కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/సస్యగర్భభూదానం
సస్యగర్భభూదానం
పెద్దలు దానాలవిషయంలో చాలా గ్రంథాల్లో వ్రాసివుంచారు. స్వీకరించడానికీ యివ్వడానికీకూడా బ్రాహ్మల కధికార ముందనిన్నీ క్షత్రియాదులకు యివ్వడానికి మాత్రమే కాని పుచ్చుకోవడానికి అధికారం లేదనిన్నీకూడా వారే వ్రాసివున్నారు. కాని యీ యిరవయ్యో శతాబ్దంలో బ్రాహ్మణేతరులు తిరగంబడి దాన్ని విశ్వసించడంలేదు. ముఖ్యంగా ఆ యా పురాణాలేమి ధర్మశాస్తాలేమి మీ బ్రాహ్మలే వ్రాసుకున్నారు. కాCబట్టి మీకు అనుకూలంగా వ్రాసుకున్నారు. అంటూ ఆపాతరమణీయమైన యుక్తి నొకదాన్ని చెప్పి పైవిషయాన్ని బ్రాహ్మణేతరులు తృణప్రాయంగా ఖండిస్తూ వున్నారు. నేనుకూడా బ్రాహ్మణ్ణి అవడంచేత దీన్ని గుఱించి యింతకన్న ఎక్కువగా వ్రాసినప్పటికి వృథా పరిశ్రమమే కాని ప్రయోజనం వుండదని యెంచి ఆజోలికిపోక ప్రస్తుతాంశాన్ని గూర్చి రెండుమాటలు వ్రాస్తూవున్నాను.
దానాలలో చాలా విధాలున్నాయి. వాట్లలో చాలాభాగము యిచ్చేవాళ్లకు పుణ్యాన్ని సంపాదించే విన్నీ పుచ్చుకునేవాళ్లకు పాపాన్ని సంఘటించేవిన్నీ అని గ్రంథాల్లోనే వ్రాయంబడివుంది. బ్రాహ్మలు బ్రాహ్మలకోసం రాసుకున్నారని చెప్పేవారికి అనుకూలించని సంగతులుకూడా ఆ గ్రంథాల్లోనే కనబడుతూ వున్నాయి బోలెండు. నిజమైన బ్రాహ్మండు. లేశమున్నూ ప్రతిగ్రహమే చేయకూడదని పలుచోట్ల వ్రాసివున్నారు. "పౌరోహిత్యం రజనిచరితం" అంటూ కొన్నిటిని యేకరు పెట్టి యివి నాకు జన్మజన్మాలకూ వద్దని భగవంతుణ్ణి ప్రార్ధించినట్లు అభియుక్తుల శ్లోకాలు కనపడతాయి.
ఆ యీ నిషేధం కన్యాభూసరస్వతులనుగూర్చి యొక్కడా వున్నట్లు లేదు. అన్నాన్ని కూడా యితరత్ర స్వీకరించడానికి మనపూర్వులు వప్పుకోనేలేదు. “తస్మాదన్నం నగృహీయాత్ ప్రాజైః కంఠగతై రపి" ఆ కారణంచేతనే శ్రీ బులుసు పాపయ్యశాస్రులవారి వంటి మహాపండితులు కొందఱు యీ విషయంలో చాలా అసిధారావ్రతంగా ప్రవర్తించినట్లు వింటాము. కన్యకను వకరివల్ల స్వీకరిస్తేనేకాని ప్రపంచప్రవృత్తే సాంగదు కనుక దాన్ని నిషేధించలేదు. భూదానం పుచ్చుకోకపోతే కన్యాదానానికి వచ్చే చిక్కువంటి చిక్కులేదుగాని యెందుచేతో దాన్ని నిషేధించలేదు. సరస్వతీదానం అంటే విద్యాదానం. దీన్ని నిషేధిస్తే లోకం అంధకారంలో పడిపోవలసి వస్తుంది. గనక దీన్ని కూడా వుభయతారకంకిందనే మనపూర్వులు జమకట్టివున్నారు. ప్రస్తుతం రాయదలచుకొన్నది భూదానాన్ని గుణించి, అట్టి భూదానాన్ని గ్రహణాది సమయాలలో యిస్తే దానివల్లవచ్చే పుణ్యం కోటిగుణిత మవుతుందని గ్రంథాలలో వ్రాసివుండడంచేత పూర్వరాజులు అగ్రహారాలు వగైరా అట్టి సమయాలలోనే యిచ్చినట్లు మనకు వారివారి శాసనాలవల్ల తెలుస్తూవుంది.
అట్టి భూమి సస్యగర్భంగా వున్నప్పడు దానమిస్తే మరీ పుణ్యమని యొక్కడో వ్రాసివుండడంచేత వక సామాన్య గృహస్టురాలు యే పురాణ శ్రవణ సమయంలోనో ఆ సందర్భాన్ని విని సస్యగర్భభూదానం చేదామని సంకల్పించుకుందని వింటాము. అయితే యీ దానం అన్నది వారి వారి స్థితిగతుల ననుసరించి ఫలప్రద మవుతూవుంటుంది కాని యొక్కువ యిస్తే యెక్కువ పుణ్యమనిన్నీ తక్కువయిస్తే తక్కువ పుణ్యమనిన్నీ లేదు. అనగా వక మహారాజు వక అగ్రహారం దానమిస్తే ఎంతపుణ్యమో వక సంపన్న గృహస్టు వక యొకరం నేల దానమిస్తే అంతేపుణ్యం. యీలాగే వక లక్షాధికారి వక వేయి రూపాయిలిస్తే యెంతో వకభిక్షాధికారి వక కాని ధర్మంచేస్తే అంతేఅని గ్రంథాలు వప్పకుంటాయి. యుక్తికిన్నీ పైసంగతి అనుకూలిస్తుంది. కాని లక్షాధికారి భిక్షాధికారి చేసినట్లుమాత్రం చేస్తే యుక్తంకాదు. అందుకే తన శక్తికొలదిగా దానం చేయవలసిందని చెపుతూ "విత్తశాఠ్యం నకారయేత్ అనికూడా పలుచోట్ల వ్రాసివున్నారు. అదలా వుంచుదాం.
యిపుడు జనశ్రుతిగా వచ్చుచున్న వక సామాన్యగృహసురాలుచేసే సస్యగర్భ భూదానాన్ని గుణించి మాట్లాడుకుందాం. పాపం ఆ అమాయకురాలికి యథాశాస్త్రంగా సస్యగర్భభూదానం చేయాలనివుంది. పండినభూమి నెక్కడతెస్తుంది? అందుచేత యెవరినో ఆశ్రయించి నాలు మూడు పండిన వరివెన్నులతో కూడుకొన్న వక పెద్ద మంటిగడ్డను సంపాదించింది. దాన్ని జాగ్రత్తగా విడిపోకుండా వక పళ్లికతట్టలో పెట్టుకుని యేపుష్కర పుణ్యకాలమందో లేక యే సూర్యగ్రహణ చంద్రగ్రహణ కాలమందో యే కోటిలింగక్షేత్రానికో వచ్చి స్నానంచేసి డబ్బో దస్కమో దక్షిణతో ఆసస్యగర్భభూమిని దానంచేసి తరించినట్లు తృప్తిపడి యింటికి వెళ్లింది. విచారించిచూస్తే ఆ అమాయకురాలికి పుణ్యంవస్తే రావచ్చునేమో కాని అది సస్యగర్భభూదానం అనిష్ఠించుకుంటుందా? యీ మట్టి గడ్డను పుచ్చుకొన్న బ్రాహ్మండు దక్షిణే దక్కుట అనుకొని దాన్ని అక్కడే పారవేస్తాడు. గాని యింటి కేమేనా తీసుకువెళ్లి యేటేటా తాను పండించు కుంటాండా? అది ఆలా పండించుకోవడానికి వీలవుతుందా? కాదు గదా? అయితే ఆవిడకు పుణ్యం మాత్రం యేలావస్తుందని శంక రావచ్చును. ఆమె బుద్ధియందు లేశమున్నూ కళంకం లేదు. కాcబట్టి- “భావనా యదిభవే త్ఫలదాత్రీ మామకం నగరమేవహి కాశీ" అన్నట్లు ఆమె భావనను పట్టి ఆపెకు సుకృతం కలిగితే కలగవచ్చు ననుకుంటాను.
ఇప్పడిట్టి సస్యగర్భభూదానాలే జరుగుతూ వున్నట్లు లేదుగాని యీలాటివి మాత్రం కొన్ని జరుగుతూవున్నాయి. వాటినే కొందఱు విమర్శనాదక్షులు విమర్శించి ఖండిస్తూవున్నారు. వారికి నేచెప్పే సమాధానమేమిటంటే : మేడున్నవారు మేడెకేరనుకోండి. అది లేనివారో గోడే యొక్కి సంతోషిస్తారు. దూరాన్నున్న వస్తువు మేడమీందవారి కెంత గోచరిస్తుందో గోడమీందవారికిన్నీ అంతే గోచరిస్తుంది. కాCబట్టి వృథాగా మీరు విమర్శించి ఖండించడం యెందుకు? అంటాను. అంటే వారు వింటారూ? యేమేమో యుక్తులు చెప్పడానికి మొదలుపెడతారు. వారి యుక్తులున్నూ తోసివేయడానికి శక్యంకాదు. యెందుచేతంటారా? మేడమీందెక్కడమున్నూ గోడమీందెక్కడం వకటే అంటే మాత్రం బాగా వుంటుందా? ఆలాగయితే బోలెండు ద్రవ్యం వ్యయం చేసి మేడ లెందుకు కట్టుకోవాలి? దేని గౌరవం దానిదే. సస్యగర్భభూదానం ఆవిడ చేసింది కూడా అయితే నిజమైన సస్యగర్భభూదానం యొక్క గౌరవం యెవరికేనా కనపడుతుందా? యిప్పటి మెడల్పులాగే పదడయిపోమా? కాcబట్టి దీన్ని గుటించి బాగా ఆలోచించాలి. ఇంతే నేను వ్రాసేది.
★ ★ ★