కాశీమజిలీకథలు/ఆరవ భాగము/73వ మజిలీ

వికీసోర్స్ నుండి

శిష్యురాలు గలిగియన్నది. ళాల్యన్నములు భుజించి పనిపాటలులేక వీరందరు నాఁబోతులవలె బలిసియున్నారు. వీరి నందరిని పొమ్మని యీ సత్ర మెత్తివేయించుట లెస్సయని పలికిన నతం డంగీకరింపక నిది మొదలు యోగిను లీ మంఠపములో నుండరాదు. పది దినములలో నందరును లేచిపోవలయునని యాజ్జయిచ్చి ప్రధానులతోఁగూడ నా ఱేడు నగరికిం బోయెను.

కమల యావార్త విని యార్తిఁజెందు డెందముతో నౌరా! నాచరిత్ర యెంత చిత్రముగానున్నది. నా కతంబున యోగినులకెల్ల నపకారమైనదిగా ? పాప మీ చిదంబరయోగి నూరేండ్లవాఁడు. ఇట్టి వారినింగూడ స్త్రీ సాన్నిధ్యంబునం జేసి లోకులు శంకించుచున్నారు. ఇంతకన్న నవివేకమున్నదియా । నా నిమిత్తమై యా కపట శిష్యులే యీ పనిఁ గావించిరి. అన్నన్నా ! నా మంచమందే యుంచినచో నన్ను వీండ్రు మోసము చేయుదురుగదా ? సీ ! ఆఁడురూపమునఁ జనించుటకంటెఁ గ౦టకము మరియొండు లేదు. నేను సత్వవంతుని నిమిత్తము మగరూపు విడచి యీ యాడురూపుఁ దాల్చితిని. ఇందు రసాభాసమైనది. సత్వవంతుండిఁక రాడు. నే నన్నింటికిం జెడితిని. ఈ యాడురూపము వానియెదుటనే ప్రకటించితినయేని యెంత యొప్పిదముగా నుండును. ఇఁక వానిం జూచుభాగ్యము నా కన్నులకుఁ గలుగదు. పోనిమ్ము. చిదంబరయోగి నా వృత్తాంతమువిని నిన్నుఁ గాశికిఁ బొమ్మని శెలవిచ్చియున్నాడు గదా! ఆయన మిగుల వృద్దుఁడు. జ్ఞానవంతుఁడు. ఆయనమాట వడువుననే కావించెదనని నిశ్చయించి కమలయను పేరుతో నున్న రూపవతి మరలఁ బురుషవేషము వైచికొని యటఁగదలి కతిపయ [పయాణంబులఁ గాశీపురంబున కరిగినది.

అని యెరింగించి అవ్వలికథ మణిసిద్ధుండు తదనంతరావ సథంబున నిట్లు జెప్పం దొడంగెను.

డెబ్బది మూడవ మజిలీ కథ

ఆహా ? లోకమెంత మోహక్రాంతమై యున్నది. అన్నియుం దాను జేయుచున్నట్లు తోచును. నిక్కమరయ జనుడు రవ్వంతయు! దాను జేయుటకుఁ గర్త కాడు. భ్రమపడి కర్తృత్వము తనపైఁ బెట్టుకొనును. తాను జేయఁ బూనిన పనులే పిమ్మట విమర్శింప విపరీతములుగాఁ దనకే తోచును. ఆచరింపబడినది మార్చుటెట్లో శక్యముకాదో జరుగఁబోవునదియుఁ దెలిసినను మార్చుటకు శక్యముకాదు. ఆ రహస్య మెరుఁగక ప్రమాదము జేసితిమనియుం ముందు జాగరూకతగాఁ జేయుదు మనియు సంకల్పించు చుందురు. అది వట్టిదబ్బర. కాకున్నది కాకమానదను నార్యోక్తి శిలాశాసనమువంటిది. అందులకు మా చరిత్రమే దృష్టాంతము. మేము గొప్ప సంపదలు కలవారియింటఁ బుట్టియు సుఖపడనేరక కన్నవారి దుఃఖముల పాలుఁజేసి యిల్లువిడిచి దేశముల పాలైతిమి. మే మిట్లు చేయుటకుఁ గారణమేమియుఁ దెలియనేరదు. రాజపుత్రికయు రూపవతియు మా యిరువుర నూరు వెడలించి నిరూపించుకొనిన సమయమునకు మమ్ముఁగలిసి కొనిరి కారు. వారు బయలుదేరి వెడలుటకు నవసరము దొరికినదియో లేదో తెలియదు. సోమభట్టారకుని యింటికి యజ్ఞదత్తుఁ డతిధియై వచ్చినంతఁ దెలిసి మేమిరువురము పారివచ్చితిమగదా ? ఇంటికి బోవు‌దమని నేనెంతఁ చెప్పినను వినక శీలవతి యిటు లాగుకొని వచ్చినది. రాత్రి యిద్దర మీ వేదికమీదనే పండుకొంటిమి. శీలవతి యేమయ్యెనో తెలియదు. నిత్య కృత్యములు తీర్చుకొ‌నుటకై యరిగినదియా ? నన్నుఁ జేరకఁ యేలఁ బోయెడిని. ఇది కడు విపరీతము. రాత్రి నాకెంత నిద్రపట్టినది. అని యొకనాడు ప్రాతఃకాలమున ఘటికాచలమను నగరంబునఁ గృతవర్మ యొక గృహస్థునివీథి యరుగుపైఁ గూర్చుండి ధ్యానించుచుండెను.

అంతలో మేఘనాధుఁడను పేరుగల యా యింటియజమానుఁడు దంతధావనము నిమిత్తము వాకిటకువచ్చి తిన్నె పైఁ గూర్చున్న కృతవర్మం జూచి తద్రూపాతిశయమునకు నక్కజమందుచు, కుమారా! నీ దేయారు? నీపేరేమి। నీ కులశీల నామంబు లెట్టివని యడిగిన నతం డిట్లనియె.

అయ్యా ! నేను ద్విజకుమారుండ. నాపేరు కృతవర్మయండ్రు నా మిత్రుండు నేనును గాశికిఁ బోవుచు రాత్రి వచ్చి యీ వాకిలిపైఁ బండుకొంటిమి. అతండేమయ్యెనో తెలియదు. ఈ గ్రామంబున మృగబాధలు లేవుగదా యని యడిగిన మేఘనాధుం డిట్లనియె ?

ఈ యూర నట్టిబాధ లేమియునులేవు. మీ రిదివర కేమి చదివిరి? ఏమి చదువుటకైఁ గాశికరుగుచున్నారు. అని యడిగిన నతఁడు తాను జదివిన గ్రంథము చదువఁబోవు గ్రంథములు నిరూపించి చెప్పెను. వాని విద్యాసంపదకు మిక్కిలి విస్మయపడి మేఘనాధుఁడు దంతధావనముఁ జేసికొనుచు నతనితో నప్పటికిం దగిన మాటల ముచ్చటింపుచుండఁ గృతవర్మ అయ్యా ! తమ రేకులమువారు? ఏమి వ్యాపారముఁ జేయుదురు ? మీరేమి చదివితిరని యడిగిన మేఘనాధుం డిట్లనియె.

సఖుఁడా ! మేమును ద్విజులబో ? మాతండ్రి చాల ధనము సంపాదించి స్వర్గస్థుండైన నే ననేక వ్యాపారములు సేసి యాసొమ్ము కొల్లబుచ్చితిని. నాకు నాటకాలంకార సాహిత్యము గలదు. కొన్ని నాటకములు రచించి‌తిని. అంతటితోఁ దృప్తిఁబొందక నా నాటకములు ప్రదర్శించు నిమిత్తము నాటకోపకరణము లన్నియు సంపాదించి పాత్రములకు వేతనములిచ్చి నాటకము లాడించుచుంటి. మా నాటకములో నున్న భూమికాధారులందరు సంగీత సాహిత్య విద్యానైపుణ్యులుగా నున్నారు. మీ రడిగితిరి కావునఁ జెప్పుచుంటిని. ఈ కాలములో మా నాటక సమాజమునకుఁ గల ----------- మరియొకదానికిలేదు. ఇప్పుడు దేశాటనముఁ చేయఁ బ్రయత్నించు చున్నారము. మాకు స్త్రీ వేషధారులు కొందరు కావలసియున్నారు. నామాటకు మీకు తప్పుగా గణింపక మీరు మా సమాజములోఁ జేరితిరియేని మాకును మంచివాఁడుక రాగలదు. మీ సంగీత సాహిత్యములకు వెన్నె వెట్టినట్టగును. మాకును జాల నుపకారము కాఁగలదు. మేము సమాజముతోఁ గాశీ ప్రయాగాది పట్టణములఁ దిరుగుదుము. మీ కయ్యెడు వ్యయ ప్రయాసము లన్నియు మేము భరింతుము. అంగీకరింతురా ? అని యడిగిన నతండు నవ్వుచు నిట్ల నియె. మాకు నాటకములనినఁ జాల వేడుక యున్నది ? మీరు కోరితిరి కావునఁ గొన్నిదినములు మీతోఁ దిరిగి మా యోపిన సహాయము చేయుదుము. మేము వేతనము లందువారముకాము. కావలసిన నాటకములు రచించి యిచ్చుచుందుము. అవసరమున్న భూమికల ధరింతుము. నా మిత్రుని వెదకి తెప్పింపుఁ డతండు నాకన్న మిక్కిలి చక్కని వాఁడని చెప్పిన సంతసించుచు మేఘనాధుఁ డప్పుడే యతని వెదకి తీసికొనిరమ్మని పెక్కండ్రఁ బరిచారకులఁ నంపెను. వాండ్రు నాఁటిమునిమాపుదనుకఁ దిరిగివచ్చి యట్టివాఁ డెందును గనంబడలేదని చెప్పిరి.

అందులకుఁ బరితపించుచుఁ గృతవర్మను మేఘనాధుఁడు కాశీ రామేశ్వరముల నడుమ నెందున్నను నీ మిత్రుని వెదకి తెప్పింతుఁ జింతింపవలదని యూరడించెను. కృతవర్మకు నప్పటికి వేరొక తెరవులేక వారియింటనే వసించి తత్కృత సత్కాలముల కానందించుచుఁ గొన్నిదినములు గడపెను. మేఘనాధుఁడు సమాజస్తులతో స్త్రీ భూమికాధారి నొకదైవము తీసికొని వచ్చెను. అతని రూపము త్రిలోకాభిరామము. కంఠమా ! కిన్నరము. దేవగానము. పాండిత్యమా ! బృహసృతి. కవిత్వమా ! కాళిదాసు. అతండు వేషము వైచినప్పడు కాంచన వర్షము కురియగలదు. మనమిఁక బయలుదేర వచ్చును. కొరంత తీరినదని యుబ్బుచు ముచ్చటించెను. సమాజమువారందరు డెందములఁ బరమానందభరితులై పయనంబున కనుమతించి నాటక లోపముల సవరించుకొనుచుఁ గొన్నిదినము లాల సించిరి.

వినత కథ

గానాభిజ్జుండు విరూపుండైనను దరుణులు వలతురను వాడుకయున్నది. తొల్లియొక రాజపుత్రిక వానరముఖుండుగా శప్తుఁడైనను గాన విద్యా విశారదు నారదు వరించినకథ లోకవిదితమేగదా? అట్టివాడుఁ లలితుండ్రైనఁ బలుకవలసినదేమి ? ఆ మేఘనాధునికి వినత యనుకూతురు కలదు అక్కలికయక్కజంబడు చక్కఁదనంబు ననవద్యమగు విద్యయుంగలిగి తొలి ప్రాయంబున నొప్పచున్నది.. మేఘనాధున కొక్కరితయే పుత్రికయగుట నపురూపపు ముద్దునం బెనిచి యొక సామాన్యున కిచ్చి పెండ్లిఁజేసి యల్లు నింటనే పెట్టుకొనియెను. అధికుండైన యల్లుఁ డిల్లరికముండ వాల్గంటులు పుట్టింట నుండినప్పు డిల్లరికపుటల్లునిఁ జులకన జూడకమానరు. నాటక ములు సంగీతములు శృంగార రసపూరితములు. తదుభయ రహస్వాదన వివశుఁడు మేఘనాధుండు. అట్టివానికూఁతు రెట్టిరసికురాలుగ నుండనో యూహింపదగియున్నది. మఱియును --

[1]శ్లో. స్వాతంత్ర్యం పితృమందిరే నివసతి ర్యా తోత్సది సంగతిః
    గోష్ఠీ పూరుషసన్నిదా వనియమో వాసో విదేశే తధా
    సంపర్కస్సహ పుంశ్చభీభి రసకృద్వత్తేర్ని జాయాః క్షతిః
    పత్యు ర్వార్దక మీశతుః ప్రవసనం నాళస్య హేతు స్త్రీయాః

వింతరూపము, విద్యయు, గుణములు గలిగియున్న మగండసమర్దుడై తమయింట నుండుటంబట్టి యతనియాజ్ఞకు లోనుగాక స్వతంత్రురాలై నది. దానంజేసి‌ తక్కిన గుణంబులన్నియు నా చిన్నదానిని స్వయముగా నాశ్రయించినవి. వినత సంగీతమనినఁ జెవి కోసుకొనును. నాటకములనినఁ బండువుగాఁ దలంచును. కావ్య ప్రసంగము లుత్సవముగా నెంచును. స్వయముగాఁ బాడగలదు. ఆడగలదు. ప్రసంగింపఁగలదు.

ఒకనాఁడు కృతవర్మ పాడుచుండ గవాక్షమునఁ గూర్చుండి యా చిన్నది విన్నది. కన్నులార నతనిం జూచినది. అప్పుడే కందర్పుఁ డాపడఁతియొడఁ దన తూపులవేపు మాపఁజేసెను. నాటంగోలె నాబోఁటి కన్నము రుచింపదు. నిద్ర పట్టదు. చావడిలో నతనిమాట వినఁబడెనేని చెవియొగ్గి వినును. పలుమారు జాలముమ్రోల కరుగుచుండును.

చ. కిలకిలనవ్వు మోవిఁ బలుగెంటులు దీటు గుచంబు లోరగా
    వెలువడఁ బైటవియు నెరవింతగఁ గేరుమరుల్కొనంగ బె
    ళ్కులుగొనఁజూచి లేనివగలుంగొని మాటికిఁ గుల్కుగోటి చి
    మ్ములు నొనరించు నవ్వెలఁది మోహమనం గనినంత నాతనిన్‌.

ఆ వికారము లన్నియు గ్రహించియుఁ గృతవర్మ యెరుంగని వాఁడుంబోలె మెలంగుచుండెను. ఒకనాడు మేఘనాధుఁడు పరివారముతో నాటకశాల కరిగి నంత నింటిలోఁ గృతవర్మ యొకఁడు మాత్రము చావడిగదిలోఁ గూర్చుండి యేదియో వ్రాయుచుండెను. అట్టిసమయమున వినత వింతచీరఁ గట్టి తలకుఁ బట్టు వైచుకొని యా గదియొద్దకు బోయి తొంగిచూచి వినత :- సౌమ్యా ! నీకు వైద్యము తెలియునని వింటిని చేయిఁ బట్టి చూచి శిరోభారమున కేదియైనఁ జికిత్స సేయుదువా ?

కృతవర్మ :- (తలయెత్తి చూచి) నాకు వైద్యము తెలియునని నీ కెవ్వండు సెప్పిరి.

వినత :- సకలవిద్యా పారంగతుఁడవని నీ మొగమే చెప్పుచున్నది.

కృత :- విద్యలు మొగముపై వ్రాయబడియున్న వియా యేమి?

వినత :- బ్రహ్మ మొగముననే కాదా వ్రాయునఁట !

కృత :- నాకు వైద్యము తెలియదు. నీ వ్యాధి మరియొకరి నడిగి తెలిసికొనుము.

వినత :- ఇంట నిప్పుడు మరెవ్వరును లేకపోవుటచేతనే నీ యొద్దకు వచ్చితిని. అందరు నాటకశాలకుఁ బోయిరి. నా వ్యాధి యందరకుఁ దెలియదు‌. మీరే కుదర్చవలయును.

కృత :- అది నా కేమియుం దెలియదని చెప్పలేదా? మరల నడిగెన వేమిటికి ?

వినత :- అయ్యో ! మీరు కడు దయార్ద్రహృదయు లనియుఁ బరోపకార పారీణులనియు నెల్లరు స్తుతియించుచున్నారే. నన్నిట్లు కసరుచున్నారేల ? నా వ్యాధి యేదియో తెలిసికొనఁ జాలకున్నను బరీక్షించరాదా ? శరణుఁ బొందినదాని విడుచుట న్యాయమా ?

కృత :- ఓహో ! నీ మాటలు నా కర్దములుకావు. నా శరణు నీ కేమిటికి? నాకు వైద్యము తెలియదనిన నేమేమో చదివెదవేల ?

వినత :- నా చేయిఁ బట్టరాదని తలంచుచుంటిరాయేమి ?

కృత :- చేతకానివాఁడ ముట్టియు నేమిచేయుదును ?

వినత :- ముట్టినపిమ్మట నన్నియు మీకే తెలియగలవు. సమర్దులిట్లే పలుకుచుందురు. (అని చేయి చాపినది.)

కృత :- (చేయిపట్టుకొని ధాతుపరీక్షఁజేసి) రోగమేదియుం గనంబడలేదే ?

వినత :- నీ కరస్పర్శము తగిలినతోడనే పటాపంచలైనది.

కృత :- అట్లయిన లెస్సయే. ఇఁక నింటిలోనికిఁ బొమ్ము.

వినత :- ‌ వీధితలుపులు వైచివచ్చితిని. తొందరలేదు. నీవు తృటిలో రోగనివారణఁ జేసితివి. అందులకుం బ్రతిఫల మీయవలయునని యాలోచించు చుంటిని.

కృత :- నీవు నా కేమియు నీయనక్కరలేదు. అవ్వలికి బోవుటయే పారితోషికము. వినత :- పోయెదంగాని మొన్న పాడిన రాగ మొకసారి యాలాపించెదవా? విన వేడుక యగుచున్నది.

కృత :- నా కిప్పుడు తీరికలేదు. వ్రాసికొనవలయును బొమ్ము.

వినత :- నా యభిలాష తీర్చినందాక విడుచుదానను కాను.

కృత :- నీవు మగనాలపుగావా ? పరపురుషుల సాన్నిధ్యములు నేకాంతముగా నిలువవచ్చునా ?

వినత :- నీవు పరపురుషుఁడవని యిక్కడికి రాలేదు. మా యింటివారే యని వచ్చితిని.

కృత :- నివృత్తి మగం డెఱింగిన శిక్షింపఁడా ?

వినత :- మగనిశిక్ష యెట్ల యినను భరింపవచ్చునుగాని‌ మదీయ మనోభవ పరితాపము సైరింపకున్నానుగదా ?

కృత :- వినతా ! నీవు చిన్నదానవు. పెద్దవారియొద్ద మంచిగుణములు నేరిచికొనుము.

వినత :- అందులకేగాదా ? మీ యొద్దకు వచ్చితిని. ఆ గుణములేవియో గురువుడు శిష్యురాలనై మీ సేవఁ జేసెదను.

కృత :- మీ తండ్రి యెరింగిన దండించును జుమీ ?

వినత :- దండించెడివాఁడైనచో నిట్టి సుందరుని మందిరమున కేమిటికిఁ తీసుకొనిరావలయును.

కృత :- నా సుందరము నిన్నేమి చేసినది ?

వినత :- అమ్మక చెల్లా? ఏమి‌ చేసినది యని యడుగుచుంటివా ? నా హృదయమును లాగికొనిపోయి దాచికొన్నది‌.

అని మాట్లాడుకొనుచుండఁగాఁ దలుపులు తీయుఁడని వీధిలో మేఘనాధుఁడరచెను. ఆ మాటవిని వినత వోయి తలుపులు తీసినది. కూతుఁతలకు పట్టుచూచి యడలుచు నతం డమ్మా ! యిదియేమి పట్టి వైచితివి, శరీర మస్వస్థ‌తగ నున్నదా యని యడుగుటయుఁ దలనొప్పి మాత్రము వచ్చి నింపాదిగా నున్నదని చెప్పినది. అ చాపల్యమును గురించి కృతవర్మ మిక్కిలి విస్మయముఁ జెందుచుండెను నాఁడు సుత వినత సిగ్గువిడచి మాటిమాటికి నతండున్న గది ముంగలకుఁ బోవుచుండును. అందు నిలువంబడియే మాట్లాడుచుండును.. ఏదియో మిషంబన్ని యతనిం బల్కరింపఁబోవును. ఆ బింబోష్ఠి చేష్టలు తెలిసికొని మందలింపనేరక యొకనాఁడు మేఘనాధుండు మెల్లగా నిట్లనియె.

తల్లీ ! నీవు పెద్దదానవైతివి తరుచుగాఁ జావడిలోబడి రాఁగూడదు. ఎయతాతదు. సం నబనను లో కలు. ఛంకింతురు.. అం ఎప్పులయు నక్కల ని వచ్చు? 'చచ్చా? నొషల చఉలియమిగచా ? అయన సంగిరము బాగుగాఁ బాడగలఁడుసుమీ ? నా కాయన చెంత సంగీతము నేర్పింపవా ? యని యడిగిన నవ్వుచు మేఘనాధుఁ డిట్ల నియె.

అమ్మా ! నీవు కడుముద్దరాలవు. నీ సంగతి యెరుఁగక నీ మగండు నిన్ను గురించి యీసుగాఁ జెప్పెను. నీకు సంగీతమిష్టమని నే నెరుఁగుదును? అది వినుటకై చావడియొద్దకువచ్చి నందుల కతం డనుమానముఁ జెందెను. సంగీతముఁ జెప్పించుట కంగీకరించునా ? యనుటయు తండ్రీ !ఇంతకుముందు మగవారిచేత నంగీతము నాకేలఁ జెప్పించితివి ? ఇప్పుడేల జెప్పింపరాదు. ఆ సంగతి నాకుఁ జెప్పుము. అని నిర్బంధించిన నతం డిట్లనియె.

పట్టీ ! నీకు స్త్రీ పురుష వివక్షయే తెలియదు. నిన్ను దూరినవారు నరకముఁ బొందరా ! ఇప్పుడు నీవు పెద్దదానవైతివి చెప్పుకొనరాదు. లోకవిరుద్దముగా నుండును. అని చెప్పుచు గూఁతురు వట్టి యమాయకురాలని మేఘనాధుఁడు తలంచెను.

తండ్రి తన మాటల నమ్మి వశుఁడగుట నతం డమాయకుఁ డని వినత తలంచినది. మించుబోణుల వంచనలం దెలిసికొన స్మృష్టించిన విరించికై న శక్యము కాదుగదా :-

అట్లు తండ్రి మందలించెనని గణియింపక యప్పంకజాక్షి చాంచల్యము విడచినది కాదు. వినత హృదయంబున మదనానలము ప్రజ్వరిల్లుచుండ దానిమగనికిఁ గోపానలము ప్రజ్వరిల్లఁ దొడంగినది. వినతభర్త రహస్యముగా భార్య కృత్యముల నరయుచు నొకనాఁ డొక పత్రికం దీసుకొనిబోయి మేఘనాధునికిఁ జూపుచు నిట్లనియె.

మామా ! నీ కూఁతు రేమియు నెరుంగనిదని నీ యభిప్రాయము ఇఁక దాచనేల? ఈ పద్యమువ్రాసి నీఁకూతురు కృతవర్మయున్న గదిలోనికి విసరినది. అతండది చూడలేదు. నేను చూచి దీని సంగ్రహించి తెచ్చితిని. ఈ పద్యమువిని నీ పుత్రిక ప్రౌఢయో ? ముగ్ధయో తెలిసికొనుము అని యా పద్యము నిట్లు చదివెను.

ఉ. ఓ నవచిత్త జన్మ ! భవదుత్త మరూపముఁ జూపి యేపునన్
    సూనశరుండు నా మదిని సూటిగనాటగనేసెఁ చూపులన్‌
    నే నెటులోర్చుదాన నిఁక నీ యధరామృత మిచ్చి నన్నుఁ బెం
    పూనగఁ బ్రోవకున్న నయయో ? మృతియే శరణంబు నాకికన్.

ఆ పద్యమువిని‌ మేఘనాధుం డించుక యాలోచించి యప్పుడు కూఁతునొద్ద కరిగి యా పద్దెముఁ జూపి దీని నెవ్వరు రచించరని యడిగిన సప్పడఁతి యదరక బెదరక తండ్రి కిట్లనియె. తండ్రీ ? నీ యల్లునికిఁ బట్టిన భూతము నిన్నుఁగూడ నావేశించినదా యేమి ? ఆతఁ డేమో చెప్పినంత నన్ను నిర్భందింప వచ్చితివి? నా యంకితము దీనిలో నున్నదియా యేమి? ఎవ్వరిచేతనో వ్రాయించికొని యా బుద్దిమంతుఁడు నీకుఁ జూపెను. అది సత్యమనుకొని నన్నడుగ వచ్చితివి. చాలు జాలు. నీ యల్లుని గుణమెరుంగని వాడుంబోలె గోఁడుబూనితివి కృతవర్మ శకుని కన్న నధికుండు‌ జుమా! మనయింట భుక్తికి నిలిచెదనని మీరేమో యనుకొనుచున్నారు. అని కృతవర్మను బొగడుచు మగని నిందింప దొడంగినది. -

మేఘనాధుఁడు వినత చెప్పిన యుపన్యాసము మంతయు సత్యమని నమ్మి యల్లునియొద్దకుఁబోయి తన పుత్రిక కడు నుత్తమురాలని పొగడుచు నతనిం దద్దయుం బూరి పారఁగొట్టెను.

అంతలోఁ బ్రయాణ ముహూర్తము సమీపించుటయు మేఘనాధుండు నాటకోపకరణములన్నియు శకటంబులపై నెక్కించి కుటుంబ పరివార సహితముగా బయలుదేరి దేశాటనముఁ జేయుచు గొప్పపట్టణముల నిలిచి నాటకప్రదర్శనములఁ గావింపుచుఁ బారితోషికములందుచుఁ గొంతకాల మీరీతి దేశములఁ జరియించి కాశీపురంబున కరిగెను.

అని యెరింగించి పిమ్మట నగు వృత్తాంత మక్కథకుండు అవ్వలి మజిలీయందుఁ జెప్పఁబూనెను.

డెబ్బది నాలుగవ మజిలీ కథ

శబరదంపతులకథ

తారావళీ ! చిదంబరయోగి వట్టి జారుఁడట, మంత్రోపదేశ కై వతంబున నా బాలయోగినిని జేరదీసెనఁ టయ్యారే ? ఎంతవంత ఆతఁ డిచ్చిన మంత్రభస్మము మనకేమి ప్రయోజనము ? నిన్నుఁజూడక యాతం డింత యుపేక్షించుచున్నాడు. నేడు చక్కగానలంకరించుకొనుము. వానియొద్దకుఁ దీసికొనిపోయి యడిగెద నని కిన్నరదత్తుని భార్య యొకనాఁడు తారావళితో ముచ్చటించిన నమ్మచ్చకంటియు నందుల కనుమోదించి దివ్యమణి భూషాంబర మాల్యాను లేపనాదులచే సింగారించుకొని మేనత్తతోఁగూడ శశాంకునొద్ద కరిగినది.

శశాంకుఁడు వారిరాక పరిజనులవలనం దెలిసికొని యెదురువోయి తల్లికి నమస్కరించుచుఁ దోడ్తెచ్చి యుచితపీఠంబునం గూర్చుండఁ బెట్టెను. తారావళి మేనత్త గద్ధియనాని వెనుక నిలువంబడినది. అప్పుడు రాజపత్ని వత్సా ! శశాంకా ! నీ వీ దేశపుఁబ్రజలపుణ్యంబున రాజువైతివి. మీతండ్రియుఁ గృతకృత్యుడయ్యెను. నీ సుగుణంబులు లోకులు కొనియాడుచుండ విని యానందించుచుంటిమి‌ అన్నిటం బ్రియకరుండ వైతివి. విను మిప్పుడు నీవు యౌవనవంతుండ వగుటఁ బెండ్లి యాడ‌ వలసి యున్నది. అప్పని యుపేక్షించుచుంటివి. అందులకుఁ దొలతనే మీతండ్రి నిశ్చయించియున్నారుగదా ? వారు చెప్పిన తారావళి నీ మేనమామ కూతు రిదియె. మంచి గుణవంతురాలు. సంతతము నీ గోష్టియే చేయుచుండును.

  1. స్వతంత్రురాలగుటయు, పుట్టినింటనుండుటయు, తరుచుగా యాత్రలకు వుత్సవములకుఁ
    దిరుగుచుండుటయు, పరపురుషులతో గోష్ఠిఁ జ్రేయుటయుఁ బనిలేక పొరుగిళ్ళ కరుగుచుండుటయు,
    జారస్త్రీలతో సహవాసము, తనవృత్తి విడచి యన్యవృత్తి గైకొనుట పెనిమిటి వృద్దుండగుటఁ మగఁడు దేశాంతర మరుగుట లోనగు కారణంబులచే నుత్తమ స్త్రీయైనను చెడక మానదు.