కంకణము/గంధర్వ గానవినోదము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గంధర్వ గానవినోదము

ఉ. ఏనిటు నాటియాటలను నింత వచింపఁ గడంగ నేటి? కా
   పైని లభించినట్టి ఘనభాగ్య మపూర్వము; దాని నెన్నఁ గా
   నౌనె? దినావసానసమయాన ననూనవిమానయానగీ
   ర్వాణవితానగానరసపానవిశేషము నాకుఁ జేకురెన్.

శా. హా! నాపుణ్యఫలం బదెట్టిదొ కదా! యానాఁట నానాట రా
   గానన్ గోకిల కాకలీకలకుహూకారంబులన్ మించు నా
   దానందంబున మున్గుచున్ జలకణం బై యున్న నేనామరు
   ద్గానానందసుధన్ సుధాకణమునై కంటిన్ వినూత్నప్రభన్.

సీ. మండు వేసగిలోని నిండుపున్న మనాఁటి
         జాబిల్లి వెన్నెల చలువలందు
   ప్రత్యూష సమయ సంభవమంద మలయమా
         రుతకోమలతరంగ హతులయందు
   పాలబుగ్గలు లొత్తవడ నోరఁ జొల్లూర
         బసిపాప లను ముద్దుపలుకులందు
   మందారమకరంద మాధుర్యధుర్యస
         త్కావ్యభవ్యకవిత్వ గతులయందు

   గలుగు వివిధసుఖంబు లొక్కటన చేర్చి
   పేర్చి గానం బనెడు పేరు గూర్చి సకల
   భోగ్యముగఁ జేసినట్టి యంభోజభవుని
   సృష్టి విరచనావిభవ మచ్చెరువు గాక.

ఉ. ఆయ సమానగాన విభవానుభవం బది చెప్పినంతసే
   పాయెనొ లేదొ నాదు శ్రవణావధి కెంతయు దాఁటిపోయినన్
   దోయకణంబు నేమఱలఁ దోయకణంబు నెయౌచుఁజింతతోఁ
   దోయమువారలంగలసితో యద మండలమందునుండఁగన్.