కవి జీవితములు/నన్నయభట్టు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు.

కవిజీవితములు.

2.

నన్నయభట్టు.


ఇతఁడు తాను రచియించినభారత ప్రథమపర్వములోఁ దనవృత్తాంత మీక్రిందివిధముగ వ్రాసి యుంచె నదెట్లన్నను :-

సీ. తనకులబ్రాహ్మణు ననురక్తి నవిరళ, బపహోమతత్పరు విపులశబ్ద
   శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది, నానాపురాణవిజ్ఞాననిరతుఁ
   బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్ర, జాతు సద్వినుతావదాత చరితు
   లోకజ్ఞు నుభయభాషాకావ్యరచనాభి, శోభితు సత్ప్రతిభాభియోగ్యు

అ. వె. నిత్యసత్యవచను మత్యమరాధిపా, చార్యు సుజను నన్న సార్యుఁ జూచి
       పరమధర్మ విదుఁడు వరచళుక్యాన్వయా, భరణుఁ డిట్టు లనియెఁ గరము ప్రీతి.

అనుదీనిం బట్టి చూడ నీనన్న యభట్టు, 1. రాజునకుఁ గులబ్రాహ్మణుఁ డనియును, 2. జపహోమతత్పరుఁ డనియును, 3. శబ్దశాసనబిరుదాంకితుఁ డనియును, 4. వేదాభ్యాసి యనియును, 5. ఆపస్తంబసూత్రుఁ డనియును, 6. ముద్గలగోత్రుఁ డనియును, 7. బ్రహ్మాండాది పురాణములు తెలిసినవాఁ డనియును, 8. లోకజ్ఞానము గలవాఁడనియును, 9. ఉభయభాషాకావ్యరచనాశక్తియుతుం డనియును దేలుచున్నది.

వీనిలో మొదటివిశేషముంబట్టి రాజవంశానుక్రమముగ నాశ్రయించియున్న పురోహితుఁ డనియును, రెండవదానింబట్టి యాజ్ఞికతంత్రమున సమర్థుఁ డనియును, మూఁడవదానింబట్టి వ్యాకరణవేత్తయనియును, అందులో నుపాధ్యాయత్వముంగూడ సంపాదించినవాఁ డనియును, నాల్గవదానింబట్టి సాంగ వేద వేది యనియును, అయిదవదానింబట్టి పౌరాణికశ్రేష్ఠుం డనియును, తొమ్మిదవదానింబట్టి ఆంధ్రగీర్వాణకావ్యరచనా దక్షుం డనియును నిశ్చయ మగుచున్నది. ఇట్టిబిరుదము లుండుటంబట్టి యితఁడు కేవలవైదికవృత్తిలో నున్నట్లును, కావున వైదికశాఖలోనిబ్రాహ్మణుఁ డనియును కొందఱూహించెదరు. కాని "లోకజ్ఞున్" అని యితఁడు చేసియున్న ప్రయోగముంబట్టి యితఁడు లౌకికుఁడుగూడనై యుండవచ్చు నని తోఁచుచున్నది. పూర్వకాలములో లౌకికవైదిక వ్యాపారములు లౌకికులవలననే జరిగింపఁ బడినట్లుగా గ్రంథములవలనం గాన్పించెడిని. ఇపుడు మనము మాటలాడుచున్న నన్నయభట్టుకాలమునాఁటికి వైదికు లని ప్రకృతమునఁ బిలువంబడుచున్న బ్రాహ్మణశాఖ వేఁగిదేశమునకు వచ్చియున్నదా ? లేదా ? అని యూహింపవలసినదిగా నున్నది. అట్టిస్థితిలో నన్న పార్యుఁ డది వఱకు దేశములో రాజాస్థానములయం దుండి లౌకికవైదిక కార్యములను నెఱవేర్చుట కేర్పడినని యోగిశాఖలోనివాఁడు గాక తదనంతర మొకటి రెండుశతాబ్దముల కీదేశమునకు వచ్చినవైదికశాఖలోనివాఁ డెట్లగు నని యోజింపవలసి యున్నది. అప్పటిచాళుక్యరాజులతో నీదేశమునకు వచ్చి యుండుబ్రాహ్మణులు తమప్రభువులతోపాటు పశ్చిమదేశస్థులే అయి యుండవలయును. తమప్రభువు లగుచాళుక్యులు మహారాష్ట్రదేశములో బీజపూరుసంస్థానములోని దగు 'కళ్యాణి' పురమునుండి వచ్చియుండిరి. అక్కడిప్రభుఁడు సత్యాశ్రయవల్లభుఁ డనియు నతనితమ్ముం డగుకుబ్జ విష్ణువర్ధనుఁడు తూర్పుదేశమును జయించుటకుఁగానువచ్చి, వేఁగిదేశ మాక్రమించుకొని పాలించినట్లును అతనిసంతతిలోనివాఁడే పైపద్యములోనిచళుక్యాన్వయా భరణుఁ డగురాజనరేంద్రుఁ డనియును రాజనరేంద్రచారిత్రములో వివరింపఁబడిన శాసనములవలన విస్పష్టము కాఁగలదు. మహారాష్ట్రదేశములోని పశ్చిమఖండమునుండి వచ్చినరాజులకు వంశానుగత మైనపురోహితులుగానుండువారు ఆదేశమునం దుండెడువారు గాక నవీనరాజ్యమగునాంధ్రదేశములోని వారలై యుండరు గదా. రాజనరేంద్రుని కాలమునకుఁ బశ్చిమచాళుక్యశాఖ అంతమగుటంజేసి కావలయును. వారిస్వాధీనములో నుండెడుదేశ మంతయు ననఁగాఁ గొంకణదేశము చివరవఱకును నీరాజనరేంద్రుని స్వాధీనములో నున్నట్లుగాఁ


గాన్పించును. (కొంగదేశపురాజకాల్ అనుచారిత్రము చూడవలెను.) అందుచేతఁ బై రాజనరేంద్రుఁడు తఱుచు పశ్చిమదేశమందే నివసించియుండె ననియును, అతని కాదేశస్థులే మంత్రులుగాను పురోహితులుగాను నుండి రనియును నూహించుట న్యాయమైనట్లు కాన్పించెడిని. కావున నన్నయభట్టారకుఁడు నక్కడివాఁడుగానే కాన్పించును. అతనికి నాదేశస్థులలోవలె లౌకికవైదికములు రెంటియందును బరిశ్రమ యుండ నోవును. అంతమాత్రమున నతనిని కేవలము వైదికశాఖలోని వాఁ డని చెప్పంజాలము. భట్టనుశబ్దము మహారాష్ట్రదేశములోనివిద్యావంతు లగుబ్రాహ్మణులకుఁ గల్గెడునొకబిరుదు. ఇట్టిబిరు దున్నంతమాత్రముచేత నీపైబిరుదుగలవారందఱును వైదికశాఖలోనివారే అని చెప్పనొప్పియుండదు గదా !

ఇపుడు మనము మాటలాడుచున్న కాలములోఁ గేవలవైదిక వృత్తిలో నుండువారు సంస్కృతభాష నొక్కదానినే నేర్చికొనునట్లును, లౌకికవృత్తిలో నుండువారుమట్టుకుఁ దప్పక రాజకీయభాషయు దేశభాషయు నగుటచేత నాంధ్రభాష నభ్యసించి యందు విశేషముగఁ భాండిత్యము కుదిరినచో దానిలోఁ గొన్నిగ్రంథములు రచియించి యాభాష యెడల మిక్కిలి యభిమానము గలవారలై యున్నట్లు కనుపించును. నేఁటికిని లౌకికములోఁబ్రవేశింపఁదలఁచుకొనువారలే రాజకీయభాషలోఁ గృషి చేయుదురు గాని కేవలవైదికవృత్తి నుండఁగోరువారు కారు. అట్టిస్థితిలో లౌకిక మనుమాటయే చెవులఁబెట్టని పూర్వకాలములో ననగాఁ బదివందలసంవత్సరములక్రిందట లౌకికులు గాఁ గోరనివారలు రాజకీయభాషలో గ్రంథము రచియించువఱకును గృషి చేసియుందు రనుట యుక్తిసహమై యుండదు. మఱియును వేఁగిదేశములోని కిట్టిరాజకీయ భాషాపండితులు మొదట వచ్చుకాలమునకు నీయాంధ్రభాష సామాన్యస్థితిలో నున్నట్లు కాన్పించును. అప్పటికిఁ బ్రసిద్ధము లైనగ్రంథములు లేవు. ఉన్న వైనను పదియిరువదిపుటల గ్రంథములుగాని అధికములు గావు. భాషయు నంతగా శిక్షితమై యుండకపోవచ్చును. ఇట్లుండఁగా రా


జును, తద్రాజకీయోద్యోగులును, కొన్నిదినము లైనపిమ్మట దేశభాషయే రాజకీయభాషగాఁ గావలసినయగత్యము తటస్థించినప్పుడు ఆంధ్రదేశభాషనుగూడ విశేషముగ వృద్ధి నందించినట్లు కాన్పించును. కావుననే మన కిపుడు తెనుఁగుభాషలోని ప్రాచీనగ్రంథము లని చెప్పఁబడునవి యన్నియు నించుమించుగా నీ చాళుక్యరాజులకాలములోనివే యయి యున్నవి. అంతకును బ్రాచీనము లగుగ్రంథములు దొరకుటయే లేదు. పైగ్రంథములను రచియించినవా రందఱును లౌకికవ్యాపారములలోఁ బ్రవర్తించువారును వారిసంతతివారునునై యున్నారు. నేఁటివఱకును నదేసంప్రదాయము ననుసరించి యాంధ్రకవిత్వముఁ జెప్పువారు తఱుచుగా లౌకికవిద్యాభ్యాసకులే అయి యున్నారు.

పూర్వకాలములో నిట్టి లౌకికు లీ దేశమున కొక్కమాఱుగ వచ్చి యుండిరి. అప్పటిలో నీదేశ మంతయు జైనాక్రాంతమై యుండెను. కావున నప్పటిలో నీదేశమునకు వచ్చినయీలౌకిక బ్రాహ్మణులకు జైనులచే వృత్తిస్వాస్థ్యము లీయఁబడినవి. కావున వీరు వైదికవృత్తిలోఁ జేరిన వ్యాపారములుగూడఁ దామే నడుపుచు వచ్చినవా రైరి. అనంతరకాలములో వైదికు లీ దేశమునకు వచ్చినతరువాత పైలౌకికులు వైదికవృత్తితోఁ జేరినజీవనము వదలుకొని కేవలలౌకికజీవనమే ప్రధానముగాఁ గల వారైరి. అప్పటినుండియు నీవైదికలౌకికశాఖాభేద మేర్పడినది. ఇట్టిశాఖాభేదము లేర్పడినవిధ మంతయు నాదేశచారిత్రములో వివరింపఁబడి యున్నది కావున దాని నిట వ్రాయ నవసరములేదు.

ప్రస్తుతము మనము వ్రాయుచున్న నన్నయభట్టును పైవిధమున లౌకికవైదికములను నడుపుట కేర్పడినశాఖలోనివాఁ డని తెల్పి యనంతర మతనివృత్తాంతము మఱికొంత వివరించెదము. దీనిసంప్రదాయము గ్రంథాంతరములోఁ జూడఁదగు నని చెప్పెదము.

పూర్వులలో లౌకికశబ్దవాచ్యు లగునియోగులుగూడ భట్టుశబ్ద ముంచి వ్యవహరించినందులకుఁ బ్రయోగము గలదు. అది యెట్లనగా

"గీ. ప్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ, గాశికాఖండ మనుమహాగ్రంథ మేను
    దెనుఁగు జేసెదఁ గర్నాటదేశకటక, పద్మవన హేళి శ్రీనాథభట్టసుకవి."
                                             శ్రీనాథుని కాశీఖండము.

అనియున్న దికాని యీశ్రీనాథుఁడు నియోగియే యగునా? అని యూహింపఁగా నాగ్రంథాంతములోని యాశ్వాసాంతగద్యము పైసందేహమును నివారించును. ఎట్లన్నను :-

"ఇది కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ శ్రీనాథనామధేయ ప్రణీతము" అనియున్నది. కావున నీతఁడును నియోగిబ్రాహ్మణుఁ డనియే నిశ్చయమగుచున్నది గదా. దీనింబట్టి శ్రీనాథునికాలమువఱకును నియోగులు వైదికవృత్తిలో నున్న వా రమాత్యాదినియోగబిరుదావళులం గైకొనక యున్నట్లును, లౌకిక వ్యాపారములోఁ దిరుగువారుమాత్రమే అమత్యాదిశబ్దముల గ్రహించుచున్నట్లును గానుపించును. దీనింబట్టియే శ్రీనాథుఁడు తనతాతపేరు వ్రాయుచు "కమలనాభతనూభవ" అనిమాత్రమే వ్రాసెను. ఈకమలనాభుఁ డొక గొప్పయాంధ్రకవి. అయినను లౌకికవృత్తిలో లేఁడు గావున నమాత్య శబ్ద ముంచి చెప్ప లేదు. ఇంతియకాక 'నన్నయ' "తిక్కయ" అనునామములుగూడ మహారాష్ట్రభాషాసాంకర్యము గల వని చెప్పుటచేఁ బైని మనము చేసినయూహలు మఱియును బలపడునవియై యున్నవి.

నన్నయభట్టు భారతమును దెనిఁగించుట.

పైసీసపద్యములో వివరించినప్రకారము రాజనరేంద్రుఁడు నన్నయభట్టును సగౌరవంబుగాఁ జూచి యీక్రిందివిధంబుగఁ జెప్పెను. ఎట్లన్నను :-

"క. జననుతకృష్ణ ద్వైపా, యనమునివృషభాభిహితమహాభారతబ
    ద్ధనిరూపితార్థ మేర్పడఁ, దెనుఁగున రచియింపు మధికధీయుక్తి మెయిన్."

అని యానతిచ్చిన నన్నయ తనలో నిట్టుగా యోజించెను. అదెట్లన్నను :

"చ. అమలినతారకాసముదయంబుల నెన్నను సర్వవేదశా
     స్త్రములయశేషపారము ముదంబునఁ బొందను బుద్ధిబాహువి
     క్రమమున దుర్గమార్థజలగౌరవభారతవాహినీసము
     ద్రముఁ దఱియంగ నీఁదను విధాతృనకైనను నేరఁబోలునే."

అని నన్నయభట్టారకుఁడు తనలో నూహించుకొని ప్రభువు కోరినకార్యము నెఱవేఱ్చుట విధి యని నిశ్చయించుకొని ప్రభువు నుద్దేశించి నీయనుమతంబున విద్వజ్జనంబులయనుగ్రహంబునం జేసి నా నేర్చువిధంబున నిక్కావ్యము రచియించెద నని యిష్ట దేవతా వందనం బొనర్చి సంస్కృతకవు లగువాల్మీకి వ్యాసాదుల నుతియించి తక్కినపండితసమాజము నీక్రిందివిధంబున నుతియించెను. ఎట్లనఁగా :-

"చ. పరమవివేక సౌరభవిభాసితసద్గుణపుంజవారిజో
    త్కరరుచిరంబు లై సకలగమ్యసుతీర్థము లై మహామనో
    హరసుచరిత్రపావనపయఃపరిపూర్ణము లైనసత్సభాం
    తరసరసీవనంబుల ముదం బొనరన్ గొనియాడి వేడుకన్."

ఇంతియ కాని యీకవి తనకుఁ బూర్వు లగునాంధ్రకవుల నుతించియుండలేదు. అంతమాత్రముచేత నతనికిఁ బూర్వు లగునాంధ్రకవులు లేరని చెప్పఁగూడదు. పెక్కండ్రు ప్రసిద్ధాంధ్రకవులు గలరు. ఉన్నను వారిని నుతియింపక యుండుట యే ఆకాలపుఁగవులయాచారముగాఁ దోఁచెడిని. భీమకవి గాని, భాస్కరకవి గాని, తిక్కనసోమయాజి గాని తమకుఁ బూర్వు లగునాంధ్రకవుల నుతించినట్టు కానుపించదు. కాని ఎఱ్ఱాప్రగ్గడనుండి యీపద్ధతి మాఱుపఁబడినది. అతఁ డైనను నన్నయభట్టారకుని, తిక్కనసోమయాజినిమాత్రము హరివంశములో నుతియించెను. అందు నన్నయభట్టు నీక్రిందివిధంబుగఁబేర్కొనియెను. ఎట్లన్నను :-

"ఉ. ఉన్నతగోత్రసంభవము నూర్జితసత్త్వము భద్రజాతిసం
     పన్నము నుద్ధతాన్యపరిభావిమదోత్కటమున్ నరేంద్రపూ
     జోన్న యనోచితంబు నయి యొప్పెడునన్న యభట్టకుంజరం
     బెన్న నిరంకుశోక్తిగతి నెంతయుఁ గ్రాలుటఁ బ్రస్తుతించెదన్."

శ్రీనాథకవియు నన్నయభట్టు నీక్రిందివాక్యంబున భీమఖండంబున నుతియించెను. ఎట్లన్నను :-

"క. నెట్టుకొని కొలుతు నన్నయ, భట్టోపాధ్యాయసార్వభౌమునిఁ గవితా
    పట్టాభిషిక్తు భారత, ఘట్టోల్లంఘనపటిష్ఠగాఢ ప్రతిభున్."

ఇటులనే ఆంధ్రకవు లందఱును నన్నయభట్టును నుతియించిరి.

నన్నయభట్టారకుని గ్రంథరచనాప్రతిజ్ఞ.

నన్నయ తాను రచియింపఁబోవుగ్రంథమున నీక్రిందివిధమున శపథంబుఁ జేసెను :-

"ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తితో
     నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా
     నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెలుంగున న్మహా
     భారతసం హితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్."

సహాయుఁ డగునారాయణభట్టు.

అని చెప్పి తాఁ జేయ దొరఁకొనినపైగ్రంథరచనలోఁ దనకు సహాయుఁడుగాఁ దగిననారాయణభట్టునుగూడఁ జేర్చుకొని గ్రంథరచనకు గడఁగెద నని చెప్పెను. ఎట్లన్నను :-

ఉ. పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా
    రాయణుఁ డట్లు తానును ధరామరవంశవిభూషణుండు నా
    రాయణభట్టు వాఙ్మయధురంధరుఁడున్ దన కిష్టుఁడున్ సహా
    ధ్యాయుఁడు వైనవాఁ డభిమతంబుగఁ దో డయి నిర్వహింపఁగన్".

దీనింబట్టి నన్నయభట్టారకునితోపాటుగ నారాయణభట్టారకుఁడును మనయాంధ్రభాషాభ్యాసకులను నాధార మైనభారతగ్రంథములోని మొదటిమూఁడు పర్వములలోను నన్నయ యెఱ్ఱాప్రగ్గడలవలె ముఖ్యుఁడైనాఁడు. కాని యితనిచేత రచియింపఁబడినభాగము లివి యని తెలియకపోవుటచేతను, అతనికవిత్వ మెట్లున్నదో చెప్పఁజాలము. కాని మొదటిమూఁడుపర్వములోనిదినన్నయభట్టుకవిత్వమా ? అని సంశయింపఁ దగినకొన్నిపద్యములు సామాన్యశైలితో నున్నవి కానుపించును.


కొన్ని ఘట్టము లటులనే యున్నవి. అవి యీనారాయణభట్టుకవిత్వములోనివై యుండనోవును. అటుగాకున్న నన్నయభట్టారకుఁ డీతనివిషయ మై చేసినస్తోత్రముంబట్టి మంచిశైలితో నుండినపద్యములే అతనివై సామాన్యశైలితో నుండునవియే నన్నయభట్టుకవిత్వములోనివి కానోవును. అటుగాకున్న రామాయణ మాంధీకరించుకవులు కొన్ని కాండములొకరును మఱికొన్ని కాండములు మఱికొందఱును పంచుకొని రచియించి నట్లు నిర్ణయించి గ్రంథము వ్రాయుచు నది ముగియకమునుపే నన్న యభట్టునకుం గల్గినమనోవైకల్యముంబట్టి యాగ్రంథమంతయు యథా యథలై పోఁగా నాయుద్యమ మంతటితో ముగియఁగా నదివఱకు సిద్ధమైనగ్రంథము నన్నయభట్టారకునిపేరిటనే ప్రకటింపఁబడి యుండనోవునుఁ అటుగానిచో నారాయణభట్టుపేరుమట్టుకు వ్రాయఁబడి పిమ్మట నతనివలనఁ జేయంబడినసహాయము వివరింపఁబడక యుండునా ? అట్లుండదు. ఉన్నను లేకున్నను మన మావిషయంగూర్చి చర్చించిన లాభ మేమి ? కావున దానిని వదలుదము.

భారతాంధ్రీకరణము.

ఈకథ సంప్రదాయజ్ఞ మతానుసారముగ వ్రాయంబడును. ఎట్లన్నను : - వేఁగిదేశములోని రాజమహేంద్రవరపురీ రాజమహేంద్రుం డగురాజరాజనరేంద్రుఁడు ఆంధ్రదేశములోనివేఁగినాడు (ప్రస్తుతపుగోదావరిజిల్లా) ను బాలించుచుండెను. అతఁ డొకదినంబునఁ బొడమినకుతుకంబున నిజనభాభ్యంతరంబున కేతెంచి పండితశిరోమణులం గాంచి భారతామ్నాయంబుఁ దెనుఁగున భాషాంతరీకరణం బొనర్పఁ దగువార లేవార లనిన సభ్యులందఱును వాగనుశాసనుం డగునన్న యభట్టారకుండుదక్క నట్టిమహత్తరకార్యంబున కొరులు చాల రనిన నారాజశిఖామణి యగుఁగాక యనియెను. ఇట్లని వాగనుశాసనుం బిల్చి పూజించి కర్పూరతాంబూలకనకచేలంబు లిచ్చి మీ రీమహనీయకార్యమునకు నియ్యకొనుం డని పల్కెను. పల్కిన నన్నయ యత్యానందంబునఁ


"బంచమవేదం బగుభారతంబును దెనిఁగింపఁ గంటిని ధన్యుండ నైతి" నని యెంచి రాజుం గాంచి యట్లనే కావించెద నని దానిఁ దెనిఁగింప నుపక్రమించెను.

అథర్వణాచార్యుఁడు.

ఇటుల నారంభించి తొలుత నాదిపర్వంబును బిమ్మట సభాపర్వంబును దెనిఁగించెను. ఆరణ్యపర్వంబు రచియించుతఱి నధర్వణాచార్యుం డనునొకపండితో త్తముఁడు తాను భారతముఁ దెనిఁగించి విష్ణువర్ధనునకుఁ గృతి యిచ్చుటకు వచ్చి తత్సంస్థానపండితుం డగునన్న పార్యుం జూడఁ జనుదెంచెను. వచ్చి తనరాక నెఱిగించిన నాతఁడు తానును భారతమును దెనిఁగించుచుంటం జేసి యాతనికవిత్వ మెట్లున్నదో చూతమని యతనిభారతంబున నొకపద్యంబుఁ జదువు మనుడు నాతఁడును నట్ల కావించెను. అంతట నన్నయ యాతనిసంగ్రహనైపుణికి మిగుల నచ్చెరువంది తనమనంబున నిట్లు చింతించె. "ఈతనిభారతంబు మన రాజు చూచెనేని మిగుల సంతసించును. ఇంతటితో మద్గ్రంధంబు పరిసమాప్తి నొందును. అట్లైన నాగౌరవంబు కొంచె మవును. ఏదియేని యొకయంకిలి గావించి రాజు దీనిం జూడకుండునట్లు చేయవలెను. ఈసమయములో నీతఁడు దొలంగినఁ గొంత మేలగును. మఱల నీతఁడు వచ్చు నంతకు నేఁ జేయుభారతము పూర్ణంబు సేసి రాజునకుఁ జూపెదను" అని యూహించి యాపండితుం గాంచి యెల్లి రాజదర్శనంబున కరుగుదము. నేఁడు విడిదలకుఁ జనుం డని యాతనిం బనిచి యాతఁడు విడిసినయింటివారల రావించి వారలకుఁ గొంతధన మొసంగిన వారలు "దేవరయాజ్ఞ సేసెదము. కర్తవ్యంబు సెలవిం డనుడు వారల కాతఁ డిట్లనియె. "రేపటిదినం బాకవి యింట లేనిసమయంబున మీయింటికిఁ జిచ్చిడుఁడు. దానిచే నతనిపొత్తంబులు సెడును." అనిన వారలు సమ్మతించిరి. తా నామఱునాఁ డాపండితునికడకుం జని యాతనిఁ దోడ్కొని రాజమందిరద్వారంబు చేరెను. అచ్చట వీరిరువురును ముచ్చటలాడు


చుండిరి. ఇచ్చట నాయింటివారలు ధనంబునకు లోఁబడి తమయింటికి నగ్ని సొనిపిరి. ఇట్లు గృహంబు పరశురామున కర్పణంబు సేసి రోదనంబు సేయుచు వీరలు రాజదర్శనార్థంబునకుఁ బోవునట్లు తత్సింహద్వారంబుకడ కేతెంచి యచ్చట ముచ్చటించుచున్న వారల కావృత్తాంతంబు దెలిపిరి. దాని వినినతోడనే యధర్వణుండు ఱొమ్ము మోఁది కొనుచు శీఘ్రంబ యచ్చోటు వాసి యిలు సేరి దగ్ధంబులైనతనపొత్తంబుల మొత్తంబులఁ జూచి యందు స్వకృతభారతంబు నుండుటకు మిగుల వగఁగుంది యోర్వలేమిచే నచటిపండితు లీదుస్తంత్రంబు గావించి రని యెంచి "నా కిట్టియపకృతి నొనరించినవాఁడు నాకుం బోలె సర్వైహికఫలంబులకు వెలి యయ్యెడు" మని దుర్వార క్రోధంబున శాపం బొసంగి యిఁకఁ బ్రతికియున్న నేమిఫలం బని యెంచి తా నాయగ్నిం బ్రవేశించి మసి యయ్యెను. ఇదియే నన్న యకు మతి చాంచల్య కారణము. నన్న యభట్టునకు మతిచాంచల్యకారణంబు కొందఱిచే నొంకొకవిధంబునఁ దెలుపంబడును. ఎట్లన :-

భీమకవిశాపవిషయము.

ఈతఁ డరణ్యపర్వంబు దెనిఁగించుచుండ వేములవాడభీమకవి కోపంబున నన్నయభ ట్టింకను నరణ్యంబుననే రోదనంబు చేయుచున్నాఁడా? ఇతఁ డెపుడును నట్లే యుండుగాక అని శాపం బిచ్చె ననియును, దానిచే నాతని కప్పటినుండియు మతిభ్రమణంబు గల్గె ననియును నందురు. కారణంబు లేకయే భీమన యాతనికి శాపం బిచ్చె ననుట సహేతుకంబుగ నున్నది కాదు. గ్రంథంబులు మఱికొన్నిటింబట్టిచూడ వీరలకు విరోధ మున్నట్లుగఁ గాన రాదు కాని స్నేహిత మున్నట్లు మాత్రము గానవచ్చుచున్నది. భీమనఛందము :-

చ. మతిఁ, బ్రభ, నీగిఁ, బేర్మి, సిరి, మానము పెంపున భీమునిన్ బృహ
   స్పతి, రవిఁ, గర్ణు, నర్జును, గపర్ది, సుయోధనుఁ, బోల్బఁబూన. నా

మతకరి, తైష్ణు, దుష్కులు. నమానుషు, భిక్షు, ఖలాత్ము లంచు వా
క్సతిపు, శశిన్, శిబిం, గొమరుసామిని, యేరువు, నబ్ధిఁ బోల్చెదన్.

దీనిచే నన్న యకు భీమకవియెడ విశేషగౌరవ మున్నట్లు గాననయ్యెడిని. ఇట్లుండ భీమకవి కీతనియెడ భేదబుద్ధి యుండునా ? యనిమాత్రము సంశయము పుట్టుచున్నది. ఈ యిర్వురికిం గొన్ని సంవాదములై వారిగ్రంథంబులు వీరు వీరిగ్రంథంబులు వారును పూర్వపక్షము చేసినట్లున్నది. అప్పు డీశాప మీయఁబడలేదు. 'ఆరణ్యపర్వావశిష్టంబునందు భీమకవి శాపభయంబున జయంబు గొనఁగోరి 'స్ఫురదరుణాంశురాగ' యని శంభుదాసుండు నగణం బుంచి మొదటిపద్యము వ్రాసి' నని యప్పకవీయము. ఈగణమునే నళోదయమునకు ముందు కాళిదాసుండును, శివభద్రంబునందు, ప్రణమితి సిరసి యని కవివరుండును బ్రయోగించె ననియును జెప్పియుండెను వానికిఁ గారణంబు లేమియు నున్నట్టు వ్రాయలేదు. భీమనశాపభయంబున శంభుదాసుం డట్లు వ్రాసె నని చెప్పిన యప్పకవిపల్కునకు భీమనపై నతని కుండునసూయ తప్పఁ గారణంబు వేఱు గానరాదు. ఇట్టియసూయకుఁ గారణం బీతనిస్వప్నగత వృత్తాంతంబు గాని వేఱేమియు నున్న ట్లీతఁడు చెప్పలేదు. కలలోనివార్త నమ్మి మనకు దేనిని నిశ్చయించి చెప్పుటకును నలవికాదు.

నన్నయభట్టు భారతమును వదలివేయుట.

పైకథనుబట్టి యధర్వణునిచావు విని నన్నయబట్టారకుండు మూర్ఛ నొంది హితులచేఁ దెల్పంబడి కొంతవడికి లేచి యుల్లంబు దల్లడిల్ల నిట్లు చింతించెను. "హా! యెంతదుర్మార్గుండను! చూచిచూచి యొక్కక్షణంబులోపలనే బ్రహ్మహత్యం గావించితిని. నాతనువుఁ గాల్పనే ? ఎంతచదివిననేమి? బుద్ధి: కర్మానుసారిణీ యని యుండ మరలింప నేరితరంబు. ఈతఁడింతవఱకుఁ దెచ్చు నని మొదటనే యెఱింగిన నీలాటి దుర్ణయకార్యంబు సేయకుందుఁగఁదా" అని యనేకవిధంబుల డోలాయమానమానసుండై వ్యాకులపడుచుండెను. ఇదియకదా సజ్జనునకును


దుర్జనునకును గల్గుభేదంబు. ఈతఁడు సహజముగ సన్మార్గవర్తనుండవుటం జేసి ధనంబునకుఁగా దా నొనర్చినచెట్టలఁ దలంచి పశ్చాత్తప్తుం డయ్యెను. ఇట్లు తాఁ జేసినచేఁతనే మరలఁ జింతింపుచు నన్నపానంబులఁ గొనక పరులకు మొగంబు సూప నోడి వగఁ గుందు చున్న నన్న పార్యు తెఱం గెఱింగి రా జాతనిం జూడ నేతెంచి యో దార్చి గడచినదానికి వగచిన నేమగు నని తెల్పిన నాతఁడు మిగుల జాలినొందె. అపు డాతనితో రాజేంద్రుండు మరల భారతంబు దెనిఁగించి యొకవ్యాసంగంబున నుండుటచేత వంత కొంత మాను ననుడు నాతఁ డిట్లనియె. కటా! పంచమహాపాతకప్రధాన బ్రహ్మహత్యకారి నగు నాకుఁ బంచమవేదం బగుభారతంబు ముట్టుటకైన నర్హత లేదు. వికలం బగునామనం బట్టిమహ త్తరకార్యనిర్వహణంబునకుం జాలదు. అని కన్నీరు మున్నీరుగా నేడ్చుచున్న నన్నపార్యుం గాంచి గత్యంతరం బేమనిన రాజున కాతఁ డిట్లనియె.

రాజు కవులను వెదకించుట.

ఉపాయాంతరంబు సెప్పెద వినుండు. మత్కృతభారతసభాపర్వంబులోని దగు :-

మ. మదమాతంగ తురంగ కాంచనలసన్మాణిక్య గాణిక్యసం
    పద లోలిం గొని తెచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించి రా
    యుదయాస్తాచలసేతుశీతనగమధ్యోర్వీపతు ల్సంతతా
    భ్యుదయుం ధర్మజుఁ దత్సభాస్థితు బగత్పూర్ణప్రతాపోదయున్.

అనుపద్యము పత్త్రికల లిఖించి దీనిఁ దేశములకుఁ బంపుఁడు. ఈపద్యమునకు సమాన మగుపద్యం బెవ్వఁడు వ్రాయునో యాతఁ డీభారతంబును దెనిఁగింప సమర్థుండు. అట్టివాని నారయ భటులను బంపుఁ డనుడు నాపద్యంబు బహుపత్త్రికల లిఖించి దానికిఁ దుల్యం బగుదానిని వ్రాయఁ గవులకుఁ బ్రార్థనాపత్త్రికలు వ్రాసి వానిని దేశ దేశంబులకుఁ బనిచిరి.

తిక్కనసోమయాజి పద్యమునకు వర్ణము చేయుట.

అంతట రాజభటులు పత్త్రికలం గొని సర్వదేశంబులకును జని యచ్చో నున్న కవులకుఁ దమపత్రికలం జూపిన వారు స్వశక్త్యనుసారంబుగ వేర్వేఱుపద్యంబుల వ్రాసిరి. వానిం దెచ్చి భటులు రాజునకుఁ జూపిన నాతఁడు వాగనుశాసనుకుం జూపెను. ఆతఁ డేమియు నన కూర కుండె. అంతకుమున్ను కాశికాపురంబునకుం జనినభటులు కవుల వెదకుచుఁ బోవంబోవ నొక్కచో వేశ్యాగృహంబు వెడలి విడెం బుమియుచు నావులింపుచుఁ బ్రొద్దెక్కె నని త్వరతో నేతెంచుతిక్కనం గాంచి యెవ్వఁడో జారశిఖామణి యని యెంచి తమత్రోవం జన నుద్యుక్తులగుడు వారిం గాంచి తిక్కన వారి రాక నారసి పత్త్రికంగొని యందున్న వృత్తాంతంబు చూచి యందలి పద్యం బే మరల దానిక్రింద లిఖియించి యుమియుచున్న తమలంబున దానికి వర్ణం బిడి తనపేరు వారల కెఱింగించి యచ్చోటు వాసి చనియె. రాజభటు లీచిత్రంబు తమయూరు సేరి రాజునకుఁ దెల్పిన నాతఁ డచ్చెరువంది తత్పత్త్రంబుఁ గొని దాని నన్న పార్యునకుం జూపెను. దానిం జూచి యాతఁడు ఱేని కిట్లనియె. ఈతఁడే భారతంబుఁ దెనిఁగింప సమర్థుఁడు. ఈతనికవనంబును నాదియు నొక్కతీరుననే యుండును. అది యంతయు నీతఁడు నాపద్యంబ మరల వ్రాయుటంజేసి సూచించెడిని. నీకును గడు నచ్చెరు వగువన్ని యఁ దెత్తు నని యీతఁడు దీనికి వర్ణం బిచ్చెను. కావున నీతని నవశ్యంబుఁ దోడితేఁజనును. అనుడు నన్నయపల్కు లాలించి యాతనిసునిశితం బగుబుద్ధికి మిగుల సంతసించి పండితులం గాంచి యిట్లనియె. అహహా చూడుఁడు. దురవస్థం జెందియున్నను నీతని బుద్ధి యెటుల వ్యాపించుచున్న యదియో. "గూఢార్థము కవియెఱుఁగును" అన్న పండితోక్తి నిజమాయెను. అనుడు నాయార్యు లందఱును నన్న పార్యు ననేకవిధంబుల శ్లాఘించిరి. రాజును పనివిని నిజనివాసంబునకుం జని తిక్కనను రావించునుపాయంబ చింతింపుచుఁ దనమనంబున నిట్లని వితర్కించెను, "తిక్కనమన మెట్టిదో మన మెఱుంగము. అతఁడు దేశంబుగానిదేశంబున నున్నాఁడు. మన


ము రమ్మనిన నేమనువాఁడో. భటులవలన నాతనివృత్తాంత మంతయు వినియేయుంటిమి. అట్టివవ్నె వాఁ డెట్లు స్వాధీనుండగును? కాకున్నఁ జేయునది యేమి?" అని యనేకవిధంబులఁ జింతింపుచు నిద్రించెను.

రాజునకు స్వప్న మగుట.

ఇట్లు నిద్రించియున్న యారాజశిఖామణికి స్వప్నంబున నాతని యిష్టదైవంబు సాక్షాత్కరించి ఓయీ ! భారతంబుఁ దెనిఁగింపఁ దిక్కనయే సమర్థుండు. ఒరులొక్కరును నట్టి మహత్తర కార్యంబునకుఁ జాలరు. ఆతనిఁ దోడ్తెచ్చి యా కార్యంబు నెఱవేఱుప నియమించుము. అతఁడును మద్భక్తియుతుండు. నీవురమ్మనిన వచ్చి నీయభీష్టంబు నెఱవేఱ్చువాఁడు గాని వేఱుచేయువాఁడు గాడు, అని తా నంతర్ధానము నొంది నాపుడమి ఱేఁడు నిద్ర మేల్కాంచి ప్రభాతం బగుడుఁ గాలోచితకృత్యంబులు నిర్వ ర్తించి మిగుల సంతసంబున సభాంతరంబున కే తెంచి యచ్చోట నున్న విబుధులకు దనస్వప్నంబు వినిపించెను. వారందఱును నుల్లములు నుల్లసిల్లి తత్స్వప్న ఫలంబు విప్పి చెప్పి యిట్లనిరి. ఈ కార్యంబునకు మీ యిష్టదైవంబు మీకంటెను వేగిరించుచుండ మీరు సంశయింపనేల? ఈశ్వరానుగ్రహంబునఁ గార్యంబు నెఱవేఱును. భగవదాజ్ఞానుసారంబుగఁ గార్యంబు నడుపుఁడు, అనుడు సంతసంబున నట్ల కాక యని యాభూపతి తగుమంత్రులఁ బిలిచి వారి నాకవివరుఁ దోడ్తీ నియమించి వారితో నొకపసిఁడియడ్డలయందలంబు నాకవివరునకుఁ బనిచెను.

తిక్కనకు స్వప్నమున హరిహరనాథుఁడు దర్శన మిచ్చుట.

ఇచ్చటఁ గాశికానగరంబున నాఁటిరేయిఁ దిక్కనయిష్టదైవంబగు హరిహరనాథుండు తిక్కనతండ్రి యగుకొమ్మనామాత్యు నాకలో కనివాసు ముందిడుకొని వచ్చి యాతనికి స్వప్నంబున దర్శనం బొసంగెను. అనంతరము కొమ్మన తిక్కనం జూచి యోవత్సా ! నీదేవుం డగు హరిహరనాథుండు వచ్చి యిదె నినుఁ గృతార్థుం జేయ నున్న వాఁడు, చూడుము, అనుడు నాతఁడు గన్నులు విచ్చి ముందున్న యద్వయబ్ర


హ్మంబుం గాంచి పులకాంకితగాత్రుండై యంజలి యొనర్చి పురుషసూక్త విధానంబున నా దేవుని వినుతించి రక్షరక్ష జనార్దనయని ప్రపన్నుండై యుండ నాపరమపూరుషుం డాతనియెడఁ బ్రసన్నుండై యోయివత్సా ! నీభక్తి యుక్తులకు నలరితిని. నీజననంబు సార్థకం బయ్యె. నీవు జీవన్ముక్తుండవు. నీనామం బీజగంబున నాచంద్రార్కంబుగ నుండ భారతా మ్నాయంబుఁ దెనిఁగింపుము.

అనుడు నాతఁడు దేవరయాజ్ఞ యని తలవంచి యున్న తఱి భగవంతుఁ డదృశ్యుఁ డయ్యె. అంత నిద్రమేల్కాంచి యెంతయు సంతసంబున నక్కల నిజాప్తవర్గంబున కెఱింగించి కర్తవ్యంబు విచారించుచుండె.

తిక్కన భారత మాంధ్రీకరించుటకై యజ్ఞాము చేయుట.

అట్లుండఁ గొన్నిదినంబులకు రాజనరేంద్రుని సచివు లేతెంచి తమరాక నెఱింగించిన నగుంగాక యని యక్కవిశిఖామణి వారి వెంబడిని రాజమహేంద్రవరంబున కేతెంచె అప్పుడు రాజనరేంద్రుఁడు నాతని కెదురుగఁ జని యాలింగన మొనర్చి సభామంటపమునకుం దోడ్తెచ్చి యున్న తాసనంబునం గూర్చుండ నియమించి యర్ఘ్యపాద్యంబు లొసంగొ కర్పూరతాంబూలగంధమాల్యంబు లిచ్చి కుశలసంప్రశ్నంబు గావించి, పిమ్మట నాతనిఁ జూచి మీప్రభావంబు దివ్యంబు సుఁడీ యని స్వప్నంబుఁ దెలిపిన నాతండును నిజస్వప్న ప్రకారంబు వినిపించె. ఇట్లన్యోన్యకుశలసంప్రశ్నంబుల సంతసించి యుండ నా రాజో త్తముఁడు భారతంబుఁ దెప్పించి యం దున్నయట్టి నన్న యకృతంబుఁ జూపి కర్జం బడిగిన నాతం డిట్లనియె. నే నింతదనుక శుద్ధుఁడఁగాను. సోమరసపానంబున గాని నారసన పూతంబు గాదు. కావున నాకు జన్నం బవశ్య కర్తవ్యంబు. అనుడు వల్లె యని యా రాజు ఋత్విక్పురోహితుల నియమించి యధ్వరంబు సేయుం డనుఁడు దిక్కన యజ్వయై క్రతువు పూర్ణంబు సేసి సోమరసపానంబు సేసి యవబృథానంతరంబున భారతంబు దెనిఁగించె. తిక్కన జన్నంబు చేయుటకు వేఱుకారణంబు గల దని


కొందఱు చెప్పికొనెదరు. అది నమ్మ నర్హము కాని దైనను అచ్చటచ్చట లోకంబున వాడంబడుటంబట్టి దాని నిట వివరించెదము. రాజనరేంద్రుండు భారతంబు పూర్ణంబు చేయుటకుఁ దగు పండితుఁడు తిక్కన యని నిశ్చయించి యతనిప్రభుం డగుమనుమసిద్ధి రాజుకడ కాపండితుని బంపుటకుఁ గోరి వర్తమానంబు పంచెను. ఆమనుమసిద్ధి అట్లనే చేసెదనని తిక్కనను రావించి రాజనరేంద్రునికడకుం బొమ్మనుడు దానికిఁ దిక్కన సమ్మతింపనందున మనుమసిద్ధి కోపించి నీవు నాయాజ్ఞానుసారముగాఁ బోకుంటివేని నీమూతి గొరొగించి తప్పెటలతో వీధులవెంబడి నూరేఁగించి యూరివెలపట గుడిసెలో ప్రవేశ పెట్టి నీనోటకండక జరిపించెద నని చెప్పి భయ పెట్టెను. దానికి దిక్కన జంకక యుండినచో మనుమసిద్ధి యాతనిం బ్రార్థించి రాజమహేంద్రవరంబు బంచి తన్ను నదివఱకుఁ బల్కినపల్కులు వృథ గాకుండఁ దిక్కనచే యజ్ఞదీక్ష చేయించినఁ దిక్కనకు మూతి గొరిగించుకొనుటయుఁ దప్పెటలతో నూరేగించుటయును, గుడిసెలోఁ బ్రవేశించుటయును, మాంసభక్షణంబును తటస్థము లయ్యెనఁట !

ఈకథ పండితసామాన్యముగా వాడుకొనంబడక యుంటచే నీవఱ కిందుఁ బొందుపఱుపఁబడ దయ్యె. ఇపు డిది రాజనరేంద్రునితో మనుమసిద్ధి సమకాలీనుఁ డనువృత్తాంతమును రూఢపఱుచుట కిందు ముఖ్యముగా నుద్ ఘోషింపఁబడినది. అట్టిసిద్ధాంతమునకుం గల కారణంబులు నీకథాంతంబున విమర్శమూలముగా వివరింపనై యున్నాము గనుక నిపుడు తరువాతివృత్తాంతంబు వ్రాయుదము.

కుమ్మర గురునాథుం దోడ్తెచ్చుట.

"నేను గననంబు నుడువుచో నన్వయించుచు వైళంబ వ్రాయఁ గలయొకపండితుఁడు వలయును. మీకడ నుండువారిలో నొక్కనిఁ బంపుఁడు" అనినఁ దిక్కనం గాంచి రాజు మీధాటికిం దగువాని మీరే నుడువవలయును. అట్టివాని మే మెచ్చో నున్నను మీయాజ్ఞఁ దెలిపి తోడి


తెత్తుము అనురాజుపల్కుల కాతఁ డిట్లనియె. మత్పితృకృపాతిశయంబునఁ గల్గిన కుమ్మర గురునాథుం డనువాఁడు మాయూర నున్నాఁడు. ఆతనిందోడ్తెం డనుడు వల్లె యని యాతనిం దెచ్చి తిక్కనకుఁ జూపిరి. దాని కాతఁ డెంతయు సంతసిల్లెను.

తిక్కనచేయుశపథములు.

అనంతరము భారతముఁ దెనిఁగింప నుద్యుక్తుండై తిక్కన తాను జేయుశపథంబు లని రాజున కిట్లనియె. నేఁ జేయుగ్రంథంబునకు హరిహరనాథుఁ దక్క నొరుల నాయకులం జేయెను. సంస్కృతభారతంబును సభాంతరంబున నెన్నండును ముట్టను. వచియించుతఱి నెన్నండును దడవికొనను. అట్లు ప్రాదవశంబున నొనరించినచో నానాలుక నీ బెడిదం బగు నడిదంబున వ్రక్కలించెద నని భయంకరంబుగఁ బల్కిన నాసభ్యులు భయ మంది యాహా! యీతఁడు సార్థకనాముండు గానోవును. వల దన నేమగునో ఊరకున్న నెటు వోయి యెటు లయ్యెడునో యని యనేకవిధంబులఁ జింతించుచుండఁ దిక్కన రాజుం జూచి సభామధ్యంబున నొక కాండపటంబు గట్టింపుఁ డందు నే నుందును, అనుడు నాతఁ డట్ల కావించె. తిక్కన తా నందుఁ బ్రవేశించి యిట్లనియె. నన్న పార్యుండు రచించిన భారతభాగంబు లిం దుండుటంజేసి యాతనికీర్తియు కృతిపతివగు నీకీర్తియు నాచంద్రార్కంబై యుండును. కావున నే నామూఁడు పర్వంబుల ముట్టక నాలవది యగువిరాటపర్వంబును దర్వాత నుండుపర్వంబులును దెనిఁగింతు ననుడు నీతనివాక్యంబుల కందఱు నలరిరి.

గ్రంథరచనావిషయము.

ఈతఁడు సంస్కృతభారతంబు సభాంతరంబున ముట్టకయే తన యిష్టదేవతాప్రసాదంబున నాశుధారను నిజవాగ్వైఖరి మెఱయ విద్వజ్జనానుమతి యగునట్లు కవనంబు నుడువ దానిని గురునాథుఁడు సభామంటపంబునఁ గాండపటసమీపంబునఁ గూర్చుండి యతిత్వరిత గతి లిఖించుచుండెను. దానిం జూచి సభాసదు లందఱును వ్యాసు


నకు గజవక్త్రుండునుంబోలె గురునాథుం డీకవికిఁ దగియుండె నని కొనియాడిరి. అనంతర మనుదినంబును వీ రీగ్రంథంబు దివాభాగంబున నారంభించి దినాంతంబునఁ బరిసమాప్తి నొందించి నిశాంతంబులకు జనుచుందురు. ఇట్లుండికొలఁది కాలంబులోపల విరాటపర్వంబు, నుద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యపర్వంబులు సాంతంబుగఁ జేసి రాజున కొసంగిన నాతండును దత్సభాసదులును దిక్కనపదలాలిత్యంబునకును, శబ్దసౌష్ఠవమునకునుఁ గల్పనాచమత్కృతికిని శయ్య నేర్పునకును సంగ్రహఫక్కికిని సందర్భనైపుణికిని నెంతయు సంతసించిరి. మఱికొందఱు సోమయాజి కవనంబు చూచి యోరువలేమిచే నీతఁడు సామాన్యవృత్తంబులఁ గొన్నిటి నేర్చి కాలము గడుపుచున్నాఁడు. ఈతనిబండార మింతియ. విశేష వృత్తంబులవాఁడు గాఁడు. సాహితీపటిమయు నంతమాత్రంబే. దూరపుఁగొండలు నును పన వినమే. అని యాతని నిరసించుచు నచ్చటచ్చట బల్కసాగిరి. అట్టివారిపల్కు లన్నియు నాతనిచెవికి ముల్కులై సోఁకిన నాతఁడు మృదువృత్తంబుల కిది తఱి గా దని యెంచి సౌప్తిక స్త్రీపర్వంబుల రెంటిని కఠినతరవృ త్తసమన్వితంబులుగాను సంస్కృతజటిలంబులుగను నొనర్చె. వానిం జూచి యితనికి ఛందంబునఁ గలప్రజ్ఞకు నందఱును నలరిరి. కాని యం దొకరైన నీతనియభిప్రాయంబును దెలిసికొనరైరి. కావున నీతఁడు తనసాహితీపటిమను జూపఁ దలంచి శాంత్యాను శాసనికపర్వంబులు రెండును చెప్పుచో ననేకసంస్కృతజటిలవాక్యంబులు నచ్చ తెనుఁగువాక్యంబులను గుప్పించెను. ఆశైలిం జూచి పండిత జనంబు లెల్ల నాహారవంబుల నీకవిశిఖామణిసామీప్యంబున కేతెంచి యిట్టికఠినశైలి సర్వజనదురవగాహంబు. పండితపామరజనసుగమం బగు న ట్లీవఱకుఁ జెప్పి యిపు డిటు వ్రాయుటకుఁ గారణంబు కానరాదు. అనుడుఁ దిక్కన నవ్వి పండితపామరుల నిర్వుర మెప్పించుట ముఖ్యంబు గావున నే నట్లొనరించితిని కొందఱకు మార్దవంబైనచో రుచ్యంబు. మఱికొందఱకుఁ గఠినంబైనచో నిష్టంబగును. కఠినంబు గోరువారికిఁ గఠినంబుగ నుండుటయే కర్జంబు గదా. కవి వీరి నందఱ సంతుష్టి


నొందింప యత్నింపవలయు. అనుడు నాతిక్కనపల్కు విని ఆహా! దుర్జనుం డెవ్వఁడో యాతనిమనంబు నోనాడె. కార్యంబు దప్పె నని వా రాతనిం గాంచి యినుమునుబట్టి యగ్నికి సమ్మెటపె ట్లన్నట్టు దుర్జనుం డాడుపల్కులు గణించి దీని నందఱకును దుర్గమం బవున ట్టొనర్చితిరి. మీబోంట్ల కిది ధర్మమా? ఇంక నైన మీతొంటిపదలాలిత్యంబు గన్గొంటిమేనిఁ గృతార్థుల మయ్యెద మని ప్రార్థింపఁ దిక్కన నవ్వి వారి కిట్లనియె. ఈరెండుపర్వంబులును వేదాంతార్థప్రతిపాదికంబు లవుటంజేసి యిట్లుండ పామరజనదుర్గమంబు లగువీనిఁ బండితు లెట్లయినఁ బొందుదురు. నేను దొంటిశైలిని మరలఁ గైకొందును. అనుడు ముదితులై వారును బనివినిరి. అనంతరము సోమయాజి యశ్వమే, ధాశ్రమ వాస, మౌసల, మహాప్రాస్థానిక స్వర్గారోహణపర్వంబులు దొంటికంటెను లలితం బగువచనరచనఁ దెనిఁగించి భారతం బంతయుఁ బూర్ణంబు సేసి రాజున కిచ్చిన నాతఁ డానందాబ్ధిమగ్నుఁడై యాకవివరేణ్యు నెంతయుఁ గీర్తించి కనకాభిషేకం బొనరించి గారవించెను.

తిక్కనసోమయాజి తననాలుకం గోసికొనఁబోవుట.

ఈతిక్కనసోమయాజి భారతంబుఁ దెనిఁగించుతఱి ద్రోణపర్వంబున సైంధవవధప్రకారంబు సంజయుఁడు ధృతరాష్ట్రునకుం దెలిపె నని చెప్పుచో నొకపద్యంబు చెప్పె నందుఁ బద్యాంతంబు స్ఫురింపకుండుటం జేసి "ఏమి సెప్పుదుం గురునాథా" అని తోడన తనముందున్న కాండపటంబు ద్రెస్సి యచ్చటఁ దా నుంచినకత్తి నెత్తి యిదె నానాలుకం గోసికొనెద. నాకిత్తఱి దైవసహాయంబు లేదు. అనుడు నాతనింజూచి గురునాథుండు తత్పద్యంబు మరలఁ జదివి యిట్లనియె. నా కిం దేదియు లోపంబు గానరాదు. కురునాథుం డగుధృతరాష్ట్రునకు సంజయుండు పల్కు పల్కులుగాఁ బల్కితివి. అట్లు నా కన్వయించుటంజేసి వ్రాసితిని. నీతెగువకుఁ గారణం బేమి ? అనుగురునాథుమాటల కెంతయు నలరి హరిహరనాథుకటాక్షంబు మనకుఁ గలుగ వగవ నేల యని తిక్కన మరల గ్రంథంబు వ్రాయఁ దొడంగెను.

భారతములో నెన్నిక యగుపద్యము.

ఇది పూర్ణంబైనయనంతరము కొందఱు పండితు లాతనిం జూడ నేతెంచి ప్రసంగవశంబున నాతని నతనిభారతంబులోని మిగుల రమణీయం బగుపద్యంబు చదువుం డనిన సోమయాజి విరాటపర్వంబులోని దగు :-

శా. "సింగం బాఁకటితో గుహాంతరమునం జేట్పాటుమై నుండి మా
     తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధ మై వచ్చునో
     జం గాంతారనివాసఖిన్నమతి నస్మ త్సేనపై వీఁడ వ
     చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్."

అనుపద్యంబుఁ జదివిన వారందఱును దానియందలియుపమాసాదృశ్యలక్ష్మికి నెంతయు సంతసించిరి.

నన్న యభట్టు కాలనిర్ణయము.

ఇంతవఱకును భారతగ్రంథనిర్మాణమునకుం గలకారణములును అది పూర్తియైనరీతియును వ్రాసియున్నారము. ఇఁకను భారతప్రారంభ మెప్పుడు? భారతశేషమును దిక్కనసోమయాజి పూర్తిచేయుకాలమునకును దానికిని వ్యవధి యెంత యున్న దనుసంగతి యోజింపవలసి యున్నది. అం దివు డీకథయందు భారతకాలముంగూర్చిమాత్రము చర్చింతము. రెండవశంకకు సమాధానము తిక్కన సోమయాజి చరిత్రములోఁ జేయుదము. అందు మొదటిశంకకు సమాధాన మెట్లంటేని. -

ఇది రాజనరేంద్రునకుఁ గృతి యియ్యఁబడిన దవుటచే నతనికాలములోనిదే కావచ్చును. అతఁడు శాలివాహనశకము 944 మొదలు శా. సం. 985 వఱకును వేఁగిదేశములో నధికారము చేసియున్నట్లు చాళుక్యవంశస్థులశాసనములఁబట్టి స్పష్ట మగుచున్నది. కాని రామానుజాచార్యులు దిగ్విజయమున కీయాంధ్రాదిదేశములకు వచ్చువఱకును అదేశము లన్నియును జైనమతా క్రాంతములై యుండెను. అటుపిమ్మట ననఁగా శా. సం. 1000 లకు మీఁదట మరల నీదేశములో బ్రాహ్మణమ


తము వ్యాపక మైనది. రాజనరేంద్రుఁడు వేఁగిదేశము వదలి దక్షిణదేశము దండయాత్రకుఁ గా వెళ్లియుండెను. ఆకాలములలో నతని పుత్రులు మొదలగువా రీవేఁగిదేశమును బాలింపుచుండిరి. రాజనరేంద్రునిచే నీగ్రంథము ఆంధ్రీకరించుటకుం గోరఁబడుట వేదమతప్రాబల్యమైనకాలములో నని యూహింప ననువై యుండును. అతఁ డాగ్రంథము కొనసాగువఱకును ఈ దేశమున నుండినను నుండకున్నను జీవించియున్నను లేకున్నను నతనిస్థానమునందు వచ్చియున్నను నతనికుటుంబమువారు దానిం బూర్తిచేయించుటకు యత్నింపవచ్చును. రాజనరేంద్రునకుం జివరకాలములోఁ జోళదేశముగూడ వచ్చియున్నది. కావున నాచోళదేశమునకు కాంచీపురము ముఖ్యపట్టణమై యుండుటంబట్టియు నచటికి నెల్లూరు సమీప మగుటంబట్టియు నా నెల్లూరిలోఁ దిక్కన సోమయాజివంటి ప్రసిద్ధాంధ్రకవి యున్నాఁ డని వినుటచేతను రాజనరేంద్రుఁనిస్థానికులు తిక్కనసోమయాజికొఱకుఁ బ్రయత్నము చేసియుండ వచ్చును. కావున నన్నయభట్టు మృతినొందుసమయమునకు రాజనరేంద్రుఁడు తనకుమారునియొద్దను గాంచీపురములోనైన నుండవచ్చును. అటు గాకున్న నతఁడు కాంచీపురిలోఁ బ్రభుత్వము చేయుచు రాజమహేంద్రవరపుపండితులను తనకడ నుంచుకొని యైన నుండవచ్చును. అట్లు పైపండితులు చేయుచున్నగ్రంథమునకు విఘ్నము రాఁగా తాజనరేంద్రుఁడు గాని, రాజేంద్రచోళుఁ డనునతనిపుత్రుఁడు గాని యచ్చటనే దానిఁ బూర్తిచేయుటకు యత్నించి యుండవచ్చును. అట్లైనను గ్రంథము రాజనరేంద్రునిపేరిట నారంభింపఁబడెను. గావున నాతనిపేరిటనే అది పూర్తిచేయించుట కభ్యంతర ముండదు. కాఁబట్టి దేశములో నుండువాడుక ననుసరించి నన్న యభట్టునకు మతిభ్రమణము కల్గునప్పటి కీరాజు రాజ్యముచేయుచుండె ననియు, నన్నయభట్టారకుఁడే తిక్కన సోమయాజిని నియమించినాఁ డనియును, నిశ్చయింతము. తిక్కనసోమయాజికాలముంగూర్చి యతనిచారిత్రములో విశేషించి వ్రాయుచున్నా రము గావున నీకవు లిరువురును ఆసిద్ధాంతము చూచువఱకును సమకాలీను లని యంగీకరింతము. నన్నయభట్టు వార్ధి కావస్థలో నుండవచ్చును. తిక్కన బాలుఁడై యుండవచ్చును. వారిరువురకును వయస్సులో నేఁబదియఱువదివత్సరములవఱకును భేద ముండవచ్చును.

నన్నయభట్టారకునిగద్యము.

"ఇది సకలసుకవిజనవిమతనన్న యభట్టప్రణీతం బైనశ్రీమహాభారతంబునందు" అని యున్నది. దీనింబట్టి యితనివంశస్థులవలన సంపాదింపఁబడిన గౌరవములు గాని తండ్రిపేరుగాని కానుపించదు. దీనిం జెప్పఁజాలుగ్రంథములును గానరావు. కావున నాయంశ మట్లే యుంచుదము.

ఆంధ్రశబ్దచింతామణివిషయము.

ఇది నన్న యభట్టారకునిచే రచియింపఁబడినట్లు చెప్పఁబడినవ్యాకరణము. సూత్రము సంస్కృతము నుదాహరణములు తెలుఁగున నీయంబడినవి. ఈగ్రంథముంగూర్చినసంగతి భారతగ్రంథములో నున్న నన్నయభట్టువలఁన దా నావఱకుఁ జేసియుండిన గ్రంథములోఁ జెప్పఁబడదాయెను. ఈగ్రంథములో నావృత్తాంత మేమియుఁ దెలియ వీలులేదు. దీనింగూర్చి కాకునూరి అప్పకవిచే నతనివలన రచియింపఁబడినయప్పకవీయ మనుగ్రంథములోఁ గొన్ని యంశములు వ్రాయఁబడినవి. అంత కంటె మన కిప్పుడు పైయాంధ్రశబ్దచింతామణిం జెప్పు గ్రంథములు లేవు. కావున నందు వ్రాయఁబడిన దంతయు నిట వివరించెదము. ఎట్లన్నను :- అప్పకవీయము మొదటియాశ్వాసములో శా. శ. 1578 సరియైన మన్మథసంవత్సరదక్షిణాయనమున శ్రావణబహుళ 8 శ్రీకృష్ణజయంతినాఁడు శ్రీకృష్ణమూర్తి స్వప్నంబునఁ గాన్పించి :-

ఉ. ఈ యువతుల్ రమాధరణు లేను బయోరుహపత్త్రనేత్రుఁడన్
    నీయెడఁ గూర్మి గల్గి ధరణీదివిజో త్తమ వచ్చినాఁడ స్వ
    శ్రేయస మబ్బు నీకు నిఁక సిద్ధము నన్నయఫక్కి యాంధ్రముం
    జేయుము మాయనుగ్రహముచేఁ గవు లచ్చెరు వంది మెచ్చఁగన్.

క. వినియును గనియును నెఱుఁగని, ఘనఫక్కిం దెనుఁగు సేయఁగా నెట్లగు నా
   కన వలదు దానిలక్షణ, మును నీ కది గలుగుచందమును విను మింకన్.

గీ. ఆంధ్రశబ్దచింతామణివ్యాకరణము, ముందు రచియించి తత్సూత్రములఁ దెనుంగు
   బాసచేఁ జెప్పె నన్నయభట్టు తొల్లి, పర్వములు మూఁడు శ్రీ మహాభారతమున.

              వ. ఆసమయంబున.

గీ. భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి, నట్టి రాఘవపాండవీయము నడంచె
   ఛందము నడంచ నీఫక్కి సంగ్రహించె, ననుచు భీమన యెంతయు నడఁచె దాని.

               వ. తదనంతరంబ.

ఉ. అదిని శబ్దశాసనమహాకవి చెప్పినభారతంబులో
   నేది వచింపఁగాఁబడియె నెందును దానిన కాని సూత్రసం
   పాదన లేమిచేఁ దెనుఁగుపల్కు మఱొక్కటి చేర్చి చెప్పఁగా
   రాదని దక్షవాటికవిరాక్షసుఁ డీనియమంబుఁ జేసినన్.

క. ఆమూఁడుపర్వములలో, సామాన్యుఁడు నుడువు తెనుఁగు లరసికొని కృతుల్
   దాము రచించిరి తిక్క సు, ధీమణి మొద లైనతొంటితెలుఁగుకవీంద్రుల్.

గీ. రాజరాజనరేంద్రతనూఁజుఁ డార్య, సఖుఁడు సారంగధరుఁడు శైశవమునందు
   నన్నయ రచించునెడఁ బఠనం బొనర్చె, నన్యు లెవ్వ రెఱుంగ రీ యాంధ్రఫక్కి.

క. ఆలోకసుతుఁడు మొన్నటి, కీలక సమ నామతంగగిరికడ నొసఁగెన్
   బాలసరస్వతులకు నతఁ, డోలిఁ దెనుఁగుటీక దాని కొప్పుగఁ జేసెన్.

క. అదిని భీమకవీంద్రుఁడు, గోదావరిఁ గలిపె దానిఁ గుత్సితమున నా
   మీఁదను రాజనరేంద్ర, క్ష్మాదయితునిపట్టి దాని మహి వెలయించెన్.

క. ఇల నెనుబదిరెండార్యలు, గలిగి పరిచ్ఛేదపంచకంబునఁ దగునీ
   విలసితఫక్కి మతంగా, చలవిప్రునివలన నీదుసదనముఁ జేరున్.

క. మును నారాయణధీరుఁడు, తనకు సహాయముగ సంస్కృతము వాగనుశా
   సనుఁడు రచియించె దానిన్, దెనిఁగింపఁగ నీకుఁ దోడు నే నిపు డగుదున్.

క. తాతనయు నూత్న దండియు, నీ తెనుఁగులలక్షణం బొకించుక యైనన్.
   జేతఃప్రౌఢిమఁ జెప్పిరి, క్ష్మాతలమున దీని తెఱఁగు గా వవి యెల్లన్.

అని యిట్లు స్వామి అప్పకవిస్వప్నంబునఁ దెల్పి యంతర్హి తుండు గాఁగ నామఱుసటిదినంబున మతంగనగ నివాసియగు బ్రాహ్మణుండు పుస్తకముం దెచ్చి యిచ్చె నని యున్నది. ఇది కలలోనివార్త యగుట చే దీనిలో యథార్థ మెంతవఱకో యబద్ధ మెంతవఱకో దానిం దెలిసి


కొనుట కలవిగా కున్నది. ఇది కేవలము స్వప్నములోనివార్త యవుటచేతఁ జారిత్రముగా నమ్మ వలనుపడదు. నమ్మినను నమ్మకున్నను అప్పకవి యిట్లుగా వ్రాయుటకుఁ గారణ మేమియై యుండు నని యూహింతము. అది యొకకారణమువలన నై యుండునేమో యని యూహింపనై యున్నది. ఎట్లనఁగా :- ఆవఱకుఁ బేరైనను వినఁబడక యుండునాంధ్రశబ్ద చింతామణిగ్రంథంబు నీతఁడు తెనిఁగించి వ్యాపింపఁజేసె ననియెడివిఖ్యాతిని సంపాదించుటకై కావలయును. దీని కనువగునట్లుగా నితనివలన వాక్రువ్వఁబడినకథయందుఁ గలపరస్పర భేదములు మనమాటను స్థిరపఱుచుచున్నవి. అందు మొదటిదానిలో నన్న యభట్టు భారతముం దెనిఁగించి భీమనవలన రచియింపఁబడిన రాఘవపాండవీయము నడంచి భీమకవి ఛందస్సుగూడ నడఁగించుటకుఁగాను వ్యాకరణమును సంగ్రహించి యుండె ననియు భీమకవి యీవ్యాకరణమును బూర్వపక్షము చేసె ననియును జెప్పెను. దీనింబట్టియే రాఘవపాండవీయ మనుభీమనకృతిని నన్నయభట్టు పూర్వపక్షము చేసెననియు భీమకవి దానికిఁ బ్రతినిధిగా నన్నయభట్టీయ మగువ్యాకరణము పూర్వపక్షము చేసె ననియు స్పష్ట మగుచున్నది. ఇఁక నిర్వురును సమానకక్షిదారులే గాని అందేమియును భేదము లేదు. ఇట్టివీరి కన్యోన్యము సమానగౌరవమే యుండును గాని హెచ్చుదగ్గులుండవు. ఇట్లుండఁగా భీమకవి నన్నయభట్టుచే రచియింపఁ బడినభారతములో నేది వచియింపఁబడినదో అదియే తెలుఁగులోఁ జెప్పఁ బడవలయును గాని వేఱుపదము సూత్రసంపాదన లేమింజేసి చెప్పఁబడ గూడ దని నియమంబుఁ జేయుట కల్గునా ? ఆహా ! ఈయుక్తి యేమి యుక్తముగా నున్నది ? భీమకవి యంతయపండితుఁ డని అప్పకవి యూహించెంగాఁబోలును? నన్నయభట్టునకు ముందుగ ఛందమును రచియించినభీమకవి నన్నయభట్టీయమును గోదావరిలోఁ గలిపి మరల వ్యాకరణమును రచియింపలేక నన్నయభట్టారకుఁడు రచియించినభారతగ్రంథమును జూచుకోవలయు ననుట నియమంబుఁ జేసినవాఁ డనుటకంటె గొప్పవింత యేమైనఁ గలదా ! అంతటితోఁ బోనీయక "దక్ష


వాటి కవిరాక్షసుడు" అని భీమకవికి బిరుదు నొసంగెను. ఈమాట భీమకవి లేనిచో నతనిపరోక్షములో నప్పకవి వ్రాసి జీవించి యుండెంగాని భీమకవి యుండఁగనే వచియించిన నప్పకవి అంతకువురిచెంతకుఁ బోకయుండునా? ఈ ప్రసంగ మింతటితోఁ జాలించి యొక్కసంగతిమాత్రము విజ్ఞాపనజేసి యీవృత్తాంతము విడిచెదము. భీమనఛందస్సనుగ్రంథము భీమకవివిరచితము గాక భీమకవియొక్క అగ్రపుత్రునివలన రచియింపఁబడినది. అందుల విశేషము లన్నియు నాభీమకవిచారిత్రములో జూడం దగును. భారతానంతరము భీమకవి ఛందస్సు నడఁచుటఁకుగా నీవ్యాకరణము నన్నయ చేసె ననుమాట భారతము రచియించుచున్న సమయములోనే నన్నయభట్టునకు మతి పోయె నని యున్న కథవలన నిర స్త మగుచున్నది.

తిక్కన మొదలగు తొల్లింటి తెలుఁగుకవులు భారతము మూఁడు పర్వములలో నన్నయవలనఁ బ్రయోగింపఁబడిన తెలుఁగుల నరసికొని తాము గ్రంథములు వ్రాసికొని రని యింకొకమాట చెప్పఁబడినది. ఇది పైదానికంటె నద్భుతముగా నున్నది. అప్పకవియభిప్రాయము తిక్కనసోమయాజి నన్నయభట్టునకు శిష్యుం డని చెప్పవలయు నని కాఁబోలును? తిక్కనవృద్ధపితామహప్రపితామహులనుండియుఁ గవిత్వమహత్తు గల దని యీతఁ డెఱుఁగఁడు. దీనికి దృష్టాంతము వలయునేని తిక్కనసోమయాజి నిర్వచనోత్తరరామాయణములోని

"సారకవితాభిరాము గుంజూరివిభుని, మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలఁచి"

అనుపద్యము చూచుకొనవలయును. ఇంతియకాక తిక్కనసోమయాజి విరచితము లగుభారతములోని పదేనుపర్వములును సావధానముగఁ జూచినచో నీసంశయము తొలఁగిపోవుటయేకాక నన్నయభట్టునకు సోమయాజులవలన నేర్చుకొనవలసినయంశములు పెక్కు లుండిపోయిన వని సులభముగ బాలురకుంగూడ బోధయగును. ఇదియునుంగాక రంగనాథ రామాయణము భాస్కరరామా


యణము మొదలగుప్రాచీనగ్రంథములును నన్న యభట్టీయమతానుసారము లై యుండె నని అప్పకవి అభిప్రాయమేమో? అట్లనినచో నప్పకవికి నెవరికంటె నెవరు ప్రాచీనులో ఆసంగతి తెలియనే లేదని చెప్పవలసియుండును.

నన్న యభట్టీయమును దెనిఁగింప దొరఁకొనుచున్నాఁడు కావున నప్పకవి కాగ్రంథ మంతఘనముగాఁ గాన్పించుచున్నది. కాని నన్న యభట్టుకాలములో నీగ్రంథమున కంత కాకున్నఁ గొంతయైన గౌరవ మున్నట్లు కాన్పించదు. నన్న యభట్టీయముకంటె నధిక మగునాధర్వణాచార్యుని వ్యాకరణమే ఆకాలములో విశేషవిఖ్యాతితో నుండెను. ఆంధ్రభాషలో నపశబ్దోచ్చారణానంతర మాధర్వణనామస్మరణ చేసినచోఁ దద్దోష పరిహారమగు నని యుండుటంబట్టి నన్న యభట్టు వై యాకరణుఁడుగానే యెవ్వరివలనను గ్రహింపంబడలేదు. ఇ ట్లున్నను సర్వకాలములలోను నన్న యభట్టీయమే పూజనీయమై అది తిక్కన మొదలగు మహాకవులప్రయోగములకుఁగూడ నాధారగ్రంథ మై యున్న దని అప్పకవి చెప్పినందులకుమాత్రము విచార మగుచున్నది.

సారంగధరుఁడు వ్యాకరణమును బ్రకటించుట.

రాజనరేంద్రునిపుత్రుఁ డగుసారంగధరుఁడు నన్న యభట్టీయవ్యాకరణము రచియింపఁబడునపుడు దానిం బఠియించె ననియు దాని నితరు లెవ్వరును నెఱుంగ రనియు నప్పకవిమతము. ఇది మఱియుఁ జిత్రముగా నున్నది. నన్నయభట్టు వ్యాకరణమును లోకోపకారార్థము రచియించును గాని యొక్కసారంగధరునికొఱకే అయి యుండదు. గ్రంథము వ్యాపకమే అయినచో మఱికొందఱు గూడ దానిఁ దెలిసికొనక మానరు. ఇదియునుంగాక నారాయణధీరుఁడు సహాయము చేయఁగా నన్నయభట్టీయము రచియింపఁబడిన దని అప్పకవియే చెప్పియున్నాఁడు. హ్రంథము నష్టమైపోవునపుడు నారాయణభ ట్టయినను దానిని వ్యాపింపఁ జేయకపోఁడు. సారంగధరుఁ డైనను నీగ్రంథము భీమనచే గోదావరిం


బడవేయఁబడె నని వినినతోడనే దానిని మరల వ్రాయింపకపోఁడు. కావున నిది యా కాలములో రూపుచెడఁబోయె ననియును, అనంతరకాలములో ననఁగా నైదాఱువందలసంవత్సరము లైనపిమ్మటను కారణము లేకయే ఒక్కరికిమాత్రము తెలుపఁబడియెనని చెప్పుట సహేతుకముకాదు.

భీమకవికాలము మొదలుకొని అప్పకవికాలమువఱకును మధ్యను అయిదువందలసంవత్సరములు వ్యవధి యున్నది. ఈకాలములో ననఁగా పై అయిదువందలసంవత్సరములకాలములో నీ నన్న యభ ట్టీయవ్యాకరణము కాన్పించకుండుటకుఁ గారణము విచారించి చూడఁగా నిది భీమకవి వలనఁ బూర్వపక్షము చేయఁబడెననియు, నట్టికారణమున నది అప్పటివా రందఱివలన నుపేక్షింపఁబడె ననియును దోఁచుచున్నది. కాని యామధ్య కాలములో నాధర్వణవ్యాకరణమే ఆంధ్రభాషకుఁ బఠనీయగ్రంథముగా నప్పటివారివలన గ్రహియింపఁబడినట్లుగా నూహింపఁబడవలయును. ఇట్టి వృత్తాంతము చెప్పుట కిష్టము లేక అప్పకవి పూర్వపక్ష గ్రంథ మగునన్న యభట్టీయమును బునరుజ్జీవింపఁజేయునిష్టముచే నిట్టియపూర్వవృత్తాంతము నొకదానిని వన్నె ననియు, నదియు నొకరివలన వింటి నన నది యతనిసమకాలీనుల కైన నమ్మకముగా నుండ దనుతలంపున నట్లు చెప్పె ననియుఁ దోఁచెడిని. నన్న యభట్టుచేఁ బూర్వపక్షము చేయఁబడినరాఘవపాండవీయ మెట్లుగ నామరూపరహితముగనయ్యెనో అటులనే భీమకవిచేతను బూర్వపక్షముచేయంబడిననన్న యభట్టీయము నామ రూపరహితమై పోయె నని యొప్పుట కాక్షేపణము లేదు. భీమకవికిని అప్పకవికిని మధ్య కాలములో నున్న వారికవిత్వము లధర్వణవ్యాకరణ మతానుసార లనుట కనేకదృష్టాంతము లున్నవి. అట్లున్నను అప్పకవి యీగాథను బన్నుటకుఁ గారణము పూర్వపక్షిత గ్రంథోజ్జీవనార్థమే కాని మఱియొకటి కా దని స్పష్టమైనది. దీనిచే భీమకవిపై నప్పకవి చేసిననిందాప్రయోగములును నిష్కారణద్వేషబుద్ధి చూపుటయును స్థిరపడుచున్నవి.