కవి జీవితములు/ఎఱ్ఱాప్రెగ్గడ

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

కవిజీవితములు.

4.

ఎఱ్ఱాప్రెగ్గడ.

(శంభుదాసుడు)

ఇతఁడు భారతములోని యారణ్యపర్వ శేషమును భారతముతోఁ జేరినహరివంశ మనుగ్రంథమును దెనిఁగించెను. లక్ష్మీనృసింహకథ ద్విపదగాఁ జేసెను. ఇతనింగూర్చినచారిత్రవిశేషములు తెలియకున్నను నీతనిగ్రంథములం జూచిన నీతనివంశావళి మొదలగునవి కొన్ని తెలియఁ గలవు. వానిని మఱియొకచో వివరించెదను.

గ్రంథరచనాకారణము.

"అని యిట్లు పూజ్యపూజాతత్పరుండ నైననాకు నభీష్టార్థదాతయై యవదాత చరితంబున నఖిలజనరంజనం బొనర్చుటంజేసి రాజశబ్దంబునకు భాజనం బగుచుఁ దేజోవిలా సైక నిత్యుండు, పల్లవాదిత్యుండు మొదలగు బిరుదంబుల నొప్పు వేమజనేశ్వరుండు."

అని గ్రంథారంభములో నెఱ్ఱాప్రెగ్గడ యొకవచనమును వ్రాసి ఆప్రభుండు అద్దఁ కిపురంబున భద్రసింహాసనమున నుండి తన్నుం బిలువం బనిచి యీక్రిందివిధ బునఁ బల్కినట్లు చెప్పియుండెను. ఎట్లన్నను :-

క. అంబుజభవనిభుఁడును పో, తాంబావిభుఁడు నగుసూరనార్యునిసుతు న
   న్నుం బూజితధూర్జటిచర, ణాంబుజు శ్రీవత్సగోత్రు సంచితచరితున్.

    వ. సవినయంబుగా నర్చించి యిట్లనియె.

గీ. సకలభాషాకవిత్వవిశారదుఁడవు, సాధుసమ్మతుఁడవు నిత్యసౌమ్యమతివి
   భవ్యుఁడవు గాన నీమీఁదఁ బరఁగఁ బక్ష, మేను గల్గి యుండుదు నెప్పు డెఱ్ఱనార్య.

శా. నాతమ్ముండు థునుఁడు మల్లరథినినాథుండు ని న్నా తత
   శ్రీతోడన్ సముపేతుఁ జేసి యెలమిన్ జేపట్టి మా కిచ్చుటన్
   జేతో మోద మెలర్ప రామకథ మున్ జెప్పించి యత్యుత్తమ
   ఖ్యాతిం గాంచితి నింకనుం దనియ నేఁ గావ్యామృతాస్వాదనన్.

క. భారతపరాంశ మని యిం, పారఁగ జెప్పుదురు బుధులు హరివంశము నీ
   వారమ్యకథఁ దెనుంగున, ధీరోత్తమ నిర్వహించి తెలుపుము నాకున్.

అని చెప్పియుండెను. దీనింబట్టి యీకవి అనవేమారెడ్డియాస్థానములో నుండె ననియు, నద్దంకివాసస్థుఁ డనియు, వేమారెడ్డితమ్ముండగుమల్లారెడ్డి మొదట నీతనిని తనకడ నుంచికొని యనంతర మతని యన్న యగువేమారెడ్డి కొప్పించెననియు నా వేమా రెడ్డి ప్రథమములో నీతనివలన రామకథ చెప్పించె ననియును, అనంతర మీభారత శేషమగుహరివంశముం దెనిఁగింపు మని కోఱఁగా దానిం దెనిఁగించినట్లును దేలినది. అట్లుగాఁ బ్రభుఁడు తన్ను గ్రంథరచన కుత్సహింప నెఱ్ఱాప్రెగ్గడ యీక్రింధివిధంబునఁ బ్రభున కుత్తరము చెప్పినట్లుగ నున్నది. ఎట్లన్నను :-

ఉ. నన్నయభట్టతిక్కకవినాథులు చూపినత్రోవ పావనం
   బెన్నఁ బరాశరాత్మజమునీంద్రునివాఙ్మ మాది దేవుఁడౌ
   వెన్ను నివృత్త మీవుఁ గడు వేడుకతో వినునాయకుండ వి
   ట్లన్నియు సంఘటించె మదభీప్సితసిద్ధికి రాజపుంగవా.

క. కావునఁ జెప్పెదఁ గళ్యా, ణావహమహనీయరచన హరివంశము స
   ద్భావమున నవధరింపుము, భూవినుతగుణాభిరామ పోలయవేమా.

అని యున్నది. దీనింబట్టి చూడ నీయెఱ్ఱప్రెగ్గడ తాను నన్నయ తిక్కనలమార్గములనే పోవునట్లుగాఁ జెప్పెను. ఈహరివంశములోఁ దా నావఱకుఁ జేసియున్న గ్రంథ మొక్క రామాయణ మనియే చెప్పి యుండెంగాని రెండవగ్రంథము కానుపింపదు. ఆరామాయణముగూడ వ్యాపకములో నున్నట్లు కానరాదు. కొంతకాలముక్రిందట నొకచిన్న యచ్చుపొత్తములో నుత్తరరామాయణగాథ ద్విపదలో నున్నది చూచి యుంటిని. అది యెఱ్ఱప్రగ్గడనామమున నున్నట్లు జ్ఞాపక మున్నది. అదియును పూర్తిగా నచ్చుపడక యక్షగానగ్రంథముల కుపయోగ మగుభాగమువఱకే అచ్చుపడి యుండుటంబట్టి దానియం దంతశ్రద్ధ చేసి సంపాదించి యుండ లేదు. ఇతఁడు చేసిన రామాయణ మదియే యగునేని యది యంతవిశేషగ్రంథము కాదనియును దానిని నంతయు బ్రకటించు


ట యనావశ్యక మని అచ్చులొత్తువారు అందలిముఖ్య భాగములుమాత్రమే ప్రచురించి రనియు నూహింపనై యున్నది.

ఆరణ్యపర్వ శేషము.

భారతములోని ఆరణ్యపర్వ శేషము నీతఁ డెప్పుడు తెనిఁగించె నో అది యితనిచేత విస్పష్టముగాఁ జెప్పఁబడలేదు. కాని యందులో నాల్గవయాశ్వాసములో "ధర్మరాజు నహుషప్రశ్నలకుఁ బ్రత్యుత్తరము లిచ్చుట" అనుభాగములోఁ గొంత నన్నయభట్టుచేతను అటు పిమ్మట నెఱ్ఱప్రెగ్గడచేతను రచియించఁబడినట్లు చెప్పఁబడి యున్నది. అందునన్న యభట్టుకవిత్వములోని తుదిపద్యము :-

ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులన్
    జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో
    దారసమీరసౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణ
    కర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబు లై.

అనునది. దీనినే పత్త్రికాముఖంబునఁ బ్రకటింప దానికిఁ దిక్కన సోమయాజి వర్ణమువేసె ననియు దానంజేసి యతఁడు భారతశేషము రచియించుటకుఁ బిలువంబడె ననియును మఱొయొకప్రతీతియుఁ గలదు.

ఈపద్యముతో నన్నయభట్టుకవిత్వము నిలిచిపోయినది. అనంతరము ఎఱ్ఱప్రెగ్గడకవిత్వము కానుపించును. కాని యిదియావెంటనే అనఁగా నన్నయభట్టు వదలివేసినవెంటనే రచియింపఁబడక మఱికొంతకాల మైనపిమ్మట వ్రాయఁబడినట్లు కానఁబడును. తిక్కనసోమయాజి తనకవిత్వము ఆరణ్యపర్వ శేషమునుండి యారంభింపక విరాటపర్వము నుండి యారంభించెను. అందులో :-

   "అం, దాది దొడఁగి మూఁడుకృతు లాంధ్రకవిత్వవిశారదుండు
    విద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్.

అని చెప్పియుండెను. దీనింబట్టి చూడఁగాఁ దిక్కనసోమయాజి నన్నయభట్టు ఆవఱకు రచియించియున్న గ్రంథమును జూడకయే వ్రాసియున్నట్లును గాన్పించును. కాని యెఱ్ఱప్రెగ్గడ భారతముతోఁ జేరియున్న హరి


వంశము తెనిఁగించుటకుఁగా నేర్పఱుచుకొని దానిని పూర్తిచేసినపిమ్మట భారతములోఁ గొంతభాగము మాత్రము సంపూర్తి కాకయుండుట బాగు గా దని దానిఁగూడఁ బూర్తి చేసినట్లు కానుపించును. కాని యట్టిసందర్భము దీనిలో వ్రాయఁబడి యుండలేదు. నన్న యభట్టు ప్రారంభించిన శరదృతువర్ణననే తానును మఱికొన్ని పద్యములతోఁ జెప్పి గ్రంథ మంతయు నన్న యభట్టు రచియించినట్లే రాజనరేంద్రునిపైఁ గృతియుంచి పూర్తి యొనరించె. నన్న యభట్టుకవిత్వమునకును శంభుదాసునికవిత్వమునకుం గలశయ్యా భేదంబు సూచించుటకుఁ గాను శంభుదాసుని శరదృతువర్ణనలోనియొకటిరెండుపద్యముల నిటవివరిం చెదను. ఎట్లన్నను :-

చ. స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిర స్తనీరదా
   వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
   ద్ధురతరహంససారసమధువ్రతనిస్స్వనముల్ సెలంగఁగాఁ
   గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడఁగన్.

శా. ధానాంభఃపటలంబునం బృథుపయోధారావలిం దాల్చి గ
   ర్జానిర్ఘోషము బృంహితచ్ఛలనఁబ్రచ్ఛాదించి ప్రావృట్పయో
   దానీకంబు శరద్భయంబున నిగూఢాకారతన్ డిగ్గె నాఁ
   గా నొప్పారె మదోత్కటద్విరదసంఘంబుల్ వనాంతంబునన్.

ఆరణ్యపర్వాంతమున శంభుదాసుఁడు తా నీగ్రంథరచనఁ జేయుటకుఁ గలకారణము నొకపద్యములో రచియించెను. దాని నిచ్చోట వివరించెదను. ఎట్లన్నను :-

సీ. భవ్యచరిత్రుఁ డాపస్తంబసూత్రుండు, శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ
   సంతతధ్యానసంసక్త చిత్తుఁడు సూర, నార్యునకును బోతమాంబికకును
   నందనుం డిలఁ బాక వాఁటిలో నీలకంఠేశ్వరస్థాన మై యెసకమెసఁగు
   గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పుధన్యుఁడు ధర్మైకతత్పరాత్ముఁ

గీ. డెఱ్ఱనార్యుఁడు సకలలోకైకవిదితుఁ, డైననన్న యభట్టమహాకవీంద్రు
   సరససారస్వతాంశప్రశస్తి దన్నుఁ, జెందుటయు సాధుజనహర్ష సిద్ధి గోరి.

క. ధీరవిచారుఁడు తత్కవి, తారీతియుఁ గొంత దోఁపఁ దద్రచనయ కా
   నారణ్యపర్వశేషము పూరించెఁ గవీంద్రకర్ణపుట పేయము గాన్.

ఎఱ్ఱాప్రెగ్గడవంశము.

ఇతనిచే నిందులో ముందుగాఁ జెప్పంబడిన పద్యానుసారముగ శ్రీవత్సగోత్రుఁ డై నట్లును, ఇతనితల్లి పోతమ్మ, తండ్రి సూరన్న యనియు, ఇతఁడు శైవోపాసకుం డనియు, శంకరస్వామి యనుయతీంద్రుల శిష్యుం డనియును సకలభాషాకవిత్వవిశారదుఁ డనియుం దేలినది. ఈ శంకరస్వామి విద్యారణ్యస్వాములకు గురుఁ డగునట్టియు లంబికాయోగ పారగు లైనట్టివిద్యాశంకరులు. విద్యాశంకరులు సన్న్యసించినది శా. సం. 1150. సిద్ధినందినది శా. సం. 1255.

ఈహరివంశగ్రంథమువలన దొరకినచారిత్ర మింతయే అయియున్నది. పైపద్యములవలనఁగాని ఆశ్వాసాంతగద్యమువలనఁగాని యెఱ్ఱాప్రెగ్గడ నియోగి శాఖలోనివాఁడో, వైదికశాఖలోనివాఁడో తెలియఁబడుటలేదు. ఆశ్వాసాంతగద్యములో "ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వర చరణసరోరుహధ్యానానంద సౌందర్యదుర్య శ్రీసూర్య సుకవిసంభవశంభుదా సలక్షణాభిధేయయెఱ్ఱయ నామధేయప్రణీతము" అని యుండుటంబట్టి యీహరివంశగ్రంథమువలన నీసంశయము నివారణ కాలేదు. ఇతనినే యెఱ్ఱప్రెగ్గడ యని వాడుటచేత నియోగియే అని నిశ్చయించినను గ్రంథములోఁ బ్రెగ్గడశబ్దము గాని పర్యాయపదములు గాని వేసికొని యుండక పోవుటచే నీతఁ డెవ్వరో యనుసందియము గల్గును. అది నివారింపఁబడుటకు గ్రంథాంతరముం జూచెదము గాక.

శ్రీమ దాంధ్ర భాగవతమున నెఱ్ఱాప్రెగ్గడవంశస్థుఁ డగుసింగనచే నతని వంశావళి తెల్పఁబడినది. దానింబట్టి చూడ నీతఁడు నియోగి బ్రాహ్మణుఁడే అయినట్లు నీతనివంశంబులో నొక్కఁడు హరివంశము, నొక్కఁడు శ్రీభాగవతములోని కొన్ని భాగములును దెనిఁగించె ననియుం దేలినది. తిక్కనవంశస్థులవలన భారత రామాయణములు తెలిఁగింపఁబడినట్లుగా నెఱ్ఱాప్రెగ్గడవంశస్థులవలన భారతభాగవతములలోని భాగములు తెలిఁగింపఁబడినవి. భాగవతములోని వంశావళిపద్య మెద్ది యనఁగా :

సీ. శ్రీవత్సగోత్రుండు శివభక్తియుక్తుఁ డా,ప స్తంబసూత్రు, డపారగుణుఁడు
   ఏర్చూరిశాసనుం డెఱ్ఱనప్రెగ్గడ, పుత్రుండు వీరన పుణ్యమూర్తి
   కాత్మజుం డగునాదెయామాత్యునకుఁ బోల, మాంబకు నందను లమితయశులు
   కనువనామాత్యుండు ఘనుఁడు వీరనమంత్రి, సింగధీమణియు నంచితగుణాఢ్యు

తే. లుద్భవించిరి తేజంబు లూర్జితముగ, సొరది మూర్తిత్రయం బన శుభ్రకీర్తిఁ
   బరఁగి రందులఁ గసవనప్రభువునకును, ముమ్మడ మ్మనుస్వాధి యిమ్ములను వెలసె.

క. ఆకసవమంత్రికిం బు, ణ్యాకల్పశుభాంగి ముమ్మడమ్మయు మము న
   వ్యాకులచిత్తుల నిరువుర, శ్రీకరగుణగణులఁ బుణ్యశీలుగఁ గాంచెన్.

క. అంగజసమలావణ్యశు, భాంగులు హరిదివ్యపదయు గాంబుజవిలస
   ద్భృంగాయమానచిత్తులు, సింగయ తెలగయలు మంత్రిశేఖరు లనఁగన్.

క. అం దగ్రజుండ శివపూ, జం దనరిన వాఁడ విష్ణుచరితామృతని
   ష్యందిపటువాగ్విలాసా, నందోచితమానసుఁడను నయరోవిదుఁడన్

ఈపై నుదాహరించినయెఱ్ఱాప్రెగ్గడవంశావళి నీక్రింద వివరించెదను, ఎట్లన్నను :-

శ్రీవత్సగోత్రము (ఆపస్తంబసూత్రము.)

|

సూరన

|

ఎఱ్ఱాప్రెగ్గడ (ఏర్చూరి శాసనుఁడు)

|

వీరన

|

ఆదెయమాత్యుఁడు

|

కసువనమంత్రి ----- వీరనమంత్రి ------సింగరాజు

|

సింగయమంత్రి -------- తెలగయమంత్రి.


(భాగవత షష్ఠస్కంథ గ్రంథకర్త.)

ఈసింగనమంత్రిచారిత్రము భాగవతములో వ్రాసియుంటిని గావున దాని నిచ్చోట వ్రాయ మానినాఁడను.

కొక్కోకగ్రంథవిషయము.

కళాశాస్త్ర మనునామంబుతో వ్యవహరింపఁబడు నీకొక్కోక గ్రంథకవి కొంచెమెచ్చుదగ్గుగఁ బై యెఱ్ఱప్రెగ్గడవలెనే కాన్పించుచున్నాఁడు. అం దాతనిచేఁ జెప్పఁబడిన వంశావళీ వర్ణనము నిట వివరించుచున్నాఁ డను, ఎట్లన్నను :-

సీ. శ్రీవత్సగోత్రప్రసిద్ధసంభూతి నా,పస్తంబసూత్రప్రశ స్తధునుఁడు
   గురుదయానిధి యైనకూచనమంత్రికి, నంగనామణి నుత్తమాంబికకును
   తనయుండు సత్కవీశ్వరమానిభరతుండు, శివకృప సుజ్ఞాన శేఖరుండు
   నారూఢవిద్యాచలానందయోగీంద్రు, శిష్టప్రచారి విశిష్టఘనుఁడు.

తే. ఎఱ్ఱయామాత్యుఁ డన సత్కవీంద్రహితుఁడు
   కలితవాక్ప్రౌఢిఁ గొక్కోకకవివరుండు
   చతురమతితోడ రతికళాశాస్త్రమిదియ
   తెనుఁగుగాఁ జేతు రసికులు వినుతి సేయ.

అనుదీనింబట్టి చూడఁగా నీకవిపేరు "ఎఱ్ఱయ" యనియు, నమాత్యుఁడనియు నుండుటంజేసి నియోగిబ్రాహ్మణుఁ డనియు, శ్రీవత్సగోత్రుఁడు, ఆపస్తంబసూత్రుఁడు, శివోపాసనావరుఁడు, ఆరూఢుఁ డగువిద్యాచలానందయోగీంద్రునిశిష్యుం డనియు, కూచనమంత్రికుమారుఁ డనియుఁ దేలినది. కాని హరివంశములోఁ జెప్పఁబడిన యెఱ్ఱయ సూరనమంత్రికుమారుఁ డనియు నతనితల్లిపేరు పోతమ అనియు నున్నది. ఇది యొకభేదము. ఇర్వురకును సమానధర్మములు మఱికొన్ని కానుపించుచున్నవి. అందు మొదటియతఁడు శంకరస్వామిసంయమీశ్వరశిష్యుఁడు. రెండవయాతఁడు విద్యాచలానంద యోగీంద్రునిశిష్యుఁడు. కావున నిర్వురును యతీశ్వరశిష్యులు. మొదటియతఁడు సకలభాషాకవిత్వవిశారదుఁ డని యున్నది. రెండవయతనికి అష్టభాషాకవిమిత్రుఁ డని యున్నది. కావున నీయిర్వురును గవిత్వప్రజ్ఞలో సమానులే. పైవాని నన్నిటిం బట్టి చూడఁగా నీ యిర్వురు నొకరే అని తోఁచు చున్నది. తల్లిదండ్రులపేరులు భేదముగా నుండుటంబట్టియు, గురువులపేరులును భేదముగా నుండుటంబట్టియు మొదట నతనికి శంభుదా సనుపర్యాయనామ ముండు


టంబట్టియు రెండవయతనికి నది లేక నవఘంటసురత్రాణుఁ డనుబిరుదుండుటంబట్టియు, లక్షణాభిధేయుఁ డనుబిరుదు లేకుండుటంబట్టియు నీయిర్వురు నొకరు కా రని నిశ్చయింపవల సెను. కాని భాగవతశేషము రచియించినసింగనకవిమాత్రము వీరియిర్వురిలో నెవ్వరిసంతతివాఁడో యిపుడు చెప్పఁజాలము. అతఁడు శ్రీవత్సగోత్రుఁ డగునెఱ్ఱన తనమూల పురుషుం డని చెప్పెను. అందుచే నీయిర్వురిలో నొకఁడు కానోపును. అనిమాత్రము చెప్పవలసి యున్నది.

ఇఁకఁ గొక్కోకకవివరునికాలము నిర్ణయింపఁబడవలసి యున్నది. అది సులభసాధ్యముగాఁ గానుపించుట లేదు. ఈ గ్రంథమును గృతి నందినకుంటముక్కుల మల్లనామాత్యునివంశచారిత్రముంబట్టి చూడవలసి యున్నది. అతనివంశముంగూర్చి వ్రాయుచోఁ గృతిపతితండ్రి యైనభైరవమంత్రింగూర్చి యీ క్రిందివిధంబుగ వ్రాసియున్నది. అదెట్లన్నను :-

గీ. అట్టిబయ్యమంత్రి కనుకూలసౌభాగ్య, భాగ్యగరిమ వెలయుపత్ని యయ్య
   నక్కమాంబతనయు లనఘుల నలువురఁ, గనియె గుణసముద్రు లనుచుఁ బొగడ.

క. వా రెవ్వ రనిన గంగన, ధీరుఁడు పెదమల్లనయును దీప్తయశఃశ్రీ
   ధారుఁడు మల్లామాత్యుఁడు, భైరవుఁడు ననంగ నఖిలభాగ్యోన్న తులై.

   వ. వారిలోన.

సీ. హరిపదధ్యానతత్పరుఁడు చండలమహా,లక్ష్మీప్రసాదైకలబ్ధవరుఁడు
   రహి గజపతిమహారాయ లిచ్చినసమం,చితమహాపాత్రప్రసిద్ధయశుఁడు
   జెమఖానరాయనిచేతను నొడయఁడై, వినుకొండదుర్గ మేలినఘనుండు
   కృతివననిక్షేపనుతతటాకాదిక, ధర్మైకసప్తసంతానఘనుఁడు

తే. "మునిపరాశరగోత్రసంజనితుఁ డార్య, సేవ్యతిరువేంగళాచార్యశిష్యుఁడు నగు,
    మంత్రి పెరుమాళ్ల కొమ్మయమనుమయోబ, మంత్రి తెలగయ భైరవమల్లమంత్రి."

    అనియున్నది.

షష్ఠ్యంతములలో

క. ఇటువంటిమంత్రినిధికిని, పటుతరవిద్యావిశేషపాండిత్యునకున్
   కటక, కలుబరిగ, ఢిల్లీ, కటక స్తవనీయసుగుణగణనిత్యునకున్

క. తిరుమల తిరువెంగళగురు, పరమకృపాలబ్ధవిభవభాగ్యాత్మునకున్
   హరిచరణక మలమధుకర, వరమతికిని జటులగంధవారణకృతికిన్.

అనుపద్యములంబట్టి యీమంత్రి గజపతిరాయనిమంత్రి యనియు, మహాపాత్రుఁ డనుబిరు దందినవాఁ డనియును, "జెంఖాన్" అనుప్రభునివలనఁ బ్రభుత్వము నంది వినుకొండకోట కధికారముచేసె ననియు, కటకము, ఢిల్లీ, కలుబరిగ మొదలగుస్థలములలో వ్యవహారము కలవాఁ డనియును, తిరుమల తిరువెంగళాచార్యులశిష్యుం డనియును దేలినది. ఇందులోఁ జారిత్రానుకూలము లగువిశేషములు పెక్కులున్నను అవిప్రత్యేకము విస్పష్టమై ప్రసిద్ధము లైనగాథలు కాకుండుటచేత నిదమిత్థమని నిర్ణయింప వీలులేదు. గజపతిరాయలవలన మహాపాత్రప్రసిద్ధబిరు దందినవాఁ డని చెప్పుటచేత ఆకాలము గజపతులు కొండవీడుదేశమును బాలించుచున్న కాల మని తోఁచుచున్నది. ఇది కృష్ణదేవరాయలు కొండవీటిదుర్గమును జయించుటకుఁ బూర్వము దీనింబట్టి యీమంత్రిశిఖామణి కృష్ణరాయలకాలమునకంటెఁ బూర్వుఁ డనియును, శ్రీనాథుఁడు, పోతరాజు మొదలయినవారికాలములోనివాఁడు కావచ్చుననియుం దోఁచు చున్నది. ప్రస్తుతములో నింత కంటె విస్తరింపవలసినది లేదు. కనుక నిపుడు మనము వ్రాయుచున్న యెఱ్ఱయకవియును ఆకాలమువాఁడే అని చెప్పెదము.

ఇందలిపైకవులశయ్యావిశేషంబులు.

నన్నయభట్టారకుని కవనంబును దిక్కన సోమయాజి కవనంబును బదశయ్యాదులం దొక్కతీరున నుండును. వీరిలోఁ దిక్కన మిక్కిలి సంగ్రహనైపుణి కలవాఁడు. ఈతఁ డేపద్యంబుఁ దాఁ జెప్పఁ దొరకొన్నను దానియందే తాఁ జెప్ప నిశ్చయించినయర్థమంతయుఁ బొందుపఱుచునుగాని తఱుచుగ నింకొకపద్యంబుతో దానికి సంబంధ ముండునట్లు చెప్పఁడు. చరణపూరణంబునకుఁ బ్రయోగింపఁబడుపొల్లుపదంబులు తిక్కన కవనంబునఁ దఱుచుగఁ గానరావు. నన్నయ తిక్కనల కవనంబుల వ్యాకరణభంగంబులుగాని ఛందోభంగంబులుగాని యుండవు. కా


వున వీరు ప్రామాణికకవు లని వాడఁబడుదురు. వీరిప్రయోగంబు లే జను లందఱుం బ్రయోగింపందగును. ఇతరకవులు వీరికి భిన్నంబుగఁ బ్రయోగంబులు సేసినను నాశబ్దంబులు బుధజనాదరణంబు నొందవు. వీరు తఱుచు ఱాకును రేఫమునకు మైత్త్రిం జెప్పి యుండ లేదు. కావున నితరకవులు వానికి మైత్రిఁ జెప్పి ప్రయోగించుటకు సంశయింతురు. వీరి కాలమునాఁ డగుభీమకవి వీనిమైత్త్రికి సమ్మతించెను. అందుల నప్పకవిమాత్రము సమ్మతింపఁడయ్యెను. దానికి నాతనిచేఁ జెప్పఁబడిన కారణము లిప్పటివారికి సమ్మతములు గావు. ఎఱ్ఱప్రెగ్గడయుఁ గవనంబున నన్న యతిక్కనలకు సరియగువాఁడు. ఈతఁడు భారతంబున మిక్కిలి తక్కువభాగంబుఁ దెనిఁగించి యుండుటంజేసి యిం దీతనిపాండిత్యము మనకుఁ దెల్లంబు గాదు. ఈతఁడు దెనిఁగించినభారతముతోఁ జేరినహరివంశంబున నీతని సామర్థ్యాతిశయంబు బోధ యయ్యెడిని. ఈతనికవనము నన్న యతిక్కనల కవనముకంటె నించుక కఠినము. విశేషించి తెనుఁగుపదంబులఁ బ్రయోంగించునిష్టము గలవాఁడు. అచ్చటచ్చట సంస్కృతజటిలంబు లగుసమాసములు గాననయ్యెడిని. అన్వయకాఠిన్యమును గలదు. పైనిచెప్పఁబడిన మువ్వురుకవులును బురాణశైలికి నెంతయుఁ దగియున్నారు. వీరికాలంబునం గలకవులచేఁ బురాణంబు లన్నియు నించుమించుగఁ దెనిఁగింపఁబడియెను. హరివంశము నాచనసోమునిచేతనుగూడఁ దెనిఁగింపఁబడియెను. ఆతఁడును బదలాలిత్యంబునకును జాతీయకవనంబునకును బ్రసిద్ధుఁడే. ఈపైని జెప్పిన కవులకల్పనలంగూర్చి పోతనామాత్యునికథలో నింకను గొంత వ్రాయఁబడును. రెండవయెఱ్ఱనకవికవిత్వము మృధుమధుర మైనది.

భారత పర్యాయనామ గ్రంథకర్తలు.

ఇదివఱలో మనము భారతనామంబున నొప్పునట్టిదియు, దాని కనుబంధమై భారతశేషమై హరివంశనామమున నొప్పునట్టిదియునగు గ్రంథమును రచియించినకవులంగూర్చియును వారితో సంబంధించిన కవులంగూర్చియు వ్రాసియున్నారము. ఇఁకముందు "జైమినిభారతము,


చిత్రభారతము" అనుమఱిరెండుగ్రంథములకుఁ గవు లగు "పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య, చరికొండ తమ్మన్న" అనువారి చరిత్రములు వ్రాయవలసి యున్నది. కాని హరివంశమును దెనిఁగించిన నాచనసోమనాథుఁ డను మఱియొకకవిచరిత్రమునుగూడ వ్రాయవలసియుండును. అతనికిఁ బ్రత్యేకము చారిత్రము వ్యాపకములో లేకయుండుటంబట్టి యతనికులగోత్రములు మఱికొందఱిచే నీవఱకే వ్రాయఁబడుటంబట్టియు నట్టివారిని చరిత్రములు గలవారితో పాటుగ వివరింపఁజాలను. ఇతనివలెనే చిత్రభారతమును రచియించిన చరికొండతిమ్మనకవియు నున్నాఁడు. కావున నతని చారిత్రమును వ్రాయఁబడలేదు. పైయిర్వురిపేరులును స్మరియించి చారిత్రవిశేషములు గలజైమినీభారతగ్రంథకర్త యగుపిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్యంగూర్చి మాత్ర మిపుడు వ్రాసెదను.



కవిజీవితములు.

5.

పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.

ఇతఁడు నియోగిశాఖాబ్రాహ్మణుఁడు. తండ్రిపేరు గాదయమంత్రి. అన్న పేరు పెదవీరభద్రయ్య. ఇతఁడు సాళువగుండ నృపాలుని యాస్థానపండితుఁడు. ఈరాజు సభ్యులం జూచి జైమినిభారత మాంధ్రీకరించుటకుఁ దగువార లెవ్వ రని యడుగఁగా నాపండితులు పినవీరభద్రయ్యవంశవిశేషముల నీక్రిందివిధమున వర్ణించిరి. ఎట్లన్నను :-

సీ. అమృతాంశుమండలం బాలవాలము గాఁగ, ములిచె నొక్కటి జగన్మోహనముగఁ,
   జిగిరించె విలయసింధుగతకైతవడింభ, శయనీయవరపలాశములతోడఁ
   బితృ దేవతులకు సంచితసత్త్రశాలయై, చెట్టు గట్టెను గయాక్షేత్రసీమ
   నిలువ నీడయ్యె నిందీవరప్రియకళా, కోటీరునకు భోగికుండలునకు