కన్యాశుల్కము/తృతీయాంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శ్రీ

కన్యాశుల్కము

తృతీయాంకము

1-వ స్థలము. రామచంద్రపురం అగ్రహారంలో రామప్పంతులు యింట్లో సావిట్లోగది.

[మధురవాణి ప్రవేశించును]

మధుర: యీ రామప్పంతులు కథ పైకి పటారం, లోపల లొటారంలా కనిపిస్తూంది. భూవుఁలన్నీ తాకట్టుపడి వున్నాయిట మరి రుణంకూడా పుట్టదట వాళ్ళకీ వీళ్ళకీ జుట్లుముడేసి జీవనం జేస్తూన్నాడు, యీ వూరు వేగం సవిరించి చెయ్‌ చిక్కినంత సొమ్ము చిక్కించుకుని పెందరాళే మరో కొమ్మ పట్టుకోవాలి (పాడును) ‘తెలియక మోసపోతినే, తెలియక ’ (పాడుతుండగా రామప్పంతులు ప్రవేశించును.)

రామ: యేవిఁటో ఆ మోసపోవడం? తరవాత ముక్కేవిఁటి, పాడూ.

మధుర: తరవాత ముక్కకేవుఁంది. మిమ్మల్ని నమ్మి మోసపోయినాను.

రామ: అదేం అలా అంటున్నావు? నిన్ను మోసపుచ్చలేదే? నిర్ణయప్రకారం రెండొందలూ పట్ణంలో యిచ్చాను. నెల జీతం నెలకు ముందే యిచ్చాను. యిహ మోసవేఁవుంది?

మధుర: యేంచిత్రంగా మాట్లాడతారు పంతులుగారూ, నాకు డబ్బే ప్రధానవైఁనట్టు మీ మనసుకి పొడగడుతూంది కాబోలు, నాకు డబ్బు గడ్డిపరక. మీ భూవుఁలు రుణాక్రాంతవైఁనాయని అప్పట్లో నాకు తెలిశుంటే మీ దగ్గిర రెండొందలూ పుచ్చుకొందునా? మీరు ఖర్చు వెచ్చాలు తగ్గించుకుని సంసారం బాగుచేసుకోక పోతే నేను మాత్రం వొప్పేదాన్ని కాను. ఫలానా పంతులుగారు ఫలానా సాన్నుంచుకుని బాగుపడ్డారంటేనే నాకు ప్రతిష్ఠ. మా యింటి సాంప్రదాయం ఇది పంతులుగారూ అంతే గాని లోకంలో సాన్లమచ్చని వూహించకండి.

రామ: భూవుఁలు తణఖా అన్నమాట శుద్ధ అబద్ధం యవరన్నారోగాని నేను మహరాజులా వున్నాను.

మధుర: నాకంటికి మహరాజులా కనపడబట్టే యిల్లూ వాకలీ వదిలి మానం ప్రాణం మీ పాలు చేసి నమ్మి మీ వెంట వచ్చాను. నన్ను మోసం మాత్రం చెయ్యకండి మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది.

రామ: నేను మోసంచేసే మనిషినేనా?

మధుర: అలాగయితే లుబ్ధావుధాన్లు గారికి పెళ్ళెందుకు కుదిర్చారు? నాకు తెలియదనుకున్నారా యేవిఁటి? ఆ ముసలాడికి పెళ్ళెందుకు? మీ కోసవేఁ యీ యెత్తంతాను.

రామ: ఆహా! హా! హా! యిదా అనుమానం! కొంచం గెడ్డం నెరుస్తూంది, నన్ను కూడా ముసలాణ్ణంటావా యేవిఁటి?

మధుర: చట్లకి చావ నలుపు, మనిషికి చావ తెలుపూ. అనగా చీకట్లో నక్షత్రాల్లాగ, అక్కడక్కడ తెల్ల వెంట్రుక తగిల్తేనే చమక్‌.

రామ: స్వారస్యం మా చమత్కారంగా తీశావ్‌ ! యేదీ ముద్దు. (రామప్పంతులు మధురవాణిని ముద్దుబెట్టుకో బోవును.)

మధుర: (చేతులతో అడ్డి ముఖము ఓరజేసుకుని) వేళాపాళా లేదా? లుబ్ధావుధాన్లు పెళ్ళి తప్పించేస్తేగాని నేను ముద్దుబెట్టుకో నివ్వను.

రామ: అంతా సిద్ధవైఁం తరవాత, నా శక్యమా ఆపడానికి? (బలాత్కారంగా ముద్దుబెట్టుకొనును.)

మధుర: సత్తువుందనా మోటతనం?

రామ: నా సత్తువిప్పుడేం జూశావ్‌ , చిన్నతనంలో ధ్వజస్తంభం దండతో కొడితే గణగణమని గంటలన్నీ ఒక గడియ వాగేవి. నాడు జబ్బు చేసిందగ్గిర్నుంచీ డీలా అయిపోయినాను.

మధుర: యిదా డీలా? నా చెయి చూడండీ యలా కంది పోయిందో అన్నా, మోటతనం!

రామ: చాప చిరిగినా చదరంతని, నీప్రాణానికి యిప్పటి సత్తువే ఉడ్డోలంలా కన పడుతూంది.

మధుర: యీపెళ్ళి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను.

రామ: వెర్రి కుదిరింది, రోకలి తలకి చుట్టమన్నాట్ట! రెండేల్లాయి ఆ ముసలిగాడిదకొడుకు మీద నా లౌక్యప్రజ్ఞంతా వినియోగపర్చి పెళ్ళి సిద్ధంచేసి యిప్పుడెలా తప్పించడం?

మధుర: యేం లౌక్యం చేశారు?

రామ: అలా అడుగు. నా బుద్ధి సత్తువకూడా నీకు తెలుస్తుంది. లుబ్దావుధాన్లు పరమలోభి. వాడి గుణం యిలావుండబోతుందని పోల్చారేమో అన్నట్టు చిన్నతనంలో వాడికి పేరు పెట్టారు. పెళ్ళాడితే వల్లమాల్ని ధనం వస్తుందని ఆశపెట్టించాను.

మధుర: యలాచేశారీ మహాచిత్రం? పెళ్ళైతే ధనం ఖర్చౌతుంది గాని, రావడ వెఁలాగ?

రామ: లౌక్యవఁంటే మరేవిఁటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్యడవేఁ కదూ? మన సిద్ధాంతిని దువ్వేటప్పటికి వాడేంజేశాడను కున్నావు? లుబ్దావుధాన్లు జాతకం యగా దిగా చూసి, శీఘ్రంలో వివాహ యోగం వుందన్నాడు, ఆ వివాహంవల్ల ధనయోగ వుఁందన్నాడు, దాంతో ముసలాడికి డబ్బొస్తుందన్న ఆశ ముందుకి, డబ్బు ఖర్చౌంతుందన్న భయం వెనక్కిలాగడం ఆరంభించింది. యింతట్లో పండా గారిక్కడికొచ్చారు. ఆయన్ని కూడా తయారు చేశాను. లుబ్దావుధాన్లు అనుమానం తీర్చుకుందావఁని ఆయనకి జాతకం చూపించే సరికి పండాగారు యేమన్నారూ? ‘వివాహ ధన యోగాలు జవిఁలిగావున్నాయి, అయితే మీరు పెద్దవాళ్ళు, యిప్పుడు మీకు పిల్ల నెవరిస్తారు, పెళ్ళెలా అవుతుంది? యిలాంటి జరగడానికి వీల్లేని మహా యోగాలు జాతకాల్లో పట్టినప్పుడు, గొప్ప మేలుకు బదులుగా గొప్ప కీడు సంభవిస్తుంది. అనగా మీకు మారకవోఁ, ధననష్టవోఁ సంభవిస్తుంది. గ్రహశాంతి చేసి బ్రాహ్మణ భోజనం బాహుళ్యంగా చెయ్యండి, కొంత జబ్బో గిబ్బో చేసి అంతటితో అరిష్టం పోతుంది. మంచి రోజు చూసి సూర్య నమస్కారాలు ఆరంభించండి’ అని చెప్పేసరికి అవుఁధాన్లు గుండె రెండు చెక్కలై వివాహప్రయత్నం ఆరంభించాడు. యిదీ కథ.

మధుర: యేమి కల్పన!

రామ: యింకావుంది యిహను కృష్ణ రాయపురంలో అగ్నిహోత్రావుఁధాన్లు కూతురు జాతక వెఁలావుందట? చప్పడానికి అలవి లేదు. అది కాలు పెట్టిన యిల్లు పది యిళ్ళౌతుందట. అది పట్టిందల్లా బంగార వౌఁతుందట!

మధుర: నిజవేఁనా లేక అదీ మీ బనాయింపేనా?

రామ: అది మట్టుకు నా బనాయింపు కాదు. అగ్నిహోత్రావుఁధాన్లే జాతకం అలా బనాయించాడు. మా బ్రాహ్మల్లో యిది పరిపాటే, పెళ్ళిళ్ళలో పంపించేది ఒహ జాతకవూఁ నిజంవుండదు.

మధుర: యేమ్మోసం!

రామ: లౌక్యం, లౌక్యవఁను!

మధుర: రెండింటికీ యేవిఁటో భేదం.

రామ: నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవఁను.

మధుర: తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్థవేఁవిటి?

రామ: యావఁన్నావూ? అబద్ధవఁనా? ఉద్యోగధర్మం లౌక్యవృత్తీ అని, అదివకవృత్తి భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్యవృత్తి యెటువంటిదీ? నిజాన్ని పోలిన అబద్ధవాఁడి ద్రవ్యా కర్షణ చేసేది. యీ ధర్మ సూక్ష్మాలు నీకెలా తెలుస్తాయి.

మధుర: నాకెలా తెలుస్తాయి నిజవేఁగాని, ద్రవ్యాకర్షణ యలాగ యీ పెళ్ళివల్ల?

రామ: (తనలో) క్రాసెగ్జామినేషను చేస్తూందోయి దీంతస్సా గొయ్యా (పైకి) నీకు మేజువాణి నిర్నయించుకున్నాను కానూ. నీకు పదిరూపాయలసొమ్ము దొరకడం ద్రవ్యాకర్షణ కాదా?

మధుర: యేచిత్రవైఁన మనుష్యులు పంతులు గారూ! (తమలపాకుచుట్టతో కొట్టి) నేను రాబోతానని రెండేళ్ళ కిందటా కలగని, యీ కాబోయే మేజువాణీ బుద్ధిలో వుంచుకుని యీ పెళ్ళి కావడానికి విశ్వప్రయత్నం చేశారూ? ద్రవ్యాకర్షణ యలాగో నాకు బోధపడ్డది. పెళ్ళికూతుర్ని యిలాకా చేసుకుని, దాంద్వారా ముసలాడి మూటా ముళ్లా లాగేస్తారు. యంత సత్యకాలపదాన్నయినా ఆ మాత్రం ఊహించుకోగల్ను. లేకపోతే నేయంత బతిమాలుకున్నా యీ పెళ్ళి తప్పించక పోవడవేఁవి? మీ బుద్ధికి అసాధ్యం వుందంటే నే నమ్ముతానా?

రామ: ఆమాట్నిజవేఁగాని, అన్ని పనులూ ద్రవ్యాకర్షణ కోసవేఁ చాస్తాననుకున్నావా యేవిఁటి, ఆ ముసలాణ్ణి కాపాడదావఁనే, యీ పెళ్ళి తలపెట్టాను.

మధుర: ‘చిత్రం చిత్రం మహాచిత్రం’ అని కథుంది, అలా వున్నాయి మీ చర్యలు!

రామ: ఆ కథేదో చెబుదూ, నాక్కథలంటే మా సరదా.

మధుర: పొగటిపూట కథలేవిఁటి. ముందు యీ చిత్రకథేవిఁటో శలవియ్యండి!

రామ: అది చెప్పేది కాదు. చెప్పను.

మధుర: చెప్పకపోతే వొప్పను.

రామ: ఒప్పకేం జేస్తావు?

మధుర: యేం జేస్తానా? యీ జడతో కొడతాను, శాస్త్రంలో కాముకులకు చెప్పిన ఆయుధవిఁది.

రామ: నేం దెబ్బలికి మనిషిని కాను. శాస్త్రం గీస్త్రం వక పక్క నుంచి మోట సరసం మాను. చెప్పమంటే చెబుతాను గాని అలాంటి కబుర్లు నువ్వు వినకూడదు. మరేం లేదు. లుబ్దావుధాన్లు వెధవకూతురు, మీనాక్షి ప్రవర్తన మంచిది కాదు. నాల్రోజుల కొహమారు అది పీకల మీదికి తెస్తూంటుంది. పోలీసువాళ్ళు బెదిరించి పది డబ్బుల సొమ్ము లాగేస్తుంటారు. డబ్బు ఖర్చంటే ముసలాడికి, ప్రాణ పోకట. సంసారం కూడా మీనాక్షి దూబర చేస్తూందంటాడు. పెళ్ళయితే దాని ఆటకడుతుంది.

మధుర: మీనాక్షి ప్రవర్తన బాగుంది కాదంటూ మీరే చెప్పాలీ? మీరు కంట పడ్డ తరవాత యే ఆడదాని ప్రవర్తన తిన్నగా వుంటుంది?

రామ: అదుగో చూశావా? అలా అంటావనే కదూ చప్పనన్నాను.

మధుర: యీ చిక్కులు నాకేం తెలియవు. పెళ్ళి మానిపించెయ్యండి.

రామ: యీ పెళ్ళిలోమేజువాణీ పెట్టి పదిరాళ్ళిప్పిస్తాను. మాటాడ కూరుకో.

మధుర: (ముక్కు మీద వేలుంచుకొని) లుబ్దావుధాన్లు యదట నేను మేజువాణీ ఆఁ!

రామ: పేరు వాడుగాని, పెద్దన్నేనే కదూ?

(హేడ్‌ కనిస్టేబ్‌ చుట్ట కాలుస్తూ ప్రవేశించి కుర్చిమీద కూర్చొనును.)

హెడ్‌ : రామప్పంతులూ! యినస్పెక్టరికే టోపీ వేశావటే?

రామ: (హెడ్‌ కనిస్టేబు చెవిలో) గారూ గారూ అనవయ్యా.

హెడ్‌ : యెప్పుడూలేంది గారేవిఁటి, గీరేవిఁటి, చింత గారు?

రామ: ఆడవాళ్ళున్న చోటికి తోసుకు రావడవేఁనా, అన్నా!

హెడ్‌ : ఆడవాళ్ళంటున్నావు, నువ్వు కూడా అందులోనె జమాయేవిఁటి? అహ! హ!

రామ: హాస్యానికి వేళాపాళా వుండాలి.

హెడ్‌ : నేను హాస్యంకోసం రాలేదు యినస్పెక్టరు పేరు చెప్పి రావిఁనాయడి దగ్గిర పాతిక రూపాయల్లాగావట, యిలా యందరి దగ్గిర లాగాడో రామప్పంతుల్ని నిల్చున్న పొట్లాన్ని పిలకట్టుకు యీడ్చుకురా అని నాతో ఖచితంగా చెప్పి యినస్పెక్టరు పాలెం వెళ్ళిపోయినాడు.

రామ: చిన్నప్పుడు ఒక్క బర్లో చదువుకున్నాం యినస్పెక్టరూ నేనూను. అంచాత అతని పిలక నేనూ, నా పిలక అతనూ లాగినా ఫర్వాలేదు. రావిఁనాయడి మాట మాత్రం శుద్ధాబద్ధం. మీరు ముందు పదండి, గుఱ్ఱం కట్టించుకుని స్టేషను దగ్గిర కలుస్తాను.

హెడ్‌ : నే నెలా వస్తాను నీతోటి నాకు వల్లమాల్నపనుంది, ఒక కనిష్టీబుని నీతో పంపిస్తాను.

రామ: (హెడ్‌ చెవులో) నా యింట్లో మాత్రం నకార ప్రయోగం చెయ్యకు, నీకు పుణ్యవుంటుంది.

హెడ్‌ : అదా నీ ఘోష! అలాక్కానియి, (నిష్క్రమించును)

రామ: (తనలో) అదుగో మళ్ళీ ఏకవచనవేఁ కూస్తాడు! (పైకి) యవడ్రా అక్కడ.

నౌఖరు: (ప్రవేశించును) సిత్తం బాబు.

రామ: గుర్రం కట్టమను.

నౌఖరు: సిత్తం బాబు, (నిష్క్రమించును)

రామ: చూశావూ మధురవాణీ నేన్నిలబడ్డచోట రూపాయలు గలగల్రాలతాయి, యీ యినస్పెక్టరుగాడికి, యీ తాలూకాకి వచ్చింతరువాత అయిదారు వేలు యిప్పించాను. వీధి తలుపు వేసుకుని సంగీత సాధకం చేసుకో, విద్య వంటి వస్తువు లేదు. (గుమ్మందాటి నాలుగడుగులు వెళ్ళి తిరిగి వచ్చి) అప్పుడే వీణ తీశావు? యీ వూళ్ళో మా దుర్మార్గులున్నారు నాస్నేహితులవఁనీ, బంధువులవఁనీ పేరు పెట్టుకొస్తారు, రానీకుమా (తలుపుపైనించి వేసి) గడియ వేసుకో. (నిష్క్రమించును)

2-వ స్థలము, రామప్పంతులు యింట్లో పడకగది.

[మధురవాణి తివాసీమీద కూచుని వీణ వాయించుచుండును వాయిద్యం ముగించి]

మధుర: విద్య వంటి వస్తువ లేదు, నిజమే - ఒక్కటితప్ప - అదేవిఁటి? విత్తం. డబ్బు తేని విద్య దారిద్య్ర హేతువ. యీ వూళ్ళో నారదుడు వచ్చి పాడితే నాలుగు దమ్మిడీలివ్వరు. గనక యీ వీణ యిటుపెడదాం. హెడ్డు కనిష్టేబు సౌంజ్ఞ చేసి వెళ్ళాడు. అతడు యిచ్చేదీ చచ్చేదీ లేదు గాని, జట్టీ లేవైఁనావస్తే ఓ వొడ్డు కాస్తాడు.

(వీధి తలుపు తట్టబడును.)

వచ్చాడు కాబోలు. (తలుపు దగ్గిరకి వక్కి) యవరు మీరు? బంధువులా? (తలుపవతల కరటక శాస్తుల్లు, కన్యవేషంతో శిష్యుడున్నూ.)

కరట: ఆపద కడ్డం బడ్డవారే బంధువులు. మేమ్మీకు బంధువులం కావుఁగాని, మీరు మాకు బంధువులు కాగల్రు.

మధుర: నాస్తులా?

కరట: (తనలో) ఈ కంఠం విన్నట్టుంది. (పైకి) నాస్తం కట్టడానికే వచ్చాం.

మధుర: దేంతో కడతారు?

కరట: (తనలో) ఈ వేశ్య మధురవాణి కాదుగద? కంఠాన్ని పోలిన కంఠం వుండ కూడదా? (పైకి) నాస్తం కట్టడానికల్లా వున్నది వక్కటే గదా టంకం?

మధుర: యేవిఁటో ఆ టంకం?

కరట: బంగారం!

మధుర: మాపంతులుగారికి మీరు నాస్తులూ, బంధువులూ కూడా కాకపోతే తలుపు తియ్యొచ్చును. (తలుపు తియ్యును)

కరట: (తనలో) అరే! మధురవాణే!

మధుర: (ముక్కు మీద వేలుంచుకొని) చిత్రం!

కరట: యేమిటి చిత్రం?

మధుర: యీ వేషం?

కరట: ఉదరనిమిత్తం బహుకృతవేషం యిది దేవుఁడిచ్చిన వేషవేఁను.

మధుర: నా దగిరేనా మర్మం? యీ పిల్లెవరో?

కరట: నా కొమార్త.

మధుర: నాటకవఁల్లా చెడి పొగటి వేషాల్లో దిగిందా? పెట్టి పుట్టారుగదా యేల యీ అవస్థ?

కరట: నీ దయవల్ల దేవుడిచ్చిన స్తితికేం లోపం రాలేదు. నిన్ను చూదావఁని వచ్చాను.

మధుర: యిన్నాళ్ళకైనా యీ దీనురాలు మీకు జ్ఞాపకం రావడం అదెంత గాదు?

కరట: నీలాంటి మనిషి మళ్ళీవుందా? నిన్ను చూడ్డం బ్రహ్మానందం కాదా? నీదగ్గిరకి రావడం చేదనా యిన్నాళ్ళూ రాలేదనుకున్నావు? డిప్టీ కలక్టరుగారి కుమారరత్నంగారు నిన్ను చేపట్టారని తండ్రికి తెలిసింతరువాత, నేనుగానీ నీ యింటికి వస్తే పీక ఉత్తరించేస్తాడేమో అనే భయం చేత కొంచం యడబెట్టి యితడికి యెప్పుడు బదిలీ అవుతుంది, మా మధురవాణ్ణి యెప్పుడు చూస్తాను అని దేవుఁణ్ణి సదా ప్రార్ధిస్తూ వుంటిని. నువ్విక్కడెన్నాళ్ళాయి వున్నావు?

మధుర: డిప్టీకలక్టరు గారి కుమారరత్నం గార్ని, తండ్రి చదువు పేరు పెట్టి చన్నపట్ణం తగిలిన రెండు నెల్లదాకా ఆయన నాస్తుడు గిరీశంగారి ద్వారా డబ్బు పంపించాడు. ఆ తరువాత మొన్నటిదాకా గిరీశం గారు నన్ను వుంచారు గాని, డబ్బుకి యటాముటీగా వుండేది. నా యింటికి వచ్చిన వాడల్లా తన కొడుక్కి దోస్తీ అయివుంటాడని డిప్టీ కలక్టరు అనుమానిస్తాడేమో అని పేరుగల వాడెవడూ నా యింటికి రావడం మానేశాడు. సంజీవరావుగారి అల్లరి కొంచం మరుపొచ్చిందాకా పైనుందావఁని యీ వూరొచ్చాను.

కరట: (ముక్కు మీద వేలుంచుకొని) గిరీశం నిన్నుంచుకున్నాడా? మా మేనల్లుడికి చదువు చెప్పడానిక్కుదురుకుని మావాళ్ళింట్లో చేరాడు. వాడికి పెందరాళే ఉద్వాసన చప్పాలి.

మధుర: (ముక్కు మీద వేలుంచుకొని) నాదగ్గిరకు వచ్చినవాడల్లా చెడిపోయినాడో? నా దగ్గిరకు మీరు రాకుండా అవరోధం కలిగిందని యిప్పుడే డిప్టీ కలక్టరుగార్ని తిట్టారే. ఆయన కంటే మీ న్యాయం యేం బాగావుంది? నా దగ్గిరకు వచ్చినందుకు, మీ భార్యాగారు ముందు మిమ్మల్ని మెడబట్టుకుని యింట్లోంచి తరవ్వఁలిసింది. తనకి రొట్టా, ఒహడికి ముక్కానా?

కరట: క్రియలలో అంతవరకు జరక్కపోయినా మాటల్లో ఆ మర్యాద ఆమేషా నాకు జరుగుతూనే వున్నది.

మధుర: (చిరునవ్వుతో) యీ యిల్లాలు మాపంతులు కంటబడితే యీవిడ గుట్టు బట్ట బయలౌతుంది.

కరట: యిల్లాలనేస్తున్నావేఁం అప్పుడేను? కన్నెపిల్ల దీన్ని పెండ్లిచేయడానికే, నీ దగ్గిరికి తీసుకొచ్చాను.

మధుర: మాపంతులుకేనా పెళ్ళి?

కరట: ‘ఏకనారీ సుందరీనాదరీవా,’ అన్నాడు. త్రిలోకసుందరివి నువ్వు దొరికింతరవాత నీ పంతులుగారికి యింకా పెళ్ళెందుకు?

మధుర: ఐతే మరెవరికి పెళ్ళి చెయ్డం? నాకా యేవిఁటి? అలాగైతే, సైయేఁ! మొగ వేషం వేసుకొని, పెళ్ళిపీటల మీద కూర్చుంటాను. యిలాంటి పెళ్ళాం దొరకడవెఁలాగ? జగత్ప్రసిద్దులైన కరటక శాస్తుల్లు గారి అల్లుణ్ణి కావడం యెలాగ? దివ్య సుందర విగ్రహవఁని పొగడగానే నా బుజాలు పొంగుతాయనుకున్నారు కాబోలు? యీ పిల్లదగ్గిర నాబోట్లు దివిఁటీ ముందర దీపాలు. ఆడది మెచ్చిందే అందం! మొగాడి కన్ను మసక. మీకేం తెలుసును? మరి నా పెళ్ళాన్ని నాకిచ్చేసి మీతోవని మీరు వెళ్ళండి. (శిష్యుడి చెయ్యి పట్టి లాగును.)

శిష్యుడు: చూశావురా నాన్నా యలా పట్టుకుందో?

మధుర: (ఆచుకోలేకుండా నవ్వుతూ) శాబాషు! యిదేనా పెద్దమనిషి తరహా! యిరుగు పొరుగమ్మ లేవఁంటారో మొగుడు పిలిస్తే వెళ్ళకుంటేను?

శిష్యుడు: కొడ్తుంది కాబోల్రా నాన్నా, యింటి కెళ్ళిపోదాం, రా!

మధుర: యేం నంగనాచివే? తరవాత పెళ్ళిచేసుకుంటాను. అందాకా ముద్దియ్యి (ముద్దెట్టుకొనును)

కరట: నేరని పిల్లని చడగొడుతున్నావు.

మధుర: నాలాంటి వాళ్ళకి నూరుమందికి నేర్పి చెడగొట్టగలడు. యవరి శిష్యుడు? యీ కన్నెపిల్ల నోరు కొంచం చుట్టవాసన కొడుతూంది!

కరట: అంచాతే కాబోలు డబ్బీలో చుట్టలు తరచు మాయవౌఁతుంటాయి. మధురవాణి! దేవుఁణ్ణాకు నిన్ను చూపించాడు. పంతుల్లేని సమయం కనిపెట్టివచ్చాను మళ్ళీ అతడొచ్చేలోగా నా మాటలు నాలుగూ విని మాకు వొచ్చిన చిక్కు తప్పించు.

మధుర: మీ కొచ్చిన చిక్కేవిఁటి? నేం చెయ్యగల్గిన సహాయ వేఁవిఁటి?

కరట: చిక్కన్నా చిక్కు కాదు. విను, యీ వూళ్ళో గిరీశం పెత్తల్లికొడుకు లుబ్దావుధాన్లని ముసలాడున్నాడు వాడికి మా మేన గోడల్నివ్వడానికి మా బావ నిశ్చయించాడు. యీ సంబంధం చేస్తే నా చెల్లెలు నూతులో పడతానని వొట్టేసుకుంది. యేం వుపాయం చాస్తావో దాని ప్రాణం కాపాడాలి.

మధుర: యీ పిల్లని అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే, లుబ్దావుధాన్లు చంకలు గుద్దుకుని చేసుకుంటాడు. అతనిదాకా యెందుకు నేనే కొనుక్కుంటాను.

కరట: చూపితే అందుకు పోయేదానికి నీకు మిక్కిలి చెప్పాలా యేవిఁటి?

మధుర: యిదివరకి నిర్ణయవైఁన సమ్మంధం యేమ్మిషపెట్టి తప్పించడం?

కరట: నీబుద్ధి కసాధ్యం వుందా? డబ్బుకసాధ్యం వుఁందా?

మధుర: బుద్ధికి అంతా అసాధ్యవేఁగాని డబ్బుకి యక్కడా అసాధ్యం లేదు. యీ పెళ్ళిలో మా పంతులుకో పదిరాళ్ళు దొరుకుతా యనుకుంటున్నాడే?

కరట: నా సంబంధం చేసుకుంటే నేను యిరవై రాపాషాణాలు యిస్తాను.

మధుర: సరే. గాని నాటకంలో యంతహాస్యవైఁనా చెల్లుతుంది. నటనలోకి హాస్యం తెస్తే యేవిఁ మూడుతుందో ఆలోచించారా?

కరట: మధ్య నీకొచ్చిన ఫర్వాయేవిఁటి? నాకొచ్చిన ఫర్వా యేవిఁటి? యీ కత్తెర మీసం, కత్తెర గెడ్డం కడిగేసుకుని నా తోవని నే వెళతాను. యీ కోక నీ దగ్గిర పారేసి మా శిష్యుడు వెళతాడు. ఆ తరవాత యిదేవిఁటమ్మా యీ చిత్రవఁని నువ్వూ నలుగురమ్మలక్కలతో పాటు ఆశ్చర్యపడుదువు గాని. మీ పంతులుతో సిఫార్చు చేసి యీ మంత్రం యలా సాగిస్తావో గట్టి ఆలోచనచెయ్యి.

మధుర: మా పంతులు వక్కడివల్లా యీ పని కానేరదు.

కరట: మరియింకా యవరి కాళ్ళు పట్టుకోవాలో చెప్పు?

మధుర: మా పంతులుతో మాట్లాడ్డం ఐన తరవాత అవుధాన్లు కూతురు మా నేస్తం మీనాక్షిని తండ్రికి తెలియకుండా చూసి, ఓ రెండు పెద్ద కాసులు యిస్తానని చెప్పండి. ఆపైని సిద్ధాంతిని చూసి అతనికీ అలాగే ఆశపెట్టండి. యీ పనికి సిద్ధాంతే కీలకం. నేను తెర వెనకనుంచి సమయోచితంగా హంగు చాస్తాను.

కరట: నీ మాట వేరే నే చెప్పాలా? నిన్ను సంతోషపెట్టడం నాకు విధి.

మధుర: ఆ మాట మీరు శలవివ్వడం నాకు విచారంగా వుంది. వృత్తిచేత వేస్యని గనక చెయ్యవలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చేస్తాను గాని, మధురవాణికి దయా దాక్షిణ్యాలు సున్న అని తలచారా? మీ తోడబుట్టుకి ప్రమాదం వచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా? యటుంచి యెటొచ్చినా కాపాడతాడు. హెడ్డు కనిష్టేబుకు మాత్రం కొంత నిజం చెపుదాం. అతగాడు యిప్పుడే వస్తాడు మాట్లాడతాను. మీరు యిక్కడ కూచోండి.

కరట: స్వాధీనుడేనా? కొంప ముంచడుగద?

మధుర: గులాం. (నిష్క్రమించును)

కరట: కూచుందాం రా.

శిష్యుడు: నా పేరేవిఁటండోయి?

కరట: కొంప ముంచుతావు కాబోలు! సుబ్బి!సుబ్బి! మధురవాణ్ణి చూడగానే మతి పోయిందా యెవిఁటి?

శిష్యుడు: దాని నవ్వు పట్టుబడాలని నిదానిస్తున్నాను.

కరట: సబ్బు అన్న మాట జ్ఞాపకం వుంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం వుంటుంది.

(రామప్పంతులు గుర్రం దూరాన్న దిగి నడిచివచ్చి)

రామ: (కరటకశాస్త్రితో మెల్లిగా) లోపలికెవరైనా వెళ్ళారా?

కరట: (గట్టిగా) యెవరో యిద్దరు ముగ్గురొచ్చారుగాని మీ యిల్లాలు గారొచ్చి పైకి పొమ్మని గెంటేశారు.

రామ: మీరెవరు? యెందుకొచ్చారు?

కరట: మాది కృష్ణాతీరం. నాపేరు గుంటూరు శాస్తుల్లంటారు. తమదగ్గిర రాచకార్యవుండి వచ్చానండి.

వీధిలో నుంచి జవాను : "యినస్పెక్టరుగారు నే వచ్చిందాకా మర్రిచెట్టుకింద గుర్రాన్ని నిలబెట్టుంచుతావఁన్నారు. రూపాయలు వేగం యివ్వండి."

(మధురవాణి ప్రవేశించును)

రామ: యవరు వొచ్చారట?

మధుర: యవరొస్తారు? మీ నాస్తులట! తగిలాను.

రామ: (మధురవాణితో) యేదీ మొన్న నీకిచ్చిన రూపాయలు? సాయంత్రం మళ్ళీ ఫిరాయిస్తాను. యీ సైతాను ప్రాణం తింటున్నాడు.

మధుర: మీరిచ్చిన రూపాయలు పట్ణం తోలేశాను. నేను డబ్బిక్కడ దాచుకుంటే మా తల్లక్కడ కాలక్షేపం చెయ్యడవెఁలాగ?

రామ: వొట్టబద్ధాలు!

మధుర: (తాళముల గుత్తి మొలలోనుంచి తీసి రామప్పంతులు మీద విసిరి) చూసుకోండి.

రామ: (బుజం తడువుఁకుంటూ) దురహంకారం కూడదు! విసిరికొడితే దెబ్బ తగల్దను కున్నావా యేవిఁటి?

మధుర: దుష్టుమాటలనగా తగిల్తే తప్పా?

జవాను: యేవఁయ్యోయి. పోయి, రూపాయి లిచ్చావు కావని యినస్పెక్టరు గారితో చెబుదునా?

మధుర: (మెడలో నాను తీసి) యిది తాకట్టువుంచి కావలసిన సొమ్ము తెచ్చుకొండి.

రామ: (తనలో) ఆహా! యేమి యోగ్యమైన మనిషి! లేనిపోని అనుమానాలు పడకూడదు!

కరట: పంతులుగారూ యెన్ని రూపాయలు కావాలండీ?

రామ: పాతిక.

కరట: నే దాఖల్చేస్తాను (జవానుకు యిచ్చును)

రామ: ధనజాతకానికి డబ్బలా వస్తూవుంటుంది. యేవిఁటి మీ రాచకార్యం?

కరట: యిది నా పిల్లండి. దీనికి వివాహం చేయించి ఆ సుకృతం తమరు కట్టుకోవాలి.

రామ: వివాహం చేయించడానికి నేను వైదీకిని కాను, నాకు మంత్రాలు రావే? (చుట్ట జేబులోంచి తీసి కొన కొరకి) యేవఁంటావు మధురవాణీ? అగ్గిపుల్ల.

మధుర: (అగ్గిపుల్ల అందిస్తూ పంతులు నుంచి శిష్యుడి వేపూ, శిష్యుడి నుంచి పంతులు వేపూ కోపముతో చూసును.)

కరట: మంత్రమన్నప్పుడు వైదీకపవాడిదేం మంత్రవఁండి? యీ రోజుల్లో వైదీక మ్మంత్రాల మహిమ పోయిందండి. మంత్రవంటే నియ్యోగప్రభువుదే మంత్రం! తమవంటి ప్రయోజకులకు మంత్రం మాటాడుతుందండి.

రామ: మధురం! యేవఁంటావు? యీ పిల్ల న్నే పెళ్ళిచేసుకుందునా?

మధుర: (రామప్పంతులు వేపూ, శిష్యుడి వేపూ చురచురా చూసి నిష్క్రమించును)

రామ: సొగసుకత్తెలకు అలకకూడా అదో శృంగారం సుమండీ, శాస్తుల్లు గారూ!

కరట: వైదీకపాళ్ళం మాకా శృంగారాలు యలా అనుభవవౌఁతాయండి? మా యిల్లాళ్లక్కోపం వస్తె చీపురుగట్టలు యెగురుతాయండి. సరసవఁన్నది పుస్తకాల్లో చదవడవేఁగాని మాకు అనుభవవేద్యం కాదండి. శ్రీకృష్ణమూర్తి వారు రాధికతో శలవిస్తున్నారు, ఓ రాధికా నీ కోపం తీర్చుకోవాలన్నష్షాయనా ‘ ఘటయభుజ బంధనం రచయరద ఖండనం, యేనవాభవతి సుఖజాలం’ అనగా యేవఁంచున్నాడంటే కవీశ్వరుడు, చేతుల్తోటి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా కౌగలించుకో, మరిన్నీ పెదివఁలురక్తాలొచ్చేట్టు కొరికెయ్యి, అంఛున్నాడు.

రామ: (మధురవాణి వెళ్ళిన గుమ్మము వేపు చూసి) ఉప్పులేకనే ముప్పందుం. మధురవాణికి మాత్రం ఈ వెర్రి మొర్రి కవిత్వాలు చెప్పకండి. నా లాంటి మృదువర్లు ఇటువంటి మోటసరసం సహించరు.

కరట: ఆమె మీ భార్యా కారండీ? సంసారి కన్నా మర్యాదగా వుంది యీ వేశ్య! మీది యేవఁదృష్టం.

రామ: యెంపిక. యెంపికలో వుందండి. మీ రాచకార్యం చెప్పారు కారు.

కరట: లుబ్దావుధాన్లుగారికీ తమకీ చాలాస్నేహవఁని విన్నాను. ఆయన తమ మాట అడుగు దాటరట?

రామ: ఆ గాడిదకొడుక్కి ఒకరితో స్నేహం యేమిటండీ? వాడి ప్రాణానికీ డబ్బుకీ లంకె. డబ్బుకీ వాడికే స్నేహంగాని మరి యవరితోనూ స్నేహం లేదు. అయితే వాడికి వ్యవహారజ్ఞానం లేకపోవడం చాతా, కోర్టంటే భయం చాతా, నా సలహాలేక బతకలేడు. వాడే అన్నమాటేవిఁటి, యీ తాలూకాలో సివిలు మేజిస్ట్రేట్లు యెక్కడొచ్చినా రామప్పంతులు పప్పులేని పులగం వుండదు.

కరట: ఆ మాటవినే తాము నియ్యోగ ప్రభువులు, మంత్రబలం చాత చక్రం అడ్డేస్తారని తమర్ని వెతుక్కొచ్చాను. మా పింతల్లికొడుకు బియ్యే బియ్యెల్‌ పాసయినాడండి. డిప్టీకలక్టరీ చేస్తున్నాడు. బంధువులకి అతనివల్ల గడ్డిపరకంత సాయం లేదుగదా? మీది మిక్కిలి కూరానారా యవళ్ళయినా గృహస్థులు గృహస్థు మర్యాదకి పంపించి, తల్లయినా పెళ్ళాం అయినా అవి పుచ్చుకుంటే, తిరగ గొట్టిందాకా అభోజనం కూచుంటాడు! పెట్టడానికి పుచ్చుకోడానికీ నియ్యోగ ప్రభువులు, తమకి చెల్లింది కాని మా వాళ్ళ ఉద్యోగాలు మంటిగడ్డ ఉద్యోగాలండి. "ఇయ్యా ఇప్పించంగల అయ్యలకే కాని మీసమన్యులకేలా రొయ్యకి లేవా బారెడు" అని కవీశ్వరుడన్నాడు .

రామ: యీ యింగిలీషు చదువులు లావైన కొద్దీ వైదీకులే అన్నమాటేవిటి అడ్డవైఁన జాతుల వాళ్ళకీ ఉద్యోగాలవుతున్నాయి గాని యంత చదువుకున్నా మీ వైదీకప్పంతుళ్ళవారికి మా చాకచక్యాలబ్బుతాయండీ. మా లౌక్యం మాతో స్వతహాగా పుట్టినది. మీరు తెచ్చిపెట్టుకున్నది. యెరువు సరుకు యెరువు సరుకే. విన్నారా? మీ వాళ్ళు లంచాలు పుచ్చుకోడం చాతకాక, పతివ్రతలమని వేషం వేస్తారు.

కరట: అదే పతకవైఁతే అది అమ్ముకు బతకనాఁ అన్నట్టు మా వాళ్ళకే చాతయితే నాకు యీ అవస్థేవఁండీ? మావాడు పది మంది పార్టీలతో చెబితే పదిరాళ్ళ సొమ్ము దొరుకును. యీ చిక్కులు లేకపోవును.

రామ: యెవిఁటా చిక్కులు?

కరట: రుణబాధ చాలా లావుగా వుందండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లక పోతే దావా పడిపోతుందండి. యీ పిల్లని నల్లబిల్లిలో వెంకటదీక్షితులుగారికి పదహారు వందలకి అమ్మ నిశ్చయించుకొని తీరా వచ్చేసరికి యిప్పట్లో రూపాయలివ్వలేం, పెళ్ళయిన నెల రోజుల్లో యిస్తావన్నారండి. అందుచేత అది వదులుకొని లుబ్దావుధాన్లుగారు వివాహ ప్రయత్నంలో వున్నారని విని తమ దర్శనానికి వచ్చానండి. యిదిగాని తాము సమకూరుస్తే పది వరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను.

రామ: నేను నలభై యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడే వాణ్ణి కాను.

కరట: తాము చేసే సదుపాయాన్ని బట్టి యంతయినా దాఖలు చేసేవాణ్ణేనండి. నా రుణాలు పదహారు వందలుంటాయండి. ఆ పైని యెవొచ్చినా తాము దాఖలు చేసుకొండి.

రామ: ’ఐతే, గియ్తే‘ బేరాలు మాకవసరం లేదు. అగ్నిహోత్రావుధాన్లకి పద్దెనిమిది వందలిస్తున్నాడు గదా, అందుకు సగానికి సగం తగ్గితేనేగాని అవుధాన్లు ఆ సంబంధం మాని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరే దేవిఁటి నాకిచ్చేదేవిఁటి? యేవైఁతేనేవిఁ? ఆ వ్యవహారం యలాగా మించి పోయింది. పది రోజులకిందటొస్తే ఫొక్తుపరుస్తును. ఆ సంబంధం భోగట్టా మొదట నేనే తెచ్చాను. నా చేతుల్లోంచి ఆ వ్యవహారం పోలిశెట్టి లాగేశాడు. కృత్యాద్యవస్థ మీద మధురవాణి మేజువాణీకి వాణ్ణొప్పించే సరికి నా తాతలు దిగొచ్చారు. మరివక ఉపాయం చెబుతాను వినండి. మీకు మైనరు కొమాళ్ళున్నారా?

కరట: చిన్నవాడ్కి మయినారిటీ దాటి మూడేళ్ళయిందండి.

రామ: అయితే యిహలేందేవిఁటి? ఆ కుర్రవాడు మయినరని వాదిద్దాం.

కరట: సాక్ష్యం యలా వొస్తుందండి?

రామ: ఓ హో హో! మీకు యేమీ తెలియదే! యిలాంటి వ్యవహారాలు నా తలమీద యెన్ని వెంట్రుకలున్నాయో అన్ని మోసేశాం విన్నారా? ఉర్లాం బసవరాజుగారి సంభావన్ల రేటే సాక్ష్యాలక్కూడా గేజటార్డర్‌ చేశాం. కుండనాలు వేసుకున్న వారికి ఓ రూపాయి జాఫా.

కరట: జాతకం వుంది గదా యేం సాధనం?

రామ: కాకితవైఁతే అగ్గిపుల్లతో ఫైసల్ ! తాటాకైతే నీళ్ళపొయ్యి! కొత్త జాతకం బనాయించడం అయిదు నిమిషాల పని. మా సిద్ధాంతి మట్టుకు నాలుక్కాలాలు చల్లగా వుండాలి. నా దగ్గిర పాత తాటాకులు అలేఖాలు అటకనిండా వున్నాయి. ముప్ఫైయేళ్ళనాటి కాకితాలున్నాయి. రకరకాలు సిరాలున్నాయి. ఒక నూర్రూపాయలు నాకు ఫీజు కింద యిచ్చి ఖర్చులు పెట్టుకొండి. గ్రంథం నడిపిస్తాను.

కరట: దారి ఖర్చుకోసం తెచ్చిన రూపాయలు మీకు దాఖలుచేసాను. మరి బుర్ర గొరిగించుకుందావఁంటే దమ్మిడీ లేదు. కోర్టంట తిరగడానికయినా చేతిలో ఓడబ్బు సొమ్ముండాలిగదా? యిదొహర్తె టొంపలా నాతోవుంటే యలాగండి కోర్టంట తిరగడం? తమ లౌక్యానికి అసాధ్యవఁన్నది వుంటుందంటే నే నమ్మ జాలను. యలాగయినా కుదిర్న సంబంధం తిప్పించి, మా సంబంధం కుదిర్చి నాకు యిచ్చే సొమ్ములో పదోవంతు తాము అంగీకరించి మిగిలింది నాకు దయ చెయ్యండి. దీన్ని మొగుడింట అప్పజెప్పి ఆ పైన యీ గ్రంథం యేదో కొసచూసిందాకా తమర్ని అంటగాగి వుంటాను.

రామ: పదోవంతు పనికిరాదు. మా బేరం యెప్పుడూ సగానికి సగం

కరట: సంగోరు మీకిస్తే మరి నేను రుణాలేం తీర్చుకోను?

రామ: రుణాల్తీర్చుకో అఖర్లేకుండా గ్రంథం జరిగిస్తాం కదూ? అప్పుడే మీ చేతులో రూపాయలు పడడానికి సిద్ధంగా వున్నట్లు మాట్లాడతారేవిఁటి? నేను యంత శ్రమబడ్డ పైని పతకం తిరగాలి? అది ఆలోచించారా?

కరట: తాము అలా అంటే నేనేం మనివి చెయ్నండి? రక్తం మాంసం అమ్ముకుంటున్నప్పుడు ఆ కానికూడయినా సంతుష్టిగా దొరకడం న్యాయంగదండీ? వ్యవహారాల తొట్రుబాటు చాతనూ పిల్ల కట్టు దప్పివుండడం చాతనూ, తొందరబడుతున్నానుగానండి, కొంచం వ్యవధివుంటే రెండు వేలకి పైగా అమ్ముకుందునండి. రామ: ’అయితే గియితేలు‘ అనుకున్న లాభం లేదని చెప్పానుకానా? ఐదో వంతుకు ఏవఁంటారు?

కరట: యీపాపపు సొమ్ముకే తమరు ఆశించాలా అండి?

రామ: పాపపు సొమ్ము మాదగ్గిరకి రాగానే పవిత్రవైఁపోతుంది. ఒహళ్ళ కివ్వడం కోసవేఁగాని నాక్కావాలా యేవిఁటి?

కరట: ఐతే కానియ్యండి.

రామ: యిక నా ప్రయోజకత్వం చూడండి. మధురం! మధురం! కాకితం, కలం, సిరాబుడ్డి తీసుకురా. మామోలు సిరాబుడ్డి కాక గూట్లోది పెద్ద సిరా బుడ్డి తే.

మధుర: (అవతలనుంచి) నాకంటె మధురం కంటబడ్డ తరవాత నేనెందుకు?

రామ: ఆడవాళ్ళకి అనుమానం లావండి. వింటున్నారా? అదో ముచ్చట!

కరట: కేవలం వజ్రాన్ని సంపాదించారు!

రామ: వజ్రవేఁ గానండి, పట్టవాసపు అలవాటుచాత పదిమందితో మాట్లాడితే గాని దానికి వూసుబోదు.

కరట: ఆమాత్రం స్వేచ్ఛ యివ్వడవేఁ మంచిదండి ఆడదాన్నట్టే రొకాయించకూడదండి?

రామ: రొకాయిస్తే యేం జేస్తుందేవిఁటి?

కరట: యిలాంటి మానంగల మనిషైతే నూతులో గోతులో పడుతుందండి.

రామ: అలాగనా అండి?

కరట: అందుకు సందేహమేమిటండి? నాజూకైన మనస్సుగల స్త్రీని మల్లెపువ్వు లాగ వాడుకోవాలండి.

రామ: ఆ నాజూకులూ గీజుకులూ మీకేం తెలుసునండి?

కరట: పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు. నాయకుడు నిరాకరిస్తే నాయిక వొచ్చిన్నీ యేవే, ఉద్యానాల్లో వుండుకున్నటువంటి లతలతో వురిపోసుకుంచుందండి. మహాకవుల నాటకాల్లో ఆష్లాగే జరిగినట్లు రాశారండి.

రామ: మరెవళ్ళతో మాట్లాడినా తప్పులేదు గాని, హెడ్డుకనిష్టీబు మాత్రం మాట్లాడవద్దని బుద్ధి చప్పండి. మీరు తండ్రిలాంటి వారుగదా?

కరట: ప్చు! అంత అదృష్టవాఁ అంటి! అట్లాంటి పిల్లే నాకువుంటే, మూడు నాలుగు వేలకమ్ముకుని రుణాలూ పణాలూ లేకుండా కాలక్షేపం చేసివుందును. దీన్నయినా నాలుగు దిక్కులా అమ్మజూపితే రెండు మూడు వేలు యిదివరకే చేతులో పడివుండునండి. మేనరికం చెయ్యాలని దీంతల్లి భీష్మించుక్కూచోబట్టి యీ దురవస్థ మాకొచ్చింది. అంచాతనే యింట్లో చప్పకుండా యీ పిల్లని వెంటతీసుకొచ్చి యీ దేశంలో పెళ్ళికి చూపుతున్నాను.

రామ: నా సహాయ లోపం వుండబోదు!

కరట: ఐతే కార్యవఁయిందే!

రామ: యేదీ పిల్లా యిలారా, చెయి చూపించూ!

(శిష్యుడు భయం నటించి వెనక్కి తక్కును)

కరట: చూపించమ్మా, భయంలెచ్చూపించు (కరటకశాస్తుల్లు శిష్యుణ్ణి రామప్పంతులు దగ్గిరికి తోయును. రామప్పంతులు చెయ్యి పట్టుకుని అరిచెయ్యి చూచుచుండును. శిష్యుడు చెయ్యిలాగుకొంటూన్నట్టు నటించును. మధురవాణి సిరాబుడ్డీ, కలం, కాకితం పట్టుకుని రామప్పంతులు వెనక నిలుచుండును.)

రామ: ఆహా! యెం ధనరేఖా! సంతానయోగ్యత బాగావుంది.

మధుర: మీరు చేపట్టింతరువాత, అందుకు లోపం వుంటుందా?

(సిరాబుడ్డిలోని సిరా రామప్పంతులు ముఖం మీద పోసి ఛర్రున వెళ్ళిపోవును.)

3-వ స్థలము, కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లుగారి యిల్లు.

(వీధిగుమ్మం యదట గిరీశంనిలిచి సన్ననిగొంతుకతో పాడును.)

"కాముని విరిశరములబారికి నే,

నేమని సహింతునే, చెలి, యేమని సహింతునే?"

వీడి తస్సా గొయ్యా, వీడిబాణాలు పువ్వులటోయి? ఆమాట యవడునమ్ముతాడు, వెర్రికుట్టె యెవడైనా నమ్మాలిగాని? అనుభవ వేద్యవైఁన దీని నిజం యేవిఁటంటే - మంచిపదునుబట్టిన లోహం మొనకి, డయమండ్‌ పొయంట్‌ వేసి, పోయజన్‌లో ముంచి, కంటికి కనపడకుండా మంత్రించి విసురుతాడు. అంచేతనే, పైకి గాయం కనపడదుగాని పోలీసువాళ్ల దెబ్బల్లాగ లోపల తహతహ పుట్టిస్తాయి. యీ విడో బ్యూటీ చూస్తే యేమీ తోచకుండావున్నది. అయితే యిది చెప్పినట్టల్లా వశమయ్యే మనిషికాదు. పాతరస్తాలేం పనికి రాకుండా వున్నాయి. నా యక్‌స్పీరియన్సూ, నాశృంగార చేష్టలూ గుడ్డిగవ్వంత పని చెయ్యకుండా వున్నాయి. యింత సింప్లిసిటీ యక్కడా కానలేదు. దీనికి లవ్‌ సిగ్నల్సు రామరామా! యేమీ తెలియవు. చమత్కారంమాటలు ఆడితే యేమిన్నీ అర్థంచేసుకోలేక ఆలేడికళ్లతో తెల్లబోయి చూస్తుంది. అయామ్‌ డ్రెడ్ఫుల్లీ యిన్‌ లవ్‌ విత్‌ హర్‌. దీన్ని చూసిన దగ్గిర్నించీ టౌను లవ్‌సూ, డాన్సింగర్లుసూ మీద పరమాసహ్యంపుట్టింది. పోజిటివ్‌ యబహరెన్స్‌. వాళ్ల పెంకెమాటలూ, పెడర్థాలు, దొంగవేషాలూ, డామిట్‌! అంతా యిన్సిన్సిరిటీయే గదా? యిన్నాళ్లు మధురవాణి వలల్లోపడి యెలాగు యాస్‌ని అయిపోయినానో నాకు నామట్టుకే ఆశ్చర్యంగావుంది! మధురవాణికీ యీమనిషికీ కంపారిజన్‌ వున్నదా? అది రంగువేసిన గాజుపూస. యిది ప్యూర్‌ డైమండ్‌! కాదని యవడైనా అభాజనుడు అంటే అమాంతంగా వాడి పిలకూడదీస్తాను. దీనిని చెడగొట్టడానికి ప్రయత్నం చెయ్యకూడదు. చేసినా సాగేది కాదు. గనక కొత్తదారీ, కొంత న్యాయవైఁనదారీ తొక్కాలి. యేవిఁటయా అది? మాయోపాయంచేసి దీన్ని లేవతీసుకుపోయి విడో మారియేజి చేసుకుంటినట్టాయనా కీర్తీ, సుఖంకూడా దక్కుతాయి. "టూ బర్‌డ్స్‌ యట్‌ వన్‌ షాట్‌!" యిలాంటి అట్టర్లీ యిన్నోసెంట్‌ విడోని వొప్పించి తీసుకుపోయి పెళ్లాడితే మజా, ప్రయోజకత్వమూగాని, రెండేసి మూడేసి సంతానాలు కలిగి తురకాడితోనో, దూదేకులవాడితోనో లేచిపోవడానికి సిద్ధంగావున్న దండుముండల్ని విడో మారియేజి చేసుకుంటే హెల్‌! పూటకూళ్లమ్మలాంటి ముండని పెళ్లాడ్డం విడో మారియేజి అనిపించుకోదు. అది దొంగముండా మారియేజి! యిదేవిఁటయా యిది, యీ బుచ్చమ్మ? సాక్షాత్తూ పరమపవిత్రమైన విడో విత్‌ గిల్ట్‌లెటర్స్‌! అయితే, గియితే, మ-రా-రా-శ్రీ, యన్‌. - గిరీశంగారు విడో మారియేజి చేసుకోవడమేనా? "టు మారీ యె విడో, ఆర్‌ నాట్‌ టు మారీ, దటీజ్‌ ది క్వశ్చన్‌!" షేక్‌స్పియర్‌ పడ్డ అవస్థలో పడ్డాం! "తొందరపడి హాజీసాహేబు తురకల్లో కలిసిపోయినాడన్నట్లు" నావంటి బుద్ధిమంతుడు తొందరపడి యేపనీ చెయ్యకూడదు. దాని లాభనష్టాలు బేరీజువేసి, జమాఖర్చుచేసుకుని మరీ డిసైడ్‌ చెయ్యాలి. లెటస్‌ సీ. Imprimis ఒకటోపద్దు డెబిట్‌ (నష్టం) - విడో మారియేజి చేసుకుంటే మావాళ్లు అక్కరచెయ్యరు. అందుకు క్రెడిట్‌, (లాభం) - వాళ్లిప్పుడు చేస్తూన్న అక్కరేవుఁంది? గనక బాలెన్స్‌ (గాక బాకీ) నిల్‌ బండిసున్నా! రెండోపద్దు - డెబిట్‌ (ఖర్చు) - లోకం నన్ను బహిష్కారం చేస్తారు. అందుకు క్రెడిట్‌, (జమ)-లోకంలోకల్లా విలవైన వస్తువను నేను అంకించుకుని, పసలేని ఆ లోకానికే నేను బహిష్కారం వేస్తాను. గనుక క్రెడిటు బాలెన్సు (నిలవ) - యేమిటయా? నెగెటివ్‌ యడ్వాంటేజి, హావింగ్‌ నథింగ్‌ టు డూ వితే పాపర్‌వర్‌ల్డు - పోజిటివ్‌ యడ్వాంటేజి - పొజెసింగ్‌ ఆలిట్స్‌ వెల్త్‌! మూడోపద్దు - డెబిట్‌ - నష్టం - "వీడి పెళ్లాం వెధవముండ" అంటారు - నోటా బీనీ - యీ పద్దు నిజంగా డెబిటేనా? ఆడిట్‌ డిపార్ట్‌మెంటు వార్నడిగి సంశయం తీర్చుకోవాలి. అందాకా మ-రా-రా-శ్రీ, గిరీశంగారి అభిప్రాయం యేమంటే - విడో అనేది యేమిటి? ఏనేమ్‌! ఓపేరు. ఆ పేరు మనిషి మొహమ్మీద రాశుందా? మనిషిని ముస్తాబుచేసి యదట నిలబెడితే, యిది పునిస్త్రీ, యిది విడో అని చప్పగలిగిన పెద్దమనిషి యవడు? ఒహడూలేడు. గనక విడో అనే వస్తువ యక్కడుందయా? వెక్కిరించే వెధవల నోళ్లలో వుంది. దీనికి క్రెడిట్‌, (లాభం) - యేమనగా - విడో పెళ్లాడిందంటె అశుభం వోగాయిత్యం అని అటెవడూ కన్నెయ్యడు. యిక డెబిట్లేని శుద్ధక్రెడిట్‌, నంబర్‌ ఫోర్‌, "చుక్కలవలె, కర్పూరపు ముక్కలవలె నీదు కీర్తి ముల్లోకములన్‌ । క్రిక్కిరిసి పిక్కటిల్లెను," అన్నట్లు గిరీశంగారి కీర్తి మిన్ను ముట్టుతుంది. గిరీశంగారి విధవా వివాహ మహోత్సవం కథ న్యూసు పాపర్లలో పెద్దక్షరాల్తోపడుతుంది. క్రెడిట్‌ నంబర్‌ ఫైవ్‌, విడో మారియేజి యసోసియేషన్‌వారు ఒక తృణం యిస్తారు. బుచ్చమ్మక్కూడా కొంచెం డబ్బుంది. డెబిట్‌ - దావా తెస్తేగాని అవుధాన్లు మావఁగారు దాన్లో దమ్మిడీ యివ్వడు.


ప్రొజెండ్‌ కాన్సన్నీ విచారించగా, అవశ్యం విడోమారియేజి చేసుకుని తీరవలసిందే. అయితే సాధనవేఁవిటి? యేదైనా యాసెన్‌ బ్రిడ్జికట్టి వొడ్డు చేరాలి. (పైకి ముఖం యెత్తి ఆలోచించి) వెంకమ్మ, మొగుడితో దెబ్బలాడి నూతులో పడ్డప్పుడు నేను సాహసించి వురికి పైకితీసిందగ్గిర్నుంచీ వూరంతా నేను సాక్షాత్తూ సత్య హరిశ్చంద్రుణ్ణిగా భావిస్తున్నారు. ఆడుగడుక్కి బుద్ధి దాట్లేస్తూంటుందిగాని, నేనంతవాణ్ణీ కానా యేవిఁటి? స్నేహంపట్ల పీకిచ్చేస్తారే గిరీశంగారు! సాధారణులా? గనుక బుచ్చమ్మని మనం లావు చనుంచేసినా సుతిమించే వరకూ యవరూ తప్పు బట్టబోరు. రాత్రిళ్లు అరబ్బీనైట్లు, కాశీమజిలీలు, మదనకామరాజు కథలూ చెబుతూవుంటే యంతో సర్‌దాగా పక్కని కూచుని వింటుంది, లవ్‌ స్టోరీజ్‌ బుఱ్ఱకెక్కించాను. కొంత గ్రౌండ్‌ ప్రిపేరైంది గనక, యిహ విడో మారియేజి మంచిదని బోధపరుద్దాం. పాచిక పారినట్టాయనా, రామవరం చలో, విడో మారియేజి కరో! లెట్‌ మీ బిగిన్‌ ది కాంపైన్‌ ఎట్‌ వన్స్‌. (తలుపు కన్నములోనుంచి తొంగిచూచి) నడవలో కూర్చుని విస్తళ్లు కుడుతున్నది. మొట్టమొదట కొంచం మ్యూజిక్‌ విసురుదాము. (ఎటులోర్తునే చెలియా అను జావళీ కూనురాగముతో పాడి) బుచ్చమ్మ వదినగారూ తలుపు తీయండి (బుచ్చమ్మ తలుపుతీయును) వదినా ... వెల్‌! ... వెంకటేశం యేమిచేస్తున్నాడు?

బుచ్చమ్మ -- పెరట్లో గొట్టికాయ లాడుతున్నాడు.

గిరీశ-- ఈ వూరువస్తే మరిచదువు చెడిపోతుంది. పట్నంలో వున్నప్పుడు డస్కుదగ్గిరనుంచి కదలితే వొప్పేవాడను కాను... ఒక్కమాటు పి... పిలుస్తారా పాఠంచెపుతాను.

(బుచ్చమ్మ తమ్ముని తీసుకొని వచ్చుటకు వెళ్లును.)

ఆహా! దీనిఠస్సా గొయ్యా, మొహం యెదటికి వచ్చేటప్పటికి కొంచం ట్రెంబ్లింగ్‌ పట్టుకుంటుంది. వకటి అనవలెనని మరివకటి అనేస్తూ యుంటాను. మరెవళ్లూలేరు. వంటరిగా దొరికిందిగదా, - యీలాంటప్పుడు నామనస్సులో మాట చెప్పేస్తే తీరిపోవునా! ఆ కోతి వెధవని తీసుకురమ్మని చెప్పాను. కానీ, పాఠాలలో చిన్నలెక్చరు వేతాము. (వెంకటేశ్వరులు, బుచ్చమ్మ ప్రవేశింతురు.) యేమివాయి మైడియర్‌ బ్రదరిన్లా వెంకటేశం, పాఠాలు చదవడం శుభ్రంగా మానివేశావు? యిక్కడ మరి మాసంరోజులువుంటే వచ్చిందికూడా మరచిపోతావు. యేదీ టెక్స్టు బుక్కు పట్టుకురా. (వెంకటేశం పుస్తకము పట్టుకొనివచ్చును) గాడ్స్‌వర్క్‌స్‌ అనేపాఠంతియ్యి. రీడ్‌ ఆన్‌ మై గుడ్‌ బోయ్‌.

వెంకటేశ-- (తడుముకుంటూ) దేర్‌ యిజ్‌ నాట్‌ ఏన్‌ ఆబ్జక్ట్‌ ఇన్‌ క్రియేషన్‌ వుచ్‌ డజ్‌నాట్‌ సెర్వ్‌ సమ్‌ యూస్‌ఫుల్‌ పర్‌పజ్‌.

గిరీశ-- అట్టె! అట్టె! అక్కడ నిలుపు, క్రియేషన్‌ అనగా యేమిటి?

వెంకటేశ-- క్రియేషన్‌ అనగా - అనగా - ఆవులు.

గిరీశ-- నాన్సెన్స్‌, చదవేస్తే ఉన్నమతికూడా పోతున్నది. ఆవులు యెదటవున్నాయనా ఆవులంటున్నావు? మళ్లీ ఆలోచించి చెప్పు.

వెంకటేశ-- యేమాటకి అర్థం అడిగారండి?

గిరీశ -- క్రియేషన్‌.

వెంకటేశ-- అదా! క్రియేషన్‌ అంటే ప్రపంచం. నేను, యెదట ఆవులు కనబడితే యీ ఆవు పెరుగు యీ నెలరోజులేకదా తినడవఁని ఆలోచిస్తూన్నాను.

గిరీశ-- వన్‌ థింగ్‌ ఎట్‌ ఏటైమ్‌. యిప్పుడు పాఠంమాట ఆలోచించు. క్రియేషన్‌ అనే వక్కమాటపైనే వక్కఘంట లెక్చరు యివ్వవచ్చును. ప్రపంచం యేలాగున్నది? కపిద్ధాకార భూగోళా అని మనుధర్మశాస్త్రంలో చెప్పినాడు. కపిద్ధమంటే యేమిటి?

వెంకటేశ-- నారింజపండు.

గిరీశ -- వెరిగుడ్‌. అందుకు అమర నిఘంటులో పద్యం నీకువచ్చునా?

వెంకటేశ -- రాదు. చెప్పండి రాసుకుంటాను.

గిరీశ-- యింతలు బదరీ ఫలములు, యింతలు మారేడుపళ్లు యీడుకు జోడై బంతులు తామరమొగ్గలు, దంతీకుచకుంభముల బోలు తరుణీ కుచముల్‌. యీ ప్రపంచములో యేమివస్తువులుంటవి?

వెంకటేశ-- ఆవులు.

గిరీశ-- డామ్‌ నాన్సెన్స్‌, యెంతసేపూ ఆవులేనా? యేవిఁటి వుంటవో బాగా ఆలోచించి చెప్పు.

వెంకటేశ -- గేదెలు.

గిరీశ-- దట్‌విల్‌ నాట్‌డు, మళ్లీ ఆలోచించి చెప్పు.

వెంకటేశ-- అయితే నాకు తెలియదు.

గిరీశ -- విడోస్‌ - యింతచిన్నప్రశ్నకు నీకు జవాబు తెలియదు! ప్రపంచమందుండే వస్తువులన్నిటిలోకీ ముఖ్యమయినవి విధవలు. దాని విషయమై పెద్ద లెక్చరు యివ్వవచ్చును. మనదేశములో ఒక దురాచారమువున్నది. మొగవాడికి పెళ్లాము చచ్చిపోతే తిరిగీ పెళ్లాడుతాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే యంత యవ్వనములోనున్నా, యెంత సొగసుగానున్నా, మరివకడిని పెళ్లాడ వల్లలేదు. ఇది అన్యాయమంటావా, కాదంటావా?

వెంకటేశ-- తప్పకుండా అన్యాయమే.

బుచ్చమ్మ-- యేమండీ గిరీశంగారూ, వెధవలు పెళ్లాడడం పాపంకాదూ?

గిరీశ -- ఆహా! మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగానున్నది. వెధవలు పెండ్లాడవలసినదని పరాశరస్మృతిలో స్పష్టంగానున్నది. వేదంలోకూడా నున్నది. రాజమహేంద్రవరములో యిదంతా పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వకాలంలో వెధవలు పెండ్లాడేవారు, వెంకటేశం! నలచరిత్రలో దమయంతి రెండోపెండ్లి సాటించినపద్యం చదువు.

వెంకటేశ-- నాకు రాదు.

గిరీశ-- ఇంత ముఖ్యమయినపద్యం మరచిపోవడం యంతతప్పూ! నోటుబుక్కు తీసిరాసుకో - "దమయంతి రెండో పెళ్లికి, ధరనుండే రాజులెల్ల దడదడవచ్చిరీ" - చూశావా! లోకంలోవుండే రాజులంతా వెధవని పెళ్లాడడానికి వచ్చారట. (బుచ్చమ్మవైపు జూచి) చూశారా? శాస్త్రాలన్నీ వొప్పుకోవడమే కాకుండా మీదిమిక్కిలి వెధవలు పెళ్లాడకుండా వుండిపోతే దోషమని కూడా చెప్పుతూ వున్నాయి. యిందు విషయమై శంకరాచార్యులవారు పత్రికకూడా యిచ్చి యున్నారు.

బుచ్చమ్మ-- అయితే మనవాళ్లంతా వెధవల్ని పెళ్లిచేసుకోకూడదంటారే?

గిరీశ-- అదంతా యింట్లో చాకిరీ చేయించుకోవడము కోసరముగాని మరేమీకాదు. ఝామురాత్రి ఉందనగాలేచి మరునాడు రెండు ఝాములరాత్రిదాకా యెద్దులాగు పనిచేయిస్తారు కదా? ఒక్కపూటకంటె యెక్కువ భోజనం చెయ్యనియ్యరు గదా? అప్సరస లాగున యెంత సొగసుగానున్నా మంచిగుడ్డ కట్టుకోనివ్వరు. సరుకు పెట్టుకోనివ్వరు. తుమ్మెదపంక్తుల్లావుండే జుత్తుకూడా తీసివేస్తారు గదా! ఫర్‌ ఎగ్జాంపిల్‌, మీ అక్కయ్యకు ఆ చంద్రబింబమువంటి ముఖముపైని ఒక కుంకుమబొట్టుంటే త్రినేత్రుడికైనా చూడడానికి అలవి వుండునా? ఆహా! యీ అవస్థచూస్తే నా హృదయం కరిగిపోతున్నది. ఆల్‌రైట్‌! ప్రపంచములో యింకా యేమివస్తువులు వున్నవి?

వెంకటే-- చేగోడీలు.

గిరీశ-- డామ్‌ నాన్సెన్స్‌ - ఎంతసేపూ తిండివిషయమయ్యే ఆలోచిస్తావు. బాచిలర్స్‌, బ్రహ్మచారులుకూడా వున్నారు. వాండ్లు చెయ్యవలసినపని యేమిటి?

వెంకటే -- వేదం చదువుకోవడం, పెయ్యలకి గడ్డితేవడం.

గిరీశ-- నాన్సెన్స్‌ - అది మీతండ్రిదగ్గర చదువుకునే విద్యార్థుల మాట. బ్రహ్మచారియొక్క రియల్‌ డ్యూటీ అంటే, విధింపబడినపని యేమనగా, విధవలను పెండ్లాడడమే. ఇంకా క్రియేషన్‌లో యేమున్నది?

వెంకటేశ-- నాకు తెలియదు.

గిరీశ-- రామవరములో వెధవవివాహము చేసుకున్నవాళ్లకల్లా నెల వక్కంటికి నూరు రూపాయలు యిచ్చి పోషించడమునకు విడోమారేజి సభ వకటియున్నది. ఇదివరకు అయిదువేలమంది విధవలకు వివాహములు అయి పునిస్త్రీలు అయిపోయినారు. ఆల్‌రైట్‌! క్రియేషన్‌ అనే మాట అయినది. ఆసెంటెన్సు అంతకూ అర్థము చెప్పు.

వెంకటే-- మీరొకటమాటు చెప్పినతరవాత నేచెబుతాను.

గిరీశ-- ఆల్‌రైట్‌! ప్రపంచములో దేవుడు ప్రతివస్తువునూ యేదో వొక వుపయోగముకొరకు చేసియున్నాడు. చేగోడీ యెందుకు చేసినాడూ?

వెంకటేశ-- తినడముకు.

గిరీశ-- దట్‌ ఈజ్‌ రైట్‌, ఆవుల నెందుకు చేశాడు?

వెంకటేశ-- పాలు యివ్వడముకు.

గిరీశ-- పెర్‌ఫెక్ట్‌లీ రైట్‌, ఆడవాళ్ల నెందుకు చేశాడు?

వెంకటేశ -- వంటచెయ్యడానికి.

గిరీశ -- నాన్‌సెన్స్‌. పెండ్లాడడముకూ పిల్లలను కనడముకున్నూ. గనుక పెండ్లాడకుండావున్న వెధవపిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన పాపమును చేస్తున్నారు.

[అగ్నిహోత్రావధానులు ప్రవేశించును.]

అగ్నిహో-- ఏమండీ గిరీశంగారూ మాకుర్రవాడికి చదువు చెప్పుతున్నారూ?

గిరీశ -- ఘంటసేపాయి చెపుతున్నానండి.

అగ్నిహో-- యేదీ నేకూడా వింఛాను కొద్దిగా చెప్పండీ.

గిరీశ-- మైడియర్‌ బోయ్‌, గాడ్‌ మేడ్‌ క్రియేషన్‌. సృష్టియెవడు చేసినాడూ?

వెంకటేశ -- దేవుడు.

గిరీశ-- ఫాదర్‌ ఈజ్‌ నెక్‌స్ట్‌ టు గాడ్‌. దేవుని తరువాత ముఖ్యం యెవరూ! సే ఫాదర్‌.

వెంకటేశ-- తండ్రి.

అగ్నిహో- మొత్తముమీద మీ ఇంగ్లీషు చదువు మంచిదిలాగే కనబడుచూన్నది. భాష భేదంగాని మనముక్కలే వాళ్లవిన్నీ.

గిరీశ-- వెంకటేశం! దేవుడు సృజించిన ప్రపంచములో యేమివస్తువులున్నవి? సే కోర్ట్‌స్‌.

వెంకటే -- వెధవలు.

గిరీశ-- నాన్‌సెన్స్‌, సే కోర్ట్స్‌.

అగ్నిహో-- యిదేమిటండోయి ప్రపంచంలో వెధవలున్నారంచున్నాడు, ఇంగ్లీషు పుస్తకాల్లో యిదేనా యేమిషి వున్నది?

గిరీశ-- వెధ్వల్‌ అన్నది లాటిన్‌ మాటండి - ఆమాటకర్థం కచేరీలండి. కచేరీలు యెందుకున్నవి?

వెంకటేశ -- దావాలు తేవడముకు.

గిరీశ -- దట్‌ ఈజ్‌ రైట్‌ - చూచారండీ మీవాడికి కచేరీల భోగట్టాలుకూడా నేర్పుతున్నాను.

అగ్నిహో-- అయితే మనదావావిషయమై నేనిచ్చిన కాకితాలు సమగ్రంగాచూశారా?

గిరీశ -- కేసు గెలవడముకు యేమీ అభ్యంతరములేదు. మీకు తెలియడంకోసం గ్రంథం అంతా తెలుగు చేస్తున్నాను. మామగారూ మీవిషయమై యెంతశ్రమయినాపడి అమలాపురం వెళ్లి అక్కడ కోర్టులో కేసు గెలిపించకపోతే నన్ను పేరుపెట్టి పిలవవద్దు.

అగ్నిహో-- యేదో అంతా మిమ్మలినే నమ్ముకునివున్నాము. యెంత డబ్బయినా కేసు గెలిస్తే చాలును. పెళ్లిపనులకి మీ కుమ్మక్కువుంటేనేకాని తూగదు సుమండీ. నామీద కోపంచాత కరటకశాస్త్రుల్లూ వాళ్లూ వెళ్లిపోయినారు. వాళ్లువొచ్చేటట్టు కనపడదు.

గిరీశ మీరు కూర్చున్న దగ్గిరనుంచి కాలుకదపకుండా ఎరేంజిమెంటు యావత్తూ నేను చేస్తానుకాదూ.

(నిష్క్రమించుచున్నారు.)

4-వ స్థలము. పెరటిలో జామిచెట్టు కొమ్మమీద వెంకటేశంకూచుని జామిపండు కొరుకుచుండును.

[చెట్టుకొమ్మలు ఆవరించివున్న నూతిలో నీరు బుచ్చమ్మ తోడుతుండును.]

బుచ్చమ్మ-- తమ్ముడూ, గిరీశంగారు గొప్పవారష్రా?

వెంక -- గొప్పవారంటే అలా యిలాగా అనుకున్నావా యేవిఁటి? సురేంద్రనాద్‌ బానర్జీ అంతగొప్పవారు.

బుచ్చమ్మ-- అతగాడెవరు?

వెంక -- అందరికంటే మరీ గొప్పవాడు.

బుచ్చమ్మ-- అయితే గిరీశంగారికి వుద్యోగం కాలేదేమి?

వెంక-- నాన్సన్స్‌! నువ్వు ఆడదానివి; నీకేం తెలియదు. ఉద్యోగవంటే గొప్పనుకుంటున్నావు. ఉద్యోగవఁంటే యేమిటో తెలిసిందా? సర్వెంట్‌ అన్నమాట.

బుచ్చమ్మ-- అనగా యేమిటి?

వెంక-- సర్వెంటనగానా? నౌఖర్‌ అన్నమాట. మన గేదెనికాసే అశిరిగాడు ఒక సర్వెంట్‌. మన యిల్లుతుడిచే అంకి ఒక సర్వెంట్‌. వీళ్లు మన నౌఖర్లు. పోలీసూ, మునసబూ తెల్లవాడి నౌఖర్లు. జీతం లావురాగానే గొప్పనుకున్నావా యేవిఁటి? సురేంద్రనాద్‌ బానర్జీ, గిరీశంగారులాంటి గొప్పవాళ్లు తెల్లవాడిదగ్గిర కాదు, దేవుఁడిదగ్గిరైనా నౌఖరీ చెయ్యమంటే చెయ్యరు. కలక్ట రేవంటాడో తెలిసిందా? పోలీసువెళితే "స్టాండ్‌!" నిలుచో అంటాడు. గిరీశంగారు వొచ్చారంటే షేక్‌హాండ్‌ చేసి కుర్చీమీద కూచోండి అంటాడు. ఆయనకి హైదరాబాదునవాబు వెయ్యిరూపాయల పని యిస్తామంటే, నీపనెవడిక్కావాలి పొమ్మన్నాడు.

బుచ్చమ్మ-- ఆయనకి పెళ్లైందిరా?

వెంక-- లేదు.

బుచ్చమ్మ-- తమ్ముడూ, వెధవలు పెళ్లాడ్డం మంచిదంటారుగదా, ఆయనెందుకు పెళ్లాడారు కార్రా?

వెంక -- నీకు యంతచెప్పినా తెలియదు. (గట్టిగా) ఆయన ఉద్యోగం చెయ్యకపోవడం, పెళ్లి మానుకోవడం లోకం మరామత్తు చెయ్యడానికట; యిప్పుడు తెలిసిందా?

బుచ్చమ్మ-- యలా మరమ్మత్తు చేస్తున్నార్రా?

వెంక-- నావంటి కుర్రాళ్లకి చదువుచెప్పడం. (నిమ్మళంగా) చుట్టనేర్పడం. (గట్టిగా) నాచ్చికొశ్చన్‌ అనగా సానివాళ్ల నందర్ని దేశంలోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్‌ కాంగ్రెస్‌ - అనగా దివాన్గిరీ చలాయించడం ఒహటి. యిప్పుడు తెలిసిందా?

బుచ్చమ్మ-- ఉద్యోగం చెయ్యరన్నావే? దివాన్గిరీ యేరాజుదగ్గిర్రా?

వెంక --యేరాజుదగ్గిరా? - ఆడదానివి నీకెందుకూ యీ భోగట్టా అంతాను?

బుచ్చమ్మ-- నువుకూడా లోకం మరమ్మత్తు చాస్తావుష్రా?

వెంక-- ఓ!

బుచ్చమ్మ-- ఐతే వెధవముండనికూడా పెళ్లా`డతావురా?

వెంక-- నాన్న తన్నకుండావుంటే తప్పకుండా పెళ్లాడతాను; గాని బోడిగుండు చేస్తేమాత్రం నాకక్ఖర్లేదు.


[గిరీశం ప్రవేశించి.]


గిరీశం-- వదినా యీ చెట్టుకింద నిలబడితే మీరు వనలక్ష్మిలా వున్నారు. (బుచ్చమ్మవైపుతేరి చూసును.)

బుచ్చమ్మ-- విన్నారా? తమ్ముడు వెధవని పెళ్లాడతాష్ష!

గిరీ-- నా ప్రియశిష్యుడూ, మీకు ప్రియసోదరుడూ అయిన వెంకటేశం విధవావివాహవేఁ చేసుకుంటే, మేం యావన్మందివిఁన్నీ బ్రహ్మరధం పట్టవాఁ?

బుచ్చ -- గురువులుగదా ముందు మీరెందుకు చేసుకోరు?

గిరీ -- ఆడగవలిసినమాట అడిగారు. చెబ్తాను వినండి. మీ రడిగినతరవాత చెప్పకపోవడం తప్పని చెబుతున్నానుగాని, యీ మాటలు చెప్పవలిసినవి కావు. యేవఁంటారా? నా గొప్ప నే చెప్పుకోకూడదుగదా? అదొహటి. అంతకంటె ప్రమాదమైనమాట మరోటుంది. చూశారా వొదినా!- మొదట్నించీ విధవావివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోయివున్న అత్తగారూ, మావఁగారూలాంటి పెద్దవాళ్లకి యెన్ని శాస్త్రాలూ సవబులూ మనం చెప్పినా, వాళ్లకి నెత్తికెక్కవు. యిలాంటి మాటలు వాళ్లతో మనం చెప్పినట్టాయనా కఱ్ఱుచ్చుకుంటారు. మావఁగారు వేదంమట్టుకే చదువుకున్నారుగాని నేను శాస్త్రాలు అన్నీ చదువుకున్నాను. అబ్బో, నేను మన శాస్త్రాల్లో వుడ్డోలుణ్ణి. శాస్త్రకారుడు యేవఁన్నాడూ? "బాలాదపి సుభాషితం" అన్నాడు. అనగా మంచిమాట చంటిపిల్లడు చెప్పినావిని ఆ ప్రకారం చెయ్యండయ్యా అన్నాడు. అయితే మన పెద్దవాళ్లు శాస్త్రంలో చెప్పినప్రకారం నడుస్తారూ? యంతమాత్రం నడవరు. మనం శాస్త్రమూ, సవబులూ చూపిస్తే యావఁంటారు? యీ గుంటవెధవలు చెప్పడం మనం విండవూనా అని కఱ్ఱుచ్చుకుంటారు. నామాటకేవిఁ చప్పకండి, నాది యినుంలాంటి శరీరం - కొడితే కఱ్ఱ విరిగిపోవాలిగాని చెక్కుచదరదు. నా ప్రియశిష్యుడికైతేనో? మీ అందరివీ మెత్తని మృదువైన శరీరాలు అవుటచాత యెవిఁకలు విరిగిపోతాయి. గనుక యీ మాటలు మన్లో మనం అనుకోవలసినవే గాని మరోళ్లతో ప్రాణంపోయినా అనవలసినవికావు. యావఁంటారు?

బుచ్చ -- అవును.

గిరీ-- అవునంటే చాలదు. యవరితోనూ యీ మాటలు చెప్పనని మీరంటేనేగాని, నామనసులో మాటలు నాలుగూ యెలా చెప్పడం?

బుచ్చ -- యవరితోనూ చప్పను.

గిరీ -- వొట్టేసుకోవాలి.

బుచ్చ-- యావఁని వొట్టేసుకునేది?

గిరీ-- యావఁనా? మీరు యవరితోటైనా చెబితే నా బుఱ్ఱ పగిలిపోవాలని వొట్టేసుకొండి.

బుచ్చ-- అహఁ! అలా వొట్టేసుకోను! మీ బుఱ్ఱ చల్లగావుండాలి. చెబితే నాబుఱ్ఱ పగిలిపోవాలని వొట్టేసుకున్నాను.

గిరీ-- అందుకు నే వొప్పుతానా యేవిఁటి?నాబుఱ్ఱ పగిలింతరవాత మీబుఱ్ఱ జోలికి యవడైనా రావాలిగాని, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువెయ్యనా?

బుచ్చ-- మాఅమ్మని బతికించారు కారా? మీరు అలాంటివారే.

గిరీ-- ఆ మాట మీరే అన్నారుగనక, వినండి--చెప్తాను. నేను పెళ్లాడి పెళ్లాం బిడ్డలూ నాకుంటే, వాళ్లని తల్చుకున్నతరవాత ప్రాణానికి తెగించి మీ అమ్మని తియ్యడానికి నూతులోకి గెంత గలిదివుందునా? యీ జన్మవంతా లోకోపకారం కింద వినియోగపర్చుకుందావఁని నిశ్చయించుకుని యిదివరదాకా ఏకాకినై వుంటిని, సత్యమే, మీలాంటి నా మేలుకోరినవాళ్లు " పెళ్లిచేసుకో" అంటే ఆ మాట తోసేయడం కష్టమేగాని;గాని ఒక మాటమాత్రం జవాబు న్యాయంగా చప్పండి. ఒక్కళ్లకి ఉపకారం చెయడం గొప్పా? అందరికి ఉపకారం చెయడం గొప్పా?

బుచ్చ-- అందరికీ చెయ్యడవేఁ గొప్పనుకుంటాను.

గిరీ-- సరే! ఆ మాటమీద నిలవండి. పెళ్లాడి, ఆలూబిడ్డలికి, ముచ్చకాయ ముగ్గురికి ఉపకారం చెయడంకంటే లోకోపకారం కింద యీ ప్రాణం వినియోగ పర్చడం పుణ్యంకాదా? చచ్చేకాలానికి స్వర్గం యెదురుగుండా వొస్తుందే?

బుచ్చ-- లోకానికి యేం వుపకారం చాస్తారు?

గిరీ-- అలా అడగండి. సోషల్‌ రిఫారమ్‌, సోషల్‌ రిఫారమ్‌ అంటే సంఘసంస్కారం. అసలు యింగిలీషుమాట యంత అర్థవౌఁతుందో, మీకు, దాని తర్జుమాకూడా అంతే అర్థం అవుతుంది. విప్పిచెప్పాలంటే ఒకసిమిలీ, అనగా ఉపమానంచెప్పి మీకు బోధపరుస్తాను. లోకం తప్పుతోవలో వెళ్లుతూంటే ఆతోవలోంచి మళ్లించి మంచితోవలో పెట్టడవఁనేది సోషల్‌ రిఫారమ్‌.

బుచ్చ-- యేమిటా తప్పుతోవ?

గిరీ -- జారూ బురదా, గట్లూ గతకలూ వున్నతోవ యలావుంటుందో యిప్పుడు మనవాళ్ల ఆచారాలు అలావున్నాయి; ఆతోవలోంచి బండీ తప్పించి మంచి దిమ్మిసాకొట్టిన హైరోడ్డులోకి మళ్లించాలి. ఆబండికి రెండుచక్రాలు. ఒకటి విధవావివాహం, రెండు నాచిక్వొశ్చన్‌, అనగా సానివాళ్లని హతవాఁర్చడమున్నూ యీ రెండే రాజమార్గాలు.

బుచ్చ-- మనవాళ్ల దురాచారాలేవిఁటో నాకు బోధపడలేదు.

గిరీ-- ఐతే చెబుతాను వినండి. ముసలాళ్లకి చిన్నపిల్లల్నిచ్చి పెళ్లిచెయ్యడం ఒకటి, డబ్బుకి పిల్లల్ని అమ్ముకోవడం ఒకటి. అవునంటారా కాదంటారా?

బుచ్చ-- అవును.

గిరీ-- ఆ ముసలాళ్లు చస్తే కష్టంసుఖం యరగని పసిపిల్లలు వెధవలు అవుతారు. ఉప్పూ పులుసూ తినడంచాత యేమీ యరగని పసిపిల్లలు పూర్నయవ్వనం వొచ్చినతరవాత మనసుపట్టలేకపోతే వాళ్లదా తప్పు? "వెధవవివాహం కూడదూ, గిధవవివాహం కూడదూ" అని ఓర్వలేనిమాటలు చెబుతూ, డబ్బుకాసించి, ముసలి పెళ్లిళ్లుచేసే మూర్ఖుల్దా తప్పు? వూరుకుంటారేం?

బుచ్చ-- నాకు తెలియదు.

గిరీ-- అవుఁను మరి మీరేవఁనగల్రు? తల్లినీతండ్రినీ యేఁవనుకున్నా మనసులో అనుకుని జీర్ణించుకోవాలిగాని, మీలాంటి మంచివాళ్లు పైకంటారా? నాలాంటి వాణ్ణి, యేవఁండీ మావఁగారూ, పిల్లల్ని రూపవంతుడూ, యవ్వనవంతుడూ, బుద్ధిమంతుడూ అయ్ని కుర్రవాడికి యిమ్మని శాస్త్రంలో వుందిగదా, శాస్త్రానికి విరుద్ధంగా, యెందుచాత డబ్బుక్కక్కుర్తిపడి ముసలాళ్లకి కట్టబెడుతున్నారయ్యా? శాస్త్రంలో "వెధవలికి పెళ్లిచెయ్యవలసినది, చెయ్యవలసినది" అని శాశించి చెప్పివుండగా యెందుకు చెయ్యరయ్యా అని అడిగితినట్టాయనా, అర్థచంద్రప్రయోగంచేసి అవతలికి గెంటుతారు. అంచాత "శాంతం బోషాణపెట్ట`" అనుకుని నోరుమూసుకు వూరుకున్నాను. యిహ నాచ్చికొశ్చన్‌ మాటవినండి. సానివాళ్లని హతవాఁర్చడం మంచిదంటారా కాదా?

బుచ్చ -- వాళ్లని చంపేస్తారా యేవిఁటి?

గిరీ-- చంపక్కర్లేదు. "పొమ్మనక్కర్లేదు, పొగబెడితే" చాలునన్నట్టు సానివాళ్లని పెళ్లిళ్లకి పిలవకపోవడం, వాళ్లిళ్లకి వెళ్లకపోవడం, వాళ్లని వుంచుకోకపోవడం పైంచెప్పిన పనులుచేసేవాళ్లని కనపడ్డచోటల్లా తిట్టడం, యిలా నాలాంటి బుద్ధిమంతులంతా ఒహటై కొంతకాలం చేసేసరికి, కలికంలోకైనా మరి సాంది వుండదు. లేకుంటే చూడండి. మన వెంకటేశం పెళ్లికి తప్పకుండా సానిమాళం తెస్తారు. నే యెరుగుదును. కూడదన్నపనల్లా మావఁగారు చాస్తారు, కూడినపని మానేస్తారు. సానిమాళం తావడమనేది డబ్బిచ్చి తద్దినం కొనుక్కోవడమన్నమాట కాదా? పెళ్లినాటికి నా ప్రియశిష్యుడికి కొంచం యీడొస్తుందిగదా. ఆ సానిముండలు యఱ్ఱగా బుఱ్ఱగా వుండడంచూసి, పెళ్లాంమీద అసహ్యంపుట్టి "యీ పసిపిల్ల యదగడవెఁప్పుడు, కాపరానికి రావడవెఁప్పుడు, యీ సానివాళ్లు మా మజాగావున్నారని" వాళ్లని వెంకటేశం వుంచుకుంటే కొంప ములిగిపోతుందిగాని తరవాయి వుండిపోతుందా? యేవఁంటారు?

బుచ్చ -- అవును, నిజవేఁ.

గిరీ-- గనుక లోకం బాగుపడేటందుకుగాను వెధవలికి పెళ్లిచెయ్యడానికి, సానివాళ్లని సాగనంపడానికి వీరకంకణం కట్టాను. మరే వచ్చి, మీ తమ్ముళ్లాంటివాళ్లకి అనేకులికి విద్యాబుద్ధులు చెప్పుతున్నాను. గజీతగాణ్ణి ఔటచేత నూతుల్లో గోతుల్లో పడ్డవాళ్లని పైకి తీస్తాను. యింకా నాషనల్‌ కాంగ్రెస్‌ ఒహటుందిగాని అందులో నే చేసేపని చాంతాడంత వ్యాఖ్యానం చేస్తేగాని మీకు బోధపడదు. పరిపరివిధాల లోకోపకారం చేస్తున్నాను.

బుచ్చ -- యీ పనులన్నీ పెళ్లిచేసుకుంటేమాత్రం చెయ్యకూడదా?

గిరీ-- యలా జెయడం? లోకవఁంటే యేవిఁటి గంజిగుంట అనుకున్నారా? యేషియా, యూరోప్‌, ఆఫ్రికా, అమెరికా, ఆష్ట్రలేషియా అని, ఐదు ఖండాలు. అందులో అమెరికాలో మనుష్యులు బుఱ్ఱకిందికీ కాళ్లు పైకీపెట్టి నడుస్తారు. యిక్కడ పగలుగదా యిప్పుడు? అక్కడ రాత్రి. నార్త్‌పోల్‌ అని మరోదేశం వుంది. అక్కడ ఆర్నెల్లు పొగలే; అప్పుడు మరి రాత్రుండదు. ఆర్నెల్లు రాత్రే; అప్పుడు మరి పొగలుండదు. అక్కడేవిఁటనుకున్నారు. సముద్రం అంతా మంచుకెరడైపోతే లేళ్లని బళ్లకికట్టి సవారీఐ, వాయువేగ మనోవేగంగా వెళతారు. యిన్ని దేశాలకీవెళ్లి అక్కడివాళ్లకల్లా ఉపకారం చేస్తేగదా లోకోపకారం అవుతుంది? పెళ్లాంబిడ్డలూ వుంటే వాళ్లని వొదిలి యలా పోవడం? అయితే పెళ్లాడమని మీరు చెప్పినమాటకూడా సుతలామూకొట్టి పారెయకూడదు. లోకానికోసం బతకడం ఉత్తమం. అయితే లోకం అంతా యంతవిలవో అంత కన్న యెక్కువవిలవైన రత్నంలాంటి ఆడమనిషి దొరికితే, తప్పకుండా పెళ్లాడవలిసిందే. యీవూరొచ్చేవరకూ నాకలాంటి దివ్యసుందర విగ్రహం, కనపళ్లేదు. మొహవెఁదట చెప్పకూడదు. అలాంటి మనిషి యీవూళ్లో కనపడ్డది; అందరాని పండుకు ఆశించడవెఁందుకని మనసు మళ్లించుకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నానుగాని మనస్సు లొంగకుండావుంది. భగవంతుడేం జేస్తాడో! మనస్సుతో యావఁంటున్నానంటే, "ఓ వెఱ్ఱిమనసా! నువ్వు వలచిన చిన్నది ఆణిముత్యవేఁగాని యిన్నాళ్లూ పెళ్లి మానేసి యిప్పుడు 'పెళ్లాడదాం, పెళ్లాడదాం' అని యెందుకు సందడిపడతావు? 'సంసార సాగరం దుఃఖం, తస్మాజ్జాగ్రత జాగ్రత' అన్నాడు. సంసారంలో పడిపోతే మళ్లీ నీకు లోకోపకారం చెయడానికి అవకాశం వుంటుందా?" అని మనస్సుకి బోధపరుస్తున్నాను. పెళ్లాడితే లోకోపకారానికి అవకాశం యంతమాత్రం వుండదు చూశారా వదినా! మాటవరసకి మనం పెళ్లాడతాం అనుకుందాం. సంసారం గడుపుకోవడానికి డబ్బు సంపాదించుకోవాలా? యిదివరకల్లా అంటే బ్రహ్మచర్యం ఆచరిస్తున్నాను గనక "సత్రాభోజనం, మఠానిద్రా" సరిపోయింది. మాటవరసకి మిమ్మల్ని పెళ్లాడింతరవాత, అలా సరిపోదే! మనంగాని మావఁగారి మూర్ఖానికి లక్ష్యపెట్టక, యవరితోనూ చప్పకుండా రామవరం వెళ్లిపోయి అక్కడ శాస్త్రోక్తంగా పెళ్లాడావఁంటే, ప్రస్తుతంమట్టుకు విడో మారియేజి సభవారు మనకి నెలకి నూర్రూపాయలు యిస్తారు. ఓ నాలుగయిదు మాసాలు అలా కాలక్షేపంచేసి, హైదరాబాదులోగాని, బరోడాలోగాని ఓ వెయిరూపాయల వుద్యోగం సులభంగా సంపాదించుకుంటాను. హయిదరాబాదు నవాబు నెలరోజులకిందట పెద్ద ఉద్యోగ విఁస్తానన్నాడు. "నేను ఒకడిదగ్గిర నౌఖరీచేస్తానా?" అని విఱ్ఱవీగి తోసిపారేశాను. మీరు వివాహం చేసుకోమని సలహాయిస్తారని అప్పుడే యెరిగివుంటే ఆ ఉద్యోగం మించిపోనియ్యకపోదును.

బుచ్చ-- మీరు ఉద్యోగం చెయ్యరన్నాడే, తమ్ముడు?

గిరీ -- అవును బ్రహ్మచారిగావుండి లోకోపకారం చేస్తూ వున్నంతకాలం పెళ్లిచేసుకోనని శపధం పట్టాను. గాని యిప్పుడు నా అదృష్టంవల్ల లోకం అంతటికన్నా విలవైన వజ్రంలాంటి భార్యా దొరికితే పెళ్లాడక తీరుతుందా? లోకంయొక్క విలవ వెండి అనుకోండి. లోకం వెండైతే మీలాంటి సువర్ణచ్ఛాయగల కుందనపుబొమ్మ, పజ్యండోవన్నె బంగారం అవునంటారా కాదంటారా? బంగారం విలవ యెక్కువా, వెండి విలవ యెక్కువా? చప్పండి.

బుచ్చ-- బంగారవేఁ యెక్కువ.

గిరీ-- సరే, మీలాంటి బంగారం బొమ్మే లభించినప్పుడు లోకం గీకం అవతలబెట్టి పెళ్లాడక తీరదుగదా. మాటవరసకి మనం పెళ్లాడతాం అనుకొండి. పెళ్లాడిం తరవాత సంసారం సుఖంగా జరుపుకోవాలంటే లావుగా డబ్బుండాలిగదా? ఉద్యోగం చేస్తేగాని డబ్బులావుగారాదే?

బుచ్చ -- అవును.

గిరీ-- అట్టే డబ్బెందుకని అడుగుతారు ఒకవేళ. చెబుతాను వినండి. సంసారానికి యిల్లన్నది ఒకటుండాలిగదా? యేవఁంటారు?

బుచ్చ -- అవును.

గిరీ-- నాకు మేడలుంటేనేగాని కుదరదు. యిలాంటి చిన్న యిళ్లలో నాకు ఉక్కిరిబిక్కిరిగా వుంటుంది. ఆమేడచుట్టూ తోట వుండాలి. మావిడిచెట్లూ, అరిటిచెట్లూ, జామిచెట్లూ, చెప్పన్న వృక్షాలూ వేస్తాం. మన వెంకటేశం కోతిలాగ పళ్లుతింటూ యెప్పుడూ ఆ చెట్లమీదే వుంటాడు.

వెంక-- ఆచెట్లపళ్లన్నీ నేనే కోస్తాను.

గిరీ-- అంతవాడివికావనా? మనం అలాగ యిల్లూ, వాకిలీ, తోటా, దొడ్డీ, యార్పరుచుకునేటప్పటికి మనకి చిన్నపిల్లలు పుడతారు. వాళ్లని సంరక్షణచెయ్యాలా? వాళ్లు నేను కుర్చీమీద కూచుని రాసుకుంటూంటే వొచ్చి చెయ్యిబట్టుకులాగి నాన్నా యిది కావాలి అది కావాలంటారు. మీరు బీరపువ్వుల్లాగ వొంటినిండా సరుకులు పెట్టుకుని, చక్కగా పసుపూ కుంకంపెట్టుకుని, మహాలక్ష్మిలాగ యింట్లో పెత్తనంచేస్తూవుంటే ఒక పిల్ల యిటివేపువొచ్చి మెడకాగలించుకునీ, ఒకపిల్ల అటువేపువొచ్చి మెడకాగలించుకునీ "అమ్మా యిది కావాలి, అమ్మా అది కావాలని" అడుగుతారు. వాళ్లకి సరుకూ జప్పరాచేయించాలి, జరీదుస్తులు కుట్టించాలి. గిరీశంగారి పిల్లల్ని తీసుకురా అని ఒకప్పుడు నవాబుగారి శలవౌతుంది. మన పిల్లల్ని వెంకటేశంలాగ కాయగావంచా, తెల్లచొక్కాయితో పంపించడానికి వల్లకాదుగదా? వాళ్లకి చిన్నబళ్లూ, గిళ్లూకొనాలి. వాళ్లకి చదువూసంధ్యా చెప్పించి ప్రయోజకుల్ని చెయ్యాలి. యిదంతా సంసార తాపత్రయంకాదా? యిందులో పడిపోతే మరి లోకోపకారం చెయడానికి అవకాశవుఁంటుందా? చెప్పడం మరిచిపోయినాను, అప్పుడు మన వెంకటేశం మనదగ్గిరే వుండి చదువుకుంటాడు.

బుచ్చ-- అలా అయితే మరి నాన్నకి ఖర్చుండదు. నాన్నా అమ్మా వాడిచదువుకోసం దెబ్బలాడ్రు.

గిరీ-- నే వొద్దన్నానా?

వెంక-- నాకో చిన్న గుఱ్ఱబ్బండి కొనాలి.

గిరీ-- వేరే నీకు బండీ యెందుకు? మా పిల్లలబండీలో నువ్వుకూడా వెళ్లుదువుగాని, వాళ్లు అల్లరి చెయకుండానూ, కిందపడిపోకుండాను చూస్తూవుందువుగాని.

వెంక-- అక్కయ్యని పెళ్లాడేస్తారా యేవిఁటి?

గిరీ-- మాటవరసకి అని అంటూంటే, మతిపోయినట్లు మాట్లాడతావేవిఁటి?

బుచ్చ-- అంతేకద?

గిరీ-- అంతేగదంటే, అంతకంటె అదృష్టం నాకు పట్టడం యలాగ? ఆమాట మీరు అన్నా, నేను అన్నా, మీవాళ్లు నన్ను తన్ని తగిలేస్తారు. వెంకటేశంగానీ అన్నట్టాయనా, పెయ్యకట్టుతాడు వుణ్ణేవుంది.

వెంక-- ఓయి నాయనో! (వీపుతడువుఁకొనును) గుప్‌ చప్‌! నే ఆవూసెత్తను!

బుచ్చ-- మానాస్తం, రాంభొట్లుగారి అచ్చమ్మ మీరు వొప్పుకుంటే మిమ్మల్ని పెళ్లాడతానంది.

గిరీ-- పెళ్లాడడవేఁ వొస్తే, అచ్చమ్మనీ పిచ్చమ్మనీనా పెళ్లాడతాను? యప్పటికైనా "ఒకళ్లతో నాకు పనేవిఁటి? నా బతుకు సుఖవేఁదో నేను చూసుకుంటాను." అని మీలాంటి దివ్యసుందరవిగ్రహమూ, గుణవంతురాలూ, నామీద కనికరించి "గిరీశంగారూ నన్ను పెళ్లాడండి" అంటే పెళ్లాడతానుగాని అచ్చమ్మల్నీ, పిచ్చమ్మల్నీ మెడకి కట్టుకుని ఉత్తమ బ్రహ్మచర్యం, లోకోపకారం మానుకుంటాననుకున్నారా యేవిఁటి?

వెంక -- మంచిపండు పడిపోయింది అందుకోండి.

గిరీ -- (పండుతీసి) ఆహా యేమిచాయ! వొదినా మీవొంటిచాయని వుంది యీపండు. యిందండి.

బుచ్చ -- బిందెలోపడెయ్యండి. తమ్ముడూ దిగొచ్చి బిందయెత్తు.

గిరీ -- వాడక్ఖర్లేదు. నేనెత్తుతాన్లెండి. (యెత్తి) ఆహా! యేమివయ్యారం!

(బుచ్చమ్మ నిష్క్రమించును.)

శిష్యా! రెండుపళ్లురాల్చు.

వెంక-- నాన్నొస్తున్నాడండోయి దిడ్డీతోవ్వేపు. యేవిఁటి సాధనం?

గిరీ -- ఆకులు దట్టంగా వున్నవేపు దాగో. నేను యాతాంతోడ్డం ఆరంభిస్తాను.


(అగ్నిహోత్రావధాన్లు ప్రవేశించి.)


అగ్ని-- గిరీశంగారూ, నీరు తోడుతున్నారండీ? అసిరిగాడు తోడుతాడే, యింగిలీషు చదువుకున్నవాళ్లు, మీ కెందుకాశ్రమ?

గిరీ-- పనివంటి వస్తువ లోకంలో లేదండి. ఊరికే కూచుంటే నాకు వూసుపోదు. మొక్కలకా, మంచిది నాకా, కసరత్తూ. గవునరు, తోట్లో గొప్పు తవ్వుతాడు. సీవఁరాణీవారు బీదలూ సాదలకీ యివ్వడానికి బట్టలు కుడతారు. యింగిలీషువాడు సోమరితనం వొప్పడండి. వాళ్లలో పెద్ద కవీశ్వరుడు షేక్‌స్పియరు యేవన్నాడో విన్నారా, "డిగ్నిటీ ఆఫ్ లేబర్‌" అన్నాడు - అనగా కలక్టరు గొప్ప వాడుకాడు, జడ్జీ గొప్పవాడుకాడు; కాయక్లెశపడి కష్టపడే మనిషే గొప్పవాడన్నాడు. అంచాతనే యీ గొప్పదొర్లంతా మెప్పు పొందాలంటే తోటమాలీపని చేస్తారు. చెట్లూ చావఁలూ యెక్కడం వొహటి వాళ్లలో గొప్పవిద్య. లాభంలేనిపని యేదీ దొరచెయ్యడండి మావఁగారూ. దొరగారు వూర్నించి వూరికి వెళుతూండగా దాహవేఁస్తుంది. చెట్లని పళ్లుంటాయి. నడితోవలో చెట్టెక్కడం నేర్చుకోకపోతే దాహంతో చావవలిసిందేగదా? యేజన్సీ కమాన్‌ చేస్తూవుంటే పెద్దపులి వొస్తుందనుకొండి. దొరకి చెట్టెక్కడం చాతయితె చపాల్న చెట్టెక్కి ప్రాణం కాపాడుకుంటాడు. అంచేత చదువుతోపాటు చెట్లెక్కడంకూడా నేరుస్తారు.

అగ్ని-- దొర్ల తరిఫీదంతా అదో చిత్రం. వెంకడు రాసుకుంచున్నాడా, చదువుకుంచున్నాడా అండి?

గిరీ-- యింతసేపూ చదువుచెప్పి "చెట్లూ చావఁలూయెక్కి ఆడుకో" అని తోలేశాను.

అగ్ని-- మీకేం మతి పోయిందా యేవిఁటండి? కాలూచెయ్యీ విరుచుకుంటే?

గిరీ -- రేపు మనవాడికి గుణుపురం తాసిల్దారీఅయి అడివిలో కమాను వెళ్లుతూవుండగా పెద్దపులొస్తే చెట్టెక్కలేక, కాళ్లువొణికి చతికిల బడాలని మీ అభిప్రాయవాఁ యేవిఁటి?

అగ్ని -- మనవాడికి తాసిల్దారీ అవుతుందండి?

గిరీ -- యెందుక్కాకూడదూ? గుఱ్ఱాలెక్కడం, చెట్లెక్కడం మనవాడు నేర్చుకోకపోతే, "నాయనా నువ్వు కమాన్లకి పనికిరావు. డసుకు దగ్గిరకూచుని గుమస్తాపని చేసుకో. తాసిల్దారీ గీసిల్దారీ తలపెట్టకు" అని దొర్లంటారు.

అగ్ని-- అషైతే చిన్నచెట్లెక్కించండిగాని పెద్దచెట్లప్పుడే యక్కనియ్యకండి.

గిరీ -- అంచేతనే జామచెట్టు యక్కమన్నాను. చూశారా?

అగ్ని-- ఓరి! కోతివెధవా!

గిరీ-- అదుగో తిడుతున్నారూ? దొర్లచదువు చదువుకుంటే, దొర్లతరిఫీదు యివ్వక తప్పదు. మీరిలా తిడితే భయపడి కిందపడతాడు; యిలాంటిపనులు మీకిష్టం లేకపోతే, యింగిలీషుచదువు మానిపించి వేదం చెప్పండి.

అగ్ని-- మరిచిపోయి తిట్టాను. యీ యింగిలీషు వాళ్లసంగతంతా అదో వెఱ్ఱిమొఱ్ఱి.

గిరీ-- మీవంటి ప్రాజ్ఞులు అలా అండం నాకు ఆశ్చర్యంగా వుంది. వాళ్లనడవడిక మంచిదవడం చాతనే దేవుఁడు యింత రాజ్యైశ్వర్యం వాళ్లకిచ్చాడు. మనశాస్త్రాల్లో మాటలు మనం మరిచిపోయినావుఁ. ఆమాటలే తెల్లవాళ్లు దొంగతనంగా పట్టుకుపోయి, శాస్త్రం చెప్పినట్టల్లా ఆచరించి మనరాజ్యం లాగుకున్నారు. మీరు యెరిగిన వారుగదా చెప్పండి, గురువులు దగ్గిర శిష్యులు యెంచేశేవారు? అడివికెళ్లి చెట్లెక్కి సమిధలు తెచ్చేవారు. రండికీ మొండికి ఓర్చెవారు. యిప్పుడు యింత ప్రాజ్ఞులైన మీరేవఁంటున్నారూ? మావాడు యిల్లుకదిలివెళ్లితే కందిపోతాడు, మావాడు జావఁచెట్టెక్కితే కాళ్లువిరుచుకుంటాడు అని భయపడుతున్నారు. మీశిష్యులు బ్రహ్మాండవైఁన మఱ్ఱిచెట్టు కొసకెక్కి ఆకులుకోసి తెస్తున్నారుకారా? మనపుస్తకాల్లో మర్మం కనుక్కుని దొర్లు బాగుపడుతున్నారు, మనపుస్తకాలు బూజెక్కించి మనం చెడుతున్నాం.

అగ్ని-- మీకు చాలాతెలుసును. యీతెల్లవాళ్లు చేసేవిద్యలన్నీ మనగ్రంధాల్లోంచి యెత్తుకెళ్లినవే. యీరెయిళ్లు గియిళ్లూ యావత్తు మనవేదంలో వున్నాయిష. మీది మాపరిశీలనైన బుద్ధి. మనకేసు గెలవడానికి మీరురాసిన సవబులు మాబాగున్నాయి.

గిరీ-- యింకాబాగుండును. రికార్డు పూర్తిగాలేదు. కొన్నికాగితాలు మీరే పారెశారో, మీవకీలు వుంచేసుకున్నాడో నాకు బోధపడకుండావుంది.

అగ్ని-- నేను పారెయ్యలేదండీ. నాకు యింగిలీషు తెలియకపోవడం చాలాచిక్కొచ్చింది.

గిరీ-- మీకే యింగ్లీషువొస్తె భాష్యం అయ్యంగార్లా అయిపోరా? యీమడి తడిపేసి, వున్నకాగితాలు యావత్తుకూ జాబితారాస్తాను, తమరువెళ్లండి.

అగ్ని-- మీరు సంసారం పనిపాట్లు యేం శ్రద్ధగాచేసుకుంటారు! మావాడికి మీలా ప్రయోజకత్వం అబ్బితే నాకొహడి అవసరంవుండదు. దిగేటప్పుడు నిమ్మళంగా సాయంచేసి మరీదింపండేం? కీడించి మేలించమన్నాడు

(నిష్క్రమించును.)

వెంక-- (నిమ్మళంగా) నాన్నయింట్లో కెళ్లిపోయినాడు.

గిరీ-- నిమ్మళంగాదిగు.

వెంక-- (వురికి) బతికించారు. (వెళ్లిపోబోవును.)

గిరీ-- ఆగు ఆగు ఆ వొళ్లొపళ్లిలా పట్రా.

వెంక-- దొబ్బుతారా యేవిఁటి అన్నీని? అన్యాయం!

గిరీ -- "అన్యాయం పాపనాశనం" అన్నాడు. ఒక్క అన్యాయంతో పాపాలన్నీ పోతాయి. అన్నిపళ్లూ నువుమాత్రం తింటావాయేమిటి? తింటే స్టమకేక్‌, కడుపు నొప్పొస్తుంది. కడుపు నొప్పొస్తే మీ అమ్మ నోరు పగల్దీసి సోలడు ఆవఁదం వసగుండా గొంతుకలో పోస్తుంది.

వెంక-- నేనావఁదం తాగను.

గిరీ-- అలా అయితే పళ్లట్టే తినకు (యాతాం వొదిలి వెంకటేశం వొళ్లోని కాయలు యెంచుచుండును.)

వెంక-- (యేడుపుమొహంతో) పెద్దపళ్లన్నీ దొబ్బుతారా యేవిఁటి?

గిరీ-- పెద్దవాళ్లకి పెద్దపళ్లూ, చిన్నవాళ్లకి చిన్నపళ్లూ. యింతసేపూ చెట్టెక్కి చిలకలా కొరికావు చాల్దా? (నాలుగుపెద్దపళ్లుతీసుకొని వెంకటేశం వీపుతట్టి) మైడియర్‌ బ్రదరిన్లా! యిహ నీయిష్టవొఁచ్చినట్టు చెట్లూ చావఁలూయెక్కు. యింగిలీషువాడు నేచర్‌ స్టడీ చెయ్యమన్నాడు. జామ చెట్టెక్కినప్పుడుమాత్రం పండూ, పరువుకాయా, పచ్చికాయా వీట్లభేదం బాగా స్టడిచేసి, పళ్లేకొయ్యి. అందులో నాలుగు గురుదక్షిణకింద నాకియ్యి. లేకుంటే కడుపుబ్బుతుంది. నువ్వొహమాటు చెట్టెక్కింతరవాత, వలేసి చూసినా మరి పరువుకాయ కనపడదు. "యేరకుమీ కసుగాయలు" అన్నాడు. రనెవే! - (వెంకటేశం దాటువేసి పారిపోవును.) పాచిక పారెటట్టే కనపడుతూంది. హా! యేమి సొగసు!

కం.

నదమా పొక్కిలి, జాంబూ ।
నదమా మైచాయ, కోకనదమా పదమా ।
పదమాజడ, నడుము వియత్‌ ।
పదమా, నూగారుగూఢ పదమాచెలికిన్‌ ॥

(నిష్క్రమించును.)

---*---