కవి జీవితములు/పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య
చిత్రభారతము" అనుమఱిరెండుగ్రంథములకుఁ గవు లగు "పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య, చరికొండ తమ్మన్న" అనువారి చరిత్రములు వ్రాయవలసి యున్నది. కాని హరివంశమును దెనిఁగించిన నాచనసోమనాథుఁ డను మఱియొకకవిచరిత్రమునుగూడ వ్రాయవలసియుండును. అతనికిఁ బ్రత్యేకము చారిత్రము వ్యాపకములో లేకయుండుటంబట్టి యతనికులగోత్రములు మఱికొందఱిచే నీవఱకే వ్రాయఁబడుటంబట్టియు నట్టివారిని చరిత్రములు గలవారితో పాటుగ వివరింపఁజాలను. ఇతనివలెనే చిత్రభారతమును రచియించిన చరికొండతిమ్మనకవియు నున్నాఁడు. కావున నతని చారిత్రమును వ్రాయఁబడలేదు. పైయిర్వురిపేరులును స్మరియించి చారిత్రవిశేషములు గలజైమినీభారతగ్రంథకర్త యగుపిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్యంగూర్చి మాత్ర మిపుడు వ్రాసెదను.
కవిజీవితములు.
5.
పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.
ఇతఁడు నియోగిశాఖాబ్రాహ్మణుఁడు. తండ్రిపేరు గాదయమంత్రి. అన్న పేరు పెదవీరభద్రయ్య. ఇతఁడు సాళువగుండ నృపాలుని యాస్థానపండితుఁడు. ఈరాజు సభ్యులం జూచి జైమినిభారత మాంధ్రీకరించుటకుఁ దగువార లెవ్వ రని యడుగఁగా నాపండితులు పినవీరభద్రయ్యవంశవిశేషముల నీక్రిందివిధమున వర్ణించిరి. ఎట్లన్నను :-
సీ. అమృతాంశుమండలం బాలవాలము గాఁగ, ములిచె నొక్కటి జగన్మోహనముగఁ,
జిగిరించె విలయసింధుగతకైతవడింభ, శయనీయవరపలాశములతోడఁ
బితృ దేవతులకు సంచితసత్త్రశాలయై, చెట్టు గట్టెను గయాక్షేత్రసీమ
నిలువ నీడయ్యె నిందీవరప్రియకళా, కోటీరునకు భోగికుండలునకు
తే. మఱ్ఱిసూత్రంబె పిల్లలమఱ్ఱిపేరు, పేరువలెఁ గాదు శారదాపీఠకంబు
వారిలోపలఁ బినవీరువాక్యసరణి, సరసులకు నెల్లఁ గర్ణరసాయనంబు.
అనుదీనింబట్టి యితనివంశముయొక్కనామము పిల్లలమఱ్ఱివారనియును, అది శారదాపీఠ మగుమఱ్ఱి యనియును, అం దనేకులు కవులుండిరనియును, వారియందఱలో నీ పినవీరన (పినవీరభద్రకవి) యొక్క వాక్యరచన సరసకర్ణ రసాయనం బనియును దేలినది. పైపద్యములో నీ కవివంశమువారిలోఁ బెక్కండ్రు కవులున్నా రని చెప్పినచో నితనితండ్రి తాతలు కవు లగుదురో కారో యనుశంక కల్గు నని నిశ్చయించుకొని సభ్యు లీక్రిందివిధంబుగ నింకొకపద్యముం జెప్పిరి. ఎట్లన్నను :-
క. తాతయుఁ దండ్రియు నగ్ర, భ్రాతయునుం దాను భువనభాసురకృతిని
ర్మాతలు పిల్లలమఱ్ఱి వి, ఖ్యాతునిఁ బినవీరుఁ బోలఁగలరే సుకవుల్.
ఇ ట్లీపద్యమున ననుస్యూతముగఁ బినవీరనవంశమునఁ గవు లున్నా రని తెల్పుట వీరనకవిత్వము సంప్రదాయసిద్ధ మైన దనియును ఆవిషయమై శంకింపవలసిన యవసరముండ దనియును రాజునకు విస్పష్ట మగుటకుఁగా నై యున్నది.
కాలనిర్ణయము.
ఇఁకఁ బినవీరనకవియొక్క కాలము నిర్ణయింపవలసియున్నది. అది రెండువిధములుగనై యుండును. అందు మొదటిది యితనిప్రభుం డగు గుండమరాజు కాలవిజ్ఞానము. రెండవది పినవీరనతో సమకాలీనుల గాలవిజ్ఞానము. ఇందు మొదటిది కష్టసాధ్య మగునదియును, రెండవది మిక్కిలి సులభ మైనదియు నై యున్నది. కావున రెండవదానింబట్టి దీనిని నిర్ణయించెదను.
ఆశ్వాసాంతగద్యములో :-
"ఇది భారతీతీర్థ శ్రీచరణకరుణాపాత్ర గాదయామాత్యపుత్త్ర వినయవిద్యా సముద్ర, పినవీరభద్రప్రణీతం బైన జైమినిభారతము"
అని చెప్పియుండెను. కావున నీతఁడు భారతీతీర్థుల శిష్యుఁడు. అట్లగుటచేఁ బినవీరన యతనిసమకాలీనుఁడే కదా. ఇఁక భారతీతీర్థుల కాల మెప్పటిదో తెలియవలయును. భారతీతీర్థులకాలము.
భారతీతీర్థులకాలమును నిర్ణయించుటకుఁ బూర్వము భారతీతీర్థులవృత్తాంతము చెప్పవలసి యుండును. ఇతఁడు శృంగేరిలోని జగద్గురుపరంపరలోని వాఁడును, వేదభాష్యకారుఁ డగుమాధవామాత్యాపరనామవిద్యారణ్యులతమ్ముండును నై యున్నాఁడు. ఇతనికే భారతీ తీర్థు లనియు, భారతీకృష్ణతీర్థు లనునామములు గలవు. జగద్గురుపీఠములోనివిద్యాశంకరున కీతఁడు ప్రథమశిష్యుఁడు. ఇతనియనంతరము విద్యారణ్యులు విద్యాశంకరస్వామిశిష్యుఁ డయ్యెను. అందుకుఁ గారణములు నావిద్యారణ్యచరిత్రములోఁ జూడం దగును, భారతీతీర్థులు యోగమార్గప్రవర్తకుఁడును, విద్యారణ్యులు కర్మబ్రహ్మమార్గ ప్రవర్తకుఁడునునై యున్నారు. ఈయిర్వురుం గలిసి యద్వైతమునకుఁ బ్రకరణగ్రంథ మగు పంచదశప్రకరణము అనుగ్రంథమును రచించిరి. భారతీతీర్థులు శా. సం. 1250 సన్న్యాసాశ్రమము గైకొని శా. సం. 1302 న సిద్ధి నొందెను. పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్యయు నీభారతీతీర్థుల శిష్యుఁడు గావున నించుమించుగ నీకాలమువాఁడే అని నిర్ణ యింపవలసి యున్నది.
పినవీరనశాస్త్రపాండిత్యాదికము.
ఇతఁడు భారతీతీర్థులశిష్యుం డగుటచేత యోగాభ్యాసపాటవంబు గలవాఁ డని చెప్పవలసియున్నది. యోగసిద్ధుఁ డనియునుఁ బ్రతీతి గలదు. పైభారతీతీర్థులు శృంగగిరిజగద్గురుపరంపరలోనివాఁడే అని చెప్పుటకు నీపినవీరనకవివలనఁ జేయంబడినభారతీవర్ణ నముచేతను పండితు లీతనివంశనామ మగు "పిల్లలమఱ్ఱి" అనుదానిని శారదాపీఠమని చెప్పుటచేతను నూహింపనై యున్నది. అందు సరస్వతీవర్ణన మెట్లన్నను :-
సీ. ప్రణవపీఠమున మంత్రపరంపరలు గొల్వ, నుండు నేదేవిపేరోలగంబు
భావజ్ఞులకుఁ బరాపశ్యంతిమథ్యమా, వైఖరు లేదేవివర్ణ సరణి
జపహారకీరపుస్తకవిపంచిసమంచి,తంబు లేదేవిహస్తాంబుజములు
కుందేందుమందారకందళీబృందంబు, చంద మేదేవియానందమూర్తి
గీ. కాంచె నేదేవి కాంచన గర్భచతుర, పూర్వదంతకవాట విస్ఫుటమనోజ్ఞ
చంద్రకాంతశిరోగృహ స్థలవిహార, మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు.
అనియుండెను. కావున నీతఁ డుపాసించుదేవత యగుభారతి జగద్గురుశారదాపీఠవర్తిని యనియు, నట్టిభారతి నుపాసించిన భారతీతీర్థులే పినవీరనకు గురుఁ డనియును, పినవీరనకుఁ గల్గిన జ్ఞానవిశేషమున కాదేవతో పాసనయే కారణ మనియునుఁ జెప్పఁదగి యున్నది. ఇంతియకాక పైవర్ణనమును క్రిందిపద్యమును బరిశీలింపఁగాఁ బినవీరన మంత్రయోగ రహస్యములుగూడఁ బెక్కులు తెలిసినవాఁడుగాఁ గాన్పించును. ఆపద్య మెట్లన్నను :-
గీ. కరముగా భారతీ తీర్థగురుకృపాస, మిద్ధసారస్వతుఁడు సత్కవీంద్రహితుఁడు.
పై భారతీతీర్థులు శా. సం. 1250 లోఁ దురీయాశ్రమమును స్వీకరించి శా. సం. 1302 లో సిద్ధినందినట్లు శృంగేరిజగద్గురుపీఠాధిరోహణనిర్ణయపట్టికలో నున్నది. దాని నే నీవఱ కాచార్యకల్పవల్లిలోఁ బ్రచురించియున్నాఁడను. పినవీరన భారతీతీర్థులచరమకాలములో యోగోపదేశము నందియుండు నని తోఁచెడిని. అప్పటి కీతఁడు మిక్కిలి బాల్యవయస్సున నుండి యుండును. కావున నీపినవీరన శా. సం. 1300 మొదలు శా. సం. 1350 వఱకుఁ గలకాలమువాఁ డని నిర్ణయించెదను.
పినవీరన కుకవులయెడ మిగుల భీకరుఁడై యున్నట్లు పైగీతపద్యములోనియుత్తరార్థమువలనం గాన్పించును. అదియెట్లన్నను :-
"కుకవిమూర్ధ విలుంఠనకులిశహస్త, పల్లవుఁడు చెప్పెఁ బినవీరభద్రసుకవి.
పినవీరభద్రయ్యగోత్రవిషయము.
దీనింగూర్చి పినవీరభద్రకవిచే నేమియుఁ జెప్పఁబడదయ్యెను. కాని యతఁ డాంధ్రకవులంగూర్చి వర్ణించుచు వ్రాసినపద్యమువలన నీతనిగోత్ర మూహింపఁదగి యున్నది. ఎట్లన్నను :మ. కవులన్ బంకజగర్భసన్నిభుల వక్కాణింతు వల్మీక సం
భవునిన్ వ్యాసునిఁ గాళిదాసు బిలహున్ బాణున్ ముయూరున్ శకున్
భవభూతిన్ శివభద్రు మల్హణుని ఘంటామాఘునిం జోరు భా
రవి మానన్న యభట్టుఁ దిక్కకవి నేఱాప్రగ్గడన్ సోమునిన్.
అనుపద్యములోని "మా" అనుదానింబట్టి చూడ నన్న యభట్టును పినవీరనయొక్కవంశమువారును నొక్కగోత్రమువా రై యుందురనియుఁ జెప్ప నొప్పి యున్నది. నన్న యభట్టుది భారద్వాజసగోత్రము కావునఁ బినవీరనగోత్రమును నదియే యని యూహింప నై యున్నది.
జైమినిభారతరచనావిషయము.
ఇందువిషయమై లోకమునఁ గలప్రతీతిని గధాసందర్భములో వివరించెదను. కాని యితనిగ్రంథములో వక్కాణింపఁబడిన వృత్తాంతము ముఖ్యముగ నమ్మఁదగియుండు నని యెంచి దాని నీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-
"ఆ రాజపరమేశ్వరుండు (సాళ్వగుండ నరసభూపాలుఁడు) ఒక్క నాఁడు ........... యర్హాసనసమాసన్న రాజన్యశిరఃప్రసవవాసనా ముద్రితం బైనభద్రాసనంబునఁ బేరోలగం బుండి పురాణేతిహాసకథాప్రసంగంబుల వినోదించుచు :-
క. నా మది నిరతము భారత, రామాయణకథలఁ బ్రేమ రంజిలు నందున్
జైమినిభారత మనఁగా, భూమి నపూర్వము పురాణముల గణియింపన్.
గీ. ఆపురాణంబుఁ గనఁ దెనుఁగయ్యనేనిఁ, జెప్ప నేర్చినకవియుఁ బ్రసిద్ధుఁడేని
తెనుఁగు నుడికారమున మించుఁ గనియె నేని, కుందనముకమ్మ వలచినచందమగును.
వ. అని సభాసదులమొగంబులు చూడ నవధరించిన నా రాజసత్తముచిత్తం బెఱింగి వారిట్లని విన్నఁ వించిరి.
క. ఏరీతి నెఱిఁగెనో పిన, వీరన దేవరతలంపు విఖ్యాతము గాఁ
బేరును బె ట్టిదియును దన, పేరుగ రచియింపఁ బూనెఁ బేశలఫణితిన్.
క. అని విన్న పంబుఁ జేసిన, ననుఁ గనుఁగొని యలరి నాథనంబు ఋణము గాఁ
దినక యుపార్జించె యశో, థన మిటు గావలదె యాశ్రితత్వం బనుచున్.
క. దరహాసరసముఁ దాంబూ, లరసముఁ గప్పురపుఁబల్కులం గుంకుమపూ
బెరసినగతిఁ దోపఁగఁ సా, దరముగ నిట్లనియె భారతజ్ఞులతోడన్.
ఉ. అల్లన విచ్చు చెంగలువలందురజంబును గప్పురంబుఁ బైఁ
జిల్లఁగఁ జల్లనై వలచుసౌరభముల్ వెదఁజల్లుభావముల్
పల్లవహస్తచన్నుఁగవపయ్యెదజీబుగఁ దోఁచుభాతిగాఁ
బిల్లలమఱ్ఱివీరన యభిజ్ఞుఁడు చెప్పఁగ నేర్చుఁ గల్పనల్
వ. అని సమీపంబునఁ గొలిచియున్న నన్నుం గృపాతరంగితాసాంగంబున విలోకించి మామక మనోరథు బెఱింగినట్లు చెప్ప నుద్యోగించితివి హృద్యానవద్యగద్యపద్యామ బంధంబు గాఁ బ్రబంధం బంధ్రబాషను జైమినిభారతంబునం దశ్వమేధపర్వంబు నిర్విఘ్నంబుగా రచియింపు మని యానతిచ్చినఁ బ్రసాదం బని యంగీకరించితిని".
అని యున్నది. ఈపైపద్యములు పినవీరనను రాజు అతని గ్రంథరచనకై ప్రేరేపించకపూర్వమే జైమినిభారతగ్రంథరచన చేయుచుండెనని తెల్పుటయేకాక అతని కవిత్వమునందుఁ గలవిశేషములను భావస్ఫుటము చేయుటయందుఁ గలసామర్థ్యాదులంగూడఁ జూపును. అందులో "నల్లన విచ్చు చెంగలువ" లనుపద్యములోఁ జెప్పినవిధముగ నీతనికవిత్వము, వినిన మాత్రనే హృదయాహ్లాదకర మనియునుఁ దెల్పఁబడియె. ఇట్టికవిత్వములోఁగూడఁ గథానుసారమైన కాఠిన్యములు కొన్నిచోట్లఁ గానుపించును. ఎట్లైనను మెట్టున నీపినవీరభద్రుఁడు ముక్కుతిమ్మన మొదలగు వారివలె మిక్కిలి మృదుమధురవాక్కులు గలకవిగా నెన్న వలసి యుండును. ఇతఁడు శ్రీనాథునికంటెఁ గొంచెము చిన్న వాఁ డై యున్నట్లు గాఁ గనుపించును. ఆవివరము శ్రీనాథునికవిత్వముతోఁ జూపి యుంటిని గావున నావిషయమై యిందు విశేషించి వ్రాయక లోకము వాడుకనుబట్టి యితనికవిత్వమహత్త్వాదుల నీక్రిందిభాగములో వివరించెదను.
లోకమువాడుకంబట్టినపినవీరభద్రయ్య చర్యలు.
ఇతఁ డాకాలపుఁ బండితులలోఁ బ్రసిద్ధుఁడు. మిక్కిలి బాలుం డై వీథులలో నాడుకొనుచున్న సమయమందు నీతనిప్రతిభావిశేషంబులు పండితులకు నచ్చెరువుఁ బుట్టించుచుండును. ఇట్టిసమయంబుననే
శ్రీనాథుఁడు తన నైషధ మీతనికడకుఁ దెచ్చెను. అపు డతఁడు బాల్య చాపలంబునఁ జెలికాండ్రతో నాడుకొనుచుండెను. ఇతఁడే పినవీరన యగు నని నిశ్చయింప లేక శ్రీనాథుఁడు పినవీరన యెచ్చో నున్నాఁ డని నంప్రశ్నంబు చేసెను. దానిని విని పినవీరనవృత్తాంతమున కేమి గాని నీ వెవ్వండవో యాతనితో నీకుం గల్గుకార్యం బెద్దియో ముందుగఁ దెల్పు మని యడిగెను. అంతటితో నైన నతఁ డితఁడే యని గ్రహింపక వీరనతో నాకొకకార్యంబు గల దని శ్రీనాథుఁడు చెప్పెను. ఆమాట విని వీరనతోఁ గల్గుకార్యంబు నాకుఁ జెప్పునగత్యంబు నీకు లేదు కాని వీరన యెచ్చో నున్నాఁడో దానిఁ దెల్పునగత్యంబు నాకే విశేషంబై యున్నదా ? యేమి ? అనుడు శ్రీనాథుం డాబాలుఁడే వీరన యగు నని యెంచి తాను వచ్చినకార్యము నివేదించెను.
శ్రీనాథుఁడు నైషధముం జూపుట.
శ్రీనాథుఁ డంతఁ దన యాంధ్రనైషధముం జూపి మీరు దీనిని బాగనిన జగద్వ్యాపకం బవున ట్లొనరించెదఁ జూడుఁ డనుడు నాతఁడు శ్రీహర్షనైషధంబులోని దగు "గమికర్మీకృత నైకనీవృతా" అనుదాని నెట్లు దెనిఁగించి తని యడిగెను. అంత "గమికర్మీకృతనైకనీవృతుఁడనై" అని తెనిఁగించితి నని శ్రీనాథుం డనియె. అపుడు వీరన శ్రీనాథుం జూచి నవ్వి యోయీ నీ విందు "నై" తెనిఁగించితివి గాఁబోలు. అనుడు వీరనపల్కుల కేమియు నుత్తర మీఁజాలక శ్రీనాథుఁడు తా నాగ్రంథమును దెనిఁగించుతఱిం జేసినపరిశ్రమవిశేషంబులు దెలుపఁదొడంగెబు, అంత వీరన చిఱునవ్వు నవ్వి యిది మాబోంట్లకుఁ గాకున్న నేమి సామాన్యులకుఁ బఠనార్హం బగుఁ గావున దీనిని జగద్వ్యాపకంబు సేయు మనుడు శ్రీనాథుండు గర్వం బేది నిజావాసంబునకుం జనియె. వీరన యెట్లన్నను శ్రీనాథకృతనైషధము తెనుఁగుగ్రంథంబులలో మిగుల శ్లాఘనీయంబు. సంస్కృతంబునకు సరియైన తెనుఁ గని దీనినిం బండితు లందఱును నొప్పికొని యున్నారు. ఇచ్ఛావిహారవర్తనము.
ఈపినవీరన బాల్యమునుండియు స్వేచ్ఛావిహారంబున నుండునిష్టంబు గలవాఁడు. కావున నీతనిప్రవర్తనము తనవారికిని బరులకును సరిపడి యుండదయ్యెను. ఇతనియన్న యగుపెదవీరన్నయు నీతనినిం జిన్న చూపే చూచుచుండెను. ఇతని యన్న భార్యమాత్ర మీతనిప్రభావమును దెలిసికొని పుత్త్రప్రేమచే గారవించుచు నీతఁ డిలు సేరు సమయంబునకు నన్న పానంబులు సిద్ధపఱిచి యిచ్చుచు నుండెను. ఇట్లింటికి వచ్చి భోజనంబు సేయుట తడవుగ నిలువెడలి భోగభామినులగృహంబులకుం జని యచటనే కాలం బంతయుఁ గడపుచుండెను. ఇతఁడు భోగినీజనభాగధేయుండై యుండియుఁ బక్షంబున కొకపరి రాజదర్శనంబునకుఁ బోవుచుండెను. అహరహంబు పూర్వాహ్ణం బంతయు సుషు ప్తిం గడపి, తములం బుమియుచు, వెలవెలందుకల గృహంబులు వెడలి, స్వగృహంబునకు వచ్చి అపుడు వదినె నడిగి దంతధావనోదకంబుఁ దెప్పించికొని ముఖసమ్మార్జనము సేయుచుండును. ఇట్టిప్రవర్తనంబు గలమనుజులకడ యోగమహిమాతిశయంబు లున్న వని యూహించుటకు నితరుల కేమియుక్తులు గలవు ? కావున నితనియన్నకు నితనియెడఁ గల్గునసూయ దినదినప్రవర్థమానం బయ్యెను. వదినెమాత్ర మీతనిని మిక్కిలి యడఁకువతో గారవించి ముం దీతనిపని నమర్చి మఱి గృహకృత్యంబులు సలుపుచుండును. ఇతనియందు మహిమలు కొన్ని యున్నట్లు వ్రాసి యుంటిమి. వాని నిట జనంబులు వాడికొనునట్లుగ వివరించి, యితనిగ్రంథం బగుజైమినిభారతరచనావృత్తాంతము తర్వాత వ్రాయుదము.
పినవీరనయోగమహిమలు.
ఒకానొకదినంబున నీతఁ డుదయంబున గృహంబునకు వచ్చి డంతధావనోదకంబు తెమ్మని వదినె నడుగుడు నాపె సత్వరంబుగఁ దెచ్చి యందిచ్చినది. అపు డాపెకాలి నుండుపావడంబులు బొళబొళ యని
ధ్వనిచేసినవి. అట్టిధ్వనిని దూరంబునం గూర్చుండి శివపూజసేయుచున్న పెదవీరన్న విని, దీనిపావడములక్రింద నందియలు లేకుండుటం జేసి యిట్లు ధ్వని పుట్టుచున్నది. కావున మనము త్వరలో నందియలం జేయింపవలయును. అని నిశ్చయించి ఆపని నెఱవేర్చుపనివాఁ డెవ్వం డని యిద్దఱు ముగ్గురు పనివాండ్రపేరు లూహించి యందులో నమ్మఁదగినవాఁడును, దనయింటికి సమీపంబున నున్న వాఁడును నగునొకకంసాలిని నిశ్చయించి తూర్ణంబుగ నావస్తువు పూర్ణంబు సేయింప నిశ్చయించుచుండెను. ఇట్లీతఁడు పరాయ త్తచిత్తుండై పరంబును మఱచి యుండుతఱి నొకమనుజుఁడు లోనికిఁ జనుదెంచి పెదవీరన్న యున్నాఁడా ? అని కేకవేసెను. దాని నీయాలోచనలో మునిఁగియున్న పెదవీరన్న తిన్నఁగ విని యూహింపలేక పెదవీరన్న యింటికడ లేఁడని యతఁ డె యుత్తరం బిచ్చెను. దాని విని పినవీరన నవ్వి పెదవీరనగారు కంసాలి దుకాణంబుపైఁ గూర్చుండి పెండ్లాముపావడంబులకు నందెలు చేయింపనున్నారు. మఱల రమ్ము పొమ్మనియెను. దాని విని పెదవీరన వెఱఁ గంది స్వమనోగతార్థ మితని కెట్లు గోచరం బయ్యె నని యోజించి యేదియేని యొకమహిమాతిశయం బితనికడఁ గల దని నిశ్చయించెను. ఇంతియ కాక తనమనంబు శివపూజాసమయంబున సంచలించుచున్న దానిం జూపుటకుఁగూడ నాతఁ డావార్తం దెలిపె నని నిశ్చయించి నాఁట నుండియుఁ దమ్మునియెడ జాగరూకుఁడై యుండెను.
పినవీరన పిల్లలకడుపులు గడుగుట
ఇట్లుండ నొకానొకదినంబున నీపెదవీరన శివపూజ సేయుచోఁ దనతమ్ముఁడు భోజనంబునకు రాఁ గని పూజాంతంబువఱకును భోజనంబున కీతఁడు నిలువఁ డని సంశయించి యోరీ! పిల్లలం దోడ్కొని చెఱువునకుఁ బోయి కడుపులోపల వెలపల శుభ్రముగఁ దోమి స్నానంబు సేయించి త్వరతో భోజనము సేయ రమ్మనియెను. ఆమాట విని పినవీరన యా బాలుర సరోవరంబునకుఁ దోడ్కొని చని పొట్టలు
చించి నీటం బడవైచి కడుపులోపట వెలపటఁ బరిశుభ్రంబుగఁ గడిగి నిర్జీవంబు లగుకళేబరంబుల భుజంబులపై నిడికొని గృహంబునకుం జనుదెంచి యాకళేబరంబుల నన్న ముం దుంచి నీయాజ్ఞానుసారంబుగఁ గుఱ్ఱలకడుపులోపల వెలుపటను గడిగితిని. అనుడు నాక ళేబరంబులు చూచి పెదవీరన కన్నకడుపు గావున దుఃఖంబు నిలుపలేక ఱొమ్ము మోఁదికొనుచుఁ దమ్ముని నేమియు ననఁజాలక రోదనంబు సేయ నారంభించెను. అతనిభార్యమాత్ర మాకళేబరంబులఁ జూచి యేమియు సంశయింపక అది యంతయుఁ దనముద్దులమఱఁది లీలావినోదంబులుగ నెఱింగి నవ్వుచు నూరకుండెను. పాకంబు సిద్ధంబు చేసి యాపె పినవీరనం జూచి "అబ్బాయీ ! పిల్లలం దోడ్కొని భోజనంబునకు రమ్ము" అని పిలిచినది. తోడనే పినవీరన యన్నకు నద్భుత మావహిల్ల నాపిల్లల వారివారినామంబులచేఁ బిలిచి "మీయవ్వ బువ్వఁ దినఁ బిలుచుచున్నది. రండు రం"డని యాకళేబరంబులఁ బట్టి యెత్తెను. వారలు నిదె వచ్చితి మని యుత్తరంబు లిచ్చి లేచి వచ్చిరి. వారిం జూచి పెదవీరన యత్యంతానందంబునఁ దమ్మునిఁ గౌగిఁలించికొని అతని కట్టిమహిమల నిన్చినభగవంతుని నుతించి తనయదృష్టంబుం గొనియాడెను. అనంతరము పిల్లలంగూడి పినవీరన యన్న పొత్తున భుజించెను.
జైమినిభారతాంధ్రీకరణవిశేషములు.
ఇట్టియద్భుతకృత్యంబులు సేయుపినవీరనవిఖ్యాతి లోకంబునం దంతటను వ్యాపింపఁదొడంగెను. జనులందఱును నీతనిని దేవునిగఁజూచుచుండిరి. ఇట్లుండ నీవీరన యొకనాఁడు సాళ్వగుండనరస రాజుతో సల్లాపించుచుండెను. అపు డాతఁడు జైమినిభారతంబును దెనిఁగింప సమర్థులెవ రని పండితులతోఁ బ్రశంసించెను. వారపుడు కొందఱుపండితుల పేరులు సెప్పి వారిలో నీపినవీరన యత్యంతము సమర్థుం డని రని చెప్పి యుంటిమి. దాని విని రాజు మనకు గ్రంథము కొంచెముకాలములో సంపూర్ణము సేసి యీఁగలసమర్థు లెవ రనుడు దానికిని నితఁడే
సమర్థుం డనిరి. ఎంతకాలములోపల దీని నీతఁడు రచంపఁగలఁ డనుడుఁ గొంద ఱితని కొకవత్సరంబు చాలు ననిరి. మఱికొంద ఱాఱుమాసంబులు పట్టు ననిరి. అందుపై రా జీతనిం జూచి మూఁడుమాసములకు సంపూర్ణ మగునా? యనుడుఁ బినవీరన నవ్వి యొకమాసములోపల సెల వేనిఁ దెత్తు ననియెను. అపుడు రాజు త న్నెగతాళి సేయుట కాతఁ డట్లనె నని యూహించి మనంబునం గోపించి యొకమాసంబునకుఁ దేకున్నచో :- అని యూరకుండెను. దాని విని వీరన మరల నవ్వి "అట్లు తేకున్నచో మీయిష్టానుసారముగఁ గార్యము నడుపుఁ" డనియెను.
రాజును మంచిదే యని యపుడ కర్పూరతాంబూలంబు తెప్పించి యిచ్చి యాతనికి సెల విచ్చెను. వీరన యచ్చోటు వాసి యెప్పటి యట్ల తనలీలా వాసంబునకుం జనుదెంచెను. సభ్యులందఱు నీపినవీరన వాక్యంబులకు భయ మంది "అయ్యయో! యీతనికి మతిభ్రమణంబు గల్గె నని తోఁచెడిని. ఆస్థానంబున నిట్లు వృథాజల్పనంబు లాడఁగూడునే? అనుడు మఱికొందఱు "బాగుబాగు ! అతఁ డూరక ప్రగల్భ వాక్యములు పల్కు వాఁడుగాఁడు. ఏదియేని ధైర్యముచేతనే యిట్లు అని యుండును. లోకమునఁ దనముప్పు దప్పించుకొనఁ బ్రయత్నంబు సేయనివా రొకరుం గలరె. అయిన మన మొకనెల యోపికపట్టి యున్నచో సర్వంబును దెల్లం బగును." అని నిజనివాసంబులకుం జనిరి.
ఇట పినవీరన రాజుకడఁ దాంబూలం బందినవృత్తాంతంబు సభ్యులవలన నితనియన్న విని భయకంపితశరీరుండై తమ్ముఁ డింటి కెప్పుడు వచ్చు నని యతనిరాక కెదురు చూచుచుండెను. ఇట్లుండఁ గొంతవడికిఁ దమ్ముఁ డింటికి వచ్చెను. అప్పు డాతఁ డతనిహస్తములు పట్టుకొని దైన్యము ముఖమునం దోఁపఁ "దమ్ముఁడా ! రాజుకడ నీ వట్టిప్రతిన పట్టుట తగునా ? నెఱ వేఱున నసాధ్యం బగుపని నెఱవేర్ప నేరితరంబు ? నీవు మొదటినుండియుఁ గడు దుడుకవుగనే యుంటివి గదా ! ఇఁక నేమి ఈ పేజి వ్రాయబడి యున్నది. ఈ పేజి వ్రాయబడి యున్నది.
గతి యోజించెదు ? అనుడు నవ్వి చినవీరన్న "యన్నా ! భయము వలదు. ఈపని నెఱవేఱుప సమర్థుండను. దీనిచే మనకు శాశ్వతయశం బుండును." అని యతనిని ధీరుం గావించి తాను భుజియించి నిజావాసంబునకుం జనియెను. పెదవీరన తమ్మునిమాటయందు గుఱి యుంచి యూఱడిలి కొన్నిదినంబు లూరకుండెను. ఇట్లు కొన్నిదినంబు లుండి తమ్ముఁడు గ్రంథ మెచ్చో నైనను వ్రాయుచున్నాఁడా యని యరయుచోఁ గాలయాపనంబు సేయుటయ కాని కార్యంబు సేయుచున్నట్లు కానరా దయ్యెను. కావున నీతఁడు తమ్మునియాస వదలి యాతనితో మరల నీప్రస్తావన సేయక యూరకుండెను. చినవీరన్న యానెల యంతయు నించుమించుగఁ గడపి యొకానొకదినంబున నింటికి వచ్చి తనవదినెను బిలిచి యొకగది శుభ్రంబు సేసి తగుమాత్రముగ నలంకరించి యొకటి రెండుదీపము లుంచి కొంతచమురు గూడ నుంచు మనియెను. అతని పల్కు లాలించి యావనితయు నట్లే యొనరించినది. పినవీరన్న నాఁటి రేయి యతిత్వరితగతి భుజియించి యాగదిలోనం బ్రవేశించి తల్పునకు గొలుసు తగిలించెను. ఇది యంతయు గ్రంథసన్నాహంబె కావచ్చునని యాతనివదినె గ్రహించినది. అన్న మాత్ర మీవృత్తాంతం బెఱుఁగనివాఁడు గావున దమ్ముఁ డాదినం బింటఁ బవ్వళించునదృష్టము గల్గెనని సంతసించుచుండెను. ఇట్లుండ లోపలనుండి కొంతవడికిఁ దాటాకు వ్రాయ నగుచప్పుడు వీతెంచెను. దానినిఁ దడ వాలించి తమ్ముఁ డేమైనను వ్రాతుచున్నాఁడా? యని భార్య నడుగ నాపె యూరకుండెను. ఇంకొకకొంతవడికి లోపలనుండి నిద్రించువాఁడు బుసకొట్టునట్లుగ వినంబడియెను. దాని విని యిప్పుడు తమ్ముఁడు నిద్రించుచున్నాఁ డని నిశ్చయించెను. మఱికొంతవడికి బుసకొట్టుట తాటియాకువ్రాయుటయుం గూడ వినవయ్యెను. ఇట్టిధ్వనులను తడవు విని యేమియు నిశ్చయింపలేక పెదవీరన మెల్లన లేచి తమ్మునిగదిగుమ్మము సమీపంబునకుం జని నలుగెలంకులు చూచి తలుపున నొక్కచో నున్న రంధ్రం
బునఁ గన్నుంచి లోపలివృత్తాంతంబు గన్గొనుచో నొకసుందరాంగి సర్వాభరణభూషితై యొకచేతఁ బైఁడిఘంటంబు పట్టి యింకొక చేత పుస్తంబు వట్టిశరవేగంబున వ్రాయుచున్నట్లు గాన్పించెను. పినవీరన యచ్చో నున్న మంచంబుపైఁ బవ్వళించి నిద్రించుచున్నట్లు చూపట్టెను. ఇట్టిచూపున కద్భుతం బందియుఁ బెదవీరన యాపెఁ బద్మభవుని రాణిగ నెఱుంగలేక సామాన్యభావంబుచేఁ జూచుచుండఁగా దీనిని గ్రహించి విరించిరాణి తనఘంటం బాతనికంటం బడ విసరినది. దానిచే నాతఁ డొకబొబ్బ వేసి భూమిపయిం బడుడుఁ బినవీరన్న లేచి వచ్చి యేమికారణం బనుడు నాతఁడు తనకన్నుం జూపెను. అపు డాతఁడు వెఱవకు మని లోపల వ్రాయుటచే రాలినతాటాకుపొడిఁ దెచ్చి యాతనికంటిలో నుంచి కొంతసేపు కట్టి విప్పినతోడనే మఱల నేత్రం బెప్పటి యట్లు కాన్పించెనఁట.
ఇట వాణి త న్నన్యుఁడు వీక్షించుటంజేసి యచ్చో నుండ నొల్లక యంతర్హిత యయ్యెను. వీరన మిగిలినభాంగంబు సంపూర్తిచేసి దానితుదిని :-
సీ. పరఁగఁగ మల్లమాంబకుమారునకు పోన, మకులాంబునిధిపూర్ణి మావిధునకు
భరతకీర్తికిఁ దులాపురుషాదిదానాంబు, జంబాలితాస్థాన సౌధునకును
పరరాజభీకరధరణీవరాహున, కాత్రేయగోత్రపవిత్రునకును
గుండయనరసింహమండలేశ్వరునకు, నభ్యుదయపరంపరాభివృద్ధి
గీ. కరముగా భారతీతీర్థగురుకృపాస, మిద్ధసారస్వతుఁడు సత్కవీంద్రసఖుఁడు
కుకవిమూర్ధవిలుంతనకులిశహస్త, పల్లవుఁడు చెప్పెఁ బినవీరభద్రసుకవి.
అని వ్రాసి గ్రంథంబు ముగించి దానిని వదినెతో విన్న వించి మాయన్న తో దీని నాస్థానంబునఁ జదువఁ జెప్పు మని ప్రార్థించెను. ఆపె తనభర్తతో మఱఁదియభీష్టంబు తీరుటకు నాస్థానంబునకుఁ జనుండని మనవి యొనరించినది. అతఁడును తమ్ముఁడు నాసమీపంబున నున్న నే దీనిం జదివెదఁ గాని లేకున్న నే నిద్దానిని ముట్ట ననియెను. ఆమాట విని పినవీరన తానును వచ్చెద నని సమ్మతించెను. ఇట్లు వీరు సంభాషించుచుండ సూర్యోదయం బయ్యెను. అపుడు సాళ్వగుండ నరసింహనృపాలుఁడు సభామండపంబునకు విచ్చేసి నిండోలగం బుండి పినవీరనరాక నిరీక్షించుచుండెను. అప్పుడు ముందు పెదవీరనయు నాతనియనంతరము పినవీరనయు వచ్చి యథోచితస్థానంబులఁ గూర్చుండి గ్రంథంబు పరిసమాప్తి యయ్యె నని తెలిపిరి. దానిని విని రాజు మిగుల సంతసించి దానిం జదువు మనియెను. అపుడు పెదవీరన కథారంభంబుమొదలు గ్రంథాంతమువఱకును జదివెను. దానిని విని పండితులు పినవీరనసరసతకు నెంతయు సంతసిల్లి యీక్రింది పద్యంబును మరలఁ జదివిరి. అదియెద్ది యనిన:-
సీ. అమృతాంశుమండలం బాలవాలము గాఁగ, మొలిచె నొక్కటి జగన్మోహనముగఁ
జిగిరించే విలయసింధుగతకైతవడింభ, శయనీయవరపలాశములతోడఁ
బితృ దేవతలకు సంచితసత్త్రశాలయై, చెట్టు గట్టెను గయా క్షేత్రసీమ
నిలువ నీడయ్యె నిందీవరప్రియకళా, కొటీరునకు భోగికుండలునకు
గీ. మఱ్ఱిమాత్రంబె పిల్లలమఱ్ఱిపేరు, పేరువలెఁగాదు శారదాపీఠకంబు
వారిలోపలఁ బినవీరువాక్యసరణి, సరసులకు నెల్లఁ గర్ణరసాయనంబు.
అనుడు భళిరే ! మీవచించున దింత యొప్పునే. ఈతఁ డిట్టివాఁ డ యగును. ఈతనివంశము నట్టిదయ. ఈతని కల్పన లెట్టివో చూచితిరే.
ఉ. "అల్లన విచ్చు చెంగలువలందురజంబును గప్పురంబు పైఁ
జల్లఁగ జల్లనై వలచుసౌరభమున్ వెద చల్ల భావముల్
బల్లవహస్తచన్నుఁగవపయ్యెదజిమ్ముగఁ దోఁచుభాతిగాఁ
బిల్లలమఱ్ఱివీరన యభిజ్ఞుఁడు సెప్పఁగ నేర్చు కల్పనల్."
అని చెప్పి యీకవికి బహుమానం బీతనియిష్టానురూపంబుగ నిచ్చుట మేలని యితఁ డాశ్వాసాంతమందుఁ జెప్పిన :-
క. ప్రేమమున శ్రోత వక్తకుఁ "జామీకరహయము ధవళచామరములు నా
నామణివిభూషణంబులు, గ్రామము కృపసేయవలయు" గ్రంథసమాప్తిన్.
అనుపద్యానుసారంబుగ నిచ్చి భూపాలుఁడు బహూకరించెను.
ఇట్టిబహుమతుల నంది యీతఁ డుండఁ బండితు లందఱును గ్రంథంబు స్వల్పకాలంబున ముగియించుట యత్యాశ్చర్యంబు.అది యెట్లు ముగించితి రని ప్రశ్నంబు సేయఁ బినవీరన వాణి నారాణియె
యుండ నేమి లోపంబు ? దీని నొకదినంబులోపలఁ బూర్ణంబుసేసితి, ననియె. "వాణి నారాణి" యని నిశ్శంకతోఁ బల్కినవీరనంగని మీరు వాణి నా రాణి యని పల్కెదరు గాఁబోలును ? అనుడు వీరన నవ్వి "వాణి నారాణి" యని కంఠోక్తిగాఁ బల్కెను. ఆమాటకుఁ బండితు లందఱును గనలి నీ వెంతవిద్వాంసుండవై యున్నను నిర్భయంబుగ నిట్టిమాట లాడఁగూడదు. జగన్మాత యగువాణి నితఁడు తనరాణి యని పలుక సభ్యులు తగునుత్తర మీక యూరకుండఁ జనదు. ఇట్టివాఁడు పండిత మాని గాని పండితుఁడు గాఁడు, అని సభ్యులొక్క పెట్టఁ బలుకఁ దొడంగిరి. అపు డంతరిక్షంబున నుండి యొక యశరీరవాణి గర్జారవంబున సభ్యుల నుద్దేశించి యిట్లనియె :-
"వాణి జగంబునకు మాత. ఇతనికిమాత్రము భార్య యగును. ఇతఁడు చతురాననుని యవతారము. కావున నీసంశయం బింక వదలుం"డని పలుక వారందఱును నద్భుతం బంది యాతని నెంతయు గారవించిరఁట! ఇట్టి వృత్తాంతము లిప్పుడు చెప్పెడివారికిని వినువారికిని నద్భుతంబులు పుట్టించుటకు సంశయంబు లేదు. అయిన నాతనిచారిత్రమునకు వలయుప్రధానవృత్తాంతంబులు మనకుఁ దెలిసిన వివియే కావున వాని నిట వ్రాసితిని.
గ్రంథకథావిషయము.
ఈగ్రంథములోనిధర్మజుని యశ్వమేధవృత్తాంతము భారతములో నున్నది. దానినే జైమినిముని యింకొకవిధంబునఁ జెప్పినట్లున్నది. ఇందలికథలు కొన్ని భారతంబునఁ గానరావు. ఈకవి రచియించినపర్వ మిది యొక్కటియే. రాజు కోరినదియు నింతమట్టు కే అయినట్లు గ్రంథారంభము తదంతంబుం జూడ గోచరం బగును. ఈకవిశైలి మృదు వగునది యైనను నన్వయ కాఠిన్యముమాత్ర మించుక కలదు. ఈతనిపదశయ్యాదులు రసస్ఫూర్తియుఁ దిక్కనసోమయాజి కవనంబుంబోలె సరసంబై యుండును. ఇట్టి సామ్యంబుఁ జూడఁగోరినచో భారతంబులో నశ్వమేధ పర్వంబున నున్న సమా నేతిహాసంబులు చూడఁదగును.
భారతాంధ్రకవులచరిత్రము ముగిసెను.