Jump to content

కావ్యాలంకారచూడామణి/నవమోల్లాసము

వికీసోర్స్ నుండి

నవమోల్లాసము

—————

వ్యాకరణము

క.

శ్రీవిశ్వేశ్వర విజయ, శ్రీవిశ్రమహర్మ్యబాహుశిఖరఋతోక్తీ
శ్రీవిశ్వగహ్వరీస్తుతి, శ్రీవిభ్రమదాలయప్రసిద్ధవిభూతీ!

1


క.

భవదనుమతి సూరిసుఖ, ప్రవణం బయినట్టి యంధ్రబంధురరుచిమ
త్కవితాస్పద మగుపలుకుల, వివరింతుం దెలియఁ బెక్కువిధములు జగతిన్.

2


క.

యుక్తివిశేషము కబ్బం, బుక్తివిశేషంబు గాదు యోగ్యునకైనన్
యుక్తివిశేషము సాధ్యం, బుక్తివిశేషం బసాధ్య మూహింపంగన్.

3


మ.

విలసద్భావరసాద్యలంకృతులచే విప్పాఱి గీర్వాణభా
షల కబ్పంబుల కెన్నిమంచితనము ల్సంధిల్లు నాచంద మై
వళియుం బ్రాసము వంత కగ్గలములై వర్తిల్లు సత్కావ్యముం
దెలుఁ గంచుం జెవిఁ బెట్ట లేమి యుడుపం దేఁగల్గునే మం దిలన్.

4


క.

ధర శ్రీపర్వతకాళే, శ్వరదాక్షారామసంజ్ఞ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం, బరుదారఁ ద్రిలింగదేశ మనఁ జనుఁ గృతులన్.

5


గీ.

తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ, దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె
వెనుకఁ దెనుఁగుదేశమును నండ్రు కొంద ఱ, బ్బాస పంచగతులఁ బరఁగుచుండు.

6


గీ.

తెలుఁగు దేశభాష తెలియుఁ బొమ్మనఁబోక, తెలియవలయు మించు తేటపడఁగ
దొడవు గాక పసిఁడిఁ దొడిగిన నొప్పునే, కనక మింట నెంత కలిగెనేని.

7


గీ.

విశ్రుతులు హేమచంద్రత్రివిక్రమాదు, లొనరఁ జూపిరి ప్రాకృతంబునకుఁ ద్రోవ
నంధ్రభాషయుఁ బ్రాకృతాహ్వయము కాన, వలయుఁ దల్లక్షణంబులు వరుసఁ దెలియ.

8


క.

స్వరములు నచ్చులు ననఁగా, నరయ నకారాదిసంజ్ఞ నయ్యక్కరముల్
దిరముగ హల్వ్యంజనములు, వరుసఁ గకారాదిపంచవర్ణాక్షరముల్.

9


క.

యరలవ లంతస్థలు నా, నురవగు శషసహలు పొలుచు నూష్మ లనంగాఁ
బరువడిఁ బ్రయోగములయెడ, విరచింపుదుఁ దెలియవలయు వీనితెఱంగుల్.

10

క.

భువిలోఁ దత్సమమును ద, ద్భవమును సహజాంధ్రదేశభవమును దేశ్యో
ద్భవమును గ్రామ్యము నాఁ బం, చవిధములై తెలుఁగుఁబలుకుజాతము పరఁగున్.

11

తత్సమలక్షణము

గీ.

పరఁగ సంస్కృతంబుపైఁ దెనుంగువిభక్తు లునుపఁబడి పొసంగె యుండెనేని
తత్సమంబు నాఁగఁ దగునండ్రు సుకవులు, తద్విహీనకావ్యతతియు లేదు.

12


చ.

పరమవినీతిమంతు లగుపార్థివకోటికి విశ్వమేదినీ
వరుస నాగ్రహంబుఁ జిరవైరము సత్యవిహీనవృత్తమున్
బిరుదమదంబుఁ గైతనము భేదవిధానము దుర్ణయంబు మ
త్సరమును వర్జనీయ మనఁ దత్సమమై చను నంధ్రభాషకున్.

13


క.

వదలక సిద్ధాక్షరములఁ, బొదివిన వర్ణములఁ దూలిపోఁ బలుకఁగ స
ర్ధదమై ప్రాకృతనిభ మగు, నది తద్భవపదము నాఁగ నభినుత మయ్యెన్.

14


సీ.

యజ్ఞంబు జన్నంబు యత్నంబు జతనంబు చంద్రముఁ డనుపేరు చందమామ
యోధులు జోదులు యోగులు జోగులు భేదంబు బిందంబు పృథివి పుడమి
విష్ణుండు వెన్నుండు వెజ్జు నా వైద్యుండు పుస్తంబు పొత్తంబు ప్రోడ ప్రౌఢ
కుబ్జుండు గుజ్జుండు కుక్క కుర్కుర మగు శయ్యయు సజ్జ నా జాది జాతి
యనెడు పల్కులు తద్భవాహ్వయము లండ్రు, వీని నన్నిటి నెఱిఁగి వివేకబుద్ధి;
గబ్బములు చెప్పుకవులచక్కనము మెచ్చు, విపులవిద్యుండు చాళుక్యవిశ్వవిభుఁడు.

15

దేశ్యలక్షణము

క.

శ్రేయములై బహుదేశా, నేయములై చక్కఁదనము నెఱదనములు నై
యాయానెలవులఁ జెవులకుఁ, దీయము లగుపలుకులెల్ల దేశ్యము లరయన్.

16


సీ.

వాలాయ మాలంబు పంగడ మంగడ సోలంబు చొక్కులు సోయగంబు
వి న్నన్ను నెన్ను వావిరి నంత వాగెంబు డెందంబు డిప్పాడి డిల్లపాటు
నెమ్మోము నెత్తమ్మి నెలఁత క్రొన్నెల కొమ్మ లావడి యొయ్యాక మారజంబు
పొక్కుడు నెవ్వీఁగు పొచ్చెంబు మచ్చిగ యక్కజం బచ్చెరు నక్కు నిక్కు
వెలఁది చిగు రెల్లి వేనలి వేనవేలు, నాఁగఁ జనుశబ్దములు దేశినామకములు
వీనఁ జెప్పినకవితల వినుచు మెచ్చుఁ, జారుతరకీర్తి విశ్వేశచక్రవర్తి.

17

అచ్చతెలుఁగు లక్షణము

క.

ఈమూఁడుతెఱంగులలో, నేమిటనున్ దొరలకున్న నెల్లజనులకున్
లో మిగులఁ దేటపడియెడు, నామాటల యచ్చతెనుఁగు లన నెగడొందున్.

18


చ.

ఎనుములు గుఱ్ఱము ల్మొదవు లెడ్డులు బండులు పండు లుప్పు ప
ప్పనుములు కొల్లు లాముదము లాకులుఁ బోఁకలు నేయి నూనె యే
పురఁ బెనుపొందు విశ్వవిభుప్రోల ననం దగ విన్నవారికిన్
మనమునఁ దేటఁగాఁ దెలియుమాటల యచ్చతెనుంగు నాఁ జనున్.

19

గ్రామ్యలక్షణము

క.

ఈసడములు గోరడములు, గా పరబీసరలు నైన కట్టిఁడిపలుకుల్
భాసిల్లు గ్రామ్యములు నా, హాసోక్తులఁ దెగడుచోట ననియును నొప్పున్.

20


సీ.

ఊసలు వేసలు వేసాలు దోసాలు దోసలు వేదాలు గాసడాలు
బొందలు గుద్దలు బొక్కలు గుండలు గంతలు మొదలైన కారకములు
దాని గొంచారమ్మి దీని గొంటూ బోకు మేనూను నీవూను యేగవలయు
పాడేము సూసేము పైలురా గాసేము రాసేవు సేసేవు లేసిరాకు
మనెడు క్రియలును మొదలైన యట్టి గ్రామ్య
శబ్దములు శబ్దములు గాఁగఁ జనవు మెఱసి
కవుల మనుకొను నయ్యూరఁగవుల కైపు
వినిన నగకున్నె చాళుక్యవిశ్వవిభుఁడు.

21

తత్సమశబ్దపరిజ్ఞానము

గీ.

వెలయుసంస్కృతంబు తెలిఁగించుతెఱఁగు సం, ధులు విభక్తిచయవిధులు సమాస
తద్ధితములుఁ క్రియలు తగుభంగి నెఱిగింతు, నమరశాస్త్రసరణి ననుసరింప.

22

అజంతప్రకరణము

క.

నిడు పుడుపవలయు సంస్కృత, మెడపక లింగములు మూఁట నేకాక్షరముల్
విడిచి యజంతాదుల కీ, నడక యవశ్యప్రయోజనము తెనుఁగునకున్.

23


క.

బిందువిసర్గంబులు గడ, నందిన పొల్లులను దక్కి యంధ్రవిభక్తుల్
పొందుగ సంస్కృతపదముల, ముందటిదెస నిలుప నందముగఁ దెనుఁ గయ్యెన్.

24


క.

స్థావరతిర్యక్పదములు, దేవమనుష్యాదికములుఁ దెనిఁగించునెడన్
వావిరి నజంతములతుదఁ, గావించు ముకారమును డుకారము నునికిన్.

25

గీ.

దానకల్పకుజము దర్ఫోగ్రసింహమ్ము, రజనికరుఁడు కాంతి విజయుఁ డాజిఁ
దనర విశ్వనాథుఁ డన నకారాంతశబ్దములఁ దెనుఁగుపఱుచు భంగు లయ్యె.

28


క.

రవి యరితిమిరాపహతం, బవి పరగిరివిహతి రసవిభావప్రతిభం
గవి విశ్వేశ్వరుఁ డనఁగా, భువినీద్వయమునకు నిదియపో తెనిఁగింపన్.

27


సీ.

ఇల నుకారాంతపదములఁ దెలుఁగు సేయఁ, గడ వుకారంబు నుండు డుకార ముండు
రాజనారాయణుఁడు నృపప్రభు వనంగ, విశ్వనాథుండు నృపులకు విభుఁ డనంగ.

28


క.

మనుకటుపటుశబ్దాదుల, నొనరింప డుకార మెపుడు నుండదు కవితం
దెనిఁగించి చెప్పుచోటం, దనకు వుకారంబ యర్థదాయక మగుచున్.

29


గీ.

మనువు ధర్మశాస్త్రమతమున మిక్కిలి, కటువు బిరుదవినతి కర్ణములకు
జాలఁ బటువు ధరణి సంగీతసాహిత్య, సరణి విశ్వనాథచక్రవర్తి.

30


క.

వెలయు ఋకారాంతపదా, దులఁ దెనుఁగుగఁ జేయుచోటఁ దుదివిడుపులు గు
జ్జులు సేయందగు నృపులకుఁ, జలుక్యపతి కర్త భర్త సంహర్త యనన్.

31


క.

స్త్రీలింగంబుల నిడుపులు, వాలాయము నుడుపఁ దెనుఁగువచనము లగు నం
దాలోలస్త్రీహ్రీశ్రీ, ధీలనులపితములు దక్కఁ ద్రిక్కినవెల్లన్.

32


క.

స్త్రీలకు మదనుఁడు విజయ, శ్రీలకు రఘురాముఁ డెపుడు హ్రీలకు నుచితా
వాలము నిజపాలితభూ, ధీలకుఁ దగుపదము రాజదేవేంద్రుఁ డిలన్.

33


క.

శ్రీవిష్ణువర్ధనాఖ్య, క్ష్మావరుభూవర వెపుడును మాకు సనంగా
భావగు నేకాక్షరశ, బ్దావళి యప్పిఱుఁద నొకరుఁ డంటక యున్నన్.

34


క.

వనితా యనుచో వనితయు, జననీ యని పలుకుచోట జననియును వధూ
యనుచోట వధువు తెనుఁగునఁ, జను నాయీయూలు తుదలఁ జను పలుకులకున్.

35


క.

ఐకారాంతము లోకా, రౌకారాంతములుఁ దెనుఁగు లైనప్పుడు పూ
ర్వాకృతితోడన యుండును, నోకారాంతంబుపై బహుత్వము నొందున్.

36


క.

రై పరఁగును నడుగోవున, గోవులు విదుకంగ గ్లౌనికులనృపతులు ధ
ర్మానిష్కృతిఁ బడయుదు రనఁ, గా వెలయుఁ గవిప్రయోగగతిఁ దెలియoగన్.

37


వ.

ఇది యజంతంబులు తెనిఁగించుతెఱం గింక హలంతవిధియు నెఱిఁగింతు.

38

హలంతప్రకరణము

క.

భూభుగ్విరాడ్పదంబులు, శోభితముగఁ దెనుఁగుపఱుచుచోఁ దుద పొల్లల్
ప్రాభవ మతివర్ణము లగు, భూభుజులు విరాజు లనఁగఁ బొలుపై యునికిన్.

39

క.

బలవన్మతమత్పదముల, తలమున్న నకార మెడలుఁ దగఁ దెనుఁ గగుచో
బలవంతుఁడు మతిమంతుఁడు, చళుక్యపతి యనఁగ సర్వశాస్త్రములందున్.

40


గీ.

ద్విట్పదంబు వేదవిత్పదంబును దిక్ప, దమును బూర్వవర్ణతను భజించు
విద్విషుండు నాఁగ వేదవిదుండనఁ, దూర్పుదిశ యనంగ నేర్పరింప.

41


క.

చేరు నకాచాంతముల డు, కారముఁ దెనిఁగించుచోటఁ గుఠినాత్ముఁ డనన్
దారుణకర్ముఁ డనంగను, మేరుమహాధన్వుఁ డన నమృతధాముఁ డనన్.

42


గీ.

వలసినపుడు కర్మనగ్మశబ్దంబుల, పైడుకార మెక్కుఁ బాసిపోవు
రామశర్ముఁ డనఁగఁ గామవర్ముఁ డనంగ, వసుధశర్మ యనఁగ వర్మ యనఁగ.

43

సంధిపరిచ్ఛేదము

వ.

ఇది సంస్కృతపదంబుల కాంధ్రీకరణం బింక నజంతహలంతసంధు లనంగ రెండు
దెఱంగు లయ్యె నందు నజంతసంధి యెట్టి దనిన.

44


సీ.

ఆదిశీబ్దాంతవర్ణంబు నంత్యశబ్ద, పూర్వవర్ణంబుతో గూడఁ బొత్తుచేయ
సంధి యగుఁ గారకక్రియాసంగతములు, పెక్కురూపంబు లవి గానిపింతుఁ దెలియ.

45


గీ.

తెలుఁగుఁబలుకులు వెలిగాఁగ దివిజభాష, లమరఁ దెనిఁగించినప్పుడు నచ్చుతోడి
వ్యక్తులై యుండునయకాని వానితోడి, వర్ణవర్ణైకభావంబు వలను గాదు.

46


క.

అచ్చుతుదియచ్చు పట్టున, వచ్చి యకారంబు నిలుచు వలసినయెడఁ దా
నచ్చయి యిత్వోత్వంబులఁ, జొచ్చు న్రచితార్థవాదసూచక మగుచున్.

47


క.

వేయిచ్చుట యీవులయెడఁ, వేయుడుపమి యరుల యెలమి సిదుముట యిలయుం
బాయక యేలుట యేచుట, యీయధిపతి కొనరు నాఁగ నివి లక్ష్యంబుల్.

48


క.

పోయితి పపుడప్పుడు నీ, వీయని కేతెంచి తేయు మేయు మనంగాఁ
బాయక యేయే యనఁగా, నీయుభయముఁ జెల్లుఁగ్రియల నిడ నొక్కొకచోన్.

49


గీ.

ఒనర సంబుద్ధి నోతండ యనఁగ నోతఁ, డనఁగఁ బూనిన వీని కనర్హ మగున
యర్ధ మిమ్మిమ్ము కొమ్మమ్ము మనెడుచోట, నూఁదు టెప్పుడుఁ దెనుఁగున కుచిత మరయ.

50


గీ.

అట నుకారాంతషష్టి పై నచ్చు మొదల, నొనరఁ బొల్ల నకారంబ యుండవలయుఁ
బోతునూ రేతునాలు నాఁబోలుఁ గాని, నగియుఁబోతూరు నేతాలునాఁగఁ జనదు.

51


గీ.

అచ్చికారాంతషష్ఠిపై నడఁగుఁ బొడము, నింటి దింటిది యనఁ జెల్లు నెల్లకడల
నర్థిదర్దిది యననొప్పు నంధ్రకవితఁ, గవులయనుమతి నిదియును గావవలయు.

52

క.

అచ్చులపై హ ల్లుండిన, న చ్చుండినఁ దద్ద్వితీయ కపుడు నకారం
బ చ్చుడిగి హల్లు లుండిన, మచ్చికమైఁ బోవు వచ్చు మఱియొక్కొకచోన్.

53


క.

భువి నైని కెగంటి ని కెగు, రువునకు నంధునకు బిరుదదూరునకారం
బివి అంతంబులపైనిం, దవిలిన బహువచనయుక్తిఁ దనరకయున్నన్.

54


క.

.... .... .... .... ...., .... .... .... .... ...... .... ..
.........౦టికి సంధినకారం, బుంట యసన్మార్గ మందు రుఱ్ఱంతములన్.

55


క.

నిడుపున జకారభావము, పడసియు హ్రస్వమున నెల్లపట్టున నుత్వం
బడరు నకారపుఁ బొల్లుకు, నిడఁ దగుఁ బూర్వప్రయోగ మెఱిఁగి కవీంద్రుల్.

56


క.

నేను బదరింతు నీవలెఁ, గానము విశ్వావనీశు కడ నునుపేనిం
దానాకును నభిమత మగు, నానగుఁ గా దేను నేను గా నేకోక్తిన్.

57


గీ.

అచ్చు పరమైనపట్టునఁ బ్రాణిపదము, కర్మమగుచోటఁ దక్క నుకారయుక్తి
వాడుకొనరు నకారభావమున దాని, ననుచరింపుదురగు కవిత్రయానుమతిని.

58


క.

రిపు నోర్చె రిపుని నోర్చెను, రిపు నాజి జయించె నుగ్రరిపుని జయించెన్
నిపుణతఁ జళుక్యవిశ్వా, ధిపుఁ డనఁగాఁ దెనుఁగుసంధితెఱఁ గొప్పారున్.

59


గీ.

తద్ద్వితీయవిభక్తిపొంతలఁ జరించు, కద్దిగల సున్న సోఁకునఁ గచటతపలు
గజడదబ లగు నూఁదుట గలుగుఁ గవుల, యనుమతంబున నొక్కయవసరమున.

60


గీ.

జడులఁ గరుణించుఁ జతురులఁ జాలఁ బ్రోచు, వాజిపదకాయంబున వశము సేయు
భటులఁ దనియించుఁ బ్రజలకుఁ బాడినడపు, శస్తవినయుండు చాళుక్యచక్రవర్తి.

61


క.

అలఁతులఁ దుదహల్లులకును, నలవడ నామమున నుండి యిచ్చోటులచేఁ
బలుమఱుఁ దేలుచు నూఁదుచు, విలసిల్లుచు గలుగు లక్ష్యవిధి నెఱుఁగఁదగున్.

62


క.

తనుఁ బొగడుఁ దన్నుఁ బొగడును, జనుఁడు జనుం డనఁగ నెసఁగుజాడలు గలుగున్
మనవాఁడు వీడు నాఁగాఁ, జను నిడుపులు వలన దూఁద సరిళతకొఱకున్.

63


క.

మొల్లమ్ముగ నెల్లెడలను, హల్లులపై నిడుపు లగుచు నాయీయేయో
లుల్లసితాకృతి నిలుపం, జెల్లుం బ్రశ్నానునయవిశేషములందున్.

64


క.

రారా నాగారీ ము, న్నీరే కర్ణాదిదాత లిట్టివదాన్యో
దారక విన మందఱు నట, పోరో విశ్వేశు వేఁడ బుధులన నెపుడున్.

65


క.

రుచిరముగఁ బిలుచుచోటను, బ్రచురంబుగఁ బ్రథమపొంతఁ బడియుండెడున
క్కచటతపంబులపట్లను, బ్రచురించుం గసడదవలు పరిపాటిమెయిన్.

66

గీ.

విశ్వవిభుఁడు గడిది వీరుండు సతురుండు, డక్కుఁద్రిక్కులేని చొక్కులాఁడు
దత్త్వవిదుఁడు నరవిదారణశీలుండు, ననఁగఁ దెనుఁగుసంధి యలరు నిట్లు.

67


క.

డులు రునులను నీవర్ణత, తులు మొదలుగఁ గొన్ని గొన్ని తుద హల్లులతోఁ
గల మునెడఁ గూడు విడుచుం, దెలుఁగున కగుసంధి దీనిఁ దెలియఁగవలయున్.

68


గీ.

వేడ్క వేడుక వ్రేల్మిడి వ్రేలుమిడియు, మార్మలసె మఱుమలసెను మాన్పు మాను
పుము విరోధము సంక్రాంతిఁ బొలుచు నిట్టి, సంధిలక్షణ మెంతయుఁ జను నెఱుంగ.

69


క.

ఇది సంధిక్రమ మరయఁగఁ, దదుచితసంధానవిధులు తఱచెఱుఁగుఁ డిలన్
విదితవిభక్తులగతిఁ జె, ప్పుచు దెలియన్వలయుఁ బూర్వబుధకృతసరణిన్.

70

విభక్తిప్రకరణము

వ.

ప్రథమయు ద్వితీయయుఁ దృతీయయుఁ జతుర్థియుఁ బంచమియు షష్ఠియు సప్త
మియు సంబోధనంబును నన నెనిమిది తెఱంగుల విభజింపం గారణంబు గాన విభక్తు
లనం బరఁగుఁ దత్ప్రకారం బెట్టి దనిన.

71


క.

తెలుఁగుం బ్రాకృతభంగిన, బలియుటచే నేకవచన బహువచననపదం
బుల కాని ద్వివచనంబులు, గలుగవు తత్క్రియలఁ గారికంబులయందున్.

72


క.

ముడులు తుదఁ గలుగుశబ్దము, లడరుం బ్రథమావిభక్తు లవి కర్త లగుం
గడు నొసఁగు నిష్టములు ధరఁ, బొడమిన కల్పకము విశ్వభూవిభుఁ డనఁగన్.

73


క.

నునివర్ణంబులు తుది నొం, దిన కర్మపుఁబదము దా ద్వితీయ యనంగాఁ
జనుఁ జాళుక్యధరిత్రీ, పుని విశ్వేశ్వరుని సిరులు వొందు ననంగన్.

74


క.

చేత ననుపలుకు తుదలఁ బ్ర తీతం బగునేని యది తృతీయ యగుం బ్ర
ఖ్యాతంబుగ విశ్వేశ్వరు, చేతం బ్రభవిల్లు నెల్లసిద్ధు లనంగన్.

75


క.

పలుకులతుదఁ గై శబ్దం, బలపడ నిలిచినఁ జతుర్థి యగు విశ్వమహీ
లలనునకై యలమునకై, చెలువారం గృతులు కవులు చెప్పుడు రనఁగన్.

76


క.

పదముతుద వలన ననియెడు, పద ముండినఁ బంచమీవిభక్తియ పుష్ప
ప్రదరుఁ డగు విశ్వభూవర, మదనువలనఁ దొలఁగు సతులమానం బనఁగన్.

77


క.

అమరి కుశబ్దము పాదాం, తమునం దున్నేని షష్ఠి తప్పదు విద్యా
సముదయము విశ్వవసుధా, రమణునకుం బొలుచు నిల నిరంతరము ననన్.

78


క.

పలుకుతుద నందు ననున, ప్పలు కుండిన సప్తమీవిభక్తి యగు న్ని
శ్చలితచతుర్దశవిద్యా, విలసనములు పొలుచు విశ్వవిభునం దనినన్.

79

గీ.

ప్రథమ గావించు ముడులను బాయఁబెట్టి, కట్టెదురఁ బల్కు సంబుద్ధి కడుఁదనర్చు
విక్రమాటోప చాళుక్యవిశ్వభూప, పటుగుణావాల గండగోపాల యనిన.

80


క.

కోరి ముకారముమీఁద డు, కారముపట్టునను దగ లుకారము నిడిఁ బెం
పారున్ బహువచనంబులు, హారము లింగములు విబుధు లమరు లనంగన్.

81


క.

కడల ముకారడుకారము, లుడుపఁగఁబడు నచ్చతెనుఁగుటుక్తులయందుం
గడ గడలు గొడుగు గొడుగులు, బడుగు బడుగు లేకవచనబహువచనములన్.

82


క.

చింతింపఁగ నెవ్విధిని హ, లంతంబులు చెల్లు నిలఁ గ్రియావంతులు శ్రీ
మంతులు ధీమంతులు గుణ, వంతులు భూభుజులు వైరివధవిదు లనఁగన్.

83


క.

ధర బాలుమీఁదిడుత్వము, పరువడి రుత్వంబు నొందు బహువచనము బా
లురు భూపాలురు కరుణా, దరలోలు రనంగఁ దగు నుదాహరణంబుల్.(?)

84


గీ.

వాఁడు వీఁడను నవి బహువచనములను, వారు వారలు వాండ్రును వీరు వీండ్రు
వీరలును నాఁగ నెందును విస్తరిల్లు, గాఁడునకు గారు గాండ్రును గలుగు నండ్రు.

85


గీ.

కొఱను నెఱను మ్రాను కొల నను నివియెల్ల, బహువచోనియుక్తిఁ బరఁగుచోట
వెలయుఁ దత్పదములఁ గులు జనియించుఁ బై, వరుస నచ్చితెనుఁగువచనములకు.

86


క.

కొఱకులు నెఱఁకులు మ్రాఁకులు, జిఱుఁగొలఁకులు నయ్యెఁ బేను జేనును మీనుం
గొఱపేలుఁ జేలు మీలన, నురువగు నిల నచ్చతెనుఁగు లూహింపంగన్.

87


క.

పల్లు వి ల్లిల్లు నాఁ జనుపలుకులెల్ల, బండ్లు వీం డ్లిండ్లు నాఁజను బహుత నొడువఁ
బాడుఁ గుందేలు గో రనుపలుకులెల్లఁ, బాళ్లుఁ గుందేళ్లు గోళ్లు నాఁబడు ధరిత్రి.

88


గీ.

వరుస నేయి చేయి వా యనుపలుకుల, తుదలఁ బెక్కుఁ జెప్పఁ దులు జనించు
బ్రీతి నేతు లనఁగఁ జేతులు వాతులు, నాఁగఁ జెల్లు నెల్ల నాట నండ్రు.

89


గీ.

వేయి ఱాయి దో యనియెడి వీనిబహుత, నోలిఁ గుదుద లుత్వ మొనఁగూడు వేలు ఱాలు
దోలు నా డుత్వ మబ్బు నెద్దునకు వరికి, నెడ్లు వడ్లును నాఁ జను నెఱుఁగవలయు.

90


క.

కే లేకవచన మరయఁగఁ, బాలును దెమ్మెరలు సహజబహువచనంబుల్
మూలాఖ్య మున్నుగాఁ బే, ర్కో లోపడు నిట్లు ధాన్యకులముల కెల్లన్.

91


గీ.

కొఱ్ఱ లాళ్లు వడ్లు గోదుమ లనుములు, కొల్లు లనెడు వీని కెల్ల నిట్ల
ప్రకటితంబు లయ్యె బహువచనంబులు, నేకవచననియతి యెపుడు లేదు.

92


గీ.

ప్రాణిపదములు వెలిగాఁగఁ బ్రథమలైన, నరయ నొక్కొక్కచో ద్వితీయార్ధము లగు
రా జలంకారములు పూనె రాచకొడుకు, వస్త్రములు దాల్చె నన నెందు వఱలెఁగాన.

93

క.

ఒనరఁ దృతీయయుఁ బంచమి, యును సప్తమియును దలంప నుచికనిజైకా
ర్ధనియతిఁ జెల్లుం దెలియఁగఁ, ననిరి విభక్త్యర్థవేదు లైనకవీంద్రుల్.

94


గీ.

విశ్వవిభునిచేత విలసిల్లు సిరి కర, వాలభైరవాంకువలనఁ గలుగు
భూరిసిద్ధి రాజనారాయణునియందుఁ, బొడముఁ గవుల కతివిభూతి యనఁగ.

95


క.

పోక చతుర్థీషష్ఠులు, నేకార్థమునందుఁ బలుక నిత్తురు విశ్వ
క్ష్మాకాంతునకుం గృతు లరి, భీకరునకు నిత్త్రు గవులు పృథునీతు లనన్.

96


వ.

మఱియు నంధ్రభాషావిభక్తులకుం గల నామాంతరంబు లెఱింగింతు, స్థావరతిర్య
ఙ్మనుష్యపదవక్త్రి యగు ప్రమావిభక్తికిం గ్రమంబున ముకారంబును డుకారం
బును, ద్వితీయకు నుకారనికారంబులును, దృతీయకుఁ జేత తోడ యనునవియుఁ,
జతుర్థికిం గై కొఱ కనునవియు, బంచమికి వలన పట్టి యుండి కంటె యనునవి
యును, షష్ఠికిం గికుకారంబులును యొక్క లోపల యనుపదములును, సప్తమికి
నందు న యనుపదంబులు నయ్యెఁ దత్ప్రకారంబునకు విభక్తినిరూపణంబు లలవరింతు.

97


క.

ద్రుమ మేచె ద్రుమముఁ జూచెను, ద్రుమమ్ముచే నొప్పె నరుగు ద్రుమమునకై యా
ద్రుమమువలన ఫల మబ్పెను, ద్రుమమున కెనలేదు పువ్వు ద్రుమమం దొప్పున్.

98


వ.

ఇది యేకవచనవిధి.

99


క.

ద్రుమములు ద్రుమములఁ గదిసెను, ద్రుమములచే నీడ గలిగె ద్రుమములపై గం
ధ మమరె ద్రుమములవలనన్, ద్రుమముల కలరారెఁ దాను ద్రుమములయందున్.

100


వ.

ఇట్లు తిర్యక్పదంబులకు యోజించునది.

101


క.

తనయుడు తనయుని గనియెను, దవయునిచేఁ దనయుకొఱకుఁ దనయునివలనన్
దనయునకు ధనము దొరకెను, దనయునియందెల్ల మంచితనములు గలుగున్.

102


క.

తనయులు తనయులఁ బడిసిరి, తనయులచేఁ దనయులకయి దనయులవలనం
దనయులకు మేలు గలిగెను, దనయులయం దనఁగ నివి యుదాహరణంబుల్.

103


క.

కవి యొప్పుఁ గవి భజింతురు, కవిచేఁ గృతు లొదవు సిరియుఁ గవియు గవులకై
కవివలనఁ గల్గుఁ గీర్తులు, కవితతికిం బేరు వెలయుఁ గవివరునందున్.

104


క.

కవులు నుతింతురు కవులం, గవులచేతఁ (?) గవులకొఱకుఁ గవులవలనఁ ద
త్కవులకుఁ బ్రసిద్ధి యలవడుఁ, గవులందుం గాక కావ్యకల్పన గలదే.

105


క.

గురుఁ డధికుఁడు గురుఁ దలఁపుము, గురుచేతం దెలిసి భక్తి కొఱలు గురునకై
గురువలన మేలు చేకుఱు, గురునకు సరి లేదు విద్య గురునం దుండున్.

106

క.

గురువులు గురులను గొల్తురు, గురువులచే గురులకొఱకు గురువులవలనన్
గురులకు భక్తి దనర్చును, గురువులయం దుండు సకలగుణములు నెపుడున్.

107


వ.

ఇత్తెఱంగున ననుక్తపదంబులయం దొడఁగూర్చునది.

108


క.

స్థావరతిర్యక్పదములు, లోవిడిచి తృతీయమొదలు పురుషాఖ్యలపైఁ
బైవర్ణములో నుత్వము, నావల నిత్వము విభక్తు లైదును జెందున్.

109


క.

సుతుచేత సుతునిచేతను, సుతుకొఱకును సుతునికొఱకు సుతువలనం ద
త్సుతునివలన సుతు కొదవును, సుతుని కొదవు సుతునియందు సుతునం దనఁగన్.

110


గీ.

పరఁగఁ గూఁతురుశబ్దంబుపై రుకార, మొక్కపలుకున పైనైన నుండుఁ బాయుఁ
బెక్కుపలుకులపైనైనఁ దక్కి పోవుఁ, గూఁతురుగఁ బొందిఁ గూఁతుగాఁ గోరె ననఁగ.

111


క.

కూఁతులచేఁ గూఁతురిచేఁ, గూఁతులకై కూఁతుకొఱకుఁ గూతులవలనం
గూఁతులకుఁ దగవు లొసఁగును, గూఁతులయం దుండుఁ బ్రీతి గుణవంతులకున్.

112


క.

ఓయాదిపదంబులతుదఁ, బాయని నిడు పుడిపి తగవిభక్తు లునుప ము
న్నేయనువునఁ బుంలింగని, కాయమునకుఁ జెప్పి రట్ల కవివరు లోలిన్.

113


గీ.

కడ డుకార మున్న నొడు లెల్ల సంబుద్ధి, హ్రస్వమైన దీర్ఘమైన నగును
వీరవరుఁడ, సమరశూరుఁడా యనఁగ మా, నిని యనంగ మానినీ యనంగ.

114


క.

డులు బహువచనంబులయెడఁ, దొలఁగు న్సంబోధనమున దుర్జనులారా
బలిభోజనవిధులారా, ఖలులారా మిమ్ము జముఁడు గావఁ డనంగన్.

115


గీ.

ఒనర యుష్మదస్మదుక్తుల కేకవ, చనబహువచనములు సంభవించు
మెఱయు నీవు నేను మీరు మే మనెడునా, దేశములు ధరిత్రిఁ దెలియవలయు.

116


క.

నియతుఁడవు నీవు నిన్నును, నియమింతురు శుభము లొలయు నీచే నీకై
జయమును నీవలన దయో, దయమున సిరి నీకు శుభము దగు నీయందున్.

117


క.

మీ రనఘులు మిముఁ గొలుతురు, సేమము మీచేత నుతులు చెలు వగు మీకై
హేమ మొదవు మీవలనను, శ్రీ మీ కలరారి యుల్లసిలు మీయందున్.

118


క.

నే రమ్యుఁడ ననుఁ దలఁతురు, నారులు నాచేత నెగడె నాకై ప్రియమౌ
ధారణి నావలనం బెం, పారెను నా కొసఁగుఁ బ్రియము లవి నాయందున్.

119


క.

మే మెఱుఁగము మము మఱచిరె, భామలు మాచేత బ్రదుకఁబడి మాకై ము
న్నే మీరు మావలన వల, దా మక్కువ సేయ మాకుఁ దగ మాయందున్.

120

సమాసప్రకరణము

క.

మొదలిపదాంతవిభక్తిని, వదలుచుఁ దుదిపదము మొదలివర్ణముతోడం
గదిసిన నదికినశబ్దముఁ, జదువులను సమాస మనఁగఁ జను నండ్రు బుధుల్.

121


వ.

అది తత్పురుషంబును, గర్మధారయంబును, బహువ్రీహియు నన మూఁడుతెఱంగులం
బ్రవర్తిల్లు, నంధ్రభాషాప్రయోగంబుల నందుఁ దత్పురుషంబులకు నొక్కతెఱం
గెఱింగింతు.

122


క.

రాచిలుకలు విరజాజులు, రాచకొడుకు లంపగములు రాయంచలు నా
రాచినయట్టిసమాసము, లేచుం దత్పురుష మన ననేకం బగుచున్.

123


క.

నెలిదమ్మి కమ్మఁదూపులు, వలకే లెడకాలు నీలవర్ణము నవసా
లులరుచులచే సమాసము, లలవడియెం గర్మధారయములు దెనుఁగునన్.

124


గీ.

పూవుఁబోఁడి తలిరుఁబోఁడి పూవిల్తుండు, వాలుఁగంటి నాతనాఁడి మించు
మొలక మచ్ఛెకంటి ముక్కంటి యన బహు, వ్రీహి పెక్కువిధుల విస్తరిల్లు.

125


వ.

మఱియు వీనికి సాధారణలక్షణంబు లొకకొన్ని యెఱింగింతు.

126


గీ.

గుణిగుణంబు చెప్పం గొఱలు విశేషణ, పదముపై నికార ముదవుఁ బాయు
నాతికెల్ల నాఁడు నల్లనికనుఁగవ, నల్లకన్నుఁగద యనంగ వరుస.

127


క.

విదితవిశేషపదాంతము, గదిసి పుకారంబు నిలుచుఁ గడ హ ల్లున్నం
బదపడి య చ్చుండిన బుటు, లొదవు ముకారంబుఁ ద్రోచి యోలిం గృతులన్.

128


క.

గూఢపుమంత్రంబులు నతి, గాఢపుఁగర్మములు సోయఁగపుటాటలు నా
రూఢపుటాలాపంబులు, ప్రౌఢములగు నీసమాసఫణితులయందున్.

129


క.

ఇలఁ బల్లు ముల్లు విల్లును, హలాదులను నదుకుచోట నడఁగును జడ్డల్
పలువరుసయు ములుమోదుగు, విలుకాఁడు ననంగ నెందు విశ్రుత మగుటన్.

130


గీ.

వెన్ను కన్ను చ న్ననియెడు వీనిజడ్డ, లుడుపుటొప్పు సమాసనియోజనములఁ
దనర వెనుగాఁడ కనుదోయి చనుములకలు, నా సమాసంబు లొప్పు నానావిధముల.

131


క.

ఆదట నా నీ తన యను, చో దుత్వము గలుగు షష్ఠి చూపెడునెడలన్
నాదు కళాసంపదయును, నీదు వివేకంబుఁ దనదు నిపుణతయు ననన్.

132


క.

నా నీ తన యనుపలుకుల, తో నదుకు దుకార మపుడు దొలఁగిన దొలఁగుం
బూని సమాసము సంస్కృత, మైనను షష్ఠ్యర్థహేతువై సత్కృతులన్.

133

మ.

తనసత్యవ్రతకౌశలంబుఁ దనవిద్యాతంత్రనిర్మాణముం
దనవిశ్రాణనకీర్తనంబుఁ దనసప్తస్తుత్యసంతానముల్
తనతేజోమహిమోదయంబు దనయుద్యత్కీర్తివిస్ఫూర్తియుం
దనరం బేర్చుఁ జళుక్యవిశ్వనృపమందారంబునా నెల్లెడన్.

134


క.

క్షీరార్ణవకూఁతురు సం, సారార్ణవయోడ శుభ మొసఁగు మీ కనఁగా
వైరిపదం బగుఁ దెనుఁగునఁ, గూరని సంస్కృతముఁ దెనుఁగుఁ గూర్చుటచేతన్.

135


గీ.

అరయ నానీలు హల్లుతో నదుకుచోట, నొనర నుగ్గును నిడుపయియున్న నుండు
గవులయనుమతి నిదిజ కృతిఁ గానవలయుఁ, జాలవర్ణంబు గదిసిన జడ్డ యగును.

136


క.

ఆకరి యక్కరి యనఁగా, నాకర మక్కరము నాగ నక్కీకసకం
బాకీకసకం బన భా, షాకరము సమాసముల కుదాహరణంబుల్.

137


గీ.

సంస్కృతము లయ్యుఁ దెనుఁగులై చాఁగుఁ గొన్ని
శబ్దములు వానిచందంబుఁ జను నెఱుంగఁ
బససపండును గుండలోపల ననంగఁ
గందదుంపలు నా జీరకఱ్ఱ యనఁగ.

138


క.

సుమతి నికారోకారాం, తముపై సంస్కృతపదంబు తగుఁ గూర్పఁగ వే
డిమరీచులు వాఁడిశరం - బమరు మనుష్యుండుఁ బేర్చు నశ్వం బనఁగన్.

139


క.

తగుఁ గూర్ప నికారాంతం, బగుసంస్కృతపదముమీఁద నచ్చతెనుఁగున
న్నిగుడారు దంతికొమ్ములు, జగ మెఱుఁగు నరాతిపోరు చందం బనగన్.

140


గీ.

అత్తమామ నాఁగ నాలుమగం డనఁ, గొడుకుగోడ లనఁగఁ గొఱనులేలు
నాఁగ రాత్రిపగలు నాఁగ నిట్టి సమాస, ములును గలుగుఁ గవులు తెలియవలయు.

141

తద్ధితప్రకరణము

క.

అరి యిడి కాఁ డాఁడఱయన, ధరలో నొకకొన్ని చెల్లుఁ దద్ధితపదముల్
పరువడి వాని నెఱుంగుట, పరమపరిజ్ఞాన మంధ్రభాషాకవితన్.

142


సీ.

సూఁడరి ముండరి తూఁడరి కల్లరి కాలరి ప్రేలరి కష్టుఁ డనఁగ
నుప్పిఁడి ప్రాయిఁడి చప్పిడి గ్రేసిడి తన్నిడి చిక్కిడి దాత యనఁగ
నీటుకాఁ డెడకాఁడు పోటుకాఁ డుదురులాఁ డించులాఁ డెప్పుడు నీతఁ డనఁగఁ
దక్కులాఁ డెక్కువ నిక్కులాఁ డదరులాఁ డెపుడు దురాత్మకుం డీతఁ డనఁగఁ

దనరు దబ్బఱ చిందఱందఱ యనంగఁ, బరఁగు పలుకులు తద్ధితపదము లయ్యెఁ
దెనుఁగునను వీనిచందంబుఁ దెలియుకవుల, నాదృతులఁ జేయు రాజనారాయణుండు.

143

క్రియాప్రకరణము

గీ.

అరయ వాక్యకదంబోత్తమాంగమునకు, నమితదృష్టులు జగతిఁ గ్రియాపదములు
వానితెఱఁగులు కవులకు వలయుఁ దెలియఁ, గడఁగి కాలత్రయప్రసంగమాలవలన.

144


క.

ధరఁ బ్రథమమధ్యమోత్తమ, పురుషాఖ్యలఁగ్రియలు మూఁడు పొలుచుం గాల
స్ఫురణలును వర్తమానాం, తరభూతభవిష్యదర్థతలఁ ద్రివిధంబుల్.

145


గీ.

ప్రథమపురుషాఖ్య యన్యార్థపణితిఁ జెప్పు, నగ్రసంస్ధితుఁ జెప్పు మధ్యమపురుషము
దగిలి యుత్తమపురుషంబు తన్ను జెప్పు, నేకబహువచనంబులు నెల్లకడల.

146


గీ.

అగుచునున్న కర్త యగు వర్తమానంబు, భూత మనఁగ నయిన పూర్వకృతము
కడగి యంత మీఁదఁ గానున్నయదియ భ, విష్యదర్థ మనఁగ విస్తరిల్లు.

147


క.

ఉచితవిధి విధియు నాశీ, ర్వచనమునను క్రియలు రెండుఁ బ్రథ నొక్కటియై
ప్రచురించుం బురుషత్రయ, వదనంబుల వీనితెఱఁగు వలయం దెలియన్.

148


క.

తెలుఁగుక్రియాపదములకును, వలగొను ధాతువులు జనపదవ్యవహారో
క్తులు కాని వానిఁ బేర్కొన, వలదు ప్రయోగములఁ దెలియవలయుఁ దెలుపుదున్.

149


వ.

ప్రథమపురుషంబునకు వర్తమానార్థంబునందు నేకవచనబహువచనంబులందు నెడినెద
రులును మధ్యమపురుషంబున కెదనెదరులును, నుత్తమపురుషంబున కెదనెదములును
గ్రమంబున నాదేశంబు లయ్యెఁ దన్నిరూపంబు లెఱింగింతు.

150


క.

అరిగెడి నరిగెద రనఁగాఁ,
నరిగెద వరిగెద రనంగ నధిపతిపురికై
యరిగెద నరిగెద మనఁగా, బరువడి నిది వర్తమానఫణితార్థ మగున్.

151


వ.

ప్రథమపురుషంబునకు భూతార్థంబునందు నేకవచనబహువచనంబుల నెన్నిరులును
మధ్యమపురుషంబునకు తివి తిరులు, నుత్తమపురుషంబునకు తినితిములును నాదేశంబు
లగుఁ దన్నిరూపణంబు లెట్లనిన.

152


క.

చేసెం జేసి రనంగాఁ, జేసితి చేసితిరి మీరు సిరి మా కనఁగాఁ
జేసితిఁ జేసితి మనఁగా, భూసుర భూతార్థకథనభజన మ్మయ్యెన్.

153


వ.

ప్రథమపురుషంబునకు భవిష్యదర్థంబునందు నేకవచనబహువచనంబులకు నుదురులును,
మధ్యమపురుషంబునకు వుదువురులును, నుత్తమపురుషంబునకు దునుదుములు వరుస
నాదేశంబు లయ్యెఁ దన్నిదర్శనం బెట్టిదనిన.

154

క.

చేయుం జేయుదు రనఁగాఁ, జేయుదు చేయుదురు మీరు చిత్తం బలరం
జేయుదుఁ జేయుదు మనఁగా, నాయతముగ నివి భవిష్యదర్థముఁ జెప్పున్.

155


క.

మొదలం చెప్పిన యది తుద, యది యాదేశంబు విధికి నవ్వచనములం
బొదలి ప్రధమమధ్యమలకుఁ, దుద నుత్తమపురుషమునకుఁ దొంటట్ల యగున్.

156


క.

చేయునది బుధుఁడు ధర్మము, సేయునది బుధులు విశేషసిద్ధక్రియలం
జేయునది నీవు దర్పము, సేయునది తపంబు మీరు శివునకు ననినన్.

157


గీ.

ఉనుదురులకుమీఁద నొగిఁ గాఁత యున్న నా, శీర్వచనమునకును జెల్లు నదియు
శివము చేయుఁగాత శివుఁడు శోభనము చే, యుదురుగాత మీకుఁ ద్రిదశు లనఁగ.

158


క.

కారయిత సేయుకృతి నల, రారు ణిజంతంబు దాని కాదేశంబుల్
ధారిణి నింపును నించును, సారముగా నేకవదనసరణికి నయ్యెన్.

159


క.

తుద బహువచనమునకు నిం, పుదురును నింతురును నయ్యెఁ బుడమియెదల నిం
చుదురును గలుగుఁ బ్రయోగా, స్పదములు దేశీయసరణిఁ జనుఁ దెలియంగన్.

160


సీ.

శ్రీవిశ్వభూపతి చేయించుఁ గ్రతువులు సేవింపుదురు తదాశ్రితులు సురలఁ
బండంగ నింద్రుండు పరఁగించు వానలు హలికులు పరగింతు రర్థచయము
నెసఁగించు ధర శ్రీల నేపారు తద్వృత్తి నరభటు లెఱిఁగింపుదురు జయంబు
వెలయింపు కీర్తి యవ్విధి నెలయింపుదు రర్ఛు లెల్లెడఁ బ్రతాపాతిశయము
ననెడు పల్కులచేత ణిజర్థములకు, నేకవచనబహువచనపాక మెఱుఁగ
వలయు నవి పెక్కువిధముల వసుధఁ దెలియ, నిఖిలభాషావివేకులై నెగడు కవులు.

161


క.

మహితస్థావరతిర్య, ఙ్మహిళాదిక్రియలవర్తమానార్థమున
న్విహితమగు నెడుడుకారము, సహజంబుగ నేకవచనసంజ్ఞలచోటన్.

162


క.

పండును భూజము తరువులు, పండెడు రాచిలుక యొప్పఁ బలికెడుఁ జిలుకల్
గండాడెడు సతిపతిపైఁ, బండెడుఁ బెక్కింటిసతులు పండెడు ననఁగన్.

163


క.

నిగుడదు భూజము సింగము, బెగడదు నిటు నాగవనిత పిలువ చనెడుచోఁ
దగుభూతార్థంబున నదు, లగు నాదేశంబు క్రియల నయ్యైయెడలన్.

164


గీ.

ఒనర నింపు నించు ననియెడు వీనిపై, నుటతలొందెనేని నొక్కచోటఁ
బరఁగుఁ గారకాఖ్యపదములై తెనుఁగున, వానితెఱఁగు లెఱుఁగవలయు బుధులు.

165

క.

కోపింపుట కోపించుట, కాపించుట పసుల నొప్పఁ గాయించుట నా
నేపారు నిట్టిపలుకులు, లోపుగ బహుళములు జగతిలో నెఱుఁగఁదగున్.

166


గీ.

తెలుఁగుఁబలుకులు పునరుక్తిఁ బలుకుచోట, గదిసి రెండవపదమున మొదలివ్రాఁత
దనరు గిత్వంబు ప్రాసంబు దప్పకుండ, వర్ణములు దీర్ఘహ్రస్వప్రవర్తు లగుచు.

167


క.

పులిగిలి యనఁ గరిగిరి యన, నలిగిలి యన నోడగీడ యనఁగా బరఁగున్
నలలు గిలు లనఁగ బలవం, తులు మఱి గిలవంతు లనఁగఁ దుద సరియగుచున్.

168


క.

స్మరధరచరవరపదములు, పరఁగుఁ గ్రియాపదము నొందుపట్టులనెల్ల
న్వరుప రకారములోపలఁ, బొరి నిత్వ మడంగుఁ గాక పొడమినఁ బొడమున్.

169


క.

స్మరియించె సంస్మరించెను, ధరియించె ధరించె బూవుదండఁ జరించెం
జరియించె వల్లభునిసతి, వరియించె వరించె నాఁగ దలనై యునికిన్.

170


క.

ఇది తెనుఁగున కెల్లను జన, పదవిదితం బైనతెఱఁగుప ట్టించుక యె
ల్లిదముగఁ జెప్పితి నంతయు, మది నెఱుఁగుం డరసి బుద్ధివంతు లితరముల్.

171


మ.

లలి ననోన్యముఖావలోకనము లీలం జేయఁగాలేని యా
విలసత్కావ్యకళాచతుష్టయము లుర్విం బగ్వ నేకస్థలిం
గలిగించెం బదవాక్యవేదియు నలంకారఙ్ఞుఁడున్ భూవరో
జ్జ్వలవిద్యావిభవోన్నతుండు నగువిశ్వక్ష్మావిభుం డిమ్ములన్.

172


మ.

కవివాత్సల్యకళాచరిష్ణుఁడు జగత్కల్యాణవర్ధిషణుఁ డు
త్సవసంపుష్టసుపర్వగర్వుఁడు జయశ్లాఘాప్తసగంధర్వుఁ డా
ర్జవశీలాదివిశుద్ధవృత్తుఁడు విరాజద్విక్రమాయత్తుఁ డు
చ్ఛవిశాలామలకీర్తిపూరుఁడు సంతేజస్స్ఫారుఁ డెల్లప్పుడున్.

173


క.

శ్రీమచ్చళుక్యవిశ్వ, క్ష్మామండలవిభుఁడు సకలసంగ్రామజయ
శ్రీమంతుఁడు సంతతనత, సామంతుఁడు కామినీవసంతుఁడు లీలన్.

174


తరళ.

బిరుదమిత్రుఁడు భిన్నశత్రుఁ డుపేంద్రపుత్రుఁడు యామినీ
శ్వరకులేశుఁడు మానవేశుఁడు వాహినీశుఁడు విక్రమ
స్ఫురణరాముఁడు నూత్నకాముఁడు పూర్ణసోముఁడు కీర్తులం
బరఁగుచుండెడు మాసుధాకరభానుతారకవిశ్రుతిన్.

175

గద్యము
ఇది శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన
వివిధబుధవిధేయ విన్నకోట పెద్దయనామధేయవిరచితం బైన
కావ్యాలంకారచూడామణి యనునలంకారశాస్త్రంబు
నందు నంధ్రభాషావిశేషసంధిసమాసదేశీయ
ప్రయోగక్రియానిరూపణలక్షణసముద్దేశం
బన్నది నవమోల్లాసము.

—————