కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/నూజివీటి వ్యవహారం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పన్నులు యావత్తు సదాశివరాయలవారున్నూ రామరాయలవారున్నూ తీసివేసినట్లుకూడా, చిట్టాలందుర్గము జిల్లాలొ 1546 లోని ఒక శాసనంచ్వల్ల కనబడుతున్నది.

సదాశివరాయలవారు స్వయంగా ఊటుకూరులోని మంగళ్ళ పైని పన్నులు తీసివేశారు. రామరాయలవారున్నూ కర్ణాటక రాజ్యంలోని కొన్ని మండలలోనూ, కడపజిల్లాలోని కొన్ని సీమల లోనూ మంగళ్లపైని పన్నులు తొలిగించారు.

రాయలవారిని చూసి వారి మంత్రులూ సామంతులూ కూడా అనేక గ్రామాలలో మంగళ్లపైని పన్నులు తొలిగించారు.

   (The Aravindu Dynasty --Heras pp. 48-49)
             -----

13. నూజివీటి వ్యవహారం

1771 లో నూజివీటి జిమీందారుడైన నరసింహ అప్పారావు గారు చాలా ఖర్చు మనిషి. చెన్నపట్నం ఇంగ్లీషు కంపనీ ప్రభుత్వానికి చెల్లించవలసిన కప్పం(పేష్కరు) సరిగా చెల్లించ లేకపోయేవాడు. అందువల్ల చిక్కులలో పడ్డాడు.

జమీందారీని వశపర్చుకోవడానికి కంపినీ సర్కారువారు 1773 లో బందరులో ఒక సైనికదళం పంపారు. అప్పుడు ఆయన అత్యధికమైన వడ్డీరేటుతో బందరులో నున్న కంపెనీదొరల దగ్గరనే కొంతసొమ్ము బదులు చేసి బకాయి చెల్లించాడు.

1775లో బందరు కంపెనీవారి పరిపాలనసంఘానికి అధ్యక్షుడుగా నుండిన వైటహిల్లుకు, హీడ్జెనుకు, ఇంకా బందరులో కంపెనీ ఉద్యోగం చేస్తూవున్న మరికొందరు దొరలకు నరసింహా అప్పారావు గారు బాకీ వున్నారనీ వాళ్ళు 1775లో తగాదా ప్రారంభించారు. మూడు సంవత్సరాలు గడిచినవి గాని వ్యవహారం తెగలేదు. అంతట అప్పారావుగారు చెన్నపట్నానికి ప్రయాణం కట్టారు. అప్పుడు చెన్నపట్నంలో సర్ తామస్ రంబోల్డు అనే ఆయన గవర్నరు. ఆయన కార్యాలోచన సంఘంలో వైటుహిల్లుగారు వృద్ధ సచివుడు(సీనియరు సభ్యుడు) అప్పారావుగారిమాట ఎవరూ వినిపించుకోలేదు. ఆయన నూజివీడుకు తిరిగివచ్చాడు.. కంపెనీవారి న్యాయంలో విశ్వాసం గోల్ఫోయి తిరుగుబాటు చేసే సూచనలు కనబరిచాడు.

కంపెనీఅధికారులు మేజర్ కసామేజరును నూజివీడు పంపి జమీందారును బందరు రప్పించి ఖైదుచేశారు. ఆయనను నిర్భంధంలో వుంచిన కారాగారాధికారి హార్జెను. పైనచెప్పిన దొర లందరికీ అప్పారావుగా రివ్వవలసినట్లు చెప్పేబాకీ మొత్తానికి అప్పారావుగారి చేత హడ్జను ఒక పత్రం వ్రాయించుకున్నాడు!

ఈవైట్ హిల్లుసంగతి చెప్పాలంటే చాలాగాధ వుంది. ఈవైటుహిల్లొ ఇతనికి ముందుపని చేసిన ఫ్లాయిర్ (Floyer) క్రాఫర్డు దొరలు స్వలాభాపేక్షతో చాలా అక్రమాలు జరిగించి ప్రజలను ఓడించారనిన్నీ అప్పుడు చెన్నపట్నంలో కొన్నాళ్ళు గవర్నరుగా పని చేసిన రంబోల్గుగారు వీరికి మద్ధతుచేశారినిన్నీ వీరందరూ కలిసి కంపెనీ వారి సొమ్ము హరించారనిన్నీ 1775లో కోరిందగ్గర ఇ జరంలో కంపెనీ వారి ఏజంటుగా వుండిన శాడ్లియర్ గారు ఫిర్యాదుచేశాడు. కొన్నాళ్ళ దాకా ఏమీ జరగలేదు. ఈలోపుగా వైటుహిల్లు, రంభొల్డుదొరల లంచగొండితనము దుష్ప్రవర్తనము మితిమీరినందువల్ల గవర్నరు జనరలు వీరిని 1781 లో పనిలోనుండి సస్పెండు ఛేశారు.

అప్పుడు చెన్నపట్నంలో పరిపాలక సంఘానికి శాడ్లియరు తాత్కాలికంగా ముఖ్యాధికారి అయినాడు. అప్పరావుగారు తనకు జరిగిన అన్యాయాన్ని గురించి యిచ్చుకున్న అర్జీని శాడ్లియరు పార్లమెంటుకు పంపించారు. అప్పుడు కంపినీడైరెక్టర్లకోర్డువారు దీనినిగురించి జాగ్రత్తగా విచారణజరిపించవలసినదని వుత్తర్వుచేశారు.

చెన్నపట్టాణానికి మెల్లర్ ట్నీ ప్రభువు గవర్నరైనాడు. ఇతడు సద్ధర్ముడు. నూజివీడుజమీందరుడి విషయంలో హాడ్జెను జరిపిన వ్యవహారం విషయంలో ఆయనకు చాలా అనుమానం కలిగింది. గాని ఈలోపుగా తన అర్జీలు కంపెనీవారు చిత్తగించి న్యాయం చేస్తారనే ఆశపోయి నరసింహా అప్పారావుగారికి మనసు విరిగిపోయినది. అందువల్ల 1783 లో కొంతసైన్యం సమకూర్చుకొని కోటలో కూర్చుని తిరుగుబాటుచేశారు. అంతట కంపెనీవారు ఆయనపైకి సైన్యాన్ని పంపారు. ఆయన నిజాము సరిహద్దుదాటి పారిపోయి సైన్యాలు కూర్చుకుని నూజివీడుమీదికి దండయాత్రలు చేయడం ప్రారంభించాడు.

ఆయనను పట్టుకోవడానికి కంపినీవారు నిజాంప్రభుత్వముతో వుత్తరప్రత్త్యుత్తరాలు జరుపుతూవుండగా అప్పారావుగారు తన తిరుగుబాటును క్షమిస్తే బకాయి చెల్లిస్తానని కంపినీఅధికారులతో రాజీచేసుకొని మొదటికిస్తీ చెల్లించగా జమీందారీని ఆయన వశంచేశారు. రెండవకిస్తీ చెల్లించలేకపోయి మళ్లీ తిరుగుబాటు చేసి మారువేషంతో పారిపోయాడు. కంపినీవారు కోటబురుజులను భూమిమాట్టం చేశారు. ఈ నరంహ అప్పరావుగారికి జమీందారీ హక్కు తీసివేశమనిన్నీ ఆయన కుమారుడు వెంకటనరసింహ అప్పరావుగార్ని జమీందారుగ స్థిరపరిచామనిన్నీ కంపినీవారు 1784 లో ప్రకటించారు.

నరసింహ అప్పారావుగారు భద్రాచలం ఆడవులలో తిష్ఠవేసుకొని సైన్యంతో వచ్చిపడి గ్రామాలు కొల్లబెడుతూ ఇళ్ళు తగల పెడుతూ ఖజానా దొచుకుంటూ అడ్దువచ్చినవారిని నరికి దౌర్జనాలు చేయడం ప్రారంభించాడు. కంపెనీ అధికారులు ఈపొరు పడలేక చివరికి విసిగివేసరి ఏమీచేయలేక నరసింహ అప్పారావుగారు కొమారుని దగ్గర నూజివీడులోనె వుండడానికి రాజీగా అంగీకరించారు. కొమారుడు సమర్ధుడు కావడంవల్ల తండ్రి పలుకుబడి హెచ్చుగస వుండేది. ఆఖరికి నరేసింహ అప్పారావుగారిని బందరుకు రప్పించి అక్కడ ఖైదు చేశారు. ఆయనతోవచ్చిన పరివారము నూజివీడుకు పోయి చిన్న జమీందారుగారికి లొంగక, దౌర్జన్యాలు చేస్తూ చినరాణీగారి కొమారుడికి మద్దతు చేయడం ప్రారంభించారు.

బందరులో కొన్నాళ్లు అధికారిగా వుండిన ఫ్లాయరు లంచము తీసుకొన్న విషయాన్ని గురించి విచారణచేస్తూ చెన్నపట్నం కార్యాలోచన సంఘమువారు వృద్దజమీందారుగారిని సాక్ష్యం యివ్వడానికి 1789 లో చెన్నపట్నానికి పిలిపించారు. ఆయన అక్కడ కొద్ది రోజులలోనే మరణించారు.

అప్పారావుగారి బాకీవ్యవహారం యింకొకమాటు తలయెత్తి వూరుకుంది.

తూర్పు ఇండియా డైరెక్టర్ల సభలో ముఖ్యుడున్నూ, పార్లమెంటువారు హిందూదేశవ్యవహారాలను తనిఖీచేయడానికి ఏర్పరచిన బోర్డులో సభ్యుడున్నూ అయిన రైట్ ఆనరబుల్ జాన్ సల్లిషన్ అనే ఆయనకున్నూ కొంతకాలం మచిలీ బందరులో కంపెనీ అధికారిగావుండి తరువాత కొద్దిరోజులు చెన్నపట్నం గవర్నరు గా కూడా పనిచేసిన వైట్ హిల్ అనే ఆయనకున్నూ ఇంకా మచిలీ బందరులో పనిచేసిన మరి కొందరు దొరలకున్నూ తనకున్నూ కలిసి అప్పటి నూజివీటి జమీందారుడైన నరసింహ అప్పారావుగారు కొన్ని లక్షలరూపాయలు బాకీ వున్నారనిన్నీ, ఆ బాకీని తాను రాబట్తుకొవడానికి ట్రాన్సుఫరు పొందివున్నట్లున్నూ, తనకు స్వయంగా కూడా ఒక పత్రంపైన ఆ జమీందారు బాకీఉన్నట్లున్నూ బనాయిస్తూ హాడ్జెన్ తగాదా చేశాడు.

అప్పారావుగరు తనకు పత్రిని వ్రాసినట్లు చెప్పే తేదీన అప్పారావుగారు నిర్భంధంలో వున్నందువల్లను కారాగారాధికారి హార్జెన్ గారే గనుకను, ఈ హాడ్జెన్ తనను బలవంతం చేసి ఒక పత్రం వ్రాయించుకొన్నాడని యింకొక జమీందారుగారు 1785 లో ఫిర్యాదు చేసిన సందర్భమున్నూ చూస్తే ఈ హాడ్జెన్ ఎంతటివాడో ఈబాకీ ఎంతవరకూ నమ్మతగినదో త్రెలుస్తుంది.

ఈ హాడ్జెను 1794 లో చనిపోయాడు. 1801 సంవత్సరం దాకా అతని భార్యా అతనికి రావలసిన ఆప్పులమాట తలపెట్టనేలేదు. అప్పుడు ఆ బాకీ తనకు యిప్పించవలసినదని కంపెనీ డైరెక్టర్ల కొర్టువారికి అర్జీ యిచ్చుకుంది. ఈ అర్జీని డైరెక్టర్లు నమ్మక త్రోసివేశారు. కంపెనీవారు భూస్వామిత్వపు హక్కులను నిర్ణయించి శాశ్వత పైసలా (పర్మనెంటు సెటిల్మెంటు) చేసే సందర్భంలో నూజివీడు జమీందారీని గురించి నరసింహప్పారావుగారి పెద్దభార్యాకుమారునికీ చిన్న బార్యకుమాళ్ళకూ గల తగాదాలు పరిష్కరించడం కోసం వెంకటనరిసింహారావుగారికి నిడదవోలు పరగణాలు, రామచంద్ర అప్పారావుగారికి వుయ్యూరు పరగణాలు యిచ్చి పేష్కషు బకాయి వదులుకొని సన్నదులిచ్చి జమీందారీని 1803 లో వారికి వశపరిచారు. పైసందర్భంలో హెడ్జెసుగారి బాకీని చెల్లించవలసినట్లు కంపెనీ అధికార్లు నిర్ణయించలేదు. వారికి చెప్పనూలేదు.

ఇలాగ నూజివీడు జమీందార్లకు కొత్తపట్టా యిచ్చిన తరువాత మళ్లీ ముప్ఫై సంవత్సరాలు జరిగిపోయినవి. అప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లుగా హాడ్జెసుగారి ఋణశేషం తగాదా మళ్ళీ త్రాచుపాముం లాగ తలయెత్తింది. సంగతి యేమిటా అని ఆలోచిస్తే అప్పట్లో సీమలో పలుకుబడిగల దొరలు కొందరు యేకమై ఈ బాకీని రాబట్టి పంచుకొని అక్రమలాభం పొందాలనె దురుద్దేశ్యంతో దీనిని బయటికి తీసినట్లు తేలింది.

ఈబాకీ అనేది సర్వాబద్ధ మనిన్నీ చెల్ల దనిన్నీ ఇవ్వ నక్కరలేదనిన్నీ కంపెనీవారు గట్టిగా వాదించారు గాని, బాకీని రాబట్టడానికి నడుముకట్టిన దొరలు చాలాబవంతులై నందువల్ల ఈ వ్యవహారం ఇంగ్లాండు పార్లమెంటులోకి యెక్కింది. ఇది ప్రభువులసభలో చర్చకు వచ్చింది.

సంగతిసందర్భాలు చూసేవారికి ఈబాకీ అనేది అబద్ద మనిన్నీ అక్రమమైనదనిన్నీ తోచినా బలవంతులైన తెల్లదొరల పలుకుబడి వల్లను మొహమాటంవల్లను ఈబాకీ యిచ్చుకోవలసినదే నని ప్రభువుల సభవారు 1832 లో తీర్మానించారు.[1]

  1. Manual of the Kistna District pp.110-112, 298-301. The History of the British Empire in India - Edward Thomson (1842) Vol.II pp.243-246