Jump to content

కళాపూర్ణోదయము/రంభా గర్వభంగం

వికీసోర్స్ నుండి


కలభాషిణికి ఒక్క క్షణం ఆమె ఏమంటున్నదీ అర్థం కాలేదు. కానీ వెంటనే తనున్న పరిసరాలు, ఆ సిద్ధుడు వచ్చిన దగ్గర్నుంచి జరిగిన విషయాలు గుర్తొచ్చేసరికి మెల్లగా అర్థం కావటం మొదలుపెట్టింది తన పరిస్థితి. “ఇప్పుడే నీ బాధంతా పోగొడతాను” అన్న మాటకి అర్థం ఏమిటో తెలుస్తోంది!

ఆమెకి తన గత జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళముందు మెదిలింది. అలాటి బతుక్కి ఇలాటి చావా?

“అమ్మా, నువ్వన్నది నిజం. వీడు మాయావే, అనుమానం లేదు. అమాయకంగా వీడి ద్వారా నా కోరికొకటి సాధించుకుందామని వీడి చేతికి నేను చిక్కాను. కాని ఇప్పుడు పారిపొమ్మంటే ఎక్కడికి పోగల్ను? దూరదృష్టితో చూసి ఎక్కడున్నా పట్టుకోగలడు కదా!”

“వాడి దూరదృష్టీ దూరశ్రవణాల విషయం నీకూ తెలుసన్నమాట!”

“అదేగా ఇన్ని తిప్పలు తెచ్చిపెట్టింది?” అంటూ తన కథంతా ఆమెతో చెప్పుకుంది కలభాషిణి, ఇలాగైనా తనకి వస్తున్న ఆపద గురించి మరిచిపోవచ్చని.

“నాకూ ఇప్పుడర్థమౌతోంది. కష్టపడి దూరదృష్టి సాధించిన దగ్గర్నుంచి “దీనికి తోడు రాజ్య సంపదలు కూడా ఉంటే ఎంత బావుండునో!” అనుకుంటూ, “అద్భుతమైన గానం, మిరుమిట్లు గొలిపే సౌందర్యం కలిసున్న వేశ్య ఎక్కడన్నా ఉంటుందా?” అని దూరదృష్టితో వెదకటం గమనించాను నేను. ఒక చిన్న కిన్నర పట్టుకుని ఎప్పుడూ వాయించుకుంటాడు కూడ అలాగ అద్భుతమైన గానాన్ని పోల్చుకోవచ్చునని.”

“ఐతే ఇక్కడనే సంపాయించాడా దూరదృష్టి కూడ? దానికి ఎంతమందిని బలిచ్చాడో కదా ఈ దుష్టుడు! వాడొచ్చే లోగా కనీసం ఆ కథైనా చెప్పు వింటా. ఇంక చేసేదేముంది గనక?”

“ఎంత ధైర్యవంతురాలివి! అదే నీకు మేలు చేస్తుంది. ఇక వాడి విషయం చెప్తా విను. అదృష్టవశాత్తూ దూరదృష్టి దూరశ్రవణాల కోసం వేరే ఎవర్నీ బాధించక్కర్లేదు. తన్ని తనే బాధించుకోవాలి. తన కళ్ళు తనే పీక్కుని, చెవుల్లో పదునైన నారసాలు పొడుచుకుని సాధించాడు వాటిని. ఇదుగో, ఆ వ్యవహారమంతా చూద్దువు రా!” అంటూ మంటపం చివర, సింహవాహనం దగ్గర శిలాస్తంభానికి వేలాడగట్టిన శస్త్రాల్ని, చురకత్తిని, గండకత్తెరనీ చూపించింది.

“అదుగో, ఆ రాతిస్తంభం మీద ఫలానా కోరిక తీరాలంటే ఫలానా మార్గం అని రాసుంది. ఆ లిపి నీకర్థమౌతుందేమో చూడు” అని అటు తీసుకెళ్ళిందా వృద్ధురాలు.

అక్కడ ఇలా రాసుంది

“ఇక్కడ రెండేళ్ళ పాటు జితేంద్రియులై భువనేశ్వరీ మంత్రం జపిస్తే దేవి అన్ని కోరికలూ ఇస్తుంది!

అలా కాదంటే దూరదృష్టి కావలసిన వాళ్ళు ఈ గోరుగంటితో కళ్ళు పొడుచుకోవాలి!

దూరశ్రవణం కావలసిన వాళ్ళు ఈ ఘోరమైన నారసాన్ని చెవిలో పొడుచుకోవాలి!

సాహిత్యంలో గొప్పవాళ్ళు కావాలంటే ఈ చురకత్తితో నాలిక కోసేసుకోవాలి!

ఈ తళతళలాడే గండకత్తెరతో నడుం నరుక్కునే సాహసుడు ఒళ్ళు మళ్ళీ అతుక్కుని బతకటమే కాకుండా తనని చంపబోయేవాళ్ళని తనే చంపుతాడు!

గొప్ప అందం, సంగీతం ఉన్న వేశ్యను బలి ఇచ్చిన వాడు మహారాజౌతాడు!”

ఆ వాక్యంతో కలభాషిణి సందేహాలు పూర్తిగా తీరిపోయాయి.

“పైనున్న వాటిలో ఏదీ చెయ్యలేని వృద్ధులు ఈ దేవి ముందు నిర్భయంగా మరణిస్తే వాళ్ళకి మళ్ళీ యవ్వనం వస్తుంది. వాళ్ళు మరణవేళ కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది!” అని అదంతా చదవటం పూర్తి చేసింది కలభాషిణి.

చివరిభాగం విని నవ్వుతూ అన్నదా ముసలమ్మ “ఆ చివరి ముక్క వినే నేను ఇక్కడ ఉంటున్నది. అసలు నా పేరు సుముఖాసత్తి. కాశ్మీరంలో ప్రఖ్యాతమైన శారదా పీఠాన సరస్వతిని పూజించే పూజారి కూతుర్ని”.

ఇంతలో సిద్ధుడక్కడికి వచ్చాడు పూజాసామాగ్రితో! “అమ్మాయ్‌! మనం త్వరగా పూజ ముగించుకుని వెళ్దాం. పద పద”.

కలభాషిణిని ఒక్కసారిగా చావుభయం పట్టుకుంది. “ఒంటిగా పోలేను. నువ్వు కూడా నాతో రా” అన్నదా ముసలమ్మతో, వణుకుతూ!

సిద్ధుడికి విషయం అంతా అర్థమైంది.

“ఈ ముసిలివగ్గు నీకు తోడేమిటి? నేనున్నాగా!” అంటూ వాడు ఆమె కొప్పు పట్టుకు లాగబోతుంటే కలభాషిణి ప్రాణ భయంతో “ఓ అవ్వా, నీ బిడ్డ లాటి దాన్ని, కాపాడు” అని ఆమె వెనక నక్కుతుంటే ఆ ముసలమ్మ కూడా మనసు కరగ్గా “చంపొద్దు చంపొద్దు” అని వాడి చేతులు పట్టుకుంటే

“లోపలికి రాకుండా అడ్డం పడితే ఆగుతానా? ఇది మాత్రం దేవి ఎదటేగా!” అంటూ ఆమె చేతులు పక్కకి నెట్టేసి ఒక చేత్తో కలభాషిణి జుట్టు పట్టుకుని రెండో చేత్తో ఒరలోంచి కత్తి దూసి

“దేవీ! నీకిది అర్పణం” అని వాడు దేవతకి కత్తి చెయ్యెత్తి మొక్కి నరకబోయేంతలో

“దీన్ని చంపితే ఆ దేవి మీదొట్టు” అంటూ కలభాషిణి మెడకి తన మెడని అడ్డం పెడుతూ ఆ ముసలమ్మ

“ఓయ్‌ సిద్ధుడా! నా ఒట్టు దాటితే నీ కోరిక తీరదు గుర్తుంచుకో! ఓ మహాశక్తీ! నా మాట నిజమయ్యేట్టు చెయ్యి” అంటూండగా

వాడు మహారోషంతో ముందు ఆ ముసలమ్మ మెడ నరికి

విచిత్ర వేగంతో కలభాషిణి కొప్పు పట్టుకుని కత్తినెత్తే సరికి

ఆ దేవి తన మీది ఒట్టుని దాటబోతున్న వాడెత్తిన చేతిని ఎత్తినట్టే పట్టుకుని వాణ్ణి దూరంగా విసిరెయ్యటంతో

ఇంతలో కత్తి దెబ్బకి తన ముసలి శరీరం పోగా సుముఖాసత్తి విచిత్రంగా సరికొత్తగా యవ్వనంతో ప్రాణం పోసుకుని

ఒక చేత్తో కత్తినీ ఇంకో చేత్తో కలభాషిణి జుత్తునీ పట్టుకుని దూరంగా ఎగిరిపోతున్న సిద్ధుణ్ణి, వాడితో కలభాషిణినీ చూసి, ఆ అమ్మాయి అవస్థ ఇంకా తీరలేదని బాధ పడుతూ క్రమంగా “సృష్టి క్రమం ఇంతే” అని గ్రహించి ఆ దుఃఖం తగ్గించుకుని దేవి వరంతో కలిగిన యవ్వనాన్ని వృథా చెయ్యకుండా ఆ దేవినే గురువుగా భావించి అక్కడే యోగవిద్యాభ్యాసం చేస్తుండగా

కొన్నాళ్ళకి

మళ్ళీ అక్కడికి వచ్చింది కలభాషిణి!

అక్కడున్న అందమైన యువతిని చూసి ఆశ్చర్యంగా, “ఎవర్నువ్వు? ఎక్కడ్నించొచ్చావ్‌?” అనడిగింది కలభాషిణి. ఆమె నవ్వుతూ, “నేను ఇదివరకు నిన్ను రక్షించబోయి ఆ సిద్ధుడి కత్తికి బలై పోయిన సుముఖాసత్తినే! ఈ దేవి కరుణ వల్ల ఇలా మారా. నువ్వు ఎంతో దూరాన వెళ్ళి పడి కూడా ఏమీ హాని జరక్కుండా రావటమే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది” అంది కలభాషిణితో.

“నిజంగా ఆశ్చర్యం అంటే దేవిని మెప్పించి నువ్వు ఇలా యవ్వనాన్ని పొందటం! అలాటి నీ కరుణ ఉండగా నేను హాయిగా తిరిగిరావటంలో ఆశ్చర్యం ఏముంది? ఐనా జరిగినదంతా చెప్తాను విను” అని కలభాషిణి తన అనుభవాలు చెప్పబోతూ ఉండగా బుజాన వీణతో, రత్నమాలికతో కట్టిన పొడవాటి జుట్టుతో, గంభీరంగా వచ్చాడక్కడికి మణికంధరుడు!

సంతోషం, విస్మయంతో తడబడుతూ అతనికి నమస్కరించింది కలభాషిణి. మణికంధరుడు కూడా ఆనందంలో తలమునకలయ్యాడు. “ఓహోహో! నిన్ను చూస్తే నా చుట్టాలందర్నీ చూసినట్లుంది! ఎప్పుడైనా నేను గుర్తొస్తానా? ద్వారకెక్కడ, ఈ ఆలయం ఎక్కడ? అంతా క్షేమమే కదా! ద్వారకలో విశేషాలేమిటి?” అంటూ పాతజ్‌ నాపకాలన్నీ కలబోసుకున్నా రిద్దరూ.

“అన్నట్టు, అప్పుడు నీ మనసులో ఒక కోరిక ఉన్నట్టు గుర్తు. దాన్ని పెంచుకుంటూ వీణని వదిలేశావా ఏమిటి?” అని గుర్తు చేశాడు మణికంధరుడు.

ఒక్క క్షణం పాటు సిగ్గుతో మొగ్గయ్యింది కలభాషిణి.

కాని అంతలోనే తన పరిస్థితి తల్చుకుని, “ఏం చెప్పేది? దాని వల్లనే కదా నా వాళ్ళందర్నీ ద్వారకలో వదిలి నేనీ దిక్కు మాలిన చోట పడరాని పాట్లు పడింది?” అన్నది బాధగా. వాళ్ళు ద్వారక బయట విడిపోయిన దగ్గర్నించి సుముఖాసత్తి తనని దేవికి బలి కాకుండా కాపాడటం వరకు తన కథ చెప్పి, “ఈమే ఆ పుణ్యాత్మురాలు” అని ఆమెని చూపించింది. తర్వాత, “మరి నీ విషయం ఏమిటి? రంభ నీ తపస్సు చెడగొట్టటం గురించి మణిస్తంభుడు చెప్పాడు. అప్పట్నుంచి ఏమైందో వినాలని కుతూహలంగా ఉంది” అనడిగిందతన్ని.

అంతలోనే అక్కడికి వచ్చాడు మణిస్తంభుడు!

“ఇతనే నేను చెప్పిన సిద్ధుడు!” అన్నది కలభాషిణి మణికంధరుడితో.

“ఇతనా?” ఎగతాళిగానూ, ఆశ్చర్యంగానూ అన్నాడు మణికంధరుడు అతనెవరో అదివరకే తెలిసినట్లు! అదెలా సాధ్యం?

కలభాషిణి, మణికంధరుడు అక్కడే ఉండటం, సుముఖాసత్తికి యవ్వనం రావటం మణిస్తంభుడికి ఇదంతా మాయగా ఉంది, ఇంద్రజాలంలా ఉంది! (కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది అతనికి అంత ఆశ్చర్యం ఎందుకో!)

“సిద్ధుడా! నువ్వూ కలభాషిణీ ఎగిరి వెళ్ళి ఎక్కడ పడ్డారు? అక్కడేం జరిగింది? చూస్తే మీ అందరి దగ్గరా తలో కథ వున్నట్టుంది” అంది సుముఖాసత్తి కుతూహలంగా.

“తప్పకుండా చెప్తాను. అబ్బో, ఎన్నెన్ని విచిత్రాలు చూశాననుకున్నావ్‌! ఇప్పుడు వెంటనే అదంతా ఎవరికన్నా చెప్పకపోతే నా పొట్ట ఉబ్బిపోయేట్టుంది తెలుసా?” అంటూ తను చూసిన వింతలు విడ్డూరాల కథని వినిపించటం మొదలెట్టాడు మణిస్తంభుడు.

“నేను కన్నూ మిన్నూ కానకుండా నువ్వు దేవి మీద వేసిన ఒట్టుని కూడ లెక్కచెయ్యకుండా ఈ కలభాషిణిని చంపబొయ్యాను కదా! దేవి ఆ చేతినలా పట్టుకుని విసిరేసింది నన్ను. ఐతే నేనొక చేత్తో జుట్టు పట్టుకుని ఉన్నందువల్లనేమో, ఈమె కూడ నాతో పాటు ఎగిరొచ్చింది. అలా వెళ్ళి ఈమే, నేనూ ఇంకెక్కడా చోటు లేనట్టు వెళ్ళి వెళ్ళి ఈ మణికంధరుడి తపోవనంలో ఒక మెత్తటి పూలపాన్పు మీద పడ్డాం, అదేం చిత్రమో గాని! నిజంగా దేవి దయచూపించి అలా పడేసింది గాని లేకపోతే ఏమయ్యేవాళ్ళమో మేము! అలా ఒక చేత్తో కత్తి పట్టుకుని నేనింకా రెండో చేత్తో ఆమె జుత్తు పట్టుకుని ఉండటంతో ఈ కలభాషిణి గడగడ వణకటం మొదలెట్టింది.

అంత దగ్గరగా ఆమెని అలా చూసేసరికి చెప్పొద్దూ నాలో మదన వికారం కలిగి వెంటనే ఆమెని కౌగిలించు కున్నాను చేసిన పాపం చెప్తే పోతుందంటారు.

దాంతో కలభాషిణి రక్షించండని కేకలు పెట్టింది.

అప్పుడేమయిందీ “భయం వద్దు, నేనొస్తున్నా. ఎవడ్రా అక్కడ అసహాయురాలైన స్త్రీని బలాత్కరిస్తున్న వాడు! వాడెక్కడున్నా పట్టుకుని వాడి మెడ విరిచేస్తా” అనే మాటల్తోటే పరిగెత్తుకొచ్చాడక్కడికి నలకూబరుడు!

అతన్ని చూడ్డంతోటే ఈమెని వదిలేసి నేను పారిపోయా. ఐనా ఊరుకోక నన్ను తరిమి పట్టుకుని, “ఎవడ్రా నువ్వు? పద, నువ్వు బలాత్కరిస్తున్న స్త్రీ ఎక్కడుందో చూపించు. అప్పుడు నిన్ను ఏం చెయ్యాలో అది చేస్తా” అని నన్ను ఈడ్చుకొస్తూంటే ఎదురుగా వచ్చింది

రంభ!

చెదిరిన బట్టలు సర్దుకుంటూ, జారిన జుట్టు ముడేసుకుంటూ, ముఖం మీద పడ్డ వెంట్రుకులు సరిజేసుకుంటూ!

రావటమే “నీకెన్ని సార్లు చెప్పినా వినవు కదా! చేతులో క్తౖతెనా లేకుండా ఇలా పరిగెత్తటమేనా? బాగానే ఉంది సంబడం” అంటూ నన్ను చూసి, “వీడేనా ఆ అన్యాయం చెయ్యబోయింది? ఐనా మన్మథుడి దెబ్బకి ఎవరికైనా మతిపోతుందిలే! ఇంతకీ అదెక్కడ?” అంది రంభ.

“అందుకేగా వీణ్ణి లాక్కొస్తున్నది!” అని నలకూబరుడంటే,

“సరే, ఎక్కడికీ పోడు గాని అతని చెయ్యి వదిలెయ్యి” అని నన్ను విడిపించింది.

అందరం కలభాషిణిని వెదుక్కుంటూ తిరిగాం గాని ఎక్కడా ఆమె కనిపించనే లేదు!

నలకూబరుడు నా కత్తి తీసుకుని “ఆవిడని ఏం చేశావ్‌ చెప్పు” అని నన్ను గద్దించాడు.

రంభ కల్పించుకుని, “పోన్లే. తనే ఎక్కడికో వెళ్ళుంటుంది. మనం వెదుకుదాం పద” అంటూ అతన్ని దగ్గరగా లాక్కుని తీసుకెళ్ళింది. అతను నా కత్తిని ఎక్కడన్నా వదుల్తాడేమో తీసుకోవచ్చునని నేను కూడా జాగ్రత్తగా వాళ్ళ వెనకనే వెళ్ళా.

అలా వెళ్తూనే నా దూరదృష్టితో ప్రపంచం అంతా వెదికినా ఎక్కడా కూడ కనపడ లేదనుకో ఈ కలభాషిణి, ఎలా మాయమయ్యిందో గాని!

తర్వాత వాళ్ళిద్దరూ రతిక్రీడల్లోకి దిగారు. నేను దూరంగా ఉండి గమనిస్తున్నా.

ఇంతలో జరిగింది నా మతిపోయే సంఘటన!

అలా నే చూస్తుండగానే అక్కడికి వచ్చింది ఇంకొక రంభ!

బిత్తరపోయింది అక్కడి పరిస్థితి చూసి!

నలకూబరుడూ ఆశ్చర్యపోయాడు ఆమెని చూసి!

వాళ్ళందర్నీ చూసి నాకు కళ్ళు తిరిగాయి!

నలకూబరుడు వాళ్ళిద్దర్నీ ఎగాదిగా చూశాడు చాలా సేపు. కానీ, వాళ్ళలో ఏమాత్రం తేడా కనిపించలేదతనికి!

“ఏమిటీ ఇటూ అటూ చూస్తున్నావ్‌! ఏమిటి నీ ఉద్దేశ్యం?” అని గద్దించిందతని పక్కనున్న రంభ.

“ఒకరికొకరు ప్రతిబింబాల్లా ఉన్నారు మీరు! నువ్వు నా పక్కనే లేకపోతే మీలో ఎవరు ఎవరో చెప్పటం కూడా అసాధ్యంలా ఉంది” అన్నాడతను తన్లో తను మాట్టాడుకుంటున్నట్టు.

“అట్లైతే నిన్ను వదలకుండా అంటి పెట్టుకునే ఉంటాను. అదివరకో రాక్షసి సీతనీ రాముడినీ విడగొట్టటానికి వచ్చిన కథ వింటాం కదా! అలాటిదే ఇదీ! ఈ చుట్టుపక్కల లేకుండా వెళ్ళగొడదాం పట్టు. కాని నువ్వు మాత్రం కదలొద్దు” అంటూ అతన్ని కౌగిలించుకుంది.

ముక్కున వేలేసుకుని తల విదిలించి ఉసూరు మన్నది కొత్తగా వచ్చిన రంభ.

ఆమెని చూసి నలకూబరుడు “ఎవర్నువ్వు? నా ప్రేయసి రూపంలో ఎందుకున్నావ్‌ ? ఎందుకీ నిట్టూర్పులు? నువ్వు రాక్షసివా పిశాచివా చప్పున చెప్పు నీ విషయమేమిటో!” అన్నాడు.

“ఏమంటానికీ ఏముంది? దానికీ నాకూ తేడా చూపించే ఉపాయం ఆలోచిస్తున్నా. ఇదెవరో సరిగ్గా నాలానే ఉంది! చల్లటి సురపొన్న చెట్టుకింద పూల పానుపు మీద మనం ఉంటే పడమట నుంచి ఒక స్త్రీ ఆర్తనాదం వినపడి నువ్వు పరిగెత్తావు. నేనూ నీతో వద్దామని బయల్దేరి అంతలో ఎదురుగా ఒక జింక వస్తే అపశకునం అని కాసేపు దాన్ని చూస్తూ అలాగే నిలబడ్డా. ఇంతలో ఇది నా వేషం ఎలా వేసిందో నాకర్థం కావటం లేదు” అందా రెండో రంభ ఆలోచిస్తూ.

“చూశావా, మన విషయం అంతా చూసినట్లే చెప్పేస్తోంది! కన్ను తెరిచుండగానే కనుపాపని దొంగతనం చేసేంత మునిముచ్చు లాగా ఉంది. దీని దగ్గర ఉండటమే మనకి మంచిది కాదు. ఇక్కడి నుంచి ఎటన్నా వెళ్దాం పద” అంటూ తొందర చేసింది తొలి రంభ.

“ఆహా! ఇల్లలగ్గానే పండగయిందా? అతన్ని అంత తేలిగ్గా వదిలేసుకుంటాననుకున్నావా! అతన్ని వదిలి పక్కకి రా ముందు, నీ అంతు చూస్తాను” అంటూ యుద్ధానికి దిగింది రెండో రంభ.

మొదటి రంభ కూడ ఇంక ఊరుకోలేకపోయింది!

ఇద్దరూ మూతులూ తిప్పుకుంటూ మెటికలు విరుచుకుంటూ నువ్వెంతంటే నువ్వెంతని తిట్టుకున్నారు నలకూబరుడు ఎంత ప్రయత్నించినా ఆగకుండా.

ఈ పోట్లాటతో తన ఆకలి తీరుతోందని ఆనందిస్తూ అక్కడికి వచ్చాడు

నారదుడు హాయిగా వీణ మీటుకుంటూ!

ముగ్గురూ వెళ్ళి అతనికి నమస్కరింఛారు.

నారదుడికి మహా ఉల్లాసంగా ఉంది!

ఔను మరి తన ముందు మిడిసిపడ్డ రంభకి పొగరు అణుగుతోంది!

“నలకూబరా! వదలని ప్రేమతో వర్ధిల్లండని మిమ్మల్ని దీవించాలని ఉందయ్యా! మరి వీళ్ళలో నీ ప్రేయసి ఎవరో చెప్తే ఆపని చేసేసి నా దారిన నేను పోతా. కానీ, ఇదేదో చాలా గమ్మత్తుగా ఉందే! తనకంటే నీకింకో ప్రేయసి లేదని రంభకి గర్వంగా ఉందని నువ్వే రెండో రంభని సృష్టించావో లేకపోతే నీతో ఆనందాలు అనుభవించటానికి ఒక్క శరీరం చాలటం లేదని రంభే సృష్టించిందో గాని మొత్తానికి ఇద్దరికీ భలే పోట్లాటపెట్టావయ్యా! చాలా సేపట్నుంచి ఆకాశంలో నిలబడి చూస్తున్నాను మీ వ్యవహారం అంతా!” అన్నాడు నారదుడు చిలిపిగా.

“అయ్యో స్వామీ!నేనేం పోట్లాడించాను? ఎవరెవరో తెలీక సతమతమౌతూ వుంటే!” అని వాపోయాడు నలకూబరుడు.

తన పక్కనే ఉన్న రంభను చూపించి, “ఈమే ఇంతకు ముందు వరకు నాతో ఉన్నది; ఆ రెండో ఆమె తర్వాత వచ్చింది. వీళ్ళలో ఎవరు ఎవరో నాకేమీ అర్థం కావటం లేదు” అన్నాడు.

అప్పుడు రెండో రంభ, “మహానుభావా! మీరప్పుడు ద్వారకలో అన్న మాటల వల్లనే ఇంతా జరిగింది!” అంది నిష్టూరంగా. మొదటి రంభ కూడ, “ఔను స్వామీ! మీరప్పుడు ద్వారకలో అన్న మాటల వల్లనే ఇంతా జరిగింది!” అన్నది.

హాయిగా నవ్వుతూ అన్నాడు నారదుడు, “ఔను. మీరిద్దరన్నదీ నిజమే!” అని. నలకూబరుడి ఓపిక నశిస్తోంది.

“ఇద్దరిదీ నిజమెలా ఐందో కాస్త చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది!” అనడిగాడతన్ని.

“ఏముందీ, వీళ్ళలో ఒకతె గర్వంగా మాట్లాడితే చూడలేక నీకు ముందు ముందు సవతి రావొచ్చులే అన్నాను. ఈవిధంగా అది నిజమైంది. ఇక రెండవది రంభ రూపంలో తన ప్రియుణ్ణి కలవాలనుకుని ఒక సందర్భంలో నా దగ్గర వరం తీసుకుంది. ఆమె విషయంలో ఇప్పుడా వరం నిజమైంది” అన్నాడు నారదుడు యుక్తిగా! (ఒక్క క్షణం ఆగుదాం ఇక్కడ! ఇప్పటికి ఆ ఇద్దర్లో ఒకరు రంభ, మరొకరు ???? అని తెలిసిపోయింది కదా! అనుమానం ఉంటే కథ మొదటికి వెళ్ళి చూడండి!)

“సరే స్వామీ! బాగానే ఉంది. ఐతే వీళ్ళలో ఎవరి విషయంలో ఏది నిజమైందో చెప్తే అప్పుడు ఎవరో నిజమో ఎవరో కాదో తెలిసి పోతుంది” అన్నాడు నలకూబరుడు ఆశగా.

అంత తేలిగ్గా దొరుకుతాడా నారదుడు!

“ఈ ప్రపంచంలో నిజమేమిటీ అబద్ధమేమిటి? ఆ మాటకొస్తే నీ రూపం నిజమైందా? అంతా మాయ. ఏమైనా అదృష్టం అంటే నీది. ఈ ఇద్దర్లో ఒకరికొకర్ని పోటీగా ఉంచి ఇద్దర్నీ నీ అదుపులో ఉంచుకోవచ్చు, ఇద్దరితోటీ హాయిగా ఉండొచ్చు!”.

వ్యవహారం దూరం వెళ్తున్నదని వెంటనే నారదుణ్ణి అక్కడ్నించి పంపదల్చుకున్నాడు నలకూబరుడు. “స్వామీ! మీలాటి పెద్దల్ని ఎక్కువ సేపుంచి ఏంమాట్లాడితే ఏమొస్తుందో! ఇప్పటికే చాలా సేపు ఉంచాం మిమ్మల్ని” అనటంతో నారదుడు విలాసంగా నవ్వుకుంటూ “అలాగే, నీ జాగ్రత్తలో నువ్వుండు మరి!” అని అక్కడ్నించి నిష్క్రమించాడు.

అప్పుడిక నలకూబరుడు మొదటి రంభని తీసుకుని, “ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం పద” అంటూ రెండో రంభతో, “నీవన్నీ మాయలుగా కన్పిస్తున్నాయి.నిజం తేల్చగలిగే సాక్షి ఎవరన్నా ఉంటే తెచ్చుకో పో” అని తిరస్కారంగా అంటే

మొదటి రంభ కూడ “ఒక జంట ఏకాంతంగా ఉన్నప్పుడు యిట్లా వచ్చి అల్లరి చెయ్యటానికి సిగ్గు లేదూ? ఆశకైనా అంతుండాలి” అని యీసడిస్తే కోపం వచ్చిన రెండో రంభ, “నాకేం, కుబేరుడు లేడా, ఇంద్రుడు లేడా, బ్రహ్మ లేడా, ధర్మం నిలబెట్టటానికి ఒక్కరైనా ముందుకు రారా?” అంటే

మొదటి రంభ గర్వంగా “నీ దిక్కున్న చోట చెప్పుకో పో! నీ అరిచేతికి పళ్ళొచ్చినప్పుడు కరుద్దువ్‌ లే నన్ను” అనటంతో

రోషంతో రెండో రంభ “తొందర పడకు, నీ నెత్తినే పొద్దు పొడిచిందా! చూస్తా!” అని కొద్ది అడుగులు వేసి అతని వియోగం భరించలేక ఆగి, ఆలోచించి, “నువ్విక్కడ అతన్తో కులుకుతుంటే నే వెళ్ళి వాళ్ళకీ వీళ్ళకీ ఎందుకు మొర పెట్టుకోవాలి? నువ్వూ రా దేవసభకి! వెళ్ళి అక్కడే తేల్చుకుందాం” అని మొదటి రంభ కొంగు పట్టుకుని తీవ్రంగా లాగుతుంటే,

“చూశావా దీని ఆగడం, యిది రాక్షసి కాక స్త్రీనా? అసలు దీంతో ఇంతసేపు మాట్టాడ్డం మనదే తప్పు” అని మొదటి రంభ అంటే,

“మనకేం! పెద్దల సభలోనే దాని అంతు తేలుద్దాం పద” అని నలకూబరుడు కూడా అనటంతో కొంత ఉత్సాహం పుంజుకున్న రెండో రంభ “నిన్ను వదుల్తాననుకున్నావా? కదులు, దేవసభకి రావాల్సిందే!” అని గద్దించటంతో

కొంచెం ఆలోచించి మొదటి రంభ “ఇంత బతుకూ బతికి ఇంటి వెనక చచ్చినట్టు అప్సరసల్లో అందరికన్నా గొప్పదాన్నై ఉండి, ఊర్వశీ మేనకల్లాంటి వాళ్ళ చేత మర్యాదలు చేయించుకుంటూ ఎప్పుడూ ఎవరి చేతా వేలెత్తి చూపించుకోకుండా బతికిన నేను యిప్పుడీ సవతి పోరు తీర్చమని ఇంద్రసభకి వెళ్ళాలా? నా బతుకింత నవ్వుల పాలు కావాల్సిందేనా? ఇప్పుడే కాదు ఇంకెప్పుడూ నేను భూమిని విడిచిపెట్టి రాను” అని ఖరాఖండిగా తీర్మానించటంతో

రెండో రంభ ఇంకా విజృంభించి, “చూశావా దీని టక్కులు? వస్తే తన మోసం బయటపడుతుందని దేవసభకి రానంటున్నది; అసలు దీనికి ఆకాశగమనం ఉన్నదో లేదో కూడా అనుమానమే! ఇంతసేపూ దీన్ని నమ్మినందుకు నిన్ననాలి” అని ఊదరగొట్టెయ్యటంతో

నలకూబరుడిక్కూడా పరిస్థితి అర్థమై మొదటి రంభని “ఓసి మాయలాడీ!” అని మెడబట్టి నెట్టటం, రెండో రంభ “ఇంత సేపూ నన్ను మన్మథుడి కత్తికి బలిచేశావు గనక నువ్వు కత్తివేటుకే చస్తావ్‌!” అని శపించటంతో ఆ వ్యవహారం ఓ కొలిక్కి చేరింది.

నలకూబరుడింకా ఆ మాయ రంభని “ఎవర్నువ్వు? నీ పేరేమిటి?” అని గద్దిస్తుంటే అసలు రంభ “దాన్నిక పోనీయ్‌! నా కోరిక సంగతి చూడు ముందు” అంటూ అతన్ని లాక్కుపోయింది” అంటూ వాళ్ళకి మణికంధరుడి తపోవనంలో తను చూసిన వింతలూ విడ్డూరాలు చెప్తున్న మణిస్తంభుణ్ణి “ఇది వరకెప్పుడూ కనీ వినీ ఎరగని కథ చెప్తున్నావ్‌! మరి ఆ తర్వాత ఏంజరిగింది?” అనడిగింది సుముఖాసత్తి.

“అప్పుడే ఏమైంది? అసలు కథ ఇంకా ముందుంది!” అంటూ మళ్ళీ ప్రారంభించాడు మణిస్తంభుడు ఉత్సాహంగా!

“అలా రంభానలకూబరులు వెళ్ళి ఒక పూలపానుపు మీద మదనక్రీడల్లో ఆనందిస్తూ ఉండగా ఇంకో నలకూబరుడు వచ్చాడక్కడికి, “నా రూపంలో ఎవడ్రా రంభతో ఉన్నాట్ట!” అని కేకలేస్తూ.

చెప్పొద్దూ, ఇదంతా చూస్తున్న నాకు ఒళ్ళు జలదరించింది. ఒకదాని వెంట ఒకటిగా ఇలా మాయలు జరిగిపోతుంటే ఈ ప్రపంచం ఏమౌతుందో అని భయమేసింది!

అతనలా వచ్చేసరికి రంభ నలకూబరుడితో, “చూశావా, నీలాటి వాడొకడొస్తున్నాడు! ఇప్పటి దాకా నారూపంలో వచ్చి మనల్ని తిప్పలు పెట్టింది చాలక ఎవడో రాక్షసుడు రకరకాల మాయలు పన్నుతున్నట్టున్నాడు” అంటూండగా,

“అదేమిటి రంభా ఆ మాటలు? అసలు నలకూబరుణ్ణి నేను! వాడెవడో మాయావి. నామాట నమ్మనంటావా, చూస్తుండు ఇప్పుడే నా కత్తితో వీణ్ణి తెగనరుకుతా. ఆ తర్వాత తేల్చుకుందూ గాని నేనో వాడో” అని రెండో నలకూబరుడు గర్జించేసరికి రంభ భయంతో తన ప్రియుడి కంఠం కౌగిలించుకుని “దేవతలారా, రక్షించండి! ఎవడో రాక్షసుడు నిరాయుధుడిగా ఉన్న నా ప్రియుణ్ణి చంపబోతున్నాడు” అని ఏడ్చి గగ్గోలు పెడుతుండగా

రెండో నలకూబరుడు నవ్వి “అరరే, నన్నే రాక్షసుణ్ణి చేశావా! భయ పడకు, నిరాయుధుణ్ణి చంపను. కావాలంటే తన కత్తి తెచ్చుకోమను. యుద్ధం అంటే ఎవరు గెలుస్తారో ఎవరు చస్తారో నిజం నలకూబరుడు చస్తే ఎలాగ అని నీకు భయమైతే మాలో ఎవరు నిజమో తెలిసే దాకా ఆగి అప్పుడే యుద్ధం చేస్తాలే. ఈ లోగా నువ్వు రహస్యాలడిగో, మాలో తేడాలు పరికించి చూసో తేల్చు… ఐతే ఒక మాట. నా ఎదురుగా నువ్వు వాణ్ణి కౌగిలించటం నేను భరించలేక పోతున్నా! కనక నాకు ఆవేశం వచ్చి వాణ్ణి చంపకుండా ఉండాలంటే నువ్వు వాడికి దూరంగా ఉండు” అంటే ఎందుకైనా మంచిదని రంభ ఇద్దరికీ మధ్య దూరంలో నిలబడి ఎంత చూసినా ఏమీ తేడా కనపడక బిత్తరపోయి చూస్తుంటే

రెండో నలకూబరుడన్నాడు, “ఇంద్రుడు పంపితే నువ్వు మణికంధరుడి తపస్సు చెడగొట్టటానికి వచ్చావు కదా! వాణ్ణి ఏ అడివికి తోలేశావు? మధ్యలో వీడెక్కడ తగులుకున్నాడు? దేవకార్యం చెడుతుందని నేను నీ విరహంతో చస్తూ చివరికి ఏమన్నా కానీ అని వచ్చి ఇక్కడికి దగ్గర్లోనే ఒక తోటలో నీ కోసం ఎదురుచూస్తూ ఉంటే నువ్విక్కడ వీడితో గడుపుతున్నావ్‌! ఇంతకు ముందే నారదుడు వచ్చి “నువ్విక్కడ విరహంలో మునుగుతూ కూర్చుంటే అక్కడెవడో నీలాటి వాడే రంభతో సుఖాలు అనుభవిస్తున్నాడ”ని చెప్పేదాకా తెలీలేదు. ఇప్పుడు చెప్పు వీడు ఎప్పుడు ఎక్కడ దాపరించాడు నీకు?” అని తన సొద చెప్పుకుంటే ఏమీ తోచని రంభ

“ఏం చెప్పమంటావ్‌?” అని మొదటి నలకూబరుడి వంక చూస్తే అతను,

“ఏమిటలా చూస్తున్నావ్‌? గుర్తులేదా నీకు అదివరకు నారదుడన్నాడు కదా నీలాటిది నిన్నూ నాలాటి వాడు నన్నూ పట్టుకుని తిప్పలు పెడతారని! ఆ మాట ఇలా నిజమైంది. నీకేం భయం వద్దు. నేనిప్పుడే వెళ్ళి నా కత్తి తీసుకొచ్చి వీడి అంతు చూస్తాను” అని బయల్దేరబోతుంటే రెండో వాడు,

“అంత పోటుగాడివైతే ఇప్పుడే రా, నా కత్తి కూడా పారేస్తాను,నీ సంగతేమిటో చూస్తాను” అంటూ కత్తి పారేసి మల్ల యుద్ధానికి దిగటంతో ఇద్దరూ హోరాహోరీ బాహాబాహీ ముష్టాముష్టీ తలపడితే

వాళ్ళలో పచ్చ దట్టీ ఉన్నవాడు తన ప్రియుడనీ చంద్రకావి దట్టీ ఉన్నవాడు రెండో వాడనీ గుర్తు పెట్టుకుని రంభ చూస్తూండగా రకరకాల విన్యాసాల్తో ఎంతో సేపు పోరాడి ఇద్దరూ అలిసిపోయి చతికిల పడగా రంభకి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది!

“మీ యుద్ధం ఆపండింక! నేనొక రహస్యవిషయం అడగబోతున్నా. దాన్ని బట్టి ఎవరు నిజమో తెలుస్తుంది” అని ఇద్దర్నీ విడివిడిగా తీసుకెళ్ళి,

“మనం కళాపూర్ణుడి విషయం ఏ సందర్భంలో మాట్లాడుకున్నాం?” అని అడిగేసరికి రెండో వాడు! టక్కుమని సమాధానం చెప్పాడు!

ఆమె అప్పటి దాకా నిజం నలకూబరుడు అనుకుంటున్న మొదటి వాడు తెల్లబోయి నిలబడ్డాడు!

“అయ్యయ్యో! ఇందాకట్నుంచి నువ్వే అసలు నలకూబరుడివనుకున్నా కదా! ఓరి మాయావీ!” అని రెండో వాడి దగ్గరికి పరిగెత్తింది రంభ కంగారుగా.

మహాకోపంతో వాణ్ణి అల్పాయుష్కుణ్ణి కమ్మని శపించాడు నలకూబరుడు!

రంభ “అసలెవరివి నువ్వు? ఎందుకీ వేషం వేశావ్‌?” అనడుగుతుంటే, “ఐన ఆలస్యం చాలకనా ఇంకా వాడితో మాటలు? పద పోదాం” అని నలకూబరుడు ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు.

మాయానలకూబరుడు కొంతసేపు నిట్టూరుస్తూ నిలబడి మణికంధరుడి పర్ణశాల వైపుకి వెళ్తుంటే అతను వదిలేసిన నా కత్తిని తీసుకుని ఆనందంగా ఇక్కడికి వచ్చాన్నేను! పైగా నా గురువు గారు ఈ కత్తిని నాకిస్తూ దీంతో నువ్వు ఎవర్ని చంపబోతావో వాళ్ళని ఎప్పటికైనా ఈ కత్తే చంపుతుందన్నారు. నేను దీంతో కలభాషిణ్ణి చంపాలనుకున్నా గనక అప్పటికి తప్పించుకున్నా …” అని ఆపైన అనటానికి నోర్రాక దిక్కులు చూడసాగాడు మణిస్తంభుడు.

“నీకు జంకేం అక్కర్లేదు. ఎలా జరగాలో అలా జరుగుతుంది లే!” అంది కలభాషిణి ధైర్యంగా. “వివేకవంతురాలివి గనక అలా అనగలిగావ్‌! సరే గాని, మరి నీ కథేమిటో చెప్పు. నిన్ను వదిలేసి నేను పారిపోయాక ఎక్కడ వెదికినా కనపడలేదు నువ్వు! ఏమయ్యావ్‌, ఎలా మాయమయ్యావ్‌?” అనడిగాడు మణిస్తంభుడు.

నవ్వింది కలభాషిణి, “నా కథంతా నువ్వే చెప్పేశావ్‌! ఇంక నేను చెప్పాల్సింది ఏముంది?” అంటూ!

“ఆ నలకూబరుడు నన్ను చూపించమని నిన్ను లాక్కొస్తుంటే మీకు ఎదురు పడ్డ రంభ ఎవరో కాదు, నేనే! నిన్ను విడిపించి అతన్ని తీసుకెళ్ళి అతన్తో కొంతసేపు రతిక్రీడలు సాగించా. ఇంతలో అసలు రంభ అక్కడికి రావటం, ఆమెతో పోట్లాడి చివరికి బయటపడి కత్తి వేటుతో చచ్చే శాపం తెచ్చుకోవటం అన్నీ నువ్వే చెప్పేశావ్‌!” అని చెప్పింది కలభాషిణి అందర్నీ ఆశ్చర్యంలో ముంచుతూ!

“అలానా! మరి రంభగా మారే శక్తి నీకెలా వచ్చింది?” అనడిగాడు మణిస్తంభుడు నమ్మలేక పోతూ! “అది నారదుడిచ్చిన వరం. జింక ఎదురొచ్చి రంభ నలకూబరుడి వెంట వెళ్ళకుండా ఆగటంతో ఇదే సమయమనుకుని నేను ఆమె రూపంలో అతన్ని దక్కించుకున్నాను. పాపం, ఆ నారదుల వారు కూడ నా మొహం చూసి నేనెవర్నో బయటపెట్టకుండా వెళ్ళిపోయారు. … చివరికి ఎలాగూ శాపం రానే వచ్చింది గనక అదేదో ఈ దేవి దగ్గరే అనుభవిద్దామని ఇక్కడికొచ్చానిప్పుడు. మీ గురువు గారి మాట నిజం కావటానికేనేమో నువ్వూ నేనూ కూడా ఇక్కడికే చేరాం!” అన్నది కలభాషిణి తన్లో తను మాట్టాడుకుంటున్నట్టు!

అంతలోనే ఆమెకి మరో విషయం గుర్తొచ్చింది.

దాన్తో పాటు ఒక పెద్ద నిట్టూర్పు కూడ బయటికొచ్చింది.

“నేను పడ్డ ప్రయాసకి కనీసం నలకూబరుడన్నా దక్కాడని ఆనందిస్తుంటే, ఆ తరవాత అసలు నలకూబరుడొచ్చి నాతో ఉన్నవాణ్ణి శపించాడని చెప్తున్నావ్‌ నువ్వు! ఇంతకూ ఆ మాయలమారి మోసగాడు ఎవడో!” అని కలభాషిణి అంటూంటే

“అట్టె, అట్టె! ఇంకేమీ అనొద్దు!

అలా నలకూబరుడి రూపంలో ఉంది ఎవరో గాదు నేనే!” అన్నాడు మణికంధరుడు నవ్వుతూ!