కాశీమజిలీకథలు/ఆరవ భాగము/97వ మజిలీ

వికీసోర్స్ నుండి

వల్లభులు బహువల్లభులని వినియుండలేదా ఇంటికిం బోయిన మన పరిగణన మెప్పటికో యని యర్థోక్తిగాఁ బికస్వర వికస్వరరవంబునఁ దెలిపినది.

బోజుండు పెచ్చు పెరుగుతమి నింత యేల బాలా ! నీ కే లిటుతమ్ము. గాంధర్వంబునఁ బరిగ్రహింతుఁ గంతుఁడే మనను బురోహితుండని పలికిన విని ప్రజ్ఞావతి సంతసించుచు దేవా ! ఇది దేవచోదికము. నీ నిమిత్తమే మేమిక్కడికి వచ్చితిమి. మేము గంధర్వులము. హరిపత్నిచే మాకీ యుపదేశము చేయఁబడనదని యా వృత్తాంతమంతయుఁ జెప్పినది. అప్పుడా బోజనరేంద్రుండు పరమానంద కందళిత హృదయార విందుండై యయ్యరవిందగంధిం గాంధర్వ వివాహంబునఁ బత్నిగాఁ గైకొని కేలు గేలం గీలించి యుద్యానవన సౌంధంబునకుం దీసికొనిపోయి తన భార్యలకు జూపుచు నక్కాంతామణి వృత్తాంత మంతయు నెరింగించెను.

అక్కురంగనయనలును గమలను జెల్లె లిగా నెంచి గారవించిరి. లీలావతి తాను గట్టుకొనిన చీర కమలదని విని విధిఘటితమును గురించి పెద్దగా నుపన్యసించినది. అట్లు బోజనరేంద్రుండు లోకైకసుందరులఁ నలువుర బెండ్లి యాడి మహేంద్రవై భవంబున రాజ్యంబు సేయు చుండెనని యెరింగించి యయ్యతి పంచాననుండు తత్కథా శేషంబు తదనంతర నివాసదేశమునఁ జెప్పఁ దొడంగెను.

తొంబదియేడవ మజిలీ

భోజుని రాజ్యపాలనము కధ

పతంగకులంబులు కులాయంబులనుండి వెలువడి కలకల ధ్వనులతో నలుదెసలకు బారుచున్నవి. చిగురించిన రసాలతరు శాఖలవసించి పికని కరంటులు మధురస్వరంబులఁ గూయుచున్నవి. నర్మదా నదీసీకర చోకరములగు మందమారుత పోతంబులు హాయిగా వీచుచుండెను. కుసుమకిసలయ ఫల మనోహరములై న తరులతా షండంబులు కన్నుల పండువుఁ గావించు చుండెను. ఒకనాఁ డట్టి సమయంబున బోజనరేంద్రుఁడు క్రీడావనంబున కరుగుచుంట రాజమార్గంబున నొక పండితుండతని కెదురువడి కన్నులు మూసికొని నడువఁ దొడంగెను. బోజుండందు నిలువంబడి యా విప్రు నుద్దేశించి పారుఁడా। నీ యాకారముసూడ విద్వాంసుండవువలెగనంబడు చుంటివి. నన్నుఁజూచి యాశీర్వదింపక విశేషించి కన్నులు మూసికొని యరుగు చుంటి వేమిటికి ? ఇది యెక్కడి సాంప్రదాయమో యెరింగింపుమని యడిగిన నతం డందు నిలువంబడి యిట్ల నియె.

దేవా ! నీవు విష్ణుభక్తుండ వగుట బ్రాహ్మణుల కుపద్రవము సేయ నేరవు గదా ? దానంజేసి నీవలన నా కేమియు భయములేదు. మరియు నీవు లోభా విష్టుండవై యెవ్వరి కేమియు నీయకపోవుట నీ యాశ్రమము వలన నాకేమి లాభము వచ్చెడిని? అందువలన నాశీర్వదింపనైతి. ప్రాతఃకాలమున తొలుతనే కృపణుని మొగముఁ జూచెనేని నాఁ డేమియు లాభముగలుగదని లోకోక్తిగలదు. దాని ననుసరించి కన్నులు మూసి కొంటిని. వినుము. ఎవని యనుగ్రహము నిష్ఫలమో యెవనికోపము నిరర్దకమో యట్టిరాజును స్త్రీలు నపుంసకునింబోలె లక్ష్యము సేయరు. లోభివాని ధనము ప్రగల్భములేనివాని విద్యయుఁ బిరికి వానిబలము వ్యర్థములగుచున్నవి. మరియు మా తండ్రి వృద్దుండై కాశీపురంబున కరుగుచుండ నతనికి నమస్కరించి జనకా ! నేనేమి సేయఁదగినది. ఏ వృత్తి నవలంబింపఁ దగినది. మంచిమాట లుపదేశింపుమని ప్రార్థించిన నతం డిట్లనియె. పుత్రా ! నీ కెట్టి యాపదవచ్చినను ఆడువాండ్రను దుర్మంత్రులును విటులును జెప్పు మాటలకుఁ జెవియొగ్గు నృపతి నెన్నడు నాశ్రయింప వద్దుసుమీ ? దాన ముప్పురాక మానదు. దుస్సచివుడగు రాజును అట్టి వాని నాశ్రయించు వాఁడును మహాపాతకుఁ లనఁబడుదురు.

వివేకహీనుండగు రాజు గుణవంతులగు మంత్రులు చెప్పు మాటలు విన నొల్లఁడు. దుర్జన సంఘము బలిసియున్న కడ సజ్జనుల యవసరమేమిటికిఁ గావలయును ? సుగుణములుగల రాజు ధనహీనుడైనను సేవింపఁ దగినది. కాలాంతర మందైన నతనివలన లాభముఁ గలుగక మానదు. దాత గాని వానికి దాక్షిణ్య మేమియు నుండదు. అని చెప్పిన మా తండ్రి వాక్యముల ననుసరించి తిరుగుచుంటి.

అది యట్లుండె. నీవు సకల విద్యా సంపన్నుఁడ వని లోక విఖ్యాతి యున్నది. బాల్యమునాఁటి నీ సుగుణంబుల నక్కజముగాఁ జెప్పికొనుచుందురు. అట్టి నీవు పట్టాభిషిక్తుండవై దానశీలత్వ మించుకయుఁ బ్రకటింప వైతివి. పండితుల నాదరింప వైతివి. స్త్రీలోలుండవై తృతీయ పురుషార్దమును సార్థకము నొందించుచుంటివి. పూర్వము శిబికర్ణదధీచి విక్రమ ప్రభృతులగు నృపతులు పరలోకములలంకరించి పెద్దకాలమైనను నిజదాన సమజ్జంభితంబులగు సుగుణ వితాదంబులు ధరణీ మండలంబునం దిరంబులై యొప్పుచుండుటఁ దెలియదా? తదితరనృపతుల పేరొక్క టియైన నిలిచినదియా ? క్షణభంగురమగు శరీరమును రక్షించిన బ్రయోజనమేమి యున్నది? కీర్తియొక్కటియె రక్షింపఁ దగినది. మృతుండైనను నరుఁడు యశఃకాయంబున జీవించి యుండును.

పండితునందును మూఢునందును దుర్భలునందు బలవంతునందు మహారాజు నందును దరిద్రునందును మృత్యువు సమముగా వర్తించును. మృత్యుదేవతకుఁ బక్షపాతము లేదు. నీ వయసు క్రమంబున నడచుచుండునుగాని నిముష మాత్రమైన నిలిచియుండదు. కావున దేహముల నిత్యములని యెఱింగి కేవలము కీర్తినే యుపార్థింపఁ దగినది జ్ఞాన విక్రమత్యాగభోగహితంబగు జీవనము విఫలమని యెరుంగునది. అని యుపన్యసించెను.

ఆ మాటలు విని భోజుండమృతహ్రదంబున మునింగినట్లుఁ బరబ్రహ్మ యందు లీనమైనట్లు కన్నుల నానంద బాష్పములు విడుచుచు నత్యంత సంతోషముతో నా భూసురుం గౌగిలించుకొని మహాత్మా ! ఇచ్చానుకూలముగాఁ బ్రతిధ్వనులవలెఁ బలికెడువారు పెక్కండ్రు గలరు. అప్రియములును బథ్యములునగు మాటల నుపదేశించు హితులు దొరుకుట దుర్ఘటము. నిర్భయముగా నాకు హితోపదేశముఁ గావించితివి. భవదీయవచనోపన్యాసంబు విని నా చిత్తము కలకఁదీరినది. ఇది మొదలు పండిత గోష్టితోఁ గాలక్షేపముఁ జేసెదను. ఈ మాటలే నిత్యము వచ్చి నాకుపదేశంపు చుండుము. మనసు కడు చంచలమైనది. దుర్వ్యసనలాలసమై యుండును. మీ పేరేమి? కాపుర మెందు? అని పలికిన నప్పండితుండు తన పేరు గోవిందకవి యని వ్రాసి చూపెను. తానా గ్రామ వాసినే యని చెప్పెను.

అప్పుడు భోజుండా కవివరుని వెంటఁబెట్టుకొని యా స్థానమునకువచ్చి మంత్రునెల్ల రప్పించి యిట్లనియె. అమాత్యులారా ! రాజ్యమదము విపరీతమైన మైకమును గలుగఁజేయు ననుమాట సత్యము. పట్టాభిషిక్తుండనై న పిమ్మట నేఁజేసిన సుకృతకార్య మొక్కిటియు లేదు. నా తమ్ముఁడు జయంతుఁడు రాజకీయ వ్యవహారముల జక్క పెట్టుచుండ నేను బండితగోష్టి నుందునని మొదట సంకల్పించుకొని యుంటి. అన్నియుం బోయినవి. దుర్వ్యసనములపాలై తిరుగుచుండ నొక్కరుండును దెలుపరైరి. నేఁడీ బ్రాహ్మణుఁడు నాకు మంచి యుపదేశముఁ గావించెను. ఇది మొదలు విద్వాంసులు గవీంద్రులును మన యాస్థానమునకు వచ్చునట్లు చాటిం బంపుఁడు. మహా కవికి లక్షయు విద్యాంసున కర్దలక్షయు సామాన్య పండితునకుఁ బాదలక్షయు యాచకునకుఁ దదర్దము నీయవలయును. అట్లిచ్చుటకు నా శాసన మవసరము లేదు. లుబ్దుఁ డగునుద్యోగి నాసభలో నుండఁదగదు. అని యాజ్ఞాపించెను.

అట్టి ప్రకటన పత్రికల నాలుగు దేశములకుఁ బంపించెను. ఆ వార్తవిని భూమండలమునఁ గలపండితులు తండోపతండములుగావచ్చి భోజునిపయి శ్లోకములు రచించి గజాశ్వాందోళికాది పారితోషికము లందిపోవుచుండిరి. భోజుండు కవిత్వ ప్రియుండనియు దాతయనియు నచిరకాలములో నతనియశము భూలోక మంతయు వ్యాపించినది. నిత్యము వేలకొలది కవీశ్వరులువచ్చి రాజదర్శనముఁ జేయుచుండుటచే భోజునకు రాజ్యాంగ విషయముల విమర్శింప సమయము లేకపోయినది.

అప్పుడు బుద్దిసాగరుం డాలోచించియప్పటి యాస్థాన కవులలోఁ బ్రసిద్దులై యున్న డండి భవభూతి శంకరులను మువ్వుర కవీశ్వరులఁ బరీక్షకులుగా నియమించి వారు సమర్ధులని చెప్పినవారే రాజదర్శనము చేయదగినది. ఇతరులకుఁ దగిన కానుకలు మేమే యిచ్చి యంపుచుందుము. అని నిబంధన మేర్పరచి రాజుగారిచేత నంగీకరింపఁ జేసెను. తరచు బండితు లితరుల గొప్పవారని యొప్పుకొనరు. దండి భవభూతి శంకరు లెట్టివారిని విద్వాంసులని పిలుచుటకే సమ్మతింపరు. అట్టివారు పరీక్షకులైనచో పండితులగతి యేమగునో యూహింపఁదగియున్నది. ఎట్టి పండితులు వచ్చినను రాజదర్శనముఁ గానీయక చిక్కులు పెట్టుచు సామాన్యులని మంత్రులకుఁ జెప్పి తగుమాత్రము కానుక లిప్పించి యంపుచుందురు. దానఁజేసి భోజునొద్దకు వచ్చు పండితుల సందడికొంతఁ దగ్గినది.

ఒకనాఁడు భోజుండు దండి భవభూతి శంకరులం జూచి ఆర్యులారా ! మంచి విద్వాంసుఁ డెవ్వఁడును రాకున్నవాఁడేమి? మన ప్రకటనలు దేశము లన్నియు వ్యాపించినవియా ? పండితులు లేరా? యని యడిగిన వారు దేవా ! దేవరదాన సముద్రములో మునిఁగి యాచకులు బలచఁబడిరి. అని చమత్కరించుచు మమ్ము మించిన బండితుఁ డెవ్వడు పుడమిలేడని గర్వముతోఁ బలికిరి.

ఆ మాటలు విని భోజుండు కానిండు. పుడమియంత గొడ్డువోయినదా ? వెదకి నెవ్వనినై న మంచి విద్వాంసునిఁ దీసికొని రండని యాజ్ఞాపించెను. వారును సమ్మతించి పోయి యట్టివాఁ డెవ్వడని యాలోచించుచుండగా నా మరునాఁడు దైవికముగా వారియొద్ద కొక పురుషుండరుదెంచి రాజ దర్శనముఁ జేయింపుఁడని కోరి కొనియెను.

కాళిదాసుకథ

విశాల నేత్రములు నాజానుబాహువులు వెడదయురము చక్కని మొగము గలిగి దివ్యతేజస్సంపన్నుఁడైన యా పురుషునింజూచి వారు నీవేమి చదివి కొంటివి ? రాజదర్శనముఁ జేసి యేమి యాచించెదవు? కవిత్వ మేమైనఁ జెప్పఁగలవా ? యని యడిగిన వారి కతం డిట్లనియె. నే నేమియుం జదివికొనలేదు. ఆయనపై శ్లోకము రచించితిని వినుండు.

శ్లో. అస్తివద్బకవచ్చైవ చల్లన ద్వెల్లకుక్కవత్‌
    రాజతే భోజ? తేకీ ర్తిః పునస్సన్యాసి దంతవతి.

ఓ భోజుఁడా ! నీ కీర్తి యెముకలాగున కొంగవలె చల్లరీతివెల్లకుక్క చందమున సన్యాసి దంతములట్లు తెల్లనై ప్రకాశించుచున్నది అని చదివెను.

ఆ శ్లోకమువిని వారు నవ్వుచు బాపురే ! వీనిందప్పక రాజునొద్ధకుఁ దీసికొని పోవుదము. యీ పద్యమునకు రాజు మిగుల సంతసింపఁగలడు. ఇంతకన్న మంచి పండితుఁడు లేడని చెప్పుదమని యాలోచించుకొని నాఁడు వాని రాజసభకుఁ దీసికొనిపోయి దేవా ! ఈతం డాశుకవిత్వమునందు మంచి నేర్చరి. వీని కవితా ధోరణికి ఫణీంద్రుడు జడిసి పాతాళ లోకమున నడిఁగి యుండెను. పెక్కు లేల? వీని మించిన కవి పుడమిలో మరిలేడని పరిహాసముగా వానిం బొగడిరి.

ఆ పొగడ్త రాజు సత్యమే యని నమ్మి యా పురుషునకు దర్శన మిచ్చెను. అప్పుడా కవి యీ క్రింది శ్లోకము పఠించెను.

శ్లో. మహారాజ ! శ్రీమాన్‌ జగతి యశనాతే థవళతే
    వయః పారావారం పరమ పురుషోయం మృగయతే
    కపర్దీ కైలాసం కరివరమభౌమం కులిశభృతి
    కళానాధం రాహుః కమలభవనో హంస మధునా.

ఓ మహారాజా ! నీ కీర్తిచే జగం బంతయుఁ దెల్ల బడనది. కావున సముద్రములు పర్వతములు మృగములు పక్షులులోనగు నవి యన్నియు దెల్లనై పోయినవి, అప్పుడు పాలసముద్ర మేదియో తెలియక విష్ణుండును, వెండికొండ యేదియో తెలియక శివుండును, హంస యేదియో తెలియక బ్రహ్మయుఁ దెల్ల యేనుగు యేదియా తెలియక యింద్రుండును జంద్రుఁ డెవ్వడో తెలియక రాహు వును, వెదకుచుఁ దొట్రు పడుచుండిరి. అట్టి యద్భుత కల్పనగల శ్లోకమును విని బోజుం డపరిమితానందముఁ జెందుచుఁ తూర్పు దిక్కుముఖంబు మాని దక్షిణ దిశకుఁ దిరిగెను. అప్పుడతండు క్రమ్మర నీశ్లోకముఁ జదివెను.

శ్లో. నీరక్షీ రేగృహిత్వానిఖిలజగతతీర్యాతి నాశీక జన్మా
    రర్వానుత్తుంగ శైలాన్‌ దహతి పశుపతిః ఫాలనేత్రేణ పశ్యన్
    తక్రం ధృత్వాతు సర్వానటతి జలనిధీన్‌ చక్రపాణి ర్ముకుందః
    వ్యాప్తాత్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతేః భోజరాజక్షితీంద్ర.

అట్లు నీ కీర్తికాంత మూడు లోకములలో వ్యాపించి యందలి వస్తువులన్నియుఁ దెలుపుఁ జేయటయు దుగ్దోదకములఁ గలిపి బ్రహ్మపక్షుల వెంబడి తిరుగు చుండెను. ఫాలాగ్ని ప్రజ్వరిల్లఁజేసి శంకరుఁడు గిరి బృందముల నరయచుండెను. చల్లఁ దీసికొని వెన్నుండు సముద్రముల కరుగుచుండెను. అట్లు తిరిగి త్రిమూర్తులు తమతమ వస్తు వాహనములం దెలిసికొనిరి.

ఆ శ్లోకము విని బోజుండు పశ్చిమ ముఖముగాఁ దిరిగెను. అప్పుడా కవి యీ శ్లోకము పఠించెను.

శ్లో. స్వర్గాద్గోపాల ! కుత్రవ్రజసిసురమునేధ ! భూతలే కామధేనో
    ర్వత్సస్యానేతుకామ స్తృణచయ మధునాముగ్ధ ! దుగ్దనఁతుస్యా
    శ్రుత్వా శ్రీభోజరాజ స్రచురవితరణం వ్రీడశుష్క స్తనీస్మాత
    వ్యర్దోహిస్యాత్ప్రయాసస్త దపితరిభిశ్చర్వితం సర్వముర్వ్యాం.

నారదునకును గొల్లవానికిని సంవాద రూపముగా నీ శ్లోకము రచించెను.

నారదుఁడు - గోపాలా ! స్వర్గమునుండి యెక్కడికిఁ బోవుచుంటివి ?

గోపాలుఁడు -- సుర మునీంద్రా? కామధేనువు దూడకు గడ్డి నిమిత్తమై భూతలంబున కరుగుచున్నాను.

నార --- ముగ్దుఁడా 1 వింతమాటలు చెప్పుచుంటివా ? ఎల్ల వారి‌ కోరికలు దీర్చెడు కామధేనువునొద్ద పాలు లేవా యేమి?

గోపా - లేకయే గడ్డికొర కరుగుచున్నాను. భూమియందెవ్వడో బోజ మహారాజను మహాధాత గలఁడట. వారి ధాతృత్వము విని కామధేనువు సిగ్గుపడి -------------- కాదు గంతయు నెండిపోయినది. నార - (నవ్వుచు) అట్లయిన నీ ప్రయాణ ప్రయాసము వ్యర్థమే. భూతలంబున నెక్కడను గడ్డిపర కన్నమాట లేదు.

గోపా - మరియేమైనది ?

నార - -ఆ బోజుని శత్రువులు సంగరమున నోడి గడ్డి గరచితి మని యట్లుచేయుచు శరణుఁజొచ్చుటచే నాకసవంతయు నై పోయినది. మందునకై నను గరికిపరక దొరకదు. ఆ శ్లోకము విని బోజుండుత్తర దిశకుఁ దిరిగెను. వెండియు నా కవి శ్లోకముఁ జదువుచున్నాఁడు.

శ్లో. విద్వద్రాజశిఖామణే ! తులయితుం ధాతా త్వదీయం యశః
    కైలాసంచ నిరీక్ష్యతత్ర లఘుతాం నిక్షిప్తవాన్‌ పూర్తయే
    ఉక్షాణం తదుపర్యుమాసహచరం తన్మూర్ధ్ని గంగాఝకం
    తస్వ్యాగ్రే ఫణిపుంగవం తదుపరి స్ఫారం సుధాదీధితిం.

ఓ భోజమహారాజా! నీకీర్తితూచెడు తలంపుతో బ్రహ్మత్రాసు లోనుంచి రెండవపెడఁ గైలాసము వైచెను. బరువు చాలినది కాదు. క్రమంబున దానిపై వృషభమును, దానిపై శంకరుని, ఆతనిపై గంగను, జంద్రుని, ముందర ఫణిరాజును వైచెను. లోకమునఁ దూచునప్పుడు దూనిక పూర్తికిఁ జిన్న చిన్న వస్తువులు వేయుట వాడుకయున్నది. అందువలనే కైలాసము ముదలైన తెల్లవస్తువు లన్నియు మీదు మీదుగానున్నవని యుత్ప్రేక్షించెను. అపూర్వ కల్పనా చాతుర్యంబున నొప్పుచున్న యా నాలుగు శ్లోకములకుఁ దనదేశములో నాలుగుదిక్కుల ధారవోసి భోజుం డపారసంతోషముతో దిగ్గునలేచి యతని పాదంబులకు నమస్కరింపుచు మహాత్మా ! నీకు రాజ్యమంతయు నిచ్చివేసితిని. నే నడవికిఁ బోవుచున్నాను. నీవు పాలించుకొమ్మని పలుకుటయు నా పండిత ప్రవరుం డిట్లనియె.

రాజా ! నేను రాజ్యమున కాసపడి నీ యొద్దకు రాలేదు. రాజ్యము పాలించు సామర్థమే మాయొద్దలేదు. నీవయేలు కొమ్ము. నాపై నక్కటిక యుంచినం జాలునని పలికెను. అప్పుడు బుద్ధిసాగరుండు రాజు చేసిన ప్రమాదమునకు వెఱచుచు నా రాజ్యమా కవివలన ధారాపూర్వకముగా వెండియుంగైకొని యత్తెరంగు నృపతి కెరింగించెను. అప్పుడు భోజుండు కవీంద్రా ! నీ పేరేమి? ఎందుండి వచ్చితివి? ఇది మొదలు మదీయాస్థానకవిగా నుండుము. నీకుఁ గావలసినంత ధనము దీసికొని పోవుచుండుమని చెప్పెను. ఆ కవి తన పేరు "కాళిదాసు” అని వ్రాసి చూపెను. అట్టి సమయమున దండ భవభూతి శంకరులు భోజునితో మహారాజా ! ఈతం డీశ్లోకములు రచించెనని నమ్మి మీరు మిగుల సంతసించుచుండిరి. మీరునిన్నఁ గొత్తపండితుం దీసుకొనిరండని చెప్పిన కతనంబున వీని కీ శ్లోకములు రచియించియిచ్చి మీవద్దఁ జదువుమని చెప్పితిమి. అతండట్లు చేసెను. వీని కేమియు విద్యరాదు. ఉన్మత్తుఁడు. దేవర పరీక్షింపవచ్చును పరిహాసమునకై వీఁడు గొప్పవాఁడని మీతోఁజెప్పితిమి. ఆ మాటయేనమ్మి యీ శుంఠ నందల మెక్కించుచున్నారని యాసూయగ్రస్త చిత్తులై వచియించిరి. దండి యేకసంతగ్రాహి భవభూతి ద్విసంతగ్రాహి. శంకరుఁడు త్రిసంత గ్రాహియగుట వారాశ్లోకములు పఠించి తామే రచియించితి మని చెప్పిరి.

శంకాకళంకిత స్వాతుండై భోజుం డీ విషయమురేపు విమర్శించెదగాక నిప్పుడు దయచేయుఁడని చెప్పి యంతఃపురమున కరిగెను. దండి భవభూతి శంకరులు కాళిదాసుతోఁగూడ నటఁ గదలి నెలవులకుం బోవుచు నోయీ ! మాతో నొకమాటఁజెప్పి యందు వేరొకరీతి స్తుతిఁ జేసితివేమిటికి? ఈ శ్లోకములు నీ కెవ్వరు రచియించి యిచ్చిరి ? నిజముఁ జెప్పుమని యడిగిన వెర్రివాడుంబోలె నవ్వుచు నేమియు సమాధానముఁ జెప్పఁ డయ్యెను.

సరే. కానిమ్ము. నీవు మేము చెప్పినట్లు నడిచెదవేని నిన్ను వెండియు సభకుఁ దీసికొనిపోయి కానుక లిప్పింతుము. ఈ శ్లోకములు వీరే రచియించి యిచ్చిరని చెప్పవలయును. ఆ రాజు మామాట గై కొనక నొరులకు గుడ్డిగవ్వయిన నీయఁడు సుమీ? నీకుఁ దెలియకున్న నొరుల నడిగి తెలిసికొమ్ము. అట్లుఁ జెప్పెదవా ? యని యడిగిన నతం డంగీకారము సూచించెను. మరనాఁడు ప్రాతఃకాలమున నందరు రాజసభ కరిగిరి. భోజుండును నియమితకాలమునకు వచ్చి సింహాసన మలంకరించెను.

అప్పుడా మువ్వురు పండితులు దేవా నిన్నటి శ్లోకములు మేము రచియించి యిచ్చినవి కావేమో వీనినేయడిగి తెలిసికొనుఁడు. నిజముఁ జెప్పఁగలఁ డని పలికిన నన్న రేంద్రు డావిషయము విమర్శించెదఁగాక నిప్పుడు నేనొకసమస్య నిచ్చెద. మీ ప్రజ్ఞాఁజూతము. పూర్తిఁజేయుఁడని పలికి యీ క్రింది సమస్య నిచ్చెను.

“అప్రతిపత్తిమూఢ మనసాద్విత్రాస్ద్సితా నాడిశాః”

దండి భవభూతిశంకరుల కా శ్లోక మేమియు నర్దమైనది కాదు. మేనం జెమ్మటలుక్రమ్మ నాకశమువంకఁ జూచుచుండిరి. అప్పుడు కాళిదాసు క్రిందిరీతిఁ బూర్తిం జేసెను.

శ్లో. స్నాతా తిష్ఠతి కుంతలేశ్వరసుతా వారాంగరాజస్వసుః
    ద్యూతే రాత్రి రియం జితా కమలయా దేవీప్రసా ద్యాధునా
    ఇత్యంతఃపురసుందరీ జనగుణే మ్యానాధికం ద్యాయతా
    దేవేనాప్రతిపత్తిమూఢ మనసా ద్విత్రాస్థ్సితా నాడికాః.

కుంతలేశ్వరుని కూఁతురు పద్మావతి మూఁడవ భార్య ఋతుస్నాతయై యున్నది. అంగరాజ పుత్రిక చంద్రముఖి రెండవభార్య యింటికి వెళ్ళ వలసిన వంతు దినము. భోజుండు కమలతో జూదమాడి నాటి రాత్రియే ఫణముగాఁ జేసి యోడి పోయెను. కావునఁ గమలయింటికిని బోవలసియున్నది. పెద్ద భార్య లీలావతి దైవజ్ఞులచే సుముహూర్త ముంచుకొని నాఁడురమ్మని చేటిని పంపినది. ఇట్లు నలువురు భార్యలకడకు నాడు పోవలసిన యగత్యము వచ్చినంత భోజుండు రెండుగడియ లేమియుం దోచక నాలోచించి యెక్కడకుం పోక యింటిలోఁ బండుకొని నిద్రవోయెను.

అయ్యర్థమే సభలో సమస్యగానిచ్చి నంత నితరు లేమియు దెలిసికొన జాలలై రి. కాళిదాసు నిశ్శంకముగా నా కథ పూర్తిఁజేసెను. ఆ శ్లోకమువిని బోజ భూపాలుం డాశ్చర్య సంతోషములతో నతనిం గౌగలించుకొని నా రాజ్య మంతయు నిచ్చినను నీ శ్లోకమునకు సరిపడదు. ఏమియు నీయఁ జాలక నాలింగనముఁ జేయుచున్నాను. ఇది మొదలు నీవు నాకు సఖుండవై గురుండవై మంత్రివై పండితుండవై కవివై మదీయా స్థాన మలంకరించి యుండవలయును. నీకుఁగావలసినంత ధనము నీ యిష్టము వచ్చినప్పుడెల్ల తీసికొని పోవుచుండము. నీవ నేను నారాజ్యమునీది. నిన్నుఁ బోలిన పండితుఁ డీపుడమిలో లేడు. దండి భవభూతి శంకరులు నీవు రచించిన శ్లోకములు తామే రచించితిమని బొంకిరి. వారు నీ సామర్థ్య మెరుంగరు, అని యనేక విధంబుల నక్కవిపుంగవుని స్తుతియించెను.

దండి భవభూతి శంకరులు తదీయ కవితాధోరణికి సిగ్గుపడి తలలు వంచుకొని యసూయలతో నిండ్ల కుం బోయిరి. అది మొదలు భోజకాళిదాసు లన్యోన్య స్నేహశబద్దులై యేకదేహ మట్ల మెలంగుచుండిరి. కాళిదాసు భోజసలంకారభూతుండై దండి భవభూతి శంకరులవలెగాక రాజదర్శనముఁ జేయింపుమని తన్నాశ్రయించెడు యాచకుల మహాపండితు లనిచెప్ఫి గొప్పకానుక లిప్పించుచుండును. కాళిదాసు భార్య పుత్రాదులు లేనివాఁడగుట సంతతము విలాసవతియును వేశ్యయింటిలో నుండును. ఒకనాఁడు కుంభుఁడను వంటబ్రాహ్మణుఁడు విలాసవతి నాశ్రయించి కాళిదాసు నిద్రించుచుండ నతనికి హాయిగాఁ బాదసంవాహనముఁ గావించెను. కాళిదాసు కొంత సేపటికి నిద్ర మేల్కొని తనయడుగు లొత్తుచున్న యాపారుంజూచి యనుగ్రహముఁ గలిగి నీ వెవ్వడవు ? అకారణముగా నా పాదము లొత్తుచున్నా వేమి? నీ కేమి కావలయునని యడిగినఁ గుంభుండు నమస్కరింపుచు నిట్లనియె.

ఆర్యా ! నే నతిదరిద్రుండ పదుగురు పిల్లలు కలరు. నాకు విద్య యేమియును రాదు. వంటజేసి బ్రతుకుచున్నాను. నీళ్ళు మ్రోయుచుండ నా భుజములు కాయలు కాచినవి. అట్ల యినను గుటుంబషోషణము జరగ కున్నది. ఏమియుం జేయనేరక బలవంతమునఁ జావవలయునని ప్రయత్నముఁ జేయుచుండఁగా నొకమిత్రుఁడు మీ పేరు సెప్పి యాశ్రయింపుమని యుపదేశించెను. మహాత్మా ! నీ విదివరకు నా వంటి శుంఠలకుఁ బెక్కండ్రకుఁ జాలయుపకారముఁ జేసితివని వింటిని. భోజునికన్న నీ యౌదార్యమునకుఁ బెద్దగాఁ జెప్పుకొనుచున్నారు. నీవెద్దియేని యుపకారముఁ జేయుదువా బ్రతికెదను. లేకున్న పిల్లలతోఁ గూడ బలవన్మరణము నొందెద ననిపలుకుచు నతని యడుగులేవిడువఁ డయ్యెను.

కాళిదాసు నవ్వుచు నీ వేమియుం జదువలేదని చెప్పుచుంటివి. కవిత్వముఁ జెప్పు విద్వాంసునికిఁగాని రాజు దర్శనమీయఁడు. నీ దీనాలాపములు విన విచారమగుచున్నది. కానిమ్ము. నీయదృష్ట మెట్లున్నదో నాకుఁ దోచినసహయముఁ జేసెదనని పలుకుచు విలాసవతితోఁ జెప్పి యతనికిం గట్ట మంచి పుట్టము లిప్పించి నాఁడు సాయంకాలమున సభకుఁ దనతో దీసికొనిపోయెను.

హజరమున నిలిచి యే వేని ఫలములఁ గొనిరమ్మని రెండు కాసు లతనికిచ్చెను. కుంభం డంగడికిఁబోయి ఫలము లేమియు లేక పోవుటచే జానెడు పొడవుగల చెఱుకుముక్కలఁ గొని తీసికొనిపోయెను. వానిం జూచి కాళిదాసు నవ్వుచు నింతకన్న నీ కేమియుం దొరకలేదాఁ మేలు మేలు. ఇట్టివాని రాజదర్శనముఁ జేయునప్పుడెవ్వరును దీసికొనిపోలేదు. కానిమ్ము చూతముగదా? నీ లీ చావడిలోఁ గూర్చుండుము. నేను నీకు వర్తమూనముఁ జేయునప్పుడు రమ్ము. అని చెప్పి లోపలకుఁ బోయెను.

ఆ రేయిఁ బెద్దతడవుదనుక బోజునితో నతని తెఱ కెరింగించుట కవకాశము దొరికినదికాదు. కాళిదాసు సమయమరసి దేవా? నేడొక మహావిద్వాంసుండు మీ దర్శనము నిమిత్తము వచ్చియున్నాఁడు. నేనింతకు ముందిట్ధి పండితునిఁ జూచి యెరుం గను. ఆ కవివరుండు సంవత్సరము నుండి మౌనవ్రతము బూనియున్నవాఁడు. సత్కరింపఁదగిన పాత్రుఁడని చెప్పినవిని బోజుండు అయ్యో ? ఇంత సేపేమిటికిఁ జెఫ్పితివి కావు. వేగము రప్పింపుమని యానతిచ్చెను.

అప్పుడు ద్వారపాలురతో నాచావడిలో నున్న వానిని పిలువుఁడని చెప్పెను. వారువోయి యతనిం గేకలు వైచిరి. కుంభుండు తడ వగుటయుఁ గూర్చుండలేక యా చెరుకు ముక్కలకట్టఁ దలక్రింద నిడుకొని పండుకొని నిద్రపోయెను. అక్కడఁ దిరిగెడు కూలివాం డ్రెవ్వరో యతని తలక్రిందమూట యేదియో యనుకొని సగముకాలి యందందుఁ బడియున్నఁ జిదుకుల నేరితెచ్చి యవి మూటగట్టి యతని తలక్రింద నిడి యాయిక్షు ఖండముల లాగికొనిరి. ఆ వ్యత్యాస మేమియు నతండు గ్రహింపక ద్వారపాలురు పిలిచినతోడనే కన్నులు నులిమి కొనుచు లేచి యా సభలోని కరిగెను.

ఆ కుంభుం జూచి రాజు గొప్ప పండితుఁ డితఁడేనా యని యడిగెను. కాళిదాసు అవును అనిపలికి అయ్యా ! తమ రందుఁ గూర్చుండుఁడు అని సంజ్ఞజేసెనుఁ కుంభుండు తాను దెచ్చిన మూటవిప్పి యా చితుగులు బల్ల మీద నిడియె. ఆ కట్టెముక్కలుఁ జూచి బోజుండిది యెక్కడి సాంప్రదాయమో తెలియదు ? ఇందుల కేమి చెప్పునో యని యాలోచించుచుండెను. కుంభుండా బొగ్గు కట్టెలం జూచి యవి యెట్లు వచ్చెనో తెలియక యిఁక తనపని పట్టుదురని పరితపించుచుండెను. కాశిదాసు. వానిం జూచివీఁడీబొగ్గులఁ దెచ్చెనేమి పాపము? దీనికెట్లు సమాధానము చెప్పుదవని వితర్కించుచుండెను.

అప్పుడు బోజుండు కాళిదాసుతో కవీంద్రా ! మీ పండితుండు బొగ్గులను దెచ్చె. నిది యెక్కడి యాచారము అని యడిగినఁ గాళిదాసు ఇది చాలా గూడాభిప్రాయము. మహాకవుల కల్పనలు దురవగాహములు కదా. ఇతండీ బొగ్గుకర్రలఁ దెచ్చిన కారణమెరింగించెద వినుండు. అని యీ క్రింది స్లోకమును జదివెను.

శ్లో. దగ్ధం ఖాండవ మర్జునేనతు వృధా దివ్యద్రుమై ర్భూషితం
    దగ్దా వాయుసుతేన హేమరచితా లంకా వృధా స్వర్గభూః
    దగ్ద సర్వసుఖాస్పదశ్చమదనో హా ! హా ! వృధా శంభూనా
    దారిద్ర్యం జనతాపకం భువి పునఃకేనాపి నోద్యహ్యతే.

అర్జునుండు దివ్యవృక్షములతో నొప్పుచున్న ఖాండవనమును, హనుమఁతుండు స్వర్గతుల్యమైన లంకాపురమును, శంకరుడు సర్వజన సుఖాస్పదుండగు మన్మధుని దహింపఁజేసిరి. సర్వజనతాపకమైన చంద్ర దేవత నెవ్వఁడును గాల్పలేక పోయెను కావున దేవా! నీవు నా దారిద్ర్యమును నీ కట్టెలతోఁ గాల్చివేయుమని తెల్పుటకై యిట్టి కట్టెలం దెచ్బెను. అని కాళిదాసు సవరించి చెప్పెను. బోజుం డాతని సమయస్ఫూర్తికి సంతసించుచుఁ గాళిదాసుం గౌగలించుకొని కవీంద్రా ! యాతని

యభిప్రాయ మేమియో నాకుఁ దెలియదు. కాని నీవిట్లు సవరించినందులకుఁ జాల సంతసించితిని అని పలుకుచు నా స్లోకమున కక్షరలక్షలు కానుకగా నిచ్చెను. కాళిదాసా విత్తమంతయుఁ గుంభున కిచ్చి నీ విట్టి బొగ్గులం దెచ్చితి వేమిటికి ? నా కప్పటి కా యుక్తి స్పురింపక పోయినచో జాలయవమానము వచ్చుంగదా. పో పొమ్ము. ఈ సొమ్ముతో సుఖముగా జీవించుమని చెప్పి యావిప్రు నంపివేసెను.

కాళిదాసు అట్టివాండ్రు బెక్కండ్ర కుపకారములు చేయుచు నర్ధికల్పభూజమగు భోజునికన్న నెక్కుడు వాడుక వడ సెను.

అని చెప్పి మణిసిద్ధుం డవ్వలిమజిలీ యందిట్లుఁ జెప్పఁదొడంగెను.

తొంబది యెనుబదవ మజిలి

యజ్ఞశర్మకథ

ఈ నిప్పచ్చరము నేను భరింపలేకుంటి నెన్నినాళ్ళిట్లిబ్బందిపడు చుందును. అయ్యో ? మీతోడివారెల్ల రాజదర్శనముఁజేయచు. గజాశ్వాందోళికాదుల సంపాదించుకొని వచ్చి మిద్దెలును మేడలును గట్టికొని భ్రార్యాపుత్త్రులతో సుఖించుచున్నారు. చదివికొనియు సభకుఁ బోవుట కింత పిరికితన మేమిటికి ? భోజుం డర్దదేవభూజుండై యుండ మనముతక్క నీ వీటిలో బేదరిక మనుభవించు పారులు లేరు. ఎన్నిసారులు చెప్పినను వినిపించుకొన కున్నారు. నేఁడు వండుట కేమియును లేదు. నాయావచ్చక్తి ని బొరుగిండ్లకుఁ దిరిగితిని తవ్వెడుబియ్య మెవ్వరును బదు లిచ్చిరికారు. నూకలు నిమిత్తము తిరిగినను దొరికినవికావు పిల్లలు మలమల మాడుచున్నారు. మీరు సర్వదా అగ్నిని శరణముగా నాశ్రయించుకొని‌ యుందురు. నేఁడు వోయి రాజుగారిం జూచి వచ్చిన నన్న మున్నది. లేకున్న హరివాసరమే యని పలుకుచు ధారానగరంబున సోమిదేవి యగు బ్రాహ్మణి తన భర్తతో నొకనాఁడు ప్రాతఃకాలమున సంభాషించినది.

యజ్ఞశర్మయను పేరుగల యా తపశ్శాలి భార్యమాటలు విని అయ్యో? నీ స్త్రీ బుద్ధివిడిచితివికావు. సకల ధర్మముల నెరింగిన నామానస మకార్య కరణంబునకు