కన్యాశుల్కము/ద్వితీయాంకము

వికీసోర్స్ నుండి


శ్రీ

కన్యాశుల్కము

ద్వితీయాంకము

1-వ స్థలము, కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు ఇల్లు

(అగ్నిహోత్రావధాన్లు జంఝాలు వడుకుచుండును. కరటకశాస్తుల్లు శిష్యుడిచేత లేనిపేలు నొక్కించుకొనుచుండును. వెంకమ్మ కూర తరుగుచుండును.)

వెంకమ్మ-- నిన్నట్నించి కిశిమీశ్శలవులని కుఱ్ఱవాడు వుత్తరం రాశాడు. యెన్నాళ్లో ఐంది వాణ్ణిచూసి, కళ్లు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి.

అగ్నిహోత్రావధాన్లు-- ఎందుకు వొట్టినే వగచడం? వొద్దు వొద్దంటూంటే యీ యింగిలీషు చదువులోపెట్టా`వ్‌. మెరకపొలం సిస్తంతా వాడి కిందయిపోతూంది. కిందటి యేడుపరిక్ష ఫేలయి పోయినాడు గదా? యీయేడు యెలాతగలేశాడో తెలియదు. మనకీ యింగిలీషు చదువు అచ్చిరాదని పోరిపోరి చెబితే విన్నావుకావు. మా పెద్దన్న దిబ్బావుధాన్లు కొడుకుని యింగిలీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి వూష్టం వొచ్చి మూడ్రోజుల్లో కొట్టేశింది. బుచ్చబ్బి కొడుక్కి యింగిలీషు చెప్పిద్దావఁనుకుంటూండగానే చచ్చినంత ఖాయలా చేసింది.

వెంకమ్మ-- మీరెప్పుడూ యిలాంటి వోఘాయిత్తం మాటలే అంౘూవుంఛారు. డబ్బు కర్చయిపోతుందని మీకు బెంగ. మొన్నమొన్న మనకళ్లెదుట మనవాకట్లో జుత్తు విరబోసుకు గొట్టికాయలాడిన నేమానివారి కుఱ్ఱాడికి మునసబీ ఐంది కాదూ?

అగ్ని-- మన వెధవాయకి చదువొచ్చేదేం కనపడదుగాని పుస్తకాలకిందా జీతంకిందా యిహ నాలుగేళ్లయేసరికి మనభూమి కడతేరిపోతుంది. ఆపైని చిప్పా దొప్పా పట్టుకు బయల్దేరాలి. నిమ్మళంగా యింటి దగ్గిరుంటే యీపాటికి నాలుగష్టాలు చెప్పేదును. వొద్దంటూంటే యీవెధ వింగిలీషు చదువులో పెట్టావు.

వెంకమ్మ-- మనవాడికో మునసబీ ఐనా పోలీసుపనైనా ఐతే రుణాలిచ్చి యీ అగ్ఘురారం భూవుఁలన్నీ కొనేస్తాడు. యాడాదికో నూఱ్ఱూపాయలు కర్చుపెట్టడానికింత ముందూ వెనకాచూస్తున్నారు, మీలాగేవాడూ జంఝాలు వొడుక్కుంటూ బతకాలని వుందా యేవిఁషి? మీకంత భారవఁంతోస్తే మావాళ్లు నాకు పసుపూకుంకానికీ యిచ్చిన భూవఁమ్మేసి కుఱ్ఱాడికి చదువుచెప్పిస్తాను.

కరటకశాస్త్రి -- నీభూవెఁందు కమ్మాలమ్మా? మనసొమ్ము చడతిని కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు.

అగ్ని-- ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావషే? యీ మారంటే నీ అన్నవున్నాడని వూరుకునేదిలేదు.

[గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు.]

వెంక-- మావాబ్బా బాబు వచ్చావషొయ్‌! (వెంకటేశమును కౌగలించుకొనును.)

అగ్నిహో-- వెధవాయా యీమారైనా పా`సయినావా? (వెంకటేశం తెల్లబోయి చూచును.)

గిరీశం-- పాసయినాడండి, ఫస్టుగా పాసయినాడు. నేను చాలాశ్రమపడి చదువు చెప్పానండి.

అగ్ని-- యీతుర కెవడోయ్‌!

గిరీశం-- టర్క్‌! డామిట్‌, టెల్‌మాన్‌.

అగ్ని-- మానా? మానులావుంచా నంఛావూ? గూబ్బగలగొడతాను.

వెంకటేశం-- (వణుకుతూ తల్లివేపుచూసి) అమ్మా యీయ్నే నాకు చదువు చెప్పే మేష్టరు.

కరట-- ఇంటికి పెద్దమనిషొస్తే అపృచ్ఛపు మాటలాడతావేవిఁటి బావా? ఆయనేదో కుఱ్ఱవాడితో యింగిలీషు మాటంటే పుచ్చకాయలదొంగంటే బుజాల్తడువుఁకున్నట్టు నీమీద పెట్టుకుంటావేం?

(బండివాడు సామానుదించును.)

గిరీశం-- (కరటకశాస్త్రితో) తమ బావగారా అగ్నిహోత్రావఁధాన్లుగారు? నన్ను తమరు యరక్కపోవచ్చునుగాని డిప్టీకలక్టరుగారింటికి తమరువచ్చేటప్పుడు నేను వారి పిల్లలికి చదువుచెబుతూ వుండేవాణ్ణి. డిప్టీకలక్టరుగారు తమర్ని యే మ్మెచ్చుకునేవారనుకుంటారు!

కరట-- అవును మీమొఖం చూచిన జ్ఞాపకవుఁంది. డిప్టీకలక్టరుగారు మహదొడ్డప్రభువ్‌.

గిరీశం-- మీలాంటి చప్పన్నభాషలూ వచ్చిన మనిషి యక్కడా లేడనీ, సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ, తమలాంటి విదూషకుణ్ణి యక్కడా చూళ్లేదనీ డిప్టీకలక్టరుగారు శలవిస్తూండేవారు. కవితారసం ఆయన్లా గ్రెహించేవారేరీ? నాకవిత్వవఁంటే ఆయ్న చెవికోసుకుంటారు. మహారాజావారి దర్శనం కూడా నాకు చెయించారండి.

అగ్ని-- (ధుమధుమలాడుతూ) ఈ శషభిషలు నాకేం పనికిరావు. యితడి వైఖరిచూస్తే యిక్కడే బసవేసేటట్టు కనపడుతూంది. మాయింట్లో భోజనం యంతమాత్రం వీలుపడదు.

వెంక-- ఆయనమాటలు గణించకు బాబూ, ఆయన మోస్తరది. మీదయవల్ల మావాడికో ముక్కబ్బితే మీమేలు మరిచిపోం.

గిరీశం-- అందు కభ్యంతర వేఁవిఁటమ్మా, మీవాడు శలవుల్లో చదువుచెప్పమని యంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుఱ్ఱవాడుగదా అని వొచ్చానుగాని పట్ణంలో మునసబుగారింట భోజనం లేదని వొచ్చానా, వారిచ్చేడబ్బు చేదని వొచ్చానా అమ్మా?

వెంకమ్మ-- యీ చదువులకోసవఁని పిల్లణ్ణి వొదులుకునివుండడం, వాడు పరాయివూళ్లో శ్రమదమాలు పడుతూండ్డం నాప్రాణాలు యెప్పుడూ అక్కణ్ణే వుంఛాయి. డబ్బంటే యెన్నడూ వెనక చూళ్లేదుగదా. మేం కనడంమట్టుకు కన్నాం. మీరే వాడికి తల్లీ తండ్రీని. యలా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదేభారం.

గిరీశం-- తమరు యింతదూరం శలవియ్యాలమ్మా? నా మంచిచెడ్డలు మీ కుఱ్ఱవాణ్ణడిగితే తెలుస్తుంది. మునసబుగారూ, డిప్టీకలక్టరుగారూ యెన్నికచేసిన మనిషిని. నా మాట నే చెప్పుకోవాలా, ఇంతెందుకూ యిక మూడేళ్లు నా తరిఫీదులో వుంచితే క్రిమినల్లో వరసగా పోలీసు పరిక్ష పాసుచేయిస్తాను.

అగ్ని-- మూడేళ్లే! యీ సంవత్సరం పుస్తకాల కెంతవుతుందిరా అబ్బీ?

వెంకటేశం-- పదిహేన్రూపాయ లవుతుంది.

అగ్ని-- ఒక్కదమ్మిడీ యివ్వను. వీళ్లిద్దరూకూడి ఆ రూపాయలు పంచుకుతినేటట్టు కనపడుచూంది. నేను వేదం యనబైరెండు పన్నాలూ ఒహదమ్మిడీ పుస్తకాలఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతుంది.

కరట-- (నవ్వుతూ) కోట్లకి విలవైనమాట అన్నావు బావా!

గిరీశం-- (కరటకశాస్త్రితో) దిసీజ్‌ బార్బరస్‌, చూచారండీ, జెంటిల్మేన్‌ అనగా పెద్దమనిషిని యలా అంటున్నారో! నేను యిక యిక్కడ వుండడం భావ్యం కాదు, శలవు పుచ్చుకుంటాను.

వెంకమ్మ-- చాల్చాలు బాగానేవుంది! యింటి కెవరొచ్చినా నాకిదే భయం, ఆయన మాటల కెక్కడికి బాబూ, వెళ్లిపోకండి.

కరటక-- అగ్నిహోత్రావుధాన్లూ! కుఱ్ఱవాడికి రవ్వంతచదువు చెప్పించడానికి ఇంత ముందూవెనకా చూస్తున్నావ్‌. బుచ్చమ్మనమ్మిన పదిహేను వొందల రూపాయిలేంజేశావ్‌?

గిరీశం-- సెల్లింగ్గర్ల్స్‌! డామిట్‌!

అగ్ని-- ప్ర`తీగాడిదె కొడుకూ అమ్మావమ్మా వంచూంఛాడు. కూరగా యల్షోయ్‌ అమ్మడానికీ? ఆ రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడుగదా, దాని గతి యావైఁయ్యుండును?

కరట-- చచ్చాడంటే వాడిదా తప్పు, మంచంమీంచి దించెయడానికి సిద్ధంగా వున్న వాడిక్కట్టావ్‌!

గిరీశం-- తమరేనా నులక అగ్నిహోత్రావుధాన్లుగారు? యీ పట్టెని జటలో తమంతవారు లేరని రాజమహేంద్రవరంలో మావాళ్లనుకునేవారు.

అగ్ని-- మీది రాజమహేంద్రంషండీ? ఆ మాట చెప్పారుకారేం? రామావుధాన్లుగారు బాగున్నారా?

గిరీశం-- బాగున్నారండి. ఆయన మా మేనమావఁగారండి.

అగ్ని-- ఆ మాట చెప్పా`రుకారూ?

గిరీశం-- మామావఁ యీ దేశబ్భోగట్టా వొచ్చినప్పుడల్లా తమర్ని యెన్నిక చేస్తూంటారండి.

అగ్ని-- నాకూ వారికి చాలాస్నేహం. చూశారా కొంచం నాకు ప్రథమకోపం. యవరో తెలియకుండా అన్నమాటలు, గణించకండేం.

గిరీశం-- దానికేవఁండి, తమవంటి పెద్దలు అనడం మాలాంటి కుఱ్ఱవాళ్లు పడడం విధాయకవేఁగదండీ?

కరట-- (తనలో) యిన్నాళ్లకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికాడు.

అగ్ని-- చూశారండీ, మీపేరేవిఁటండీ?

గిరీశం-- గిరీశం అంటారండి.

అగ్ని-- చూశారండి, గిరీశంగారూ! మా కరటక శాస్తుల్లు వట్టి అవకతవక మనిషి; మంచీ చెడ్డా యేమీ వాడి మనసుకెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల యెంతలాభం కలిగింది. భూవుఁలకి దావా తెచ్చావాఁలేదా? నేను యీమధ్య దాఖల్చేయించిన పిటీషను మీద ఆర్డరు చదివి పెట్టండి (గదిలోకి వెళ్లి కాకితంతెచ్చి గిరీశంచేతికి యిచ్చును.)

గిరీశం-- (చూసి) ఎవడో తెలివితక్కువ గుమాస్తా వ్రాసినట్లుంది. అక్షరపొలికే లేదండి.

అగ్ని-- మావకీలు గడగడ చదివేశాడండి.

గిరీశం నేను మాత్రం చదవలేకనా. అంతకన్న గళగ్రాహిగా చదువుతాను. లెక్చర్లిచ్చేపండితుణ్ణి నాకిది పేలపిండీ కాదు; అయితె రాసినవాడి తెలివికి సంతోషిస్తున్నాను. యిది అరిటిపండు విప్పినట్టు తర్జుమాచేసి దాఖలుచెయ్యమని శలవా?

అగ్ని-- అంతకంటేనా! (తనలో) డబ్బు ఖర్చులేకుండా వీడిచాత కాగితమ్ముక్కలన్నీ తర్జుమాచేయించేస్తాను.

గిరీశం-- యింకా యింగ్లీషు కాయితాలు యేవుఁన్నా నామీద పార`య్యండి, తర్జుమా చేసిపెడతాను.

అగ్ని-- అష్లాగే.

వెంకమ్మ-- మా అబ్బాయీ మీరు ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ. గిరీశం-- అలాగే నమ్మా.

    My dear Venkatesam-
    Twinkle! Twinkle! little star,
    How I wonder what you are!

వెంకటేశం-- There is a white man in the tent.

గిరీశం--

The boy stood on the burning deck
Whence all but he had fled.

వెంకటేశం-- Upon the same base and on the same side of it the sides of a trepezium are equal to one another.

గిరీశం-- Of man's first disobedience and the fruit of that mango tree, sing, Venkatesa, my very good boy.

వెంకటేశం-- Nouns ending in f or fe change their f or fe into ves.

అగ్ని-- యీ ఆడుతూన్న మాటలకి అర్థంయేవిఁషండి?

గిరీశం-- ఈ శలవుల్లో యే ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నావఁండి.

కరట-- అబ్బీ వొక తెనుగు పద్యం చదవరా?

వెంకటేశం-- పొగచుట్టకు సతిమోవికి-

కరట-- చబాష్‌!

గిరీశం-- డా`మిట్‌! డోంట్రీడ్‌ దట్‌, (మెల్లగా) "నలదమయంతులిద్దరు" చదువ్‌.

వెంకటేశం-- నలదమయంతు లిద్దరు మనః ప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘ వాసర నిశల్‌.

కరట-- అట్టేఅట్టే, మనఃప్రభవానలవఁంటే యేవిఁట్రా?

వెంకటేశం-- (యింటికప్పువేపుచూసి వూరుకుండును.)

గిరీశం-- పసిపిల్లలకి అలాంటి కఠినవైఁన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి?

అగ్ని-- పద్యాలికి అర్థం చెప్పరూ?

గిరీశం-- యిప్పటిమట్టుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగుపద్యాలమీద ఖాతరీ లేదండి. యంతసేపూ జాగర్ఫీ, గీగర్ఫీ, అర్థమెటిక్‌, ఆల్జిబ్రా, మాథమాటిక్స్‌ యివన్ని హడలేసి చెప్తారండి.

కరటక-- (తనలో) తర్ఫీదు మాచక్కగావుంది. వీణ్ణి పెందరాళె తోవపెట్టకపోతే మోసంవొఁస్తుంది.

అగ్ని-- ఇన్నోటి చెప్తారండీ?

గిరీశం-- మరేవఁనుకున్నారు? మీ కుఱ్ఱవాళ్లాగా చదువుకునే వాడికి ఒక నిమిషవైఁనా తెరిపుండదు.

అగ్ని-- అదుగో చదువంటే అష్లాగే చదువుకోవాలి. గొట్టికాయలాడకుండా మావాణ్ణి ఖాయిదాచేస్తే యంత చదువైనా వొస్తుంది.

గిరీశం-- నాదగ్గిర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చాతపడితే వేళ్లకి పుస్తకం అంటుకుపోవాలి, అలాచదివిస్తానండి.

అగ్ని-- అలాగేచేస్తే మావాడికి చదువొచ్చి అన్నిపరిక్షలూ పాసవుతాడండి. మావాడికి డబ్బుఖర్చులేకుండా పెళ్లయె సాధనంకూడా తటస్థించిందండి.

వెంకమ్మ-- మీ నైజంకొద్దీ ఛిఱ్ఱూ కొఱ్ఱూ మంఛారుగాని మీకు మాత్రం అబ్బిమీద ప్రేవఁలేదా యేవిఁషి? పట్టంలో గొట్టాలమ్మొచ్చినప్పుడు యంతో బెంగబెట్టుకుని అబ్బిని శలవర్జీరాసి వెళ్లిపోయిరమ్మన్నారు కారా? చదువూచెప్పించక పెళ్లీచెయ్యక తీరుతుందా యేమిషి?

కరట-- డబ్బు ఖర్చులేకుండా కొడుక్కి పెళ్లిచేస్తావుటోయి బావా? ఆడపిల్లల్ని అమ్మినట్టే అనుకున్నావా యేవిఁటి? పదిహేను వొందలైనా పోస్తేనేగాని అబ్బికి పిల్లనివ్వరు.

అగ్ని-- డబ్బు ఖర్చులేకుండా వెంకడికి యలా పెళ్లిచేస్తానో నువ్వేచూతువుగాని. రామచంద్రపురం అగ్రహారంలో లుబ్ధావదాన్లుగార్ని యెరుగుదువా?

కరట-- యరగను.

అగ్ని-- ఆయ్న లక్షాధికారి. పద్ధెనిమిదివందలకి సుబ్బిని అడగొచ్చారు. ఉభయఖర్చులూ పెడతారష, పెళ్లి మావైభవంగా చేస్తారష, మనం పిల్లనితీసికెళ్లి వాళ్లింటే పెళ్లిచెయ్యడం, మనకి తట్టుబడి అట్టేవుండదు. ఆపద్ధెనిమిది వొందలూపెట్టి వెంకడికి పెళ్లిచేస్తాను.

వెంకమ్మ-- పెళ్లికొడుక్కెన్నేళ్లు?

అగ్ని-- యెన్నేళ్లైతేనేవిఁ? నలభైయ్యయిదు.

గిరీశం-- లుబ్ధావదాన్లుగారు మాపెత్తల్లి కొడుకండి, తమతో సమ్మంధవఁంటే నాకు సంతోషవేఁగానండి. ఆయనకి అరవయ్యేళ్లు దాటాయండి, యీడేవఁయినా సెల్లింగ్‌ గర్ల్‌స్‌ అనగా కన్యాశుల్కం, డామిట్‌! యంత మాత్రమూ కూడదండి, నేను పూనాలో వున్నప్పుడు అందువిషయమై ఒహనాడు నాలుగ్గంటలు ఒక్కబిగిని లెక్చరిచ్చానండి, సావకాశంగా కూర్చుంటే కన్యాశుల్కం కూడని పనని తమచేతనే వొప్పిస్తాను.

కరట-- బావా యీసమ్మంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను.

అగ్ని-- వీళ్లమ్మా శిఖాతరగ, ప్రతీగాడిదకొడుకూ తిండిపోతుల్లాగ నాయింటజేరి నన్ననేవాళ్లే. తాంబోలం యిచ్చేశాను. యిహ తన్నుకుచావండి.

వెంకమ్మ-- నాతో చప్పకుండానే?

అగ్ని-- ఆడముండల్తోనా ఆలోచన? యీ సమ్మంధం చైకపోతే నేను బారికరావుఁణ్ణే! (లేచివెళ్లును.)

కరట-- యెంమార్దవం.

వెంక -- అన్నయ్యా! యీ సమ్మంధం చేస్తే నేన్నుయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ముమీద కుంపట్లాగ భరిస్తూనేవున్నాం. ఆయనికి యంత యీడొచ్చినా కష్టంసుఖం వొళ్లునాటక యీ దౌర్భాగ్యపు సమ్మంధం కల్పించుకొచ్చారు. నే బతికి బాగుండాలంటే యీ సమ్మంధం తప్పించు.

కరట-- గట్టి అసాధ్యంతెచ్చిపెట్టావే, వొట్టిమూర్ఖప గాడిదకొడుకు. యెదురుచెప్పినకొద్దీ మరింత కొఱ్ఱెక్కుతాడు. యేం చేయగల్గుదునని నీకు భరువసా చెప్పను? యేమీ పాలుపోకుండా వుంది.

గిరీశం-- అమ్మా మీరు యెందుకలా విచారిస్తారు? అవుఁధాన్లుగారు సావకాశంగా వున్నప్పుడు ఒక్కగంట కూర్చుంటే డబ్బుచ్చుకు ముసలివాళ్లకి పెళ్లిచెయ్యడం దౌర్జన్యవఁని లెక్చరిచ్చి మనసు మళ్లిస్తాను.

వెంకమ్మ-- బాబూ, అతడు మీ మానత్తకొడుకైతే మీకాళ్లు పట్టుకుంటాను, మీరువెళ్లి ఆయ్న మనస్సు మళ్లిస్తురూ. నా చర్మం చెప్పులు కుట్టియిస్తాను.

గిరీశం-- అమ్మా యేం చెప్పను! వాడో త్వాష్ట్రం. పిల్లదొరకడవేఁ చాలువాడికి. యీసమ్మంధం వొదులుకుంటే వాడికి పెళ్లేకాదు. వాడని వాడొదిలే ఘటంకాడు.

కరట-- అమ్మీ నేనో ఉపాయం చెబుతాను యిలారా. (కరటకశాస్త్రి శిష్యుడు వెంకమ్మ నిష్క్రమింతురు.)

గిరీశం-- మైడియర్‌ షేక్స్పియర్‌! నీ తండ్రి అగ్గిరావుఁడోయి. మీ యింట్లో యవళ్లకీ అతణ్ణి లొంగదీశే యలోక్వెన్సు లేదు. నాదెబ్బచూడు యివాళేం జేస్తానో. వీరేశలింగం పంతులుగారు కన్యాశుల్కం విషయవైఁరాసిన ఉపన్యాసం పైకితీయ్‌. మావఁగారికి లెక్చరివ్వడాని కత్తీ కఠారీనూరాలి.

వెంకటేశం-- మీలెక్చరుమాట అలావుణ్ణీండిగాని యీవాళ నాగండం గడిచిందిగదా అని సంతోషిస్తున్నాను. మీఱ్ఱాకపోతే పరిక్ష ఫేలయినందుకు మానాన్న పెయ్యకట్టుతాడుతో చమ్డా లెక్కగొట్టును.

గిరీశం-- యిలాంటి ప్రమాదాల్తప్పించుకోవడవేఁ ప్రజ్ఞ. యేవైఁనా డిఫికల్టీ వొచ్చినప్పుడు ఒక ఠస్సావేశావఁంటే అది బ్రహ్మభేద్యంగా వుండాలి. పోలిటిషనంటే మరేవిఁటనుకున్నావ్‌? పూజా నమస్కారాల్లేక బూజెక్కున్నాను గాని మనకంట్రీయే ఇండిపెండెంట్‌ అయితే గ్లాడ్స్టన్‌లాగ దివాన్గిరీ చలాయిస్తును. యేమి వాయ్‌! మీ తండ్రివైఖరి చూస్తే పుస్తకాలకి సొమ్మిచ్చేటట్టు కనబడదు. చుట్టలు పట్ణంనించి అరకట్టేతెచ్చాంగదా, యేమి సాధనం?

వెంక-- నాన్నివ్వకపోతే అమ్మనడిగి డబ్బుతెస్తాను.

గిరీశం-- నీబుద్ధియలా వికసిస్తూందో చూశావా? యిలా తర్ఫీదవుతుంటే నువ్వుకూడా పెద్దపోలిటిషను వవుతావు.

[బుచ్చమ్మ ప్రవేశించును.]

బుచ్చమ్మ-- తమ్ముడూ అమ్మ కాళ్లు కడుక్కోమంచూందిరా.

గిరీశం-- (తనలో) హౌ బ్యూటిపుల్‌! క్వైటనెక్‌స్పెక్టెడ్‌!

బుచ్చమ్మ-- అయ్యా మీరు చల్దివణ్ణం తించారా?

గిరీశం-- నాట్ది స్లైటెస్టబ్జక్‌షన్‌, అనగా యంతమాత్రం అభ్యంతరం లేదు. వడ్డించండిదుగో వస్తున్నాను. తోవలో యేటిదగ్గిర సంధ్యావందనం అదీ చేసుకున్నాను.

(బుచ్చమ్మ వెళ్లును.)

గిరీశం-- వాట్‌, యీమె నీ సిస్టరా? తలచెడ్డట్టు కనబడుతున్నదే?

వెంక-- మాఅక్కే, జుత్తుకి చవుఁఱ్ఱాసుకోదు.

గిరీశం-- తల చెడ్డం అంటే, విడో అన్నమాట. చవుఁరు గివుఁరూ జాంతే నయ్‌. గాని యిన్నాళ్లాయి నీకు విడో మారేజి విషయవైఁ లెక్చర్లిస్తూవుంటే యీ కథ యెప్పుడూ చెప్పావుకావు? మీ యింట్లోనే ఓ అన్ఫార్చునేట్‌ బ్యూటిఫుల్‌ యంగ్‌ విడో వుందటోయ్‌! యేమి దురవస్థ! మైహార్ట్‌ మెల్‌ట్స్‌. నేనే తండ్రినైతే యీపిల్లకి విడోమారియెజ్జేసి శాశ్వితవైఁనకీర్తి సంపాదిస్తును. (తనలో) యేమి చక్కదనం, యీసొంపు యక్కడా చూళ్లేదే! పల్లిటూరు వూసు పోదనుకున్నానుగాని పెద్ద కాం`పేనుకి అవకాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం.

వెంక-- మా నాన్న నాక్కూడాపెళ్లి చాస్తాడు.

గిరీశం-- యీ వాళో పెద్ద పెళ్లినీకు తలవెంట్రుకంత వాసి తప్పిపోయింది. యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్‌ పూరా ప్రయోజకుడివే, యిహ నిజవైఁనపెళ్లా? యింతచదువూ చదువుకుని నీతండ్రి కుదిర్చిన యేవీఁ యరగని చిన్న పిల్లకా పుస్తె కడతావ్‌? మాంచియెఱ్ఱగా బుఱ్ఱగావున్న యంగ్విడోని నువ్‌ పెళ్లాడకపోతే ఐషుడ్బి యషేమ్డాఫ్యూ!


2-వ స్థలము. దేవాలయం

[పువ్వుల తోటలో మండపంమీద కూచుని, శిష్యుడు ప్రవేశించును.]

శిష్యుడు-- ఆర్నెల్లకోమాటు పొస్తకంపట్టుకుంటే కొత్తశ్లోకాలు పాతశ్లోకాలు ఒక్కలా గ్కనపడతాయి. యిప్పుడు కొత్తశ్లోకం కనుక్కొమ్మంటే నాశక్యవాఁ? సిద్ధాంతినెవణ్ణయినా ప్రశ్నడిగి కనుక్కొవాలి. లేకుంటే చటుక్కున పుస్తకం విప్పియె శ్లోకం కనపడితే ఆశ్లోకం చదువుతాను.

"మృగాః ప్రియాళు ద్రుమమంజరీణాం"

యిదేదో చదివినజ్ఞాపకం లీలగావుంది. లేళ్లుపరిగెత్తాయని కాదూ? యేం గొప్పమాట చెప్పాడోయి కవి! లేళ్లు పరిగెత్తితే యవడిక్కావాలి. పరిగెత్తకపొతే యవడిక్కావాలి? కుక్కలు పరిగెత్తుతున్నాయ్‌ కావా, నక్కలు పరిగెత్తుతున్నాయ్‌ కావా? పిల్లులు పరిగెత్తుతున్నాయి కావా? పనికొచ్చే ముక్క ఒక్కటీ యీపుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వొడ్డీ వాశీ కట్టడం కాళిదాసుకేం తెలుసును? తెల్లవాడిదా మహిమ! యెపట్నం యెక్కడుందో, యెకొండ లెక్కడున్నాయో అడగవయ్యా గిరీశంగార్ని; నిలుచున్న పాట్ను చెబుతాడు.

"ప్రియాముఖం కింపురుషశ్చుచుంబ"

ముద్దెట్టు కున్నాడటోయి ముండాకొడుకు. ముక్కట్టు కున్నాడు కాడూ?

[కరటకశాస్త్రి శిష్యుడికి కనపడకుండా వెనుకనుంచి ప్రవేశించును.]

    "వర్ణ ప్రకర్షే సతి కర్ణికారం ।
    ధునోతి నిర్గం ధతయాస్మచేతః" ॥

యిదికూడా చదివినట్టె వుందోయి, ఆపువ్వెదో కవికిష్ఠంలేదట. యిష్ఠం లేకపోతె ములిగిపోయింది కాబోలు! మాగురువుగారికి దొండకాయ కూర యిష్ఠం లేదు, గురువుగారి పెళ్లాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆకూరె వొండుతుంది. బతికున్నవాళ్ల యిష్ఠవెఁ యిలా యేడుస్తూంటే చచ్చినవాడి యిష్ఠాయిష్ఠాల్తో యేంపని? యీచదువిక్కడితో చాలించి గిరీశంగారి దగ్గిర నాలుగింగిలీషు ముక్కలు నేర్చుకుంటాను. వెంకడికి యింగిలీషొచ్చునని యేం గఱ్ఱాగా వుంది?

కరట-- యెవిఁట్రా అబ్బీ అంటున్నావు?

శిష్యు-- యెదో నాస్వంత ఘోష.

కరట-- గురువునిగదా, అదేదో నాకూ కొంచెం చెబుదూ.

శిష్యు-- చప్పడానికేవుఁందండి? నాటకంలో నాచాత వేషం కట్టించి పెద్దచాంతాళ్లలాంటి హిందూస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ అర్థం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపికుందిగాని నాకు నాల్రోజులి కోశ్లోకం చెప్పడానికి శ్రద్ధలేదుగదా? పట్నంవొదిలి ఆర్నెల్లకోమాటు అగ్రహారాలంట వొచ్చినప్పుడు మరేం వూసుపోక "పుస్తకం తియ్యంటె" సంస్కృతం యెంవఁచ్చేని?

కరట-- యిటుపైన్చూడు యలా చెబుతానో, రోజుకి నాలుగేసి శ్లోకాలు చెబుతాను. కొత్తశ్లోకం చదువు.

శిష్యు--

"అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా ।
హిమాలయో నామ నగాధిరాజః॥"

కరట-- మొదటి కొచ్చావేం?

శిష్యు-- మొదలూకొసా వొక్కలాగే కనపడుతూంది.

కరట-- (నవ్వి) పోనియ్‌, మొదణ్ణించే చదువుదాం.

శిష్యు-- చదివినా యేంలాభవుఁంది. యీశ్లోకం శుద్ధ అబద్ధంట.

కరట-- యవరుచెప్పారు?

శిష్యుడు -- గిరీశంగారు.

కరట-- యెంచెప్పాడు?

శిష్యు-- హిమాలయం రెండుసముద్రాలకీ దాసి, రూళ్ల గఱ్ఱలాగలేదట. మాపులో చూపించాడు.

కరట-- హిమాలయం శిగగోశిరిగాని. ఆపుస్తకం ముణిచి నామాటవిను.

శిష్యు-- చిత్తం (పుస్తకం మూయును.)

కరట-- చదువన్న దెందుకు, పొట్ట పోషించుకోడానిగ్గదా?

శిష్యుడు- అవును.

కరట-- యీరోజుల్లో నీసంస్కృత చదువెవడి క్కావాలి?

శిష్యు-- దరిద్రులి క్కావాలి.

కరట-- బాగా చెప్పావు. నీకు యింగ్లీషు చదువుకోవాల్నుందో?

శిష్యు-- చెప్పించే దాతేడీ?

కరట- నేను చెప్పిస్తాన్రా.

శిష్యుడు- నిజంగాను?

కరట- నిజంగాన్రా, గాని ఒకషరతుంది.

శిష్యు- యెవిఁటండి?

కరట- నాకో కష్ఠసాధ్యమైన రాచకార్యం తటస్థించింది. అది నిర్వహించి నువ్‌ చేసుకురావాలి.

శిష్యు- నావల్లయే రాచకార్యాలు కూడా వున్నాయా?

కరట- యీరాచకార్యం నీవల్లేకావాలి. మరెవడివల్లాకాదు. అదేవిఁటంటె, ఓపదిరోజులు నువ్వు ఆడపిల్లవై పోవాలి.

శిష్యు- గణియం పట్ణంలోవుండి పోయిందే?

కరట- అట్టే గణియం అవసరంలేదు. నీకు తలదువ్వి, కోకకడితే పజ్యండేళ్ల కన్నెపిల్లలావుంటావు. నిన్ను తీసుకెళ్లి లుబ్ధావుధాన్లికి పెళ్లి చేస్తాను. నాలుగుపూటలు వాళ్లింట నిపుణతగా మెసిలి, వేషం విప్పేశి పారిపోయిరా. నిజవైఁన పెళ్లిముహర్తం చాలా వ్యవధుంది.

శిష్యు- యిదెంతపని.

కరట- అలా అనుకోకు. అతి చేస్తి వట్టాయనా, అనుమాన పడతారు. పట్టుబడ్డావంటే పీక తెగిపోతుంది.

శిష్యు- మీకా భయంవొద్దు.

కరట- నువ్వునెగ్గుకొస్తే, మా పిల్లన్నీకిచ్చి యిల్లరికం వుంచుకుంటాను.

శిష్యు- అలాప్రమాణం చెయ్యండి.

కరట- యిదుగో యీపుస్తకం పట్టుకు ప్రమాణం చేస్తున్నాను.

శిష్యుడు - యీపుస్తకంమీద నాకు నమ్మకం పోయింది. మరోగట్టి ప్రమాణం చెయ్యండి. గిరీశంగారిని అడిగి ఒక యింగిలీషు పుస్తకం పట్టుకురానా?

కరట- తప్పితే భూమితోడ్రా.

శిష్యు- మీరు యగేస్తే భూవేఁం జేస్తుంది? మీ మాటేచాలును కానీండి.


3-వ స్థలము. అగ్నిహోత్రావధాన్లు యింటి యదటివీధి.

[గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు.]

వెంక- రాత్రి కన్యాశుల్కం మీద లెక్చరిచ్చారా?

గిరీశం- లెక్చరేవిఁటోయ్‌. ధణుతెగిరిపోయింది. మీతండ్రి మైరావణ చరిత్రోయ్‌. మీఅంకుల్‌ కరటకశాస్త్రి స్కౌండ్రల్లా క్కనపడుతున్నాడు.

వెంక- యేం జరిగిందేం జరిగిందేవిఁటి?

గిరీశం విను. రాత్రి భోజనాలవేళ లెక్చరు ఆరంభించమని రోజల్లా బురిడీలు పెట్టాడోయి మీ మావఁ. సబ్జక్టు నేను కొంచం యెత్తగానే తనుకూడా గట్టిగా సపోర్టు చేస్తా నని ప్రోమిస్‌కూడా చేశాడు. నీ తండ్రి వైఖరీచూస్తే మాత్రం కొంచం ధైర్యం వెనకాడి నాలిక్కొన కొచ్చిన మాట మళ్లీమణిగి పోతూండేది. పెరుగూ అన్నం కలుపుకునే వేళకి యిక టైమ్మించి పోతూందని తెగించి లెక్చరు ఆరంభించాను. ఇంట్రడక్‌షన్‌ రెండు సెంటెన్సులు యింకా చెప్పనే లేదు నాలుగు యింగ్లీషు మాటలు దొల్లాయోయ్‌ దాంతో నీతండ్రి కళ్లెఱ్ఱజేశి "యీ వెధవ యింగ్లీషు చదువునించి బ్రాహ్మణ్యం చెడిపోతూంది; దేవభాషలాగ భోజనాల దగ్గిరకూడా ఆ మాటలే కూస్తారు; సంధ్యావందనం శ్రీసూక్త పురుషసూక్తాలూ తగలబడిపోయినాయి సరేగదా?" అని గట్టిగాకేకవేసి చెప్పేసరికి నేను కొంచంపస్తాయించి "థ్రోయింగ్‌ పెర్‌ల్సు బిఫోర్‌ స్వైన్‌" అనుకొని కరటక శాస్తుల్లువేపు చూసేసరికి యెంచేస్తూన్నాడనుకున్నావ్‌? రాస్కెల్‌ వులకలేదు పలకలేదు సరేకదా మొహం పక్కకి తిప్పి కడుప్పగిలేటట్టు నవ్వుతున్నాడు. యికలెక్చరు వెళ్లిందికాదు సరేకదా, నోట్లోకి ముద్దకూడా వెళ్లిందికాదు. ఛీ యింతయిన్సల్టు జరిగింతరవాత తక్షణం బయలుదేరి వెళ్లిపోదావఁనుకున్నాను.

వెంక-- అయ్యో వెళ్లిపోతారా యేవిఁటి?

గిరీశం-- నాటింది లీష్టు. కొసాకీవిను, నీతండ్రిని పోకెట్లో వేశాను.

వెంక-- నా తండ్రికి లెక్చరిచ్చి పెళ్లి తప్పిస్తావఁన్నారే?

గిరీశం-- పెళ్లి ఆపడానికి బ్రహ్మశక్యంకాదు. డిమాస్థనీసు, సురేంద్రనాద్‌ బానర్జి వచ్చి చెప్పినా నీతండ్రి యీ పెళ్లిమానడు. లెక్చర్లు యంతసేపూ సిటీల్లోనేగాని పల్లిటూళ్లలో యంతమాత్రం పనికిరావు. పూనాలాంటిసిటీలో లెక్చర్‌ యిచ్చావఁంటే టెంథౌజండు పీపిల్‌ విండానికి వొస్తారు. మన టౌన్లోనో, పెద్ద మీటింగులు చెయ్యాలంటే, డప్పులు బజాయించి, నోటీసులు కట్టి, బౙార్లుకాసి, తోవంట పోయేవాళ్లని యీడ్చుకు వొచ్చినా, యాభైమందికారు. పల్లెటూరి పీపిల్‌ లెక్చర్లకి అన్‌ఫిట్‌. మొన్న మనం వొచ్చిన బండీవాడికి నాషనల్‌ కాంగ్రెస్‌ విషయవైఁ రెండు ఘంటలు లెక్చరు యిచ్చేసరికి ఆగాడిద కొడుకు, వాళ్లవూరు హెడ్‌కానిష్ఠేబిల్ని కాంగ్రెసువారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు! విలేజస్‌లో లెక్చర్లు యంతమాత్రం కార్యంలేదు. నీ తండ్రి దగ్గిర మాత్రం లెక్చరన్నమాటకూడా అనకూడదు.

వెంక-- అయితే, నాన్నని యలాగ జేబులో వేశారేవిఁటి?

గిరీశం-- అది పోలిటిక్సు దెబ్బోయ్‌! ఆ తరవాత కథవిను. నామీద కాకలేసిన తరవాత కోపవఁణక్క, ధుమధుమ లాడుకుంటూ, పెరుగూ అన్నం కుమ్మడం ఆరంభించాడు. ఇంతలో మీ అప్ప వొచ్చి గుమ్మం దగ్గిర నిలబడి కోకిలకంఠంతో "నాన్నా తమ్ముడికి పెళ్లిచెయ్యాలంటే నాసొమ్ముపెట్టి పెళ్లిచెయ్యండిగాని దాని కొంపముంచి లుబ్ధావుఁధాల్లుఁకి యివ్వొద్దని" చెప్పింది. దాంతో నీ తండ్రికి వెఱ్ఱికోపం వొచ్చి వుత్తరాపోసనం పట్టకుండానే ఆ పెరుగూ అన్నంతో విస్తరితీసికెళ్లి దాన్నెత్తిని రుద్దేశాడు! కరటక శాస్తుల్లు అడ్డుపడబోతే చెంబుతో నీళ్లు వాడినెత్తిం దిమ్మరించాడు. కరటక శాస్తుల్లుకి కోపంవొచ్చి శిష్యుణ్ణి తీసుకు వాళ్లవూరెళ్లిపోయినాడు.

వెంక-- దీనిపేరెనా యేవిఁటి మానాన్నంజేబులో వేసుకోవడం?

గిరీశం-- పేషన్స్‌! కొసాకీవిను. స్కౌండ్రల్‌ కరటక శాస్తుల్లు వెళ్లిపోయినాడని సంతోషించానుగాని, నీ సిస్టర్‌ ఫేట్‌ విషయవైఁ మహా విచారవైఁంది. నేనే దాని హజ్బెండ్నైవుంటే, నిలబడ్డపాటున నీ తండ్రిని రివాల్వర్తో షూట్‌ చేశివుందును. మీ అమ్మ యేడుస్తూ ఒకమూలకూచుంది. అప్పుణ్ణే వెళ్లి, నీళ్లపొయిలో నిప్పేసి, నీళ్లుతోడి, నీసిస్టర్ని స్తానం చెయమన్నాను. సిగర్సు కాల్చుకుందావఁని అరుగుమీద నేను బిచాణావేసే సరికి, నీ తండ్రికి పశ్యాత్తాపం వొచ్చి, తానూ ఆ అరుగుమీదే బిచాణా వేసి, ఒక్క సిగరయినా కాల్చనియ్యకుండా రాత్రల్లా కబుర్లలో పెట్టి చంపాడొయ్‌. మొత్తానికి కత్తు కలిపేశాను.

వెంక-- యాలాక్కలిపారేవిఁటి?

గిరీ-- ఒక పొలిటికల్‌ మహాస్త్రం ప్రయోగించి కలిపేశాను.

వెంక -- యెవిఁటండా అస్త్రం?

గిరీ -- ఒకడు చెప్పిందల్లా మహాబాగుందండవేఁ. సమ్మోహనాస్త్రవఁంటే అదేకదా?

వెంక -- లెక్చరిచ్చి మాతండ్రిని వొప్పించడానికి బదులుగా ఆయన చెప్పిందానికి మీరే వొప్పుకున్నారూ?

గిరీ-- కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు, తిరిగేశైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి. బాగా ఆలోచిస్తే యిన్ఫెంటు మారియేజి కూడుననే తోస్తూంది.

వెంక-- యిన్నాళ్లూ కూడదని చెప్పేవారే నాతోటి?

గిరీ -- ఒపినియన్సు అప్పుడప్పుడు ఛేంజి చెస్తూంటేనేగాని పోలిటిషను కానేరడు. నాకు తోచిన కొత్త ఆర్గ్యుమెంటు విన్నావా? యిన్ఫెంటు మారేజీలు అయితెనేగాని, యంగ్‌ విడోజ్‌ వుండరు. యంగ్‌ విడోజ్‌ వుంటేనేగాని, విడో మారియేజ్‌ రిఫారమ్‌కి అవకాశం వుండదుగదా? సివిలిజేషన్కల్లా నిగ్గు విడో మారియేజ్‌ అయినప్పుడు, యిన్ఫెంట్‌ మారేజీల్లేకపోతే, సివిలిజేషన్‌ హాల్టవుతుంది! మరి ముందు అడుగు పెట్టలేదు. గనక తప్పకుండా యిన్ఫెంటు మారేజి చేయ్యవలసిందే. యిదివొహ కొత్తడిస్కవరీ; నంబర్‌టూ, చిన్నపిల్లల్ని ముసలాళ్లకిచ్చి పెళ్లిచెయ్యడం కూడా మంచిదే అనినేను వాదిస్తాను.

వెంకటే-- సుబ్బిని లుబ్ధావుఁధాల్లికి యివ్వడం మంచిదంటారా యెవిఁటి? అమ్మ ఆ సమ్మంధం చేస్తే నూతులో పడతానంటూందే?

గిరీ: ఫెమినైన్స్‌ ఫూల్సన్నాడు. "పడుపడుఅన్న నా సవితేగాని పడ్డనాసవితి లేదంది" టెవర్తోను. నూతులో పడడం గీతులోపడడం నాన్సన్స్‌, ఓ రెండు తులాల సరుకోటి మీనాన్నచేయించి యిచ్చాడంటే మీ అమ్మ ఆమాట మానేస్తుంది. గాని నా ఆర్గ్యుమెంటు విను.

వెంక: యేవిఁటండి?

గిరీశం: పెళ్ల`నే వస్తువ, శుభవాఁ అశుభవాఁ? మంచిదా చెడ్డదా? చెప్పు.

వెంక-- మంచిదే.

గిరీశం-- వెరిగుడ్‌! పెళ్లనేది మంచి పదార్థవైఁతే "అధికస్య అధికం ఫలం" అన్నాడు గనక చిన్నపిల్లని ఒక ముసలాడికి పెళ్లిచేసి, వాడుచస్తే మరోడికి, మరోడుచస్తే మరోడికి, యిలాగ పెళ్లిమీద పెళ్లి, పెళ్లిమీద పెళ్లిఅయి, వీడిదగ్గిరో వెయ్యి, వాడిదగ్గిరో వెయ్యి, మరోడిదగ్గిర మరోవెయ్యి, రొట్టెమీద నెయ్యి, నేతిమీద రొట్టె లాగ యేకోత్రవృద్ధిగా కన్యాశుల్కం లాగి, తుదకి నాలాంటి బుద్ధివఁంతుణ్నిచూసి పెళ్లాడితే చెప్పావ్‌ మజా? ఇహసౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహసౌఖ్యంవుంటే పరసౌఖ్యంకూడా సాధించావేఁ అన్నమాట. యలాగో తెలిసిందా? ఈజ్‌మెంటు హక్కు యష్ఠాబ్లిష్‌ అవుతుంది.

వెంక-- కన్యాశుల్కం కూడా మంచిదంటున్నా రేవిఁటి?

గిరీ-- మరేవిఁటనుకున్నావ్‌? నెవ్వర్డూబైహావ్సన్నాడు చేస్తే శుద్ధక్షవరవేఁగాని తిరపతి మంగలాడి క్షవరం చెయ్యకూడదు. యీ అస్త్రంతోటే మీతండ్రి వశ్యం అయినాడు. యింగ్లీషువాడు "థింక్‌" అన్నాడోయి. ఆలోచిస్తేగాని నిజం బోధపడదు. బాగా ఆలోచించగా, కన్యాశుల్కంలేని మారేజే యీ భూప్రపంచంలో లేదు. విన్నావా?

వెంక-- యెలాగండి?

గిరీ-- అలా అడగవోయి, యేం? డబ్బుచ్చుకుంటేనే కన్యాశుల్కవఁయిందేం? యిన్ని తులాలు బంగారం పెట్టాలి, యింత వెండిపెట్టాలి అనిరూపాయిలకి బదులుగా వెండిబంగారాలకింద ధనం లాగితే, కన్యాశుల్కం అయిందికాదేం? యీ పెద్దపెద్ద పంతుళ్లవారంతా యిలా చేస్తూన్నవారేనా?

వెంక-- అవును.

గిరీ-- యిక దొర్లలోనో? వాళ్లతస్సా గొయ్యా, యిల్లుగుల్ల చేస్తారోయి; అవి గుడ్డలుకావు, అవి శెంట్లుకావు, అవి జూయల్సుకావు, మారియేజి సెటిలుమెంటని బోలెడు ఆస్తికూడా లాగుతారు. యీ ఆర్గ్యుమెంటు నేను చెప్పేసరికి నీ తండ్రి బ్రహ్మానంద భరితుడైనాడు. లుబ్ధావుఁధాన్లు పెళ్లికి అన్నిటికన్న పెద్ద సవబొకటి నీకు చెబ్తానువిను.

వెంక-- యెవిఁటండి.

గిరీ-- లుబ్దావుఁధాన్లు ముసలాడూ, బంగారప్పిచికానున్ను. రెండేళ్లకో మూడేళ్లకో అమాంతంగా బాల్చీ తన్నెస్తాడు. అనగా "కిక్స్‌ ది బకెట్‌." దాంతో నీ చెల్లెలు రిచ్చి విడో అవుతుంది. నువ్వు పెద్దవాడివైన తరవాత దానికి విడోమారియేజి చేశి శాశ్వతవైఁన కీర్తి అతిసులభంగా సంపాదించవచ్చును. యెవఁంటావ్‌?

వెంక-- అవును.

గిరీశం మరో గొప్పమాట యీ సంబంధం అయితె నీకూనాకూ సంబంధం కలుస్తుందోయి.

వెంక-- అదినాకిష్ఠవేఁ.

గిరీ-- రాత్రి నీ తండ్రి, నీకు హైకోర్టు వకాల్తీదాకా చదువు చెప్పిస్తానన్నాడు. ప్రస్తుతోపయోగం పుస్తకాలమాట కదిపానుగాని, పెళ్లినుంచి వచ్చింతరవాత యిస్తానన్నాడు. యీలోగా చుట్టముక్కల్లాకపోతే గుడ్లెక్కొస్తాయి. సిగర్సుకోసం కాపర్సేవఁయినా సంపాదించావాలేదా?

వెంక-- లేదు. యీ వుదయవఁల్లా అమ్మ ధుమధుమలాడుతూనే వుంది. మానాన్న పొడుంకోసం కొట్లోనిలవచేశిన పొగాకులోది వోకట్ట వోణీలో దాచి తీసుకొచ్చాను.

గిరీ -- దటీజ్పోలిటిక్స్‌! మరియింతసేపూ చెప్పావుకావేం? చుట్టల్చుట్టుకుని యీకోవిల గోపురంలో కూచుని కాల్చుకుందాం రా!

వెంక-- కోవిల్లో చుట్టకాల్చవొచ్చునా?

గిరీ-- కాలిస్తే కోవిల్లోనే కాల్చాలోయి. దీనిపొగ ముందర సాంబ్రాణి, గుగ్గిలం యేమూల? యేదీ కట్ట యిలాతే (కట్ట అందుకొని వాసనచూసి) ఆహా! యేవిఁ పొగాకోయి! నిజంగా కంట్రీలైఫులో చాలా చమత్కారంవుంది. బెస్టుటోబాకో, బెస్టుగేదెపెరుగు, మాంచిఘీ. అంచేతనేనోయ్‌ పోయట్సు "కంట్రీలైఫ్‌ కంట్రీలైఫ్‌" అని దేవులాడుతారు.

వెంక-- మీరూ పోయట్సేగదా?

గిరీ-- అందుకభ్యంతరవేఁవిఁటి? నాకూ కంట్రీలైఫు యిష్ఠవేఁగాని సీవఁలోలాగ బ్యూటిఫుల్‌ షెపర్డెస్లూ, లవ్‌ మేకింగూ వుండదోయ్‌. గ్రాస్‌ గర్ల్సు తగుమాత్రంగా వుంటారుగాని, మా డర్టీస్మెల్‌! అదొహటిన్నీ మనదేశంలో మెయిడన్సు వుండరోయి. యంతసేపూ లవ్మేకింగ్‌ విడోజ్కి చెయ్యాలిగాని మరి సాధనాంతరంలేదు.

వెంక-- మీరు విడోమీద చేశిన పోయిట్రీ రాసియిస్తానని యిచ్చారుకారు గదా?

గిరీ-- అడగ్గానే యిస్తే వస్తువవిలవ తగ్గిపోతుంది. అదొహటిన్నీ, మఱ్ఱెండేళ్లు పోతేనేగాని దాని రసం నీకు బాగా బోధపడదు. అయినా స్పెషల్‌కేసుగా నీకు ఉపదేశం చాస్తాను. నోటుబుక్కు తీసిరాయి.

(గిరీశం చుట్టకాలుస్తూ, మధ్య మధ్య చుట్టచేత పట్టి, ఒక్కొక్క ముక్క చెప్పగా వెంకటేశం వ్రాసును.)

            THE WIDOW.

    She leaves her bed at A.M. four,
    And sweeps the dust from off the floor,
    And heaps it all behind the door,
                                                     The Widow!

    Of wond'rous size she makes the cake,
    And takes much pains to boil and bake,
    And eats it all without mistake,
                                                      The Widow!

    Through fasts and feasts she keeps her health,
    And pie on pie, she stores by stealth,
    Till all the town talk of her wealth,
                                                       The Widow!

    And now and then she takes a mate,
    And lets the hair grow on her pate,
    And cares a hang what people prate,
                                                        The Widow!

    I love the widow - however she be,
    Married again - or single free,

    Bathing and praying
    Or frisking and playing,
    A model of saintliness,
    Or model of comeliness,
    What were the earth,
    But for her birth?
                        The Widow!

యిది నేను రిఫార్మర్లో అచ్చువేసేటప్పటికి టెన్నిసన్‌చూసి గుండెకొట్టుకున్నాడు. చుట్టతాగడం సమాప్తంచేశి యింటికి పొదాంరా చాలాసేపైంది.

(నాలుగడుగులు యిద్దరూ నడిచేసరికి అగ్నిహోత్రావుఁధాన్లు కలియును.)

అగ్ని-- ఏవఁండీ - హనుమాన్లుగారూ - మీపేరేవిఁటండీ!

గిరీ-- గిరీశం అంటారండి.

అగ్ని-- అదుగో, గిరీశంగారూ రాత్రి మనవఁనుకున్న ప్రకారం మనదావాలు గెలుస్తాయనే మీ అభిప్రాయవాఁ?

గిరీ-- గెలవకపొతే నేను చెవి కదపాయించుకు వెళ్లిపోతాను. మీ వూహపోహలు సామాన్యవైఁనవా? అందులో "యతోధర్మ స్తతోజయః" అన్నట్టు న్యాయం మీ పక్షం వుంది. బుచ్చమ్మగారి కేసు విషయమై జబ్బల్పూర్‌ హైకోర్టు తీర్పొహటి మనకి మహా బలంగావుంది. మాపెత్తండ్రిగారు యిలాంటి కేసే ఒహటి యీ మధ్య గెలిచారండి.

అగ్ని-- దీని కల్లా అసాధ్యం యీకేసు కాకినాళ్లో తేవల సొచ్చింది. మా కరటక శాస్తుల్లుని పంపిస్తే యవడో చవలవకీల్ని కుదిర్చాడు. వాడెప్పుడూ డబ్బు తెమ్మని రాయడవేఁగాని కేసుభోగట్టా యేవీఁరాయడు. గడియ గడియకీ వెళదావఁంటె దూరాభారం గదా?

గిరీ-- మీశలవైతే స్టీమరుమీద నేను వెళ్లి ఆవ్యవహారవఁంతా చక్కబెట్టుకువస్తాను. మాపెత్తండ్రిగారు కాకినాడ కల్లా తెలివైన ప్లీడరు, ఆయనపట్టిన కేసు యన్నడూ పోయిందన్నమాట లేదండి.

అగ్ని-- మీరు వెళితే నేను వెళ్లినట్టే. యంత ఫీజయినా మీ పెత్తండ్రిగారికే వకాల్తీ యిద్దాం. యావఁంటారు?

గిరీ -- మీదగ్గిర ఫీజు పుచ్చుకోవడం కూడానాండి? ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే, ఫీజక్ఖర్లేకుండానే పని చేయిస్తానండి.

అగ్ని-- మీరలా అంటార న్నేనెరుగుదును. గాని గెలిచింతరవాత మనకితోచిన బహుమతీ యిద్దాం.

గిరీ -- యిచ్చినాసరె యివ్వకపోయినా సరేనండి.

[బుచ్చమ్మ ప్రవేశించును.]

బుచ్చమ్మ -- నాన్నా! అమ్మ స్తానానికి లెమ్మంచూంది.

అగ్ని-- అలాగే. (బుచ్చమ్మ వెళ్లిపోతూండగా గిరీశం కేగంట చూసును.) భోజనంచేశిన తరవాత కాయితాలు మీచేతికిస్తాను; అవన్నీ సావకాశంగా చూడండి, మాయింటితూరు ప్పొరుగు రావాఁవుధాన్లుమీద మందడిగోడ విషయమై మనంతెచ్చినదావా, లంచంపుచ్చుకుని మునసబు అన్యాయంగా కొట్టేశాడు. జడ్జీకోర్టులో అప్పీలుచేశాం; మావకీలు అవతలపార్టీదగ్గిర కతికి మనకేసు ధంసంచేశాడు. మీవంటివారు నాకు చెయ్యాసరావుంటే రావాఁవుధాన్లు పిలకూడదీసేదును: కానిండిగాని తూర్పుమందడిగోడ రావాఁవుధాన్లిదయితే, పడవఁటి మందడిగోడ మందవాల్నా లేదా? న్యాయంచెప్పండి. చూడండీ దానిమీద యలా కొంజాయెత్తాడో! క్రిమినల్నడిపించమని భుక్తసలహాచెప్పాడు.

[బుచ్చమ్మ ప్రవేశించును.]

బుచ్చ-- నాన్నా! అమ్మ స్తానం చెయ్యమంచూంది.

అగ్ని-- వెధవముండా సొద! పెద్దమనుష్యుల్తో వ్యవహారం మాట్లాడుతూంటే రామాయణంలో పిడకల వేట్లాటలాగ అదే పిలవడవాఁ!

గిరీ-- తప్పకుండా క్రిమినెల్కేసు తావలశిందే, క్రిమిన ల్ప్రొశిజ్యూర్‌ కోడు 171 శక్షన్‌ ప్రకారం తెద్దావాఁ? 172డో శక్షన్‌ ప్రకారం తెద్దావాఁ?

అగ్ని-- రెండు శక్షన్లూ తాలేవేఁం?

గిరీ-- నేరంగలప్రవేశం, ఆక్రమణ - రెండు శక్షన్లూకూడా ఉపచరిస్తాయి సరేగదా కళ్లతో చూశాను గనుక యీగోడ మీదయినట్టు జల్లీల్తెగబొడిచి సాక్ష్యంకూడా పలగ్గలను, యీగోడ స్పష్టంగా మీదాన్లాగే కనపడుతూంది.

అగ్ని-- అందుకు సందేహవుఁందండీ, యేమరిచి యిన్నాళ్లు వూరుకున్నాను. పెరటిగోడ కూడా చూతురుగాన్రండి. అక్కాబత్తుడిముక్కు నులిపిగెల్చుకున్నాను. కాని యీదావాలకింద సిరిపురంభూవిఁ అమ్మెయ్య వలసి వొచ్చిందండి, రావాఁవధాన్లుకేసుకూడా గెలిస్తె, ఆవిచారం నాకు లేకపోవును.

(అందరు నిష్క్రమింతురు.)

---*---