కవి జీవితములు/తిక్కన సోమయాజి

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

కవిజీవితములు.

3.

తిక్కన సోమయాజి.


ఇతఁడు భారతములోని పదేనుపర్వముల నాంధ్రీకరించినకవి. ఈతనివలననే యీతనివంశమును గోత్రమును జెప్పఁబడినది. అందొకటి యితనిప్రథమప్రబంధ మగునిర్వచనో త్తరరామాయణములోను, రెండవది భారతములోని విరాటపర్వములోను గాన్పించును. అందు మొదటిదానిలో :-

మ. "అమరోదాత్తమనీషి నే నుభయకావ్యప్రౌఢిఁ బాటించుశి
     ల్పమునం బారగుఁడన్ గళావిదుఁడ నాపస్తంబసూత్రుండ గౌ
     తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ న
     న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుఁడఁ దిక్కాఖ్యుండ సన్మాన్యుఁడన్."

         అనియును, రెండవదానిలో :-

సీ. "మజ్జనకుండు సన్మాన్యగౌతమగోత్ర, మహితుండు భాస్కరమంత్రితనయుఁ
    డన్న మాంబాపతి యనఘులు కేతన, మల్లన సిద్ధనామాత్యవరుల
    కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు, కొమ్మనదండనాథుండు మధురకీర్తి
    విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రప, విత్రశీలుఁడు సాంగవేదవేది."

అనియుం జెప్పెను.

పై రెండుపద్యములలో మొదటిదానింబట్టి యాలోచింపఁగాఁ దిక్కనసోమయాజి యజుర్వేదియనియు నాపస్తంబసూత్రుఁ డనియు, గౌతమగోత్రుఁ డనియుఁ దెలియుచున్నది. ఇతనితల్లిపేరు అన్న మ్మ, తండ్రిపేరు కొమ్మన్న, మంత్రిశబ్దముఁ బ్రయోగించుటంబట్టి యితఁడు నియోగిశాఖాబ్రాహ్మణుఁడు అని స్పష్టమే.

సోమయాజితండ్రి.

ఇఁక రెండవపద్యముంబట్టి యితనితండ్రి యగుకొమ్మనామాత్యుని వృత్తాంతము కొంత తేటఁబడుచున్నది. అందుఁ గొమ్మనామాత్యుఁడు భాస్కరమంత్రికుమారుఁ డనియును, కేతన, మల్లన, సిద్ధన యను మంత్రిశిఖామణుల తమ్ముఁ డనియును, గుంటూరికి అధికారి యనియు, సేనానాయక వృత్తిలో నుండె ననియును పవిత్రస్వభావుఁ డై యుండె ననియును సాంగోపాంగముగ వేదముల నభ్యసించె ననియును గలదు.

సోమయాజితాత.

తిక్కనసోమయాజితాత యగు భాస్కరుఁడు గుంటూరికిఁ బ్రభుఁడగునొకసామంతునకు మంత్రిగా నుండె నని యుత్తర రామాయణములోనిమఱియొక పద్యమువలనఁ దేలుచున్నది. కాని యీయన భాస్కరునికుమారుఁ డగుకొమ్మన్న దండనాథుఁడు గా నుంనుటచేత నీగ్రామ మతనికి శ్రోత్రియముగా నీయంబడి యుండనోవును.

సోమయాజివాసస్థలము.

తిక్కనసోమయాజితండ్రియుఁ దాతయు గుంటూరిలో నున్నట్లు కాన్పించుటచేతఁ దిక్కనసోమయాజియును, అక్కడ జనించినవాఁడే అని స్పష్ట మగుచున్నది. ఇట్లుండఁగ నీసోమయాజి నెల్లూరువాస్తవ్యుఁడని కొందఱిచేతను, గుంటూరుజిల్లాలోని ప్రాటూరుకాఁపురస్థుఁ డని మఱికొందఱిచేతను జెప్పంబడును. నెల్లూరిప్రభుఁ డగుమనుమసిద్ధి రాజు పేరిట సోమయాజి తననిర్వచనోత్తర రామాయణము కృతి యిచ్చుటంజేసియు, భారతము హరిహరనాథునిపేరిటఁ గృతి యిచ్చుటచేతను నీతఁడు నెల్లూరువాసస్థుఁ డనువాడుక కల్గినది. ఇందు మొదటిగాథనుబట్టి అక్కడ నివాసము స్థిరపఱుప వీలు లేదు. పూర్వము కవీశ్వరులు దేశదేశములు తిరిగి, ఎక్కడ రసికు లగుప్రభువు లుందురో అక్కడఁ గొన్నిదినంబు లుండి యాప్రభుని కొకకృతి యిచ్చి బహుమతుల నంది మరల స్వస్థలమునకుఁ బోవుచుండునాచారము గలదు. అటులనే సోమ


యాజియుఁ జేసియున్నాఁ డని ఆతని రెండవగ్రంథ మగుభారతములో మనుమసిద్ధియాస్థానములోనివాఁడ నని యుచ్చరింపఁబడకపోవుటచేత నిస్సంశయముగాఁ జెప్పనొప్పి యున్నది. ఇఁక రెండవశంకకు సమాధాన మెట్లన్న - భారతములో స్మరియింపఁబడిన హరిహరనాథుఁడు అర్చావతారరూపుఁ డై నెల్లూరున వేంచేసి యున్న హరిహరనాథుఁడు కాక కేవలమును నద్వైతుల కుపాస్యుం డగుహరిహరులకు నధినాథుఁ డగునద్వయనిర్గుణబ్రహ్మ మని భారతములోనియాశ్వాసాద్యంత పద్యముల నద్వైత శాస్త్రసంప్రదాయమునఁ జూచిన స్పష్టము కాఁగలదు. కావునఁ బై రెండుయుక్తులును సోమయాజి నెల్లూరుపురవాసి యని చెప్పుటకుం జాలవు. భారతరచనాపూర్వకాలములో సోమయాజి కాశీయాత్రఁ జేయుచుఁ గాశినుండి యీగ్రంథరచనకు వచ్చియున్నాఁ డని చెప్పెడుసంప్రదాయజ్ఞవాక్య ముభయపక్షములలో నిర్బాధకమే అయి యున్నది. పై నుదాహరింపఁబడిన ప్రాటూరుగ్రామవాసి యనుదాని నింకొకవిధముగా సమన్వయించెదము. గుంటూరువాసమునకుఁ బూర్వము సోమయాజితండ్రితాతలు ప్రాటూరుగ్రామవ్యాస్తవ్యులు కానోవుదురు. దానింబట్టి యీకుటుంబము వారికి 'ప్రాటూరివారు' అనుగృహనామము కల్గి యుండును. అనంతరము సోమయాజివంశస్థులు లౌకికు లగుటచేత వ్యాపారాంతరముల నితరదేశములకుఁ బోయి యుండినను గృహనామముమాత్రము ప్రాటూరివారే అని యుండుట ఆంధ్రదేశసంప్రదాయము కావున వీరికిని నట్లె అయ్యె నని సిద్ధాంతము.

సోమయాజిచే రచియింపఁబడినకావ్యములు.

ఇతఁడు ప్రథమములో నిర్వచనముగ రామాయణముతోఁ జేరిన యుత్తరకాండముఁ దెనిఁగించెను. దీనినే నిర్వచనోత్తరరామాయణమని వాడెదరు. అనంతరమున సంస్కృతమహాభారతములోని పదేనుపర్వముల నాంధ్రీకరించెను. కవివాగ్బంధన మనులక్షణగ్రంథముంగూడ రచియించెను.

ఆంద్రభారతము.

సోమయాజికృతము లగుప్రసిద్ధగ్రంథములు రెంటిలోపలను భారతగ్రంథమువలన నాతనికవిత్వమహత్త్వము జగద్విదితమైనది. కావున మనము ముందుగ భారతరచనకుం గలకారణములం జెప్పి అనంతరము నిర్వచనోత్తర రామాయణగ్రంథరచనావృత్తాంతమును వివరింతము భారత మాంధ్రీకరించుటలో సోమయాజి యుద్దేశ మితరులవలన నెట్లు గా వాడుకొనంబడినను దాని నంతయు విరాటపర్వారంభంబున నాతని చేతనే వివరింపబడి యున్నది. దాని నీక్రింద వివరించెదము :-

ఉ. శ్రీ యన గౌరి నఁ బరఁగుచెల్వకుఁ జిత్తము పల్లవింప భ
    ద్రాయితమూర్తి యై హరిహరం బగురూపముఁ దాల్చి విష్ణురూ
    పాయ నమశ్శివాయ యని పల్కెడుభక్తజనంబువైదిక
    ధ్యాయిత కిచ్చ మెచ్చుపరతత్త్వముఁ గొల్పెద నిష్టసిద్ధికిన్.

వ. అని సకలబ్రహ్మప్రార్థనంబుఁ జేసి తత్ప్రసాదాసాదితకవిత్వతత్త్వనిరతిశయానురూపానందభరితాఁతఃకరణుండ నగుచుండి యొక్క నాఁ డిట్లు వితర్కించితి.

శా. విద్వత్సం స్తవనీయభవ్యకవితావేశుండు విజ్ఞానసం
   పద్విఖ్యాతుఁడు సంయమిప్రకరసంభావ్యానుభావుండుఁ గృ
   ష్ణద్వైపాయనుఁ డర్థి లోకహితనిష్ఠం బూని కావించె థ
   ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగులేఖ్యం బైనయామ్నా యమున్.

క. వేదములకు నఖిలస్మృతి, వాదములకు బహుపురాణ వర్గంబులకున్
   వా దైనచోటులను దా, మూదల ధర్మార్థకామమోక్షస్థితికిన్.

          వ. అదియును.

ఉ. ఆదరణీయసారవివిధార్థగతిస్ఫురణంబు గల్గి య
   ష్టాదశపర్వనిర్వహణసంభృత మై పెను పొంది యుండ నం
   దాదిదొడంగి మూఁడుకృతు లాంధ్రకవిత్వవిశారదుండు వి
   ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్.

మ. హృదయాహ్లాది చతుర్థ మార్జితకథోపేతంబు నానారసా
    భ్యుదయోల్లాసి విరాటపర్వ మట నుద్యోగాదులుంగూడఁ గాఁ
    బదు నేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్థ్యంబు లై పెంపునన్
    దుది ముట్టంగ రచించు టొప్పు బుద్ధసంతోషంబు నిండారఁగన్.

ఈపైపద్యములలోనికథసోమయాజి స్వయముగఁ జెప్పినవృత్తాంతము గావునఁ బుక్కిటిపురాణములకంటెఁ బూర్ణముగ విశ్వసనీయము గదా! కనుక దానిం జెప్పెడుపద్యముల వివరించినాఁడను, ఇపు డందులకథా సంగ్రహము వ్రాసెదను, ఎట్లన్న :- తిక్కనసోమయాజి హరిహరనాథ రూపుఁ డగుపరవస్తువును సకలబ్రహ్మవస్తువుగా ననఁగా సగుణబ్రహ్మముగాఁ బ్రార్థనము చేసి యట్టి సగుణబ్రహ్మయొక్క ప్రసాదముచేత లబ్ధమైనకవిత్వతత్త్వనిరతిశయానురూపానంద భరితాంతఃకరణుఁ డై యుండి యొక్కనాఁడు తనలో నిట్లుగా నాలోచించుకొనియెను. తొల్లి కృష్ణ ద్వైపాయను డనంబరఁగువ్యాసమహర్షి లోకహితార్థము ధర్మాద్వైతస్థితికొఱకుఁ బంచమవేద మనంబరఁగు భారతమును రచియించెను. అది పదునెన్మిదిపర్వములుగా నుండును. అందు మొదటిమూఁడు పర్వములను ఆంధ్రకవిత్వవిశారదుం డగునన్న యభట్టారకుఁడు తెనింగించెను. ఇఁక నాల్గవపర్వము మొదలు అనఁగా విరాటపర్వము మొదలు పదేనుపర్వములు జనసంప్రార్థ్యము లౌటం జేసి తుదముట్ట నాంధ్రీ కరించుట తగవు. అని ఇట్లు చెప్పుట నావఱకు నొకపండితునిచేఁ దెలిఁగింపఁబడిన భాగముంగూడ మరలఁ దాను దెలిఁగించినచో నాతనిభాగము లోకములో వ్యాపింపకయే యుండును; ఆకవినామమును శాశ్వతముగా నుండకపోవు నని యెంచి యందులకు సోమయాజి సమ్మతింపక పోవుటచే భారతము ప్రథమమునుండి ప్రారంభించ లేదని యూహింప నై యున్నది. సోమయాజి పైవిధముగ వ్రాసి గ్రంథరచనాకుతూహలంబున నుండి యీప్రబంధమండలికిఁ గృతిపతి నెవ్వరిం బేర్కొనువాఁడ నని యున్న సమయంబున నతనికిఁ గొంచెము నిద్రవచ్చెను. అపుడొక స్వప్నం బాయె నని దాని నీక్రిందివిధముగ వివరించుచున్నాఁడు. ఎట్లన్నను :-

సీ. "మజ్జనకుండు సన్మాన్యగౌతమగోత్రమహితుండు భాస్కరమంత్రితనయుఁ
    డన్నమాంబాపతి యనఘులు కేతన మల్లన సిద్ధనామాత్యవరుల

    కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొమ్మనదండనాథుండు మధురకీర్తి
    విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రుపవిత్రశీలుఁడు సాంగవేద వేది
    యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్ల, నస్మదీయప్రణామంబు లాదరించి
    తుష్టి దీవించి కరుణార్ద్రదృష్టిఁ జూచి, యెలమి నిట్లని యానతి యిచ్చె నాకు.

శ్లో. కి మస్థిమాలాం కిము కౌస్తుభం వా, పరిష్క్రియాయాం బహుమన్య సే త్వమ్,
   కిం కాలకూటః కిమువా యశోదా, స్తన్యం తవ స్వాదు పద ప్రభో మే."

వ. అని నీవు తొల్లి రచియించినపద్యము గాఢాదరంబున నవధరించి భక్తవత్సలుం డగుహరిహరనాథుండు నీదెస దయాళుం డై యునికింజేసి నిన్నుఁ గృతార్థునిఁగా జేయఁ గార్యార్థియై నాకలోకనివాసి నైననాకుఁ దనదివ్యచిత్తంబునం గలయాకారుణ్యంబు తెఱం గెఱుంగునట్టి శక్తి ప్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించుకొని వీఁడె విజయంబు చేయుచున్నవాఁ డనుచు జూపుటయు సవిశేషసంభ్రమ సంభరితహృదయుండ నై యవ్వలను గలయం గనుంగొని.

అని సోమయాజి తాను హరిహరనాథుని సుతియించినట్లును అపు డా దేవుఁడు తనయెడ దయాళుఁడై :-

క. "పారాశర్యునికృతి యయి, భారత మనుపేరఁ బరఁగు పంచమ వేదం
    బారాధ్యము జనులకుఁ ద, ద్గౌరవ మూహించి నీ వఖండితభక్తిన్.

గీ. తెనుఁగుబాస వినిర్మింపఁ దివురు టరయ, భవ్యపురుషార్థతరుపక్వఫలము గాదె
    దీని కే నియ్యకొని వేడ్క నూని కృతిప, తిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ".

అని హరిహరనాథుం డానతియ్యఁగఁ దా నందులకు నియ్యకొంటి నని సోమయాజి తెల్పి :-

ఉ. "కావున భారతామృతముఁ గర్ణపుటంబుల నానఁ గ్రోలునాం
    ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయసంస్మృతి
    శ్రీవిభవాస్పదం బయినచిత్తముతోడ మహాకవిత్వదీ
    క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదన్ గృతుల్."

    అని చెప్పెను.

సోమయాజి స్వకీయ శిష్టత్వమును బ్రకటించుట.

భారతము పంచమవేద మని ప్రసిద్ధిఁ జెందిన గ్రంథము. అట్టిదానిం దెనిఁగించు నవసరములోఁ దనకును దనవంశమునకును గల శ్రేష్ఠత్వమును, దేవతాభక్తి మొదలగువానిని బ్రకటింపక యున్నచోఁ దన గ్రంథము సర్వజనాదరణపాత్రము కా దనుతలంపుతో సోమయాజి


పై స్వప్న సందర్భములో హరిహరనాథుండు తన నుద్దేశించి యీక్రింది విధంబుగఁ బల్కె నని వ్రాసె. ఎట్లన్నను :-

ఉ. వైదికమార్గనిష్ఠ మగువర్తనముం దగ నిర్వహించుచున్
    భేదము లేనిభక్తి నతినిర్మలవృత్తిగఁ జేయుచుండి మ
    త్పాదనిరంతరస్మరణతత్పరభావముకల్మి నాత్మస
    మ్మోదముఁ బొంది కావ్యరసముం గొనియాడుచు నుండు దెప్పుడున్.

అని సోమయాజి తనకుఁ గలవైదికమార్గనిష్ఠ మగుప్రవర్తనమును, హరిహరులయెడ భేదము లేక సమభక్తి కల్గి యుండుటయును స్మరియించి తదుభయ సగుణమూర్త్యధిదేవత యగుహరిహరనాథునియెడ నిరంతరభక్తి గల్గి యాత్మానందానుభవంబు గల్గి యున్నట్లు చెప్పెను. ఇట్లుగా స్వప్నంబు గల్గినట్లుగ మిషఁ గల్పించుకొని స్వాభిప్రాయ ప్రకటనము చేయుట పూర్వకవులలో నాచారమై యున్నట్లు కాన్పించును. ఇందులో నప్పకవిస్వప్నమువలె దేశచారిత్రము లేదు కావునను, స్వప్నములో నుపాసకులకుఁ దదుపాసనాదేవతలును, అన్యులకు జాగ్రత్పరిదృశ్యమానప్రపంచవస్తు విశేషంబులు నగపడుట సహజము కావున దానిని నమ్మినను నమ్మకయున్ననుఁ బాఠకులకు బాధక మేమియు లేదు. కాని స్వప్నములను నమ్మి వానిని గ్రంథస్థముఁ జేసినయాంధ్రకవులలో నీతఁడే మొదటివాఁడు. భగవదుపాసనాపరులకుఁ దన్మూలముగ నంతఃకరణపరిపాకము కల్గి యిట్టిభగవదనుగ్రహసూచకస్వప్నంబు లగుటయు విశేషమహత్తులు లభ్యమగుటయు నైసర్గికములే యని యాస్తికులకు విశేషించి చెప్పవలసినది లేదు. సోమయాజియు నట్టియుపాసనాబలంబున విజ్ఞానసంపన్నుఁ డై భారతరహస్యార్థములఁ దెలిసికొని వేదముం బ్రకటించినచతురాననప్రతిష్ఠ నంది యుండె నని చెప్పుటకు సందియము లేదు. ఇట్టిఘనకార్యము నిర్వహించుటచే నీసోమయాజియనంతరకాలములోని పురాణకవులలో విశేషజ్ఞులు సోమయాజిని జతురాననుఁడే యని నుతియించుచు వచ్చిరి. హరివంశములో నెఱ్ఱాప్రగ్గడ :-

మ. తనకావించినసృష్టిత క్కొరులచేతం గాదు నా నేముఖం
    బునఁ దాఁ బల్కిన పల్కు లాగమము లై పొల్పొందు నా వాణి న
    త్తను నీతం డొకరుండ నాఁ జను మహత్త్వాప్తిం గవిబ్రహ్మ నా
    వినుతింతుం గవితిక్కయజ్వ నిఖొలోర్వీ దేవతాభ్యర్చితున్.

    భీమఖండములో శ్రీనాథకవి.

ఉ. పంచమవేద మై పరఁగుభారతసంహిత నాంధ్రభాషఁ గా
    వించెఁ బదేనుపర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
    క్కాంచనగర్భతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
    ర్వంచితకీర్తివైభవవిరాజికిఁ దిక్కనసోమయాజికిన్.

సోమయాజి భారతముం దెనిఁగింప నుద్యుక్తుం డగుట.

పైనిఁజెప్పినవిధంబుగఁ దిక్కనసోమయాజి సాత్యవతేయసంస్మృతి గలచిత్తముతోడ మహాకవిత్వదీక్ష నంది షష్ఠ్యంతములం జెప్పి హరిహరనాథు నుతియించి ఆదేవునకుఁ దాను విన్నపము సేయుతెఱంగునఁ దత్సన్నిధిం గల్పించుకొని అమ్మహా వాక్యంబున నర్థంబు సంగతంబు చేసెదనని మరల భక్తిపారవశ్యంబునఁ దనహృదంతరంబున నీక్రింది విధంబుగ భజనంబు చేసితి నని చెప్పెను. ఎట్లన్నను :-

క. జలనిధిహిమవద్భూధర, కలితజనన కేళికాతుకవ్యక్తావ్య
   క్తలలితసౌందర్యస్ఫుర, దలఘుతను స్త్రీసనాథ హరిహరనాథా.

అను నీపద్యములో వ్యక్తావ్యక్తలలితసౌందర్యస్ఫురదలఘుతను స్త్రీననాథుఁడు హరిహరనాథుఁ డని చెప్పుటచేతను దనయుపాస్య దేవుఁడు మహాదేవుం డగుశివు డని మఱియొకచోఁ జెప్పుటచేతను సోమయాజి యద్వయబ్రహ్మమయుండును, జ్ఞానప్రదుండును తేజోమూర్తియు నగు దక్షిణామూర్తి నుద్దేశించి చెప్పెననుటకు సందియము లేదు. ఇట్టి సంప్రదాయములు మంత్రశాస్త్రరహస్యములు. ఇట్టి తనయుపాస్యమూర్తి సాన్నిధ్యంబు గల్గించుకొని.

వ. దేవా! దివ్యచిత్తంబున నవధరింపుము :

గీ. కథ జగత్ప్రసిద్ధి గావునఁ బూర్వప, ర్వార్థయుక్తిఁ జేయునట్టియెడల
   యత్న మించుకంత యైనను వలవదు, వలసినట్లు చెప్ప వచ్చియుండు.

   అని విన్న వించి సోమయాజిగ్రంథారంబు సేసె నని యున్నది.

పైపద్యము పరిశీలింపఁగఁ దిక్కనసోమయాజివలనఁ జేయంబడిన మఱియొకనియమము మనచరిత్రమునకు ముఖ్య మగునది బయలువెడలు చున్నది. అదియే లోకములో సోమయాజి భారతముఁ దెనిఁగించుచో సంస్కృతమాతృకను జూడకయే భారతగ్రంథము అశుధారను నిరంకుశప్రజ్ఞతోఁ జేసియున్నాఁ డని చెప్పెడుప్రతీతికిఁ గారణ మయు యుండును. ఆయంశ మెద్ది యనఁగా :- భారతకథ జగత్ప్రసిద్ధ మయినది. కావున పూర్వపర్వార్థములను సందర్భింపఁ జేయునప్పుడు యత్న మే మాత్ర మక్కఱ యుండ దనియును, ఇష్టానుసారముగ సందర్భము పొసఁగింపవచ్చు నని చెప్పినవాక్యమే. దీని కర్థము బుద్ధిమంతు లేమిచెప్పవచ్చునో యూహింపుఁడు. ఇది చదివినయప్పుడు పుక్కిటిపురాణములుగా వాడుకొనఁబడుచున్న తిక్కనసోమయాజికృత ప్రతిజ్ఞాదికమున కిది యాధారమై యుండు నని తోఁచకపోదు.

తిక్కనసోమయాజి వ్యాసుని నుతించుట.

సోమయాజి తనకు భారతకృతనిర్మాత యగువ్యాసమహర్షి పయింగలభక్తివిశ్వాసములను అవకాశమైనప్పుడెల్ల వివరింపుచుండును. ప్రతి యా శ్వాసమున నాద్యంతములలో హరిహరనాథుని నుతియించినట్లుగనే వ్యాసభగవానునిఁగూడ స్మరియించుచుండును. సోమయాజికి భారతరహస్యార్థములు స్ఫురియించుచో వ్యాసావేశంబు గల్గియుండె నని ప్రతీతి గలదు.

సోమయాజికిఁ గలశాస్త్రపాండిత్యము.

సోమయాజికి వేదాంతాదిశాస్త్రములందును, సాంఖ్య యోగాదిశాస్త్రములలోపలను గలవిశేషపాండిత్యము శాంత్యానుశాసనిక పర్వములను తక్కినపర్వములలోఁ దత్త్వముం జెప్పెడునితిహాసాదుల వలనం గోచరంబులు గాఁ గలవు. పూర్వోత్తరమీమాంసాశాస్త్రము


లెంతయు నేర్చినవాఁ డని సోమయాజి జైనపండితులతోఁ జేసినసంవాదాదికములవలనం గోచరం బగును. అట్టివానివివరములు గ్రంథస్థములు గాకున్నను, అట్టి సంవాదములవిషయముమాత్రము సోమదేవ రాజీయము మొదలగుగ్రంథములలోఁ గొంత వివరింపఁబడి యున్న దాని నే నీవఱకే ప్రకటించితిని. ఆవృత్తాంతమును వివరించుటకు ముందుగ నద్వైతమతబోధ మాంధ్రభాషలోఁ జేసినయాచార్యులలో సోమయాజియే మొదటివాఁ డని చెప్పవలసి యున్నది. ఆంధ్రులలోఁ దత్త్వరహస్యము లరయఁగోరెడునాంధ్రభాషాపండితు లందఱును సోమయాజిమార్గముం దెలిసికొనకయే యితరగ్రంథము లభ్యసింపరు. ఇఁక వేదాంతగ్రంథములు తెనిఁగింప నుద్యోగించువా రందఱును సోమయాజిమార్గమునే యవలంబించి నవీనగ్రంథములు రచియించిరి.

ఇట్టివారిలోఁ బౌరాణికకవు లందఱును దా మాంధ్రీకరించుగ్రంథములలోఁ బ్రసక్తమైనచోటుల నెల్ల మతోపన్యాసములఁ బద్యరూపముగాఁ జేయుచునే వచ్చుచుండిరి. అందులో భారతమును, భాగవతమును, జ్ఞానవాసిష్టమును, విజ్ఞానప్రదీపికయును, సీతారామాంజనేయసంవాదము మొదలగుగ్రంథములను రచియించినగ్రంథకర్తలు సోమయాజితోపాటు కేవలమును గురురూపులుగా నాంధ్రులవలన గ్రహింపఁబడినవారై యున్నారు. ఇట్టివారిలోఁ భారత మన్ని గ్రంథములలో నెట్లు ప్రామాణికగ్రంథ మయ్యెనో అటులనే అద్వైతశాస్త్రబోధకు లగుకవులలోఁ దిక్కనసోమయాజియు గౌరవనీయుఁడును, అగ్రగణ్యుఁడును నై యున్నాఁడు. ఇట్టివిశేషములను జూపుటకును కేవలము ఆంధ్రభాషలోపలనే అద్వైతమతబోధము కోరువారికి నుపయుక్తముగ నుండుటకొఱకు పైగ్రంథములన్నిటిలో నుండుతత్వవిషయికము లగుభాగముల నెత్తి వేఱే యొకగ్రంథము పర్యాయమున నచ్చు వేయుచున్నాఁడను.

తిక్కనసోమయాజి కాకతీయ గణపతి మాహారాజుం జూడఁబోవుట.

సోమదేవరాజీయ మనుప్రతాపరుద్రవంశచారిత్రములోఁ బ్రతాపరుద్రునిమాతామహుఁ డగుగణపతిదేవరాయని దర్శించుటకుఁ దిక్కన


సోమయాజి వచ్చె ననియు నపుడు కొన్ని రాజకీయవ్యవహారములును మతసంవాదములు నడిచె ననియుం జెప్పి యున్నది. ఇట్టివృత్తాంతము లావంశచారిత్రముం దెల్పుగ్రంథములన్నిటిలోపల నేకరీతినే కాన్పించును. ఆగ్రంథములలో నొకటిరెండు ప్రామాణికగ్రంథములుగఁ గాన్పించును. అందు మొదటిది వచనకావ్యము. ఇది పుట్టి యిప్పటికి 300 సంవత్సరములకుఁ బైఁగా ననఁగా శా. సం. 1500 సమానకాలములోఁ బుట్టి యుండును. రెండవది దానికే పద్యకావ్యము. అది పుట్టి 150 సంవత్సరములై యున్నది. ఈరెండుగ్రంథములును గోదావరీమండలములోని రహితాపురము రఘుదేవపుర మనునామములతో నొప్పు పట్టణమునకుఁ బూర్వపుజమీన్‌దారు లగుమందపాటివా రనుక్షత్రియ ప్రభువులవలన సంపాదింపఁబడినవి. అందుఁ బద్య కావ్యము కూచిమంచి తిమ్మకవిసార్వభౌమునితమ్ముం డగుజగ్గకవివలనఁ బై మందపాటివారిపైఁ గృతియియ్యఁబడినది. పై రెండుగ్రంథములలోపలంగూడఁ దిక్కనసోమయాజివృత్తాంత మొక్కవిధముగనే వ్రాయంబడి యున్నది. కావున వచనకావ్యములో నున్న దాని నిట వివరించెదను. ఎట్లన్నను :-

"గణపతిరా జేకశిలానగరంబునకు వచ్చి, తనకు మరలఁబడ్డతమ్ములం బ్రహరించి తాను పట్టాభిషిక్తుఁడై యోరుగంటికి శిలాప్రాకారంబుగాఁ గోట నేర్పఱచి, చేయం గడమపడిన దేవాలయంబులను బూర్తిగాఁ గట్టించి యున్న సమయంబునఁ దిక్కనసోమయాజు లేతెంచిన గణపతి దేవు లెదుర్కొని పూజించి యతనిచేత భారతార్థంబులును, ద్వైతాద్వైతంబులును, చినచిద్వివేకంబులును, ధర్మాధర్మంబులును, రాజనీతి ప్రకారంబులును, భారతవీరుల ప్రభావంబులును నాదిగాఁ గలయర్థంబులు వినుచుండె. అట్టిసమయంబున నొక్కనాఁడు తిక్కనసోమయాజి యనుమకొండనివాసు లైనబౌద్ధమునులతో వాదించి యెనుబదినల్గుర బౌద్ధమునుల నఱికించె. అనంతర మాగ్రంథములో గణపతిదేవుఁడు తిక్కనసోమయాజికి నెన్మిదిగ్రామంబులును, నవలక్ష ధనంబును, స్వర్ణకుండలములును బహుమానంబుగ నిచ్చె."

అని యున్నది. ఈవృత్తాంతము పద్య కావ్యములోఁగూడ విశేష భేదము నొందకుండ నున్నది. ఎట్లన్నను :-

"గీ. వచ్చి తనకు మఱలఁబడ్డతమ్ములను హ, రించి సకలగహ్వరీస్థలికినిఁ
    బ్రాజ్ఞు లెన్నఁగాను బట్టాభిషిక్తుఁడై వీటికొక్కఱాతికోట నిలిపె.

గీ. చేయఁ దక్కువ యైన దేవాయతనము, లపుడు పూర్తిగఁ గట్టించి యలరుచున్న
   చోట నొకనాఁడు తిక్కనసోమయాజి, వచ్చె నెల్లూరినుండి భూవరునికడకు.

సీ. వచ్చిన నయ్యార్యవర్యు నెదుర్కొని, వినయసంభ్రమభక్తు లినుమడింప
   నతిథిపూజ లొనర్చి యతనిచే భారతా, ర్థమును ద్వైతాద్వైతతత్త్వములును
   విస్తృతచిదచిద్వివేకలక్షణములు, ప్రకటధర్మాధర్మ పద్ధతులును
   రాజనీతిప్రకారంబును భారత, వీరులమహిమంబు వినుచు నుండి

గీ. యనుమకొండనివాసు లైనట్టిబౌద్ధ, మునుల రావించి వారిఁ దిక్కనమనీషి
   తోడ వాదింపఁ జేసినఁ దొడరి వాండ్ర, జులకఁగా సోమయాజులు గెలుచుటయును.

వ. అప్పుడు బౌద్ధదేవాలయంబులు గూలం ద్రోయించి గణపతిదేవరాజు సోమయాజులపటువాక్యశక్తికి మెచ్చి యతని బహుప్రకారం బులఁ బూజించి యెనిమిది గ్రామంబు లొసంగి యతఁడు వచ్చినకార్యం బడిగిన నాభూవరునకుఁ గవివరుం డిట్లనియె."

సోమయాజి మనుమసిద్ధిరాజునకుఁ గలిగినవిపత్తు తెల్పుట.

పైని చెప్పినవిధంబున సోమయాజి బౌద్ధమునులను జయించి గణపతిరాజుతో నెల్లూరునకు బ్రభుం డగుమనుమసిద్ధిరాజునకు దాయాదులవలనఁ గలిగినరాజ్యవిహీనతవిధంబు తెల్పెను. ఇట్లు తెల్పి ఆమనుమసిద్ధి రాజుయొక్క దాయాదులఁ బాఱఁదోలి అతనిరాజ్య మాతనికి నిప్పింపుఁ డని చెప్పిన విని గణపతిదేవరా జందుల కంగీకరించి, నవలక్షధనమును, యజ్ఞకుండలములును తిక్కనసోమయాజికి బహుమాన మిచ్చి పనిచెను.

గణపతిదేవునిమంత్రింగూర్చి సోమయాజి రాజుతో ముచ్చటించుట.

ఇట్లు సోమయాజి గణపతిదేవరాజువలన స్వదేశంబునకుఁ బోవుట కనుజ్ఞాతుండై గణపతిదేవునిమంత్రి యగు "శివదేవయ్య" అను నతనిం జూచి గణపతిదేవునితో నిట్లనియె. "రాజా ! ఈమంత్రి దేవుండు గాని సామాన్యమనుష్యమాత్రుండు గాఁడు. నీవు రాజ్యభారం బితని యనుమతంబునఁ జేయుట శ్రేయోదాయకము" అని సోమయాజి చెప్పి నిజనివాసంబునకు జనియెను.

గణపతిరాజు మనుమసిద్ధిని మరల సింహాసన మెక్కించుట.

ఇట్లు సోమయాజిం బనిచి గణపతిదేవరాజు తనమంత్రి యగు శివదేవయ్యయనుమతిం గొని ప్రయాణభేరి వేయించి చతురంగబలసమేతుం డై దండయాత్రకు బయలువెడలెను. ఇట్లు పోయి ముందుగ వెల్నాటిరాజుం గెల్చి యతనిం దనయాజ్ఞకుఁ లోనుజేసికొని యప్పనంబులు గొని నెల్లూరిపై విడిసెను. అక్కడ నపు డధికారము చేయుచున్న "అక్కన, బయ్యన," అనుమనుమసిద్ధిరాజుదాయాదు లగువారిని మనుమసిద్ధిరాజును సింహాసనవిహీనునిం జేసిననేరమునకుఁగాను దండించి, వారిబిరుదులు తనకు ధారణయోగ్యంబులు కా వని వానిని తేరాల రుద్రారెడ్డి యనునొకసామంతునకు ధరియింప నిచ్చెను. ఇట్లు చేసి మనుమసిద్ధిరాజును నెల్లూరునకుఁ బిలిపించి మరల నాతని నారాజ్యమునకుఁ బట్టంబుగట్టి అతనికి స్వాధీనము గానియిరువదినాల్గుదుర్గంబుల సాధించి యతనికి రెండువేలయేనూఱుగ్రామంబులఁ జెల్లంజేసి, ఒక్క తటాకంబును గట్టించె. ఇట్లుగాఁ జేసి గణపతి రాజు మనుమసిద్ధి రాజుచేఁ బూజితుం డయి తనదేశంబులోని దగుగంగాపురంబునకు వచ్చెను. ఈ కథవలన సోమయాజి కాలములోనిరాజుల కతనియెడ నెట్టిగౌరవము గలదో తెలిసికొనవచ్చును.

సోమయాజిసంతతి.

ఇంతవఱకును సోమయాజికి మతవిషయములోపలను, లౌకిక విషయములోపలను గలవిశేషములను వివరించినారము - ఇఁక సోమయాజిసంతతిం గూర్చి వివరింపవలసి యున్నది. అట్టిపనికి నిదర్శనములను విస్పష్టముగఁ జూపెడు గ్రంథదృష్టాంతము లెవ్వియుం గానరావు. కాని జ్ఞానవాసిష్ఠము నాంధ్రీకరించినకవి సోమయాజికిఁ దాను సంబంధుఁడ నని కొంత వ్రాసి యుంచెను. దాని నిచ్చో వివరించెదను. దాని నట్లు వివరించుటకుఁ బూర్వము "ఆంధ్రకవిచరిత్రము" అనుగ్రంథములో వివరింపఁబడినయొకగాథ తెలుపవలసి యున్నది. అందులో - తిక్కన


సోమయాజికుమారుం డగుమారనకవి మార్కండేయపురాణముం దెనిఁగించి ప్రతాపరుద్రదేవునిమంత్రి యగునాగయగన్నమంత్రికిఁ గృతి యిచ్చినట్లుగాఁ జెప్పంబడి యున్నది. అందులోనే మఱియొకచోఁ బైనిఁ జెప్పినమారనకవి సోమయాజికుమారుండు కాఁడనియును, మఱియొక తిక్కనామాత్యునికుమారుం డనియును, నొకానొక రనిరి గాని దాని కాధార మేదియుఁ గానరా దని యుండెను. కాని యాగ్రంథములోని సందర్భము చూచినమాత్రముననే మారనకవి సోమయాజికుమారుఁడు కాఁడని స్పష్టముగ నూహింప నయ్యెడిని. తిక్కనసోమయాజికొమారుని పేరు మారన యని వాసిష్ఠరామాయణకవివలనం గాని, మఱియేయితరగ్రంథమువలనం గాని, తిక్కనసోమయాజికృతంబు లగుగ్రంథములవలనం గాని కాన్పింపదు. జ్ఞానవాసిష్ఠరామాయణాంధ్రకవి తనవంశముం గూర్చి వ్రాసికొనుచోఁ దనతాత యగునల్లాడమంత్రి తిక్కనసోమయాజిపౌత్రుఁ డగుగుంటూరికొమ్మవిభునికూఁతుం బరిణయ మయ్యె నని చెప్పి యుండెను. దీనివలన సోమయాజి కొక్కకుమారుఁ డున్నట్లు తెలియుచున్నది. కాని యతనిపేరేమో తేలలేదు. ఇఁక మార్కండేయపురాణములోనియాశ్వాసాంతపద్యములో నున్న సందర్భముంబట్టి చూడ నం దుదాహరింపఁబడినమారనకవి తిక్కనసోమయాజికుమారుఁడు కానట్లు స్పష్టమే యగుచున్నది. అందులో :-

"శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీ పాత్ర తిక్కనామాత్యపుత్త్ర మారయనామధేయ ప్రణీతము?

అని యున్నది. దీనింబట్టి మారనకవి తిక్కనసోమయాజిపుత్త్రుండు గాక అతనిశిష్యుం డగుతిక్కనామాత్యునిపుత్రుం డని స్పష్ట మగు చున్నది. కావునఁ దిక్కనసోమయాజి కుమారునిపేరు మనకుఁ దెలియ లేదు. ఇటులఁ దెలియనిదానికై ప్రయత్నము మాని అతనిసంతతి వారిలో నెవ్వరిపేళ్లు వసిష్ఠరామాయణకవివలన వివరింపఁబడినవో వానిం జూపుదము.

తిక్కనసోమయాజికిని వసిష్ఠ రామాయణ కవి యగుసింగనకును గలసంబంధము.

పైగ్రంథములోఁ జెప్పఁబడినయొకపద్యమువలన నీకథ యంతయు స్పష్టము కాఁగలదు. కాఁబట్టి ఆపద్యమును దెలిపెదను. అందు సింగనకవి తనతాత యగునల్లాడమంత్రింగూర్చి వ్రాయుచు నీక్రిందివిధంబుగ వివరించెను. ఎట్లన్నను :-

సీ. అతఁడు దిక్కనసోమయాజులపౌత్త్రుఁ డై, కొమరారుగుంటూరికొమ్మ విభుని
   పుత్త్రి బిట్టాంబిక బుధలోకకల్పక, వల్లి వివాహమై వైభవమున
   భూసార మగుకోటభూమి కృష్ణానదీ, దక్షిణతటమున ధన్యలీల
   నలరురావెల యనునగ్రహారముఁ దన, కేకభోగంబుగా నేలుచుండి.

గీ. యందుఁ గోవెలఁ గట్టి గోవిందు నెన్న, గోపినాథుప్రతిష్ఠయుఁ గోరి చేసి
   అఖిలవిభవంబునందున నతిశయిల్లె, మనుజమందారుఁ డల్లాడమంత్రివిభుఁడు.

అనునీ పద్యములోఁ బౌత్త్రుఁడని వ్రాసినచోఁ బుత్త్రుఁ డని పాఠాంతర ముండిన నుండవచ్చును. ఆంధ్రదేశస్థులలోఁ దఱుచుగఁ దండ్రిపేరు కొడుకుల కుంచుట స్వభావముగా నున్నది. తిక్కనసోమయాజి తండ్రిపేరు కొమ్మన పైపద్యములో వివరింపఁబడినతిక్కనసోమయాజి సంబంధి యగునతనిపేరును గొమ్మనయే అచ్చుప్రతులలోఁబౌత్త్రుఁడని పుత్త్రునకే పడియున్నఁ బడియుండును. ఈమార్పువలనఁ బద్యములోన గణ భంగము కాదు. కాఁబట్టి, ఆభాగమును "తిక్కనసోమయాజులపుత్త్రుఁడై కొమరారుగుంటూరికొమ్మవిభుని" అని సవరించిన లెస్సయైయుండును. అట్లే సవరించి చదువఁగా దిక్కనసోమయాజికిఁ గుమారుఁడు గుంటూరికొమ్మన యనియు, పౌత్త్రి బిట్టాంబిక యనియును, ఆమెకు నల్లాడమంత్రివలన నయ్యలమంత్రి యనుకుమారుఁడు కల్గె ననియును, నాయయ్యలమంత్రి కుమారుఁడు వసిష్ఠ రామాయణగ్రంథకర్త యగుసింగనమంత్రి యనియుం దేలినది. ఇంతకు నధిక మగుగ్రంథములు దొరకకుండుటచేతఁ దిక్కన సోమయాజికుమారునివంశముంగూర్చి వివరింపఁబడ దయ్యెను. దేశాభిమాను లీవిషయము నింకను శోధింతురుగాక, సోమయాజికృత


నిర్వచనోత్తరరామాయణముంగూర్చి రామాయణకవులచారిత్రములోఁ జూడఁదగును.

తిక్కనసోమయాజికాలనిర్ణయవిమర్శనము.

ఇదివఱలోఁదిక్కనసోమయాజికాలనిర్ణయము చేయుటకుఁగాను ఆంధ్రకవులచారిత్రములోఁ గొంతయత్నము చేయఁబడినది. కాని అది యొకస్థిరమార్గమును కనుపఱుపనందున నిం దా కాలనిర్ణయమును ముందు విమర్శించి అనంతరము దాని నెట్లు సిద్ధాంతీకరింపవలయునో తెలియఁజేసెదను. అది యెట్లన్నను :-

1. ఆంధ్రకవిచారిత్రములో "కృష్ణామండలచారిత్రములో నెఱ్ఱగడ్డరా జగుకాటమరాజును, పల్నాటిప్రభు నైనపద్మానాయకుఁడును, గలిసి పశువులబీళ్లకుఁగాను పదుమూఁడవశతాబ్దమందు నెల్లూరిప్రభు వైన సిద్ధిరాజుతో యుద్ధము చేసినట్లును, సిద్ధిరాజుసేనలు కవితిక్కనతమ్మునికుమారుం డగుతిక్కనమంత్రిచే నడిపింపఁ బడినట్లును" జెప్పంబడి యున్నది. దీనింబట్టి చూడఁగా సోమయాజితమ్మునికుమారుఁడు పదుమూఁడవశతాబ్దములోని వాఁడు కాని సోమయాజి పదమూఁడవశతాబ్దములోనివాఁడు కాఁ డని తేలినది. 1200 ల సంవత్సరము మొదలు 1300 ల సంవత్సరమువఱకును పదమూఁడవశతాబ్ద మగును. సోమయాజతమ్ముని కుమారుఁడు 1150 కల కాలములోఁ బుట్టి 1201 వఱకు ననఁగా 50 సంవత్సరములవఱకును జీవించియున్నను పదమూఁడవ శతాబ్దములోఁ జరిగెడుయుద్ధములో నుండవచ్చును. ఆయుద్ధములోనే హతుఁడైన నతఁడు పదమూఁడవశతాబ్దములో యుద్ధములో హతుఁ డయ్యె నని చెప్పఁ బడవచ్చును. ఇతఁ డేఁబదిసంవత్సరములవాఁ డని యొక యూహం జేసినారము. అంతకుఁ దక్కువవయస్సులో నుండువారికిఁ బూర్వకాలములో నున్నతోద్యోగములు దొరకెడునాచారము లేదు. ఏఁబదిసంవత్సరములవయస్సునకుఁ బైవాఁడే అయ్యెనేని అతనిజననకాలము 1130 లేక, 1140 కూఁడఁ గావచ్చును. ఇదికాక తిక్కనసోమయాజితమ్ముని


కుమారుఁడు పదమూఁడవశతాబ్దమున నున్నట్లు చెప్పినను తిక్కన దానింబట్టి అతనికి నతిసమీప్య కాలీనుఁ డని యూహింపఁ జాలి యుండదు. సోమయాజితండ్రికి సోమయాజి అతి బాల్యంబునం బుట్టి యుండవచ్చును. అతనితమ్ముఁడు సవతితమ్ముఁ డై తండ్రి వృద్ధావస్థలోఁ గల్గి యుండవచ్చును. ఈయిర్వురకును నలుబదిసంవత్సరములవఱకును వ్యవధి యుండవచ్చును. అట్టితిక్కనసోమయాజితమ్మునకు మరల నైదవపదిలోనో లేక ఆఱవదిలోనో పుట్టియున్న తిక్కనమంత్రి అతని యఱువదవసంవత్సరమున యుద్ధములో హతుఁ డయి యుండవచ్చును. అట్లైనఁ దిక్కనమంత్రిమృతినాఁటికిఁ దిక్కనసోమయాజి జననకాలము నూటయేఁబదిసంవత్సరములకు ముందు గాకున్న నూఱుసంవత్సరములవఱకైన నై యుండును. రెండవపక్షములోఁగూడ నిది శా. సం. 1030 అంతకుఁ బూర్వము అగు ననుటకు సందియ ముండదు. కాని యీపైవృత్తాంత మంతయు నూహలపైని చేసిన సిద్ధాంతమునకు నట్లుగనే యూహించి యియ్యఁబడిన సమాధానముగా నగును. తిక్కనసోమయాజికిఁ దమ్ముఁ డున్నాఁ డని సోమయాజికృతగ్రంథములలోఁ జెప్పఁబడి యుండలేదు. ఇట్లుగాఁ జెప్పఁబడకపోవుటంబట్టి సోమయాజితండ్రికి సోమయాజి యొక్కఁడే కుమారుఁ డని నిశ్చయింపవలసి యున్నది. తిక్కన మంత్రినాముఁడు కాక దండనాథనాముఁడు వీరివంశములో నొక్కఁ డున్నట్లు గ్రంథము లున్నవి. అతనికే రణతిక్కన యని వాడుక. ఇతనితండ్రి సిద్ధయ. ఈసిద్ధయ సోమయాజికి మూఁడవ పెత్తండ్రి. సిద్ధయకుమారుం డగురణతిక్కన ముప్పదియిద్దఱునియోగులలోఁ జెప్పఁబడిన వాఁడును, వేములవాడభీమకవి కాలములోనివాఁడు నైనట్లు నీవఱకే యాభీమకవిచారిత్రములోఁ జెప్పఁబడియెను. ఇఁకఁ దిక్కనతమ్మునికుమారుం డగుతిక్కనమంత్రి యున్నట్లు ప్రామాణిక గ్రంథములు లేవు గావున దీనింబట్టి తిక్కనసోమయాజికాలము నిర్ణయింపము. ఇది నిర్ణయము కాలేదు గావునఁ దిక్కనమంత్రికిఁ బ్రభుఁడుగానుండినసిద్ధిరాజు తిక్కనసోమయాజులవలన నుత్తర


రామాయణముం గృతి నందినసిద్ధిరా జైనట్లును నిశ్చయింపఁజాలము. కావున సోమయాజికాలనిర్ణయ మీమూలముగఁ గాలేదు.

2. ఆంధ్రకవిచారిత్రములోని మఱియొక యుదాహరణములోఁ దిక్కనసోమయాజికుమారుం డగుమారన మార్కండేయపురాణమును తెనిఁగించి దానిని ప్రతాపరుద్రదేవునిమంత్రి యగునాగయగన్న మంత్రికిఁ గృతి యిచ్చెఁ గావున దానింబట్టి తిక్కనసోమయాజికాలము నిర్ణయించెద మని చెప్పి యున్నది. ఇంతమాత్రమునఁ దిక్కనసోమయాజి కాలమునిర్ణయింప వలనుపడదు. ప్రతాపరుద్రదేవుఁ డనునామము కాకతీయవంశస్థులలోఁగొందఱకును, కటకప్రభువులలోఁ గొందఱకును నున్నది. వీరిలో నెవ్వరి మంత్రిగానున్న నాగయగన్న మంత్రికిఁ గృతి యిచ్చెనో తెలియదు. ఎట్లైనను మనదేశములో విశేషవ్యాప్తనాముఁ డగు వాఁడెవ్వఁడో అతనిమంత్రియగు నాగయగన్న మంత్రికే కృతి యిచ్చె నని యూహింతము. "M. R. Sewell's Lists of Antiquities" అను న్యూయల్ దొర గ్రంథములో నీక్రింద నుదాహరించినవారు రుద్రనాములై యున్నారు. ఎట్లన్నను :-

క్రీ. శ. = శా. సం.
1179-77 = 1102 లో నొకరుద్రుఁడు.
1179-77 = 1120 "
1255-77 = 1202 "
1299-77 = 1222 "
1310-77 = 1242 "

ఇట్లుగా నైదుగురురుద్రు లున్నారు. వీరు గాక పద్మనాయకులవంశావళీశాసనముం జేయించినరుద్రుఁడు మఱియొకఁ డున్నాఁడు. ఇతఁడు శా. సం. 1019 లోనివాఁ డైన ట్లా శాసనమువలనఁ గాన్పించును. కోనసీమద్రావిడులకు నగ్రహారములును, స్వాస్థ్యములు నిచ్చినరుద్రుఁడు మఱియొకఁ డున్నాఁడు. ఇతనికాలము శా. సం. 1087. ఇట్లు


గాన్పించునేడ్గురురుద్రులలో నెవ్వరివలన నాగయగన్న మంత్రికాలము నేర్పఱుపవలయునో తెలియకున్నది. ఇది యయినపిమ్మట నతనికి మార్కండేయ పురాణముం గృతి యిచ్చినమారనకవికాలము నిర్ణయింపవలయును. ఇంతశ్రమకు నొప్పికొని మారనకవికాలము నిర్ణయించినచో నామారనకవి తిక్కనసోమయాజికొడుకు గాక తిక్కనసోమయాజిశిష్యుఁడగుతిక్కనమంత్రికుమారుం డైనట్లుగా నీవఱకే చూపించి యుంటిమి. మన మొక వేళ మారనకవికాలము నిర్ణయించినను మొదటియంశములోఁ జెప్పఁబడినయాక్షేపణలే యిందును దటస్థము లగునుగావున దీనింబట్టియును తిక్కనసోమయాజి కాలము నిర్ణయింప వీలుపడదాయెను. కావున నాంధ్రకవిచారిత్రములో వ్రాయఁబడినసిద్ధాంతము మాని తిక్కనసోమయాజికాల మిఁక నెట్లు నిర్ణయింపవలయు నని శంకించుకొనెదము. దాని కీక్రిందిభాగములోఁ జేయఁబోవునుపన్యాసము సమాధాన మై సిద్ధాంతమును సృష్టీకరించును.

సోమయాజికాలనిర్ణయము.

తిక్కనసోమయాజి యేకాలము వాఁడైనదియును నిర్ణయించుట కొకటిరెండు మార్గములు గలవు. అందు మొదటిది సోమయాజిప్రభుండగుమనుమసిద్ధిరాజు కాలపరిజ్ఞానము. రెండవది యీ రాజుయొక్కగాని, లేక, అతనిపూర్వు లగురాజులయొక్కగానిసమ కాలీనుల కాలవిజ్ఞానము. ఈరెండును గానిచోఁ దిక్కనసోమయాజి సమకాలీనుల కాలములఁ దెలిసికొనుట గాని లేక కేవలము లోకమువాడుకవలనఁ గల్గెడుకథాజ్ఞానము కల్గించుకొనుట గాని యయి యుండును. అందులకు ముందు మొదటిదానిలో నీసంశయమును నివారించుస్పష్టగాథలు లేవు. రెండవగాథలోనియంశములు చూచినం గాని దానిలోఁ గలసంశయములు తీఱవు. కావున రెండవదానిని వివరించెదను. ఎట్లన్నను :-

1. తిక్కనసోమయాజితోఁ గొంచెము సంబంధము గల్గియున్న వాసిష్ఠ రామాయణగ్రంథకర్త యగుసింగనకవి తనతాతభార్య తిక్కన


సోమయాజికుమారునికొమార్తె యని చెప్పెను. అటుపిమ్మట సింగన తనతండ్రింగూర్చి వ్రాయుచు నతఁడు రాజమహేంద్రవరమునఁ బ్రభుత్వముఁ జేయుచున్నతొయ్యేటి అనపోతభూపాలునిమంత్రి యని యీక్రిందివిధంబుగఁ జెప్పెను. ఎట్లన్నను :-

సీ. ఆత్రేయగోత్రపవిత్రు పేరయమంత్రి, పుత్త్రి సింగాంబిక పుణ్యసాధ్వి
   వెలయ వివాహమై వేఁగిదేశంబులో నేపారురాజమహేంద్రపురికి
   నధిపతి తొయ్యేటి అనపోతభూపాలుమంత్రి యై రాజ్యసంపదలఁ బొదలి
   యొప్పారుగౌతమియుత్తరతటమున మహనీయ మగు పెద్దమనికియందు

గీ. స్థిరతరారామతతులు సుక్షేత్రములును, పెక్కు లార్జించి సితకీర్తిపెంపు మిగిలి
   యఖిలజగదన్న దాత నా నవనిఁ బరఁగె, మధురగుణధుర్యుఁ డయ్యలమంత్రివరుఁడు.

దీనింబట్టి చూడ నీ అయ్యలమంత్రి అనపోతభూపాలునితో సమకాలీనుఁ డని స్పష్టమే కదా. అనపోతభూపాలుడు కొండవీటిసీమలో రాజ్యముచేయువాఁడు. అతనిప్రభుత్వకాలము శా. సం. 1222 మొదలు 1251 వఱకునై యున్నట్లు కొండవీటి రెడ్లశాసనములవలనం గాన్పించును. ఇదియే అనఁగా శా. సం. 1200 మొదలు 1250 వఱకును, అతనిమంత్రి యగునయ్యలమంత్రికాలముగా నిర్ణయింపవలయును. అయ్యలమంత్రి మొదలు తిక్కనసోమయాజివఱకును బైని చెప్పిన విధమున నైదుగురుపురుషు లైరి. పురుషునకు ముప్పదిసంవత్సరముల చొప్పున నైదుగురికిని నూటయేఁబదివత్సరము లగును. ఇది పండ్రెండువందలలోఁ ద్రోసివేయఁగ 1050 శా. సంవత్సర మగును. ఇది తిక్కనసోమయాజి కాలమును నిర్ణయించుట కొకమార్గము.

2. ఇఁక రెండవవిధ మెట్లన్నను :- గోదావరీమండలములోని దాక్షారామదేవాలయముపై నున్నయొకశిలాశాసనములో శా. సం. 1098 (SS. 1098 + 77 = 1175 AD) లోఁ గాకతీయగణపతిరుద్రుని యల్లునిదాన మున్నది. దీనింబట్టి కాకతీయగణపతికాల మంతకుఁ బూర్వ మిరువదిముప్పదిసంవత్సరము లైనను నై యుండవచ్చును. ఈ గణపతిరుద్రునికడకే తిక్కనసోమయాజి పోయి యుండె ననియు, నతని


కోర్కెపైని బౌద్ధమునులతో సోమయాజి సంవాదము చేసి యుండెననియును నీవఱకుఁ జెప్పియుంటిమి. గణపతిరుద్రుఁడు శా. సం. 1057 మొదలు 1085 వఱకును రాజ్యము చేసినట్లు సోమదేవరాజీయ వచనకావ్యమువలనం గాన్పించును. కావున సోమయాజియు నాకాలమువాఁడే యని నిశ్చయింపవలయును. తిక్కనసోమయాజి గణపతి రాజుం జూడఁబోవునప్పటికే భారతముం దెనిఁగించినట్లును, భారతార్థము లతనిసభలో నుపన్యసించినట్లును కానుపించును. సోమయాజి శివదేవయ్య యనుమంత్రియొక్కగుణవిశేషములు గణపతిరాజునకు బోధించిన ట్లుండుటచేతను, అతనిమూలముగనే రాజకీయవ్యవహార మంతయు నడిపింపు మని సోమయాజి లెస్స చెప్పుటచేతను గణపతిదేవుఁ డప్పుడే సింహాసనమునకు వచ్చి యున్నట్లును, అప్పటికే అనఁగా శా. సం. 1057 నకే సోమయాజి భారతముం దెనిఁగించినట్లును స్పష్ట మగుచున్నది. ఇట్టిమనయూహలు పైనుదాహరించినకాలముతో సరిపడి యుండుటంబట్టి న్యాయ్య మగునవిగానే కానుపించుచున్నవి.

3. కాకతీయగణపతి రాజుమంత్రులతో నొక్కం డగువాణనవంశపు కన్న మంత్రి వసిష్ఠ రామాయణకవి యగుసింగనకవివలనఁ బద్మపురాణోత్తరఖండముం గృతి నందినకందనమంత్రికి నాఱవపురుషుఁడు. వసిష్ఠ రామాయణకవి యైన సింగనమంత్రి తిక్కనసోమయాజికి నైదవ పురుషుఁడు. కాఁబట్టి తిక్కన సోమయాజియును కాకతీయగణపతిరాజును సమ కాలీను లని చెప్పుట కేయా క్షేపణయును లేదు. సోమదేవ రాజీయమను వచన పద్య కావ్యములరెంటికిని ప్రారంభము మొద లొకవందసంవత్సరములు వ్యత్యాసము గాన్పించును. ఆవ్యత్యాసముంగూర్చి కాకతీయరాజవంశచారిత్రములో నాచేత సవిస్తరముగ సంవాదింపఁబడినది గావున నిపు డది యంతయు నీకవిజీవితములలో వ్రాయఁబడక వచన కావ్యములోఁ జెప్పఁబడిన గణపతిరాజు కాలమే సరియైనది యనియును, దానికి నీదృష్టాంతమునే చూపి యుంటి ననియుఁ దెలియఁజేయుచున్నాఁడను. 4. చెన్న పట్టణములోని గవర్నమెంటువారి ప్రాచీనపుస్తక భాండాగారములో సి. పి. బ్రౌన్ (Mr. C. P. Brown) దొరవలన మేకంజై కలెక్షన్‌స్ (Mackenzic Collections of old Manuscripts) లలో నుండి యెత్తివ్రాయించఁబడిన లోకల్‌రికార్డు (Local Records) లను స్థలచారిత్రగ్రంథములలో మూఁడవసంపుటము 389 పుటలోఁ దిక్కనసోమయాజిమృతికాలమును స్పష్టపఱుచునొకపద్యము కానుపించును. అదెట్లన్నను :-

క. అంబరరవిశశిశాకా, బ్దంబులఁ జను కాళయుక్తిభాద్రపదపుమా
   సంబున రవిప్రభావిని, భంబగుశ్రీతిక్కయజ్వ బ్రహ్మముఁ జేరన్.

అనునీపద్యములోని "అంబర = 1, రవి = 12, శశి = 1 అనుదానిని "అంకానాం వామతో గతిః" అనుగణితశాస్త్రసూత్రముం బట్టి లెక్కింపఁగా 1120 తేలును. ఇది శాలివాహనశకము. సంవత్సరనామము కాళయుక్తి. ఇది తిక్కనసోమయాజిమృతివత్సరము. ఈపైసంఖ్యను 1210 గా లెక్కించి ఆంధ్రకవులచారిత్రములో వ్రాసినది గణితశాస్త్రసంప్రదాయమునకు సరి కాదు. అట్టివత్సరము కాళయుక్తివత్సరము కాదు. రెండం కెలఁ గూర్చి యొక్కటే సంకేతనామము చెప్పఁబడినప్పు డారెండం కెలకు "అంకానాం వామతో గతిః" అనుసూత్రము పట్టదు. వీనిం దెల్పుటకు మఱొయొక్క శాసనోదాహరణముం దెల్పెదను. అది రాజమహేంద్రవరములో మార్కండేయశివాలయమును మరలఁ గట్టించిన కాటయవేమా రెడ్డిభార్య మల్లాంబ కోనసీమలోనిమల్లవరాగ్రహార దానముం జేసినప్పు డిచ్చినశాసనము. దీనివివరణము రెడ్లచారిత్రములో వ్రాయఁబడినది. ఇపుడు ప్రస్తుతాంశమునకు వలయుశ్లోకమును మాత్రముదాహరించెదను. ఎట్లన్నను :-

"శ్లో. శ్రీశాకే గుణ రామ విశ్వ గణితే కార్తిక్యహేబ్జే ఖరే." అని

ఇం దుదాహరింపఁబడి శకవత్సరము గుణ=3, రామ=3, విశ్వ(13 విశ్వే దేవతలు)=13 - దీనిని లెక్కించునపుడు "అంకానాం" అను సూత్రమునకుఁ బ యర్థమే కాకున్న 3133 శాలివాహనశకము


కావలసివచ్చును. ప్రస్తుతములోఁగూడ శాలివాహనశక మింకను 1820 లోపే కావునఁ బై గుణితము సంపూర్తిగా నసందర్భ మని చెప్పక తప్పదు. సోమయాజిమరణముం దెల్పుపద్యములో మనము చేసిన సిద్ధాంతమే సరియగునది యని ఖరసంవత్సరము శా. సం. 1333 అగుటచే స్థిరపఱుచును. అట్లైనచో సోమయాజినిర్యాణము శా. సం. 1120 అగును.

ఇట్లు సోమయాజిమృతికాలము సిద్ధాంతము కాఁగా సోమయాజి జననకాలము దానింబట్టి నిశ్చయించుట అతిసులభమై యుండును. ఇదివఱలో భారతము శా. సం. 1057 నకుఁ బూర్వమే తెనిఁగింపఁబడె నని చెప్పియున్నాము. అప్పటికిఁ దిక్కనసోమయాజి నలుబదియేఁబదిసంవత్సరములవాఁ డని యూహింప వచ్చును. అటులైనచో నాతనిజననము శా. సం. 1020 కి లోపుననే అయి యుండును. అది మొదలు సోమయాజికి నూఱువత్సరములు చెప్పవలసియుండును. ఇది సామాన్యముగ మనదేశములోఁ బ్రస్తుతకాలాయుర్దాయములనుబట్టి చూడ నాశ్చర్యముగాఁ గాన్పించును గాని సోమయాజిసమకాలీను లగురామానుజా చార్యుఁడు మొదలగు 120 సంవత్సరములు జీవించినవారితో సరిచేసి చూడఁగా దక్కువయే కాని అధిక మేమియును లేదు. పూర్ణాయుర్దాయవంతులు వేయుసంవత్సరములక్రిందట ప్రస్తుతమునకంటెఁ బెక్కండ్రున్నట్లుగా ననేకగ్రంథదృష్టాంతములు కలవు. కావునఁ దిక్కనసోమయాజి నూఱుసంవత్సరములు జీవించె నని చెప్పుట యుక్తిసహ మని వక్కాణించెదను.

సోమయాజియు నన్నయభట్టును సమకాలీను లనుట.

పై సంవాదములోఁ దేలినసిద్ధాంతములంబట్టి తిక్కనసోమయాజి పదునొకొండవశతాబ్దములో నున్న వాఁ డనుటకు సందియము లేదు గదా? ఇదివఱలో నన్నయభట్టారకుఁడు పదియవశతాబ్దాంతమునను పదునొకండవశతాబ్దములో నుండినట్లు చూపించి యున్నాము. ఈ యిర్విరును సమకాలీను లనుమాట దృఢపఱుచుటకుఁ బైసంవాదమే


చాలియుండును. అయినను ఆంధ్రులలోనిబుద్ధిశాలు లాలోచించి యింకనుఁ బరిశీలించుటకుఁగాను లోకములోఁ గలయింకొకప్రతీతిని వివరించుచున్నాఁడను. దానిని మనస్సున నుంచుకొని శోధకులు గ్రంథములు లభించినపుడు పరిశీలింతురుగాక. అది యెద్ది యనఁగా :-

రామాయణము నాంధ్రీకరించిన వాస్కరుఁడును, నన్నయ భట్టారకుఁడును, వేములవాడ భీమకవియును, దిక్కనసోమయాజియును సమకాలీను లనియును, భాస్కరకవి రామాయణము తెనిఁగించుచు రావణసంహారానంతరము శ్రీరాముని వివిధదేవతలు చేయుస్తోత్రములు వివిధభూదేత లగుకవీశ్వరులచే రచియింపఁ బడి తనగ్రంథములో నుండవలయు నని కోరఁగాఁ బైకవీశ్వరు లందఱును తమపేరు లుంచి యొక్కొక పద్యము రచియించి యిచ్చి రనియును, ఆ పద్యములను వారిపేరిటనే ప్రకటించి రనియును వాడుక గలదు. కాని ముద్రితగ్రంథములలోఁ గాం డాంతగద్యములుకూడ మార్చి ముద్రింపఁబడినట్లుగా రామాయణకవుల చారిత్రములోఁ జూపించి యుంటిమి. కాఁబట్టి ప్రాచీనము లగుతాళపత్త్ర గ్రంథములు దొరకినపు డెల్ల నీవిషయమై పరిశీలన చేయుటకు బుద్ధిమంతులను బ్రార్థించి యిప్పటి కీఈవృత్తాంతమును వ్రాయ విరమించెదను.