కవిరాజమనోరంజనము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము

వ.

నాయొనర్పంబూనిన కవిరాజమనోరంజనం బనుపురూరవశ్చరిత్రంబునకుం గథా
ప్రకారం బెట్టిదనిన సకలమునివరేణ్యశరణ్యం బగునైమిశారణ్యంబునం బుణ్యకథా
శ్రవణోల్లాసవికాసముఖులు శౌనకప్రముఖులు సమస్తపురాణవాణీమణిస్యందన
సంచారకరణప్రవీణసూతుం డగుసూతునివలన నుపసూచితం బగుపురూరవశ్చక్రవర్తి
చరిత్ర౦బు విని సవిస్తరంబుగాఁ దెలుపవయునని యడిగిన నక్కథకుం డిట్లని
తెలుపం దొడంగె.

52

ప్రతిష్ఠానపురవర్ణనము

సీ.

వరణాగ్రమణిరాగభరణాంచదుదయాస్తమయహంసశుభ్రాంశుమండలంబు
బహుళసౌధావళీప్రతిబింబభాగపూర్వార్జునస్వర్దీర్ఘికామృతంబు
నీలనభోవాదనిశ్చయాపాదకాగరుధూపధూమరేఖాస్థిరంబు
ప్రతిపదాలిప్తజంబాలకస్తూరికాప్రకటితస్వగుణగోత్రాస్థలంబు


తే.

ఘటితకుట్టిమపటుహీరకాంతికౌము, దీవిధూతతమఃపటలావిధూద
యత్రియామోత్కరంబు విచిత్రవిభవ, సురుచిరంబు ప్రతిష్టానపురవరంబు.

53


సీ.

పణ్యస్థలము లెల్లఁ బద్మాకరములు పద్మాకరతతులు మహావనంబు
లావనంబులు వినోదాగంబు లావినోదాగము ల్గోపురాగ్రాంచితములు
గోపురాగ్రంబులు గురుసభావళులు సభావళుల్ దైవాలయములు చూడ
దైవాలయంబులు ధామస్థితు ల్మఱి ధామస్థితు ల్కడుధర్ము లరయ


తే.

ధర్ము లతిభద్రకరులు తద్భద్రకరుల, యూధముల నెన్నఁగాఁ బ్రమదోత్కరంబు
లచటఁ బ్రమదోత్కరములు ప్రభాసమాన, లనఁ బ్రభాసమానం బగు నప్పురంబు.

54


చ.

నయగుణరత్నసంయుతి వనప్రకటోన్నతి రాజమండలో
దయపరిజృంభమాణత సుధామహితస్థితి శ్రీవిలాససం
శ్రయత ననంతభోగవిలసత్పురుషోత్తముయుక్తి వర్ణితం
బయి కలశాంబురాశిగతి నన్నగరంబు గరంబు చెల్వగున్.

55

తే.

రాజమార్గంబు నక్షత్రరాజితోడ, నంతరిక్షంబున వెలుంగు టెంతయనఁగ
రాజమార్గంబు నక్షత్రరాజియగుచు, నగరమధ్యంబునందు నున్నతివహించు.

56


శా.

క్రీడాశైలదరీపరిస్ఫుటవితర్దిస్థాపితాంచత్క్షపా
రాడశ్మచ్ఛటలం గరంచు విలసద్రాకానిశాభాసమా
నోడువ్రాతపసాంద్రచంద్రికతదీయోదప్రపూరంబు జా
లై డిగ్గు న్సెలయేఱులై పురివిహర్త్రాహ్లాదముం జేయుచున్.

57


సీ.

చక్రవాళధరాధరక్రియాచాతురిఁ గొంకుదేఱిన పాణిపంకజమున
మహనీయజలధినిర్మాణకేళీలీల వడఁకుదేరినకరవారిజమునఁ
గలధౌతకాంచనాచలశృంగరచనచే నళుకుదేరినహస్తజలరుహమునఁ
నలచైత్రరథనందనారామకల్పన నారితేఱినశయాంభోరుహమునఁ


తే.

గనకగర్భుండు నిర్మించెఁ గనకఘనక, ళావిలాసతనసమాన మై వెలుంగు
వరవరణఖేయహర్మ్యోపవనచయంబు, లప్పురంబున భువనంబు లభినుతింప.

58


తే.

సర్వతోభద్రరేఖాప్రశస్తివలన, భాసురం బైనయట్టియప్పట్టణంబు
సర్వతోభద్రరేఖాప్రశస్తివలన, భాసురంబైన జ్యౌతిషప్రతిభఁ గాంచె.

59


క.

పుటభేదనపటుకేతన, పటసంచలదంచలముల భాసిలుఘటిత
స్ఫుటముక్తామణి రేఖా, మటిమం దారాగణము విభావరివేళన్.

60


మ.

పురనానామణిహర్మ్యదేశచరదంభోజాంబకాస్యాచ్ఛసుం
దరత ల్సూచిన కన్నులన్ నిహితతద్ద్వారస్థలాదర్శవి
స్ఫురితాత్మప్రతిబింబము ల్గని సుమీ పూర్ణప్రభాపూర్ణిమా
హరిణాంకుండు వివర్ణుఁడై యరిగి కార్శ్యంబందు నంతంతకున్.

61


తే.

అలమృగాంకుండు వాతాయనాంతరములఁ, దూఱిపోవుచుఁ జరియించుకారణమున
లీలఁ బురహర్మ్యములు చంద్రశాలలయ్యెఁ, దత్సుధాసేచనమున సౌధంబు లయ్యె.

62


సీ.

గగనగంగాతరంగములఁ దోఁగినచల్లగాలి ఘర్మాంబుశీకరము లణఁప
నమృతంబుచిలుకు శీతాంశుబింబమరీచు లాయాసఖేదంబు నవనయింపఁ
బరువమై చెలువొందు పారిజాతద్రుసూనచయంబు పరిమళానంద మొసఁగ
వీణారవంబుతో నీతెంచుకిన్నరీజనగానములు చెవుల్సల్ల సేయఁ


తే.

జొక్కి నిదురింపుదురు గాఢసురతజనిత, మోహబంధానుగుణనిజబాహుబంధ
విరచనైకీభవత్పరస్పరశరీరు, లగుచు దంపతు లప్పురహర్మ్యములను.

63


తే.

కమలబంధుండు మధ్యాహ్నకాలమునను, దా మహేశ్వరుఁ డైనచందంబుఁ దెలుపు
రజతకుధరాధరావతారప్రకార, హీరసౌధాగ్రసీమలఁ జేరి పురిని.

64

తే.

మీనకర్కటమకరసంస్థాన మగుచు, సొరిదిఁ బ్రతిబింబమిషమున సూర్యచంద్ర
తారకాదులు తనయందుఁ జేరియుండ, గగనమును బోలియొప్పు నన్నగరిపరిఘ.

65


క.

పరిసరపరిఖాసలిలాం, తరమున వెసఁజొచ్చి మర్త్యదర్శనకాంక్షా
పరతఁ బఱతెంచి యీఁదుచు, శరములపైఁ దేలుదురు రసాతలభోగుల్.

66


సీ.

లలితచందనలేపకలితసుందరవళీసౌపానముల జంగఁజాఁపియెక్కు
ఘనతారహారసుస్తనభారగిరినితంబములపై జీరుకుబండలాడు
నసమానవీటికారసమానితాధరామృతదీర్ఘకలనుఁ జేయీఁతలీఁదు
హేలారచితపుష్పమాలారచితకేశభృంగమల్లములతోఁ బెనఁగులాడు


తే.

సురతనాట్యకళాంశుకీకరణకామ, కమలజాతావసరతీవ్రగాఢకేళి
భవపరిశ్రమలాలసపౌరయువతి, జాలతనుసీమల సమీరబాలకుండు.

67


చ.

చనునెడ దక్షిణాయనమిషంబునఁ గొన్నిదినంబు లుత్తరా
యణమనఁ గొన్నినాళ్లు గగనాంతరసీమ మెలంగుచుం బురిం
గనఁబడు చోద్యము ల్గలయఁ గల్గొనుచుండుదు రెల్ల కాలమున్
ఘనమగుదర్శనేచ్ఛలను గైరవిణీనలినీమనోహరుల్.

68


సీ.

ప్రాకార మమరేంద్రలోకాంత మన్నచో హర్మ్యజాలోన్నతు లడుగ నేల
ధామంబులెల్ల రత్నమయంబు లన్నచో నొడలిసొమ్ములవింత లడుగ నేల
ప్రతివీథియు సుగంధరససిక్తమన్నచో నంగరాగములమే లడుగ నేల
త్యాగంబు లర్థి కత్యధికంబు లన్నచో నైశ్వర్యవిభవంబు లడుగ నేల


తే.

శుకపికాదులు సరసవచోవిలాస, కృతపురాణప్రసంగమోదితజనాళు
లన్నచో విద్వదధికార మడుగ నేల, జగదలంకార మైనయన్నగరమునను.

69


సీ.

అశ్రాంతనియతిఁ బద్మాసనస్థితు లౌట భాషాప్రియోదారభావు లగుట
సత్యప్రవర్తనశ్లాఘ్యత వెలయుట నామ్నాయమతి చతురాస్యు లగుట
విబుధాగ్రగణ్యతావిస్ఫూర్తిఁ గాంచుట సన్ముఖాంభోరుహజనితు లగుట
హంసేశహరిహితోద్ద్యద్గతి మెలఁగుట సౌమనోధర్మాగ్రజన్ము లగుట


ఆ.

నలహిరణ్యగర్భు నపరావతారంబు, లగుట కింతసంశయంబు గలుగ
దప్పురంబులోన నొప్పారుచున్నట్టి, భూమిసురులమహిమ పొగడ వశమె.

70


సీ.

పౌరుషంబుకొఱంత పౌరవిరోధంబుఁ గలుగ దీరాజశేఖరులయందుఁ
బక్షపాతంబు స్వభావకాఠిన్యంబు పొరయ దిగోత్రాధివరులయందుఁ
నొరుదండ నిలిచి యేయుట వైరిధాటికి విముఖమౌ టెఱుఁగ మీవిజయులందు
సత్కులామిత్రత శాత్రువుఁ దలచూప నిచ్చుటఁ జూడ మీయినులయందు

తే.

ననుచు జనులెంచ మఱియుఁ గళ్యాణగృహని, వాసులై నిత్యధర్మవిలాసులై య
నంతరాయభోగిష్ఠులై యమితవాహ, వంతులై బాహుజులు ప్రవర్తింతు రచట.

71


మ.

తమకుం జాలినవర్తకం బతనిచేతం గామినో శంఖప
ద్మమహాపద్మము లర్ధపున్ విడిచి ప్రేమం దత్పురీవైశ్యస
త్తములం జేరె ననంగ శంఖములు పద్మంబు ల్మహాపద్మముల్
ప్రమితార్థంబుల వృద్ధిఁబొంది సిరులన్ భాసిల్లుఁ దద్గేహముల్.

72


ఉ.

అద్రులు ధైర్యవైభవసమగ్రత బ్రాహ్మణసేవచే సదా
భద్రులు బాహుశక్తిబలభద్రులు రుద్రముకుందభక్తిని
ర్ణిద్రులు సత్కృపాగుణసమృద్ధిసముద్రులు చారుకీర్తిన
క్షుద్రులు శూద్రు లొప్పుదురు చూడఁ బురిన్ సుకృతైకముద్రు లై.

73


ఉ.

హైమమనోజ్జ మైనపురిహర్మ్యచయంబున మర్త్యదంపతుల్
ప్రేమలతోడఁ గూడి విహరించుచు నింపుగ షడ్జమధ్యమ
గ్రామముల న్వినోదగతి గానము సేయఁగ నాలకించుచున్
వేమఱు మెచ్చుచుందు రతివింతగఁ గిన్నరదంపతు ల్దివిన్.

74


క.

పురిగోపురాగ్రసింహో, పరిగతమధ్యాహ్నసమయభానుఁడు వొలుచున్
నిరతముబ్రపూర్ణదీధితి, నరయన్ స్వక్షేత్రవాస మని తలఁచియొకో.

75


క.

సాలంబులకొమ్ములు సుర, సాలంబుల నంటుకొనఁగ సారికిఁ బురిలో
సారంబులకొమ్ములుసుర, సారంబుల నంటుకొనుఁ బ్రశస్తస్ఫూర్తిన్.

76


చ.

అతనునిముల్కులో చిగురుటాకులొ కుందనపున్ సలాకలో
రతనపుతేటలో తొగలరాయలచాయలనిగ్గులో తటి
ల్లతికలొ పువ్వుగుత్తులొ విలాసరసంబునఁ బోసినట్టియా
ప్రతిమలొ వీ రనంగ బురిఁ బంకజగంధులు వొల్తు రెంతయున్.

77


సీ.

పొలఁతులవలుదకొప్పులు చూచి నిజశాంబరీతమోనిర్మాణరీతి మఱచి
తరుణీకటాక్షపాతచమత్కృతులు చూచి శరసంప్రయోగవైఖరులు మాని
వనితలమధురనిస్వనకంఠములు చూచి విజయశంఖములపై వేడ్క సడలి
నీలవేణులముద్దునెమ్మొగంబులు చూచి యలమృగాంకునిసహాయంబు వదలి


తే.

యలఁతఁ దీఱుచుకొనుఁ గుసుమాయుధుండు, రతికుచాభోగశయననిద్రాసుషుప్తి
బురుషుల జయించుకార్య ముప్పురివిలాస, వతులచే నౌట నిర్విచారతఁ జెలంగి.

78


సీ.

ఆడనేర్తురు మనోహరలీల నృత్యనృత్తంబులు భరతవిద్యానిరూఢిఁ
బాడనేర్తురు రాగపరిమితస్వరసుధావ్యాప్తిచే దారువు లంకురింపఁ

జూడనేర్తురు యతీశులకైన భ్రమపుట్ట దశవిధవీక్షావధానములను
గూడనేర్తురు సొంపుగులుక నైంద్రాణికఫణిపాశముఖరతిబంధములను


తే.

సరససౌందర్యవిద్యాప్రసంగగరిమ, రసికనికరకటాక్షపరంపరావి
కాససుమమాలికాస్వలంకరణపాత్ర, లైనపాత్రలు తత్పురియందుఁ గలరు.

79


సీ.

కార్కొన్నచికురాంధకారంబులో బడి వెలువడు సీమంతవీథులందుఁ
బైజొన్నదృగ్బాణపంజరంబులఁ జిక్కి కడచు నిమేషావకాశములను
మొనయెక్కుడగుగుబ్బచనుకొండ లెక్కి గాసిలి డిగ్గు హారనిశ్రేణికలను
గనరాని యవలగ్నగగనాంతమునఁ బ్రాకి వ్రాలుఁ గాంచీచక్రవాళమునను


తే.

బురసమాగతపాంథప్రభూతకుసుమ, శరవికారవిలోలలోచనదృగంచ
లములు ఘంటాపథచరద్విలాసలసిత, వారకన్యావలోకనావసరములను.

80


సీ.

వెలకుఁ జూపవు పొన్నవిరి యంతగోప్యమా యది యరంటులలో నయ్యెఁ జుమ్ము
కప్పుకోనేల బంగారమా పువుబంతు లవి సువర్ణలతోదయములు సుమ్ము
మూసిపెట్టెదు మల్లెమొగ్గ లింతబ్రమా యవి సుధారాశిచేరువ సుమ్ము
దాఁచుకొంటివి యరుదా నల్లఁగలువపే రదియ గాఢసరోవహనము సుమ్మ


తే.

టంచు ముసిముసినగవు లన్యోన్యవచన, మంజులవ్యంగ్యచాతురీవ్యంజకములు
గా విటుల కమ్ముదురు విరు ల్కాముకైక, జీవికలు పుష్పలావిక ల్సెలగి పురిని.

81


చ.

అరదములన్ సృజించి కమలాసనుఁ డుర్వికిఁ ద్రోయ రత్నని
ర్భరమునఁ గొన్ని తత్పురిని వ్రాలినఁ జుల్కనివెల్ల గాడ్పుచే
దిరుగుచు మింటఁ జిక్కె నవి దేవవిమానము లయ్యె వానిపెం
జరయఁగఁ దత్సమానములయైన విమానములందుఁ గల్గునే.

82


మ.

జిగతీధ్రంబులు దేవపాపగతసంచారంబులై నిశ్చలం
బగు వృత్తిం దపమాచరించి తతఘంటారావనిర్భీకయా
నగుణోదగ్రత విగ్రహాంతరము లెన్నం దాల్చుటం గల్గెనో
నగసంబంధగతాదివృద్ధి యనఁగా నాగంబు లొప్పుం బురిన్.

83


చ.

అరివిజయప్రతాపఘనయానమహీభృదుపాశ్రయంబులం
బరఁగినవౌటఁ గైటభవిభంజనజింభమదాపహారకుం
జరరిపువిక్రమానుగుణసారతఁ జొప్పడు నప్పురీహరుల్
హరులను నామథేయములు సార్థకమై యనువొందునట్లుగన్.

84


క.

వాసవవాసవదీప్తన, వాసిని వాసిని జయించునయ్యాయుధముల్
కేసరికే సరివత్తురు, భాసురభాసురవు లచటిభటు లుద్వృత్తిన్.

85

వ.

వెండియు నప్పుటభేదనప్రకాండం బఖండతాండవపాండిత్యవికస్వరశిఖండశిఖండి
మదోత్సాహకృదాఖండలకోదండమండితకాండమండలాయమానవిచిత్రచిత్రధ్వజ
పటపటలకిమ్మీరశోభామిళడభ్రభ్రమదదభ్రశుభ్రేతరవిభ్రాజితధూపధూమరేఖాబహు
ళంబును భరతసంగీతరత్నాకరకళావీణాప్రవీణవాణినీశ్రేణివివిధవిధనాట్యవిజృంభణచ
లదరుణచరణరణదతులతులాకోటిచాటుకింకిణీకలితతాళతత్కారపల్లవనితంబతలము
ఖరేచితమకరావిద్ధవక్రదండపక్షోర్ధ్వమండలీప్రముఖకరకమలవిక్షేపజనితకంకణఝ
ణఝణత్కారకనకరశనాగుణకీలితఘంటికాఘనఘనత్కారమార్దళికశయాహ
తమృదంగాభంగధిమిధిమితాగారసమ్మిశ్రసాంద్రస్వనఘుమఘుమితనాట్యశాలాజా
లఖేలనంబును ప్రభుసేవాసమాగతసంకీర్ణకర్ణాటలాటవరాటకాంభోజకాశ్మీరకుకురు
కురుగాంధారసౌవీరసౌరాష్ట్రమగధమద్రమాళవనేపాళబంగాళకళింద్రావిడకేరళ
గూర్జరప్రముఖనానాదేశవసుంధరావరాన్యోన్యసంఘర్షణసముద్భూతశుంభచ్ఛాతకుం
భభూషావిశేషరజఃపుంజసికతావిరాజమానరాజమార్గంబును గృతకసిలోచ్చయనిచ
యసముత్తుంగశృంగస్థాపితదీపితహీరవారాంబరచుంబికాంతికదంబాడంబరనిష్కళం
కితశంబరభవనికురంబవిరోధిబింబంబును మహామహోన్నతహాటకహర్మ్యసమూహ
శీరోగేహదేహళీప్రముఖగృహాంగణస్థగితరోహిణీకాంతకాంతోపలదృశ్యమాననిజ
ప్రతిబింబవిలోకనసంజనితాన్యవాహసందోహమోహసముత్సాహహేతుహేషా
విశేషఘోషబంధురసముల్లంఘనోద్ధతకబంధజబాంధవసైంధవాహంకారహరణ
హుంకారతోత్రతాండవఝళత్కారధీరగరుడాగ్రజంబును సంతతవసంతసౌభా
గ్యసంపదుద్యదుద్యానవాటికాచ్ఛటాభ్రంకషవివిధవిధశాఖశాఖోపశాఖాశిఖరసు
ఖాసీనశుకశారికానికరమధుమధురవచనరచనాచమత్కారసరసకథాప్రసంగసంశ్ర
వణకుతూహలస్తంభితవిమానగమనపరిసరచరత్ఖచరజంపతినిచయంబునునై వనీభూష
ణంబయ్యును నవనీభూషణంబై వారణదానధారాప్రవాహబంధురంబయ్యు నవా
రణదానధారాప్రవాహబంధురంబై శేషాలంకారమహాస్థానమండపసహస్రశోభితం
బయ్యును నశేషాలంకారమహాస్థానమండపసహస్రశోభితంబై విప్రచయామోదకృ
ద్వైభవరాజద్రాఘిష్టంబయ్యును నవిప్రచయామోదకృద్వైభవరాజద్రాఘిష్టంబై స్వ
ర్గలోకంబునుంబోలె విబుధసమన్వితంబై సుమేరునగంబునుంబోలె గల్యాణనిల
యంబై సుధాసముద్రంబునుఁబోలె లక్ష్మీసముదయస్థానంబై శృంగారవనంబునం
బోలెఁ దరుణీపురుషసౌమనస్యరమ్యంబై యలకాపురంబునుంబోలెఁ బుణ్యజనవిరా
జితంబై పాతాళభువనంబునుంబోలె ననేకభోగివిలసితంబై శరత్కాలంబునుం
బోలె నపరూపితపంకంబై కమలాకరంబునుంబోలెఁ గవిసివహపర్ణనీయంబై సంపద
లకుఁ గొటారును, సారస్వతంబునకు నునికిపట్టును బుణ్యంబునకుఁ దావలంబును

బురుషార్థంబులకుం బుట్టినిల్లును నగుచు ధరాపురంధ్రీకమనీయకరకమలకలితకనత్క.
నకమణికటకంబై యొప్పునక్కటకంబున కధీశ్వరుండు.

86

పురూరవుని సౌందర్యాదులు

సీ.

పటుభుజాస్తంభాగ్రఘటికవిశ్వంభరాభరలాఘవితమహాఫణిఫణుండు
నవకీర్తినర్తకీనాట్యరంగావధీకృశచక్రవాళధాత్రీధరుండు
సంతతౌదార్యసిద్ధాంతార్థపూర్వపక్షీభవత్కల్పకప్రాభవుండు
బిరుదాంకరచితగంభీరగీతప్రసంగాశాపసంజీవనాంతకుండు


తే.

నిశితనిరుపమనిజకరనీరజాత, నిహితనిస్త్రింశనిర్భిన్ననిష్ఠురారి
పలలనైవేద్యతృప్తశుంభత్ప్రతాప, ఘోరతరభైరవుండు పురూరవుండు.

87


మ.

అతఁ డుద్దండప్రకాండభుజదండాఖండకోదండదం
డతమఃఖండనమండలప్రభవకాండవ్యాప్రధాగద్ధగీ
తతకాండౌఘమయూఖదూతహయవేదండాదిమద్భండనో
దృతచండాహితమండలేంద్రమదనీహారుం డుదారుం డిలన్.

88


గీ.

ఆనృపాలునియసమసాయకతఁ జూచి, వానిసుమహితకార్ముకత్వంబుఁ జూచి
మనుజు లవ్విభుజోకకుమారుఁ బోల్తు, రతనిసౌందర్యమును శౌర్య మట్టిదగుట.

89


చ.

అతిశయసంపదల్ గులుకునందపుఁజూపు నిదర్శనంబుగా
నతనివిశాలనేత్రములయందు వసింపఁగఁబోలు లక్ష్మి త
చ్చతురతతోడియున్నజలజంబులయందలి యున్కి మాని ని
ర్జితులధనంబు లెల్ల జయసిద్ధులఁ జేరుట యుక్తమేకదా.

90


ఉ.

శారదవేళయందు సరసంబగుపున్నమనాఁటిరేయి ని
ర్ణీరదరాచితాభ్రమున రెండవయామము నిండుచున్నచోఁ
జారుకళాభిరాముఁ డగుచంద్రుఁ డొకించుక సాటివచ్చు దు
ర్వారకళంకదోషము తొఱంగుటఁ గల్గిన రాజు మోముతోన్.

91


శా.

ఆరాజేంద్రుని చెక్కుటద్దములపై వ్యాపించులీలాదర
స్మేరజ్యోత్స్నజపాప్రసూనవిలసజ్జిహ్వాగ్రసింహాసన
ప్రారూఢస్థితిఁ బొల్చు శారదమనోజ్ఞాకారశోభాసుధా
పూరం బుద్గతమైనచందమున నొప్పున్ లోచనానందమై.

92


సీ.

అకలంకలావణ్యతాఖండసుందరతనువిలాసంబునఁ దనరుకొఱకు
నలపార్వతీపతియమృతాంశుమయమైన కడకంటిచూపులు పడయుకొఱకు
నన్నివేళలయందు నధికవైభవసమన్వితుఁడై జగంబుల వెలయుకొఱకు

జంభాంతకాదినిర్జరబృంచమాననీయప్రాభవంబున నలరుకొఱకుఁ


తే.

జంద్రమదనవసంతనాసత్యు లైక, మత్యమున నేకరూపమై మహి జనించి
నటులు సౌందర్యగరిమచే నతిశయిల్లుఁ, జారుమూర్తి పురూరవశ్చక్రవర్తి.

93


ఉ.

ఆనరనాథుఁ జూచినలతాంగులడెందపుఁగుందనం బయో
గానలకీలలం గరఁచి యందుఁ దదీయమనోహరాకృతిం
బూని దృఢంబుగాఁగ నిలుపున్ వలపుంబడియచ్చుచేత నా
నౌనె వినోదము ల్సుమశరాసనకాంచనకారికృత్యముల్.

94


క.

ఆనృపతిఁ దలంచినచం, ద్రాననలకు సాత్త్వికోదయం బగు లక్ష్మీ
జానికళోదితుఁ డట త, ద్ధ్యానంబున సాత్త్వికోదయం బగు టరుదే.

95


మ.

తమప్రాణేశులు గారవింపఁగ నెలంతల్ నిండుకౌఁగిళ్ల నం
దముగా నుండియు నప్పురూరవునిసౌందర్యంబు భావింకు రు
ష్ణము దీర్ఘంబును గంపితంబు నగునిశ్వాసంబు వాటిల్ల భ
ర్తృమనశ్శంకగతాపరాధపునరుక్తిం బాయగాఁ జేయుచున్.

96


సీ.

కొలువు సేయఁగవచ్చుకొదమసాయపువారసుందరు ల్నృపుసొంపు చూచిచూచి
యాత్మసాక్షాత్కారమైయున్న యతనికిఁ దమయౌవనంబులు దన్కనిచ్చి
పరిరంభణాదులైన రహస్యచేష్టల నతఁడు క్రీడించినయట్లు దలఁచి
భ్రాంతితో సత్యానుభవబుద్ధిఁ గైకొని యానందపారవశ్యంబు నొంది


తే.

మగుడఁ దెలివొంది యతనినెమ్మొగము చూడ, సిగ్గువడుచుందు రేమని చెప్పవచ్చు
నట్టివలపుల నాఱడిఁ బెట్టుచున్న, చెఱకువిలుకానికైతవచేష్టితములు.

97


మ.

అయ మర్థీజన యంచు యాచకలలాటాంతస్థలిన్ బ్రహ్మని
ర్ణయతన్ వ్రాయవహించునట్టి లిపియర్థంబున్ విశేషాన్వయ
క్రియగా నర్థ మవారిగా నొసఁగి యర్థిం జేయు వాగీశువ్రాఁ
తయు నాత్మీయవితీర్ణియు న్నిజముగా ధాత్రీశు నేర్పెట్టిదో.

98


సీ.

బిరుదాంకపటజాతమరుదాహతిని విగ్రహములకు నిస్సత్త్వ మావహిల్ల
భూరిసేనాసముద్భూతధూళీవ్యాప్తి గాఢాంధకారంబు గ్రమ్ముకొనఁగ
భేరీగభీరభాంకారనాదార్భటిపటిమచే గుండియల్ బగ్గుమనఁగ
శాతహేతిచ్ఛటాచ్ఛచ్ఛవిస్ఫూర్తిచే మిగులుగన్నులు మిఱుమిట్లుఁగొనఁగ


తే.

సాలభంజికలను బోలి శత్రుకోటి, ప్రాదితస్తంభు లగుచు దూరములయంద
రిచ్చపడుదురు విజయధురీణుఁడైన, యప్పురూరపుధాటి కే మనఁగవచ్చు.

99

శా.

ఆరాజేంద్రకులావతంస మొకనాఁ డత్యంతసంప్రీతి నా
నారత్నప్రకరప్రకీర్ణసముదీర్ఘస్వర్ణవాతాయనో
దారస్తంభవిటంకకుడ్యపటలోద్యద్వేదిగోపానసీ
ద్వారస్ఫారకవాటశోభితసభాస్థానాంతరస్థాయి యై.

100


సీ.

చరణాబ్జనఖకాంతిచంద్రిక ల్నతభూపముకుటాగ్రమణులపై ముసుఁగువార
గణుతింపరానిచక్కఁదనంబు ప్రేక్షకవీక్షణంబులకును విందు లొసఁగ
గంభీరమధురవాక్యచమత్కృతు ల్సభాసదులకుఁ గర్ణరంజన మొనర్ప
సానుగ్రహములైన యవలోకనము లర్థికోటి కిష్టార్థము ల్గురియుచుండ


తే.

విగ్రహచ్చాయకాంచనవిమలమకుట, వలయముఖభూషణములకు వన్నె లొసఁగ
చిత్రకంఠీరవాసనాసీనుఁ డగుచుఁ, జెలగి కొలువుండె నారాజశేఖరుండు.

101


తే.

సత్ప్రసంగంబు దనర నార్జవముఁ గలిగి, కడగి తగుచోటులను గురుకవిబుధాదు
లుండ సింహాసనస్థుఁడై యుండె నినుఁడు, ధారణీప్రజ కానందకారి యగుచు.

102


సీ.

వింజామరంబుల విసరుపూఁబోడుల కంకణఝణఝణత్కారరవము
మురువుగా సుతిఁగూడి మొదయించువైణికవల్లకీనిక్వణక్వణరవంబు
కడుసొంపుగా నాడు కర్ణాటనాటికాకనకమంజీరఘల్గలరవంబు
ప్రణతపార్థివశిరఃస్రగ్గంధలోలతఁ దిరుగుతుమ్మెదలఝంకరణరవము


తే.

మిళిత మగుచు సుధారసగళిత మగుచు, లలిత మగుచు మనోరథఫలిత మగుచు
నానినాదం బపూర్వమోహనవిలాస, మహిమఁ జెన్నొందెఁ దత్సభామండపమున.

103


సీ.

సింధునాయకుదండఁ జేరె జీవనముఁ గల్గుట చాలునని మత్స్యకువలయేశుఁ
డలవత్సనరపతి యాభీరభూమిపాలకుసమీపమున నిల్కడ వహించె
నాడంబరస్ఫూర్తి నమరుచున్న నిషాదనాథునిఁజేరె గాంధారవిభుఁడు
కెలనఁ గుంతలరాజు బలమధ్యమునఁ జొచ్చి వసియించె బాహ్లికవల్లభుండు


తే.

మఱియుఁ దక్కిననృపతు లేమాడ్కిఁ దమకుఁ, దగినవారలతో గూడి తగిలి నిలిచి
రధిపుఁ బోడఁగనుఖండాంతరాధిపతులు, సందడికి నోడి యెప్పుడో సమయ మనుచు.

104


వ.

ఆసమయంబున.

105

పురూరవునియొద్దికి నారదుఁడు వచ్చుట

సీ.

లాంఛనంబు సముజ్జ్వలభుజాంతరస్థితిమహతిరూపంబున రహివహింప
నమృతంబు విష్ణునామాక్షరమధురగాంధర్వరూపంబునఁ దరఁగలెత్తఁ
జంద్రిక ల్ధళధళాచ్ఛశ్వేతశారీరకాంతిరూపంబునఁ గ్రమ్మికొనఁగఁ
జల్లఁదనంబు శశ్వత్కృపారసపూర్ణదృష్టిరూపంబునఁ దేటపడఁగ

మనుమఁడైన పురూరవక్ష్మాతలేంద్రుఁ, జూడ నేతెంచుచంద్రునిజాడ దోఁప
నరుగుదెంచె నభోమార్గయానమునను, నారదుఁడు మూర్తిజితశరన్నారదుండు.

106


తే.

స్వాంతములు పల్లవించెను సత్కదంబ, ములకుఁ బంకజాతమ్ముల పొంక మెడలె
భువనము శుభోదయస్ఫూర్తిఁ బొలుపుమిగిలె, నారదాగమమున కది నైజమకద.

107


వ.

ఇవ్విధంబున.

108


ఉ.

వచ్చినఁ జూచి లేచి పరివారముతో నెదురేగి యవ్విభుం
డచ్ఛపుభక్తి మ్రొక్కి కనకాసనసుస్థితుఁ జేసి పూజలన్
మెచ్చొదవింపఁగా వినయమేదురమంజులవాక్యవైభవం
బెచ్చ ననేకభంగుల మునీంద్రుఁడు దీవన లిచ్చి వెండియున్.

109


క.

కుశలంబె మీకు హితులకుఁ, గుశలమె కుశలంబె బంధుకోటికి నెల్లం
గుశలమె భృత్యశ్రేణికిఁ, గుశలంబె ధరిత్రిప్రజలకు న్మనుజేంద్రా.

110


వ.

అని పలికిన నాసంయమీంద్రచంద్రునితోఁ జంద్రవంశతిలకుండు వినయ
సంభ్రమమాధురీధురీణవచనంబుల నల్లన ని ట్లనియె.

111


క.

మీకారుణ్యమువలనను, మాకందఱకు న్శుభంబు మౌనీశ్వర మీ
రాకవలన మద్భాగ్యము, లోకస్తుతమయ్యె జగతిలోపల నింకన్.

112


తే.

వినుతమోగుణహర్తవై వెలయునీవు, మిత్రరూపంబుతో వచ్చి మేలొసంగ
నిపుడుగద యజ్ఞకులమున కెలమియగుట, చక్రవర్తిత్వ మిఁకఁ గదా స్పష్టమగుట.

113


క.

అని పలుకునన్నరేంద్రుని, వినయోక్తుల కలరి మౌనివిభుఁడు తదీయా
ననమునఁ గారుణ్యరసం, బెనయఁ గటాక్షములు నిగుడ నిట్లని పలికెన్.

114


సీ.

ఉత్తమాన్వయమున నుదయంబునొందుట సరిలేనిసౌందర్యశాలి యగుట
యఱువదినాల్గువిద్యలఁ బ్రవీణుండౌట పటుబాహుశౌర్యసంపన్నుఁ డగుట
ధరణిచక్రాచలాంతంబుగా నేలుట నిగ్రహానుగ్రహనిపుణుఁ డగుట
వేదశాస్త్రోక్తసద్విధు లాచరించుట యాచార్యగుణముచే నధికుఁ డగుట


తే.

హరిహరబ్రాహ్మణార్చనానిరతుఁ డగుట, యాత్మవిదుఁ డౌట యొక్కనియందుఁ గలవె
పుణ్యనిధివైన నీయందె పొసఁగె నిన్ని, సద్గుణములు పురూరవస్సార్వభౌమ.

115


క.

స్తుత్యుం డమరులకైనను, నిత్యోన్నతుఁ డైనధారుణీపతి “రాజా
ప్రత్యక్షదైవత” మ్మన, సత్యవ్రత పూర్వవచనసంగతి వినవే.

116


వ.

అని పలికి వెండియు నమ్మహానుభావుం డమ్మానవపతితో రాజనీతిప్రసంగంబున
నిట్లనియె.

117

నారదుఁడు పురూరవునకు రాజనీతి చెప్పుట

చ.

మతియుతు బుద్ధిశాలిఁ బరమర్మవిభేదనదక్షు సత్కళా
చతురుని శాంతునిన్ సమరసాహసుఁ గార్యవిచారకౌశలుం
బతిహితశీలు షడ్గుణవిభాసురు భృత్యజనప్రజామనో
హితనిజవర్తను న్వసుమతీశుఁడు మంత్రిగఁ జేయఁగాఁదగున్.

118


క.

తా నెంతయధికుఁడైనం, గానీ మనుజేశ్వరుండు కార్యాకార్య
జ్ఞానము నిజప్రధానుల, తో నాలోచించి యుక్తితో నెఱుఁగఁదగున్.

119


క.

సప్తాంగరక్షణంబును, సప్తోపాయము లొనర్చుసామర్థ్యంబున్
సప్తవ్యసనవిరక్తియు, సప్తద్వీపేంద్రరాజసద్ధర్మంబుల్.

120


సీ.

న్యాయంబు దప్పనినడవడితోడను బెంపుగాఁ బ్రజలఁ బాలింపవలయు
నుచితవ్యయంబు సేయుచు నర్ధసంపద ల్కొదవగాకుండంగఁ గూర్పవలయు
శౌర్యోజ్జ్వలములైన చతురంగబలముల నెంతయు విరివిగా నేలవలయు
సమయంబు బలము విచారించి పైకొని పరరాజ్య మాక్రమింపంగవలయు


తే.

నేమఱుట లేక గడిదుర్గసీమలందు, నాప్తులును గార్యఖడ్గప్రయత్నపరులు
నయినవారలఁ దగినసైన్యములతోడ, నునుపవలయును దనపేర్మి యొరులు పొగడ.

121


క.

తనరాజ్య మొరుల రాజ్యం, బనవలవదు బుద్ధికుశలు లగుచారులఁ బం
చి నిఖలవార్తలు నిచ్చలు, వినుటొప్పును భూవిభుండు విశ్రుతమతియై.

122


క.

బలవంతులతోఁ బగయును, బలవద్భాంధవులతోడి పగయును ధరలోఁ
బలువురతోఁ బగయును మఱి, బలభేరికినైనఁ దెచ్చు భంగముఁ దలపన్.

123


క.

చెలిమియ యుచితం బెంతయు, బలవంతునితోడ నతఁడు పగవాఁడైనం
జలియింప కంతకంటెను, బలవంతునిచెలిమి వడసి పగ యీఁగఁదగున్.

124


చ.

నిజభుజశక్తినైనఁ దననేర్పునఁ దంత్ర మొనర్చియైన న
క్కజముగ వారిపైఁ బలముఁగల్గినవారలఁ గూర్చియైన వై
రిజనవినాశనంబు నొనరింపక జాడ్యముచేత నున్న భూ
భుజునిప్రభుత్వ మెల్ల నదిపొంతమహీజము గాదె భూవరా.

125


క.

విశ్వాసపరుల నెఱిఁగి న, రేశ్వరుఁ డధికార మిచ్చు టెంతయు నుచితం
బైశ్వర్యయుతులు గాఁగ న, విశ్వాసులఁ జేయఁదగదు విమలవిచారా.

126


తే.

కరుణ తన కెంతగలిగిన కనకవస్తు, వాహనాదులు చాల నీవలయుఁ గాని
భూతలేశ్వరుఁ డెంతయాప్తులకునైన, నాజ్ఞఁ ద్రోవంగ నిచ్చుట యనుచితంబు.

127

చ.

కలిమికొలంది ఠీవి గమకంబుకొలందిఁ బ్రవర్తనంబు దో
ర్బలముకొలందిఁ బూన్కి యనురక్తికొలంది సమాదరంబు మే
లొలయుకొలంది యత్నము నియోగికొలందిని భార మీగియుం
దెలివికొలంది మాటయు నుతింపఁగ యోగ్యతఁ దెచ్చు నేతకున్.

128


శా.

సర్వజ్ఞత్వముఁ గల్గి కీర్తిలతికాజాలంబు చక్రాద్రిపైఁ
బర్వ న్నిశ్చలధర్మమార్గమున సప్తద్వీపసామ్రాజ్యము
న్నిర్వైరస్థితి నేలు నీకుఁ దలప న్నీతిప్రకారంబు లో
యుర్వీనాథ! నిసర్గసిద్ధములు గానోపు న్విచారించినన్.

129


వ.

అని మఱియు బ్రసంగోచితంబు లగువిశేషభాణంబుల నభినందించు మునిపుంగవుం
గనుంగొని వినయనమ్రవదనకమలుం డగుచు మహీవల్లభుం డి ట్లనియె.

130


ఉ.

ఎందఱు రాజు లీయవని నేలినవా రిఁక నేలనున్నవా
రెందఱు లెక్క సేయఁ దరమే పరిమేష్టికి నైన నట్లనే
నందఱిలోన నొక్కరుఁడనై ధరయేలుట యెంతప్రాభవం
బిందుల కింతపెద్దగ మునీశ్వర నన్గొనియాడ నేటికిన్.

131


ఉ.

హము వాయుసంచలితదీపిక పుత్రకళత్రమిత్రసం
దోహము స్వప్నకాలమునఁ దోఁచెడిసందడి రాజ్యభోగస
స్నేహముఁ జంత్రపుంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాల మీ
యైహికసౌఖ్య మేమిసుఖమంచుఁ దలంచెదనయ్య నారదా.

132


సీ.

కామరోగాదిదుష్కరశత్రువర్గప్రతాపప్రధానసాధనము ధనము
జన్మపరంపరాసంపాదితానేకఘనకర్మజాలవర్ధనము ధనము
కైవల్యసంప్రాప్తికారణవైరాగ్యధర్మమార్గావరోధనము ధనము
సకలావగుణపుంజసంశ్రయాశారూపదారుణనిగళబంధనము ధనము


తే.

గలిగి గర్వంబు దొట్టి దుఃఖంబు మదికిఁ, బెనుచు నజ్ఞానపావకేంధనము ధనము
స్వప్నలబ్ధపదార్థంబు చందమునను, దలఁచి జూడంగ వట్టిదంధనము ధనము.

133


ఉ.

చక్కెరపూఁత పూసిన విషంబులు భామలవాక్యవైఖరుల్
చక్కగ వెన్న మెత్తినసిలల్ విరిబోఁడులచిత్తము ల్మణు
ల్చెక్కినసంకెంలల్ సతులచేష్టలు కొమ్మల నమ్మవచ్చునే
యక్కట మేఁకవన్నెపులు లంగన లెన్నిట నెన్ని చూచినన్.

134

క.

చన్నులు మాంసపుముద్దలు, గన్నులు దుర్జలముఁ బుసులుగాఱెడితొరటల్
వెన్నులు నెముకలపాతర, లన్నుల నిటు తెలిసి వలచు టవివేకమెకా.

135


తే.

మూత్రపతనస్థలం బపవిత్ర మనుచుఁ, ద్రొక్కరా నేలఁ గని రోసి తొలఁగుచుందు
రట్టిమూత్రపుగాలువ యైనదోలి, యోని దానికి రోయ దీయుల్ల మహహ.

136


చ.

కొడుకులు గల్గుదాఁక నొకకొన్నిదినంబులు చింత నందనుల్
వొడమిన నాయువున్ బలము బుద్ధియు విద్యయుఁ జాలఁ గల్గఁగా
నుడుగనిచింతఁ గల్గి తనునోలిభజింపనిచింత తండ్రి కె
ప్పుడు గడుచింత సేయుదురు పుత్రులు శత్రులు గాక మిత్రులే.

137


వ.

మునీంద్రా! పుత్రదారధనాదిసంగరహితులై విషయసుఖంబులం బరిత్యజించి యర
ణ్యగిరిగుహాంతరప్రముఖవివిక్తప్రదేశంబులం గందమూలఫలంబు లాహారంబులు
సేయుచు మోక్షసామ్రాజ్యపట్టాభిషిక్తు లగుమహానుభావులజీవనంబు పావనం
బని తోఁచుచున్నయది రాగద్వేషమూలంబైన యీతుచ్ఛసామ్రాజ్యం బెంతపూ
జ్యంబు సార్వభౌమత్వాభిమానంబున నవిద్యామగ్నులమైన మావంటివారలకు సంసా
రసారావారంబు తరించునుపాయం బెట్లు గలుగు నానతి మ్మని మోక్షాపేక్షం
బ్రార్థించినం బార్థివోత్తమువాక్యంబు లాకర్ణించి హర్షిత్కర్షమానసుండై నీప్రశ్నం
బింతయొప్పునే యిట్టివైరాగ్యంబు బహుజన్మసుకృతసంచితతపఃప్రభావంబువలనం
గాక సంభవించునే యని వికసితవదనారవిందుండై యత్తపోధనసత్తముండు నృపో
త్తమున కి ట్లనియె.

138

నారదుం డాత్మవిద్యోపదేశము చేయుట

తే.

అడిగితివి వేదశాస్త్రసారాంశమైన, యట్టిపరమరహస్యంబు నవనినాథ
యడుగుదురుగాని ధర్మకామార్థఫణితు, లడుగ రెవ్వరు నీభంగి నాత్మవిద్య.

139


శా.

అజ్ఞానంబునఁ దోఁచుసంసరణదుఃఖావాప్తి యజ్ఞాన మా
త్మజ్ఞానంబున నాశనంబగు దదాత్మజ్ఞాన మయ్యీశ్వరా
నుజ్ఞం గాని ఘటింప దీశ్వరుఁడు సంతోషించువేదోక్తమౌ
స్వాజ్ఞ న్వర్తిలుధర్మము న్నరుఁడు కర్త్తె సేయు సద్వృత్తికిన్.

140


ఉ.

కావునఁ గర్మనిష్ఠ గతకల్మషుఁడైన ముముక్షుఁ డయ్యవి
ద్యావరణంబు వాసి సముదంచితబోధము నొందు బోధలీ
లావిభవంబుచేత సకలంబును బ్రహ్మముగా నెఱుంగు ద
ద్భావము నిశ్చలంబయిన బ్రహ్మముఁ దానగు నిర్విశేషతన్.

141

వ.

నరేంద్రా! యద్వితీయంబును, నపరిచ్ఛిన్నంబును, నాద్యంతరహితంబును, సచ్చిదా
నందస్వరూపంబును నయి శుద్ధచైతన్యంబైన బ్రహ్మం బొక్కటియ వెలుంగు
చుండు; నట్టిబ్రహ్మంబునందు నధ్యస్తయై, యనాదియై, మిథ్యాభూతయై, తచ్ఛ
క్తియై, త్రిగుణాత్మకయై, నిర్వచనీయయై, కలుగందోఁచుమూలప్రకృతి యవస్తు
వయ్యును దదాశ్రయత్వదద్విషయత్వబలంబునం జేసి వస్తువుంబోలి ప్రకాశిం
చుచు నాత్మసత్తాస్ఫూర్తులవలన స్ఫురద్రూపంబై యావరణవిక్షేపరూపంబులు దాల్చి
యుండునట్టిప్రకృతి సాత్త్వికగుణప్రకాశంబువలన మాయ యనంబడు; నమ్మాయ
యందుఁ బ్రతిఫలితంబగు చైతన్యంబును మాయాధిష్ఠానచైతన్యంబును నమ్మాయ
యుంగూడి కారణోపాధికుండైన యీశ్వరుండై సర్వజ్ఞత్వసర్వేషకత్వసర్వనియం
తృత్వసర్వేశ్వరత్వాదిధర్మంబులు గలిగియుండు; నయ్వీశ్వరుండు తమోగుణ
ప్రకాశిని యగుమాయ నీక్షించినఁ దత్సంకల్పవశంబున శుక్తియందు రజతాధ్యారో
పంబును, రజ్జువునందు సర్పాధ్యారోపంబును, స్థాణువునందుఁ బురుషాధ్యారోపం
బును దోఁచుకైవడి భ్రాంతికల్పితంబులై మహదహంకారంబులును, శబ్దస్పర్శరూప
రసగంధసమేతంబులై, త్రిగుణాత్మకంబులై గగనపవనాగ్నిజలభూతత్త్వంబులును
గ్రమంబున సంభవించె నవి సూక్ష్మభూతంబు లనంబడు నాభూతంబులు పంచీకృ
తంబులై యన్యోన్యభాగమేళనంబున స్థూలభూతంబు లయ్యె నాస్థూలభూతంబు
లవలన స్థూలశరీరంబును, సూక్ష్మభూతంబులవలన సూక్ష్మశరీరంబును, మాయవలనఁ
గారణశరీరంబు నయ్యె; నిట్లు సమష్ట్యుపాథులైన యేతత్రయంబున నీశ్వరుండు క్ర
మంబున విరాట్టును, హిరణ్యగర్భు౦డును, నహంకృతుండును, ననుసంజ్ఞల నొప్పుచు,
నవాంతరసృష్టిస్థితిప్రళయనిమిత్తంబున రజస్సత్త్వతమోగుణావలంబనంబున, బ్రహ్మ
విష్ణురుద్రరూపంబులఁ గ్రీడించుచుండు నిది సమష్ట్యుపాధికుండైన యీశ్వరుని
ప్రకారంబు, ఇంక వ్యష్ట్యుపాధికుండైన జీవునిప్రకారంబు వినుము, ప్రకృతిరజ
స్సత్త్వతమోగుణప్రకారంబువలన నవిద్య యనంబడు నయ్యవిద్యారూపంబైన యం
తఃకరణంబునందుఁ బ్రతిఫలితంబైన చైతన్యంబును నంతఃకరణాధిష్టానచైతన్యంబును
నయ్యంతఃకరణంబునం గూడి జీవుం డనుసంజ్ఞఁ గలిగి యవిద్యావశతం గార్యోపాధి
కుండై స్వరూపవిస్మృతి నొంది కించత్జ్ఞుండై యుండు నట్టిజీవునికి స్థూలభూతజన్యం
బై స్థూలశరీరంబును సూక్ష్మభూతజన్యంబై జ్ఞానేంద్రియకర్మేంద్రియపంచప్రాణ
మనోబుద్ధిరూపంబైన సూక్ష్మదేహంబును నవిద్యారూపంబైన కారణదేహంబునుం
గలిగియుండు నందు విశ్వతైజసప్రాజ్ఞు లనుసంజ్ఞల జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థల

యందు స్థూలప్రవిక్తానందభోగంబు లనుభవించుచు జీవుం డహంకారయుక్తుం
డై కర్తృత్వభోక్తృత్వాదిధర్మంబులు తనయందు నారోపించుకొను నయ్యవివే
కంబువలన నభిమానంబును నభిమానంబువలన రాగద్వేషాదులును రాగద్వేషా
దులవలనఁ గర్మంబులును గర్మంబువలన దేహంబును, దేహంబువలన సుఖదుఃఖం
బులును, బ్రాప్తంబు లగుచుండు నందు నొకానొకపురుషుండు పురాకృతసుకృతవిశే
షంబున బహుజన్మంబులలో నొక్కంట సంసారనివర్తనంబునకు నుద్యోగియగు
నట్టివాఁడు సత్సంగతివలన సన్మారవర్తియై పాపంబులంబాసి జ్ఞాననిష్ఠుండగు జ్ఞాన
నిష్టవలనఁ జిన్మాత్రవ్యతిరిక్తం బయినవస్తు వెద్దియుం గలుగఁ దనియును గలిగిన
యట్ల తోఁచుచున్న సకలజగంబును నెడమావులు బలంబులై తోఁచినకైవడి మనో
విభ్రాంతికల్పితంబు లనియుం తెలిసి కార్యకారణోపాధులు మిథ్య యగుటం జేసి
యీశ్వరత్వజీవత్వంబు లసత్యంబని ఘటపటోపాధ్యభావంబునం దదంతర్గతాకా
శంబును మహాకాశంబును నేకంబైనయ ట్లనుస్యూతంబయిన యాత్మ యొక్కటి
యను నిశ్చయంబున బ్రహ్మైక్యానుభవంబునం దన్మయుండై యుండు నతండు
జీవన్ముక్తుండై, ప్రారబ్ధక్షయానంతరంబున విదేహకైవల్యప్రాప్తుం డగు నని వెండియు
నిట్లనియె.

142


శా.

నామంబు ల్మఱి రూపము ల్క్రియలు నానాభంగులం దోఁచు ని
ద్రామోహంబున స్వప్నమున్వలె నవిద్యంజేసి సత్యంబు గా
దేమిన్ జ్ఞానికిఁ దోఁచినట్లయిన బ్రహ్మీభూతమై యుండు నో
భూమీశోత్తమ చిన్మయంబు సకలంబు న్వేఱులే దింతయున్.

143


క.

చిత్తనియెను సాగరమునఁ, జిత్తం బనువాయువశత సృష్టితరంగో
త్పత్తి యగుఁ జిత్త మడఁగిన, నత్తఱి జగ మడఁగు ముక్తి యన నదియకదా.

144


క.

ఏలా పలుచదువులు బ్ర, హ్మలోకనసుఖము తనకు ననుభవ మగునా
కీ లెఱుఁగుట మే లెఱుఁగుట, భూలోకసురేంద్ర సూక్ష్మబుద్ధిం గనుమా.

145


క.

ఆరూఢుఁడు ముక్తినగా, గ్రారూఢుం డారురుక్షుఁ డారోహాణకా
ర్యారంభపరుఁడు గావున, నారెంటికిఁ గలదె భేద మధికారములన్.

146


తే.

కామి కర్తయుఁగాక సత్కర్మములు శి, వార్పణంబులు సేయుచు నారురుక్షుఁ
డరయ నారూఢుఁ డగును గాలాంతరమున, నతని కెద్దియుఁ గర్తవ్య మపుడు లేదు.

147


ఉ.

మాటలు వేయు నేల నొకమర్మము సెప్పెద మోక్షదాతవై
పాటిలు విష్ణుశంకరుల భక్తి దృఢంబుగఁ గల్గెనేని నా

నాఁటికి వాని కన్నిసుగుణమ్ములు దామె ఘటింప ముక్తుఁడౌ
బూటకపున్విచారములఁ బోవఁగ నేమిఫలంబు భూవరా.

148


క.

సుగుణం బెఱిఁగి భజించిన, నగు నిర్గుణసిద్ధి సిద్ధుఁడగు నాతనికిన్
జగమెల్లను బ్రహ్మమయం, బుగఁ దోచును సర్వకాలమును నొక్కగతిన్.

149


సీ.

బయల సంరంభి లోపల నసంరంభియై కార్యతంత్రంబులు గడపెనేని
సఫలప్రయత్నంబు విఫలప్రయత్నంబు దనకుఁ దుల్యంబుగాఁ దలఁచెనేని
ననివార్యమై కర్మమున వచ్చుసుఖము వర్ణించినయట్లు భోగించెనేని
సౌఖ్యంబు దుఃఖంబు సంప్రాప్తమైనచో నుబ్బుస్రుక్కులు లేకయుండెనేని


తే.

జీవపరమేశ్వరైక్యసచ్చిత్సుఖాను, భూతి నిస్సంశయాత్ముఁడై పొలిచెనేని
నతఁడు ప్రారబ్ధమున వ్యవహారియైన, ముక్తిసామ్రాజ్యపట్టాభిషిక్తుఁ డగును.

150


చ.

వనమున నున్న నేమి గృహవాసము చేసిన నేమి యాత్మభా
వనయు నసంగవృత్తి యరివర్గజయంబును గల్గియుండినన్
వనమున నున్న నేమి గృహవాసము చేసిన నేమి యాత్మభా
వనయు ససంగవృత్తి యరివర్గజయంబును లేకయుండినన్.

151


క.

దేహము తాఁ గానని నిజ, మూహింపఁగ నేర్చి నట్టి యుత్తమునకుఁ ద
ద్దేహమునకైన బాంధవ, దేహంబులు మిథ్య లనుచుఁ దెలియంబడవే.

152


సీ.

పుత్రమిత్రకళత్రమైత్రి వర్తిల్లు వసిష్ఠసంయమిబ్రహ్మనిష్ఠ వినమె
కర్మకుండై రాజధర్మ మూని చరించు జనకునివిజ్ఞానచర్య వినమె
వాణిజ్యవృత్తి జీవనుఁడైన యలతులాధారునిపూర్ణబోధంబు వినమె
కటికిగాయకముచేఁ గాలంబుఁ గడపు ధర్మవ్యాధువిజ్ఞానమహిమ వినమె


తే.

వారిప్రారబ్ధమున నుండవలసి జ్ఞాను, లెట్టివ్యవహారముల నున్న నేమి కొదవ
జ్ఞానవైరాగ్యనిశ్చలానందపూర్ణు, లైనవారు జీవన్ముక్తులగుట నిజము.

153


క.

ఏయాశ్రమమున నుండిన, నాయాచారములు నడప కాశ్రమసుఖతృ
ష్ణాయత్తమతిని వంచకుఁ, డై యే నిష్కర్మి ననుట నర్థముగాదే.

154


ఉ.

కర్మము బంధకం బని సుకర్మము మాని సుఖంబు గోరి దు
ష్కర్మము సేయుచు న్బుధులు కాదనిన న్విన కాత్మకున్న వే
కర్మములంచుఁ దాఁ జెడుట గా కొకకొందఱిజ్ఞాననిష్ఠకుం
గర్మఫలాప్తికిం జెఱుచుఁ గాపురుషుం డుపదేష్టనంచు ని
ష్కర్మికి నాస్థలేదు భయకర్మములు న్విధిచే ఘటించినన్.

155

శా.

జ్ఞానారూఢుఁడు బాహ్యచేష్టల మనస్సంకల్పుఁడై చేయు నే
మైనం బాకృతు నట్ల వానిఁ గని తా నాచేష్టలే చేయఁగాఁ
బో నల్పజ్ఞుఁడు వంచన న్మదిఁ దలంపు ల్మాన కారూఢుఁడ
న్నేనంచున్ ఫలమేమి చేష్టల మది న్నిశ్చింత లేకుండినన్.

156


ఆ.

మనసు చల్లఁబడక మాట లెన్నాఁడిన, ముక్తిగాదు వాదశక్తి గాని
మనసె కారణంబు మఱి బంధమునకు మో, క్షమున కనుచుఁ దెలుపు చదువు వినమె.

157


క.

జ్ఞాతృజ్ఞానజ్ఞేయము, లేతెఱఁగున వేఱు దోఁప కేకంబుగ న
ద్వైతాత్మత వెలుఁగు ప్రపం, చాతీతుం డెవ్వఁ డతఁడె యారూఢుఁ డిలన్.

158


క.

ఇది నగర మిది యరణ్యం, బిది సౌఖ్యం బిది యసౌఖ్య మీతఁడు పురుషుం
డిది సతి యని తోఁపద యె, య్యది చూచిన బ్రహ్మమయమ యారూఢునకున్.

159


తే.

సంగములు సర్వమును గల్గి సంగి కాఁడు, భోగములు సర్వమును చెంది భోక్త గాఁడు
కార్యములు సర్వములు చేసి కర్త గాఁడు, విగతసంకల్పుఁ డగుబ్రహ్మవేత్త యధిప.

160


ఆ.

ఇచ్చలేనియోగి కింద్రియంబులు కర్మ, వశతచే స్వభావవర్తనముల
మెలఁగుచున్న నేమి యిలఁ బుణ్యపాపంబు, లంట వతఁ డకర్త యగుటఁ జేసి.

161


తే.

నిర్విషయచిత్తుఁ డగుబ్రహ్మనిష్ఠునకును, దనుసుఖంబులు ప్రారబ్ధమున ఘటించు
నంతియేకాని యవి వాని నంటకుండు, గమలపత్రాగ్రమున జలకణికవోలె.

162


తే.

శయ్య నుండియుఁ బెక్కుదేశములవెంటఁ, దిరుగఁ గలగాంచుచున్ననిద్రితునిభంగి
సచ్చిదానందుఁ డయ్యుఁ దా జననమరణ, బాధలను బొందినట్లుంట భ్రాంతిగాదె.

163


క.

కలలోన నఱుకులాడినఁ, గలవే గాయములు మేలుకాంచిన వెనుకం
దెలియక మునుపటిసంసృతి, కలఁకలు విజ్ఞాని కేల గలుగందోఁచున్.

164


క.

ఆయెఱుక దొరకు కొఱకుఁ గ, దా యోగజపాదినిష్ట లాయెఱుక దృఢం
బైయున్నతఁ డేక్రియలం, జేయఁడు లోకోపకృతికిఁ జేసిన జేయున్.

165


మ.

తొలిజన్మంబుననైన నిప్పుడయినన్ దుష్కర్మనిర్మూలనం
బిల బ్రహ్మార్పణసత్క్రియామహిమచే నెంతేధృతిం జేసి ని
ర్మలుఁ డైనన్ శ్రవణంబు తన్మననముద్రాసన్నిధిధ్యాసలున్
సులభంబౌ శ్రవణాదు లబ్బక చలించుం దామసత్యాగతన్.

166


క.

ఈమేనను సత్కర్మము, లేమియుఁ జెందకయె చెందు నిద్ధజ్ఞానం
బామునుపటిభవమున ని, ష్కామసుకర్మాప్తి విగతకల్మషుఁడైనన్.

167

ఉ.

చేయఁడు సత్త్రియ ల్బయలఁ జేసిన యట్ల సుఖించు లోపలం
జేయును గార్యముల్ బయలఁ జేయని యట్ల సుఖించు లోపలం
జేయఁడు కృత్యమంచు మఱి చేసె నకృత్యమటందు నెంచరా
దేయెడ బ్రహ్మవిద్య తుదకెక్కినయట్టిమహానుభావునిన్.

168


చ.

అమితములై ఘటించు విషయానుభవంబుల భోగి యయ్యు ను
త్తముఁడగుయోగి బ్రహ్మమయి తన్మది రంజిలుచుండు గీతనృ
త్యములను దాళమానవశుఁడయ్యు శిరస్స్థితపూర్ణకుంభమున్
సమధికయుక్తి నిల్పికొనఁజాలిన నాట్యధురీణుకైవడిన్.

169


గీ.

తలఁచినఁ దలంపకున్న నిత్యప్రబోధ, పూర్ణుఁడగు తాను దాఁ గాకపోవు టెట్టు
లెఱుఁగఁ దగగుఱి తనకంటె నెద్దిలేక, యెఱుక నుఱపులు సమమైన యెఱుక యెఱుక.

170


వ.

అని పలికి వెండియు ని ట్లనియె.

171


ఉ.

కోరకు మేపదార్థమును గోరిన వచ్చునె రానివస్తువుల్
గోరకయున్న రావె తనకు లభియింపఁగ నున్నయర్థముల్
గోరిన రానిచోఁ గలిగిపోల్పడుచో వెతగాన సజ్జనుల్
గోర రనాస్థఁ బ్రాప్తములు గొందురు కుందరు వస్తుహానికిన్.

172


శా.

ప్రారబ్ధంబగుమేన నేయనుభవం బౌచుండఁ దత్సాక్షి వై
యారూఢస్థితి సర్వమున్ మఱచి సర్వావస్థలం జిత్సుధా
ధారాపానసుఖాప్తి సర్వగతశుద్ధబ్రహ్మమేనంచు శం
కారాహిత్యము మానుమీ యదియ మోక్షప్రాప్తి భూవల్లభా!

173


సీ.

ఆసక్తి లేక యత్నాయత్నత ఘటించు ననిషిద్ధసుఖముల ననుభవింపు
ప్రారబ్ధవశత నాపత్సంపదలు వచ్చు వగపునుబ్బును మదిఁ దగులనీకు
కర్తవుగాక లౌక్యములు శాస్త్రీయంబు లైనట్టియుచితకార్యములు సేయు
మాత్మనిశ్శంకత సద్వైతివై తేలి కృత్రిమద్వైతతఁ గ్రీడసలుపు


తే.

పొడమునజ్ఞానమున నది వోవఁ బోవు, నఖిలసంసారమును మిథ్యయని యెఱుంగు
సచ్చిదానంద మిది యవస్థాత్రయైక, సాక్షి వీవౌటఁ దెలియుము మోక్ష మిదియ.

174


తే.

సకలమును జిన్మయముగ దృశ్యములు మది క, దృశ్యములుగాఁ దలంచి నిస్పృహతఁ గార్య
వర్తివై దైవగతి నేలవలయు రాష్ట్ర, మేలు మనహంకృతిని శంకయేల నీకు.

176


చ.

అని మునిపుంగవుడు నిగమాంతరహస్యసమగ్రవాగ్రసా
యనము కృపామతిన్ మిహికరాన్వయుకర్ణపుటంబులందు నిం

చిన బహుజన్మభాగ్యమునఁ జేసి యవిద్యఁ దొలంగి సత్యమై
యనుభవమయ్యె నాత్మఁ జిదహంబను సంస్కృతి సుస్థిరంబుగన్.

176


వ.

ఇట్లు బరమజ్ఞానసంపన్నుండయిన యమ్మహామునీంద్రునుపదేశంబున నానృపాల
శేఖరుం డఖండసంపత్పరిపూర్ణుండై యానందంబున నతనికి సాష్టాంగవందనంబులు
చేసి యనేకవిధంబులఁ బ్రస్తుతించె. నారదుండును నతనిమనీషావిశేషంబునకు సంతో
షించుచు బహుభంగుల నాశీర్వదించి వీడ్కొని స్వర్గగమనోన్ముఖుఁడయ్యె నప్పు
రూరవుండును యథేచ్ఛాప్రవర్తనంబున సుఖస్థితుండయ్యె నఁట నారదుండు
చని చని.

177

నారదుఁడు నాకమున కేఁగుట

శా.

కాంచె న్మౌనివరుండు ముందట నభోగంగాతరంగచ్ఛటా
చంచచ్చంలచంచరీకచయసంచారంబు భూసంచయా
కించిద్బంధురగంధబాంధవమరుత్ఖేలాగవాక్షావళీ
ప్రాంచత్సౌధచరక్రియాన్వితసుపర్వానీకమున్ నాకమున్.

178


సీ.

వివిధదానాధ్వరోత్సవపుణ్యపరిపాకఫలభోగదేశ మేపట్టణంబు
కావలంబై యొప్పు నేవీడు కల్పపాదపకామధేనుచింతామణులకు
భువనత్రయాధిపత్యవిభూతి నొప్పు సుత్రామున కేప్రోలు రాజధాని
గరుడగంధర్వకిన్నరసిద్ధచారణాహీంద్రాదిసేవితం బేపురంబు


తే.

సకలసౌభాగ్యలక్ష్మీప్రశస్తి నగ్ర, మగుచు నేపుటభేదనం బమరుచుండు
నట్టియమరావతిని గాంచి యంతరంగ, మునఁ బ్రమోదంబు నొందె నమ్మునివరుండు.

179


క.

ఆదిత్యమండలస్థితి, చే దీపితమైన దివము చెలువునఁ దగి య
య్యాదిత్యమండలస్థితి, చే దీపితమైన దివము చెలు వమరంగన్.

180


వ.

కని తదీయవిశేషంబు లగ్గించుచు నట చని.

181


సీ.

ఒకచోటఁ బ్రకటహాటకసముద్యద్దీప్తిపుంజ మాతపపరిస్ఫూర్తి చూప
నొకచోటఁ బద్మరాగోపలప్రభలు సంధ్యారాగవిభ్రమం బావహింప
నొకచోట వజ్రమౌక్తికధాళధళ్యవినిర్మలరుచులు వెన్నెలలు గాయ
నొకచోట హరినీలనికరవిస్ఫుటనైల్యకాంతులు చీఁకటు ల్గ్రమ్మఁ జేయ


తే.

మిశ్రబహువిధమణిగణామితమరీచి, జాల మొకచోఁటఁ గిమ్మిరలీల నింప
వైభవశ్రీసమున్నతి వర్ణనీయ, మగుసుధర్మాభిధానసభాంతరమున.

182

మ.

ఘనచింతామణిభద్రపీఠమున రంగల్లీల నాసీనుఁడై
వినతాశేషసుపర్వసంఘమకుటావిర్భూతదీప్తు ల్పదా
బ్జనఖశ్రీల భజింప భూషణమణిచ్ఛాయ ల్వెలుంగన్ శచీ
స్తనకుంభద్వయగంధసారయుతముక్తామాలికోరస్కుఁ డై.

183


ఉ.

ముందొకవేళయందు సురముఖ్యుఁడు పద్మములందు డాగినాఁ
డందుకు నాఁటిచెల్మిని సహస్రదళంబులఁ బాయలేక మై
బొందొనఁగూడ నుంచుకొనఁబోలుఁ జుమీయన వేయికన్నులున్
సుందరమై వెలుంగఁ గడుశోభిలుచున్న నిలింపవల్లభున్.

184


మ.

కలితాష్టాపదరత్నకంకణఝణత్కారప్రయుక్తావలో
లలనాహస్తసరోజచామరమరాళవ్రాతసంజాతకో
మలవాతప్రకటాంగరాగవిలసన్మందారమాలాసము
జ్జ్వలసౌరభ్యవిశేషహృష్టసభికస్వాంతున్ శచీకాంతునిన్.

185


క.

కనుఁగొని తత్ప్రత్యుత్థా, ననమస్కారంబులను మనంబలరఁగ దీ
వన లిచ్చి యమ్మునీంద్రుం, డనుపమకనకాసనస్థుఁ డయియున్నయెడన్

186


క.

చారణవిద్యాధరగరు, డోరగగంధర్వముఖ్యు లుచితస్థితులం
జేరి వినయంబుతో జం, భారాతిం గొలిచియుండి రాసభలోనన్.

187


వ.

అప్పుడు.

188


మ.

పదవిన్యాసవిలోలనూపురకదంబస్వానములు ల్ఘల్లనన్
మదదంతావళరాజయానములతో మాణిక్యహారావళుల్
కుదురుంజన్నులపై వెలుంగ సుమనఃకోదండపాండిత్యసం
పదఁ బెంపొందిన యూర్వశీముఖ నిలింపస్థానవేశ్యామణుల్.

189


సీ.

సోమపానపవిత్రసుముఖులు గాక యీయధరబింబామృతం బానఁగలరె
వైరిహేతివిశీర్ణవక్షులు గాక యీపాలిండ్లఁ గౌఁగిటఁ బట్టఁగలరె
బహుదానవిఖ్యాతబాహులు గాక యీనిద్దంపుఁజెక్కిళ్లు నివురఁగలరె
ఘనతపోవ్రతకృశగాత్రులుగాక యీయుత్సంగశయ్యల నుండఁగలరె


తే.

యనుచుఁ గనుచూపులకు వింత బెనుచుప్రేమ, ననుచు మనముల సుర లెంచుకొనుచు నుండ
మదనదైవతమోహనమంత్రశక్తు, లనఁగ నచ్చర లేతెంచి రపుడు సభకు.

190


తే.

వచ్చి పురుహూతునకు మ్రొక్కి వరమృదంగ, పాద్యరవహృద్యతాళాన పద్యనాట్య
విద్య చోద్యంబుగాఁగఁ బ్రవిస్తరించి, పడఁతు లొనరించి రప్పుడు భరతఫణితి.

191

సీ.

చెలఁగుమద్దెలమ్రోఁత జిలుగు రాణింపంగఁ బదపద్మముల లయప్రాప్తి చూపి
లయధృతమధ్యవిలంబము ల్రహిఁ దాళశారీరమున గీతసరణి నెరపి
గీతమాధుర్యవాగ్విభవంబు బయలుగాశయముల నర్థాభినయ మొనర్చి
యర్థాభినయమున కందంబుగా, లోచనంబుల రసపోషణంబు చేసి


తే.

రసము శృంగారవీరాదిరమ్యగతుల, జూపఱుల డెందములు నిండి సొరిదివెల్లి
విరిసి ముఖపంకజంబుల విశ్రమింప, నాట్యమాడిరి మగువ లానంద మొదవ.

192


చ.

దదిగణతె య్యటంచు సముదంచికమర్దళతాళమానసం
పద జతగూడ నబ్బిరుదుపాత్రలు చేయుకళాంజిక ల్ప్రమో
దదమగుచుండెఁ బో తళుకుతళ్కుతళుక్కనుచు న్వెలుంగునం
బుదనినదార్భటీసహితభూరితటిల్లతికాసమంబు లై.

193


సీ.

వేదశాస్త్రపురాణవిద్యాప్రసంగము ల్చేరి మహర్షులు చేయుచుండ
జలపాకజంభనిర్దళనాదివిజయము ల్విద్యాధరేంద్రులు వినుతి సేయఁ
గడఁగి షడ్జర్షభగాంధారముఖరవఫణితి గంధర్వులు పాటవాడఁ
గుండలీప్రేరణీదండలాసకముఖ్యనృత్యంబు లచ్చర ల్నెఱపుచుండఁ


తే.

జెలఁగి త్రిభువనరాజ్యలక్ష్మీవిరాజ, మానవైభవలీలాసమానగరిమ
నిట్లు గొలువున్న యవ్విభుధేశ్వరుండు, పలికె నారదమునిఁ జూచి ప్రస్ఫుటముగ.

194


శా.

ఏలోకంబున సంచరించితిరి మీ రేయేవిశేషస్థలం
బాలోకించితి రేప్రసంగమున మీ కచ్చోట నిన్నాళ్లుఁ దాఁ
గాలక్షేపము చెల్లె సంశ్రవణముం గావింపు శ్రోతవ్యవా
ర్తాలాలిత్యవచస్సుధారససుధాధారాపూర్తి నోనారదా!

195


వ.

అనిన నమ్మహేంద్రునకు మునీంద్రుం డిట్లనియె.

196


మ.

జగదాధారకుఁ డచ్యుతుం డెచట నర్చారూపబాహుళ్యతం
దగు నానావిధపుణ్యవాహినులచేతం బొల్చు నెచ్చోట పెం
పగుసత్కర్మధనంబుఁ గూర్పఁగ నుపాయం బేస్థలం బన్నిటం
బొగడొందున్ భువియందు నుత్తమము జంబూద్వీప మూహింపఁగన్.

197


వ.

అందు.

198


సీ.

శ్రీపురుషోత్తమక్షేత్రసువ్యక్తస్వభావు జగన్నాథదేవుఁ గొలిచి
మంగళాచలమహామండపాభ్యంతరవర్తి శ్రీనరసింహమూర్తిఁ జూచి

శేషధాత్రీధరశిఖరసౌధాగ్రవిహారిని వేంకటశౌరిఁ గాంచి
కాంచీకనకగోపురాంచితగృహదీప్తశుభతేజు వరదరాజును భజించి


తే.

వరకవేరసుతోభయవాహినీత, రంగరంగత్ప్రదేశవిరాజమాన
శేషపర్యంకనిద్రావిశేషణాభి, రాముఁ డగురంగధాము దర్శనము చేసి.

199


క.

కాశియుఁ గేదారంబును, శ్రీశైలముఁ గాళహస్తి చిద్గగనము రా
మేశక్షేత్రము మొదలగు, దేశంబుల శంభుఁ గొలిచితిం గదుభక్తిన్.

200


వ.

మఱియుం దక్కిన శైవవైష్ణవక్షేత్రంబుల సంచరించి గంగాయమునాసరస్వతీ
నర్మదాగోదావరికృష్ణవేణికావేరిప్రముఖపుణ్యతీర్థంబుల నవగాహనంబు చేసి పునఃపున
రాచరితైతద్విశిష్టప్రయోజనుండ నగుచుఁ దదానందంబు సదానందంబు గావింప
కొన్నిదినంబు లచ్చట నుండితి వర్తమానకాలమున నమ్మధ్యలోకము సకలకళ్యాణ
గుణాభిరామంబై లోకాంతరములకంటె నాహ్లాదకరంబై యున్నయది తద్విశేషం
బాకర్ణింపుము.

201


శా.

లోకాలోకనగావృతం బగుధరాలోకంబు బాలించుదా
నీ కాలంబున సర్వధర్మములు భూయిష్టంబులై చెల్లఁగా
నేకచ్ఛత్రముగాఁ బురూరవుఁడు రాజేంద్రుండు సౌందర్యరే
ఖాకందర్పుఁడు కీర్తివిక్రమగుణాకల్పుండు లేఖర్షభా!

202


సీ.

ప్రతిదేశమును భోగభాగ్యసంపత్ప్రజాసంపూర్ణవిభవమై పెంపుమీఱుఁ
బ్రతిదేవతావాస మతులితనిత్యోత్సవాడంబరంబుల నతిశయిల్లుఁ
బ్రత్యగ్రహారంబు భాసురాధ్యయనయజ్ఞాతిసంశోభితం బై వెలుంగు
బ్రత్యయనంబును బహుళాన్నసత్రప్రపావళిసాంద్రమై యలరుచుండు


తే.

జనులు వర్ణాశ్రమాచారసరణి లేశ, మైనఁ దప్పక సుకృతాత్ము లై మెలంగ
సకలధర్మంబులును బ్రవిస్తరము లయ్యె, నప్పురూరవుం డేలురాజ్యంబునందు.

203


ఉ.

అందఱు విష్ణుభక్తులు దయాపరు లందఱు నందఱున్ సదా
నందమనస్కు లందఱు జనస్తవనీయచరిత్రు లైనవా
రందఱు భోగభాగ్యయుతు లందఱు కల్మషదూరు లందఱున్
సుందరమూర్తు లెవ్వరినిఁ జూచిన నానృపుఁ డేలు మేదినిన్.

204


శా.

ఆసౌందర్యము నామృదూక్తివిభవం బాసాదరాలోకనం
బాసారస్యము నాచమత్కృతియు నాయౌదార్య మావైభవం

బాసామర్థ్యముఁ గల్గునే గతభవిష్యద్వర్తమానంబులం
దోసంక్రందన! యప్పురూరవునియ ట్లూహింప నెవ్వారికిన్.

205


తే.

సరసకరుఁడు సులక్షణచారుమూర్తి, భాన్వితుండు కళాకలాపాంచితుండు
కువలయాప్తుండు నుగ్రాంబకవిలసనుఁడు, నయ్యె నారాజు విష్ణుపదాశ్రయమున.

206


తే.

అతని నెమ్మోము పూర్ణసుధాంశుబింబ, మగుట సత్యంబు గాకున్న నగుట యెట్లు
వికచభావంబు నవరసవిభ్రమాభి, రామరామాంబికేందీవరంబులకును.

207


సీ.

పుండరీకదళాంతములయందు నందంబుగాఁ బద్మరాగరాగంబు నిలిపి
సమదవేదండతుండములందుఁ దీరుగా నిగనిగ మనుజిగి నెలవుకొలిపి
కుందనంపుఁబసిండియందుఁ దా ఘనసారసారసౌరభవిశేషంబు నించి
యరుణపల్లవములయందుఁ బద్యాంకుశకులిశాదిభాగ్యరేఖలు రచించి


తే.

చేసెఁ గావలె నలవాగ్విలాసినీశుఁ, డాకనుంగవ యాచేతు లాశరీర
మాపదంబులు గాకున్న నానృపాల, తిలకునంగకముల కింతచెలువుఁ గలదె?

208


ఉ.

కొందఱియందుఁ గొన్ని మఱికొందఱియం దొకకొన్ని గాని పెం
పొందుసమస్తసద్గుణము లొక్కనియందు ఘటించి యుండఁగా
నెందు నెఱుంగ మెవ్వరి సురేశ్వర! విష్ణుకళాప్తి నుద్భవం
బొందిన యప్పురూరవుని నొక్కనిఁదక్కఁగ మేదినీస్థలిన్.

209


చ.

అన విని వజ్రపాణి వినయంబున నారదమౌనిఁ జూచి యి
ట్లనియెఁ బురూరవక్షితితలాధిపుసద్గుణవర్ణనంబు నె
మ్మనమున కింపొనర్చె బుధమాన్య! సవిస్తరభంగిఁ దెల్పుమ
య్యనఘుఁడు విష్ణుభక్తుఁడు గదా విన నొప్పుఁ దదీయవృత్తమున్.

210


క.

ఎవ్వఁడు హరిభక్తిపరుం, డెవ్వఁడు సూనృతవచస్కుఁ డెవ్వఁడు సుజనుం
డెవ్వఁడు బహుజనపోషకుఁ, డవ్విమలునిచరిత మెన్ననగు వినఁగఁదగున్.

211


తే.

అనినఁ దత్పూర్వవృత్తాంత మన్నగారి, తోడ నమ్ముని వివరింపఁ దొడఁగె నప్పు
డమరగంధర్వవిద్యాధరాప్సరఃక, దంబకములకుఁ గర్ణామృతంబు గాఁగ.

212


క.

నారదనారదజోక్తిక, ధారాగ్రహణప్రయత్నతత్పరలీలా
సారంగీభూతశ్రుతు, లై రప్పుడు లేఖు లెల్ల నాసభలోనన్.

213


వ.

అని పలికినం బ్రహృష్టమానసులై తత్కథాప్రకారం బెఱింగింపు మని మహర్షులు
రోమహర్షణతనూభవు నడుగుటయును.

214

మ.

ప్రణవాగారవిహార హారకలితోరశ్శోభితాకార కా
రణజాభీరకుమార మారహనుతప్రాంచత్కథావార వా
రణదక్షాదరభార భారతహితప్రజ్ఞావచస్సార సా
రణముఖ్యాప్తవిచార చారణసురారాధ్యాంఘ్రిపంకేరుహా.

215


క.

నిటలతటఘటితకరపుట, జటివియదటపటలవరణచరణనికటవి
స్ఫుటమకుటకటగహాటక, పటకటితలదళితశకటపటుకపటవిటా.

216


మాలిని.

నతశశధరజూటా నాగభుకృత్రిఘోటా
జితసమదనిశాటా శ్రీశ్రీతోరఃకవాటా
ధృతతిలకలలాటా దివ్యతేజఃకిరీటా
తతచరణకృపీటా దైవసౌభాగ్యకూటా.

217


గద్యము.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తి
రాయనమంత్రితనూభవ సుజనహితకృత్యనిత్య యబ్బయామాత్యప్రణీతం బైన
కవిరాజమనోరంజనం బనుమహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.