Jump to content

కావ్యాలంకారచూడామణి/పంచమోల్లాసము

వికీసోర్స్ నుండి

పంచమోల్లాసము

—————

అలంకారములు

క.

[1]శ్రీకాళీపతిపదనా, ళీకస్మృతిలోలచిత్తలీలావిజయ
శ్రీకర కులజలరాశిసు, ధాకర చాళుక్యవిశ్వధరణీనాథా!

1


కా.

కావ్యశ్రీల నలంకరించుట నలంకారంబు లై చాల శ్రో
తవ్యార్థంబుల నొప్పి పూర్వకృతసందర్భంబులం బెక్కు లు
ద్భావ్యప్రోక్తుల నాఱు ముప్పదియు నై భాసిల్లు వానిం గవి
స్తవ్యాద్యుక్తపదస్వరూపములుగా సాగింతు శాస్త్రక్రియన్.

2


వ.

[2]అది యెయ్యది యనఁగా— స్వభావాఖ్యానంబును, నుపమయు, రూపకంబును,
దీపకంబును, నావృత్తియు, నాక్షేపంబును, నర్థాంతరన్యాసంబును, వ్యతిరే
కంబును, విభావనయు, సమాసోక్తియు, నతిశయోక్తియు, నుత్ప్రేక్షయు, హే
తువును, నుదారంబును, సూక్ష్మంబును, లవంబును, గ్రమంబును, ప్రేయస్కం
బును, రసవంతంబును, నూర్జస్వియు, పర్యాయోక్తియు, సమాహితంబును,
నుదాత్తంబును, నపహ్నుతియు, శ్లిష్టంబును, విశేషోక్తియు, దుల్యయోగితయు,
విరోధంబును, నప్రస్తుతస్తుతియు, వ్యాజస్తుతియు, నిదర్శనంబును, సహో
క్తియు, పరివృత్తియు, నాశీర్వచనంబును, వక్రోక్తియు, భావికంబును, నన
నర్థాలంకారంబులు షట్త్రిశ[3]త్ప్రకారంబు లై వర్తిల్లుఁ దత్స్వరూపోదాహర
ణంబుల పరిపాటిం జెప్పుదు. నందు స్వభావాఖ్యానం బెట్టి దనిన.

3

స్వభావాఖ్యానము

క.

జాతిగుణద్రవ్యక్రియ, లేతెఱఁగున నుండు నట్ల యింపుగఁ జెప్పన్
బ్రీతి స్వభావాఖ్యానము, [4]జాతి యనం బరఁగు నదయు శాస్త్రజ్ఞులచేన్.

4


శా.

నీలశ్రీలఁ దనర్చి [5]నిర్మలము నై నిస్తంద్రసౌరభ్య మై
చాలం బేశలరూప మై చులుక నై శాతోగ్రధారాగ్రరే
ఖాలంకారిక మై దృఢత్సరుసముద్యన్మేఖలాబద్ధ మై
[6]వా లొప్పుం గరవాలభైరవజయావాలక్రియాశీల మై.

5


క.

జాతిగుణద్రవ్యక్రియ, లాతతజీవితము లందు రార్యులు శాస్త్ర
వ్రాతములకు సత్కివితా, జాతములకు; వీనిఁ బొసఁగఁ జనుఁబో నొడువన్.

6

ఉపమ

క.

గుణధర్మకర్మముల ను, ల్బణ మయ్యెడువస్తువునకుఁ బరువడిఁ దుల్య
ప్రణయనముఁ జేయా నెయ్యది, గణుతింతురు దాని నుపమగా బహువిధులన్.

7

శా.

చాళుక్యక్షితిపాలుఁ డొప్పు ననిలో శక్రుండునుంబోలె, దం
భోళిక్రీడఁ దనర్చు ఖడ్గ, మసుహృద్భూపాలకశ్రేణులుం
గూలుం గొండలభంగి, నంబరనటత్కోలధ్వజంబుం బొరిం
గ్రాలుం గాలవలాహకాకృతి, సురవ్రాతంబు గీర్తింపఁగన్.

8


క.

సతతప్రతిభోదయసం, గతి నుపమానోపమేయకల్పనములయం
దతిచతురకవులతలఁపులఁ, [7]బ్రతిపాద్యోపమలు పెక్కుభంగు లెఱుంగన్.

9


క.

లింగంబుల వచనంబుల, భంగులు హీనాధికతలపాటియు వీడ్పా
టుం గదిరిన నుపమకు [8]నిం, పుం గలుగం జేయం నండ్రు బుధు లుచితోక్తిన్.

10


తే.

అరుగుచున్నాఁడు పేడివాఁ డతివపోలెఁ,
బలుకుచున్నది పురుషునిపగిది నింతి,
ప్రాణములు నాకు నీతఁ. డుపార్జితార్థ
మిన్నివిద్యలు ననినను నెసఁగు నుపమ.

11


క.

దేవా, నీ చందంబున, దేవేంద్రుం డొప్పు నంట దినకరుగతి ను
ర్వీవరుఁడు తేజమున సం, భావితుఁడన నుపమ చెల్లు [9]బ్రౌఢప్రియ మై.

12


క.

నిపుణుల[10]చెవి కెఱబఱ మగు, నుపములు నొకకొన్ని గలవ యొక్కొకచోటన్
క్షపవోలె జముఁడు కృష్ణుఁడు, విపినంబునుబోలె [11]వనధి విఫలం బనఁగన్.

13


ఆ.

హంసివోలెఁ [12]జంద్రుఁ డవగాతుఁడు, నభంబు
కొలఁకులట్లు సిడము, కుక్కవోలె
నించు బంటు పతికి, నినుఁబోలె ఖద్యోత,
మనెడు [13]నుపమ లసహసనకరములు.

14


సీ.

సంకాశ నీకాశ సన్నిధ ప్రతిరూప తుల్య ప్రకాశాభ తులితములును
ప్రత్యనీక ప్రతిపక్ష సమాన ప్రతిద్వంద్వ నిభ సజాతీయములును
సదృశ సదృ క్సమ సంవాది సప్రభ ప్రతిబింబజ కోపమా ప్రఖ్యములును
[14]సహలక్షణ ప్రతిచ్ఛంద విరోధి సదృక్ష సవర్ణ సపక్షములును


ఆ.

నుపమితానువాది యుత సరూప ప్రతి
నిధులు ననఁగఁ బెక్కువిధములైన
శబ్దములును నట్టి స[15]త్క్రియాపదములుఁ
బొలుచుచోటఁ జెప్పఁ బొసఁగు నండ్రు.

15


క.

[16]దొరయు గెడ జోడు పోలిక, సరి సంగడి యుద్ది యీడు [17]సాటి పగిది నా
గరణి యనఁ జాడ్పు చందం, బొరసు [18]పరుసు నాఁగ నుపమ కొప్పుం జెప్పన్.

16

రూపకము

క.

ఉపమానంబునకును న, య్యుపమేయంబునకు రూపయోజన మేకో
ల్లపిత మయి వెలుఁగు నెచ్చటఁ, [19]బ్రపంచితము రూపకంబు [20]బహువిధలీలన్.

17

ఉ.

చారుచళుక్యవిశ్వనృపచంద్రుని నిర్మలకీర్తిచంద్రికా
సారముచే సుహృత్కుముదసంచయముల్ విలసిల్లు గర్వదు
ర్వారవిరోధివారిరుహవారములున్ ముకుళించు నుల్లస
త్సూరి[21]చకోరసంఘములు సొంపు వహించు ధరాతలంబునన్.

18


వ.

ఇది ప్రసిద్ధరూపకాలంకారం; బిందు భ్రాంతిమదలంకారంబునుం గల; దది
యె ట్లనిన.

19

భ్రాంతిమంతము

క.

కవిసమ్మతి నారోప్య, ప్రవణానుభవంబు భ్రాంతిపద మగుఁ దత్సం
భవ మయ్యెడుదానికిఁ బే, రవిరళముగ భ్రాంతిమంత మనఁగాఁ బరఁగున్.

20


క.

చంద్రాన్వయుఁ డగువిశ్వన, రేంద్రుని సత్కీర్తిదీప్తు లేపారుటయున్
[22]సాంద్రతరంబుగ నెల్లెడఁ జంద్రశిలాతతులు పరఁగు సద్రవ లగుచున్.

21


క.

సుకవినిరూపణములచేఁ, బ్రకటిల్లుచు రూపకములు బహులాకృతు లై
వికసిల్లు వానితెఱఁగులు, వికటంబులు తెలియవలయు వివిధస్మృతులన్.

22

దీపకము

ఆదిదీపకము

క.

[23]మొదలను నడుమను నొండెన్, గదిసి క్రియాపదము యొండెఁ గారక మొండెన్
[24]బొదలి తదర్థము దెలిపెడు, నది దీపక మనఁగఁ [25]గృతుల నందం బెపుడున్.

23


శా.

కావించుం గులధర్మ మెప్పుడుఁ జళుక్యక్ష్మావిభుం డొప్పుగా
దేవశ్రేణి మదింప దిక్కరులు మోదింపన్ ధరాభారభృ
ద్గ్రావవ్రాతము సంతసిల్ల భుజగేంద్రప్రీతి సంధిల్ల న
వ్యావిర్భూతపృథుం డితం డనఁగ దివ్యశ్రవ్యకీర్తీశుఁ డై.

24

అంత్యదీపకము

క.

నల నహుష భరత భానుజ, [26]బలి బలిభేదులకు సాటి పాటి తులితుఁ డ
గ్గలికుఁడు గెడ సదృశుం డన, వెలయుం జాళుక్యవిశ్వ[27]విభుఁ డెల్లెడలన్.

25

మధ్యదీపకము

మ.

కవిసంఘంబునకుం బటీర పటికా కస్తూరికా చేటికా
వివిధశ్రీల విభూతియున్ విజయమున్ [28]విశ్వేశ్వరుం డిచ్చుఁ బో;
భువి సర్వజ్ఞుఁడు శంకరుండు నగుటన్ బోలించి శీలించినన్
భవనామస్తుతి భద్రదాయిని గదా భావింప నెవ్వారికిన్.

26

ఆవృత్తి

క.

చెప్పినమాటయ పెక్కుగఁ, జెప్పుట యావృత్తి యనఁగ జెలు వగు; నదియున్
దప్పక మూఁడుదెఱంగుల, విప్పఁ బదార్థోభయానువృత్తులఁ బరఁగున్.

27

శబ్దావృత్తి

క.

అరు లని విశ్వేశ్వరునకుఁ, దిరుగక క్రీడింతు రమరదీర్ఘికలోఁ ద
[29]త్పురవరపరిఖాతాయత, సరసులఁ గ్రీడించుఁ గ్రోడసంతతు లెపుడున్.

28

అర్థావృత్తి

క.

శ్రీవిశ్వవిభుని వేఁడిన యావిప్రులు విత్తవంతు లగుదురు, వారిన
వావిరి నడిగినవారును, నావల ధనవంతు లగుదు రతిచిత్రముగాన్.

29

ఉభయావృత్తి

క.

ధరణివరాహం బగుపతి, ధరణి వరాహంబవోలెఁ దాల్చిన నేకా
తురచరణ మైనధర్మము, కరిగతి [30]నలుగాల నిలిచెఁ గలియుగవేళన్.

30

ఆక్షేపము

క.

తొడఁగినకృతకృత్యంబుల, [31]నడఁచునిషేధోక్తి దలఁప నాక్షేప మగున్
బెడఁ గగు సుకవులతలఁపుల, బడిఁ గాలత్రితయవిధుల బహుగతు లగుచున్.

31


ఉ.

'వారక విశ్వభూవిభునివాలున కగ్గము గాకుఁ, డైతిరే
నీరస మబ్బు మిమ్ము వరియించిన వేలుపుఁబువ్వుఁబోండ్లకున్
ధీరత మంట వెంట నరుదెంచినతెంపున మాకు' నంచు వా
గ్వీరము వీరభార్య లెఱిఁగింతురు భర్తల కాహవంబునన్.

32

అర్థాంతరన్యాసము

తే.

చెప్పఁదొడఁగినయర్థసంసిద్ధికొఱకు
[32]వేఱ యర్థము యోజించి వెలయఁ దెలుప
నదియ యర్దాంతరన్యాస మనఁగఁ బరఁగుఁ
దలఁప నేర్చినఁ బెక్కు భేదముల నెగడు.

33


మ.

[33]క్షమలో వేఁడనివారికేనియును విశ్వక్ష్మావిభుం డిచ్చు న
చ్చములై పొచ్చెము లేనిసంపదల శశ్వత్సర్వలోకాశ్రయ
త్వము, నై జంబుగ నట్ల కాదె తలఁపన్ వాంఛార్థహీనస్ఫుర
త్కమలోజ్జృంభణకల్పనంబు రవికిన్ గర్జంబు మి న్నందియున్.

34

వ్యతిరేకము

క.

అమరఁగ శబ్దార్థంబులు, క్రమతుల్యము లయ్యె భేదకథనముచే వ
ర్ణ్యము నతిరిక్తముఁ జేయుట, నమితవ్యతిరేక మసఁగ నగుఁ బలుకుబడిన్.

35


మ.

సుమనోరక్షణవైభవంబులను జిష్ణుత్వంబునం గ్రూరవి
క్రమవిద్విడ్బలమర్దనంబున సుధుర్యత్వంబు తుల్యంబపో,
యమరాధీశుఁడు గోత్రభంజనుఁడు గోత్రానందసంపాది వి
శ్వమహీపాలుఁడు, వీరికిన్ గుణకథాసాదృశ్య మేచందమో.

36

విభావన

తే.

సహజవిఖ్యాతహేతువు జాఱ విడిచి
కారణాంతరకల్పనకథన మొండెఁ
[34]గామవిహితస్వభావసంగతియ యొండె
నమరఁ బల్క విభావన యనఁగఁ బరఁగు.

37


మ.

[35]స్ఫురదాధ్మాతకరాళకీలమును దంభోలిప్రభాభీలమున్
[36]జలదస్పష్టకృతాంతదండమును నై సంగ్రామరంగంబులోఁ
గరవాలంబు చళుక్యవల్లభునిచేఁ గ్రాలుం బరప్రాణసం
హరణక్రీడనదృష్టమృత్యురసనాహంకారఘోరంబుగన్.

38

సమాసోక్తి

క.

[37]తగు వినిహితార్థగర్భిత, యగు నాన్యార్థోక్తి గతి సమాసోక్తి యగున్
సుగమార్థగోపనముచే, నెగడిన నన్యాపదేశనియతిం బడయున్.

39


మ.

స్ఫుటపున్నాగములం దొఱంగి కితనస్తోమంబుఁ బాటించి యు
తకటపంకాంకిత[38]మూర్తులం గదిసి భద్రశ్రీలపైఁ గూర్మి దు
ర్ఘటముం జేసి సువర్ణముం దెగడి [39]దుర్వర్ణంబు నర్థించి యే
చుటలం జెందిన మెచ్చునే నృపతులన్ సోమాన్వయుం డుర్వరన్.

40

అతిశయోక్తి

క.

తనతలఁచిన యర్థము సొం, పున నింపున లోకవృత్తమున కతిశయిత
ధ్వని గలిగి కవుల చెవులకు, నొనరిన యది యతిశయోక్తి యొప్పగుఁ గృతులన్.

41


క.

ఉల్లసితాలంకృతులకు, నెల్లఁ బరాయణము, కవుల కెలమి యనఁగ శో
భిల్లుం, బెక్కుతెఱఁగులఁ, జెల్లుం [40]బొరి నేకపదముచే నొడఁగూడ్పన్.

42


మ.

భరితార్తిం బరగండభైరవునిచే భగ్నాంగు లై పాఱు త
త్పరిపంథిప్రమదావలోకనగళద్బాష్పాంబుధారాపరం
పర[41]పె ల్లే మని చెప్ప నంతయు జలాభావంబు లై యుండు న
మ్మరుదేశంబు లనూపభూము లగు సీమామానహీనాకృతిన్.

43

ఉత్ప్రేక్ష

క.

అలవడ శబ్దార్థములకుఁ, [42]జెలువంబగుననన్యకౢప్తి సృజియించి సము
జ్జ్వల[43]దుష్ప్రేక్షావ్యంజన, ములచే నుత్ప్రేక్ష యనఁగ మొనయుం గృతులన్.

44


చ.

కెరలు చళుక్యవిశ్వవిభుకేతువరాహము నన్యభీతికృ
ద్గురుతరకృత్య యందు రొకకొందఱు, కొందఱు వైరివాహినీ
నిరుపమమృత్యు వందు, రిట నే నయినన్ రిపురాజమండలా
హరణము సేయ వేఁడి పొలుపారెడిరాహువుగాఁ దలంచెదన్.

45

క.

గజభుజగాదులదెసఁ గల, గుజిబిజికిం గాక వీడుకొన్నదివోలెన్
భజియించి నిలిచె వలపటి, భుజమున విశ్వేశ్వరునకు భూసతి ప్రీతిన్.

46

హేతువు

క.

కారకమును గ్రియయును న, ర్థారంభంబునకు బీజ మగు నేమిట [44]నిం
పార నది హేతు వనఁ జను, భూరిప్రతిభావిశేషములఁ బె క్కరయన్.

47


శా.

సంపల్లంపటమందహాసములు సంజాతానుకంపాకళా
సంపన్నంబులు సాదరప్రియనయస్థానంబు [45]లిద్ధక్రియా
సంపూర్ణంబులు నాఁగ విశ్వధరణీశశ్రీకటాక్షాంశువుల్
సొంపుం బెంపును నింపు సేయు నెపుడున్ సూరీశ్వరశ్రేణికిన్.

48

ఉదారము

క.

ఆయాసోపార్థితము న, దేయమును మనోహరాభిధేయమ్మును శ్ర
ద్ధేయము నగుధన మొసఁగును, సాయ ముదారంబు నాఁగ నవనిం బర్వున్.

49


శా.

విశ్వే[46]శావనిపాలపాలకునిచే విత్తాఢ్యులున్ సత్యభా
[47]గశ్వారూఢులు నంబరాభరణచిహ్నాటోపులుం గామినీ
శశ్వత్సౌఖ్యసమగ్రమానసులు నై [48]చారుస్థితిన్ సత్కవుల్
నైశ్వర్యోన్నతిఁ బేర్తు రెప్పుడు తదుదార్యం బవార్యంబుగన్.

50

సూక్షము

క.

ఆకారేంగితకృతచే, ష్టాకల్పితసూక్ష్మగతుల [49]సంలక్షిత మై
[50]కైకొనఁ దగు నంతర్గత, పాకాల్పత సూక్ష్మ మనఁగఁ బరఁగుం గృతులన్.

51


ఉ.

శ్రీల జళుక్యనాథుఁ డొనరించెను నేఁ డని గారవించుచో,
బాలకు లేఁతన వ్వధరపల్లవకాంతి నలంకరించె, వై
మాలపుసిగ్గు చూపులకు మాటుగఁ దోఁచెఁ, గుచోత్తరీయమున్
గే లొడికంబు సేసెఁ, దిలకించిన నెచ్చెలు లట్టిచేష్టలన్.

52

లవము

తే.

సూక్ష్మభావంబు విడువనిసొబగుతోడ
భావమునఁ దోఁచువస్తుగోపనముపేరు
లవము నాఁ జను; [51]దేశకల్పనముతోడి
విమతినిందలు లవమున విస్తరిల్లు.

53


చ.

సుదతి యొకర్తు విశ్వవిభుఁ జూచి వడిం బులకించి లజ్జ లోఁ
[52]గదిసిన నేర్పుతోడఁ జెలికత్తెల కిట్లను నింత యొప్పునే

మృదులవనానిలం బనుగమించు మధువ్రతపంక్తితోన నిం
పొదవఁగ వీచె డిగ్గియలనుండి సరోజరజోవిలాసి యై.

54

క్రమము

క.

ఉపమానము నుపమేయము, [53]నుపమలఁ బరిపాటి తప్పకుండఁగ [54]నొడువన్
నిపుణత్వము క్రమ మనఁ జను, ప్రపటుప్రఖ్యాతశబ్దపంక్తులచేతన్.

55


ఉ.

శ్రీరుచి వైభవోదయశరీరవిలాసములందుఁ జూడఁగా
శౌరి శశాంక జంధరిపు శంబరశత్రులతోడ నెప్పుడున్
దోరపుటీడు జోడు సరి దోయి చళుక్యనరేంద్రుఁ డంచు నిం
పారఁగఁ జాటుసత్కృతు లుదారత మ్రోయు సభాంతరంబులన్.

56

ప్రేయము

క.

ప్రేయోలంకారంబు వి, ధేయం బగుఁ బ్రియతరాభిధేయోక్తులచే
నే యెగ్గు లేక కర్ణర, సాయన మై యుండెనేని సత్కవికృతులన్.

57


మ.

భవదుద్యత్కరుణాకటాక్షకిరణోత్పన్నంబు లస్మన్మహో
త్సవసంపత్ప్రకరంబు లెల్ల నని శస్తస్తోత్రులై విశ్వభూ
ధవుభూపాలగుణప్రకీర్తనలఁ బ్రీతస్వాంతు లై కాంచి శా
త్రవు లర్చింతురు పాదపద్మముల నిర్యన్మౌళిరత్నద్యుతిన్.

58

రసవదలంకారములు

క.

[55]అసితం బగురత్నాది, ప్రసరణములఁ దేజరిల్లి ప్రథమరసాదుల్
పొసఁగఁబడు నెచట నది వో, రసవదలంకార మనఁగ రసికుల కెక్కున్.

59

శృంగారరసము

చ.

ఇల వలరాజురూపునకు నెక్కువ యయ్యెడు విశ్వమేదినీ
లలనునిరూపయౌవనవిలాసములం [56]జెలిమాటు చేరి య
గ్గలికపుసిగ్గు వేడుకలక్రందున కడ్డ[57]పడంగ నిమ్ములన్
మెలఁతుక వాలుఁజూపులకు మేపులు వెట్టెడుఁ జూచితే సఖీ!

60

హాస్యరసము

క.

లీనాచారుల బహుకౌ, లీనాత్ముల సతతసవ్యలీకులఁ జూడం
బూనెడువిశ్వేశ్వరుని న, వీనదర[58]స్మితము లచ్చివెన్నెలఁ బోలున్.

61

కరుణరసము

క.

అనిఁ దృణము [59]గఱచి జేయని, నినదించుచుఁ బొరలు వినుతనికరముఁ గరుణన్
[60]గనుఁగొని కాచుట నైజము, [61]గొనకొని యరిరాయగండగోపాలునకున్.

62

రౌద్రరసము

క.

[62]రుద్రుం డగు విమతనరో, పద్రవకరణములఁ గుపితబలభద్రుఁ డగున్,
[63]ముద్రణితకదనగతి ను, న్నిద్రాకృతి విశ్వమేదినీపతి చూడన్.

63

వీరరసము

క.

అరివీరుల [64]నమరావతి, కరిగించుచు వివిధధనము లర్థివరులకై
యురవడి నొసఁగుచుఁ బరగెడు, నిరతోత్సాహంబు విశ్వనృపునక యొప్పున్.

64

భయానకరసము

క.

రిపునృపులు విశ్వనాథ, ప్రపటుధ్వజదంష్ట్రిఁ జూచి [65]పరఁగినభీతిన్
విపినవరాహంబుల నిల, నిపుడుఁ గనుఁగొనఁగ వెఱతు రెట్టితలఁపులో.

65

బీభత్సరసము

మ.

అతిదృప్యత్పరగండభైరవభుజోద్యత్ఖడ్గకృత్తాహిత
చ్యుతభూరిక్షతజప్రవాహములలో [66]శుండాలరుండావలీ
కృతలీలాచరయానపాత్రములలో, గ్రీడించు నాయోధన
క్షితి భూతంబులు మజ్ఞమాంసరసమస్తిష్కప్రమత్తంబు లై.

66

అద్భుతరసము

క.

సమధిక మగు నచ్చెరు వ, చ్చముగా విశ్వేశుదానజలధారాపూ
రముచేతఁ జేతి కందును, విమలాంబరకనకహరులు విద్వత్తతికిన్.

67

శాంతరసము

క.

విశ్వేశు[67]మహిమ విని కని, విశ్వంభర విడిచి మదము వీడ్కొని విమతుల్
శశ్వద్ధమశమయుక్తి న, నశ్వరు లై నిలుతు [68]రమరనగముల నదులన్.

68

ఊర్జస్వి

క.

అతులితబలవదహంకృతి, యుత మగువాక్యంబు దలఁప నూర్జస్వి యగున్
బ్రతిభటతర్జనగర్జన, వితతాక్షేపములచేత విస్ఫుట మెపుడున్.

69


మ.

కపటద్విట్కరవాలభైరవుఁడు ఖడ్గాఖడ్గిసంక్రీడలన్
గుపితాటోపనిరూఢి నుగ్రరిపురక్షోరాజనారాయణుం
డపరావిష్కృతరుద్రుఁ డన్యపురదాహప్రౌఢిచే విశ్వభూ
మిపుఁ డమ్మేటి నెదుర్చుటల్ జమునితో మేలంబు గావించుటల్.

70

పర్యాయోక్తి

క.

కార్యార్థకౢప్తిచేఁ ద, త్కార్యార్థప్రాప్తికొఱకు గల్పించిన మా
ధుర్యయుతభాషితం బది, పర్యాయోక్తంబు నాఁగఁ బరఁగుం గవితన్.

71

చ.

[69]సురుచిరరత్నకీలితము సూతము బన్న సరంబు సూపు, క
ప్పురపుఁగరండముం [70]దెఱచి పుచ్చు వెలుంగున, నంచు విశ్వభూ
వరుఁ డొకయింతిఁ బల్కుటయు వచ్చిన[71]నెచ్చెలు లంతటంతటన్
[72]సురుచిరసాలభంజికల[73]చొక్కపుజోటులువోలెఁ జూడఁగన్.

72

సమాహితము

తే.

కడఁకతో మున్ను దొరకన్నకర్జమునకు, సాధనము [74]దైవవశమునఁ జాగెనేని
యది సమాహిత మని చెప్ప నతిశయిల్లుఁ, గార్యకర్తకు నానందకరణ మగుచు.

73


ఉ.

మానిని విశ్వనాథు[75]పదమంజరులున్ దనఫాలపట్టమున్
మానుగఁ గూర్తు నంచు నభిమానము మానఁ దలంచుచోట న
మ్మానవనాథుఁ డచ్చ మగుమక్కువ నచ్చటి కేఁగుదెంచి త
త్సూనశరాసనాస్త్రములు చూఱకొనుం గరుణాసమేతుఁడై.

74

ఉదాత్తము

క.

[76]అతులైశ్వర్యాశ్రయముల, వితతత్వ ముదాత్త మనఁగ విశ్రుత మగు [77]నం
చితసంపద్భహుళము నూ, ర్జితపదమును నగుచుఁ గార్యరీతులయందున్.

75


శా.

వంశం బీశ్వరమాళి [78]మండనమహో౽వార్యంబు, నిర్ణిద్రని
స్త్రింశం బింద్రపురస్థి[79]తాహితనుతిశ్రీకంబు, చక్రాచల
ప్రాంశుధ్వాంతనిహంత్రి కీర్తి, వినమద్రాజన్యకోటీరర
త్నాంశూదంచిత మంఘ్రియుగ్మము, చళుక్యస్వామి కెల్లప్పుడున్.

76

అపహ్నుతి

క.

కలయర్థనిరసనంబున, నలవడునన్యప్రకార మగునర్థముచే
వెలయు నపహ్నుతి యనఁగాఁ, బలికెడు వెరవులను బోక్కుపాకము లగుచున్.

77


మ.

ఘనమేఘం బది వాజిగాఁ దతఁడు నిక్కం బింద్రుఁ డారోహకుం
డనరా దంగమరీచి గా దది తటిద్వ్యాపార ముద్యత్థుర
ధ్వని గా దంబుదఘోషణం బది ధరన్ దక్కొంట నీసొంపు లే
దని [80]భావింతురు విశ్వభూవిభుని యశ్వారోహణక్రీడలన్.

78

క్లిష్టము

క.

[81]ఏకార్ధోక్తం బయ్యు [82]న, నేకార్ధము చిలుకుచుండు నెయ్యది యతివో
లోకమున శ్లిష్ట మనఁగాఁ, బైకొనఁదగుఁ బదవిచిత్రకల్పనవిధులన్.

79


మ.

[83]మరుదుత్ఖేలదశోకపల్లవయు సమ్యక్పత్త్రసందోహయున్
భరితామోదయు జృంభమాణసుమనోభద్రప్రదేశంబు నై
యరుదై యొప్పెడు [84]విశ్వభూపవిపులోద్యావళిం జూడఁ ద
త్పురియుం బోలెఁ దనర్చె నింతి మహిళాపున్నాగపూగంబులన్.

80

విశేషోక్తి

క.

జాతిక్రియాగుణాదుల-యాతతహీనత్వకథన మలవడు నెచటన్
[85]బ్రీతివిషయేతరార్థ, స్ఫీతతకై యదియ తగు విశేషోక్తి యనన్.

81


మ.

చటులక్రోడ[86]పతాక యెత్తరు బృహత్సైన్యంబుపైఁ [87]ద్రోవ రు
ద్భటనిస్సాణ[88]రవం బెలర్ప రతిదృప్యద్గండగోసాలు భ్రూ
కుటిమాత్రోదితచేష్టచేతన రిపుక్షోణీశు లంతంతటన్
[89]స్ఫుటజూటంబులు దాల్తు రెక్కువ గదా భూరిప్రభావం బిలన్.

82

తుల్యయోగిత

క.

ఖ్యాతగుణంబులచే ను, ద్యోతితసదృశోక్తి తుల్యయోగితే యగుఁ బ్ర
స్ఫీతస్తుతి నిందనములు, జాతీయము గాఁగఁ జెప్పఁ జను నండ్రు బుధుల్.

83


శా.

కాలవ్యాలముఁ గాలకూటమును [90]నిర్ఘాతంబు ఘోరానల
జ్వాలాజాలము నీకృపాణమును దుర్వారంబు లుగ్రక్రియా
లోలక్రీడల నంచు నెన్నుదురు భూలోకాదిలోకంబులన్
జాళుక్యాన్వయవిశ్వభూప సమిదిజ్యాశీలమంత్రోజ్జ్వలా!

84

విరోధము

క.

[91]తమలో నొంటను రెంటఁ బ, దములకు సంభావితార్థదర్శన మెచటన్
గ్రమమున విరుద్ధ మగు నది, యమరు విరోధంబు నాఁగ నయ్యైయెడలన్.

85


చ.

అనిమొన విశ్వభూవిభునికహస్తకృపాణము చంద్రహాస మ
య్యును మఱి చిత్రభాను వన నుజ్జ్వల మయ్యడుచోట నప్సరో
వనితలచన్నులం బులకవర్గము నెక్కొను వైరిభీరు [92]లో
చనముల నశ్రువారములు [93]సాల్పడు నందును నిందునుం బొరిన్.

86

అప్రస్తుతస్తుతి

తే.

వివిధ[94]సేవాదికంబుల విసువుచేత, నడరి యప్రస్తుతస్తుతి యనఁగ బరఁగు;
ననుచితార్థప్రశంసన మయ్యు [95]నదియు, నొనర నొక్కొక్కచోటున నొప్పు నొసఁగు.

87


చ.

కస వశనంబు పేయ ముదకంబు విహారము గానలోపలన్
వసుమతి శయ్యప [96]ట్టొరులవంకఁ జరింపమి సంతసం బిలన్
[97]బసులకు నెల్ల వృత్తి, జనపంక్తుల కైన [98]నభీప్సితేందిరా
వసుమతి యైన విశ్వజనవల్లభు[99]దృష్టియ వృత్తి నిచ్చలున్.

88

వ్యాజస్తుతి

క.

వ్యాజస్తుతి యనఁగఁ బరి, భ్రాజిత మగు నిందవోలె బ్రణుతింపంగాఁ
దేజం బెసఁగెడు కథనము, రాజిల్లెడు మధురవచనరచనలచేతన్.

89

ఉ.

ఈతఁ డుపేంద్రపుత్త్రుఁ డటె [100]యింతుల నేఁపక యేల మానుఁ? బ్ర
ఖ్యాతవినూత్నభద్రుఁ డటె [101]కాంతల నేఁపక యేల తక్కు? వి
ద్యోతకళాధరుం డటె [102]వధూటుల నేఁపక యేల యుండు [103]నే
రీతి? నటంచు విశ్వవిభుఁ బ్రీతి నుతింపుదు రంగనాజనుల్.

90

నిదర్శనము

క.

తిర మగునొకయర్థముతో, సరి యననర్థాంతరంబు సమకొల్పి తగన్
[104]బర మైన నపర మైనను, ధరణి నిరూపింపఁగా నిదర్శన మయ్యెన్.

91


ఉ.

ఇవ్వసుధం గవిప్రవరు లెచ్చట [105]నుండియుఁ జెందకుండినన్
మవ్వ మెలర్ప విశ్వనృపమన్మథుఁ డిచ్చు నభీష్టసంపదల్
నివ్వటిలంగ, [106]నత్తెఱఁగు నిశ్చితకృత్యము, యీక తక్కు నే
దవ్వులనుండి యైన రవి తమ్ముల కిమ్ముల సద్వికాసముల్.

92

సహోక్తి

క.

సమగుణధర్మము లగుభా, వములఁ [107]గ్రియాసదృశ యగుచు వచనార్ధముతో
నమరిన సహోక్తి యనఁ జను, సముచితచతురార్ధశబ్ద[108]సంఘటనమునన్.

93


చ.

వసుధ జిగీషుఁ డైనశశివంశ్యునికీర్తులతోన చంద్రికా
విసరము [109]సాగె దిక్కులను, విభ్రమదశ్వఖురోన్నమద్రజః
ప్రసరముతోన తోయజ[110]పరాగము వ్రాఁకె నభంబు, మిత్రమా
నసపరిశుద్ధితోన మలినత్వము వీడ్కొనె వారిపూరముల్.

94

పరివృత్తి

క.

సరినన్యోన్యార్థములం, బరువడితో మార్చుకొనుట పరివృత్తి యనం
బరఁగుం బలికెడు వెరవుల; నారయ నలంకారకరణ మగు సత్కృతులన్.

95


శా.

సవ్యాసవ్యవిఘాతశాలి యగు నీ చాళుక్యవిశ్వేశు హ
స్తవ్యావల్గదసిప్రభావము ప్రశస్తప్రౌఢి దీపింపఁగా
భవ్యాంగంబుల నాహరించి యనిలో భద్రక్రియాపాది యై
దివ్యాంగంబుల నిచ్చుఁ బేర్చి మదవద్వీరాహితశ్రేణికిన్.

96

ఆశీర్వచనము

క.

ఆశీర్వచన మనంగా, నాశాస్యపదార్ధసమ్యగాశంసన మి
ద్ధాశయము భద్రములకుఁ బ్ర, కాశింపఁగఁ దగు నశేషకావ్యముఖములన్.

97


ఉ.

వేలుపుటిల్లువిల్లు [111]వెడ వీఁకలపోకలనారి, రెండుచే
దోల వెలుంగు[112]తూ పెచటఁ దోలినఁ బాఱనితేరు మాటలై
గ్రాలెడుతేజు లెవ్వనికిఁ గల్గు నతండు చళుక్యవిశ్వభూ
పాలుమనంబునం బరవిభంజనుఁ డై విహరించుచుండెడున్.

98

వక్రోక్తి

తే.

స్తుతియు నభయంబుగా మున్ను దోఁచి పిదపఁ
దోడుతో వంకవంకయై దొరకుపలుకు
కవులు వక్రోక్తి యన నొప్పుఁ గబ్బములను
గల్పనీయార్ధవశమునఁ గానవలయు.

99


మ.

పరపుష్టంబులు కోకిలంబు లనిశభ్రాంతుండు చంద్రుండు క్రొ
వ్విరు లస్త్రంబు లనంగుఁ డంగభవుఁ డీవీఱిండ్లు ని న్నేఁచ ను
ర్వరలో నెంతటివారు? వారక సఖుల్ వారింపఁగాఁ బోయి సుం
దరి విశ్వేశ్వరుఁ [113]జూచి, తవ్విభుమహత్త్వం బీదశాభేదముల్.

100

సంకరము

క.

వివిధాలంకృతి సమ్మతిఁ, జవిగా నొనరించు నర్థసంగతిచేతన్
[114]సవర నయి కర్ణముల కు, త్సవపద మగుకబ్బ మరయ సంకర మయ్యెన్.

101


మ.

అనిలోనం గరవాలభైరవుఁడు వీరారాతులం గూల్చు న
ర్జునుఁ డీతం డనఁగా, సురాంగనలన్ శూరాహితశ్రేణికిన్
దనరించుం దగులంబు లచ్చుపడ నుద్యద్రాజకందర్పుఁ డై,
[115]ఘనకీలాలము లుబ్బఁ జేయు ఘనవిఖ్యాతిం బ్రపూర్ణంబుగాన్.

102

భావికము

తే.

భావ మనఁగను గవియభిప్రాయ మండ్రు,
భావభేదనియుక్తంబు భావికంబు
వివిధరూపప్రబంధోక్తివిషయగుణము;
దగు వివేకింప సూక్ష్మసందర్శనమున.

103


చ.

వివిధపదార్థభావరసవృత్తుల రీతులఁ గావ్యపాకసం
భవ మను[116]సూక్ష్మబంధమున బర్వునలంకృతు లెల్లఁ జూచి స
త్కవులవివేక మెల్లఁ బొడ గానఁగ నేర్చు చళుక్యవిశ్వభూ
ధవుఁ డనుమాట [117]లొజ్జల విదర్ప మెలర్ప సభాంతరంబులన్.

104


ఉ.

చంద్రకులాగ్రగణ్యుడు ప్రశంసితపుణ్యుఁడు సత్యధీహరి
శ్చంద్రుఁడు శైవతంత్రవిలసద్వృషభేంద్రుఁడు నీతితత్త్వని
స్తంద్రుఁడు శౌర్యలోలుఁడు బుధప్రియశీలుఁడు భూరివిక్రమో
పేంద్రుఁ డుపేంద్రనందనుఁడు భీమపదానిశవందనుం డిలన్.

105


క.

గంధర్వకళావిదుఁ డరి, గంధద్విపమదవిమర్ద[118]కంఠీరవుఁ డు
ద్బంధుర[119]వరాహకేతుఁడు, బంధుపయోరాశి[120]కుముదబాంధవుఁ డెపుడున్.

106

మాలిని.

అహలనగరరుద్రుం డంగనాసంఘభద్రుం
డహిమకిరణతేజుం డర్చ్యవిద్వత్సమాజుం
కహసితకులశీలుం డర్థివర్గానుకూలుం
డహరహరుదితార్ధుం డాజిపార్థుండు శక్తిన్.

107

గద్యము
ఇది శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన వివిధ
బుధవిధేయ విన్నకోట పెద్దయనామధేయవిరచితం బైనకావ్యాలంకార
చూడామణి యనునలంకారశాస్త్రంబునందు న
లంకారసముద్దేశం బన్నది పంచమోల్లాసము.

—————

  1. క.గ.చ. శ్రీకాశీపతిపద
  2. క.గ.చ. అవి యెయ్యవి యంటేని
  3. క.గ.చ. ప్రకారంబులఁ బ్రవర్తిల్లె
  4. క.గ.చ. జాతియుఁ ననఁ బరఁగు
  5. క.గ.చ. నిర్మలినమై
  6. క.గ.చ. వా లేఁచున్
  7. క.గ.చ. ప్రతిపాద్యోపములు
  8. గ. ఇంపుం గదురంగఁజేయు
  9. క.గ.చ. ప్రౌఢప్రియయై
  10. క. చెవి కెరపడమగు, గ. ఎడపరమగు, చ. ఎరసరమగు
  11. మనము విపులం బనఁగన్
  12. గ. చంద్రుఁ డరరాతుఁడు, చ. చంద్రుఁ డరదాతుఁడు
  13. క. ఉపమలపహసంకరములు, గ.చ. ఉపమలపహసాకరములు
  14. తద్వ దేకార్థ సాంతత్య సాధర్మ్యాను రూపకాభేదనిరూపణములు—పా.
  15. క.గ.చ. క్రియాపదములఁ బోల్చుచోట
  16. క.గ.చ. దొరసుగెడ
  17. క.గ.చ. లాగరిదియైన
  18. క.గ.చ. పరసు నాఁగ ను
  19. క.గ.చ. ప్రపటుక మది రూపకంబు
  20. క.గ.చ. బహువిధము లిలన్
  21. క.గ.చ. చకోరసంఘమును
  22. క.గ.చ. రుంద్రతరంబుగ నెల్లెడ
  23. క.గ.చ. మొదలం దుద నడుమ నొండెన్
  24. క. పొదరితదార్థము, గ. పొదవితదర్ధము
  25. క.గ.చ. కృతుల కందం బెపుడున్
  26. క.గ.చ. బలిబలభేదులకు
  27. క.గ.చ. విభుఁ డెల్లపుడున్
  28. క.గ.చ. విశ్వేశ్వరుం డిచ్చుచో
  29. క.చ. తత్పరపురపరిఖా
  30. క.గ.చ. నలుగాల నడచె
  31. క.గ.చ. నడపునిషేధోక్తి
  32. క.గ.చ. వేఱయర్థము నోజించి
  33. క.గ.చ. క్షమతో వేఁడని
  34. క.గ.చ. కాక విహితస్వభావ
  35. గ. స్ఫురణోదార
  36. క. చరదస్పష్ట
  37. క.గ. తగు నిహితార్థాగర్భిత, చ. తగు విహితార్థవిగర్భిత
  38. క. మూర్తులం గవిసి, గ.చ. మూర్తులం గదసి
  39. క.గ.చ. దుర్వర్ణంబు నగ్గించి
  40. క.గ.చ. పోలికపదంబుచే
  41. క.గ.చ. పెల్లేమని చెప్ప నెంతయు
  42. క.గ.చ. చెలువంబుగ
  43. క.గ.చ. ఉత్ప్రేక్షావ్యంజకములచే
  44. క. ఇంపారునది
  45. క.గ.చ. ఇష్టక్రియాసంపూర్ణంబులు
  46. క.గ.చ. అవనిపాల పాలితులచే
  47. గ.చ. అశ్వారూఢులు నుంబరాభరణ
  48. క.గ. చాటుస్థితిన్ సత్కవుల్
  49. క.గ. సంవీక్షితమై
  50. క.గ. చేకొనఁదగు
  51. క.గ.చ. లేశకల్పనముతోడి
  52. క.గ. గదిసిననోర్పుతోడ
  53. క.గ.చ. ఉపచితపరిపాటి
  54. గ.చ. నొడువున న్నిపుణత్వము
  55. క.గ.చ. లసితంబగు రత్యాది
  56. గ.చ. చెలిమాట చేరి
  57. క.గ.చ. పడంగఁ గ్రిమ్ములన్
  58. క.గ.చ. స్మితము లేఁతవెన్నెలఁ
  59. క. గఱచి బేయని
  60. గ.చ. పనివడి గాచుట
  61. క. గొనకొని యది
  62. క.గ.చ. రుద్రండువితతనగరో
  63. గ.చ. ముద్రణితపవనగతి
  64. క.గ.చ. అమరావతి కరగింపుచు
  65. క.గ.చ. పఱచినభీతిన్
  66. క. శుండాలతుండావలీ
  67. గ.చ. మహిమ కని విని
  68. క. అమరనగరములందున్
  69. క. సురుచిరరత్నకీలములు, గ.చ. సురుచిరరత్నకీలనము
  70. క.గ.చ. తెఱచిపుచ్చుపలుంగుల
  71. క.గ.చ. నెచ్చెలు లంతనంతటన్
  72. క.గ.చ. సురిగిరిసాలభంజికల
  73. క.గ.చ. చొక్కపుబోఁటులవోలె
  74. క.గ.చ. దైవవశమున సాగెనేని
  75. క. పదమంజరులన్
  76. క.గ.చ. అతులైశ్వర్యాశయముల
  77. గ.చ. సంచితసంపద్బహుళము
  78. క.గ.చ. మండనమహావర్యంబు
  79. క.గ.చ. అహితనుతశ్రీకంబు
  80. గ.చ. భాషింతురు విశ్వభూవిభుని
  81. క.గ.చ. ఏకార్థంబే యయ్యు
  82. క.గ.చ. ననేకార్థముఁ బలుకుచుండు
  83. క.గ.చ. మరుదుద్వేలదశోక
  84. గ.చ. విశ్వభూపతిపురోద్యానావళి
  85. క.గ.చ. ప్రీతివిశేషతరార్థ
  86. క.గ.చ. పతాకయెత్తదు
  87. క.గ.చ. త్రోవదుద్భట
  88. క.గ.చ. రవం బెలర్పదట
  89. క.గ.చ. స్ఫుటజూటంబుల వ్రాల్తురు
  90. క.గ.చ. నిర్ఘాతంబు కాలానల
  91. క.గ.చ. తమలో నొంటని రెంటఁ
  92. క.గ.చ. లోచనముల నశ్రుపూరములు
  93. క. పొల్పడు, చ. సాల్వడు
  94. క.గ.చ. సేవాదికంబుల విసపుచేత
  95. క.గ.చ. అదియ యొనర
  96. క.గ.చ. ఒరులవంకఁ జలింపమి
  97. క. పశులకు నెల్లప్రీతి
  98. క. అభీప్సితేందిరావసుపతియైన
  99. గ. దృష్టియతృప్తి
  100. క. ఇంతుల నంపఁగ
  101. క. కాంతల నేఁపఁగ
  102. క. వదూటులఁ బేల్పఁగ, గ.చ. వధూటులఁ బ్రేల్పక
  103. క.గ.చ. ఏరీతులనంచు
  104. గ.చ. వరమైన నవరమైనను
  105. క.గ.చ. నుండియు వేఁడకుండినన్
  106. క.గ.చ. నిత్తెఱఁగు నిశ్చితకృత్యమ
  107. క.గ.చ. క్రియాసదృశి యగుచు
  108. క.గ.చ. సంఘటనములున్
  109. క.గ.చ. సాగె దిక్కులకు
  110. గ.చ. పరాగము ద్రాకె నభంబు
  111. క.గ.చ. వెడవీఁకల ప్రోఁకలనారి
  112. క.గ.చ. తూపెచటు దోలిన
  113. క.గ.చ. చూచి తద్విభుమహత్త్వం
  114. క. సమరనయి
  115. క.గ.చ. ఘనకీలాలము నుబ్బ
  116. క. సూక్ష్మబోధమున, గ.చ. సూక్ష్మబోధనము
  117. క.గ.చ. ఒజ్జలయి దర్ప మెలర్ప
  118. క.గ.చ. కంఠీరవ ముద్బంధుర
  119. క. వరాహకేతువు
  120. క.గ.చ. కుముదబంధుం డెపుడున్