Jump to content

కావ్యాలంకారచూడామణి/షష్ఠోల్లాసము

వికీసోర్స్ నుండి

షష్ఠోల్లాసము

—————

శబ్దాలంకారములు

క.

శ్రీశుఁడు హృదయాంతరితగి, రీశుఁడు పదవినమదరినరేశుఁడు విజయా
ధీశుండు [1]విజయతత్పర, వేశుఁడు చాళుక్యవంశవిశ్వేశుఁ డిలన్.

1


క.

శీలింపవలయు మది శ, బ్దాలంకారంబు లైనయమకాదివిచి
త్రాలిఖితబంధభేదము, [2]లోలిన యొకకొన్ని వాని నొనరింతుఁ దగన్.

2


క.

కలయఁబడి రూపకాదుల, కలవడు సంసృష్టిసంకరాఖ్యలు కృతులన్
విలసితమణికనకమరీ, చులకు విమిశ్రమును బోలె శోభాధికతన్.

3

శబ్దసంసృష్టి

క.

తిలతండులములు సరి సరిఁ, గలసినగతి రూపకాదికంబులు తమలో
పల బెరసి యుండు నెచ్చట, లలి నది సంసృష్టి యను నలంకృతి యయ్యెన్.

4


తే.

వృత్త్యమప్రాసపదసమావృత్త మైన, శబ్దసంసృష్యలంకారసంజ్ఞితంబు
వినుమర్దళమంజులధ్వనియుఁబోలెఁ, గర్ణముల కెప్డు [3]నానందకరణ మగును.

5


చ.

గుహ భృగురామ రామ [4]సమకోపవిభూషితవిశ్వ[5]భూమిభృ
ద్బహుబలబాహురాహువు కృపాణముఖోద్ధతిఁ బేర్చి తత్సమి
న్మహి విహరించుచో నహితమండల మైందవమండలంబుగా
విహితవివేకు లై గగనవీథిఁ దలంతురు వేల్పు లాత్మలన్.

6

క్షీరనీరన్యాయసంకరము

తే.

పాలు నీరును గలసి యేర్పడకయున్న
కరణిఁ దద్రూపకాములు బెరయు నెచట
దొరసి యది క్షీరనీరసంకరము నాఁగఁ
గబ్బముల నుండు [6]నంగాంగికములచేత.

7


శా.

[7]సత్త్రాచారము చెప్ప నొప్పు నిల విశ్వస్వామి కెట్లన్న న
ద్ధాత్రీశాధ్వరభోజనంబులను దత్ఖడ్గాహతారిప్రియా
మత్రక్రీడల నిత్యదానముల [8]సమ్యక్ప్రీతి వర్తింతు రా
సుత్రామాదులు నప్సరోగణములున్ సూరీంద్రులుం దద్దయున్.

8

నరసింహసంకరము

క.

లసితాలంకృతిసంధులు, గసిబిసి యై చెదరకుండఁ గల్పించినఁ బొం
దెసఁగెడు సంయోగం బది, రసికులు నరసింహసంకరం బనఁబరఁగున్.

9

మ.

పనితోదగ్రుఁడు విశ్వనాథుఁ డనిలోఁ బర్జన్యుచందంబునన్
గనుపట్టం బటహారవంబు మొరయం గగ్జోపమానోద్ధతిన్
దనరించున్ రుధిరాపగానికరముం దద్యోధబాహుభ్రమ
ద్ఘనకోదండపయోధరప్రవిగళత్కాండావళీవర్షముల్.

10


క.

[9]ఒకతెఱఁ గిది [10]శబ్దార్థ, ప్రకటనములసంకరములు బహువిధము లిలన్
సుకవులు ప్రతిభాఫణితుల, సకలంబు నెఱుంగవలయు శాస్త్రములందున్.

11

అనుప్రాసములు

ఆ.

ఛేక వృత్తి లాట సిద్దంబులగు నను
ప్రాసములు ధరిత్రిఁ బరఁగు మూఁడు
లలితవృత్తి; వానిలక్షణోదాహర
ణములు తెలియవలయు యమకవిధుల.

12

ఛేకానుప్రాసము

క.

ఛేకానుప్రాసం బనఁ, నాకర్షిత మగుచు చొప్పు నర్థము వేఱై
చేకొన్నవ్రాల యెప్పటి, చేకొనఁబడు నేనిఁ గృతుల సిరులకు నెలవై.

13


క.

కందర్పదర్పదము లగు, [11]సుందరరతిహాసరుచుల సుందరి యందం
బందము గూరఁగ శంకర, వందారూదారు విశ్వవరు నర్చించెన్.

14

వృత్త్యనుపాసము

తే.

ఒకటి రెండును మూఁడునై యొలయువ్రాలు
పద్యమున నచ్చటచ్చటఁ బరఁగునేని
వృత్త్యనుప్రాస మన నది విస్తరిల్లు
లలితరీతుల కెల్ల విలాస మగుచు.

15


ఉ.

చొక్కపుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కన పెక్కువ [12]నక్కజంపుట
న్నెక్కక చక్కనై [13]బ్రతుకునిక్క నెఱింగితిరేని శాత్రవుల్
మొక్కల మేఁది మ్రక్కి యని మ్రొక్కుఁడు, మ్రొక్కక నిక్కుచున్న మీ
టెక్కులు చక్కఁబెట్టు విఘటించి చళుక్య[14]నరేంద్రుఁ డిక్కడన్.

16

లాటానుప్రాసము

క.

పాటిగఁ జెప్పిన శబ్ద మ, చాటుగతిన్ సొరిదిఁ బల్కు [15]చక్కద మర్దా
ఘాటోత్కర్షము చేసిన, లాటానుప్రాస మనఁగ లలితం బయ్యెన్.

17


చ.

ధరణిఁ జళుక్యవిశ్వవిభుదానము దానము కీర్తి కీర్తి భీ
కరమగువాలు వాలు రణగర్వము గర్వము గాక కల్పితే
తరనృప[16]నామధారకుల దానము దానమె కీర్తి కీర్తియే
కరమున వాలు వాలె రణగర్వము గర్వమె పౌరుషక్రియన్.

18

శృంఖలన్యాయబంధము

క.

మొదలిపదం బటమీఁదటి, పదయుక్తికి హేతు వగుచుఁ బరువడిఁ గలయన్
దుదపదముతోడ నదికిన, నది శృంఖలమూలబంధ[17]నాఖ్యన్ బెరయున్.

19


చ.

ధరణి శ్రుతంబుచే నఖిలధర్మము ధర్మముచేత నర్థసు
స్థిరతయు నర్థసుస్థిరతచేత బలోదయమున్ బలోదయా
చరణముచే జయావహము సంపదయుం ప్రభవించు విశ్వభూ
వరునకు, నీతిమార్గమున [18]వావిన చేరవే నిత్యభద్రముల్.

20

ఏకావళి

తే.

ఆదిశబ్దంబునకు మీఁద నడరుపదము
దగువిశేషణములతోడఁ దగిలి వరుస
గొలుసుగొని యర్థసంగతిఁ గూడెనేని
యదియు నేకావళిసంజ్ఞ నడరు నండ్రు.

21


చ.

మదిఁ దలపోయ విశ్వవిభుమంజులభాషలు సర్వసంపదా
స్పదములు సర్వసంపదలు సజ్జనసేవ్యలు సజ్జనౌఘమున్
బొదలు విభూతియుక్తము విభూతియు [19]నిత్యసముత్థ యిట్టిభ
ద్రదభరితానుభావ మొకరాజునకుం గలుగంగ నేర్చునే.

22

ప్రతిషేధబంధము

తే.

ఇవియె కవితలఁ దగఁ [20]జెప్ప నెఱిఁగెనేనిఁ
బరఁగుఁ బ్రతిషేధశృంఖలబంధ మనఁగఁ
బదము పదమునఁ బ్రతిషేధఫణితి గలిగి
పటుపదాలంకృతులచేతఁ బాటి యగుచు.

23


తే.

ఎచటఁ బ్రజ లూర్జితశ్రీల [21]నెసఁక మెసఁగ
రది దలంపఁగ నెపుడు రాజ్యంబు గాదు,
విశ్వభూవిభుఁ డేరికి విభుఁడు గాఁడు
పట్టి చూడంగ [22]వారలు ప్రజలు గారు.

24

మాలాదీపకము

క.

మొదలిపదంబున నుండియు,
నుదయోత్కర్షంబు లుత్తరోత్తరముగ నిం
పొదవఁగఁ బరువడి నెలకొను, నది మాలాదీపికాఖ్య మనఁ జనుఁ గృతులన్.

25


చ.

ప్రకటిత మైనవిశ్వవిభుపాణికిఁ బుట్టె [23]వితీర్ణి, యా [24]వితీ
ర్ణి కవితకీర్తి గల్గె, నతినిర్మలకీర్తికి నుద్భవించె నీ
సకలవికర్ణవిశ్రుతులు సజ్జనకర్ణవిభూషణంబు లై
యొకనికి నేల యబ్బు నిటు లొప్పెడు [25]నుత్తమనిత్యసంపదల్.

26

సారాలంకారము

తే.

పలుకుపలుకున కుత్కర్ష బంధసిద్ధి, యుత్తరోత్తరసారమై యోలి నమరు,
నయ్యలంకృతి [26]సారనామాఖ్యఁ జెందుఁ, జెవుల కింపుగ సుకవులు చెప్పిరేని.

27


క.

దేవతలకు వరుఁడు మహా దేవుం డద్దేవుమాళిదెసఁ జరియించున్
జైవాతృకుఁ దాతనికుల, పావనుఁడు చళుక్యవిశ్వపతి యిల నొప్పున్.

28

యమకములు

క.

యమకాదిచిత్రబంధ, క్రమములు బహులములు, వానిగతి భాషాకా
వ్యములకు నుచితములై చన, నమరింతుం గొన్ని వరుసఁ నగుఁ దెలియంగన్.

29


క.

వచ్చినవర్ణంబులు కడు, నచ్చములై మొదల నడుమ నంతమునఁ గవుల్
మెచ్చఁ దదర్థము లలవడి, యచ్చెరువులు గాఁగఁ జెప్ప నగు యమకంబుల్.

30


తే.

ఆదిమధ్యాంతగోచరాఖ్యత్రయంబు
నా మధ్యగతంబు మధ్యాంతగతము
వరుస నాద్యంతగతము సర్వగము ననఁగ
యమకములు సప్తవిధముల నమరు నండ్రు.

31

ఆదియమకము

తే.

ఉక్తశబ్దంబు తుదశబ్ద ముక్తశబ్ద
విధముననె తోఁచి యర్థంబు వేఱ యగుచు
వీనులకు నింపు సొంపును నీనెనేని
నాదియమకంబు నాఁ జను నండ్రు బుధులు.

32


క.

వాసరవాసవధూసువి, లాసములం దెగడి దెగడులలనలమనముల్
వాసించు నాత్మగుణముల భాసురుఁ డగు[27]విశ్వవిభుని పటువిక్రమముల్.

33

మధ్యయమకము

క.

హృద్యార్థం బై పరఁగెడు, పద్యమునకు నిట్ల యమకబంధము నడుమం
బ్రద్యోతించిన నది యన, వద్యంబుగ మధ్యయమకవైభవ మెసఁగున్.

34


క.

శ్రీకీర్తిచంద్రికల వి, ద్యాకైరవవితతు లలరఁ దలకొలిపెడు నీ
పోకుల పో కులపౌరుష, మా కుముదిహితాన్వవాయుఁ డగు భూపతికిన్.

35

అంత్యయమకము

క.

పాదము లుక్తక్రమసం, పాదితగతి నొప్ప [28]తుదను భావాలంకా
రోదయకరమై [29]యమకం, బాదృత మగునేని యంత్యయమకం బయ్యెన్.

36


తే.

లీలఁ జాళుక్యవిశ్వభూపాలవరుని
విజయలక్ష్మీకరగ్రాహవేళ లందుఁ
జెవుల [30]కింపుగఁ దొడరి ఘోషింపఁ దొడఁగె
[31]గతుల కళ్యాణకళ్యాణగౌరవములు.

37

ఆదిమధ్యయమకము

క.

పరపుగఁ [32]బద్మాకర మనఁ, [33]బరికల్పిత మగుచుఁ బరఁగుఁ బద్మాకర మై
ధర నెగడు విశ్వభూవరు, వరసదనము బుధులపాలి వైభవపదమై.

38

మధ్యాంత్యయమకము

క.

పరగండభైరవుని యరి, వరులును ముక్తాతపత్త్రవైభవు లెపుడున్
[34]పరగండభైరవుని కవి, వరులును ముక్తాతపత్త్రవైభవు లెపుడున్.

39

ఆద్యంత్యయమకము

క.

హరిదంబరవిక్రము డనఁ బరఁగుం జళుక్యవిశ్వపార్థివుఁ డనుచున్
బొరిఁ బొగడుదు రరినృపతులు, హరిదంబరవిక్రమప్రయత్నయశస్కున్.

40

సర్వయమకము

క.

వనవర్గనివసదహితుఁడు, వనవర్గప్రీతదివిజవల్లభుఁడు సకృ
ద్వనవర్గశివవయస్యుఁడు, [35]వనవర్గార్కుండు విశ్వవసుధేశుఁ డిలన్.

41

పాదత్రయయమకము

శా.

శస్త్రోదంచితుఁ డైన యవ్విభు విపక్షశ్రేణికి న్విభ్రమ
త్స్వస్త్రీతస్ఫుటకంకణధ్వని రణస్థానంబున న్విభ్రమ
త్స్వస్ స్త్రీతస్ఫుటకంకణధ్వని మరుత్సౌధంబుల న్విభ్రమ
త్స్వస్త్రీతస్ఫుటకంకణధ్వని సరిత్సంగంబులం జేకుఱున్.

42

ద్వితీయోపమానగోపనము

సీ.

విద్యావిభూతి వివేకసంపన్నత వాణీశ వాణీశవైభవంబు
[36]శౌచప్రతాపాతిసత్త్వసమగ్రత శిఖిమిత్ర శిఖిమిత్ర శీలనంబు
గాంభీర్యభోగరంగద్రత్నసామగ్రి జలధీంద్ర జలధీంద్ర విలసనంబు
విక్రమసౌందర్యవిపులదర్పోన్నతి బలభద్ర [37]బలభద్రబంధురంబు


తే.

దాల్చి వెలుఁగొందు విష్ణువర్ధనకులాబ్ధి
చంద్రుతో విశ్వభూపాలచంద్రుతోడ
చంద్రధరపాదభక్తినిస్తంద్రుతోడ
నితరనృపునకుఁ దుల్యత్వ మెట్లు గల్గు.

43

నిరోష్ఠ్యము

క.

పంచమవర్గాక్షరములు, వంచించి హితోచితార్థవంతంబులు గా
వించిన కబ్బము వీనుల, కంచిత మై యది నిరోష్ఠ్య మన నొప్పారున్.

44[38]


శా.

చాళుక్యక్షితినాథునూర్జితయశస్సంక్రాంతిచేఁ దూలు లో
కాలోకాద్రిఁ దనర్చుచీఁకటులు, కైలాసోల్లసద్దీధితుల్

సాలం దెల్లనిచాయలం దనరు, నాశాదంతు లంతంతకున్
గాలాకారత నుజ్జగించు ననుచుం గాంక్షింతు రత్యుక్తులన్.

45

గూఢచతుర్థము

క.

మొదలిచరణత్రయములోఁ, బదిలముగాఁ [39]గవిత నంత్యభాగాక్షరముల్
గదియం గ్రమమున నిల్పిన, నది గూఢచతుర్థ మనఁగ నద్భుత మయ్యెన్.

46


చ.

[40]చతురుఁ బరార్థ్యశీలుఁ గవిశశ్వ[41]దభీప్సితభూరిదానదున్
వితతిభుజానిసర్గబలువిక్రమసన్నుతిసేవితోదయున్
మతి కెదు రెల్ల సేసికొని మాన్యుల కాలము కాని మానులై
చతురులు విశ్వభూవిభుని సన్నుతి సేయుకు రెల్లకాలమున్.

47

చతుర్విధకందము

తే.

ప్రథమకందంబు రెండవపాదయుగము
నందు రెండవగణవర్ణ మాది గాఁగఁ
గడయు మొదలును వరుసతోఁ గలిపి చదువ
నగుఁ జతుర్విధకందమై యార్యసభల.

48

మొదటికందము

క.

చాళుక్యవిశ్వవిభునకు, వాలున్ బుధనుతియు సుగుణవర్గము నిధులున్
జాలుటయు నీతినిరతియు, మేలున్ మధురతయు నీగి మీఱినవిధమున్.

49

రెండవకందము

క.

బుధనుతియు సుగుణవర్గము, నిధులుం జాలుటయు నీతినిరతియు మేలున్
మధురతయు నీగి మీఱిన, విధముం జాళుక్యవిశ్వవిభునకు వాలున్.

50

మూఁడవకందము

క.

చాలుటయు నీతినిరతియు, మేలును మధురతయు నీగి మీఱినవిధమున్
జాళుక్యవిశ్వవిభునకు, వాలుజ్ బుధనుతియు సుగుణవర్గము నిధులున్.

51

చతుర్థకందము

క.

మధురతయు నీగి మీఱిన, విధముం జాళుక్యవిశ్వవిభునకు వాలున్
బుధనుతియు సుగుణవర్గము, నిధులున్ జాలుటయు నీతినిరతియు మేలున్.

52

—————

పంచవిధవృత్తము

క.

సరసిజముఁ గందయుగళము, సరి మొదలినవాక్షరముల సమవృత్తముఁ, ద
త్పరమున మణిగణనికరము, వెరవున రచియింపఁ బంచవిధవృత్త మగున్.

53

సరసిజవృత్తము

శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు నిరి వరఁగుటకై
ధీవిద్యాసంభావితేదేవున్ ధృతియుతు హితజనదివసదినకరున్
శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరపు శశికులశిఖరిమృగపతిన్
భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతరవిధవున్.

54

ప్రథమకందము

శ్రీవిశ్వేశక్ష్మావరు, సేవాశ్రితులు వొగడుదురు సిరి వరఁగుటకై
ధీవిద్యాసంభావిత, దేవున్ ధృతియుతు హితజనదివసదినకరున్.

55

ద్వితీయకందము

శ్రీవర్ణింతున్ [42]భావన, జీవున్ జితరిపు శశికులశిఖరిమృగపతిన్
భావోదంచద్భావిత, భావున్ బ్రతిదినసముదితబహుతరవిభవున్.

56

నవాక్షరవృత్తము

శ్రీవిశ్వేశక్ష్మావరు సేవా, ధీవిద్యాసంభావితదేవున్
శ్రీవర్ణింతున్ [43]భావనజీవున్, భావోదంచద్భావితభావున్.

57

మణిగణనికరము

[44]శ్రితులు వొగడుదురు [45]సిరి వరఁగుటకై, ధృతియుతు హితజనదివసదినకరున్
జితరిపు శశికులశిఖరిమృగపతిన్, బ్రతిదినసముదితబహుతరవిభవున్.

58

—————

క.

తలకట్లు బోడలుం గొ, మ్ములు [46]గలవర్ణములతోడి ముఖ్యపదములున్
గలకబ్బము హ్రస్వస్వర, కలితం బగుఁ గృతుల నరయఁ గవియనుమతులన్.

59

తలకట్లు

క.

వనదఘనవర్యచర్యక, మనవరత ప్రసర దయ నయ క్రమ మఘమ
ర్దనకర మనత మనః కం, పన మరయ శశధరవంకభవమహ మరయన్.

60

బోడలు

క.

స్థితి నిలిచిరి సిరి నించిరి, [47]ధితి మించి విరించివిధికిఁ దివిరిరి [48]శ్రితి ని
ర్మితికి నిలియిచ్చిరి మితిని, క్షితి నిగిడిరి [49]గిరిపతాకిచెంగటివిమతుల్.

61

కొమ్ములు

క.

ఉరుగుణులుఁ గురులుఁ గుకురులు
గురులును బుణ్యులును బుధులుఁ గుతుకులు శ్రుతులున్
సురుచులు [50]సుముఖులు సుఖులును
బురునుతు లుడురాజవంశ్యుఁ బూన్పుదు రెపుడున్.

62

సరిగమపధనులు

క.

నీసరి పని నీసరి ధని, నీసరిమాధారిగరిమ నీసరిగా రీ
నీసరిగా నిగమాగమ, [51]గోసారులునుం జళుక్యకులవిశ్వేశా.

63

గోమూత్రికాబంధము

తే.

వర్ణములు నాల్గుపంక్తుల వరుస వ్రాసి
మూలలం దోలి గోమూత్రలీలఁ జదువ
నుక్తపద్యంబు దా నగు చుండెనేని
దనకు గోమూత్రికాఖ్యబంధంబు నాఁగ.

64

మాలిని

వివిధ నయ విధిజ్ఞున్ విద్ధవీరారిగర్వున్
భువి ధనద విధిజ్ఞున్ బుద్ధసారాభిగమ్యున్
[52]బ్రవరగుణగరిష్ఠున్ భాతవిశ్వేశుఁ గాంతున్
ధవళగుణగరిష్ఠున్ [53]ధాత విశ్వేశుఁ గాంచున్.

65

చక్రబంధము

తే.

[54]వలయనవకంబు [55]నాఱురేఖలు లిఖించి
యందు శార్దూలవిక్రీడితాక్షరములు
వెట్టి నడుచుట్లఁ గవి కృతి పేళ్లు రెండు
చక్రబంధంబునకు నిడి చదువవలయు.

66


శా.

చిత్తోపేతవికస్వరోత్తమగుణున్ శ్రీలంపటున్ సత్క్రియా
విత్తోద్దండును విశ్వభూరమణు నుర్వీకృత్యసత్కృత్యదున్
విత్తాయక్షమతావిధిజ్ఞు మహితున్ [56]వీతిక్రమాతిప్రియా
యత్తుం జూచి నినున్ విశేషవిదుఁగా యాచింపుదున్ దుర్జయా.

67

కుండలిబంధము

క.

[57]ఎనుబది పదములుగాఁ, బెనఁ గొని యుపదేశమునఁ దెలియఁ గుండలిబంధం
బనఁజనుఁ దత్పదములఁ జ, క్కనివ్రాలిడి వరుసఁ జదువఁ గబ్బం బమరున్.

68


మ.

సరతోద్యత్కరవాలభైరవు విరాజద్రాజతేజస్కుఁ జి
ద్గతసత్యస్వరపూతకార్యు వరదున్ దత్కోలఖేలద్ద్వజ
ప్రతిభీత[58]ద్విడధీశనుత్యచరణున్ [59]భావార్థసారజ్ఞు [60]ను
చ్ఛ్రితసారస్వతభూతిసారవిషయున్ జింతింతు సంతుష్టితోన్.

69

ఖడ్గబంధము

క.

తరతరమ పూసనుండియుఁ, [61]బరుజులు దట్టాడి మధ్యపద్ధతి ధారా
పరివృతి నుపదేశక్రమ, పరిచితిఁ బఠియింప ఖడ్గబంధం బయ్యెన్.

70

క.

సమరమహీ[62]మధుమత్సమ, సమధికతం ద్రుంచు విమతశఠులన్ లీలన్
హిమరుక్కులుఁడు మరుత్వ, త్సమసత్త్వతఁ బేర్చుచుండు సర్వజగములన్.

71

—————

ఆ.

ప్రథమయమకచిత్రబంధాదు లొకకొన్ని
తెలుపఁబడియె బుధులు తెలియవలయు
ముర్విఁ బద్మబంధ సర్వతోభద్రాదు
లంధ్రభాషఁ జెప్ప నరిది యండ్రు.

72

————

పదదోషములు

మ.

ప్రతిభాకంపన మబ్బినం గవులచేఁ బాటిల్లు శబ్దార్థ[63]సం
గతదోషంబులు [64]కొన్ని, కొన్ని ధర సత్కావ్యంబులం దైన [65]ను
త్థితవేగాకులితాపగావితతిలో [66]డిండీరపిండాకృతిన్,
[67]ధృతి సందర్భముచోట వానిఁ దగ జింతింపందగున్ సత్కవుల్.

73


క.

పదవాక్యార్ధత్రితయ[68]స, ముదితములై వివిధదోషములు చెవి [69]కసుఖా
స్పదము లగు; వానితెఱఁగులు, మది సుకవుల కెఱుఁగవలయు మఱువక యెపుడున్.

74


సీ.

అప్రయుక్తము నపుష్టార్థకంబును నసమర్థకంబును నిగర్ధాహ్వయంబు
నపసంస్కృతంబు నేయార్థంబు [70]సందిగ్ధనష్టప్రయోజనశ్లిష్టములును
గాఢపరిక్లిష్టగూఢార్థకంబులు నప్రతీతికము నన్యార్థకంబు
నవిమృష్టకవిధేయకాంశంబు నశ్లీలపరుషవిరుద్ధార్థభాషితములు


తే.

ననఁగఁ బదియే[71]డువిధము లై యతిశయిల్లు
గావ్యముల దోషములు పదగతము లగుచు;
వాని నెఱుఁగక రచియించు నట్టికవుల
వేడ్క మెచ్చఁడు చాళుక్యవిశ్వవిభుఁడు.

75

అప్రయుక్తము

క.

దైవతుఁడు గాచుఁ గడుసం, భావన నన [72]నప్రయుక్తి పదమునఁ బరఁగున్
వావిరిఁ బుల్లింగత్వము, దైవతపదమునకుఁ దఱచు దనరక యునికిన్.

76

అపుష్టార్థము

ఆ.

జగతి నెనిమిదింటిసగములో సగ మగు
భుజము [73]లాహనములఁ బొల్లు లగునె
భూపరులకు నన నపుష్టార్థ, మర్ధార్థ
పదము లర్థపుష్టిపదము గామి.

77

అసమర్థము

క.

జనపతి వనధర పరివృత, యనఁ జను[74]ధర నేలె ననఁగ నసమర్థ మగున్
[75]వనధికి నీవనధరపద, మొనరించుట శబ్దసంపదూనత యగుటన్.

78

అనర్థకము

క.

నలి నొప్పెఁ బురుషుఁ డొగిఁ గడు, నలవడియెం బడఁతి యన ననర్థక మయ్యెన్
[76]నలి ననియెడునది యొగినన్, పలుకును బూరణము లంధ్రభాషకు నగుటన్.

79

అపసంస్కృతము

క.

స్పరిశన మతివకు సీతకు, దరిశనము మనోహరంబు దరుణికి ననఁగా
ధర నపసంస్కృత మగుఁ ద, ద్గురుత్వ మాద్యక్షరములఁ గూడక యునికిన్.

80

నేయార్థము

క.

వరునిపయిఁ గూర్మి వనితకు నిరవగ్రహ [77]మెపుడు ననిన నేయార్థ మగున్
నిరవగ్రహశబ్దార్థము, తీరముగ నేతవ్యసరణిఁ దెలియుటచేతన్.

81

సందిగ్ధము

క.

అవనీభృత్కటకం బు, త్సవపద మెల్లపుడు ననిన సందిగ్ధార్థం
బవిరళ మగు నగతట మా, నవపతిపుర సంశయంబు నరులు కొదవుటన్.

82

అప్రయోజనసంశ్లిష్టము

తే.

[78]అప్రయోజనసంశ్లిష్ట మగు సమీర, ణాశనారాతికృతకేతనాగ్రజన్మ
శత్రుకటముల నిల్తురు శత్రు లనిన, నేతదర్థంబు గిరులకు నేఁగి రనుట.

83

క్లిష్టగూఢార్థము

తే.

క్షతజకంజేక్షణలు క్షామగల్లకటలు, ఘనవిదగ్ధాత్మికలుఁ [79]బురికాంతఁ లనఁగఁ
గ్లిష్టగూఢార్థ మనఁ జనుఁ గ్లేశసరణిఁ, దత్తవర్థంబు నెఱిఁగెడి తలఁపుచేత.

84

అప్రతీతికము

క.

క్షితి బాడబులకు మన్యు, [80]స్థితి యుచిత మనంగ నప్రతీతిక మగు వి
శ్రుత బాడబమన్యువులకు, వితతార్థము లెందుఁ బెక్కువిధము లగుటచేన్.

85

అన్యార్థము

క.

ఆదట నింద్రుని జగదా, హ్లాదంబునఁ జంద్రుఁ డనిన నన్యార్థము సం
పాదిల్లు నియతనామ, ప్రాదుర్భావముల నెన్నఁబడకుండుటచేన్.

86

అవిమృష్టవిధేయాంశము

క.

ఉవిదకు మొలనూలు మనో, భవురెండవనారివోలెఁ బరఁగె ననంగా
నవిమృష్టవిధేయాంశం, బవు నతనికి రెండునారు లడరక యునికిన్.

87

అశ్లీలము

క.

వ్రీడామంగళ కుత్సలు, దోడుగ నశ్లీల మనెడు దోషము మూఁడై
[81]జాడపడు గ్రామ్యవచన, క్రీడల; నత్తెఱుఁగు కృతుల గేలిం జేయున్.

88

వ్రీడాశ్లీలము

క.

[82]జనపతికృప మదయుతులై, చనుకుజనులు గుహ్యకేశసన్నిభులును మో
హనరసరుచిపరిపూర్ణులు, నన వ్రీడాశ్లీలదోష మగు నినుచోటన్.

89

అమంగళాశ్లీలము

క.

అన్నున కధిపతి యలుకం గన్నుల [83]నీ రొలుక బట్ట గడుఁ దడిపె ననం
గ్లిన్నశ్మశాన [84]మన్న, ట్లన్నేరనిపలు కమంగళాశ్లీల మగున్.

90

జుగుప్సాశ్లీలము

తే.

[85]నాతి గనయంబు వదలింప నాథుమీఁద
నాభిపంకజగంధ మున్నతిఁ జరించె
నన జుగుప్సాభిధాశ్లీల మయ్యె నింతి
కపుడు [86]పొక్కిలిరొంపికం పర్థ మగుట.

91

పరుషము

క.

కుర్కుర కర్కశ [87]బర్బర, తర్కిత మవ్విటునిసురతతంత్రం బనుచున్
బేర్కొన్నఁ బరుష మనఁ జనుఁ, దార్కొను శ్రుతికటువు ననఁగఁ దజ్జ్ఞులచేతన్.

92

విరుద్దము

తే.

మిత్రుఁ డుదయింపఁ గువలయోన్మేష మొదవె
నన విరుద్దంబు సఖునకు [88]నవని కైనఁ
గలువలకు నర్కునకు నైనఁ [89]గల్గుమైత్ర్య
కారణం బొక్కనెపమునఁ గానఁబడమి.

93

—————

వాక్యదోషములు

క.

ఇవి పదగతదోషంబులు, కవులకు నిటమీఁద వాక్యగతదోషంబుల్
వివరింతుఁ గొన్ని యవియును, వివిధంబులు సూక్ష్మములు వివేకింపఁ దగున్.

94


సీ.

క్రమభంగము విసంధికంబును [90]బునరుక్తికంబును [91]వ్యాకీర్ణకంబు నాఁగ
భిన్నవచస్కంబు భిన్నలింగంబు ఛందోభంగ యతిభంగ దోషములును
న్యూనాధికోపమా న్యూనపదంబులు నట [92]సమాప్తికపునరాత్తకంబు
నశరీరకంబును నధికపదంబుఁ బ్రక్రమభంగము పతత్ప్రకర్షకంబు

తే.

ననఁగఁ బదియేనువిధులఁ గావ్యములయందు
వాక్యదోషంబు లుదయించు; వానిఁ దెలిసి
కబ్బములు చెప్పు నుత్తమకవుల మెచ్చు
విష్ణువర్ధనచాళుక్యవిశ్వవిభుఁడు.

95

క్రమభంగము

క.

శ్రీవిష్ణువర్ధనాఖ్య, క్ష్మావరుకీర్తిప్రతాపమహిమలతో రా
జీవేందీవరమిత్రులు, కావింతురు చెలిమి యనఁగఁ గ్రమభంగ మగున్.

96

విసంధికము

క.

[93]కులఅంబుజఅర్కుం డిల, బలిఇంద్రఉదారుఁ డనెడు[94]పలుకులలో న
చ్చులు హల్లులతోఁ గూడం, గలయక యుండిన విసంధికం బగుఁ గృతులన్.

97

పునరుక్తము

తే.

చక్రి చక్రాయుధుఁడు పోరు సలుపుచోట
ననిన నిది శబ్దపునరుక్త మండ్రు బుధులు
శార్ఙ్గి చాపాస్త్రుఁ [95]డాజి నెసంగునెడల
చేసిన నిది యర్థపునరుక్త మగుఁ దలంప.

98

వ్యాకీర్ణము

క.

తలల వరాహాంక మురం, బుల నాజ్ఞయుఁ దాల్చి విశ్వభూవిభుఁ గొలువం
దలఁపుదు రరు లని చెప్పం, దొలఁగక వ్యాకీర్ణ మనెడురోషం బయ్యెన్.

99

భిన్నవచనము

తే.

అనిశభంగంబులును నసేవ్యములు నైన
యంబునిధు లట్ల [96]గంభీర మగుమనంబు
వశము గా దన్న నది భిన్నవచన మయ్యెఁ
[97]బెక్కుమాటల నొకమాట భేద్య మగుట.

100

భిన్నలింగము

క.

చాళుక్యవిభుఁడు పనుపఁ ద్రి, శూలంబును బోని సేన శూరతచేతం
గూలుదురు వైరు లనిలో, లీలం బొరి నన్న భిన్నలింగం బయ్యెన్.

101

ఛందోభంగము

క.

ఎందును నీరాజున కే, చందంబున లేరు సరి [98]జగంబుల నెల్లన్
[99]సుందరతను శూరత నన, ఛందోభంగంబు గృతులఁ జను దోషం బై.

102

యతిభంగము

క.

చెప్పినయెడ నిలువక వడి, దప్పిన యతిభంగ మనఁగఁ జనుఁ దత్కృతి నీ
[100]చొప్పు నెఱుంగుఁడు తెనుఁగున, నెప్పుడును విరామభంగ మెన్నరు కృతులన్.

103

న్యూనోపమ

తే.

చంద్రతారాభిరామ మై చదలు వొలిచెఁ
బుండరీకాంకకాసారఖండ మనఁగ,
నట్ల చెప్పిన న్యూనోపమాఖ్య యయ్యె
నుపమ తారాపథంబున కూనమగుట.

104

అధికోపమ

తే.

వికలముఖు లైన యరివధూటికలు గ్లాంత
నలినకైరవ లగు గ్రీష్మ[101]నదులభంగి
నైరి నా సధికోపమ యయ్యె నరయ
నందుఁ గైరవ ముపమకు నధిక మగుట.

105

న్యూనపదము

క.

పరగండభైరవునిశ్రీ, చరణంబుల కెరఁగ కున్న సమకూఱె ననే
చరత యన న్యూనపద మగు, [102]పరునకు నరిపదముఁ గవితఁ బఠితము గామిన్.

106

సమాప్తపునరాత్తము

క.

అవనీశుయశము గుణమణి, నివహంబులు [103]నెగడ నెగడె నిఖిలము నిండెన్
గవివినుతులచే ధవళిత, భువనం బనఁగా సమాప్తపునరాత్త మగున్.

107

అశరీరము

క.

కుశలుఁ డగునృపతి సతతము, కృశకులధర్ములను సహజకృత్రిమగుణులన్
బిశునుల నని మును పలుకఁగ, నశరీరము నిగ్రహించు ననుక్రియ నిడమిన్.

108

అధికపక్షము

క.

కరవాలభైరవునిచే, నరుగుదు రరు లర్కమండలాకారములో
సురిఁగి యన నధికపద మగు, నరయఁగ నాకారశబ్ద మధికం బగుటన్.

109

ప్రక్రమభంగము

క.

నారలు చీరలు మధురా, హారంబులు కూర లడవి యాలయ మనఁగాఁ
గూరుం బ్రక్రమభంగము, [104]వారక వనగృహము లేకవచనం బగుటన్.

110

పతత్ప్రకర్షము

తే.

ఏచి [105]మార్కొనుఁ బలులఁ గ్రొ వ్వెసఁగుకిరులఁ
బాఱు మృగములఁ ద్రుంచు [106]నీభటుఁ డనంగ
నడరి విపరీతగతిఁ జెప్ప నగుఁ బతత్ప్ర
కర్షరోషంబు దగ దీనిఁ గానవలయు.

111

—————

అర్థదోషములు

క.

ఇవి వాక్యజాతదోషము, లవిరళముగఁ దెలియుఁ డింక నర్థక్రమసం
భవము లగుదోషముఖలఁ దగఁ, జెవులకుఁ జవు లొదవ [107]నోలిఁ జెప్పెద నొప్పన్.

112


సీ.

వరుస నపార్థంబు వ్యర్థంబు హీనాధికోపమంబులు సంశయోక్తికంబు
నసిమాత్రకంబు నేకార్థంబు భిన్నంబు జరపదక్రమమును బరుషకంబు
నసదృశోపమమును నప్రసిద్ధోపమ మును హేతుశూన్యార్థమును దనర్చు
విరసాహ్వయంబును నిరలంకృతియు విరుద్ధంబు నసంగ[108]తత్వం బనంగఁ


తే.

గబ్బముల సప్తదశదోషఘటన లొదవుఁ
బ్రౌఢి వానికిఁ బాసి సత్ప్రభువు లైన
యుభయభాషాకవీంద్రుల కొసఁగుఁ బొసఁగఁ
జారుతరకీర్తి విశ్వేశచక్రవర్తి.

113

అపార్థము

క.

[109]ధనదునకు నెంద ఱంగన?, లనుములు నాకమునఁ బండునా? పాతాళం
బునఁ బాము లెన్నిగలవో?, యనఁగ నపార్థంబు వాచికార్థము గామిన్.

114

వ్యర్థము

తే.

'మీరు పెద్దలు, [110]కులమును బౌరుషంబు
విశ్రుతంబులు, గుణము [111]లీవితతు, లేల
యధిపుఁ గొలువారు దా?' రన వ్యర్థ మయ్యెఁ
తొలుతఁ బలుకులు భజనహేతువులు గామి.

115

హీనోపమ</pె

క.

[112]కుక్కలునుబోలె దనుజులు
[113]మిక్కుటముగఁ గదుర సురలు మృగములభంగిన్
దిక్కులు చెడి పాఱిరి నాఁ
దక్కక హీనోపమాభిధానంబయ్యెన్.

116

అధికోపమ

క.

అకుటిలగతిఁ గొలఁకులలో, బకములు మునివరులుఁబోలెఁ బరఁగె ననంగాఁ
బ్రకటిత యగు నధికోపమ, సుకవిత నీరెండుఁ జొనుప శూన్యం బయ్యెన్.

117

సంశయము

క.

నీ వన్నపలుకు చెప్పిన, నావెలఁదికి నలుగ నేల యన సంశయ మై
భావింపంబడు నీ వను, నావెరవున నన్న గామి నవ్యార్థం బై.

118

ఏకార్ధము

క.

మలయసమీరము మలసెను, మలఁగొనియెఁ బటీరశైలమారుత మనుచుం
బలికిన యర్ధమ క్రమ్మఱఁ, బలుకుట యేకార్ధ మండ్రు ప్రతిభావంతుల్.

119

అతిమాత్రము

క.

అతిమాత్రం బగు నతిభా, షితమున నేకోదకమునఁ జెడు జగ మనుచున్
మితముగ నరిసతు లేడ్చినఁ, బ్రతతాకృతి నదులు వర్వె బాష్పజలములన్.

120

భిన్నసంబంధము

క.

నలువ భవదహితకీర్తులు, నలుపులు గావించుతలఁపునం జేసి సుమీ
మలినత్వము కుజనమనః, స్థలముల నిడె ననఁగ భిన్నసంబంధ మగున్.

121

అపక్రమము

తే.

పురుషుఁ డొక్కండు పరిణయంబునకు మున్న
వరుస సమకూర్చె సీమంతపరికరములు
అన నపక్రమ మండ్రు [114]కృత్యంబు గడచి
[115]యవలిపని సేయు నని [116]చెప్పునట్టికృతుల.

122

పరుషము

క.

వేఁడెడునర్థులఁ గనుఁగొన, వాఁడికుఠారమునఁ జెండవలదా యను [117]నీ
సూఁడరిమాటల పరుషము, [118]పోఁడిమి చెడు నట్టియర్థములఁ గబ్బములన్.

123

అసదృశోపమ

క.

వసుధాపతి కోపాగ్ని, ప్రసరంబులచేత రజతపర్వతభంగిన్
వెస వెలిఁగెఁ బోర ననఁగా, నసమత నిది యసదృశోపమాహ్వయ మయ్యెన్.

124

అప్రసిద్ధోపమ

తే.

బాష్పకణకీర్ణ మై యొప్పుఁ బణఁతిమోము
మంచు నిండినతొగపువ్వుమాడ్కి ననిన
నప్రసిద్ధోపమార్థ మై యడరు నండ్రు
కుముదముఖముల కుపమాప్తి గూడ కునికి.

125

హేతుశూన్యము

తే.

[119]చర్మగోరక్షణార్థంబు చంపుఁ బులుల
ననక మిన్నక పులివేఁట లాడు నృపుఁడు
శూరుఁ డై యన్న నది హేతుశూన్య మయ్యె
నిష్ప్రయోజనకథన మై నివ్వటిలుట.

126

విరసము

క.

[120]తలఁపపు చూపులు నిద్దపు, టెలనగవులు నింత యొప్పునే భయమున ని
చ్చలు చను సరిసతులకు నన, విలసనసమయంబు గామి విరసం బయ్యెన్.

127

నిరలంకృతి

క.

నీచుఁడు సభలోపల దు, ర్వాచాలత నాత్మదోషవంచితుఁ డగు నా
నేచును నిరాలంకృతి యై, యీచంద మలంకృతులకు నెక్కక యునికిన్.

128

విరుద్ధము

ఆ.

చర్చ సేయ జగదసమ్మత మగునర్థ
మది విరుద్ద మనఁగ నతిశయిల్లు
దేశ కాల లోక [121]ది క్సమయక విరు
ద్ధాహ్వయములచేత నైదు నాఁగ.

129

దేశవిరుద్ధము

క.

మరుదేశంబునఁ బెక్కులు, పరిపూరితసలిలనదులు పరఁగి పిపాసా
తురులఁ [122]దనియించు నాఁగా, ధర దేశవిరుద్ధ మయ్యె దజ్జ్ఞుల కెల్లన్.

130

కాలవిరుద్ధము

తే.

[123]గ్రీష్మకాలంబు మత్తిలి కేకు లాడె
నింద్రగోపంబు లిలమీఁద నెల్లఁ బొడమెఁ
జాఁగెఁ ప్రథమాంబువులకు నై చాతకంబు
లనఁగఁ గాలవిరుద్ధసమాఖ్య మయ్యె.

131

లోకవిరుద్ధము

క.

ఘనగజకుంభంబులలో, మొనయుఁ బ్రవాళంబు వెలయు ముత్తెపుగము ల
య్యెనుఁబోతులకొమ్ములలో, నన లోకవిరుద్ధ మయిన యర్థముఁ దలపన్.

132

దిగ్విరుద్ధము

క.

ఉదగంబుధివీచుల ను, న్మదుఁ డై క్రీడించె దాక్షిణాత్యుఁ డనంగా
మదిలో వినియెడు[124]వారల, యెద నించును దిగ్విరుద్ధ మనునర్థం బై.

133

సమయవిరుద్ధము

క.

అమరఁగఁ బులితోలును మ, స్తమునం బలుజడలు దాల్చి సౌగతుఁ డొప్పెన్
హిమకరశేఖరుగుడి నన, సమయవిరుద్దార్ధ మగుచుఁ జను సత్కృతులన్.

134

అసంగతి

తే.

శ్రుతము [125]శాంతియు నితనికిఁ జుట్ట లనక
దయయు దానంబు నితనికి [126]దయిత లనక

జోడు దప్ప [127]నసంగతి స్తుతి యొనర్పఁ
బద్యములయందు సహచరభ్రంశ మయ్యె.

135


క.

ఈదోషంబులు మొగి న, ర్థోదిరములు పూర్వభాషితోదారశ్లే
షాదిగుణంబులతోడం బ్ర, మోదంబునఁ గూడి యొసఁగు ముఖ్యార్థములన్.

136


క.

శ్రుతిపరుషత మానుటకై, మతిఁ గర్తవ్యంబు సౌకుమార్యము చెప్పన్
జతురతఁ గాంతి ఘటించుట, వితతగ్రామ్యార్థహరణ విశ్రుతిఁ జేయున్.

137


క.

కృతుల [128]నపుష్టార్థప్రవి, హతికొఱకై చొనుపవలయు నర్థవ్యక్తిన్,
వితతన్యూనాధికపద, యుతిహతికై సమత చెప్ప నొప్పుం గవితన్.

138


తే.

అనుచితార్థనిరాకరణాప్తికొఱకు
నగు నుదాత్తతఁ కావ్యంబులందుఁ జొనుప
యుక్తపాదవిసంధివిచ్యుతి యొనర్చు
పనికి నూర్జస్వి కర్జంబు పద్యములను.

139


ఆ.

తుదిఁ బతత్ప్రకర్షదోషాపహతికి నై
యుక్తి రీతిఁ గావ్య మొగి నొనర్ప
నప్రతీతికపరిహారంబుకొఱకు నై
సుప్రసారగుణముఁ జొనుపవలయు.

140


క.

[129]చ్యుతసంస్కృతి మానుటకై, యతిమధురసుశబ్దవృత్త మగు నొనరింపన్,
బ్రతతప్రక్రమభంగా, హతి కై సంక్రమతఁ గూర్ప నగు నండ్రు బుధుల్.

141


క.

ప్రే[130]యోలంకారము దా, శ్రేయం బగుఁ బరుషదోషశిథిలతకొఱకై
చేయఁ దగుసూక్తితంత్రము, హేయాశ్లీలంబుఁ [131]దొలఁగ నెగుచుటకొఱకై.

142


క.

ఇత్తెఱఁగున మఱియు గుణా, యత్తాలంకారసరణు లరసి కవీంద్రుల్
చిత్తంబున రోషోదయ, వృత్తం బెడలించి కవిత విరచింపఁదగున్.

143

—————

చ.

విరహితవైరికై భువనవిశ్రుతసద్గుణరత్నహారికై
నిరుపమకీర్తికై యువతినిర్మథనక్షమచారుమూర్తికై
విరచితవృద్ధికై సమరవీరవిరాజితజైత్రసిద్ధికై
పరిచితశక్తికై గిరిశపాదపయోజనిషక్తభక్తికై.

144


క.

పరగండభైరవునకై, యరిమానసచండడిండి[132]మారావునకై
కరవాలభైరవోర్జిత, బిరుదునకై నతవినుత[133]నిభృతవరదునకై.

145

తరలము

సుజనపోషణశాలికై [134]రణశూరతావనమాలికై
రజనినాథకులాగ్రగణ్యవిరాజికై [135]జయవాజికై

గజభుజంగమభారవారణకారికై యవికారికై
విజయవిక్రమధర్తకై మనవిశ్వభూవరభర్తకై·

146

గద్యము
ఇది శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన వివిధబుధ
విధేయ విన్నకోట పెద్దయ నామధేయవిరచితం బైనకావ్యాలంకార
చూడామణి యనునలంకారశాస్త్రంబునందు విమిశ్రితాలంకార
యమకాద్యనుప్రాసచిత్రబంధచిత్రసందర్భదోషగుణ
నిరూపణప్రభృతిపంచమం బన్నది
షష్ఠోలాసము.

—————

  1. చ. విద్యాతత్పరవేశుఁడు
  2. గ.చ. లోలిన నొకకొన్ని
  3. క.గ.చ. ఆనందకరణ మగుచు
  4. చ. సమకోపవిభూప్రియ
  5. క. భూమిభుగ్బహు
  6. క. అంగాంగికతనచేత, గ.చ. అంగాంగికలనచేత
  7. క.గ.చ. క్షత్రాచారము చెప్పనొప్పు
  8. క. సమ్యక్ప్రీతిఁ గీర్తింతురు
  9. గ.చ. ఒకతెఱఁ గిడి
  10. గ.చ. శబ్దార్థప్రకటమ్ముల
  11. క.గ.చ. సుందరదరహాసరుచులు
  12. చ. అక్కజంపు నన్నెక్కక
  13. క.గ.చ. బ్రదుకనిక్క
  14. క. నరేంద్రుఁ డక్కడన్
  15. గ.చ. చక్కడమర్థా
  16. క.గ.చ. నామధారికుల
  17. క.గ.చ. ఆఖ్యం బడయున్
  18. క. వాలికఁ జేరవె, గ.చ. వాలినఁ జేరవె
  19. క. నిత్యసమృద్ధ, గ.చ. నిత్యసమృద్ధి
  20. క.గ.చ. చెప్ప నెఱిఁగిరేని
  21. క.గ.చ. ఎసఁగ మెసఁగ
  22. క.గ.చ. వారును బ్రజలు గారు
  23. గ. వితీర్ణయా
  24. క.గ.చ. వితీర్ణికి సితకీర్తి
  25. క.గ.చ. ఉత్తమనిత్యసంతతుల్
  26. చ. సారసమాఖ్యఁ జెందుఁ
  27. క.గ.చ. విశ్వవిభుని పటువిభ్రమముల్
  28. క.గ.చ. సరసభావాలంకార
  29. క.గ.చ. యర్థం బాదృతము
  30. గ.చ. ఇంపుగఁ జెలఁగి
  31. గ.చ. నతులకల్యాణ
  32. క.గ.చ. పద్మాకరమున
  33. క.గ.చ. పరికల్పిత యగుచు
  34. క.గ.చ. కరవాలభైరవుని కవి
  35. గ.చ. వనవర్గాంకుండు
  36. చ. శౌచప్రతాపాది
  37. క.గ.చ. బలభద్రబంధురతయు
  38. ఈపద్యము తరువాత గ.చ ప్రతులలో నీకందపద్య మధికముగాఁ గన్పట్టుచున్నది.
    క. శరణాగతజనరక్షక
       ధరణీరథ(ధర) శీతశైలఁ(దళితశైల)తనయేశ లస
       ద్ధరిణాంక కళాధర శం
       కర శాంత దయాసనాథ కాశీనాథా!

  39. క.గ.చ. కవితనంత్యపాదాక్షరముల్
  40. క.గ.చ. చతురుఁ బదార్థశీలు
  41. గ.చ. అభీహితభూరిదానదున్
  42. క.గ.చ. పావనజీవున్
  43. క.గ.చ. పావనజీవున్
  44. గ.చ. శ్రితులు వరగుదురు
  45. గ. సిరి గలుగుటకై
  46. క.గ.చ. గలవర్ణములనైన
  47. క.గ.చ. ధిృతిమించి
  48. క.గ.చ. కిృతినిర్మితికినిరియించిరి
  49. క.గ.చ. కిరిపతాకిచేఁ గవివితతుల్
  50. గ.చ. సుముఖులునుందుం
  51. క.గ.చ. గోసారులు నై చళుక్య
  52. క.గ.చ. ప్రవణగుణగరిష్టున్
  53. గ. భావవిశ్వేశుఁ గాంచున్
  54. క. వలయదశకంబు
  55. గ.చ. ఆఱుఱేకులు లిఖించి
  56. గ.చ. వీతిక్రమాతిక్రియా
  57. క.గ.చ. ఎనబది పదములుగా
  58. క.గ.చ. ద్విషధీతనుత్య
  59. క.గ.చ. భావార్ధసార్థజ్ఞు
  60. క. తచ్ఛ్రితసారత్వవిభూతి, గ.చ. నంచితసారత్వవిభూతి
  61. క. పురుజులదట్టాడి, గ.చ. పురుజులందట్టిడి
  62. క. మధుభిత్సము
  63. క.గ.చ. సంగతిదోషంబులు
  64. చ. కొన్ని గల్గు ధర
  65. గ.చ. ఉద్ధతవేగాకుల
  66. క.గ.చ. డిండీరఖండాకృతిన్
  67. క. ధృతి సంధ్యర్థముచోట
  68. క.గ.చ. సముదితములగు
  69. క.గ.చ. అసుఖాస్పదములగు
  70. క.గ.చ. సందిగ్ధకష్టప్రయోజన
  71. ను
  72. క.గ.చ. అప్రయుక్తపదమన
  73. క.చ. ఆహవమునఁ బొల్లలగునే, గ. ఆహవమునఁ బోలలగునే
  74. క.గ.చ. ధర యేలె ననఁగ
  75. క.గ.చ. వనధికినై వనధరపదము
  76. క.గ.చ. వలవనియెడ నలి నొగినను
  77. చ. ఎపుడుననఁగ
  78. క.గ.చ. అప్రయోజకసంక్లిష్ట
  79. క.గ.చ. పురికాంత లనిన
  80. క.గ.చ. స్థితి యుచితమె యనంగను
  81. క. జూడఁబడు
  82. గ.చ. జనపతికృత
  83. క.గ.చ. నీరొలికి పట్టుఁగడు
  84. చ. అన్నట్లన్నారని, గ. అన్నట్లన్నరస
  85. క. నాతి కనయంబు
  86. క.గ.చ. పొక్కుడురొంపి
  87. గ. బర్కరతర్కిత
  88. గ.చ. అవనిపైని
  89. క.గ.చ. కలుగు మిత్రకారణంబు
  90. క.గ.చ. పునరుక్తకంబును
  91. క.గ.చ. వ్యాకీర్ణంబునౌల
  92. క.గ.చ. సమాప్తితపునరాత్మకంబు
  93. ఈపద్యమున, ప్రతుల మూడింటను సంధులు కలిసియే యున్నవి.
  94. క.గ.చ. పలుకులతో నచ్చులు
  95. క.గ.చ. ఆజికిఁ జాగునెడల
  96. క.గ.చ. గంభీర మరిమనంబు
  97. క.గ.చ. పెక్కుమాటల కొకమాట
  98. క.గ.చ. జగమ్ముల నెల్లన్
  99. గ. సుందరతను శూరతనానన
  100. క.గ.చ. చొప్పున నెఱుఁగఁడు
  101. క.గ.చ. నదులభంగు లైరి
  102. క.గ.చ. పరునకు ననుపదము
  103. క.గ.చ. నెగడె నెగడి
  104. క.గ.చ. వైరికి వనగృహము
  105. క.గ.చ. మార్కొనుఁ బులుల
  106. గ.చ. ఈభటుఁడు నాఁగ
  107. క.గ.చ. ఓలిఁ జెప్పెదు నొప్పన్
  108. క.గ. తత్వంబు ననఁగఁ
  109. క.గ.చ. ధనదులకు
  110. క.గ.చ. కుల మురుపౌరుషంబు
  111. క.గ.చ. ఈవిమతు లేల
  112. క.గ.చ. కుక్కలును బోని దనుజుల
  113. క.గ.చ. మిక్కుటమునఁ గదరి
  114. క.గ.చ. కృత్యంబు గదిశి
  115. క.గ.చ. ఔలఁ బని సేయునని
  116. క.గ.చ. చెప్పునట్టికవిత
  117. క. నీచూడరిమాటలు, గ. నీచూడనిమాటలు
  118. క.గ.చ. పోడిమి చెడునిట్టి
  119. గ. శర్మగోరక్షణార్థంబు
  120. క. సొలపపుచూపులు, గ. తలపపుచూపులు, చ. తలవపుచూపులు
  121. గ.చ. దిక్సమయజవిరుద్ధ
  122. గ.చ. దనియించు ననఁగ
  123. గ.చ. దేశకాలంబు మత్తిలి
  124. క.చ. వారల నదరించు, గ. వారల నదలించు
  125. గ.చ. శాంతము నితనికి
  126. క.గ.చ. దైతు లనక
  127. క.గ.చ. అసంగతస్తుతి
  128. క.గ.చ. అపుష్టార్థార్థవిహతి
  129. క. చ్యుతిసంస్కృతి, గ.చ. చ్యుతిసంస్మృతి
  130. క.గ.చ. అలంకారము గడుశ్రేయంబు
  131. క.గ.చ. తొలఁగ నేఁగుటకొఱకై
  132. క.గ.చ. మారవునకునై
  133. గ.చ. విభృతవరదునకై
  134. క.గ.చ. నయశూరతా
  135. చ. జయదాజికై, గ. యజదాజికై