కాశీమజిలీకథలు/ఆరవ భాగము/88వ మజిలీ

వికీసోర్స్ నుండి

నిరపరాధుల మమ్ముఁ బట్టికొనఁబూనిరని పలుకుచు నెదురుకొనుటయు రాజభటు లిట్లనిరి.

తులువా ? నీవు రాజువలెవచ్చి బోగముదాని మచ్చ మాపుటయె కాక కూతుంగూడ నెత్తికొని - పోయితివి నీ నిమిత్తమై పుడమి యెల్లడం గాలించుచున్నారము. మా యెకిమీడు నిన్నుఁ బట్టికొని తీసికొని వచ్చినవానికి‌ మూడుగ్రామములు కట్టన మిత్తునని ప్రకటించియన్నాఁడు నీవు మా బారిఁ బడితివి. పోనీయమని పలుకుచు నందరు నొక్కట వచ్చి యతనిం జుట్టుకొనిరి.

నిరాయుధుండైనను హస్తపదతాడనంబుల నవ్వీరుండు వారిలో ముప్పది గుండ్రజముప్రోలి కనిపెను మిగిలినవారు పౌరుషము మీరఁ గలియఁబడి యెట్టకే నతనిం బట్టికొని కరపాదంబులకు నిగళంబులు తగిలించి సరోజినిజాడ యేమియుం దెలిసికొనఁజాలక నతనితోఁ గూడ గాళిందీపురాభిముఖులై యరుగుచుండిరి.

అని యెరిగించువరకుఁ బ్రయాణసమయ మగుటయు జాలించి తదనంతర వృత్తాంత మా తపోధనుం డవ్వలిమజిలీయం దిట్లు చెప్పుచుండెను.

ఎనుబది ఎనమిదవ మజిలీ

ఇంద్రదత్త - సఖీ ! మురళీ ! సురకుమారులపై నా మనసు మరలినది నేనొక సుందరపురుషుని వరంచితిని. నీకు జెప్పకున్న గోపింతువు గదా ?

ముర - ఎట్టెట్టూ ? నీవు వరింపదగిన పుణ్యశాలి యెందుండి వచ్చెను. అతని పేరేమి ? ఎప్పుడు వరించితివి ? మాకు రవ్వంతయు దెలిసినది కాదే? ఆతం డిపు డెం దున్నవాఁడు ?

ఇంద్ర - సరోజినియను లేఖకురాలీ సంబంధము మొన్న నే పొసగించినది. వానిపేరు ఘటదత్తుఁడు. ఇప్పుడీవీటనే యున్నాఁడు.

ముర - నెలవెరింగింతువేనిఁ బోయిచూచి యానందింతుముగా ?

ఇంద్ర - వానియునికి నాకుఁ దెలియదు. సరోజిని సుమతియను వర్తకునిసత్రములో బసచేసి యున్నది. దానిం గలసికొనిన నంతయుం జెప్పఁగలదు.

ముర - అతం డేదేశపు రాజకుమారుండో యడుగలేదా ? అట్టి యుదారండు మనవీటిలో బసఁజేసిన వెల్లడి కాకుండునా ? వానిరూప మెట్లున్నది ?

ఇంద్ర - వాని చిత్రపట మిదిగో చూడుము. నీకునుం దెలియఁగలదు.

ముర ‌- (నాశ్చర్యముగాఁజాచుచు) నిక్క ముగా నిట్లున్నవాఁడా ?

ఇంద్ర - ఇంతకన్న నొకవన్నెవాసిగానే యున్నవాఁడు? సందియమున్నఁ బోయి చూచి రమ్ము.

ముర - ఈ శుభవార్త నమ్మగా రెరుఁగుదురా ? ఇంద్ర - మొదట నెరుఁగదు. తరువాతఁ జెప్పి యొప్పించితిని. ఈపాటి కయ్యగారితో మాట్లాడియే యుండును.

ముర - జాగుసేయనేల? నే నిప్పుడేపోయి చూచి వచ్చెదఁగాక. అని పలికి మురళి యప్పుడే సుమతిసత్రమున కరుదెంచి నలుమూలలు వెదకి వారిం గానక మరియు నగరమెల్ల గాలించి తెలిసికొన లేక విసిగికొనుచుఁ దిరుగ రాజుపుత్రియొద్దకు వచ్చి యిట్లనియె.

మచ్చెకంటీ ! నేనీ యానతిఁ బుచ్చుకొని యా సుమతిసత్రమున కరగితిని. ఆహా ? అది సత్రమువలెనే బహు జనాకీర్ణమై యొప్పుచున్నది. కొందరుమూటలు దింపు చుండిరి. కొందరు మూటలఁ గట్టి పయనమగుచుండిరి. కొందరు వంటఁ జేసికొను చుండిరి. కొందరు భుజించు చుండిరి. ఆ సంఘములోనికిం బోయి నేను సరోజినియను చిన్నది యుండవలె నెందున్నదని యఱచితిని. ఆ మాట కెవ్వరును బ్రత్యుత్తరమీయ లేదు పలుమా రట్లు చీరి విసిగి ఘటదత్తుడను చిన్నవాఁ డిందుండెనాయని వెండియుం బిలిచితిని. అప్పుడును బ్రతివచనము వచ్చినది కాదు. అందొకఁ డెవ్వడో నా మాట విని ఘటదత్తుం బట్టుకొనిన వానికి మూఁడు గ్రామములు కానుకగా నిత్తునని కాళిందీపుర భర్త ప్రకటించియున్న వాఁడే ? అతం డిక్కడ నేమిటికుండు నని పలికెను.

పిమ్మట నేనా సుమతి యొద్ద కరిగితిని. ఆ పుణ్యాత్ముండు కొందరకు స్వయంపాకము కల్పించుచుఁ గొందరకుఁ బాత్ర లర్పించుచుఁ గొందరకు విత్త యొసంగుచుఁ గడు సందడిలో నుండెను ? పెద్దతడ వందు వేచియుండి యవసరముఁ దెలిసికొని నమస్కరింపుచు మహాత్మా ? మీ సత్రంబున సరోజినియను చిన్నది రంగులు వేయునది బస జేసినదట. ఎందున్నదో యెరుగుదురా ? యని యడిగిన నతండు నాకుఁ దెలియదు పోయి చూచికొమ్మని చెప్పెను.

సత్రమంతయు వెదకితిని. నా కెందును గనంబడలేదు. దానితో మన రాజపుత్రికకుఁ బని వచ్చినది. మిమ్మడిగి తెలిసికొని రమ్మన్నదని చెప్పిన పిమ్మట నతండు నా మాట శ్రద్దగా వినిపించుకొని గ్రమ్మరఁదన పరిజనులచే నా సత్ర మంతయు వెదకించెను. ఎందును లేదు పిమ్మట నేనీ వీటిలో బాటసారులు వసియించు చోటు లన్నియుం జూచితిని. సరోజినీ ఘటదత్తులజాడ యించుకయుఁ దెలియలేదని చెప్పినది. ఆ మాట విని రాజపుత్రి యించుక ధ్యానించి మురళీ ! నీవు లెస్సగా విమర్శించి వచ్చితివికావు. అది యా సత్రమునందే యున్నది. దాని రూపము సామాన్యముగా నుండుటచే నలువురకుఁ దెలియఁబడదు. ఏ మూలనో యణఁగియుండి నీ కేక వినకపోవచ్చును. నాతోఁ దానం దుందునని చెప్పి యింతలో నెక్కడిఁకి బోఁగలదు. ఒకవేళ ఘటదత్తుని బస కరిగినదేమో ? అతని నెల వెందో యడుగుట మరచిపోయితిని గదా? కాళిందీపుర భ ర్తకు నతనిం బట్టికొమ్మనుటకు గారణ మేమియో తెలియదు. అతండు వేరొకఁడు కావచ్చును. మఱియుం బోయి చూచిరమ్మని పలికినఁ గలికీ ! నా మాట నమ్మవుగదా ? సరోజిని సత్రములో నున్న దన్నమాట కల్ల. అతనిబస కరిగిన దేమో వెండియు విచారించెదంగాక యని‌ పలికి నాలుగు దినంబు లావీ డంతయు గాలించి వారప్పురంబున లే్‌రని రాజపుత్రికకు వచ్చి చెప్పినది.

అప్పు డప్పడఁతి మిక్కిలి పరితపించుచు అయ్యో ? యిదియేమి కర్మము ? ఉన్నదాన నుండక లేనిపోని గొడవఁ దెచ్చి పెట్టుకొంటినే ? నాకిది స్వప్నము కాదు గద. అట్ల యిన నీ చిత్రపటము నా చేతికేల వచ్చును ? సరోజిని నన్ను నమ్మించి రాకపోవునా ? పది దినములు నిలువుఁడని చెప్పితినిగదా ? ఇంతలోఁ దమగ్రామము పోయివత్తురేమోయని సమాధానముపడి వాని రూపమె తలంచుకొనుచున్న సమయంబునఁ దల్లి శర్వాణి యరుదెంచి యిట్ల నియె.

పట్టీ ! నీవు కోరినవరుని గురించి నీ తండ్రితో జెప్పితిని. ఆయన వాని పేరు విని విమర్శించి ఛీ ! ఛీ! వాఁడు దొంగలఱేఁడు వానిబట్టి కొనుటకు నాలుగు దేశములు రాజభటులు తిరుగుచున్నారు. మాకుఁ గూడ సమాచార మిదివరకే వచ్చియున్నది. మొన్న వాఁ డిక్కడికి వచ్చియున్నవాఁ డని తెలిసి కాళిందీపుర భర్త ప్రత్యేకముగా వేగుర వీరభటుల నీ యూరికంపెను. వాఁడు కనంబడ లేదు. దొంగతనములో నంత నేర్పరి లేడట. గడియ కొకవేషము వైచుచుండును. కాళిందీపురములో మిగుల భాగ్యవంతురాలగు నొక వెలయాలి యింటికి వెళ్ళి రాజ పుత్రుఁడనని చెప్పి నలుగురు పరిజనులతో లోపలఁ బ్రవేశించి దానిరెక్కలు విరిచికట్టి సొమ్మంతయు దోచికొనివచ్చెనఁట. మఱియు దానికూతుఁగూడ తీసికొని పోయెనట. వాఁడు మన యింద్రదత్త కెట్లు కనంబడెను? చక్రవర్తి కుమారుల దీసికొనివచ్చిన బనికిరారని చెప్పినది కాదా ? ఆ మ్రుచ్చు నెట్లు వరించినది ? పో పొమ్ము. ఎక్కడి వార్తయని‌ పలుకుచు నలుకతో నన్నుఁ దూలనాడిరి.

అని చెప్పిన విని యవ్వనితామణి కన్నుల మూసికొని నిట్టూర్పు నిగుడించుచు నిట్లనియె. అమ్మా ! నేను బాల్యచాపల్యంబున విమర్శింపక తప్పుఁ జేసితిని. ఇప్పు డేమనుకొనినను బ్రయోజనము లేదు. ఇఁక నీ యొద్ద దాచనేల ? నేను వాని సోయగమునకు వలచి భర్తగావరించితిని. సరోజినియే యావార కాంతకూతురై యుండును. దాని మూలముననే నేనీ వలలోఁ బడితిని. అని తాను గావించిన కృత్య మంతయుఁ దల్లి కెఱింగించినది. ఆ కథ విని రాజపత్ని అద్దిదా? ఇంత మాత్రమునకే వాఁడు మగఁడయ్యెనా యేమి? చాలుఁజాలు. దేవుని మెడలో బ్రాహ్మణుని మెడలోఁ బూవుదండలు వేయమా యేమి ? అదియు నట్లే తలంచి చేసినదని సవరించుకొనుమని బోధించిన విని యచ్చెల్వ యిట్ల నియె.

అమ్మా ! సావిత్రి చరిత్ర మించుక తలంచుకొనరాదా ? త్రికరణములలో మనసు ప్రధానమైనది. మనసు చేత వరించుట కంటె గ్రియ యెక్కుడా ? పోనిమ్ము నా భర్త దొంగయే యగుగాక. దొంగ పెండ్లాము దొరసాని యనువాక్య మున్నది గదా? నేను వేరొకనిం బెండ్లి యాడను. వానిమెడలో భర్తయని తలఁచి పూవుదండ వైచితిని ఇప్పుడు కాదనిన దప్పునా ? నా ప్రారబ్దము నాది నాలిఖితమునకు మీ రేమి చేయుదురు. ఇంద్రుని కొడుకో, కుబేరుని కొమరుఁడో వచ్చి పెండ్లి యాడునని యాసతో నున్నందులకు మంచిమగఁడే లభించెనని తలంచుచు వెక్కి వెక్కి యేడువఁ దొడంగినది

పుత్రికం గౌగలించుకొని శర్వాణియు తల్లీ ! వగవకుము. వెర్రి పని చేసితివి. నాతో నింత చేప్పరాదా ? ఆ మాయలమారి‌ యెవ్వతెయో నిన్ను మోసముఁ జేసినది. నా మాట వినుము. సావిత్రి యరుంధతి వారి పోలికలు మన కేమిటికి ? మన కథలు మనవి. నిశ్చిత వివాహవిపర్యాసము లెన్ని జరుగుచున్నవి. వానిలో నిది యొకటి. మంచి సంబంధమును గురించి వెదకించెచ నూరడిల్లుమని బోధించిన నా చంచలాక్షి తల్లి నాక్షేపించుచు నప్పని కొడ బడినది కాదు. అప్పుడు తల్లి యేమియుంబలుక నేరక యవ్వలికి బోయి మనోహరుని కవ్విధం బెరింగింప దరినరయు చుండెను.

ఇంద్రదత్తయు మురళిం జీరి ప్రియసఖీ ! నీ కంటె నా కాప్తులు లేరు. నాఁడు నీవు దాపున లేక పోపుటచే నిట్టి ప్రమాదము జరిగినది. అతండు దొంగల రాయఁడని చెప్పుచున్నారు కాని నా కంత నమ్మకము లేదు. ఎట్లయినను సరియే నీవు వోయి వారిని వెదకి తీసికొని రావలయును. అని బ్రతిమాలుటయు నా మురళి వారిగురుతు లన్నియుం దెలిసికొని నాడే బయలుదేరి ప్రతి గ్రామమునకుం బోవుచు వారి పేరులు సెప్పి వెదకుచుండెను. ఒక పల్లెటూరిలో నొక యింటి యొద్దఁ గూర్చుండి కథలఁ జెప్పుచున్న యొక చిన్న దానిం జూచి తన్వీ ! సరోజిని యను చిన్నదియు ఘటదత్తుఁడను చిన్నవాఁడు నీయూరు రాలేదు గద. అని వారిగురుతులం జెప్పి యడుగుటయు నా కథకురాలు వారియవసరము నీ కేమిటికి వచ్చినది ? నీ దేయూరు? నీ పేరేమియని యడిగిన మురళి యిట్లనియె.

బీటీ ! మాది కమలాపురము. నా పేరు మురళి యండ్రు. ఇంద్రదత్త యను రాజపుత్రిపంపునఁ దిరుగుచుంటిని. వారు మాకు మిత్రులగుట వెదకుచుంటినని చెప్పినది. వారిజాడ నాకుఁ గొంచెము తెలియును. చెప్పెద నిటు రమ్ము అని చీరి యేకాంతముగా నాకాంత యింద్రదత్త యెందు నిమిత్తమై వారిని వెదకమన్నదని యడుగుటయు మఱేమిటికింగాదు వారి మేలుకొరకే యని చెప్పినది.

అట్లయిన వినుము. ఘటదత్తుఁడు శత్రువులచేఁ జిక్కులు పెట్టబడు చుండెను. అతనినిమిత్తమే నేను దిరుగుచున్నాను. నీవు నాతో రమ్ము. ------------ మెరింగింతు నని యామె చెప్పుటయు నప్పడఁతి యతండు మ్రుచ్చులకు మొనగాఁడని సత్యమే ? వెలయాలి యిల్లుఁ గొల్లఁబెట్టెనట కాదా ? దానికూతురు సరోజిని. దాని వెంటఁ బెట్టుకొని తిరుగుచున్నాడని వింటిమి. అట్టి యుత్తమున కీ నీచ కృత్యము లేమిటి కబ్బినవి. ఈ కథ మా రాజపుత్రికకుఁ దెలిసి మిక్కిలి పరితపించుచున్నది. అని యక్కడ జరిగిన తెరంగంతయుం జెప్పెను.

అప్పు డా చిన్నది చేయి పట్టుకొని దూరముగాఁ దీసికొనిపోయి నెచ్చెలీ ! నీ వడిగితివి కావున నిజముఁ జెప్పుచుంటి వినుము. ఘటదత్తుఁ డుత్తమకుల సంజాతుఁడు. సకలశాస్త్రములుం జదివినవాఁడు వసుంధరుఁడను రాజు వానికి మంత్రిపద మిచ్చి యేమిటికో కోపముఁ జేయుటయు నతం డూరు విడిచి యడవికిం బోయెను. అందు దొంగలసహవాసముఁ జేయవలసి వచ్చినది. తన కిష్టము లేకున్నను వారితోఁ దిరుగుచు మా తల్లి - అనఁబోయి - కాళిందీపురంబున జంద్రవతి యింటిలో దూరిన మాట నిజమె. ఆ మ్రుచ్చిలి కతఁ డేమియు బూనికొనినవాఁడు కాడు. నన్నుఁ బట్టికొని అన బోయి -- దాని కూఁతుం బట్టికొని దొంగలు బాధింపుచుండ విడిపించెను. అని యతని కధ యంతయు నా మూలచూడముగాఁ జెప్పి యిందాతని తప్పేమి యున్నదో చెప్పమనియడిగెను.

మురళి విస్మయముఁ జెందుచు అయ్యో ? నిష్కారణము నతఁడపనింద మోయుచున్నాఁడు. ఇంద్రదత్త యావాడుక విని మిక్కిలి దుఃఖించుచున్నది. నీవు అనఁబోయి ఆ సరోజినియే యీ కపటముఁ జేసినదని కుందుచున్నది. పాప మతండే పాపము నెరుఁగనిదే యింత దుర్యశము కలిగిన దేమి ? కాళిందీపురము బోయి యా మాట జెప్పరాదా ? సరోజిని యేమైనది? నిజముఁ జెప్పుము. నా యొద్ద దాచనేలయని పలికిన నత్తన్వి యిట్లనియె.

ఇందుముఖీ ? నీవు నాకు సఖురాలవైతివి. ఇఁక నీ యొద్ద నిజముదాతునా? ఆసరోజిని నేనే వినుము. మీ వీటినుండి మే మిరువురము బయలుదేరి యొకదారి బడి పోవుచు నొకనాఁడు మిట్టమధ్యాహ్నమొక మర్రిచెట్టు క్రిందఁ బండుకొంటిమి. రాజభటులు మా నిమిత్తమై యడవులలోఁ గూడ వెదకుచుండిరి. కావున నా వటవృక్షము కొమ్మలపై నుండి మా మాటలు విని యురికి ఘటదత్తుఁ బట్టికొనిరి. నిరాయుధుండైనను నతండు ముప్పదిమందిం గడతేర్చెను. చేత నాయుధ ముండిన మరి


వచ్చినను వాని నేమియుం. జేయఁజాలరు. పదుగురతో నొకఁడు పోరుట దుర్ఘటము కాదా ? వారికిఁ బెద్దతడవునకుఁ బట్టువడియెను. సంకెళులు వైచి దీసికొని పోయిరి.

నేనా సందడిలో వారికిఁ గనంబడక తప్పించుకొని మారురూపున వెనువెంటఁ బోవుచు నొక గ్రామమున నొక విహితునివలన నతండు విడిపింపఁబడుట కన్నులారఁ జూచితిని. కాని వానిం గలిసికొనలేక పోయితిని. నే నం దున్నట్లతం డెరుఁగడు. ----------- బరిభవించి యతండా మిత్రునితో నెక్కడికో పోయెను. అతని నిమిత్తమే దెలిసికొని నే నిక్కడినుండి బయలుదేరి వానినే వెదకికొనుచు మొన్న నే నిచ్చటకువచ్చితిని. ఇక్కుప్పము నాలుగుదేశముల త్రోవలో నుండుటచే నతం డేదారినైన నిటకరుదెంచునేమోయను నాసతోఁ దెఱవు మొగముననున్న యా విప్ర గృహంబున వసియించి వారికి వినోదార్దము కథలఁ జెప్పుచుంటి. దైవవశంబున నిన్నుఁ గలసికొంటి. నే నీరహస్య మిదివర కెవ్వరికిం జెప్పి యుండలేదు. వేయు నేల ఘటదత్తుఁడు భూలోక మంతయు నేలదగిన బలశాలి. ధర్మరాజుకన్న నెక్కుడు గుణవంతఁడు. అతని కింకను మంచిదినములు రాలేదని యావృత్తాంతమంతయుఁ జెప్పినది. మురళియు సరోజినీ ఘటదత్తుఁడు ఇంద్రదత్తపై యనురాగము గలవాఁడగుట నక్కడికే రాఁగలడు మన మానగరికిఁ బోవుదము రమ్ము. ఇంద్రదత్త సత్యమైన మీ చరిత్రవిని హృదయపరితాపము విడువఁ గలదని పలికి యక్కలికి తోఁగూడఁ గొన్ని పయనంబుల కావీడు చేరినది అని యెరింగించి మణిసిద్ధుఁ డవ్వలికథ మరియు నిట్లవ్వలి మజిలీయందుఁ జెప్పదొడంగెను.

ఎనుబది తొమ్మిదవ మజిలీ

మంజరి కథ

పాటలిక - ఓసీ ? మంజరికా ! ఇప్పుడు మహారాజు కౌముదియం దేమిటికో యలిగి యామె యంతఃపురమునకుఁ బోవుట లేదట. అందుల కామె పరితపించుచు మీ రెద్దియో కొండెములు సెప్పి మానిపించిరని తలంచుచు నా కారణము గ్రహించి రమ్మని నన్నుఁ నియమించినది. మనలో మన కంతరము లేదు కదా ? నిజ మెరింగినని జెప్పెదవా ?

మంజరిక - అత్తా ! నీతోఁ జెప్పకుందునా? నాఁడు మన మొుండొరులము చెప్పుకొన రహస్యములకన్న నివి గూఢములా యేమి? కౌముది తల్లి నీ కా బహుమానముఁ జేసినదా ?

పాట - లేదు. లేదు. తనపుత్రిక శిశువుఁగూడ గతతేరినది కాదా? అందులకు హెచ్చరిక లేక జరుపుచున్నది.

మంజ - కౌముదికిఁ బుట్టినది ఆడుబిడ్డయా ? దాని నెట్లు మార్చితివి ?

పాట - నీవు చెప్పినట్లే చేసితిని. ప్రసవసమయమున దాపున నేనును నా పుత్రికయు మాత్రమే యుంటిమి. తల్లి దూరముగానున్నది. పిల్ల భూమిపైబడిన తోడనే తెచ్చియుంచిన మృతయంత్రశిశువు నందుంచి యా బాలిక నేడువకుండఁ బట్టికొని నా కూఁతురు నొడిలోఁ బడవైచి యవ్వలికిఁ దీసికొని పొమ్మని పంపితిని.

మంజ - కౌముది చూడలేదుగదా ?

పాట - ప్రసవవేదనా వివశయై యామె యొడలే యెరుంగక కున్నదిగదా?

మంజ - తరువాత.

పాట - చచ్చియే పుట్టినదని యా పిల్లం జూపితిని. అంతగా విమర్శింపక