Jump to content

కావ్యాలంకారచూడామణి/అష్టమోల్లాసము

వికీసోర్స్ నుండి

అష్టమోల్లాసము

ఛందస్సు

 భ జ స య ర త మ న గ ల
U।। ।U। ।।U ।UU U।U UU। UUU ।।। U ।
గలము లగము
 U। ।U
(గలమునకు హగణమనియు, లగమునకు వగణమనియు
నామాంతరములు.)

క.

శ్రీవిశ్వేశ్వర విశ్వ, క్ష్మావల్లభవంద్యపాదకమల కమలభూ
దేవీకమలసితయశా, కోవిదనుత రాయగండ గోపాలాంకా.

1

13. అతిజగతీచ్ఛందఃపాదంబు త్రయోదశాక్షరంబు—

అందుఁ బ్రహర్షిణీవృత్తము (మ-న-జ-ర-గ-8 యతి.)

ప్రావీణ్యపదయొనరం బ్రహర్షిణిం దాఁ- గావించున్ మనజరగ వ్రజంబుధాత్రిన్

రుచిరవృత్తము (మ-త-య-స-గ 8 యతి.)

క్రమంబుతో జభసజగమ్ము లిమ్ముగా-నమర్పఁగా రుచిరసమాహ్వయం బగున్.

మత్తమయూరము (స-స-ర-స-లగ-9 యతి.)

సంబోధార్థంబై విలసన్మత్తమయూరా
ఖ్యం బింపొప్పారున్ మతయాగ్ర్యాత్త సగాప్తిన్.

మంజుభాషిణి (స-జ-స-జ-గ-9 యతి.)

సలయంబు గాఁగ సజసంబుతో జగం-బులు మంజుభాషిణికిఁ బొంగు నందమై

జలదము (భ-ర-స-భ-గురు-10 యతి.)

ఈభరవంబుల న్భగురు లెక్కుచు నిం-పై భజియించె నేని జలదాహ్వయ మౌ.

ప్రభాతము (న-జ-జ-ర-గ-8 యతి.)

మొదల నజారగము ల్ప్రభాతసంజ్ఞం-బొదవఁగఁ జేయు నపూర్వకల్పనోక్తిన్.

14. శక్వరీచ్ఛందఃపాదంబు చతుర్దశాక్షరంబు

అందు వసంతతిలకవృత్తము (త-భ-జ-జ-గ-గ-8 యతి.)

స్థాపించినం దభజజంబు చళుక్య విశ్వ-క్ష్మాపా వసంతతిలకం బగు గానియుక్తిన్.

అపరాజితవృత్తము (న-వ-ర-స-ల-గ-9 యతి.)

ననరసలగముల్ దనర్చిన సత్కృతిం-దనరఁగ నపరాజితంబు కవిస్తుతిన్.

వనమయూరము (భ-జ-స-న-గగ-9 యతి.)

నందయతితో భజననప్రజగగం బిం-పొంది చదువ న్వనమయూర మగు ధాత్రిన్.

సుందరము (భ-భ-ర-స-లగ-9 యతి.)

భారసపంబుల నొప్పుఁ పద్మజవిశ్రమం- బారఁగ సుందరవృత్తమై బుధవర్ణ్యమై.

ప్రహరణకలితము (న-న-భ-న-లగ-8 యతి.)

ప్రహరణకలితంబయి ననభనవల్ -బహువిధయతులం బ్రథఁ జెలు వడరున్.

భూనుతము. (ర-న-న-భ-గగ-10 యతి.)

అందమై రసనభతతి నంది గగంబుల్-పొందఁగాఁ బదగతిఁ గని భూమత మయ్యెన్.

15. అతిశక్వరీచ్ఛందఃపాదంబు పంచదశాక్షరంబు

అందు మణిగణనికరవృత్తము (న-న-న-స-9 యతి.)

పరసత నననన సగణము లెసఁగం-గరియతిఁ గని మణిగణనికర మగున్.

మాలినీవృత్తము (న-న-మ-య-య-8 యతి.)

కరటివిరతి నామక్రాంతయాయుక్తితోడన్
మరగి తిరుగఁ జెప్ప మాలినీవృత మయ్యెన్

సుకేసరము (న-జ-భ-జ-ర-10 యతి.)

నజభజరేఫలం గదియ వచ్చి దిగ్యతిన్- సుజనమతి న్సుకేసరము శోభితం బగున్

మణిభూషణము (ర-న-భ-భ-ర-10 యతి.)

విశ్వభూప మణిభూషణవృత్త మనం జనున్-శశ్వదుక్తరనభారదిశాయతిఁ గూడినన్.

మనోజ్ఞము (న-జ-బ-భ-ర-9 యతి.)

వరుస మనోజ్ఞ మనంగ వచ్చు నజాభర - స్థిరగతిఁ బంకజభూయతిం బ్రతిపన్నమై.

16. అష్టిచ్ఛందఃపాదంబు షోడశాక్షరంబు

అందుఁ బద్మకవృత్తము (న-భ-జ-జ-జ-గ-11 యతి.)

నభజజద్వయగకార సనాతనవిశ్రుతిం- బ్రభవమై పరఁగు సత్కృతిఁ బద్మవృత్తమై

ప్రియకాంతావృత్తము (న-య-న-య-స-గ-10 యతి.)

నయనయయుక్తిం దగ సగణంబున్ గురువొందున్
నియతము దిగ్విశ్రమమును నించుం బ్రియకాంతన్.

చంద్రశ్రీ (య-మ-న-స-ర-గ-11 యతి.)

అగుం జంద్రశ్రీ దాహారవిరమణాయత్తమైనం
బ్రగాఢంబై యొప్పు యమనసర బద్ధాగ్రగాప్తిన్.

మేదిని (న-జ-భ-జ-ర-గ-10 యతి.)

నజభజరేఫగంబునఁ దనర్చు మేదినీవృ-త్తజనికి మూలమై దిగుదితస్థవిశ్రమంబై.

17. అత్యష్టిచ్ఛందఃపాదంబు సప్తదశాక్షరంబు

అందు శిఖరిణీవృత్తము (య-మ-న-స-భ లగ-12 యతి.)

వివస్వద్విశ్రాంతిన్యమనసభవావిష్కృతగతిం
గవిశ్రేణీరక్తిన్ శిఖరిణియనంగాఁ దగుఁ బ్రథన్.

పృథివీవృత్తము (జ-స-జ-స-య-వ-12 యతి.)

జసంబులు జసంబులున్ యపనిషక్తరూపంబులై
పొసంగఁ బృథివీసమాఖ్య యగుఁ బూషవిశ్రాంతితోన్.

హరిణి (న-స-మ-ర-స-వ-11 యతి.)

హరిణి యనువృత్తం బయ్యెన్ శంకరాత్త యతప్రథన్
సరినసమరేఫాక్రాంతోపేతసస్థలగంబులన్.

మందాక్రాంతము (మ-భ-న-త-త-గగ-11 యతి.)

పొందందంబై మభనతతగా భూషితంబై తనర్పన్
మందాక్రాంతాహ్వయ మగు శివామందవిశ్రాంతిచేతన్.

త్వరితపదగతి (న-న-న-న-న-గగ-11 యతి.)

త్వరితపదగతి యనఁగఁ దగుననననాగా- విరచితయు దశమయతి విలసితయు నైనన్.

నర్కుటము (న-జ-భ-జ-జ-వ-10 యతి.)

నజభజముల్ జనంబులఁ దనర్చిన నర్కుటక - ప్రజనన మొప్పు దిగ్యతిని రాజకులాబ్ధి శశీ.

18. ధృతిచ్ఛందఃపాదం బష్టాదశాక్షరంబు

అందుఁ గుసుమితలతావేల్లితావృత్తము (మ-త-న-య-య-య-11 యతి.)

స్వశ్రేయస్సిద్ధిన్ మతనయయయవ్యాప్తిచేఁ జర్మవాసో
విశ్రామం బొప్పం గుసుమితలతావేల్లితావృత్త మయ్యెన్.

మత్తకోకిలవృత్తము (ర-స-జ-జ-భ-ర-10 యతి.)

మత్తశోకిలవృత్త మై దశమప్రవర్తితవిశ్రమా
యత్తమై రసజాభరేఫల నచ్చమై కడు గొప్పగున్.

19. అతిధృతిచ్ఛందఃపాదం బేకోనవింశత్యక్షరంబు

అందు శార్దూలవిక్రీడితవృత్తము (మ-స-జ-స-త-త-గ-12 యతి.)

సంబంధించి దినేశవిశ్రమముతో శార్దూలవిక్రీడితా
ఖ్యం బయ్యెన్ మసజంబులు సతతగాయత్తంబులై యుండినన్

మేఘవిస్ఫూర్జితవృత్తము (య-మ-న-స-ర-ర-గ-12 యతి.)

మృదువ్వస్తార్ధంబై దినకరయతి న్మేఘవిస్ఫూర్జితాఖ్యం
బుదాత్తశ్రీ జేర్చున్ యమనసర రప్రోత గప్రాప్తిచేతన్.

చంద్రకళ (ర-స-స-త-జ-జ-గ-10 యతి.)

వ్యక్తరీతి రసాతజజగ్రాయత్తగకారనిరూఢిచే
సక్తదిగ్విరమంబున నొప్పుం జంద్రకళాహ్వయమై ధరన్.

తరలము (ధ్రువకోకిల) (న-భ-ర-స-జ-జ-గ-11 యతి.)

నభరసంబులు జాగవర్గము వచ్చి యీశ్వరవిశ్రమ
ప్రభవమై తరలం బనంజను రాజవంశశిఖామణీ!

భూతిలకము (భ-భ-ర-స-జ-జ-గ-11 యతి.)

భూతిలకం బగు భారసంబులఁ బొంది జాగము లుండినన్
భూతిపతిస్ఫుటవిశ్రమంబున భూప విశ్వనరేశ్వరా!

20. కృతిచ్ఛందఃపాదంబు వింశత్యక్షరంబు

అందు మత్తేభవిక్రీడితవృత్తము (స-భ-ర-న-మ-య-వ-13 యతి.)

మనమారం బదుమూఁట విశ్రమముగా మత్తేభవిక్రీడితా
హ్వనమయ్యెన్ సభరంబు లన్నమయవన్యాసంబులం జెప్పినన్.

ఉత్పలమాలావృత్తము (భ-ర-న-భ-భ-ర-లగ-9 యతి.)

పద్మజయుగ్యతిన్ భరనభారలగంబులఁ జెంది సన్మనః
పద్మవికాసహేతు వగుపద్యము నుత్పలమాల యం డ్రిలన్

అంబురుహము (భ-భ-భ-భ-ర-స-వ-12 యతి.)

భానభరంబులపై సభ లొందుచు భానువిశ్రమయక్తమై
యీభువి నంబురుహం బనఁగాఁ జను నిందువంశనృపాగ్రణీ.

ఖచరప్లుతము (న-భ-భ-మ-స-న-వ-11 యతి.)

నభభముల్ మసనంబు లగాప్తి న్నాగవిభూషణయుగ్యతిన్
శుభదమై ఖచరప్లుత మొప్పు న్సోమకులార్ణవచంద్రమా.

21. ప్రకృతిచ్ఛందఃపాదం బేకవింశత్యక్షరంబు

అందు స్రగ్ధరావృత్తము (మ-ర-భ-న-య-య-య-7-7 యతులు.)

క్ష్మాభృద్భూభృద్యతిన్శ్రీమరభనమయయయామాత్రమై యాదిమాద్య
క్ష్మాభృత్కీర్తీశ విశ్వేశ్వరనృపతివరా స్రగ్ధరావృత్త మయ్యెన్.

చంపకమాలావృత్తము (న-జ-భ-జ-జ-జ-ర-10 యతి.)

నజభజజారవర్గము దనర్చి దిశాయతి నర్థయుక్తమై
ఋజుగతిఁ చెంది సత్కవుల కింపుగఁ జంపకమాల యై దనున్.

లాటీవిటము (స-స-స-స-మ-త-య-12 యతి.)

సససా మతయంబులు భానుయతి న్సాకంబై లాణీవిటవృత్తం
బెసకం బెసఁగున్ విరచించిన విశ్వేశా, చాళుక్యక్షితిపాలా!

వనమంజరి (న-జ-జ-జ-జ-భ-ర-13 యతి.)

తనర నజాజజభాగ్భరకారయుతత్రయోదశయుగ్యతన్
వినుత మగు న్వనమంజరి నాఁ దగువృత్త మింపెసలారఁగన్.

మణిమాల (స-జ-స-జ-స-జ-స-10 యతి.)

వరుసన్ సజత్రితయము న్బ్రసక్తసగణంబుతోడ నొనరం
బరఁగున్ దిగంతనిరతిం బ్రధానపదమై చళుక్యమదనా!

22. ఆకృతిచ్ఛందఃపాదంబు ద్వావింశత్యక్షరంబు

అందు మహాస్రగ్ధరావృత్తము (స-త-త-న-స-ర-ర-గ-8-7 యతులు.)

సకలశ్రీవిశ్వభూపా సతతనసరరాసక్తమై యగ్రగాప్తిం
బ్రకటింపన్ దంతిశైల ప్రచురయతి మహాస్రగ్ధరావృత్త మయ్యెన్.

భద్రిణీవృత్తము (భ-ర-న-ర-న-ర-న-గ-11 యతి.)

భాదిరనత్రయంబు గురుయుక్తమై గిరిశవిశ్రమప్రకటమై
మేదిని నొప్పు భద్రిణికి నందు మేరునగధీర విశ్వనృపతీ.

మానిని (భ-భ-భ-భ-భ-భ-భ-గ-6-6- యతులు.)

కామిని సప్తభకారము లౌల గకారమునై పరికల్పితమై
నేమముగా వడి నిల్పినఁ బెక్కులు నిల్చిన మానిని నిక్క మగున్.

తురగవల్గిత(న-న-న-న-స-జ-జ-గ-14 యతి.)

మెఱయు ననననసజజగములను మేలుగా రచియించినన్
వఱలు మనుయతి వలనను దురగవల్గితంబను వృత్తమై.

23. వికృతిచ్ఛందఃపాదంబు త్రయోవింశత్యక్షరంబు

అం దశ్వలలితవృత్తము (న-జ-భ-జ-భ-జ-భ-లగ-12 యతి.)

నజభజము ల్భజంబులకు వచ్చి భస్థలగయుక్తమై రవియతిం
బ్రజనితమైన నశ్వలలితంబు రాజకులదీప ధీజననుతా.

కవిరాజవిరాజివృత్తము (న-జ-జ-జ-జ-జ-వ-8-7-7 యతులు.)

కలయఁగ నేకనకారషడుక్తజకారవకారనికాయనిర
ర్గగళగతిచే నలరం గవిరాజవిరాజితవృత్తము రమ్యమగున్.

24. సంకృతిచ్ఛందఃపాదంబు చతుర్వింశత్యక్షరంబు

అందు సరసిజవృత్తము (మ-త-య-న-న-న-న-స-10-9 యతులు.)

చాళుక్యక్ష్మాపాలవరేణ్యాశ్రయమతయనననినయయుతనవసల్
చాలై యింపై వ్రాలిఁ దనర్ఫన్ సరసిజమగు నిలఁ జవులకుఁ గుదురై.

క్రౌంచపదవృత్తము (భ-మ-స-భ-న-న-న-య-10-8 యతి.)

ప్రాంచితతేజఃకుంచితవైరీభమసభనననయపరిచితరీతిన్
అంచితమయ్యెం గ్రౌంచపదాఖ్యం బనుగతహరిదిభయతి నభివృత్తిన్.

25. అభికృతిచ్ఛందఃపాదంబు పంచవింశత్యక్షరంబు

అందు సింధురవృత్తము (న-న-న-న-స-భ-భ-భ-గ-10 యతి.)

క్రమమున నననన సభభభగగణ కాంతిదినాధిపవిశ్రమ మై
ప్రమిదధరసలయభరితవిరచనన్ బంధురసింధురవృత్త మగున్.

భాస్కరవిలసితవృత్తము (భ-న-జ-య-భ-న-న-స-గ-12 యతి.)

సారసహితయతి సంగతవృత్తి న్సంచిరిభనజయభననసగంబుల్
పౌరసకులజలరాశిమృగాంకా, భాస్కరవిలసిత మన విలసిల్లున్.

26. ఉత్కృతిచ్ఛందఃపాదంబు షడ్వింశత్యక్షరంబు

భుజంగవిజృంభితవృత్తము (మ-మ-త-న-న-న-ర-స-వ-7-10 యతి.)

ధీవైదగ్ధ్యశ్రీవిక్రాంతాదిగిభదశమపదనిరతిన్ భుజంగవిజృంభితం
బై విశ్రాంతుల్ దైవాఱం జెన్నగుమమతననసరసహారియై లగసంయుతిన్.

మంగళమహాశ్రీవృత్తము (భ-జ-స-న-భ-జ-స-న-గగ-8-8 యతి.)

శ్రీనిలయవిశ్వనృపశేఖరకృతిస్తుతివశీకరణమంగళమహాశ్రీ
నా నెగడు సద్భజసనంబులతుదన్ భజసనంబులు గగంబును దనర్పన్.


క.

క్రమమున నిరువదియాఱై, యమరిన ఛందంబులందు నందంబులుగా
సముచితసమవడత్తంబుల, సమకూర్చితి నెఱుఁగవలయుఁ జతురులు మఱియున్.

2


క.

ఆలాగు గాక యుద్ధుర, మాలావృత్తములు నాఁగ మంజులతాలా
వాలములు నధికవర్ణవి, శాలమ్ములు నగుచుఁ బరఁగుఁ జతురుల కెల్లన్.

3

అందుఁ జత్వారింశన్మాత్రాగర్భితపాదంబు త్రింశదక్షరంబు

లయగ్రాహి (భ-జ-స-న-భ-జ-స-న-భ-య-8 పైఁ బ్రాసయతి)

పంబినయతిన్ భజసనంబులఁ బునర్భజస, నంబుల భయంబుల కదంబము లయగ్రా
హిం బెనుపునం బుధమతిం బరఁగుఁ బ్రాసనిళు, రుంబకము పాదముల నింబడరు చూడన్.

అట్ల చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు చతుస్త్రీంశదక్షరంబు

లయవిభాతి యనువృత్తము (న-న-న-న-న-న-న-న-న-న-స-గ)

నసననసనాకలితనసననసగంబుల వి, లసితతరపాదములఁ బొసఁగు నలువ్రాలం
బ్రసరితములై యలరుఁ బసలయవిభాతి యన, రసికులకు వీనులకు నొసఁగుఁ జవు లింపై.

అట్ల చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు సప్తత్రింశదక్షరంబు

లయహారి యనువృత్తము (న-న-న-న-న-న-న-న-న-న-న-స-గ-10పైఁ బ్రాసయతి.)

పదునొకఁడు నగణములఁ బొదలి సగణము గురువు
         మృదులపదరచనఁ దగి యొదవి మితివ్రాలన్
ముద మొసఁగు సభల నని చదువుదురు కవివరులు
         హృదయములఁ జతురతలు గదుర లయహారిన్.

అట్ల చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు చతుస్త్రింశదక్షరంబు

త్రిభంగి యనువృత్తము (న-న-న-న-న-న-స-స-భ-మ-స-గ.)

లలిననననననములు ససభమములు నతిసన యుక్తిఁ, జరింపం బ్రసరింపం బాటివహింపం
జెలువుగ నవకలి నిలుపఁగఁదగునెడ వెలయుఁ ద్రిభంగి, సురక్తిం బదభక్తిం బ్రాసనియు

మఱియు ననియతపాదంబు - దండకము

కృతినాది నసహంబు లొండెం దకారంబు లొండెం బ్రకల్పించి యామీఁద నెల్లం దకార
ప్రధానంబు గుర్వంతమై క్రాల నిచ్చానురూపావధిం బేర్మి నిర్మించుచో మించి తత్త
ద్గణవ్రాతమున్ వృత్త్యనుప్రాసధుర్యంబులై యర్థపర్యంబులై మోదితార్యంబులై
సాధుసారస్యహార్యంబులై రీత్యలంకారవంతంబులై పుష్టిమంతంబులై యింపు లంత లత
కింపాఱఁ గల్పింపఁగా దండకంబు న్నమన్మండలం బయ్యె రాజేంద్రకోటీరకోటీతటీ
నృత్యదాజ్ఞాగ్ర్యమాణిక్య విశ్వేశ్వరా విశ్వవిశ్వంభరాధీశ్వరా.

మఱియు నీవృత్తములు స్వస్థానార్థసమవృత్తములుఁ బరస్థానార్థసమవృత్తంబులు నన రెండుతెఱంగు లయ్యె నది యెట్లనిన:

క.

ఛందోవృత్తంబుల సమ, సందర్భము లీడుపడఁగ సముచితనికట
చ్ఛందఃపాదంబుల సర, విం దప్పక యుభయరూపవృత్తము లయ్యెన్.

4


క.

స్వస్థానార్థసమములుఁ బ, రస్థానార్ధసమములు రచనలచే న
ర్థస్థూలత నిరుఁదెఱఁగై, సుస్థిరవృత్తములఁ గృతుల సొంపుల నింపున్.

5


గీ.

మొదలిపాదంబు మూఁడవయదియు పరుపఁ, దద్ద్వితీయచతుర్ధపాదములు నట్ల
సమకవర్ణంబు లైన వృత్తములఁ జెప్ప, స్వపదజాతార్థసమవృత్తసంజ్ఞ వడయు.

6

నారీప్లుతవృత్తము

దానోదారశ్రమతా గానియుక్తిం, గానంగఁదాజస్థగగప్రసక్తిన్
నూనై చాళుక్యక్షమాపాలరమ్య, స్థానంబు నారీఫ్లుతసంజ్ఞ మయ్యెన్.

7

రతిప్రియవృత్తము

ఖ్యాతశ్రీమనజరగంబాలుండఁగాఁ ద, ద్గతంబులై జభసజగంబు లొందఁగా
వీతాఘప్రముదితవిశ్వ విశ్వభూపా, కృతిం దలంప నిది రతిప్రియం బగున్.

8

అజితప్రతాపవృత్తము

సజసాగణావలిఁ బ్రసన్ననభా, గ్రజరపంక్తి నభిరామరూపమై
యజితప్రతాపచెలువారుఁ గృతి, న్విజయవిక్రమణ విశ్వభూవరా.

9


గీ.

వలయుఛందంబు పాదంబుఁ దొలుత నిలిపి, యౌలఛందంబుపాదంబు నౌల నిలిపి
యోలి నెడనెట్టి యీగతి నొనరఁ జెప్ప, వెసఁ బరస్థానసమకార్ధవృత్త మయ్యె.

10

అందు మనోహరవృత్తము

చాళుక్యనృపాల తజావములం, గలయన్ససపాపరికల్పితమై
మేలొప్పఁగ, జెప్పిన మేదినిలో, విలసిల్లు మనోహరవృత్త మనన్.

కోమలవృత్తము

సలలితరీతి నజాయగణంబుల్, చళుక్యభూప జభసజస్థగస్థితిన్
మలయుచు నర్ధసమర్థతిచేత, న్వెలుంగఁ గోమల మనువృత్త మొప్పగున్.

11


క.

ఏకచ్ఛందోవృత్తా, నీకంబులు రెండు రెండు నిలుపుదు రిష్ట
శ్లోకార్దంబుల నోలి వి, వేకులు స్వస్థానవిషమవృత్తంబులకున్.

12

అందు అంగజాస్త్ర మనువృత్తము

దానబలేంద్రోదారభమంబుల్, పూనిసగాప్తిం బొంపిరివోవన్
జానార న్మసజంబు గస్థితం, బై నీడం జను నంగజాస్త్ర మై.

13

వారాంగి యనువృత్తము

చళుక్యవంశాజతజల్ గగంబుల్, చెలంగి యర్థంబునఁ జెంది రీతిం
గ్రాలంగఁ దాయత్తిజగానియుక్తిన్, మేలయ్య వారాంగి సమీహితాఖ్యన్.

14

నదీప్రఘోష మనువృత్తము

భారరము ల్మొగిఁ బ్రాగుపేతంబులై, చరించుచుండం జతజస్థరేఫలం
బరత్రిపాదంబులఁ బర్వునొప్పఁగన్, దిరంబుగా మూఁట నదీప్రఘోషమై.

15


క.

అందముగ నుపక్రాంత, చ్ఛందఃపాదంబు లౌల సాగెడు నికట
చ్ఛందఃపాదంబులతో, నందఁ బరస్థానవిషమ మనువృత్త మగున్.

16

అందు శ్రీరమణ మనువృత్తము

ఆరభమవ్యాయత్తసగవ్యా, పారము నాదిమపాదము సెందన్
జారుభిభాగగసంగతిచేతన్, శ్రీరమణం బని చెప్పిరి మూఁటన్.

17

శరభక్రీడావృత్తము

చతుర్వర్ణాధారాయమనసరగవ్యాప్తినాద్య
ద్వితీయాంత్యాంఘ్రిప్రస్తుతగతి నతిస్పష్టమైనన్
ఖ్యాతాసక్తిన్ మభనయయ తృతీయాంఘ్రి నొప్పన్
బ్రతిప్రేమోత్పత్తిం బరఁగి శరభక్రీడ యయ్యెన్.

18

సర్వపరస్థానవిషమవృత్తంబులలో వీణారచన యనువృత్తము

చాణక్యనయజ్ఞాతయసస్థసగంబుల్, వీణారచన కొందు భువిందససానంబుల్
శ్రేణిందజనస్థితిభససేవిత నియతిన్, రాణల నెలవై భస నజరంబు లోలిగన్.

19


క.

ఛందఃప్రస్తారక్రమ, సందృష్టం బైన వృత్తసంఘములో నొ
ప్పందము లగుపాదంబులఁ, బొందింపఁగ విషమవృత్తపుంజము లడరున్.

20

ఇది వివిధవిషమవృత్తలక్షణము

క.

మాత్రాగణరచనలకుం, బాత్రములై నెగడి యంధ్రభాషాకవితా
మిత్రములై రసభావా, మత్రములౌ జాతు లెఱుఁగ మంచిది కృతులన్.

21


క.

అందున గందంబులు నా, నందంబులు భజసనలగగాఖ్యలచే వా
నిం దగు నెఱుఁగం బ్రాసము- ముందుగ నిడి మూఁడు నైదు మూఁడున్నైదున్.

22


క.

ఆదిమవర్ణము వళి నిడు, పై దొరికినఁ గుఱుచయైన నట్టుల తత్త
త్పదాదుల నిలుపందగు, గాదిలిగాఁ జెప్పఁదలఁచు కందంబులకున్.

23


క.

నిడుదలగు పాదములకును, వడి నాలవగణము మొదల వలయు నిలుప నె
క్కడలను గురువును మూఁడవ, యెడ నలజలలోన నొకటి నిడ బెడఁగడరున్.

24


క.

ఇందుపుర బాణనగముల, కందువ జగణంబు నిలుపఁగాఁ గా దెపుడుం
గందములకు నార్యాదుల, చందం బధికంబు వానిఁ జనుఁ దెలియంగన్.

25


క.

కందము నర్ధంబులతుద, నందినగురు వుడుపఁ బథ్య యగు నాఱవచోఁ
జెందిన జగణము లత్వముఁ, బొందిన నది యార్యయనఁగఁ బొసఁగుం గృతులన్.

26


క.

క్రమమునఁ బథ్యార్యార్ధము,
లమరంగా వీడుపడిన నది గాథాభే
ధముగాఁగఁ బరఁగు ప్రపం, చము తెనుఁగునఁ జెప్పరండ్రు చతురులు కృతులన్.

27

సీసపద్యలక్షణము

క.

భావరసాలంకార, ప్రావిర్భూతాంధ్రకావ్యఫణితులకును ర
మ్యావాలము లగుసీసగ, ణావళిలక్షణము లెఱుఁగనగుఁ జతురులకున్.

28


క.

నలనగసలభరతగణం, బులు నసహంబులుసు ననఁగఁ బొలుపగు సీసం
బులు గీతులు వానఁగదా, యలవఱపఁగవలయుఁ గృతుల కందం బరయన్.

29


క.

ఒకగురువు రెండులఘువులు, నకలంకత సమమ కాన హనమలు దమలో
నొకఁడొకఁడు వీడుపడుచున్, వికటింపక చెల్లు నొక్కవృత్తము తక్కన్.

30


క.

అమరంగ విషమసీసము, సమసీసము లనఁగ రెండుచందము లందున్
బ్రమితమగు విషమసీస, క్రమ మెఱుఁగఁగవలయుఁ జతురకవిజనములకున్.

31


గీ.

హగణనగణంబు లేడు గుర్వంతమగుచు, విస్తరిల్లిన నుత్సాహవృత్త మయ్యె
దీనికుద గీతియొకఁడు సంధింప విషమ, సీస మిత్తెఱఁ గెఱుఁగుట చెలువు మతికి.

32


ఉత్సాహము.

ఓసరించుఁ బజ్జ లజ్జ లుజ్జగించు రాజులన్
వేసరించు గర్వపర్వవేషభూషితారులన్
వాసవానుకార వీరవర్య విశ్వభూప నీ
భాసురాసిధేనుకానుభావ మాహవంబులన్.

33

విషమసీసపద్యలక్షణము

గీ.

వడి దనర్పఁ బ్రాసవైభవం బలరార, నిట్ల గణనిరూఢి నెసక మెసఁగఁ
గీర్తితాతిమధురగీతియు బైగల్గ, నదియ విషమసీస మండ్రు కృతుల.

34

సమసీసపద్యలక్షణము

గీ.

వెలయు సమసీసములు పంచవిధము లయ్యె, నరయ నవకలిసీసాహ్వయంబుఁ బ్రాస
సీస మక్కిలిప్రాససీసాఖ్యసీస, ము వడిసీస మక్కిలివడిసీసమును ననంగ.

35


క.

తనపాదంబులు నాలుగు, మొనసిన పైగీతి పదములు రెండును గా
నినుమూఁడై సీసమునకు, జను నడుగులు వ్రాలు వళ్లు సరి యిన్నిటికిన్.

36

అవకలిసీసము

క.

అలవడిసీసము పాదము, నలుతునకలు చేసి మూఁట నలనామగణం
బుల రెంటి రెంటి నిడి య, వ్వలితునుక నహంబు లిడఁగవలయ న్వరుసన్.

37


సీ.

సామంబుచేఁ దుల్యభూమీశ్వరులు దనతోడ మిత్రతకు నఱ్ఱాడుచుండ
దానంబుచే నతిమానమానవనాథు లేర్పడ నక్కఱఁ దీర్చుచుండ
భేదంబుచేత దుర్మోదమహీశులం దంద సంక్షిప్తతి నొందుచుండ
దండంబుచేత నుద్దండమాండలికులాజ్ఞాచక్ర మౌదల మోచియుండ
శశ్వదనురక్తిఁ జాళుక్యవిశ్వవిభుఁడు, వాలి వసుమతి లీలమై నేలుననుచుఁ
జెప్ప నవకలిసీస మి ట్లొప్పునండ్రు, పూని కావ్యకళావేదు లైనకవులు.

38

ప్రాససీసము

క.

సీసమునకు నాఱడుగులఁ, బ్రాసము లిడి యోలి సర్వపదఖండములన్
భాసురముగ వ ళ్లలవడఁ,_జేసిన నది కృతులఁ బ్రాససీసం బయ్యెన్.

39


సీ.

చక్రవాళాచల చంద్రకాంతములకు సంతార్ద్రత్వంబు జరపి జరపి
చక్రీశలోకసంచరదురుసంతమసంబుల వడి బాఱఁ జదిపి చదిపి
శక్రేభశంకరశంకరాచలశశి చారుదీధితులపైఁ జాఁగి చాఁగి
చక్రస్తనీకుచసాంద్రచందనరసచర్చలపైఁ గేలి సలిపి సలిపి
విక్రమప్రతాపవిశ్రుతమూర్తియై, విశ్వభూమివిభునివిశదకీర్తి
ప్రక్రమప్రసక్తిఁ బ్రసరించు నని చెప్పఁ, బ్రాససీస మనఁగఁ బరఁగు నెందు.

40

అక్కిలిప్రాససీసము

క.

తుదిగీతి నాలుగడుగులు, వదలక ప్రాసంబు నిలిపి వ ళ్లింపారం
గదిరినఁ గదురగయున్న, న్నది యక్కిలిప్రాససీస మనఁగాఁ బరఁగున్.

41

సీ.

శ్రమయుక్తివిద్యల కందువ లెఱుఁగుచుఁ గవులనే ర్పారసి గారవించి
సమరసంక్రీడనక్షమసుభటాటోపసంచారములకు నుత్సాహ మూఁది
నమితాహితక్షమానాథులరాజ్యంబు నానాఁటి కొనర నున్నతము చేసి
ప్రముదితారాతుల భంజించి వేలుపుంబడఁతుల కింపారుపతులఁ జేసి
విమలకీర్తుల దిక్కులు విప్ప నేర్చు, శమితవిరతుండు విశ్వేశచక్రవర్తి
సముచితంబుగ నని చాల సన్నుతింప, నమరు నక్కిలిప్రాససీసాహ్వయంబు.

42

వడిసీసము

క.

ఏపాదమునకు నేవడి, యాపాదింపంగఁబడియె నది ఖండములం
బ్రాపింపఁ జెప్పఁగ వళిని, రూపితసీసం నాఁగ రూఢికి నెక్కున్.

43


సీ.

గ్రహదంష్ట్ర సోఁకని గ్రహరాజు ప్రియవధుకథనంబు నేర్చిన కల్పభూజ
మలరుఁదూపులు కేల నంటని కందర్పుఁ డమ్ముచే నింకని యంబురాశి
కన్నులు పెక్కులు గల్గనియింద్రుండు కఱకేది వంగని కనకనగము
తను వెత్తి క్రాలెడు ధర్మదేతవరూపుఁ దాల్చిన రాజవిద్యావిధూతి
నయవిదుండు రాజనారాయణుఁడు విశ్వ, నాథుఁ డనుచు వర్ణనములు సేయ
వరుస నిట్లు కృతుల వళిసీస మన నొప్పు, వసుధ వైభవాలవాల మగుచు.

44

అక్కిలివడిసీసము

గీ.

సీసఖండంబు వ ళ్లిట్లు చెప్పి గీత, ఖండవళి రెంటి కొక్కఁడుఁగా నొనర్ప
నదియ యక్కిలివడిసీస మండ్రు కృతుల, లక్ష్యములు రూచి యెఱుఁగుఁ డీలాగు లెల్ల.


క.

సీసములకు గీతులకుం, బ్రాసములును వళ్లుఁ గలయఁబడి కవితల ను
ద్భాసిల్లఁ దఱచు నియమ, వ్యాసక్తియుఁ గలుగుఁ జెప్పవలసినచోటన్.

45

గీతభేదములు

గీ.

ప్రవళినాఁ బ్రసన్న పదినాఁగ గీతులు, సీసములను రెండు చెందుఁ దుదల
నాటవెలఁది యనఁగఁ తేటగీతి యసంగ, వానిపేళ్లు వేఱ వలయుఁ దెలియ.

46


ఆ.

మూఁడునగణహగణములు రెండునలనామ, కములు హగణపంచకంబుఁ గూర్ప
నాటవెలఁది యడుగు లంబునిధులపట్ల, వ్రాలు వళ్లుఁ జెంది వఱలెనేని.

47


గీ.

నగణ మొక్కండు మఱి నలనామకములు, రెండు నగణంబులును గుద రెండునాలు
గడుగులును దేటగీతికి నబ్ధివిరతి, వలయు వళ్లైన వ్రాలైన వరుస నిలుప.

48

మేలనగీతి

గలము రెండునగణములును గలసి ప్రాస మెఱయు
జెలుపు దోఁప నెత్తుగీతి వెలయుఁ గృతులయందు
నోలి నగణ మెుండె హగణ మొండె నేడు చేసి
నాలుగడుగులందు నిలిపి నళువు దోఁప విరతి
వాలీ పంచమస్థ యగుచు వచ్చెనేని యొప్పు
మేలనాభిధాన మైన మేలుగీతి కృతుల.

49

తరువోజ

నలనామకంబులు నగణాంతములుగ నాలుగంఘ్రులయందు నాలుగుఁ గూర్చి
వళులు మూఁడెడలను వరుసతో నిల్పవలయు మూఁడవగణవర్ణంబు మొదల
నిలుపంగ నివ్విధి నిర్మించి విశ్వనృపతికి నిచ్చిన నింపుసొంపారుఁ
దలకొని తగఁ బ్రాలు దంపెడిచోటఁ దరుణులచే సొంపు దనరుఁ దర్వోజ.

50

ఇంద్రాదిగణలక్షణము

గీ.

ఓలి రెండు మూఁడు నాలుగు గురువుల, నెనగణము లినసురాధిపేందు
గణము లక్షరోపకరణంబు లవి యాది, లఘుగణంబు మొదల లఘువు నిలుప.

51

సూర్యగణములు

U౹, ౹౹౹

ఇంద్రగణములు

౹౹౹౹, ౹౹౹U, ౹౹U౹, U౹౹, U౹U, UU౹

చంద్రగణములు

U౹UU, ౹౹౹UU, UU౹U, ౹౹U౹U, U౹౹U,౹౹౹౹U, UUU౹, ౹౹UU౹, U౹U౹, ౹౹౹U౹, UU౹౹, ౹౹U౹, U౹౹౹, ౹౹౹౹౹

[1]అక్కరలక్షణము

వ.

ఇత్తెఱంగున రవీంద్రచంద్రాఖ్యగణంబులలోన సప్తగణకల్పనీయం బై మహాక్కరంబు,
షడ్గణకల్పనీయం బై మధ్యాక్కరంబును, బంచగణకల్పనీయం బై మధురాక్కరంబు
ను, జతుర్గణకల్పనీయం బై యంతరాక్కరంబును, ద్రిగణకల్పనీయం బై యల్పాక్క
రంబు నానక్కరవృత్తజాతంబులు పంచవిధంబులం బరఁగు నందు.

52

మహాక్కరం బెట్టిదనిన

వారిజాప్తుండు పంచేంద్రగణములు వనజారియును గూడి వెలయుచుండ
నారయ రెండవనాలవచోట్ల నర్కుండయి ననుం దనర్చుచుండఁ
గోరి యవ్వడిపంచమగణమునఁ గూడి మొదలు నిలుపంగ నగు
సారమై ప్రాసవడి సప్తగణములు సాఁగ మహాక్కర మతిశయిల్లు.

53

మధ్యాక్కరం బెట్లనిన

వరుసతో దేవేంద్రసూర్యవజ్రిరవుల......
విరచించి నాలవపట్టు విశ్రాంతి సదనంబు చేసి
తరబడిఁ దప్పక చెప్పఁదగునండ్రు మధ్యాక్కరంబు
కరవాలభైరవుపెంపు గణషట్కమున నుతియింప.

54

మధురాక్కరం బెట్లనిన

తరణివాసవత్రితయంబు ధవళభానుయుతి నొంద
నిరతి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
సరసమధురార్థములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయ.

55

అంతరాక్కరం బెట్లనిన

కమలమిత్రుండు సురరాజగణయుగంబు, కమలశత్రునితోఁ జెంది కందళింప
నమరుఁ బ్రావళ్లు నర్ధంబు నతిశయిల్ల, నమల మగునంతరాక్కర మబ్ధిసంఖ్య.

56

అల్పాక్కరం బెట్లనిన

సుమనఃపతియుగము సోముండును, నెమకంగఁ బ్రావళ్లు నిండిమీఱ
గమనీయవిభవంబు గాంచు నెప్డు, రమణీయ మల్పాక్కరము కృతుల.[2]

57

షట్పది

సురపతులిరువురు సురపతులిద్దఱు, సురపయుగమ్ముతో సోముండును
బరువడిఁ బెసఁగొన నరుదుగ షట్పది, సరిఁబ్రాసములు దనరారంగను.

58

చౌపది

భసగానలములపైని గరంబు, న్నెసఁగఁగ మూఁడవయెడ విరమంబుం
బొసఁగినఁ జౌపదిఁ బొలుచు రసంబుల, గసవరముగఁ దగుఁగద ప్రాసంబున్.

59

త్రిపది

త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు
ద్యుపదు లిద్దఱు సూర్యు లిర్వు రౌలర్యుపతిద్వయార్కులు నౌల.

60

ద్విపది - మంజరి

శక్రత్రయంబును సవితృండుఁ బాద, విక్రీడితులు మృదుద్విపదికి నెపుడు
వళియుఁ బ్రాసంబును వలయు దీనికిని, వలదు ప్రాసం బండ్రు వరుస మంజరికి.

61

షత్ప్రత్యయములు

గీ.

నచ్చిప్రస్తారసంఖ్యా ననష్టములును, నౌల నుత్దిష్టలగకరణాధ్వములును
ననఁగ షట్ప్రత్యయము లిందుఁ దనరు వాని, నెఱుఁగ నేర్చుట ఛందంబు నెఱుఁగునేర్పు.

62

ప్రస్తారము

క.

గురుపంక్తి నిలిపి మొదటను, గురువునకుం గ్రింద లఘువుఁ గొని దానిపయిన్
సరిచేసి పిఁఱుద గురు లిడి, పరువడి లఘ్వంతమైనఁ బ్రస్తార మగున్.

63

సంఖ్యానము

క.

గురుపంక్తి మొదలు రెండిడి, వరుసను రెట్టింపఁ దుదకు వచ్చిన సంఖ్యా
పరిమాణము తచ్ఛందో, విరచితవృత్తములుగా వివేకింపఁదగున్.

64

నష్టము

గీ.

అరసి వృత్తసంఖ్య నర్ధించుచో సరి, యైన లఘువు విషమ మైన గురువు
గొనుచు బేసి నొకఁడు గూడి యర్గము సేయ, నవధి నష్టవృత్త మబ్బు నండ్రు.

65

ఉద్దిష్టము

క.

వలసినవృత్తగణాలిమొ, దల నొక్కఁడు నిలిపి తుదకుఁ దగ రెట్టింపం
గలలఘువుల పై లెక్కలు, నొలయఁగ మఱియొకఁడు గూడ నుద్దిష్ట మగున్.

66

లగకరణము

క.

ఎక్కువ యొకఁడుగ వృత్తపు, టక్కరముల దొంతి పేర్చి యట మీఁదటికై
యొక్కొకఁడ విడిచి యెన్నిన, రెక్కలు గురులఘువిమిశ్రలిఖితగణంబుల్.

67


క.

ఆలెక్క లన్ని యెన్నిన, లోలత లఘువులును గురువులును గలిగెడు వృ
త్తాలి నవి గలయఁ గూడిన, నోలిం దద్వృత్తసంఖ్యయును నొనఁగూడున్.

68

అధ్వపక్రియ

క.

వృత్తసంఖ్య నిడుపు వెడలుపు రెట్టించి, వాని నొక్కఁడొకఁడు వరుస నెన్న
నెన్ని యయ్యె నన్ని యెసఁగు నంగుళు లవి, ప్రస్తరింప నిడుపు పరఁగు విప్పు.

69


శా.

అందంబై శ్రుతిమూలమై విలసదుద్యత్సర్వలోకాశ్రయా
నందం బై సమవృత్తమై వివిధవర్ణశ్రావ్య మై సద్రస
స్యందం బై బహువిశ్రమంబయి భవచ్చారిత్రముంబోలె ని
చ్ఛందశాస్త్రము పర్వు నుర్వరను విశ్వక్షోణిపాలాగ్రణీ.

70


శా.

కావ్యాలంకృతికల్పనక్షమకళాకల్యాణ కల్యాణ
ర్ణవ్యాపారసమృద్ధ యుద్ధవినమద్రాజన్య జన్యస్థల
క్రవ్యాదావళిగీయమానవిజయప్రారంభ రంభాదిరం
తవ్యస్త్రీసుఖవృత్తిసుందరసపత్నిస్తోత్రపాత్రోదయా.

71


క.

నిఘ్నాఖిలశోభన వృ, త్రఘ్నమహత్తరవిభూతి రంజితజంఘా
డఘ్నారినన్యజయ ని, ర్విఘ్నోదయసదయవినుత విశ్వాసనిధీ.

72


మాలిని.

స్తుతిహిమకరజూటా చూర్ణితద్విట్కిరీటా
ప్రతతగుణపరీణా పంచధారాధురీణా
సితకరకులదీపా స్నిగ్ధబద్ధప్రతాపా
సకతలసదిభిఖ్యా సర్వలోకాశ్రయాఖ్యా.

73

గద్యము
ఇది శ్రీమదుమారణచరణావిందవందన గోవిందామాత్యనందన
వివిధబుధవిధేయ విన్నకోట పెద్దయనామధేయవిరచితంబైన
కావ్యాలంకారచూడామణి యను నలంకారశాస్త్రంబు
నందు ఛందోగణజన్మశుభాశుభనిరూపణవివిధవళి
ప్రాసప్రపంచలక్షణ సమవృత్తజాతికల్పన
షట్ప్రత్యయదర్శనాదిసముద్దేశంబునం
దష్టమోల్లాసము.

—————

  1. అక్కఱలక్షణము
  2. ఇది గీతపద్యమువలె నున్నది.