కవిరాజమనోరంజనము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము



భోజసుతాచారుకు
చాభోగవిలగ్నతారహారాంకితవ
క్షోభాగభోగమోక్ష
శ్రీభూరికటాక్షలీల శ్రీగోపాలా.

1


వ.

అవధరింపుము. సమస్తసద్గుణసాంద్రులగు శౌనకాదిమునీంద్రులకు సామోదహృదయజల
జాతుండై సూతుం డిట్లనియె. న ట్లమ్మునిచంద్రుండు సురేంద్రున కి ట్లనియె.

2

చంద్రునివృత్తాంతము

సీ.

మదనసంహరుజటామకుటాగ్రసీమ నుద్దీపితంబైన వజ్రోపలంబు
బృందారకులకుఁ దృప్తిగ విందు లిడుసుధారసపూరితాక్షయరజతపాత్ర
యలఘుపుష్కరపుష్కరాకరాంతర్విహారప్రౌఢి జెలువొందురాజహంస
మబ్జగర్భాండగేహమున నుత్కృష్టకాంతి వెలుంగుకర్పూరదీపకళిక


తే.

దక్షకన్యామనోజసంతాపభరము, నెయ్యమునఁ జల్లఁజేయుపన్నీటికొలకు
శౌరిడాకంటివెలిదమ్మి తోరమైన, చలువచాయలగుంపు నిశాకరుండు.

3


క.

చదువఁగవచ్చు బృహస్పతి, సదనమున కనారతంబు సౌందర్యగుణా
స్పదనిజరూపవిలాసము, హృదయంబులఁ జూపఱులకు నింపొదవింపన్.

4


మ.

తళుకుంజెక్కులరత్నకుండలసముద్యత్కాంతి రంజిల్ల ను
జ్జ్వలముక్తామణిమాలికావళులు వక్షస్సీమఁ బొల్పార ని
ర్మలసౌరభ్యపటీరచర్చ సుకుమారంబైన నెమ్మేనఁ బెం
పలరన్ వచ్చుసుధాంశుఁ జూచి గురుఁ డత్యానందముం బొందుచున్.

5


వ.

విద్యోపదేశంబు సేయుచుండె నాసమయంబున.

6


తే.

ఆగురుదార రూపరేఖాత్యుదార, చారుకుచభార శృంగారతారహార
సుగుణవిస్తార పదనఖసురుచివిజిత, తార మోహిని యపరావతార తార.

7

క.

జీవునకు జీవమై తగు, జీవనజాతాక్షి బంధుజీవాధర దా
జీవంజీవంబునకును, జీవన మగుచంద్రకళవిశేషము దోఁపన్.

8


ఉ.

చంద్రరజంబు సైకతముఁ జల్లుచుఁ గాముశరాళిఁ బూర్ణిమా
చంద్రుని సానఁబట్టి దిగజాఱిన రాపొడి దివ్యవాసనా
సాంద్రసురప్రసూనరససారమున న్మిళితంబు చేసి ని
స్తంద్రతఁ జేసెఁ గావలయుఁ దారబయోజభవుండు నేర్సునన్.

9


సీ.

సారంగమదహారి సంపన్నత వహించు ఘరసారసచ్ఛాయఁ గడురహించు
సారంగమదహారి సంపన్నత వహించు ఘనసారసచ్ఛాయఁ గడురహించు
సారంగమదహారి సంపన్నత వహించు ఘనసారసచ్ఛాయఁ గడురహించు
సారంగమదహారి సంపన్నత వహించు ఘనసారసచ్ఛాయఁ గడురహించు


తే.

బాలికామణి తనుమధ్య నీలచికుర, చారుదీర్ఘవిలోచన సరసహసన
తరుణమోహనమూర్తి సౌందర్యవదన, నవ్యసౌరభసురుచిరనఖరలీల.

10


మ.

అలులం గొప్పు నెపంబునన్ మృదువచోవ్యాజంబున న్ముద్దుజి
ల్కల నెత్తావుల సింగిణిన్ బొమల యాకారంబునం బూవుము
ల్కుల దృగ్భావమునన్ వహించి జిగి చెక్కుందోయి నక్రాంగరే
ఖలతో నొప్పులతాంగిమూర్తి విలసత్కందర్పశాక్తస్థితిన్.

11


క.

ఆయిందువదన సుమన, స్సాయకశారీరవిభవజయసౌందర్య
శ్రీయుక్తమూర్తి రజనీ, నాయకు వీక్షించె వికచనయనోత్పలయై.

12


సీ.

పలుచనిచూపునఁ బరిపాటిగాఁ జూచు నల్లాకుఁజూపునఁ నదటిచూచు
నరగంటిచూపున నలసరీతిని జూచు మఱుపెట్టుచూపున మరలిచూచు
నొడలెల్లఁ జూపుగాఁ గడునబ్రపడి చూచు సొగయ నొయ్యారంపుఁజూడ్కిఁ జూచు
భయమింత లేక తప్పనిచూపుచేఁ జూచుఁ జూచిచూడనియట్టిచూడ్కిఁ జూచు


తే.

సొలపువలపునుఁ దిలకించుచూడ్కిఁ జూచు, నాటుజూపున మరులుకొనంగఁ జూచు
దార తారామనోహరు దశవిధావ, లోకనంబుల మోహవిలోల యగుచు.

13


ఉ.

చక్కనిమోము చూచి సరసంపుఁ గనుంగవఁ జూచి నిద్దపుం
జెక్కులు చూచి కెంపువగఁ జెల్వగు వాతెఱ చూచి కాంతిఁ బెం
పెక్కినమేనుఁ జూచి గురునింతి మనోహరగాత్రి తార యా
చుక్కలఱేనికిన్ వలచి సొక్కి మనోభవబాణభిన్నయై.

14

సీ.

లేని ప్రయోజనం బైనఁ గల్పించుక పలుమాఱుఁ దత్సమీపమునఁ దిరుగు
వలరాజుచిల్కుముల్కులవంటిచూపుల ననువుగా మర్మము ల్నాటఁజూచు
నుచితక్రమంబునఁ గుచకచాద్యవయవసౌభాగ్యములు ప్రకాశంబు చేయు
సమయమైనప్పుడు సారస్యముగ నర్మగర్భంబులైన వాక్యములు పలుకు


తే.

నతఁడు తనమోము చూచినయపుడు దీన, వదనయై సోష్మదీర్ఘనిశ్వాసవశతఁ
దనమనోవ్యధ యతనిచిత్తమున కెఱుక, పఱుచు నాకాంత విరహవిభ్రాంత యగుచు.

15


తే.

ప్రాణహానిఁ దలంపరు పాప మనుచు, నెంచ రపకీర్తి యని చూడ రిందుముఖులు
వలపుగలచోట నెట్లైనఁ గలయఁజూతు, రెంతసాహసు లహహ సీమంతవతులు.

16


తే

అనుదినము నిట్లు హావభావాదిచేష్టి, తములు మోహింపఁగాఁ జేసెఁ దార విధునిఁ
బురుషుమన సెంత దృఢమైనఁ బువ్వుఁబోఁడి, వికృతి పైకొన్న సెగపొంతవెన్న గాదె.

17


వ.

ఇవ్విధంబున.

18


సీ.

హరినీలము మించి యరిలీల వెలయించి వేణియు శ్రోణియు వింతదనర
విరి నిరాకృతిఁ జేసి కరికరాకృతి డాసి యొడలును దొడలును నొప్పుమీఱ
నగజాతములఁ గేరి మృగపోతముల మీఱి చన్నులుఁ గన్నులుఁ జెన్ను మిగుల
వరకుందములఁ బోలి యరవిందముల నేలి రదములుఁ బదములు రహి వహింప


తే.

గురుని భవనంబునందు సుందరి మనోజ, విమలఘంటారవాయతవిమలకనక
చరణమంజీరపుంజసింజానినాద, యగుచు నిట్లు మెలంగఁ బద్మాహితుండు.

19


క.

పాపపరాఙ్ముఖతామతి, దీపాంకుర మన్నెలంతదీర్ఘశ్వసితా
టోపమరుద్ధతి నడఁగినఁ, బ్రాపితమోహాంధకారబంధురుఁ డయ్యెన్.

20


సీ.

లలనానితంబమండలముపై నుత్పలదళములు రచియింపఁ దలఁచుఁగాని
తరుణికెమ్మోవిమీదఁ బ్రవాళమణిసొంపు గులుకఁగా ఘటియింపఁ దలఁచుఁ గాని
జలజాక్షి కుచకుంభములమీఁదఁ శశకప్లుతంబు దా నొనరింపఁ దలఁచుఁగాని
మృగరాజమధ్య నెమ్మేను లతావేష్టితంబునఁ బెనగొనఁ దలఁచుఁగాని


తే.

తలఁపఁ డెప్పుడు గురువని తాసమాగ, మాగతాత్యుష్ణదురితదవానలంబు
దుస్సహం బని కటకటా తొగలఱేఁడు, కలుగదుగదా వివేకంబు కాముకులకు.

21


సీ.

తా సుధానిధి యయ్యుఁ దరుణికెమ్మోవిసుధారసంబునకు నోరూరుచుండుఁ
దాఁ జంద్రికాసాంద్రతనుఁ డయ్యుఁ గుసుమకోమలిదరస్మితచంద్రికలకుఁ జొక్కుఁ
దాఁ గళానిధి యయ్యుఁ దరళాయతాక్షికళావిశేషమున కుల్లాసమొందుఁ
దా మృగాంకమనోజ్ఞతనుఁ డయ్యు నలివేణిలోచనమృగదీప్తిఁ జూచి సొగయు

తే.

నహహ యీయద్భుతమున కేమనఁగవచ్చు, సకలజనరంజనుండైన చంద్రునకును
జంద్రుఁడై చాలహృదయరంజన మొనర్చె, సుందరీమణివదనారవింద మపుడు.

22


తే.

తనకలిమిలేములను సర్వజనుల కుభయ, పర్వములఁ దెల్పుశశికి నప్పద్మనయన
యభిముఖంబైనఁ బున్నమ యగుచుఁ దోఁచు, ననభిముఖ్యమైన నమవస యగుచుఁ దోచు.

23


ఉ.

జక్కువలిక్కువ న్ఘనకుచస్తబకంబులపేరఁ జీఁకటుల్
చక్కనికొప్పుపేర జలజంబులు కన్నులపేర నెచ్చెలిం
దక్కక యాశ్రయించి పరితాపపరంపరపాలుఁ జేసి నా
చుక్కలఱేనిఁ దీర్చుకొనఁజూచి సుమీ తమపూర్వవైరముల్.

24


తే.

ఆసుధాధామునకు విదాహంబు గొలుపు, నాహిమాంశునిఁ బరితాప మందఁజేయు
నాకళానిధిఁ ద్రోచు మోహాంధకార, మున నొరుల నెంత చేయఁడు మనసిజుండు.

25


చ.

చదువు వివేకమూలమని సద్గురుసన్నిధి వేదశాస్త్రముల్
చదువఁగ వచ్చినట్టి యలచంద్రునకుం గురుపత్నిపొందు క
ష్టదశ ఘటింపఁజేసె నకటా యిఁక నేమనవచ్చు దైవమున్
మది నిది పుణ్యమౌ నని యొనర్పఁగఁ బాపము వచ్చు టేమొకో.

26


వ.

అని జనం బెంచుచుండఁ జంద్రుండు.

27


క.

దోషాకరుండుఁ దారా, శ్లేషసుఖాన్వితుఁడుఁ గాన శీతాంశుఁడు దా
దోషాకరుండుఁ దారా, శ్లేషసుఖాన్వితుఁడు నయ్యె సితగజగమనా.

28


సీ.

బొమ ముడివెట్టుమాత్రమె కాని ప్రియుఁడు పాలిం డ్లొత్తిపట్టుట కిచ్చగించుఁ
గసరుమాత్రమె కాని కాంతుఁ డాయము లెత్తి వెసఁబల్కుట కపేక్ష వీను లొగ్గు
కొంగు పైనిడుకోఁ బెనంగుమాత్రమెకాని విటుఁడు గోప్యములు జూచుటకుఁ గోరు
సీత్కృతు ల్వెడవెడఁ జేయుమాత్రమె కాని పతిమోవినొక్కుసంగతికి నలరు


తే.

సొలయు మాత్రమే కాని నెచ్చెలిమికాఁడు, కఠినరతి సల్పుటకు సముత్కంఠ దాల్చుఁ
బులకహర్షాశ్రుసుఖజలోద్భూతగరినుఁ, దనవలపు జారునకుఁ దెల్పుఁ దరుణి యపుడు.

29


వ.

ఇత్తెఱంగున.

30


క.

అన్యోన్యమోహవిభమ, సన్యస్తవివేకు లగుచు శశలాంఛనుఁడుం
గన్యామణియును గోర్కులు, ధన్యత నొందంగఁ గలసి తమి చిగురొత్తన్.

31


ఉ.

కొన్నిదినంబు లిక్కరణి గోప్యముగా విహరించుచుండి య
య్యన్నుపయిం బ్రియంబు హృదయంబున నగ్గలమైనఁ జంద్రుఁ డిం

తి న్నిజమందిరంబునకుఁ దెచ్చుక నిర్భయకేలిలోలుఁడై
యున్నయెడన్ బృహస్పతి వియోగవిచారవిషాదమగ్నుఁ డై.

32


సీ.

సకియకౌనుఁ దలంచి సన్మార్గ మనుగాని యింతిదుర్మార్గత యెంచఁడయ్యెఁ
జెలువచన్గవఁ దలంచి సువృత్త మనుఁగాని తరుణికువృత్తంబుఁ దలఁపఁడయ్యె
నతివమోముఁ దలంచి యకలంక మనుఁగాని తెఱవకలంకంబు దెలియఁడయ్యె
సుదతినవ్వుఁ దలంచి శుచి యనుఁగాని యవ్వెలఁదుకయశుచి భావింపఁడయ్యె


తే.

గురునివంటిమహాత్ముఁ డిక్కరణిఁ దరుణి, చక్కఁదనమే గుణంబుగ సంస్మరించుఁ
గాని వ్యభిచారదోషంబుఁ గాంచఁడయ్యె, నజ్ఞుఁ డనఁ బ్రాజ్ఞుఁ డన నెవ్వఁ డవని నింక.

33


తే.

అమృతమయుఁ డౌట శశి పవిత్రాంగు డనియొ, తనమహిమ దారదోషంబు దలఁగుననియొ
యమరగురుఁ డింతి విడువలేఁడయ్యెఁ గాక, పెనిమిటికి నేల కడలుత్రొక్కినలతాంగి.

34


వ.

ఇవ్విధంబున.

35


క.

ఏపొద్దు ఖేదమున సం, తాపించుచునుండె నతఁడు ధరలో భార్యా
రూపవతీ శత్రువని క, దా పెద్దలు పల్కి రేల తప్పు నటంచున్.

36


ఆ.

సుదతి వ్రతము చెడిన సుఖము దక్కఁగవలె, నన్నమాటఁ దలంచుకొన్నదేమొ
కాఁపురంబు చేసెఁ గలికి ముచ్చటఁదీఱ, మగని విడిచి తేరమగనియింట.

37


వ.

అంత.

38


మ.

రతిబంధప్రతిబంధకం బురుపరీరంభక్రియాస్తంభనం
బతిహేలామణితాంతరాయము నిజప్రాణేశకేళీజిదా
యతమీనధ్వజయుద్ధతంత్రపటుతాహంకారశంకాంకురం
బతులస్ఫూర్తి నెసంగె గర్భము నవవ్యాకోచపద్మాక్షికిన్.

39


ఉ.

వీడనిప్రేమలం గలియు వేఁకటివ్రేఁగుట లంతికూటముల్
వేడుకకు న్వినోద మొదవింపఁగ నయ్యువనాథుతో హిత
క్రీడ మెలంగుచుండ నరిగె న్నవమాసము లంతమీఁద న
చ్చేడియ గాంచె నందను నశేషవిశేషగుణాంబుధిన్ బుధున్.

40


వ.

అబ్బాలకుండు సుధాధాముధామంబునం బెరుఁగుచుండ నపుడు.

41


తే.

చంద్రునకు బుద్ధిచెప్పి వాచస్పతికిని, దార నిప్పించితిరి గాదె మీరు మరల
నింతవృత్తాంతమును నీవు నెఱుఁగు దైన, సరణిఁ బలుకంగవలసెఁ బ్రసంగవశత.

42


క.

ఈరీతిఁ దారకును గమ, లారికి జన్మించినట్టి యాబుధునకు శృం
గారవతి కిలాకన్యకు, సారమతి పురూరవుండు సంభవమయ్యెన్.

43

వ.

తత్ప్రకారంబు వివరించెద నాకర్ణింపుము.

44

బుధునిచరిత్రము

తే.

జలజబాంధవవంశవిస్తారకుండు, మహితకీర్తి వైవస్వతమనువు సకల
ధారుణీమండలాధిపత్యమునఁ దనరు, చుండి సంతానకాంక్షచే నొక్కనాఁడు.

45


ఉ.

రాజికరత్నకాంచనతురంగమతంగజధేనుదాసదా
సీజనదివ్యమందిరవిచిత్రదుకూలవిలాసభాసురాం
భోజముభీముఖోజ్జ్వలవిభూతి నెసంగుట నిష్ఫలంబుగా
దే జగతిం దనూభవవిహీనత నొందినయట్టివానికిన్.

46


చ.

తొకతొకమాటలు న్నొసలఁ దుంపెసలాడెడు నుంగరంపువెం
డ్రుకలును మద్దికాయలు గడుంగదులాడగ ముద్దుగారు పొం
దిక జిగిపాలబుగ్గలను దేలికచూపులుఁ గోమలంపుటం
గకములు గల్గి యింపొదవుఁగా సుతుబాల్యము తండ్రి కెంతయున్.

47


సీ.

కాంతాకుచద్వయీకాఠిన్యసంపద వెలితియయ్యును వేడ్క విస్తరిల్లు
వినుతాంగియవలగ్నతనుతావిలాసంబు కొదవయయ్యు ముదంబు కొనలు సాగుఁ
గలకంఠకంఠిచెక్కులనిండుతేటలు పలుచనయ్యును గుతూహల మెసంగు
మృగనేత్రతనులతజిగిబిగిసొగసు తక్కు వయయ్యుఁ బ్రమదంబు కొమరుమిగులు


తే.

యౌవనోన్మాదజనితచేష్టావికార, కలితలలితవతీరతికౌశలంబు
పెంపు దఱిఁగియు ఘటియించు నింపుమిగులఁ, బురుషునకుఁ బుత్రలాభంబె పరమహితము.

48


క.

అని తలఁచి కులగురుం డగు, ననుపమగుణనిధి వసిష్ఠుఁ బ్రార్థించి యతం
డనుమతి సేయఁగఁ బుత్రునిఁ, గనుటకు నై యధ్వరంబుఁ గావించెఁ దగన్.

49


సీ.

సవనక్రియోచితసకలవస్తుసమృద్ధిఁ గావించి భువనవిఖ్యాతదాన
మహిమఁ జెల్లుచు నుండి మంత్రతంత్రకలాపపరిశుద్ధి నమరు విప్రవ్రజంబు
గూర్చి దీప్తానలకుండంబులోపల హోమంబు చేయుచు నున్నవేళ
నమ్మనుభామిని యైన శ్రద్ధాదేవి కూఁతురు గలుగంగఁ గోర్కి వొడమ


తే.

హోత నధ్వర్యుఁ బ్రార్థించి యువిద గలుగఁ, జేయుఁడనియె నిజేశు వంచించి యపుడు
బుద్ధిహీనలు సతులని పుడమిలోన, జనులు పల్కెడుమాట నిశ్చయము గాఁగ.

50


క.

ఆతలిరుఁబోఁడి కోరిన, రీతిని సంకల్పవైపరీత్య మొదవినన్
హోతపెడచేతఁ బుట్టెను, నాతి యిలాకన్య యనఁగ నవమోహినియై.

51

చ.

పొడమినయింతిఁ జూచి వగఁ బొందుచు భానుతనూజుఁ డక్కటా
కొడు కుదయించు నంచు మదిఁగోరి మఖంబొనరించుచున్నచోఁ
దడఁబడి యాఁడుబిడ్డ యుదితంబగుటెట్లొకొ దైవయత్నమున్
గడవవశంబె మానుషికకార్యము నిష్ఫల మెన్నిచూచినన్.

52


మ.

అని చింతించి వసిష్ఠుఁ జేరఁజని సమ్యగ్భక్తితో మ్రొక్కి యి
ట్లనియె సూనృతవాక్యశీలు రగు మీయాజ్ఞన్ మఖం బేను బు
త్రుని వాంఛించి యొనర్చుచున్నయెడ నేదోషంబునం జేసి యో
జననంబందెఁ గొమార్తె యోర్తు హృదయోత్సాహంబు భంగంబుగన్.

53


తే.

కులము వర్ధిల్లుఁ దల్లిదండ్రులకు సుఖము, కలుగు నిహపరములయందు గణనవచ్చు
బంధువులలోన సత్పుత్రు బడయు టొప్పుఁ, గాక ఫలమేమి కూఁతును గనుటవలన.

54


చ.

అనవుడు సంయమిప్రవరుఁ డవ్విధమంతయు యోగదృష్టిచే
మనమునఁ గాంచి హంసకులమండనుతో భవదీయపత్ని గో
రిన నొనరించె హోత విపరీతవిధంబున హోమమంత్ర మం
గన జనియింప నిట్టియవకార్యము చేసిరి బుద్ధిహీనులై.

55


క.

దైవాధీనము లోకము, దైవ మధీనంబు మంత్రతంత్రములకు భూ
దేవాధీనము మంత్రము, కావున సంకల్పవిషమగతి నిట్లయ్యెన్.

56


క.

ఐనం దగిన ప్రయత్నం, బే నొనరించెద విచార మేటికి నిజభ
క్తానందకరుఁడు పరమద, యానిధి విష్ణుండు గలుగ ననఘచరిత్రా.

57


తే.

అనుచు నారాజశేఖరు ననునయించి, యతఁడు నియమవ్రతంబుతో నఖిలభువన
కర్తఁ బరమాత్ము నాశ్రితకల్పతరువు, విష్ణు నారాధనము చేసి విమలభక్తి.

58


వ.

ఇ ట్లని వినుతించె.

59

వసిష్ఠుఁడు విష్ణుని స్తుతించుట

పంచచామరములు

1.

తరణ్యుదగ్రదీప్తిమత్సుదర్శనం సుదర్శనం
సరాగచారుమాధురీరసాధరం రసాధరం
వరాప్తతాచరన్మనోభవచ్ఛిదం భవచ్ఛిదం
హరిం వ్యతీతపద్మగర్భజామితం భజామి తమ్.

60


2.

కరస్ఫురద్దరస్వరప్రకంపమానదిక్తటం
ధరాధరాధరాస్థితప్రథానకూర్మరూపకం

చరాచరాకరా తతప్రశస్తకుక్షిశోభితం
నిరంతరం దురంతశక్తినిస్తులం ప్రభుం భజే.

61


3.

చలత్ప్రదీప్తకుండలం లసత్కపోలమండలం
కళావిలాసమోహనం ఖగప్రకాండవాహనం
మిళిందసుందరాలకం యమిప్రతానపాలకం
బలారివైరిమర్దనం ప్రభావయే జనార్దనమ్.

62


4.

ఉమాసమానవాక్యసన్నుతోరుదివ్యనామకం
సమానమాధురీధురీణసంస్కృతాంధ్రవర్ణితం
క్షమాసమాదృతాపరాధజాలక న్నిజాశ్రితం
రమాసమాగమప్రియాంతరంగ మచ్యుతం భజే.

63


5.

రణత్తరంగమాలికాస్ఫురత్తరంగిణీడ్యస
త్ఫణామణిచ్ఛటాఘృణిప్రభాసమానభూమిభృ
ద్ఫణీంద్రభోగతల్పభాగభాక్ఛయానదివ్యభూ
షణప్రకాశవిగ్రహం భజామి సాధ్వనుగ్రహమ్.

64


వ.

అని.

65


క.

ఈరీతి నవ్వసిష్ఠుఁడు, సారమతిం బంచపంచచామరవృత్తో
దారస్తుతి గావించిన, నారాయణమూర్తి శ్రితజనప్రియుఁ డగుటన్.

66


సీ.

పదివేలసూర్యబింబము లొక్కప్రోవైనకరణి నుత్కృష్టప్రకాశ మెసఁగ
శృంగారరసము మూర్తీభవించినలీల ఘనలీల సుందరాంగము వెలుంగ
నిందుషోడశకళ లేకోత్తరాభివృద్ధి నెసంగె నన మోము తెలివిమీఱ
సౌదామినీలతాచ్ఛవినిచ్చలంబైన వడువున జాళువావలువ మెఱయఁ


తే.

బాంచజన్యసుదర్శనప్రముఖదివ్య, సాధనంబులు మరకతస్తంభవిజయ
బాహువులుఁ బూని పతగేంద్రవాహుఁ డగుచు, నాదినారాయణుండు ప్రత్యక్షమయ్యె.

67


ఉ.

ఆహరిమందహాసవదనామృతదీధితిబింబవర్శనో
త్సాహతఁ బొంగు హర్షరససారసముద్రపయస్తరంగసం
దోహమిన న్జనించి పయిఁదోఁచిన బుద్బుదపుంజమో యనన్
దేహము నిండె సంచితగతం బులకాంకురపాళి మౌనికిన్.

68


వ.

అప్పుడు.

69

శా.

ఆనందాశ్రులు కన్నులం దొరుఁగ సాష్టాంగంబుగా మ్రొక్కి వా
చానైపుణ్య మెలర్పఁగా నుపనిషత్సారస్తుతుల్ చేసి యిం
పూనం బల్కె వివస్వదాత్మజుఁడు పుత్రోత్పాదనార్థంబు య
జ్ఞానుస్థాన మొనర్పఁ గూఁతు రుదయంబయ్యె న్వికల్పంబుగన్.

70


క.

మనువునకుఁ బుత్రదానం, బనుగ్రహింపంగ వలయు నని ప్రార్థింపన్
విని యక్కూఁతురు కొడుకౌ, నని యానతి యొసఁగి యరిగె నంతర్హితుఁడై.

71


వ.

అప్పుడు.

72

ఇలాకన్య పురుషుఁ డగుట

సీ.

కొదమలేళ్ళకు సిగ్గుగొలుపువాల్గన్నులు తరుణారుణాబ్జసుందరము లయ్యెఁ
గరికుంభకుచమనోహర మైనయురము నిర్మలకాంచనకవాటరమ్య మయ్యె
మువ్వంపుఁదీఁగెల నవ్వుచేతులు మత్తమతంగశుండాసమంబు లయ్యె
మధుమాసపికరవమధురకంఠము మేఘగంభీరనిస్వనకలిత మయ్యెఁ


తే.

బొదవు లజ్జాభయంబుల నొదుఁగుమనసు, ధైర్యశౌర్యనిరంకుశత్వము వహించె
నయ్యిలాకన్యకును నీశ్వరాజ్ఞవలన ప్రాప్తమయ్యెను బౌరుషభావ మపుడు.

73


తే.

కోమలశ్మశ్రురేఖాభిరామమైన, యక్కుమారునివదన మాహ్లాద మొసఁగె
సకలజనలోచనోత్పలషండమునకు, లక్ష్మియుతపూర్ణశశిమండలంబు కరణి.

74


శా.

దాసత్వంబు తొలంగి మండలపతిత్వం బబ్బినం బ్రాపితో
ల్లాసోత్కర్షతఁ బొంగుమానవునిలీలన్ భామినీరూపస
న్యాసంబై పురుషత్వ మబ్బినఁ బ్రభుత్వాహంకృతిం బొల్చు శో
భాసౌందర్యవిచిత్రుఁబుత్రుఁ గని సాఫల్యాత్మసంకల్పుడై.

75


వ.

వైవస్వతుండు వసిష్టానుమతంబున నక్కుమారునకు సుద్యుమ్నుం డని నామనం
బిడి విద్యాపారంగతుం గావించె నంత.

76


చ.

కరితురగాధిరోహణము కార్ముకబాణకృపాణచక్రతో
మరముసలాదిసాధనసమాజపరిశ్రమమున్ వసుంధరా
భరణరణప్రవీణత యుపాయచతుష్కనిరూఢి యాదిగాఁ
బరిచితమయ్యె సర్వము నృపాలకుమారునకుం గ్రమంబునన్.

77


క.

అంతట నొకనాఁ డాక్ష్మా, కాంతతనూభవుఁడు వేఁటకాండ్రును దానుం
గాంతారభాగములకుం, బంతంబున వేఁటఁబోవఁ బయనం బయ్యెన్.

78

ఉ.

రంగమరంగ వెన్నెల తరంగములై తనుకాంతి నిగ్గుతే
రంగ జవంబుచే జితకురంగమనంగ నభంగభేరికా
రంగదురుస్వనంబు దనరంగ గుణోన్నతి నశ్వశాస్త్రపా
రంగతహృద్యమౌ నొకతురంగము భూషితచాతురంగమున్.

79


ఉ.

కనకఖిలీనముం బసిమిగ్రమ్మెడు పచ్చలహేమపట్టమున్
ఘనమగుజాతికెంపులచ కాటపుబల్లము మౌక్తికావళిం
దనరెడుకంఠమాలిక లుదంచికవజ్రమయావతంస మిం
పొనర నలంకరించి తనయొద్దకు దెచ్చిన నెక్కె నశ్వమున్.

80


తే.

బొమిడికంబులు వెట్టి జోళ్లమరఁ దాల్చి, చల్లడంబులు దొడిగి కాసలు బిగించి
జముదళంబులు చెక్కి బల్లెములు పూని, వెడలి రప్పుడు పెక్కండ్రు వేఁటకాండ్రు.

81


చ.

దెసమొలవేల్పుసాహిణపుతేజులు పోషకగేహరక్షకుల్
విసువనికమ్మకట్టు మఱి వింతజనంబుల బీతుగొల్పుక
క్కసమగురక్కసుల్ వనమృగంబులపాలిటి మృత్యురూపముల్
వెసఁ జనుదెంచె నత్తఱిని వేఁటకు గాటపుసారమేయముల్.

82


సీ.

అల దుర్గ యెక్కిరింతల వెక్కిరింతలాడెడురీతి నాలుకల్ వెడలఁజాఁచు
నిఱ్ఱిగుఱ్ఱపురౌతు నెక్కసక్కెములాడుగతి వాలవిక్షేపకలనఁ దాల్చుఁ
దొడరి కొండల నెత్తి యడవఁబూనెడు మాడ్కిఁ బదరి చివ్వునఁ బూర్వపదము లెత్తు
గర్జితంబులసారె భర్జించుకైవడి మొఱుగునార్భటముగా మోరలెత్తు


తే.

బలిమి కలిమిని జనము సంపదను దిట్ట, తనము పెంపున దారుణధ్వనినిరూఢి
జాగిలంబులు మృగయు లచ్చంపుఁబసిఁడి, పట్టెడలఁ బట్టి వెడలించునట్టియెడను.

83


సీ.

ధర నల్పులకుఁ బ్రభుత్వంబు వచ్చిన మనుష్యులవికారపుఁజూడ్కిఁ జూచినట్లు
పల్లవుల్ తుదిలేమిపడి యింటిచాయరా మొగిలంజెతల్లులు మూల్గినట్లు
పరదేశి యతిలోభపరునియింటికిఁ బోవఁ దెగి కోఁతివలెను గద్దించినట్లు
వంతువాసికి హీనవైశ్యులు దమలోన సేకంబుగాఁ గలహించినట్లు


తే.

తెరలి యొరుఁడొక్కటి నిరూక్షదృష్టిఁ జూచు, గొఱగొఱను మూల్గు గద్దించుఁ దఱిమి తఱిమి
కవిసి కలహించు భౌకృతికలకలముగ, జాగిలమ్ములు రోషభీషణము లగుచు.

84


తే.

బెబ్బులి తుపాకి సుడిగాలి పిడుగుతునుక, భూతనాథుండు గడిపోతు పోతురాజు
గండగొడ్డలి దొంగలమిండగీఁడు, మొదలుగాఁ బేరుగల వేపు లుదుటనడచె.

85


వ.

ఇట్లు చనిచని.

86

క.

ఒకగహనము జనసంచా, రకగహనము నగురుధూమరచితసురభిదా
వకదహనము సింహకుటుం, బకవహనముఁ గనిరి వారు పటుతరలీలన్.

87


క.

కని చేరంబోవుచు న, జ్జననాథకుమారుతోడ సమయోచితవా
క్యనయప్రసంగములచే, ననుమోదం బొదవ లుబ్ధకావళి పలికెన్.

88


క.

కొద్దిమెకాలకుఁ బోదా, పెద్దపులిం గఱచి చంపుఁ బిడుగువలెను బై
నుద్దవిడి దుమికి యిదిమా, గద్దరిజాగిలము దీనిఁ గనుఁగొనుము నృపా.

89


క.

ఇది గాలి వేసి మెక మే, పొదలోపల నెంతదూరమున నున్నను దా
వెదకి పసివట్టి పోవును, గోదగొని పోనీక పట్టుకొని చంపుఁజుమీ.

90


క.

దాడిమెయి దీనివెంబడిఁ, గూడం బెఱజాగిలములకుం దరమే యీ
జోడంగివేపిముందర, లేడియుఁ గీడియు జనంగ లేదడుగైనన్.

91


వ.

అని మఱియు బహువిధముల మృగవ్యక్రీడానుగుణభాషణములు పలుకుచుండ
నప్పుడు.

92


తే.

వనమృగంబుల పొలకువ గనుటఁ దెలిపె, వేటకాండ్రకుఁ గుర్కురవితతి యపుడు
పట్టఁబట్టంగ నిలువక బలిమినిగ్గు, లాడి యెగురుచుఁ దమకించుజాడవలన.

93


మ.

మృగయుల్ పట్టెడ లూడ్చినన్ భషకముల్ మృత్యుప్రయోగోజ్జ్వలా
రుగసంఘాతముకైవడిన్ వనమృగస్తోమంబుపై వాయువే
గగతిన్ ఱివ్వునఁ దూఁగి పైనుఱికె వీఁకన్ విస్ఫుటీభూతవ
క్రగుహాద్వారకనత్కరాళఖరదంష్ట్రాగ్రాహకోత్సాహతన్.

94


తే.

పర్వతమువంటియొకకొమ్ముపందిమీఁద, నుఱికి యొకజాగిలము చెవి యొడిసిపట్టి
యదియుఁ దన చాయఁ దిరుగఁ దానట్ల తిరిగి, లంకెవెట్టినకైవడి శంక లేక.

95


తే.

తోరె నలపందినలపంది తూలిపడఁగ, నొక్కబలువేపి యదియట్టు లుండనిమ్ము
పులిపులిని దప్పకుండంగఁ బులిపులిగను, దఱిమె నొకజాగిలం బది యరుదుగాదె.

96


చ.

తిరుగుము పోకు సీయనుచుఁ దెంపునఁ బల్కినవానిమీఁద సూ
కరము గిఱుక్కున న్మరలె గ్రక్కునవాఁడును బందిపోటుచే
నఱిముఱిఁ గ్రుమ్మిపట్టె నెదనట్లును నిల్వక నిక్కి పైకిరా
నరుదుగఁ జేర్చె నొక్కశిల యాఁపున బల్లెపుఁగఱ్ఱ వాఁడిలన్.

97


ఉ.

స్రుక్కక దిండుగా వలువచుట్టినవామకరంబు నోటికిం
గ్రక్కున నిచ్చి పై నెగురఁగా నలబెబ్బులి తెల్లచంకలో

నక్కుడిచేకటారి పరుఁజంటఁగ నుక్కునఁ గ్రుమ్మి గుండియల్
వ్రక్కలువాపి త్రోఁచి పడవైచె నొకం డతఁ డెట్టిశూరుఁడో!

98


తే.

ఒక్కవిలుకానిగాఢప్రయోగమునను, దానికుంభప్రగుప్తముక్తాఫలములు
మార్గణావలిపాలయ్యె మార్గణాళి, పాలుసేయక దాని సొమ్మేల దాఁచు.

99


క.

ఈరీతి మృగవ్యవ్యస, నారంభము మానసముల నంతంతకు వి
స్తారముగ వేఁటలాడి రు, దారగతిన్ వేటకాండ్రు తద్విపినమునన్.

100


శా.

ఆసుద్యుమ్నకుమారమౌళియును నట్లావేళ మిత్రాళితో
నాసక్తిన్ మృగయావినోదమున ఘోరారణ్యభాగంబులం
దా సంచారము సేయుచుం గరికిరీంద్రవ్యాఘ్రసింహాదినా
నాసత్వంబుల నుగ్రబాణనిహతిన్ నాశంబు నొందించుచున్.

101


ఖరధారాశరభగ్నసింహశరభోగ్రవ్యాఘ్రకీలాలవీ
తరజఃపుంజవనావలిన్ శకలితోద్యద్భద్రదంతావళో
త్కరకుంభోదయమౌక్తికావళులు రంగద్రంగవల్ల్యాకృతిం
గరమొప్పన్ మృగయావినోదపరుఁడై గాంధర్వయానోద్ధతిన్.

102


వ.

చనిచని ముందఱ.

103


సీ.

దుర్గంబులై యుండు భర్గవిష్ణుపితామహపురంబు లేశిఖర్యగ్రమునను
సెలయేఱులై యుండు నలసుధారసస్సింధుజలపూర మేశిలోచ్చయముమీఁద
గహనంబులై యుండుఁ గల్పకసంతానహరిచందనాదు లేయద్రియందు
గండోపలంబులై యుండు మాణిక్యవైడూర్యాదిమణు లేయహార్యసీమ


తే.

నట్టిమేరుమహీంద్రంబు నహరహప్ర, దక్షిణప్రచరద్గ్రహతారకాక
దంబకప్రతిబింబవిడంబి తన్ని, తంబవింబపరిస్ఫురితంబుఁ గాంచి.

104


చ.

అమరులకెల్ల నిల్లు త్రిపురాంతకుచేనిలసిల్లువిల్లు లో
కములకుఁ బట్టుగొమ్మ మణికాంచనసంపదతావలమ్ము గ్రా
వములకుఁ జక్రవర్తి భగవత్కళయై తగుపుణ్యమూర్తి యీ
సమధికవర్ణనీయగుణచారువు మేరువటంచు నెంచుచున్.

105


వ.

తదీయవైభవంబున కద్భుతంబందుచుం జనిచని తత్పర్వతోపకంఠంబునందు.

106


సీ.

సురసాలసురసాలసురసాలఖేలంబు కాంచనకాంచనాభ్యంచితంబు
కేసరకేసరకేసరాస్తోకంబు ఘనసారఘనసారకదళియుతము

వంజులవంజులవంజులప్రథికంబు పాటలిపాటలిపరివృతంబు
మధురసామధురసామధురసారస్యంబు ఫలపూరఫలపూరబంధురంబు


తే.

దంతశఠదంతశఠవిచిత్రస్థలంబు, వీరతరువీరతరువారచారుతరము
వరసరశ్చయపూర్ణీభవత్సుధార, సౌరసకుమారవనము కుమారవనము.

107


ఉ.

కాంచి దృగంచలంబులు వికస్వరభాస్వరపుష్పపల్లవా
భ్యంచితసాలజాలములపై నెగఁ రాఁకఁగ నెమ్మదిం బ్రహ
ర్షించుచు నమ్మహాపపనసీమఁ జరింపఁదలంచి మించి రా
ణించు నిబద్ధరత్నధరణీసరణిం బటులీలఁ బోవుచున్.

108


ఉ.

ఏవనమైన దీనిసరియే గుఱియే మఱియెంచ నెంతయున్
బావన మంచితప్రసవబంధురగంధమిళిచ్ఛరత్కన
త్పావన మాశ్రితాన్యభృతబంభరకీరకపోతభోగిభు
క్సావన మీవనం బిది విహర్తకు జీవన మై యెసంగదే.

109


సీ.

దేవవల్లభనామధేయప్రసిద్ధినో యైరావతంబుపై నందగించె
బహులశాఖాంచితబ్రహ్మణ్య మగుటనో యొనరఁ గాయత్రీప్రయుక్త మయ్యె
గౌశికాభిఖ్యత గలుగుటనో శ్రేష్ఠసుమనోగణికఁ గూడి సొంపు మీఱె
హైమవతీసంజ్ఞ నమరుటనో మాధవీకృతసాంగత్యవృత్తి నెనసె


తే.

సానుగుణ్యంబులైన సమాగమముల, నలరె నిబ్భంగి నేతద్వనాగమంబు
లనుచుఁ జనుచుండి నిజవయస్యాళితోడఁ, బలికె నిట్లని మఱియు నృపాలసుతుఁడు.

110


తే.

స్యందనంబులు పున్నాగబృందములును, మావులును వీరతరు లగమ్యములు గలిగి
నలినమిత్రప్రకరముల కలవిగాక, తనరె వనసీమ యిది రాజధానివోలె.

111


తే.

కుసుమ మయ్యెనె వీనికిఁ గుసుమ మహహ, యీరసం బయ్యెనే వీని కీరసంబు
కాంచనము కాంచనమ్మగా నెంచుకొనవు, తలఁప మధుపంబులకు నెట్లు తెలివి కలుగు.

112


క.

కనుఁగొనుఁడు లతాంగీకృత, వినయాశ్లేషములఁ బొదలు విటపులు తగదే
కనుఁగొనఁగ లతాంగీకృత, వినయాశ్లేషములఁ బొదలు విటపులన వనిన్.

113


ఉ.

పొంకములై యెసంగె వనభూమిఁ గనుంగొనుఁ డూర్మికావళీ
కంకణభూషితంబులు వికస్వరహల్లకరాగరమ్యముల్
పంకజయుక్తముల్ సుకరభాంచితముల్ దరచక్రమత్స్యరే
ఖాంచితముల్ వినోదకమలాకరముల్ కమలాకరంబు లై.

114

సీ.

జటియయ్యుఁ గొమ్మలసంపర్క మొనరించె సౌబరిసన్నిధిఁ జదువుకొనెనొ
గురుజాతియయ్యుఁ జేకొనియెను విటాపాప్తి నిగమశర్మను జూచి నేర్చుకొనెనొ
బ్రాహ్మణియయ్యుఁ దాఁబల్లవలోలతఁ దాల్చె నహల్యను దలఁచుకొనెనొ
తరుణియయ్యును బ్రవృద్ధప్రియసుమనస్క యయ్యె సుకన్యలా గియ్యకొనెనొ


తే.

యగమ మయ్యును బహుపాదమయ్యె నిట్లు, శిఖరిపర్యమతం బభ్యసించెనొక్కొ
యనుచుఁ దత్తద్ద్రుమౌళిసహాయులకును, జూపెఁ జతురోక్తు లాడుచు భూపసుతుఁడు.

115


సీ.

కలకంఠములకంఠములఁ గుంఠదుత్కంఠ నొనరించు పంచమస్వనము నిగుడ
సమరందసుమబృందగమిళిందముల మందగతి నెసంగించు ఝంకరణ మొనర
గొరవంక లిరువంక మరువంకములశంకఁ బఠియించుగతి మ్రోయుపలుకు లెసఁగ
శుకకులాధికవిలాసకకలారవకలాపోక్తులు సరససంయుక్తి నెఱయఁ


తే.

గులుకుపలుకుల మెలఁకువ నలరుకలర, వముల రవములు చెలగంగ నెమిలిగములు
విమలగతిఁ గూయు నినదము లమర నివ్వ, నంబు చెలువొందు నానందనాదమయత.

116


క.

అని తనియని కోరిక న, వ్వనిఁ గొనియాడి నిజమిత్రవర్గంబులఁ దో
డ్కొని జనితనితాంతముదా, ప్తిని జనియె నిరంకుశోద్ధతి న్వనసీమన్.

117


వ.

ఇ ట్లతండు వనక్రీడావ్యసనంబున నచ్చటిమహిమ తెలియక యవ్వనంబు సొచ్చె
నాస్థలమాహాత్మ్యం బాకర్ణింపుము.

118

రాజకుమారుఁడు ఈశ్వరశాపమున సుందరి యౌట

మ.

ప్రమదారత్నము సర్వమంగళకళాప్రావీణ్య కన్యాళితోఁ
బ్రమదంబార భజింపఁగాఁ బ్రమథవర్గస్వామి దూరీకృత
ప్రమదాంధద్విపదైత్యబాహుబలసంరంభుండు శంభుండు త
త్ప్రమదారామమునం దృతీయపురుషార్థక్రీడలన్ లోలుఁడై.

119


ఉ.

ఆటలపాటల న్సుముఖుఁడై చరియించుటఁ జేసి యెవ్వ ర
చ్చోటికిఁ బోవ రాస్థలము చొచ్చినయంతనె యీశ్వరాజ్ఞచే
ఘోటికయయ్యె ఘోటకము కూడి చరించుచునున్న మానవుల్
జోటికలైరి తాను నొకసుందరి యయ్యె మహాద్భుతంబుగన్.

120


సీ.

సారంగముల నట్లు చంపిన పాపంబు తప్పునే కన్నులఁ గప్పుకొనక
సామజంబుల నట్లు సమయఁజూచినకర్మ మడఁగునె నడుపుల నంటుకొనక
గురుమెకంబుల నట్లు కూర్చినగీడు దాఁ దొలఁగునె శిరసుల దొట్టుకొనక
పంచాస్యముల నట్లు త్రుంచినదోషంబు పోవునే నడుములఁ దాపుకొనక

తే.

యకట! వనవాసులై దేశయాత్ర నడపు, కొనుమృగంబుల మృగయావ్యసనత హింస
చేసిన యఘంబు పొందె జేఁ జేతననఁగ, నధమమగునాఁడువగ వారి కమరె నపుడు.

121


సీ.

శ్మశ్రుకళంకదోషంబు నిశ్శేష మై ముఖచంద్రబింబము ముద్దుగులుక
వరవీరరసరజోభరణంబు హరణమై నేత్రాబ్దదవళిమ నివ్వటిల్ల
నుష్ణీషపేటికాయుక్తి విముక్తియై కచనీలమణిగణకాంతి దనర
జ్యాకిణాంకమిళిందసహితంబు రహితమై కరహల్లికచ్ఛాయ గడలుకొనగఁ


తే.

బటుతనుత్రాణశుక్త్యపవారణమున, వారణంబై శరీరలావణ్యమౌక్తి
కద్యుతి వెలుంగఁ బురుషలక్షణము లెడలి, యక్కుమారుండు నవమోహనాంగి యయ్యె.

122


శిఖరిణీవృత్తము.

ఇలాకాంతాకారం బెడలి మును దా నెట్టు లటుల
య్యిలాకాంతాకారం బెనసి తదుపాంతేందుగురుమే
ఖలాకాంతారాంతర్గతకిణికిణిక్వాణమణిమే
ఖలాకాంతారిప్రాకటజఘనభారప్రచలయై.

123


వ.

మెలంగుచుండి.

124


రాకుమారుండు రూపేందిరాకుమారుఁ, డాకుమారవనంబునం దాకుమారి
కాకృతి ధరించుటకు హేతు నాకుమార, జనకునాజ్ఞోక్తి కలదది వినుము తెలియ.

125


మ.

నవలావణ్యవిలాసమూర్తి పరమానందస్వభావుండు కై
రవిణీబాంధవశేఖరుండు హరుఁ డార్యాయుక్తుఁడై యక్కుమా
రవనాంతంబున నొక్కనాఁడు ప్రియమారన్ రుద్రలీలావతీ
నివహంబుల్ గొలువన్ వినోదవిహృతి న్నేయంబు సంధిల్లఁగన్.

126


సీ.

చలువఱాదొనల గొజ్జఁగిపూఁబొదల మంచుదొరుఁగు నాపన్నీట దోఁగితోఁగి
పరుపుగా ముదిరిన పండ్లగుత్తులమొత్తముల దాక పందిళ్ళ మూఁగిమూఁగి
గుజ్జుమావుల నల్లుకొని వ్రేలునునుదీఁగతూఁగుటుయ్యాలల నూఁగి యూఁగి
యింపుసొం పొదవించు నెలతేఁటిగమిపాట లెసఁగుపూఁబొదరిండ్ల నీఁగియీఁగి


తే.

పరపుఁబుప్పొళ్ళ నడుగుఁ దామరల చిన్నె, లేరుపడ మెట్టి సురపొన్నచాఱుచలువ
లీను నీడలజాడల నేగియేగి, చెలఁగి చెలులును జెలువుండు మెలఁగి రెలమి.

127


శా.

ఈచందంబునఁ గొంతసేఁపు ప్రమదంబేపార లీలావిహా
రౌచిత్యంబుల సంచరించి విటపోద్యత్పారిజాతావృత

ప్రాచుర్యామృతసారపుష్కరిణికాప్రాంతాయతోదార శో
భాచంద్రోపలవేదికాస్థలిఁ బ్రభల్ భాసిల్ల నాసీనుఁ డై.

128


చ.

దరహసితామృతంబు ముఖతామరసంబు నలంకరింప నా
హరుఁడు ముదంబున న్వనవిహారపరిశ్రమలాలసాంగి న
గ్గిరిసుతఁ గాంచి కేలితమిఁ గీల్కొనుసన్న యెఱింగి నెచ్చెలుల్
సరసగతిం దొలంగి కనుచాటగుచోటుల నుండ నయ్యెడన్.

129


తే.

అంబుజాననఁ గౌఁగిట నలమియలమి, యిష్టకేలీసుఖంబుల నెనసితనిసి
యంకపీఠంబుపై నుంచి యలపుసొలపు, దీఱ లాలించి పలికె సుస్థిరుఁడు హరుఁడు.

130


చ.

అడుగులు చూడఁ గెంజిగురుటాకులు చేతులు లేఁతతీఁగె లె
క్కుడుజిగిచన్నుదోయి పువుగుత్తులు మోవిరసంబు పక్వమై
వడుచుఫలద్రవంబు ప్రియవల్లభ చక్కనికొమ్మ వౌట ని
న్నెడయక యిన్నిరూపముల నివ్వనదేవత యాశ్రయించెనో.

131


తే.

తరుణి నానీలకంఠాభిధానమునకు, దోఁచె నర్థాంతరము పరితోషసరణి
సాంద్రసీమంతభూషాసురేంద్రచాప, సహితయుష్మత్కచాబ్దదర్శనమువలన.

132


సీ.

మృగశాబకంబు హస్తగతంబు సేయుట సుదతి నీకన్నులు చూచికాదె
యరచందమామను శిరసుపైఁ దాల్చుట వెలఁది నీనుదురు భావించికాదె
గగనంబు కేశసంగతము గావించుట చెలువ నీకౌను లక్షించికాదె
భుజగంబులను హారములుగా ధరించుట కలికి నీకీల్జడఁ గాంచికాదె


తే.

కొమ్మ నీయంగములపోల్కి కొంతకొంత, కలిగియుండుటఁ బ్రియమయ్యెఁ గాక మాకు
వీని భరియించుటకు నించుకైనఁ గలదె, కారణము పూర్ణచంద్రసంకాశవదన.

133


చ.

కలికి శిరీషపుష్పములకంటెను మిక్కిలికోమలంబులై
యలరు భవన్మనోహరతరాంగకము ల్నినుఁ జూచి యేగతిన్
దెలియఁగవచ్చుఁ గొండకుజనించినదానవటంచు నీదుని
శ్చలపటుకర్కతోన్నతకుచద్వయి తెల్పఁగఁగాక కోమలీ.

134


చ.

అనవుడు లేఁతనవ్వు జిగి యందపుఁజెక్కిలిదోయి కుందనం
బునకు మెఱుంగువెట్ట గొనబుంబచరింపుల సిగ్గుఁ బ్రేమయుం
బెనఁగొని వాలుఁగన్నుఁగవ బిత్తరిచూపుల నాదరింప మో
హనమధురోక్తి నుత్తరములాడుచునుండె భవాని శంభుతోన్.

135


వ.

ఆసమయంబున.

136

శా.

కౌండిన్యాత్రివసిష్ఠగౌతమమతంగవ్యాసజాబాలిమా
ర్కండేయచ్యవనౌర్వకణ్వభృగుభారద్వాజకుంభీజను
శ్శాండిల్యాదిమహామునీంద్రు లెలమిన్ సందీపితానేకమా
ర్తాండస్ఫూర్తితతేజు నయ్యభవు సందర్శించునాసక్తితోన్.

137


తే.

వచ్చి ప్రమదవనస్థలిఁ జొచ్చి యనతి, దూరమునఁ గాంచి రమ్మునీంద్రులు రహస్య
కేలి ననురాగరసవార్ధి నోలలాడు, తమిఁ జెలంగెడు నాదిమదంపతులను.

138


వ.

అప్పుడు.

139


ఉ.

వారలరాకఁ గన్గొని వివస్త్రశరీరిణిగానఁ గక్కునం
జీర ధరించె శైలసుత సిగ్గున మన్మథచంద్రహాస మొ
య్యారముగా నొరంజొనిపినట్లయి యచ్చపలాలతాంగి శృం
గారరసంబు ప్రాణవిభుకన్నులచూడ్కికి విందుసేయఁగన్.

140


వ.

అవ్విధం బవలోకించి.

141


క.

మునివరులు సమయ మెఱుఁగక, చనుదెంచితి మనుచు మఱలి చని రపుడ రయం
బున నరనారాయణులం, గనుఁగొనువేడుకల బదరికావనమునకున్.

142


ఉ.

అత్తఱి నమ్మును ల్నిజరహస్యవిహారముఁ గాంచిరంచు న
య్యుత్తమనాయకాతిలక ముల్లమునం గడులజ్జనొంది మో
మెత్తక యున్న శూలి హృదయేశ్వరిచిత్త మెఱింగి పల్కె నో
మత్తమరాళయాన వినుమా యనుమానము వాయఁజేసెదన్.

143


మ.

తరుణీ నీకును నాకు నెంతయు వినోదక్రీడకున్ వేడ్క సే
యురహస్యస్థల మిక్కుమారవన మన్యుల్ చొచ్చిరాఁగూడ దే
పురుషు ల్వచ్చినఁ బౌరుషం బెడలి యంభోజాతపత్రాక్షు లౌ
దురు నేఁడాదిగ నంచుఁ బల్కె భువనస్తుత్యుండు శర్వాణితోన్.

144


వ.

తత్కారణంబునం జేసి సుద్యుమ్నుండు విద్యుల్లతాంగి యై విస్మయవిషాదవిహ్వల
మతిం దిరుగుచు.

145


క.

కామినియై తానిక్కొఱ, గామిని నేమని జనంబుఁ గాంతు నని వనీ
భూమిని జరియించె నిలా, భామినియై వనరమాస్వభావత దోఁపన్.

146


తే.

పల్లవితపాదపంబుల ఫలితభూజ, ములను బుష్పితతరువుల ముద్దుగుమ్మ
పికవిలాసినికైవడి శుకవధూటి, పోల్కి మధుకరరమణిసొంపునఁ జరించె.

147

క.

ఈరీతిఁ దిరిగి తిరిగి ప, యోరుహదళనేత్ర దైవయోగమువలనన్
దారాతారారమణకు, మారుం డగుబుధునియాశ్రమంబునఁ జేరెన్.

148


ఉ.

చేరిమనోజసుందరవిశేషతనూవిభవాభిరాముఁ గే
యూరకిరీటకుండలముఖోజ్జ్వలదివ్యవిభూషణాద్యలం
కారు సమందహాసముఖకాంతివినిర్ణికపూర్ణిమాతమీ
చారుకళావిధు న్వినతసర్వబుధున్ బుధుఁ గాంచి ప్రేమతోన్.

149


వ.

ఇట్లని వితర్కించె.

150

స్త్రీయైన సుద్యుమ్నుఁడు బుధుని మోహించుట

సీ.

అలివేణులకు మనోహరముగాదే వీనికెందమ్మిచాయలకేలుదోయి
కీరవాణులకు నోరూరింపదే వీనిమాధురీకలితబింబాధరంబు
మనచకోరాళుల కెదఁ భ్రమగొల్పదే వీనిపూర్ణేందుబింబాననంబు
వరకోకకుచలకు వలపుపుట్టింపదే వీనిమార్తాండతేజోనిరూఢి


తే.

యహహ వీనివసంతమోహనవికాస, మేలతాంగుల నలరింప దెంచిచూడ
ననుచు రాగరసార్ద్రాంతరంగ యగుచు, సుదతి కనుఱెప్ప వెట్టక చూచె నతని.

151


ఉ.

ఆయరవిందరాగరుచిరాధర నాహరినీలవేణి నా
శ్రీయుతమౌక్తికద్యుతివిశేషదరస్మిత నానవప్రవా
ళాయతపాణిపాదయుగ నావరహీరనఖాళిఁ గాంచి యా
హా యిది రత్నరాశి వనితాకృతి దాల్చి మెలుగెడుం జుమీ.

152


వ.

అని తలంచుచు నసామ్యసౌమ్యసద్గుణరమ్యుం డగునాసౌమ్యుండు మదనప్రదర
విదళితహృదయుం డైయమ్మదవతం గదియవచ్చి యి ట్లనియె.

153


మ.

నవలావణ్యవిలాసమోహినివి చానా నీవు గంధర్వకాం
తవొ విద్యాధరభామవో విహగసౌందర్యాంగివో సాధ్యక
న్యవొ సిద్ధాంగనవో భుజంగసతివో యక్షాంబుజాతాయతా
క్షివొ గీర్వాణవధూటివో తెలుపుమా చిత్తంబు రంజిల్లఁగన్.

154


చ.

పరభృతపఙ్క్తి నీయధరపల్లవలబ్ధియుఁ దుమ్మెదల్ భవ
త్సరసముఖాంబుజాప్తియును సంగతిఁగోరి వనంబులం దప
శ్చరణలు చేసి సుస్వరముఁ జక్కనిచూపులు నై మెలంగెడున్
బురుషులు నిన్నుఁజూచి మరుపూన్కికిఁ జిక్కరె నీకుఁ దక్కరే.

155

తే.

వనిత వీవాలుగన్నులు వలుదకొప్పు, మందగమనంబు సారంగమహిమఁ గాంచుఁ
గలికి నీమోముఁ జక్కనికరయుగంబు, మఱి గళంబును నబ్జసంపద వహించు.

156


సీ.

తెఱవ నీవు కటాక్షదృష్టిఁ జూచినఁ గాముకాండముల్ తృణమునఁ గట్టరాదె
నాతి నీవించుక నవ్వినఁ బూర్యచంద్రికల జాడ్యంబు నొందింపరాదె
భామ నీవు ప్రియోక్తిఁ బలికినఁ జిలుకలఁ బట్టిబందిగములఁ బెట్టరాదె
లోలాక్షి నీవు కెంగేలు పైఁజేర్చినఁ జిగురాకులఁ జలింపఁజేయరాదె


తే.

లేమ నీదయ నామీఁద లేమినింత, వెతల పాల్పడవలసెను వీనిచేతఁ
గాక నీప్రాపు గలిగినఁ గడఁగి వీనిఁ, బట్టిపల్లార్తుగాదె నీపాదమాన.

157


సీ.

రాజబింబాస్య యీరాజకీరములకు నీముద్దుమాటలు నేర్పుకొఱకొ
యిందీవరాలక యీపూవులకు నెల్ల నీమేనితావులు నింపుకొఱకొ
నవమోహనాంగి యీనమలిగుంపులకు నీతిన్ననినడుపులు దిద్దుకొఱకొ
వామాక్షి యీపల్లవములకు నీమోవితళుకుఁ గెంజాయఁ బైకొలుపుకొఱకొ


తే.

కాక యివ్వనసీమ నిట్లేకతంబ, యేకతంబునఁ దిరిగెదవే యొయారి
నన్ను ధన్యనిఁ జేయుయత్నంబు దక్కఁ, గలదె కలవాణి యొండొకకారణంబు.

158


శా.

నాసాగంధఫలీపరాఙ్ముఖగతి న్నాతీ భవత్కేశభృం
గీసంఘం బిరుపాయలై వెనుకకుం గేడించి యచ్చోట గుం
పై సొంపొందినభంగి సుందరతరంబై చారుసీమంతరే
ఖాసంయు క్తిని గీలుగంటు సిగ శృంగారంబు రాజిల్లెడున్.

159


సీ.

భామినీమణి బెండువడనిసింగిణులు నీకనుబొమ్మ లైక్షపకార్ముకునకు
జలజాక్షి యక్షయశరములు నీకటాక్షపరంపరలు పంచసాయకునకుఁ
గలికి చాయలు వోనిఖడ్గముల్ నీకేలుదోయి ప్రవాళకౌక్షేయకునకు
నెలఁత మనోగతి మెలఁగువాహములు నీకులుగుఁబల్కులు కీరఘోటకునకుఁ


తే.

దనకుఁ దగ వివి జాడ్యంబు లనుచు మొదలి, సాధనంబులు పూర్వపక్షములు చేసి
యతివ నీయంగకములు సిద్ధాంతములుగఁ, గైకొనియెఁజుమ్ము మరుఁడు లోకముల గెలువ.

160


సీ.

కురియదే కలువక్రొవ్విరివాన జోరున నీవు వీక్షించిన నీరజాక్షి
నిండదే పండువెన్నెలతేట చల్లఁగా నీ వింత నవ్విన నీలవేణి
మొరయదే పంచమస్వరలీల ఘుమ్మన నీవు మాటాడిన నిరుపమాంగి
పొలయదే గమ్మన మలయజామోదంబు నీయూర్పు సోఁకిన నిమ్ననాభి

తే.

మదనచంద్రవనప్రియమలయపవన, నిగ్రహంబులు తలఁప ననుగ్రహంబు
లౌఁగదా నీకృపాప్రసాదాస్తి నిట్టి, రూపముల రాజహంసానురూపగమన.

161


తే.

కలిమి కొండంత కలిగియుఁ గఠినరీతి, నర్థికిని మేలుచూపక యకట బయటి
గమకముల నాసకొల్పెడుఁ గలికి నీదు, చన్నుఁగవ లోభిదొరల దీచంద మనఁగ.

162


మ.

ఎలనాఁగా మదనాగ్ని వేఁగెడు నయో యీమేను గుత్తంపుఁగ్రొం
జిలుఁగుంబట్టుచొ కాటపున్రవికలోఁ జెల్వై సెగల్దేరు నీ
బలుపుంజన్గవ నొత్తి పట్టఁగదె నాపై నుష్టముష్ణేన శీ
తలమంచున్ బుధకోటి పల్కుగతి సంతాపంబు చల్లాఱగన్.

163


శా.

నిన్నుం జూచినవేళనుండి తరుణీ నీరూపరేఖావిలా
సౌన్నత్యంబులు నామదిం దగిలి మోహభ్రాంతిపాలైతిఁ జం
చన్నీలోత్పలబాణవృష్టిని రణఝ్ఝంకారటంకారసం
పన్నాభంగురభృంగమార్వి నటియింపం గమ్మవి ల్వంచి ముం
చె న్నించె న్నిజశాంబరీతమము రాజీవధ్వజుం డియ్యెడన్.

164


క.

బాలిక శకలితశశిబిం, బాలిక శుకశారికాదికాంగజసేనా
కోలాహలంబు చెవులకు, హాలాహల మగుచు మిగుల నలయించెఁగదే.

165


క.

అని యిట్లు పలుకుశశినం, దనుమోమున కతివ కులుకుతళుకుబెళుకువా
ల్గనుఁగొనల సిగ్గుఁ బ్రేమయుఁ, నెనసినచూపుల నివాళు లిడుచుం బలికెన్.

166


తే.

రాజనందన జితరతిరాజరాజ, రాజనందన విను మేను రాజకన్య
నీశ్వరానుగ్రహంబున నివ్విధమున, సంచరించెద నివ్వనస్థలులయందు.

167


సీ.

స్వాభావ్యమందహాసచ్ఛలంబునఁ బూర్ణహరిణాంకు నవ్వు నీయాననంబు
నైసర్గికాంతారుణవ్యాజమునఁ దమ్మిగములపైఁ గినియు నీకన్నుదోయి
సహజోర్ధ్వరేఖామిషమునఁ గెంజిగురులపై ధ్వజంబెత్తు నీపదయుగంబు
నిజభూషణమునఁ గరికరనికరంబు నదలించు నీభుజంబు


తే.

లిట్టినీచక్కఁదనము పూర్ణేందుబింబ, వదనలకు సాత్త్వికోదయాస్పదము కాదె
కమలభవురచనాచమత్కారమునకు, నరయఁ గూలంకషముగాదె యలఘుచరిత.

168


చ.

మదనవిలాసినీనిరుపమానమనోహరమూర్తిఁ జూచి నా
హృదయము చంద్రకాంతమణి యిందుకరాప్తిఁ గరంగనట్లు స
మ్మదరసపూరమయ్యె ననుమానము సేయక యేలుకొమ్ము పెం
పొదవఁ గవుంగిలించి చిగురొత్తినకోర్కులకున్ ఫలంబుగన్.

169

చ.

అని వనితాలలామయు నిజాభిమతానుగుణంబుగాఁగఁ బ
ల్కినపలుకు ల్సుధారసములీల శ్రుతిద్వితయంబు నిండి నె
మ్మనమున సంప్రకాశమగు మన్మథతాపము చల్లచేయ న
వ్వనరుహనేత్రఁ జేరి రతివాంఛలు లోపలఁ జౌకళింపఁగన్.

170


క.

భృంగీసంగీతస్వన, మాంగళ్యసుగంధకుసుమమంజరులు బయల్
పొంగుమరందము నెపమున, శృంగారరసంబు గ్రుమ్మరిలుపొదరింటన్.

171


మ.

వనితం గౌఁగిటఁ జేర్చి బింబఫలనవ్యం బైనకెమ్మావి ప
ల్మొనల న్నొక్కుచుఁ జెక్కుటద్దము లొగి న్ముద్దాడుచు న్మోహన
స్తనకుంభంబుల నెమ్మొనల్ పుణుకుచున్ సంభోగచాతుర్యఖే
లనుఁడై సల్పె రతిప్రసంగము మహోల్లాసంబు సంధిల్లఁగన్.

172


క.

ఆయింతిమదనుపాళెము, నాయతమతి గొల్లకొనఁగ నతనుం డబలుం
డై యొదిఁగె వగరుదోఁచఁగ, నాయఁడు పొంచుండు ననుట నైజము గాఁగన్.

173


చ.

కటకట వెన్నవంటికలకంఠిమనం బొకరాయి చేసి మి
క్కుట మగుచన్నుదోయిపయి కొంగయినం బతి నంటనీక య
ట్టిటుఁ బెనఁగించుకూళతన మెక్కడఁబోయెనొ కాని సిగ్గుతా
గిటగిటమంచుఁ గొమ్మకనుఁగ్రేవలఁ జేరఁ దుది న్విభుండు ము
చ్చట తమిరేఁచి లోఁఱిచి జవ్వనమెల్లను జూఱలాడఁగన్.

174


సీ.

సొగసుఁ బల్మొనగంటు చుఱు కెఱుంగఁగరాని పెదవులయమృతంపుఁబీల్పుసొక్కు
తారహారములయొత్తడ మెఱుంగఁగరాని పరిరంభములప్రేమపరవశంబు
గిలిగింత యళ్కుబెళ్కు లెఱుంగఁగారాని మర్మసంస్పర్శనామందసుఖము
సిగ్గుపోకడమాట యెగ్గెఱుంగగరాని తమి హెచ్చరింపువాక్యములముంపు


తే.

ముదురుఁదమకంపుఁ గలయిక నొదవునలయి, కల నెఱుఁగఁగరాని యగ్గలపుఁగళల
యబ్బు నుబ్బువినోదమై యొనరె నపుడు, సమరతిక్రీడ రమణికి రమణునకును.

175


తే.

ఇవ్విధంబున జవ్వని నవ్వనిం బ్ర, గాఢమోహాప్తిఁ గొన్నాళ్లు కలసిమెలసి
మకరకేతనవుజ్యసామ్రాజ్యపదవి, కెలమి మూర్థాభిషిక్తుఁడై యేలుచుండె.

176


తే.

అతనికన్యాసమాగమస్థితి తదీయ, మిథునవర్తనమునుఁ బెంపు మిగిలియుండె
బుధునికన్యాసమాగమమిథునవర్త, నములు పెంపువహించుట నైజమకద.

177


వ.

ఆసమయంబున.

178


క.

ముక్తామణిభరణాంచిత, శుక్తిప్రతిమాన మగుచు సుదతీమణికిన్
నక్తంకరజాతకళా, యుక్తంబై గర్భమమరె నుజ్జ్వలలీలన్.

179

క.

చెక్కులతెలుపును జిగిచను, ముక్కులనలుపును నపాంగములఁ దేలికతా
దృక్కులసొలపును నెడనెడ, వాక్కులయలపును ఘటిల్లె వనితామణికిన్.

180


ఉ.

కేలితమిం జెలంగి తమకించి నిజోద్ధతిఁజూపఁ జూచు న
వ్వేళఁ బ్రశాంతుఁ జేయు నరదిందనిభానన కుంచితాంచిత
భ్రూలతికావిలాసమునఁ బొల్పుకనుంగవమోడ్పుతోడ గ
ర్భాలసజాతశీత్కృతిరవాననపద్మము ప్రాణనాయకున్.

181


ఉ.

రావె కృశోదరీ యనుచుఁ రాగదవే తనుమధ్యయంచు హే
లావతు లెక్కసక్కె మగులాగనఁ బల్క శిరంబువాంచు ల
జ్జావశమందహాసవిలసన్ముఖయై జఠరావలగ్నభా
గావహవిస్తరంబు తెలియం గను భంగి లతాంగి యయ్యెడన్.

182


సీ.

దృఢసంపదల కింకఁ దిరుగుఁబాటనియొ స్తనంబులముఖములు నల్లనయ్యె
జిగిబిగి పరిపాటి యగు నింకననియో తనూలత చంచలానూపమయ్యెఁ
గళపెంపు మట్టుగాఁ గలదింక ననియొ ముఖాబ్జంబు వెలవెల్లనై యెసంగెఁ
గ్రొవ్వాఁడితనమింకఁ గొలఁదియౌ ననియొ దృగంచలం బలసావికాసమయ్యె


తే.

నెపుడుఁ బతిప్రక్కఁబాయనియెలమికలిమి,యెడ నెడలఁగాని లభింప దింకననియొ
యంతరంగంబు మిగలజాడ్యంబు నొందె, సతికి గర్భంబు వర్ధిల్లు సమయమునను.

183


వ.

అంత.

184


క.

నవమాసానంతరమున, నవమోహనగాత్రి గాంచె నందను రాకా
ధవళకరుం బ్రథమదిశా, కువలయదళనేత్ర గాంచుకొమ రమరంగన్.

185


శా.

సూచించెం బరమోచ్ఛభాగవిహరత్సువ్యక్తవర్గోత్తమ
ప్రాచుర్యోచితదృక్సమేతశుభదారంభగ్రహానుగ్రహం
బాచక్రాచలధారుణీవలయరాజ్యశ్రీయుతైశ్వర్యవి
ద్యాచాతుర్యగుణాదిభావిఫలముల్ తజ్జన్మకాలంబునన్.

186


మ.

గణనాతీతవిశేషలీలఁ గురిసెన్ గంధర్వగీర్వాణచా
రణవిద్యాధరదంపతిప్రకరనిర్యత్పుష్పవర్షప్రక
ర్షణ మబ్బాలకుఁ డుద్భవింపఁగ సమస్తక్షోణిరక్షావిచ
క్షణదీక్షారచితాభిషేకదినిషద్గంగాంబుధారాకృతిన్.

187


ఉ.

తత్సమయంబునం బుధుఁ డుదారముదావహచిత్తవృత్తిఁ బు
త్రోత్సవకృత్యముల్ నడపె యోగిజనంబు లితం డఖండసం

పత్సముపేతలీల నయపద్ధతి నేలఁగలం డనేకసం
వత్సరము ల్సుధాంశుకులవర్ధనుఁడై జనలోక మంతయున్.

188


క.

అని నిర్ణయించి మిక్కిలి, యనురాగముతోడ మంగళాశాసన మిం
పొనరఁగ జేసి పురూ, రవుఁ డనియభిధానం బొనర్చి రబ్బాలునకున్.

189


సీ.

పాలుబ్బు బిగువుగుబ్బల నెమ్మొనలఠీవి పసపంటుపయ్యెదపై నటింపఁ
గాయంపుముద్దల కారంపుఁదావు లాస్యనిసర్గవాసన నలమికొనఁగ
నడుమున దిటముగా వడిఁ జుట్టికట్టిన బంగారుమైజారుకొంగు దనర
నుల్లిపూసలపేరు హరుమంజిముత్యాలకుతికంటు దాపునఁ గొమరు మిగులఁ


తే.

బ్రసవసమయపరిశ్రాంతి బడలియున్న, యంగకముల నొకవింతయంద మెసగ
జూడఁ దగియుండె నప్పుడాసుదతియందు, లాలితంబైన బాలెంతరాలితనము.

190


సీ.

అర్ధక్షణంబైన నంతరాయములేని కౌఁగిలి యత్నసంఘటిత మయ్యుఁ
గుచపీడనంబు చేకొలఁదిసారెకుఁ జేయు మమతహస్తస్పర్శమాత్రమయ్యుఁ
గపురవిడ్యపుఁదావి గ్రమ్ముచుంబనలబ్ధి కటువస్తుపరిమళకలితమయ్యు
ఘటచక్రపుంభావనటనలఁ జూపునేర్పులకు జోక్కుట లపరూపమయ్యు


తే.

నతనిహృదయంబు పూర్వహర్షానుభవతఁ, బొదలె బాలెంతరాలిసంభోగకేళి
నలవియే యెంచఁ బ్రసవితానంతరద్వి, తీయమాససమాగమాధిక్యసుఖము.

191


క.

ఈకరణి మఱియుఁగొన్నా, ళ్లాకరభనిభోరుఁ గూడి యతిశయసమ్మో
దాకరవిహారగతుల సు, ధాకరనందనుఁడు మెలఁగు తత్సమయమునన్.

192


చ.

ప్రతిదినవర్ధమానసితపక్షకళానిధికైవడిం బ్రవ
ర్తితరమణీయశైశవశరీరవిరాజితుఁడై విభూపణ
ద్యుతి యతిచిత్రమై వెలుఁగుచుండ జగజ్జనలోచనోత్సవ
స్థితిఁ దనరెం బురూరవుఁ డశేషవిశేషగుణాభిరాముఁ డై.

193


వ.

అంత.

194


క.

తనయాకృతి వితతామో, దనిదానంబయ్యు నపుడు తరుణీమణికిం
దనయాకృతి వితతా మోద,నిదానంబయ్యె నది యథార్థముగాదే.

195


చ.

కతిపయివాసరంబు లరుగన్ భ్రమరాలక యొక్కనాఁడు కు
త్సితమగునాత్మవర్తనము చిత్తమునం దలపోసి రోసి దుః
ఖత యగుచుం దలంచి మదిఁ గేవలయోగసమాధినిష్ఠ నూ
ర్జితకరుణాదిసద్గుణగరిష్ఠు వరిష్ఠు వసిష్ఠు నయ్యెడన్.

196

తే.

తలఁచినప్పుడ వచ్చె భక్తప్రసన్న, పరమకరుణారసార్ద్రస్వభావుఁ డగుట
నమ్మునీంద్రుండు నిజవిగ్రహప్రదీప్తి, విసినదేశంబు నెంతయు వెలుఁగఁజేయ.

197


క.

ఆగతి నాగతుఁ డగున, య్యోగిశిఖామణిపదాబ్జయుగళంబునకున్
సౌగుణ్యగతిఁ బ్రణామము, లాగజగామిని యొనర్చి యవనతముఖి యై.

198


మ.

తనవృత్తాంతము విన్నవించి పురుషత్వప్రాప్తికై వేఁడినన్
మునినాథాగ్రణి యూరడించి గిరిరాణ్మూర్థన్యకన్యానిగూ
హనరోమాంచితసవ్యభాగు భుజగేంద్రాకల్పు సంకల్పసం
జననవ్యాళవిహంగపుంగవు శివు న్సద్భక్తి భావించుచున్.

199


శా.

చిద్రూపంబు నివాతదీపకళికాశ్రీలక్ష్యమై లోన న
క్షుద్రస్ఫూర్తి వెలుంగ వర్ణితనిమేషోన్మేషమై దృష్టిభా
స్వద్రూఢిన్ బయ లందగింపఁ గరణస్వస్థాత్ముఁడై శాంభవీ
ముద్రాముద్రితలీల నిష్టసలిపె న్ముఖ్యప్రకారంబునన్.

200


క.

యతియతినియతికి గిరిజా, సతిపతి మతి సంతసించి సాగుణ్యనిజా
కృతిశ్రుతితతినుతిపాత్ర, స్థితి ధృతియుతి దర్శితంబు చేసె న్మునికిన్.

201


సీ.

మస్తకస్ఫూర్జితామరధునీవిధుకళల్ వ్యోమకేశత్వంబు నొనరఁజేయ
మహితధాతృకపాలమాలికాబాహుళ్య మాద్యంతరాహిత్య మభినయింప
భయభక్తులను మేలుపడియున్న జగదంబ స్వాధీనమాయాత్వసాక్షిణిగను
గొలిచి వచ్చెడిభక్తకోటి సారూప్యంబు కైవల్యదాతృత్వగరిమఁ దెలుప


తే.

సహజమందస్మితరసప్రసన్నవదన, రుచి సదానందభావంబు రూఢిపఱుప
నపుడు ప్రత్యక్షమయ్యె బ్రహ్మర్షిలోక, తల్లజునకుఁ ద్రిలోకబాంధవుఁడు శివుఁడు.

202


చ.

ప్రమథగణంబుతో భుజగభాస్వరహారకదంబకంబుతో
సమరధునీకరంగలుఠనాత్తజటాపటలంబుతోఁ దురం
గమితవృషేంద్రచంక్రమణకల్పనతోఁ గనుపట్టు పార్వతీ
రమణుని గాంచి హర్షజలరాశి పరిప్లవదంతరంగుఁడై.

203


వ.

సాష్టాంగదండప్రణామంబు లాచరించి యిట్లని స్తుతియించె.

204


లయగ్రాహి.

అంగజభుజంగమవిహంగప కురంగకర భృంగినతమంగళతరంగపటుశృంగా
రాంగభటపుంగవతురంగమ మతంగజశతాంగచతురంగబలరంగదరిభంగా

భంగురపతంగశశిసంగతరథాంగ సదపాంగ శుభలింగ గిరిశృంగగృహ గంగా
తుంగతరభంగచయసంగ మపరాంగ హృదయంగమ మతంగమతిచంగసుమభృంగా.

205


లయవిభాతి.

భుజగకరవలయ వరరజతగిరినిలయ పదసృజితభరతలయ రణవిజయ భుజదండా
ఋజుసరసహసన లసదజినకృతవసన ముఖవిజితశశిలసన రచితజలభవజాండా
త్రిజగదనుభరణ సురభజితమృదుచరణ మదగజదనుజహరణ సరసిజనయనకాండా
ప్రజవవృషగమన ఘనవృజినచయదమన కృతసుజనభయశమన ధృతరజనికరఖండా.

206


చ.

అనుచు ననేకభంగుల నయం బెనయం బెనఁగొన్నభక్తిచే
వినుతులుసేయుమౌనిఁ గని విశ్వగురుండు హరుండు సుందరా
ననదరహాసచంద్రికలు నైజికటాక్షదయాసుధారసం
బున కనురూపమై మదికపూర్వముదం బొదవింప నిట్లనున్.

207


శా.

నీసంకల్ప మెఱుంగుదు న్వినుము మౌనిశ్రేష్ఠ హేలావతీ
త్వాసంగాకృతి నున్న రాసుతుని బుంస్త్వాకారసంప్రాప్తికై
యాసక్తి న్మముఁగోరి వేఁడెదు మదీయాజ్ఞోక్తి యట్లుంటఁ గా
దా సుద్యుమ్నుఁడు పౌరుషంబెడలి కాంతారూప మయ్యె న్వనిన్.

208


ఉ.

మావచనం బమోఘ మదిమాన్పుట గల్గదు నీయెడం బ్రస
న్నావహమయ్యె మాహృదయ మట్లగుటన్ భవదిష్టసిద్ధియుం
గావలనె న్మునీంద్ర యటుగావునఁ దా నుభయార్థసాధకం
బై వెలయంగ వేఱొకయుపాయ మొనర్చెద నేర్పు పెంపునన్.

209


క.

పురుషుండై యొకమాసము, ధరణీసామ్రాజ్యభారదక్షత నుండుం
దరుణీమణియై మాసాం, తరమున వర్తించు నిట్లు తప్పక నడచున్.

210


వ.

అని ఇవ్విధంబున.

211


క.

మగరూపు నాఁడురూపును, సుగుణస్థితి దాల్చుహరుఁడు సుద్యుమ్నునకున్
మగరూపు నాఁడురూపును, దగనొసఁగి వసిష్ఠవందితపదాంబుజుఁ డై.

212


శా.

అంతర్ధానము నొందె నంతఁ బరమేశానుజ్ఞచే నయ్యిలా
కాంతారూపము పౌరుషాకృతి వెలుంగంజూచి చిత్తంబునన్
వింతంబొందుచు నున్నసౌమ్యునకుఁ దద్వృత్తాంతముందెల్పి ని
శ్చింతుం జేసి యరుంధతీవిభుఁడు దాక్షిణ్యంబు సంధిల్లఁగన్.

213

వ.

రూపరేఖాజితప్రద్యుమ్నుం డగుసుద్యుమ్నుని నిజవదనచంద్రచంద్రికావికసిత
జగజ్జననయనకైరవుం బురూరవుం దోడుకొని ప్రతిష్టానపురంబున కరుగుదెంచు
చుండె నవ్వార్త చారులవలన వినినవాఁడై వైవస్వతవసుంధరావల్లభుం డుల్లాసంబున
నుల్లంబు పల్లవింప బురంబు శృంగారింపం బరిచారకుల నియోగించిన వారును
సంభమంబున నానావిధశృంగారరచనల నపూర్వవిలాసంబుగా నగరం బలంకరించి
రప్పుడు.

214


సీ.

పొసఁగుపన్నీటిపొల్పున జొబ్బిలనివీథి పచ్చికస్తురి నల్కఁబడనియరుగు
వెడఁదముత్యముల మ్రుగ్గిడనిముంగిలి కల్పసూనతోరణలబ్ధిలేనివాకి
లాటపాటలయింపు లమరనిసభ మహోత్సవముసేయని దేవతాగృహంబు
నగరుధూపపుఁదావు లతిశయింపనిచో టశేషవస్తువుల రాజిలనివిపణి


తే.

నూతనాలంకృతులను మనోజ్ఞరూప, వైభవులు గాని పురుషుండు వనజముఖియు
వెదకినను గానఁబడుటగల్గదు తదీయ, నగరశృంగారరచన లెన్నఁగఁ దరంబె.

215


చ.

అరయ నిసర్గసుందరతరావయవోజ్జ్వల యైనపాటలా
ధర కుసుమాంబరాభరణధారిణియై మిగులన్వెలుంగు న
ట్లురుతరనిత్యవైభవసమున్నతమయ్యుఁ బురంబు నవ్యమై
కరము రహించెఁ దత్సమయకల్పిత మైనయలంకృతంబులన్.

216


వ.

ఇవ్విధంబున.

217


మ.

నగరాలంకృతి లోచనంబులకు నానందం బొనర్పంగ న
జ్జగతీనాథుఁ డమాత్యభూసురసుహృత్సంయుక్తుఁ డై యాభిము
ఖ్యగతిం బోయి యరుంధతీరమణుపాదాంభోరుహద్వంద్వముం
దగఁ బూజించె నిజోత్తమాంగమకుటోద్యద్రత్నకాంతిచ్ఛటన్.

218


వ.

అప్పుడు.

219


మ.

ఎలమిం బొంది మునీంద్రశేఖరుఁడు రాజేంద్రుం గృపాబుద్ధి సం
ధిల భద్రాణి భవంతుతే యని తగన్ దీవించి తత్పుత్రపౌ
త్రల సుద్యుమ్నపురూరవస్సులను సంతోషస్థితిం జూపి సా
గిలి మ్రొక్కించిన నానృపాలుఁ డనురక్తిం గౌఁగిటం జేర్చుచున్.

220


ఉ.

హర్షవికాసమానహృదయాంబుజుఁ డయ్యె ననంతరంబ బ్ర
హ్మర్షిసమేతు లందఱు సమగ్రశతాంగము లెక్కి వైభవో

త్కర్షతచేఁ బురంబునకుఁ గ్రమ్మర వచ్చిరి పౌరమానసా
కర్షణకృత్ప్రసన్నముఖకైరవిణీప్రియబింబరమ్యు లై.

221


ఉ.

లాజలు చల్లిరప్పుడు విలాసవతుల్ శరదభ్రశుభ్రవి
భ్రాజితసౌధయూధములపైఁ దగ నెక్కి మృణాలనాళలీ
లాజయహస్తకీలితచలద్వలయక్వణనిక్వణంబు లిం
పై జతగూడి మ్రోయుచు జనాళికి వీనులవిందొనర్పఁగన్.

222


మ.

నవరత్నోజ్జ్వలచంద్రశాలలు విమానంబుల్ తదధిరో
హవరారోహలు దేవకన్యలు తదీయాంచత్కరాంభోరుహ
స్రవదుత్కర్షసుగంధబంధురసుమవ్రాతంబు మందారపు
ష్పవితానంబును గాఁగఁదోఁచె గణుతింపఁ బ్రేక్షకశ్రేణికిన్.

223


క.

ఈవిధమున నధిపతివీ, ణావేణుమృదంగశంఖనాదంబులు డం
బై వందిమాగధస్తుతి, రాపంబులఁ గూడి చెలఁగ రాజితలీలన్.

224


తే.

కలితపురరాజమార్గశృంగారమునకు, నంద మొసఁగెడు రాకడ నరుగుదెంచె
నారచితహాటకద్యుతిహసితరుచిర, తరుణనిజధామ మగునిజధామమునకు.

225


ఉ.

వచ్చి కృతోపచారహితవర్తనలన్ గురుచిత్తవృత్తికి
న్మెచ్చొదపంగఁ కడునెయ్యమున న్నిజపుత్రపౌత్రులన్
హెచ్చగు సౌఖ్యసంపదల నెంతయుఁ బ్రీతులఁ జేసి భూవిభుం
డొచ్చెములేనివేడుకల నుల్లము రంజిల నుండె నయ్యెడన్.

226


సీ.

ఏకాంతమున మానవేంద్రుతోడ వసిష్ఠ సంయమీంద్రుఁడు సవిస్తరముగాఁగ
సుద్యుమ్నుఁ డలకుమారోద్యానవనమున విహరింపఁబోవుట విశ్వవిభుని
పౌర్వికనియతిచే భామినీరూపంబు సంప్రాప్తమగుట నక్షత్రవిభుని
నందనుతోఁ బొందొనర్చుట తద్గర్భమునఁ బురూరవుఁడు సంజనితుఁ డగుట


తే.

పురుషత్వమునకుఁ దానంబికేశుఁ, గొలువ మగరూపమై నెలనెల నెలంత
యగుచుఁ గ్రామముననుండు నిట్లనుచు వరము, హరుఁ డొసంగుట తెలిపి యిట్లనియె మఱియు.

227


మ.

నరనాథోత్తమ యిప్పురూరవుఁడు శ్రీనారాయణాంశోదితుం
డరయం బూర్ణయశఃప్రతాపనిధి యై యష్టాదశద్వీపభా
స్వరసామ్రాజ్యరమానులబ్ధమహదైశ్వర్యంబుచే నొప్పెడున్
ధరలో నైందవరాజవంశవిలసత్కల్పద్రుమాంకూర మై.

228

వ.

అని యక్కుమారకుం బిలిపించి తనసమీపంబున నాసీనుంజేసి సాముద్రికచిహ్నంబు
లుపలక్షించి యి ట్లనియె.

229


సీ.

రత్నగర్భకు వీనిరాజితాజానుబాహాస్తంభసీమ నిత్యాశ్రయంబు
వాగ్వధూటికి వీనివ్యాకోచహల్లకనవ్యజిహ్వాగ్రంబు నాట్యశాల
చింతామణికి వీనిప్రాంతరక్తవిశాలసుందరాక్షులు కేళిమందిరములు
స్పర్శవేదికి వీనిభవ్యరేఖాశ్రయశయకుశేశయపాళి జన్మభూమి


తే.

సకలసౌభాగ్యలక్షణస్వచ్ఛమైన, వీనినెమ్మేను లక్ష్మికి విడిదిపట్ట
వీనిసద్గుణసంపూర్ణవిమలహృదయ, నలినకర్ణిక సింహాసనంబు హరికి.

230


శా.

నానాద్వీపనృపాలమౌళి నవరత్నస్నిగ్ధకోటీరశో
భానీరాజతరాజితంబు లగునీపాదంబులందు న్నవ
శ్రీనిత్యధ్వజవజ్రశంఖహలరాజీవాదితద్రక్తరే
ఖానీకంబు కుమారశేఖరుభవిష్యద్భాగ్యముం దెల్పెడున్.

231


చ.

ఇతఁ డుదయించువేళ నమరేంద్రగురుప్రముఖగ్రహంబు లా
తతకళల న్వెలుంగుహిమధామునిఁ జూచుచునుంటఁ జేసి ని
ర్జితరిపుఁడై ధరాస్థలమశేషము నేలెడు సార్వభౌముఁడై
యతులితకీర్తి నొప్పెడు మహావిభవంబునఁ బెక్కువర్షముల్.

232


క.

అని పలికిన విని తనమన, మునఁ బెనఁగొను మోదమునను మునిపతితో న
మ్మనుజపతి యనియె వినయం, బెనయన న్మృదువచనరచన యింపొదవింపన్.

233


తే.

శిష్యవాత్సల్యమున మీరు చేసినట్టి, యత్నమునఁ జేసి యీడేఱె నన్నిపనులు
నిట్టిశ్రేయస్కరములకు హేతుకంబు, మీయనుగ్రహమహిమగాదే యమీంద్ర.

234


వ.

అని మఱియు ని ట్లనియె.

235


క.

మీయుపదేశంబున నితఁ, డాయతమతి సకలవిద్యలందు ధురీణుం
డై యొప్పు నట్లు సదయో, పాయత నొనరింపవలయు నభ్యసనంబున్.

236


క.

అని ప్రార్థించిన మంచిది, యని రాజకుమారకునకు సాంగంబుగ న
మ్మునిశేఖరుఁ డుపదేశం, బొనరించి సమస్తవిద్య లుద్యత్ప్రీతిన్.

237


మ.

అమర న్నేతకు ఋగ్యజుస్సులును సామాధర్వణంబు ల్నిరు
క్తము ఛందంబును జ్యోతిషంబు మఱి శిక్షా కల్పముల్ శబ్దశా
స్త్రము మీమాంసపురాణసంహితలు ధర్మన్యాయశాస్త్రంబు లా
దిమవిద్యల్ పదునాలుగుం జతురుపాధిప్రౌఢి నభ్యస్త మై.

238

చ.

సకృదుపదేశమాత్రమున సద్గురుసన్నిధిఁ బ్రాగధీతవి
ద్యకరణి నప్పగించునె కదా మఱి యెన్నఁటికైన విస్మృతం
బొకయెడనైన లేదు చతురుత్తరషష్టికళాకలాపసా
ధకుఁడయి యొప్పెఁ దద్గ్రహణధారణశక్తి వచింప శక్యమే.

239


మ.

హరిహస్తిప్రముఖావరోహణము దివ్యాస్త్రప్రయోగోపనం
హరణప్రౌఢి గదాదిసాధనఘనాభ్యాసంబు సారస్వతా
కరవాగ్వృత్తి యుపాయసప్తకచమత్కారంబు షాద్గుణ్యవి
స్ఫురణం బాదిగ నన్నిటం జతురుఁడై శోభిల్లె నుద్యన్మతిన్.

240


చ.

సకలగుణప్రవీణత రసజ్ఞశిఖామణి యైనరాకుమా
రకుహృదయాంబుజం బనితరప్రతిపాదకవిష్ణుభక్తి నై
ష్ఠికయుతమయ్యె మేలిమిపసిండికి నవ్యవికాసపారిజా
తకుసుమగంధ మబ్బినవిధంబున నాతనిభాగ్య మెట్టిదో.

241


వ.

మఱియు నప్పరమయోగిపరివృఢుం డతనికి నఖిలజగత్సంచారసామర్థ్యంబును
నసాధారణపరాక్రమంబును నక్షీణభుజావష్టంభంబును నక్షయతూణీరంబులును నభే
ద్యకవచంబును నవధ్యరథ్యాదిసమృద్ధరథంబును నణిమాద్యష్టసిద్ధులును మొదలుగాఁగల
విశేషంబులు ప్రసాదించి మఱియు నతిరహస్యంబులైన మణిమంత్రసిద్ధక్రియాకలా
పంబు లెఱింగించి నిజాశ్రమంబునకుం బోవం దలంచి తనకుఁ గృతప్రణాము లైన
వైవస్వతసుద్యుమ్నుల సబహుమానంబుగా నాదరించి యనంతరంబ.

242


క.

తనపాదములకు వందన, మొనరించిన సంతసంబు నొందుచు సుఖివై
మను మను మని మనువుననుఁగు, మనుమని దీవించి యరిగె మౌని నిజేచ్ఛన్.

243


క.

అనిన విని శౌనకాదులు, వినయంబున సూతుఁ గని సవిస్మయభంగిన్
వినిపింపు మనంతరకథ, యనుచు సముత్సుకమనస్కులై యడుగుటయున్.

244


శా.

రక్షోశిక్షణదక్ష దక్షిణభూజాగ్రక్షిప్రకౌక్షేయకా
మోక్షాపేక్షకరక్షణాక్షయకృపామోఘేక్షణాలక్షణా
వీక్షాలక్ష్యసులక్షణావయవద్రాక్షేక్షుద్రవాక్షేపకా
ర్యక్షుద్రోక్తిచయక్షమారమణ అక్షాధ్యక్షపక్షిధ్వజా.

245


క.

భద్రాకుచమకరీదళ, ముద్రాంకితచారువక్ష మోక్షాధ్యక్షా
భద్రాకరకారుణ్యస, ముద్రా రుద్రాభినంద్య మునిజనవంద్యా.

246

భుజంగప్రయాతము.

ధరాజసురాహ్యుగ్ర ధాటీవిరాజా, విరాజాదరప్రాప్తవిద్యాపరాజా
పరాజాఖ్యవేదక్షపాపర్వరాజా, వరాజాఢ్యభాబాంధవస్వర్ధరాజా.

247


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తి
రాయనమంత్రితనూభవ సుజనహితకృత్యనిత్య అబ్బయామాత్యప్రణీతం బైనకవిరాజ
మనోరంజనం బనుమహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

248