లిబ్బందిపడు చుందును. అయ్యో ? మీతోడివారెల్ల రాజదర్శనముఁజేయచు. గజాశ్వాందోళికాదుల సంపాదించుకొని వచ్చి మిద్దెలును మేడలును గట్టికొని భ్రార్యాపుత్త్రులతో సుఖించుచున్నారు. చదివికొనియు సభకుఁ బోవుట కింత పిరికితన మేమిటికి ? భోజుం డర్దదేవభూజుండై యుండ మనముతక్క నీ వీటిలో బేదరిక మనుభవించు పారులు లేరు. ఎన్నిసారులు చెప్పినను వినిపించుకొన కున్నారు. నేఁడు వండుట కేమియును లేదు. నాయావచ్చక్తి ని బొరుగిండ్లకుఁ దిరిగితిని తవ్వెడుబియ్య మెవ్వరును బదు లిచ్చిరికారు. నూకలు నిమిత్తము తిరిగినను దొరికినవికావు పిల్లలు మలమల మాడుచున్నారు. మీరు సర్వదా అగ్నిని శరణముగా నాశ్రయించుకొని యుందురు. నేఁడు వోయి రాజుగారిం జూచి వచ్చిన నన్న మున్నది. లేకున్న హరివాసరమే యని పలుకుచు ధారానగరంబున సోమిదేవి యగు బ్రాహ్మణి తన భర్తతో నొకనాఁడు ప్రాతఃకాలమున సంభాషించినది.
యజ్ఞశర్మయను పేరుగల యా తపశ్శాలి భార్యమాటలు విని అయ్యో? నీ స్త్రీ బుద్ధివిడిచితివికావు. సకల ధర్మముల నెరింగిన నామానస మకార్య కరణంబునకు దొరకున్నది. నే నేమి చేయుదును? క్షణభంగురమైన శరీరమును బోషించుకొనుటకై దుష్టమార్గము నవలంబింపనా ? రాజు విత్తములు క్రూరక్రియార్జితములు. పాపద్రవ్య పరిగ్రహణంబున మిగుల పాతకమని శాస్త్రములు ఘోషించుచున్నవి. అట్టి రాజ ద్రవ్యము పరిగ్రహించి యస్థిరమైన నీ శరీరమును బోషించుకొని స్థిరపదవిని బోగొట్టుకొనఁ జాలను ఎట్లో కన్నులు మూసికొనిన నాలుగుదినములు గడువకపోవు. ఇన్ని దినములు జరిపిన భగవంతుఁడు పిమ్మట మాత్ర మేల జరుపకుండెడిని. దైవమే యున్నాడు. నన్ను రాజునొద్దకుఁ బొమ్మని వేధింపకు మని బ్రతిమాలిన నా యిల్లా లిట్లనియె.
అగు నగు. నేనుబ్రతిదినము పెక్కుచిక్కులు పడి యిల్లుఁగడుపుచుండ భగవంతుఁడు గడుపుచున్నాఁడని చెప్పుచున్నారా? చాలుఁజాలు. రాజద్రవ్యముఁ దెచ్చుకొనువా రెల్ల నరకమునకుఁ బోవువారేనా? అట్లయినఁ గ్రొత్తనరక మొకటి కట్టించవలయును. మనరాజునొద్ద ద్రవ్యమును గ్రహింపనివారు లేరు. అప్రయోజకులిట్లే చెప్పుచుందురు. రాజులు యజ్ఞయాగములు చేసి బ్రాహ్మణులకు ధనము బంచి పెట్టిరని పురాణములలో నున్నది. వారందరు దోషులేనా? మీమాట లేమియు నుచితముగా లేవు. ఎక్కుడనో తెచ్చి పెట్టుచుండ నింటిలోఁ గూర్చుండి నీతు లెన్నియేనిఁ జెప్పవచ్చును. ఇంత వేదాంతము గలవారు పెండ్లి యాడఁ గూడదు. పిల్లలఁగన గూడదు. సంసారముఁ జేయుచున్నప్పుడు భార్యాపుత్రులఁ బోషింపలేనివాఁడు మహాపాపుఁడని యున్నది. నేనిట్లే పండుకొని యుండెద. మీ దైవ మెట్లు తెచ్చి పెట్టునో చూచెదం గాకయని యా సోమిదేవి ప్రొయి రాజవేయక యూరక పండుకొన్నది.
అప్పుడు యజ్ఞశర్మ మిక్కిలి పరితపించుచు వోసి నిర్భాగ్యురాలా ? నన్ను రక్కసివలెఁ బీడించు చుంటివికదా ? ఆ పెట్టెలో శాలువ యున్నది. ఇటు తెమ్ము. పోయి వచ్చెదనని దంతములు కొరుకుచుఁ బలికిన నామెలేచియా శాలువఁ దెచ్చియిచ్చినది. అది యజ్ఞశర్మ ముత్తాతది. వేయిచ్ఛిద్రములు కలిగి యున్నది. ఎన్నిమడతలు పెట్టినను దూట్లు కప్పబడినవికావు. దానినే బుజముపై వైచికొని విభూతిరేఖను -------- మెఱయుచుం బ్రహ్మదేజంబున నొప్పుచు విధిలేక యెట్టకే భోజనరేంద్రుని యా స్థానమున కరిగెను.
కట్టిన గుడ్డయుఁ గప్పిన పుట్టమునుం జాచి పకపక నవ్వుచు నా విప్రునిజాడ భోజున కెరింగించి తదానతినతని నృపతి మ్రోలకుఁ దీసికొనిపోయిరి. ఆ విప్రశథామణిఁ జూచి బోజుండు విస్మయముతో నమస్కరించి ఆర్యా ! మీదే గ్రామము? ఏ విద్యలం జదివితిరి. మీరు కట్టిన పుట్టంబులఁ జూడ కడు దరిద్రులవలెఁ గనంబడుచున్నారు. మీ దేశమున వదాన్యులు లేరా ? యని యడిగిన నాభూసురుని నాశీర్వచన పురస్సరముగా నిట్లనియె. దేవా ! నా కాపుర మీ పురమే. నే నెన్నడును రాజదర్శనముఁజేసి యుండలేదు. నేను దరిద్రుఁడనే. విద్య లన్నియుఁ బూర్తిఁ జేసితిని. అగ్నిష్టోమముఁ జేసితిని. అగ్నిగృహము నాశ్రయించుకొని యుందు నింతకన్న వేరొక వృత్తిలేదని చెప్పుటయు బోజుండు చెవులు మూసికొని శివశివా! యెంతమాట వినఁబడినది మావీట దారిద్ర్య బీడితుండగు భూసురుం డుండెననిన నాకపఖ్యాతి కాదా ? ఇన్ని దినములను నా యొద్ద కేమిటికి వచ్చితిరి కారు? మిమ్మెవరైన రానీయ రైరా? హరహర! ఈ దారిద్ర్యమెట్లు గడుపుచున్నారు. మీ మాటలు వినఁగడు నిడుములు కడుచుచున్నట్లు తోచుచున్నదని పరితపించుచుఁ గోశాధికారిం జీరి యాపారునకుఁ గోరినంత ధన మిమ్మని నియోగించెను.
అతండా బ్రాహ్మణుని రమ్మని పిలిచినంత నత్తపస్వి దేవా ! నా విన్నప మొండువినవలయును. నేనింతకాలము మీ చెంతకు రాకపోవుటకుఁ గారణ మిదియే మీ కష్టార్జితమైన ద్రవ్య మేమైనఁ గలిగియున్న నాకీయుఁడు. ఇతరమైనది నేను భరింప జాల. అల్ప మిచ్చినను సంతోషింతునని వినయముతోఁ బ్రార్థించిన విని యారేఁ డాలోచించి యోహో? యితండు కష్టార్జితమిమ్మని యడిగెను. అట్టి ధనము నాయొద్ద నేమియున్నది? ఉన్న దంతయు రాజకీయమే. అని యాలోచించి యావిప్రున కిట్లనియె.
అనఘా ! నీవు నన్నుఁ బరీక్షించుటకై యిట్లంటివి కాబోలు ? నా యొద్దఁ గష్టార్జిత మేమియునులేదు. రాజ్యము మదీయ మగుట నందలి ధనము నాదికాదా? నీకు గావలసినంత ద్రవ్యము దీసికొని పొమ్ము. ఊరక బాధింపకుము. అని వేడుకొనిన నతండిట్లనియె.
రాజా ! నేనుపవాసములైనఁ జేయుదునుగాని పాపద్రవ్యము బరిగ్రహింప నోప. అట్టిది లేకున్న నాకనుజ్ఞ యిమ్ము పోయి వచ్చెద. వేరొకప్పుడు సత్కరింతురుగాక యని లేచి యింటికి బోవ యత్నించుటయు బోజుండు నివ్వెరపాటుతో అయ్యో? ఇంతకు మున్నే పండితుండును నన్ను యాచించి విఫలమనోరధుడై క్రమ్మర పోలేదు. ఈతండతి దరిద్రుడయ్యు బ్రతిగ్రహమునకుఁ వెరచుచు ద్రవ్యశోధనఁ జేయుచున్నాడు. ఇట్టి మహాత్ముని సంతోషపరచలేని నాజన్మ మేమిటికి? అక్కటా ? వీని దరిద్ర మెట్లు పోగొట్టుదును? నాకష్టార్జిత ద్రవ్యం బేది గలదు? అని తలంచుచు ఆర్యా ! మీరు రేపీవేళకు నిక్కడికి దయచేయుడు. ఏదియో చూచి యిచ్చువాడనని చెప్పి యొప్పించియంపెను.
అతండరిగినది మొదలు కష్టపడి ధన మెట్లు సంపాదింతునని యాలోచించుండ సాయంకాలమైనది. రాత్రియెక్కడికైన బోయి ప్రచ్చన్నముగా గూలి పనిచేసి దానవచ్చిన సొమ్మా విప్రున కీయదలంచెను.
ప్రొద్దుగ్రుంకినతోడనే ప్రచ్ఛన్న మార్గమునగోట దాటి కూలి వేషమువైచికొని వీధిలో నిలువంబడి యుండెను. అప్పుడు కొందరు కూలివాండ్రు మాటలాడి కొనుచు నెక్కడికో పోవుచుండిరి. వారింజూచి మీరెందు బోవుచున్నారు! ఈ రాత్రి నాకేదియేని పని చెప్పింతురా? యని యడిగిన వారు మేము లోహశాల కరుగు చున్నాము. రాత్రుల నందు బని చేయుదుము. నీవు సమ్మెటం గొట్టెదవేని తీసికొని పోయెదము. ఆ పనివాడు నేడు రాలేదని చెప్పిరి.
ఆమాట విని రాజు రాత్రియెల్లఁ బనిచేసిన నా కేమి యిప్పింతురని యడిగిన పదారుకాసుల నిత్తునని చెప్పెను. నాఁ డా పనివాఁడు రాలేదు కావున వారికి వానితో నవసరముఁగలిగి నాలుగణా లిత్తుమని యొప్పించి తీసికొనిపోయిరి. వారందరు నొక లోహకారకుని యింటికిఁ బోయిరి. లోహకారకుడు సమ్మెట గొట్టుట రాజునకు నియమించెను. తన మృదుహస్తములతో బరువైనసమ్మెట నెత్తి కొట్టుచుండెను. పెడదెబ్బలు కొట్టునప్ప డొకటి రెండుసారులు నిదానముగా వేయుమని లోహకారకుఁడు మందలించెను. వెండియు నట్లే వేయుచుండ వానికిఁ గోపమువచ్చి కాలిన కారుతోఁ గాల్చబోయెను. అందుల కతండు తప్పించుకొని నే నెప్పుడు నీ పనిచేసి యెరుంగను. దానంజేసి నాకుఁ జక్కగాఁ దెలియకున్నది. కోపము సేయకుడు అని బ్రతిమాలికొనుచుండెను.
అతని వక్రఘాతలకు సంతత మా లోహకారకుఁడు తిట్టుచునే యుండెను. వాని ప్రతాపము లన్నియు సైరించుచు భూపాలుండు సూర్యోదయముదనుక సమ్మెట బాదుచుండెను. చేతులు రెండును పుండ్లుపడి రక్తము స్రవింపుచుండెను.
ఓరీ పశువా! ఇంత చేతగానివాఁడవీపని కేమిటికి రావలయును? నీ కతంబు నా పనికూడఁ జెడిపోయినదికదా ! పో, పొమ్ము. ఇఁక నెన్నడును మా శాలకు రాకుము. తెలియక నిన్నుఁబెట్టికొంటినని నిందించుచుఁ బదారు రాగిడబ్బులు వానికిచ్చి పంపివేసెను. రక్త వ్రణపూరితములై కరతలంబులు బాధింపుచుండ నా భోజుండాడబ్బుల మూటఁ గట్టికొని యొండేమియు ముట్టఁజాలక అక్కటా! నాకు లోకులు పడెడు నిడుమలం దెలిసికొనుటకై కష్టార్జిత ద్రవ్యం మిమ్మని యా విప్రుం డడిగెనా ? అయ్యో! పాపము కూలివాండ్రు స్వల్పవిత్తములకై యెంతపాటు పడుచుందురోకదా. నేనీ స్వల్పద్రవ్యము నిమిత్త మింత కష్టబడితిని. దీని వలన నా బ్రాహ్మణుని కొక పూటయయినఁ గడువదు. ఆహా ! కష్టార్జిత ద్రవ్యంబున నా విప్రునిదరిద్ర మెట్లు బాపువాడను. ఒకరాత్రికే నా పని తుదముట్టినది. మరియొక తెరవేదియు గనంబడదు. ఇంతకన్న నాకు శక్యముకాదని యా యనతోఁ జెప్ప వలసి వచ్చినది. అని యనేక ప్రకారముల దలపోయుచు నా నృపతి గూడమార్గమున నింటికిం బోయి స్నానముఁ జేసి జపమందిరమునఁ గూర్చుండి యా విప్రుని రాక నరయుచుండుటయు నింతలో
“కూ వొబహంసు (1
పిలు టంతలం నలంకలించన. నమస్కరింపుచు బోజుండు తన రెండు కరంబులు చూపి మహాత్మా ! నీవు నన్నిట్లు బాధ పెట్టుటకిట్టి కోరిక కోరితివి. కష్టపడి నే నెంత ద్రవ్యము సంపాదింపగలనుఁ రాత్రి యెల్ల సమ్మెట బాదితిని. పదారు డబ్బులనిచ్చిరి. అత్యల్ప మైన యీ ద్రవ్యము మీ కిచ్చుటకు సిగ్గగు చున్నది. మీ కిది యొక పూటకైన జాలదు. మీరు నన్నాశ్రయించియు దరిద్రపీడితులై యన్నారని నా మనసు మిక్కిలి పరితపించుచున్నది. మీకుఁ బెక్కులు వందనములు చేయుదును. ఈ కట్టడి విడిచి రాజకీయ ద్రవ్యము తీసికొని పొండు. దాన యావజ్జీవము సుఖింపుదురుగాక అని సానునయముగాఁ బ్రార్థించిన నా విప్రుఁ డిట్లనియె.
దేవా ! నాకు సగముకాలము గతించినది. ఇప్పటికిఁ బ్రతిగ్రహము జేసి యెరుఁగను. భార్యాపుత్రుల యిబ్బందిమూలమున నిందులకు సిద్ధపడవలసి వచ్చినది. అదియే నాకుఁ బదివేలు. పాపద్రవ్య పరిగ్రహణము సేయజాలను. నా నిమిత్తము మీరు చాల శ్రమపడితిరి. అయ్యో? కిసలయ కోమలములగు మీ కరతలములు దారుణ ప్రణాంకితములై యున్నవి. ఈ పాడు పొట్టకై మిమ్మింత కష్టపెట్టిన నా పాతకమున కంతముఁ గలదా? సీ ! నేను వట్టి మూర్ఖుఁడ. నే నిన్నాళ్ళుఁ గడపి యిప్పుడువచ్చి నిర్భంధింపవలయునా ? పాపము ! మీరు రాత్రి యెల్ల నిద్ర మాని పడరాని మాటలం బడుచుఁ గూలిపని చేసితిరిగదా ! అయ్యారే ! మీ యౌదార్యము వేనోళ్ళ గొనియాడఁ దగియున్నది. దీన మీకు నధిక పుణ్యము కలదు. నాకు మహా పాతకము కలదు. అని విచారించుచున్న యా జన్నిగట్టు నూరడింపుచు బోజనృపాలుం డా డబ్బులిచ్చి సాష్టాంగ నమస్కారములు గావించెను. యజ్ఞశర్మ నిర్మలమైన మనసుతో నా వసుమతీపతి నాశీర్వదించుచు నా రొక్కము మూటఁ గట్టికొని తన యింటికిం బోయెను.
సోమిదేవియు భర్త కెదురువోయి బండ్లా ? గుర్రములా ? యేనుగులా ? దేనిమీద ద్రవ్యముఁ దెచ్చుచున్నారు. ఎంత సొమ్మిచ్చెనని యడిగిన నవ్వుచు నా పాఱఁడు ఆ పాడుద్రవ్యము నేను భరింపలేను. రాజునకుఁ దన కష్టార్జితమైన రొక్క మిచ్చె. నిదిగో పుచ్చుకొనుమని మూట విప్పి యా డబ్బులు భార్యచేతిలో వై చెను.
ఆమె వానిం జూచికొని కోపముతో నగ్నిహోత్రగృహములోఁ బారవైచి -
ఉ. అక్షరలక్షలిచ్చి ప్రియమారఁ గవీంద్రులకెల్ల దేవతా
వృక్షమనంగఁ గోర్కె లొదవించుచు నర్దులఁ బ్రోచునట్టి భో
జక్షితినేత మీ కకట? చాలినవిత్త మొసంగలేక యీ
భిక్షము వెట్టె మీ కిఁకఁ గుబేరునిచేరిన నబ్బునే సిరుల్.
అంతకుమున్ను సోమిదేవిచే విసరి పారవైచిన పదారుడబ్బులు నా ధార్యములోఁ బడినవి. ఆ ధార్యమున నగ్గి వెలువరించు సమయంబున నందున్న రాగి నాణెములు అంగారక భ్రాంతి గలుగఁ జేయుచు బంగారు ముద్రలై మెరయుచున్న యవి. ఆ జన్నిగట్టు వానిం బట్టిగొని చూచి లెక్కింప యోహో ? ఈ బంగారు ముద్రల నిందెవ్వరిడిరి ? ఇది కడుచోద్యము. నాకు భోజుండిచ్చిన డబ్బు లిట్లయినవియా ? అవును సత్యమే లెక్కింపఁ బదారే యున్నవి. ఔరా ! శ్రోత్రియద్రవ్యము సత్పాత్రయం దుపయోగింపఁ బడిన సుక్షేత్రంబున నాటిన మంచి విత్తనమువలె బంగారమై ఫలించునని శాస్త్రములు చెప్పుచున్నవి. ఆహా ! ఆ మహారాజు నా నిమిత్తమై కూలిపనిచేసి సంపాదించి తెచ్చిన విత్తమూరక పోవునా? భళిరా ! ద్రవ్యశుద్ది అని యుబ్బుచు నా శ్రోత్రియుఁడు కళత్రమును బిలిచి యా చక్కానముద్రికలం జేతికందిచ్చి యివి యేమియో చెప్పుకొనుమని యడిగెను.
ఆవిడ వానింజూచి తలయూచుచు భోజుఁడు మీ కిచ్చిన వీనిం దాచి తెచ్చితిరి కాబోలు. ఇవి మీ చేతఁ బడి లోష్టములుగాక యట్లే యున్నవేమి ? అని పరిహసించిన నా భూసురుండు నవ్వుచు డిట్లనియె. సోమిదేవీ ! నీవు మంచి చెడ్డలు విమర్మింపక న న్నూరక నిందించుచున్నావు నీ మాటలు విని నేను జెడుత్రోవం బోవలసినదియా ? దుష్టక్రియోపార్జింతంబైన విత్తం బనల్పమైనను జిరకాలము నిలువనేరదు. సన్మార్గంబున లభించిన సొమ్ము అలంతియైనను నక్షయంబై యుండును. దానమునకు ద్రవ్యశుద్ధియుఁ బాత్రశుద్దియుఁ గలిగినేని నణువుమేరువై ప్రకాశించును. ఇవి యిందాక నేఁ దెచ్చినవియే. దాతృప్రతిగ్రహీతల నైర్మల్యంబునంజేసి రాగినాణెములు కనకము లైనవి. చూచుకొమ్మని చెప్పిన నమ్మక యా యిల్లాలు బాపురే ? న న్నెంత మోసము జేయుచుండిరి. చాటుగ వీనిం దెచ్చి ధార్యములోఁ గుక్కి వెక్కిరించుచున్నారా ? పోనిండు ఎట్లయిననేమి ? కొన్నిదినములు కాలముఁ గడపుకొనవచ్చునని చెప్పి వానిం బుచ్చికొని వానిలో నొకముద్రిక ఖండించి కొంచెము కాంచనం బమ్మి కావలసిన పదార్దములఁ దెప్పించుకొని నాఁడు సుఖముగాఁ గడిపినది. మరునాఁ డేదియో కావలసిన యా కాంచన ముద్రికలలోఁ దొలినాడు ఖండతమైన ముద్రికయేది యని వెదకగా నన్నియు నేకరీతిగానే యున్నవి లెక్కకు సరిపడినవి. అప్పుడు సోమిదేవి యబ్బురపాటుతో భర్తయొద్ద కరిగి నాధా ! మీ రన్నమాట నిక్కువమె సుడీ ? ఏమో యనుకొంటి. నిన్న వీనిలో నొకదానినరికి యమ్మితిని. అది యెప్పటియట్లయొప్పుచున్నది. ఇవి ఆక్షయములు గాబోలునని చెప్పిన నా బ్రాహ్మణుండును వానిం గ్రమ్మరఁ బరీక్షించి యట్లగుట చూచి వింత పడుచు రాజుగారి కష్టార్జితమైనద్రవ్యశుద్ది యెట్టిదో చూచితివా యని భార్యకుం జెప్పుచు దత్ప్రభావముఁ బెక్కు తెరంగుల స్తోత్రముఁ గావించెను. వారుక్రమంబున నా కళికల ఖండించుచు నా కాంచనము విక్రయించి దాన వచ్చిన ద్రవ్యంబున మేడలు గట్టి భూములు సంపాదించి తోటలువైచి యధికవైభవముతో నొప్పుచుండిరి.
ఒకనాఁడు భోజుండు తురగారూఢుండై రాజమార్గంబున బోవుచునద్బుతాలంకార శోభితములైన సౌధంబులంగాంచి యివి యెవ్వరి వని యడగిన యజ్ఞశర్మయను బ్రాహ్మణోత్తముని వని చెప్పిరి.
అతని పేరువిని యోహో ! యజ్ఞశర్మ కడు పేదవాఁడే యింత భాగ్యమెట్లు వచ్చినది ? తాను మిగుల భాగ్యవంతుండై కపటముగా నా యొద్దకువచ్చి యట్లు యాచించెనా ? నిష్కారణముగ నన్ను గూలిపని చేయించెం గదాయని యాలోచించుచు వీధి నిలువంబడి యా బ్రాహ్మణుని బిలిపించెను.
యజ్ఞశర్మ వాకిటికి వచ్చి బోజుం గాంచి వినయ మభినయించుచు దేవా ! లోపలికి దయచేయుఁడు నేను మీ యాశ్రితుఁడ యజ్ఞశర్మనని చెప్పుటయు రాజు విస్మయముఁ జెంది నీ కీసంపద యెట్లుగలిగినది. కష్టార్జితముగాని స్వీకరింపవుగదా ? ఒరునివలన ద్రవ్యము సంపాదించి నాతో నప్రతిగ్రహీతనని చెప్పి నన్ను గష్ట పెట్టితివిగదా? ఇదియా నీ వృత్తియని యాక్షేపించిన నాక్షితిసురుం డిట్లనియె.
దేవా ! నా ఐశ్వర్య మంతయు దేవర దానముఁగావించిన ద్రవ్యమువలన వచ్చినదే ? ఇతరులకడ కెన్నఁడును నేను పోయి యెరంగ. ద్రవ్యశుద్ధియుఁ బాత్ర శుద్ధియుం గలసి యక్షయమైనదని చెప్పిన నమ్మక బోజుం డాపాఱుని బరిహాసములాడఁ దొడంగెను.
అప్పుడు యజ్ఞశర్మ భోజ నరేంద్రుని లోపలకుఁ దీసికొని పోయి ధార్యములో (అగ్ని దాచుకుండములో) నున్న బంగారు ముద్రలఁ జూపించి వారియెదటనే ఖండించి దానిలోఁ గప్పి యెత్తి యెప్పటియట్ల యొప్పుచుండుటం జూపించి యా వృత్తాంత మంతయుం జెప్పి యతని నాశ్చర్యసాగరంబున మునుఁగఁ జేసెను.
అప్పుడు భోజుండు ఆహా ! దానమునకు ద్రవ్యశుద్ది కావలసియున్నది నేను లక్షలకొలఁది ధనము పంచిపెట్టుచున్నను దానిఫలమంతయు నీ డబ్బుల నిచ్చిన ఫలమునకు సరిపడదు. పాత్రశుద్ధియు నట్టిదే యని మెచ్చుకొనుచు నా విప్రునివలన నా మంత్రణము వడసి యింటికిఁ జనుచు మార్గమధ్యమున నున్న శివాలయములోని కరిగి ప్రదక్షణముఁ జేయచుండఁ బ్రక్క నున్న మంటపములో నొక యోగిని యొకబాలుని ముద్దాడుచుండెను.
దుర్గకథ
బోజుం డందు నిలువఁబడి యోహో ? ఈ యోగిని సంగముల విడిచియు నీ డింభకునియం దిట్టి ప్రీతి యేమిటికిఁ జెందవలయును? బ్రహ్మచారిణికిఁ బుత్రుం డెట్లు జనియించెనని శంకించుకొనుచు దాపునకుంబోయి దేవీ ! నీ కీ శిశు వేమి కావలయునని యడుగుటయు నా యోగిని యిట్లనియె.
దేవా ! నాకీ బాలుండు సోదరుఁడు. మేనల్లుఁడు. పౌత్రుఁడు. మామ కొడుకు. పినతండ్రి మరది యగునని చెప్పినది. ఆ మాట విని యతండు నివ్వరపాటుతో నిన్ని వావు లెట్లు కలిగినవియో చెప్పుమనుటయు నా యోగిని నేను జెప్పఁ జాలను దైవమే చెప్పవలయునని యుత్తరముఁ జెప్పినది.
అప్పుడు బోజుం డింటికిఁ బోయి మరునాఁడు సభలోఁ బండితుల నందరను రప్పించి యిట్లు చదివెను.
శ్లో. భ్రాతః !: ధ్రాతృవ్య ! పౌత్ర ! శ్వశుర ! సుత ! పితృ వ్యేతితం దేవరేతి.
అనియొక పాదముఁ జదివెను. కవీంద్రులందరు దిక్కు.లు చూచుచుండిరి. అప్పుడు కవిసార్వభౌముఁడు కాళిదాసు ఇట్లు పూర్తి గావించెను.
శ్లో. జారోత్పన్నౌ విసృష్టౌ తనయదుహితరోదంపతీధైపయోగాత్ ।
యోగినాగహిన్‌తాసాతదనుగమన శాద్యోగినీత్వం ప్రపెదె ॥
పశ్చాద్భార్యాకృతాంబాజినితమథశిశుంలాలయంత్యబ్రవీత్సా ।
భ్రాతర్భాతృవ్య పౌత్రశ్వశురసుతపితృ వేతితందేవరేతి.
ఒక గ్రామమున దుర్గయను వెలఁది గలదు అది జారిణియై తొలిప్రాయముననే భర్తనువిడిచి మరియొకగ్రామముపోయి యుపపతితోఁ గాపురము జేయుచుండ దండుఁడను కొమరుం డుదయించెను. ఆ శిశువుం బెంచినచోఁ దనయౌవనమునకు భంగము గలుగునని యా దుర్గ యా పాపనువిడిచి మరియొక గ్రామమువోయి యందొ కనితోఁ గాపురము చేయుచుండెను. కొంతకాలమునకు గర్భవతియై యొక యాఁడు శిశువుంగని వెనుకటిరీతి నా బాలిక నందువిడిచి యింకొక పట్టణమునకుఁబోయి వేశ్యలలోఁ గలిసి వర్తించుచుండె.
దాని కొడుకు నొకఁడును గూతుఁనొకఁడును బెంచికొని తెలియక యా యిద్దరికే వివాహము గావించిరి. ఒకనాఁడు త్రికాలవేదినియైన యోగిని వారి గ్రామమునకు వచ్చుటయుఁ బెంచుకొనిన తల్లిదండ్రులా వధూవరుల నామె కడకుఁ తీసికొనిపోయి వీరి యదృష్ట మెట్టిదో చెప్పమని యడిగిరి. అప్పు డాయోగిని దివ్యదృష్టిచే వారి సంబంధము దెలిసికొని సీ ! సీ ! యీ మిధునము గూర్చ దగినది కాదు. అన్నా చెల్లెండ్రు అని వారి వృత్తాంతము చెప్పినది. ఆ కథ విని యా బాలిక వివేకముతో నప్పుడనన్యసించి కాషాయవస్త్రము ధరించి కపర్దిని యని పేరు పెట్టుకొని యా యోగినికి శిష్యురాలై యామెతోఁ దిరుగుచుండెను.
దుర్గకొడుకు మాతృదోషంబున దుర్వ్యుసనములపాలై యౌవన గర్వమున గన్ను గానక తిరుగుచు నెరుఁగక యొకచోట వేశ్యా ధర్మమున వర్తించు దల్లితోఁ గలిసికొనియెను. వానివలన దుర్గకు మగశిశువు జనియించెను. దుర్గ వెనుకటి కారణముననే యా శిశువును వీధిలోఁ బారవేయించినది. ఉప్పరవాండ్రు ఏడ్చుచున్న యాడింభకుని తీసికొని కావడిలో నిడికొని యెక్కడికో బోవుచుండిరి. దైవికముగా యోగియై తిరుగుచున్న కపర్దిని యా బాలుంజూచి దివ్యదృష్టిచే గ్రహించి తొడ నిడుకొని యట్లు ముద్దులాడెను. విత్కరించి చూడ నా బాలునం దన్నిపావులు గలిగియున్నవి.
తన తల్లి కొడుకు కావున - సోదరుఁడయ్యెను.
తన యన్నకొడుకు కావున మేనల్లుఁడు.
భర్తకు భార్యయైన తల్లి తనకు సవతి అయినట. అట్టి సవతికొడుకు తనకు కొడుకయ్యెను. వాని కొడుకగుట - పౌత్రుఁడు.
భర్తకు తల్లిఅయిన తనతల్లి తన కత్త అయినది. అత్త మగనికి తమ్ము -------
తన భర్త కొడుకగుట - సుతుఁడు.
సు గతికి మ మగని తమ్ముంయగుటసిన గం. ల
న? వతమ్ముయతు శీ మ ఆలి ఎతయంతయు. మూండువాద: లలి" సమక్ని యజ్‌ంగిందిన కొ? న సబునవైన భత్యము భారని ల హింట్ కవులకు సిగ్గువవ్న
వున ర్ ఆని, యులేగేలచప గోపాలా ! బోజభూపాలుండట్లు కాళిదాసాది మహాకవులతో విద్యాగోష్టిఁ గాలక్షేపము జేయుచు నింద్రవైభవములతోఁ బెద్దగాలము రాజ్యము గావించె. నీ యుపాఖ్యానము వినిన నిహపర సాధనమైనదని చెప్పుటయు శిష్యుండ పరిమితానందము జెందుచు గురునితో నవ్వలి మజిలీ చేరెను.
క. మంగళమగు గో బ్రాహ్మణ *
పుంగవులకు సర్వసస్యపూర్ణంబై యొ
ప్పుంగాత ధాత్రిప్రజ లు
ప్పొంగుచు దనరారుదురు ప్రపూర్ణసుఖములని.
గీ. బుతుహుతాశన వసుతార కేశకలిత
సంఖ్య నొప్పారు వరిశాలిశకమునందు
దనరు నానందనామ వత్సరమునందు
దీని రచియించి ప్రకటించితిని ధరిత్రి.
గద్య. ఇది శ్రీమద్విశ్వనాధ సదనుకంపాసంపాదితకవితావిచిత్రాత్రేయ
మునిసుత్రామ గోత్రపవిత్రమధిరకులకలశజలనిధిరాకాకుముద
మిత్ర లక్ష్మీనారాయణపౌత్ర కొండయార్యపుత్రసోమి
దేవి గర్భశుక్తిముక్తాఫల విబుధజనాభిరక్షిత
సుబ్బన్నదీక్షితకవివిరచితంబగు కాశీయా
త్రావసథ చరిత్రమున నాఱవ
భాగము సమాప్తము.
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
శ్రీ విశ్వనాధార్పణమస్తు.