కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/సీతారాముల శాపము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

6. సీతారాముల శాపము

"దేవాలయాలలోని విగ్రహాల నగలను ముట్టుకుంటే ఘోరమైన శాపం తగులుతుంది. ఆ పాపఫలాన్నీ వంశపారంపర్యా అనుభవించవలసివస్తుంది." అని భారతదేశాన్ని ఏలే మొగలుచక్రవర్తి టెవర్నియరు అనే ఫ్రెంచి దేశీయుడితో అన్నాడట. ఈ మాట టెవర్నియరు విషయంలోనే రుజువు అయింది.

టెవర్నియరు 1638-68 మధ్య అయిదుసార్లు హిందూదేశానికి వచ్చి దేశమంతా తిరిగిచూశాడు. టెవర్నియరు వజ్రాల వ్యాపారం చేసి చాలా సొమ్ము ఆర్జించాడు. ఎక్కడనైనా అపూర్వమైన వజ్రం వున్నదంటే యెలాగైనా దాన్ని సంపాదించాలని ప్రయత్నించేవాడు. ఇతడు మొగలుచక్రవర్తి దయ సంపాదించి ఆయనతో వెళ్ళి హిమాలయ పర్వతాలలో వుండే వజ్రపు గనులు చూశాడు. అప్పుడు చక్రవర్తి టెవర్నియరుకొక మహావజ్రాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ సమయంలోనే చక్రవర్తి టెవర్నియరుకు బర్మా వజ్రం సంగతి ఇలాగని చెప్పాడు. "ఐరావతీ నదీతీరాన్నివున్న పగను అనే నగరంలో ఒక పురాతన దేవాలయంలో ఒక గొప్ప స్ఫటికంలో చెక్కిన సీతారాముల విగ్రహాలు వున్నాయి. ఆ విగ్రహాల మెడలలోను వక్షస్థలాల మీదను భక్తులు సమర్పించిన అనేక అమూల్య రత్నాల ఆభరణాలు వున్నాయి. వాటిలోకల్లా అందమైనదీ, అపూర్వమైనదీ ఒక వజ్రం వున్నది. అది రెండువేల సంవత్సరాల నుంచి ఆ విగ్రహాలకు అలంకారంగా వున్నది. దానిని పూర్వం బర్మారాజు కొమరితయైన బ్రిస్బన్ ధరించేది. ఆ పిల్ల ఆతతాయిలవల్ల బలవన్మరణము నందినది. దీని పూర్వచరిత్రను గురించి యింక ఏమీ తెలియదు." అని చక్రవర్తి చెప్పాడు.

వజ్రాపహరణం

ఈ మాట వినేటప్పటికి ఎలాగైనా ఆ వజ్రాన్ని అపహరించాలని టెవర్నియరుకు కోరిక కలిగింది. అతడు ముందుగా మండలేపట్నం వెళ్ళాడు. పగను చాలా దుర్గమమైన ప్రదేశంలో వుంది. అక్కడికి వెళ్లడం చాలా కష్టం. అయితే టెవర్నియరు ఫ్రెంచి దేశాన్నుంచి వచ్చిన ఒక గొప్పదొర అనిన్నీ, హిందూదేశాన్ని ఏలే చక్రవర్తికి స్నేహితుడనిన్నీ అతని ప్రఖ్యాతి అతనికంటె ముందుగానే పాకినందువల్ల అది సాధ్యం అయింది. అతడు గమ్యస్థానానికి దగ్గరికి వచ్చినకొద్దీ చాలా ధాతృత్వం కనబరుస్తూ దానధర్మాలు చెయ్యడం ప్రారంభించాడు. తనను ఒక మహారాజు అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారని టెవర్నియరే అన్నాడు.

విదేశీయుడిని - అందులో తెల్లవాడిని - దేవాలయంలోనికి సులభంగా రానివ్వరుగాని టెవర్నియరుకు ఇది సులభంగా సాధ్యమైంది. దేవాలయంలో కాలుపెట్టగానే టెవర్నియరు ఎంతో భక్తిపరుడిలాగ సాష్టాంగపడి దేవుడికి నమస్కరించాడు. ఈ సీతారాములను చూడలేక కళ్ళు మిరుమిట్లు క్రమ్మినాయేయో అనేటట్లుగా తన అరచేతి వేళ్లను కళ్ళకు అడ్డముపెట్టికొని ఆ వేళ్ళసందులనుంచి తాను అపహరించదలచిన అపూర్వ వజ్రం ఎక్కడవుందో కనిపెట్టాడు. ఆ మర్నాడు ప్రొద్దున్న దివ్యవజ్రం పోయిన సంగతి తెలియగానే లబాయిలూ దిబాయిలూ ఎవరు ఎత్తుకుపోయివుంటారు ? అని అర్చకులు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. బిచ్చగాళ్ళను కట్టిన తాళ్ళను విప్పుతూవుండగా కొత్తగా వచ్చినవారు ఆ రాత్రి వెళ్ళిపోయారనే కేకలు వినబడ్డాయి.

శాపంయొక్క పీడ ప్రారంభం

టెవర్నియరు కోరిక సఫలమైంది. వజ్రం పోయిన సంగతి అర్చకులకు తెలిసేటప్పటికి అతడూ అతని అనుచరులూ తప్పించుకొని చాలా దూరం పోయారు. ఫ్రెంచిరాజు 16 వ "లూయీ" భార్య మేరీ అంటాయినెట్టు దీనిని ధరించింది. ఆవిడకు చాలా చిక్కులు వచ్చినవి. ఫ్రెంచి ప్రజా విప్లవంలో ఆ రాజు పదబ్రష్టుడైనాడు. ఆ రాణి ప్రాణాలను గోల్పోయింది. విప్లవం జరిగిన తరువాత 1792 లో తక్కిన జవాహిరితోపాటు ఈ వజ్రాన్ని ఎవరో అపహరించారు.

దుర్మరణాలు - దురదృష్టాలు

ఎలియాసన్ ఆ వజ్రాన్ని సంగ్రహించాడు. అతని దగ్గర ఆ వజ్రం 1830 వరకూ ఉంది. తరువాత అతడు దానిని తామస్ హెన్రీ హోపు అనే ఆయనకు 18 వేల సవరనులకు అమ్మాడు. ఆ వజ్రం నిజానికి 30 వేలు చేస్తుంది. హోపుగారి తదనంతరం ఈ వజ్రం ఆయన వారసుడైన లార్డు ఫ్రాన్సిస్ హోపు ప్రభువునకు సంక్రమించినది. దీనికి అప్పటినుంచీ "హోపు వజ్రం" అని పేరు వచ్చింది.

హోపు ప్రభువు కొరట్ అనేవాడు తన వజ్రం ఖరీదు తాలూకు సొమ్ము తనకు రాదనే అధైర్యంతో ఆత్మహత్య చేసుకొన్నాడు.