కాశీమజిలీకథలు/ఆరవ భాగము/68వ మజిలీ

వికీసోర్స్ నుండి

యజ్ఞ:- ఈ కుళంకలిక చాలించి పాఠములు జదువుము నిన్న సీలవతియు నీరీతినే తల్లితో వాదువెట్టికొని తనకిప్పుడు వివాహమక్కరలేదని చెప్పినదఁట. మీరు బబుద్దిమంతులై నందుల కిదియా ఫలము. పో పొండు అని మందలించుటయుఁ గళావతి యాచార్యునికి మారుపలుక నోరు యూరకొన్నది. పిమ్మట నతం డింటికిబోయె.

అని యెరింగించువరకు సమయ మతిక్రమించినది. మరి సిద్ధుం డంతటితో నా కథ నుడుపుట విరమించి యనంతర నివాసదేశంబనఁ దరువాతికథ నిట్లని చెప్పఁదొడంగెను.

అరువది ఎనిమిదవ మజిలీ కథ

నిగమశర్మా ! మరలఁ జెప్పుము. వివాహములు రెండు నొక లగ్నమందే జరుగునాఁ ఈరేయి నెంతప్రొద్దు పోవును. మాబోటి పెద్దవాండ్రకు గొప్పచిక్కే తటస్థించినదిగదా యజ్ఞదత్తుఁడు కన్యాదాన కాలమందు షోడశ మహాదానములు గావించుట నిజమేనా ?

నిగమశర్మ :- పెద్దిభట్టుతాతా ! పెండ్లిండ్లు రెండును గుంభలగ్నమందే సేయ నిశ్చయించినారు. రాత్రి జాముప్రొద్దుండును. మన సదుపాయములు చూచి వారు ముహూర్తము లుంచుదురా యేమి ? యజ్ఞదత్తుండేకాదు. ధనపాలుండను బ్రాహ్మణసత్కార మధికముగాఁ జేయునని చెప్పుకొనుచున్నారు. పండితులకు శాలువలు గుండలములు ధోవతులు మిక్కిలి వెలగలవి పెక్కు తెప్పించినాఁడట.

పెద్దిభట్టు :- నిగమశర్మా ! మనము దొలుత నెక్కడికిఁ బోవుదము? ఉభయత్ర సంభావన జరుగు నట్లాలోచింపుము.

నిగ :- ఏదియో యొకచోట నమ్మియుండవలయును గాని యత్యాసకుఁ బోయిన రెంటికిఁ జెడుదుము. ధనపాలు నింటికే పోవుదము.

పెద్ది - కాదు కాదు. ముందు యజ్ఞదత్తునింటి కరిగి వానికిఁ గనంబడి పిమ్మట ధనపాలునింటి కరుగుదము. అట్ల యిన రెండుచోట్ల బహుమతులు దొరకఁ గలవు.

నిగః- ఉండుముండుము. ఏదో కోలాహలము వినఁబడుచున్నది.

పెద్ది:- పెండ్లివారియింట్లో కోలాహలముగా నుండదా?

నిగః- కాదు కాదు. ఏడుపులాగు వినఁబడుచున్నది. (ఆలకించి) అవును. ఏడుపే. ఏడుపే. పెండ్లివారి యింట్లోనే !

పెద్ది:- ఏమి చెప్మా? పెండ్లిండ్లు ఆగిపోవవుగద. గంపెడాస పెట్టుకొని వచ్చినాము.

నిగ:- అబ్బో ! ఆయల్లరి పెద్దగా వినఁబడుచున్నది. తెలిసికొని వచ్చెద నిందేయుండుఁడు. (అనిపోయి తెలిసికొనివచ్చి')అయ్యో! అయ్యో! తాతా ! ఇఁక నేమి సెప్పుదును? పాపము పెండ్లికూతుళ్ళిద్దరు సాయంకాలము వేత్రవతీనదిలో జలకమాడుచుండ మొసళ్ళు లాగినవఁట. రాజుగారు మొదలగు వారందరు పోయి వెదకించు చున్నారు.

పెద్ది :- హా ! యెంతకష్టము. నాశాలువులు రెండును నిష్కారణముగా పోయినవిగదా (యని దుఃఖించుచున్నాడు.)

నిగః- తాతా! (నీవు వానికన్న నెక్కుడుగా దుఃఖించుచున్నా వేమిటికి?

పెద్ది:- దుఃఖముకాదా ? ఎంతదూరమునుండి వచ్చితిమి. అబ్బీ ! మాట. ఇరువురకు నేకపుత్రికా విషయముకాదా? విరక్తితో వారిం గురించి యేమైనా దానములు సేయరా? ఆ పర్యవసానము చూచి మరియుఁ బోవుదము.

నిగః- ఛీ ! ఛీ ! అట్టిమాటలిప్పు డాడగూడదు. నీవిక్కడఁ బండు కొనుము. నే నక్కడికిఁబోయి యా వృత్తాంత మంతయుఁ దెలిసికొని వచ్చెద.

అనిచెప్పి నిగమశర్మ వేగముగా వేత్రవతీ నదీతీరమున కరిగెను. ఆ యుపద్రవమువిని పౌరులు వీధులవెంబడి పరుగిడుచున్నారు ధర్మపాల నృపాలుండును బ్రవాసులును బరివారములతో నదియొడ్డున నిలువంబడి కన్నుల నీరుఁగార్చుచుఁ బ్రవాహమువంకఁ జూచుచుండిరి. ప్రవాహమంతయు నావలలో దీపములతో నిండి యున్నది కొందరు వలలు వేయుచున్నారు. మరికొందరు ఓవలఁ బన్నుచున్నారు. ఈతగాండ్రు మునుంగుచున్నారు. గొలుసులు వైచుచున్నారు. మరియు రాజపుత్రికయు రూపవతియుఁ దీరమునఁ గూర్చుండి విచారింపుచుండ ధర్మపాలుండు బుజ్జగింపుచు అమ్మా! ఏడువకుఁడు మీరందరు ఎక్కడ జలకమాడిరి. వారిరువురు నెక్కడ మునిఁగిరి. చెప్పుము. చెప్పుము అని యడుగుచుండ రాజపుత్రిక యిట్లనియి.

మేమందరము సాయంకాలమున మాపూవుఁదోటలో సఖురాండ్రకు రాత్రి వివాహము జరుగునని సంతసముతో నలంకరించుకొనుటకై పూవులుగోసి యలసి మేనంతయుఁ జెమ్మటలు గ్రమ్మ జలక్రీడలాడ నేటిదరి కరుదెంచితిమి. పెండ్లి కూతుండ్రు మాతోఁగూడవచ్చిరి. మీరిప్పుడు జలకమాడగూడదు. దరిఁ గూర్చుండుఁడని మే మెంతఁ జెప్పినను వినక శీలవతియు విద్యావతియు నాశ్రమజలముఁ గడిగికొని యెదమని పలుకుచు జానుదగ్ధమగునీటిలో నిలువంబడి మాదెసఁ జూచుచుండిరి.

అంతలో అమ్మయ్యో? నా పాదమేదియో పట్టికొన్నదని శీలవతి పలుకుచునే మునిఁగినది. విద్యావతి మొసలి మొసలియని యరచుచు నీవలికిఁ రాబోయి నీటిలోఁబడి మునిఁగిపోయినది. అట్లి రువురు మునుఁగుటఁ జూచి మేము గుండెలు బాదికొనుచుఁ గాళులు తడఁబడ గద్గదస్వరముతో నరచుచుఁ బ్రాణములకు వెరువక సాహసముతో నా చెంతకుఁబోయి వెదకితిమి వారిజాడ యేమియుం దెలిసినదికాదు. పిమ్మటనే మీకుఁ దెలియఁ జేసితిమి. అదిగో ! ఆ మూలనే వారు మునింగిరి. అని రాజపుత్రిక యావృత్తాంత మంతయుఁ జెప్పినది. అప్పుడు యజ్ఞదత్తుండును భార్యయు రాజపుత్రికపయింబడి తల్లీ ! మునిఁగి పోవునప్పుడు నాబిడ్డ యేమని యేడ్చినది. అయ్యో ! మాకేమి చెప్పినది. నిన్నుఁ బెండ్లికూతుం జేసితిమి ఇల్లుకదలవద్దని చెప్పిన నాసఖురాండ్రను దీసికొనివత్తునని చెప్పి బండియెక్కి మా మాట వినిపించుకొనకయే పోయితివిగదా? హా ! పుత్రీ ! హా ! శీలవతీ ! హా ! త్రిలోకసుందరీ ! నాకుఁ బెండ్లి వద్దని నిర్బంధించితివిగదా! ఈ ప్రయత్నము చేయకపోయినను బ్రతుకుదువేమో? అయ్యో ! నా పసికూనా ! నీవిద్యలన్నియు గంగ పాలైనవిగదా? అని తగ్గుణంబు లన్నియు దలంచుకొనుచు దుఃఖింపుచుండిరి.

ధర్మపాలుండు బాలికల కళేబరములు వెదకి తీసికొనిరండని కింకరుల నియమించి యజ్ఞదత్తుని భార్యతోఁగూడ దనయింటికిం దీసికొనిపోయి శోకోపశమనముగా నిట్లనియె.

ఆర్యా ! నీవు ప్రాజ్ఞుండవయ్యుఁ బామరునిభంగినట్లు దుఃఖింపుచుండ మేము చూడలేకుంటిమి వెలుగుఁ జూపి మేఘము పిడుగు విడచినట్లు దై వము ఫల మెరవైచి శోకసముద్రములో ముంచుచుండును. అత్యంతసంతోష సమయంబున నిట్టి వింత తటస్థించిన నెట్టివెతయో యూహింపనలవికాదు. మిమ్మూరడించుటకు మాకు నోరురాకున్నది. గతమునకు వగచుట నిరర్థకముగదా? లోకప్రవృత్తిఁ దెలిసికొని ధైర్యము నవలంబింపుము. సంసార మసారమనియే పెద్దలు నిరసించిరి. కళావతియే శీలవతియని తలంచి మీయింటికిఁ తీసికొనిపొమ్ము. ఎప్పటికైన నా బాలికలు బ్రతికి మరల వస్తారేమో? అట్టికథలు మనము వినియుండలేదా? విధివిలాసములు విచిత్రములుగదా? యని బోధించిన యజ్ఞదత్తుండు కన్నీరుఁ దుడిచికొనుచు నిట్ల నియె.

దేవా ! జీవితాంతమైనను నాశలు బాధింపకమానవు. ఆహా ! నీటిలో రెండుగడియలు మునిఁగియుండినఁ బ్రాణములు నిలువవని యెరింగియు మీమాటలు మదీయ హృదయమున వెఱ్ఱియాసఁ గలిగించుచున్నవి. ఇంతకన్న విచిత్ర మేదియైనంగలదా ? నాయట్టి నికృష్టున కట్టి యదృష్టముపట్టునా? సీ ? మమతామోహము కడుచెడ్డదిగదా? అని యూరక విలపించుచుండ నూరడింపుచు ధర్మపాలుండు కళావతీ రూపవతుల సంతతము నతనియొద్దనుండ నియమించి వారింటి కనిపెను.

యజ్ఞదత్తుండు తద్బాలికా సంభాషణాది విశేషములతో దుఃఖముమరచి కొన్నిదినములు గడిపెను. ఒకనాఁ డా బ్రాహ్మణుఁడు అమ్మా ! కళావతీ ! మీతండ్రి నాకు లోకోపశమనము నిమిత్తము మిమ్ము నాయొద్దనుండ నియమించెను. ఆ కారముచే సాదృశ్యమునం జేసి మిమ్ముఁ జూచినప్పుడల్ల శీలవతి జ్ఞాపకము వచ్చుచున్నది. దానంజే నాదుఃఖము పెరుగుచున్నది. కాని తరుగుటలేదు. విద్యా వ్యాసంగము మాని మీ రిందుండుటఁ బ్రయోజనములేదు. విద్మగఱపుటకు నాకు నో రాడకున్నది. మీ యిరువురు మరియొక యుపాధ్యాయు నొద్ద విద్యలం జదువుఁడు. మేము దేశాంతర మరిగి యే క్షేత్రమందైనఁ గాలక్షేపముఁ జేయుచు శరీరయాత్ర జరుపు కొనియెదము. అని పలికినఁ గన్నీరు విడుచుచు నక్కన్నెక లిట్లనిరి.

తండ్రీ ! మా వయస్య లిరువురు బ్రతికియుండిరని మా హృదయములు సూచించుచున్నవి. ఎప్పటికైనను వారు వెడలిరాగలరని మా నమ్మకము. అట్టి స్వప్నములు మాకువచ్చుచున్నవి. మీరు చింతింప వలదని యూరడించుటయు నతండు తత్పరిజ్ఞాతృ వాక్యములకుఁ దలయూచుచు అమ్మా ! కళావతీ ! చచ్చినవారెన్నడైన బ్రతికివత్తురా ? పోనిమ్ము ఇంతియే సుఖము పెట్టిబుట్టితిమి. మేము పోవుటకు మీ తండ్రి యనుమతింపఁడు. మే మెప్పుడో చెప్పకయే లేచిపోయెదము. తరువాత నీవు చెప్పవలసిన మాటలం జెప్పుమని యేమేమో యుపన్యసించెను. దేశాంతర మరుగవలదని వారిరువురును మాటలకుఁ బ్రతికూలముగాఁ జెప్పిరి.

ఆ రాత్రి యజ్ఞదత్తుండు భార్యతోగూడ నా బాలిక లిరువురు మేల్కొనక పూర్వ మా యిల్లు వెడలి యెందేనిం బోయెను. మరునాఁడు ప్రాతఃకాలమునలేచి గురుదంపతులం గానక పరితపించుచు నా బాలిక లిరువురు నాలోచించుకొని యా దివసము రాత్రియే యీ వీడు విడచి యన్యదేశ మరిగిరి. ఎట్టివారికిని విధిలిఖితము లతిక్రమించుటకు శక్యమా ? వారరిగిన యొండు రెండునాళ్ళకు ధర్మపాలుండు యజ్ఞదత్తు నూరడించు తలంపుతో వారింటికరిగి తలుపులు మూయంబడి యుండుట జూచి వెరగుపడుచు గొండొకతెరవున లోనికింబోయి యందెవ్వరింగానక భయసంభ్రమములతో వృషాంకుని రప్పించి యతనివలనను వారిజాడఁ దెలియక యూరెల్ల వెదకించయుఁ నడిగియు జాటించియు వారివృత్తాంత మించుకయుఁ దెలిసికొనలేక నత్యంత దుఃఖాక్రాంతస్వాంతుండై యోలగంబున మంత్రులతో నిట్లాలోచించెను.

రాజు — అమాత్యులారా ! యజ్ఞదత్తుని వృత్తాంతము మీ రెరింగినదియే కదా? అతండు పుత్రికాశోకంబునఁ బొగులుచుండ నాగపు మఱచుటకై రూపవతినిఁ గళావతిని నందుండ నియమించితిని. ఇప్పుడు మనతోఁజెప్పకయె వారినెచ్చటికో తీసికొనిపోయె నిదియేమికర్మము.

హితవాది - దేవర యాలోచించకయే చేసితిరి. నెట్టిప్రాజ్ఞునకును సమానవస్తుహాని యందసూయ జనింపకమానదు. అతండు వారి కిప్పుడేదియేని వెతఁజేసెనని యూహింప నగుచున్నది.

ధర్మవాది — కన్నులారఁ జూడక నిందమోపరాదు వారిని వెదకి తెప్పించి నిజము తెలిసికొనుట కర్జము.

వృషాంకుడు - దేవా ! హితవాది పలికినదే తధ్యము. ఆబాలికలు ధరించు తెల్లబోవుదురు? తమ బ్రాహ్మణ హృదయమ గుద్యోగింపదు, యజ్ఞదత్తునివంటి విద్వాంసుఁడును వివేకవంతుఁడును పుడమిలోలేడని నా యభిప్రాయము. అట్టివాఁడే ద్రోహములుచేసిన భూమి నిలుచునా? అయినను వారిజాడ వెదకించి యిందు వచ్చునట్లుఁ జేయుఁడు. దగిన దూతలం బుచ్చుడు.

అని రాజు నియోగించినంత మం త్రులట్లు కావించిరి. అమాత్యప్రేషితులైన కింకరులు నలుమూలలకుంబోయి యొక క్షేత్రంబున శివాలయములో జపముఁ జేసికొనుచున్న యజ్ఞదత్తుంజూచి గురుతుపట్టి సవినయముగా నతనికి రాజశాసనముఁ జూపిరి. అయాజ్ఞ శిరసావహించి యతండు భార్యతోఁగూడ వారివెంట విశాలాపురంబున కరుదెంచెను. అతనిరాకవిని ధర్మపాలుం డెదురువచ్చి యతనింగాంచి ప్రహష్టాంతరంగుండై గౌఁగలించుకొని యుచిత సత్కారములతోఁ దీసికొనిపోయి పీఠంబునఁ గూర్చుండంబెట్టి యల్లన నిట్లనియె.

ఆర్యా ! కళావతీ రూపవతుల వెంటఁబెట్టుకొని యెందేగితిరి. ఆ బాలికల దీసికొని వచ్చితిరా ? నాతోఁజెప్పిన నే మీ యానతి నతిక్రమించు వాఁడనా ? ఎందెందుఁ దిరిగితిరి? విశేషములేమి? ఆ కన్యకలును మీరును సేమముగా వచ్చితిరా యని యడిగిన విని యాజన్ని కట్టు నిట్టూర్పు నిగుడింపుచు దేవా ! మీ బాలికల మీ కెరింగింపక విదేశమునకుఁ దీసికొని పోవుదునా? వారు మా యింట నుండఁగనే చెప్పక లేచిపోయితిమి. ఇంత నిక్కువంబు. వారి వృత్తాంతము నాకేమియుఁ దెలియదని నుడువుటయు నా రాజు మూర్చావేశముతో నేలంబడియెను. సామంతులు సేదఁదీర్చి పీఠముపైఁ గూర్చుండఁబెట్టిరి.

అప్పుడు హితవాది యనుమంత్రి మొగంబునఁ గోపం నభినయించుచుఁ దాపనగరాసా ! నీనిడులేమియు సరిపడినవికావు. నీ యుడుము లెరుగుటకై నీకడ నసువులకన్న బ్రియమగు నసువులనిడిన గడియింపక ------------ పోయితినని చెప్పితివి. ఇది యేటినీతి ? వా రిపుడు గనంబడుటలేదు. ------------ దాచితివో లేక ద్రోహము సేసితివో నిక్కము వక్కాణింపుము. -------------- నొడయం డార్తిఁ గృశించుచున్నాఁడు. సత్యవాదివై ప్రాణముఁ గాపాడుకొని------- . తీవ్రముగాఁ బలుకుటయు నతండు చెవులు మూసికొని శివ శివా ! ఎంత------------- హా ! యెంతపాపినైతిని. అక్కటా ! ఎట్టినింద మోసితిని. అన్నా ! పురాకృతమా ! ఎంతచెడ్డవైతివి. ఆహా ! కాళావతీ రూపవతులు నాకేమి యపరాదము సేసిరని వారికి ద్రోహము చేయుదును. నా బిడ్డకన్న వారు దొడ్డవారు -------? అట్టిమాట యనుటకన్న నాకు శిరచ్ఛేదము సేయరాదా? అని పలుకుచు యూరక దుఃఖింపఁ దొడంగెను. ఇతర మంత్రు లతండ నపరాధియనియు హితవాది యపరాధియనియు వాదించుచుండిరి. ధర్మపాలుం డేమాటయుఁ బలుకనేరక విభ్రాంత స్వాతుండై చింతించుచుండెను.

అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలికథ తదనంతరావధంబునఁ జెప్పబూనెను.