కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/జిల్లా శిరస్తాదారు

వికీసోర్స్ నుండి

     1000-0-00 పౌనులు (నవరసులు) సారా స్లిన్ సన్ కు
    10000-0-0 " " మెరైనుసొసైటీట్రస్టీలకు
    10000-0-0 " " సీమెన్సు ఆసుపత్రికి.

5000 పౌనులు తనసొదరికి దానిపైన అయివజును యిచ్చుటకు, ఇదిగాక తనకు సాలుకు 1200 పౌనులు ఆదాయము వచ్చేరొఖ్కం 40 వేల పౌనుల విలువగల పదిలక్షలఫ్రాంకులు ప్యారిసులో సత్రములు వున్నవనిన్నీ, ఈ సత్రములున్నూ చస్టరుఫీల్డు వీధిలొవున్న 10 వ నెంబరు యిల్లున్నూ అందులోవుండే సామానూలున్నూ గుఱ్ఱపుబండి ఇతర చరాస్తిన్ని మరణశాసనంలో చెప్పకుండా విడిచిన ఆస్తియావత్తున్నూ ఎలిజారస్సెల్ కన్యకు చెందచేస్తున్నాననిన్నీ, మరణశాననం ప్రకారం మిగిలినఆస్తి తన ఎగ్జిక్యూటర్లకు చెందవలననిన్నీ శాసించాడు. రంభలో వున్న స్నాడ్ గ్రాసు తాలూకు భవనం యిప్పుడు కళ్ళికొట రాజాగారి అధీనంలో వున్నది.


2. జిల్లా శిరస్తాదారు

ఇంగ్లీషువర్తక కంపెనీవా రీ దేశాన్ని పరిపాలించడం ప్రారంభించిన తరువాత చాలాకాలంవరకూ ప్రభుత్వశాఖలలో పెద్ద వుద్యోగాలెవీ దేశీయుల కెచ్చేవారు కారు. ఉద్యోగా లివ్వడంలో జాతి మత వర్ణవివక్షత చూపబడదని పార్లమెంటు వారు 1233 లో శాసించి నప్పటికీకూడా తెల్లవారు చెయ్యడానికి అంగీకరించని చిన్న జీతాల వుద్యోగాలను మాత్రమే మనవాళ్ల కిచ్చేవారు.

తాశీల్దారులు

అప్పట్లో రివిన్యూశాఖలో మనవాళ్లు చేసే పెద్ద ఉద్యోగం తాశీల్దారీ, అప్పటికి చదువుకున్నవాళ్లు బ్రాహ్మలే గనుక చాలామంది తాసిల్దారులు బ్రాహ్మణులే. ఈ తాశెల్దారులకు ఆ కాలంలో రివిన్యూ వసూలుతో పాటు నేరాలు విచారించే పోలీసు అధికారం కూడా వుండేది. అయితే వీళ్ల జీతం చాలా స్వల్పంగా వుండేది. ఇంగ్లాండులో ఒక బిళ్లబంట్రోతు కిచ్చే జీతమైనా లేదు. కలెక్టరుకు వీళ్లపైన సర్వాధికారాలు వుండెవి. చీటికీ మాటికీ వీళ్లని బదిలీచెయ్యడమూ, జుల్మానా వెయ్యడమూ, పనిలోనుండి తగ్గించడమూ, తీసివేయడమూ జరుగుతూ వుండేది. తెల్లవారిలో చాలా మందికి నల్లవాళ్లని చూస్తేనే అసహ్యం. తాశిల్ధారులను ఇలాగ అగౌరవంగా చూస్తూ వున్నందువల్ల ప్రజలకు వాళ్లమీద గౌరవం పోయి కొండెములు చెప్పడం ఎక్కువ అయింది. కలెక్టరులు ఆమాటలు విని తాశీల్దారులను కఠినంగా శిక్షిస్తూ వుండేవారు. తమ ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనె భయముతో వుంటూ జీతాలు చాలక, ఉద్యోగం వున్న నాలుగురోజులలో నాల్గుడబ్బులు సంపాదించుకుందామని కొందరు తాశిల్దారులు లంచాలు పుచ్చుకోనేవారు. తాశిల్దారు లందరూ లంచగొండులే ననే అభిప్రాయంతో కలెక్టర్లు అందరినీ కఠినంగా చూడడము ప్రారంబించారు.

ప్రతి తాశిల్దారు సత్ప్రవర్తనకు పూచీగా రెండువేల రూపాయలకు హామీ యివ్వాలని నిర్ణయించారు. తాశిల్దారులు తమకు ఆస్తి వున్న వూళ్ళలో వుద్యోగాలు చెయ్యకూడదన్నారు. అంతేగాని వాళ్ళ జీతాలను వృద్ధిపరచలేదు. వాళ్లగౌరవాన్ని కాపాడేటట్లు ప్రవర్తించనూలేదు. ఈస్థితిని కొంత చక్కపరచదలచి చెన్నపట్నం ప్రభుత్వం వారు 1235 లో తాశిల్దారులను చీటికీ మాటికీ శిక్షించి ప్రజల దృష్టిలో వాళ్ళ గౌరవానికి భంగం కలిగించవద్దనిన్నీ,వాళ్ళకు వుద్యోగాలు స్థిరములనే నమ్మకం కలిగించాలనిన్నీ కలెక్టర్లకు తాకీదులు జారీ చేశారు. ఈ సలహలిచ్చి పాతికేళ్లు దాటినా కలెక్టర్లు పూర్వంలాగానే నిరంకుశంగా ప్రఫర్తిస్తూ వచ్చారు. తాశీల్దారుల జీతాలు వృద్ధికాలేదు. విశాఖపట్నంలో 1856 ఆ ప్రాంతములలో ఇద్దరు తాశిల్దరులు తమకు నెల 1కి 10 నవరసులు జీతం యివ్వవలసిందని అర్జీపెట్టుకుంటే అప్పుడు జిల్లాకలెక్టరులపైన అధికారిగా వుండే ఉత్తర సర్కారుల కమిషనరు వాళ్ళకు నెల 1కి 8 సవరసులు జీతం చాలునని వుత్తర్వుచేశారు.

శిరస్తాదారులు

కలెక్టరు కచేరీలలో శిరస్తాదారులుగాను, శిరస్తా మదద్గారు, లేక డిప్యూటీశిరస్తాదార్లుగాను పనిచేసే దేశీయుల స్థితికూడా ఇలాగే వుండేది. నిజానికి ఈ శిరస్తాదారువుద్యోగం దేశీయులుపొందే హోదాలలోకెల్లా గౌరవకరమైనదీ, కొంచెం ఎక్కువజీతం కలట్టిదీ. అయినా 1845 కి పూర్వం పదేళ్ళలో ఉత్తరసర్కారులలో ప్రతిజిల్లాలోనూ కూడా శిరస్తాదారు లందరినీ ఏదో కారణముమీద పనిలోనుంచి తొలగించారు.

1842 లో విశాఖపట్నం జిల్లాకలెక్టరుగానూ, చెన్నపట్నం గవర్నరు ఏజంటుగానూ వుండిన పి.బి.స్మాలట్టుగారు (P.B.Smollet ) 1858 లో 'Madras and its civil administration' అనే పుస్తకంలో యీపరిస్థితుల నన్నింటినీ వర్ణిస్తూ ఆ జిల్లాలో తనకు పూర్వం పనిచేసిన కలక్టరు పోయి తాను వచ్చే లోపుగా తాత్కాలికంగా పనిచేసిన కలెక్టరుకింది సీనియరు అసిస్టెంటుదొర అక్కడి శిరస్తాదారుణ్ణీ, సగంమంది దేశీయోద్యోగులనూ పనిలోనుంచి తీసివేసిన సంగతిని వ్రాశారు.

కంభం నరసింగరావు గారు

ఈయన 1544-52 మధ్య రాజమహేంద్రవరంజిల్లా కలెక్టరు కచేరీలో శిరస్తాదారుగా వుండేవాడు. అప్పట్లో గోదావరిజిల్లాను రాజమహేంద్రవరంజిల్లా అనేవారు. ఆ కాలంలో చెన్నరాజధానిలో హెడ్డుశిరస్తాదారు అంటే కలెక్టరు దొరగారి దివాను అన్నమాట. రివిన్యూసిస్తువసూలు విషయాలలో అతడే కలెక్టరుకు ముఖ్య సలహాదారు. కలెక్టరు కచేరీలోనుంచి జారీఅయ్యే తాఖీదు లన్నింటిపైనా ఆయన చేవ్రాలు వుండాలి అతణ్ణి 'నేటివుకలెక్టరు ' అనేవారు.

నరసింగరావుగారు ఇంగ్లీషువర్తకకంపెనీ సర్కారు కొలువులో 27 సంవత్సరాలు పనిచేసి రెవిన్యూశాఖలో పెద్ద ఉద్యోగాలు చేసిన అనుభవజ్ఞుడు రాజమహేంద్రవరం జిల్లాపరిపాలన బాగా లేకపోవడం వల్ల అక్కడ పని చెయ్యడానికి ప్రత్యేకంగా ఇతణ్ణి ఏరి కోరి నియమించారు. ఈయనపై యధికారి రాజమహేంద్రవరం కలెక్టరు, మొదటి ఏడేళ్లవరకూ ఇతనిని ప్రశంసిస్తూ పైవారికి వ్రాసేవాడు. ఇదివరకు వ్యవహారాలు సరిగా జరగనందువల్ల అధోగతిలో వున్న ఈ జిల్లా రివెన్యూ వసూలు నరసింగరావుగారు అమలులో పెట్టిన మంచి పద్దతులవల్ల ఈ జిల్లా ఆదాయం అభివృద్ధి జెందిందని (డి.సి. డభ్లియు) ఇంజనీరింగుశాఖవారు అంటారుగాని ఈ జిల్లాను గురించి స్వయంగా ఎరిగున్నవా రీమాటను నమ్మరనిన్నీ అక్కడ స్థానికులుగా వున్న ఇంజనీర్లు కూడా ఇప్పుడు ఈ చిలక పలుకులు పలకడానికి సాహసింపరనిన్నీ స్మాలెట్టు గారు వ్రాశారు.

పిఠాపురం జమీందారీ

పిఠాపురం జమీందారు శ్రీరాజారావు వేంకట కుమార మహీపతి గంగాధరరామారావు బహద్దరుగారి తండ్రిగారైన శ్రీరాజారావు సూర్యారావుగారు సాధారణ నామ సంవత్సర కార్తీక బ (27-11-1850) తేదీన చనిపోయారు. ఆయన కొమాళ్లు చిన్నవాళ్లైనందువల్ల వాళ్లను దొరతనంవారి సంరక్షణకింద 'వార్డులు ' గా వుంచారు. సూర్యారావుగారు చనిపోయిన సంగతి తెలియగానే అప్పటి రాజమహేంద్రవర కలెక్తరున్నూ, ఆయన హెడ్డు శిరస్తాదరున్నూ జమీందారు గారి ఆస్థిని వశపరచుకోడానికి తక్షణమూ పిఠాపురం వెళ్లారు. జమీందారుగారి ముఖ్యబంధువు లెవ్వరూ దీనికి యిష్టపడక కొంత సాత్విక నిరోధం చేసారు.

ఈ పిఠాపురం జమీందారీ చాలా ముఖ్యమైన జమీందారీ. చనిపోయిన రాజాగారి చిన్నతనంలో 12, లేక 14 సంవత్సరాలు కంపెనీ సర్కారు వారి సంరక్షణలో "వార్డు ' గా వున్నారు. జమీందారీని సర్కారువారు చక్కగా వ్యవహరించి నిల్వతో ఆయనకు వప్పచెప్పడానికి బదులుగా జమీని దు:స్థితిలోకి తెచ్చి అప్పుతో వప్పగించి నందువల్ల జమీందారుగారు తమ జమీందారీని నిలబెట్టు కొనడానికి సగం జమీందారీని గవర్నమెంటుకు యిచ్చివేయవలసివచ్చింది. 1844 మొదలు 1850 వరకూ సూర్యారావుగారి పరిపాలనలో జమీందారీ మళ్లీ బాగుపడి కొంత నిల్వలోవుంది. మళ్లీ సర్కారువారి అజమాయిషీ రాగానే వ్యవహారాలు పాడవడం ప్రారంభమైంది. 1853 లో ప్రకటించిన లెక్కలనుబట్తి నిలవ లేకపోగా ఆ సాలు తాలూకు శిస్తులో 65000 రూపాయలు బకాయి కనబడింది. దానికి కలెక్టరు జమాఖర్చు చెప్పలేదు. కలెక్టరుగారి ఆజమాయిషీని గవర్నమెంటువారు పరిశీలించడంలో దీనిని గురించి ఏమీ సెలివివ్వలేదు.

దిగవల్లి తిమ్మరాజు గారు

పైన చెప్పినట్లు జమీందారుగారి ఆస్థిని స్వాధీనపరుచుకొనడానికి వెళ్లినప్పుడు జమీందారుగారి తాలూకు విలువగల చరాస్తిలో చాలా కొద్దిభాగం మాత్రమే ఆయన రాజబంధువులు కలెక్టరుగారిని వశపరచగా కోటను సోదా చెయ్యడానికి వారంటు జారీ చెయ్యవలసినదని హెడ్డుశిరస్దారుగారు సలహా యిచ్చారు. కాని కలెక్టరు ఆ సలహా ప్రకారం జరుపలేదు. ఆఖరికి ఒక నెల జరిగిన తరువాత యాభై వేల రూపాయ్హల విలువగల చరాస్తి కలెక్టరుగారికి వశమైంది. అప్పుడు ఈ జమీందారీ వ్యవహరాలను చక్కబెట్టడానికి నెలకు 250 రూపాయల జీతంపైన శ్రీ దిగవల్లి తిమ్మరాజు పంతులుగారిని (కోర్టు ఆఫ్ వార్డ్సు) మేనేజరుగా నియమించారు. పిఠాపురం జమీందారీ శిస్తులు వసూలు చెయ్యడానికి - కచేరీలో పనికోసం నిరీక్షిస్తూ వాలంటీరుగా వుమ్మేదువారు చేసే ఆయనను ఒకరిని తాశిల్దారుగా నియమించారు.

ఈ తిమ్మరాజుగారు చాలా అనుభవజ్ఞడైన వుద్యోగి. ఆయన కృష్ణాజిల్లాలో కొయ్యూరునుంచి1807 లో ఏలూరు వచ్చి ఇంగ్లీషు చదువుకొని రాజమహేంద్రవరంవచ్చి అక్కడజిల్లాకోర్టులో పీటర్ రీడ్ కాజులెట్ గారి కాలంలో రికార్డుకీపరు మదద్గారీ, శిరస్తామదద్గారీ, శిరస్తా హెడ్ మదద్గారీ పనిన్నిచేసి, 1824 లో జిల్లాజడ్జీ చేసిన హెన్రీ వైబార్టు దొరగారి శిఫారసువల్ల కలక్టరు ఆఫీసులో ఇంగ్లీషు రికార్డుకీపరుపని, సాల్టురైటరీ, అమల్ దారి, నాయబు శిరస్తాదారి, ఆక్టింగు హెడ్ శిరస్తాదారి మొదలైన వుద్యోగాలు చేశారు. తరువాత సదరామీన్ పనికూడా చేసి పించను పుచ్చుకుని 1856 సం. ఫిబ్రేవరి 6 వ తేదీన స్వర్గస్థులైనారు. వీరు కాకినాడలో శ్రీభీమేశ్వరస్వామిని ప్రతిష్ఠించి 1828లో ఒకగొప్ప దేవాలయాన్ని కట్టించారు. 1862లో శ్రీగంగాధర రామారావుగారికి మైనారిటీ తీరి పిఠాపురం జమీందారు అయిన తరువాత తిమ్మరాజుగారి పెద్దకుమారుడైన వెంకట శివరావు గారిని మొదట శిరస్తాదారుగానూ, తరవాత 1872లో మేనేజరు గానూ, పిమ్మట దివాను గానూ నియమించారు. రాజాగారు 1890 లోనూ శివరావుగారు 1892లోనూ చనిపోయారు. వీరిని గురించి ఇప్పటికీ చాలాకధలు చెప్పుకుంటారు.

నరసింగరావుగారిమీద కేసు

పైన చెప్పినట్లు తిమ్మరాజుగారు మేనెజరుగా ప్రవేశించిన కొద్ది రోజులలో జమీందారీ వ్యవహారాలు తనిఖీ చేయగా ఎస్టేటు తాలూకు లెక్కపుస్తకాలలో చాలా పుస్తకాలు కనబడలేదు. దర్యాప్తును బట్టిన్నీ, సంగతి సందర్భాలను బట్టిన్నీ ఆలోచించగా ఆ లెక్కలవల్ల జమీందారీ తాలూకు ;యావత్తునగలూ, రొక్కమూ, చరాస్తిన్నీ కలెక్టరుగారికి స్వాధీనం కాకుండా ఇంకా చాలా మిగిలి పోయిన వనే సంగతి బయట పడుతుందనే భయంతో కొందరు కుట్రచేసి ఆస్తిని హరించి పుస్తకాలను గైరువిలియా చేయించారని తోచింది. ఈ కుట్రలో నరసింగరావు గారుకూడా భాగస్వాములై వున్నట్లు అనుమానం కలిగింది. ఈ సంగతిని మేనేజరుగారు కలెక్టరు గారికి తెలియజేశారు. అప్పటికి కొంతకాలంనుంచి కలెక్టరు గారికి నరసింగరావుగారి మీద మంచి అభిప్రాయం లేనందువల్ల ఈసంగతిని విన్నతక్షణమే కలెక్టరు గారు ఆయనను పనిలోనుంచి తగ్గించి సస్పెండు చేసి ఖైదులో పెట్టి ఆయనను గురించి స్వయంగ విచారణ చేయడం ప్రారంఃభించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకేమి కొదవ? నరసింగరావు గారంటే గిట్టనివాళ్ళందరూ ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పారు. కొత్తగా పిఠాపురం తాశిల్దారుగా ప్రవేశించిన ఆయన ఈ వ్యవహారంలో నరసింగరావుగారికి వ్యతిరేకంగా పనిచేశాడు. నరసింగరావుగారు పిఠాపురం జమీందారీని దగాచేసి అక్రమలాభం పొందే దురుద్దేశంతో కాగితాలు ఫోర్జరీ చేసినట్లున్నూ, లెక్కలను మాపుచేసి నట్లున్నూ, కలెక్టరుగారు నేరాలు మోపి సెషన్సు జడ్జీకోర్టులో విచారణ చేయడానికి ఇతనిని కమిటుచేశాడు. కలెక్టరే మేజెష్ట్రీటు అయివున్నందువల్ల తానే ఫిర్యాదీయున్నూ, నేరారోపకుడున్నూ, (ప్రాసిక్యూటరున్నూ, కమిటింగు మేజస్ట్రీటున్నూ) అయి నేరమునుగురించి చిన్న అక్షరాలతో కొన్ని తావుల వివరణపత్రికను వ్రాసాడు. జమీనుమీద విదుదల చెయ్యవలసిన దని ముద్దాయి కోరిననూ వదలక చెరసాలలోనే వుంచారు. అవమానం కంటె చావు మేలని ఆయన అన్నాడని, వదలిపెడితే ఆత్మహత్యచేసుకుంటాడనే నెపంతో జిల్లాలోకల్లా గొప్ప దేశీయోద్యోగిని ఇలాగ ఖైదులో పడవేసి వుంచారు.

కలెక్టరు రికార్డుల సోదా

ఈ ముద్దాయిపైన మోపిన నేరాలలో శిరస్తాదారుగారిదగ్గర వున్న లెక్కలను బట్టి కనబడే పిఠాపురం జమీందారుగారి చరాస్తి నగలు యావత్తూ స్వాధీనం కాలేదనే సంగతిని యీ శిరస్తాదారు కలెక్టరుగారికి తెలియపరచలే దనేది ఒకటి. తాను మరుగు పరిచినట్లు చెప్పే సంగతులన్నీ మూజువానీగానూ, లిఖిత మూలంగానూకూడా కలెక్టరుగారికి తెలియజేసానని శిరస్తాదారుగారు జిల్లా కోర్టు వారికి మనవి చేశారు. లిఖితమైన జాబితా యేదీ లేదని జిల్లాకలెక్టరుగారు మొదట అన్నారు. జిల్లాకోర్టువారి వుత్తర్వుప్రకారము కలెక్టరుగారి రికార్డులను సోదాచూడగా అలాంటి కాగితం ఒకటి దొరికింది. అంతట శిరస్తాదారు దానిని తనకు ఇచ్చివుండవచ్చునని కలెక్టరుగారు ఒప్పుకొన్నారు. ఈకాగితాన్ని కోర్టువారి కి పంపుతూ జమీందారుగారి ఆబరణాలను గురించి శిరస్తాదారుగారు తనకు తెలిసినా, లెక్కలన్నీ ఆయనదగ్గిర వున్నందువల్ల ప్రత్యక్షంగా కనబడుతూవున్న 67000 రూపాయల లోటుసంగతి తనకు చెప్పలేదనిన్నీ, శిరస్తాదారుగారి దుర్మార్గం వల్లనే ఈ సొమ్ము (ఫాజలు) అపహరించ బడిన దనిన్ని కలెక్టరుగారు వ్రాశారు.

ముద్దాయి విడుదల

కలెక్టరుగారు నరసింగరావుగారిని పనినుంచి తీసివేసిన తరువాత ఆయన స్థానంలో తాత్కాలికంగా తిమ్మరాజుగారినే శిరస్తాదారుగా నియమించారు. పైన చెప్పినట్లు జిల్లాకోర్టువారు కలెక్టరు కచ్చేరీరికార్డును సోదాచూసి లెక్కజాబితాను పట్టుకువెళ్లిన తరువాత పిఠాపురం ఎస్టేటుకు కలిగిన నష్టాన్ని గురించి కలెక్టరుగారు ఒక స్టేటుమెంటు (తబ్సీళ్లవారీ వివరణము)ను తయారుచేయించి ఈస్టేటుమెంటు ముద్దాయి (నరిసింగరావుగారి) నేరాన్ని స్పష్టముగా ఋజువు చేస్తుందని వ్రాస్తూ దానిని జిల్లాజడ్జిగారికి పంపించారు. నరసింగరావుగారి కేసు జిల్లాకోర్టులో పదహారునెలలు వాయిదాలు పడిపడి చివరకు విచారణ అయింది. కలెక్టరుగారు పంపించిన స్టేటుమెంటు అనేది మొదటినుంచి చివరదాకా అభూతకల్పనమని కోర్టువారికి నచ్చేటట్లు ముద్దాయి ఋజువు చెయ్యగలిగాడు. విచారణసందర్భంలో ఈకేసు దాఖలవడానికి మూలకారకుడైన పిఠాపురం అమలుదారు ఫిర్యాదును సమర్ధించడంకోసం అబద్ధపుసాక్ష్యం యిచ్చినట్లు జడ్జీగారికి తోచి అతనిని ఖైదులో పెట్టారు. అతని పనినికూడా తీసివేశారు. ముద్దాయి నరసింగరావుగారిని నిర్దోషి అని విడుదల చేశారు. పదహారు నెలలు ఖైదులో మగ్గిమనోవ్యధ అనుభవించి ఆయన బయటికి వచ్చాడు.

కలెక్టరుగారి పగ

ఒకమూల యీకేసు జరుగుతూవుందగానే కలెక్టరుగారు నరసింగరావుగారిని గురించి తనపై యధికారియైన ఉత్తర సర్కారుల కమిషనరుగారితో ఉత్తర ప్రత్యుత్త రాలు జరపడం ప్రారంభించారు. ఈశిరస్తాదారుయొక్క దుష్ప్రవర్తనవల్ల సర్కారు సంరక్షణలో వున్న మైనరు జమీందారుకు కొన్ని వేలసవరసుల నష్టం కలిగిందనిన్నీ, ఘోరమైన ఈ అన్యాయపుమోసమును గురించీ, అపహరణమును గురించీ తనకచ్చేరీ వుద్యోగులు తనకు తెలియనియ్యకుండా కుట్రచేశారనిన్నీ, తనఒక్కడికీ తప్ప రాజమహేంద్రవరం జిల్లాలో అందేదికీ తెలుసుననిన్నీ, కొత్తగా తనకు అనుచరులైన తిమ్మరాజు గారున్నూ, అమల్దారున్నూ తన నీచిక్కు లొనుంచి బయటికి తీసారనిన్నీ కమీషనరుగారికి తెలుపుతూ, ఈ క్రిమినలు కేసులో ఆముద్దాయికి శిక్షపడుతుందనే ధృఢనమ్మకంతోనూ తాను వ్రాసిన సందర్భాలలోనూ ఆముద్దాయి ఇదివరకు చేస్తూవుండిన నౌకరీలోనుంఛి అతనిని తొలగిండానికి తనకు అధికారం యివ్వవలసిందనిన్నీ, ఒకవేళ మమిషరుగారు ఇందుకు ఇష్టడనిచో, ఒకవేళ ముద్దాయిని కోర్టువారు నిర్దోషి అని వదలివేసినా, తనకూ ఆ శిరస్తాదారునూ యిక సహకారం గాని, సామరస్యంగాని వుండడం దుస్తరమనిన్నీ, అందువల్లనైనా అతనిని పనిలోనుండి తొలగించడానికి అంగీకరించవలసినదనిన్నీ, ఈ కలెక్టరుగారు గట్టిగా వ్రాసినందువల్ల అతనిని పనిలోనుండి తీసివేయడానికి కమిషనరుగారు అధికారం యిచ్చారు.

నరసింగరావు గారికి ఉద్వాసన

అంతట కలెక్టరుగారు యీవిధంగా ఒక తాఖీదు జారీచేశారు:

"కంభం నరసింగరావుకు---

నీప్రవర్తనను గురించిన విచారణ పూర్తిఅయ్యేవరకూ నిన్ను పనిలోనుండి సస్పండుచేసినట్లు ఇదివరకే నీకు తెలుపబడివున్నది. పిఠాపురం ఎస్టేటు ఆస్తిని కోర్టుఆఫ్ వార్డ్సువారికి వశపరచగలందులకు నిన్ని నియమించి పంపినంతలో నీ ప్రోత్సాహంవల్లను, దుష్ప్రవర్తన వల్లను ఆజమీందారీతాలూకు చాలా వస్తువులున్నూ సొమ్మున్నూ అపహరించబడినట్లు దరిమిలాను చేయబడిన దర్యాప్తువల్ల రుజువు అయినది. నీవు ఇతరమైన అక్రమచర్యలుకూడా చేసినావు. నీవు విశ్వాసపాత్రుడవు కానందువల్ల నీవిషయమై ఉత్తరసర్కారుల కమిషనరు గారికీ తెలియపరచగా నిన్ను తొలగించుటకు ఆయన అధికారం యిచ్చిన్మారు. నీవు సర్కారునవకరీకి తగవుగనుక నిన్ను సస్పెండు చేసిన తేదీలగాయతూ నీకు జీతము ఏమీ యివ్వబడరు." ఈ హెడ్డుశిరస్తాదారు యొక్క నేరాలతో సంబంధం లేక పోయినా ఆయన జరిగించిన మోసకృత్యాలను బయటికి తియ్యడంలో కలెక్టరుగారికి సహాయం చేయలేదనే నెపంమీద అతని క్రింది యుద్యోగియైన డెప్యూటీ శిరస్తాదా రునుకూడా పనిలోనుండి తీసివేశారు.

కలెక్టరు సంజాయిషీ

జిల్లాకోర్టువారు అతనిని నిర్దోషిఅని వదలగానే కంభం నరసింగరావుగారు తనపై వచ్చిన దస్తుఫాజలునేరమనేది అభూతకల్పన మనిన్నీ, తనను పనిలోనుండి తీసివేయడము అక్రమమనిన్నీ, పిఠాపురం జమీందరీ తాలూకు ఆస్తియేదిన్నీ బీరుపోలేదనిన్నీ, అలా పోయినట్లు చూపడానికి తయారుచేయబడిన లెక్కలు అబద్దములనిన్నీ ఉత్తర సర్కారుల కమిషనరుగారికి అర్జీద్వారా తెలియపరిచారు. ఇతడు వ్రాసిన సంగతులను కమిషనరుగారు కలెక్టరుకు పంపించి దానిని గురించి సంజాయిషీ యివ్వమని కోరారు. దానికి జవాబుగా 1843 సం. నవంబరు 2-వ తేదీన కలెక్టరుగారు ఒక ఉత్తరం వ్రాశారు. తిమ్మరాజుగారిని పిఠాపురం మేనేజరుగానూ, కలెక్టరు కచ్చేరీ శిరస్తాదారుగానూ నియమించిన సందర్భాలను గురించి ఆ జవాబులో మొట్టమొదట వివరించారు. ఈజిల్లాలో ఏర్పడిన క్లిష్టపరిస్థితి లో విశ్వాసపాత్రుడైన ఉద్యోగి ఒకడు తన ఖుద్దున వుండడం అవసరం గనుక ఈ తిమ్మరాజుగారిని ప్రత్యేకంగా ఏరి శిరస్తాదారుగా నియమించానని వ్రాశారు. నరసింగరావుగారిమీద మోపిన దస్తుఫాజలు నేరాలన్నీ నిరాధారా లనే సంగతిని కలెక్టరు గారు ఒప్పుకొన్నారు. నరసింగరావుగారి లెక్కలనుబట్టి పిఠాపురం జమీందారీ తాలూకు 67000 రూపాయలకు లెక్క తేల లేదనే విషయాన్ని గురించి అతి కష్టంమీద తిమ్మరాజుగరివల్ల సంజాయిషీ పుచ్చుకోగలిగాననిన్నీ, అయితే ఆ సంజాయిషీ చాలా అసంతృప్తికరంగావున్నదనిన్ని, అందువల్ల నిజంగా ఆసొమ్ము లోటుబడలేదని అంగీకరించినట్లే ఎంచవలసివుంటుందనిన్నివ్రాశారు. ఆలెక్కను తాను చూడనేలేదనిన్నీ, దానిని తయారుచేయడంలో తన కేమీ ప్రసక్తి లేదనిన్నీ, దానిని తయారు చేసినవారు కలెక్టరుగా రెన్నడూ విశ్వాసముంచని చిన్నవయస్సుగల ఇద్దరు గుమాస్తాలని తిమ్మరాజుగారు చెప్పినాడని కలెక్టరుగారు తమ వుత్తరంలో వ్రాస్తూ ఇంకా యీకింది సంగతులు కూడా వ్రాశారు.

"ఆలెక్క నాదగ్గరికి తెచ్చినప్పుడు మేజస్ట్రీటు కేసులో ఏదైనా పొరబాట్లు వస్తే చాలా చిక్కులు కలుగుతాయి గనుక నేను క్షమించను సుమా అని చెపుతూ ఆకాగితాన్నినేను శిరస్తాదారు శాఖలోకి పంపించాను. అందులో ఏదో అనుమానం తోచి దానిని మళ్లీ ఇంకోసారికూడా సరిచూడడానికి నేను పంపించినట్లుగా నాకు జ్ఞాపకం. అయితే ఆ సంగతిని నేను గట్టిగా చెప్పలేను .

"ఆలెక్కను జాగ్రత్తగా సరిచూసే విషయంలో నేను చేయగలిగినదంతా చేశానని అనుకున్నాను.

"తిమ్మరాజుగారే జవాబుదారు"

"దస్తులో 67000 రూపాయల లోటు కనబడుతూవుందని నేను సెషన్సు కోర్టుకు వ్రాసినప్పుడు పైన చెప్పిన విధంగా హెచ్చరించిన తరువాతకూడా పైయిద్దరు గుమాస్తాలున్నూనన్ను మోసంచేయడానికి సాహసిస్తారని నేను అనుకోలేదు. తిమ్మరాజుగారు తన ఉద్యోగాన్నిబట్టి చేయవలసినపని చేయకుండా ఇంత అజాగ్రత్త వహిస్తాడనిన్నీ నేను అనుకోలేదు. ఈ తప్పిదాన్ని మన్నించే విషయంలో నేనేమి చెప్పడానికి నాకు తోచడంలేదు. నేను ఎంతో విశ్వాసముంచిన మనిషి, పాతశిరస్తాదారును నష్టపరచడానికి ఒక దొంగ లెక్క తయారుచేసిన వాడనిగాని, తాను స్వయంగా పరిశీలించకుండానూ, లేదా తనక్రింది వుద్యోగులచేత జాగ్రత్తగా సరిచూపించకుండానూ ఆకాగితాన్ని తన కచ్చేరీలో నుంచి జారీచేశాడనిగాని ఇటువంటి అపవాదుకు గుఱిఅయ్యేటందుకు అవకాశం యివ్వడం నామనస్సుకు చాలాకష్టం కలిగిస్తూవుంది."

"ఇది చాలా విపరీతమైన సంగతిగా వుంది. ఇదివరకెన్నడూ యిటువంటి అజాగ్రత్తను, బుద్ధిమాంద్యమును తిమ్మరాజు ప్రదర్శించి యెరగడు. ఈమారు అతడు ఇలాగు ఎందుకు చేశాడో తెలియడంలేదు. ముద్దాయి (శిరస్తాదారు)పైన పన్నబడిన ఒక కుట్ర లో ఇత నొక భాగస్వామి అవడానికి ఎంతమాత్రమూ వీలులేదు. వివేకంగలవారెవ్వరూ అలాంటి దుర్మార్గంలో చేరడు. ఎంత స్వల్పమైన లోపమునుగాని పట్టుకోకుండా వదలని తెలివితేటలు గల అతిసమర్ధుడైన అకవుంటేంటు (తిమ్మరాజుగారు) వున్నాడు కదా అనే నమ్మకంతో నేను స్వయంగా సరిచూడ కుండ ఆలెక్కమీద సంతకం పెట్టాను. ఈవిధంగా ఆలొచిస్తే ఇది అంత పెద్దపొరపాటు కాకపోయినా దాన్ని గురించి నేను సమర్ధించుకోవడానికి ప్రయత్నించను. కలెక్టరుసంతకంతో జారీఅయ్యే లెక్కలయొక్క నిర్ధిష్టతకు కలెక్టరే బాధ్యుడని (రూల్సులో)ఇప్పుడు నిర్ణ యించబడినట్లు అప్పటికి విధించబడియుండనందువల్ల ఈతప్పుడు లెక్కకు తిమ్మరాజుగారే జవాబుదారు అయివున్నాడు" అని కలెక్టరు గారు కమిషనరు గారికి వ్రాసి తన బాధ్యతను తప్పించుకోవడానికి తిమ్మరాజుగారి మీదికి త్రోసివేసి వూరుకున్నాడు.

"ముద్దాయి నేరాన్ని స్థాపించే లెక్క" అని తాను తయారుచేయించి జిల్లాకోర్టు వారికి పంపించిన లెక్క తప్పుడు లెక్క అని తేలింది. ముద్దాయినిర్దోషి అని రుజువు అయింది. ఇలాగ నిష్కారణంగా ఒక నల్లవాడిని సామాన్యఖైదీలనుంచే బందిఖానాలో పడవేసివుంచడము,పదహారునెలలు విచారణలో నిర్భంధించి వుంచడమూ అంతగా విచారించతగిన అంశము కాదని ఈదొరగారు అనుకొని వుంటారు.

ఇంకో కేసు

ఒకప్రక్క ఈశిరస్తాదారుగాని కేసు జరుగుతూ వుండగా ఈ కలెక్టరుగారు పిఠాపురం మైనరుజమీందారు సంరక్షుకుడైన రాజబంధువు (Uncle) మీదకూడా ఒక నేరాన్ని మోపి ఆయనను ఖైదులో వుంచారు. పైన చెప్పిన 67 వేల రూపాయలతో సహా ఇంకాకొంత ఎస్టేటు ఆస్తిని హరించి నేరం చేశాడని ఆయనమీద ఒక కేేసు దాఖలు చేశారు. ఆకేసును సర్కారుతరపున నడపడానికి నాలుగువందల మైళ్ల దూరాన్నుంచి ఇంగ్లీషుబారిష్టర్లను తెచ్చి దీనికోసం అయిన సొమ్మును పిఠాపురం జమీందారీ ఖజానాలో నుంచి ఖర్చుపెట్టారు. ఆకేసులో కూడా ముద్దాయిని నిర్దోషి అని వదలివేశారు. "సర్కారు సంరక్షణకింద వుండే మైనరు జమీందారుల సొమ్మును ఎలాగ వృధాగా ఖర్చుపెడతారో దీనివల్ల తెలుస్తుంది. 1854 నాటికి పిఠాపురం లెక్కలలో నిల్వ యేమీ లేకుండా పోవడానికి ఇది ఒక కారణమని చెప్పవచ్చును" అని స్మాలెట్టుగారు వ్రాశారు.

నరసింగరావుగారి అర్జీలు

పైన చెప్పిన కలెక్టరుగారి సంజాయిషీ వుత్తరం ఉత్తరసర్కారుల కమిషనరు గారికి చేరినమీదట ఆయన తా నీవిషయంలో జోక్యం కలిగించుకోవడానికి నిరాకరించి పనిలోనుంచి తీసివేసిన శిరస్తాదారును కావలిస్తే గవర్నమెంటుకు చెప్పుకోమని అన్నారు. చెన్నపట్నం గవర్నమెంటువారు కిందివారి వుత్తరువును ఖాయపరచారు. జిల్లాజడ్జీ తన్ను నిర్దోషి అని నిర్ణయించి ఆకోర్టులోనే ఒక వుద్యోగం తన కిస్తారని అన్నా రనిన్నీ, సర్కారు నౌకరీని మళ్లీ చేసుకోవడానికి అనుజ్ఞ యిప్పించవలసిం దనిన్నీ, మళ్లీ రాజమహేంద్రవరం కలెక్టరుకిందనే పని చెయ్యాలని తనఉద్దేశ్యం కాదనిన్నీ నరసింగరావుగారు మళ్లీ అర్జీ దాఖలు చేసుకోగా ఈ అర్జీదారు ఏశాఖలోనూ సర్కారు నౌకరీ చేయడానికి వీలులేదని సభాయుతులైన గవర్నమెంటుగారు నిష్కర్షగా శాసించారు! పది రూపాయలకు పైబడిన జీతం గల ఏ దేశీయోద్యోగినీ కూడా అతడు చేసిన నేరం నకలును అతని కిచ్చిఅతడు చెప్పే సంజాయిషీని, తెచ్చుకునే సాక్ష్యాన్ని వినిగాని అతనిని పనిలోనుండి తీసివెయ్యకూడదని, అంతకుపూర్వం కొంతకాలం కిందటనే దొరతనమువా రొక తీర్మానాన్ని చేసివున్నా ఇప్పుడు ఈ నరసింగరావుగారి విషయంలో అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు.

పిఠాపురం ఎస్టేటు తాలూకు చాలా సొమ్ము అపహరించడానికి ఇతడు మద్దత్తు చేశాడనే నేరంమీద ఇతనిని పనిలోనుండి తీసివేశారు. అయితే ఇతడు నిర్దోషి అని కోర్టువారు తీర్మానించారు. అంతట ఇతడు ఎంతమాత్రమూ విశ్వసపాత్రుడు కాడనే నెపంమీద ఎంతోకాలం నమ్మకంగా పనిచేసి సమర్ధుడనీ, నమ్మకమైనవాడనీ కలక్టరువల్లనె అనేక యోగ్యతా పత్రాలు పొందిన ఈ దేశీయోద్యోగి పనిని తీసివెయ్యడాన్ని సమర్ధించారు!

చెన్నపట్నం దొరతనమువారివల్ల న్యాయం కలగకపోగా నరసింగరావుగారు ఈ సంగతులన్నీ తెలుపుతూ ఇంగ్లాండులోవున్న కంపెనీ డైరెక్టర్ల సభవారికి 1855 లో ఒక విన్నపము పంపించారు. అంతట సర్కారుకొలువులో ఏ ఉద్యోగమూ ఇవ్వకూడదనే నిషేధాన్ని తోలగిస్తూ 1856 లో వుత్తర్వులు వచ్చాయి. అయితే ఈలోపుగా నరసింగరావుగారు విజయనగరం ఎస్టేటుదివాను అయి ఆజమీందారీ రివిన్యూ పరిపాలన చక్కగా నిర్వహిస్తూవున్నందువల్ల మళ్లీ సర్కారు నౌకరీలో చేరడం అసంభవము అయింది.

గంజాం శిరస్తాదారు కథ

ఈదేశీయుణ్ణి ఇలాగ బాధించి వుద్యోగంలోనుంచి తొలగించి దీనికంతా కారకుడై న రాజమహేంద్రవరం కలెక్టరు ప్రెండరుగాస్టు గారికి గంజాంజిల్లాలో గవర్నరుగారి ఏజెంటుహోదాతో పెద్ద గౌరవ వుద్యోగం యిచ్చారు. ఈ దొరగారు అక్కడికి వస్తున్నాడనేటప్పటికి అక్కడివారిలో చాలమందికి భయం కలిగింది. ఈ కొత్త ఏజంటుగారు ఆపనిలో ప్రవేశించిన కొన్ని వారాలలోనే, గంజాముజిల్లాలో పెద్ద ఉద్యొగాలు చేస్తూవున్న దేశీయులను చాలామందిని పనిలోనుంచి తొలగించారు. సర్కారుకింద నలభైసంవత్సరాలు నమ్మకంగా పనిచేసి అతడు చేసిన రాజకీయ సేవకు ఒక బిరుదును పొందడానికీ, ఫించను పుచ్చుకోవడానికి సిద్ధంగా వున్న హెడ్డుశిరస్తాదారు పైన ఈ దొరగారు ఏదో నేరం మోపి పట్టుకొని శ్రీకాకుళం సెషన్సు కోర్టుకు పంపారు ఆ కోర్టుజడ్జీగారు ఈఫిర్యాదులోని సంగతులు చాలా హాస్యాస్పదమైన స్వల్పవిషయాలై వుండడం చూచి ఆయనమీద నేరం మోపి కేసు విచరించడానికి యిష్టపడక ఆఖరికి దానిని కొట్టివేశారు. ఇది జరిగి పదిహేను నెలలు అయినా ఉద్యొగరీత్యా ఆ శిరస్తాదారుగారి వ్యవహారం పరిష్కారం కాకుండా ఇంకా విచారణలోనే వుంది. దానికి సంబంధించిన కాగితాలు పైఅధికారులదగ్గర చాలా నెలలనుంఛి పడివున్నాయి. ఆవుద్యోగి ముసలివాడు. అయ;న జబ్బుమనిషి బహుశా ఈయన వ్యవహారం ఫైనలు అయ్యేలొపుగానె స్వర్గస్థుడయి విముక్తి పొందుతాడేమో అని స్మాలెట్టు గారు వ్రాశారు.

ఈగంజాం హెడ్దు శిరస్తాదారుమీద మోపిన నేరాలలో చెన్నపట్నం రాజధానిలో శిరస్తాదారు ఉద్యోగం చేసేవారు వహించేదానికన్న యెక్కువ దర్జాగల గౌరవాచకాన్ని తన పేరుతో కలిపి వాడుతున్నా డనే నేరం ఒకటి! ఇంకా ఇలాంటి పనికిమాలిన నేరాలు కొన్నింటిని మోపారుగాని ఆపాదించిన దోషాలలో ఒక్కటైనా సరియైన సాక్ష్యంతో రుజువుపరచడానికి ప్రయత్నించలేదు. ఈ అక్రమాన్ని గురించి ఈగంజాంజిల్లా శిరస్తాదారుగారు ఇంగ్లాండులో కంపెనీ డైరెక్టర్ల కోర్టువారికి అర్జీ యిచ్చుకొగా ఆయనకు పూర్తిఫించను ఇచ్చేటట్టు వారు వుత్తరువు చేశారు.


3.చక్రవర్తికి శిక్ష విధించిన దివానులు

ఈ దేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చిన ఇంగ్లీషువారు 1765 లో అప్పటి మొగలాయి చక్రవర్తియైన షా ఆలం పాదుషాను ఆశ్రయించి వంగరాష్ట్రములోను బీహారు ఒరిస్సాపరగణాలలోను చక్రవర్తి ప్రతినిదులుగా శిస్తులు వసూలు చేసి, సివిలు పరిపాలన జరిపే 'దివానిగిరీ ' ఆధికారాన్ని సంపాదించడంతో రహస్యంగా ప్రారంభమైన బ్రిటిషు రాజ్యతంత్రము 1858 లో జరిగిన సిపాయిల విప్లవమనే స్వాతంత్రము యుద్ధంలో పాల్గొని ఐరోపావారి వధలకు మద్దతుచేసినాడనే నేరం మోపి అప్పటి మొగలాయి చక్రవర్తియైన బహదూరుషా పాదుషాను పట్టుకుని యావజ్జీవ కారాగార శిక్షవిధించి రంగూనులో నిర్భంధించి ఇండియాలో కంపెనీపరిపాలనను రద్దుచేసి ఇంగ్లీషు రాణీ ప్రభుత్వము ప్రకటించడంతో స్ధిరరూపం దాల్చింది.