కవి జీవితములు/వెన్నెలకంటి సూరనార్యుడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు.

కవిజీవితములు.

పురాణకవులచరిత్రము.

21.

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

ఇతఁడు విష్ణుపురాణముం దెన్గు బావ నొనరించినకవి. ఇతనిది హరితసగోత్రము. ఇతనితండ్రిపే రమరనమంత్రి. ఈయన నియోగి శాఖా బ్రాహ్మణుఁడు. పైవిష్ణుపురాణము 'రావూరి రాఘవరెడ్డి' యను నతనికిఁ గృతియియ్యఁబడినది. ఆకృతిపతి వృత్తాంతము జెప్పుటకుఁ బూర్వము సూరనకవి వక్కాణించియున్న పూర్వకవినామంబుల వివరించెదను, ఎట్లన్నను :-

"ఉ. ము న్నిటు కాళిదాసకవిముఖ్యులకుం బ్రణమిల్లి వారిలో
      నెన్నికగాఁ బ్రబంధపరమేశ్వరుఁ దిక్కనసోమయాజినిన్
      నన్నయభట్టు భాస్కరుని నాచనసోముని రంగనాథునిన్
      వెన్నెలకంటి సూర్యుఁ బదివేలవిధంబులఁ గొల్చిభక్తితోన్."

అని యున్న పై పద్యముంబట్టి చూడ నీసూరకవివలన నుదాహరింపంబడినకవులకుఁ బిమ్మట నీ సూరకవి పుట్టిన ట్లూహించవలసియున్నది. అం దుదాహరింపఁ బడినకవులలో వెన్నెలకంటి సూర్యుఁ డనంబడు సూర్యకవి యెవ్వరని యూహించవలసియున్నది. అతనింగూర్చి మఱి యొకస్థలములో నీక్రిందివిధంబున నీసూరనకవి వివరించె. ఎట్లన్నను :-

"ఉ. ఈనిఖిలంబు మెచ్చ నమరేశ్వరదేవుఁడు చూడఁ గృష్ణవే
      ణీనదిసాక్షిగా ననికి నిల్చినరావుతుఁ గేసభూవిభుం
      గానకుఁ దోలి వెన్నడచి కాచినవేమయయన్న పోతభూ
      జానికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలకంటివారిలోన్.

సీ. భవ్యచరిత్రుఁడాపస్తంబమునిసూత్రు, శుద్ధసారస్వతస్తోత్రపాత్రు
    హరిత గోత్త్రపవిత్రు నాంధ్రభాషాకావ్య, రచనాభినయ విశారదుంబ్రబంధ
    కర్తను వెన్నెలకంటి సూర్యునిమను, మనిఁ జెఱకూరి యమరనమంత్రి
    సత్పుత్రునాశువిస్తారవిచిత్ర మా, ధుర్యకవిత్వచాతుర్యశీలు

తే. నిజకులాచారమార్గైకనిపుణుఁబరమ, సాత్వికోదయ హృదయు వైష్ణవపురాణ
    వేది సారస్యవిద్యాప్రవీణు సుకవి, మాననీయుని సూరనామాత్యవరుని"

ఇట్లున్న పైపద్యములంబట్టి పై వెన్నెలకంటి సూర్యకవి యీ విష్ణుపురాణకవి యగుసూరనకవికిఁ దాత యని తేలినది. ఆసూరకవి వేమయయన్న పోతరెడ్డికాలీనుఁడని తేలినది. ఆసూర్యకవి యేప్రబంధములం జేసెనో బోధకాకయున్నది. ఈసూరనకవి తండ్రి చెఱకూ రను గ్రామములో వసియించుటంజేసి యాతఁడును చెఱకూరి యమరనమంత్రియని పిలువంబడినట్లు కాన్పించు. అంతమాత్రమున నాతనివంశ నామము చెఱకూరివా రని చెప్పఁగూడదు. కొందఱి కింటిపేరు వేఱైనను వారు కారణాంతరములవలన నన్యగ్రామనివాసము చేయునపు డాయూరి పేరిట వారు మాత్రము పిలువంబడునాచార మాంధ్రులలోఁ గలదు. అది గృహనామముమాత్రము కాదు. కావున నీసూరనకవి తనయాశ్వాసాంత్యగద్యములోఁ దనయింటిపేరు చెఱకూరివా రని చెప్పక వెన్నెలకంటివా రనియే యీక్రిందివిధంబునఁ జెప్పె. ఎట్లన్నను :-

"ఇది శ్రీమదమరనామాత్యపుత్త్ర హరితగోత్రపవిత్ర సుకవిజనవిధేయ వెన్నెలకంటి సూరయ నామధేయప్రణీతంబైన యాదిమహాపురాణం బగుబ్రహ్మాండంబునందలి పరాశరసంహిత యగుశ్రీవిష్ణుపురాణంబు."

అని యిట్లు వ్రాయంబడుటచే వీరియింటిపేరు వెన్నెలకంటి వారనియే వాడఁబడును.

వెన్నెలకంటివారివృత్తాంతము.

ఈ యింటిపేరు గలవారిలోఁ బెక్కండ్రు కవు లున్నట్లు వాడుక గలదు. ఆకారణంబున

"కవితపుట్టిల్లు వెన్నెలకంటియిల్లు, వచ్చిచొచ్చెను మోచెర్లవారియిల్లు."

అను మొదలగు పద్యములు పుట్టెను. దీనింబట్టి వెన్నెలకంటి వారి కుటుంబమొకటియు, మోచెర్లవారికుటుంబ మొకటియు నొక కాలములోఁ గవిత్వమునకు మిగులఁ బ్రసిద్ధి కెక్కినకుటుంబము లనియు నాయిర్వురలోనే కవిత్వ విద్య నిలిచి యుండె ననియుఁ దేలినది. అట్టి వారిలో నిర్వురు మువ్వురు ప్రసిద్ధు లున్నట్లును వారిసమీపబంధువులై నట్లు తేలును. అందు మొదటివాఁడు సూర్యకవి. మఱియొకఁడు పైసూర్యకవి తమ్మునికొడుకైన విక్రమార్క చరిత్రములో వివరించఁబడిన వెన్నెలకంటిసిద్ధన యొకఁడును, నీ సూరకవి యొకఁడు నై యున్నారు. ఇఁక మోచెర్లవారింగూర్చి వ్రాయవలసియున్నది. వారిలో వెంకన్న, దత్తప్ప లను కవు లిర్వురుమాత్రము మనమెఱిఁగినవారు. వారిగ్రంథములు వ్యాపకములో లేవుకాని వారిసమస్యాపూరణములు పెక్కులు గలవు. ఆపద్యప్రశంశసేయుటకుఁ బూర్వము పై రెండుకుటుంబములకుఁ గలప్రత్యక్షసంబంధము వివరింపవలసి యున్నది. ఆసంబంధము దౌహిత్రసంబంధ మని చెప్పఁ దగియున్నది. అందులో నెవ్వరి కెవ్వరు దౌహిత్రులోఁ జెల్పఁజాలము కాని పై పద్యానుసారముగాఁ గవితాకన్య వెన్నెలకంటి వారియింటఁ బుట్టి మోచెర్లవారి యింటికోడలైనదని చెప్పంబడుటచేత వెన్నెలకంటి వారి కన్యకను మోచెర్లవారి పిల్లని కిచ్చి వివాహము చేయఁబడియుండవచ్చు నని తోఁచును. పైవెన్నెలకంటి కవులలో నెవ్వరిపుత్త్రికాసంతానములోనివారు మోచెర్లకవులో దానిని నిర్ణయింపలేము. వెన్నెలకంటి వారిలో ననేకులు కవు లున్నా రనుచో నిమొచర్లవా రెవ్వరిదౌహిత్రులో దాని నిర్ణయింప వీలులేదు. అట్టి మోచెర్లవారిలో నిర్వురుకవులు బహుప్రసిద్ధులు. వారిపేరులు వెంకన్న, దత్తప్ప. వీరు రావు యాచమనాయని కాలీను లని యుండుటచేతఁ పై కవులందఱికి వీరు మిగుల దూరస్థులుగాఁ గాన్పించెదరు.

మోచర్లవారివిషయము.

పై మోచర్ల వెంకన్న, దత్తప్పకవులు 'ఏజళ్లవారు' అను తెట్టు జమీందారుల యాస్థాన కవీశ్వరులు. వారిలో వెంకన్న యనునతఁడెల్లప్పు డాస్థానమునే కనిపెట్టియుండుటయు దత్తప్ప యితరరాజుల సంస్థా నములకుఁ బోయి తనవిద్యావిశేషములఁ జూపుచుండుటయు నచ్చటచ్చట ననేకబహుమానంబు లంది వచ్చు చుండుటయుఁ గలదు అ ట్లతఁ డితరసంస్థానములకుఁ బోయి చేసిన విద్యావ్యాసంగములలో నొకసమయమునఁ బైరావు యాచమనాయని సభలోఁ జేసినయొకకార్యము మిక్కిలి ప్రసిద్ధినొందెను. ఆకథనుమాత్రము వివరించి మోచర్లవారి గాథను వదలెదను.

ఒకపండితునికథ.

"ఒకదినమున నొకబ్రాహ్మణుఁడు మండువేసవిగా మధ్యాహ్నసమయంబున నీమోచర్లవారియింటికి వచ్చె. అపుడు వార లాతని నభ్యాగతునిగా భావించి యుచిత సత్కారంబులఁ జేసి యామాధ్యాహ్నిక కార్య మచటనే కావింపఁ బ్రార్థించిరి. ఆపండితుఁడు నటులనే చేయుటకు సమ్మతింప వెంకన్నకవి వెంటనే లేచి యతనిఁదోడ్కొని చని స్నా నాదికములం దీర్ప నందఱు భోజనమునకుం గూర్చుండిరి. అంతట వెంకన్నకవి యప్పండితునకు హస్తోదకం బిచ్చి కైకొమ్మనుడు నాబ్రాహ్మణుఁ డట్లుచేయక తలవాంచి యూరకుండె. దానింజూచి యతని కెద్దియో కోర్కెగలదనియూహించి "అభ్యాగతస్స్వయంవిష్ణుః" అనియుండుటంజేసి మీయభీష్టం బెద్దియోయదిపడయవచ్చు ననుటకుసందియంబు లేదు. దానిం జెల్లింతును హస్తోదకంబు గైకొమ్మనుడు నాపండితుఁడు నాయభీష్టవరంబు దయచేసితిరి కావునం గైకొనెద నని హస్తోదకంబు గై కొనియె. అపుడు వారందఱు నుచితాలాపంబు లాడుచు భోజనంబులుగావించిరి. భోజనానంతరము తాంబూల చర్వణార్థము రండని వెంకన్నకవి యాబ్రాహ్మణుని మేడపైకిం గొనిపోయి యతని నుచితాసనంబున నునిచి ఆయన వృత్తాంతంబును, వచ్చినకార్యంబును దెలుపవేడఁగా నాబ్రాహ్మణుఁడు విన్నంబోయిఅ వదనంబున నాకవివర్యున కిట్లనియె. ఓకవికులావతంసా ! నావంత యొక్కింత చిత్తగింపుఁడు. నే నొకపేదబ్రాహ్మణుఁడను. చిన్నతనముననే వారాణసికిం బోయి యిరువది ముప్పది సంవత్సరములు గురుశుశ్రూష చేసి కష్టించి షట్ఛాస్త్రములను గొంతవఱకు నేర్చికొంటిని. అంతట స్వజ నులు వచ్చి నన్ను బ్రార్థించి స్వదేశంబునకుఁ దోడి తెచ్చిరి. ఇంటఁ బ్రవేశించినది మొదలుగృహకృత్యములు నేనే జరుపవలసినవాఁడ నగుటం జేసియు దానికిఁ దగువృత్తిస్వాస్థ్యములు లేకుండుటం జేసియు విద్యాధికులగుప్రభువుల నాశ్రయించి నాదరిద్రము వావు కొనియెద నని నిశ్చయించుకొని అట్టివిద్యాప్రభువు లెవ్వరు గల రని విచారింపఁగా బెక్కండ్రు వెలుగోటియాచమనాయఁ డనుమహాపురుషుఁ డున్నాఁడనియు, నాతఁడు విద్వత్పక్షపాతియనియు, నతనియాస్థానంబున ననేకులు విద్వాంసు లున్నారనియు, పండితుఁడని వినిన వారిని మిక్కిలి గౌరవించు ననియుఁ జెప్పిరి. అట్టివృత్తాంతముం దెలిసికొని మనంబున నెంతయు నలరి నాదరిద్ర విచ్ఛిన్న మగుసుకాలంబు సంప్రాప్తమయ్యె నని నిశ్చయించుకొని ఆశాపిశాచ ముత్సహింపఁ జేయుచుండ దూరమని యాలోచింపక రాత్రింబగలు నడిచి యతిత్వరలో నతని ముఖ్యపట్టణమునకుఁ బోతిని. అక్కడి పండితుల నాశ్రయింప వారు నాదైన్యముం జూచి కరుణించి ప్రభునితో విన్నవించి నన్నుం దోడ్కొనిపోయి ప్రభుదర్శనంబుఁ జేయించిరి. నేనునుఁ బ్రభు నాశీర్వదించి ఫలమంత్రాక్షతల నిచ్చి యుండుతఱి జరిగినవృత్తాంతంబు జెప్పుటకు సిగ్గును దుఃఖముగల్గుచున్నదని తలవాంచికన్నీరు నించుచుఁ గొంత తడ వుండిన వెంకన్నకవి యాపండితుం దేర్చి స్వామీ మీయట్టిమహావిద్వాంసు లిట్లు పామరులవలె వ్యాకులచిత్తు లగుట న్యాయమగునా ? ధైర్యముఁ బూని యనంతరవృత్తాంతంబు నివేదింపుఁడు. నా కున్న శాంతంబు సంతంబు నందునదియైయున్నది. అనుడు నాబ్రాహ్మణుఁడు కొంత వడికిఁ దేఱి యిట్లనియె. కవివర్యా విద్వత్ప్ర భుం డని నేను జూడఁబోయిన నామహామహుడు సామాన్యగౌరవప్రవత్తులైనంజేయక యేవచనప్రయోగంబుననే నాయూరుం బేరు నడిగి తెలిసికొని నీ వాంధ్రంబున నెంతవఱకు వ్రేలు పెట్టినావోయీ? అందులో సమస్యలఁ బూర్తిచేయఁగలవా? అని ప్రస్తావింప నారంభించె. అట్టివాక్యములకు నామనం బెంతయు సంచలించుచుండఁ గార్యవాదులకు గర్వముతోఁ బనియే మని నిశ్చయించుకొని యాప్రభున కిట్లుత్తరమిచ్చితిని. నేనాంధ్రపండితుఁడను కాను. సంస్కృత విద్యాభ్యాసముఁ గొంతచేసియున్నాఁడను. అందలిశాస్త్రములకుఁగాను స్వదేశము వదిలి కాశికిఁ బోయి యిరువది ముప్పది సంవత్సరములు గురుకులవాసముచేసి వానిఁగొంచెము తెలిసికొనివచ్చినాఁడను. వలయునేని మీయాస్థానవిద్వాంసులు నన్ను పరీక్షింపవచ్చును. అని నేను విన్నవింప నామాటలు చెవిఁ బెట్టకయె అబ్బో సంస్కృత పండితులా "తెనుఁగెఱుఁగఁడు సంస్కృతంబు తె న్నే మెఱుఁగున్" అని యుండలేదా ! యని యెగతాళి చేయనారంభించె. అంతటితోఁ బోనీయక పో పో యింటికిఁ బోయి కొన్ని దినములు తెలుఁగు చదువుకొని సమస్యాపూరణ మాంధ్రమునఁ జేయఁగల నేర్పు సంపాదించుకొని మఱియు రమ్మని చెప్పి, సదన్యులు వినుచుండఁ బండితవేషములు వేసుకొని యాచనార్థము వచ్చెడు వారి నింతటినుండి మాకడకుం దోడ్కొని రాఁగూడదని సభ్యులకుం దెల్పుచు యాచకుల ననేకనిందావాక్యముల నదిక్షేపించుచుఁ బూటబత్తెమైన నీ' కుండఁ బొమ్మని సాగఁబనిచె. అనంతరము నేను నాకు సంప్రాప్తమైనయవమానదుఃఖంబు మనంబు దహించుచుండ దానిఁ జల్లార్చుకొనుటకుఁగాని దానికిఁ బ్రతీకార మూహించుటకుఁగాని యసమర్థుండనై యుండ నామిత్రులు గొందఱు నన్నుం బోయి జరిగినవృత్తాంతంబు మీయన్న దమ్ములతో విన్నవించిరమ్మని పంచిరి. కావున నీయవమా దుఃఖము విద్వాంసులు గావున మీతో విన్నవించినఁ గొంతవాయు ననితలంచివాచినాఁడను. నాకు మీరకృతపరిచయులుగావున న్నెఱిఁగించుకొను తలంపుతో వాస్తోదకసమయమున నట్లు మౌనముద్రను ధరియించితిని. అట్టి నాసాహసకార్యమును సైఁచి నన్ను వెంటం గొనిపోయి ఆంధ్రంబున మహాపండితుఁడ ననుకొని గర్వించి పండితుల నలయించు యాచమనాయనిసమస్యలు బూరించి యతనిగుట్టు బయటఁబెట్టి యాతని నాయెదుట నవమానించిన నాతొంటి యవమానంబు వాయును. ఇదియ యేఁ గోరువరము. ఇది నాకులభియించు వఱకు నేను మీయిల్లు వదలువాఁడం గాను. నామనోభీష్టంబు సఫలంబుచేయఁదగునని విన్నవించె. అట్టి మాటలు విని వెంకన్నకవి దత్తప్పకవిని రావించి ఆపండితుని వృత్తాంతంబంతయుఁ దెల్పి యితనికి వచ్చినయవమానం బీతనిదొక్కనిదేకాదు. ఇది మనయందఱిదియు న నగును. ఇట్టియవమానంబులనే యాచమనీఁ డనేకులకుం జేసియున్నట్లు చిరకాలమునుండి వినుచున్నాము. ఒక్కపరి తగిన వారివలన నతకిఁ బండితగౌరవము దెలిసినంగాని యిట్టి ద్రోహచింత యతనికి మానదు. కావున నీవు మిక్కిలి త్వరతో బయలు వెడలియీపండితుని వెంటం బోయి యాతనికార్యంబు సానుకూలంబుజేసి రావలయును. అని యన్నగా రనుజ్ఞయయినం గని దత్తప్ప చిత్తమని తనప్రభునికడకుం జని రామేశ్వరతీర్థయాత్రకుఁ బోయివచ్చెద నని యనుజ్ఞఁగొని నాఁటి రాత్రియే బయలుదేఱి పండితుని తనవెంటనే యుంచుకొని మఱికొన్ని దినంబులకు యాచమహీపతి యున్న పట్టణంబునకు వచ్చి చేరెను.

దత్తప్పకవి యాచమహీపతిసభకుం బోవుట

ఇట్లు వచ్చి దత్తప్పయుఁ బండితుఁడు నొకబ్రాహ్మణగృహంబున విడిసి మఱునాఁ డుచితవిధంబున నాంధ్రకవి వచ్చియున్నాఁ డని యాచ భూపాలునకు వర్తమానంబుపంచె. ఆవృత్తాంతము విని యాచమనీఁడు తనకడ నున్నపండితు లావఱలొ నేర్పర్చియుంచినదుష్కరప్రాసయుక్తము లగుననేకపద్యసమస్య లున్న గ్రంథమును సిద్ధముగా నుంచికొని కవీశ్వరుండు రావచ్చు నని యాజ్ఞనొసంగె. ఆదత్తప్పకవియును బండితుని వెంట నిడుకొని ప్రభుదర్శనమునకుఁ బోయె. అపుడు యాచమనాయఁడు తూఁగుటుయ్యలపయి నుండి యితఁడేనా ఆంధ్రకవి యని తనసన్ని ధానవర్తులతోఁ బ్రస్తావింప వా రగుననితెల్పిరి. అట్టివార్తవినియైన నాకవికి దండ ప్రణామాదుల నొనరింపక కూర్చుండుటకైన సెలవొసంగక ఆకవి యూరుం బేరును దెలిసికొనునుద్దేశంబునఁ గొన్ని సంప్రశ్నంబులు చేయనారంభించె. దానిందెలిసికొని కృద్ధుండై దత్తప్పకవి నిలువంబడియే యుండె. అపుడు యాచమనీఁ డితఁడేనా కవియనె. ఆమాట విని దత్తప్పకవి పరీక్షించు పండితప్రభుఁ డున్నచో నీతఁడే కవి యగు నని తెల్పె. దానికి యాచమనీఁ డల్గి 'యేయూరో' అని ప్రశ్నించె. దానికి సమాధానముగా 'తెట్టు' అనుడు 'మఱో' యని ప్రశ్నించె. దానికి సమాధానముగా దత్తప్ప 'కుమారకృష్ణవసుధేశ్వరనందనరాజ్యలక్ష్మికిం బట్టు' అనుడు 'మఱో' 'మఱో' అని యడిగెడు యాచమనీని ప్రశ్నములకు సమాధానముగా నాపద్యమంతయుఁ బూర్తిచేసిన దత్తప్పకవిం జూచి యాచమనీఁడు దిగ్గన లేచి యుయ్యలపైనే కూర్చుండి కవిం బరీక్షించుప్రభుఁ డిచటనే యున్నాఁడు. పరీక్షించిన నిల్చుకవి యుండఁగలఁడో యను సంశయము తీఱినంగాని ప్రభుఁడు మెచ్చఁ డని పల్కి యాచమనీఁడు తనకడ నున్నసమస్యల నొక్కొకదానినే దత్తప్పకవికి నీయఁ బ్రారంభించె. వా నిన్వెంట వెంటనే దత్తప్పకవి పూర్తిచేయుచు వచ్చె. (తెలుఁగు సమస్యల పుస్తకములోని పెక్కుసమస్య లీదత్తప్పకవిపూరణములే యని వాడుకొనంబడు.) అట్టి దత్తప్పకవిసమయస్ఫురణమునకు నాశుధారకు నచ్చెరువందుచు యాచభూమీశుఁడు దుష్కరప్రాసయుక్తము లగుసమస్యల నీయందొడంగె. వానింగూడఁ బూర్తిసేయుదత్తప్పకవిం జూచి యాచమనీఁడు తనకు భంగపాటు కల్గు నను భయంబునఁ దనకడ బ్రహ్మాస్త్ర సమముగానిల్పియుంచిన

'గుండ్రాతికిఁగాళ్లు వచ్చి గున గున నడిచెన్‌'

అను సమస్యనిచ్చె. అక్కడి కాతనిసమస్యాసామగ్రి ముగిసె నని దత్తప్ప యూహించి యిఁక నాతని వెఱపింపసమయ మని దాని నీక్రింది విధంబునఁ బూర్తిచేసె. ఎట్లన్నరు -

"క. ఉండ్రా యోరికులాధమ (దురాత్మక, యిండ్రాప్రాసంబు కవుల కియ్యందగునా
     అండ్రాముకరుణచేతను, గుండ్రాతికిఁ గాళ్లు వచ్చి గున గున నడిచెన్."

అని యిట్లు చెప్పిన విని యాచభూవరుఁ డుయ్యల డిగ్గనుఱికి దత్తప్పకు నమస్కరించి కూర్చుండుటకు సెలవొసంగినఁ జూచి దాని నంగీకరింపక కోపోటోపంబున దత్తప్ప "తిట్టుదునా" అని యొకపద్యమారంభించునట్లుగాఁ బలికె. దాని విని యాచభూపాలుఁడు వలదు వల దని దత్తప్పకవిచేతులు పట్టుకొని బ్రాహ్మణుఁ డలుగఁదగునే సైరింప వలయును. అని యాతని వేడుకొని కూర్చుండఁ బెట్టి చీనిచీనాంబరములు తెప్పించి యాతనిపయిఁ గప్పె. అట్టివానిలో నొకదానింబట్టి అతనియెదుటనే దత్తప్ప ముక్కలుముక్కలుగాఁ జింప నారంభించె. దానిం జూచి యేమి స్వామీ యిటులొనరించుట న్యాయమా ? యని యడుగుయాచమనీనిం జూచి దత్తప్ప యిట్లనియె.

"క. యాచమహీపతివలువలు, గోఁచులకేఁ గాక కట్టుకోకల కగునా
     రేచెర్లగోత్రమందున, నీచుఁడు జన్మించి కులము నీఱుగఁ జెఱిచెన్."

అని యిట్లుత్తరంబిచ్చిన కవికిఁ గల్గిన కోపకారణం బారా జడిగిన నాతం డిట్లనియె. ప్రభువులకు విద్యావిశేషంబులుండవలయు నని యనుటకుఁ గారణము తమకడ కరుదెంచు విద్వాంసుల యోగ్యతల దెలిసి వారికి యథోచిత సత్కారంబులఁ జేయుటకుఁ గాని వారు స్వయముగ కక్షగట్టి పండితుల నలయించుటకుఁ గాదు. ఒక్కొకవిద్యలోఁ బెక్కేండ్లు గడపి గురుకులవాసంబుచే విద్యనేర్చిన పండితోత్తములఁ బరీక్షింప దానిలోఁ గొంచెము దీనిలోఁ గొంచెము తెలుసుకొనినవారితరంబగునే? అట్లుగాఁ దనబలంబు నెదిరిబలంబు నెఱుఁగక పండితుల నలయింప వారి కాగ్రహంబు రాక అట్టివారియెడ ననుగ్రహం బేల కలుగు? 'సాధుసజ్జన సంతాపా త్కి మాశ్చర్యం కులక్షయే' అనియుండుటంజేసి యట్టివారు పడినపరితాపం బూరక పోవునా ? అట్టి పరమసాధులలో నొక్కండును షట్ఛాస్త్రపారంగతుండునగునీపండితశిఖామణి వచ్చినపుడీ యాస్థానములో నాతనికిఁ గల్గినయవమానంబే యిపుడీప్రత్యవమానకారణంబు. ఆ పండితుఁడు దయాళుండు గావున నీసంస్థానంబున కొకొకీడు తలంపక నీవలనం గల్గినయవమానమునకు సమమగునవమానం బే కోరి నన్నుంబిలిచి తెచ్చె. ఆకారణంబుననే నంతకు నోనాడనైతి. కావున నీవుచేసినది మహాపచారంబగు. నావిప్రశిఖామణిం బ్రసన్నుం జేసికొమ్మనుడు రాజుపశ్చాత్తప్తుం డై ఆపండితశిఖామణి దిక్కు మొగంబై యిట్లనియె. ఎఱిఁగియొ యెఱుఁగకయో మీయెడ మహాపరాధంబు గావించితి. దానిని సహించి నన్నుఁ గరుణింప నీకవిశిఖామణిం బ్రసన్నుం జేయుఁ డనుండు నాతండు మహాప్రభూ మేమందఱ మీశ్రేయస్సుఁ గోరినవార మవుటంజేసి యిక్కడ జరుగుచుండుదురాచారంబు నివారింప ని ట్లొనర్చితిమిగాని మీయెడఁ గోపంబు లేదు. అట్టియుద్దేశంబుతోడ నీదత్తప్పకవిశిఖామణియు వచ్చియున్నాఁడు. అతఁడు నైసర్గికముద దయాళుఁడు నీయెడ నొకకోపంబుదెచ్చుకొనునే? యనుడు రాజాయిర్వురఁబూజింతు నని యిర్వురకును విశేష బహుమతు లొనర్చె. అపుడు దత్తప్పలేచి తనబహుమతులఁ గూడ నా పండితున కిచ్చి రాజుకడ ననుజ్ఞాతుం డై బండితుని వెంట నిడుకొని స్వ గ్రామంబునకుఁ జనియె. ఇట్లు వచ్చి వెంకన్నకవితో నా సభలో జరిగిన వృత్తాంతమంతయుఁ దెలుప నాతం డాపండితుని సంతసించితివిగదా యని యడిగిన నాతండు బ్రహ్మానందభరితుం డై నేను పట్టినది చింతకొమ్మ కాదా ? నా కొకలోపముండునా యనిచెప్పి వారిరువుర వలన ననుజ్ఞాతుం డై నిజనివాసగ్రామంబునకుఁ జనియె. ఇది వెన్నెలకంటివారి దౌహిత్రు లగుమోచెర్లవారివృత్తంతము.

కృతిపతి వంశావళి.

ఈవిష్ణుపురాణమునకుఁ గృతిపతి రావూరి బసవ భూపాలుని కుమారుఁ డగురాఘవభూపాలుఁడని వక్కాణించితిమి. అం దాతని వంశావళి విపులముగా వివరింపఁబడినది. దానిసంగ్రహము నీక్రిందవివరించెదను.

శూద్రజాతి అందు అన్న వేమభూపాలుఁడు పుట్టినపంటకులములో (1) పైవారిలో నొకటి రెండుగుర్తులు గలవారిచరిత్రము కొంత దెలియఁదగియున్నది. అందు మొదటివా డగుబసవరెడ్డి కటకాధిపుఁ డగు గజపతిరాజుచేత పల్లకి బహుమానము నందె. కర్ణాటప్రభునిచేత నాఎకరాజ్యభోగముల గైకొనియె. మలకవజీరులను సాధించె. తెలంగాణ (probably Telingana) భూములలోనుండెడు మన్యరాజులచేత పన్నులు గ్రహించె. దీనిం దెల్పుపద్యమును వివరించెదను.

"సీ. కటకాధిపతి యైనగజపతిరాజుచేఁ, బ్రతి లేనిపల్లకిపదవి నందె
      మహిమచేఁ గర్ణాటమండలాధిపుచేతఁ గడలేనిరాజ్యభోగములఁ గాంచె
      ప్రౌఢపౌరుషమున రాజిల్లి మెఱయఁగా, మలకవజీర్ల కుమ్మలిక జేసెఁ
      దెలగాణభూములఁ గలమన్నెవారిచే, బలవంతముగను గప్పములు గొనియెఁ

తే. జటుధాటీనిరాఘాట ఘోటకావ, లీఖురోద్థూత నిబిడధూలీనిలిప్త
    మండితాశాంగ నాకుచమండలుండు, బాహుబలశాలితమ్మయబసవవిభుండు."

పై బసవారెడ్డియు నాతని తమ్మలు శిష్యులుగాఁ గల్గిన యొక మహాత్ముఁ డుండెననియు నాతనిపేరు పంగులూరి యన్నయ యని యుఁ గలదు. అతనికి 'ఘోడియరాయ' బిరుదు గలదు. అట్టిపంగులూరి యన్నయాచార్యుని కటాక్షము నంది పై బసవరెడ్డి సమస్తైశ్వర్యముల నందె నని యున్నది. ఈపంగులూరి యన్నయ మిగుల విశేషజ్ఞుఁ డని సూరకవియు యాతనిం గూర్చి చేసిన వర్ణనంబట్టి యూహించ వలసియున్నది. ఆవర్ణన యెట్లున్న దనఁగా :-

"క. వీరుల కెల్లను గురుఁడై, రారాజులపూజలింగమై సుకవిమనః
     పూరితఘనవితరణవి, ద్యారసికుఁడు పంగులూరి యన్నయ వెలసెన్.

సీ. వినుతనానావేదవేదాంగశాస్త్రపు, రాణేతిహాసనిర్వాహకుండు
    శైవవైష్ణవసౌరశాక్తగాణాపత్య, మంత్రతంత్రాగమమర్మవిదుఁడు
    పరమపావనపరాపశ్యంతి మధ్యమా, వైఖరీమార్గప్రవర్తకుండు
    ఆధారమణిపూరకాది పంకజపత్త్ర, నిక్షిప్తపంచదశాక్షరుండు.

తే. కావ్యనాటకాలంకార భవ్యమూర్తి, పరమగురుసంప్రదాయప్రభావనిరతుఁ
    డగుచు ఘోడియరాయవిఖ్యాతినొందె, పంగులూరన్న యార్యుండు బ్రహ్మవిదుఁడు."

అనియున్న యీస్తోత్రముంబట్టి యితఁడు శివాద్వైతిగాఁ గాన్పించు.

(2) రాఘవరెడ్డి విశేషములు.

ఈ రెడ్డి తనతండ్రివలెఁ గాక తాను వైష్ణవమతప్రవిష్టుఁడై యొకవైష్ణవుని తనకు గురువుం జేసికొనియె. అతనిపేరు సింగరాచార్యుఁడు. ఆసింగరార్యుఁడు తిరుమల తాతా చార్యుని మనుమఁడని చెప్పంబడినది. ఆ యిర్వురినడుమ నున్న వారిపేరులు చెప్పంబడలేదు. మొదట సింగరాచార్యులవిశేషములం దెల్పి యనంతరమతనిం గూర్చి ఆగ్రంథములోనే అచ్చటచ్చట వివరింపఁబడినపద్యములం జూపెద. ఎట్లన్నను.

"క. ఆతనియాచార్యుఁడు వి, ఖ్యాతయశోధనుఁడు సింగరార్యుఁడు వెలసెన్
     భూతలమునందుఁ దిరుమల, తాతయవంశమున సకలధర్మజ్ఞుం డై.

సీ. వేదాంతవిద్యావివేకి షడ్దర్శన, పారంగతుఁడు పరాపరరహస్య
    వేది బ్రహ్మాండాది వివిధ పురాణజ్ఞుఁ డసమానధర్మశాస్త్రాభినేయ
    కుశలుఁడు పరమార్థకోవిదుం డఖిలాధ్వ,రక్రియానిపుణుఁడవక్రకావ్య
    నాటకాలంకారనానాకళాభిజ్ఞుఁ, డుభయభాషాకవిత్వోజ్జ్వలుండు

తే. పరమవైష్ణవమార్గతత్పరుఁడు కీర్తి, ధనుఁడు తిరుమలతాతయ్యమనుమఁ డైన
    సింగరాచార్యు గురువుగా సేవజేసి, రమణఁజెలువొందెబసవయరాఘవుండు."

షష్ఠ్యంతములలో నీరాఘవరెడ్డి తిరుమలతాతాచార్యుని శిష్యుఁ డనియేయున్నది. ఎట్లన్నను :-

"క. తిరుమలతాతయదేశిక, వరశిష్యున కనుపమేయవైదుష్యునకున్
     పరభూపాలతమస్సం, హరణాదిత్యునకుఁ బల్లవాదిత్యునకున్."

అష్టమాశ్వాసాంతమున మఱియొకపద్య మున్నది. అందు సింగ రార్యుఁడు తిరుమలతాతాచార్యవంశ్యుఁడుగా వివరింపఁబడె. ఎట్లన్నను :-

"క. తిరుమలతాతయవంశా, భరణశ్రీసింగరార్యపరమగురుకృపా
     పరిపూర్ణహృదయయాచక, వరచేతఃకమలినీదివాకరమూర్తీ."

ఈ శింగరాచార్యుఁ డేకాలపువాఁడో తెలిసిన నతనిశిష్యుం డగు రాఘవరెడ్డికాలంబును, అతనిపైఁ గృతినిచ్చిన వెన్నెలకంటి సూరన కవికాలమును విస్పష్టంబగును. ఇదివఱలో నావలనఁ బింగళిసూరన చారిత్రములోఁ బ్రచురింపంబడిన తిరుమలతాతాచార్యుని వంశావళిం బరీక్షింప నందు సింగర్యనామము లభియింపలేదు. తత్పర్యాయ నాముఁడగు నృసింహాచారి మొదటివాఁడే. అందులో మువ్వురు తాతాచార్యనాము లున్నారు. వా రీసింగరార్యునితరువాతి వారు. అందు మొదటియతనిమనుమనిపేరు శ్రీనివాసాచార్యుఁడు. రెండవయతనిమనుమనిపేరు సుదర్శన లేక సుందరాచార్యులు. మూఁడవయతని మనుమనిపేరు వేంకటాచార్యులు, ఈ మువ్వురిలో నెవరైన నీసింగరాచార్యావరనాము లుండిరేమో తెలియదు. ఉన్నచో దానిం దెలుపుగ్రంథసామగ్రిలేదు. మొదట నృసింహాచార్యు లేమో అను సంశయము మఱియొక స్థలములోఁ దీర్చెదను. నియాస్థానమార్గమునకు విశేషాధారములు లేవు గావున దీనింబట్టి రాఘవరెడ్డి యొక్కయు, నత కవి యగు వెన్నెలకంటి సూరనకవియొక్కయుఁ గాలము ధైర్యముతో నిర్ణయింపఁ జాలను. కావున దీని న్వదలి మార్గాంతరమున నీతనికాలము నిర్ణయింపఁజూచెదను. అట్టిదానికిఁగాను గ్రంథారంభంబున నచ్చటచ్చట వివరింపఁపడిన కొండవీటిరెడ్ల వృత్తాంతము పరిశీలించవలసియున్నది. దానిం దెలుపుటకు సూరకవి కొన్నికొన్ని వాక్యములను వివరించె. వాని నీక్రింద నేకముఖముచేసి చూచెదము గాక. అవి యెట్లనఁగా :-

ప్రాచీను లగురెడ్లవిషయము.

(1) "క. అనవేమమండలేశ్వరుఁ, డును నళ్లయవీరభద్రుఁడును మొదలుగఁ గ
          ల్గిన తొంటిరెడ్డిరాజులు, ఘనకీర్తులఁ గనిరి కృతిముఖంబున ననుచున్."

అనుదీనింబట్టి పైరెడ్డిరాజుల యనంతరకాలములో నీరాఘవరెడ్డి యున్నట్లు తేలును. పై అళ్లయ వీరభద్రరెడ్డి శా. స. 1350 సమీప కాలములో నున్నాఁడు. కావున నీరాఘవరెడ్డి తదనంతరకాలమువాఁ డగుట నిశ్చయమే. వారిరువురకును నడుమ యెంతయవధియున్నదో. తేలవలసియున్నది. దానికై మఱికొన్ని యాధారముల నరయుదము.

2. పైవెన్నెలకంటి సూరయ్యకవితాత యగుసూర్యకవింగూర్చి వివరింపుచు నాతఁడు 'వేమయయన్న వోతభూపాలునకు' సత్ప్రబంధము లొసంగెనని వివరించె. ఆపద్యము మొదటనే వివరింపఁబడినది. పై వేమయయన్న వోతభూపాలుఁ డెవ్వఁ డనుశంకఁ బొడమును. రెడ్డిరాజులలో వేమయనాములు పెక్కండ్రు గలరు. వారిలో శ్రీశైలములో నున్నపాతాళగంగకు సోపానములు కట్టించినవేమభూపాలుఁడు ప్రసిద్ధుడు. ఇతఁ డే కొండవీటిసీమలోఁ బ్రభుత్వము చేసినరెడ్డిరాజులలో మొదటివాఁడు. ఇదియ రెడ్లసంస్థానములలోఁ బ్రధానమగునది. పైరెడ్డివేమభూపాలున కిర్వురు పుత్త్రులు గలరు. వారిలో మొదటి యతనిపేరు అనవోతరెడ్డి. రెండవ యతనిపే రనవేమారెడ్డి. పైపద్యములలో వివరింపబడిన రెడ్డి రా జగు "వేమయయన్న వోతభూపాలుఁడు" వేమభూపాలుని పెద్దకుమారుఁడు. వెన్నెలకంటిసూర్యకవి యీవేమయయన్న వోతభూపాలునిపైఁ గృతులిచ్చినట్లుగా నతని మనమఁ డగుసూరనకవి పద్మపురాణమున వివరించె. విక్రమార్కచరిత్రములోని యీక్రిందిపద్యముంబట్టి పైవెన్నెలకంటి సూర్యకవి పై వేమభూపాలునిపేరఁగూడఁ గృతినిచ్చినట్లు కాన్పించు ఆపద్య మెట్లున్న దనఁగా :-

"ఉ. వెన్నెలకంటిసూర్యుఁడు వివేకగుణాఢ్యుఁడు వేదశాస్త్రసం
      పన్నుఁడు రెడ్డివేమనరపాలునిచేత మహాగ్రహారముల్
      గొన్నకవీంద్రకుంజరుఁ డకుంఠిత తేజుఁడు పెద్దతండ్రిగా
      సన్నుతి గన్న సిద్ధనకు సంతత దానకళావినోదికిన్."

దీనింబట్టి చూడఁగా సూర్యకవి వేమారెడ్డికాలములోఁ గూడఁ గృతినీయఁదగినవయస్సులో నున్నట్లు తేలినది. ఇచ్చట పైవేమారెడ్డి వంశావళిని ముందు వివరించెదను అదెట్లన్నను :పై వేమారెడ్డికిని, అన్న వోతరెడ్డికిని గూడ వెన్నెలకంటిసూర్యుఁడే ఆస్థానకవి. కావుననతఁడు వేమా రెడ్డికంటెఁ జిన్న వాఁడు నన్న వోతరెడ్డికంటెఁ బెద్దవాఁడు నై యుండవలెను. సూర్యకవిపుత్రుఁ డగునమరయామాత్యుఁ డన్న వోతభూపాలునికంటెఁ జిన్న వాఁడు నాతనిపుత్రుం డగుకుమారగిరి రెడ్డికంటెను పుత్త్రికయగు మల్లాంబకంటెఁ బెద్దవాఁడునగు. అటులనే అమరనామాత్యుని పుత్రుఁడగుసూర్యకవి మల్లాంబకంటెఁ జిన్నవాఁడును తత్పుత్త్రిక యగునితల్లీదేవికంటెఁ బెద్దవాఁడు నై యుండవచ్చును. కాని నితల్లీదేవి భర్త యగు నళ్లయ వీరభద్రరెడ్డివయస్సెంతో మనకుఁ దెలియదు గావున నతఁడు సూరనకంటెఁ బెద్దవాఁడో లేక ఆయిర్వురునొకయీడువారో ఊహింపవీలులేదు. ఆవిషయమెట్లున్నను వీరభద్రరెడ్డి అనంతరకాలములోఁ గృతినందినరాఘవరెడ్డికంటె నాతఁడు పెద్దవాఁ డనిచెప్పుటకు సందియ ముండదు. ఈ వీరభద్రరెడ్డియనంతర మతని తమ్ముం డగుదొడ్డయరెడ్డి అధికారము చేసినట్లుగా నాతనివలనఁ జేయంబడినకొంకుదుటి తామ్రశాసనముంబట్టి కాన్పించు. దానికాలము శా. స. 1352. ఇట్లుగా నీతఁడు రాజ్యము చేసినట్లున్నను రెడ్లసంపూర్ణాధికారము వీరభద్రరెడ్డితోనే ముగిసినట్లు కనుపించు. పై రాఘవరెడ్డి వీరభద్రరెడ్డి యనంతరము రాజ్యము చేయుచున్న దొడ్డారెడ్డిపేరు స్మరియింపక అతనియన్న వీరభద్రరెడ్డిపేరుమాత్రమే స్మరియించుటచే నతఁడు దొడ్డారెడ్డికాలీనుఁ డని యూహింపఁదగియున్నది. అప్పటికిఁ గృతి నందినరెడ్డిరాజులలోఁ జివరవాఁ డీవీరభద్రరెడ్డియేకా వున నళ్లయ వీరభద్రరెడ్డిమొదలగు తొల్లిటిం రెడ్డిరాజులు కృతిముఖంబుననే కీర్తులు సంపాదించినట్లు రాఘవరెడ్డి వచించె. ఈ వీరభద్రరెడ్డి పైఁగృతినిచ్చినవాఁడు శ్రీనాథుఁడు కావున నీశ్రీనాథుఁడును వెన్నెలకంటి సూరనకవియు సమకాలీనులు కాక తప్పదు. అటుకావున సూరనకవి శ్రీనాథునిప్రాచీనాంథ్రకవులలోఁ జేర్చి వర్ణించనట్లు కాన్పించదు.

రాఘవరెడ్డి నివాస్థానము.

ఇది గుడ్లూ రనునామంబునఁ బిలువం బడుచుండును. ఈగ్రామముయొక్క విశేషము లొకపద్యములో నీగ్రంథములోనే వివరింపఁబడినవిః ఎట్లనఁగా :-

"సీ. గౌరీసమేతు డైఁగరిమతో నేవీట, నేపారు నీలకంఠరేశ్వరుండు
      వారాశికన్యతోవర్తించు నేవీట, గిరిభేదిసుతుఁడైనకేశవుండు
      యోగినీసహితయై యొప్పారు నేవీటఁ, బసిఁడిపోలేరమ్మ భవునికొమ్మ
      పాపవినాశయై ప్రవహించు నేవీట, మన్నేఱుమిన్నేటిమాఱటగుచుఁ
      గుంజరములు వేయికొలువంగ నేవీటఁ, గొడగుచక్రవర్తి పుడమి యేలె
      నట్టిరాజధాని యై యొప్పుగుడ్లూరి, నొనర నేలుచుండి యొక్క నాఁడు."

ఈ గుడ్లూరు గ్రామమే హరివంశమును రచియించిన యెఱ్ఱప్రెగడ నివాసస్థలము. దాని నాతఁ డీక్రింది విధంబున వర్ణించిచెప్పె.

ఆరణ్యపర్వశేష మగునాశ్వాసములలోఁ జివరనున్న యాశ్వాసము చివరసీసపద్యము.

"సీ. భవ్యచరిత్రుఁ డాపస్తంబసూత్రుండు, శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ
      సంతతధ్యానసంసక్తచిత్తుఁడు సూర, నార్యునకును బోతమాంబికకుని
      నందనుం డిల పాకనాటిలో నీలకం,ఠేశ్వర స్థానమై యెసకమెసఁగు
      గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు, ధన్యుఁడు ధర్మైకతత్పరాత్ముఁ
      డెఱ్ఱనార్యుఁడు _________"

ఇట్టిపద్యములంబట్టి పై గుడ్లూరుగ్రామము పాక నాటిసీమలోని దని తేలినది. అది పై రావూరి రాఘవరెడ్డికి ముఖ్యపట్టణము. ఈ రాఘవరెడ్డియింటిపేరు రావూరివా రని యుండుటచేతను, రావూరను నొక గ్రామముండుటచేత నతని కాఁపురస్థలము రావూ రని కొందఱభిప్రాయపడుదురు. అది సరికాదు. గుడ్లూరనునది కొడగుచక్రవర్తికి ముఖ్యస్థానమనియు నది తదనంతరమున నీరాఘవరెడ్డిస్వాధీనమైనట్లుగా నున్నది. కావున నీ రాఘవరెడ్డి గుడ్లూరి సంస్థానాధిపతియని నిర్ణయించెదము. పైకొడగు చక్రవర్తి యెవరో దానిం దెల్పుగ్రంథసహాయములు లేవు. పూర్వకాలములో గుడ్లూరు మొదలగుసీమలు అదొండుఁ డను చోళచక్రవర్తి పరిపాలనలో నున్నట్లు తెలియవచ్చును. అతనికే యీ కొడగుచక్రవర్తి యనుపే రీదేశస్థులవలన వాడఁబడెనేమో తెలియదు.

కవిచరిత్ర పై విమర్శనము.

బ్ర. కందుకూరివీరేశలింగము పంతులవారు తమ 'ఆంధ్రమధ్య కవుల' చరిత్రములో (రెండవభాగములో) నీవెన్నెలకంటి సూరకవి కాలము మఱియొకటిగా నిర్ణయించిరి. వారికిని మాకును పైవిష్ణుపురాణములోని యాధారములే కాని వేఱుసామగ్రితోఁ బనిలేదు. కావున వారు నిర్ణ యించినకాలము సరియైనది యవునా కాదా యని పరిశీలించవలసి యున్నది. అట్టిపని చేయుటకుఁ బూర్వ మాంధ్రదేశములోని వివిధఖండములను బాలించిన రెడ్లవంశము లెన్ని యున్నవో, వారిలో వారికిఁగలసంబంధము లెట్టివో చూపవలసియున్నది. ఆవివరము దేశచారిత్రోపయోగముగా నీవఱకే నావలన మఱియొకసందర్భములోఁ గొంచెము విపులముఁగా వివరించఁబడియున్నది. దాని సంగ్రహమైన నిచ్చో వివరింపకున్న నీ విష్ణుపురాణము కృతినందినరెడ్లవంశావళిలో వివరింపఁబడిన యితర రెడ్లసంబంధములు తేలవు కావున నావంశావళుల నిట వివరించెదను

1. ఆంధ్రహరివంశములోని యొక రెడ్డివంశావళి.

పంటకులములో

కుమారగిరిరెడ్డి.

కొండవీటిలోఁ గులాగతమైన రాజ్యమునందె. ఇతని బాల్యములోఁ గాటయ వేమారెడ్డి మంత్రిగానుండి వ్యవహరించె. దానికిఁ బ్రత్యుపకృతిగా నీకాటయ వేమారెడ్దికి కుమారగిరిరెడ్డి రాజమహేంద్రవరము మొదలగు తూర్పుదేశము బహుమానమిచ్చెను.

5. మల్లవరశాసనములోని రెండవ రెడ్డివంశావళి.

కాటయరెడ్డి.

|

మారయరెడ్డి.

|

కాటయరెడ్ది.

ఇతనిభార్య వేమారెడ్డికొమార్తెయు అనవోత అనవేమారెడ్లతోఁబుట్టువగు దొడ్డాంబిక

వేమారెడ్డి

ఇతనిభార్య అన్న వోతరెడ్డి కుమార్తెయు కుమారగిరిరెడ్డితోఁబుట్టువు మల్లాంబ.

ఈమె శాసనం శా. స. 1333

6. అమరుక కావ్య వ్యాఖ్యాత యగు రెడ్డివంశావళి.

శ్రీశైలములో పాతాళగంగకు సోపానములు కట్టించిన వేమారెడ్డికి

జ్యేష్ఠసోదరుఁ డుగుమాచభూపాలుఁడు.

|

రేడిపోతరెడ్డి - కోమటి రెడ్డి. - నాగారెడ్డి.

|

వేమారెడ్డి (వ్యాఖ్యాత) - మాచరెడ్డి

ఇట్లుగాఁ బ్రస్తుతములోని విష్ణుపురాణ వంశావళిగాథలకు నవసరముగా వలయురెడ్డివంశావళులమాత్రము వివరించినాఁడను. పై వానింబట్టి "వేమయ అన్నవోతభూపాలుఁడు" "ఆళ్లయవీరభద్రరెడ్డి" ఎవరోస్పష్టముకాఁగలరు.

ఇట్లుండఁగా నాంధ్రకవిచరిత్రములో 83 వ పుటలో "తాను అనవోతరెడ్డికి ప్రబంధము లొసంగిన వెన్నెలకంటివారి వంశజుఁడననియు, వెన్నెలకంటి సూర్యునిమనుమఁడ ననియు, వేఱు వేఱుగాఁ జెప్పుకొనుట చేత నీతఁ డనవేమరెడ్డికాలములో నున్న సూరన్నకు మనుమని మనుమఁ డగుట స్పష్టము. మొదటిసూరన్న కైదవతరమువాఁడగుటచేత నిరువురకును నూఱుసంవత్సరములకంటె నెక్కువకాలవ్యత్యాస ముండి యుండవలెను." అని యున్నది. దీనిలో నాలోచించవలసినది వెన్నెలకంటి సూర్యుఁ డనునతఁ డెవ్వండని ? అతనికిని విష్ణుపురాణకవి యగుసూరన కవికిని గలసంబంధమేమి? దీనికి వీరేశలింగముపంతులుగారు కనిపెట్టిన మార్గము గ్రంథాధారము లేనిదైయున్నది. "వెన్నెలకంటివారిలో" ననియున్న దానికి వెన్నెలకంటి వంశమందుఁ బుట్టిన కవీశ్వరు లందఱిలో నని యర్థమూహించిరి. అంత విశేషార్థము దానిలో నాలోచించవలసిన పనిపేదు "వెన్నెలకంటివారిలో" ననఁగా వెన్నెలకంటివా రనుగృహ నామము గలవారిలో 'వెన్నెలకంటిసూర్యఁ డనునతనిమనుమఁడ నని' చెప్పినాఁడు. ఈసూర్యకవి "వేమయఅన్న వోతరెడ్డి" పైఁ గృతినిచ్చినట్లుగా నీవిష్ణుపురాణములోను అంతకుముందే వేమయభూపాలునకుఁగూడ గృతినిచ్చి యగ్రహారములు కొనియె నని విక్రమార్క చరిత్రములో నుండఁగా నా యిర్వురు వేఱు వేఱు కవీశ్వరు లనియు వారికీవిష్ణుపురాణ గ్రంథకర్తయగుసూరన మనుమనికి మనుమఁడనియు నిశ్చయించి అది స్పష్టమే యని పంతులవా రెట్లు నిష్కర్షించిరో తెలియదు. ఇట్టి నిష్కర్షకు పంతులవారికిఁ గలయాధారములు లేనిమాట స్పష్టమే. విక్రమార్క చరిత్రములోని పద్య మీవఱకే వివరించితి. కావుననీ వెన్నెలకంటి సూర్యకవి అనవోతభూపాలునిపైనేగాక అతని తండ్రి యగువేమభూపాలుని పైఁగూడ కృతియిచ్చినట్లు కానుపించును. దీనింబట్టి యీసూర్యకవి వేమభూమీశుని కాలములో బాలుఁడై యున్నట్లును, అతని కుమారుని కాలమునాఁటికి వార్ధికమం దున్నట్లును గానుపించు. అటులనే సూర్యకవి కొడుకుకొడు కగుసూరనకవి వేమభూపాలునికొడుకు అతనికొడుకగు కుమారగిరి రెడ్డికాలములో బాలుఁడై యున్నట్లు నాకుమారగిరి మేన గోడలి పెనిమిటియగు వీరభద్రభూవిభునికాలంబులో నీతని కతిసమీపంబుననున్న యీ రావూరి రాఘవరెడ్డికాలములో ముదుసలియై యున్నట్లూహించుట సహేతుకమైయుండును గాని పంతులవారూహించినట్లుకాదు. ఇఁక పంతులవారు కనిపెట్టిన రెండవమార్గముకూడ సరియైనది కాదని తోఁచుచున్నది. అది తిరుమలతాతాచార్యులంబట్టి యతని మనుమని శిష్యుండగు నీరాఘవరెడ్డి కాలము నిర్ణయించుట. దీనింగూర్చి యిదివఱకే నాయభిప్రాయము నిచ్చియున్నాను. ఆపద్యములనే తిరుగఁ బరిశీలించి చూపెదను. అందు పంతులవా రుదాహరించినయొకపద్యములో తిరుమలతాతయ్య అనుమఁ డగుసింగరాచార్యునిశిష్యుఁ డీరాఘవ రెడ్డి యని యున్నదిగాని షష్ఠ్యంతములలోని మఱియొకపద్యములో "తిరుమల తాతయదేశిక వరశిష్యునకు" నని యున్నది. దీనింబట్టిచూడ నీరాఘవరెడ్డి ప్రథమములో తిరుమలతాతాచార్యునివలన మంత్రోపదేశమునంది యున్నట్లు గాన్పించు. ఆకారణమున నతని తండ్రి యగునరసింహాచార్యుని (సింగరాచార్యులు) తన పరమ గురునిగా భావించినట్లు కాన్పించు, అదెట్లన్నను :-

"క. తిరుమలతాతయవంశా, భరణశ్రీసింగరార్యపరమగురుకృపా
      పరిపూర్ణహృదయ యాచక, వరచేతఃకమలినీదివాకరమూర్తీ." ఆశ్వా-8-చివర

పైనృసింహాచార్యులు మహామహిమావంతుఁ డైకర్ణాటప్రభుండగువిరూపాక్షరాయలను శైవమతమునుండి వైష్ణవమతములోనికి మార్చినవాఁడు. అంత నారా జీనృసింహాచార్యునకు శిష్యుఁడై యుండి విరూపాక్షముద్ర వదిలె ననియు నాకారణమున నావంశపురాజులకు రాజ్యభ్రంశము కల్గెననియు రాయలవంశ చరిత్రములో నున్నది. ప్రపన్నామృతములోఁగూడ నీనృసింహాచారింగూర్చి యీక్రిందివిధంబున వ్రాయంబడినది. దానినే మఱియొకపరి వివరించెదను. ఎట్లన్నను -

శ్లో. విరూపాక్ష స్తతో ధీమా న్వీరశైవమతో౽పి సః,
    శ్రీశైలవంశసంభూతా జ్ఞాత్వా తా రామలక్ష్మణౌ.

   పుత్త్రమిత్రకళత్రాది సహితశ్చ సనాగరిః,
   శ్రీశైలవంశతిలకా న్నృసింహార్యా జ్జగద్గురోః.
   పంచసంస్కారసంపన్నో బభూవ సుమహాయశాః."

ఇఁక 'తిరుమలతాతయ్యమనుమఁడైనసింగరాచార్యుని' అనుదానినాలోచించవలసియున్నది. నృసింహాచారి మొదలు తిరుగ నావంశములో నాపేరు గలవారుగాని దాని పర్యాయనామమగు సింగరాచార్య నామము గలవారుగాని లేకుండుటంబట్టి యీనరసింహాచార్యుని తాతయును తాతాచారిగానే తేలినది. పై విరూపాక్షదేవరాయనికాలము క్రీ. శ. 1470 సమీపకాలముగాఁ గాన్పించు. అనఁగా శా. స. 1390 సమీపగును. మనము పై నూహించిన సింగరాచార్యుఁడు నాకాలమునకే మిక్కిలి వృద్ధుగాఁ గనుపించును. రెడ్డివారికాలముంబట్టి చూచిన నావఱకే యీరాఘవరెడ్డికంటె నతని కవీశ్వరుం డగునీవెన్నెలకంటి సూరనకవి ముదుసలి యై యున్నట్లు తేలినది. కావున నతనికాల మించుమించుగా నంతకుఁ బూర్వమే యగును. పంతులవా రింకొకమార్గముగూడ విశదీకరించిరి. షష్టాశ్వాసాంతమునందలి యొక పద్యములో

   "క, ర్ణాటనరేంద్రదత్తసముదంచిత శాశ్వతరాజ్యవైభవా."

అని రాఘవరెడ్డిని సంబోధించుటచేతను ప్రథమాశ్వాసమునందలి కృతిపతివంశవర్ణనములో

   "........మహిమచేఁ గడ లేనిరాజ్యభాగములు గాంచె."

నని రాఘవరెడ్డి తండ్రి యైనబసవయరెడ్డినిగూర్చి చెప్పియుండుటచేతను, ఈరాఘవరెడ్డియుతండ్రియు కొండవీటిరాజ్యమును కృష్ణదేవరాయని తండ్రితాతలు జయంచి యాక్రమించుకొన్న తరువాత వారిచే నియ్యఁబడిన చిన్న సంస్థానమును బాలించుచుండినట్లు కానుపించు." అని దీనిలోఁ బంతులవారు స్థూలదృష్టి నాలోచించిరిగాని సూక్ష్మముగాఁజూడ లేదు. ఈకథయంతయుఁ బూర్వపక్షమయ్యె నని చెప్పుటకుఁ గొండవీటిసీమ కృష్ణదేవరాయలనాఁడే జయింపఁబడెనని చెప్పుటచే నై యున్నది. ఆవృ త్తాంతవిశేషములు నావలన దీనికి వెనుకటిభాగములోఁ గృష్ణదేవరాయ చరిత్రములో స్పష్టపఱుపఁబడినది. కావున నిపుడు కృష్ణదేవరాయల తండ్రితాతలకాలములోఁ గొండవీడు కృష్ణరాయవంశస్థులస్వాధీనములో నుండెనని చెప్పవీలులేదు. ఇఁక పైకర్ణాటమండలేశ్వరుఁ డెవ రని శంకింప వలసియున్నది. బుక్క రాజుయొక్కవంశమువారు శా. స. 1250 మొదలు 1400 సంవత్సరములవఱకుఁ గర్ణాటకప్రభుత్వము చేసిరి అట్టివారిలోఁ బైవిరూపాక్షరాజు నతనియనంతర మతిప్రసిద్ధుఁ డగుప్రౌఢ దేవరాయలును క్రీ. శ. 1476 అనఁగా శా. స. 1400 వఱకును రాజ్యము చేసినట్లు (" Lists of Antiquities of Madras, " Vol II. page 128) గ్రంథదృష్టాంత మున్నది. రెడ్ల అధికారము తగ్గినది మొదలు బెజవాడ ఖండము మొదలు కర్నూలు జిల్లా తుదవఱకుఁ గలదేశమంతయు బెజవాడ రాజధానిగాఁ గలసూర్యవంశము వసిష్ఠగోత్రము గలసింగిరిరా జను నొకరాజు స్వాధీనములో నున్నట్లును, అతఁడు నాతనిపిమ్మట రాజ్యమునకు వచ్చిన అతనివంశస్థులును గర్ణాటకప్రభుఁ డగుబుక్కరాజు నతని వంశస్థులకు సామంత ప్రభువులుగా నుండి వ్యవహరించినట్లును " Local Records" లో గ్రంథదృష్టాంతములు పెక్కులు కానంబడుచున్నవి. ఇట్లుండఁ గృష్ణదేవరాయలు నాతనితండ్రి తాతలు కొండవీడు రాజ్యమును జయించి ఆక్రమించి రని చెప్పినమాట చరిత్రానుభవవ్యతీ రేక వాక్యముగాఁ బరిహరించవలసివచ్చినది. ఇఁక నీవెన్నెలకంటి సూరనకవి

శ్రీనాథునివిషయము.

శ్రీనాథాదుల కాలమునకుఁ దరువాతివాఁ డైనట్లు విష్ణుపురాణ కృతిపతి యగురాఘవరెడ్డి కృతులందిన తన పూర్వులంగూర్చి చెప్పిన యీ క్రిందిపద్యమువలనఁ దేటపడుచున్నది.

"క. అనవేమమండలేశ్వరుఁ, డును నళ్ళయవీరభద్రుఁడును మొదలుగఁ గ
     ల్గినతొంటిరెడ్డిరాజులు, ఘనకీర్తులు గనిరి కృతిముఖంబున ననుచున్."

క్రీ. శ. 1435 సంవత్సర ప్రాంతములయం దుండిన వీరభద్రరెడ్డి తనపూర్వులలో నొకనిఁగా గృతిపతియైనరాఘవరెడ్డి చెప్పుటచేత నీవిష్ణుపురాణము రచియింపఁబడినకాల మటుతరువాత నఱువది డెబ్బది సంవత్సరము లైన నై యుండవచ్చును." అని యున్నవి. ఇందులోఁ బంతులవా రొకసంగతి నాలోచింపనట్లుగాఁ గాన్పించు. ఆకారణంబున వీరభద్రరెడ్డి పై రాఘవరెడ్డికిఁ బూర్వులలో నొకఁ డని పంతులవారు నిర్ధారణ చేసిరి. అది పొరపాటుగా పైని నావలనఁ బ్రస్తరింపఁబడిన రాఘవరెడ్డి వంశావళివలన స్పష్టమే. దానిలోని రాఘవరెడ్డి తండ్రి బసవ రెడ్డి అయినట్లు, నాతనితండ్రి తమ్మారెడ్డి అయినట్లు నాతని తండ్రి పేరమరెడ్డియు, నాతనితండ్రి లింగ భూపాలుఁ డైనట్లు కానుపించు. పై వీరభద్రరెడ్డి, రాఘవరెడ్డి పూర్వులలో నొక్కఁడు కావలసియుండునెడల నైదుగురు పురుషులకుఁబైవాఁడు కావలయును. అటులైన నాయిర్వురకుం గలకాలభేద మఱువది డెబ్బది సంవత్సరములుగాక నూటనలుబది నూటయేఁబది సంవత్సరములవఱకు నుండవలసివచ్చును. ఇఁకఁ దొంటిరెడ్డిరాజు లనుదాని కెట్టి యర్థము చెప్పవలయు నని శంకించుకొనియెదము. పైవీరభద్రరెడ్డివఱకును రెడ్లు మిగులఁ బ్రబలు లైనదేశాధిపులై యుండిరి. మొట్టమొదట నీరెడ్లకుఁ గొండవీటి సీమ, అద్దంకి, అమ్మనబ్రోలు సీమలు ముఖ్యస్థానము లై యుండిన నట్టివానిలో వీరి అధికారము క్రమముగా క్షీణించి తుదకు రాజమహేంద్రవరము మొదలు తూర్పున నున్న లక్షకలింగమునకు మాత్రమే ప్రభుత్వము నిల్చినది. అదియును శ్రీనాథుఁడు భీమఖండంబున వివరించిన విధంబునఁ బూర్వసామ్రాజ్య పీఠస్థు లగుప్రోలయవేమ అన్నవోత, అన్నవేమ, కుమార గిరీశ్వారాదుల సంబంధ బాంధవ్యంబున వసుంధరాభారధౌరంధర్యంబు అల్లయవేమ వీరభద్ర రెడ్లకు సంప్రాప్తంబయ్యె. పైరాఘవరెడ్డి తనకులస్థులలో దేశాధిపతు లని విఖ్యాతివహించి యున్న అళ్లయవేమ, వీరభద్రాదులగు రెడ్డిరాజులు కృతు లంది విశేషకీర్తి సంపాదించిరి కావునఁ దాను నట్టి పనినే చేసి శాశ్వత కీర్తినందె నని తాఁ జేయుచున్న కార్యోత్కృష్టతఁ దెల్పుటకుఁ పల్కె. అంతమాత్రముచేతఁ బైవీరభద్రరెడ్డి రాఘవరెడ్డి పూర్వులలో నొకఁడని యూహించి. దానింబట్టి అతనికాలము నిర్ణయింపఁ గూడదు. పూర్వపు రెడ్డిరాజులను జెప్పునప్పుడు రాఘవరెడ్డి రాజు లనఁదగినవారిపై రెడ్లలోఁ జివరవాడగు వీరభద్రరెడ్డిని స్మరియించి అతఁడు తుదగాఁ బూర్వ మందుండు రెడ్డిరాజులలోఁ గొందఱు కృతినంది రనిచెప్పె. ఈరాఘవ రెడ్డియొక చిన్న సంస్థానాధిపుఁడగుటచేత రాజశబ్దవాచ్యుఁడు కాఁడు. ఇతని సంస్థానము కర్ణాటప్రభువుల పరిపాలనలోని దగుటచేత నానైచ్యమును దెల్పుకొనక తానుగూడఁ దనకంటెఁ గొప్పవా రగురెడ్డిరాజులవిధముగాఁ గృతినందినట్లు తెల్పును. వీరభద్రరెడ్డియనంతర మనఁగా శా. స. 1352 సంవత్సరమును తత్సమీపకాలములో నాతనితమ్ముం డగు దొడ్డయరెడ్డి ఆరాజమహేంద్రవరప్రాంతములోని కొంత దేశమున కధికారము చేసినట్లుగా నొకతామ్రశాసనము గోదావరీజిల్లా రామచంద్రపురముతాలూకా కొంకుదురుగ్రామములోఁ గాన్పించుచున్నది. వీరభద్రరెడ్డి కవ్యవధిగా రాజ్యమునకువచ్చియున్నయీ దొడ్డారెడ్డిపేరు విడువఁబడి వీరభద్రరెడ్డిపేరుమాత్రమే వివరింపఁబడుటచేత నీరాఘవరెడ్డి వీరభద్రరెడ్డితో సమకాలీనుఁ డై యున్నట్లును, కృతులనందిన రెడ్డివారిలో నప్పటికి వీరభద్రరెడ్డియే తుదివాఁడు నవుటంజేసి అతనిపేరుమాత్రమే స్మరించె. అతనిపైఁ గృతినిచ్చినకవి శ్రీనాథుఁడు. వీరరాఘవరెడ్డిపైఁ గృతినిచ్చినవాఁ డీవెన్నెలకంటి సూరనకవి. వీరిర్వురు రెండుస్థానములలోఁ గొంచెమెచ్చుతగ్గుగా నేక కాలములోనే కవీశ్వరులుగా నుండునపుడు కవీశ్వరుఁడు తనకాలములో నుండినమఱియొకకవీశ్వరుని పూర్వకవులలోఁ జేర్చి యేల చెప్పును. ఆకారణమున నీసూరనకవివలన శ్రీనాథునిపేరు వివరింపఁబడనట్లు కానుపించును. ఇట్లు శ్రీనాథునిపేరు సూరనకవి వదలుటయే ఆ యిర్వురు నేకకాలమువారు కావచ్చు ననుదానిని స్థిరపఱుచుచున్నది.

ఈవెన్నెలకంటి సూరనకవి చరిత్రములోఁ జేర్చవలసినవి మఱి రెండుకథలున్నవి. అందు మొదటిది 'విక్రమార్కచరిత్రముఁ' గృతినందిన వెన్నెలకంటి సిద్ధమంత్రికథ యొకటియుఁ గృష్ణవిలాసమున రచియించిన వెన్నెలకంటి వేంకటాచలకవి చరిత్రమొకటియును, ఈరెంటిలో సిద్ధమంత్రిచరిత్రము సూరయ కవికిఁ బ్రాచీనమైనదియును వేంకటాచలకవిచరిత్రము సూరనకవికి ననంతరకాలములో నిదియు నై యున్నది. ఈ రెండు చారిత్రములును గలిసినచో నీసూరన కాలనిర్ణయము తేలుటయేగాక అతని పూర్వులయొక్కయు ననంతర కాలములోని వారియొక్కయు చారిత్రములు దేలఁగలవు. కావున నారెంటిని నా 'కవికావ్యపశంసాచంద్రిక' నుండి విడఁదీసి దీనిలోఁ జేర్చు చున్నాను.

వెన్నెలకంటి సిద్ధయ్యచరిత్రము.

విక్రమార్కచరిత్ర మనుగ్రంథమును పైసిద్ధయ్య కృతినందె. ఆ గ్రంథములో నీతనివంశావళి వివరింపఁబడియున్నది. ఇతనిచారిత్రము నుడువునపుడే ఆగ్రంథమును రచియించిన జక్కనకవి చారిత్రముగూడ నుడువవలసియుండును గావున నిపుడు మొదట సిద్ధయ్యవంశచారిత్రము వ్రాసి అనంతరము జక్కనకవిచరిత్రము వివరించెదను.

సిద్ధనవంశము.

ఇట్లుగా వివరింపఁబడిన వంశవృక్షములోని పురుషులలో 1-2-3-4 గుర్తులు గలవారిచారిత్రము కొంత తెలియఁదగినదిగా నున్నది. ఎట్లన్నను :-

1. సూరనసోమయాజి.

"సీ. వేదశాస్త్రపురాణ విజ్ఞానసరణిపై, నధిగతపరమార్థుఁ డై తనర్చె
      నెద్దనపూఁడిరాజేంద్ర చోడక్షమా, రమణుచే నగ్రహారముగ వడసెఁ
      గనకదండాందోళికాచ్ఛత్రచామర, ప్రముఖసామ్రాజ్య చిహ్నములనొప్పె
      సర్వతో ముఖముఖ్యసవనక్రియా ప్రౌడి, నుభయవంశంబులనుద్ధరించె
      నన్న దానాదిదానవిదాఘనుండు, పరమశైవసదాచార పారగుండు
      హరితవంశాబునిధిచంద్రుఁ డార్యసుతుఁడు, సుగుణవిభ్రాజి సూరనసోమయాజి."

దీనింబట్టి యీ సూరనసోమయాజి రాజేంద్రచోళునివలన నెద్దనపూఁడి యనునగ్రహారము సామ్రాజ్యచిహ్నములు నందిన ట్లున్నది. ఈరాజేంద్రచోళు డనునతఁడు రాజనరేంద్రపుత్త్రుఁడు శా. స. 993 సంవత్సరములో సింహాసనమెక్కినట్లును శా. స. 1034 లో గతించినట్లు నుండుటచేత నీసూరన సోమయాజియును ఆకాలములోనివాఁడే అని తేలును. ఇతఁడును తిక్కన సోమయాజులును ఏకకాలీనులుగాఁ గాన్పించుచున్నారు. ఆకాలములోని నియోగిశాఖా బ్రాహ్మణులు యజ్ఞాదిక్రతువులుచేయుటయందు మిక్కిలి శ్రద్ధాళువులై యున్నట్లు కాన్పించు. ఈతఁడు కేవలము సోమము చేయుటయేకాక సర్వతోముఖము మొదలగు పైసంస్థలుగూడఁ జేసినట్లును, పరమశైవ సదాచారపరుఁ డైనట్లును గాన్పించు. ఇట్టి సూరన సోమయాజిపుత్త్రుని పేరుమాత్రము వివరింపంబడలేదు. అతని మ

(2) సిద్ధనమంత్రి.

నుమఁ డగు సిద్ధన మంత్రిపేరు వివరింపఁబడియె. ఈ సిద్ధమంత్రి యొక గొప్పకవిగాను నన్నయగంధవారణ మను నతనికి మంత్రిగా నున్నట్లును గానుపించును. ఆపద్యము లెట్లున్నవనఁగా :-

"మ. శ్రుతుల న్వన్నియ కెక్కెశాస్త్రములచే సొంపగల్గించెన్ మహో
       న్నతిఁ బోషించెఁ బురాణ కావ్య రస నానానాటకాలంకృతుల్

     క్రతువర్గంబుల సుప్రయోగ మహిమన్ గాంచెన్విరించాన్వయో
     ర్జితపుణ్యుం డగుసిద్ధమంత్రి సుగుణ శ్రీమించె సేవించిలన్.

మ. వనరుహానాభు కుద్ధవుఁడు, వజ్రికి జీవుఁడు, వత్సధారుణీ
     శునకు యుగంథరుండు, దితినూతికి దైత్యగురుండు, విక్రమా
     ర్కునకును భట్టి రీతి నధికుం డగునన్నయగంధవారణం
     బునకుఁ బ్రధానుఁ డై నుతులఁ బొందెను సిద్ధయమంత్రి యిద్ధరిన్."

దీనిలో నింకొకవిశేషముగూడఁ దేలినది. యుగంథురుఁడని బిరుదునందినవాఁడు మొదట వత్స రాజునకు మంత్రియై యుండెననియు, నది మొదలు బుద్ధిశాలిగాఁ బ్రవర్తించినమంత్రులకు యుగంథరుఁ డన్న బిరుదు కల్గుచు వచ్చినట్లును గానుపించును. ఈసిద్ధయమంత్రి పేరయనన్న నార్యు డనునొకమహాకవితోఁ బుట్టువును బెండ్లియాడె నని చెప్పంబడి యున్నది. ఆపండితుఁ డేయేగ్రంథముల రచియించెనో దానిం దెలుపఁ జాలను కాని మఱియెచ్చటనైన నతనిపేరు కానుపించినఁ బరిశీలింపఁదగునని చెప్పి అతనివిశేషములఁ జెప్పినపద్యముంగూడ వివరించెదను.

"వ. పరిణత నవ్యకావ్య రసభావవిజృంభణ భూరివిక్రమా
      స్ఫురితచరిత్రతత్త్వసరసుం డగు పేరయనన్న నార్యసో
      దరి యగునూరమాంబిక ముదం బలరంగఁ బరిగ్రహించె
      భాస్వరకమలాజనార్దనవివాహమహోత్సవలీల మీఱఁగన్."

ఈ సిద్ధయమంత్రి పైసూరనసోమయాజికి మనుమఁ డగుటంజేసి యితనికాలముగూడఁ గొంత యూహింపఁబడవచ్చును. శా. స. 1035 సమీపకాల మనఁగా శా. స. 1030 మొదలు 1050 వఱకు ఇతని తాతకాలము. అట నుండి యేఁ బదిసంవత్సరము లితనితండ్రికిని మఱియేఁ బదిసంవత్సరములు సిద్ధనకును లెక్కించి చూడఁగా నీసిద్ధనకాలము శా. స. 1180 లు గల దగును.

(3) జన్న మంత్రి.

ఈజన్నయ యనునతఁడు కర్ణాటాధిపుఁ డగుదేవరాయనిమంత్రిగా నున్నట్లుగా నీక్రిందిపద్యమువలఁ గాన్పించును. ఆపద్య మెట్లున్నదన :

"సీ. విమలవర్తనమున వేదశాస్త్రపురాణ, వాక్యార్థసరణికి వన్నె వెట్టె
      బరమహృద్యం బైనపద్యశతంబున, దేవకీతనయు విధేయుఁ జేసె
      రసికత్వమున దేవరాయమహారాయ, కరుణాకటాక్షవీక్షణముఁ గాంచె
      కర్ణాటకటకముల్ గలయంతయును మెచ్చ, గణకవిద్యాప్రౌఢి ఘనతకెక్కె
      గురులఁ బోషించె సత్కవివరుల మనిచెఁ,బ్రజల బాలించె భాగ్యసంపద వహించె
      హరితమునిముఖ్యవంశరత్నాకరేంద్ర, చంద్రుఁడైయొప్పుసిద్ధయజన్న మంత్రి."

ఇందులో వివరింపఁబడినదేవరాయ లెవ్వ రనుశం యున్నది. కర్ణాటరాజచారిత్ర మింకను సంపూర్తిగా దొరికియుండకుండు టంబట్టి యీ దేవరాయని పోల్చుటకు వీలులే కున్నది. పైఁ జెప్పిన సిద్ధయమంత్రి శా. స. 1180 గల కాలమువాఁడుగాఁ గాన్పించు. అతనికుమారులలో రెండవయతఁడీ జన్నయమంత్రి. కావున నితనికాలము శా. స. 1230 సమీపకాలము కావలసియున్నది. అప్పటికి కన్నడవిజయనగరపురనిర్మాణమే లేదు. బుక్కరాజు మొదలగు వారివ్యవహారమే ఆరంభము కాలేదు. ఆకారణమున బుక్క రాజునకుఁ గొందఱు పురుషు లైనపిమ్మట. 1406 లో ననఁగా శా. స. 1328 లోఁ గాన్పించు దేవరా జితని కాలీనుఁడు కాఁడని స్పష్టమే. ఈజన్న మంత్రియన్న యగు భాస్కరుఁడు లేక సూర్యుఁ డనునతఁడు రెడ్డివేమనృపునివలన నగ్రహారాదిక మందినవాఁ డగుటంజేసి అతనికాలము నొక్కటియే యగును. ఆవేమనృపాలునిపేరే అన్న వేమనృపాలుఁ డని చెప్పెదరు. అతఁడే యెఱ్ఱాప్రెగడవలన హరివంశమును గృతినందినవాఁడు. అతని శాసనము శా. స. 1268 మొదలు కాన్పించుచున్నది. ఆవఱకే అతఁడు బహుసంవత్సరములు రాజ్యముచేసె. అన్నదమ్ములగు సూరనకవి, జన్నయమంత్రియు నంతకుఁ బూర్వకాలములోని వారుగానే కాన్పించెదరు. అది శా. స. 1230 మొదలు 1268 వఱకు నగును.

(4) సిద్ధయమంత్రి (కృతిపతి.)

ఈ సిద్ధయమంత్రి యనేకప్రజ్ఞలు గలవాఁడుగా ననేక దేశభాషల నభ్యసించినవాఁడుగాఁ గాన్పించును. ఎట్లన్నను :_

"సీ. చిత్రగుప్తునికైనఁ జింతింప నరు దైన, గణితవిద్యాప్రౌఢి ఘనతకెక్కె
      నవసరంబులయందు నవ్యకావ్యంబులు, కవిజనములు మెచ్చఁగా నొనర్చె
      నాణిముత్తెముల సోయగము మించిన వ్రాలు, వరుసతో నిరుగేల వ్రాయనేర్చె
      నాత్మీయలిపి యట్టు లన్యదేశంబుల, లిపులను జదువంగ నిపుణుఁ డయ్యె
      దేవరాయ మహారాయ ధీవిధేయ, మంత్రివల్లభ చామనామాత్యదత్త
      చామరచ్ఛత్రశిబికాదిసకలభాగ్య, చిహ్నముల నొప్పె జన్నయసిద్ధమంత్రి."

దీనిలో వివరింపఁబడిన దేవరాయని మంత్రి యగుచామనామాత్యుని వివరము మనకింకను దెలియలేదు. అతనివలన నీసిద్ధయమంత్రి ఛత్రచామరాందోళికాదిచిహ్నము లంది ధరియించె నని యున్నది. ఈ సిద్ధయతండ్రియు దేవరాజుకాలీనుఁడే అనియు సిద్ధన యతనిమంత్రికాలీనుఁ డనియు నుండుటచేత జక్కన వృద్ధావస్థలో దేవరాయనిమంత్రిగా నుండెననియు, నీసిద్ధన దేవరాయని వృద్ధావస్థలో నుండెననియు నూహింపవచ్చును. ఈసిద్ధమంత్రింగూర్చి షష్ఠ్యంతములలోఁ గొంత వివరింపఁబడినది. ఎట్లన్నను :_

1. "క. శ్రీమద్వల్లయవరసుత, చామనదండాధినాథసామ్రాజ్యరమా
        సామగ్రీసంపాదక, సామాధిక చతురుపాయసంపన్ను నకున్.

2. క. సముచితయజనాదివిధి, క్రమనిపుణున కుభయవంశఘనకీర్తిసము
       ద్యమనియమాచారునకును, విమలాపస్తంబసూత్ర విఖ్యాతునకున్.

3. ఉ. వెన్నెలకంటిసూర్యుఁడు వివేకగుణాఢ్యుఁడు వేదశాస్త్రసం
        పన్నుఁడు రెడ్డివేమనరపాలకుచేత మహాగ్రహారముల్
        గొన్న కవీంద్రకుంజరుఁ డకుంఠితతేజుఁడు పెద్దతండ్రిగా
        సన్నుతిఁ గన్నఁ గన్న సిద్ధనకు సంతతదానకళావినోదికిన్."

మొదటిపద్యములో వల్లయ్యయను వల్లభయ్యకుమారుఁ డగు చామన యనుదండనాయకునివలన సామ్రాజ్యలక్ష్మీసామగ్రి యన గా ఛత్రమరాందోళికాది రాజచిహ్నములను సిద్ధమంత్రి సంపాదించె ననియు, రెండవపద్యములోనీ సిద్ధమంత్రి యజ్ఞాదివిధులలో నిపుణుఁ డనియు, యమనియమయుతుఁ డనియు నాపస్తంబసూత్రుఁ డనియు, మూఁడవపద్యములో వెన్నెలకంటి సూర్యనాముఁ డగుభాస్కరుఁ డనుమహాకవిని యీసిద్ధమంత్రి పెద్దతండ్రిగాఁ గలవాఁడనియు దేలినది. ఈభా స్కరుఁడే రెడ్డివేమనవలన ననేకాగ్రహారములఁ గొనియె. ఈవేమనయే హరివంశకృతిపతి. ఇఁక నాశ్వాసాంతపద్యములలో నున్నయీసిద్ధమంత్రివిశేషము లరయఁగా నితఁడు బెల్లముకొండ భైరవునికృపచేత సామ్రాజ్యలక్ష్మిం గైకొనియె నని యున్నది. ఎట్లన-

"శా. శ్రీ మద్బెల్లముకోండ భైరవకృపాశ్రీనిత్యసామ్రాజ్యల
      క్ష్మీమాధుర్యగృహాంతరాంతర - - - -" రెండవయాశ్వసాంతము.

మూఁడవయాశ్వాసముచివరను కర్ణాటరాజును సేవించువాఁ డని యున్నది. ఎట్లన :_

"కా. శ్రీ కర్ణాట మహామహేశ్వర సదా సేవా ప్రధానోత్తమా."

ఇతనికాలము శా. స. 1268 శా. స. 1300 వఱకు.

22.

జక్కనకవి.

ఈకవి నియోగిశాఖాబ్రాహ్మణుఁడు. ఇతనితాతపేరు పెద్దన. తండ్రిపే రన్న యామాత్యుఁడు. ఇతనిచారిత్రము నుడువుటకుఁ బూర్వ మితని యాశ్వాసాంతగద్యమును వివరించెదను. ఎట్లన్నను :_

"ఇది శ్రీమదఖిలకవిమిత్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణీతం భైనవిక్రమార్క చరిత్రం బనుమహాకావ్యంబునందు సర్వంబు నష్టమాశ్వాసము."

ఆంధ్రకవినుతి.

ఇతఁడు భారతకవిత్రయమును వినుతించె. ఈకవి యెఱ్ఱాప్రెగడకుఁ దరువాతివాఁడుగాఁ గాన్పించు. ముందుగా నీతని కవిత్రయవర్ణనముం దెల్పి అనంతర మితనికాలము నిర్ణయించుటకు యత్నించెదను. ఎట్లన్నను :_

నన్నయభట్టువర్ణనము.

"ఉ. వేయివిధఁబులంచుఁ బదివేవురు పెద్దలు సత్ప్రబంధముల్
      పాయక చెప్పి రిట్టు రసబంధురవాగ్విభవాభిరామధౌ