Jump to content

ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 9

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 9

ఆనందభరిత భక్తుడు,

ఆయన విశ్వప్రేమలీల

“చిన్నబాబూ, కూర్చో. నా జగన్మాతతో మాట్లాడుతున్నాను.”

అత్యంత శ్రద్ధాభక్తులతో నేను నిశ్శబ్దంగా గదిలోకి ప్రవేశించాను. మాస్టర్ మహాశయుల దివ్యదర్శనం నన్ను చకితుణ్ణి చేసింది. పట్టులాటి తెల్లటి గడ్డంతోనూ మిలమిల మెరిసే విశాల నేత్రాలతోనూ ఆయన, పరిశుద్ధత రూపుగట్టిన అవతారమూర్తిలా భాసించారు. పైకెత్తి ఉన్న చిబుకమూ జోడించి ఉన్న చేతులూ చూడగానే, నే నక్కడికి మొదటిసారిగా వస్తూనే ఆయన ధ్యానానికి భంగం కలిగించిన విషయం స్పష్టమయింది.

సరళమైన మాటలతో కూడిన ఆయన పలకరింపు, నా స్వభావంలో అంతవరకు నాకు అనుభవమయిన వాటన్నిటికంటే అత్యంత తీవ్రమైన ప్రభావం కలిగించింది. మా అమ్మ చనిపోవడంతో, ఎడబాటువల్ల కలిగిన క్షోభ ఒక్కటే నా దుఃఖానికి పరాకాష్ఠగా భావించాను. ఇప్పుడు నాకు, జగన్మాతతో ఎడబాటు కలిగిందే అన్న స్పృహ నా అంతరాత్మకు చెప్పరాని వేదన అయింది. నేను ఏడుస్తూ నేలమీద ఒరిగిపోయాను.

“చిన్నబాబూ, మనస్సు కుదుటపరుచుకో!” అంటూ ఆ సాధువు సానుభూతితో బాధపడ్డారు. మహాసముద్రంలో ఏకాకి అయిపోయినవాడిలా ప్రాణం దక్కించుకోడానికి, వారి పాదాలనే ఒక తెప్పగా భావించి గట్టిగా పట్టేసుకున్నాను. “మహాత్మా, మీరే నాకు మధ్యవర్తిగా సహాయం చెయ్యాలి! జగన్మాతకు నామీద ఏమైనా అభిమానం ఉందో లేదో అడగండి!”

ఒకరి గురించి తాను కలగజేసుకొని చెబుతాననే పవిత్రమైన వాగ్దానం అంత సులువుగా చేసేదేమీ కాదు. ఆయన మౌనం వహించారు.

మాస్టర్ మహాశయులు జగన్మాతతో చాలా చనువుగా మాట్లాడుతున్నారన్న విషయంలో సందేహానికి తావులేనంత గట్టి నమ్మకం కలిగింది నాకు. ఇప్పుడు ఈ క్షణంలో, ఈ సాధుపు నిర్దుష్ట దృష్టికి గోచరమవుతున్న జగన్మాతను నా కళ్ళు చూడలేకపోవడం గాఢమైన అవమానంగా అనిపించింది. మెత్తని ఆయన మందలింపులను కూడా వినిపించుకోకుండా సిగ్గు విడిచి ఆయన పాదాలు బిగబట్టి ఆయన, దయతో నా గురించి జగన్మాతకు చెప్పాలని మరీమరీ వేడుకున్నాను.

“నీ కోరిక జగన్మాతకు విన్న విస్తాను,” మాస్టర్ మహాశయులు దయతో కూడిన చిరునవ్వుతో మెల్లిగా ఒప్పుదల తెలిపారు.

ఆ కొద్ది మాటల్లో ఎంత శక్తి ఉందని! తుఫానులో ఒంటరిగా చిక్కుపడ్డ నాకు విముక్తి అనుభూతమయింది.

“మహాశయా, మీ రిచ్చిన మాట మరిచిపోకండి! అమ్మవారి జవాబుకోసం మళ్ళీ త్వరగానే వస్తాను!” ఒక్క క్షణం క్రితం, కట్టలు తెంచుకువచ్చిన దుఃఖంతో పూడిపోయిన గొంతులో ఇప్పుడు ఆశావహమైన ఆనందం ధ్వనించింది.

పొడుగాటి మేడమెట్లు దిగుతూ వెనకటి జ్ఞాపకాల్లో మునిగిపోయాను. మాస్టర్ మహాశయుల ప్రస్తుత నివాసం- అమ్హరెస్ట్ వీధిలోని 50 నంబరు ఇల్లు- ఒకప్పుడు మేం ఇంటిల్లిపాదీ ఉన్న ఇల్లు; అమ్మ చనిపోయింది ఇక్కడే. కంటికి దూరమైన అమ్మకోసం నా మానవ హృదయం పగిలింది ఇక్కడే. మళ్ళీ ఈనాడు ఇక్కడే, జగన్మాత కనబడనందుకు నా అంతరాత్మ, శిలువ వేసినంత బాధతో విలవిల్లాడిపోయింది, పావనమైన గోడలు! నన్ను బాధించిన గాయాలకీ, చివరి ఉపశమనానికి మౌనసాక్షులివి.

గుర్ఫార్ రోడ్డులో ఉన్న ఇంటికి తిరిగి వెళుతూ ఉంటే నా అడుగుల వడి పెరిగింది. మిద్దెమీద నా చిన్న గదిలో ఏకాంతంగా, పదిగంటల వరకు ధ్యానంలో ఉండిపోయాను. భారతదేశపు వెచ్చని రాత్రిపూట అలుముకొన్న చీకటిని పటాపంచలు చేస్తూ అద్భుతమైన దృశ్యం ఒకటి హఠాత్తుగా వెలుగొందింది.

వెలుగులు వెదజల్లుతూ జగన్మాత నా ఎదురుగా నిలిచింది. మెత్తని చిరునవ్వు చిందిస్తున్న ఆవిడ ముఖం, రూపుగట్టిన సౌందర్యమే.

“ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే వచ్చాను! ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను!”

దివ్యస్వరాలు ఇంకో గాలిలో ఆడుతూ ఉండగానే ఆమె అంతర్ధానమై పోయింది.

మర్నాడు పొద్దున నేను, మాస్టర్ మహాశయుల్ని రెండోసారి దర్శించే సమయానికి సూర్యుడింకా సరిగా ఉదయించనే లేదు. గాఢమైన స్మృతులతో కూడిన ఆ ఇంటి మేడమెట్లు ఎక్కుతూ నాలుగో అంతస్తులో ఉన్న గదికి చేరాను. గది తలుపు మూసి ఉంది. తలుపు గుబ్బమీద ఒక గుడ్డ చుట్టి ఉంది. ఆ సమయంలో మహాశయులు ఏకాంతం కోరుతున్నారనిపించింది. ఏం చేయ్యడానికి పాలుపోక, నేను గుమ్మం ముందర నించుని ఉండగా, మాస్టర్ మహాశయులే స్వయంగా తలుపు తెరిచారు. ఆయన పవిత్ర పాదాలముందు మోకరిల్లాను. నాలోని దివ్యానందాన్ని మరుగుపరిచి, కేవలం సరదాకోసం నా ముఖంలో గాంభీర్యం తెచ్చి పెట్టుకున్నాను.

“వచ్చేశానండీ- చాలా పెందరాళే వచ్చానని ఒప్పుకుంటాను. మీ సందేశం కోసం! జగన్మాత నా గురించి ఏమయినా చెప్పిందాండీ?”

“కొంటె చిన్నబాబూ!”

మరోమాట అననేలేదాయన. నేను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఆయనకి నమ్మకం కలిగించినట్టు లేదు.

“అంత గుట్టు ఎందుకండి? అలా మాట తప్పిస్తున్నారేం? సాధువు లెప్పుడూ సూటిగా చెప్పరా?” బహుశా నేను కొంచెం రెచ్చిపోయి మాట్లాడా ననుకుంటాను.

“నువ్వు నన్ను పరీక్షించక తప్పదా!” ప్రశాంతమైన ఆయన కళ్ళలో అవగాహన నిండుగా ఉంది. “నిన్న రాత్రి పది గంటలకు సౌందర్యమయి అయిన జగన్మాత స్వయంగా నీ కిచ్చిన హామీకి అదనంగా ఈరోజు పొద్దున నేను ఒక్క ముక్కయినా చేర్చవలసిన అవసరముందా?”

నా అంతరాత్మ వరద వెల్లువను అరికట్టి ఉంచే ద్వారాలు మాస్టర్ మహాశయుల అధీనంలో ఉన్నాయి. మళ్ళీ నేను ఆయన పాదాలముందు మోకరిల్లాను. ఈసారి నా కన్నీళ్ళు ఆనందంవల్ల పెల్లుబికినవే. కాని, వెనకటిలా బాధవల్ల వెలువడ్డవి కావు.

“భక్తితో నువ్వు పిలిచిన పిలుపు, ఆ ఆపార దయామయికి అందలేదనుకున్నావా? ఎడబాటు సహించలేక నువ్వు వేసిన కేకకు, మానవ రూపంలోనూ దేవతారూపంలోనూ కూడా నువ్వు ఆరాధించిన, దేవుడి మాతృభావం మారు పలకకుండా ఉండదు.” చిన్న ప్రార్థనతోనే పరమాత్మ సమ్మతిని మధురంగా పొందగలిగిన ఈ నిరాడంబర సాధువు ఎవరు? ఈ లోకంలో ఈయన నిర్వహించే పాత్ర అతిసామాన్యమైనది; నాకు తెలిసినవారందరిలోకి అత్యంత వినయసంపన్నునికి తగ్గట్టుగా ఉంది. అమ్హరెస్ట్ వీధిలో ఉన్న ఈ ఇంట్లో మాస్టర్ మహాశయులు[1] మగపిల్లలకోసం ఒక చిన్న హైస్కూలు నడిపారు. కటువైన మాట ఒక్కటి కూడా ఆయన పెదవి దాటి వచ్చేది కాదు. ఆయన క్రమశిక్షణలో ఏ నియమానికి నింబధనకూ తావు లేదు. నిజానికి, నిరాడంబరమైన ఈ తరగతి గదుల్లోనే ఉన్నత గణితశాస్త్రమూ పాఠ్యపుస్తకాల్లో ఉండని ప్రేమరసాయనశాస్త్రమూ బోధించేవారు. చెవి కెక్కని ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతోనే ఆయన తమ జ్ఞానాన్ని వ్యాప్తిచేసేవారు. జగన్మాత మీది పరిశుద్ధ భక్తిపారవశ్యంలో మునిగిపోయిన ఆయన, చిన్నపిల్లవాడి మాదిరిగా, బాహ్యమైన మర్యాద సూచనలేవే అపేక్షించేవారు కారు.

“నేను నీ గురువును కాను; ఆయన కొద్దికాలం తరవాత వస్తారు,” అని చెప్పారు నాకు. “భక్తి ప్రేమలపరంగా నువ్వు పొందే దివ్యానుభవాలు ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన ప్రగాఢ వివేకపరంగా వ్యక్తమవుతాయి.”

నేను ప్రతిరోజూ సాయంత్రం, అమ్హరెస్ట్ వీధికి వెళ్తూండేవాణ్ణి. మాస్టర్ మహాశయుల దైవానుభవ చషకం పూర్తిగా నిండి, ప్రతిరోజూ ఆయన ఆనందం నా మీదికి పొంగి పొర్లాలని చూసేవాణ్ణి. ఇంతకు ముందెప్పుడూ నేను, అత్యంత గౌరవభావంతో మోకరిల్లలేదు; ఇప్పుడు మాస్టర్ మహాశయుల పాదస్పర్శతో పావనమైన నేలమీద నడవకూడా అపరిమిత భాగ్యంగా అనిపించింది.

“మహాశయా, మీ కోసం ప్రత్యేకంగా అల్లిన ఈ సంపెంగ పూమాల ధరించండి.” ఒకనాడు సాయంత్రం నేను పూలమాల ఒకటి తీసుకవెళ్ళాను. కాని ఆయన వద్దు వద్దంటూ, సిగ్గుపడుతూ దూరంగా జరిగిపోయారు. చివరికి నేను నొచ్చుకోడం గమనించి, చిరునవ్వుతో అంగీకారం తెలిపారు.

“మన మిద్దరం ఆ తల్లి భక్తులమే కనక, నువ్వు, నాలో నివసించి ఆ తల్లికి కానుకగా, నా దేహాలయం మీద ఆ మాల వెయ్యవచ్చు. ఆయన విశాల ప్రకృతిలో, రవ్వంత అహంకారానికి చోటు లేదు.

“మా గురువుగారి వల్ల శాశ్వతంగా పావనమైన దక్షిణేశ్వర కాళికాలయానికి వేళ్దాం, రేపు.” ఈ సాధువు, క్రీస్తువంటి గురువర్యులయిన శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు.

ఆ మర్నాడు పొద్దున, గంగానదిలో నాలుగు మైళ్ళు ప్రయాణం చేయడానికి పడవమీద బయలుదేరాం. తొమ్మిది గుమ్మటాలతో విరాజిల్లుతున్న కాళికాలయంలోకి ప్రవేశించాం. అందులో వెండితో చేసిన తామర పువ్వుమీద, జగజ్జనని విగ్రహం, శివుడి విగ్రహం ఉన్నాయి. తామర పువ్వు కున్న వెయ్యి రేకులూ అతి నేర్పుగా చెక్కి ఉన్నాయి. మాస్టర్ మహాశయులు మంత్రముగ్ధులైనట్టుగా భాసించారు. ప్రేమమయి అయిన జగన్మాత అనంత ప్రణయలీలలో ఆయన నిమగ్నులయిపోయారు. ఆయన ఆ అమ్మవారి పేరు గానం చేస్తుంటే భావోద్రిక్తమైన నా హృదయం, ఆ తామరపువ్వులాగే, వెయ్యి రేకులుగా విడివడిపోయినట్లనిపించింది.

తరవాత మే మిద్దరం, పవిత్రమయిన ఆ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఈత (ఝావుక) చెట్ల తోపులో ఆగాం. ఈ చెట్లనుంచి సహ జంగా కారే పాలు, మాస్టర్ మహాశయులు అందిస్తున్న అమృతధారకు ప్రతీకగా ఉన్నాయి. ఆయన దైవప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. గులాబివన్నె రేక లుండే ఝావుక పుష్పాలమధ్య నేను, గడ్డినేలమీద అత్యంత నిశ్చలంగా కూర్చున్నాను. తాత్కాలికంగా ఈ శరీరంలోంచి బయల్పడి దివ్యలోకాల్లో విహరించాను.

దక్షిణేశ్వరం సందర్శించడానికి మాస్టర్ మహాశయులతో కలిసి నేను చేసిన యాత్రల్లో ఇది మొదటిది. మాతృభావంలో, లేదా దివ్య కరుణామయిభావంలో భగవంతుడి మాధుర్యాన్ని ఆయన దగ్గరే నేను చవిచూశాను. ఆ సాధువు శిశుహృదయానికి పితృభావం, లేదా దివ్యన్యాయభావం రుచించదు. కఠినమూ అమిత ప్రయాసాత్మకమూ గణితబద్ధమూ అయిన తీర్పరితనం ఈయన సాధుస్వభావానికి సరిపడేది కాదు.

ఒకనాడు ప్రార్థనల్లో నిమగ్నులై ఉన్న ఆయన్ని ప్రేమతో గమనిస్తున్నప్పుడు, “స్వర్గంలో ఉండే దేవదూతలకు ఈయన, భూమిమీద ప్రతిరూపం,” అనిపించింది. ఆక్షేపణకాని, విమర్శకాని స్పర్శామాత్రంగా కూడా సోకకుండా ఈయన, ఆద్యస్వచ్ఛతతో చిరకాలంగా పరిచయమైన కళ్ళతో ప్రపంచాన్నంతనీ పరిశీలించేవారు. ఈయన శరీరం, మనస్సు, వాక్కు, చేతులు ఆన్నీ ఆత్మసారళ్యంలో అప్రయత్నంగా సామరస్యం పొందాయి.

ఈయన మామూలుగా, ఎవరికయినా సలహా ఇచ్చేటప్పుడు, తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యమియ్యకుండా, “మా గురుదేవులు నా కిలా చెప్పారు,” అని చెప్పి జోహార్లు అర్పిస్తూ ముగించేవారు. మాస్టర్ మహాశయులకు శ్రీరామకృష్ణులతో తాదాత్మ్యం ఎంత ప్రగాఢంగా ఉండేదంటే, ఆయన తమ ఆలోచనల్ని వేటినీ తమ సొంతంగా గణించేవారే కాదు. ఒకనాడు సాయంత్రం ఆయనా నేనూ చెయ్యీ చెయ్యీ కలుపుకొని ఆయన విద్యాలయ ఆవరణలో తిరుగుతున్నాం. ఇంతలో అక్కడికి, ఆయన పరిచయస్థుడొకడు వచ్చాడు. అతడు వట్టి ధూర్తుడు; అతని రాకతో నా ఆనందం సన్న గిలింది. అతను చాలాసేపు ఏవేవో మాట్లాడుతూ మమ్మల్ని ఊదరగొట్టేశాడు.

“ఇతను నీకు సంతోషం కలిగించడం లేదని గ్రహించాను” అంటూ నాతో రహస్యంగా అన్నారాయన. ఆ వచ్చిన దురహంకారి తన సోదికి తానే ముగ్ధుడై ఉన్నందువల్ల ఈ మాటలు అతని చెవిని పడలేదు. “దీన్ని గురించి జగన్మాతకు చెప్పాను; మన దుస్థితి ఆమెకు తెలుసు. అదుగో, అక్కడున్న ఎర్రరంగు ఇంటి దగ్గరికి మనం వెళ్ళేసరికి, అతనికి బాగా తొందరపని ఒకటి జ్ఞాపకం చేస్తానని ఆవిడ మాట ఇచ్చింది.” అన్నారు.

మాకు విముక్తి ప్రసాదించే చోటుమీదే నిలిచిపోయాయి నా కళ్ళు. అతను సరిగా ఎర్రగేటు దగ్గరికి వచ్చినవాడల్లా, కారణమేమీ లేకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. చెప్పే వాక్యం పూర్తి చెయ్యనూ లేదు, వెళ్ళొస్తానని మాతో చెప్పనూ లేదు. కల్లోలిత వాతావరణంలో మళ్ళీ శాంతి నెలకొంది.

మరో రోజున నేను హౌరా రైల్వే స్టేషను దగ్గర ఒంటరిగా నడుస్తున్నాను. ఒక గుడి దగ్గర, తప్పెట్లూ తాళాలూ కొడుతూ గొంతు చించుకొంటూ భజన చేస్తున్న ఒక చిన్న బృందాన్ని చూసి నేను మనస్సులో విమర్శించుకొంటూ క్షణకాలం నిలిచిపోయాను.

“దేవుడి పవిత్ర నామాన్ని వీళ్ళు ఎంత భక్తి శూన్యంగా, యంత్రం మాదిరిగా పునశ్చరణ చేస్తున్నారు!” అనుకున్నాను. ఇంతలో హఠాత్తుగా, మాస్టర్ మహాశయులు నా వేపు గబగబా వస్తూండడం చూసి ఆశ్చర్యపోయాను. “అయ్యా, మీరిక్కడున్నారేమిటి?”

ఆ సాధువు నా ప్రశ్న పట్టించుకోకుండా, నా ఆలోచనకు జవాబిచ్చారు. “చిన్న బాబూ, భగవన్నామం, అజ్ఞానుల నోట్లోంచి వచ్చినా జ్ఞానుల నోట్లోంచి వచ్చినా మధురంగానే ఉంటుంది కదూ?” అంటూ ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఆయన ‘మాయ తివాసీ’ మీద నన్ను కరుణామయి సన్నిధికి తీసుకువెళ్ళిపోయారని గ్రహించాను.

“నువ్వు కొన్ని బై స్కోపులు చూస్తావా?” ఒకనాడు మధ్యాహ్నం, విరాగులైన మాస్టర్ మహాశయుల నోట్లోంచి ఈ ప్రశ్న రావడం నాకు అగమ్యంగా అనిపించింది; బై స్కోపు అన్న మాట భారతదేశంలో ఆ రోజుల్లో, సినిమాలకు వాడేవారు. నేను సరే నన్నాను; ఆయన వెంబడి ఉంటే చాలు, ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు సంతోషమే. వడివడిగా నడిచి, కలకత్తా విశ్వవిద్యాలయం ముందరి తోట దగ్గరికి వచ్చాం. ‘గోల్‌డిఘీ’ అనే నీళ్ళకుంట దగ్గరున్న బల్ల చూపించారాయన.

“కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చుందాం. ఎక్కడయినా విశాల జలాశయం కనిపిస్తే ధ్యానంచెయ్యమని. మా గురువుగారు చెప్పారు. ఇక్కడ దీనికున్న ప్రశాంతత, దేవుడి అపార శాంతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. సమస్త వస్తు జాలమూ ఈ నీళ్ళలో ప్రతిఫలించినట్టుగానే, ఈ విశ్వమంతా విశ్వమానస సరోవరంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగని మా గురుదేవులు తరచు అంటూండేవారు.”

కాసేపట్లో మేము యూనివర్సిటీ హాలులోకి ప్రవేశించాం; అక్కడ ఒక ఉపన్యాసం జరుగుతోంది. అప్పుడప్పుడు లాంతరు స్లైడ్లువేసి చూపిస్తున్నప్పటికీ, ఆ ఉపన్యాసం చాలా నిరుత్సాహజనకంగా ఉంది; చూపించే స్లైడ్లు కూడా అంత నిరుత్సాహకరంగానూ ఉన్నాయి. “మాస్టరుగారు నన్ను చూడమనే బై స్కోపు ఇదన్నమాట!” నా ఆలోచనకు ఓర్పు నశించింది కాని నా ముఖంలో విసుగుదల కనబరిచి ఆయన్ని నొప్పించదలచలేదు. కాని ఆయన నావేపు వంగి రహస్యంగా ఇలా చెప్పారు:

“చిన్నబాబూ, నీకు ఈ బై స్కోపు నచ్చనట్టవుపిస్తోంది. ఈ సంగతి జగన్మాతకి చెప్పాను; ఆవిడకి మనిద్దరి మీదా పూర్తిగా సానుభూతి ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు పోతాయనీ, మనం ఈ గదిలోంచి వెళ్ళిపోయే వరకూ మళ్ళీ వెలగవనీ చెబుతున్నది.”

ఆయన గుసగుసలు పూర్తి అయేసరికి హాలంతా చీకటయిపోయింది. ఉపన్యాసమిచ్చే ఆయన గంభీరస్వరం, ఆశ్చర్యంతో ఒక్క క్షణం నిలిచి పోయింది. ఆ తరవాత ఆయన, “ఈ హాల్లో ఎలక్ట్రిక్ సిస్టంలో ఏదో లోపమున్నట్టుంది,” అన్నాడు. అప్పటికి నేనూ మాస్టర్ మహాశయులూ గడపదాటేస్తున్నాం. నడవలోంచి వెనక్కి తిరిగి చూస్తే హాల్లో మళ్ళీ దీపాలు కనిపించాయి.

“చిన్న బాబూ, ఆ బైస్కోపు నీకు నిరాశ కలిగించింది కదూ! అయితే మరో రకంది. నీకు నచ్చుతుందనుకుంటాను.” ఆయనా నేనూ యూనివర్సిటీ భవనానికి ఎదురుగా ఉన్న దారిలో, నించుని ఉన్నాం. నా గుండెమీద ఆయన మెల్లగా తట్టారు.

వెంటనే పరివర్తనాత్మకమైన నిశ్శబ్దం ఒకటి ఆవరించింది. ఆధునికమైన “టాకీలు”. శబ్ద పరికరాలు చెడిపోయినప్పుడు మూక చలన చిత్రాల్లా ఎలా మారిపోతాయో అలా, ప్రపంచంలోని కోలాహలాన్నంతని అతివిచిత్రమైన అలౌకిక ఘటనద్వారా దివ్యహస్తం అణిచేసింది. కాలి నడకని వెళ్ళేవాళ్ళూ, సాగిపోతున్న ట్రాలీ కార్లూ, మోటారు బండ్లూ, ఎడ్లబండ్లూ, ఇనప పట్టాలున్న జట్కా బండ్లూ- అన్నీ చడీ చప్పుడూ లేకుండా సాగిపోతున్నాయి. సర్వవ్యాపకమైన దృష్టి ఉన్నట్లుగా నేను, నాకు వెనకవేపూ పక్కలా ఉన్న దృశ్యాల్ని కూడా, ఎదురుగా ఉన్నవాటి మాదిరిగానే చూశాను. కలకత్తాలో ఆ చిన్న బస్తీలో జరుగుతున్న కార్యకలాపాల దృశ్యమంతా నా కళ్ళముందు నిశ్శబ్దంగా సాగిపోతోంది. పలచని బూడిద పొరకింద మసకమసకగా కనిపించే నిప్పుకణంలాటి మృదుకాంతి ఒకటి పరిసర దృశ్యంలోకి ప్రవేశించింది.

నా శరీరం, అనేక మైన నీడల్లో ఒక నీడలా తప్ప, అంతకుమించి గోచరించలేదు. అయితే తక్కిన నీడలు మూగగా ముందుకూ వెనక్కూ చెదిరిపోతూ ఉంటే, నా నీడ మాత్రం నిలకడగా ఉంది. కొందరు కుర్రవాళ్ళు నా స్నేహితులు, నావేపు వచ్చికూడా ముందుకు సాగిపోయారు. వాళ్ళు సూటిగా నావేపు చూసినప్పటికీ నన్ను గుర్తుపట్టలేదు.

ఈ అనుపమ ఛాయాప్రదర్శన నాకొక అనిర్వచనీయమైన ఆనందాతిశయాన్ని కలిగించింది. ఏదో ఊటచెలమలోంచి వెలువడే ఆనందామృతాన్ని సేవించాను. ఇంతలో హఠాత్తుగా, మాస్టర్ మహాశయులు నా రొమ్ముమీద తట్టినట్లు తెలిసింది. నాకు ఎంత ఇష్టం లేకపోయినా ప్రపంచపు గందరగోళం మళ్ళీ చెవుల్లో పడింది. కలలో తేలిపోతూండె వాణ్ణి నిర్దయగా మేల్కొలిపినట్లుగా అల్లాడిపోయాను. అతీంద్రియానంద మధువును నాకు అందకుండా దాచేశారు.

“చిన్న బాబూ, నీకు రెండో బై స్కోపు[2] నచ్చినట్టు కనిపిస్తోంది.” చిరునవ్వు చిందిస్తున్నారు ఆ సాధువు. నేను కృతజ్ఞతతో ఆయన పాదాల ముందు మోకరిల్లబోయాను. “నువ్విప్పుడా పని చెయ్యకూడదు!” అన్నారాయన. “దేవుడు నీ దేహాలయంలో కూడా ఉన్నాడని నీకు తెలుసు. జగజ్జననిని నీ చేతులతో నా పాదాలు తాకనియ్యను!” నిరాడంబరులైన మాస్టర్ మహాశయులూ నేనూ జనసమ్మర్దంగల పేవ్‌మెంటు నుంచి వచ్చి మెల్లగా నడిచిపోతూండడం కనక ఎవరయినా గమనించినట్లయితే మేమిద్దరం మంచి నిషాలో ఉన్నామని అనుమానించి ఉండేవారు. అలుముకుంటున్న ఆ సాయంకాలపు నీడలు కూడా మాతోబాటు దివ్యానందంతో మత్తెక్కి ఉన్నాయి.

మాస్టర్ మహాశయులకూ, నా జీవిత మార్గంలో తారసపడ్డ ఇతర సాధుపుంగవులకూ, కొన్నేళ్ళ తరవాత నేను ఒక పాశ్చాత్యదేశంలో, దైవభక్తులుగా తమ జీవిత విశేషాలను రాస్తానని ముందుగా తెలిసే ఉండవచ్చుననిపిస్తోంది. ఆయన దయను గురించి నిస్సారమైన మాటల్లో రాయడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు. వారికి భవిష్యత్తు ముందే తెలిసి ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయ మేమీ కాదు; అలాగే ఇంతవరకు చదువుతూ వచ్చిన నా పాఠకులకు కూడా ఆశ్చర్యం కలిగించదనుకుంటాను.

సరళమైన విశ్వప్రేమమయ భావనద్వారా, అన్ని మతాల సాధువులూ దైవసాక్షాత్కారం పొందారు. కేవల పరబ్రహ్మ నిర్గుణం, అంటే “గుణాలు లేనిదీ,” అచింత్యం, అంటే “ఆలోచనకు అందనిది,” కావడంవల్ల, మానవుల ఆలోచనా ఆకాంక్షా ఆ పరబ్రహ్మకు జగజ్జననిగా ఒకమూర్తిమత్వమిస్తూ వచ్చాయి. వేదాల్లోనూ , భగవద్గీతలోనూ వివరించిన విధంగా, సాకారదైవ భావననూ కేవల నిరాకారబ్రహ్మ భావననూ సమ్మేళనంచేయడం, హిందూతత్త్వ చింతన సనాతన కాలంలోనే సాధిం చిన విజయం. ఈ “పరస్పర విరుద్ధాల సమన్వయం” హృదయాన్నీ బుద్ధినీ కూడా తృప్తి పరుస్తుంది; భక్తి జ్ఞానమూ ప్రధానంగా ఒకటే. ప్రపత్తి- అంటే దేవుణ్ణి “ఆశ్రయించడం,” శరణాగతి- అంటే “దేవుడి దయనే నమ్ముకొని తనను తాను అర్పించుకోడం,” అన్నవి నిజంగా, పరమోన్నతజ్ఞాన సాధనకు మార్గాలు.

మాస్టర్ మహాశయులకూ ఇతర సాధువులందరికీ ఉండే వినయం, దేవుణ్ణే ఏకైక ప్రాణంగానూ న్యాయమూర్తిగానూ భావించి, ఆయన మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నామన్న (శేషత్వం) గుర్తింపువల్ల ఏర్పడినది. భగవంతుడి స్వరూపమే ఆనందం కాబట్టి, ఆయనతో భావైక్యం పొందినవాడు సహజమైన అపరిమితానందం అనుభవిస్తాడు. “ఆత్మా సంకల్పశక్తీ పొందే భావావేశాల్లో మొదటిది ఆనందం.”[3]

పసిపిల్లలకు సహజమైన హృదయంలో జగన్మాతను చేరే అన్ని యుగాల భక్తులూ, ఆవిడ ఎప్పుడూ తమతో ఆడుకొంటూనే ఉంటుందని ధ్రువపరుస్తారు. మాస్టర్ నుహాశయుల జీవితంలో, ముఖ్యమైన సందర్భా ల్లోనూ ముఖ్యంకాని సందర్భాల్లోనూ కూడా, దివ్యలీలలు కళ్ళకు కడుతూ వచ్చాయి. దేవుడి దృష్టిలో పెద్దా చిన్నా అన్న తేడా లేదు. అంత పరిపూర్ణ నైపుణ్యంతో ఆయన సూక్ష్మమైన అణువునే కనక నిర్మించి ఉండకపోతే ఆకాశం, అభిజిత్తూ స్వాతీవంటి నక్షత్రాల్ని సగర్వంగా అలంకరించుకొని ఉండగలిగేదా? ఇది “ముఖ్యమైనది”, అది “ముఖ్యంకానిది” అన్న విచక్షణలు దేవుడి కసలు తెలియనే తెలియవు; లేకపోతే, ఒక సూది కనక లేకపోతే మొత్తం విశ్వమంతా కుప్పగూలిపోయేది!

  1. ఆయన్ని మామూలుగా, గౌరవసూచకమైన ఈ పేరుతోనే పిలిచేవారు. ఆయన అసలు పేరు మహేంద్రనాథ్ గుప్త. ఆయన రచించిన పుస్తకాల మీద ఉత్తి ‘ఎం.’ అనే రాసుకొనేవారు.
  2. వెబ్‌స్టర్ న్యూ ఇంగ్లిష్ డిక్‌ష్ణరీ (1934) లో బైస్కోపు (bio-scope) అన్న పదానికి అరుదైన నిర్వచనం ఉంది: “జీవిత దృశ్యం; అటువంటి దృశ్యాన్ని కల్పించేది.” దీన్నిబట్టి, మాస్టర్ మహాశయులు ఎన్నుకున్న పదం చిత్రంగా నప్చింది.
  3. సెంట్ జాన్ ఆఫ్ ది క్రాస్. ప్రీతిపాత్రుడయిన ఈ క్రైస్తవ సాధువు 1591 లో కన్ను మూశాడుచ 1859 లో ఈయన భౌతికకాయాన్ని బయటికి తవ్వి తీసినప్పుడు ఏ మాత్రం చెడిపోకుండా కనిపించింది. సర్ ఫ్రాన్సిస్ యంగ్ హజ్వెండ్ (‘అట్లాంటిక్ మంత్లీ’, డిసెంబరు 1936), తనకు కలిగిన విశ్వానందానుభవాన్ని గురించి ఇలా చెప్పాడు: ఉల్లాసంకన్నా ఉత్సాహంకన్నా ఎంతో ఎక్కువ ఆనందానుభూతి నాకు కలిగింది: ఒకానొక ఆనందాతిరేకంతో నా ఒళ్ళు నాకు తెలియలేదు. వర్ణించనలవి కాని, దాదాపు భరించ శక్యంకాని ఈ ఆనందానుభూతి కలగడంతో, ప్రపంచానికి సారభూతమైన, మంచితనం కూడా నాకు అవగాహన అయింది. మనుషులు అంతరంగంలో మంచివాళ్ళే ననీ వాళ్ళతో కనిపించే చెడు పైపైది మాత్రమేననీ, కాదనడానికి వీలులేనంత గట్టిగా నమ్మకం. కుదిరింది.”