Jump to content

కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా?

వికీసోర్స్ నుండిభీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా?

భీష్మణ్ణి గురించి నాలుగుమాటలు వ్రాస్తాను. భారతంలో యితని చరిత్ర సమగ్రంగా వున్నప్పటికీ అక్కడక్కడ వెదికితేనే తప్ప వొకటే చోట వుపలబ్ధం కాదు. యితఁడు శంతన మహారాజుకున్నూ గంగా దేవికిన్నీ జన్మించినవాఁడు. గంగ వొకానొకనది కదా! ఆ నదికిన్నీ మనుష్యుడైన శంతనుండికిన్నీ దాంపత్యం యెట్లా? అంటూ శంకిస్తే జవాబు చెప్పవలసింది లేదు. యిలాటి దాంపత్యాలు మన ఆర్యుల చరిత్రల్లో చాలా వున్నాయి. శ్రీ కృష్ణమూర్తికి కాళింది భార్యకావడం వగయిరాలు చూచుకోండి. వసుమహారాజుభార్య గిరికాదేవికూడా నదీసంతానమే. కాని అక్కడ ఆశుక్తిమతీనదికి భర్త మనుష్యండుకాఁడు; కోలాహల పర్వతం. కనక యింత విరుద్ధంగా వుండదు ఆ కథ.

రెండున్నూ జడపదార్థాలే. వస్తుతః మన ఆర్యుల మతంలో కుల పర్వతాలుగాని, మహానదులుగాని కేవల జడపదార్థాలు కావనిన్నీ వీటికి అంతరాత్మ దేవతగా వుంటుందనిన్నీ నిశ్చయింపCబడినట్లు తేలుతుంది.

"శ్లో అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయః."

అంటూ కాళిదాసంతటి మహాకవి చెప్పడం సాధారణంగా తటస్థించదుకదా! కాళిదాసు పరిశీలన సామాన్యమైనదంటే ప్రాజ్ఞలెవ్వరూ విశ్వసించరని వేటే చెప్పవలసి వుండదు. కాCబట్టి సూర్యచంద్రాది ఖగోళస్థ పదార్థములేమి, నదీపర్వతాది భూగోళస్థ పదార్థములేమి కేవలజడములుగా సామాన్యదృష్టికి గోచరించినప్పటికీ విశేషజ్ఞల దృష్టిలో వీటికన్నిటికిన్నీ అంతరాత్మ వుండడం సిద్ధాంతమే. కర్ణుండు సూర్యపుత్రుండైనట్లే భీష్ముండు గంగా పుత్రుండే. ఒకచోట తల్లి మానుషి తండ్రి దేవత, వేటొకచోటో తండ్రి మనుష్యుండు తల్లి దేవనది. భీష్ముడు తల్లివద్దనే బాల్యంలో పెంపcబడ్డాడు. యేలా పెంచిందో యేలా పెరిగాడో వివరించడానికి భారతంలో కూడా తగినంత ఆధారం కనపడడంలేదు. తల్లిద్వారాగానే వసిషుణ్ణి శుశ్రూషించి వేదాదికాన్ని అభ్యసించాడు. పరశురాముణ్ణి శుశ్రూషించి ధనుర్వేదాన్ని అభ్యసించాడు. భీష్ముండికి తెలిసినధనుర్విద్యలో వక్కమోహనాస్త్రం తప్ప యావత్తుశస్తాస్తాలున్నూ పరశురాముండు ద్వారాగానే వచ్చినట్లు భారతంవల్లనే తేలుతుంది. అర్జునుండికో? అలా కాదు. ముందత్తిగా బడిచదువు ఓనమాల మోస్తరు శస్త్రవిద్య కృపాచార్లగారి వద్ద జరిగింది. తరువాత చాలాగ్రంథం ద్రోణాచార్లగారివద్ద జరిగింది. ట్రయినింగుకూడా ద్రోణాచార్లగారివద్దనే అనుకోవాలి. ద్రుపదుణ్ణి కట్టి తీసుకురావడం ఆ ట్రయినింగులోకే చేరుతుంది. ఇంతతోకూడా యితని విద్య సమాప్తం కాలేదు. శ్రీ పరమేశ్వరుండు, దేవేంద్రుండు మొదలైన దిక్పాలకులు వీరంతా అర్జునుండికి అంతో యింతో గురుత్వం చేసినవారే, ప్రధానగురువైన ద్రోణాచార్లగారికికూడా తెలియని మోహనాస్త్ర ప్రయోగంకూడా మన అర్జునుండికి తెలుసును. యిది భీష్ముడికి సోదర ప్రాయులైన వసువుల ద్వారాగా సంక్రమించింది. అర్జునుండికి దీన్ని తాతగారుపదేశించినట్లు భారతంలో కనపడదు. బహుశః స్వర్గంలో యింద్రాదులు కొన్ని అస్తాలు ప్రసాదించిన తరుణంలో వసువులు దీన్ని ప్రసాదించి వుంటారని తోస్తుంది. నన్నయ్యగారు -

"...పాశుపతాదిక దివ్యబాణముల్
హరసుర దేవరాజ నివహమ్ములచేఁ బడసెంగ్రమమ్మునన్."

అని సంగ్రహంగా చెప్పివున్నారు. ఏమైనా అర్జునుండు మాదిరిగా భీష్ముండు చాలామందివల్ల ధనుర్వేదాన్ని అభ్యసించలేదు. ఒక్క పరశురామునివల్లనే సమస్త ధనుర్విద్యను సంపాదించుకున్నాండు. తండ్రిగారికి ద్వితీయ వివాహం చేయవలసివచ్చి &9 సందర్భంలో అవసరమవడంచేత బ్రహ్మచర్యవ్రతాన్ని పూని గురువుగారికి సర్వవిధాలా దీటయిన శిష్యుండని పించుకున్నాండు. పరశురాములవారు ఆజన్మబ్రహ్మచారిగా యెందుకు వుండవలసివచ్చిందో? చూచినంతలో నాకు యేగ్రంథంలోనూ వుపలబ్ధం కాలేదు. మురారి నాటకంలో - "శ్లో ఆజన్మ బ్రహ్మచారీ" అని వ్రాయCబడివుంది. బహుశః యొక్కడో ఈ విషయం పురాణాలలో వుండేవుంటుందనుకోవాలి. అదిన్నీ కాక ఆయనకు కాస్త గోcచీ పెట్టేవయస్సు వచ్చింది మొదలుకొని యెవళ్లతోనో రాజులతో పోట్లాటలతోనే సరిపోయింది. అందులో యెదురుకున్నవాళ్లే లేరుకదా! తుదకు శ్రీరామమూర్తివారు కాంబోలును కాస్త క్షత్రియతేజాన్ని చూపించారు. ఉభయులున్నూ విష్ణుతేజస్సంభవులే అవడంచేత అందులో అంత అవమానం వున్నట్టు ఆయనా భావించుకొన్నట్టులేదు; చరిత్రకారులున్నూ భావించు కోలేదు. కాని అది మొదలుకొని వైరాగ్యానికి దిగి యేదో తపోగోష్టితో మహేంద్రపర్వతం మీఁద కాలక్షేపం చేయడంతప్ప ఆయనకి యితర ప్రసక్తి లేనేలేదు. చాలాకాలం యుద్ధాలే. పిమ్మట తపస్సు, యిఁక వివాహ ప్రసక్తికి అవకాశం యొక్కడ?

ఈ పరశురాముడు సాక్షాత్తూ పరమేశ్వరుండి దగ్గిఱ శస్త్రవిద్యాభ్యాసం చేసినట్టున్నూ, ఈశ్వరుండున్నూ, పార్వతిన్నీ యీయన్ని కుమారస్వామి కన్నా మిన్నగా ఆదరించినట్టున్నూ తఱుచు నాటకాలలో కవులు వ్రాస్తూవచ్చారు. పురాణాలలో ఈ విషయం యొక్కడవుందో తెలియదు. అంతో యింతో ఈశ్వరశిష్యరికం అర్జునుండిక్కూడా వుండడంచేత పరశురాముండున్నూ అర్జునుండున్నూ సతీర్ధులనికూడా అనుకోవచ్చును. భీష్మలవారో యీశ్వరుcడికి ప్రశిష్యుCడు. ఇంతటిస్వార్థత్యాగి అప్పడేకాదు యెప్పడున్నూ లేఁడని చెపితే వొప్పనివారుండరు. స్వార్ధత్యాగులలో శ్రీరాములవారు ప్రథమగణ్యులే, కాని ఆయన వివాహాన్ని కూడా మానుకున్నవారుకారు. రావణవధానంతరం చాలాకాలం రాజ్యంకూడా చేసివున్నారు. భీష్ముండో వివాహాన్నీ వదలుకున్నాండు, రాజ్యాన్నీ వదలుకున్నాండు. అట్లని తపస్విగా వుండలేదు. కుల ధర్మమైన క్షాత్రాన్ని నిర్వహిస్తూ బ్రహ్మచర్యాన్ని అవ్యాహతంగా

"... ... ... ... ... ... ...జ
న్మావధి చచ్చునంతకు రవంతయు లోటునులేనివారి నెం
దేవినియుంటిమే? ... ... ..."

అని యీయన్నిగూర్చి అశ్వమేధంలో మేము ప్రశంసించివున్నాము. యిట్టి భీష్మునికి సకల ధర్మవేత్తకు అంతో యింతో కాక తన యావత్తు ధనుర్విద్యకున్నూ మూలభూతుండైన పరశురామునితో యుద్ధం చేయక తప్పింది కాదు. దైవతంత్ర మనివార్యం కదా! యే కొంచెం గురుశిష్యభావం వున్నా గురువును యెదిరించడానికి శిష్యుండికి అధికారం లేనట్టు మన ఆర్యులమతం చెపుతుంది. అట్టిస్థితిలో భీష్ముండు చేసినపని సూల దృష్టిని విచారిస్తే సమర్థనీయం కాదు. అయితే పరశురాములు కేవలం ఆశ్రితపక్షపాతాన్నే పురస్కరించుకొని చేయందలంచుకొన్న వుపకారానికి భీష్మణ్ణి తోడ్పడవలసిందని విధించాcడు. ఆపనిచేస్తే భీష్మండు కేవలం నింద్యండు కావలసివస్తుంది. అందుచేత అందుకు అంగీకరించలేక పోయాండు. దానితో శీఘ్రకోపి కావడంచేత పరశురాములు మండిపడి తనతో యుద్ధానికి రమ్మన్నాండు. భీష్ముండు యెన్నోవిధాల బతిమాలుకున్నాండు కాని పరశురాములు వినలేదు. తనగండ్రగొడ్డలికి యెందతో యిదివఱలో క్షత్రియులు బలి కావడంచేత భీష్మణ్ణికూడా ఆలాగే చేయంగలనుకదా! అని ఆయనకి పూర్తి ధిమాకువుంది. భీష్ముండికో? గురువుగారు తన్నయితే వోడించలేరని తెలుసునుగాని ఆయనికి యెదురుగా వుండి యుద్ధంచేయడం ధర్మం కాదని సంశయింపవలసివచ్చింది. అందుచేత బతిమాలు కోవడానికి మొదలు పెట్టాండు. పోనీ గురువుగారు చెప్పినట్టు చేస్తేనో? యిహపరాలు రెండూకూడా చెడతాయి. అందుచేత అంబా వివాహానికి వప్పుకోలేక పోయాండు. గురువుగారు “కత్తేస్తావా? బద్దేస్తావా?” అంటూ గండ్రగొడ్డలి చూపిస్తూ ప్రాణగొడ్డంగా భయపెట్టడానికి వుపక్రమించారు. చూపిస్తే చూపించారుగాక? ఆయన పెద్దలు అని వెనుకదీస్తే కులధర్మానికే లోటు రావలసివచ్చింది. యెట్లో బతిమాలు కుందామంటే బతిమాలినకొద్దీ బిల్దబిగిసి కయ్యానికి కాలు ద్రవ్వడం జరిగింది. దానిమీంద కొంచెం బెడిదంగా జవాబుచెప్పి చూచాండు. ఆ బాపతు పద్యం వకటి వుదాహరిస్తాను.

క. క్షత్రియులం దొల్లి యలుకకుం
బాత్రముచేసితటే? నాcడుబలియుండు గంగా
పుత్రుండు పుట్టమిం గా కిది
యీ త్రయినింకేల? చెల్లు నెఱుంగవె? నన్నున్.

యిలా కొంచెం బెడిదంగా మాట్లాడింది సర్వసన్నద్ధుఁడై వచ్చిన తరవాతనే. అంతకుముందు యింతకంటె కొంత మృదువుగానే మాట్లాడి చూచాండు.

“ಇట్టి కృత్యం బాచరించుటకంటె నీచేత నెట్లయినను లెస్స"

అన్నాండు. అని వూరుకోలేదు; అక్రమంగా, అధర్మంగా, అనవసరంగా నన్నుమీరు యుద్ధానికాహ్వానిస్తూవున్నారు. యిందులో నేను మిమ్మల్ని వోడించవలసివస్తుందని సంశ యిస్తానేమో అని మీ అభిప్రాయమేమో? అట్టి సంశయంతో నాకు లేశమున్నూ అవసరం లేదు. అయొచ్చేది పయెుచ్చేదీ ఆలోచించకపోవడమే కాకుండా ధర్మాధర్మ విచక్షణకూడా చేయకుండా నన్ను మీరు ఆహ్వానిస్తున్నారు. అని యీ క్రింది మాటలు పలికినాఁడు.

తే.గీ. "గర్వియై కార్యమిట్టి దకార్య మిట్టి
దని యెఱుంగక లోకంబు చనుపథమునం
దిరుగ కున్మదవృత్తి వర్తించునట్టి
వాని గురునైన దండింపవలయు నండ్రు"

పయికిట్లు చెప్పడమైతే చెప్పినాండు విధిలేక కాని భీష్మునికి సుతరామున్నూ గురునితో యుద్ధం చేయడం యిష్టంలేదు. లేకపోతే మాత్రం తప్పుతుందా? గురువుగారు మూర్ధప్పట్టు పట్టి కూర్చున్నప్పడు. సరే యేలా గయితే యేమీ “అంగీకృతా గ్లానిర్నదోషాయ" అనుకొని యుద్ధరంగంలోకి ప్రవేశించాcడు. చాలా రోజులు యుద్ధం జరిగింది. తుట్టతుదకు మోహనాస్త్ర ప్రయోగంతో శిష్యుండు గురువుగారిని విజితుణ్ణి చేయడానికి సిద్ధపడుతూ వుండంగా నారదాది మహాఋషులు- “ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః" చెప్పి గురువుకు చెప్పేమాటలు గురువుకూ, శిష్యుండికి చెప్పేమాటలు శిష్యుండికి చెప్పి యెట్లాగయితే యేమి రాజీచేశారు. ఈ యుద్ధానికి కారణ భూతురాలైన అంబనే శిఖండిపదంతోటి ఇటీవల భారతంలో వాడింది. ఈలాటి అకార్యాన్ని పురికొల్పిందని కాంబోలు ఈశిఖండి పదం లోకంలో తిట్టుగాకూడా యిటీవల మాటింది. "గండా మొండి శిఖండి బండలకు లెక్కల్లేని నాల్కల్గదా!" లోనైన వాటివల్ల పైసంగతి తేలుతుంది. వూరికే అంబను దూషిస్తారుగాని నిజానికి లోపమంతా పరశురాములదే. అయితేనేమిగాక! పరశురాముండు నిజమైన శూరాగ్రేసరుండవడంచేత శిష్యుండి ప్రజ్ఞకు సంతోషించాండు, కౌగిలించుకున్నాడు ఆశీర్వదించాడు కూడాను. భీష్ముండు తనకు జయం కలుగుతూ వున్నప్పటికీ యీ జయం జయంకింద చూచుకోకూడదని యొఱింగినవాండవడంచేత నారదుండున్నూ తనతల్లి గంగాదేవిన్నీ చెప్పిననీతికి ప్రతిచెప్పక అంగీకరించి పరశురాముండిదగ్గరకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాండు, క్షమాపణ చెప్పాండు. జయలక్ష్మీ శోభితుండై కూడా వినయ వినమితుండైన శిష్యుణ్ణి యెంతగౌరవించాలో అంతా గౌరవించి పరశురాముండు ఆదరించాండు. పరశురామునితో గంగ చెప్పే వుపశమనవాక్యాలలో కొంచెం తన కొడుకు ప్రవర్తనకు అనుకూలంగానే స్ఫురించేటట్టు మాట్లాడింది. ఆమాటలు వుదాహరిస్తాను.

"నీ శిష్యుండు దేవవ్రతుండు, వానియెడ నలుగందగునే? వాండు తగవు మాలినపనిఁ జేయంజాలక పెనంగె, నింతియుకాని విరోధిగాండు."

పైమాటలవల్ల లోపమంతా గురువుగారియందే వుందని గంగ తేల్చినట్లయింది. అయినప్పటికీ యథార్థం వప్పుకోవడం సజ్జనలక్షణమున్నూ, శూరలక్షణమున్నూ కనక పరశురాములు ప్రతి చెప్పక చట్టన శిష్యుణ్ణి ఆదరించి బుజ్జగించాడు. గురువుగారి ఆజ్ఞను శిరసావహించి భీష్మండు యుద్ధానికి సిద్ధపడ్డాండు గనుక ఆయి చరిత్ర లోకంచేత యింతగా మన్నించంబడుతూవుంది, కాని భీష్ముండు యుద్ధానికి వెనుతీయడమే జరిగితే ఆ యీచరిత్రకు లేశమున్నూ గౌరవమే లేకపోయేది. యితరులమాటెందుకు? పరశురాములుకూడా "అయ్యో! యేలాటి పిటికిపంద నాకు శిష్యుండైనాఁడని తనలో తాను సిగ్గుపడేవాఁడు. శూరత్వప్రసక్తి వచ్చినప్పుడు గురుశిష్యులేకాదు, పితాపుత్రులే కాదు తమ తమ ప్రజ్ఞావిశేషానికి ప్రాధాన్యం యివ్వవలసిందే. కాని బంధుత్వానికి ప్రాధాన్యం యివ్వడానికి అవకాశం లేదని లోకానికి యీ చరిత్రేకాదు, అర్జున బభ్రువాహనుల చరిత్రకూడా చెపుతూవుంది. బభ్రువాహనుండు యెంతో వినయంగా దర్శనానికి వచ్చి నమస్కరిస్తే అర్జునుండేలాటి జవాబు చెప్పినాండోచూడండి

ఉ. నాకొమరుండ వంచు నెటునమ్మదు? నశ్వముc గట్టిపెట్టితో
వీంక నెదిర్చితో? యిదియు విందగునే నరపాలసూతికీ
రాక గనుంగొనంగ నిను రాకొమరుండ వటన్నమాటకే
లోకము విశ్వసింపదెటులో? యింకనాకొమరుండ వన్నచో.

శూరునకు శూరుండుకాని కొడుకునం దెలా గౌరవం వుండదో వీరునకు వీరుండుకాని శిష్యునియందున్నూ ఆలాగే గౌరవం వుండదని చెప్పనక్కరలేదు. వేయిమంది అగస్త్యభ్రాతలకు గురు వనిపించుకోవడంకన్న భీష్మునివంటి వొక్కనికి గురువనిపించు కోవడమే గురువుకు సంతోషదాయకము. అట్టి గురుత్వానికే అందఱూ ఆశించతగ్గది. మురారి మహాకవి యేమన్నాడు?

"స్థానే స్వశిష్యనివ హై ర్వినియుజ్యమానా విద్యాగురుం హి గుణవత్తర మాతనోతి"

అన్నాడు. యొక్కువ అదృష్టవంతులైన గురువులకుఁగాని వారిని మించిన శిష్యులున్నూ, కొడుకులున్నూ వుండితీరవలసిందిగా కవులనాదిగా అభిప్రాయపడుతూన్నట్లు యెన్నో చరిత్రలు సాక్ష్యమిస్తాయి. నిజంగా అట్టి శిష్యులూ, కొడుకులూ వున్నారో లేదోగాని వున్నట్లు కవులు వ్రాస్తూ వున్నారు. ఆలా వ్రాస్తేనేకాని కవులకు సంతుష్టి వున్నట్లు తోcచదు. "పార్థ ఏవ ధనుర్ధరః" అనిపించుకొన్న అర్జునుణ్ణి కొడుకు బభ్రువాహనుండు వోడించిన సందర్భానికి గంగా శాపం కారణంగా వుంది. కనక అంతగణనీయం కాకపోయినా శ్రీరాముణ్ణి పసికుల్దలు కుశలవులు వోడించినట్టు కవులు చిత్రించారే! యిది విశ్వసనీయమేనా? అట్టి కవులమీంద శ్రీరామునికి కోపం రావడానికి మాఱు అనుగ్రహమే వున్నట్లు తోస్తుంది. ఎందుచేత? ఇట్టి కల్పనాచమత్కృతిగల కవులే లేకపోతే శ్రీరాముండు అదృష్టవంతులలో అగ్రేసరుండు కాకపోవలసివస్తుంది. తన కొడుకులు తన పేరు ప్రతిష్టలమీందనే ఆధారపడడానికి కవుల కెవ్వరికీ యిష్టం లేనట్టు కనపడుతుంది. అందులో పిల్లల మట్టికవి యీ విషయంలో వ్రాసినపద్యం మతీ అద్భుతంగా వుంటుంది. యిదివఱలో వకటి రెండుసార్లు వుదాహరించినదే అయినా ఆ పద్యాన్ని మళ్లా వుదాహరిస్తాను.

క. అనిచదివి లవుండు రాఘవ
మనుజేంద్రుని తల్లి వీరమాతంట సీతా
జనని కుశలవుల నిరువురC
గనియు నకట! గొడ్డువోయెం గడపట ననుచున్.

ఇక్కడ సర్వాత్మనా. గ్రంథకర్తతాత్పర్యం రాముణ్ణి అధఃకరించడం కాదు. రాముణ్ణి సర్వోత్కృష్ణుణ్ణి చేయడమే “పుత్రాదిచ్ఛేత్పరాజయం" అన్నసూక్తికి వుదాహరణం కాని శూరుండుగాని, పండితుండుగాని అంతగా గణనీయుండు కాడనియ్యేవే ఆయా కవుల తాత్పర్యం. గురు శిష్యుల విషయంకూడా యీలాగే చూచుకోవలసి వుంటుందని మురారి మహాకవి ప్రవృత్తివల్ల గోచరిస్తుంది. పరశురాముండుకూడా భీష్ముని విషయంలో యీ అంబా ప్రసక్తిదాంకా మంచి హృదయంతోటే వుండేవాండు. ఆసందర్భం యీ పద్యం చెపుతుంది.

మ. విలువిద్దెం బలుమంది కిచ్చితిని మీ పృథ్వీశులందేమి పా
అులయందేమి నినున్ బలెన్మదికి నేరున్ మోదమున్ గూర్చరీ
యిలనిన్నున్ బలెం గీర్తికిన్ దెరువులై యేపారం బో రొక్కరున్
గలిగెన్నాకు భవద్వశంబున యశఃకల్యాణ లీలాగతుల్."

యేదో హేతువు కలిగేదాంకా హృదయం యెవ్వరికీ మంచిగానే వుంటుంది. హేతువు కలిగినప్పడుకూడా హృదయం చెడకుండా వుంటేనే అది కవివర్ణ్యం అవుతుంది. హేతువు కలిగినపుడేనా పరశురాముఁడు యుద్ధానికి రమ్మన్నాండు కాని అంతకంటె అనుచితమైన సంభాషణ లేశమున్నూ చేయలేదు. ముఖ్యంగా యీ అంశం మనం గమనించాలి. యుద్ధంలోనేనా పరశురాముఁడు సుఖసుఖాల వోడేవాఁడు కాండు. కాని బొత్తిగ తనకు తెలియని మోహనాస్త్రం వకటి శిష్యుండికి తెలియటంచేత వోడిపోవలసి వచ్చింది. బహుశః అది యిప్పటి విషవాయు ప్రయోగం వంటి దనుకుంటాను. అప్పుడు మాంత్రికాలన్నీ నేcడు తాంత్రికాలుగా మాటి మన కాయా పురాణ వాక్యాలయందు విశ్వాసాన్ని కల్పిస్తూవున్నాయి. ఇటువంటివే లేకపోతే ఇప్పటివారిలో అనేకులు పురాణాలన్నీ పుక్కిటిగాథలే అనటానికి సందేహం వుండదు. పురాణాలలో కొన్ని అర్థవాదాలు లేకపోలేదు. గాని అన్నీమాత్రం అర్థవాదాలుకావు. అర్థవాదమంటే దేన్నోబల పఱచడానికి యేదోవకకథ కల్పించి చెప్పడం. సత్యాన్ని బలపఱచడానికి వూరికే “సత్యం వద"అని బోధించడంకంటె, హరిశ్చంద్రోపాఖ్యానంద్వారాగా బోధిస్తే బాగా వంటపడుతుందికదా! ప్రతివిషయంలో నున్నూ యిట్టివున్నాయి. సంగీతంలో యేదో వకరాగానికి స్వరాలు “రిగపధసా” అని వున్నాయనుకోండి. ఆ అక్షరాలు అయిదున్నూ వుపదేశించి వూరుకుంటే శిష్యుండికి బాగా తెలియదు. దాన్ని వక వర్ణంద్వారాగానున్నూ, కృతిద్వారాగానున్నూ బలపరిస్తే ఆరాగం బాగా శిష్యుండికి వంటపడుతుంది. యీ అర్థవాదాల మతంలో కథలన్నీ కల్పనకిందకే వస్తాయి. ప్రస్తుతం మనం యేకథను గూర్చి ముచ్చటించుకున్నామో ఆ కథానాయకుండు భీష్ముండుగాని ఆయన గురువుపరశురాముండుకాని మరికొన్ని పాత్రలు యీకథకు సంబంధించిన యితరాలుగాని లేనేలేవనుకోవాలి. అట్టే చెప్పేదేమిటి? “గజంమిథ్య పలాయనంమిథ్య"గా వుంటుంది. గురువును మించిన శిష్యులుంటారనిన్నీ బొత్తిగా గురువు ధర్మేతరంగా తొక్కుకు వస్తూవుంటే ధర్మబద్ధమైన యుద్ధానికి శిష్యుండు అంగీకరించ వచ్చుననిన్ని దీనివల్ల తెలుసుకోవలసి వుంటుంది. చాలాకథలు యీలాటి అర్థవాదాలుగా పుట్టినట్టే మనలో విజ్ఞలు అభిప్రాయపడతారు; భారతంలోకూడా కొన్ని కథలు అర్థవాదాలు అంటే కేవల కల్పితాలు లేకపోలేదు. గాని ప్రధానకథకు సంబంధించిన భీష్మాదిపాత్రలు మాత్రం యీ తెగలోకి చేరేవికావు. పరశురామ భీష్ములకు సంబంధించిన చరిత్రను గూర్చి లోకంలో యింకోవిశేషం కనపడుతుంది. యెక్కడోతప్ప బాహుపరాక్రమంచేత క్షత్రియులను వోడించిన బ్రాహ్మణులు లేకపోవడంచేత కొందఱు క్షత్రియులకు ఆ కథాభాగం పురాణం జరుగుతూ వున్నప్పడు వినడం చాలా కష్టంగా వుంటుంది. అట్టి సమయంలో గంభీరహృదయులు కొందఱు యేలాగో పైకి తేలకుండా కాలక్షేపం చేస్తారుగాని కొందఱుమాత్రం త్వరగా కానివ్వండి అంటూ పౌరాణికులను తొందరపెట్టడం ద్వారాగా తమ అసూయను ప్రకటించడంకలదు. భీష్ముండు పరశురాముణ్ణి వోడించే ఘట్టంలో యూలాటి తొందర వారు కనపఱచరనిన్నీ వింటాను. దీన్నిబట్టి అనాదిగా జాత్యభిమానం మనదేశంలో కనబడుతుందని విస్పష్టం. యీ మాదిరిదే అని చెప్పఁజాలంగాని యేదోమాదిరి జాత్యభిమానం ఖండాంతరాలలోనున్నూ కనపడుతూనే వుంటుంది. ఆయా విషయం యీ మధ్య ఎడ్వర్డు చక్రవర్తిగారి వివాహంలో అందఱికీ విస్పష్టం అయిందే. కాCబట్టి విస్తరించనక్కఱలేదనుకుంటాను. నిన్న మొన్నటినుంచి యీ జాతిబాధ కవిత్వానిక్కూడా కనపడుతూవుంది. సంబంధబాంధవ్యాలకు జాతిభేదం పాటింపని సంఘాల క్కూడా తక్కిన విషయాలకు యిది బంధిస్తూనే వుంటుందని ఖండాంతరాలవారి ప్రవర్తనవల్ల తేటతెల్లమవుతూ వుండడంచేత బాగా ఆలోచిస్తే మనహిందువుల యేర్పాటే బాగుందేమో? అనిపిస్తుంది. యిది విషయాంతరం. మనకు ప్రస్తుతం భీష్ముని చరిత్ర. యింత జ్ఞాని, యింత శూరుండు, యింత ధర్మాత్ముండు, రాజులలోనే కాదు యితరులలో కూడా లేడంటే వప్పనివారుండరు. యీతని పరమపదారోహణంకూడా మిక్కిలి వర్ణనీయంగా వుంటుంది. ఆ సందర్భం అశ్వమేధంలో కొంత విస్తరించి వుంది. ధర్మరాజుకు ధర్మబోధ చేయడానికి శ్రీకృష్ణభగవానులుయీయన్ని నియమించడంవల్ల బాగా ఆలోచిస్తే శ్రీకృష్ణ భగవానునికి తెలియని ధర్మ సూక్ష్మాలు యీయనకు తెలుసునని మనం నిశ్చయించు కోవచ్చును. అట్టి ధర్మజ్ఞCడు కనుకనే శ్రీకృష్ణునికన్న మిక్కిలి వృద్ధయియుండిన్నీ కృష్ణుండు భగవదవతారమని యెఱిఁగినవాcడవడంచేత మోక్షార్ధియైన భీష్ముండు శ్రీకృష్ణభగవానుడ్లే శరణ్యునిగా స్తుతిస్తూ వచ్చాడు. ధనుర్ధరుండై శ్రీకృష్ణుణ్ణి బాణాలతో చాలా నొప్పించినప్పటికీ భక్తిని కనపఱుస్తూనే వుండేవాఁడు. యుద్ధధర్మ సర్వస్వవేది కావడంచేత కృష్ణుణ్ణి బాణాలచే నొప్పించియున్నాండు. గాని లేకపోతే అట్టిపనికికూడా అంగీకరించేవాcడు కాండు. ఆయీ అపరాధానికి తుట్టతుదను క్షమాపణ చెప్పినట్టు మూ పాండవాశ్వమేధంలో వ్రాసి వున్నాము. ఆ పద్యం వుదహరించి యీ వ్యాసాన్ని ముగిస్తాను.

చ. మృదువగు వెన్నవంటిది శరీరము నీయది యెపు కష్టమ
న్నది సయిపంగనేరదు పదారు సహస్రములిందుకై సదా
మరి జపియింత్రుగోపికలు మాధవ! నిష్కరుణుండనైననా
ప్రదరము లిందునాటి యపరాధ మొనర్చె ననుగ్రహింపవే.

శ్రీకృష్ణునియందు భీష్మునికివున్న భక్తిపారవశ్య మెట్టిదో తెలుసు కోవాలంటే పోతరాజుగారి భాగవతపద్యాలవల్లనే తెలుసుకోవాలి. తిక్కన్నగారి భారతంలో వక పద్యం కాcబోలును- -

ఆ.వె. “బలము నీవ నాకు భక్తుండ నీయెడ నాలు బిడ్డ లేనియట్టివాండ"

అనేది యున్నది. పోతరాజుగారు చాలా పద్యాలు వ్రాసి భీష్మపాత్రలో తాను ఏకీభవించిన తన్మయత్వాన్ని ప్రకటించియున్నారు- "తెరలిచనుదెంచు దేవుండు దిక్కునాకు” అనే పద్యం వగయిరాలు పలువురు భక్తులకు కంఠపాఠమే. కనక వుదాహరించ నక్కఱలేదు. ‘లోకుల రసనలె, యాకులుగా నుండునట్టి యవివో! కవితల్ అనే భాగ్యం పట్టిన కవులలో పోతరాజుగారు మొట్టమొదటివారు. యీయన భీష్ముని భక్తిని వర్ణించినట్లు తిక్కన్నగారు వర్ణించలేదు. పూర్వకవులతోపాటు పేరు తెచ్చుకోవాలంటే తరువాతవారికి వక వుపాయం కనబడుతుంది. యేమిటంటే? వారు విస్తరించని విషయా లేమేనావుంటే వాట్లని పెంచి వ్రాయడమే. ప్రస్తుతం భీష్ముని విషయమై పోతన్నగారు చేసినపని అదే. అయితే అసలు వాణియందు రసమంటూ వకటి వున్నప్పుడే యీ వుపాయం పనిచేస్తుందిగాని ෂඩ් ෂීඨ కవిత్వాలకు ఆయీ వుపాయాలు లేశమున్నూ పనిచేయవు. బాణుcడికి పూర్వమందున్న కవులకేమీ చిక్కులేదుగాని తరవాత బయలుదేణిన కవులకు

"బాడోచ్చిష్టం జగత్సర్వమ్” అనే చిక్కు వచ్చింది. ఇది సూల దృష్ణులమాట. యేదో మార్గాంతరాన్ని పురస్కరించుకొని శ్రీనాథాదులందఱూ పేరుతెచ్చుకొన్నారా, లేదా అంటే జవాబు లేదుకదా! పోతరాజుగారు బాణుcడికి తరవాతివారే అయినా రసవంతమైన వాణి వుండడంచేత పేరు వచ్చింది. ఈలాగే పలువురు పేరుపొంది వున్నారు. దీన్ని గూర్చి మటొకప్పుడు మాటాడుకుందాం. భీష్మణ్ణిగూర్చి యెవరు వ్రాసినప్పటికీ పోతరాజుగారు వ్రాసినట్లుండదన్నది ప్రస్తుతం. భీష్ముండు చేసిన ప్రతిపనిన్నీ శాస్త్రసమ్మతమే అయిన దన్నందుకు ఆయనకు తటస్థించిన వుత్తమలోకావాప్తి సాక్ష్యమిస్తూ వుంది. సూలదృష్టులేమో యితణ్ణి కృతఘ్నుడంటారు. అది సత్యదూరం. యితఁడు కృతాన్ని లేశమున్నూ మఱచింది లేదు, లేనేలేదు. శిష్యుణ్ణి కాదన్నాడా? లేదుకదా? దుర్యోధనుని తరఫునవుండి యుద్ధంచేస్తూ పాండవులకు తనగుటూ మటూ చెప్పడం యుక్తంకాదని సూలదృష్టులనడం కలదు. కాని సూక్ష్మదృష్ట్యా విచారిస్తే అదిన్నీ యుక్తంగా కనపడదంటాను. వుభయులున్నూ భీష్మునికి బాంధవ్యంలో వొక మాదిరివారే. ప్రవర్తనలో పాండవులు, ప్రేమించతగ్గవారవడంచేత భీష్మునికి పక్షపాతం చూపవలసి వచ్చింది. మొదటినుంచీ ఆ పక్షంలో వుండి తీరా యుద్ధ సమయానికి అక్కడనుంచి తప్పకొనేయెడల యింకోమాదిరి అపయశస్సు వస్తుందికదా? అందుచేత ఆ పక్షాన్నే వుండి యుద్ధం చేయవలసివచ్చింది. అయినా తన శక్తిని లేశమున్నూ దాఁచుకోలేదు. దుర్యోధనుcడికి యిచ్చిన వాగ్దానాలన్నీ నెఱవేర్చాండు. అదిన్నీకాక పదిరోజులు యేకాధ్వరంగా యుద్ధంచేశాఁడు శతవృద్దు. అప్పుడేనా శిఖండిబాధ లేకపోతే అర్జునుండికి సాధ్యంకాకపోవునేమో? యిది యిలా వుంచుదాం. కర్ణుణ్ణి అర్ధరథులలో చేర్చడం భీష్మండికి తీరని కళంకంగా చాలామంది భావిస్తారు. నిజానికి కర్ణుడు అర్జునునికన్న బాహుబలాదుల చేతఁగాని, జన్మచేతఁగాని తీసిపోయేవాఁడు కాండని భారతంలో పలుచోట్ల కనబడుతుంది. ఆ సందర్భం భీష్ముండు యెఱుంగని వాండున్నూ కాండు. కనుకనే నిష్కారణంగా అవమానించినట్లయింది. దీనికి తగినజవాబులేదు. భవితవ్యం యెఱిఁగి వుండడంచేత దుర్యోధనుణ్ణి అనుత్సాహపరిస్తే యుద్ధం ఆంగిపోతుందేమో? దానివల్ల జనక్షయంకావడం తప్పతుందని భీష్ముండలా ప్రవర్తించవలసి వచ్చిందనుకోవాలి. భీష్ముండు కర్ణుణ్ణి యిటీవల తాను శరతల్పగతుండైన ಹಿಮ್ಮಿಲು మాట్లాడే సందర్భంలో యెంతో గౌరవించినట్లున్నూ భారతంలోనే కనపడుతుంది. పైకి యితరులతోపాటుగా భీష్ముండున్నూ కర్ణుణ్ణి సూతపుత్రుండంటూ నిరసించినా అసలు రహస్యం యెటింగే వున్నాండు. యెఱింగిన్నీ ఆలా అపవదించడాన్ని సమర్థించవలసివస్తే సూతకులంలో చేరివుండడాన్ని పట్టి సమర్థించాలి. ప్రతీవారి చరిత్రానికిన్నీ యేవో నీహారలేశాలు వుండనే వుంటాయి. అవి ప్రాజ్ఞలంతగా గణించరు. మొత్తంలో యొక్కువగా సుగుణాలుండడమే కావలసింది. భారతవీరులలోనే కాదు యితరత్రకూడా యింత వుత్తమచరిత్ర కల మహనీయుండు మృగ్యండు. యీయనవల్ల నేర్చుకోదగిన విశేషాలు లోకాని కెన్నో వున్నాయి. యెంతవాండూ కాకపోతే యీయన్ని గూర్చి కర్మఠులు ప్రతివత్సరమున్నూ మాఘమాసంలో తర్పణాలు వగైరాలు తమతమ పితృదేవతలకు విడిచినట్లు విడవడం తటస్థించదు కదా! విస్తరించవలసి యున్నప్పటికీ సంగ్రహంగా వ్రాసి యిప్పటికి దీన్ని ముగిస్తున్నాను.

★ ★ ★