కవి జీవితములు/బమ్మెర పోతరాజు

వికీసోర్స్ నుండి

లపైఁ గృతులిచ్చియుండిరి. కాఁబట్టి వారు కేవలము దక్షిణదేశకవులే కాక చోళ పాండ్యదేశాంధ్ర కవులని కూడఁ జెప్పఁదగియుందురు. ఇట్టి వారి గాథలు చాలభాగము కవికావ్యప్రశంసాచంద్రికలోఁ జూడఁదగు నని చెప్పి యీనావిజ్ఞాపన నిల్పెదను.

____________

శ్రీరస్తు.

కవిజీవితములు.

పురాణకవులచరిత్రము.

20.

బమ్మెర పోతరాజు

ఈ భాగములోఁ బురాణముల నాంధ్రీకరించిన కవులచారిత్రము లుండును. వారిలోఁ బ్రధానుఁడు భాగవతపురాణముం దెనిగించిన బమ్మెరపోతనామాత్యుఁడు. అదియునుగాక అతనికాలము పురాణకవనమునకును ప్రబంధకవనంబునకును నడిమి దగు 'కావ్యరచనా కాలమగుటచేతఁ బ్రాచీనగ్రంథమునకంటె ననఁగా సంస్కృతమాతృకాగ్రంథమునకంటె వర్ణ నాంశములో వేదాంతభాగములోఁ బెంచి యీభాగవతపురాణముఁ బ్రకటించెను. ఇట్టిగ్రంథరచనాప్రధానుఁ డగుపోతనామాత్యునిచారిత్రముఁ బ్రథమములోఁ గైకొనుచున్నారము. ఇతనివలెనే భాగవతకథావిశేషంబులఁ దెనిఁగించుటలో నతిసమర్థుఁడును, అద్వైతశాస్త్రప్రధానం బగువసిష్ఠరామాయణ పద్మపురాణోత్తరభాగాది గ్రంథములఁ దెనిఁగించిన 'మడికిసింగన' యొక్కయుఁ జారిత్రము తెలిసిన వఱకు వెల్లడింపఁబడును. వీరితో నించుమించుగా సరితూఁగు విష్ణుపురాణగ్రంథకర్త యగు 'వెన్నెలకంటి సూరన' అను నతని చరిత్రమును దొరికినవఱ కిందుఁ గాన్పించు. తక్కుంగలపురాణకవులపేరులు వివరించి యేవఱకు వారిచరిత్రములు ప్రసిద్ధములో తెల్పి వాని నుచితస్థలంబున వివరించెదను.

పై ప్రసిద్ధపురాణకవుల మువ్వురిలో భాగవత గ్రంథకవి యగు బెమ్మెరపోతరాజుచారిత్రము ప్రథమములోఁ బ్రారంభింపఁబడుచున్నది.

ఈపోతనామాత్యుఁడు నియోగిబ్రాహ్మణుఁడు. కౌండిన్యగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. ఇంటిపేరు బమ్మెరవారు. తండ్రిపేరు కేసన్న. తల్లిపేరు లక్కాంబిక. ఈ కవి తనవంశావళి నీక్రింది పద్యములలో స్పష్టపఱిచెను. ఎట్లన్నను :-

"సీ. కౌండిన్యగోత్రసంకలితుఁ డాపస్తంబ, సూత్రుండు పుణ్యుండు సుభగుఁ డైన
      భీమనమంత్రికిఁ బ్రియపుత్త్రుఁ డన్నయ, కలకంఠి తద్భార్య గౌరమాంబ
      కమలాప్తువరమునఁ గనియె సోమనమంత్రి, వల్లభ మల్లమ వారితనయుఁ
      డెల్లన యతనికి నిల్లాలు మాచమ, వారిపుత్రుఁడు వంశవర్ధనుండు
      లలితమూర్తి బహుకళావేది కేసన, దానమాననీతిధనుఁడు ఘనుఁడు
      తనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ, మనియె శైవశాస్త్రమతము గనియె."

ఇట్లు చెప్పి తనతల్లి యగులక్కమగుణములను వర్ణించి యొకటి రెండు పద్యములు చెప్పె. అం దొకటి మనము వివరింపఁదగియుండును. ఎట్లన్నను :-

"ఉ. మానిను లీడు గారు బహుమాననివారిత దీనమానస
      గ్లానికి దానధర్మమతిగౌరవమంజులతాగభీరతా
      స్థానికి ముద్దుసానికి సదాశివపాదయుగార్చనానుకం
      పానయవాగ్భవానికిని బమ్మెరకేసయ లక్కసానికిన్."

      అని తనతల్లిదండ్రుల వర్ణించి

"క. అమిథునమునకుఁ బుట్టితి, మే మిరువుర మగ్రజాతుఁ డీశ్వరసేవా
     కాముఁడు దిప్పయ పోతయ, నామవ్యక్తుండ సాధునయ యుక్తుండన్."

అని తనవంశావళిని తనవఱకే చెప్పి ముగించెను అప్పటి కీతనికిం గుమారు లున్నట్లు తోఁచదు. దీనింబట్టి యితనివంశవృక్షము ప్రస్తరించెదను.

 కౌండిన్యసఁగోత్రుఁ డగు
      భీమనమంత్రి.
            |
      అన్నయ్య. (భార్య గౌరమాంబ.)
            |
      సోమనమంత్రి. (భార్య మల్లమాంబ.)
            |
      ఎల్లనమంత్రి. (భార్య మాచమ్మ.)
            |
       కేసనమంత్రి. (భార్య లక్కమాంబ.)
      (ఇతఁడు శైవశాస్త్రమతము నందెను.)
           |
   _______________
   | ____________ |
 తిప్పయ్య. పోతయ్య. (గ్రంథకర్త)

పోతనమతము శైవము.

ఈకవి సహజపాండిత్యుఁ డైన ట్లాతనిచేఁ జెప్పంబడినయాశ్వాసాంత గద్యములవలనఁ గోచరించును. అది యెట్లంటేని :-

"ఇది శ్రీపరమేశ్వరకరుణాకటాక్షకవితావిచిత్ర కేసనమంత్రిపుత్త్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతము."

ఇచ్చటి పరమేశ్వర శబ్దమునకు శివుఁ డనియే అర్థము చెప్పవలసియున్నది, దీని కీతనితండ్రి శైవమతము నందె నని చెప్పినది కారణము. ఇతఁడు శైవమతస్థుఁ డై యుండుటయేకాక భాగవతమును దెనిఁగించుటకుముందుగ గంగాస్నానంబు చేసి యపుడు మహేశ్వరధ్యానంబు సేయుచున్నట్లును జెప్పెను -

పోతన భాగవతముం దెన్గించుటకుఁ గారణము.

పోతనామాత్యుఁడు తాను భాగవతముఁ దెనిగించుటకుఁ గల కారణం బీక్రిందివచనంబున నిట్లు వ్రాసెను -

"మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణకథా ప్రపంచరచనా కుతూహలుండ నై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాక గని సజ్జనానుమతంబున నభ్రంకషశుభ్రసముత్తుంగభంగ యగుగంగకుం జని గ్రుంకు లిడి లెడలి మహనీయమంజులపులిన శోభితప్రదేశంబున మహేశ్వరధ్యానంబు సేయుచుఁ గించిదున్మీలితలోచనుండ నై యున్న యెడ రామభద్రుండు తన నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబు తెనుంగుసేయ నానతిచ్చి తిరోహితుం డయ్యె"

నని వ్రాసె. దీనిం బట్టిచూడ పోతనామాత్యునకు బహుకాలము నుండి నారాయణకథావిధానంబుల నాంధ్రీకరించు కోర్కె యున్నట్లును దానికి శ్రీరామచంద్రునియాజ్ఞయు నైనట్లును స్పష్ట మగును. లీలాశుకుఁడు మొదలగుకొందఱు శైవమత ప్రవిష్ఠులకు వైష్ణవగ్రంథరచనయందును, హరదత్తాచార్యుఁడు మొదలగు వైష్ణవమతప్రవిష్టులు కొందఱకు శైవమతగ్రంథ రచనయందును గోర్కెలు గలుగునట్లుగ నీవఱకే దృష్టాంతములు న్నవి. అటులనే పోతనామాత్యుఁడును శైవమంత్రోపాసకుం డైనను వైష్ణవకథానువర్ణనాసక్తియు తద్భక్తియు మిగులఁ గలిగియున్నట్లు స్పష్టం బగుచున్నది.

భాగవతరచనాప్రకారము.

ఇతఁడు తాను రచియింపఁబోవుభాగవతములో సంస్కృతమునకంటె అధికగ్రంథము చేర్చుటకు తనకుం గలయిష్టమును సూచించుట కీక్రిందివిధంబున నొకపద్యంబు వ్రాసెను :-

"తే. భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁ దమ్మిచూలికైన
      విబుధజనులవలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపఱుతు."

      ఈపోతన తన శైలింగూర్చి మఱియొకపద్యంబు వ్రా సెను :-

క. కొందఱకుఁ దెనుఁగు గుణ మగుఁ గొందఱకును సంస్కృతంబు గుణ మగు రెండున్
    గొందఱకు గుణము లగు నే, నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్.

అని పోతన తనకు బూర్వు లగుతిక్కనాదికవులందఱు పురాణాదులు తెనిఁగించినను భాగవతమును దెనిఁగించక యుండి రనియు దానిం దెనిఁగించినచో లోకము త న్నా క్షేపించెదరేమో అనుశంక మనంబున నుంచుకొని యి ట్లీ క్రిందిపద్యంబున పూర్వులు దీని దెనిఁగించకుంటకుఁ గారణము తనను దరింపఁజేయుటకుఁగా నని తెల్పెను. అదెట్లన్నను :

"మ. ఒనరన్ నన్నయ తిక్కనాదికవు లీయుర్విం బురాణావళుల్
       దెనుఁగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
       తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
       జననంబున్ సఫలంబు సేసెదఁ బునర్జన్మంబు లేకుండగఁన్."

పోతన భాగవతమును దాను గంగాతీరమం దున్న సమయమందుననే చేయక తిరిగి యేకశిలానగరమునకు వచ్చినపిమ్మట దానింజేయ నారంభించె నని యీక్రిందివచనసందర్భంబువలన స్పష్టంబగు.

ఎట్లనిన :-

"వ. ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవత పురాణ పారిజాతపాదప సమాశ్రయంబున హరికరుణావిశేషంబున కృతార్థత్వంబు సిద్ధించె నని బుద్ధి నెఱింగి లేచి మఱికొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురువృద్ధబుధబంధుజవానుజ్ఞా తుండ నై నాచిత్తంబునఁ బెన్నిధానంబుం బోనిశ్రీరామచంద్రునిసన్నిధానంబుఁ గల్పించుకొని శేషశాయికి సమర్పణంబుగా నే నాంధ్రంబున నొనర్పం బూనిన శ్రీమహాభాగవత పురాణంబునకుఁ గథాప్రారంభం బెట్టిదనిన?

అని వ్రాసె. దీనింబట్టి చూడ నీతండు గంగాతీరంబు వదలి స్వగ్రామం బగునేకశిలానగరంబునకు వచ్చి యనంతరము భాగవత మాంధ్రీకరింప నారంభించినట్లు స్పష్ట మగును. ఇం దుదాహరింపంబడిన యేకశిలానగర మెక్కడిదై యుండు నని యొక శంక వొడముచున్నది. కడపజిల్లాలోని యొంటి మిట్టకే యీనామ మున్నట్లు కొందఱమతము. ప్రతాపరుద్రునిరాజధాని యగునోరుగల్లునకే యీనామ మున్నదని మఱి కొందఱ యభిప్రాయము. గ్రంథాదులలో సర్వత్ర రెండవదే ప్రసిద్ధనామ మై కాన్పించును. దీనికి వ్యతిరేక మగుగ్రంథదృష్టాంత మగపడువఱకు నీరెండవస్థలమే యితనినివాసస్థలముగా నిర్ణయింతము.

నరకృతి నిషేధించుట.

ఈ బమ్మెరపోతరాజు భాగవతమున నరకృతి చేయఁగూడనట్లుగాఁ జెప్పికొనియె. అదెట్లంటేని :-

"ఉ. ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
      సొమ్ములుఁ గొన్ని పుచ్చికొని సొక్కి శరీరము వాసి కాలుచే

సమ్మెటవ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్."

అను దీనిం బట్టి పోతరాజు నరకృతి నిషేదించినట్లు స్పష్టమే యగు. అయితే దీనిఁకి బూర్వమునందో పరమందోగాని యీపోతరాజు వేంకటగిరి ప్రభుం డగుసర్వజ్ఞసింగమనీని కోర్కెపై నొక దండకము చెప్పి యాప్రభునిపైఁ గృతియిచ్చినట్లు వేంకటగిరివారివంశ చారిత్రమువలనఁ గాన్పించును. అది కేవలము నిజమనుటకు నబద్ధమనుటకు మనకుఁ దగినన్ని నిదర్శనములు కానరావు. భాగవతమున నరకృతి నిచ్చుటచేఁ గల్గినమనఃపరితాపముచేతనే అయియుండు నని యూహింపవచ్చును. అట్లైన నది భాగవతమునకు ముందే అగును. పోతన కృతగ్రంథములలో నెచ్చట నది వివరింపఁబడలేదు. ఆకారణముచేత భాగవత రచనానంతరమే అని యూహింతు మనిన నదియుం బొసఁగి యుండలేదు. భాగవతానంతరము పోతనవిషయమై సింగమనీఁడు జరిగించియున్నాఁ డనినచర్యయే యధార్థమేని అపుడును భోగినీదండకము పుట్టుట కవకాశము లేదు. కావున నీగ్రంథము పోతన చేసియుండె ననుట కన్యగ్రంథసాక్ష్యము కావలసియుండును. ఆంధ్రభాగవత మచ్చొత్తించిన పండితులు దీనివిషయ మెట్లుగా వ్రాసిరో దానిం జూపెదము.

పోతరాజుకాలము.

"శాలివాహనశకసంవత్సరములు 1300 గల కాలంబుగతంబై యుండు సమయంబున ............................. వ్యాసాపరావతారుం డని పొగడొందఁదగిన సుగుణాకరుం డైనపోతనామాత్యుఁడు బమ్మెరవంశ ప్రసూతుండైన కేసనమంత్రికిఁ దనూజుండుగా జనించె. ఇది కొంచె మించు మించుగా నితని దండకమును గృతినందె నని చెప్పెడు వేంకటగిరి ప్రభునికాలముంబట్టి నిర్ణయింపఁదగియున్నది. ఆప్రభునిపేరు సర్వజ్ఞసింగమనీఁడు." అతఁడు శా. స. 1300 మున ప్రభుత్వమునకు వచ్చి శా. స. 1350 వఱకును వ్యవహరించినట్లుగా వేంకటగిరివారి వంశావళీ గ్రంథ మువలనఁ గానుపించును. అదిగావున పోతరాజుకాల మదియ కావచ్చును. అసర్వజ్ఞ సింగమనీఁడు విజయనగర ప్రభుం డగు ప్రౌఢదేవరాయల కాలీనుం డని ఆగ్రంథమందే వ్రాయఁబడినది. కావున నతని కాలీనుఁడ.

పోతరాజు బాల్య చేష్టితము.

పోతరాజు బాల్యవ్యాపారాదికములంగూర్చి పైపండితులు వ్రాసిన దెట్లనగా :-

"ఇమ్మహత్ముండు బాల్యంబునందు గోసంరక్షణార్థంబుగ స్వగ్రామం బగునేకశిలానగరంబునకు సన్ని కృష్ణపర్వతాగ్రంబున సంచరించుసమయంబున నచ్చట తనపూర్వజన్మసుకృత పరిపాకాతిశయంబునఁ జిదానందయోగీంద్రుం డనునొక ఋషిశ్రేష్టుం డతనికి దృగ్గోచరుం డైన నంత నాపోతనామాత్యుఁ డమ్మహాత్మునింగాంచి యతనిచెంతకుం జని యత్యంతభయభక్తుల నవనతశరీరుం డై యభివందనం బొనర్చి శరణుజొచ్చితినని పలుక నాతపోధనుండు బాలుం డగుపోతనామాత్యునియం దవ్యాజకరుణ నుంచి శ్రీరామ మంత్రరాజం బనుగ్రహించి తదనుష్ఠానక్రమం బశేషంబుగఁ దెల్పి కృతార్థుండవు గమ్మని తెల్పె"

అయితే భాగవతములో నిట్టివృత్తాంత మేమైనా నున్నదా యని యారయవలసి యున్నది.

పోతన గురువిషయము.

భాగవతంబున నీకథ కెంతమాత్రము నాధారము గాన్పించదు. చిదానందయోగీంద్రుండు పోతనకు గురుండే అయినచో నాతనింగూర్చి స్తోత్రము గానీ స్మరణము గానీ అం దుండకపోవునా అని తోఁచుచున్నది అ దెట్లన్న దన -

"అని యిష్టదేవతలం జింతించి దినకరకుమారప్రముఖులం దలంచి ప్రథమకవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి హయగ్రీవదనుజ కర పరిమళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సములాసుం డగువ్యాసునకు మ్రొక్కి శ్రీ మహాభాగవతకథాసుధారస ప్రయోగికి శుకయోగికి నమస్కరించి మృదుమధుర వచనవర్గ పల్లవిత స్థాణునకున్ బాణునకుం బ్రణమిల్లి కతిపయ శ్లోకసమ్మోదిత సూరు మయూరు నభినందించి మహాకావ్యకళా విలాసుం గాళిదాసుం గొనియాడి కవికమలరవిం భారవిం బొగడి విదళితాఘు మాఘున్ భూషించి యాంధ్రకవితా గౌరవజన మనోహరి నన్న యసూరిం గైవారంబు చేసి హరిహరచరణారవింద వందనాభిలాషిం దిక్క మనీషిం భూషించి మఱియు నితరపూర్వకవిజన సంభావనంబు కావించి వర్తమానకవులకుం బ్రియంబు పల్కి భావికవుల బహూకరించి యుణయకావ్యకరణదక్షుండ నై"

అని యున్నది, పోతన తనకు మంత్రోపదేశము చేసి తరియింపం జేసిన చిదానంద యోగీంద్రునివంటిగురుండే యుండఁగ నాతని తన గ్రంథంబులో నెచ్చెటనైన స్మరియించక యుండునా ? కావున నీవృత్తాంతంబు యుక్తిసహముగ నుండలేదు. ఇదియునుగాక ఇతఁడు రామమంత్రోపాసన చేసె నని చెప్పినవృత్తాంతంబు నంతమాత్రముగనే యున్నది. శ్రీరాముఁడు గృతిపతియేని అతనిస్తోత్ర ముండునుగదా. దానిం జూచిన శ్రీకృష్ణస్తుతిగాఁ గాన్పించు. ఎట్లనఁగా :-

"ఉ. శ్రీకైవల్యపదంబుఁ జేరుటకు నై చింతించెదన్ లోకర
      క్షాకారంభకు భక్తపాలనకళాసంరభకున్ దానవో
      ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృజగాలసంభూతనా
      నాకంజాత భవాండకుంభకు మహానందాంగ నాడింభకున్."

అని యందు "నందాంగనాడింభకున్" అనువాక్యము శ్రీరామపరము కా దనియు శ్రీకృష్ణపరమే అనియును స్పష్టము. షష్ఠ్యంతములలో నేదేవుని వక్కాణించినాఁడో అని చూడఁగా నందు నీప్రకారము శ్రీకృష్ణుని నుద్ఘాటించినట్లు స్పష్టమగుచున్నది. ఎట్లం టేని :-

"ఉ. హారికి నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్యసం
      హారికి భక్తదుఃఖపరిహారికి గోపనితంబినీమనో
      హారికి దుష్టసంపదపహారికి ఘోషకుటీపయోఘృతా
      హారికి బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్."

ఇట్లు స్పష్టముగా శ్రీకృష్ణునిపేరిట కృతిముఖము కాన్పించు చున్నపుడు నీ శ్రీకృష్ణుంఁడే పోతానామాత్యున కుపాసనాదేవతగా భావించవలసియున్నది. ఇతని నుద్దేశించియే మొదటిరచనకు గమకించి యుండును. అయితే భాగవత కథానాయకుండును కృతినాయకుండు నొక్కం డవుటకంటె శ్రీకృష్ణునకు రూపభేదంబుగా నున్నశ్రీరాముని దీనికిఁ గృతిపతిగాఁ జేసిన లెస్స యై యుండునని యూహిం చి ప్రథమస్కంధము చివరనుండియును శ్రీరాముని సంబోధించి అవదరింపు మని చెప్పినట్లు కాన్పించును. అయితే తాను గంగాతీరంబున మహేశ్వరధ్యానంబు సేయుచుఁ గించిదున్మీతలోచనుం డై యుండునపు డొకరాజ్యముఖ్యుఁడు గన్పించె ననియును నాతఁడు తాను శ్రీరాముండ నైనట్లు తనపేరిట శ్రీమహాభాగవతముఁ దెనిగింపు మనికోరినట్లుగా మాత్రము వ్రాయంబడియున్నది. దానికిఁ బోతన తనయంగీకారము చెప్పినట్లుగాఁ గానుపించదు. ఈక్రిందిపద్యము తాను మేల్కాంచి తన మనంబులో ననుకొనినట్లుగాఁ గానుపించదు. ఈక్రిందిపద్యము తాను మేల్కాంచి తన మనంబులో ననుకొనినట్లుగాఁ గాన్పించును.

"క. పలికెడిది భాగవత మఁట, పలికించెడివాఁడు రామభద్రుండఁట నేఁ
     బలికిన భవహర మగు నఁట, పలికెద వేఱొండుగాథ పలుకఁగ నేలా."

దీనింబట్టిచూడ నారాజశేఖరునకుఁ గృతినిచ్చెద నని పోతరాజు సన్నుద్ధుః డైనట్లు కాన్పించదు. ఈపద్యమునకు మఱియొక తాత్పర్యమే చెప్పవచ్చినయెడల దీని తర్వాయిని వెంటనే వచ్చిన షష్ఠ్యంతములు శ్రీకృష్ణునిపేరిట నుండ దీనినంతయుం జూచినచో జిదానందయోగీంద్రుని కథయును, శ్రీరామ మంత్రోపాసనంబును రెండును కల్పనాకథలుగా నూహింపవలసియున్నది. గీర్వాణభాగవతగ్రంథసంఖ్య యిరువది

ఆంధ్రభాగవత గ్రంథపద్యాదికము.

రెండువేలు. ఆంధ్రంబున ముప్పదివేలవఱకును భాగవతగ్రంథ సంఖ్య కలదు. ఇట్లధికముగాఁ జేయుటకు తలంపు గలిగియే పోతన గ్రంథారంభంబున నొక్కపద్యంబువ్రాసి యుండె. అందు :-

"గీ. భాగవతము దెలిసి పల్కుట చిత్రంబు, శూలుకైనఁ దమ్మిచూలికైన
     విబుధజనులవలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత తేటపఱుతు."

సంస్కృతభాగవతమునే తెనిగించు తలంపు గలదేని యిట్లు తెలుపనవసరము లేదు. ఇందు గ్రంథసంఖ్య పెరుగుటకుఁ గారణ మష్టాదశ పురాణములలో విష్ణుమహిమానువర్ణనముంజేయుకథలను కథాసందర్భాను సారు లైన ప్రబంధవర్ణనలుం జేర్చుటయై యున్నది. అందుకు సత్యభామ యుద్ధాదికములును గంగావతరణాది విశేషవర్ణనలును దృష్టాం తములుగా నున్నవి. పోతన భాగవతంబునం దంతట వ్యాసకృత శ్లోకముల యభిప్రాయమును వదలక సరిగా నాంధ్రీకరించినాఁడు. ఇ ట్లాంధ్రీకరించుట యెంతయు శ్లాఘాపాత్ర మైనపని యై యున్నది. ఈ గ్రం

అన్యకవిరచితగ్రంథ ప్రక్షేపకారణము.

థము రామాయణ భారతములవలె నేకారణముననో యొక్క కవివలనఁ బూరింపఁబడక తచ్ఛిష్యులును తన్మిత్త్రులును నగుమఱికొందఱ వలనఁ బూర్ణంబుచేయఁబడినట్లుగాఁ గాన్పించును. దీనికి దేశదేశములలో వేఱు వేఱు కథలు వ్యాపించియున్నవి. అవి నమ్ముటకుంగాని నమ్మ మని పరిహరించుటకుఁగాని వ్రాఁతమూలము లగునాధారము లెవ్వియుఁ గానరావు. ఆంధ్రభాగవతమును ముద్రించి ప్రకటించిన వారు బమ్మెరపోత నామాత్యుని జన్మకర్మ ప్రభావములు తెలిపెడువచన రూపం బగుప్రాచీనపండితజనలిఖితగ్రంథంబును తాము తెప్పించి దానిం బట్టి తాము వ్రాసిన చారిత్రము వ్రాసియుంటి మని చెప్పిరి. దాని సంగ్రహమును చేసి వారు వ్రాసి ప్రకటించుటకంటె మూలగ్రంథమునే ప్రకటించిన లోకోపకారముగ నుండును. అట్టిమూలగ్రంథము లేనిదే ఆకథ యెడ నేయభిప్రాయంబు నీయ వీలుపడదు. అట్టిగ్రంథంబు వచ్చి యధార్థ కథనుసూచించువఱకును పోతన తనశిష్యులకుఁ గొంతభాగమును మిత్త్రులకుఁ గొంతభాగము నిచ్చి తాను కొంతభాగముఁ గొని పెద్దగ్రంథము గావున దీనిని పరిసమాప్తి నొందించె నని చెప్పిన నొప్పియుండును. అట్లు నిశ్చయించి దీనిలో నుండెడు నన్యకవిరచనంగూర్చి వ్రాయుదము. ఈ భాగవతములోని పంచమ షష్ఠ ఏకాదశ స్కంధములు అన్యకవిరచితములుగాఁ గాన్పించు. అట్టివానిని రచియించిన వానింగూర్చి వ్రాయవలసియున్నది.

ఆంధ్రభాగవత కవులు.

మనము పై నూహించినయూహ కనుగుణముగనే భాగవతము భాగములుగా విడదీయఁబడినచో పోతరాజు భాగమునకు (6) స్కం ధములును, తచ్ఛిష్యుల భాగమునకు 6 స్కంధములును వచ్చినట్లు గఁగాన్పించు. అందు 5 పంచమస్కంధము గంగనార్యప్రణీతము. షష్ఠ స్కంధము సిం గనార్య ప్రణీతము, 11 ఏకాదశ 12 ద్వాదశ స్కంధములు వెలిగంధల నారాయణకవి ప్రణీతములై యున్నవి. ఇందు మొదటికవి గాక తక్కిన యిర్వురును పోతనార్యునియె డల గురుభక్తి గలవారుగా వారిపద్యములవలనను, గద్యములవలనను స్పష్టమగుచున్న ది. గంగ నార్యుఁడు తన వంశావళి మొదలగువానిం డెల్ప కుండుట చేత నెట్టిసంబంధము కల్గియుండునో చెప్ప వీలులేకున్న ది. అయితే ఇతఁడును పోతనామాత్యునివిధంబుననే తనగ్రంథము కృష్ణున కంకితముగా జేసెను. ఇతనివలెనే సింగనార్యుఁడును తనగ్రంథము కృష్ణున కే యంకితము చేసి రచియించెను. దీనింబక్టి చూడగా నీకవులం దఱును తమతమ భాగములు కృష్ణునకే అంకితములు చేయుటకు సిర్ల యించుకొనినట్లును అనంతరము కారణాంతరముచేత రామాంకితము గా దానిని మార్చిన నతని ప్రియశిష్యుం డగువెలింగందల నారాయణ కవిమాత్రము తాను పోతనవిధంబుగ రామనామాంకితముగనే గ్రంథము రచియించి నట్లు నూహించనై యున్నది. ఇదియునుగాక యీమువ్వురుకవుల భాగములకు నిల్చిన గ్రంథ మీంచుమించుగా పరమార్థభాగ ములో సమానముగ నే యున్నట్లు కాన్పించుచున్నది. 5 స్కంధము 30 పుటలలో ఋషభ రాజుచరిత్రమును భరతోపాఖ్యానములును ముఖ్యములు. 6 స్కంధము 36 పుటలలో అజామిళోపాఖ్యానము, హంసగుహ్య స్తవరాజము, నారాయణకవచము నున్న ది. 11 12 స్కంధలు 20 పుటలలో ఋషభకుమారుల పరమార్థోపదేశము కృష్ణం డుద్దవునకుఁ జేసినపరమార్థోపదేశము, అవధూతయదుసంవాదము నున్నది. పోతన ఇట్లుగా పరమార్థోపదేశము గల్గిన భాగము విడదీసి యొ క్కొకని కొక్కొక దాని నిచ్చి గ్రంథము పూర్తిచేయించినట్లుగాఁ గానుపించు, ఈమువ్వులో సింగన తాను రచియించిన షష్ఠస్కంధము నకుఁ గృత్యాది పద్యములును తన వంశవర్ణనయు తాను దానిం జేయుటకుఁ గలకారణములను కొన్నింటి వ్రాసి యుంచెను. వాని నిట వివరించుట అవసరముగావున సంగ్రహముగా వివరించెదను.

ఏర్చూరి సింగనమంత్రి

ఇతఁడు భారతశేషమును, హరివంశమును ఆంధ్రీకరించిన యెఱ్ఱాప్రెగ్గడయొక్కయో లేక కొక్కోకమనుకళాశాస్త్రముం దేనిఁగించిన యెఱ్ఱాప్రెగ్గడయొక్కయో వంశస్థుఁ డని చెప్పవలసియున్నది. ఈ విషయమైన కొంత వృత్తాంతము 3 అధ్యాయములో 60, 61. 62 పుటలలో వ్రాయఁబడినది. ఇపుడు సింగనవిషయమైన గ్రంథస్థచారిత్రము వ్రాసెదను. ఎఱ్ఱాప్రెగ్గడనుండి ఎఱ్ఱాప్రెగ్గడవారనియు పోతరాజునుండి పోతరాజువారనియు నియోగికుటుంబములు రెం డేర్పడినట్లు కాననగు. దానికి దృష్టాంతముగ నెఱ్ఱాప్రెగ్గడవారిది శ్రీవత్సగోత్రమును పోతరాజు వారిది కౌండిన్యసగోత్రము నై యున్నది. ఇదియే యథార్థమైన నీసింగనార్యుని యింటి పేరు ఎఱ్ఱాప్రెగ్గడవారు కావచ్చును. కొండవీటి సీమలోను అద్దంకి సీమలో నుండు పెకండ్రు నియోగిబ్రాహ్మణులు ఆదేశప్రభువులు లీదేశము జయించి వచ్చునపుడు వారితో వేఁగిదేశమున గోదావరీ తీరమునకు వచ్చి అచ్చటనే స్థిరపడిరి. పైకుటుంబములవారును అట్టి వారిలోనివారే కావచ్చును. కావున నిపుడు మనము వ్రాయుచున్న సింగన యెఱ్ఱాప్రెగ్గడవారికి మూలపురుషుఁడు కానోపును.

ఈసింగన తాను భాగవతముం జేయుటకుఁ గల కారణంబు నొక విధంబుగఁ జెప్పుచున్నాఁడు. అది యెట్లనిన :-

"ఉ. ఎయ్యది కర్మబంధముల నెల్ల హరించు విభూతికారణం
      బెయ్యది సమ్మనీంద్రులకు నెల్ల కవిత్వసమాశ్రయంబు ము
      న్నెయ్యది సర్వమంత్రముల నేలిన దెయ్యది మోక్షలక్ష్మీరూ
      పెయ్యది దానిఁ బల్కెద సుహృద్యము భాగవతార్థ మంత్రమున్.

వ. అని శ్రీ మహాభాగవత పురాణంబునందు షష్ఠస్కంధం బాంధ్రభాష విరచింపం బూని యాకృతికిం బతిగా నద్దేవుండు గలం డని వితర్కించి నాకుం గవిత్వమహత్వంబు సంప్రాప్తం బగుకాలంబుఁ దలంచి నారాయణుండె దైవం బని యెఱింగి మనోరథంబు సఫలం బయ్యె ననీ యీకృతి కృష్ణార్పణంబు చేసితి నది యెట్లనిన నేను విద్యాభ్యాసంబునం దగిలి కొండిక నై యుండ నొక్కనాఁడు దివంబున

చ. కలితవిశేషవస్త్రములు గట్టి హిమాంబు సుగంధ చందనం
    బలఁది వినూత్న భూషణము లారఁగఁ దాల్చి వినోదలీల నిం
    పుల మృదుశయ్య నిద్రఁ దగఁ బొందినచోఁ గనుపట్టెఁ బల్మఱుం
    దలమున గ్రమ్ము క్రొమ్మెఱుఁగుదండము రూపున నిల్చుపోల్కిగన్.

సీ. ఉరవడిఁ బ్రాగ్వీథి నుదయించు మార్తాండ, కోటి బింబచ్ఛాయ గూడినట్లు
    హరిహరబ్రహ్మల యాత్మలలో నుబ్బి, కరుణ యొక్కట మూర్తి బెరసినట్లు
    ఖరకరకరతీవ్రగతిని గరంగుచు, హేమాద్రిచెంతఁ బెల్లెగసినట్లు
    ఫణిరాజఫణరాజిమణిగణవిస్ఫూర్తి, సుషిరంపువెలి దలచూపినట్లు

    ఉట్టిపడ్డట్లు క ట్టెఱ్ఱ నూఁదినట్లు, తేజ మెసఁగoగ నామ్రోల దివ్యవాణి
    పూని సాక్షాత్కరించి సంపూర్ణదృష్టిఁ, జూచి యిట్లని పలికె మంజులకము గాను.

ఉ. ఆటలు పాటలుం జదువు లద్భుతముల్ విననొప్పువాద్యముల్
    సాటి దలంపరానిబలుసాములు మున్నగువిద్య లెల్ల నీ
    కాటలుఁ బాట లయ్యె విను మన్నిటికి న్మెఱుఁ గిడ్డభంగి నా
    చాటున జాటుకారపద సాధుకవిత్వము జెప్ప మింపుగన్.

వ. అని యానతిచ్చుజగన్మాత కృపావలోకన సుశ్లోకుండనై యే నొకశ్లోకంబు నాక్షణంబ నుడివితి నది యెట్టిదనిన.

శ్లో. హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ
    నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ
    సఁత్సంగ్రహాయ సగుణాయ సదీశ్వరాయ
    సంపూర్ణ పుణ్యపతయే హరయే నమో౽స్తు.

వ. ఈశ్లోకం బద్దేవి యంగీకరించె నంత మేలుకాంచి యానందభరితుండ నై నాఁటనుండి చంద్రానుగత యగుచంద్రికయుంబోలె నారాయణాంకితం లైనకవిత్వ తత్త్వజ్ఞానంబు గోచరం బయ్యె దానికి ఫలంబుగా గోపికావల్లభుని నుల్లంబున నిడుకొని.

గీ. పలుకఁ గలిగె మొదల భాగవతార్థంబు, భర్త కృష్ణుఁ డాయె భాగ్య మొదవె
   నమృతరసము గోర నమరుచింతామణి, పాత్ర సంభవించుభంగి నిపుడు.

గీ. భాగవతము తేటపఱుప నెవ్వఁడు సాలు,శుకుఁడు దక్క నరుని సఖుఁడు దక్క
    బుద్ధిఁ దోఁచినంత బుధులచే విన్నంత, భక్తి నిగిడినంత పలుకువాఁడ. "

ఇట్లుగా సింగన తాను భాగవతకథ నాంధ్రీకరించుటకుఁ గారణంబులు వాక్రుచ్చె. ఇతఁడు ప్రాచీనాంధ్రకవులను వర్ణించుచో నన్నయభట్టును, తిక్కన సోమయాజులను ఎఱ్ఱప్రెగ్గడను, భాస్కరుని నాచనసోముని, శ్రీనాథుని వర్ణనజేసి పోతనామాత్యు నీక్రిందివిధంబున నుతియించె.

"ఉ. ఎమ్మెలు సెప్ప నేల జగ మెన్నఁగ పన్నగ రాజశాయికిన్
      సొమ్ముగ వాక్యసంపదలు సూరలు సేసినవాని భక్తి లో
      నమ్మినవాని భాగవత నైష్ఠికుఁ డై తగువానిఁ బేర్మితో
      బమ్మెరపోతరాజుఁ గవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్."

అని నుతియించుట జేసి యితఁ డీగ్రంథంబు రచియించుటకుఁ బూర్వమే పోతన భాగవతనిష్ఠ నున్నట్లుగా నూహింప నై యున్నది. ఈసింగన పోతనామాత్యుని విధంబున తనకృతిముఖమంతయు నమర్చుటం జేసి యితఁ డాతనిశిష్యుం డగునేమో యని తోఁచుచుండును. ఇతని కృతిముఖంబున పోతనవలెనే శ్రీకృష్ణవర్ణనయు ననంతర పద్యములో శివవర్ణనయు, పిమ్మట బ్రహ్మకు వందనమును దరువాత విఘ్నేశ్వరవర్ణనయు సరస్వతీస్తుతియును, అనంతరము లక్ష్మీస్తుతియు నున్నది. షష్టస్కంధములోను ప్రథమస్కంధములోవలెనే శ్రీకృష్ణునకు షష్ఠ్యంతములు వాయ౦బడినవి. దీనిం జూడ నీతండు భాగవత మారంభమైన కొన్ని దినములకు గ్రంథారంభంబు చేసి తన గ్రంథారంభముకూడ పోతనగంథమువలెనే యుండఁగోరి యటులనే దాని నంతయు రచియించినట్లు మాత్రము గాన్పించును. ఇంతకంటె నీగ్రంథమునుబట్టి వ్రాయఁదగినది కాన్పించదు, ఇతఁడును షష్ఠస్కంధము చివరను శ్రీరామాంకితము గానే ముగించి చెప్పెను. దీనికి పోతనవలే ముగించెద ననుతాత్పర్యముతప్ప వేఱే కాన్పించదు.

వెలిగందల నారాయణకవి వంశముంగూర్చి

ఇతనిం గుఱించిన కథాసందర్భము లేమియు విస్పష్టము కాలేదు. పైని మనము నిర్ణయించిన ప్రకారము వెలిగందల అనునామము గ్రామనామముగాక పౌరుషనామమే అగునెడల "కందన ” అను పద్మ పురాణోత్తరఖండ కృతిపతియొక్క వంశస్థుఁడు కానోవును. అయితే తగినన్ని ఆధారములు లేనిదే దీనిం బెంచివ్రాయఁగూడదుగావున దీని నిల్పెదను.

భాగవతాంధ్రకవులు.

ఈక్రింద సంప్రదాయజ్ఞులవలన విన్నంతవఱకు నావలన నిదివఱలో వివరింపఁబడిన గాథలు పైకథాసందర్భములకు వ్యతిరేకించనట్లుగా దిద్ది పునరుక్తి లేకుండఁ జేసి వివరించెదను

శ్రీనాథుడు కర్ణాటకునికిఁ. గృతి నిప్పింపవచ్చుట.

ఇదివఱలో నీభాగవత గ్రంథమును గృతియిమ్మని రావుసింగన కోరినట్లు దానిం జేయకుంట కలిగి యాతఁ డపకారము చేసె ననియును జెప్పియున్నాము. అటువలేనే కర్ణాటకప్రభుఁడుగూడ నీభాగవత గ్రంథము తనకు గృతినిప్పింపవలయు నని కోరి తనమిత్త్రుండును, పోతనకు బంధువుఁడు నగు శ్రీనాథకవిం బంచినట్లును, అతఁడు వచ్చువఱకుఁ బోతరాజు వ్యవసాయము చేయచు పొలముగట్టునఁ గూర్చుండఁగా 'హాలీకులకు మీకుం గుశలంబె' అని యడుగుడుఁ బోతన యీక్రిందిపద్యంబు చదివినట్లును గలదు. ఎట్లన్నను :-

"ఉ. బాలరసాలసాలనవపల్లవ కోమలకావ్యకన్యకం.
      గూళుల కిచ్చి యాపడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
      హాలికు లైన నేమి గహనాంతరసీమలఁ గందమూలకౌ
      ద్గాలికు లైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై."

అట్టిమాటకు శ్రీనాథుడు సమాధానము చెప్పఁజూలక నీవు వచించినది నిజమే ప్రపంచములో ధనికునకు నేకొఱఁత యుండదు. “ధన మూల మిదం జగత్' అని యుండ లేదా ! బ్రతికియున్నంతవఱకు నింత యన్నముం బట్టయుఁ గలిగియుండవలెఁగదా! నీ కంతయిష్ట మున్న మఱి యొకకృతి దేవున కిమ్ము. ఇప్డు నాపలు కాలించి నీభాగవతంబుఁ గర్ణాటమహీపాలునకుఁ గృతియొసంగి సంపదల నందుము. దీనికి మాఱువలి కిన నామాటకుఁ దప్పినట్లు దలంచెద. అనుడు పోతన శ్రీనాథునినిర్బంధ వాక్యముల కేమియుఁ బ్రతివచనం బీయ నోరాడకుండుటం జేసి యూరకుండే. దాని నంగీకారపిశునంబుగ భావించి శ్రీనాథుండు కర్ణాటమహీజాని కడ కరిగి పోతనవృత్తాంతంబంతయుఁ దెలిపి భాగవతంబునకుఁ. గృతిపతివి గా నీవ తగు దని తెల్పి పోతనకవనంబు గొనియాడి యాతని పదలాలిత్యంబు నిన్నును నీపదలాలిత్యం బాతని సంతుష్టులఁ జేయు నని తలంచెద ననియె. రాజును శ్రీనాథుపలుకులకు సంతసిల్లి వల్లె యనియె.

పోతనచింత.

అంతఁ బోతన శ్రీనాథుపల్కులు మనంబునం దలపోసి యిట్లు చింతించె. అయ్యయో యిది యేటివృత్తాతంబు ! కర్ణాటునకుం గృతియొసఁగు మని న న్ని తండు బ్రేరేపించెడిని. నే నెటు జేసిన నీతని కేమాయె. నీతం డీవృత్తాంత మంతయు గర్ణాటమహీధపునకుఁ దెల్పియుండనోపు. అతఁడు కృతిఁ దెమ్మన్న నే నెట్లు దెత్తు. అటు గాకున్న నేమి చేటు వాటిలునో బుద్దిజూడ్యంబునం జేసి స్వాభిప్రాయంబు తేటపడం బల్కనైతి. ఇట్టిబుద్ధి మాంద్యము గలవానికిఁ జెట్టలు తప్పక రావలయు. అని తన్ను నిందించి కొనుచు నేమియుఁ జేయఁ జేయాడకున్న నొకచోఁ గూర్చుండియుండి కనులుమూసె. అంతఁ గమలపాణి యగువాణి కన్నీరు వఱదలై పాఱ నేడ్చుచుఁగాన్పించె. పోతన యాపె కమలభవునిరాణిగ నెఱింగి రోదనము సేయుటకుఁ గతం బూహించి స్వాపరాధంబ దానికిం గారణం బని యెంచి యద్దేవిం గాంచి యిట్లనియె:-

"ఉ. కాటుకకంటినీరు చనుకట్టుపయిం బడ నేల యేడ్చెదో
      కైటభదైత్యమర్దనుని గాదిలికోడల యోమదంబ యో
      హాటకగర్భురాణి నిను నాఁకటికిం గొనిపోయి యల్లక
      ర్ణాట కిరాట కీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ.”

అని పల్కి యాపె నూరార్చి నాఁటనుండియుఁ గర్ణాటునకుం గృతినిచ్చుతలంపు మానియుండెసఁట. ఇట నొక్కనాఁడు కర్ణాటమహీ 

కర్ణాటప్రభుఁడు వచ్చుట.

జాని భాగఫతనామంబుఁ దలంచి యిట్లు చింతించె. బహుదినంబులాయెఁ బోతన భాగవతంబు దెనెఁగించుచుండె నని వింటిమి. ఇంతకు నాతండు రాకుండుటకుఁ గారణం బేమి. మృగయావినోదమిషంబున నతం డుండు దేశంబునకుఁ బోయివత్తుఁగాక యని బయలువెడలి యాతనియూరు సేరి యాతనిం బిలువ దూతలంబనిచె. అత్తఱిఁ బోతనామాత్యుండు భాగవత తృతీయస్కంధంబున శ్రీయజ్ఞ వరాహావతారఘట్టంబు దెనిఁగించుచుండె. భక్తపరాధీనుండగు నారాయణుండు పోతనతో నెల్లపుడు లీలావినోదంబులఁ గాలంబు గడుపుచుండుఁగావున వర్ణితవరాహ రూపంబున నచ్చో విహరించుచుండె భూవిభుని బంట్లు వచ్చిన వత్తాంతమంతయు నెఱింగి యా దేవుండు భక్తరక్షణార్థంబు తద్ద్వారోపరిభాగంబున నూక్ష్మగాత్రంబునఁ గూర్చుండియుండె. భటకోటి లోనికిఁ జననుద్యుక్తు లగుడుఁ దనదేహంబు హుంకారధ్వనితోఁ బెంచి వారి నదల్చిన నా రాజకింకరులు తమయొడయనికడ కేఁగి సంప్రాప్త మగునంకిలిఁ దెల్ప నాతండు శంకలుడుగుం డని భయంకర సేనాపరివృతుం డై చని కిటిస్వామిం గని సామాన్యవరాహంబని యెంచి పంది కై యిటు భయమంద నేల? చూడుఁడు. నే నివుడ దీని మడియింతు. అని తన సేనానులం బురికొల్పి పొడువుఁడు పొడువుఁడు పెంపు డింపు: డనుచు వెంట నంటె. అంత నాక్రోడంబు సక్రోధం బై కన్నుల నిప్పు లొలుక వారినందఱఁ దనకోప పావకునకు నింధనీభూతులఁ జేయఁదలంచి విజృంభించి దంతపహతి నరాతిచమూపతుల నింతింతలు తునియలుగ విదారించి పొట్టలు చించి మించె. ఇట్లుండుపొలికలనిం గాంచి యా రా జిట్లు చింతించె. ఏమీ యీయద్భుతంబు! ఇక్కిటి యొక్కటియ:మదీయ సేన నుక్కడంచె. నే నొక్కండ దీనిపని చక్కఁ జేసెద నని మిక్కుటంపు కోపంబున ధిక్కరింపుచు నలుప్రక్కలం బరికించుచో నయ్యాదివరాహం బవార్యతర శౌర్యంబున మాఱు లేనివిహారంబు సల్పుచు ధర బొరియగఁ ద్రవ్వుచుఁ జెల రేఁగియుండె. దానింజూచి రాజు కన్నులు మిఱుమిట్లుగొన శరీరంబు కంపింప నిశ్చేష్టితుం డయ్యె. ఇట్లుండి కొంతతడవునకుఁ దెలిసి యదియంతయుఁ పోతనామాత్య ప్రభావప్రకటనంబునకుఁ గా నాతనియిష్టదైవంబు చేసినచేఁతఁగా నెఱింగి యపరాధంబు సేసితి నని పోతనను దనమది నెంచి యపరాధక్షమ యని నమస్కరించె.అంత నావరాహం బంతర్ధానంబు నొందె. ఆరాజేంద్రుం డామంత్రిశిఖామణికడకుం జని యాతని యడుగుఁ దమ్ముల కెఱఁగి కర్ణాటుండ దీనుండ రక్షింపుఁడు. అనుఁడు పోతన యాతనిం గ్రుచ్చియెత్తి యాతని వృత్తాంత మడిగిన నాతం డిట్లనియె. "చెఱుపకురా చెడెద వ"న్నట్లు నిను నవమానింపఁదలంచి నేన యాపదలపాలైతి. సర్వబలంబులు సమసె. నీవాకిటికిటి నా కిటుల నగునటుల నొనర్చె. ఇదియంతయు భవదీయానుగ్రహాతిశయంబుచే నివారితంబు గావలయు. అనుపృథ్వీథపుపల్కు లాలించి కించి త్తాలోచించి భగవత్కృతం బని యెఱింగి యవమానంబునకు వగవకు మని యా రాజునోదార్చి యిట్లనియె. నీకు సర్వంబును మంగళం బగు. రమేశు ధ్యానింపుచుఁ గాలంబు గడుపు మనుఁడు నాతండు శ్రీహరిని తనహృత్సరసి జంబున నిల్పి ధ్యానింపుచుఁ బోతనామాత్యుమాహాత్మ్యంబు దలంచుచు నాయిలు వెడలె. అపుడు మోహనాస్త్ర విముక్తులభంగి నింగిముట్టఁ గోలాహలస్వనంబు సేయుచుభగవదనుగ్రహ దత్తంబులై యతనిసేన లుండ నాతండు కొలఁదికి మీఱినసంతసముఁ బొందితనయూరుసేరెనఁట.

భగవద్దర్శనము.

అనంతరము పోతనామాత్యుండు భగవద్భక్తి యుక్తుం డై చతుర్థాదిస్కంథంబులఁ దెనిఁగించి యష్టమస్కంధంబున గజేంద్రమోక్షణంబు వ్రాయుచు నందు గజేంద్రుండు స్వామిని రక్షించు మని పలుకఁగ నావచనంబులు వైకుంఠనాథుం డాలించె ననుచో "అలవైకుంఠపురంబులో నగరిలో నామూల" అని నుడివె. అంతట నేమియుం దోఁచకుండె. అపుడు తనకూఁతుం బిలచి తా వ్రాయుచున్న పొత్తం బాపె చేతి కిచ్చి యుదె వచ్చెద నని యొకనిర్జనప్రదేశంబునకుం జని తొంటివా క్యంబ మరల నూహించుచుండె. ఇట పోతనయిష్టదైవంబు తద్రూపధారి యై, యాతనిగృహంబునకుం జని పోతనకూఁతుం బిలచి పుస్తకము దెప్పించి యం దున్న యసంపూర్ణవాక్యంబు సూచి, "సౌధం బందాపల" అని వ్రాసి దాని నాపె కొసంగి తా నంతర్ధానంబు నొందె. పోతనకు రహస్యస్థలంబున నీవాక్యంబ స్ఫురింప వైళంబుగ నిలుసేరి తనపొత్తంబు మరలఁ గైకొని యందున్న స్వమనోగోచరార్థంబుఁ జూచి యత్యాశ్చర్యంబునఁ గూఁతుఁ బిలచి దానియం దెవ్వరు వ్రాసి యుండి రని యడిగె. అనుడు నాపె 'నీవకదా యింతకుము న్నిటకు నేతెంచి వ్రాసియుంటివి.' అనినం గూఁతుపల్కులు విని కొంతతడవు చింతించి యి ట్లనియె. అమ్మా నీపుణ్యం బెంతయు శ్లాఘనీయంబు. నీక గపడినమత్స్వరూపధారుం డాత్మారాముం డగురాముండుగాని యే గాను. అని తెల్పి ప్రచ్ఛనుండై తనవెనువెంట నంటి తిరుగునించువిల్దంట తండ్రికి మ్రొక్కి ప్రసన్నుండ వగుదుగా కని సంతసంబున నాపద్యంబు పూర్ణంబు సేసె. పిమ్మట నాస్కంధంబును ముగించెను.

శ్రీనాథునియాక్షేపము.

అంత శ్రీనాథుం డొకదినంబున మరలఁ జనుదెంచి పోతన వ్రాసినయష్టమస్కంధముఁ జూచి యందున్న

"మ. సిరికింజెప్పఁడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపఁ డే
       పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
       తరధమ్మిల్లము చక్క నొత్తఁడు వివాదప్రోద్ధతశ్రీకుచో
       పరిచేలాంచల మైన వీడఁడు గజప్రాణావనోత్సాహి యై."

అనుపద్యంబుఁ జూచి పోతనం బిలిచి బావా నా కీపద్యంబు సమ్మతంబు గాకున్నదిసుమీ అని యిట్లనియె. సిరికిఁ జెప్పఁడు. శంఖచక్రములఁ బట్టడు. తదితరసాధనముల ముట్టఁడు, ఊరక గజేంద్రుం జూడ విష్ణుండు సనియె నని వ్రాసితివి. అతండు పరికరరహితుం డై యేమిసేయం జనె. ఇట్లు వ్రాయుటంజేసి నీవ్రాఁత యుక్తి యుక్తముగ నుండినట్లు గానరాదు. అనుడుఁ బోతన యిట్లనియె. భక్తా వనుం డగుశ్రియఃపతి అట్లు పరితాపంబుపా లగుట భక్తులయెడఁ దనకుండుకారుణ్యంబు జూపుట కేకదా. ఇదియ నాకుంబోలినయర్థంబు. సహేతుకంబు గాకున్న భక్తికిం గొదువయేమి. అనుడు శ్రీనాథుం డూరకుండె. మఱికొన్నిదినంబు లైనతర్వాతఁ బోతనామాత్యుండు తనమనంబున శ్రీనాథుండు శ్రీనాథు నాడిన వాఁడిమాటలవేఁడిమి సహింపలేక యథార్థం బాతనికి గోచరం బగున ట్లొనరింపఁ దలంచి యాతనిపుత్త్రుని దాఁచి బావా నీకొడుకు నూతం గూలె నని తెల్పె. శ్రీనాథుం డాపల్కులు విని మనంబునఁ గలఁగి దిగ్గున లేచి కళవళపడి యెచ్చ టెచ్చట నని విలపించుచుఁ బరువులిడఁదొడంగె. దానిం జూచి పోతన యాతనితో నిట్లనియె. ఓయీ నిలు నిలుము. ఊరక చనెదవేమి. త్రా డేది నిచ్చెన యేది. ఇట్లు విలపించుచుఁ జని నీవు నందుఁ గూలుదువుగాఁబోలు. అని యడ్డంబువచ్చి నిలిపిన శ్రీనాథుండు పోతనతో నిట్లనియె. వేగంబునఁ జని న న్నాకుఱ్ఱనిం గననిమ్ము. కన్నారం జూచినఁ గొంత వంత మాను. అనునాతనిం గాంచి పోతన యిట్లనియె. బావా జడియకుము. నీ కుమారుండు నూతం బడలేదు. గజేంద్రరక్షణంబునకు నార్తావనుం డగు శ్రియఃపతి యిటులనే పరితాపంబు నొందె. నీ వసమర్థుండవయ్యుఁ బరికరరహితుండవయ్యు మిన్నక చూచినంతనే కర్జంబగు నని తలంప నఖిల లోకాధీశ్వరుం డగుకరివరదుం డూరక యచ్చోటి కరిగినఁ గొఱఁత యొక్కటి గలదే. భక్తులయెడ భగవంతునకుం గలప్రేమ జనులకును నీకును గోచరంబు గా నే నట్లుపలికితి. నీవు వాగపరాధం బొనర్చితివి. కావునఁ బశ్చాత్తప్తుండ వై యాహరిశరణంబు వేఁడు మని నిజనివాసంబు కుంజనియె. ఇట్లనేకసమయంబులఁ బోతనామాత్యుండు భగవన్మాహాత్మ్య ప్రకటనంబు సేయుచు భాగవతంబుఁ దెనిఁగించి భగవదర్పణంబు సేసె. ఇం దీతండు శివపరాత్పరత్వము చెప్పకుంటం జేసి వాగ్దోషంబు సంభవించె ననియుఁ దద్దోషపరిహారార్థంబు వీరభద్రవిజయం బనునొకగ్రంథంబు వ్రాసి తత్పాపంబు పాపికొనె ననియుం గలదు. ఇటీవల నావలనఁ జేయంబడిన "వీరభద్రవిజయవివేకము" అను నొకదీర్ఘోపన్యాసములో భాగవత గ్రంథకర్త కాఁడని సిద్ధాంతమాయెఁ గావునఁ బాఠకు లీవ్యాసాంతమందుఁ బొందుపఱచి యుంచిన 'వీరభద్రవిజయ వివేక' ముం జదివి తమసందియములు వారింపఁ గోరెదను. భక్తాగ్ర గణ్యుం డగునీపోతనామాత్యుండు పదలాలిత్యంబునకుమిగులః బ్రసిద్ధుండు ఇట్టికవికృతగ్రంథంబునఁ గొన్నిస్థలంబుల నీతనికవనంపుజాడలఁ జూడనోడుదుము. అట్టిపట్లు రచించినవాఁ డీతం డౌనా యని శంకవొడమెడిని. ఆశంక నిష్కళంకంబుసేయు నొకవృత్తాంతంబు గలదు. దానినీక్రింద

పోతన భాగవతముం దాఁచుట.

వివరింతము. ఈకవి యాంధ్రభాగవతంబు పూర్ణంబుసేసి యది యైహిక సుఖేచ్ఛాపరు లగుపామరులకునధ్యేయంబైన వేదాంతార్థంబులగౌరవంబు సెడు నని యెంచి ప్రచురింపక పఠనార్హు లగుముముక్షుజనుల వెదుకుచు నుండె. ఇట్లుండ నిర్యాణసమయం బగుడుఁ దనకుమారుం డగు మల్లనను రావించి యతనికి నఖిలరహస్యార్థప్రతిపాదకం బగుస్వకృత భాగవతం బిచ్చి దానిని సాధనచతుష్టయసంపన్ను లగుముముక్షువుల కధ్యేయం బగున ట్లొనరింపు మని తెల్పి తాఁ బరమపదప్రాప్తుం డయ్యె. అంత మల్లన పితృవాక్యపరిపాలనేచ్ఛాపరుం డై తదర్హజనాన్వేషణంబు సేయుచు దానిఁ బేటికాంతర్గతంబు సేసి దేవతార్చనావితర్ది సమీపంబున నుంచి సమంచితభక్తిఁ బూజించుచుండె. అనంతర మాతండు తనకును గాలావసానం బగుడు నాత్మసఖుండును సహా ధ్యాయియు నగు వెలిగందలనారయకవిం బిలిచి రహస్యంబుగఁ దనపైతృకథనంబుఁ గొమ్మని దేవతార్చనపూర్వకంబుగ నా పేటిక నిచ్చి తా లోకాంతరగతుండయ్యె. పిమ్మట నారయ తనగురుధనంబు నారయ దానిం దీసి యందుఁ జీనాంబరముల నతిశిథిలంబు నొందియున్న జీర్ణ భాగవతంబుఁ జూచి యది స్వగురుప్రణీతంబ కాఁ దెలిసి శైథిల్యంబు నొందుట కెంతయు డెందంబునఁ గుంది దానిఁ గట్టి మరల నొకచోఁ బెట్టియుంచి నాఁటిరేయి దానింగూర్చి చింతింపుచు నిద్రింపఁ బోతనామాత్యుం డాతనికి స్వప్నంబునఁ గాన్పించి యిట్లనియె. ఓయీ దీని నే నీవఱకు లోకంబున వ్యాపకంబవున ట్లొనరింపకుండుటం జేసి యీగతి వగవవలసివచ్చె. ఇపుడు విభ్రష్టంబు లైన ఘట్టంబుల న ట్లింపు దోఁప సంపూర్ణంబు సేసి తూర్ణంబ దీని జగద్య్వాపక మవున ట్లొనరింపు మని తిరోహితుం డైన, నారయ మేల్కాంచి స్వప్నంబు తెఱంగు పోతనామాత్యశిష్యులకుఁ దెల్పె. వారును నాతనిం గూడి దానినంతయు సంపూర్ణంబు సేసిరి. అని కొందఱ మతము. ఇందుఁ గొంతపూర్వపక్ష మాయెను. దానిని మఱియొకచోఁ

పోతనకవనంబును శిష్యకవనంబును.

దెల్పితి. పోతనామాత్య కవనంబునకుఁ దచ్ఛిష్యజన కవనంబునకుఁ గల భేదంబులు సమానవర్ణన లున్నతావులఁ గొన్నికొన్నిపద్యంబులఁ జూచిన గోచరంబగు. దీనికిఁ దార్కాణంబుగ నష్టమంబునఁ ప్రహ్లాదునిపద్యము.

"సీ. మందార మకరంద మాధుర్యమునఁ దేలు,మధుపంబు వోవునే మదనములకు
      నిర్మలమందాకినీవీచికలఁ దూఁగు, రాయంచసనునె తరంగిణులకు
      లలితరసాలపల్లవ ఖాది యై చొక్కు, కోయిల సేరునే కుటజములకుఁ
      బూర్ణేందుచంద్రికా స్ఫురిత చకోరక, మరుగునే సాంద్ర నీహారములకు

తే. నంబుజోదరుదివ్య పాదారవింద, చింతనామృతపానవిశేషమత్త
    చిత్త మేరీతి నితరులఁ జేరనేర్చు, వినుతగుణశీల మాటలు వేయు నేల."

ఇది పోతనామాత్యకవనంబు. తచ్ఛిష్యకృతం బగుదశమోత్తర భాగంబున రుక్మిణితోఁ గృష్ణుండు విరసోక్తు లాడిన యనంతరము శ్రీకృష్ణుఁ డాపెను దేర్చియుండ ననంతర మాయమ శ్రీకృష్ణు నుతించుతఱి పద్యము :-

"సీ. నీరదాగమమేఘనిర్యత్పయఃపాన, చాతకం బేఁగునే చౌటిపడెకు
      పరిపక్వమాకందఫలరసంబులఁ గ్రోలు, కీరముల్ జను నె దుత్తూరములకు
      ఘనరవాకర్ణ నోత్కలికమయూరము,ల్గోరునే కఠినఝల్లీరవంబు
      కరికుంభపిశితసద్గ్రాసమోదితసింహ, మరుగునే శునకమాంసాభిలాషఁ

గీ. బ్రవిమలాకార భవదీయపాదపద్మ, యుగసమాశ్రయనైపుణోద్యోగచిత్త
    మన్యుఁ గోరునె తన కుపాస్యంబుగాఁగ, భక్తమందార దుర్భవభయవిదూర."

ఇంకను భేదంబుచే నొప్పుతావు లనేకము లున్నవి. ఆయాస్థలంబులలోఁ, గొన్ని క్త్వార్ధకసంధులును గొన్ని వ్యాకరణస్ఖాలిత్యంబులు దృష్టిగోచరం బయ్యెడి. ఇట్టిపొరబా ట్లుండుటచే నీ గ్రంథంబు ప్రామాణికగ్రంథంబు కాదయ్యె. ఇందులతప్పులన్నియుఁ బోతనామాత్యుని వని కొంద ఱూహింతురు. మఱికొందఱు మహాకవి యిట్టితప్పులు వ్రాయునా యనేకు లందు వ్రాసియుంటచే నవి కల్గెఁగాని వేఱొకటి కా దందురు. పోతనవిరచితంబును దచ్ఛిష్యవిరచితంబును మొత్తంబున మనకుఁ దెలిసియున్నను, దీని వివరింపఁజాలను. మూలముట్టుగఁ గొంత గ్రంథము చెడుట యే నిజమయ్యెనేని ఆచెడినగ్రంథంబులోని స్కంధంబులును దశమోత్తర భాగంబున నున్న "కాటుకనెఱయంగ" అను పద్యోపరిభాగంబును పోతనకృతంబులు గా వనుట స్పష్టమే. తాళపత్త్ర గ్రంథంబుఁ జెదులుదిన్నపుడు కొన్ని ఘట్టంబులును మఱికొన్ని పద్యంబులు నష్టంబు లై యుండనోవు. అట్టిపట్లును వీరిచేతనే వ్రాయఁబడియుండునుగదా వీనికినిఁ బోతనకుం గలతారతమ్యంబు వీరిచే వ్రాయఁబడినగ్రంథముచేతనే మనకు గోచరం బగు. అచ్చటచ్చట మనకుం గానఁబడునెఱసులు పోతనచే వ్రాయంబడినవో లేక వీరు వ్రాసియుండు తఱి నుత్పన్నంబు లాయెనో తెలిసికొనుట దుర్లభంబు. గ్రంథంబునఁ గాన్పించుతప్పులు పోతనశిష్యులవిగాని పోతనవి గావని తలఁచదగియున్నది. దీని కనుగుణంబుగ నప్పకవియు నొకపద్యంబు పూర్వలాక్షణికులది యుదాహరించె అదెట్లనిన :-

"ఉ. బమ్మెరపోతరాజకృత భాగవతంబు సలక్షణంబు గా
      కిమ్మహి నేమిటం గొదువ యెంతయు నారసి చూడఁ గాను రే
      ఫమ్ములు ఱాలునుం గలసి ప్రాసము లైనకతంబునం గదా
      యిమ్ముగ నాదిలాక్షణికు లెల్లను మాని రుదాహరింపఁగన్."

దీనిచేఁ బోతనకృత గ్రంథంబున నీ రేఫయుగమైత్త్రి దోషంబు తప్ప కడమ దోషంబులు లే వని యప్పకవియు సమ్మతించె. ఈ రేఫయుగ మైత్త్రీదోష మొకదోషములోనిది గా దనియును, కావునఁ బోతనకృతం బంతయు నిర్దోషంబే యనియు మఱికొందఱ యభిప్రాయంబు. రేఫ గయుమైత్త్రికి సమ్మతించుటచే దోషంబు గల్గు నని యప్పకవి యిట్లు వ్రాయుట స్వాభిప్రాయ స్థాపనంబునకుఁగాని మఱియొకటి గాదు. ఈవిషయం బీతనిచే వ్రాయంబడిన పద్యంబు విచిత్రంబుగ నుండును. పొరపాటున రేఫమైత్త్రి చెప్పిన నది సమ్మతంబు చేతనే చెప్పిన ట్లీతండు వ్రాయు. వీనిమైత్త్రి శాస్త్రసమ్మతము గాకున్న నుంనుట కేరైన నిచ్ఛ యింతురా. అట్టియిచ్ఛ లేకున్నను గొన్నికొన్ని స్థలంబులఁ బ్రమాదంబుచేఁ గొన్ని ప్రయోగంబులు సంప్రాప్తంబులవు. ఇట్టి ప్రమాదము నే స్థిరపఱిచి రేఫమైత్త్రియు స్థిరపఱుచుట న్యాయంబు గాదు. ఒకటి రెండున్నఁబ్రమాదంబుగాని విశేషించియున్నఁ బ్రమాదంబు గా దనవలదు. అది గ్రంథబాహుళ్యమునుబట్టి తటస్థించు. 'ఎంత చెట్టుకంతనీడ' యను నట్లు గ్రంథంబు స్వల్పమయినఁ దప్పులును దానికిఁ దగినట్లే యుండును. అధికమైనదానికిఁ దగినట్లే యుండును. న్యాయబుద్ధిచే నేద్ది యేని గ్రంథంబు చూచి యాకవికి వీనిమైత్త్రికి సమ్మతి యున్నదా లేదా యని యోఁచించునపు డందులోఁ గొన్నిపద్యంబులు ప్రత్యేకించి చూచి దానియథార్థ మారయవలయు. ఇట్టిబుద్ధిచే యోచించినయెడ భాగవతంబున నీలాటియనుమానమునకుఁ గారణ మున్న ట్లేమియుఁ గానరాదు. పోతనామాత్యున కీసూత్రమం దిష్టమే లేకున్నఁ బెక్కులు శకట రేఫములకు మైత్త్రి యున్న పద్యంబు లేల కాన్పించు ? ఇఁక నెచ్చోటనైన వీటిమైత్త్రి కానుపించిన నది ప్రమాద మనక తప్పదు. ఇట్టి ప్రమాదంబు లొరుల కుండుట కేమియబ్బురంబు ? వీనిమైత్త్రి కెంతమాత్రము సమ్మతింపనియప్పకవికే కలవు. దృష్టాంతమునకుఁ గొన్నిటిం జూడఁదగు నని యప్పకవీయంబులోని కొన్ని పద్యంబు లిట వివరించెదను :-

అప్పకవితప్పులు.

"1. క. కేరుచు నొయ్యన డగ్గఱఁ, జేరుచు నురుముష్టిహతికిఁ జిక్కకవేగం
        దాఱు చహంకృతిఁ గ్రమ్మఱ,దూఱు చధోక్షజుఁడు మల్లుఁ ద్రుంచె ననంగన్."

ఇందులోనితాఱుట అప్పకవిచేత శకట రేఫముగ ఱకారసీసమాలికలోఁ జెప్పంబడియె. "తాఱుమెకంబు లీతీరున" అని యప్పకవీయము. ఇది ప్రయోగంబులోమాత్రము లఘువులతోఁగూడియున్నది. 'దూఱు' అనునది యిచ్చోనున్న యర్థముంబట్టి శకట రేఫముగ నుండవలయును.

2. "ఇఱ్ఱి వెఱ్ఱియు" నని యిట్లు క్రింద జడ్జ లుండెడిలిపులెల్ల బండిఱాలు. వీనిద్విత్వము లొకవేళఁ బోయినం బోవును. 'జెఱిపోతు కఱిమేఁక గొఱియ యనఁగ' అని ముందు సూత్రము వ్రాసి పిమ్మట కొఱ్ఱశబ్దము లుప్తశేషమయినపుడు 'కొఱ' యని వ్రాయక 'కొర' యని లఘురేఫముతో వ్రాసెను. ఇది యితరలాక్షణికుల మతంబు గాదు.

3. 'ఱాదక్క సకలాక్షరములమీఁదను' అని రేఫసీసమాలికలో వ్రాసియున్నాఁడు. ఇందు 'ఱా' శకట రేఫసంజ్ఞికము.

"మ. పురుటింటం బసిబిడ్డచందమున వాపోవంగ నాఁ డాత్మలో
       మురువొప్పన్ విషదుగ్ధయుక్తకుచ యై ముద్దాడురాకాసి గు
       ర్తెఱిఁ గిష్టంబుగఁ బాలు ద్రావుమిషచే నిర్వైనకాలంబునం
       ధరణిం గూల్చి నందపుత్త్రువలనన్ దార్కాణ ధర్మస్థితుల్."

ఇందు నెఱిఁగిశబ్దము లఘు రేఫముతోఁజేర్చి బ్రయోగింపఁబడినది. 'ఈశబ్దమునకు రూపాంతరమును బద్యమునకుఁ బాఠాంతరమును గానరాదు.' అని ద్విరేఫవర్ణదర్పణకారులయభిప్రాయంబు. ఎఱుఁగుట శకటరేఫము గల దని యీ అప్పకవియే చెప్పియుండె. ఇంక నిట్టిపొరపాట్లనేకము లుండనోవు. ఇట్టి భ్రమప్రమాదంబుల కెడ మియ్యకుండున ట్లింకొకపద్యంబు వ్రాసె. అ దెట్లనిన :-

"క. బ్రమయక రేఫములకు రే, ఫములును ఱాలకును ఱాలు ప్రాసములను వి
     శ్రమములను జెప్పఁదగు నీ,క్రమ మెఱుఁగక రెండునుం గుకవిగూర్చుఁ గృతిన్."

అని యిట్లు వ్రాసి తానే యనేకస్థలంబులలో బ్రమసి యీరెంటిని వివేచింపలేక యొకదాని కొకటి ప్రయోగించె. ఇప్పుడు రేఫనియమన మప్పకవి తనయిష్టానుసారంబుగఁ జేసియుండియుం దాఁజెప్పిన సూత్రమును దా సమర్థింపలేక తాను పైనఁ జెప్పినపద్యార్థమునకుఁ బాత్రుఁ డయ్యె నని యొరు లాక్షేపింప మన మే మని సమర్థింపఁ గలము ? అట్లు సమర్థింపలేనిచో నీతనిగ్రంథంబును సలక్షణంబుగాదన వలసివచ్చును. దీనిని రేఫమైత్త్రికి సమ్మతించనివా రేమని సమర్థింతురో ! ఆముక్తమాల్యదలోని కొన్నిగురువులై లఘువులుగాఁ గాన్పించు రేఫములకు వీరు ద్విరూపము లున్న వన్నట్లు వీనికిని ద్విరూపముల నైనఁ జెప్పవలెను. లేకున్న నింకొక విశేషవిధాన మేమైనఁ గల్పింపవలయును. సర్వజనులకుఁ బ్రామాణికగ్రంథం బగుభారతంబున గాన్పించు ప్రయోగములంబట్టి సూత్రములను సవరించిన నేమికొఱంత ? భారతమునందుఁ బ్రయోగము లున్న వని వీరికిఁ దెలియక యుండునా ? అ ట్లుండుటకుఁ గారణముమాత్రము కానరాదు. ఇట్టిప్రయోగంబులు భారతంబునం గలవా యనవలదు. వానిం గొన్నిటిని వివరింతము -

1. "క. సర్పముఖశరము గల దని, దర్పంబునఁ గ్రీడిఁ దొడరఁ దలఁపకు హరి పెం
         పేర్పడఁగ నదియ కా దట, తీర్పవలయువానినెల్లఁ దీర్చు నరునకై."

ఇందులో 'తీఱు' శకటరేఫము గలది. ఇచ్చట నీ గురురేఫమునకును మిగిలిన లఘురేఫములకు మైత్త్రి చెప్పంబడియె. దీనికి రేఫాక్షరమైత్త్రి సమ్మతింపనివారిచే గొన్ని విశేషవిధానంబులు గల్పింపంబడియె. అం దొక దాని నిట వివరింతము. "రేఫమునకు నన్యవర్ణముతో సంశ్లేషము వచ్చినప్పుడు గురుత్వలఘుత్వ వైపరీత్యము గలుగదు." అని యిట్లు చిత్రంబుగ వ్రాయంబడియె. అహహా చూడుఁడు ! ఈసూత్రకారునిచే సంశ్లేషాక్షరమున కెట్టిసామర్థ్యంబు చెప్పఁబడినదో ! తన పై యక్కరములు దేవ[1]దానవులవంటివైనను సంయుక్తాక్షరములు తాము దలఁచినట్లైన వాని నెట్లు చేయదొరకొన్న నట్లు సేయఁగలవఁట. భారతంబులోనే యున్న మఱియొక ప్రయోగంబు చూపుదము

"క. తెంపును బెంపును గదుర ని, లింపులు వెరఁగంది చూడ రిపుసైన్యములుం
     గంపింపఁ దమబలంబులు, ఱంపిలి బిట్టార్వ సింధురాజుం దాఁకెన్."

ఈపద్యములోని ఱంపిలిశబ్దము సర్వత్ర గురు రేఫముగాన లఘువు గాదు. దీనికిని లఘు రేఫమునకును మైత్త్రి సోమయాజిచేఁ జెప్పఁబడియె. ఇచట మైత్త్రిగలలఘు రేఫము తత్సమంబుగావున ద్వైరూప్యము చెప్ప వీలులేదు. కావున నిచ్చో లఘ్వలఘు రేఫములమైత్త్రికి నొప్పికొనక తప్పదు. అని యిట్లు సులక్షణసారవ్యాఖ్యాత వ్రాసె.

ఈ పై నుదాహరించినపద్యంబున నింకొకవివాదాంశంబు గూడకాన్పించుచున్నది. అదియు నప్పకవికి సమ్మతము గానిదే. దానిం గూర్చి వాదించునవసరము మన కీవఱకు లేకున్నను గొన్ని స్థలంబుల నప్పకవి భారతముం జూడకయే స్వాభిప్రాయమును వ్రాసె ననుమాట యథార్థపఱుచుటకునై దాని నిట వివరింతము.

"తే. భరితభువనార్ణవంబుతో వంత సరియె, రమ్యమణిరాజరాజితో లక్క సరియె
      లలితవీణారవంబుతో ఢక్క సరియె,ననగఁ, జెల్లు నభేదాఖ్య నమరువళ్లు. అ. ఆ. 3.

వ. ఈ మూఁటిలోపలను భకారంబునకు వకారంబునకు నభేదవర్గయతులు గావునఁ బ్రయోగింపవచ్చు. లవర్ణమునకు డవర్ణమునకు నభేదవర్గయతులు గావు గావునఁ బ్రయోగింపరాదు. రవర్ణనమునకు లకారమునకు గ్రాహ్యంబు గాదు. వానికి లక్షణవిలాసమువారు తెలియక కొన్ని యుదాహరణంబులు వ్రాసినారు. అవియు నిట వివరించెద. నైషధములో 'లీలామకరాంకచంద్రరేఖాంకుర' అనియు రామాయణములో 'శారదాభ్రవిలీనత నేపారు చంద్రలేఖయపోలెన్‌' అనునదియుం గలవు. సంస్కృతమునందు రేఖాలేఖాశబ్దములు రెండునుం గలవు. కావున నీరెండుపద్యములయందుఁ జెప్పిన లేఖాశబ్దము మొదలిది ద్వితీయాంతస్థమని యెఱుంగునది.

అని వ్రాసియనంతరము వసుచరిత్రలో

"రోలంబాలక యోర్తు గ్రుంకి బిసవల్లుల్ దున్మి తూటడి" అనునీచరణంబులో 'లోలంబాలక' అని కవిహృదయము. దీనిం గానక కొందఱు 'ఇందిందిరశ్చంచరీ కోరోలంబో భంభరో ౽పిచ' అని యున్నది గావున రోలంబాలక యని చదువుదురు. ఇట్లని రామరాజభూషణకవి తలంపుగాదు."

అనియు వ్రాసి,

"క. నణ లనురెండక్కరముల, కును వడిఁ బ్రాసంబుఁ బెట్టికొనవచ్చుఁ దగన్
      విను రఱల కిట్లు పెట్టం, జను లళల కభేద మరయ సర్వజ్ఞనిధీ."

వ. ఈచెప్పిన మూఁటిలోపలను మొదలఁ జెప్పిన 'నణలకు' సరసవడియును కడమఁ జెప్పిననళల కభేదవిరతియును గనుక నీరెండును గూర్పవచ్చును. నడుమఁ జెప్పిన రఱలకు 'రయోస్తు నిత్యం స్యాత్‌' అను శబ్దానుశాసన సూత్రము కలిమింజేసి యేకతర యతు లవుటంజేసి కూర్పరాదు. "అటుగావున నీపద్యమును బ్రశస్తము కాదు."

అని యి ట్లప్పకవి కొన్ని చోట్లఁ గవిహృదయంబు గా దనియును వీరందఱు సప్రశస్తముల వ్రాసి రనియుఁ జెప్పియుండెఁ గాని వీరట్లు వ్రాయుటకుఁ గారణం బేమి యని యూహింపఁ డయ్యె. ఇంతియకాక తాఁ జెప్పినదే కవిహృదయ మనియు నొరులు దాని నెఱుఁగరనియుఁ జెప్పుట మఱియు వింతగ నున్న యది. తనకు నూటయేఁబదిసంవత్సరములకుఁ బూర్వంబున నున్న రామాభూషణునిహృదయంబు తనకును బూర్వు లగులక్షణవిలాసమువారికంటెఁ దనకే యెక్కుడుగఁ దెలియు టెట్లు గలుగు? వారిహృదయంబు లిట్లే కావున రలలకును మైత్త్రి యుండఁగూడ దనుటకంటె సర్వజనులకు సుగమం బవుభారతములోనున్న

"క. తెంపును బెంపును గదురని, లింపులు వెఱఁ గంది చూడ రిపుసైన్యములున్
     గంపింపఁ దమబలంబులు, ఱంపిలి బిట్టార్వ సింధురాజుం దాఁకెన్."

అనుపద్యమును సులక్షణసారములో భారతములోనిది గావున పరిహరింపఁ గూడ దని వ్యాఖ్యత వివరించెను. పై పద్యంబునందలి రెండవపాదంబులోని లకారరకారమైత్త్రియును నాల్గవపాదంబున నున్న ఱకార రేఫమైత్త్రియుఁ జూపిన నీయప్పకవిప ల్కెంతశ్లాఘనీయముగ నుండును? కవుల కెంతసంతసంబు గల్గును ? భారతప్రమాణంబు లేకుండఁ జెప్పంబడినయీయప్పకవి పల్కులంగూర్చి యీవిషయంబున నిఁక సంవాదంబు సేయంబనిలేదు. ఈరేఫములు రెండును దఱుచుగ నొకచో నుండుటంజేసి విన వీనులకు సొంపుగ నుండదుగావునఁ బ్రయోగించునపు డెల్లరు సంశయింతురు. అయిన వీని నేఱ్పరింపలేక కవులు బ్రమయుదురు. ఇట్టిచోటనే యప్పకవి దోషబాహుళ్యంబుగా వ్రాసె. ఇట్లువ్రాసినవాఁ డన్నిశబ్దంబులును రూఢముగా నెఱింగించినవాఁడును గాఁ డయ్యె. [2]తా వ్రాసిన దానినైన దా సమర్థింపలేఁ డయ్యె. ఈతని యనంతర మహోబలపండితుం డీరేఫయుగవిషయం బెంతయు వ్రాసి వీనిమైత్త్రికి సమ్మతించినవారిని మఱియు నిందించె. భాగవతంబుఁ దెనిఁగించిన బమ్మెరపోతరాజునకును రాఘవపాండవీయంబు వ్రాసినపింగళసూరన్నకు ననామకకవిద్వయ మని పేరుంచె. చూడుఁడు తావ్రాసినదే యథార్థ మని యితఁడు మహాకవుల నిందించె. అహోబలపతి యనంతరము మఱికొందఱు ప్రత్యేకంబు దీనివిషయంబే వ్రాసి పరుష వాక్యంబులచే దీనిమైత్త్రి తప్పింప యత్నించిరి. ఇంతియ యోచించిరిగాని దీనిలోని ముఖ్యాంశంబు గనుపఱుపరయిరి. అది యటుండనిండు. మన మీ యక్కర మెక్కడనుండి వచ్చినదియో యోచించి దానియుపయోగముం గూర్చి పిమ్మట నాలోచింతము.

ఆంధ్రాక్షరవిమర్శనము.

ప్రప్రథమంబునఁ దెనుఁగుబాసలోనివర్ణంబులఁ దేటపఱుతము. అ ఆ, ఇ ఈ, ఉ ఊ, ఎ ఏ ఐ, ఒ ఓ ఔ, ౦-ఁ, కగ, చౘ, జౙ, టడణ, తదన, పబమ, యరలవసహళ. అనునక్కరములు ముప్పదియాఱు. ఇవియే యచ్చ తెనుఁగు వర్ణంబు లైనట్లు వ్యాకరణంబులలో స్పష్టం బగు. అందు చే ఱకారంబు మొదటనుండియు నుండినట్లు నిశ్చయింపఁ దగియున్నది. అట్లే కాకున్న నీభాషకు వర్ణంబులు ముప్పదియేడు గాకుండునే. అట్లైన నిఁక నీవర్ణం బెచ్చటిదో యరయవలయు. ఇది కన్నడభాషలోని దని చెప్పంబడు. మనదేశపు రాజు లాదేశంబుం జయించి యచ్చో గాఁపురమున్న కాలంబులు కొన్ని గలవు. అపు డీయక్షరము మనకు సంప్రాప్తం బయియుండు. ఈఱకారమునకు మన రేఫమునకు సంబంధంబు లేకుండుటం జేసియే సూత్రకారులు దీనికి వైధర్మంబు సెప్పెరి. మనభాషలోనిది కానియక్షర మం దుంచి దాని ప్రయోగంబునకుఁ జర్చించుటకుఁ గారణంబుమాత్రము కానరాదు. వీనిప్రయోగంబునకు శాస్త్రంబు సమ్మతించినను గ్రంథంబుల దాని నుంచకున్న బాధకం బేమి కలదు. ఇదియకాదు సర్వభాషలు దెనుఁగుతోఁ గలిపి ప్రయోగింపవచ్చును. ఇతరభాషలోనియక్షరము మనభాషలో నుంచి దానిప్రయోగంబునకు సంశయించుకంటె నాయక్షరమును దొలఁగించి మనభాషలోని యక్షరమునేగొను టెంతయు శ్లాఘనీయంబుగాదె. ఱకారంబునకుంబోలె ళకారంబునకు సంస్కృతంబున నొకవివాదము సంభవించుచున్న కొందఱు (ళ) యీశ్వరఢక్కచే నుద్భవించలేదనియుఁ గావున నిది వర్ణ సమామ్నాయంబున లేదనియు ళకారయుతంబు లైనశబ్దములలో లకార ముంచి యుచ్చరించుటయేయుక్త మని వాదించుచున్నారు. దీని కనేకులు పండితులు సమ్మతించియున్నారు. ఈశ్వరఢక్కవలనఁ బుట్టినలకారమునకుఁ గొన్నికొన్ని దేశములవారిచే నిట్టియుచ్చారణభేదంబు గల్పింపఁబడినది. దాక్షిణాత్యులుదీనినే తఱుచుగ గురువుగ నుచ్చరించుచున్నారు. ఉత్తరదేశవాసులు దీనిని స్వభావసిద్ధ మైనయుచ్చారణతోఁ బల్కుచున్నారు. మధ్య దేశస్థుల మైనమన ముభయోచ్చారణలును వినియున్నాము కావున నారెంటినిగూడఁ బల్కు చున్నాము. ఇంతమాత్రముచే లకారముయొక్క గురురూపము శివునిఢక్కచే నుత్భవించినట్లే లెక్కించి వాక్యంబు దిద్ద నలవికాదుగదా. తెలుఁగున ఱకార రేఫములకు నుచ్చారణయం దిట్టి సామ్యమే యున్నది. ఇందలిపండితులును శాస్త్రసమ్మతంబైన రేఫోచ్చారణంబేయుంచుట మే లనిన మనకు ఱకారముంగూర్చి మాటలాడు నవసరంబే లేదు. మనకే కాదు తొంటికవులలోఁగూడ నిట్టి భేదాభిప్రాయంబులు గలవు. దీనికి దృష్టాంతముగఁ గవిత్రయము వారిమతంబు చూచిన వృత్తాంతమంతయు గోచరంబగు. నన్నయభట్టున కున్నంతయిష్టంబు తిక్కనసోమయాజికి వీనిమైత్త్రి లేమికి లేదు. ఎఱ్ఱప్రెగ్గడయుం దిక్కనమార్గంబునే యవలంబించినట్లు కానంబడు. ఈ మువ్వురింగాక తక్కినవారిం జూచిన వారికి నిట్టిభేదంబే గలదు. అందుఁ బోతనామాత్యుని కాలీనులచే నిది మిగులఁ బాటింపంబడినట్లు గానరాదు. కృష్ణరాయలకాలీనులు తాము కర్ణాటదేశంబున నుండుటంజేసి దీని నెంతయుఁ బాటించినట్లు గాన్పించు. కర్ణాటదేశ వాసంబు లేకపోయినతోడనే మనవారికి వీనిమైత్త్రి లేమికి మిక్కిలి యాదరంబు లేదయ్యె. మఱికొంతకాలంబున కప్పకవి దీనివైధర్మ్యమును మరల నుద్ధరించి దీని మైత్త్రికి సమ్మతించినవారిని గుకవులనియు నాగ్రంథంబులు సలక్షణంబులు గావనియుం బల్కె. నాఁటనుండియు గొందఱు కొందఱు వ్యాకరణకారులు వీనిమైత్త్రి తప్పింప నతితీక్ష్ణముగ వ్రాసిరి. వీరందఱును ఋకారంబునకును రేఫమునకు మైత్త్రియుండవచ్చు ననిరి. దానికి కారణంబు రేఫలోనిభాగంబే కావున నట్లున్న దోషము లే దనిరి. ఱకారముమాత్రము రేఫములోనిది గా దని వారియభిప్రాయము. ఈ రేఫమే గురువుగ నొకపరియు లఘువుగ నొక పరియు నుచ్చరింపఁబడు ననుచో ఋకారంబున కున్నంతమైత్త్రియైన లేకుండునా యని యేల యూహింపఁ గూడదు అచ్చగుఋ కారమునకును, హల్లగురేఫమునకును మైత్త్రి వీరికి సమ్మతమైయుండ వీరికి గురులఘు రేఫములమైత్త్రి సమ్మతించిన దోష మేమిగలదు. సూత్రమునఁ జెప్పఁబడినది కావున దీనికి నేమియుఁ జేయఁగూడ దని యనెద రేమో సూత్ర మున్నను బ్రయోగంబున భేదంబులు గాన్పించుచుండ నాసూత్రమునకు విశేషవిధానములు కల్పించుచుండ నిచ్చో నది యేల కూడదు. ప్రయోగంబు ననుసరించి సూత్రముల నేఁటివఱకును గల్పింపఁబడుట లేదే? పండితులును బుద్ధిమంతులును భాషలోని చిక్కులు తప్పింప యత్నింపవలయుఁగాని యిట్టిపట్టునే యవలంబించిన నేమిలాభంబు ? ఈ రేఫయుగమైత్త్రి దోషమును సవరింపకుండిన గ్రంథంబులన్నియు నలక్షణంబులు గావు. వైకల్పికమైత్త్రి కైన సమ్మతింపక తప్పదు. అటుగాకున్న ప్రతిగ్రంథంబులో నీలోపం బొకమాఱైనఁ గాన్పించి దా నిం దుచ్ఛంబు సేయు. దీనికి నప్పకవీయమే దృష్టాంతము. ఏదేని యొకసూత్రంబు సవరించి గ్రంథంబులు నిర్దోషములు చేయుట ముఖ్యముగాని దానినే యుంచి వానిని చెఱుచుట ప్రశస్తము గాదు. ఈదోష మొక్కటి లేకున్నఁ బోతనకృత గ్రంథంబు సలక్షణ మనుటకు సందియంబులేదు. ఈతండు పదశయ్యాదులందుఁ దిక్కనతో సరిసేయం

పోతనపదశయ్యా విశేషములు.

దగువాఁడు. సమానవర్ణన లున్నతావులు చూచిన నీయిరువుర కవనంబునకుం గలసామ్యంబు గోచరంబయ్యెడిని. కావున మన మిపు డొకటిరెండుపద్యంబుల వ్రాయుదము.

"సీ. ప్రాణంబుతోఁగూడ రక్కసిచన్నుల, పాలు ద్రావినప్రౌఢబాలుఁ డితఁడె
      వ్రేల్మిడిఁ జాణూరు విఱిచి లోకముల మె,చ్చించినయాజగజెట్టి యితఁడె
      దుర్వృత్తుఁ డగుకంసుఁ దునిమి యాతనితండ్రిఁ,బట్టంబు గట్టినప్రభుఁ డితండె
      సత్యభామకుఁ బారిజాతంబుపైఁ గల,కోర్కి దీర్చినరసిం డితండె

తే. వెన్నలును గోపికాచిత్తవృత్తములును, నరసి ముచ్చిల నేర్చినహరి యితండె
    శ్రుతిశిరోభాగములఁదనసుభగచరణ, సరసిజా మోదమునుగూర్చుచతురుఁడితఁడె."
                                                                     భార. ఉద్యో. ప. అ. 3

"సీ. వీఁడఁటే రక్కసి విగతజీవ గఁ జన్ను, బాలుఁ ద్రావినమేటిబాలకుండు
      వీఁడఁటే నందునివెలఁదికి జగమెల్ల, ముఖమందుఁ జూపినముద్దులాఁడు
      వీఁడఁటే మందలో వెన్నలు దొంగిలి, దర్పించి మెక్కినదాఁపరీఁడు
      వీఁడఁటే యలయించి వ్రేతలమానంబుఁ, జూరలాడినలోకసుందరుండు
      వీఁడు లేకున్నపుర మటవీస్థలంబు, వీనిఁ బొందనిజన్మంబు విగతఫలము
      వీనిఁ బల్కని వచనంబు విహగరుతము, వీనిఁ జూడనిచూడ్కులు వృథలు వృథలు."
                                                                భాగ. స్కం. 10. పూ. భా.

ఇ ట్లింక ననేకపద్యంబు లున్నయవి. ఎచ్చోఁ బరిశోధించినను బోతనపాండిత్య విశేషంబులు పూర్వకవులవానితో సమానముగను కొంచెమధికముగ నుండునుగాని న్యూనంబుగ నెన్నండు నుండవు. తిక్కన సంగ్రహ శయ్యకును, బోతన యమకకవనంబునకుం బ్రసిద్ధులు. తిక్కన రౌద్ర భీభత్స రసప్రధానంబు లగునారభటీవృత్తులును వీరభ యానకరసప్రధాన సాత్వతీవృత్తులును జెప్పెడి స్వభావము గలవాఁడు. పోతన శృంగార కరుణారసంబులచే నొప్పు కైశికీ వృత్తులును, హాస్య శాంతాద్భుత రసప్రధాన భారతీవృత్తులును జెప్పెడి స్వభావము గలవాఁడు. తిక్కన ప్రత్యక్షశయ్య నుడువ నుత్సహించు. పోతన భక్తిరస మొల్కునట్లు పల్కు. సోమయాజి తెనుఁగుపదంబులు ప్రయోగించుట యందు విశేషాసక్తి కలవాఁడు. పోతన సంస్కృతపద ప్రయోగపటిష్ఠుఁడు శృంగారవర్ణనలఁ దొంటి పురాణకవులలోఁ బోతన కవనంబే మిగుల శ్లాఘనీయంబు. దానిం జూపుటకు రుక్మిణీకల్యాణమునుండి యొకపద్యము చూపెదను. ఎట్లన్నను. -

"సీ. పల్లవవైభవాస్పదములు పదములు, కనకరంభాతిరస్కారు లూరు
      లరుణప్రభామనోహరములు కరములు, కంబుసౌందర్యమంగళము గళము
      మహిత భావాభావ మధ్యంబు, చక్షురుత్సవదాయి చన్నుదోయి
      పరిహ సితా ర్ధేందుపటలంబు నిటలంబు, జితమత్తమధుకరశ్రేణి వేణి

తే. భావజాశుగముల ప్రాపులు చూపులు, కుసుమశరునివింటికొమలు బొమలు
    చిత్తతోషణములు చెలియభాషణములు, జలజవయనముఖము చంద్రసఖము."

రుక్మణీకల్యాణము సత్యభామయుద్ధము మొదలగుపట్లు హరివంశంబున నెఱ్ఱాప్రెగ్గడచే వర్ణితంబులయ్యె. వానిం బరిశోధించిన నీయిరువురకుం గలతారతమ్యంబులు గోచరంబు లగు. శృంగారవర్ణనలు కానిచోట్లను జూచినఁ బోతన శంభుదాసునకు నీ డగు ననియుఁ, గొంచె మతిశయించు ననియుం దోఁచు. దానికి దృష్టాంతముగ హరివంశ భాగవతంబులలోని కొన్నిసమానవర్ణన లున్నపద్యంబుల వివరింతము.

శ్రీరామచరిత్రము.

మ. అమలాంభోజదళాక్షుఁ డక్షతఘనశ్యామాంగుఁ డాజానుదీ
     ర్ఘ మహాబాహుఁడు సంహతోరుకఠినోరస్కుండు సింహోరువి
     క్రమణుం డుద్ధత శౌర్యధుర్యకల నాకల్పుండు కళ్యాణధీ
     రమణీయుండు వెలింగె రాముఁడు గుణారాముండు భూమండలిన్.
                                                 హరి. పూ. భా. ఆశ్వా. 4.

మ. అమరేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితం బైనట్లు నారాయణాం
      శమునం బుట్టె మదాంధరావణశిరస్సంఘాతసంచేదన
      క్రమణోద్దాముఁడు రాముఁ డాగఱితకున్ గౌసల్యకున్ సన్ను తా
      సమనైర్మల్య కతుల్య కించితజనుస్సంసారసాఫల్యకున్. భాగ. స్కం. 9.

శా. ఈవానం బరిపీడ నొందువసుల న్వీక్షించి రక్షార్థినై
     వేవే యిద్ధరణీధ్రముం బెఱికితిన్ విస్తీర్ణ మీక్రింద మీ
     రేవా రెచ్చట నుండఁ గోరితిరి మీరెల్లం బశుశ్రేణితో
     భావంబు న్భయ ముజ్జగించి చనుఁడీ భవ్యాద్రిచా టందఱున్. హరి. పూ. భా. ఆ. 6.

శా. బాలుం డీతఁడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపఁగాఁ
     జాలండో యని దీనిక్రింది నిలువ న్శంకింపఁగాఁ బోల దీ
     శైలాంభోనిధిజంతుసంయుతథరాచక్రంబు పైఁబడ్డ నా
     కే లల్లాడదు బంధులార నిలుఁ డీక్రిందన్ బ్రమోదంబునన్. భాగ. స్కం. 10. పూ

ఇంకను ననేకస్థలంబులు గలవు. వానిం బరికించిచూచినఁ బోతన కవిత్రయమువారితో సమానుఁ డని కంఠోక్తిగఁ జెప్పఁదగు. వారు చేసినపద్యములుచూచి యీతండు కొన్నిటివ్రాసెఁ గావుననంతకంటెను గొంచెము బాగుగ వ్రాసె నని యనవలదు. ఈతని జూచివ్రాసిన యీతనిశిష్యుల కవనంబును తర్వాత మఱికొందఱు వ్రాసిన కొన్నికొన్ని భక్తిరసపద్యంబులును వీనికి నీడుగ నున్న వే? కావున నిది పోతనకవిత్వ పటిమయే యని చెప్పఁదగు.

వీరభద్రవిజయవివేకము.

బమ్మెర పోతరాజు వీరభద్రవిజయ మనుగ్రంథము రచియించి యుండె నని యొకప్రతీతి గలదు. అయ్యది భాగవతశైలి నుండ లే దనియు నది పోతరాజు వార్థికదశలోఁ జేసియుండుటచేత నందులోఁ గొన్ని దోషంబులు కలిగె ననియు నాంధ్రకవి చరిత్రములో వివరింపంబడియె. లోకములోనివాడుకగూడ నట్లే యుండుటచేత నాగ్రంథము విమర్శనా పూర్వకముగాఁ గొంత చదివి యందలి పరస్పరభేదంబులఁబరికించి యది భాగవతగ్రంథకర్త యగు బమ్మెరపోతనకృతం బగునా యని యీక్రిందికారణములనుబట్టి సంశయించుట కలుగుచున్నది. చదువరు లద్దానిలోని విశేషముల నరయురురుగాక.

"1. గీ. వెలయ మఱియుఁ గల్గువీరమాహేశ్వరా, చారవరుల వీరసత్యవ్రతుల
        వీరసచ్చరితుల వీరవిక్రములను, పన్నుగదలంచి మ్రొక్కెద భక్తితోడ.

వ. తత్ప్రసాద కరుణావిశేష ప్రవర్ధమాన కవితామహత్త్వ సంపన్నుండ నైన మదీయాంతరంగంబున."

2. దీనిం బట్టి చూడ నీయంశము భాగవతరచనావిచక్షణుఁ డగు పోతనామాత్యుని కథవలె వ్రాయంబడక వేఱువిధంబుగ నున్నట్లు కాన్పించుచున్నది. అది స్పష్టముగా నందలియాశ్వాసాంతరగద్యములో నున్నది, ఎట్లన్నను :- "ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితాచిత్ర" అని పైగ్రంథకర్త యగుపోతయ వీరమహేశ్వరు లనుశైవభక్తులకరుణచేతఁ దనకుఁ గవిత్వప్రజ్ఞ గలిగినట్లు చెప్పును. వీరభద్రవిజయగ్రంథకర్త యగు పోతయ తా నాగ్రంథరచనాకారణ మొకచో నొక విధముగను, మఱియొకచో మఱియొకవిధంబుగను వ్రాసె. దానిని ముందుఁగఁ దెల్పెదను -

"వ. అయ్యవసరంబున సోమశేఖరుండు (ఇవటూరి సోమశేఖరుఁడు) ఇట్లనియె.

సీసగీతము. ఉన్న నైనను మాకెల్ల నూహలోన, వింతపండువు బోలెను వీరభద్ర
విజయ మెల్లను వినఁ గడు వేడ్క యయ్యె, నది తెలుంగున రచియింపుమభిమతముగ.

అ. పిన్న వాఁడ ననియుఁ బెక్కుసత్కృతులను, విననివాఁడ ననియు వెఱపు మాని
    మత్ప్రభావదివ్యమహిమచే నెంతైన, కవిత చెప్ప లావు గలదు నీకు.

వ. అదియునుంగాక నీకు వీరభద్రేశ్వరప్రసాదంబు గలదు."

అని యిట్లు తామొదట నొకచోటవ్రాసి వీ. వి. లోఁ బోతయ కవి స్వవంశమును వర్ణించి తిరుగ మఱియొకపరి స్వసామర్థ్యంబును, గ్రంథరచణాకారణంబు నీక్రిందివిధంబుగ వ్రాసెను. ఎట్లన్నను :-

"వ. తదనుజుండ నై నేను జన్మించిపోతయనామధేయుండ నై పరఁగి జనకశిక్షితవిహితాభ్యాసుండ నై వీరభద్రప్రసాదలబ్ధ కవితాతిశయంబున.

ఉ. భాగవతప్రబంధ మతిభాసురతన్ రచియింప దక్షకృ
    ద్యాగకథాప్రసంగమున నల్పవచుస్కుఁడ నైతిఁ దన్నిమి
    త్తాగమవక్త్రదోష పరిహారతకై యజ నైక శైవశా
    స్త్రాగమ వీరభద్రవిజయంబు రచించెద వేడ్క నామదిన్."

అని యున్నది. దీనింబట్టియే భాగవత మాంధ్రీకరించిన పిమ్మటఁ బోతనామాత్యునివలన నీ వీరభద్రవిజయము రచియింపఁబడినట్లు వాడుక గలిగెను. అయితే మొదట నుదాహరింపఁబడిన పద్యమువలన వీరభద్రవిజయము రచియించునాఁటికి దద్గ్రంథకర్త యగుపోతయకవి పిన్న వాఁడనియు పెక్కుసత్కృతులను విననివాఁడనియుఁ జెప్పంబడియున్నది. కావున భాగవతగ్రంథ మావఱకే యీపోతన రచియించె నని చెప్పినమాట నిలువనేరదు. ఇఁక భాగవత ప్రబంధ మనునొకగ్రంథ మాతఁ డావఱకు రచియించియుంటి నని చెప్పిన దాని కర్థము బమ్మెరపోతనామాత్య కృతభాగవతపురాణాంధ్రగ్రంథము కాక ప్రత్యేకము భాగవత మనునొకప్రబంధము రచియించియుండె ననియు నందులో దక్షయాగకథాసందర్భములో నీశ్వరుని నిందించినట్లును అర్థము చెప్పినచో దోషము లేదు. బమ్మెరపోతరాజు భాగవతము తనబాల్యకాలములోపలనే రచియించినట్లు చెప్పియుండలేదు. ఇంతియకాక ఆగ్రంథముయొక్కవిశేష కథాంశములం బట్టియును, పద్యబాహుళ్యముం బట్టియు నిది పదియిరువదిసంవత్సరముల కాలములోఁగాక త్వరలో ముగించఁదగినగ్రంథము కాదనియు భాగవతగ్రంథము నాంధ్రీకరింపఁ దొడంగునాఁటికే పోతనామాత్యుఁ డద్వైతశాస్త్ర సంబంధము లగుననేకగ్రంథములను, భాష్యముల నధ్యయనము చేసియుండవలసి యుండుననియు నది పది యిరువది సంవత్సరముల కాలమునంగాని సమకూడునది కా దనియు నూహింపవలసి యుండును. పోతన బాల్యమునుండి యనఁగాఁ బదిసంవత్సరములనుండి వేదాంత శాస్త్రాభ్యాసము చేసి యుండినను ముప్పదవ యేటం గాని భాగవతముఁ దెనిఁగింపఁ గడఁగుటకు సమర్థుఁడై యుండఁడు. అట్లుగా యత్నించి దానిం దెనిఁగింప నారంభించినను నేఁబదియవవత్సరము నాఁటికిగాని దాని ముగియించియుండఁడు. అటు పిమ్మట వీరభద్రవిజయగ్రంథరచన యై యుండును, ఇట్లుండఁగా నా నాఁటికి నీపోతనామాత్యుఁడు పిన్నవయసుననున్నాఁడనియుఁ బెక్కు సత్కృతులను విననివాఁ డనియును జెప్పుట కవకాశ ముండు నని యూహించను. ఇంతియకాక వీరభద్రవిజయ గ్రంథకర్త దాను వీరభద్రోపాసనఁ జేసినాఁడ ననియుం జెప్పుచుండును. పోతనామాత్యుఁడు భాగవతములోఁ దాను పరమేశ్వరోపాసనఁ జేసినాఁడ నని చెప్పును. మంత్రశాస్త్రాను సారంబుగ వీరభద్రోపాసన కేవలము కామ్యమును, పరమేశ్వరోపాసన కేవలము మోక్షదాయకమునై యున్నది. కావున నీయుపాసనాభేదములు గలవా రిర్వురు నొక్క రని చెప్పుటకు సంశయము కలుగుచున్నది, ఇదియునుగాక పోతనామాత్యుఁడు శైవుఁడును శైవమంత్రోపాసకుఁ డయినను భాగవతమును దెనిఁగించుటకుఁ గలకారణముల నీక్రిందివిధంబున. జెప్పెను. ఎట్లన్నను :-

"వ. అని మఱియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనాకుతూహలుండ నై"

అని యొకచో వ్రాసి, మఱియొకచో

"ఇట్లు భాసిల్లెడుశ్రీమహాభాగవతపురాణపారిజాతపాదపసమాశ్రయంబున హరి కరుణా విశేషంబునఁ గృతార్థత్వంబు సిద్ధించె నని బుద్ధి నెఱింగి"

అనివ్రాసెను. పోతరాజును లీలాశుకుఁడు మొదలగువారింబలె శైవమంత్రోపాసకుండయినను వైష్ణవమహిమాను వర్ణనమునఁ దత్సంకీర్తనవలనను వైష్ణవుఁ డయినవాఁడుగాని శైవుండు గాఁడు. ఇట్టిదార్ఢ్య బుద్ధితో భాగవతముం దెనిఁగించి తనకుం గలభక్తిపారవశ్యముం జూపుచు నానందించుపోతనామాత్యునకు వాచాదోషము గలుగుటయుఁ దన్ని వారణార్థముగా నట్టిమతమును వదలుకొని తిరుగ శైవుఁ డయి వీరభద్రోపాసన జేసి యివటూరి సోమనారాధ్యుని సేవించి ఆయనసెలవుపయిని వీరభద్రవిజయము నాంధ్రీకరించుటయుఁ గలుగు నని చెప్పుట కంటె హాస్యాస్పదకార్యము మఱియొకటి లేదు. ఇట్లుగాఁ బోతనామాత్యుఁడు తనమతము మార్చుకొనుటయే కాక ఆశ్వాసాంతగద్యనుగూడ మార్చుకొనె నని చెప్పుట మఱియు హాస్యాస్పదముగా నున్నది. అది యెట్లనఁగా :

భాగవతగద్యము.

"ఇది శ్రీపరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్త్ర సహజ పాండిత్య పోతనామాత్య"

అనియున్నది.

వీరభద్రవిజయగద్యము.

"ఇది శ్రీమ న్మహా మాహేశ్వర యివటూరి సోమనారాధ్య దివ్యప్రసాద పాదపద్మారాధక కేసనామాత్య పుత్త్ర పోతయనామధేయ"

అని యున్నది.

ఈ రెండుగద్యములం జూచినతోడనే గ్రంథకర్త లిర్వురు నొక్కరు కా రనియు నట్లే యైన రెండుగద్యములును రెండువిధంబుల వ్రాసి యుండ రనియుఁ జెప్పవలసియున్నది. భాగవతకవికిం గల 'సహజపాండిత్య' శబ్దము రెండవయతనికి లేదు. ఇదివఱలో మొదటియతని కవిత్వ మీశ్వరవరప్రసాదలబ్ధ మనియు, రెండవయతనికవిత్వము వీర మాహేశ్వరాది కటాక్షసంప్రాప్త మనియుఁ జెప్పియే యున్నాను.

3. భాగవతములో దక్షయజ్ఞ సమయములో బోతనామాత్యునివలన నీశ్వరనింద చేయంబడినట్లుగా వీరభద్ర విజయములోఁ జెప్పంబడినది. దానికిఁగాను చతుర్థస్కంధములో దక్షయజ్ఞ కథాభాగమంతయుఁ జదివినాఁడను. అందు శివనింద లేదు సరిగదా పైగా శివ పరాత్పరత్వ వర్ణనమే పోతనామాత్యునివలన విశేషించి చేయంబడినది. పోతనామాత్యుఁడు కేవలాద్వైతి యై యుండియు

"చేతులారంగ శివునిఁ బూజింపఁడేని, నోరు నొవ్వంగ, హరికీర్తి నుడువఁడేని
 దయము సత్యంబు సమముగాఁ దలఁపడేని, కలుగ నేటికిఁ దల్లులకడుపుచేటు."

అని చెప్పి గ్రంథారంభము చేసినవాఁడు నీశ్వరోపాసనాపరుండు గూడ నైనచో శివస్తోత్రము చేయుటలో లోపముచేయునా ? ఇది గాక పోతనామాత్యుఁడు తాఁ దెలిగించుచున్న గ్రంథమంతయు స్వకపోలకల్పితము కానందున నద్దానిలో స్వాభిప్రాయము మాతృకాగ్రంథములలో ననఁగా భాగవతాది విష్ణుకథాప్రధానగ్రంథములలోఁ జెప్పం బడనివాని నేల చేర్చును ? దక్షుఁడు కైలాసమునకుం బోయి యీశ్వరునివలన గౌరవము కలుగలే దనుకోపము నంది యీశ్వరుని శపియించినపట్టున నాతనివెంబడినే నందికేశ్వరుఁడు లేచి దక్షుని, బ్రాహ్మణుల శపియించె ననియు, నది విని భృగుమహర్షి లేచి శివానుచరుల నాతఁడు శపియించె ననియుఁ జెప్పినకథాభాగములో నందికేశ్వరునివలన బ్రాహ్మణనిందయు భృగుమహర్షివలన శైవులనిందయుఁ జేయంబడినవి. ఇట్టి వృత్తాంతముఁ దెనిఁగించుటచేతనే పోతనామాత్యునకు వాచాదోషము కలుగు ననఁగా నిఁకఁ జెప్పవలసిన దేమున్నది. అయిన నాపట్టులోఁ బోతనామాత్యుం డెంతవఱకు నిందార్హుఁడో చూచిగాని నిర్ణయించను. పోతనామాత్యునివ్రాఁత లెట్టులున్నవో యీక్రింద చూపెదను.

భాగవతచతుర్థస్కంధమున నీశ్వరునకును దక్షప్రజాపతికిని విరోధము సంభవించినకథలో దక్షుఁ డీశ్వరుం జేసిననింద.

"సీ. అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన, హీనుఁడు మర్యాద లేనివాఁడు
      మత్త్రప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం, బరుఁడు భూత ప్రేతపరివృతుండు
      తామసప్రథమభూతములకు నాథుండు, భూతిలిప్తుం డస్థిభూషణుండు
      నష్టశౌచుండు నున్మదనాంగుఁడును దుష్ట, హృదయుండు నుగ్రపరేతభూని
      కేతనుఁడు వితతశ్మశ్రుకేశుఁ డశుచి, యైనయితనికి శివనాముఁ డనుప్రవాద
      మెటులఁ గలిగె నశిపుఁ డగు నితని నెఱిఁగి, యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చినటుల

      వ. ఇతనికి నన్మత్తనయను విధిప్రేరితుండ నయి యిచ్చితి.

క. ఇతఁ డింద్రోపేంద్రపరీ, వృతుఁ డై సుఖసమయమున హవిర్భాగము దే
    వతలం గూడఁగ మహితని, యతిఁ బొందక యుండుగాక యని శపియించెన్."

ఇది దక్షుఁడు చేసినట్లుగాఁ బోతనామాత్యుఁడు శివుని చేసె నని చెప్పిన యొకనిందకాని యావెంటనే చెప్పినవచనముంబట్టి దక్షునినింద శివునకు నుతియే యైన దనియు నంతియ కాక అక్కడ వచ్చి యుండిన ఋషు లందఱు దక్షుని నిందించి రనియుఁగూడఁ బోతనామాత్యునివలననే చెప్పఁబడినది. ఎట్లన్నను :"వ. ఇట్లు దక్షుండు పలికినగర్హితవాక్యంబులు వినిందితంబులుగ నుండినను యథార్థంబున వాస్తవంబు లగుచు భగవంతుం డగురుద్రునందు ననిందితంబు లై స్తుతిరూపంబున నొప్పు తదనంతరంబున రుద్రునకు శాపం బిచ్చి దక్షుండు సదస్యముఖ్యులచే నకృత్యం బని నిషేధింపఁబడి ప్రవృద్ధం బయిన క్రోధంబుతో నిజనివాసంబునకుం జనియె.

అని యుండుటచేతఁ బోతనామాత్యుఁ డిప్పట్ల స్వకపోల కల్పితము గాని స్వాభిప్రాయ ప్రకటనముగాని చేసియుండలేదు. ఇఁక నందికేశ్వర శాపాదికముంగూర్చి వ్రాసెదను. ఎట్లన్నను :-

"అంత గిరీశానుచరాగ్రేసరుం డగునందికేశ్వరుండు దక్షుండు నిటలాక్షుని శపియించినశాపంబు నతఁడు బల్కిన యనర్హవాక్యంబులును వినికోపారుణితలోచనుం డై యిట్లను ఈ దక్షుండు మర్త్యశరీరంబు శ్రేష్ఠంబు గాఁ దలంచి యప్రతిద్రోహియైన భగవంతునందు భేదదర్శి యై యపరాధంబుఁ గావించె. అట్టిమూఢాత్ముండు తత్త్వ విముఖుం డగు మఱియును గూటధర్మంబు లైననివాసంబుల గ్రామ్యసుఖాకాంక్షలంజేసి సక్తుం డై యర్థవాదంబు లైనవేదంబులచేత నష్టమనీషం గలిగి కర్మతంత్రంబు విస్తృతంబు సేయుచు దేహాదికంబులు పాథేయంబు గాఁ దలఁచుచు బుద్ధిచే నాత్మతత్త్వంబు మఱచి వర్తించి పశుప్రాయుం డైస్త్రీకాముండు నగు ఇదియునుంగాక దక్షుం డచిర కాలంబున మేషముఖుండు నగు నని మఱియును.

మ. అనయంబుం దనమానసంబున నవిద్య న్ముఖ్యతత్త్వంబుఁ గా
     గని గౌరీశుఁ దిరస్కరించినయసత్కర్మాత్ము నీదక్షుఁ దా
     మనునర్తించినవారు సంస్మరణ కర్మారంభు లై నిచ్చలున్
     జననం బందుచుఁ జచ్చుచున్ మరల నోజం బుట్టుచున్ వర్తిలున్.

వ. అదియునుంగాక యీహరద్వేషు లైనద్విజు లర్థవాద బహుళంబు లైనవేద వాక్యంబులవలన మధుగంథసమంబయిన చిత్తక్షోభంబుచేత విమోహిత మనస్కులై కర్మాసక్తులగుదురు మఱియును భక్ష్యాభక్ష్య విచారశూన్యు లై దేహాదిపోషణంబు కొఱకు ధరింపఁబడు విద్యాతపోవ్రతంబుఁ గలవారయి ధన దేహేంద్రియంబులందుఁ బ్రీతిఁ బొంది యాచకు లై విహరింతురు అని నందికేశ్వరుండు బ్రాహ్మణుల శపియించె"

అనియున్న పయివాక్యములలో శివనింద లేదు సరికదా యట్టి శివనిందఁ జేయుబ్రాహ్మణులకు (అనఁగా వైష్ణవులకు) అఖండ మయిన శాపమును పెట్టినట్లు పోతనామాత్యుఁడు చెప్పియుండెను. అయిన నంతటితో నాగ్రంథంబు ముగియలేదు గావున ననంతరము వైష్ణవమతస్థుఁ డగునొకఋషి లేచి నందికేశ్వరు శాపంబునకుఁ బ్రతిహతముగా నతనిపక్షమువా రగుశైవులకు శాపముఁ బెట్టి యుండుటను వ్యక్తీకరిం చెడు. అదియును బోతనామాత్యుని నిష్పక్షపాతబుద్ధిని దెలియఁజేయునుగాని పోతనామాత్యునియెడల దోషారోపము చేయదు. ఆవాక్యము లెట్లున్న వనఁగా -

"వ. నందికేశ్వరు వచనంబులు విని భృగుమహాముని మరల శపియింపంబూని యిట్లనియె.

గీ. వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు వారు, వారి కనుకూలు లగుదు లెవ్వారు వార
    లట్టిసచ్ఛాస్త్రపరిపంథు లైనవారు, నవనిఁ బాషండు లయ్యెద రని శంపించె.

సీ. సకలవర్ణాశ్రమాచారహేతువు లోక,ములకు మంగళమార్గమును సనాత
    నము పూర్వఋషిసమ్మతము జనార్దనమూల, మును నిత్యమును శుద్ధమును శివంబు
    నార్యపథానుగం బగువేదమును విప్ర,గణము నిందించినకారణమున
    నేశివదీక్షయందేని మథ్యమపూజ్యుఁ, డైభూతపతి దైవ మగుచునుండు

తే. నందు మీరలు భస్మజటాస్థి ధార,ణములఁ దగి మూఢబుద్ధులు నష్టశౌచు
    లై నశింతురు పాషండు లగుచు ననుచు, శాప మొనరించె నాద్విజసత్తముండు.

వ. ఇ ట్ల న్యోన్యంబును శాపంబులం బొందియు భగవదనుగ్రహంబు గలవా రగుటంజేసి నాశంబు నొందరైరి."

అని చెప్పిన పోతనమాత్యు నెంతని కొనియాడవలయును ! ఇతఁ డొకఁడే యద్వైతి యని చెప్పవలదే ? శైవులకు వైష్ణవులును, వైష్ణవులకు శైవులును శాపము లిచ్చి రని చెప్పియు నీశాపము నిచ్చినవారిర్వురికంటెను దత్తన్మతప్రవర్తకు లధికు లగుభగవదవతారపురుషు లగుశివకేశవులు గావున వారివలన నిర్మింపఁబడినపాశుపత, పాంచరాత్రాగమ తంత్రమాహాత్మ్యంబు చెడక లోకంబున రెండును నేఁటివఱకును నిల్చియుండె ననుదాని నెంతసొగసుగ వ్యక్తీకరించెను ! ఇట్టిపోతనామాత్యునియెడ లోపముఁ దెల్పినవారు కేవలపాషండులే కానోవుదురు. అహా ! యది యట్లేగదా ! పోతనామాత్యుఁడు జన్మచేత శైవాచారపరుని కుమారుఁ డయినను [3] తనతాతముత్తాతల మతానుసారంబుగనే శైవమంత్రోపాసన మాత్రము చేయుచు లింగాంక నాది శైవాచార వర్జితుఁ డై సర్వాద్వైతమతస్థులవలె నుండెను. కావున నీకవికి శైవవైష్ణవమతభేదములు లేక యాయుభయ మతములను గూర్చి ప్రత్యేకించి చెప్పవలసివచ్చినప్పుడు వారిలో వా రెట్లుగాఁ జెప్పుకొనియెదరో అటులనే చెప్పుచు వచ్చెను. దూషణులు వచ్చినపుడు వారు పరస్పర మెట్లు చెప్పుకొనియెదరో అటులనే చెప్పుచు వచ్చెను. ఇది పూర్తిగా నూహింపఁజాలనిశైవు లెవరో యొకకొందఱు పోతనామాత్యుఁడు శైవుఁ డై యుండియును వైష్ణవగ్రంథము చెప్పుటయేకాక శివదూషణ కూడఁ జేసియున్నాఁడు. అట్టిదోషనివారణముం జేయుట కాతని పేరిటనే శైవప్రధానగ్రంథము నొకదానిం జేసి యుంచిన లెస్స యని యూహించి యీవీరభద్ర విజయగ్రంథమును రచియించి నట్లు తోఁచెడిని యాగ్రంథము రచియించిన కవి సాధారణముగా నయిన ఆంధ్రకవిత్వము చెప్ప లేనివాఁ డవుటం జేసియు కథాసందర్భములఁ బొందుపఱుపలేనివాఁ డవుటం జేసియు నాగ్రంథమును తుదకు హాస్యాస్పదముగా రచియించె. అటులనే కాకున్న నీగ్రంథము పోతనామాత్యకృతము కా దని భేదించి చెప్పుట కవకాశమే చిక్కకపోవును. వీరభద్ర విజయగ్రంథకర్త కేవల శైవుఁడే యౌటంజేసి భాగవతరచనాదక్షుఁ డగుపోతనామాత్యునకుంగూడ వీరభద్రోపాసన యున్నదనియు వీరమాహేశ్వరకరుణ కలదనియు, తద్వీరమాహేశ్వరప్రధానుం డగుయివటూరి సోమేశ్వరగురుని శిష్యుం డై యుండి వారియాజ్ఞానుసారముగా వీరభద్రవిజయ మనుశైవగ్రంథమును రచియించె ననియుఁ గథం గల్పించె. దీని కనుగుణముగా నుండునట్లే దక్షుఁడు కైలాసమునకుఁ బోవునపు డచ్చో జరిగినశాపాదికముల వదలివేసి మఱికొన్ని భాగములలోఁ బెంచి వ్రాసెను. ఆభాగంబుల వివరించెదను. వీరభద్రవిజయ ప్రథమశ్వాసమున దక్షుఁడు రజతగిరి కరిగినకథలో

"క. చని గిరిమంది, రసన్నిధి వినయంబున నిలిచి యున్న వేడుక నతఁడున్ !
     మునులను సంభావించిన, యనువునఁ దను గారవించె నప్పుడు కరుణన్.

వ. ఇట్లఖిలభువనాధీశ్వరుండు సంభావించిన.

ఉ. అద్దిర! శంకరుండు వినయంబున నా కెదు రేఁగుదెంచి నా
    పెద్దతనం బెఱింగి తనపెద్దఱికం బొకయించుకైన దా
    గ్రద్దనఁ జేయఁడయ్యె నట గౌరియు మన్ననసేయదయ్యె నీ
    పెద్దలు నవ్వ లాతిమునిబృందముచాట్పునఁ జేసి రిమ్మెయిన్.

క. అని తనపాలిటికర్మము పెనగొని తనచుట్టుముట్టి ప్రేరేపంగాఁ
    జెనటి యగుదక్షుఁ డప్పుడు మనమునఁ గోపంబునందమలహరు నిలిచెన్.

వ. ఇట్లు దేవదేవునిమహాత్మ్యంబు దెలియక వృథావైరంబున దక్షుం డటు వాసి చనియె నంత నమ్మహేశ్వరుఁ గొల్వవచ్చిన దేవేంద్రాది బృందారక సంఘంబులు పునః పునః ప్రణామంబు లాచరించి చనిరి తదనంతరంబ."

వెనుకటి భాగవతవృత్తాంత మంతయుఁ జదివినవారు దీని నేమని యూహించెదరో మన మాలోచింపవలసియున్నది. పోతనామాత్యుఁ డొక్కొకయంశంబుననే యేపురాణములో నేయేవిషయము లున్నవో అవియన్నియు నేకముఖము చేసి యథాస్థితి బయటఁబెట్టుటయందు కోర్కెగలవాఁ డని తోఁచక మానదు. ఇఁక వీరభద్రవిజయగ్రంథకర్త అట్టి సందియము లేకయే తన కిష్టమైన కథ లుంచి తక్కినవానిని వదలివేసినాఁ డని చెప్పక తప్పదు.

4. పైగ్రంథకర్త లిర్వురు నొక్కరు కా రని సూచించు నట్టి కొన్నిపద్యములు పార్వతీప్రయాణసమయములోనివానిం దెల్పెదను. అది చూచినవెంటనే పయికవు లిర్వురిలో సమయోచితవాక్కు లెట్లుగా నుండునో అదియును దెలియును. అపుడు కవుల భేదమును, కవిత్వభేదముం దెలియకపోదు. వీరభద్రవిజయమున దాక్షాయణి శివుని యనుజ్ఞ గోరఁగా నాయన యనుజ్ఞ యిచ్చినయనంతరవృత్తాంతము.

"గీ. అనుచుఁ జంద్రచూడుఁ డానతియిచ్చిన, శివుఁడు తన్ను వేఱుచేసె ననుచు
     ఫాలమందు పాణిపద్మముల్ ధరియించి, వెలఁది మ్రొక్కి నిలిచె వెఱపుతోడ.

మత్తకోకిల. తల్లి యాదిగఁ దండ్రి యాదిగఁ దాత యాదిగఁ గల్గువా
              రెల్లభంగుల నీవె కాని మహేశ యన్య మెఱుంగ నే
              నుల్లమందుల జిత్తగించితి నొప్పముల్ దగునయ్య యా
              ప్రల్లదుం డగు నాకుఁ దండ్రి భరంబు పల్కితి శంకరా.

మత్తకోకిల. శ్రీలలాటము సంఘటించిన చేతులాన వినావినీ
              లాలకర్మద భృంగముత్ నయనాదికల్వలు జక్కవల్
              పాలయిండ్లు మరాళముల్ గద భక్తి నీరుకడల్ దగన్
              గాలిఁగాఁ గలకంఠి నిల్చె కొలంకుభంగిఁ దలంచుచున్.

        వ. అప్పుడు దరహసితవదనుం డైయప్పరమేశ్వరుఁ డిట్లనియె.

ఉ. మాటలు సేయు నేమిటికి మాకడ నీవును నేము మీడకన్
    బాటలగంధి యుండుదము బాలకశబ్దము నర్థమట్ల నా
    మాటకుఁ దాఁట గా వలదు మన్నన నీచెలులెల్లఁ గొల్వఁగా
    బోటిరొ పొమ్ము నీజనకుపొందగునోమునకుం గుటుంబినీ.

చ. అని నియమించి శంభుఁడు గణాధిపులం బిలు పించి దక్షనం
    దన తనపుట్టినింటికిని ధన్యతఁ బోయెడు నోము చూడఁగా
    దినకరభాతిఁ బొల్చుతగుదివ్యవిమానముఁ దెండు రండు పొం
    డనపుడు వారుఁ దెచ్చి రతిహాటకదివ్యవిమానరాజమున్.

అనియున్నది. ఇంకభాగవతంబున నీకథాభాగంబుననే దీనినంతయు మఱొయొకవిధంబునఁ జెప్పుచున్నాఁడు - చతుర్థస్కంధములో శివుఁడు సతీదేవితోఁ జెప్పుచున్న వాక్యములలో

"వ. అదియునుంగాక నీ వతనికిం! బ్రత్యుత్థానాభివందనంబులు గావింపకుండుటం జేసి యతండు తిరస్కృతుం డయ్యె నంటివేని లోకంబుల జను లన్యోన్యమును ప్రత్యుత్థా నాభివందనంబులు గావింతురు అది ప్రాజ్ఞులయినవారు సర్వభూతాంతర్యామి యైన పరమపురుషుండు నిత్యపరిపూర్ణుండు గావునఁ గాయికవ్యాపారం బయు క్తం బని తదుద్దేశంబుగా మనంబునందు నమస్కారాదికములు గావింతురు కాని దేహాభిమానంబు గలుగుపురుషులందుఁ గావింపరు. కాన నేనును వాసుదేవశబ్దవాచ్యుండు శుద్ధసత్త్వమయుండు నంతః కరణంబునందు నాపరణవిరహితుం డయి ప్రకాశించు వాసుదేవునకు నాహృదయంబున నమస్కరింపుచుండుదు. ఇ ట్లనపరాది యై యున్న నన్ను పూర్వంబున బ్రహ్మాదులు సేయుసత్త్రంబునందు దురుక్తులంజేసి పరాభవించిన మద్ద్వేషి యైన దక్షుండు భవజ్జనకుం డయిన నతఁడును తదనువర్తులయినవారలును జూఁడదగరు గావున మద్వచనాతిక్రమంబునంజేసి యరిగితివేని యచట నీకుఁ బరాభవంబు సంప్రాప్తం బగు లోకంబున బంధుజనులవలనఁ బూజవడయక తిరస్కారము నొందుట చచ్చుటయకాదే యని పలికి మఱియు నభవుండు పొ మ్మని యనుజ్ఞయిచ్చిన నచ్చట నవమానంబునంజేసి యశుభం బగుననియు నిచ్చటఁ బొమ్మనక నివారించిన మనోవేదన యగు ననియు మనంబునఁ దలపోయుచు నూరకుండె నంత.

సీ. సతి సుహృద్దర్శ నేచ్ఛాప్రతికూల దుః,ఖస్వాంత యగుచు నంగములు వడఁక
    నందంద తొరఁగెడు నశ్రుతపూరంబులు, గండభాగంబులఁ గడలుకొనఁగ
    నున్నతస్తనమండలోపరిహారముల్, వేఁడినిట్టూర్పులవెచ్చఁ గంద
    నతిశోకరోషాకులాత్యంతదోధూయ, మాన మై హృదయంబు మలఁగుచుండ

తే. మఱియుఁ గుపితాత్మ యై స్వసమానరహితు, నాత్మదేహంబు సగ మిచ్చినట్టిధవుని
    విడిచి మూఢాత్మ యగుచు నవ్వెలఁది చనియె జనకుఁ జూచెడువేడుక సందడింప.

        వ. ఇ ట్లతిశీఘ్రగమనంబున.

సీ. మానిని చనుచుండ మణిమన్మదాది, సహస్రసంఖ్యాతరుద్రానుచరులు
    యక్షులు నిర్భయు లై వృషభేంద్రుని, ము న్నిడికొనుచు నమ్ముదిత దాల్చు
    కందుకాంజనశారికాతాళవృంతద,ర్పణధవళాతప్రతప్రసూన
    మాలికా సౌవర్ణమణివిభూషణఘన, సారకస్తూరికాచందనాది

తే. వస్తువులు గొంచు నేఁగి శర్వాణిఁ గదిసి, శంఖదుందుభివేణునిస్వనము లొప్ప
    మానితం బైనవృషభేంద్రయానఁ జేసి యజ్ఞభూమార్గు లై యర్థి నరిగి యరిగి."

అని యున్నది. పయిరెండుకథాసందర్భములఁ జూచినచోఁ గథాసందర్భ భేదము లుండుటయేకాక సందర్భోచితవర్ణన గలశైలి భాగవతములోనిది కా దనియు నాగ్రంథకర్త వియోగదుఃఖసమయములో నెట్టివర్ణన జేయవలయునో యిసుమంత యైనఁ దెలియని కేవలరసహీన హృదయము కలవాఁ డనియు నటుగావున నాతనికి 'రసమున కనుచితమగుపదవి రస మరీతి యనఁబరఁగు' అనునట్లుగా నాతనికవన మరీతిదోఁప యుక్త మై యుండు ననియుఁ జెప్ప నొప్పియున్నది.

5. ఇఁక దక్షుఁడు సతీదేవితోఁ జెప్పినవాక్యములు.

"క. నీనాయకుఁ డల్లుం డగు, కానీ నను ధిక్కరించెఁ గాన భవానీ
     మానుగఁ గనియును నీవును, కాననిగతి నుండనేల గర్వము నేలా.

క. చెలువా పిలువక ముందఱ, వలసరి మాయింటి కేల వచ్చితి చెపుమా
    పిలువని పేరంటము పని,గలవారును బోలెసిగ్గుగాదేరాఁగన్." వీర. వి. ఆశ్వా. 1.

అని యున్నపద్యములంబట్టి చూడ వీరభద్రవిజయగ్రంథకర్త కల్లునియెడఁ గోపము వచ్చియున్నపుడు కూఁతు నెట్లుగా గౌరవించవలయునో అపు డేయేమాటలు మాటలాడవలయునో లెస్సగా బోధయై యున్నది. ఇట్లుగాఁ బుట్టినయింటికిఁ గూఁతురు వచ్చినపుడు దుర్భాష లాడువాడుక బ్రాహ్మణాది అగ్రజాతులలో నూండక కేవల మతినీచజాతులలోఁగూడ నుండునో యుండదో యని యూహింపవలసిన దై యున్నది. తనయింటికిఁ గూఁతురు వచ్చినపుడు పలుకరింపకుండుటయే తండ్రికిఁ గలయసూయం దెలుపుట. అది యెఱిఁగియున్న భాగవతకవి యగు పోతనామాత్యునియట్టిపెద్దగృహస్థుఁడు దానినెట్లు వర్ణించెనో చూడుఁడు.

భాగవత చతుర్థ స్కంధమున దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు దాక్షాయణి పోవుట అనుకథలో

"వ. ఇట్లు కనుఁగొని యజ్ఞశాలం బ్రవేశించిన.

క. చనుదెంచిన యమ్మగువను, జననియు సోదరులు దక్క సభ గలజనులె
    ల్లను దక్షువలనిభయమున, ననయము నపు డాదరింపరైరి మహాత్మా.

క. మఱి తల్లియుఁ బినతల్లులు, పరిరంభణ మాదరింపఁ బరితోషాశ్రుల్
    దొరఁగఁగ డగ్గుత్తికతో, సరసిజముఖి సేమ మరయ సతి దానంతన్.

క. జనకుం డవమానించుట,యును సోదరు లర్థిఁ దనకు నుచితక్రియఁ జే
    సినపూజల నందక శో,భన మరసిన మాఱుమాట బలుకక యుండెన్."

అని యున్న పైపద్యమువలన భాగవతగ్రంథకర్తయొక్క మనోధర్మము బోధపడకమానదు. అది మొదలు సతీదేవి దేహము విడిచిన దనువఱకుఁ గలకథలో దక్షుఁడు మౌనముద్రాధారియై యుంచం బడెనే గాని యొక్క వాక్య మైన నల్పప్రసంగ మతనినోట నుండి వచ్చి నట్లుగాఁ జెప్పం బడదయ్యెను. తండ్రికిఁ గూఁతునెడలఁ గోపము లేక కేవల మల్లునియెడలనే కోప మున్నట్లుగాఁ జెప్పంబడెఁ గావునఁ గూఁతు నాతఁడు నిందించుట కవకాశము లేదు. ఇట్లు లేనిచో నిఁకఁ గూఁతునకు నల్లునియెడఁ గలుగు ననురాగాతిశయమునకు నిందింపవలయును గాని మఱియొకవిధమున నిందించుటకు వీలుపడదు. అది పతివ్రతాలక్షణమేకావున శ్లాఘ్యకార్య మని దక్షుండు కూఁతు నిందించినట్లు చెప్పంబడలేదు. ఇఁకఁ దనకూఁతు నుపేక్షించి యూరకొనుటలో నాపెకుఁ దండ్రి గౌరవము చూపకుంటకుఁ గారకుఁ డగునీశ్వరుఁ డట్టివృ త్తాంతము తదనుచరులవలన విని తనమూలముగాఁ దనభార్య కట్టియగౌరవము తటస్థించె నని సిగ్గుపడి అంతటినుండియైనఁ దనకు భయభక్తులు చూపు ననుతలంపుననైన యుండును. పై రెండుకథలం బరిశీలించినచో భాగవతగ్రంథకర్తయు, వీరభద్రవిజయగ్రంథకర్తయు నొక్క రని యెవరైనఁ జెప్ప గమకించెద రేమో నే నూహింపను.

6. సతీదేవి తండ్రితోఁ బల్కినపల్కులు.

సతీదేవి తండ్రివలన నవమానింపఁబడియెంగావున స్త్రీస్వభావముచేతఁ గోపించి తన పెనిమిటియెడలఁ గలమహత్త్వాదికమును దండ్రికిఁ దెల్పి అట్టివానితోడ విరోధము శ్రేయస్కరమైనది కా దనియు నందు మూలమునఁ గల్గెడులాభమునకంటె నష్టమే యెక్కువయైనదనియుఁ జెప్పుటయు లోకసామాన్యధర్మము. అందులో నాతఁడు భగవంతుఁడుగా సతీదేవి భావించుచున్నది కావున నట్టివారియెడలఁ గల్గునసూయమూలమున నైహికాముష్మికములు రెండును జెడు నని తండ్రికి నామె చెప్పుటయు నై సర్గికములే. ఇట్టిచోఁ బైయిర్వురుకవులు నెట్లుగాఁ బైవృత్తాంతముం జెప్పిరో చూచెదముగాక. వీరభద్రవిజయము ప్రథమాశ్వాసములో

"వ. అనవుడు నమ్మహాదేవి కోపవివశ యై యయ్యాగమంటపంబున శుభాసీను లై యున్న సభాసదుల వనలోకించి యిట్లనియె.

చ. నిగమములార ధర్మపదనిర్ణయులార మునీంద్రులార యో
     నిగమ మహాత్ములార భవనిర్ణయులార గిరీంద్రులార భూ
     గగన చరాదులార భవఖండనులార మునీంద్రులార యే
     నిగమములందుఁ జెప్పె శివనింద యెఱింగితి రేనిఁ జెప్పరే."

అని యొకపద్యమున్నది. పాఠకులారా! ముం దీపద్యప్రశంస జేయసెలవొసంగుఁడు. ఒక్కపద్యము పరికించినచో నీపద్యకవి భాగవతకవి యగుపోతనామాత్యుఁ డేమో మీకే బోధకాక మానదు. పోతనామాత్యుఁడు నిద్దురలో జెప్పినను నింతయభాగ్యకవనముం జెప్పఁడుగదా ! పైవచనములో నాయాగమంటపంబున శుభాసీను లై యున్న సభాసదుల నుద్దేశించి దాక్షాయణి చెప్పినవాక్య మనిగదా యున్నది. అటులైనచో నిగమములును గిరీంద్రులుగూడ నాసభలోనికి వచ్చి సుఖాసీను లై యున్నట్లుచెప్పెడు వివేకహీను లుందురా. గగన చరులారా యని చెప్పినఁ జాలకకావలయును గగనచరాదులార యని విశేషించి చెప్పె. ఇట్టి చేతగానిప్రయోగములు భాగవతకవి చెప్పె ననినచో మీ రామాటలకు నంగీకరించెదరా ? ఇట్లు చెప్పుచుఁ బైకథ కెడమగుచున్నారము. కావునఁ గథలోనికిం దిగుచున్నాఁడను, సభాసదుల నుద్దేశించి పల్కుచున్న వాక్య మంతలోనే దక్షునియెడ సమన్వయించఁబడి యీక్రిందిపద్యములు వ్రాయంబడినవి. ఎట్లన్నను :-

"ఉ. వేదములం దెఱింగినవివేకము లెక్కడఁ బోయె నేఁడు పు
      ణ్యోదయబుద్ధి యెం దణఁగియున్నది నేఁడు తలంపఁ, బొల్లయై,
      నీ దగుదక్షతాద్ఫుతము నీతియు నెక్కడ దాఁగె నేఁడు బ్ర
      హ్మాదులు బోనిప్రీతి యవి యారడివోయెనె నీకు నక్కటా.

శా. ఏరా దక్ష యదక్షమానస వృథా యీదూషణం బేలరా
     యోరీ పాపములెల్లఁ బోవిడువరా యుగ్రాక్షుఁ జేపట్టరా
     వైరం బొప్పదురా శివుం దలపరా వర్ణింపరా రాజితో
     త్కారాత్ముం డగునీలకంఠుఁ దెగడంగా రాదురా దుర్మతీ.

క. చదువుల నాలుగు శివుఁ గని, యెదఁ దలఁచుచు వెదకుఁగాని యెబ్భంగులఁ ద
    త్సదమలరూపము కావున, వదలినమతితోడఁ జిక్కు వలదుర దక్షా.

క. విశ్వములోపలఁ దనరెడు, శాశ్వత మగుశివునిమహిమ చెప్పఁగ నీకున్
    విశ్వాసంబునఁ జెల్లదు, యీశ్వరుమహిమాబ్ధి నీకు నెఱుఁగన్

క. ఈయొడలు రోఁతగాదే, పాయక పరమేశు నొంద పనిసేయంగా
    వేయును నేటికి మాటల, పోయెదురా కీడు నొందఁబూని దురాత్మా."

అను మొదలగుపద్యములు మఱికొన్ని యున్నవి. ఈపద్యములు చదివినమాత్రమున వీరభద్రవిజయగ్రంథకర్త కేవల నీచాతినీచుఁ డనియుఁ దలిదండ్రులు బిడ్డలు 'నీవు ఛీ అంటె నీవు ఛీ' "నీవురండా అంటే నీవు ముండా" అని వచియించుకొనుచు దినముల వెళ్లించునీచజాతులలోఁ బుట్టినవాఁడుగాఁ గానిపించును. ఓరీ దక్షా, విడువరా, చేపట్టరా, వైర మొప్పదురా, శివుని దలంపరా, వద్దురా, దుర్మతీ, దురాత్మా, అని యొక సంపన్నుని కూఁతురు విద్యాబుద్ధులు గల్గియుండిన తనతండ్రిం గూర్చి యిట్లుగాఁ దుచ్ఛనంబోదన లుంచి చెప్పునా అనుదాని నాలోచింపఁగా నీతండు భాగవ గ్రంథకర్త కాక మఱియొకఁ డని స్పష్టము కాక పోదు. ఇఁక భాగవతములో శివమహిమ జెప్ప లేదనియుఁ దాను వీరభద్రవిజయములో శివమహిమఁ జెప్పెద నని చెప్పినపద్యములు పై మూఁడుకందపద్యము లయియున్నవి. ఆపట్టున మఱికొన్ని పద్యము లున్నవి. అవియును గ్రంథకర్తకుఁ గలశివభక్తివిశేషములం దెల్పును. గాని శివతత్త్వప్రతిపాదకములుమాత్రము కావు. ఈవిషయములో మనయభిప్రాయముతోఁ బని లే దని భాగవతములోనిపోతనామాత్యవాక్య విశేషములనే చూపెదను. భాగవతము చతుర్థ స్కంధము సతీదేవి వాక్యములో

"వ. ఇట్లు తండ్రిచే నాదరింపఁబడనిదై విభుం డైనయీశ్వరునందు నాహ్వాన క్రియాశూన్యత్వరూపం బైన తిరస్కారంబున రుద్రాభావం బైనయజ్ఞంబు గనుంగొని నిజరోషానలంబున లోకంబులు భస్మంబు సేయంబూనిన తెఱంగున నుద్రేకించి రుద్రద్వేషియుఁ గ్రతుకర్మాభ్యాస గర్విష్ఠుండు నగుదక్షుని వధియింతు మనుచు లేచిన భూత గణంబుల నివారించి రోషావ్యక్త భావణంబుల నిట్లనియె. లోకంబున శరీరధారులైన జీవులకుఁ బ్రియాత్మకుం డైనయీశ్వరునకుఁ బ్రియాప్రియులు నధికులు లేరు. అట్టిసకలకారణుండు నిర్మత్సరుం డైనరుద్రునందు నీవుదక్క నెవ్వండు ప్రతికూలం బాచరింపఁడు. అదియునుం గాక మిముఁబోటివారలు పరులవలనిగుణంబులందు దుర్గుణంబుల నాపాదింతురు. మఱియుఁ గొందఱు మధ్యస్థు లైనవారలు పరులగుణంబులయందు దోషంబుల నాపాదింపరు. కొందఱు సాధువర్తనంబు గలవారలు పరులదోషంబులనైన గుణంబులుగా ననుగ్రహింతురు. మఱియుం గొంద ఱు త్తమో త్తములు పరులయందు దోషంబు నాపాదింపక తుచ్ఛగుణంబు గలిగినను సద్గుణంబులు గాఁ గైకొందురు. అట్టిమహాత్ముల యందు నీవు పాపబుద్ధి కల్పించితివి. అని వెండియు నిట్లను. మహాత్ము లగువారల పాదధూళిచే నిరస్తప్రభావు లై జడస్వభావంబు గలదేహంబు నాత్మ యని పల్కుకుజనులగువారు మహాత్ముల నిందించుట కార్యంబు గాదు. అదియు వారి కనుచితం బగు నని వెండియు నిట్లనియె.

సీ. అనయంబు శివ యనునక్షరద్వయమర్థి, వాక్కునఁ బలుక భావమునఁ దలఁప
    సర్వజీవులపాపసంఘముల్ చెడునట్టి, మహితాత్మునందు నమంగళుండ
    వగునీవు విద్వేషి వగుట కాశ్చర్యంబు నందెద వినుము నీ వదియుఁ గాక
    చర్చింప నెవ్వనిచరణపద్మంబుల, నరసి బహ్మానంద మనుమరంద

గీ. మతులభక్తిని దమహృదయంబులనెడి, తుమ్మెదలచేతఁ గ్రోలి సంతుష్టచిత్తు
    లగుదు రత్యంతవిజ్ఞాను లట్టిదేవు, నందు ద్రోహంబు చేసి తేమందు నిన్ను.

క. మఱియును నమ్మహితాత్ముని, చరణసరోజాతయుగము సకలజగంబుల్
    నెఱిఁగొలువఁ గోరుకోర్కులఁ, దఱమిడి వర్షించు నతనిఁ దగు నే తెగడన్.

చ. పఁరగఁ జితాస్థిభస్మనృకపాలజటాథరుఁడున్ పరేతభూ
    చరుఁడు పిశాచయుక్తుఁడని శర్వు నమంళు గాఁ దలంప రె
    వ్వరు నొకఁ డీవుదక్క మఱి వాక్పతిముఖ్యులు నమ్మహాత్మున
    చ్చరణసరోజరేణువులు సమ్మతిఁ దాల్తురు మస్తకంబులన్.

చ. నెలకొని ధర్మపాలనవినిర్మలు భర్గుఁ దిరస్కరించున
    క్కలుషునిజిహ్వఁ గోయఁదగుఁగా కటుసేయఁగ నోపఁడేనిఁదాఁ
    బొలియుట యొప్పు రెంటికిఁ బ్రభుత్వము చాలమిఁ గర్ణరంధ్రముల్
    బలువుగ మూసికొంచుఁ జనఁ బాడి యటందురు థర్మవర్తనుల్.

    వ. అది గావున.

మ. జునుఁ డజ్ఞానమునన్ భుజించిన జుగుప్సం బైనయన్నంబు స
      య్యన వెళ్లించి పవిత్రుఁ డైనగతి దుష్టాత్ముండ వై యీశ్వరున్
      ఘను నిందించిననీతనూభవ యనంగా నోర్వ నీ హేయభా
      జన మైనట్టిశరీరము న్విడిచి భాస్వచ్ఛుద్ధి వాటిల్లెదన్.

వ. అదియునుంగాక దేవతల కాకాశగమనంబును, మనుష్యులకు భూతలగమనంబును, స్వాభావికంబులైనట్లు ప్రవృత్తినివృత్తికర్మంబులు రాగవైరాగ్యాధికారంబులుగా వేదంబులు విధించుటంజేసి రాగయుక్తు లై కర్మతంత్రులైనసంసారులకు వైరాగ్య యుక్తులై యాత్మారాములైన యోగిజనులకు విధినిషేధరూపంబు లైనవైదికకర్మంబులు గలుగుటయులేకుండుటయు నైజంబులగుటంజేసి స్వధర్మనిష్ఠుఁడగువాని నిందింపంజన దాయుభయకర్మశూన్యుండు బ్రహ్మభూతుండు నైనసదాశివుని గ్రియాశూన్యుం డని నిందించుట పాపం బగుఁ దండ్రీ సంకల్పమాత్రప్రభవంబు లగుటంజేసి మహాజనయోగి సేవ్యంబు లైనయస్మదీయంబు లగు నణిమాద్యష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు. భవదీయంబు లగునైశ్వర్యంబులు ధూమమార్గప్రవృత్తు లై యా గాన్న భోక్తలైనవారిచేత యజ్ఞశాలయందె చాల నుతియింపంబడి యుండుఁగావున నీమనంబున నే నధికసంపన్నుండ ననియుఁ జితాభస్మాస్థిధారుం డైనరుద్రుండు దరిద్రుం డనియు గర్వింపఁ జన దని వెండియు నిటనియె.

ఉ. నీలగళాపరాధి యగునీకుఁ దనూభవనౌట చాలదా
    చాలుఁ గుమర్త్య నీదుతనుజాత ననన్ మది సిగ్గు పుట్టెడిన్
    జాలధరన్ మహాత్ములకుఁ జయ్యన నె గ్గొనరించుజన్మమున్
    గాలుపనే తలంప జనకా కుటిరాత్మక యెంచిచూడఁగన్.

చ. వరవృషకేతనుండు భగవంతుఁ డునైనహరుండు నన్ను నా
    దరపరిహాసవాక్యముల దక్షతనూభవ యంచుఁ బిల్వ నేఁ
    బురపురఁ బొక్కుచున్ ముదముఁ బొందక నర్మవచస్స్మితంబులన్
    దొరఁగుడు నీతనూజ ననుదుఃఖముకంటెనుఁ జచ్చు టొప్పగున్."

అని యున్నది. ఇట్లుగా నుండినకథాకల్పకు లిరువురిలోఁ గల్గువిశేషంబులు పాఠకులే యోచించెదరుగాక. భాగవతములోఁ బోతనామా

అనంతరకథావృత్తాంతము.

త్యుఁ డట్లుగాఁ బల్కుచు దాక్షాయణి యోగాగ్నిచే దగ్ధ మయ్యె ననియు నపుడు రుద్రాణితో వచ్చియున్న రుద్రపార్ష దులందఱును దక్షుని సంహరింప విజృంభించిన నధ్వర్యుం డగుభృహుమహర్షి యొకయభిచార హోమంబున ఋభునామధేయుల నగ్నికుండంబు నుండి యుదయింపం జేసిన వారు వచ్చి రుద్రపార్షదులఁ బాఱం దోలి రనియుఁ జెప్పి యా వృత్తాంతబంతయు నారదునివలన నా వెంటనే యీశ్వరుండుతెలిసికొని,

"శా. ఆద్యుం డుగ్రుఁడు నీలకంఠుఁ డిభదైత్యారాతి దష్టోష్ఠుఁడై
      మాద్యగ్భూరిమృగేంద్రఘోషమున భీమప్రక్రియన్ నవ్వుచున్
      విద్యుద్వహ్ని శిఖాసముచ్చయ రుచి న్వెల్గొందు చంచజ్జటన్
      సద్యఃక్రోధముతోడఁ బుచ్చి వయిచెన్ క్ష్మాచక్రమధ్యంబునన్."

అని యీశ్వరునకు దాక్షాయణీవృత్తాంత శ్రవణానంతరమునఁ గలిగిన కోపవిశేషమంతయు వర్ణించి చెప్పె. పిమ్మట నట్లుగాఁ బెఱికి వైచినజడయందు వీరభద్రావతారము కలిగినట్లును అతఁ డీశ్వరుని యెదుట నిలువంబడి కర్తవ్యం బడుగఁగా నీశ్వరశాసనంబుగా నీక్రింది పద్యంబు రచియింపఁబడినది. ఎట్లన్నను :-

"చ. గురుభుజశౌర్య భూరిరణకోవిద మద్భటకోటికెల్ల నీ
      వరయ వరూధినీవరుఁడ వై చని యజ్ఞముగూడ దక్షునిన్
      బరువడిఁ ద్రుంపు మీ వచట బ్రాహ్మణ తేజ మజేయమంటివే
      నరిది మదంశసంభవుఁడ వై తగునీకు నపాధ్య మెయ్యెడన్."

అని యిట్లుగా నాజ్ఞాపింపఁబడినవీరభద్రుం డట్టహాసంబున బయలువెడలి శివసేనాపరివృతుఁ డై దక్షయజ్ఞవాటంబునకు వచ్చి యజ్ఞంబుతోఁగూడ దక్షుని వధించి నిజనివాసం బయినకైలాసంబునకుఁ జనియె నని పోతనామాత్యుఁడు దక్షయజ్ఞపరిసమాప్తిం దెలిపెను.

వీరభద్రవిజయకథోపసంహారవిధానము.

"దాక్షాయణి దేహంబు దొరఁగిన యనంతరము తత్ప్రకారంబు వీక్షించి దక్ష సుఖమంటపంబున సుఖాసీను లై యున్న బ్రహ్మ విష్ణు సూర్య చంద్ర దేవేంద్ర దండధర వరుణ కుబేరాది దేవజనంబులు మహాభీతచిత్తులై మూర్తివంతంబు లైన మంత్రంబులు చాలించి పాపకర్ముం డగుదక్షుని నిందించి బ్రహ్మ తనలోకంబునకుఁ బోయె మఱియుఁ దక్కినవారందఱును దమతమనివాసంబులకుం జనిరి తత్సమయంబున"

అని యొకఘట్టము చెప్పంబడినది. దీనిలో నీగ్రంథకర్తవలన యజ్ఞసమాప్తి యెట్టులుగాఁ జేయంబడెననఁగా యజ్ఞశాలలో నొకశవంబు బడియెంగావున నక్కడిఋత్విక్కులందఱు నశుచికారణంబున మూర్తివంతులైనమంత్రంబులు చాలించి యాపాపాత్ము దిట్టుచుం దమతమనివాసంబులకుంజని రని చెప్పిన లోకాచారంబు ననుసరించి యుండు నని యూహించెంగాని యజ్ఞాదులు జరుగుచున్నపుడు యజమానికిని ఋత్విక్కులకును దీక్షామధ్యంబున నుండుటం జేసి అపభృథాంతమువఱకును జాతా శౌచామృతాశౌచంబులు పట్టకుండుట విధిగానిప్రారంభమైనయజ్ఞము పరిసమాప్తినొందింపక ఋత్విక్కులుగానీ యజమానిగానీ తమయిష్టానుసారము వదలివేసిపోఁగూడ దనువిధిగానీ తెలిసియుండలేదు. ఇవి సర్వద్విజులకును దెలియఁదగిన ధర్మంబులే కాని ఇట్టివానిలోఁగూడ నీవీర భద్రవిజయగ్రంథకవి పరాకు జెందినందులకు నాలోచించెదను. ఇప్పటి కీపూర్వపక్షము వదలెదను. ఇఁక నీశ్వరుఁడు సతీదేవివృత్తాంత మెఱింగినసందర్భముం బరిశీలింతము. అదియెట్లన్నను. -

"సీ. కైలాసగిరిమీఁద కరకంఠుఁ డొక నాఁడు, కరమొప్పఁ గొలువుండి గౌరిఁ దలఁచి
      యిదియేమి రా దయ్యె నియ్యేణలోచన, యని యవ్విధంబెల్ల నంత యెఱిఁగి
      సుందరి తనకుఁ గూర్చుటయెల్ల భావించి, శంభుండు మనమునఁ జాల నొచ్చి
      యిదియేమి తా నంపితిని దక్షునింటికి, మీనాక్షి తా నేల మేనువాసె

తే. పొలఁతి తన్ను నేను పొమ్మని తఱిమినఁ, బోవనొల్ల ననియెఁ బువ్వుబోఁడి
    పంకజాక్షి నొంటిఁ బంపినకతనఁగా, వెఱ్ఱితనము వచ్చె వేయునేల.

వ. అని మఱియును పరమేశ్వరుండు గౌరీదేవి ననంతకరుణామాసుం డై తలంచి వెండియుఁ దనమనంబున.

మ. పుడమిన్ రాజ్యముఁ గోలుపోయి తగ నేడ్పుం బొంది శోకించున
     జ్జడధీశాత్మకుఁ డైనయింద్రునకు దా జన్మించి రోషాంబుధిం
     బడ వైవస్వతమన్వు నాఁడు ముదమొప్పన్ రాజ్యముం జేయఁగా
     గడతేర్తు న్నని పాపదక్షునకు వేగన్ శాపమిచ్చెన్ వడిన్.

వ. ఇట్లు పరమేశుండు శాపంబిచ్చిన దక్షుండు తదీయప్రకారంబున నుండె నంత."

అని దక్షయజ్ఞ వృత్తాంతము ముగించఁబడినది. ఆహా! యేమి యీకవికథాసందర్భనైపుణి. రుద్రునంతటివానిభార్య నవమానించి చచ్చునట్లుగాఁ జేసినదక్షున కవుడే రుద్రునివలన శిక్ష కలుగునట్లుగా వచియింపఁబడక అనేక మన్వంతరము లైనపిమ్మట వచ్చెడువైవస్వతమనువు కాలములో నీదక్షు నీశ్వరుఁడు సంహరించెద నని చెప్పినట్లు కథ పొసఁ గించి తిరుగ దక్షునకు మఱియొక జన్మమును మఱియొక యజ్ఞమును గల్పించి అందులో నీశ్వరుఁడు ప్రస్తుత మన్వంతరములోఁ దక్షుఁడు జేసియున్న యపచారమునకుఁ గాఁ దనకు లేనిదీర్ఘక్రోధము మనసులో నుంచుకొని వీరభద్రుం బుట్టించి యతనివలన నానాఁటియజ్ఞమునకు వచ్చినదేవతలనందఱఁగూడ శిక్షించె నని చెప్పుట యెంతశ్లాఘనీయము ? పురాణములో నట్లుండెఁగావున నతఁడట్లుగాఁ జెప్పెనందు రేమో. భాగవతములోఁ బోతరా జాపురాణములఁ జూడకచెప్పెనా ? అట్లుగా నొకచోటఁ జెప్పి నం దర్భముం గుదిర్చిన పౌతరాజే మఱియొకగ్రంథములో నాకథనే సందర్భహీనముగాఁ జెప్పునా? కావున నీరెండుకథలును జెప్పినవా రొకరు కాక యిరువురు వేఱ్వేఱుకవు లని నిర్ణయించి యీగ్రంథము నవీన మనియుఁ గల్పితమనియు సిద్ధాంతీకరించెదను.

భోగినీదండకము.

ఇదివఱలో వీరభద్రవిజయ మీపోతరాజకృతంబు కా దని తగినయాధారము లుండుటంబట్టి నిష్కరించియుంటిమి. అటులనే నిష్కర్షింపవలసినయంశ మింకొకటి యున్నది. అది పోత రాజకృత మనిప్రసిద్ధి నొందిన 'భోగినీదండకము.' దీనిం బరిశీలింపఁ దగుగ్రంథములు లేవు. వేంకటగిరిసంస్థానచరిత్రములో నీక్రిందివిధంబుగా వివరింపఁబడియె. ఎట్లన్నను :-

"Biographical Sketches of the Rajahs of Venkatagiri by Mr. T. Rama Rao, in 1875, pages 26-27.

It is highly interesting to learn that the eldest of them (Sarvagna Singma Naidu) was greatly learned in Sanskrit literature, poetry, drama, logic, grammar and rhetoric and that he himself composed a work on the last-mentioned subject called "Singabhupaleyam" His Court is said to have been adorned by several poets among whom were Bammera Potarazu who translated 'Bhagavatam' in telugu, and Srinathudu, the telugu Transletor of 'Naishadham' Sarvagna Singama Naidu formed the subject of a Composition by the former called 'Bhogini Dandakam and of some stray verses by the latter."

పైదానిం బట్టి సర్వజ్ఞసింగమనీనివిశేషములు కొన్ని కానవచ్చును. అయితే దానిలో నతనిసభాపండితులలో భాగవత మాంధ్రీకరించిన బమ్మెరపోతరాజును, నైషధ మాంధ్రీకరించిన శ్రీనాథకవియు నున్నట్లును, పై యిర్వురిలోఁ బోతరాజు 'భోగినీదండకమును' శ్రీనాథుఁడు కొన్నిచాటుధారాపద్యములును సింగమనీనిపైఁ గృతియిచ్చినట్లుగా నున్నది. పైయిర్వురిలో శ్రీనాథకవి యీసింగమనీనిసభాసదులలోని వాఁడు కానట్లును పైగా నతనికి బలవద్వైరి యగుననవేమా రెడ్డియొక్క యాస్థానకవి యనియు నతనికార్యార్థమే సింగమనీనిం జూడఁబోయి దానిం జేసికొనుటకై అతనిపై రెండర్థములు కల్గునట్లుగాఁ బద్యములు చెప్పి, దానిలోనిసర్వజ్ఞశబ్దము గలపద్యములోఁ జేసినయపహాస్యాదిక మిదివఱలో శ్రీనాథకవిచరిత్రములో నావలన వ్రాయంబడినది. ఆకథ శ్రీనాథుఁడు సింగమనీఁడును సమకాలీను లని చెప్పుటకుఁ జాలునుగాని శ్రీనాథకవి సింగమనీనియాస్థానపండితుఁ డని సూచింపదు. అటువలెనే కూచిమంచి తిమ్మకవి చెప్పిన పద్యమును భాగవతములోఁ బోతరాజు చెప్పిన 'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి' అనుపద్యము పోతరాజు సింగనీని కాలీనుఁ డని తెల్పినను సింగమనీని పైఁ గృతియిచ్చి భోగినీదండకము చెప్పె ననుమాటను పూర్వపక్షము చేయుచున్నది. వీనికిఁ దోడుగా భోగినీదండకము చివర నున్న యీక్రిందిపద్యము మఱియొక పెద్దయనుమానమును కల్గించుచున్నది. ఆపద్య మెట్లన్నను :-

"ఉ. పండితకీర్తినీయుఁ డగుబమ్మెరపోతన యాసుధాంశుమా
      ర్తాండకులాచలాంబునిధితారక మై విలసిల్ల భోగినీ
      దండకమున్ రచించె బహుదానవిహర్తకు రావుసింగభూ
      మండలభర్తకున్ వినుతమానవ నాథమదాపహర్తకున్."

ఇ ట్లున్నపద్యమున పండితకీర్తనీయుఁడ నని బమ్మెరపోతన పై దండకమువంటిచిన్నవ్రాఁతకుఁగా నింతబిరుగాంకితము వేసికొని యింతగా ఆత్మస్తుతి చేసుకొనునా? యనియు నిది యొక గొప్పయంశ మని దీనికిఁగాను సర్వజ్ఞసింగనీనివంటి మహాపండితుఁడు కృతిపతిగా నుండఁగోరి పోతరాజువంటి వై రాగ్యసంపన్నుని అట్టి కవిత్వము చెప్పుట కుత్సహింపజేయుట కల్గునా యనియుఁ దోఁచుచున్నది.

సర్వజ్ఞసింగమనీనివంశస్థులే యగు మఱియొకకుటుంబమువారు గోదావరీ మండలములోని పిఠాపురములో నున్నారు.వారిగృహనామము రావువా రని వ్యవహరింపబడును. వారిలోఁగూడ నొకసామంత సంస్థాన మున్నది. వారు తమవంశావళిం బ్రకటించుచుఁ దమపూర్వుఁ డగు పై "సర్వజ్ఞసింగమనీని" వృత్తాంత మీక్రిందివిధమునఁ గొంత వ్రాసినారు. "(vide 'Row Vamsa Charitra Tilaka translated by one Nadakuditi Seetanna, printed and published in 1884) at page 16, we find the following ː- Anapotam Naidu had a son named Sarvagana Singama Naidu who was well versed in, as well as, in other branches of learning He collected a large army and conquered the ports of Methuku and Kylasa in the west and held them as Jaghire. He patronized many poets, Philosophers, and Metaphysicians of the day. Panditaraya, the celebrated Telugu translator of Naishadha and Kasikhanda, i. e., Sreenadha and several others were highly respected and honored."

పైగాథనుబట్టిచూడఁగాఁ బండితరాయలు నైషధ, కాశీఖండములఁ దెనిగించిన శ్రీనాథకవి మొదలగువారును సింగమనీనివలన గౌరవింపఁబడిన ట్లున్నది. కాని అతనియాస్థానవిద్వాంసులుగాఁ గానీ కవులుగాఁ గానీ యున్నట్లు కనఁబడదు. ఇదియునుగాక సింగమనీనికిఁ గల యబిరుచి సంస్కృతభాషలోఁగాని యాంధ్రంబునఁ గా దని అతనివలన రచితము లైనసింగభూపాలీయము నాటకపరిభాష మొదలగుగ్రంథములం బట్టి కాన్పించును. అట్టివాఁ డాంధ్రములో వారనారిపై నొకదండకముం జెప్పించి దానికిఁ దాను కృతిపతి యై యుండ నంగీకరించె నని పుట్టింపఁబడినకథయే పొసఁగియుండలేదు. ఆసింగమనీనియోగ్యతామహిమంబుల రెంటూరి రంగరాజకవి తనభానుమతీపరిణయగ్రంథములోఁ గృతిపతివంశాను వర్ణనములో నీక్రింది విధంబుగా వివరించె. ఎట్లనఁగా.

"సీ. ఏమహాసేనాని యిద్ధతేజోరాశి, హితధనంజయజయోన్నతి వహించె
      నేభోగిభూషణు హేలాధృతిగుణంబు, తుహినాప్తజాతసంస్తుతి భరించు
      నేహ స్తిబలహారి బాహువిక్రమలీల, గర్వాంధకచ్ఛదకలనఁ గాంచు
      నేమహాపతి ధర్ముసామోపయత్నంబు, సిద్ధసంకపరాజిని మెలంగు

గీ. వేసమాశ్రితవిద్యాధరేంద్రశక్తి, సుగుణగణపాలనార్చితస్ఫూర్తిఁ గాంచు
   నట్టిసర్వజ్ఞమూర్తి నా నలరుచుండుఁ, జిత్రకళమీఱి సర్వజ్ఞసింగశౌరి."

కూచిమంచి తిమ్మకవిసార్వభౌముఁడు తనలక్షణగ్రంథములో భాగవతగ్రంథము రచియించిన బమ్మెర పోతరాజునకును పైసింగమనీనికిని బలవద్విరోధంబు కలదనియు నాకారణమున నాపోతరాజకృతభాగవతమురూపుమాపఁదలంచి దానిని భూమిలోఁ బాఁతించెననియుఁ గావున నందులోని యనేక భాగములు ఖిలములైనవనియు నిట్టులే మఱికొన్ని వృత్తాంతంబులు చేర్చియొకపద్యము చెప్పె. దానింబట్టి చూడ నీపోతరాజునకును సింగమనీనికిం గల విహితవిశ్వాసములు బోధయగును. ఆపద్యానుసారముగాఁ జూచిన నాయిర్వురకును విరోధ మున్నట్లు కాన్పించునుగాని విహితమున్నట్లు కాన్పించదు. దానినూహించుటకుఁ బూర్వమాపద్యము నీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

"సీ. ఘనఁడు పోతనమంత్రి మును భాగవతము ర, చించి చక్రికిసమర్పించు నెడల
      సర్వజ్ఞసింగయక్ష్మావరుం డది దన, కిమ్మని వేడిన నీయకున్న
      నలిగి యాపుస్తకం బవనిఁ బాఁతించినఁ జివికి యం దొకకొంతశిథిలమయ్యె
      గ్రమ్మఱ నది వెలిగందలనారప, రాజును మఱి బొప్పరాజు గంగ
      రాజుమొదలగుకవివరుల్ దేజమెసగఁ, జెప్పి రాగ్రంథములయందె తప్పలొదెవెఁ
      గాని పోతకవీంద్రునికవనమందు, లక్షణం బెందుఁ దప్పునా దక్షహరణ."

దీనింబట్టిచూడ సింగమనీనికిని పోతరాజునకు నెట్టిస్నేహ మున్నదో చూడనగును. ఈపద్యమునం గలలక్షణము(దీని పే రేలక్షణసారసంగ్రహము) తిమ్మకవివలన శా. సం. 1662 అనఁగా క్రీ. శ. 1740 నకు సరి యగురౌద్రిసంవత్సరమున రచియింపఁబడియె. దీనికి వ్యతిరేకముగా ఆ. 1860 సంవత్సరప్రాంతమున ఆంధ్రభాగవతమును ముద్రించినపండితులు పోతరాజు జన్మకర్మములు దెల్పు ననువచనగ్రంథమునుండి తాము పరిశోధించి వ్రాసితి మని కొన్ని క్రొత్తమాటలు వ్రాసిరి. దాని వివర మీవఱకే చేసియున్నాను. పై రెండుకథలలోఁ దిమ్మకవి వ్రాసినదే మధ్యాంధ్రమండలము నాఁ బరఁగువేంగీదేశములో వ్యాప్తమై యున్నది. తిమ్మకవినాఁటికే పైసర్వజ్ఞసింగమనీనికథ ప్రాచీనము. అట్లుండఁగా నాంధ్రభాగవతము ముద్రించినవారు మఱి నూటయిరువది సంవత్సరముల యనంతరకాలములోఁ దా మెద్దియో పోతరాజు జన్మకర్మములఁ దెలుప నున్న వచనగ్రంథముందెచ్చి తాము పరిశీలించితి మని మూలగ్రంథమును బ్రకటింపకయే వ్రాసినమాటలను నమ్ముట యుక్తియుక్తముగాఁ గాన్పించదు. కావున సింగమనీనికిని పోతరాజునకును విహితవిశ్వాసములు లే వనియే నిశ్చయింపవలసి యున్నది. సర్వజ్ఞసింగమనీఁడు పోతరాజును భాగవతము తనకుఁ గృతియిమ్మని యడుగుటయు దానిని స్పష్టముగా నీయనని పోతన తిరస్కరించెననుటయు యు క్తియుక్తముగాఁ గాన్పించదు. లోకములోఁ గవులు తాము గ్రంథములు రచియించి ప్రభువులపైఁ గృతినీయ ననుగ్రహింపుఁ డని యాశ్రయించుటయు, నట్టిగ్రంథముల గృతినంద నిష్టము గలవారు ఆగ్రంథమునకుఁ దగు సత్కార మెంతో దానిం జేయుటకుఁ తమరు చాలియుందురో లేదో చూచుకొనుటయు, నట్టిగొప్పవ్యయ మవశ్యమో కాదో చూచుకొని యనంతర మట్టి గ్రంథము నందలేమని చెప్పుటయును కవి కది సమ్మతము కానియెడల నాప్రభువును వదలి మఱియొకప్రభువు నాశ్రయించుటయు నున్నది కాని సింగమనీనివలె నొక గ్రంథము నాకుఁ గృతియియ్యవలె నని స్వయముగ యాచించుటయు, నట్లు యాచించు ప్రభుని నీ వీగ్రంథమునకుఁ గృతిపతివి కాఁదగవు కావున నే నీయను పొమ్మని పోతన మూర్ఖించి చెప్పుటయు లోకానుభవవ్యతిరేకమై యున్నది. ఇటులఁ గానిచో గ్రంథమెందులకు బహుకవికృతమై యున్న దని ప్రశ్నము పుట్టఁగలదు. ఆప్రశ్నమున కీవఱకే కొంత యూహించి వ్రాసితిమి. గ్రంథము బాహుళ్య మైనది కావునఁ బోతరాజే తాఁగొన్నిస్కంధములును దనశిష్యులు కొన్నిస్కంధములు విభజిం చి కొని ముగించినట్లు తోఁచెడిని. దానికి దృష్టాంతముగాఁ గేవలము వేదాంతరహస్య ప్రతిపాదకంబు లగు ద్వితీయ స్కంధము మొదలగువేతాంతభాగములును ప్రహ్లాదచరిత్రము గజేంద్రమోక్షణము, శ్రీరామ చరిత్రము, దశమస్కంధపూర్వభాగము సత్యభామయుద్ధము మొదలగు ప్రసిద్ధకథలన్నియుఁ బోతరాజ కృతములే యగుటయు సామాన్యకథా భాగములుమాత్రమే తచ్ఛిష్యకృతము లగుటయుఁ గాన్పించుకావున పోతన తనకిష్ట మైనభాగములును ననశిష్యులకు లొంగనిభాగములను దా స్వయముగాఁ గైకొని యాంధ్రీకరించిన ట్లూహించుటయే యుక్తి యుక్తముగా నున్నది. ఇఁక భాగవతమును సింగమనీఁడు పాఁతివేయించిన మాటయే నిజమేని దానికారణ మూహింతము. దానికొకకారణ మూహింప దగియున్నది. అదిప్రాచీనులలోఁ బెక్కండ్రకుఁ గలసామాన్య గుణవిశేషమై యున్నది. ఏమియనగా సింగమనీఁడు కేవలము సంస్కృత భాషాభిమాని భాగవతము కేవలరహస్యార్థప్రతిపాదక సంస్కృతగ్రంథము కావున దానిని పురాణకవులు వదలిరి. అట్టిగ్రంథమును దెనిఁగించుపోత రాజున కా కాలములో నెంతమంచియుద్దేశమున్నను భాగవతము దెనిఁగించు టనునది సంస్కృతాభిమానుల కందఱకు మిగులఁ గోపకారణముగా నుండకపోదు. అట్టిపండితు లుత్సహింపఁ జేయఁగా గనలినట్టియుఁ దాను స్వయముగా సంస్కృ తాభిమానియు నగుసింగమనీఁడు ప్రభుఁడై యుండుటంబట్టి, దుష్కార్య మని తా నూహించుదానిని నివారింపయత్నించుట కేల సంశయించును? కావునఁ దనయుద్దేశానుసారముఁగా బోతనకృత మగుగ్రంథము నశింపఁ జేయఁగోరి యప్పటికిఁ దోఁచినవిధముగ నాగ్రంథంబు భూస్థాపితము జేయించియుండును. అతఁడు ప్రభుండుగావున నాతనియాజ్ఞ చెల్లక తప్పదాయె. దానిం జరిగించిన పిమ్మట నాగ్రంథమందును, కవియగు పోత రాజునందును నభిమానము గలవారు దానిని రహస్యంబుగనైనఁ బయటికిఁ దీసి సింగమనీనికాలములోఁ దిరుగ దాని వ్యాపింపఁ జేయక యుంచవచ్చును. అతని యనంతర మతనిశిష్యు లాగ్రంథమున కనేకప్రతులు వ్రాసి వాని నొక్కమాఱుగ దేశమునం దంతట వ్యాపింపఁ జేసి యుండవచ్చును. ఇట్లైన భాగవతగ్రంథముద్రణకర్తలు వ్రాసినదానిలోఁ జాలభాగము యథార్థముగానుండె నని తలంచవచ్చును. అటుగానినాఁడు రెండుకథలును విశ్వాసపాత్రములు కాక చెడును. ఇట్లున్న పై వ్యాసముం జూచిన పిమ్మటనైన "భోగినీదండకము" సింగమనీని కోర్కె పైఁ బోతరాజువలన రచియింపంబడి, యాతనికిఁ గృతియీఁ బడె ననుమాట పూర్వపక్షమతములోనిదిగాఁ బాఠకులు భావింతు రని నమ్ముచున్నాఁడను.

  1. గీ. జ్ఞాతివైరంబు నంది ప్రాసంబులందు, విశ్రమములందుఁ దమలోన వేఱు గలిగి దేవ దానవులట్లన తెనుఁగులందు,మించి రేఫఱకారముల్ మెఱయుఁ గృష్ణ. అ. క.
  2. చేఱఁగుశబ్దము లఘురేఫ ముంచి వ్రాసె. దాని కితరలాక్షణికులు సమ్మతింపరైరి.
  3. పోతనామాత్యుని తండ్రినాఁడే శైవశాస్త్రమతము కల్గెనని భాగవతములోఁ బోతనామాత్యునిచేతనే 'మనియె శైవశాస్త్రమతముఁ గనియె' అని చెప్పఁబడియె.