కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/చిలకసముద్రం కలెక్టరు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కథలు - గాథలు

చిలకసముద్రం కలెక్టరు

[ఇదికల్పికధకాదు. నూరు సంవత్సరాలకు పూర్వం నిజంగా జరిగినకధ. గంజాంజిల్లాలో ఇప్పటికీ ముసలివాళ్లు ఈ కధ చెప్పుకుంటారు. చాలామంది పాశ్చాత్యగ్రంధకర్తలు దీనిని తమ పుస్తకాలలోనికి యెక్కించారు. సర్ చార్లెస్ గారు "మెమోరీస్ ఆఫ్ మెడ్రాస్" అనే పుస్తకంలో దీనినిగురించి ఒక ప్రకరణం వ్రాశారు. నేను వ్రాస్తూవున్న సంగతులలో చాలాభాగం వారి గ్రంధానికి అనువాదం]

గంజాంజిల్లలో చిలకసముద్రం అనే మహాసరస్సు ఒకటి ఉన్నది. ఇది 44 మైళ్ళు పొదుగున బంగాళాఖాతానికి అనుకునిఉన్నది. సముద్రానికి దీనికీ 200 గజాలు వెడల్పుగల ఇసుకపర్ర మాత్రమే అడ్డం. ఇది సముద్రభాగమే అని చెప్పవచ్చును. డిశంబరు నుంచి జూన్ వరకూ నీళ్ళు ఉప్పగా ఉంటాయి. వర్షాకాలంలో మాత్రం తియ్యగా ఉంటాయి. ఈ సరస్సుయొక్క లోతు మూడుమొదలు ఐదు అడుగులు ఉంటుంది. ఎక్కడా ఆరుడుగులు దాటదు. దీనికి దక్షిణాన, పడమర, చిన్న చిన్న ఱాతికొండలు నీటిలోకి చొచ్చుకొని లంకల్లాగు ఉంటాయి. అలాంటి ప్రదేశాలలో ఒకదానికి బ్రేక్ ఫాస్టు ఐలెండు (Break-fast Island) అనిపేరు. ఈ సరస్సులో మధ్య కళ్ళికోట రాజాగారి భవనం ఒకటి ఉన్నది. ఇండియా దేశానికి వైస్రాయిగా వుండిన కర్జనుప్రభువు ఇక్కడికి వచ్చినప్పుడు "ఈ చోటునుంచి కనబడే దృశ్యం భారతదేశంలోని కల్లా సుందరమైనదిగా నాకు తోస్తూంది" అనిఅన్నాడట! మన కధ ఈ ప్రదేశానికి సంబంధించినదే!

మనకధానాయకుడి పేరు తామస్ స్నాడ్ గ్రాస్. ఇతను గేబ్రిగ్రాసు కొడుకు ఇతడు 1759 లో జన్మించాడు. తండ్రి ఇండియాలో కుంఫిణీవారి కొలువులో పనిచేశాడు. అతని ప్రాపకంవల్ల తామసుకుకూడా 1777 లో చెన్నపట్నం సెంట్ జార్జికోట పరిపాలన క్రింద ఒక రైటరుగిరీ (Writership) యిచ్చారు. 1782లో ఈ కుర్ర వాడికి ఫ్యాక్టరు (Factor) గా ప్రమోషను యిచ్చారు. 1790 లో ఇతడు సీనియరు మర్చెంటు హోదాను, గంజాం అసిస్టెంటు రెసిడెంటు పదవిని పొందినాడు. భారతదేశంలో ఎక్కడ చూసినా వరహాల చెట్లువుండిన రోజులు - అవి. ఆచెట్లను ఆశ్రయించుకొని దులిపినకొద్దీ బంగారువర్షం కురిసేది. తక్కిన దొరల లాగునే ఈ స్నాడ్ గ్రాసుకూడా వుద్యోగరీత్యా తనకు అబ్బిన అవకాశాన్ని వృధాపోనివ్వకుండా ఆ వరహాలచెట్టును గట్టిగా పట్టుకొని దులపడం ప్రారంభించాడు. ఇతడు రెసిడెంటుగా వచ్చిన రెండుసంవత్సరాలలో గంజాంలొ కఱవు వచ్చించి ఈకఱవు లో ఇతడు తెలివిగా పనిచేశాడు. జమీందార్లను అదుపులో వుంచాడు. ఆ కాలంలో ఇతడు తిండిలేక మాడుతూన్న వాళ్లచేత పనులు చేయించి సర్కారు డబ్బులతో వారికి గంజికూడు పెట్టించాడు. ఇతడు వాళ్లచేత కట్టించిన బిల్డింగులలో గంజాం పట్టణానికి పదిమైళ్లలో వున్న రంభలో చిలకసముద్రంయొక్క ఒడ్డును ఆనుకొని ఇరవైవేల నవరసలుపెట్టి కట్టిన సుందర మైన భవంతి ఒకటి. ఇది అతనిసొంతం. ఈ భవనం అంటే అతనికి అతిప్రీతి. దానిలోనే ఇతడు కాపురం వుంటువుండేవాడు. అది ఇప్పటికీ వున్నది. అప్పుడు చెన్నపట్నం గవర్నరుల్ స్దర్ చార్లెస్ ఓక్లే, కఱవుకోసం అని చెప్పి స్నాడ్ గ్రాసు ఖర్చుపెట్తిన సొమ్ము చాలా ఎక్కువగా వున్నదని విమర్శించాడు. ఈ సంగతి ఏమిటో కనుక్కో వాలనిన్నీ, కుంపినీవారి రెవెన్యూ ఉద్యోగులందరూ చేయవలసినట్లు పార్లమెంటువారు నిర్ణయించిన ప్రమాణం ఇతనివల్ల తీసుకో గలందులకున్నూ ఇతన్ని చెన్నపట్నం రమ్మన్నారు.

ఇతడు గంజాంనుంచి అవతలికి అడుగు పెట్టడంతోటే అక్కడి జమీందార్లు చాలామంది ఇతని దువాషీ (ద్విభాషి)అయిన గొపాలకృష్ణమ్మకు తాము దఫాలవారీగా చాలామొత్తాలు చెల్లించినా మనిన్నీ, దానికి అతడు రశీదులు యివ్వలేదనిన్నీ ఫిర్యాదుచేశారు. దీనివల్ల స్నాడ్ గ్రాసు తన 'ద్విభాషికి ' తగని చనవూ అధికారమూ ఇచ్చాడనిన్నీ, అతడు అధికారం దుర్వినియోగం చేసి లాభం పొందినాడనిన్నీ, అతడు అధికారం దుర్వినియోగం చేసి లాభం పొందినాడనిన్నీ, బయలు అనేక తంత్రాలు, తమాషాలు చేస్తూ అమిత వ్యయం చేయించేది. తన యిష్టం వచ్చినట్లల్లా ఆడించేది.

ఇలాగు కలెక్టరు ఉపేక్షవల్లా, దుబాషీ దుర్మార్గంవల్లా జిల్లా వ్యవహారం దు:స్థితిలోకి దిగిపోయింది. సర్కారు శిస్తు వసూలు మందగించింది. అప్పుడు చెన్నపట్నంరాజధాని గవర్నరు క్లైవుప్రభువు శిస్తులు ఎందువల్ల సరీగా వసూలు కావడం లేదని సంజాయిషీ అడిగాడు. వర్షాలు సకాలంలో కురవలేదనిన్నీ, అందువల్ల పంటలు బాగా పండలేదనిన్నీ, ప్రజలలో డబ్బు లేదనిన్నీ, జిల్లాలో జమీందార్లు చెప్పినమాట వినడం లేదనిన్నీ, ఖోండుజాతివాళ్లు అల్లరిచేస్తున్నారనిన్నీ, శాంతిభద్రతలు నెలకొల్పడానికి శిస్తు వసూలుకు తగిన మిలిటరీ బందోబస్తు సిబ్బంది తనకు లేదనిన్నీ స్నాడ్ గ్రాస్ జవాబు చెప్పాడు. కాని చెన్నపట్నం రెవెన్యూబోర్డువారు మోసపోయేవారుకాదు. సర్కారుదస్తు ఫాజలు (అపహారం) కేసు కప్పిపుచ్చడానికి ఇంత తెలివితేట లైనజవాబు ఇదివరలో ఏకలెక్టరూ చెప్పినది లేదని అన్నారు. గవర్నమెంటువారు కూడా ఇలాగే అభిప్రాయపడి స్నాడ్ గ్రాసును కలెక్టరు పదవిలోనుండి తొలగించి బ్రౌను అనే అతనిని కలెక్టరుగా నియమించారు. ఈబ్రౌను గంజాం వచ్చేటప్పటికి కొంతకాలం పట్టింది. వచ్చినతరువాత స్నాడ్ గ్రాసును చార్జీ వప్పగించేటట్లు చేయగలిగేటప్పటికి ఇంకా కొంతకాలం పట్టించి. స్నాడ్ గ్రాసును రంభదగ్గరనుంచి కదిలించేటప్పటికి గవర్నమెంటువారి తాతలు దిగివచ్చారు.

స్నాడ్ గ్రాసు స్థానే నియమింపబడిన కొత్తకలెక్టరు బ్రౌను గంజాంజిల్లా వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి ప్రయత్నించాడు. కాని అది సులభసాధ్యం కాలేదు. అవి అంత గందరగోళంలొ వున్నాయి. మంచి అభివృద్ధిలో వుండిన జిల్లా పాడైపోయిందనిన్నీ, జనసంఖ్య కూడా క్షీణించిదనిన్నీ ఇతడు పైకి వ్రాశాడు. దుబాషీని అరెస్టుచేశారు కాని అత డెంతసొమ్మొ అపహరించిందీ సరిగ్గా తెలుసుకొవడానికి వీలు కాలేదు. బయటపడిన రెండుపద్దులే ఒకలక్ష అరవైవేల రూపాయిలు దాకా తేలినాయి. ఈద్రవ్యాపహరణానికి అతనిమీద దస్తు ఫాజుల్ కేసు పెట్టాడు. కాని దేశం అల్లకల్లోల స్థితిలో నుండుటవల్లా, గుంసూరులో తిరుగుబాటు జరిగినందువల్లా, ఈ కేసు విచారణ జయప్రదంగా నడవడానికి బ్రౌనుదొరకు అవకాశం లెకపోయింది.

1793 కూ 1801 కీ మధ్య యీజిల్లా పరిపాలనను గురించిన తప్సీలు తెలుసుకోడానికి రికార్డులు ఏమీలేవని జిల్లామాన్యూలు వ్రాసిన మాల్టుబీ వ్రాసినాడు. ఈరికార్డు లేమైనవని విచారించగా బ్రౌను దొరగారే వానిని తగల వేశారని స్పాటిస్ వుడ్ అనే కలెక్టర్ వ్రాశాడు. కాని ఇది విశ్వసించతగినట్లు లేదు. ఈజిల్లాలో దీనిని గురించి ఒకకధ చెపుకుంటారు. తనపైని సాక్ష్యం దొరకకుండా రెవిన్యూ లెక్కలపుస్తకాలన్నీ స్నాడ్ గ్రాసు చిలకసరస్సులో పారవేశాడట. "రంభదగ్గరకు వచ్చే టట్లయితే ప్రాణం తీస్తానని బ్రౌను దొరను బెదిరించాడట!

రంభలో కూర్చుని స్నాడ్ గ్రాసు చేసిన విచిత్రాలను గురించీ, అతన్ని అక్కడ నుండి కదిలించడం గవర్నమెంటుకు ఎంత కష్టసాధ్యమైనదో ఆ సంగతిని గురించి ఇంకా కొన్ని కధలు ప్రచారంలో వున్నాయి. వాటిని ఆంగ్లేయగ్రంధకర్తలు తమ పుస్తకాలలోకి కూడా ఎక్కించారు.

కలకత్తాలో సండేస్టేట్సుమన్ అనే పత్రికలో 1938 సంవత్సరం అక్టోబరు 23 వ తేదీన సి.బి.సి అనే పొడి అక్షరాలతో ఈస్నాడ్ గ్రాసును గురించిన కధ వ్రాయబడినది. దానిలో పైనచెప్పిన సంగతులుగాక ఇంకా కొన్ని విశేషాలు వ్రాయబడినాయి.

స్నాడ్ గ్రాసుకు 1791 లో గంజాం రెసిడెంటు ఉద్యోగం వచ్చిన తరువాత గోపాలకృష్ణమ్మను తనకు సహాయ దుబాషిగా ఏర్పరచుకొని అతని సహాయంతో రివిన్యూలో నూటికి 90 వంతులు మాత్రం సర్కారుకు జమకట్టి తక్కినది స్వంతానికొసం అట్టేఎట్టుకోవడం ప్రారంభించాడు. రంభలో కట్టించిన ఇంటికి 20 వేల పౌనులు ఖర్ఫు అయినదట. జమీందారులు ఎందుకు బకాయి పెడుతున్నారో తెలుసుకోవలసిందని 1794 లో చెన్నపట్నాన్నుంచి ఒక ఉద్యోగిని పంపగా వాళ్ళందరూ తమ పేష్కషు నదివరకే ఇచ్చివేశారని తేలింది. తప్పుడు లెక్కలు వ్రాయవలసిందని స్నాడుగ్రాసు తనను నిర్బంధించాడని గోపాలకృష్ణమ్మ ప్రమాణం చేశాడు. నేనలాంటిపని చేయమనలేదని స్నాడుగ్రాసు అన్నాడు. స్నాడుగ్రాసు కూడా దీనిలో భాగస్వామే అని, తేలినా సరియైనరుజువు దొరకనందువల్ల అతడు తాను చేయవలసినపని తిన్నగా నిర్వహింపక ఉపేక్ష చేసినాడని సస్పెండు చేశారు. గోపాలకృష్ణమ్మను జైలులో పడవేసి సొమ్ము కక్కేవరకు నిర్భంధించి వుంచారు. శిస్తురసీదు కవుంటరుఫాయిలు కాగితాలు లెక్కలతో సరిగా వున్నయా లేవా అని చూడడం మాత్రమే తన పని అనిన్నీ, అవి సరిగానే వున్నాయనిన్నీ, కవుంటరుఫాయిలులో వసూలు చేసిన దానికన్న గోపాలకృష్ణమ్మ తక్కువ మొత్తాలు వేసి నట్లైతే తా నేమిచేయగలననిన్నీ స్నాడ్ గ్రాసు చెప్పి తాను నిర్దోషినని వాదించాడు. 1797 ఇతనికి మళ్ళీ పని యిచ్చారు.

రెండవమారు 1810 నాటికే మళ్లీ ఇతనిపైని ఫిర్యాదులు చెలరేగాయి. ఇతని సంజాయిషీకి రివిన్యూబోర్డువారూ గవర్నమెంటు హర్షించలేదు. ఇతనిని చార్జీ వప్పగించ వలసిందని బ్రౌను అనేదొరను పంపించారు. ఈ బ్రౌను వచ్చేటప్పటికి తన ఆఫీసు దగ్గరకు తుపాకీబారు మేరదూరంలోకి వస్తే కాల్చివేస్తానని బెదిరించి అతని ఎదటనే లెక్క పుస్తకాలూ రికార్డులూ చిలకసరస్సులో పారవేశాడు. తన పీక మీదికి తేగలసాక్షి సాధనాలన్నింటినీ అలా మాపుచేసి జిల్లాలో తనకు గల వ్యవహారాలన్నీ మెల్లగా చక్కబెట్టుకొని ఆఖరుకు చెనపట్నం వెళ్లాడు.

'జాన్ లా ' అనే ఆయన 1908 లో "గ్లింప్సెస్ ఆఫ్ హిడెన్ ఇండియా" అనే పుస్తకంలో ఈ క్రింది విధంగవ్రాశారు

"స్నాడ్ గ్రాసు రంభలో కట్టించిన దివ్యభవనాన్నిఎంతో చక్కగా అలంకరించాడు. తన సాలలలో మంచి గుఱ్ఱాలనూ, ఏనుగు లనూ, కట్టించి వుంచారు. పెద్ద నవాబులాగు జీవించెవాడు. రంభ మారుమూలగా వున్నది. చెన్నపట్నంనుంచి కలకత్తా వెళ్లేదొరలు సముద్రంమీదనే సరాసరి వెడతారుకాని యీపక్కకిరారు. ఎవరైనా వస్తే మాత్రం ఇతడు వాళ్లని వదలి పెట్టేవాడుకాదు. వాళ్లకు విందులు చేసి వేటలు ఏర్పాటుచేసి, ఆదరించేవాడు. ఇతడు కాపురం ఉన్న ఇంటికి ఎదురుగా చిలక సంద్రంలో రెందుమైళ్లదూరంలో పదిహేను అడుగుల చతురంగల ఒక చిన్న లంకవున్నది. దానికి బ్రేక్ ఫాస్టు ఐలెండు అనిపేరు. తనపనికి ఎవరూ అంతరాయం కలిగించకుండా ప్రశాంతంగా చేసుకోవడానికని ఆలంక మీద ఒక్కటేగది కట్టించి అది తన ఆఫీసు అన్నాడు. ఆగదిపైన స్తూపీబురుజులాగు గోపురం ఒకటి కట్టించాడు. ఆ బురుజులో ఒక దీపం వేళ్లాడ గట్టేవాడు. దీనిని దీపస్తంభం అనేవాడు. తన రివిన్యూ లెక్కలూ, రికార్డులూ అన్నీ ఈ గదిలో పెట్టించాడు.

ఈ జిల్లా పరిస్థితులు బాగాలేవని మద్రాసు గవర్నమెంటు పంపిన తాఖీదును ఇతడు చిత్తుకాగితాల బుట్టలో పడవేశాడు. లెక్క పుస్తకాలన్నీ చెన్నపట్నం పట్టుకురావలసిందని మళ్లీ తాఖీదువచ్చింది. దానికి సరియైన సమాధానం వ్రాయలేదు. వర్షాకాలంలో పూరీ రేవులోకి ఓడలు సరిగా రాలేవని ఇతడు ఎరుగును. ఇలాగు రెండేళ్లు గడిసిన తరువాత అధికారులు కలెక్టరేటును వశంచేసుకుని స్నాడ్ గ్రాసును అతని పుస్తకాలను చెన్నపట్నం తీసుకొని రావడానికి కొంతమంది సోల్జర్లను పంపడానికి నిశ్చయించారని ఇతనికి తెలిసింది. వీళ్లు ఇక్కడికి రావడానికి తనకు తెలియ చేయడానికి వేగులవాళ్లను పెట్టి వాళ్లు వారం రోజుల దూరంలో ఉన్నారని తెలియగానే ఇతడు లెక్క పుస్తకాలన్నీ ఒక పడవలో పెట్టించి ఒడ్దుకు పట్టమన్నాడు. పడవ బ్రేక్ ఫాస్టులంకకు తీరానికి మధ్యకు రాగానే పడవ చీల ఒకటి ఎలాగో వూడి వచ్చింది. ఆ పడవ, దానితో పాటు పుస్తకాలూ మునిగిపోయాయి. పడవవాళ్ళు మాత్రం ఈదుకుంటూ ఒడ్దుకు వచ్చారు. సోల్జర్లు వచ్చినాక స్నాడ్ గ్రాసు ఈ సంగతి ఆ చిన్న దళాధిపతికి చెప్పాడు. అతడు ఏంచేస్తాడు? స్నాడ్ గ్రాసును చెన్నపట్నం తీసుకొని వెళ్లాడు.*[1]

ఇక బ్రౌనుదొర ఏం చేస్తున్నాడో చూద్దాము. ఎలాగైతేనేమి బ్రౌను ఎంతో తంటాలుపడి చాలాసంగతులు బయటికి లాగాడు. వీటిని బట్టి స్నాడ్ గ్రాసుపైని కేసు పెడదామని మద్రాసు గవర్నమెంటువారు ఆలోచించారు కాని ఇలాంటికేసు విచారింఛడానికి చెన్నపట్నం సుప్రీము కోర్టువారికి అధికారం వున్నదో లేదో అని అనుమానం కలిగినందువల్ల ఇది మానుకున్నారు. 1800 సంవత్సరం మొదలు 1804 వరకూ ఏమీ పనిలేకుండా స్నాడ్ గ్రాసును చెన్నపట్నంలోనే వుండమన్నారు. విలియం బెంటింక్ గవర్నరుగా ఉండగా ప్రభుత్వంవారు 1804 లో ఇతని పని తీసివేశారు. అంతట స్నాడ్ గ్రాసు తన డబ్బాడవాలీసర్దుకుని సామానులు తీసుకొని ఇంగ్లాండుకు ఓడ ఎక్కాడు. ఇతడు 27 సంవత్సరాలు కంపనీవారికొలువులో పనిచేసి జీతం కొద్దిపాటిదైనా పెద్దసంపద ఆర్జించాడు. ఇతడు తన సంపదతో పాటు ఇంగ్లాండుకు పరువు ప్రతిష్టలు కూడా తెచ్చుకోవడం వల్ల తూర్పుఇండియా కంపెనీ డైరెక్టర్లు తమ ఉద్యోగుల కెచ్చే పించను ఇతనికి యివ్వడానికి నిరాకరించారు. దీనికి ఉపాయ మేమిటని ఇతడు ఆలోచించాడు. తనహక్కు నిలబెట్టుకోవాలనీ కక్షసాధీంచాలని ఇతనికి బుద్ధి పుట్టింది. తనకు న్యాయం చేయకపోతే తమకూ కష్టం కలిగేటట్లు ప్రవర్తించవలసి వస్తుందని ముందుగా డైరెక్టర్లను ఇతడు హెచ్చరించాడు. ఈ బెదిరింపులకు వారు ఏమీ జవాబు చెప్పక ఉపేక్షించారు. కొన్నాళ్లు గడవనిచ్చి ఇతడు కార్యాచరణకు పూనుకున్నాడు. చిరిగిపోయిన పాతదుస్తులూ పాకీవాళ్లు వీధులూడిచే చీపురుకట్టా కొని, ఆ పాతదుస్తులు వేసుకొని చీపురుతో లీడెన్ హాలు వీధిలో తూర్పు ఇండియా కంపెనీవారి దివ్యభవనం ఎదుట నిలిచి రోడ్డు ఊడ్చడం ప్రారంభించాడు. తాను ఎవరో ఇతరులకు తెలియకుండా ప్రచ్చన్నంగాగాక, బహిరంగంగా వచ్చి పోయేవారితో కుంపినీవారికి ఇండియలో ఉన్న మంచి ధనవంతమైన రాష్ట్రంలో తాము ఒక జిల్లాకు కలెక్టరుగా పనిచేసినాననిన్నీ వారికింద తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నమ్మకంగా పనిచేసినప్పటికీ తన పెద్దతనంలో తనకు ఏమీ యివ్వకుండా తినడానికి కూడు, కట్టుకోవడానికి బట్టకూడా లేకుండా వీధులలో ముష్టియెత్తుకొని బ్రతకమని వదిలి వేశారనిన్నీ తన కధ చిత్రవిచిత్రముగా వర్ణిస్తూ అతి దీనంగా చెప్పుకోసాగినాడు.

ఇప్పటివలెనే ఆ రోజులలోకూడా లీడెన్ హాలు వీధి లండనులో వచ్చిపోయేవారితో నిండి కిటకిటలాడే రాజవీధి. తూర్పుదేశపు సంపదలకును ఇంగ్లాండుకును గల పరస్పరసంబంధానికి బాహ్యచిహ్నంగా ఆ వీధిలో కంపెనీ వారి దివ్యభవనం అందరికీ కనబడుతూ వుండేది. ఇండియాదేశంలో సంపదలార్జించి వచ్చిన దొరలను 'నవాబు ' లని చెప్పుకునేవారు వీళ్లు లెక్క లేనంత ధనమార్జించి ఆ ధన కనక వస్తువాహానాలలో దొర్లుతూ ఒళ్ళుపైని తెలియక సౌఖ్యాలు అనుభవిస్తూ నీతినియమాలు లేక కళ్లు నెత్తినిపెట్టుకొని వ్రవర్తించడాన్ని గురించి ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ కధలలో వింటూ నాటకాలలో దర్శిస్తూవుండేవారు. ఇట్టి స్థితిలో ఆ ఇండియాలోనే పనిచేసివచ్చిన నిర్భాగ్యుడైన ఈ ఉద్యోగి ఈ వీధులలోనే ఇలాగ పాకీపనిచేస్తూవుండడం చూసి అనేకమంది ఇది ఏమిటని ఆలోచించడం ప్రారంభించారు. లండన్ నగరంలో గొప్పవారు నివసించే పడమటిభాగంలో దీనిని గురించిన గుసగుసలు బయలుదేరినవి. స్నాడ్ గ్రాసుకూడా తాను వేసిన వేషానికి అనుగుణ్యంగానే ప్రవర్తించేవాడు. పాపం, అన్యాయం జరిగిన కంపెనీ ఉద్యోగి అనిచెప్పి ఎవరైనా పెన్నీలు (సీమదేశపు నాణెం - నాలుగుడబ్బులు) యిస్తే కృతజ్ఞతతో పుచ్చుకొని జేబులో వేసుకొనేవాడు.

ఇత డీ కంపెనీ భవనం ఎదుట ఇలా వుండడం చూసేటప్పటికి కంపెనీ డైరెక్టర్లకు తలవంపుగా తోచింది. అందులో ముఖ్యంగా ఇతడు చీపురు పెట్టి వూడ్చే పెద్దమెట్లపైని వున్న పెద్ద సింహద్వారం దగ్గరనే ఈడైరక్టర్లు తను గుఱ్ఱపు సార్టు బండ్లలో దిగి లోపలికి వెళ్లవలసి వచ్చేది. ఈదివ్య భవనానికి వెనక ఒక చిన్న సందులోనుంచి లోపలికి పోవడానికి ఇంకొదారి వున్నమాట నిజమేకాని అది నౌకర్ల కొసం ఏర్పడినదారి. ఈపాపిష్టి ముండాకొడుకు మొఖం కనబడకుండా అక్కడ ఈ చిత్రం చూస్తూ నిలబడిన వాళ్ల లేవిడీలు తప్పించుకోవడానికిన్నీ అలాగ సందులొనుంచి లోపలికి దూరడం వారికి చాలా పరువు తక్కువగా తోచింది. పోనీ ఒక పోలీసు వాడిని పిలిచి ఈ "న్యూసెన్సు" మాన్పిద్దా మనుకుంటే ఇతడేమి నేరం చేశాడని పిర్యాదు చేయగలరు? స్నాడ్ గ్రాసు తన చర్యలవల్ల ఎలాంటి నేరమూ చేయడం లేదు. మునిసిపాలిటీ నిబంధననలలో దేనినీ మీరడంలేదు. పైగా అతడు చేసెపని పరోపకారంగా కూడావున్నది. ముఖ్యంగ వర్షంకురిసి బురదగా వున్నరోజున మహోపకారంగానూ వున్నది. అదిగాక అతనిపట్ల ప్రజలందరికీ అమితమైన జాలి కలుగుతూ వున్నది.

ఈ కంపెనీ డైరక్టర్ల కోర్టువారికి హిందూదేశంపైన అమితమైన అధికారాలున్నాయి. అక్కడ తమ నిరంకుశాధి కారాలను చలాయించడంలో వీరు ఏమాత్రమూ వెనుదీయరు; ఎంత క్రూరంగా నైనా ప్రవర్తిస్తారు; కాని తమ కార్యాలయం గుమ్మం ఎదుటనే తమ కింద పూర్వం పనిచేసిన తాబేదారు డొకడు తమ అధికారాన్ని ధిక్కరించి నవ్వుబాటు చేస్తువుంటే వీరు దీని కే ప్రక్రియనూ చేయలేక పోతున్నారు. ఇదిచూచి ఇతరులుకూడా ఇలాంటి పెంకితనాలు మొదలు పెడతారేమో! అందువల్ల డైరక్టర్ల కోర్టువారు మొదట కోపంతో మండి పడినా వీధిలో ఈ అప్రతిష్ట మాన్పుకోడానికి ఏదో మార్గం యోచించక తప్పినదికాదు. స్నాడ్ గ్రాసుతో రాజీ చేసుకొవడమే ఉత్తమ మార్గంగా కనబడింది. ముందుగా అతడు చేస్తూవున్న చర్య మానివేస్తే అతని వ్యవహారం మళ్లీ ఆలోచిస్తామని కంబురంపారు. తనతోపాటు ఉద్యోగం చేసినవారికి న్యాయంగా వచ్చే పించను మొత్తమునేే తన పని తొలిగించిన తేదీ లగాయతూ తనకు కూడా మంజూరు చేసేవరకూ తన చర్యను విరమించనని అతడు చాల మర్యదగా మళ్ళీ కబురంపాడు. డైరెక్టర్లున్నూ వారి చైర్మెనుగారున్నూ బింకాలు మానివేసి స్నాడ్ గ్రాసు కోరికలను చెల్లిస్తూ తీర్మానాలు చేశారు. అంతట ఆ మర్నాడు స్నాడ్ గ్రాసు నుంచి కొత్తసూటు దొరటోపీ వెసుకొని జోడుగుర్రాల బండి యెక్కి *[2] డైరెక్టర్ల కోర్టువారికి వందనా లర్పించడానికి వచ్చి 'అయ్యా ఇప్పుడు మీరు నా ఆదాయం సాలుకు 5 వేల పౌనులు అయ్యేటట్టు చేసినా' రని అన్నాడట! ఈ మాట వినేటప్పటికి వాళ్ళందరూ తెల్లపోయారు. ఈదృశ్యం సరిగా వర్ణించడానికి ఎవరితరము?

స్బాడ్ గ్రాస్ చిలకసరస్సు దగ్గర రుచి మరగిన సౌఖ్యాల నన్నింటినీ మళ్ళీ స్వేచ్చగా అనుభవించడానికి మళ్లీ అతనికి అవకాశం కలిగింది. అతడు మళ్లీ తలయెత్తాడు. ఇప్పటిలాగే ఆ రోజులలో షోకీళాలందరూ నివసించే మేఫెయిరులో చెస్టరుఫీల్దు వీధిలో ఒక దివ్యభవనాన్ని ఇతడు తీసుకున్నాడు. దానిని చక్కగా అలంకరించాడు. కొన్నాళ్లు అయ్యేటప్పటికి ఉద్యోగరీత్యా అతనికి తటస్థించిన లోటుపాటులు అందరూ మరిచిపోయారో, లేకపోతే ఇలాంటి లోపాలు అందరికీ వుంటాయని సరిపెట్టు కున్నారో, కాని అందరూ అతనిని మర్యాద చేసేవారు. ఇతడు తన కాలంలో ఇండియానుండి వచ్చిన ప్రముఖులైన వారిలో ఒకడైనా ఇలాగ అతడు నలుగురిలో గౌరవంగా వుంటూ 1824లో ఓరియంటల్ క్లబ్బు స్థాపించడానికి కారకులైనాడు. దానిలో ఇండియాలో గవర్నర్లుగానూ సేనానులు గానూ పనిచేసిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టను, విలియం బెంటింగు, సర్ జాన్ మాల్కలం సర్ తామస్ హిన్లస్, మొదలైనవారు ఇతనితోపాటు సభికులైనారు. ఇతడు మెరైన్ సొసైటీలో 15 సంవత్సరాలు సభికుడుగావుండినాడు. స్త్రీల ఆసుపత్రికి కూడా ఇతదు పోషకుడుగా వుండినాడు. ఇలాగ లండనులో పేరెన్నిక పొందిన వారిలో ఒకడుగా నుంటూ ఇతడు 1834 వ సంవత్సరం ఆగస్టు నెల 29 వ తేదీన దివంగతుడైనాడు. స్నాడ్ గ్రాసు చనిపొవడానికి మూడేండ్ల క్రిందట ఒక విల్లు వ్రాశాడు. ఇతడు రసెల్ అనే వితంతువుయొక్క పెళ్ళిగాని పెదకుమార్తెయైన ఎలిజాకు ఒకలక్ష 73 వేలపౌనులు చెందచేసినాడనిన్నీ, దీనికి కరణం ఆమె తండ్రి తనపట్ల దయగా వుండడమే ననిన్నీ జంటిల్మెన్సు మాగజీనులో ప్రకటించారు. కాని ఇది సరి కాదనిన్నీ, ఆవిల్లు తాను చూచినాననిన్నీ ఇండియాలో చిలకసరస్సుతీరంలొ గల తనకున్న ఇంటినీ, భూమినీ తన స్నేహితుడైనట్టిన్నీ ఖాండ్లింగు ఆసుపత్రిలో వున్నట్టిన్నీ గేబ్రేల్ గిల్బర్దుకు చెందచేసినాడనిన్నీ, తన స్నేహితులకూ, స్నేహితు రాండ్రకూ యీ క్రిందివిధంగా ఇలా మొత్తాలు చెంద చేసినాడనిన్నీ చార్లెస్ లాసన్ గారు మెమరీస్ ఆఫ్ మద్రాస్ (Memories of Madras) అని తాను రచించిన పుస్తకంలో వ్రాశారు, స్నాడ్ గ్రాసు వ్రాసిన మరణశాసనము ప్రకారము అతడు చెందచేసిన ఆస్తి చాలా వున్నది.

అప్పర్ గిల్డు స్ట్రీటు ఫౌండ్లింగ్ ఆస్పిటలులో నున్న గేబ్రిల్ గిల్బర్టుకు, రంబలో చిలక సరస్సుఒడ్దున వున్న ఇల్లు, భూమి (గడచిన 30 సం||లనుంచి ఖాళీగావుండి కంపెనీవారి తాలూకు 2500 పౌనుల బాండుక్రింద వుంటూవున్న ఆస్తిని ఇచ్చినారు.

4000 పౌన్లు ఎలిజారస్సెల్ ను, కిల్లెటను, హ్యుఎడ్వర్డ్సును, మేజర్ జాన్ స్మిత్తును ఎగ్జిక్యూటర్లుగా నియమించి వారికి చెరివక వేయిపౌనులు మొత్తం పౌ.4000-0-0 లు యిచ్చాడు.

1000-0-0 పౌనులు ఎలిజబెత్తుగిల్లెటుకూ, మిసెస్ కవర్లుకూ దానిపైని అయివేజు యివ్వగలందులకు.

    1000-0-0 పౌనులు (సవరసులు) అనీ జెఫ్రీకి
    1000-0-0 " " చార్లటీ హంప్ స్టెడ్ కు
     400-0-0 " " తామస్ ఫ్లక్ కు
     200-0-0 " " హెన్రీ బాసన్ కు
     200-0-0 "  : రెబెకా పాట్రిడ్జికీ

     1000-0-00 పౌనులు (నవరసులు) సారా స్లిన్ సన్ కు
    10000-0-0 " " మెరైనుసొసైటీట్రస్టీలకు
    10000-0-0 " " సీమెన్సు ఆసుపత్రికి.

5000 పౌనులు తనసొదరికి దానిపైన అయివజును యిచ్చుటకు, ఇదిగాక తనకు సాలుకు 1200 పౌనులు ఆదాయము వచ్చేరొఖ్కం 40 వేల పౌనుల విలువగల పదిలక్షలఫ్రాంకులు ప్యారిసులో సత్రములు వున్నవనిన్నీ, ఈ సత్రములున్నూ చస్టరుఫీల్డు వీధిలొవున్న 10 వ నెంబరు యిల్లున్నూ అందులోవుండే సామానూలున్నూ గుఱ్ఱపుబండి ఇతర చరాస్తిన్ని మరణశాసనంలో చెప్పకుండా విడిచిన ఆస్తియావత్తున్నూ ఎలిజారస్సెల్ కన్యకు చెందచేస్తున్నాననిన్నీ, మరణశాననం ప్రకారం మిగిలినఆస్తి తన ఎగ్జిక్యూటర్లకు చెందవలననిన్నీ శాసించాడు. రంభలో వున్న స్నాడ్ గ్రాసు తాలూకు భవనం యిప్పుడు కళ్ళికొట రాజాగారి అధీనంలో వున్నది.


2. జిల్లా శిరస్తాదారు

ఇంగ్లీషువర్తక కంపెనీవా రీ దేశాన్ని పరిపాలించడం ప్రారంభించిన తరువాత చాలాకాలంవరకూ ప్రభుత్వశాఖలలో పెద్ద వుద్యోగాలెవీ దేశీయుల కెచ్చేవారు కారు. ఉద్యోగా లివ్వడంలో జాతి మత వర్ణవివక్షత చూపబడదని పార్లమెంటు వారు 1233 లో శాసించి నప్పటికీకూడా తెల్లవారు చెయ్యడానికి అంగీకరించని చిన్న జీతాల వుద్యోగాలను మాత్రమే మనవాళ్ల కిచ్చేవారు.

తాశీల్దారులు

అప్పట్లో రివిన్యూశాఖలో మనవాళ్లు చేసే పెద్ద ఉద్యోగం తాశీల్దారీ, అప్పటికి చదువుకున్నవాళ్లు బ్రాహ్మలే గనుక చాలామంది తాసిల్దారులు బ్రాహ్మణులే. ఈ తాశెల్దారులకు ఆ కాలంలో రివిన్యూ వసూలుతో పాటు నేరాలు విచారించే పోలీసు అధికారం కూడా

  1. * (Glimpses of Hidden India - John Law 1909. pp.91-93)
  2. *ఈ కధ కొన్ని సంవత్సరాలక్రిందట పయెనీరు పత్రిక వ్రాసింది. బెయిలీ గారు కూడా మళ్ళీ వ్రాశారు. అతడు నాలుగు గుర్రాల బండిలో వెళ్ళాడని పాఠాంతరము.