Jump to content

కంకణము/మెఱపులు - నక్షత్రములు

వికీసోర్స్ నుండి

మెఱపులు - నక్షత్రములు

గీ. బంధురవినీల కంధరపటలినుండి
   వెడలఁదొడగె విద్యుల్లతా వితతు లంతఁ
   జటుల గహనాంతరోజ్జ్వల జ్జ్వలనజనిత
   కీలికా భీలమాలికాకృతుల లీల.

శా. మెండై నిండు నవిద్య, విద్యలనమై మృగ్యంబుగానుండు బ్ర
   హ్మాండంబం ; దటులయ్యు విద్యయె యవిద్యం గూల్చునంచున్ మహో
   ద్దండ ధ్వాంతవితానముం దొలఁచి సద్యస్స్వల్ప శంపాలతా
   తండంబుల్ వివరింపఁగా దొడఁగె విద్యామాన దండంబులై.

ఉ. చెల్లు సమస్తజీవులును జెల్లి నయంతనె వానియందు రం
   జిల్లు పరాత్పరద్యుతియుఁ జేరునుదత్పరమాత్మయందె; మా
   చెల్లెడునట్టి కాలమును జేకురెనోయన విద్యమానవి
   ద్యుల్లతికానికాయము లధోగతి భీతి ఘటించె నక్కటా

శా. పోయెన్ ముందటిఖేచరత్వ విభవంబుల్; వ్యోమమానారక
   బాయెన్; బాపులమైతి మేమకట! మాయంగంబులంగ్రుచ్చనుం
   దీయంజల్పెడు క్రూరకింకరుల యుద్దీస్తాగ్ని సంత ప్త దీ
   ర్ఘాయోదండములయ్యె నయ్యెడల యాతాయాతశంపాలతల్.

ఉ. నెట్టనఁ జిట్టచీకటిమునింగిన యట్టి జగంబుమాకుఁ గ
   న్పట్టమి మార్ధ్వదృష్టి పరుపంగఁ బ్రపంచపుదృష్టికడ్డముం
   గట్టిన మేలినీలి తెరకైవడి మాజలదాళి గ్రాలఁగాఁ
   బట్టపురాణులట్ల కనుపట్టెను మాపయిఁ దారకావళుల్.

శా. ఔరౌరా! పతిరాని రాతరుల మేలౌ నంబరాలంకృతా
   కారస్ఫూర్తుల స్వేచ్ఛఁగాంచెదరు; రాకంగంటిరాతారకా
   నారుల్ మెల్లనఁ జాటుచాటునన యుండంబోదు రే తద్దురా
   చారంబుల్ వ్యభిచారకామినులసంచార క్రమంబుల్ గదా!

నా. రాజుంగాంచిన కంటితోడఁగనిభర్తన్ మొత్తెనన్నట్లుమున్
   రాజుంగాంచిపతిన్ మొఱంగె నొకతారాకాంత; నానాది శా
   రాజుల్ తారలఁగూడునాఁడు వ్యభిచారంబేరు శంకింతు రం
   చేఁ జింతించితినాఁటితామనపు రేయిం దారలంజూచుచున్.

మ. అకలంకోజ్జ్వల తారలం బొదివి భావాభావ మధ్యాల్ప తా
    రక లందందునఁ జుట్టుజేరె ముదమారన్ రత్నభూషాంబర
    ప్రకరోద్యద్రమణి జనాభరణ సౌభాగ్యంబువీక్షించు వే
    డుకతోడన్ నిరుపేదరాండ్ర రిగిచుట్టుంజుట్టు చందంబునన్.

గీ. తఱచు తెగి వ్రాలుచుక్కలు ధరణిఁ బడఁగ
   నెడములేక మామేఘాళి నడుమఁ జిక్కి
   యొండొకనభంబు గల్పించుచుండె మాకు
   నభ్ర మన్వర్థనామధేయంబు గాఁగ.

శా. దేశంబున్ విడియేగె భర్త, జగమెంతేమెచ్చు మీమేఘసం
    దేశంబన్నను, మాకు నున్న దొకసందేశంబుగొంపోయి మా
    యాశల్ దీర్పుఁడటంచు దెల్పుఁడని చంద్రాబ్జాన్యలంపన్ దదా
    దేశంబుం గొనివచ్చు దూతికలరీతిన్ వ్రాలె నత్తారకల్.

మ. అమితోగ్రాకృతి నుద్భవించి సకలాశాంతంబులన్ శ్రీమహే
    శ మహాలింగము వ్యాప్తమౌ నెడవిరాజత్పారిజాత ప్రసూ
    నములన్ వేల్పులు పూజసల్పెడు విధానంబెల్ల మా మేచకా
    భ్రముపై వ్రాలెడు తారకావళిస్ఫురింపంజేసె మాకయ్యెడన్.

శా. తారామండలమందె యంతవఱకంతర్భూతుఁడై వింట దు
   ర్వారాస్త్రంబులఁ గూర్చి మారుతుడు మా పైనిం బ్రయోగింపఁ ద
   న్నారాచానలకీలికావళియొనా నాఁ డావియన్నిర్లళ
   త్తారావారము మా కపారభయదోత్పాతంబె యయ్యెంగటా!