ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం : 7

గాలిలో తేలే సాధువు

“ఒక యోగి, భూమికి కొన్ని అడుగుల ఎత్తున గాలిలో తేలడం నిన్న రాత్రి ఒక చిన్న సమావేశంలో చూశాను,” అంటూ మా స్నేహితుడు ఉపేంద్ర మోహన్ చౌధరి నాకు నొక్కి చెప్పాడు.

నేను ఉత్సాహంగా చిరునవ్వు నవ్వాను. “ఆయన పేరు నేను ఊహించగల ననుకుంటాను. అప్పర్ సర్క్యులర్ రోడ్డులో ఉండే భాదురీ మహాశయులే కదూ?” అని అడిగాను. తాను చెప్పింది నాకు కొత్త సంగతి కాదని తేలిపోవడంతో కొద్దిగా దిగాలుపడుతూ, ఉపేంద్రుడు తల ఊపాడు. సాధువులగురించి తెలుసుకోడమంటే నాకు ఎంత ఆసక్తి ఉందో మా స్నేహితులకు తెలుసు; ఎప్పటికప్పుడు నన్ను ఒక కొత్తదారి పట్టించడం వాళ్ళకొక సరదా. “ఆ యోగి మా ఇంటికి దగ్గరిలోనే ఉంటారు. ఆయన్ని చూడ్డానికి తరచుగా వెళ్తూనే ఉంటాను.” నా మాటలకు ఉపేంద్రుడి ముఖంలో గాఢమైన ఆసక్తి పొడగట్టింది. అప్పుడు నే నింకా చెప్పాను.

“ఆయన అద్భుతమైన యోగక్రియలు చెయ్యడం చూశాను. అష్టాంగ యోగంలో పతంజలి[1]చెప్పిన రకరకాల ప్రాణాయామాల్ని[2] ఆయన గొప్పగా సాధన చేశారు. ఒకసారి బాదురీ మహాశయులు నా ఎదుట భస్త్రిక ప్రాణాయామం చేస్తుంటే, గదిలో నిజంగా తుఫాను వచ్చిందేమో అనిపించింది; అంత అద్భుత శక్తితో చేశారన్న మాట. తరవాత, ఉరుము ఉరుముతున్నట్టుగా వెలువడే ఊపిరిని పూర్తిగా బయటికి వదిలేసి ఉన్నతమైన అధిచేతన[3] స్థితిలో నిశ్చలంగా ఉండిపోయారు. ఆ తుఫాను వెలిసిన తరవాత ఏర్పడ్డ ప్రశాంతత, ఎన్నటికీ మరిచిపోలేనంతగా, నా మనస్సులో ఇప్పటికీ అనుభూతమవుతూ ఉంటుంది. “ఆ సాధువు, ఇల్లు విడిచి ఎన్నడూ బయటికి వెళ్ళరని విన్నాను.” ఉపేంద్రుడి కంఠంలో కొద్దిగా అపసమ్మకం ధ్వనించింది.

“ముమ్మాటికీ నిజం! గత ఇరవై ఏళ్ళుగా ఆయన ఇల్లు విడిచి బయటికి రాలేదు. మనవాళ్ళ పర్వదినాల్లో మాత్రం ఆయన, తమకు తాము పెట్టుకొన్న నియమాన్ని కొద్దిగా సడలించి, గుమ్మం దాటి వీధి దాకా మాత్రం వెళ్తారు! భాదురీ మహాశయులది జాలిగుండె అని ప్రసిద్ధి. అంచేత ముష్టివాళ్ళు గుమ్మం దగ్గరికి చేరుతూంటారు.

“గురుత్వాకర్షణ శక్తిని ఉల్లంఘించి, గాలిలో ఎలా ఉంటారాయన?”

“నిర్ణీతమైన కొన్ని రకాల ప్రాణాయామాలు చేస్తే, యోగి శరీరానికి స్థూలత్వం పోతుంది. అప్పుడది పైకయినా లేస్తుంది, కప్ప మాదిరిగా కుప్పించి ఎగురుతూ నయినా ఉంటుంది. విధాయకమైన యోగాభ్యాసం చెయ్యని సాధువులు కూడా, గాఢమైన భక్తి పారవశ్య స్థితిలో ఉన్నప్పుడు అలా గాలిలో తేలుతూ ఉంటారని వింటాం.”

“ఈయన్ని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది నాకు. సాయం సమయాల్లో ఆయన జరిపే సమావేశాలకు వెళ్తూ ఉంటావా?” ఉపేంద్రుడి కళ్ళు ఆసక్తితో మిలమిల మెరుస్తున్నాయి.

“ఆ, తరుచు వెళ్తూనే ఉంటాను. ఆయన జ్ఞానంలోని చమత్కారం, నాకు చాలా ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను అదేపనిగా నవ్వుతూ ఉండడం వల్ల , సమావేశాల్లో గాంభీర్యం సడలిపోతూ ఉంటుంది. అందుకు ఆయనయితే ఏమీ అనుకోరు కాని, శిష్యులు మాత్రం కొరకొరా చూస్తుంటారు!”

ఆ రోజు మధ్యాహ్నం, బడినుంచి ఇంటికి వెళ్తూ, భాదురీ మహా శయుల మఠం మీదగా వెళ్తూ, ఆయన్ని ఒకసారి కలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఆ యోగిగారు, మామూలు జనానికి అందుబాటులో లేరు. కింది అంతస్తులో ఒక శిష్యుడు కూర్చుని, గురువుగారి ఏకాంతానికి భంగం కలక్కుండా కాపలా కాస్తున్నాడు. ఆ శిష్యుడిలో చండశాసనుడి అంశ కొంచెం ఉంది; ఆయన్ని కలుసుకోడానికి ముందుగా అనుమతి తీసుకున్నావా, లేదా అని అడిగాడు. అతగాడు నన్ను బయటికి నెట్టేసే ప్రమాదం తప్పించడానికా అన్నట్టు, అతని గురువుగారే సరిగా సమయానికి అక్కడికి వచ్చారు.

“ముకుందుడు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రానియ్యి.” సాధువు కళ్ళు మెరిశాయి. “నా ఏకాంతవాస నియమం నా సౌకర్యం కోసం ఏర్పాటుచేసుకున్నది కాదు. లౌకిక జీవులకు, తమకున్న భ్రమల్ని పటాపంచలు చేసే నిష్కాపట్యం నచ్చదు. సాధువులన్న వాళ్ళు చాలా అరుదుగా ఉండడమే కాదు, వాళ్ళు సరిగా అర్థం కావడం కూడా కష్టం. పవిత్ర గ్రంథాల్లో కూడా వాళ్ళ గురించి రాసింది తరచు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది!”

నేను భాదురీ మహాశయుల వెనక, పై అంతస్తులో ఉన్న ఆయన నివాస భాగానికి వెళ్ళాను. అది ఎంతో నిరాడంబరంగా ఉంది. ఆయన అక్కణ్ణించి కదలడమన్నది చాలా అరుదు. సాధుపుంగవులు తరచుగా ప్రాపంచిక కార్యకలాపాల్ని పట్టించుకోరు; యుగ ప్రసిద్ధులు అయేవరకు వెలుగులోకి రారు. ఒక మునికి, సంకుచితమైన వర్తమాన కాలంలో జీవించే వాళ్ళు మాత్రమే సమకాలికులని అనుకోడానికి వీలులేదు.

“మహా ఋషీ[4], నేను ఎరిగినవాళ్ళలో, ఎప్పుడూ ఇంట్లోనే ఉండే మొట్టమొదటి యోగి మీరేనండి.” “భగవంతుడు తన సాధువుల్ని ఒక్కొక్కప్పుడు, ఎవరూ అనుకోని చోట పుట్టిస్తాడు; లేకపోతే ప్రజలు, తన నొక నియమానికి పరిమితం చేసేస్తారని.”

ఆ సాధువు, చైతన్యంతో స్పందించే తమ దేహాన్ని పద్మాసనం వేసి బిగించారు. డెబ్బయ్యో పడిలో పడ్డ ఆయనలో, వయస్సు పైబడ్డం వల్ల కాని ఎప్పుడూ కూర్చునే ఉండడంవల్ల కాని మామూలుగా కనిపించే అప్రియమైన చిహ్నాలేవీ కనబడవు. దృఢంగా, నిటారుగా ఉండే దేహం. ప్రతి విషయంలోనూ ఆయన ఆదర్శమూర్తి. సనాతన గ్రంథాల్లో వర్ణించిన మాదిరిగా, ఆయన ముఖం ఋషినే తలపిస్తుంది. ఉన్నతమైన శిరస్సుతో, ఒత్తుగా పెరిగిన గడ్డంతో ఆయన, ఎప్పుడూ వెన్ను దృఢంగా, నిటారుగా నిలిపి ఆసీనులయేవారు; ప్రశాంతమైన ఆయన నేత్రాలు సర్వాంతర్యామి మీదే నిలిచి ఉండేవి.

ఆ స్వామివారూ, నేనూ ధ్యానస్థితిలోకి వెళ్ళాం. ఒక గంట తరవాత ఆయన మృదుస్వరానికి నాకు స్పృహ వచ్చింది.

“నువ్వు తరచుగా మౌనంలోకి వెళ్తూ ఉంటావు; కాని అనుభవం[5] సంపాదించావా?” ధ్యానం కన్న భగవంతుణ్ణే ఎక్కువగా ప్రేమించాలన్న విషయం ఆయన నాకు గుర్తుచేశారు. సాధన పద్ధతినే లక్ష్యమనుకుని పొరపాటు పడకు.”

ఆయన నాకు కొన్ని మామిడిపళ్ళు పెట్టారు. ఆయన గంభీర స్వభావంలోనే నాకు ఆహ్లాదకరంగా కనిపించే హాస్య ప్రియత్వం ఉంది. ఆ ధోరణిలో ఆయన ఇలా అన్నారు : “జనానికి సాధారణంగా, ధ్యానయోగం (భగవంతుడితో కలయిక) కంటె జలయోగం (తిండి తినడం) అంటేనే ఇష్టం.” యోగపరంగా ఆయన ప్రయోగించిన శ్లేషకు నేను విరగబడి నవ్వాను.

“ఎంత బాగా నవ్వుతావో!” అన్నారు. ప్రేమతో కూడిన వెలుగు ఆయన చూపులో తళుక్కుమంది. ఆయన ముఖమయితే ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది; కాని ఆనంద పారవశ్యంతో కూడిన చిరునవ్వు ఒకటి దాంట్లో రవ్వంత పొడగడుతూ ఉంటుంది. సువిశాలమైన ఆయన నేత్ర పద్మాల్లో దివ్యహాసం దాక్కొని ఉంటుంది.

“ఆ ఉత్తరాలు, ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా నుంచి వచ్చాయి.” బల్లమీద ఉన్న కొన్ని లావుపాటి కవర్లను చూపిస్తూ అన్నారాయన. “యోగం మీద ఆసక్తి గల సభ్యులున్న కొన్ని సంఘాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. కొలంబస్ కన్న ఉత్తమమైన దిగ్దర్శన జ్ఞానమున్న ఆ సభ్యులు, భారతదేశాన్ని కొత్తగా కనుక్కొంటున్నారు! వాళ్ళకి సాయం చెయ్యడం నాకు సంతోషకరమైన విషయం. పగటి వెల్తురు లాగే, యోగశాస్త్ర జ్ఞానం కూడా, పొందదలిచిన వాళ్ళందరికీ ఉచితంగా లభిస్తుంది.

“మానవులు మోక్షం పొందడానికి సారభూతమైనదిగా ఋషులు దర్శించినదాన్ని పాశ్చాత్యుల కోసం పలచన చెయ్యనక్కర లేదు. బాహ్యానుభవం వేరయినా ఆత్మమట్టుకు ఒకే తీరుగా ఉన్న పాశ్చాత్యులు కాని, ప్రాచ్యదేశాలవాళ్ళు కాని క్రమశిక్షణతో కూడిన ఏదో ఒక యోగ పద్ధతిని అభ్యాసం చేయ్యకపోతే బాగుపడరు.”

ఆ యోగి ప్రశాంతమైన కళ్ళతో నన్ను ఆకట్టుకొన్నారు. ఆయన, మాటల్లో, భవిష్యత్తును సూచించే అస్పష్టమైన ఉపదేశం ఉందన్న సంగతి నేను అప్పుడు గ్రహించలేదు. ఎప్పుడో ఒకనాడు నేను భారతదేశపు దివ్య బోధలను అమెరికాకు తీసుకు వెళ్తానని, తరచుగా మాట వరసకు చేసే సూచనలకు పూర్తి అర్థం, ఇప్పుడే – ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడే తెలుస్తోంది.

“మహాఋషీ, ప్రపంచానికి లాభం కలగడానికి, యోగశాస్త్రాన్ని గురించి మీరొక పుస్తకం రాస్తే బాగుండు ననిపిస్తోంది.”

“నేను శిష్యుల్ని తయారుచేస్తున్నాను. వాళ్ళూ వాళ్ళ శిష్యపరంపరా, కాలక్రమాన జరిగే సహజ విచ్ఛిత్తులనూ విమర్శకుల అసహజ వ్యాఖ్యానాలనూ తప్పని నిరూపించే సజీవ గ్రంథాలుగా నిలుస్తారు.”

సాయంకాలం ఆయన శిష్యుడు వచ్చేవరకు ఆ యోగి దగ్గర నేను ఒక్కణ్ణే ఉన్నాను. భాదురీ మహాశయులు ప్రసంగం ప్రారంభించారు; ఆయన ప్రసంగాలు సాటిలేనివి. వినేవాళ్ళ మనస్సుల్లో ఉండే చెత్తనంతా తుడిచిపెట్టేసి దేవుడివేపు తేలుతూ పోయేటట్టు చేసే ప్రశాంతమైన వరద వెల్లువ మాదిరిగా ప్రసంగించారాయన. ఆయన స్వచ్ఛమైన బెంగాలీలో, మనస్సుకు హత్తుకుపోయే నీతికథలు చెప్పారు.

ఈ సాయంత్రం భాదురీ మహాశయులు, మీరాబాయి జీవితానికి సంబంధించిన వివిధ తాత్త్విక విషయాల్ని వివరించారు. మీరాబాయి మధ్య యుగంలో జీవించిన రాజపుటానీ రాజకుమారి; సాధుసజ్జన సాంగత్యం కోసం ఈమె రాజభోగాల్ని కూడా విడిచిపెట్టేసింది. సనాతన గోస్వామి అనే గొప్ప సన్యాసి ఒకాయన, ఈమె ఆడది కాబట్టి దర్శన మివ్వడానికి నిరాకరించాడు. దానికి ఈమె ఇచ్చిన జవాబుతో ఆయనే తలవంచుకొని ఈమె పాదాల దగ్గరికి రావలసి వచ్చింది.

“మీ స్వాములవారికి చెప్పండి,” అన్న దామె, “ఈ విశ్వంలో దేవుడు తప్ప మరో మగవాడెవరూ ఉన్నట్టు నాకు తెలియదు; ఆయన ముందు మన మందరం ఆడవాళ్ళం కామా?” (ఏకైక సృష్టికర్త దేవుడే ననీ, ఆయన సృష్టి అంతా స్తబ్ధమైన మాయ తప్ప మరేమీ కాదనీ పవిత్ర గ్రంథాలు వెల్లడించే భావన).

మీరాబాయి ఆనంద పారవశ్యంతో అనేక కీర్తనలు కట్టింది; వాటిని ఈనాటికీ భారతదేశంలో పదిలపరుచుకుంటారు. వాటిలో ఒకటి కింద అనువదిస్తాను :

“ప్రతినిత్యం స్నానంచేస్తేనే దేవుడు సాక్షాత్కరించేటట్టయితే
 వెంటనే నేను తిమింగిలాన్నవుతాను, అఖాతంలో;
 దుంపలూ పళ్ళూ తిన్నంత మాత్రాన తెలిసేటట్టయితే ఆయన,
 నేను మేకజన్మ ఎత్తితేనే బాగుండు ననుకుంటాను;
 జపమాల తిప్పితేనే ఆయన బయటపడతాడంటే
 రాకాసి పూసల పేరుతోనే జపాలు చేస్తాను;
 రాతిబొమ్మలకు మొక్కడంవల్లనే ఆయన తెరమరుగు విడుస్తాడంటే
 పాషాణమయమైన పర్వతాన్నే పూజిస్తాను సవినయంగా;
 పాలు తాగితేనే ఆయన్ని ఒంటబట్టించుకోవచ్చునంటే
 ఎన్నో పాడిదూడలకూ పసిపిల్లలకూ ఆయనీపాటికి తెలిసిపోయే ఉండాలి;

 సతిని విడిచిన మాత్రాన దేవుడికి పిలుపందుతుందంటే
 వేలకొద్దీ జనం నపుంసకులయిపోరా మరి?
 మీరాబాయికి తెలుసు, దేవుణ్ణి కనుక్కోడానికి
 తప్పకుండా ఉండవలసింది, ప్రేమ ఒక్కటేనని.”

భాదురీ మహాశయులు యోగాసనంలో కూర్చుని ఉండగా, చాలా మంది విద్యార్థులు, ఆయన పక్కన ఉన్న పాంకోళ్ళలో రూపాయలు పెట్టారు. భారతదేశంలో సంప్రదాయ ప్రకారంగా భక్తితో ఇలా సమర్పించడమన్నది, శిష్యుడు తన భౌతిక సంపత్తిని గురువుగారి పాదాల ముందు అర్పిస్తాడన్న దానికి సూచన. కృతజ్ఞతగల స్నేహితులంటే, మారు రూపాల్లో ఉండి తన అవసరాలు తాను చూసుకొనే భగవంతుడే.

“స్వామీ, మీరు అద్భుతమైనవారు!” ఒక శిష్యుడు ఈ ఋషి పుంగవుల దగ్గర సెలవు తీసుకుంటూ భక్తిపూర్వకంగా అన్నాడు. “భగవంతుణ్ణి అన్వేషించడం కోసం, మాకు జ్ఞానోపదేశం చెయ్యడం కోసం మీరు సంపదలూ సౌఖ్యాలూ అన్నీ త్యాగం చేసేశారు!” భాదురీ మహాశయులు చిన్నతనంలో, ఏకైక లక్ష్యంతో యోగమార్గంలోకి ప్రవేశించేటప్పుడు, పెద్దలిచ్చిన గొప్ప సంపదను విడిచి పెట్టేశారన్నది లోకప్రసిద్ధం.

“విషయాన్ని తారుమారు చేస్తున్నావు నువ్వు!” ఆ యోగి ముఖంలో మెత్తటి మందలింపు ఉంది. “నేను అనంతమైన ఆనందంతో కూడిన విశ్వసామ్రాజ్యం కోసం పనికిమాలిన రూపాయలూ, కొన్ని చిల్లరచుల్లర సుఖాలూ మట్టుకే విడిచిపెట్టేశాను. అటువంటప్పుడు నేను, నా కేమీ లేకుండా చేసుకోడమేమిటి? ఒక గొప్ప నిధిని ఇతరులతో పంచుకోడంలో ఉన్న ఆనందం నాకు తెలుసు. అది కూడా ఒక త్యాగమేనా? కురచ చూపుగల లోకులే నిజమైన త్యాగపురుషులు! ఒక గుప్పెడు ప్రాపంచికమైన ఆటబొమ్మలకోసం, అసమానమైన దివ్యసంపదల్ని త్యాగంచేస్తున్నారు!”

త్యాగాన్ని గురించిన ఈ విరోధాభాస దృష్టికి నాలో నేను నవ్వుకున్నాను – గర్విష్ఠులైన కోటీశ్వరులను అనుకోని త్యాగపురుషులుగా మార్చేసి, సాధువయిన ఏ బిచ్చగాడి నెత్తినయినా కుబేర కిరీటం పెట్టేటట్టుగా ఉందిది.

“భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమం, భీమా కంపెనీ కంటె కూడా తెలివిగా మన భవిష్యత్తును అమర్చి ఉంచుతుంది.” స్వామివారు పలికిన తుది పలుకులు, తమ విశ్వాసాన్ని స్వయంగా అనుభవసిద్ధం చేసుకొన్న మీదట వెలువడినవి. “ఈ ప్రపంచం, బయట భద్రత ఉండి లోపల అశాంతి అలుముకొన్న విశ్వాసపరులతో నిండి ఉంది. కటువుగా ఉండే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నుదుటి మీద మచ్చల్లాటివి. తొలిసారిగా ఊపిరి ఆడినప్పటినుంచి మనకు గాలీ పాలూ కల్పించినవాడికి, తన భక్తులకు ఏ రోజుకు కావలసినవి ఆ రోజు అమర్చి పెట్టడం ఎల్లాగో తెలుసు.”

బడి విడిచిపెట్టిన తరవాత ఆ సాధువుగారి దర్శనానికి వెళ్ళడం కొనసాగిస్తూనే వచ్చాను. నేను ‘అనుభవం’ పొందడానికి ఆయన, పైకి చడీ చప్పుడు లేని ఉత్సాహంతో తోడ్పడ్డారు. ఒకనాడు ఆయన రామ మోహన్ రాయ్ రోడ్డుకు మకాం మార్చేశారు. అది మా గుర్పార్ రోడ్డు ఇంటి పరిసరాలకి చాలా దూరం. ఆయన మీద అభిమానం గల శిష్యులొకరు, ‘నగేంద్ర మఠం’[6] అన్న పేరుతో ఆయనకోసం ఒక ఆశ్రమం కట్టించారు. తరవాత నా జీవిత కథలో అనేక సంవత్సరాలు గడిచాక జరిగిన ముచ్చట ఒకటి ఇక్కడ మనవి చేస్తాను. భాదురీ మహాశయులు చివరిసారిగా నాకు చెప్పిన మాటలవి. నేను పాశ్చాత్యదేశాలకు బయలుదేరడానికి కొద్దిగా ముందు, ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి, వీడుకోలు దీవెనలకోసం వినయంగా ఆయన ముందు మోకరిల్లాను.

“నాయనా, అమెరికా వెళ్ళు, సనాతన భారతదేశం ఘనతని నీకు కవచంగా తీసుకువెళ్ళు, విజయం నీ నుదుట రాసి ఉంది. దూరదేశాల సజ్జనులు నిన్ను బాగా ఆదరిస్తారు.”

  1. ప్రాచీన యోగశాస్త్రానికి మొట్టమొదటి వ్యాఖ్యాత.
  2. శ్వాసను క్రమబద్ధం చేసి ప్రాణశక్తిని, అదుపులోకి తెచ్చుకొనే పద్ధతులు. భస్త్రిక ప్రాణాయామం, మనస్సును నిలకడగా ఉంచుతుంది.
  3. ఫ్రెంచి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి అధిచేతనను గుర్తించారని సోర్బన్‌లో ఉండే ప్రొఫెసర్ జులే బోయా 1928 లో చెప్పాడు . అత్యద్భుతమైన ఈ అధిచేతన, “ఫ్రాయిద్ భావించిన అవచేతన మనస్సుకు సరిగా వ్యతిరేకమైనది; మానవుణ్ణి కేవలం ఉన్నతజాతి జంతువుగా కాకుండా నిజంగా మానవుడిగా చేసే శక్తులు దీంట్లో ఉన్నాయి,” అని కూడా ఆయన అన్నాడు. ఉన్నతమైన చేతన జాగృతం కావడం అంటే, “కుయేయిజం [మనోవిశ్లేషణ పరమైన చికిత్సా విధానం] అని కాని సమ్మోహన శక్తి అని కాని అనుకోగూడదు,” అని ఆ ఫ్రెంచి శాస్త్రవేత్త వివరించాడు. అధిచేతన మనస్సు ఉనికిని తాత్త్వికంగా చాలాకాలం కిందటే గుర్తించారు; నిజానికి ఎమర్సన్ ‘ఓవర్ - సోల్’ అని చెప్పింది దీన్ని ఉద్దేశించే; కాని దీన్ని శాస్త్రీయంగా గుర్తించింది మాత్రం మొన్నమొన్ననే. “ది ఓవర్ - సోల్” అన్న దాంట్లో ఎమర్సన్ ఇలా రాశాడు: “మనిషి, జ్ఞానమంతా, ఉత్తమత్వమంతా నెలకొని ఉండే ఆలయానికి ముఖతలం వంటివాడు తింటూ, తాగుతూ, మొక్కలు నాటుతూ, లెక్కలు వేస్తూ ఉండే, మనకు తెలిసిన మామూలు మనిషినే మనం సామాన్యంగా మనిషి అని అంటూ ఉంటాం. కాని అతడు తన గురించి తాను సరిగా తెలుసుకోలేడు సరికదా, తప్పుగా తెలుసుకుంటాడు. వాణ్ణి మనం గౌరవించం; వాడు అంగభూతంగా ఉన్న ఆత్మను గౌరవిస్తాం. వాడు తన చేతలద్వారా దాన్ని కనబరుస్తాడు; మన చేత మొక్కించు కుంటాడు. ఆధ్యాత్మిక ప్రకృతి అగాధాలకూ, భగవంతుడి సకల గుణాలకూ ఒక పక్కగా పడుకొని ఉంటాం మనం.”
  4. “గొప్ప ముని.”
  5. భగవంతుణ్ణి యథార్థంగా దర్శించడం.
  6. ఆయన పూర్తిపేరు నగేంద్రనాథ్ భాదురీ. మఠమంటే సన్యాసులుండే ఆశ్రమం. క్రైస్తవ ప్రపంచంలోని, “గాలిలో తేలే యోగు”ల్లో, 17వశతాబ్ది నాటి కూపర్టినోలోని సెంట్ జోసఫ్ ఒకడు. ఆయన చేసిన యోగక్రియను కళ్ళారా చూసి చెప్పినవాళ్ళు దండిగా ఉన్నారు. సెంట్ జోసఫ్ మతిమరుపుమనిషిలా పైకి కనిపించేవాడు: కాని ఆ మతిమరుపు నిజానికి దివ్యస్మరణ. తోటి ఆశ్రమవాసులు ఆయన్ని అందరితోబాటు కలిసి ఒకే బల్లదగ్గర భోజనానికి కూర్చోనిచ్చేవారు కాదు; పింగాణీ పళ్ళాలతో సహా ఆయన గాలిలో పైకప్పుదాకా తేలిపోతాడని. ఈ సాధువు, ఎక్కువసేపు ఎప్పుడూ భూమిమీద ఉండలేకపోవడంవల్ల ప్రాపంచిక విధులు నిర్వర్తించడానికి అనర్హుడయిన ఏకైక వ్యక్తి అన్నది నిజం. ఒక పవిత్ర విగ్రహం కంటబడితే చాలు, సెంట్ జోసఫ్ గాలిలో నిటారుగా తేలిపోవడం తరచు జరుగుతూండేది: ఇద్దరు సాధువులు, ఒకరు శిలారూపంలోనూ మరొకరు రక్తమాంసాలతోనూ, గాలిలో పైన, కలిసి గుండ్రంగా తిరుగుతూ కనిపించే వాళ్ళట. మహోన్నతాత్మురాలు - ఆవిలాలో ఉండే సెంట్ తెరీసాకు శరీరం, పైకి తేలిపోవడం చాలా ఇబ్బందిగా ఉండేదట. సంస్థాపరమైన కార్యభారాలు నిర్వర్తించవలసి ఉన్నందువల్ల గాలితో “పైకి తేల్చే” అనుభవాలు రాకుండా ఉండడానికి విఫలప్రయత్నాలు చేసింది. “కాని ప్రభువు మరో విధంగా చేయదలచినప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు నిష్ఫలమయేవి,” అని రాసిందామె. సెంట్ తెరీసా భౌతికకాయం, స్పెయిన్‌లోని ఆల్బా అనే ఊళ్ళో చర్చిలో ఉంది. ఇది నాలుగు శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉంది: దీనికి తోడు పూలవాసనలు కూడా గుబాళిస్తూ ఉంటాయి. ఈస్థలంలో లెక్కలేనన్ని అలౌకిక ఘటనలు సంభవించాయి.