కంకణము/భూపతనముగాకుండఁ గంకణ మీశ్వరునిఁ బ్రార్థించుట

వికీసోర్స్ నుండి

భూపతనముగాకుండఁ గంకణ మీశ్వరునిఁ బ్రార్థించుట

శా. ఆయుత్పాతము లుప్పతిల్లుటయు నత్యాకస్మికంజౌ మహా
    వాయుధ్వానముమా చెవింబడియెఁదదద్ధ్వానంబు విన్పింపమా
    కాయంబుల్ గడు జల్లుజల్లుమనియెన్, గాయంబులున్ జల్లనన్
    మాయోగంబున నొక్క జల్లువడియెన్ మానుండిక్ష్మా మండలిన్.

ఉ. తొల్లిటి పుణ్యపాపములతోడనె నాకము నారకమ్ము సం
   ధిల్లఁగ వానినిన్ బడసి తీరి పదంపడి భూతధాత్రికిం
   ద్రెళ్లెడు జీవకోటులటు ద్రెళ్లె ననేక సహస్ర సంఖ్యలై
   జల్లున నేలపై ఁబడిన జల్లున మాజలబిందుబృందముల్.

క. ఆతఱి నేతఱి వాతా
   ఘాత మధ:పాతగతిని గల్గించునొ య
   న్భీతిన్ బింకము సెడి జీ
   మూతవ్రాతములు వడక మొదలిడె నకటా.

క. వికలమతిన్ మిపుల వికా
   వికలై యిల బడకయుండు వెరపున మావా
   రికణము లత్యాతురతన్
   జకచక వెనువెనుక కొదుగసాగెను మింటన్.

క. ఈతెరుగున నాభీకర
   వాతధ్వానమ్ముకతన వారిదములలో
   నూతనసంచలనం బు
   ద్భూతంబై మిపుల దివులుపుట్టించుటయున్.

ఉ. ప్రాంతచరత్పయ:కణకృపాపరిలబ్ధసుఖస్థిన్ దదీ
   యాంతరమందు డాఁగి పవనాహతిఁ ద్రెళ్లకమున్న నిశ్చల
   స్వాంతముతో నుమారమణుఁ జర్వితచర్వణమైన యిట్టి జ
   న్మాంతరముల్ ఘటింపవలదంచును వేడుకొనందొడంగితిన్.

శా. వందేశంకర మిందుశేఖర ముమాప్రాణేశ్వరం సంతతా
    నందశ్రీవిభవప్రదం విబుధసంతానార్పి తాత్యుల్లస
    స్మందారాంచిత నుంద రాంఘ్రి యుగళం మన్నాధ మర్కోజ్జ్వలం
    కందర్పాంతక మంబుజేక్షణసఖం కైవల్య సంధాయకమ్‌.

శా. వ్యాసాగ స్త్యవసిష్ఠనారద భరద్వాజాదిసన్మున్యుప
    న్యాసాధారగుణాలయాయ భవబంధత్రాసనాశాయ కై
    లాసశ్రీవిభవాయ పంకమయదుర్లంఘ్యోచ్చలజ్జీవనా
    వాసక్లేశహరయ భక్తహృదయావాసాయ తుభ్యన్నమ:.

శా. నాకుం జెల్లెనె ఖేచరత్వజనితా నందైకభాగ్యంబు? నా
    నాకూపస్థ దురంతపంకనిచయాంతర్మగ్న సంతాప మెం
    తో కాలంబయి పొందుచుందుఁ గరుణాదూరుండవై నన్ను నిం
    కేకూపంబునఁ ద్రోయ నెంచితొకదోయీ! తండ్రి! మృత్యుంజయా!

మ. భవఘో రార్ణవవీచికాతరణసంపత్కారణం బెన్నఁగా
    భవదంఘ్రి స్మరణంబ! యన్యతరణోపాయంబు లే దింక, నీ
    భవసంతాపభరంబు దుర్భరము, నాప్రాపీవె కాపాడు మో
    భవదూరా! యభవా! భవా! శివ! శివాప్రాణేశ! మృత్యుంజయా.

శా. నీవారిన్ నిరతంబు నీవు కరుణానిర్నిద్ర భద్రాత్ములన్
    గావింపం దలపోసె; దేము నభిషేకస్ఫూర్తి నేవేళ నీ
    సేవాన్చావిధు లాచరించు టెదలోఁ జింతించి మావారినిన్
    నీవారిం బలెబ్రోవఁగాఁదగదె తండ్రీ! నీకుమృత్యుంజయా!

శా. లోనం బుట్టవు కీటకచ్ఛటలు, కల్లోలంబులుం గల్ల, విం
    తేనిన్ వక్రత నేఁగుజీవనములే, దేపంకసంపర్కమున్
    గానన్ రాదు; వియచ్చరత్వమ సదా కల్పించి నా కీపయిన్
    రానీకయ్య! పునర్మహీపతనసంత్రాసంబు మృత్యుంజయా!

మ. భువిఁ జచ్చున్ దివి జొచ్చు; నచ్చటను జావుం గాంచి చొచ్చున్ భువిన్
    భువిచావున్ దివిచావు నాఁగ నిటుచావుల్ రెండు భూతాళికిన్;
    భువి చావున్సుఖసుప్తివోలెఁ బడయంబో నౌనుగాకక్కటా
    దివి చావున్ ననుఁజావనీకుముకపర్ది స్వామి! మృత్యుంజయా!

మ. బహుధాభూతవిలాసకందుకకళాప్రజ్ఞన్ సదా తన్ముహు
    ర్ముహుకుద్య త్ప్రపతద్గతి క్రమములన్ మోదింతె? యుష్మత్కరా
    బ్జహతిన్ మింటికిఁ దూలి నేలఁ బడగా సంసిద్ధమైయుంటి, నీ
    కుహనాభేలస మేలనాయెడల నీకుందండ్రి! మృత్యుంజయా!

శా. గంగాశీతలశీకరప్రకరసాంగత్యంబు దివ్యాంగనా
   సంగీతామృతపానవైభవ ముదంచత్కామరూపంబు, నా
   కుం గల్పింపుము శాశ్వతమ్ముగ నధ;కూపమ్ము చేకూర్ప కో
   గంగాసంకలితోత్తమాంగ! భవభంగా! లింగ! మృత్యుంజయా!