కంకణము/కంకణము మేఘం బై సంచరించుట
కంకణము మేఘం బై సంచరించుట
మ. ఒకనాఁ డిట్లెపయోదమండలగతో ద్యోగ ప్రమోదంబునన్
స్వకులాంభ:కణరాశితోడుత నభోభాగంబునం గామరూ
పకలాకౌశల ముల్లసిల్ల బహురూపస్ఫూర్తులం దాల్చి, యా
డుకొనం జొచ్చితి మాప్రభాకరు ప్రభాటోపంబు మాటొందఁగన్.
శా. పారావారధరాధరోన్న తతరువ్రాతాపగా ఘోరకాం
తారాకారములా, సమస్తవనసత్వ ప్రస్ఫుటన్మూర్తులా;
నీ రేజోద్భవు సృష్టిరూపముల నన్నింటిందగన్ దాల్చి, రం
గారం జూపితి మప్పు డభ్రతలరంగన్నా ట్యరంగమ్మునన్.
సీ. మొత్తమ్ము లై పాఱు మత్తేభముల గూడఁ
బిల్ల యేన్గులు వెంటఁ బెట్టినట్లు
అత్యున్న తములౌ మహాపర్వతబుల
చుట్టు గుట్టలు కొన్ని పుట్టినట్లు
పేర్చి పెట్టిన దూదిపిండునుండి యనేక
తూలాంకురంబులు తూలినట్లు
సాంద్ర నీరంధ్ర వృక్ష చ్ఛటాచ్ఛాయలఁ
బలు గుజ్జుమ్రాఁకులు మొలచినట్లు
ప్రకృతి ప్రకటించు నఖిలరూపములతో న
లంకృతం బయి నీలాకలంకసకల
గగనభాగంబు లావేళఁ గ్రాలె నూత్న
కళల మాఖేలనాకలాకలవలన,
శా. నీలస్నిగ్ధవియత్తలం బనెడు మేల్నిద్దంపు టద్దంబునన్
భూలోకప్రతిబింబ మీకరిణిఁ గన్గో నయ్యెనో; యమ్మరు
జ్జాలంబుల్ గన మర్త్యలోక ప్రకృతిచ్ఛాయాపటం బిట్టులా
కాలాఖ్యుండు రచించెనో యనఁ గడున్ గన్పట్టె మాయా కృతుల్.