Jump to content

కంకణము/అంధకార వర్ణనము

వికీసోర్స్ నుండి

అంధకార వర్ణనము

మ. అకటా! మమ్మటు లావియచ్చటుల కారాగారమందుంచి, కం
    టకుఁడౌ తుంటరి గాలిదయ్యమపు డంతర్ధానమైపోయె; మే
    మొకటన్ మింటను గడ్డవారి చలనం బొక్కింతయున్లేక, యూ
    రక వర్షించితి మంధకారఘన ధారాపూరముల్.

క. ప్రాచి నవాచిఁ బ్రతీచి ను
   దీచిన్ బహుధాసముత్పతిత వితత తమో
   వీచీనిచయము చెలఁగెను
   మాచేత సమాసచేత మహి నమితంబై.

గీ. భీకరాకృతి సూచి కాభేధ్యమాన
   భూరినీరంధ్ర నిబిడాంధ కారఘోర
   వారినిధిపొంగి జగము ముంపంగ నాఁటి
   రాత్రి ధాత్రికిఁ బెనుకాళరాత్రి యయ్యె.

సీ. పరమేశ్వరా భానదురిత భావమ్ము వి
            ధాన నాస్తికతాప్రధాన మగుచు
   సంతత క్లిష్ట దుష్ట ప్రబంధంబ ట్ల
            గోచరాఖిలవస్తుగుణము నగుచు
   కపటమిత్రుని మైత్రికరణి క్షణక్షణ
            జాయమాన భయాతిశయము నగుచు
   అతిదరిద్రు మహానసాగారమును బోలెఁ
           జూడఁజూడఁగ సర్వశూన్యమగుచు

   నిర్ధనమనోరథము లీల వ్యర్థమగుచు
   నక్షరాపేతు హృదయమ ట్లంధమగుచుఁ
   ద్యాగరహితు రాజ్యమువోలెఁ ద్యాజ్యమగుచుఁ
   దమము గ్రమ్మినజగ మధమముగ ఁదోచె.

శా. మాకుం గ్రమ్మఱఁగానరాఁ డెచటికమ్మా యానిలుండేఁగెనో
    నాకారామచరత్సురాంగనలఁ గానంబోయెనో లేక గం
    గాకల్లోలవిలాసడోలికల నూఁగంజొచ్చెనో భూతలం
    బాకల్లాడదు నాఁటిరేయిని సమస్తాశాప్ర దేశంబులన్.

ఉ. స్థావరజంగమాత్మకము సర్వజగంబును నాఁడు కేవల
   స్థావరగూపమయ్యెను; గుజవ్రజముల్ చలనస్వభావమున్
   బో విడనాడి పూనెను దపోనియమంబు తమోనివృత్తికిన్
   క్ష్మావలయంబు నిశ్చలసమాధిమునింగెను శాంతిమంతమై.

క. ప్రాణా పానసమానో
   దానవ్యానములె జీవధారణమునకున్
   మేనుల మిగులఁగ, మిగిలిన
   భూనభముల ననిలచలనములు తొలఁగి చనెన్.

శా. ఆపై నుక్క విషజ్వరాకృతి నవార్యంబై విజృంభించుచున్
    దాపోద్రేకము నస్త్రవర్జనము నిద్రాహీన భావంబుని
    ర్వ్యాపారమ్ము హిమోపచారమసుఖాహారంబు దుర్వారఘ
    ర్మాపూరమ్ము విదాహబాహ్యగతశయ్యల్ గూర్చె మర్త్యాళికిన్.

శా. ఆరాత్రిన్ నిజభర్తృవక్త్రగతఘర్మాంకూరముక్తాఫలా
    కారస్ఫూర్తుల కానతస్మితదళత్కంజాస్యలై, తఛ్చ్రమం
    బారన్‌వీచిరి తాళవృంతముల శుద్ధాంతంబులందున్న కాం
    తారత్నంబులు రత్నకంకణఝణత్కారంబు లేపారగన్.