కాశీమజిలీకథలు/ఆరవ భాగము/77వ మజిలీ

వికీసోర్స్ నుండి

నేర్చుకొనుచున్నారు. శంకరుఁడు నన్ను మోసముఁ జేసెనని నిందించుచుండును. కావున నో భూసురుఁడా ? నీవా కౌశికునివలె మోసము పన్నుకొని వచ్చితివేమో యెవ్వఁ డెరుఁగును? మే మట్టి మాయలం జిక్కువారము కాము. నీ దారి నీవు పొమ్ము. మా పిల్లనీయము. అదియునుంగాక-

శ్లో. వర్ణం సితం శిరసి వీక్ష్య శిరోరుహాణాం
    స్థానం జరాపరిభవిష్య తదా పుమాలనం
    ఆరోపితాస్థిళకలం పరిహృత్య యాంతి
    ఛండాలకూపమివ దూరతరం తరుణ్యః.

అని యెఱింగించువరకు వేళ యతిక్రమించినది తరువాత కథ తదనంతరావసంధంబున నిట్లని చెప్పం దొడంగెను.

డెబ్బది ఏడవ మజిలీ

కరభశరభుల కథ

శరభుడు :- కరభా ! నిన్న నా విదేశ బ్రాహ్మణునితోఁ దలుపు వైచికొని మన గరువుగా రెద్దియో ముచ్చటిందిరి. ఆ రహస్యముఁ దెలిసికొంటివా ?

కరభుఁడు :- వారు రహస్యముగా మాట్లాడికొన్న విషయము మన కెట్లు తెలియఁబడును ?

శరభుఁడు :- మనల దూరముగాఁ బొమ్మని నంత నేదియో వింత యుండక పోదని తలంచి రహస్యముగా నటుకపైఁ జేరి వీరి యేకాంతలాపము లాలకించితిని.

కరభుఁడు :- అందలి విశేషములేమి ?

శరభుఁడు :- ఆ బ్రాహ్మణుఁడు పెద్దకాలము తపముఁజేసి యింద్రజాలము పరకాయప్రవేశము అను విద్యలు రెండు సంపాదించి యంతలో దంతభగ్న మగుట నవి ప్రసాదింపమి సంతానాపేక్షఁ బెండ్లి యాడఁ దలంచి గురుపుత్రిక సావిత్రినిమ్మని యాచించెను.

కరభుఁడు :- అందులకుఁనొజ్జ లేమనిరి ?

శరభుడు :- కౌశికుఁడను బ్రాహ్మణునికథఁ జెప్పి నీవు మిగుల వృద్ధుండవు. నీకుఁ బిల్లనియ్యనని చెప్పిరి.

కరభుఁడు :- తరువాత తరువాత.

శరభుఁడు :- అతఁడు సిగ్గుపడి మరుమాటఁ బలుకక యిప్పుడే యీ యూరు విడిచి మరియొకయూరికిం బోయెను.

కరభుఁడు :- పోవుగాక మనకేమి.

శరభుఁడు :- మన మెన్నియేం డ్లేడిచినను రామశబ్దమైన తిన్నగారాదు. మన బుద్ధులు బండబుద్ధులు. ఈ చదువు తుదముట్టినదికాదు. మనమా బ్రాహ్మణు నాశ్రయించి శుశ్రూషఁ జేసి యెట్లో యా విద్యల నుపదేశముఁ బొందితిమేని చాల ద్రవ్యము సంపాదింపఁగలము.

కరభుఁడు :- ఆ పారుఁడు మన కా విద్యల నేమిటి కిచ్చును?

శరభుఁడు :- ఇయ్యకేమి చేసికొనును. వానికిఁ బెండ్లి యీ జన్మమునకు గాదు.

కరభుఁడు :- అట్లయిన మంచిదే. కూడదిరిగి యాశ్రయింతము. ఆ రెంటిలో నొకదాని నిచ్చిననుం‌ జాలు.

శరభుఁడు :- సీ! సీ! ఈ విద్యాగ్రహణభేద మెవ్వఁ డనుభవింపఁ గలడు. ఏపనికై నను నా మది ముందడుఁ గిడుచుండునుగాని చదువనిన శిరోభారము రాక మానదు.

కరభుఁడు :- అవును నాకును నట్లేవచ్చును.

శరభుఁడు :- అందులకే మన కిరువురకు జత కలిగినది. మఱియు గురువుగారి శుశ్రూష కడు కష్టముగా నున్నది. ఈ యేడు సావిత్రికి వివాహముఁ జేయఁగలఁడు. అప్పుడు మనచేత పశువులచేతం బోలె పనులు చేయించును. ఈ రేయిఁ జెప్పకుండఁ బారిపోయి యా కామగ్రీవుని గలసికొందము.

అని యిరువురు నాలోచించుకొని నాఁటిరేయి గృహము వెడలి కరభ శరభులను విద్యార్థు లిరువురు రెండుమూడు పయనములలోఁ గామగ్రీవుని గలసికొనిరి. గామగ్రీవుఁడు వారిం జూచి గురుతుపట్టి ఓహో! మీరు భట్టపాదుని శిష్యులుకారా? ఇక్కడి కేమిటికి వచ్చితిరి ? న న్నాయన తీసికొని రమ్మని పంపెనా యేమి అని తొందరగా నడిగిన వాండ్రు నవ్వుచు నిట్ల నిరి.

మహాత్మా ! నీవు వచ్చిన తరువాత భట్టపాదునకు భార్యకు నీ వివాహము విషయమై చాల వివాదము కలిగినది. ఆమె యొప్పుకొన్నదికాదు. మేముఁగూడ నిన్నుగురించి తగవులాడి విరోధుల మైతిమి. అందు నిలువక నీయొద్ధఁ జదువవలయునని లేచివచ్చితిమి. నీవు మాకు విద్యాదానముఁ గావింపుము. నీకుఁ బెండ్లి చేయు భారము మాది అని యదురు గరుపుటయు నతం డిట్ల నియె.

వత్సలారా! మీ యొద్ద దాచనేల ? నా కే విద్యయురాదు. నే నేమియుం జదువలేదు. మీరు మరియొకరియొద్దకుం బోయి చదువుకొనుడు అని పలుకుటయు వాండ్రు మరల నిట్లనిరి. ఆర్యా! మీరు మాకుఁ జదువు చెప్పకపోయినను సరే మీ వెనువెంటఁ దిరిగి మీకు రెండు మాసములలోఁ బెండ్లిచేయక తీరదు. మేమా గురుపత్నితో నట్లు శపథముఁజేసి బయలుదేరి వచ్చితిమి. చూడు మా సామర్ద్యమని పలికి యతని‌ కెంతేని సంతోషముఁ గలుగఁజేసిరి. అతండు వారిని విద్యార్థులుగా నంగీకరించిరి వెంటఁ బెట్టుకొని త్రిప్పుచుండెను. మువ్వురు దేశాటననుఁ జేయు చుండిరి. ఎక్కడనై న వివాహయోగ్యమగు కన్య కాన్పించినపుడు దాని తల్లిదండ్రుల కడఁ గామగ్రీవుండు మహేంద్రు నంతవాఁడని పొగడుచుందురు. వారి పరోక్షమున నితండు కడు వృద్దుఁడు. పెండ్లి చేయుమని మమ్ముఁ జంపుచున్నాఁడు విత్త మున కాసపడి వీనికిఁ బిల్లనెవ్వరిత్తురని పలుకుచుందురు.

అట్లుఁ గొంతకాలము దేశములు తిరిగిరి. కామగ్రీవునికి వివాహమైనది కాదు. శరభ కరభుల యభిలాషలే తీరినవి. అతనికి. బ్రాణోత్క్రమణసమయంబు వచ్చినపు డిఁకఁ బెండ్లి కాదని నిశ్చయించి కామగ్రీవుఁడా విద్యలు రెండు చెరియొకటియు నుపదేశించి ప్రాణములను వదలెను.

అట్లు శరభ కరభులు కామగ్రీవునివలన నా విద్యలు గ్రహించి యతని కపర సంస్కారముఁ గావించి యొండొరు లిట్లు నియమముఁ జేసికొనిరి. శరభా! నీ కింద్రజాలము నాకుఁ బరకాయ ప్రవేశవిద్యయు నుపదేశించెగదా! మొదటినుండియు నా కింద్రజాలమునం దభీష్ట ముండునది. మన యిరువుర మెవ్వరి విద్యలవలన లాభము వచ్చిననను సమముగాఁ బంచుకొనవలసినదియెగదా ? నాకు దానియం దభిలాషగా నున్నది. నా విద్య నీ కిచ్చెద. నీవిద్య నాకిమ్మని కోరిన శరభుం డనుమోదించుచు నతని వలనఁ బరకాయ ప్రవేశవిద్యను గ్రహించి తన విద్య వాని కుపదేశించెను.

అప్పుడు వాండ్రు పరమసంతోషముతోఁ దిరుగుచు నొకనాఁడొక పట్టణమునకుఁ బోయి తమ యింద్రజాల ప్రభావముఁ జూపి యా భూపతి నొప్పింపఁ దలచిరి కాని యాఱేడస్వస్థుండైయున్న కతంబున వినోదముఁ జూప నవసరము కలిగినదికాదు. అప్పుడు శరభుఁడు అయ్యో ? ఈ రాజు రోగపీడితుఁడై యున్నవాడు. రెండు మూడు దినములలోఁ గడతేరగలడు అప్పుడు వీ డాతని దేహములోఁ బ్రవేశించి రాజ్యమేలును. నా యింద్రజాల మేమిఁ జేయుదును ? గురుఁ డుపదేశించిన విద్య నిష్కారణము వానిపాలుఁ జేసితిని. నా వంటి పసర మెందైన గలడా ?

కరభా! గురుఁడు మన కే యభిప్రాయముతో నీ విద్యలని నిచ్చె యట్లే యుంచవలయుంగాని మార్చికొనరాదు. మనము తప్పుపని చేసితిమి. అది గురుద్రోహమగును కావున నావిద్య నాకిమ్ము. నీవిద్య నీ కిచ్చెదనని పలుకుటయు నతఁ డట్టిదిగా నిశ్చయించి వానివలన నింద్రజాలము విద్య గ్రహించి తనయొద్దనున్న విద్య వానికిచ్చి వేసెను.

ఇంతలో రాజభట్టులు వారిని వెదకికొనుచు వచ్చి మాఱేనికి రోగము కుదిరినది. వినోదములు చూడవలయునని కోరుచున్నాఁడు. మీ రింద్రజాలవిద్య నెరుఁగుదు

పింవుడని పిలిచిరి. అ న్తువిని భరరుండు పీఃవీః నేప వ. వాఖ బంశినట. వయిలు చూచునంట.. ఇప్పుడు "హాము కాగలదు. నా పరకాయ థి నేమి జేయుదును. ఇంతలో దొందరపడితినని పశ్చాత్తాపముఁ జెందుచుండెను. శరభుఁ డా యూరజూలముఁ బన్ని యనేకచిత్రములు చూపించి జనుల నాశ్చర్య వివశులం జేయుచుఁ జాల ధనము సంపాదించి సగము శరభునికిఁ బంచిపెట్టెను. శరభునికి మనోవ్యాధి బలియఁ జొచ్చినది అన్నన్నా ! ఈ జాలము చేతిలోనుండినచో నిత్యము వేలకొలదిఁ ధనము సంపాదింపవచ్చును. అతండు తెలియక మొదట నాకిచ్చెను. నేను మూర్ఖుడనై వచ్చిన లక్ష్మిని జేతులతోఁ ద్రోసివేసితిని. ఇప్పుడిమ్మని యడిగిన వాఁ డిచ్చునా ? అయినను గోరి చూచెదంగాక యని యాలోచించుకొని శరభుఁడు మెల్ల గా వానియొద్ద కరిగి మిత్రమా ! నీవు నాముద్దు జెల్లించుచు నే నడిగినంత రెండుసారులు విద్యల మార్చితివి. ఇఁక గడపటిమాటి నొకటి యడుగఁదలంచుకొంటిని. ఇదిగాక మరి యెన్నఁడును నేను గోరినను మార్చవద్దు. నా కింద్రజాలమునందు వేడుక తీరినదికాదు. దాని నిత్తువే? యని యడిగిన శరభుండు దీనికొరకింత మనవియేల ? నా కేదియైన నొకటియే. కావలసినం దీసికొమ్మని నిష్కపటముగా నుత్తరముఁ జెప్పెను.

అప్పుడు శరభునకు దురాలోచన కలిగి యట్ల యిన నీ విద్య తొలుత నాకిమ్ము. పిమ్మట నా విద్య నీకిచ్చెదను. ఇంతకుమున్ను రెండుతేపలు ముందు నేనే యిచ్చితినికదాయని పలికిన నతం డనుమానముఁ జెందుచు నీ మార్పులకు నీవే మూలము గనుక ముందు నీవే విద్య నీయవలయునని యుక్తిఁ జెప్పెను. అప్పుడు శరభఁడు నా విద్య నా కీయనిచో నే నేమి సేయవలయునో చెప్పుమని యడిగిన శరభుండు మూఁఢుఁడా ! నీకీబుద్ధి యెప్పుడు పుట్టినది. ఇదివరకు రెండుమారులు నట్లుచేసిన నేమిచేయుదువు ? నమ్మకముండిన నిమ్ము లేకున్న మానివేయుము. నా కేమియు నవసరములేదని చెప్పెను. ఇరువురకుఁ బెద్ద సంవాదము జరిగినది. అది పోట్లాట యైనది. అహంకారములు బలిసినవి. క్రమంబున మిత్రులిరువురు శత్రువులైరి. ఒండొరుల వంచించు కొనవలసిన యవకాశములు వెదకుచుండిరి.

కరభుఁడు వాని విడచిపోవయునని యెంత ప్రయత్నముచేసినను వదలక శరభుఁడు వెనువెంటనే తిరుగుచుండెను.

ఒకనాఁడొక మహారణ్యమున బడిపోవుచున్నప్పుడు శరభుఁడు జాల ప్రభావమున నొక పట్టణమును సృష్టించెను. అందనేకములైన మేడలును గృహములును రత్నమయములై విరాజిల్లుచున్నది. రాజమార్గములు మనోహర రధాశ్వాం దోహవస్తు విశేషములచే నిండియున్నవి. రాజభటులు సంభ్రమముతోఁ బరుగిడుచు అయ్యా ! మీ కేమైన వైద్యము తెలియునా ? మా రాజు ప్రాణంబులంవాయ సిద్ధముగా నున్నాడని యడుగుటయు శరభుఁడు మా కేమియుం వైద్యము తెలియదని చెప్పెను. శరభుఁడు కరభుని విడిచి సంతోషముతో వారివెంట రాజభవనమున కరిగెను. అప్పుడే రాజు శరీరములోనుండి ప్రాణములు లేచిబోయినవి. ఇదియే సమయమని తలఁచి శరభుఁడు తన శరీర మెక్కడనో పారవేసి యా రాజశరీరములోఁ బ్రవేశించెను.

అప్పుడు కరభుఁడు వాని శరీరము వెదకి పట్టుకొని జుట్టునకుఁ ద్రాళ్లుగట్టి యొక చెట్టునకు దలక్రిందులుగా వ్రేలఁగట్టెను. అ జాల యొక దివసముకన్న నిలువదు కావున నా పట్టణ మంతలో మాయమైపోయినది. ఉపాది నశించినతోడనే శరభుఁడు నిలువలేక తన దేహము వెదకికొని దేహములోఁ బ్రవేశించి తలక్రిందుగా నుండుటకు వగచుచు నేల కురికి యది కరభుఁడు పన్నిన జాలమని తెలిసికొని తన యవమానమును గురించి దుఃఖించుచు నౌరా! యిది నిజమైన పట్టణమనియు నతఁడు రాజనియుఁ తలంచి మోసపోతిని అన్నన్నా ! ఇంద్రజాలము సత్యములాగే తోచును. అబ్బిన విద్యను గోలుపోయితిని. ఇఁక వీని వెనువెంట దిరుగరాదు. జాలము తెలియదు, నిజము తెలియదు. దూరముగాఁ బోయి యే మహారాజై నను మృతిబొందిన నతని శరీరముఁ బ్రవేశించెద నింతకన్న నాకు వేరొక తెరవులేదు. అని నిశ్చయించి వానికిఁ దెలియకుండ నఁట గదిలి మరియొక దేశమున కరిగెను.

కరభుండును దనజాలము జూడఁదగిన రాజధాని నరయు తలంపుతోఁ దిరుగుచుండెను.

అని యెరింగించి మణిసిద్దుం డవ్వలికథ నవ్వలి మజిలీయం దిట్లు చెప్పుచుండెను.

డెబ్బది ఎనిమిదవ మజిలీ

శంతనుని కథ

అయ్యారే ! ఈ పట్టణ రామణీయకం బెంత వింతగా నున్నది. ఇందలి భవనంబు లన్నియు నింద్రభవనములవలె మెరయుచున్నవిగదా ! దీనిం బృధ్వీ స్వర్గమని చెప్పనోపు. ఇట్టి పట్టణమునకును మన దేశమునకును నధి నాయకుఁడైన మహారాజు పూర్వజన్మంబుననెట్టి తపంబుఁ గావించి యుండునో? నే నుత్తమమైన పరకాయప్రవేశవిద్య శరభునకిచ్చి యీ పాడు నింద్రజాల విద్య గ్రహించితిని అందుఁ బొడకట్టు వినోదములన్నియు నొరులకేగాని నా కొక్కటియు గనంబడదు. అందుఁ జూపించు చిత్ర వస్తుజాలమెల్ల నెండమావులవంటివే ? క్షణభంగురములు దీనివలన సంపాదించిన విత్తము క్షణభంగురమే యగుచున్నది. ఈ రాజధానిలో నా విద్యా వైచిత్రముఁజూపి ‌ కొంతధనము సంపాదించెదగాక. అని తలంచుచుఁ గరభుం డొకనాఁడు ప్రాతఃకాలమున రత్నాకరమను నగరమున బ్రవేశించి వీధింబడి నడచుచుండెను.

పోవంబోవ నొకచోట నొక గృహద్వారముపై రాజపురోహితుని గృహమని