ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 8

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 8

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త,

సర్ జగదీశ్ చంద్ర బోసు

“జగదీశ్‌చంద్ర బోసు కనిపెట్టిన నిస్తంత్రి పరికరాలు మార్కొనీ వాటికంటె ముందటివే.”

రెచ్చగొట్టేటట్టున్న ఈ వ్యాఖ్యానం చెవిని పడగానే, దారి పక్కన నించుని శాస్త్రచర్చ జరుపుతున్న ఆచార్యుల బృందానికి దగ్గరగా వెళ్ళాను. వాళ్ళతో కలవడానికి నాలో కలిగిన ప్రేరణ జాతి దురహంకారమే. అయితే దానికి నేను విచారించవలసిందే. కాని కేవలం అధిభౌతికశాస్త్రం లోనే కాకుండా భౌతికశాస్త్ర రంగంలో కూడా భారతదేశం ప్రముఖ పాత్ర వహించగలదన్న విషయానికి సాక్ష్యం ఉందంటే, దాని మీద నాకు గాఢమైన ఆసక్తి లేదని చెప్పలేను.

“అంటే మీ అభిప్రాయం ఏమిటండీ?”

ప్రొఫెసరుగారు నా కోరిక మన్నించి ఇలా వివరించారు: నిస్తంత్రీ సంయోజకాన్నీ, విద్యుత్ తరంగాల వక్రీభవన సూచక పరికరాన్ని కనిపెట్టడంలో బోసు మొట్టమొదటివారు. కాని ఈ భారతీయ శాస్త్రవేత్త, తాను కనిపెట్టినవాటి మీద వ్యాపారంచేసి డబ్బు గడించడానికి పూనుకోలేదు. త్వరలోనే ఆయన, నిర్జీవ ప్రపంచం మీంచి సజీవ ప్రపంచం మీదికి దృష్టి మళ్ళించారు. వృక్షశరీరధర్మ శాస్త్రజ్ఞుడుగా ఆయన కని పెట్టిన విప్లవాత్మకమైన విషయాలు భౌతిక శాస్త్రవేత్తగా సాధించిన విప్లవాత్మక విజయాలను మించిపోయాయి.

ఆయనకు నేను మర్యాదగా కృతజ్ఞతలు తెలిపాను. ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఈ ప్రఖ్యాత శాస్త్రవేత్త మాతోబాటే ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు.”

మర్నాడు నేను, ఆ ఋషితుల్యుల నివాసానికి వెళ్ళి దర్శించాను. ఆయన ఇల్లు గుర్నార్ రోడ్డులో మా ఇంటికి దగ్గరిలోనే ఉంది. చాలా కాలంగా నేను ఆయన్ని దూరంనుంచే గౌరవభావంతో చూస్తూ ఉండేవాణ్ణి. గంభీరంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఈ వృక్షశాస్త్ర వేత్త, నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు. ఆయన మంచి రూపసి; దృఢకాయులు. ఏభయ్యో పడిలో ఉన్నారు. జుట్టు ఒత్తుగా ఉంటుంది. నుదురు విశాలం. కలలు కనేవాడి కళ్ళలా, పరధ్యానంలో ఉండే కళ్ళు ఆయనవి. ఆయన కంఠస్వరాల్లోని నైశిత్యం, ఒక జీవితకాలంలో అలవడిన శాస్త్రీయమైన అలవాటును తెలియజేస్తోంది.

“ఈమధ్యనే నేను, పాశ్చాత్యదేశాల్లో ఉన్న వైజ్ఞానిక సంఘాల్ని సందర్శించే యాత్ర పూర్తిచేసుకొని తిరిగి వచ్చాను. ప్రాణు[1]లన్నిటిలోనూ ఉన్న అవిభాజ్యమైన ఏకత్వాన్ని ప్రదర్శించే విధంగా నేను కనిపెట్టిన సున్నితమైన పరికరాలపట్ల, ఆ సంఘాల సభ్యులు గాఢమైన ఆసక్తి కనబరిచారు. బోన్ క్రెస్కో గ్రాఫ్‌కు, ఉన్నదాన్ని కోటిరెట్లు పెద్దగా చేసి చూపించే బ్రహ్మాండమైన శక్తి ఉంది. సూక్ష్మదర్శిని అయితే కొన్ని వేల రెట్లు మాత్రమే పెద్దగా చేసి చూపిస్తుంది; అయి నప్పటికీ అది జీవశాస్త్రాభివృద్ధికి గొప్పగా తోడ్పడింది. ఈ క్రెస్కోగ్రాపు లెక్కలేనన్ని మార్గాల్ని ఆవిష్కరిస్తుంది.”

“మహాశయా, నిరాకారమైన శాస్త్రహస్తాలతో పడమటి దేశాలు తూర్పుదేశాల్ని త్వరగా దగ్గరికి చేర్చుకోడానికి మీ రెంతో దోహదం చేశారు,” అన్నాను.

“నేను కేంబ్రిడ్జిలో చదువుకున్నాను. సిద్ధాంతాన్నంతనీ సునిశితమైన ప్రయోగాత్మక పునఃపరిశీలనకు గురిచేసే పాశ్చాత్య పద్ధతి ఎంతో హర్షించదగ్గది! తూర్పుదేశాల వారసత్వంగా నాకు సంక్రమించిన అంతఃపరిశీలనాశక్తికి, ఈ అనుభవిక ప్రక్రియ తోడయింది. ఆ రెండూ కలిసి చాలాకాలంగా మూగవోయి ఉన్న ప్రాకృతిక రాజ్యాల మౌనాల్ని తొలగించడానికి నాకు తోడ్పడ్డాయి. మొక్కలకు సున్నితమైన నాడీమండలం ఉందని, అవి భిన్నమైన భావోద్రేకాలకు గురి అవుతూ ఉంటాయని నా క్రెస్కోగ్రాఫ్[2] తాలూకు వివరణ పట్టికలు, ఎంతో సంశయశీలుడైన వ్యక్తికి కూడా, నిరూపించి చూపిస్తాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, భయం, సంతోషం, బాధ, ఉద్రిక్తత, మైకం, లెక్కలేనన్ని ఇతర ఉత్తేజకాలూ జంతువులన్నిటికీ ఎంత సర్వసామాన్యమైనవో, మొక్కలకు కూడా అంత సర్వసామాన్యమైనవి.”

“ప్రొఫెసరుగారూ! మీరు రంగంలోకి ప్రవేశించకముందు, సృష్టి అంతా ప్రాణంతో స్పందించడమన్నది కేవలం కవుల కల్పన అనిపించేది. వెనక, నాకు తెలిసిన సాధువు ఒకాయన, ఎన్నడూ పువ్వులు కోసేవారు కారు. ‘గులాబి పొదకున్న సౌందర్య గర్వాన్ని నేను హరించనా? మొర టుగా చెయ్యి చేసుకుని దాని దర్జాకు భంగం కలిగించినా?’ అంటూ సానుభూతిపూర్వకంగా ఆయన పలికిన మాటలు మీ ఆవిష్కరణల ద్వారా అక్షరాలా రుజువయాయి.”

“సత్యానికి కవి సన్నిహితుడు; కాని శాస్త్రజ్ఞుడు దాంతో మొరటుగా వ్యవహరిస్తాడు. ఒకనాడు ఎప్పుడయినా నా ప్రయోగశాలకు వచ్చి, క్రెస్కోగ్రాఫు కున్న తిరుగులేని శక్తిని గమనించు.”

ఆయన ఆహ్వానాన్ని కృతజ్ఞతతో అందుకొని బయటికి వచ్చాను. తరవాత, ఆ వృక్షశాస్త్రవేత్త ప్రెసిడెన్సీ కాలేజీనించి వెళ్ళిపోయారని, కలకత్తాలో ఒక పరిశోధన కేంద్రం స్థాపించడానికి పథకం వేస్తున్నారని విన్నాను.

బోస్ సంస్థ ప్రారంభించినప్పుడు జరిగిన సమర్పణోత్సవానికి నేను హాజరయాను. ఉత్సాహవంతులైన వందలాది జనం ఆ సంస్థ ఆవరణలో విహరించారు. విజ్ఞానశాస్త్రానికి నూతన నిలయమైన ఈ సంస్థ భవనం కళానైపుణ్యానికీ ఆధ్యాత్మిక ప్రతీకకూ ముగ్ధుణ్ణి అయాను. దీని ముఖద్వారం, దూరాన ఎక్కడో కొన్ని శతాబ్దాలుగా పాడుబడి ఉన్న దేవాలయ శిథిలాల్లోంచి తెచ్చినది. ఒక తామర కొలను వెనక, కాగడా పట్టిన స్త్రీమూర్తి శిల్పం ఉంది. అమరజ్యోతిని ధరించే వ్యక్తి గా స్త్రీపట్ల భారతీయులకున్న గౌరవాన్ని ఇది తెలియజేస్తుంది.[3] ఒక తోటలో చిన్న దేవాలయం ఉంది. అది భౌతిక విషయాలకు అతీతుడైన నిరాకారుడికి అంకితమైనది. అందులో విగ్రహమేదీ ప్రతిష్ఠ కాకపోవడం, భగవంతుడి నిరాకారతను సూచిస్తుంది.

ఆ మహోత్సవంలో బోసు ఇచ్చిన ఉపన్యాసం, దైవప్రేరితులైన సనాతన ఋషుల నోటినుంచి వెలువడ్డట్టుగా ఉంది.

“ఈనాడు నేను ఈ సంస్థను కేవలం ఒక ప్రయోగశాలగా మాత్రమే కాకుండా, ఒక దేవాలయంగా అంకితం చేస్తున్నాను.” భక్తిశ్రద్ధాభరితమైన ఆయన గాంభీర్యం, జనంతో క్రిక్కిరిసి ఉన్న ప్రేక్షకమందిరం మీద, కంటికి కనరాని ఆచ్ఛాదనలా భాసించింది. “నా పరిశోధన కృషిలో, నా దారి అనుకోకుండా, భౌతికశాస్త్రానికి శరీరధర్మశాస్త్రానికి మధ్య సరిహద్దు ప్రాంతంలోకి సాగింది. సజీవ జగత్తుకూ నిర్జీవ జగత్తుకూ మధ్య సరిహద్దు రేఖలు మాయమవడమే కాక అవి కలిసిపోయే స్థానాలు బయల్పడటం గమనించి ఆశ్చర్యపోయాను. నిర్జీవ పదార్థం జడేతరంగా, అసంఖ్యాక శక్తుల చర్యకు గురిఅయి సంస్పందిస్తున్నట్లు గోచరించింది.

“లోహాన్నీ మొక్కనూ జంతువునూ ఒకే సామాన్య సూత్రం కిందికి తేవడానికి సార్వత్రికమైన ప్రతిచర్య ఒకటి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ప్రధానంగా ఒకే విధమైన అలసట, కుంగుదల లక్షణాలను కనబరచడమే కాక, అలసటనుంచి తేరుకోడానికి పెరుగుదల పొందడానికి, మరణ సంబంధమైన శాశ్వత జడత్వం వహించడానికి గల అవకాశాలను కూడా కనబరిచాయి. అత్యద్భుతమైన ఈ సాధారణీకరణంతో ఆశ్చర్యంలో మునిగి, నా ఫలితాల్ని - అంటే, ప్రయోగాల్లో వెల్లడి అయిన ఫలితాల్ని- గొప్ప ఆశాభావంతో రాయల్ సొసైటీ -వారి ముందు ఉంచాను. కాని అక్కడికి వచ్చిన శరీరధర్మశాస్త్రవేత్తలు, నేను నా పరిశోధనల్ని, వాళ్ళ సంరక్షణలో ఉన్న రంగంలోకి అక్రమంగా చొర బడ నివ్వకుండా, నాకు తప్పకుండా విజయాన్ని చేకూర్చగల భౌతిక శాస్త్రానికే పరిమితం చేసుకోడం మంచిదని సలహా ఇచ్చారు. నేను అనుకోకుండా, అపరిచితమైన కులవ్యవస్థలోకి చొరబడి, దాని మర్యాదకు భంగం కలిగించాను.

“అజ్ఞానాన్ని విశ్వాసంతో కలిపి గందరగోళపరిచే దైవశాస్త్రపరమైన పక్షపాతం కూడా ఒకటి అనుకోకుండా పనిచేస్తోంది. నిరంతర పరిణామశీలమైన సృష్టి రహస్యంతో మనల్ని ఆవరించి ఉన్న భగవంతుడు, ప్రశ్నించి తెలుసుకోవాలన్న కోరిక కూడా మనలో పాదుగొలిపాడన్న విషయాన్ని తరచుగా మరిచిపోతుంటాం. నేను అనేక సంవత్సరాల పాటు ఇతరుల అపార్థానికి గురి అయినమీదట, విజ్ఞానశాస్త్రాన్ని ఆరాధించే శాస్త్రవేత్తల జీవితం, అందులేని సంఘర్షణ అని తెలుసుకున్నాను, కష్టనష్టాల్ని జయాపజయాల్నీ ఒక్కటిగానే భావించి, జీవితాన్ని అతడు భక్తిపూర్వకంగా అర్పణ చేసుకోవాలి.

“కొంతకాలానికి, ప్రపంచంలో ఉన్న ప్రముఖ వైజ్ఞానిక సంఘాలు నా సిద్ధాంతాల్నీ, ఫలితాల్నీ అంగీకరించాయి; విజ్ఞానశాస్త్రానికి భారతీయులు చేసిన దోహదాన్ని గుర్తించాయి. ఏదో స్వల్పమైనది లేదా గిరిగీసి పెట్టినది, భారతీయమైన మనస్సుకు ఎన్నడయినా తృప్తి నియ్య గలదా? ఈ దేశం, అవిచ్ఛిన్నమైన సజీవ సంప్రదాయంవల్లా పునరుజ్జీవన శక్తిపట్లా లెక్కలేనన్ని మార్పులకు లోనయి మళ్ళీ సర్దుబాట్లు చేసుకుంది. భారతీయు లెప్పుడూ, పక్కన ఉన్న తాత్కాలిక లాభాన్ని విడిచిపెట్టి జీవితంలో అత్యున్నత ఆదర్శాల్ని అందుకోడానికే- అదికూడా, నిష్క్రియాత్మకమైన త్యాగంద్వారా కాక, సక్రియాత్మకమైన సంఘర్షణ ద్వారా సాధించడానికే- దీక్ష వహిస్తూ వచ్చారు. ఏమీ సాధించకుండా, సంఘర్షణను నిరాకరించే దుర్బలుడికి త్యాగం చెయ్యడానికి ఏమీ ఉండనే ఉండదు. కష్టించి పనిచేసి జయం పొందినవాడే విజయవంతమైన తన అనుభవ ఫలాల్ని ప్రపంచానికి అందించి దాన్ని సుసంపన్నం చెయ్యగలడు.

“జడపదార్థం చూపించే ప్రతిచర్య గురించి, మొక్కల జీవితంలో వెల్లడి అయిన అనుకోని విషయాలగురించి బోస్ ప్రయోగశాలలో ఇప్పటికే జరిగిన కృషి, భౌతికశాస్త్రంలోనూ జంతుశరీరధర్మశాస్త్రంలోనూ వ్యవసాయశాస్త్రంలోనూ చివరికి మనోవిజ్ఞానశాస్త్రంలో సైతం, ఎంతో విస్తృతమైన పరిశోధన రంగాల్ని ఆవిష్కరించింది. ఇంతవరకు పరిష్కరించడానికి వీలుకావనుకున్న సమస్యలన్నిటినీ ఇప్పుడు ప్రయోగాత్మక పరీక్షాపరిధిలోకి తీసుకురావడం జరిగింది.

“అయితే ఘనవిజయమన్నది కఠోరమైన సునిశితత్వం సాధించనిదే చేకూరదు. అందుచేతనే నేను రూపొందించిన అత్యధిక సూక్ష్మగ్రాహక యంత్రాలూ పరికరాలూ ఒక వరసలో పొడుగ్గా, ఈనాడు మందిర ప్రవేశ విభాగంలో మీ ముందు నిలిచి ఉన్నాయి. భ్రాంతి కలిగించే ఆభాసకు వెనక అగోచరంగా ఉండే వాస్తవాన్ని తెలుసుకోడానికి కావలసిన సుదీర్ఘ ప్రయత్నాల్ని గురించి, మానవ పరిమితుల్ని అధిగమించడానికి అవసరమైన అనవరత పరిశ్రమ, పట్టుదల, ప్రతిభలనుగురించి తెలుపుతాయవి. భ్రాంతులకు వెనక ఉండే సత్యసూత్రాల్ని బయల్పరచగల నిజమైన ప్రయోగశాల మనస్సు అన్న సంగతి, సృజనాత్మక శాస్త్రవేత్తలందరికీ తెలుసు.

“ఇక్కడ ఇచ్చే ఉపన్యాసాలు కేవలం, ఇతరులు కనిపెట్టి చెప్పిన వాటిని చిలకపలుకుల్లా అప్పగించేటట్టు ఉండవు. ఈ ప్రయోగశాలలో మొట్ట మొదటిసారిగా కనుక్కొని, కళ్ళకు కట్టించే కొత్త ఆవిష్కరణల్ని ప్రకటిస్తాయవి. ఈ సంస్థ పక్షాన అప్పుడప్పుడు నియతకాలికంగా వెలువడే ప్రచురణల ద్వారా, భారతీయుల కృషి ప్రపంచానికంతకీ అందు తుంది. అవి ప్రజాసంపద అవుతాయి. పేటెంటు హక్కులు ఏర్పరచుకోడం ఎన్నడూ జరగదు. విజ్ఞానాన్ని ఎన్నడూ, వ్యక్తిగత లాభంకోసం మాత్రమే వినియోగిస్తూ అపవిత్రం చెయ్యకుండా ఉండాలన్నది మన జాతీయ సంస్కృతి ఆశయం.

“ఈ సంస్థలో సదుపాయాలు, వీలున్నంత వరకు, అన్ని దేశాలనుంచి వచ్చిన కార్యకర్తలకూ అందుబాటులో ఉంటాయని కూడా ఆశిస్తున్నాను. ఈ రూపంలో, నా దేశం సంప్రదాయాన్ని కొనసాగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇరవై ఐదు శతాబ్దాలకు పూర్వమే భారతదేశం ప్రాచీనమైన నాలందా, తక్షశిలా విశ్వవిద్యాలయాలలో, ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్ని చేర్చుకొన్నది.

“విజ్ఞానశాస్త్రమన్నది ప్రాచీ, ప్రతీచి దేశాలకు వేటికీ పరిమితం కాకుండా సార్వత్రికత విషయంతో అంతర్జాతీయతను సంతరించుకొన్న దైనప్పటికీ కూడా భారతదేశం, మహత్తర కృషి చెయ్యడానికి ప్రత్యేకంగా తగినది.[4] పైకి పరస్పర విరుద్దాలుగా కనిపించే యథార్థాల రాశిలో ఒక కొత్త వ్యవస్థను నిరూపించగల భారతీయుల ఉజ్జ్వల కల్పనాశక్తిని ఏకాగ్రత అనే అలవాటు అదుపులో ఉంచుతున్నది. అయితే ఈ నిగ్రహమే అపారమైన ఓర్పుతో మనస్సును సత్యాన్వేషణ మీద నిలిపే శక్తిని ప్రసాదిస్తోంది.”

ఆ శాస్త్రవేత్త చెప్పే చివరి మాటలు వింటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కాలాన్నీ చారిత్రకుల్నీ కూడా సమానంగా కలవరపెట్టే ఈ “ఓర్పు” భారతదేశానికి మారుపేరు కాదా?

పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవం జరిగిననాటి తరవాత, త్వరలోనే మళ్ళీ వెళ్ళాను నేను. ఆ మహాశాస్త్రవేత్త, తామిచ్చిన మాట గుర్తుంచుకొని నన్ను, ప్రశాంతమైన తమ ప్రయోగశాలకు తీసుకువెళ్ళారు.

“ఈ ఫెర్న్ మొక్కకు క్రెస్కోగ్రాఫు తగిలిస్తాను; దీని వర్ధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే అనుపాతంలో నత్తనడకను కనక పెంచి చూస్తే, ఆ పురుగు ఎక్స్‌ప్రెస్ బండిలా ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది.”

పెద్దగా కనిపించేటట్టు పెంచిన, ఫెర్న్ మొక్క నీడ పడుతున్న తెరమీద చూపు నిలిపి ఉంచాను. సూక్ష్మమైన జీవన చలనాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమ్మోహితమైన నా కళ్ళముందే ఆ మొక్క, మెల్ల మెల్లగా పెరుగుతోంది. బోసు మహాశయులు, ఒక చిన్న లోహపు కడ్డీతో ఆ ఫెర్న్ మొక్క కొనను తాకారు, తాకీ తాకడంతోనే, మూకాభినయంలా సాగుతున్న పెరుగుదల చటుక్కున ఆగిపోయింది; కడ్డీ తీసెయ్యగానే, లయబద్ధంగా సాగే పెరుగుదల మళ్ళీ కొనసాగింది.

“బయటి నుంచి ఏ కొద్దిపాటి జోక్యం కలిగినా సరే, సున్నితమైన కణజాలాలకి అది ఎంత హానికరమవుతుందో చూశావు,” అన్నారు బోసు మహాశయులు. “ఇదుగో, నే నిప్పుడు మత్తుమందు ఇస్తాను చూడు; ఆ తరవాత దానికి విరుగుడు ఇస్తాను.”

మత్తుమందు ఫలితంగా పెరుగుదల అంతా ఆగిపోయింది; విరుగుడు ఇచ్చేసరికి మళ్ళీ మొదలయింది. తెరమీద కనిపిస్తున్న పరిణామాత్మక భంగిమలు “చలన చిత్ర” కథ కంటె కూడా ఎక్కువగా నన్ను ఆకట్టుకొన్నాయి. బోసు మహాశయులు (ఇక్కడ విలన్ పాత్రధారిగా) ఆ ఫెర్న్ మొక్కకు ఒకచోట, పదునైన పరికరం ఒకటి గుచ్చారు; వెంటనే ఆ మొక్క గిలగిలా కొట్టుకోడంతో ఎంత బాధపడుతోందో తెలిసింది. కాడలో కొంత మేరకు ఆయన కత్తి గుచ్చేసరికి మొక్క విపరీతంగా విలవిల్లాడిపోతున్నట్టు నీడలో కనిపించింది. చివరికి మరణ యాతన ముగిసిపోయి చలనం లేకుండా అయిపోయింది.

“మొదట, ఒక పెద్ద చెట్టుకు మత్తుమందు ఇచ్చి అంటుకట్టి విజయం సాధించాను. మామూలుగా, అటువంటి వనస్పతులు, ఉన్న చోటినించి కదిలించేసరికి తొందరగా చచ్చిపోతాయి.” ఆ ప్రాణరక్షణ వ్యూహాన్ని నెమరువేసుకొంటూ సంతోషంగా చిరునవ్వు నవ్వుకొన్నారు జగదీశ్‌చంద్ర బోసుగారు. “చెట్లకు ఒక (రస) ప్రసరణ వ్యవస్థ ఉందని సున్నితమైన నా పరికరాలు తయారుచేసిన రేఖాపటాలు నిరూపించాయి; వాటిలో ఉండే జీవరస చలనాలు, జంతుశరీరాల్లో రక్త సంచరణానికి సమానమైనవి. ఈ జీవరసం పైకి ఎలా ఎక్కుతుందో, మూమూలుగా ఒక దీపపు వత్తిలోకి నూనె ప్రవహించే మాదిరి యాంత్రిక ఆకర్షణ పద్ధతిలో వివరించడం సాధ్యం కాదు. ఈ దృగ్విషయం, సజీవ కణాలు పనిచేసే తీరువల్ల ఏర్పడుతోందని, క్రెస్కోగ్రాఫు ద్వారా వెల్లడి అయింది. చెట్టు దిగువ వరకు వ్యాపించి ఉండే స్తూపాకారపు గొట్టం నుంచి సర్పిలాకార తరంగాలు వెలువడతాయి; ఈ గొట్టం నిజంగా గుండెకాయలా పనిచేస్తుంది. లోతుగా చూసిన కొద్దీ, బహురూపాత్మకమైన ప్రకృతిలో ప్రతి ఒక్క రూపము, ఏకరూపాత్మకమైన ఒక ప్రణాళికతో ముడిపడి ఉన్నదన్న విషయం స్పష్టంగా సాక్షీభూతమవుతూ ఉంటుంది.

ఈ మహాశాస్త్రవేత్త, మరో బోస్ పరికరం వేపు చూపించారు.

“ఒక తగరపు ముక్క మీద ప్రయోగాలు చేసి చూపిస్తానుండు. లోహాల్లో జీవశక్తి, బయటినుంచి కలిగే ప్రేరణలను బట్టి అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని ప్రతిక్రియలు చూపిస్తుంది. సిరా గుర్తులు వివిధ ప్రతిచర్యల్ని నమోదు చేస్తాయి చూడు.”

అణుఘటనం తాలూకు స్వాభావిక తరంగాల్ని నమోదుచేసిన గ్రాఫును తదేకదృష్టితో తిలకించాను. ఆ ప్రొఫెసరుగారు తగరానికి మత్తు మందు ఇచ్చినప్పుడు స్పందనాత్మక లేఖనాలు ఆగిపోయాయి. ఆ లోహం మళ్ళీ మెల్లగా మామూలు స్థితికి వస్తుంటే అవి పునఃప్రారంభమయాయి. ఆయన విషసంబంధమైన ఒక రసాయనాన్ని దానికి పూశారు. ఒక పక్క తగరం ముక్క కొన విలవిల్లాడుతూ ఉండగా, పట్టిక మీదున్న ముల్లు చావుకబురు చల్లగా చెప్పింది. శాస్త్రవేత్త ఇలా అన్నారు:

“కత్తెరలు, యంత్రాలు వంటివాటికి ఉపయోగించే ఉక్కులాంటి లోహాలు అలసటకు గురి అవుతాయనీ, నియతకాలికమైన విశ్రాంతి కనక పొందితే వాటి సామర్థ్యం మళ్ళీ పెరుగుతుందనీ బోస్ పరికరాలు నిరూపించాయి. విద్యుత్ ప్రవాహాలుకాని, భారీ ఒత్తిడికాని కలిగించడం వల్ల లోహాల్లోని జీవనాడికి తీవ్రంగా హాని కలగడమే కాకుండా అది పూర్తిగా అంతరించిపోతుంది.”

అలుపులేని బుద్ధికుశలతకు ప్రశంసనీయమైన ప్రమాణంగా గదిలో నాలుగు పక్కగా అమర్చి ఉన్న ఎన్నో రకాల పరికరాలను నేను చూశాను.

“అయ్యా, అద్భుతమైన మీ యంత్రసామగ్రిని పూర్తిగా వినియోగించుకొని భారీ వ్యవసాయాన్ని త్వరత్వరగా అభివృద్ధిచెయ్యక పోవడం విచారకరమైన విషయం. మొక్కల పెరుగుదలకు దోహదంచేసే రకరకాల రసాయనిక ఎరువుల ప్రభావాన్ని చూపించడానికి, వాటిలో కొన్నిటి మీద ప్రయోగశాలలో త్వరగా ప్రయోగాలు జరపడం సులభంగా సాధ్యం కాదాండీ?”

“నువ్వు చెప్పింది నిజం. ముందుతరాల వాళ్ళు బోస్ పరికరాల్ని రకరకాలుగా ఉపయోగించుకుంటారు. శాస్త్రవేత్తకు, సమకాలిక పురస్కారం లభించడమన్నది అరుదు; సృజనాత్మక సేవలో కలిగే ఆనందం ఒక్కటి దక్కితే చాలు.”

ఓటమి నెరగని ఆ మునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొని సెలవు తీసుకున్నాను. “ఆశ్చర్యం కలిగించే ఆ మేధావి అసాధారణ ప్రజ్ఞాపాటవసారం హరించిపోవడమంటూ ఉంటుందా?” అని మనస్సులో అనుకున్నాను.

కాలం గడిచినా అది తరిగిపోలేదు. బోసుగారు, ‘రిసొనెంట్ కార్డియోగ్రాఫ్’ (హృచ్చలన లేఖని) అనే జటిలమైన పరికరాన్ని కనిపెట్టి, భారతదేశంలోని మొక్కల మీద లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. వీటి పర్యవసానంగా ఉపయోగకరమైన మందులకు సంబంధించి, ఊహించినంత పెద్ద ఔషధ ప్రయోగ పద్ధతి వెల్లడి అయింది. ఒక సెకనులో వందో వంతు కాలాన్ని కూడా గ్రాపుమీద సూచించే విధంగా, ఒక్క పిసరు కూడా తేడా రానంత కచ్చితంగా పనిచేసే కార్డియోగ్రాఫ్‌ను తయారు చెయ్యడం జరిగింది. మొక్కలకూ జంతువులకూ మానవులకూ శరీర నిర్మాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన నాడీస్పందనల్ని రిసొనెంట్ రికార్డులు లెక్కకడతాయి. తన కార్డియోగ్రాఫ్ ముందుముందు, జంతువుల్ని కాకుండా మొక్కల్ని కోసి చూడడానికి ఉపయోగపడుతుందని ఆ ప్రసిద్ధ వృక్షశాస్త్ర వేత్త జోస్యం చెప్పారు.

“ఒక మొక్కకూ ఒక జంతువుకూ వేసిన మందువల్ల కలిగే ఫలితాల రికార్డింగ్‌లను పక్కపక్కన పెట్టి చూసినప్పుడు, అవి అచ్చూ మచ్చూ ఒక్క లాగే ఉండడం ఆశ్చర్యం కలిగించింది,” అన్నారాయన. “మనిషిలో ఉన్న ప్రతి ఒక్కటీ ముందుగానే మొక్కల్లో కనిపించింది. మొక్కల మీద చేసే పరిశోధన, జంతువులకూ మనుషులకూ కలిగే బాధల్ని తగ్గించడానికి సాయపడుతుంది.”

చాలా ఏళ్ళ తరవాత, మొక్కల విషయంలో మొట్టమొదటిసారిగా బోసు కనిపెట్టిన విషయాలు, ఇతర శాస్త్రవేత్తల పరిశోధనల్లో బలపడ్డాయి. 1938 లో కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన కృషి గురించి ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఇలా రాసింది:

“నరాలు, మెదడునుంచి శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలు పంపేటప్పుడు చిన్న చిన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతాయని, గడిచిన కొన్ని సంవత్సరాల్లో నిర్ధారణ అయింది. ఈ విద్యుత్ తరంగాల్ని సున్నితమైన విద్యున్మాపకాలతో (గాల్వనో మీటర్ల తో) గణించి, వాటిని ఆధునిక పరివర్ధక పరికరంతో కొన్ని లక్షల రెట్లవరకు పెంపుచేసి చూపించడం జరిగింది. ఈ విద్యుత్ తరంగాలు గొప్పవేగంతో పోతూ ఉండడంవల్ల, బతికున్న జంతువుల్లోకాని మనిషిలోకాని నాడీతంతువుల గుండా, ఇవి ఎలా సాగుతాయో పరిశీలించడానికి ఇప్పటిదాకా తృప్తికరమైన పద్ధతి ఏదీ కనబడలేదు.”

“తరచుగా, బంగారుచేపల తొట్టెల్లో వేసే మంచినీటి నిటెల్లా మొక్క తాలూకు పొడుగాటి ఏకకణాలు, వస్తుతః ఏకనాడీ తంతువుల్ని పోలి ఉంటాయని డా॥ కె. ఎస్. కోల్, హెచ్. ఆర్. కర్టిస్ రాశారు. అంతే కాకుండా, నిటెల్లా తంతువులకు ఉద్రేకం కలిగించినప్పుడు, ఒక్క వేగం విషయంలో తప్ప తక్కినవాటన్నిటిలోనూ అవి, జంతువులోనూ మనిషిలోనూ ఉండే నాడీతంతువులకు అన్ని విధాలా సమానంగా విద్యుత్ తరంగాల్ని ప్రసరింపజేస్తాయని వారు కనుక్కొన్నారు. మొక్కలో ఏర్పడే, నాడీ సంబంధమైన విద్యుత్ తరంగాలు జంతువుల్లో ఏర్పడేవాటి కన్న చాలా తక్కువ వేగం ఉన్నవని గమనించడం జరిగింది. అందువల్ల కొలంబియా కార్యకర్తలు, నరాల్లోని విద్యుత్ తరంగాల గతిని మందగొడి చలన చిత్రాలుగా ఫొటోలు తియ్యడానికి, కొత్తగా కనిపెట్టిన ఈ విషయాన్ని ఒక సాధనంగా చేబట్టారు.”

“మనస్సుకూ పదార్థానికీ మధ్య సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న గుప్త రహస్యాల్ని తెలుసుకోడానికి ఈ నిటెల్లా మొక్క, ఒక రకమైన రొజెట్టా రాయిలా ఉపకరించవచ్చు [రొజెట్టా అనే వాడు నెపోలియన్ సేనలో ఒక అధికారి; అతనికి ఈజిప్టులో దొరికిన ఒక రాయిమీద, ఒకే విషయం మూడు లిపుల్లో రాసి ఉంది. దీనివల్ల ప్రాచీన ఈజిప్టు దేశపు లిపుల్ని చదవడానికి వీలయింది].”

విశ్వకవి రవీంద్రనాథ్ టాగూరు, ఆదర్శప్రియుడైన ఈ భారతీయ శాస్త్రవేత్తకు చాలా సన్నిహిత మిత్రుడు. ఈయన్ని సంబోధిస్తూ, ఆ వంగదేశపు మధురగాయకుడు ఇలా గానం చేశాడు :[5]

“హే తపస్వి డాకో తూమి సామమంత్రే[6]- జలదగర్జ నే,
“ఉత్తిష్ఠత! నివోధిత!” డాకో శాస్త్ర అభిమానీజీనే–
పాండిత్యేర్ పండతర్క హతే. సుబృహత్ విశ్వతలే
డాకో మూఢ దాంభికేరే. డాక్ దావ్ తబ్ శిష్యదలే–

ఏకత్రే దాఁ డాక్ తారా తవ హోమహుతాగ్ని ఘిరాయా.
బార్‌బార్ ఏ భారత్ అప్నాతే ఆనూక్ ఫిరాయా
నిష్ఠాయ, శ్రద్ధాయ, ధ్యానే- బసూక్ సే అప్రమత్తచిత్తే
లోభహీన ద్వంద్వహీన శుద్ధశాంత గురుర్ వేదీతే.”

[ఓ తపస్వీ, సామవేదమంత్రాల మేఘగంభీర గర్జనతో, “ఉత్తిష్ఠత! నిబోధిత!” అంటూ మేల్కొలుపు. శాస్త్రాభిమానులైన జనాన్ని కుతర్కాలతో కీచులాడుకొనే పండితుల్నీ పిలిచి, వ్యర్థ తర్కాల్ని విడిచి పెట్టమని చెప్పు. ఆ మూడదాంభికుల్ని, సువిశాలమైన ప్రపంచంలోకి రావడానికి ప్రేరేపించు. నీ శిష్యబృందాన్ని కూడా ఆహ్వానించు; వాళ్ళు యజ్ఞవేదికకు నలువైపులా ఒకే కట్టుగా నిలవాలి; దాంతో మన భారతదేశం తన సత్యస్వరూపాన్ని తిరిగి పొంది కర్తవ్యనిష్ఠతో, శ్రద్ధతో ధ్యానంతో అప్రమత్త చిత్తురాలయి లోభహీన, ద్వంద్వహీన, శుద్ధ, శాంతరూపం పొంది విశ్వగురుస్థానాన్ని మళ్ళీ అలంకరించాలి].
  1. “శాస్త్రం యావత్తూ లోకాతీతమైనది; లేకపోతే అది నశించిపోతుంది. వృక్షశాస్త్రం ఇప్పుడు సరయిన సిద్ధాంతాన్ని సాధిస్తోంది. పరబ్రహ్మ అవతారాలు ఇప్పుడు ప్రకృతి చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలవుతాయి ” – ఎమర్సన్ .
  2. crescere అనే లాటిన్ ధాతువునుంచి వచ్చింది : ‘పెంపొందించడం’ అని దీనికి అర్థం. ఈ క్రెస్కోగ్రాఫు ఇతర పరికరాలూ కనిపెట్టినందుకు బోసును 1917 లో ‘నైట్’ను చేశారు.
  3. తామరపువ్వు అన్నది భారతదేశంలో సనాతనమైన దైవీసంకేతం; విచ్చుకొంటున్న దీని రేకలు, ఆత్మవికాసాన్ని సూచిస్తాయి. ఇది పుట్టేది బురదలోనే అయినా స్వచ్ఛమైన సౌందర్యంతో పెరగడం, శుభప్రదమైన ఆధ్యాత్మిక వాగ్దానాన్ని సూచిస్తుంది.
  4. పదార్థం అణుఘటనల వల్ల ఏర్పడిందని ప్రాచీన హిందువులకు బాగా తెలుసు. భారతీయ షడ్దర్శనాల్లో.. ‘వైశేషికం’ ఒకటి. ఈ వైశేషక పదం, సంస్కృతంలో ‘విశేషస్’ అనే ధాతువు నుంచి వచ్చింది: అంటే “ఆణ్విక విశిష్టత” అని దీనికి అర్థం. సనాతన వైశేషిక దార్శనికుల్లో ఔలూక్యుడు ప్రముఖడు. ఈయనకే కణాదుడన్న పేరు కూడా ఉంది. కణాదుడంటే ‘కణాల్ని తినేవాడు’ అని అర్థం. ఈయన 2800 సంవత్సరాల కిందట జన్మించాడు. 1934 ఏప్రిల్ నెలలో వెలువడిన ‘ఈస్ట్-వెస్ట్’ పత్రిక సంచికలో వైశేషిక దర్శన సారాంశాన్ని ఈ విధంగా పొందుపరచడం జరిగింది: “ఆధునిక ‘అణుసిద్ధాంతం’ విజ్ఞానశాస్త్ర రంగంలో కొత్తగా వేసిన ముందడుగు అని, సాధారణంగా అందరూ భావిస్తూ ఉన్నప్పటికీ, ‘అణుభక్షకు’డైన కణాదుడు, దీన్ని చాలా కాలం కిందటే అద్భుతంగా వ్యాఖ్యానించాడు. ‘అణున్’ అనే సంస్కృత శబ్దాన్ని ఆంగ్లంలో ‘ఆటం’ అనీ చక్కగా అనువదించవచ్చు. గ్రీకు భాషలో దీనికి, ‘విడగొట్టరానిది’ అని వాచ్యార్థం. క్రీస్తుకు పూర్వం, వైశేషిక దర్శనానికి వెలువడ్డ ఇతర శాస్త్రీయ వ్యాఖ్యల్లో కింద పేర్కొన్న అంశాల్ని కూడా చేర్చడం జరిగింది: (1) సూదుల్ని అయస్కాంతం ఆకర్షించడం, (2) మొక్కలో జలప్రసరణం, (3) జడం, నిర్మాణరహితం అయిన ఆకాశం లేదా ఈథర్, సూక్ష్మశక్తుల్ని ప్రసారం చెయ్యడానికి ఆధారం కావడం, (4) అన్ని రకాల వేడికి సౌరాగ్నే కారణం, (5) అణు విపరిణామానికి ఆ వేడే కారణం, (6) భూమి అణువుల్లో ఉండే ఆకర్షణ గుణమే గురుత్వాకర్షణశక్తికి కారణం; వేటినైనా కిందికి లాక్కొనే శక్తి దీనివల్లే వచ్చింది, (7) అన్ని శక్తులకూ ఉండే చలన స్వభావం; దీనికి మూలకారణం శక్తివ్యయం లేదా చలనం తిరిగి పంపిణీ కావడం, (8) అణు విఘటనం ద్వారా విశ్వప్రళయం, (9) ఉష్ణకిరణాలూ కాంతికిరణాలూ చాలా చిన్న కణాలుగా ప్రసరించడం; ఈ కణాలు మనం ఊహించలేనంత వేగంతో (ఆధునిక ‘విశ్వకిరణ’ సిద్ధాంతం) అన్నివేపులకూ దూసుకుపోతాయి, (10) దేశకాలాల సాపేక్షత. ప్రపంచోత్పత్తికి మూలం స్వాభావికంగా అందే, వాటి తాత్త్విక విశేషతల రీత్యా- శాశ్వతమైన అణువులని చెబుతుంది వైశేషిక దర్శనం. ఈ అణువులకు అవిరామమైన స్పందన గతి ఉన్నట్టుగా భావించారు. అణువు చిన్న సైజు సూర్యమండల మన్న సంగతి ఇటీవల కనుక్కొన్నారు కాని, వైశేషిక మీమాంసకులకు అది కొత్త విషయమేమీ కాదు. వీరు కాలాన్ని గణితపరంగా విభజిస్తూ పోయి, ఒక అణువు తన ప్రదేశ పరిమాణం (unit of space) లో తాను తిరగడానికి పట్టే సమయాన్ని అన్నిటికంటే తక్కువ కాలపరిమాణం (Unit of time) (కళ) గా చెప్పారు.
  5. బెంగాలీ మూలంలో రవీంద్రనాథ్ టాగూరు రాసిన గీతాన్ని మన్ మోహన్ ఘోష్ ఇంగ్లీషులోకి అనువదించి, శాంతి నికేతనం నుంచి వెలువడే ‘ది విశ్వభారతి క్వార్టర్లీ’ అనే పత్రికలో ప్రచురించాడు.
  6. సామమనేది నాలుగు వేదాల్లో ఒకటి. తక్కిన మూడూ: ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం. ఈ పవిత్ర గ్రంథాల్లో, సృష్టికర్త అయిన దేవుణ్ణి బ్రహ్మతత్త్వంగా అభివర్ణించడం జరిగింది. ప్రతి ఒక్క మానవుడిలో, ఈయన్ని జీవాత్మ అంటారు. బ్రహ్మ శబ్దం ‘బృహ్’ ధాతువునుంచి వచ్చింది: ఈ ధాతువుకు, “విస్తరించడం” అని అర్థం. దివ్యశక్తి దానంతట అది పెరగడం, అంటే సృజనాత్మక కార్యకలాపంలోకి దూకడం అనే వైదికార్థాన్ని తెలియజేస్తుంది ఇది. ఈ విశ్వం, సాలీడు గూడు మాదిరిగా, ఆయన సత్తాలోంచే, వివర్తం చెందుతుందని (నికురుతే) చెబుతారు. ఎరుకతో, ఆత్మను బ్రహ్మపదార్థంలో లీనం చేయడం. అంటే జీవాత్మను పరమాత్మతో ఐక్యం చెయ్యడమే వేదాల మొత్తం సారమని చెప్పవచ్చు.

    వేదాల సారసంగ్రహమైన ‘వేదాంతం’ అనేక మంది పాశ్చాత్య ఆలోచనా పరులకు స్ఫూర్తి నిచ్చింది. ఫ్రెంచి చారిత్రకుడయిన విక్టర్ కూజ్యాఁ (Victor Cousin) ఇలా అంటాడు: “ప్రాచ్యదేశాల తత్త్వశాస్త్ర మహాగ్రంథాల్ని - అన్నిటికన్న మిన్నగా, భారతదేశ గ్రంథాల్ని, మనం సావధానంగా చదివినప్పుడు, ప్రాచ్యదేశాల తత్త్వశాస్త్రం ముందు మోకరిల్ల కుండానూ, మానవజాతికి తొలికాలపు ఉణికిపట్టయిన ఆ ప్రాంతం, సర్వోత్తమ తత్త్వశాస్త్రానికి కాణాచి అని గమనించకుండానూ ఉండలేనంతటి గాఢమైన అనేక సత్యాల్ని, వాటిలో మనం కనిపెడతాం.” ష్లెగెల్ ఇలా అంటాడు: “గ్రీకు తత్త్వవేత్తలు ప్రతిపాదించిన వివేక ఆదర్శవాదం. యూరోపియన్ల సర్వోన్నత తత్త్వశాస్త్రం- కూడా, ప్రాచ్య ఆదర్శవాదానికున్న జీవిత సమృద్ధిముందు జీవశక్తిముందూ, మధ్యందిన మార్తాండుడి ముందు మినుకుమినుకు మంటూండే ప్రామీథియన్ విస్ఫులింగంలా కనిపిస్తుంది (గ్రీకు పురాణ కథల్లో వచ్చే ప్రామిథ్యూస్ ప్రస్తావన ఉందిక్కడ; ఇతడు మానవజాతికి సహాయం చెయ్యడం కోసం సూర్యుడి దగ్గర్నించి నిప్పు దొంగిలించుకు వచ్చాడు).

    భారతదేశపు అపార సాహిత్యంలో, గ్రంథకర్తృత్వం, ఆరోపించి ఉండని గ్రంథాలు వేదాలే (‘విద్’ అనే ధాతువుకు, ‘తెలుసుకోడం’ అని అర్థం). వేద మంత్రాలు అపౌరుషేయాలనీ (ఋగ్వేదం 5, 90, 9), అవి “అతి ప్రాచీనకాలం” నుంచి పారంపర్యంగా వస్తున్నవనీ ఉత్తరోత్తరా కొత్త భాషను ధరించాయనీ (III, 39, 2) ఋగ్వేదం చెబుతోంది. “ద్రష్ట” లయిన ఋషులకు, యుగ యుగాంతరాల్లో దైవ ప్రేరణవల్ల వెల్లడి అయిన ఈ వేదాలకు నిత్యత్వం, అంటే
    “కాలాబాధితమైన ప్రామాణికత" ఉందని చెబుతారు.

    వేదాలు నాదరూపంలో వెలువడి ఋషులకు "నేరుగా వినిపించిన” (శ్రుతి)ని. అవి ప్రధానంగా, మంత్ర పాఠరూపంలో ఉన్న సాహిత్యం. అందుచేత వేదాల్లో ఉన్న 1,00,000 మంత్రాలూ (రెండేసి పాదాలున్నవి) అనేక వేల సంవత్సరాల పాటు బ్రాహ్మణ పురోహితుల మౌఖిక పఠనపాఠనాల వల్ల పరంపరాగతంగా వచ్చినవేకాని ఎవరో రాసి పెట్టినవి కావు. కాయితమూ రాయీ, ఈ రెండూ కాలగతిలో నశించే అవకాశమున్నవే. ఒకరి దగ్గరినుంచి మరొకరి దగ్గరికి అందించడానికి, భౌతిక పదార్థం కంటె మనస్సే బాగా తగిన సాధనమని ఋషులు తెలుసుకొన్నారు. కనక, వేదాలు యుగయుగాంతరాలవరకు నిలిచి ఉన్నాయి. “హృదయ ఫలకాల్ని” మించగలిగినవి మరేమున్నాయి?

    వేద శబ్దాలకున్న ఒక నిర్దిష్ట క్రమాన్ని (ఆనుపూర్వి) గమనించి, ధ్వనుల సంయోజనకూ (సంధి) అక్షరాల పరస్పర సంబంధానికి (సంతానం) ఏర్పడిన ధ్వనిశాస్త్ర నియమాల్ని అనుసరించి, కంఠస్థం చేసుకొన్న పాఠాల శద్ధతను కొన్ని నిష్కృష్ట గణితశాస్త్ర పద్ధతులో నిరూపించి బ్రాహ్మణులు, వేదాల మౌలిక పరిశుద్ధతను అత్యంత ప్రాచీనకాలం నుంచి పరిరక్షిస్తూ వచ్చారు. వేదశబ్దంలోని ప్రతి అక్షరమూ కూడా విలక్షణత ఉన్నది, ఫలప్రదమైనది.