Jump to content

కవిరాజమనోరంజనము/పీఠిక (2)

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కవిరాజమనోరంజనము

పీఠిక



కెంగేల వెలుంగుతమ్మికి జేతం జెల్వొందు చెంగల్వకున్
వ్యాకోచస్థితిసామ్యమై యెసఁగఁగా నర్కేందుబింబాక్షివీ
క్షాకారుణ్యరసాప్తిఁ తత్ప్రియకు వేడ్క ల్సేయులీలానృసిం
హాకారోజ్జ్వలు మంగళాద్రిపతి నిష్టావ్యాప్తికై కొల్చెదన్.

1


చ.

ఒకవదనంబుఁ ద్రిప్పి మఱియొక్కముఖాబ్జము ముద్దుగొంచుఁ బా
యకయును వేడుకోగఁ బొలయల్కనెపంబున నిట్టులాస్యపం
చకమును నొక్కచుంబనరసస్పృహఁ ద్రిప్పుచుఁ దత్సుఖోచితో
త్సుకమున నవ్వున్చు గిరిజఁ జూచుశివుం గొలుతు న్మదార్తికై.

2


శా.

వైరాగ్యార్థవిచారవేళ మదనవ్యాపారశాస్త్రైకవా
చారూపంబున లోనఁదోఁచుచు భ్రమించన్ వాణిధౌర్త్యంబు పెం
పారన్ బుద్ధి నెఱింగి నవ్వుచుఁ దదీయాంగం బెదం జేర్చులో
కారాధ్యుండు విరించి శ్రీకవితవిద్యాస్పూర్తి నా కీవుతన్.

3


సీ.

తనచూపులకుఁ గల్పతరుకామధేనుచింతామణు లంశమాత్రములు గాఁగఁ
దనప్రసన్నతనుఁ జంద్రకలాపకమలజైశ్వర్యమహోన్నతుల్ సాక్షి గాఁగఁ
దనపెంపునకు దేవతానితంబవతీకదంబంబు దాసీజనంబు గాఁగఁ
దనకథావిస్తారతకు సర్వవేదశాస్త్రంబులు వందిబృందములు గాఁగఁ


తే.

దనరు నేచెలి లిప్తచందనసుగంధ, సరసవిష్ణుభుజాంతరసౌధసీమ
నమ్మహాదేవి పరమకళ్యాణి లక్ష్మి, చేరి మమ్ముఁ గృతార్థులఁ జేయుఁగాక.

4

శా.

సీమంతాభరణంబు క్రొన్నెల చెలుల్ శ్రీవాగ్వధూటుల్ ప్రియా
రామశ్రేణి కదంబసుందరతరారణ్యస్థలుల్ కేళికా
ధామంబుల్ రజతాద్రికందరము లౌదార్యంబు భోగాపవ
ర్గామోదార్తియు నైన హైమవతి భాగ్యస్పూర్తి మా కీవుతన్.

5


శా.

శ్రీచింతామణి మంత్రదేవత జగత్క్షేమంకరాపాంగవీ
క్షాచంద్రోదయభక్తశేవధి మహాసంగీతసాహిత్యవి
ద్యాచారుస్తనకుంభ శారద మదీయస్వచ్ఛజిదగ్విస్థలిన్
వాచానృత్యము సల్పుగావుతఁ గవిత్వస్పూర్తి వర్తిల్లఁగన్.

6


ఉ.

పుష్కరదీప్తతుండపరిపూరకలీనసమస్తమైన యా
పుష్కరథిన్ నభస్థలికి ఫూత్కరణోద్ధతిఁ జిమ్మి యచ్చటం
బుష్కరవాహినిం గలయఁబొందొనఁగూర్చిన విఘ్నరాజు ధీ
పుష్కరహేలి మతక్కృతికి భూరిజయాభ్యుదయం బొసంగుతన్.

7


క.

శ్రీరామాయణకావ్యక, ళారూఢవచోవివేకి నవ్వాల్మీకిన్
భారతభాగవతాదిక, థారచనోల్లాసు వ్యాసుఁ దలఁచి భజింతున్.

8


చ.

అనఘుల సంస్కృతాంధ్రకవితాఢ్యులఁ బేర్కొని సన్నుతింతుఁ బెం
పునఁ దగుకాళిదాసు భవభూతిని చండిని బాణునిన్ మయూ
రుని మఱి మాఘు భారవిని రూఢిగ నన్నప భీము నెఱ్ఱమం
త్రిని నలసోము భాస్కరునిఁ దిక్కన బమ్మెర పోతనార్యునిన్.

9


ఉ.

ఎవ్వరి కెంతబుద్ధి పరమేశుఁడు దాఁ గృపజేసె నట్టిదై
నివ్వటిలుం గవిత్వరుచి నేరుపు చాలినఁ జాలకుండినన్
నవ్వక వర్తమానకవినాథులు చేకొనరయ్య మత్కృతిన్
బువ్వులు గందకుండ రసముం గొనుతేఁటులవంటి నేర్పునన్.

10


ఉ.

చెల్లునటంచు నొక్కకవి చేసిన లక్షణ మొక్కరివ్వలన్
జెల్లమిఁ జేసి తారొకటి చెప్పఁగ ఛాందసవిస్తరంబు సం
ధిల్లుటఁ గావ్యశంక లవనిం దఱుచయ్యె రసజ్ఞులార నా
యుల్లపుసౌధవీథిఁ గొలువున్న సరస్వతి సత్యవాణినా
తల్లి యొసంగుపల్కు లివి తప్పులు సేయక చిత్తగింపుఁడీ. (పంచపాది)

11


చ.

పలుమఱుఁ దప్పులే వెతకఁ బాల్పడి యుండుటగాక దుష్కవుల్
తెలియఁగఁ జాలుటెట్లు రసదీపకకావ్యకళారహస్యముల్

తలఁపఁ బ్రపూతిహేయకలితవ్రణశోధనవాంఛ గాక యీఁ
గలకుఁ బటీరచర్చితసుగంధతనుస్థితి బుద్ధి గల్గునే.

12


వ.

అని యిష్టదేవతాప్రార్థనాచరణంబును బూర్వకవీంద్రసంస్మరణంబును నవీనకవిజనా
నుసరణంబును గుకవితృణీకరణంబును గావించి యొక్కపుణ్యకథారత్నంబు రచి
యించుఁయత్నంబునం గుతూహలదోహలం బైన చిత్తంబున నిట్లని వితర్కించితి.

13


తే.

ప్రాజ్ఞులు ప్రబంధకల్పనాపాటవంబు, గలుగుట సత్ఫలంబుగాఁ దలఁచి కృతులు
చేయుచుందురు జగదేకనాయకునకు, నచ్యుతున కంకితముగఁ గృతార్ధులగుచు.

14


క.

ధాతలకు ధాత భువన, త్రాతలకున్ దాన శౌరి రక్షకుఁ డఁట యా
దాతలదాత న్విడిచి యి, లాతలనేతల నుతించు లాఘవ మేలా.

15


సీ.

కృపఁ జేసి భువనముల్ కీర్తింప ధ్రువునకుఁ జెలఁగి యెన్నాళ్లకుఁ జెడనిపదవి
యొసఁగె విభీషణాఖ్యునకు నాచంద్రతారార్కంబు గాఁగ లంకాధిపత్య
మిచ్చెఁ గుచేలున కిష్టార్థసిద్ధియౌ సరివోల్సరానియైశ్వర్యమహిమ
దత్తంబుచేసె గంధవహాత్మభవునకు వరభవిష్యత్బ్రహ్మవైభవంబు


తే.

వాసుదేవుండు బ్రహ్మాండవల్లభుండు, భక్తజనులకు సకలసౌభాగ్యదాత
దాతమాత్రంబె మోక్షప్రదాత యతఁడె, యతని నుతియించుకంటె భాగ్యంబు గలదె.

16


మ.

చతురుల్ పూర్వకవీంద్రు లన్నిటను నే స్వల్పజ్ఞుఁడన్ స్వామికిన్
హితమోకాదొ మదీయకావ్య మని నాకేలా విచారింప న
గ్రతనూజుల్ వ్యవహారకర్తలయినం గానీ కడుంబాలుఁడౌ
సుతునవ్యక్తపుమాట తండ్రి కొదవించుంగాదె యానందమున్.

17


మ.

తనుఁ దా మెచ్చుకొనంగనేటికిఁ గవిత్వప్రౌఢి యాంధ్రీఘన
స్తనకుంభస్ఫురణన్ నవీనమృదుచిత్రశ్రీపదాచ్చాదనా
భినవాలంకరణార్థసూచనల సంప్రీతిన్ మనోవీథులం
జొనుపంగల్గిన నింపుతో విని రసజ్ఞుల్ మెచ్చినం జాలదే.

18


క.

ప్రాచీనకవిక్వచిదుప, సూచితకథ సుకవిరచనసొంపున వితతం
బై చిత్తము లలరించుం, బ్రాచురగతిఁ గనకఘటితరత్నము భంగిన్.

19


వ.

అట్లుగావున మదీయసరస్వతీవిలాసంబువలన సార్థకనామధేయంబుగాఁ గవిరాజ
మనోరంజనం బనునొక్కసత్ప్రబంధంబు రచియించి మజ్జన్మసాఫల్యంబుగా భగవ
దర్పణంబు గావింతు ననుతలంపున.

20


ఉ.

శ్రీరమణాంకితంబుగ రచింపగయోగ్యత గల్గి వీరశృం
గారరసాదిలీలలఁ బ్రగల్భతకున్ బుధు లౌననంగ వి

స్తారము సేయఁగాఁ దగినసత్కథయెయ్యది గల్గునో యటం
చారయుచున్ మదీయహృదయంబునఁ గోర్కులు నివ్వటిల్లఁగన్.

21


తే.

ఉండి యొకనాఁటిరేయి నాయుల్లమునను, మత్ప్రభుండైనయట్టి శ్రీమంగళాద్రి
నిలయు నరసింహు భక్తవత్సలు దలంచి, శయ్యమీఁదను నిదురించు సమయమునను.

22


సీ.

శతకోటికందర్పసౌందర్యరేఖావిమోహనంబు ఖగేంద్రవాహనంబు
హారకోటీరకేయూరాదిభూషణస్ఫూర్జితంబు కలంకవర్జితంబు
దరహాసహసితవిస్ఫురితజీవంజీవజీవితంబు సుపర్వసేవితంబు
సంపద్విలాసినీసరసభుజాలతాలింగితంబు కృపాతరంగితంబు


తే.

గురుతరానంతకళ్యాణగుణమణీధు, రంధరంబు లసత్కంబుకంధరంబు
విష్ణుదివ్యస్వరూపంబు వేడ్కతోఁ బ్ర, సన్న మయ్యెను మామకస్వప్నమునను.

23


వ.

ఇట్లు మదీయజన్మాంతరసహస్రసంచితతపఃఫలంబునం బ్రసన్నంబైన భగవద్దివ్యమం
గళవిగ్రహంబు సందర్శించి కంచుకీకృతపులకోద్గమశరీరుండనై యానందరసకందళిత
హృదయారవిందుండ నగుచు లేచి సాష్టాంగవందనంబు లాచరించి నిలిచి స్తోత్రం
బులు చేయుచున్ననన్నుం గరుణామృతశీతలకటాక్షంబుల వీక్షించుచు గంభీరమృదు
మధురభాషణంబుల నిట్లని యానతిచ్చె.

24


క.

మును పనిరుద్ధచరిత్రం, బనుకృతి రచియించి మంగళాచలపతినై
తనరారు నాకు నంకిత, మొనరించితి నేను బ్రీతి నొందితి నింకన్.

25


శా.

మద్భక్తుండు పురూరవుండు మును ధర్మంబొప్పఁ బాలించె నే
తద్భూమండల మేకచక్రముగఁ దద్వార్తల్ పురాణోక్తముల్
తద్భావార్థ మెఱింగి విస్తరము నొందం జేయు మస్మత్ప్రసా
దోద్భూతాద్భుతశేముషీచతురవాగ్యుక్తిం బ్రబంధంబుగన్.

26


వ.

తత్ప్రబంధంబు మద్గోపాలనామాంకితంబుగా రచియింపుము మదీయకృష్ణావతారసగు
ణబ్రహ్మోపాస్తిపరులు నాకుం బ్రియతములు గావునఁ దద్రూపంబున నీచే నుపాసి
తుం డైననీహృదయంబున వివరింతు నని యానతిచ్చి యప్పరమేశ్వరుం డంతర్థా
నంబుఁ జేసినట్లయిన మేలుకాంచి యాశ్చర్యమిళితప్రమోదమానసుండనై యద్ది
వ్యవిగ్రహంబుఁ దలంచి మ్రొక్కుచుండితి నివ్విధంబున నిష్టదేవతానుగ్రహంబు
వడసినవాఁడనై తత్ప్రబంధంబు రచియింపఁ బూని, కవిసమయసిద్ధతావిచారంబున
మద్వంశక్రమం బెఱిఁగించెద.

27


శా.

శ్రీపేర్మిన్ శశివోలె బ్రహ్మకులవార్ధిం బుట్టి కౌండిన్యగో
త్రాపస్తంబపవిత్రసూత్రకలితుం డై రామసింహాసనా

భ్యోపేతస్ఫుటకొండవీటిపురరాజ్యోర్వీశ్వరుల్ మంత్రిగా
జేపట్టన్ బసవప్రధానుఁ డిల మించెన్ భాగ్యసంపన్నుఁ డై.

28


క.

ఆమంత్రిమణి ప్రకాశన, భోమణి కనుపర్తిబుక్కపురిముఖ్యబహు
గ్రామస్వాస్థ్యానుభవ, గ్రామణి బుధనుతుల సుతులఁ గాంచె నలువురన్.

29


వ.

తదీయాభిధానసౌగుణ్యక్రమంబు

30


తే.

అమరమంత్రి గుణంబుల నమరమంత్రి, ముమ్మహిమవేల్పు ప్రభనొప్పుముమ్మఘనుఁడు
పెద్ద నానాచమత్కృతిఁ బెద్దనార్యుఁ, డెల్లసచివుండు సంస్తుత్యుఁ డెల్లసభల.

31


ఉ.

అం దసమానకీర్తియుతుఁ డై తగు ముమ్మనమంత్రిమౌళికిన్
నందనుఁ డై జనించె సుజనస్తవనీయుఁదు నిమ్మనాథుఁ డిం
పొందుసమస్తసంపదల నున్నతిఁ గాంచెను గొండమాంబ రా
కేందునిభాస్యఁ గూర్మి హృదయేశ్వరిఁగా భరియించె వేడుకన్.

32


క.

ఆనిమ్మమంత్రివరునకు, సూనుండై యబ్బనార్యచూడామణి పెం
పూన జనియించెఁ గొండాం, బానిరుపమగర్భశుక్తిమౌక్తిక మగుచున్.

33


చ.

సుగుణకదంబ మెల్ల నొకచోటనె కాపురమున్నయట్లుగా
నగునని వేయునోళ్లఁ గొనియాడుచు భూజను లెంచ ధన్యుఁడై
తగుకనుపర్తియబ్బనకు దత్ప్రియసాధ్వికి లచ్చమాంబకుం
బొగడిక కెక్కి రిద్దఱు సుపుత్రులు రాయన నిమ్మనాహ్వయుల్.

34


ఉ.

వేయనవచ్చుఁ గాక సుళువే యనపాయవదాన్యవైభవం
బాయనవద్యబుద్ధి తగునాయనకీ యనఁ గీర్తిచంద్రికల్
గాయ నయస్వగీతికలు గాయనశీలురు పాడ నొప్పు మా
రాయనమంత్రి మేలు బళిరా యన సూరిజనాభివంద్యుఁ డై.

35


క.

 ఆరాయనార్యమణికి వ, ధూరత్నము నరసమాంబ దొరయన్ సుగుణ
శ్రీరమణీయత ననసూ, యారుంధతు లనఁ బతివ్రతాభరణం బై.


తే.

అట్టిదంపతులకు నన్వయాభివృద్ధి, యొదవఁ బుత్రుల మిరువుర ముదయమైతి
మగ్రజుండు యోగానందుఁ డనఘచరితుఁ, డబ్బయామాత్యుఁ డండ్రు మదాహ్వయంబు.

37


క.

శ్రీమంగళగిరినరసిం, హామేయకృపావిజృంభితాద్భుతకవితా
శ్రీమంతుఁడ గానకళా, ధీమంతుఁడ దేవతాస్తుతివ్రతపరుఁడన్.

38


వ.

ఈదృశుండ నగునాచేతన్ గ్రథితం బగునేతత్ప్రబంధంబున కధీశ్వరుం డయిన
శ్రీరాజగోపాలప్రభుండు.

39

సీ.

యదువంశజలధిరాకామృతభానుండు భానుండు యోగిహృత్పద్మములకుఁ
ద్రైలోక్యహితరాసకేళీసనాథుండు నాథుండు బ్రహ్మాండయూధములకు
నిజకథామృతధౌతవృజినజంబాలుండు బాలుండు నందగోపాలసతికిఁ
గృతవైణవికగానగీతప్రబంధుండు బంధుండు వల్లవీప్రాణములకుఁ


తే.

గోమలశ్యామలామ్ముగగ్రామలామ, రప్రకాండకాండాసనరాజమాన
సాంద్రచంద్రకనపచంద్రకీంద్రబర్హ, శేఖరుఁడు కృష్ణగోపాలశేఖరుండు.

40


సీ.

వసుదేవసూనుఁడయ్యు సనాతనుఁడు నవనీతచోరకుఁడయ్యు నిస్పృహుండు
కాముకుఁడయ్యు నస్ఖలితవటుండు నృశంసహింసకుఁడయ్యు సర్వసముఁడు
సంసారియయ్యు నిస్సంగుండు ద్వారకావాసుఁ డయ్యును జగద్వ్యాపకుండు
మాయావియయ్యు నిర్మలమానసుండు కార్యక్రవర్తకుఁడయ్యు నఖిలసాక్షి


తే.

రాజగోపాలలీలావిరాజమాన, దేహభృద్బ్రహ్మతత్త్వంబుఁ దెలిసిపొగడ
వేయుమోములు గలకాద్రవేయలోక, సార్వభౌమునకైన వశంబుగాదు.

41


సీ.

వాసుదేవఖ్యాతి వర్తిల్లె నెవ్వాఁడు భవముచే మూర్తివైభవముచేత
నఘవిఖండలలీల నమరారె నెవ్వాఁడు శక్తిచేఁ జరణాంబుశక్తిచేత
కాళిందిఁ గదిసి వేడ్కలు సల్పె నెవ్వాఁడు రతులచే వనకేళిరతులచేత
గీతామృతవ్యాప్తిఁ గీల్కొల్పె నెవ్వాడు నయముచేఁ దత్త్వనిర్ణయముచేత


తే.

దెలిపె నెవ్వాఁడు కంసమాంసలమతంగ, భూహననధాటిచేఁ దనపురుషసింహ
మూర్తివిస్ఫూర్తి యసమాసకీర్తి యతఁడు, సంహృతార్తార్తి యాభీరచక్రవర్తి.

42

షష్ఠ్యంతములు

క.

ఈదృక్ప్రసారసారగు, ణోదారున కాశ్రితవ్రజోభయసుఖదా
నోదారున కవనీభృ, ద్భూదారున కమృతజలధిభూదారునకున్.

43


క.

మండితగుణపండితహృద, ఖండితవిజ్ఞానహంసకాసారునకున్
గుండలరుగ్మండలభృ, ద్గండలసద్ధరహసనసుధాసారునకున్.

44


క.

బంధురతరరవమురళీ, గాంధర్వసుధాస్రవంతికాలహరీసం
బంధోదితప్రవాళ, స్కంధస్థాణునకు భజదజస్థాణునకున్.

45


క.

వరఖద్యుమణికి సాష్టో, త్తరశతషోడశసహస్రతరుణీయుగప
త్సురతోచితబహుతనుభా, సురదక్షిణనాయకైకచూడామణికిన్.

46


క.

విజరాజకకుబధీశ, వ్రజరాజతనగపమృగ్యపదునకు వీణా
ద్విజరాజద్విజరాజ, ద్విజరాజముఖాచ్ఛకీర్తివిభవపదునకున్.

47

క.

పరగోపీగోపితస, త్పరిమళహయ్యంగవీనపాటచ్చరతా
స్ఫురితునకున్ రాధాకుచ, భరితునకున్ దురితహరణపటుచరితునకున్.

48


క.

రాసక్రీడానటనవి, లాసవశీకృతనభస్స్థలస్థాస్వప్న
స్త్రీసముదయహృదయునకున్, వ్యాసాదిమునీంద్రవర్ణితాభ్యుదయునకున్.

49


క.

శుంభదవష్టంభభుజా, స్తంభాగ్రహఠాచ్చపేటశంబాహతి సం
రంభహతకంసభూభృ, త్కుంభికగోత్రునకు భరితగురుగోత్రునకున్.

50


క.

గోగోచరబలవిక్రమ, గోగోచరతాహృతాకగోపాలునకున్
గోగోనియమితనానా, గోగోపాలునకు రాజగోపాలునకున్.

51