Jump to content

కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/చక్రవర్తికి శిక్షవిధించిన దివానులు

వికీసోర్స్ నుండి

సంబంధించిన కాగితాలు పైఅధికారులదగ్గర చాలా నెలలనుంఛి పడివున్నాయి. ఆవుద్యోగి ముసలివాడు. అయ;న జబ్బుమనిషి బహుశా ఈయన వ్యవహారం ఫైనలు అయ్యేలొపుగానె స్వర్గస్థుడయి విముక్తి పొందుతాడేమో అని స్మాలెట్టు గారు వ్రాశారు.

ఈగంజాం హెడ్దు శిరస్తాదారుమీద మోపిన నేరాలలో చెన్నపట్నం రాజధానిలో శిరస్తాదారు ఉద్యోగం చేసేవారు వహించేదానికన్న యెక్కువ దర్జాగల గౌరవాచకాన్ని తన పేరుతో కలిపి వాడుతున్నా డనే నేరం ఒకటి! ఇంకా ఇలాంటి పనికిమాలిన నేరాలు కొన్నింటిని మోపారుగాని ఆపాదించిన దోషాలలో ఒక్కటైనా సరియైన సాక్ష్యంతో రుజువుపరచడానికి ప్రయత్నించలేదు. ఈ అక్రమాన్ని గురించి ఈగంజాంజిల్లా శిరస్తాదారుగారు ఇంగ్లాండులో కంపెనీ డైరెక్టర్ల కోర్టువారికి అర్జీ యిచ్చుకొగా ఆయనకు పూర్తిఫించను ఇచ్చేటట్టు వారు వుత్తరువు చేశారు.


3.చక్రవర్తికి శిక్ష విధించిన దివానులు

ఈ దేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చిన ఇంగ్లీషువారు 1765 లో అప్పటి మొగలాయి చక్రవర్తియైన షా ఆలం పాదుషాను ఆశ్రయించి వంగరాష్ట్రములోను బీహారు ఒరిస్సాపరగణాలలోను చక్రవర్తి ప్రతినిదులుగా శిస్తులు వసూలు చేసి, సివిలు పరిపాలన జరిపే 'దివానిగిరీ ' ఆధికారాన్ని సంపాదించడంతో రహస్యంగా ప్రారంభమైన బ్రిటిషు రాజ్యతంత్రము 1858 లో జరిగిన సిపాయిల విప్లవమనే స్వాతంత్రము యుద్ధంలో పాల్గొని ఐరోపావారి వధలకు మద్దతుచేసినాడనే నేరం మోపి అప్పటి మొగలాయి చక్రవర్తియైన బహదూరుషా పాదుషాను పట్టుకుని యావజ్జీవ కారాగార శిక్షవిధించి రంగూనులో నిర్భంధించి ఇండియాలో కంపెనీపరిపాలనను రద్దుచేసి ఇంగ్లీషు రాణీ ప్రభుత్వము ప్రకటించడంతో స్ధిరరూపం దాల్చింది. ఇంగ్లీషు వర్తక కంపెనీకి దివానిగిరీని ప్రసాదించిన షా ఆలం చక్రవర్తి అసలు పేరు ఆలీగోహర్. ఆయన అలంగీరు చక్రవర్తి కొమారుడు. అతడు 1728 లో జన్మించాడు. తండ్రికి ఆయనమీద దయదప్పగా అప్పట్లో అయోధ్యలో రాజ ప్రతినిధిగా వున్న 'నవాబు నజీరు ' షుజాఉద్దౌలాను ఆశ్రయించి అక్కడ తల దాచుకున్నాడు. షుజాఉద్దౌలా బలవంతుడై చక్రవర్తినికూడా లోబరచుకొన్నాడు. ఆలంగీరు చక్రవర్తి 1759 లో దుర్మరణము పొందగా షాఆలం చక్రవర్తియైనాడు. ఈయనకూడా షుజ ఉద్దౌలా చెప్పుచేతలలొనె వున్నాడు.

మూర్షిదాబాదును రాజధానిగా చేసుకొని వంగరాష్ట్రాన్ని పరిపాలిస్తూవున్న రాజప్రతినిధియైన ఆలావర్గీఖాను చనిపోగా ఆయన మనుమడు దత్తపుత్రుడునైన సురాజుద్దౌలా 1756 లో నవాబు అయినాడు. కొత్తనవాబు చాలా చిన్నవాడు. అప్పట్లో కలత్తాలో వర్తకం చేసుకుంటూవున్న ఇంగ్లీషువారి అక్రమ చర్యలను హర్షించక వారిని దండించాడు. అంతట వారు ఆయన మంత్రులను తిరుగదీసి ఆయన బంధువుడున్నూ మంత్రిన్నీ అయిన మీర్జాఫరుచేత స్వామిద్రోహము చేయించి 1757 లో ప్లాసీయుద్ధంలో నవాబును ఓడించారు. ఈ యుద్ధంలో విజయం పొందిన క్లైవుయొక్క ధైర్యసాహసాలకు అయోధ్యనవాబున్నూ చక్రవర్తిన్నీ కూడా సంతోషించారు. సురాజుద్దౌలా దుర్మరణం పొందగా మీర్జాఫరును నవాబుగా అంగీకరింప జేయడానికి క్లైవున్నూ ఇతర ఇంగ్లీషు ఉద్యోగులున్నూ చాలా సొమ్ము లంచము పుచ్చుకొని చక్రవర్తికి శిఫారసుచేసి మీర్జాఫరును నవాబుగా చేసి కృతకృత్యులైనారు.

మహారాష్ట్ర వ్యవహరాలలో క్లైవు చూపిన చాకచక్యానికి చక్రవర్తి అతనిని ఆరువేల గుర్రపుదళానికి అధికారి యనే గౌరవబిరుదు నిచ్చాడు. ఆయుద్యోగము నకు న్యాయంగా సాలుకు ముప్పైవేల సవరసుల జీతము తనకు రావలెనని క్లైవు మీర్జాఫరును నిర్భంధించి అందు క్రింద 24 పరగణాలను జాగీరుగా పుచ్చుకున్నాడు. ఈమీర్జాఫరు కేవలము ఇంగ్లీషు కంపెనీ యుద్యోగుల చేతులలో కీలుబొమ్మగా వుండినందువల్ల వారికి అమితలాభం కలిగించి. త్వరలోనే మీర్జాఫరును అతని కొమారుణ్ణికూడా త్రోసిరాజని అతని అల్లుడైన మీర్జాసీమమును నవాబుగా చేశారు. ఇతడు మీర్ఝాఫరులాగ ఇంగ్లీషు వర్తకులుచేసే అన్యాయాలన్నింటినీ సహించలేక వారికి గల ప్రత్యేక హక్కులను తీసివేసేటప్పటికి ఇంగ్లీషు వారాయనను పదభ్రష్టుణ్ణి చేసి మళ్లీ మీర్జాఫరును తక్తుమీదికి యెక్కీంచారు.

1760-1764 మధ్య వంగరాష్ట్రంలో అరాజకం ప్రబలింది. ఇంగ్లీషు వర్తకులు చేసే అన్యాయాలకు మితిలేకుండా పోయించి. వారి దుర్మార్గాలు సీమలో అధికారులకు కూడా తెలిసి ఇక్కది పరిస్థితులను చక్క బెట్టవలసిన దని క్లైవును మళ్లీ గవర్నరుగా నియమించి పంపించారు. అతడు 1765 మే నెలలో ఇక్కడికి వచ్చాడు.

ఈలోపుగా వంగరాష్ట్ర రాజకీయ పరిస్థితులలో కొన్ని మార్పులు వచ్చినవి. పదచ్యుతుడైన మీర్జాసీము అయోధ్య నవాబును ఆశ్రయించాడు. అంతట అయోధ్య నవాబున్నూ, షా ఆలం చక్రవర్తిన్నిఈ అతనికి సహాయులైనవారు. 1764 లో బక్సారువద్ద జరిగిన యుద్ధములో వారికి అపజయం కలిగినందువల్ల కంపెనీవారి సైన్యాలు అయోధ్యమీదికి చెలరేగి దండయాత్రలు చేయడం ప్రారంభించినవి. క్లైవు వచ్చేటప్పటికి అయోధ్యలో యుద్ధం పూర్తి అయింది. మీర్జాఫరు 1765 జనేవరు లోనే మరణించాడు.ఇక్కడి కంపెనీ యుద్యోగులు అతడి రెండవకొడుకుదగ్గర లంచములు పుచ్చుకొని అతణ్ని నవాబును చేశారు.

వంగరాష్ట్ర సింహాసనం మీద ఓక బలహీనమైన నవాబును నిమిత్తమాత్రంగా వుంచి కీలుబొమ్మలాగు ఆడించినందువల్ల ఇంగ్లీషు కంపెనీ వుద్యోగులందరికీ వారు ఆడింది ఆటగానూ, పాడిందిపాటగానూ, సాగింది. వారు పుచ్చుకునే లంచాలకు జరిగించే అక్రమాలకు హద్దు పద్దు లేకుండా పోయింది.

"దివానిగిరీ"

వంగరాష్ట్రంలో ప్రభుత్వాధికారాలను కంపెనీవారికి చేజిక్కించాలనే వుద్దేశ్వం కంపెనీయుద్యోగులు చాలామందికి కొంతకాలం నుంచి కలిగింది. ఆఘనకార్యం సాధించిన గౌరవం క్లైవుకే దక్కింది.

ఆకాలంలో దేశంలో ప్రతినవాబున్నూ చక్రవర్తి పేరిటనే ప్రభుత్వం జరుపుతూ వుండేవారు. ఏరాజ్యతంత్రం ప్రయోగించాలన్నా చక్రవర్తి పేరుతో ఒక ఫర్మానా పుట్టుతూ వుండేది. చక్రవర్తిని చేజిక్కించుకొన్నవాడిదే రాజ్యంగా సాగేది. అందువల్లనే అయోధ్య నవాబు వజీరు చాలా బలవంతుడైనాడు. 1763 లో క్లైవు రాగానే చేసిన పని అయోధ్య నవాబుతోనూ చక్రవర్తితోనూ రాయబారాలు సాగించి కంపెనీవారికి లాభకరమైన సంధియేర్పాటులు చేయడమే.

షా ఆలం చక్రవర్తి అలహాబాదు మకాములో వుండగా క్లైవు స్వయముగా ఆయనను దర్శించి ఆయనవల్ల కంపెనీ వారికి వంగరాష్ట్రానికి బీహారు ఒరిస్సా పరగణాలకూ దివానిగిరి అధికారాలను సంపాదించాడు. చక్రవర్తి సంరక్షణకోసము అలహాబాదులో ఇంగ్లీషు సైనికదళము నుంచేటట్లున్నూ కంపెనీవారు వంగరాష్ట్రం బీహారు ఒరిస్సా పరగణాలలో దివానుగా వుండి శిస్తులను వసూలు చేసి పరిపాలన జరిగించుటకున్నూ కంపెనీవారు చక్రవర్తికి సాలుకు 20 లక్షల రూపాయలు చెలీస్తూ ఉండేటట్లున్నూ ఏర్పాటు జరిగింది ఈదివానిగిరీతోపాటు దక్షిణదేశంలో ఉత్తరసర్కారు జిల్లాలనుకూడా కంపెనీ వారికి దయచేస్తూ షాఆలం చక్రవర్తి ఫర్మానా జారీచేసినాడు.

చక్రవర్తియిచ్చిన దివానిగిరీని బట్టి కంపనీవారి (సివిలు) ప్రభుత్వాధికారాలన్నీ చలాయించడానికి వీలున్నప్పటికి వెంటనే అలాగ జరిగించక పన్నులు వసూలు మాత్రం తాము చేస్తూ మిగతా ప్రభుత్వాధికారాలన్నీ నవాబుక్రింది వుద్యోగుల ద్వారానే జరగనిచ్చారు. దీనికి కారణం వెంటనే తా మీప్రభుత్వాధికారాలన్నీ చలాయించేటట్లైతే చాలా పెద్దసిబ్బందిని నియోగించి చాలాసొమ్ము ఖర్చుపెట్టవలసివస్తుం దనిన్నీ పైగా తమతోడి పాశ్చాత్యవర్తక కంపెనీలకు కన్నుగుట్టి తమ ఆదాయానికి భంగంరావచ్చుననిన్నీ దూరాలోచనతోనే ఇంగ్లీషు వర్తకకంపెనీవారు ఈవిధంగ ప్రవర్తించారు. దీనివల్ల ప్రభుత్వం యొక్క బాధ్యతలన్నీ నవాబులమీదనే యుంటూవున్నా దానివలని లాభాలన్నీ కంపెనీవారికే గలుగుతూవుండేవి. నవాబుసర్కారు వుద్యోగుల నందరినీ కంపెనీవారు తమ శిస్తువసూలు వ్యవహారాలలో బాగా వుపయోగించుకునేవారు. ఇలాగ వంగరాష్ట్రంలో కొంతకాలము ద్వంద్వ ప్రభుత్వం నడిచించి. ప్రభుత్వ వ్యవహరాలు జరపడానికని కంపెనీవారిచ్చే సొమ్ము చాలక నవాబు చాలా చిక్కులు పడేవారు.

ఈవిధానంవల్ల ప్రభుత్వ బాధ్యతలు లేకుండా అధికారాలన్నీ కంపెనీవారు చలాయిండానికి వీలుకలుగుతుం దనిన్నీ, తక్కిన పాశ్చాత్యులకు కన్నుకుట్ట కుండా వుంటుందనిన్నీ కంపెనీవారికి సాలుకు 122 లక్షల రూపాయల నికరాదాయం వస్తుందనిన్నీ 1766 వ సంవత్సరం సెప్టెంబరు 30 వ తేదీన క్లైవు సీమకు వ్రాశాడు. ఈదివానిగిరీ వల్ల ఇంగ్లీషు వర్తకకంపెనీవారు మొగలాయి చక్రవర్తికింద దివానుగా రాజప్రతినిధి హోదాను కలిగి వంగరాష్ట్రానికి నిజమైన పరిపాలకులైనారు. క్రమక్రమంగా అధికారాలన్నీ కంపెనీవారే చలాయించడానికి అవకాశం కలిగించి. పేరునకు నవాబు రాజ్యం చేస్తున్నాడు గాని సాక్షాత్తుగా పరి పాలించేది కంపెనీవారే. 1772 లో వారన్ హేస్ఠింగ్సు గవర్నరైన తరువాత ఈ ద్వంద్వ ప్రభుత్వ నాటకాన్ని రద్దుచేసి నవాబుకి 16 లక్షల మనువర్తినిచ్చి కంపెనీవారే ప్రభుత్వం చేసేపద్దతిని స్థాపించాడు. వంగరాష్ట్రంలో నవాబు స్థానే కంపెనీవారే రాజప్రతినిధులై పరిపాలన చేయసాగినారు.

హిందూదేశంలో మహారాష్ట్రులు బలవంతులై దేశాక్రమణ చేస్తూ దేశాలను కొల్ల గొట్టుకుంటూ వున్న కాలంలో వారు మొగలాయి చక్రవర్తిని పట్టుకుని తమ వశంలో వుంచుకున్నారు. 1771లో మొగలాయి చక్రవర్తిని ఢిల్లీసింహాసనము మీద నిలిపి ఆ మొగలాయిచక్రవర్తి పేరున తాము దేశపరిపాలన ప్రారంభించారు. ఆ కాలంలో ఇంగ్లీషువారు షా ఆలం చక్రవర్తికి తా మివ్వ వలసిన సొమ్మును ఇవ్వకుండా బిగబట్టారు. 1788 లో రోహిలాల నాయకుడైన గులాంఖాదిర్ ఢిల్లీని పట్టుకుని షాఆలం చక్రవర్తి గ్రుడ్లు పీకివేశారు. తరువాత మహారాష్ట్రరాజ్యసమ్మేళనములో నొక రాజైన సింధియా యీ అంధచక్రవర్తిని మళ్ళీ ఢిల్లీ సింహాసనము మీద కూర్చుండబెట్తి కీలుబొమ్మలాగ ఆడించడం ప్రారంభించాడు. ఇంగ్లీషు వర్తక కంపెనీ వారు మహారాష్ట్రులతో, యుద్ధము చేసిన సందర్భములో 'లేకు ' సేనాని ఢిల్లీ నగరాన్ని పట్టుకుని 1806 లో షాఆలం చక్రవర్తిని మళ్లీ ఇంగ్లీషు కంపెనీవారి సంరక్షణలో ఉంచగలిగారు. ఐతే అంధుడైన ఈ ముసలి పాధుషా 1806 వ సంవత్సరం నవంబరు 10 వ తేదీన చనిపొవడంతో ఆయన బాధలు తీరినవి.

పూర్వపు మర్యాదలు

ఆంగ్లేయ వర్తకకంపెనీ యుద్యోగులును వారి అధికారులును గవర్నరులును కూడా మొదటి రోజులలో మొగలాయిచక్రవర్తిని నవాబులునుకూడా దాసాను దాసులై ఎంతో భయభక్తులతో ప్రవర్తించేవారు. వారికి జోహారులుచేయడము నజరులు సమర్పించడము వారి యెదుట నిలిచియుండడము మొదలైన పూర్వపు మర్యాదలనన్నిటినీ చాలాకాలంవరకూ పాటించేవారు. వాస్కోడాగామా కళ్లికోటరాజైన జామొరిన్ పాదముల దగ్గర మోకరించియుండిన చిత్రము, జహంగీరు చక్రవర్తి దర్బారులో ఇంగిలీషురాజు రాయబారియైన సర్ తామస్ రో నిలిచియుండడము, షాఆలంచక్రవర్తి అలహాబాదులో కొలువు దీర్చి యుండగా క్లైవు నిలిచియుండడము మొదలైన పటములు ఆకాలమునాటి మర్యాదలను ప్రదర్శిస్తున్నవి. కంపెనీ యుద్యోగులు మొదలు గవర్నరు జనరలు వరకును తుదకు సీమలోని డైరక్టర్లవరకును గల వారందరూ మొగలుచక్రవర్తి గారికిని నవాబులకును వ్రాసే ఉత్తరాలలో వారి వారి బిరుదావళిని యుదాహరించి యెంతో వినయము తోను నమ్రతతోనూ చేసిన విన్నపము లిప్పటికిని కంపెనీవారి కవిలెలలో నున్నవి. 1711 లో కలకత్తా విలియంకోట ప్రెసిడెంటు (గవర్నరు)గానుండిన ఇంగ్లీషు వర్తకకంపెనీ యుద్యోగి వంగరాష్ట్ర నవాబుగారికి అతివినయముగా దాసోహముచేసి "ఏలినవారి సేవకే అంకితముచేయబడిన నాప్రాణములను తమ పాదముల సన్నిధిని ఉంచుచున్నాను" అని వ్రాశాడు. ఇతడే రెండేళ్ల తరువాత ఫరుక్ షయ్యరు చక్రవర్తిగారికి వ్రాయుచు "ఏలినవారి సేవకుడును, అత్యల్పమైన ఇసుకరేణువును అగు తూర్పు ఇండియావర్తకకంపెనీ ప్రెసిడెంటు జాన్ రస్సెల్ తననుదుటిని నేలపైన మోపి చేయుమనవి" అని తాను సాష్టాంగప్రమాణమును చేయుటను ఆ ఉత్తరములో సూచించినాడు.

ఆరోజులలో ఇంగ్లీషు వర్తక కంపెనీవారును వారితాబేదారులును మొగలాయి చక్రవర్తులకును వారి రాజప్రతినిధులకును అడుగులకు మడుగులొత్తి అతి వినయముగా ప్రవర్తించుచు వారిని దర్శించి నప్పుడు రొక్కపునజరులను సమర్ఫించి వారిని తృప్తిపరచి ఫర్మానాలను సంపాదించేవారు.

చాలా కాలంవరకూ గవర్నరులు, గవర్నరు జనరలులు కూడా మొగలాయి చక్రవర్తుల ఎదుట నిలచి యుండవలసినదేగాని కూర్చుండుటకు వీలులేదు. వారన్ హేస్టింగ్సు గవర్నరుజనరలుగా నున్నప్పుడు (1774-85) ఢిల్లీ చక్రవర్తి ఏనుగుపైన హౌదాలో కూర్చుండగా తాను ఆయన వెనుకగా కూర్చుండ వలసి వచ్చినది.

1813 లో హేస్టింగ్సు గవర్నరు జనరలు అగునప్పటికి ఆంగ్లేయుల పలుకుబడిన్నీ బలమున్నూ హెచ్చినందువల్లను మొగలు చక్రవర్తి చాలా బలహీనుడై మహారాష్ట్రుల చెప్పుచేతలలో నున్నందువల్లను చక్రవర్తి హేస్టింగ్సు నొకమారు రమ్మని కోరినప్పుడు అతడు వెళ్లడాని కెంతో జాగుచేసి తుదకు చక్రవర్తి తో సమానముగా కుర్చీలో కూర్చుండే గౌరవమును పొందగలిగాడు. గవర్నరు జనరలైన డల్ హౌసీ ప్రభువు 1848 లో ఢిల్లీకి వెళ్లినపుడు చక్రవర్తిని దర్శించడమే తనకు పరువు తక్కువగా యెంచి వెళ్లడము మానివేశాడు. డల్ హౌసీ మెల్లిగా చక్రవర్తికిని నవాబులకును చూపవలసిన మర్యాదల నన్నిటినీ పూర్తిగా తీసివేశాడు.

1765లో దివానిగిరీని సంపాదించినది మొదలు 1858లో కంపెనీవారి పరిపాలన రద్ధు చేయబడి ఇంగ్లీషు రాణీ ప్రభుత్వము స్థాపించబడు వరకూకూడా ఇంగ్లీషు వర్తక కంపెనీవారు జారీచేసిన వుత్తర్వులలోనూ, ప్రకటనలలోనూ మొగలాయి చక్రవర్తి సార్వభౌమత్వమునకు లోబడితాము పరిపాలిస్తూవున్న సంగతిని తెలిపే ("Under the king's realm and the Company's rule") అనే ఇంగ్లీషు మాటలను వాడుతూ వచ్చారు.

ఇంగ్లీషు వర్తకకంపెనీవారు చివర వరకూ మొగలాయి చక్రవర్తిగారి సార్వభౌమత్వాధికారానికి లోబడియే హిందూదేశాన్ని పరిపాలించారు గాని క్రమక్రమముగా ఆయన రాజచిహ్నాలను దర్జాలను తొలగించారు.

1803 లో లేక్ సేనాని ఢిల్లీనగరాన్ని ముట్టడించి షాఆలం చక్రవర్తిని మహారాష్ట్రుల స్వాధీనం తప్పించి ఇంగ్లీషు కంపెనీవారి స్వాధీనంలోకి తెచ్చినప్పుడు అదివరకు సింధియా చేసినట్లే ఢిల్లీనగరాన్ని చక్రవర్తి పేరిటనే పరిపాలించ సాగినారు. చక్రవర్తిన్నీ అంతకు ముందు సింధియాకు గొప్ప బిరుదును ప్రసాదించినట్లే దాని తరువాత గొప్ప బిరుదైన సంసాం ఉద్దౌలా అజ్ఘార్ ఉల్ మల్కు ఖాన్ దేరాన్ ఖాన్ పత్తేసింగ్ అనే గొప్ప బిరుదును ఇప్పుడు లేక్ సేనానికి ప్రసాదించాడు. ప్రపంచంలోకల్లా ప్రఖ్యాతి జెందిన మొగలాయి చక్రవర్తుల వంశీకుడైన పాదుషావల్ల ఇలాంటి బిరుదులను పొందడము తనకు చాలా గౌరవమని లేకు సేనాని యెంచి దానిని సంతోషముతో శిరసావహించాడు.

చక్రవర్త్రికి ఇంగ్లీషువర్తక కంపెనీవారు సాలియానా ఫించనుగా కొంతసొమ్ము ఇస్తూవున్న మాటవాస్తవమే గాని ఇది కప్పము అనికూడా చెప్పతగివున్నది. పైగా మొగలు చక్రవర్తి ఇంగ్లీషు వర్తకకంపెనీవారి న్యాయస్థానాల అధికారానికి లోబడిన సామాన్యవ్యక్తివంటివాడుకాడు. ఇంతేగాక సాక్షాత్తూ సామ్రాజ్యం ఏలకపోయినా చక్రవర్తి ఢిల్లీలో తన రాజభవనములో ఒకవిధమైన దర్భారులో కొలువుతీరుస్తూ, తన దర్జాను నిలబెట్టుకుంటున్నాడు.

కంపెనీవారు మొగలు చక్రవర్తికి చేయవలసిన మర్యాదలను గౌరవాలను క్రమక్రమంగా తగ్గించడం ప్రారంభించారు. ఇంగ్లీషు ఉత్తర ప్రత్యుత్తరాలలో ఆయనను 'చక్రవర్తి ' యని పేర్కొనడం మానివేసి 'ఢిల్లీరాజు ' అని వ్యవహరించడం ప్రారంభించారు. అయితే షాఆలం చక్రవర్తిగాని ఆయన తరువాత 1806 మొదలు 1837 వరకు రాజ్యంచేసిన అక్బరుషా చక్రవర్తిగాని 1837 మొదలు 1857 వరకు చక్రవర్తిగా నున్న రెండవ బహదూర్ షా గాని తమకు జరుగవలసిన మర్యాదలలో లోపము జరగడానికి అంగీకరించినవారుకారు. అందువల్ల పారశీక బాషలో జరిగే ఉత్తరప్రత్యుత్తరా లన్నింటిలోనూ పూర్వము లాగనే చక్రవర్తి అని అర్ధమువచ్చే 'పాదుషా ' అనే బిరుదు వుపయోగింపబడుతూ వుండేది.

1828 వరకూకూడా మొగలాయి చక్రవర్తులు ఇతరులకు బిరుదులు ప్రసాదించేవారు. వాటిని కంపెనీవారు హర్షిస్తూ వచ్చారు. చక్రవర్తిగారిమీద ఆధారపడే సన్నిహితులైన వారి విషయంలో తప్ప ఇతరుల కిచ్చే బిరుదులను అంగీకరించ మని కంపెనీవారు 1828 లో నిరాకరించారు.

1835 వరకున్నూ దేశంలో చలామణి అయ్యే నాణెములను తూర్పు ఇండియా కంపెనీవారు మొగలాయి చక్రవర్తిపేరుతోనే ముద్రించేవారు. కంపెనీ రూపాయలమీద చక్రవర్తిగారిపేరే వుండేది. ఆ సంవత్సరంలో మొదటిసారి ఇంగ్లీషురాజైన నాలుగవ విలియంగారి పేరుతో నాణెములను ముద్రించి హిందూ దేశంలో కంపెనీ పరిపాలనలోవున్న రాజ్యభాగాలలో ప్రవేశపెట్టారు. 1835 వరకూ హిందూదేశంలో వున్న వివిధరాజ్యాలవారు మొగలాయి చక్రవర్తి దర్బారులో తమతమ ప్రతినిధులను రాయబారులుగా నుంచేవారు. ఆపరిస్థితిని కంపెనీవారు 1835 లో రద్దు పరిచారు.

గవర్నరుజనరలైన హేస్టింగ్రుప్రభువు కాలంనాటివరకూ గవర్నరుజనరలు సహా ఇంగ్లీషు అధికారులందరూ ఢిల్లీచక్రవర్తికి నజరులు సమర్పించేవారు. హేస్టింగ్సు ఈమర్యాదను పాటించకపోగా 1823-26 మధ్య కలకత్తాలో క్రైస్తవమతాధికారిగా వుండిన బిషప్ హెబరుగారు హేస్టింగ్సు చర్యను విమర్శించారు. తరువాత కంపెనీ కింది అధికారులుమాత్రం 1843 వరకూ చక్రవర్తికి నజరులు చెల్లించేవారు. గవర్నరుజనరలైన ఎల్లెన్ బరో ఈ ఆచారాన్ని కూడా 1843 లో మాన్పించాడు.

ఢిల్లీచక్రవర్తిగారి రాయబారిని తన దర్బారులో నుంచుకోవడానికి గవర్నరుజనరలైన డల్ హోసీప్రభువు 1853 లో నిరాకరించి చక్రవర్తిని ఒక సామాన్యవ్యక్తిస్థితిలోకి దింపినాడు. ఢిల్లీచక్రవర్తిని ఆయన వారసులను ఢిల్లీ కోటలోనుంచి సాగనంపాలని కూడా ఆ కాలంలో ప్రయత్నించారు గాని అది సాగలేదు. ఇదంతా దేశీయుల మనస్సులకు కష్టం కలిగించింది.


చక్రవర్తికి ఖైదు

1837 మొదలు బహదూరుషా మొగలాయి చక్రవర్తిగా వుంటూయున్నాడు. 1857 లో ఇంగ్లీషు వర్తక కంపెనీవారి దొరతనాన్ని సిపాయిలు ధిక్కరించగా దేశంలో జరిగిన మహాయుద్ధంలో కంపెనీ వారిమీద కత్తికట్టిన వారిలో బహదూరుషా ఒకడనిన్నీ, తెల్లదొరల వధలకు ఆయన మద్ధతు చేశాడనిన్నీ, ఇంగ్లీషు కంపెనీ ప్రభుత్వం వారు ఆయనమీద నేరంమోపి 1858 జనవరిలో ఆయనను తమ న్యాయస్థానం ఎదుట విచారణకు పెట్టారు. ఇంగిలీషు న్యాయస్థానం వారు బహదూరుషా చక్రవర్తి నేరస్థుడని నిర్ణయించి 1858 న సం॥ మార్చి 29 తేదీన ఆయనకు యావజ్జీవఖైదు విధించారు. ఆ తీర్పునుబట్టి కంపెనీవా రాయనను రంగూనులో నిర్భంధించి యుంచగా ఆయన 1862 వ సంవత్సరం నవంబరు 7 వ తేదీన దివంగతుడైనాడు.

1765 లో మొగలు చక్రవర్తివల్ల దివానుగిరీని పొందినది మొదలు 1857 వరకూ ఇంగ్లీషు కంపెనీ వారు దేశపరిపాలనమంతా చక్రవర్తిపేరుకిందనే జరిగిస్తూ వచ్చారుగాని తాము స్వతంత్రప్రభువులమని ఎన్నడూ ప్రకటించ లేదు. క్రమక్రమంగా చక్రవర్తికి చేయవలసిన మర్యాదలను తగ్గించినా వారు బహిరంగముగా చక్రవర్తిని పదచ్యుతుని చేయలేదు. బహుదూరుషా చక్రవర్తి రాజ్య పరిత్యాగమున్నూ చేయలేదు. అందువలన ఆయనను తమన్యాయ స్థానం యెదుట పెట్టి శిక్షించే టప్పటికి కూడా ఇంగ్లీషు ప్రభుత్వము చక్రవర్తికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ వున్న తాబేదారీ వ్యవస్థగానే ఉన్నది. కంపెనీవారు చక్రవర్తికి ప్రతిసాలునా చెల్లిస్తూ యున్న సొమ్ము (పించను) ఉపకారవేతనమని వారు చెపుతూవున్నా ఆదిలో అది కప్పంగా వుడినందువల్లదానిస్వభావం మారలేదు. ఇంగ్లీషు కంపెనీవారు చక్రవర్తిని త్రోసిరాజన్నమాత్రంచేత దేశానికి స్వతంత్రప్రభువులు కారు. అందువల్ల దివానులుగా పనిచేస్తూ వున్న సేవకులే చక్రవర్తికి శిక్షవేసి నట్లేనని కొందరు విమర్శించారు. పైగా ఎంత చెడ్డా మొగలురాజు స్వతంత్రరాజు. అంతర్జాతీయ న్యాయశాస్త్రధర్మము ప్రకారము ఆయన సామాన్యన్యాయస్థానముల అధికారిమునకు లోబడిన సామాన్య వ్యక్తి కాదు. అందువల్ల ఇంగ్లీషు న్యాయస్థానము వా రాయనకు విధించిన శిక్ష న్యాయమైనదిన్నీ చెల్లతగినదిన్నీ కాదని కొందరు ధర్మశాస్త్రజ్ఞలు విమర్శించారు. ఏమైతే నేమి? బలవంతులైన ఇంగ్లీషువారి చర్యను ఎవరు కాదనగలరు? అందువల్ల చెల్లిపోయింది. మొగలాయి చక్రవర్తి నిర్భంధములో వుంటూనే 1862 లో చనిపోయినాడు.