కవిరాజమనోరంజనము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

కనుపరి అబ్బయామాత్యుఁడు రచించిన గ్రంథములలో రెండే మనకు లభించినవి. ఒకటి అనిరుద్ధచరిత్రము, రెండవది పురూరవశ్చరిత్రమను కవిరాజమనోరంజనము. వీరేశలింగముపంతులువారు కవులచరిత్రములో గవిరాజమనోరంజనము నిట్లు ప్రశంసించిరి. “వసుచరిత్రమునకుఁ దగువాతఁ గవిరాజమనోరంజనముతోఁ దులతూఁగఁదగిన ప్రబంధము లొకటి రెండుకంటె నెక్కువగా లేవు. బాల్యమునందు రచించబడినదగుటచే అనిరుధ్ధచరిత్రము పురూరవశ్చరిత్రమంత ప్రౌఢముగా లేదు. కవి సాహిత్యమునందుమాత్రమే గాక సంగీతమునందును బ్రవీణుఁ డైనట్లు కనఁబడుచున్నాఁడు.”

వీరేశలింగముపంతులువా రీగ్రంథమును మిగులఁ బ్రశంసించుట గ్రంథప్రశస్తికి దృష్టాంతము. అబ్బనామాత్యుఁడు కౌండిన్యసగోత్రుఁడు. ఆఱువేల నియోగిబ్రాహ్మణుఁడు. గుంటూరుమండలములోని కొండవీటికి రెండామడల దూరములోనున్న కనుపర్తి యీతని నివాసస్థలము. నేఁటికిని గవివంశీయు లట వసించుచున్నారు. ఈకవితండ్రి రాయనమంత్రి. తల్లి నరసమాంబ. మంగళ నృసింహస్వామి యీతని యిష్టదైవము. నరకృతికొల్లక యిక్కవి తన రెండుగ్రంథములను దేవాంకితము గావించి ధన్యుఁ డయ్యెను. ఇక్కవి పూర్వులలో బసవప్రధాని “కొండవీటిపుర రాజ్యోర్వీశ్వరులు మంత్రి గాఁ జేపట్టన్” బేరొందెనఁట. అంతియగాదు “కనుపర్తి బుక్కపురి ముఖ్యబహుగ్రామస్వాస్యానుభవగ్రామణి”యట. కనుపర్తికి మిగులఁ జేరువలో బుక్కపట్టణ మున్నది గాన కవి కొండవీటిసీమవాఁ డనుట నిస్సంశయము. కవి పూర్వులప్రశంస కాలనిరూపణమునకుఁ దోడ్పడుట లేదు.

వసుచరిత్రమును బూర్తిగ ననుకరించినకతన అబ్బయామాత్యుఁడు వసుచరిత్ర రచనకాలమున కీవలివాఁ డనుట స్పష్టము. కవివంశజులలో నిప్పటితరమున సూర్యనారాయణ యనువారున్నారు. ఈయనవయస్సు 42 సంవత్సరములు. ఆయననుండి పురుషులను దీసికొన్నచోసుబ్బయ్య - శ్రీనివాసరాయఁడు - సుబ్బరాజు - వెంకన్న - పెద్దిరాజు - గ్రంథకర్తయగు అబ్బరాజు వంశవృక్షమువలనఁ గన్పట్టిరి. అనఁగా సూర్యనారాయణగారికిఁ బ్రకృతగ్రంథకర్త ఆఱవతరమువాఁడు. తరమునకు ముప్పదియేండ్లవంతున లెక్కించినచో అబ్బయామాత్యుఁ డిప్పటికి నూటయెనుబదియేండ్లక్రిందట క్రీ.శ. 1750 ప్రాంతమున నుండె ననుట స్పష్టము. ఇంతకంటే బలవత్తరములగు నాధారములు లభించువఱ కీనిర్ణయము విశ్వసనీయమని మాతలంపు.

కవిరాజమనోరంజనము రసవత్తరమగు ప్రబంధము. కవి వర్ణనములకుఁ బాటుబడినటులఁ గథాకల్పనమునకుఁ బాటుపడలేదు. "ఆద్యసత్కథల్ వారివిపుట్టురత్నము”లన్నట్లు ఇందలికథాంశము పురాణములనుండి యథావిధముగఁ బ్రబంధములోనికి మాఱినది. ఈ మార్పునకు అష్టాదశ వర్ణనలు అంత్యనియమపద్యములు చిత్రకవిత మున్నగుకవితాశిల్పములు తోడ్పడినవి. అంతియగాని ప్రధానపాత్రముల నాదర్శప్రాయముగఁ జిత్రించుట, ప్రకరణోచితముగఁ గథను సృజించుట మున్నగు నూతనవికాసము లీప్రబంధమునఁ గానరావు. మృదుమధురమగు నీకవికవిత స్వతంత్రముగనున్నంతదనుక మనోజ్ఞముగనున్నది. వసుచరిత్రము ననుకరించినతావులలోఁ గొంతకొంత పేలవము కనిపించుచున్నది. ఎట్లయిన నేమి సమకాలికగ్రంథములలో మిన్నయనుట సత్యము. ప్రధానకథాబీజము గొని కాళిదా సిందలికథనే తారుమా రొనరించి విక్రమోర్వశీయమున దనఁ గథాసంస్కరణనైపుణ్యమును బ్రకటించినాఁడు. నాటకములఁ బ్రబంధములుగ మార్చుకాలమున నున్న యిక్కవి యిందులకు దొరకొనమి సంతాపకరము. అబ్బనామాత్యుని మనోహర కవిత నూతనకథాకల్పనకుఁ ద్రోవదీసిన నెంతరమణీయముగ నుండునో గదా!

అబ్బయామాత్యుఁడు పలుతావుల వసుచరిత్రము ననుకరించినాఁడు. కొన్నితావుల వ్యాకరణనియమములఁ గూలత్రోసినాఁడు. ఈతని స్వతంత్రరచనము మృదుమధురపదభూయిష్ఠ మై తెలుఁగు నుడికారములందలి తీరుతీయముల వెదజల్లుచుండును. శృంగారనైషధములోని కొన్నిపద్యముల కనుకరణము లితనికవితలోఁ గలవు.

సీ.

“నిఖలవిద్యానటీనృత్తరంగస్థలా
                   యతనాయమానజిహ్వాంచలుండు."

శృంగా-ఆ.1. ప.46.


సీ.

“నవకీ ర్తినర్తకీనాట్యగంగావధీ
                   కృతచక్రవాళధాత్రీధవుండు."

కవిరా-ఆ-1. ప-87.


చ.

"ఇతఁడు దరిద్రుఁ డౌ ననుచు నేర్పడ నర్థిఁ లలాటపట్టికన్
శతధృతి వ్రాసినట్టిలిపిజాల మనర్థము గానియట్లుగా
వితరణఖేలనావిభవవిభ్రమనిర్జితకల్పభూరుహుం
డతఁడు దరిద్రతాగుణమునందు దరిద్రుని జేయు నాతనిన్.”

శృంగా-ఆ-1. ప.57.


మ.

“అయమర్థీజనయంచు యాచకలలాటాంతస్స్థతిన్ బ్రహ్మని
ర్ణయశన్ వ్రాయవహించునట్టి లిపియర్ధంబుల్ విశేషాన్వయ
క్రియగా నర్థమవారిగా నొసఁగి యర్థింజేయు వాగీశువ్రాఁ
తయు నాత్మీయవితీర్ణయున్ నిజముగా ధాత్రీశునేర్పట్టిదో.”

కవిరా.ఆ.1. ప-98

వసుచరిత్రము ననుకరించిన పద్యములనుగూడఁ జూపుట ప్రకృతము కాకపోదని ఒకపద్యమును జూపుచున్నారము.

ఉ.

"కొండఁట విల్లు వేదలలకుండలిరాజఁట నారి యమ్మనం
గుండఁట బైటిపల్లియల దున్మినవాఁడఁట యొండు రెండు భ
ర్గుండిది నిండు పౌరుషమొకో యని గెల్వవె ముజ్జగంబు లు
ద్దండత నొక్కతుంటవిలు దాలిచి యంటినగందుతూపులన్.”

వసుచరిత్రము


ఉ.

"నారఁట తేఁటి, జోక నలినారఁట, తేరఁట చిల్క సౌరభో
ద్గారఁట విల్లుపూతనయగారఁట చుట్టము శైత్యపున్ సదా
చారఁట కమ్మగట్టు పరిచారఁట కోయిల కేతనీభవ
ద్వారఁట యిట్టినీకొదుగువారఁట లోకు లిదేమిచిత్రమో.”

కవిరాజమనోంజనము

అనుకరణపద్యమున సంధిలోపములు చాలగలవు. గ్రంథవిస్తరభీతిచే నిం దుదాహరింప మానితిమి. కవిరాజమనోరంజనమున, రసవత్తరము లగుఘట్టము లెన్నేని కలవు. మొదటియాశ్వాసములోని రాజనీతులు ఆత్మవిద్యోపదేశము, ప్రత్యేకపఠనీయములు. రెండవయాశ్వాసములోని తారాశశాంకసమాగమముగ సభ్యముగ సంగ్రహరూపముగ నుండి దుర్నీతిని బరిహరించుచున్నది. వసిష్ఠస్తుతి కవికిఁగల యుభయభాషాకవితానైపుణ్యమునకుఁ దార్కాణగా నున్నది. ఇలాకన్య పురుషుఁ డగుటయు రాజకుమారుఁడు స్త్రీ యగుటయు వీరలు పరస్పరము మోహించుకొనుటయు నిరువురకుఁ దనయుం డుదయించుటయు శివానుగ్రహంబునఁ బూర్వరూపంబులు దాల్చుటయు మిగుల మనోహరముగ రెండవయాశ్వాసమున వర్ణింపఁబడినది. మూఁడవయాశ్వాసమునుండి ప్రధానకథ యగుపురూరవశ్చరిత్ర మారంభమైనది. ఊర్వశీపురూరవుల సమాగమమునకుఁ గాంక్షించుట, మలయానిలాద్యుపాలంభములు చెలికత్తియల యోదార్పులు మున్నగు కథాభాగములు విశేషభావసమన్వితము లై మనోహరముగ నున్నవి. ఊర్వశీపురూరవుల కీయాశ్వాసమున వలపు మొలక లెత్తినది. సమాగమవిధము నాల్గవయాశ్వాసమునఁ గలదు. మైత్రావరుణుల తపోభంగము గావింప నింద్రుపంపున ఊర్వశి ధరణి కవతరించి శాపతప్తురా లయ్యెను. శాపఫలము భూలోకమున వసించుట. ఊర్వశికిఁ దీర్థము స్వార్ధము గలసివచ్చింది. తరువాత నీయిరువురికలయిక (సమావేశము) సందర్భశుద్ధిగ సరసముగ రసవత్తరముగఁ గవి చిత్రించినాఁడు. ఈయుభయులప్రేమ నిష్కళంక మైనదె. ఏకహృదయముగ నిరువురు వర్తించుచుండిరి. కాని యిరువురు విడిపోవుట కొకసమయము గలదు. ఊర్వశి రెండుపొట్టేళ్లఁ దెచ్చినది. వానిని మృగచోరాద్యాపదలు బొరయనీయక కాపాడుట, వివస్త్రముగ దనకుఁ బురూరవుఁడు కనపడకుంట జరుపువఱకు ఊర్వశి వెంటనుండును. ఈనియతికి భంగముకలుగుటయే యెడబాటు. నియమముల కంగీకరించి పురూరవుఁడు ఊర్వశిని బరిగ్రహించి ప్రతిష్టానపురము జేరి చిరకాలము కామసౌఖ్యము లనుభవించెను. ఒకదినము తగళ్లం జోరులు హరించిరి. వివస్త్రముగ నేగుచున్నపురూరవుని దర్శించుటతో నిరువురిబంధము తెగిపోయెను. ప్రతిజ్ఞాభంగము జ్ఞాపకముజేసి ఊర్వశి స్వర్గలోకమునకుఁ బోయెను, అటనుండి విప్రలంభశృంగారము మనోహరముగ నున్నది. ఈ కథాభాగముల నైదవయాశ్వాసమునఁ గాంచనగును.

ఊర్వశి నిర్గమనానంతరము పురూరవుఁడు వలపువ్రేగునఁ జింతించుచు గంధర్వులఁ బ్రార్థింప ఊర్వశివలె అగ్నిస్థాలి యనుకన్యను సృజించి యొసంగుదురు. క్రమముగా నాయమ యూర్వశి కాదని పురూరవుఁ డెఱింగి యేకతమునఁ జింతించుచు రెండరణుల సేకరించి యొకటి యూర్వశియని మఱియొకటి పురూరవుఁడని పేర్కొని రెంటిని త్రచ్చుచుండ విష్ణువు ప్రత్యక్షమై కామితములు ప్రసాదించుటతోఁ గథ యంతమగుచున్నది. కథాంశమునకుఁ గవి సంస్కరణ జరుపక గనిలోనుండి తీసినపుట్టుశిలవలెఁ గథనుంచి వర్ణనము పేర నెన్నేని భూషణము లాశిలకే కూర్చినాఁడు. మూడవయాశ్వాసమునుండియే యీప్రబంధమునకుఁ బ్రధానకథ యారంభమగుచున్నది. ఇందలిశృంగారము చాలవఱకు సభ్యముగఁ బఠనయోగ్యముగ నున్నది. పదునెనిమిదవ శతాబ్దమునాఁటి ప్రబంధములలోఁ గవిరాజమనోరంజనమువంటి సర్వాంగసుందరము రసవత్తరము నగు ప్రౌఢకావ్య మింకొకటి లేదను కవిచరిత్రకారుల వాక్యమునం దెంతయు సత్యము గలదు.

ఆంధ్రభాషయందుఁ గలలక్షణగ్రంథముల కైక్యము కానరాదు. ఒకరిసిద్ధాంతము నింకొకరు పూర్వపక్షముఁ జేసిరి. ఎవరిత్రోవ వారిది. ఈవిసృతలక్షణముల సమన్వయించుట యసాధ్యముగ నుండెను. ఒక రంగీకరించిన సిద్ధాంతము నింకొక లాక్షణికుఁడు పూర్వపక్షము గావించుచునుంటచే నానాఁటికవులకు నిశ్చయసిద్ధాంతములే తోఁచకుండెను. అందుచేతనే యీతనికవితలో వ్యాకరణలోపము లుండెనని కవిరాజమనోరంజనములోని యీ క్రిందిపద్యమువలన నెఱుంగనగును.

ఉ.

“చెల్లునటంచు నొక్కకవి చేసినలక్షణ మొక్కరీవలన్
జెల్లమిఁజేసి తారొకటే జెప్పఁగ ఛాందసవిస్తరంబు సం
ధిల్లుటఁ గావ్యశంక లవనిం దఱుచయ్యె రసజ్ఞులార నా
యుల్లఫుసౌధవీథిఁ గొలువున్న సరస్వతి సత్యవాణి నా
తల్లి యొసంగు పల్కులివి తప్పులుసేయక చిత్తగింపుఁడీ."

కవితాప్రౌఢి కిక్కవి యాంధ్రీస్తనముల నుపమానముగాఁ గైకొనినాఁడు. బహుశః ఇది అఱచాటగు నంధ్రవధూటిచొక్కపుంజనుఁగవను బేర్కొనువిధము గానోపు. ఆంధ్రీస్తనముల కాఠిన్యమును నన్నెచోళుఁడు రాజశేఖరుఁడు పేర్కొనిరి. అదియే కవిభావ మేని కవి శృంగారరసంబంధమునకుఁ గ్రొత్తవన్నెలు బచరించుటయే!

రసవత్తరమగు నీ గ్రంథరాజమునుండి దృష్టాంతముగ నీయఁదగినపద్యములు చాలఁ గలవు. రసికులముం దీ గ్రంథముంచి వారి నానందపఱచుటయే యుద్ధృతమునకంటె నుచితమగు పని. రచనాచమ త్కారమునను గూర్పుబింకమునను అనిరుద్ధచరిత్రముకంటె నీకవిరాజమనోరంజనము బ్రశంసాపాత్రముగ నున్నది.

చిరకాలముక్రింద చింతామణిముద్రణాలయమున నీగ్రంథము ముద్రితమైనది. అందు ముద్రణస్ఖాలిత్యములు కలవు. ప్రతులు చిక్కుటయే అసాధ్యముగ నుండెను. ఆంధ్రజనాదరపాత్రమగు నీగ్రంథరాజమునకుఁ గలప్రశస్తి గమనించి సర్వాంగసుందరముగ ముద్రించి ఆంధ్రలోకమునకు సమర్పించిన శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారి యత్నము ప్రశంసనీయము.

ఇట్లు, భాషాసేవకులు,

శేషాద్రిరమణకవులు

శతావధానులు