కంకణము/పూర్వ చరిత్రము

వికీసోర్స్ నుండి

కంకణము

పూర్వ చరిత్రము


చ.

అణువునయందు మేరుగిరియందును నిత్యము నొక్కరీతి న
య్యనుపమమౌపరాత్పరు మహత్తర తేజము వెల్గుఁగావునన్
గనుఁగొన నొక్క కంకణమెకా యను నీరసభావ మూన కో
యనఘన చరిత్రులార! వినుఁ డయ్య! మదీయకథావిధానమున్.



చ.

జలముల నేర్పడున్ జనదసంచయముల్, జలముల్ జనించున
జ్జలధరజాతమందె; మది సంశయమయ్యె మదీయజన్మమీ
జలజలదంబులం దెటనో; సర్వచరాచరకోటి సాటిగా
నలినభావాండమందెజననంబని మాత్రము విన్నవించెదన్.


చ.

ఖరకరు గ్రీష్మభీష్మకరకాండముఖంబున నెన్నిమాఱు లే
నరిగితినో నభంబునకు, నభ్రమునుండి మఱెన్నిసారు లే
నురనడి జారి భూపతన మొందితినో; బుధులిట్టి జన్మముల్
మరణములుం గణింప రిట మజ్జననక్రమగాథ లేటికిన్ ?


శా.

నాపాపం బది యేమొకాని భువి నానాయోనిసంజాతుఁడౌ
పాపాత్మున్ వలెఁ బెక్కు జీవనములం బ్రాపించుచున్ బుద్బుద
వ్యాపారమ్మున సంచరించితి ననేకాబ్దమ్ము లేతన్మహీ
వాపీకూపనదీనదాదిబహుళాంభశ్శ్రేణి మధ్యంబులన్.

మ. కలరూపంబు తొలంగి సూక్ష్మమగు నాకారంబుతో మింటికిన్
    బలుమా ఱేగుదు నేగి సర్వభువనావాసవ్యథా ఖేదముల్
    తలపోతున్ దలపోసి యంబరనటద్ధారాధరాకారని
    శ్చలసంచారసుఖంబు శాశ్వతముగా సర్వేశుఁ బ్రార్థించెదన్.