Jump to content

ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 6

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 6

టైగర్ స్వామి

“టైగర్ స్వామిగారి ఎడ్రస్ కనుక్కున్నాను. రేపు ఆయన దర్శనానికి వెడదాం.”

సంతోషకరమైన ఈ సూచన చేసినవాడు మా హైస్కూలు స్నేహితుడు, చండి. ఈ స్వామివారు సన్యాసాశ్రమ జీవితానికి పూర్వం, పెద్దపులుల్ని పట్టుకునేవారనీ ఉత్తిచేతులతోనే వాటితో పోట్లాడేవారనీ విన్నాను. ఈయన్ని కలుసుకోవాలని ఎంతగానో ఉవ్విళ్ళూరుతూండే వాణ్ణి. అటువంటి అసాధారణమైన సాహసకృత్యాలంటే పిల్లలకు ఉత్సాహం కలగడం సహజం; అది నాలో గాఢంగా ఉండేది.

శీతాకాలం కావడంవల్ల, మర్నాడు తెల్లవారేసరికి ఇంకా చలిచలి గానే ఉంది; కాని నేనూ చండీ ఉల్లాసంగా నడక సాగించాం. కలకత్తా నగరం బయట భవానీపూర్‌లో వెతికి వెతికి వేసారి చివరికి సరయిన ఇల్లే పట్టుకున్నాం, ఆ ఇంటి తలుపుకి రెండు ఇనప కడియాలు ఉన్నాయి: వాటిని పట్టుకుని నేను చెవులు చిల్లులు పడేలా చప్పుడు చేశాను. ఇక్కడింత రొద అవుతున్నా నౌకరు ఒకడు నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు మా దగ్గరికి. రణగొణ ధ్వని చేసే అగంతుకులు, సాధువుల ఆశ్రమంలోని ప్రశాంతిని భంగపరచలేరన్న భావాన్ని సూచిస్తోంది, వ్యంగ్యంగా అతడు నవ్విన చిరునవ్వు.

మౌనంగా అతడు పెట్టిన చీవాటుకు మనస్సు చివుక్కుమని పించినా, లోపలికి రమ్మన్నందుకే ధన్యులమనుకున్నాం, నేనూ నా స్నేహితుడూ. అక్కడ చాలాసేపు ఎదురు చూస్తూ కూర్చోడంతో మాకు అనుమానం వచ్చింది. సత్యాన్వేషకుడికి ఓర్పు అవసరమన్నది భారతదేశ సాంప్రదాయిక నియమం; తనని చూడ్డానికి వచ్చేవాడి కుతూహలం ఎంత గాఢమైనదో తెలుసుకోడానికి, కావాలనే గురువు పరీక్షించవచ్చు. పాశ్చాత్య దేశాల్లో వైద్యులూ దంతవైద్యులూ చికిత్సకోసం వచ్చేవారి మనఃప్రవృత్తిని స్వేచ్ఛగా పరీక్షిస్తూనే ఉంటారు!

చివరికి ఆ పనివాడు పిలిచాక, చండీ నేనూ ఒక పడగ్గదిలో అడుగు పెట్టాం. ప్రసిద్ధులైన సొహాంగ్ (సో౽హం) స్వామి వారు[1] పక్కమీద కూర్చుని ఉన్నారు. బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటబడే సరికి మేము ఏమిటో అయిపోయాం. కళ్ళు ఇంత చేసుకుని, నోట మాట లేకుండా స్తంభించిపోయాం. అంత భారీ సైజులో ఉన్న ఛాతీ కాని, పెద్ద బంతుల్లాటి కండలు తిరిగిన జెబ్బలు కాని అంతకుముంచెన్నడూ మేము చూడలేదు. మంచి దిట్టంగా ఉన్న మెడపైన, ఆయన ముఖం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది. పొడుగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు, గడ్డం, మీసాలు దానికి శోభ నిస్తున్నాయి. ఆయన నల్లటి కళ్ళలో పావురం మాదిరి, పెద్దపులి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయి. బలమైన నడుము చుట్టూఉన్న ఒక్క పులిచర్మం తప్పిస్తే, మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు.

నేనూ, నా స్నేహితుడూ ఎలాగో మాటలు పెకల్చుకుని, ఆ సన్యాసికి నమస్కారం చేశాం; పులుల్ని లొంగదీసుకోడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాం. “అడవి జంతువు లన్నిటిలోకీ ఎక్కున భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడికిళ్ళతోనే లొంగదీసుకోడం మీకు ఎలా సాధ్యమైందో, దయచేసి మాకు చెప్పరూ?”

“అబ్బాయిలూ, పులులతో పోట్లాడ్డం అన్నది నాకు చాలా చిన్న విషయం. అవసరమైతే ఈవేళ కూడా ఆ పని చెయ్యగలను.” పసివాడిలా నవ్వారాయన. “మీరు పులుల్ని పులుల్లా చూస్తారు; వాటిని పిల్లులుగా నే నెరుగుదును.”

“స్వామీజీ, పులులు పిల్లులేనని నా మనస్సు (అవచేతన) కయితే నచ్చజెబుతాననుకోండి, కాని పులులకు నచ్చజెప్పగలనా?”

“బలం కూడా అవసరమన్న మాట నిజమే! పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని గెలవాలని ఎవరూ ఆశించకపోవచ్చు! బలమైన నా చేతులే నాకు చాలే ఆయుధాలు.”

మమ్మల్ని వెంట బెట్టుకుని పెరట్లోకి వచ్చారాయన. అక్కడ గోడ అంచున ఒక్క గుద్దు గుద్దారు. దాంతో ఒక ఇటిక కిందికి రాలి పడింది. తొస్సి పన్నులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూసింది. ఆశ్చర్యంతో వెర్రిచూపులు చూశాను నేను. సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటికనే ఒక్క గుద్దుతో రాలగొట్టగలిగిన ఈయన, పెద్దపులుల పళ్ళు రాలగొట్టడంలో సందేహం లేదనిపించింది!

“నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది; కాని వాళ్ళకి నిబ్బరమైన నమ్మకం ఉండదు. ఒంటిని మాత్రమే వస్తాదుల్లా పెంచుకొని మనస్సును అలా పెంచుకోనివాళ్ళు, అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూరమృగం ఏదైనా కంటబడితే చాలు, ఇట్టే కళ్ళు తేలవేస్తారు. సహజమైన ఉగ్రతతో తన స్థావరంలో ఉండే పులికీ, నల్లమందు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది!

“భీముడంతటి బలం ఉండి కూడా, రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే, బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయస్థితిలో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా తన మనస్సులోనే తానొక పిల్లిమోస్తరుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది పులి. ఒక మోస్తరు బలమైన శరీరం ఉండి, బ్రహ్మాండమైన మనఃస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులిజిత్తులను దాని మీదికే ప్రయోగించి, దాని ప్రవృత్తిని పిల్లిలాటి నిస్సహాయ స్థితికి తేగలడు. సరిగ్గా ఇలాగే, ఎన్నిసార్లు చేశానో నేను!”

నా ఎదుట ఉన్న భీమబలుడు, పెద్దపులిని పెంపుడు పిల్లిలా మార్చెయ్య గలగడంలో సందేహం లేదనిపించింది. ఆయన ఏదో ఉపదేశం చేసే ధోరణిలో ఉన్నట్టున్నారు. చండీ నేనూ శ్రద్ధగా వింటున్నాం.

“కండరాల్ని పనిచేయించేది మనస్సు. సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం, దానికి ఉపయోగించిన శక్తిమీద ఆధారపడి ఉంటుంది; మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం, అతని మనస్సులోని ఆక్రమణేచ్ఛ మీదా ధైర్యం మీదా ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని అక్షరాలా తయారుచేసేదీ, షోషించేది మనస్సే. బలాలయినా బలహీనతలయినా, గత జన్మల్లోని సహజాతాల ఒత్తిడి ద్వారానే మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి. అవి అతని అలవాట్లుగా వ్యక్తమయి, కోరదగిన శరీరం గానో, కోరదగని శరీరంగానో రూపొందుతాయి. బాహ్యమైన బలహీనతకు మూలం మానసికమైనది. విషవలయక్రమంలో, అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనస్సును అడ్డగిస్తూ ఉంటుంది. తన నౌకరు తనను ఆజ్ఞాపించడానికి యజమానే అనుమతించినట్లయితే, ఆ నౌకరు నిరంకుశుడవుతాడు; అలాగే మనస్సు కూడా శరీరం చెప్పినట్టల్లా లోబడి, దానికి బానిస అవుతుంది.”

ఆ స్వామీజీ మా కోరిక మన్నించి, తమజీవితాన్ని గురించి కొంత చెప్పడానికి అంగీకరించారు.

“మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా, పెద్దపులులతో పోట్లాడాలని. నా మనస్సంకల్పం బలిష్ఠమైనదే కాని నా శరీరం దుర్బలంగా ఉండేది.”

ఆ మాటకు నాలోంచి ఆశ్చర్యం వ్యక్తమయింది. భీముడులాంటి భుజబలమున్న ఈయన, ఎన్నడయినా బలహీనత అన్నది ఎరుగునంటే నమ్మలేననిపించింది.

“ఆరోగ్యమూ బలమూ చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో, ఆ లోపం పోగొట్టుకున్నాను. రాయల్ బెంగాల్ పులుల్ని నిజంగా లొంగ దీసుకునేటట్టు చేసినది నా ఉద్ధత మనోదార్ఢ్యమేనని చెప్పక తప్పదు.

“పూజ్య స్వామీజీ, నే నెప్పటికయినా పెద్దపులులతో పోట్లాడగల నంటారా?” అల్లాటి విపరీతమైన కోరిక నా మనస్సులో చొరబడ్డం అదే మొదటిసారీ చివరిసారీ కూడా!

“ఆహా!” అంటూ నవ్వారాయన. “కాని, పులులు చాలా రకాలున్నాయి; మానవుల కోరికలనే అడవుల్లో తిరుగుతుంటాయి కొన్ని. మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడంవల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు. అంతకంటే, లోపల తిరిగే క్రూరమృగాల్ని జయించు.”

“అయ్యా, అడవిపులుల్ని అణిచేసే మీరు, తీవ్రమైన మనోవికారాల్ని అణిచేవారుగా ఎలా మారారో చెప్తారా?” టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు. గతకాలపు దృశ్యాల్ని తిరగదోడుతున్నట్టుగా, ఆ చూపు ఎటో ప్రసరించింది. మా మనవి మన్నించాలా, వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయనలో చూడగలిగాను. చివరికి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వారు.

“నా కీర్తి ఉచ్చస్థితి నందుకొనేటప్పటికి, దానివల్ల నాలో గర్వ మదం ఏర్పడింది. పులులతో పోట్లాడటమే కాకుండా, వాటి మీద రకరకాల జిత్తులు ప్రదర్శించాలని కూడా నిశ్చయించుకున్నాను. అడవి జంతువులు పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేటట్టు చెయ్యాలని నా ఆశ. నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించడం మొదలుపెట్టాను; దాంట్లో తృప్తికరమైన విజయం సాధించాను.

“ఒకనాడు సాయంత్రం, మా నాన్న గారు చింతాక్రాంతులై నా గదిలోకి వచ్చారు.

“ ‘బాబూ, నీకు నాదో చిన్న హెచ్చరిక. కార్యకారణాలనే తిరగలి రాళ్ళ మధ్య ఉత్పన్నమయి రాబోయే ముప్పులనుంచి నిన్ను కాపాడుతాను,’ అన్నారు.”

“నాన్నగారూ, విధినిర్ణయవాదులా మీరు? శక్తిమంతమయిన నా కార్యకలాప జలాల్ని మూఢ విశ్వాసంతో కలుషం కానివ్వవలసిందేనా?”

“ ‘నేను విధినిర్ణయవాదిని కాను, నాయనా. కాని మన పవిత్ర గ్రంథాలు బోధించే న్యాయమైన ప్రతిఫల నియమాన్ని నమ్ముతాను. అడవి జంతువులకు నీ మీద ఆగ్రహం ఉంది; దానివల్ల ఎప్పుడో ఒకనాడు నీకు ముప్పు రావచ్చు.’ “ ‘నాన్నగారూ, మీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది! పులుల సంగతి మీకు బాగా తెలుసు - అవి అందమైనవే కాని కనికరం లేనివి! ఏమో, ఎవరికి తెలుసు? నా పిడిగుద్దులు, వాటి మొద్దుబుర్రల్లోకి కాస్తంత విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో! వాటికి సాధువర్తన అలవరచడానికి, అడవిని చక్కదిద్దే బడిలో నేనే హెడ్మాస్టర్ని!’ ”

“ ‘నాన్నగారూ, నన్ను పులుల్ని మచ్చికచేసే వాడిలాగే చూడండి. పులుల్ని చంపేవాడినని ఎన్నడూ అనుకోకండి. నేను చేసే మంచి పనులు నాకు చెరుపు ఎందుకు చేస్తాయి? నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న ఆజ్ఞ ఏదీ విధించవద్దని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను.’ ”

చండీ, నేనూ ఎంతో శ్రద్ధగా వింటున్నాం; వెనకటి సంకటస్థితి అర్థం చేసుకుంటూ, భారతదేశంలో పిల్లలెవరూ తల్లిదండ్రుల కోరికలను తేలికగా తీసిపారేసి చిత్తం వచ్చినట్టు నడుచుకోరు. టైగర్ స్వామిగారు ఇంకా ఇలా చెప్పారు:

“ నే నిచ్చే సంజాయిషీని నాన్న గారు, నిర్వికార మౌనం వహించి విన్నారు. విన్న తరవాత గంభీరంగా ఒక విషయం వెల్లడించారు.

“ ‘నాయనా, జరగబోయేదాన్ని గురించి ఒక సాధువు నోట్లోంచి వచ్చిన అశుభ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నావు. ప్రతి రోజులాగే నిన్న నేను వరండాలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన వచ్చాడు.

“ ప్రియమిత్రమా, కలహప్రియుడైన నీ కొడుక్కి ఒక సందేశం తీసుకువచ్చాను. వాణ్ణి కిరాతకమైన పనులు మానెయ్యమను. లేకపోతే, ఈసారి పులితో పోట్లాటకు తలపడ్డప్పుడు తీవ్రమైన గాయాలకు గురిఅయి, ఆరు నెల్లపాటు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడతాడు. అప్పుడిక వెనకటి నడవడి విడిచిపెట్టి సన్యాసి అవుతాడు.” ’ “ఈ కథ నా మనస్సు కెక్కలేదు. నాన్న గారు, ఒక మాయదారి ఛాందసుడి మాటల్ని సులువుగా నమ్మేశారని అనుకున్నాను.”

తమ మూర్ఖత్వానికి దేనికో కించపడుతున్నట్టుగా ఆయన, సహనం కోల్పోయినవాడి భంగిమ ఒకటి చేస్తూ ఈ విషయం వెల్లడించారు. చాలా సేపటి వరకు గంభీరంగా మౌనం వహించడం చూస్తే, మేమక్కడ ఉన్న సంగతే ఆయన ఎరగనట్టున్నారు. అంతవరకు చెప్పిన కథలో, విడిచిపెట్టిన కొస మళ్ళీ అందుకుని సాగించేసరికి, ఆయన స్వరం హఠాత్తుగా మందగించింది.

“నాన్నగారు హెచ్చరించి అట్టే కాలం కాకముందే, నేను కూచ్ బిహార్ రాజధానికి వెళ్ళాను. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతం నాకు కొత్త. విశ్రాంతిగా అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డాను. మామూలుగా ప్రతిచోటా జరిగినట్టుగానే అక్కడ కూడా, వీథుల్లో జనం నన్ను వింతగా చూస్తూ వెంటబడ్డారు. గుసగుసలాడుతూ వాళ్ళు చేసే వ్యాఖ్యానంలో కొన్ని ముక్కలు పట్టుకున్నాను కూడా:

“ ‘అడవి పులులతో పోట్లాడేవాడు ఈయనే.’ ”

“ ‘ఈయనవి కాళ్ళా, చెట్ల బోదెలా?’ ”

“ ‘ఆయన మొహం చూడు! పులిరాజు అవతారమే అయి ఉండాలి!’ ”

“వార్తాపత్రికలు వేసే తుది సంచికల్లా, పల్లెటూరి పిల్లకాయలు ఎలా పనిచేస్తారో తెలుసా! అంతకంటె కూడా ఆలస్యంగా వెలువడే ఆడవాళ్ళ ప్రసంగ విశేషాలు ఇంటింటికీ ఎంత వడిగా వ్యాపిస్తాయో! ఒక్క కొన్ని గంటల్లోనే, నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరమందటా ఉద్రేకం చెలరేగింది.”

“సాయంత్రం నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను.” ఇంతలో, దౌడు తీసే గుర్రాల డెక్కల చప్పుళ్ళు వినిపించాయి. అవి నా బస కెదురుగా వచ్చి ఆగిపోయాయి. తలపాగాలు పెట్టుకున్న పొడుగాటి పోలీసువాళ్ళు కొందరు లోపలికి వచ్చారు.

“నేను ఆశ్చర్యపడ్డాను. ‘మానవ చట్టం సృష్టించిన వీళ్ళకి అన్నీ సంభవమైనవే,’ అనుకున్నాను. ‘నాకు బొత్తిగా ఏమీ తెలియని విషయాల గురించి దండించబోరు కదా, అనిపించింది.’ కాని ఈ ఆఫీసర్లు అలవాటు లేనంత అతివినయంతో వంగి నమస్కరించారు.

“ ‘అయ్యగారూ, కూచ్ బిహార్ యువరాజావారు వారి తరపున తమకు స్వాగతం ఇవ్వడానికి మమ్మల్ని పంపారు. రేపు పొద్దున తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుతున్నారు.’ ”

“ఈ పిలుపు ఎందుకయి ఉంటుందా అని కొంత సేపు ఊహించాను. అస్పష్టమైన ఏ కారణంవల్లనో కాని, ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగినందుకు మనస్సు చివుక్కుమనిపించింది. కాని పోలీసులు చూపించే వినమ్రభావం నన్ను కదిలించింది; రావడానికి ఒప్పుకున్నాను.

“మర్నాడు, నాలుగు గుర్రాలు పూన్చిన అద్భుతమైన బండిని గుమ్మంలోకి తీసుకువచ్చి అతిమర్యాదలతో నన్ను రాజమందిరానికి తీసుకువెళ్తూ ఉంటే తబ్బిబ్బు అయాను. మలమల మాడ్చే ఎండ నాకు తగలకుండా ఉండాలని ఒక భటుడు, అందంగా అలంకరించి ఉన్న గొడుగు పట్టాడు. నగర వీధుల గుండాను, శివార్లలో ఉన్న వనాల గుండాను కులాసాగా సాగుతూ ఆనందించాను. నాకు స్వాగతం పలకడానికి రాజవంశాంకురమే స్వయంగా, మందిర ద్వారం దగ్గర ఉన్నాడు. బంగారు నగిషీ చేసిన తన ఆసనాన్ని నాకు ఇచ్చి, అంతకంటె సాదా నమూనాలో ఉన్న కుర్చీలో తాను కూర్చుంటూ చిరునవ్వు చిందించాడు.

“ ‘ఈ మర్యాదంతా నాకు తప్పకుండా ముప్పుతెస్తుంది!’ అని, ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాను. కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తరవాత, యువరాజు ఉద్దేశం బయటపడింది.

“ ‘మీరు ఉత్తి చేతులతోనే అడవి పులులతో పోట్లాడగలరని మా ఊరంతా పుకారుగా ఉంది. ఇది నిజమేనా?’ ”

“ ‘అక్షరాలా నిజం.’ ”

“ ‘నేను నమ్మలేను! పట్నవాసుల తెల్ల బియ్యపన్నం తిని పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు. నిజం చెప్పండి; మీరు పోట్లాడేది, వెన్నుబలం లేని, నల్లమందు మరిగిన జంతువులతోనే కదూ?’ ఆయన గొంతు బిగ్గరగా, వెటకారంగా ఉంది; పలుకుబడిలో ప్రాంతీయమైన యాస కలిసి ఉంది.

“నన్ను అవమానపరిచే ఆయన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేదు.

“ ‘మాకు కొత్తగా పట్టుబడ్డ ‘రాజా-బేగం’[2] అనే పులితో పోట్లాడాలని మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. మీరు దాన్ని సరిగా ఎదిరించి, గొలుసుతో కట్టేసి, ఒంటిమీద స్పృహ పోకుండా దాని బోనులోంచి బయటికి రాగలిగితే, ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు. అంతేకాక, అనేక వేల రూపాయలు, అనేక ఇతర బహుమతులూ కూడా వస్తాయి. ఒకవేళ మీరు, దాన్ని ఎదుర్కోడానికి ఒప్పుకోకపోతే, మీరు వట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంతటా చాటిస్తాను!’

“అవమానకరమైన ఆయన మాటలు తుపాకిగుండ్ల వర్షంలా తగిలాయి. నేనూ కోపంగానే అంగీకారం తెలిపాను. ఆ ఉద్రేకంలో ఆయన కుర్చీలోంచి సగం లేచి, ఒక విషపు నవ్వు నవ్వుతూ మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు; ఆయన్ని చూస్తుంటే, క్రైస్తవుల్ని క్రూరమృగాల మధ్య విడిచిపెట్టి ఆనందించే రోమన్ చక్రవర్తులు గుర్తుకు వచ్చారు నాకు. ఆయన ఇలా అన్నాడు:

“ ‘పోటీ ఇంకో వారంలో ఏర్పాటవుతుంది. ఆ పులిని ముందుగా చూడటానికి మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను.’

“ఆ మృగానికి నేను వశీకరణ చేస్తాననో, రహస్యంగా నల్లమందు పెట్టడానికి ప్రయత్నిస్తాననో ఆ యువరాజు భయపడ్డాడేమో, నాకు తెలియదు!”

“రాజప్రాసాదంనుంచి బయటికి వస్తూ, అంతకు ముందున్న రాజోచితమైన ఛత్రం, సర్వాంగకవచంతో సన్నద్ధమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి, నాలో నేను నవ్వుకున్నాను.

“మరుసటి వారమంతా, రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్నీ మనస్సునూ క్రమపద్ధతిలో సిద్ధం చేసుకున్నాను. నా నౌకరు ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా విన్నాను. నాకు ముప్పు వస్తుందని ఒక సాధువు మా నాన్న గారికి జోస్యం చెప్పిన సంగతి ఇక్కడి జనంలో ఎలా వ్యాపించిందో కాని, ప్రచారమైనకొద్దీ చిలవలూ పలవలూ వేసింది. దేవతల శాపం పొందిన ఒక దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రిళ్ళు రకరకాల రాక్షసరూపాలు దాలుస్తుందనీ, పగలు మట్టుకు చారల పులిలాగే ఉంటుందనీ అమాయకులైన గ్రామప్రజలు నమ్మారు. నన్ను అణగదొక్కడానికి ఏర్పాటయినది ఆ రాకాసిపులేనని భావించారు.

“వాళ్ళ ఊహల్లో అల్లుకొన్న మరో కథ ఏమిటంటే, జంతువులన్నీ కలిసి పులుల స్వర్గానికి పెట్టుకున్న మొర ఫలించి రాజా-బేగం అవతరించిందట. పులిజాతి కంతకూ తలవంపులు తెస్తున్న వెరపులేని ద్విపాద పశువును శిక్షించడానికి అది సాధనమట! జూలులేని, కోరలులేని మానవ మాత్రుడొకడు, పంజాలతోనూ బలిష్టమైన అవయవాలతోనూ ఉండే పులిని సవాలు చెయ్యడానికి సాహిసించడమా! అవమానానికి గురి అయిన పులులన్నిటి విద్వేషవిషమూ సాంద్రీభూతమయి ఏర్పడ్డ శక్తికి, గుప్త నియమాల్ని పనిచేసేటట్టు చేసి, పులుల్ని దండించే గర్విష్ఠిని మట్టుపెట్టడానికి తగినంత చలనం వచ్చిందనీ పల్లెప్రజలు ప్రకటించారు.

“మనిషికీ మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా నా నౌకరు చెప్పాడు. వేలకొద్ది ప్రేక్షకజనం పట్టడానికి వీలయిన డేరా, ఆయనే దగ్గరుండి వేయించాడట; తుఫానుకు కూడా తట్టుకోగలిగేటంత దిట్టంగా వేయించాడు. దాని మధ్యలో బ్రహ్మాండమైన బోనులో రాజా-బేగం ఉంది; బోను చుట్టూ కాపుదల గది ఏర్పాటయి ఉంది. బోనులో బందీగా ఉన్న పులి, నెత్తురు తోడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తోంది. దానికి కోపంతో బాటు ఆకలి రగిలించడం కోసం తిండి అడపాతడపా పెడుతూ వచ్చారు. బహుశా, నేనే దానికి విందు భోజనం అవుతానని అనుకొని ఉంటాడు ఆ యువరాజు!

“సాటిలేని ఈ పోటీని గురించి బాగా టముకు వేయించినందువల్ల, నగరంలోవాళ్ళూ బయటివాళ్ళూ కూడా తండోపతండాలుగా వచ్చి టిక్కెట్లు కొనుక్కున్నారు. పోట్లాట జరిగేనాడు, వందలాది జనం, టిక్కెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చాలామంది, డేరా కంతల్లోంచి చొరబడి గేలరీల కింద ఉన్న చోటకు చేరి కిక్కిరిసిపోయారు.”

టైగరు స్వామి కథ మంచి పట్టులోకి వస్తూంటే, నాలో ఉద్రేకం పెల్లుబుకుతూ వచ్చింది; చండి కూడా మూగబోయి శ్రద్ధగా వింటున్నాడు.

“ఒక పక్క రాజా - బేగం చెవులు చిల్లులుపడేలా గర్జిస్తోంది; మరోపక్క, కొంచెం కంగారుపడ్డ ప్రేక్షక జనం గోల చేస్తున్నారు. ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను. నడుముకు చుట్టి కట్టుకొన్న చిన్న గుడ్డ తప్ప నా ఒంటిని కాసుకోడానికి మరే బట్టలు లేవు. కాపుదల గది తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్ళీ బిగించాను. మనిషి నెత్తురు పసిగట్టింది పులి. చువ్వలు ఫెళఫెళలాడేటంతగా రొద చేస్తూ ముందుకు ఉరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతం ఇచ్చింది. జాలీ భయమూ కలగలుపుగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది-- మహోగ్రమైన క్రూరమృగం ముందు నే నొక గొర్రెపిల్ల మోస్తరుగా కనిపించాను.

“ఒక్క క్షణంలో నేను బోనులోకి ప్రవేశించాను; కాని నేను తలుపు మూస్తూ ఉండగానే రాజా-బేగం నిలువునా నా మీదకి వచ్చిపడింది. నా కుడిచెయ్యి ఘోరంగా చీలుకుపోయింది. పులికి అన్నిటికంటె ఇష్టమైన మానవరక్తం చేతినుంచి వరదలా ప్రవహించింది. ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్టు అనిపించింది.

“అంతకు ముందెన్నడూ ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారిగా అవడంతో మెరుపుదెబ్బ తిన్నట్టయి, తక్షణమే నేను తేరుకున్నాను. నెత్తురు ఓడుతున్న వేళ్ళు దాని కంటికి కనబడకుండా ఉండాలని, అంగోస్త్రం కింద పెట్టేశాను. ఎడమచేత్తో విసురుగా, ఎముకలు విరిగేలా ఒక్క గుద్దు గుద్దాను. దాంతో పులి వెనక్కి తిరగబడి బోనులో వెనకతట్టున గింగిరాలు తిరిగి మళ్ళీ నా ఎదటికి వచ్చింది. పిడిగుద్దులకు మనం పెట్టింది పేరు; ఆ పిడుగుద్దులతో దాని నెత్తిమీద దబదబా మొత్తాను.

“చాలాకాలం పాటు సారా చిక్కని తాగుబోతుకి మళ్ళీ అది చిక్కితే, మొదటి పీల్పు ఎంత వెర్రెత్తిస్తుందో, రాజా-బేగంకు నెత్తుటి రుచి అంత వెర్రెత్తించింది. మధ్యమధ్య చెవులు గళ్ళుపడేలా గాండ్రిస్తూ, కోపంతో రెచ్చిపోతూ నామీద విరుచుకు పడింది. వాడిగా ఉన్న పంజాలూ కోరలూ గల ఆ పులిముందు నేను, ఒంటిచేత్తో కాసుకోవలసి ఉన్నందువల్ల దాని వాతపడే పరిస్థితిలో పడ్డాను. అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బ తియ్యకపోలేదు. ఇద్దరమూ చావో బతుకో తేల్చుకోవలసినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం. బోను బోనంతా గందరగోళమయి పోయింది; నెత్తురు అన్ని వైపులకీ చిమ్మేసింది. బాధా కసీ కలిసిన గాండ్రింపులు దాని గొంతులోంచి వెలువడుతున్నాయి.

" ‘కాల్చండి! ‘పులిని చంపండి!’ అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి. ఈ పెనుగులాటలో మనిషి మృగమూ కూడా వడివడిగా తిరుగుతుండడం వల్ల, రక్షక భటుడు కొట్టిన తుపాకిగుండు గురి తప్పిపోయింది కూడా. నేను నా సంకల్పశక్తి నంతనూ కూడగట్టుకొని భయంకరంగా హుంకరిస్తూ చిట్టచివరి చావుదెబ్బ కొట్టాను. పులి కూలబడి పోయి చడీ చప్పుడూ లేకుండా పడుకుంది.

“పిల్లిలాగ!” అన్నాను మధ్యలో, ఉండబట్టలేక.

నా మాటకు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ. తరవాత, మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్ళీ కొనసాగించారు.

“చివరికి రాజా-బేగం ఓడిపోయింది. తరవాత దాని రాజగర్వం మరింత అణిగిపోయింది. గాయాలతో చిట్లిపోయిన నా చేతులతో, జబర్దస్తీగా దాని దవడలు పెగలదీసి, నాటక ఫక్కీలో రంజింపజెయ్యడం కోసం, ఒక్క క్షణం మృత్యుముఖంలో తలదూర్చి ఉంచాను. గొలుసు కోసం చుట్టూ చూశాను. నేల మీదున్న గుట్టలోంచి ఒక గొలుసు లాగి పులి మెడకు బిగించి బోను కడ్డీలకు కట్టాను. విజయోత్సాహంతో గుమ్మం వేపు నడిచాను.

“కాని, రాకాసి పుట్టుక పుట్టిన ఆ రాజా - బేగంకు, పుట్టుమూలానికి తగ్గ రాకాసి బలం ఇంకా ఉంది. బలంగా ఒక్క ఊపుతో గొలుసు తెంపుకొని నా వీపు మీదికి దూకింది. నా బుజం దాని కోరల్లో చిక్కింది; నేను కుప్పగూలిపోయాను. కాని మరుక్షణంలోనే దాన్ని నేల మీద పడగొట్టి అణచిపారేశాను. నిర్దాక్షిణ్యంగా నేను గుద్దిన గుద్దులకు అది, ఒళ్ళు తెలిసీ తెలియని స్థితిలో పడింది. ఈసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టిపడేశాను. మెల్లగా బోనులోంచి బయటికి వచ్చాను.

“ఈసారి నాకు కొత్తరకం అరుపులు వినవచ్చాయి; ఆనందంతో అరిచిన అరుపు లవి. జన మందిరి గొంతులూ కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టున్నాయి. నేను తీవ్రంగా గాయపడ్డప్పటికీ, పెట్టిన మూడు షరతులూ పాటించాను- పులికి స్పృహ తప్పేటట్టు చెయ్యడం, గొలుసుతో కట్టిపడెయ్యడం, ఎవరి సహాయమూ అవసరం లేకుండా నా అంతట నేనే బయటికి రావడం. అంతే కాదు; ఆ పొగరుబోతు పులిని దారుణంగా చితగొట్టడమే కాకుండా, ఎంతగా బెదరగొట్టానంటే- సమయానికి చిక్కిన బహుమానంలా దాని నోట్లోకి దూర్చిన తలను కూడా ఉపేక్షించి ఊరుకుందది.

“నా గాయాలకు మందువేసిన తరవాత, పూలదండలు వేసి నన్ను ఘనంగా సన్మానించారు. బంగారు కాసులు అనేకం నా కాళ్ళ దగ్గర జల్లుగా కురిశాయి. నగరం యావత్తు పండుగ జరుపుకొంటున్నంత ఉల్లాసంగా ఉంది. ఎన్నడూ కనీ వినీ ఎరగనంత పెద్ద, క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు నా గురించి అన్ని చోట్లా అంతులేకుండా చెప్పుకున్నారు. అన్న మాట ప్రకారం, ఆ రాజా-బేగంను నన్నే తీసుకోమన్నారు. కాని నా కేమీ ఉత్సాహం కలగలేదు. ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది. నేను పులి బోనులోంచి చివరిసారిగా బయటికి రావడంతోనే, ప్రాపంచికమైన నా ఆశలన్నిటికీ ద్వారం మూసేసినట్టు అనిపించింది. “తరవాత నాకు కష్టకాలం వచ్చింది. నెత్తురు విషపూరితమైనందు వల్ల ఆరు నెల్లపాటు మృత్యుముఖంలో ఉన్నాను. కూచ్ బిహార్ విడిచి వెళ్ళడానికి తగినంత స్వస్థత చేకూరగానే, నేను మా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను.

“ ‘తెలివిగా నన్ను ముందుగానే హెచ్చరించిన సాధుపుంగవుడే నా గురువని నాకు తెలుసు.’ ఈ మాట నాన్నగారికి వినయంగా చెప్పాను. ఆయన ఎక్కడున్నారో కనుక్కోగలిగితే ఎంత బాగుండును!’ నా కోరిక చిత్తశుద్ధితో కూడినది. కనకనే ఆ సాధువు ఒకనాడు అనుకోకుండా వచ్చారు.

“ ‘పులుల్ని అణచడం ఇంక చాలు. ప్రశాంత నిర్భర స్వరంలో అన్నారాయన. ‘నాతో రా; మానవ మనస్సనే అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడం ఎలాగో నేర్పుతాను. ప్రేక్షకులముందు ప్రదర్శన లివ్వడానికి అలవాటుపడ్డవాడివి; యోగంలో నువ్వు సాదించే ఘనవిజయాన్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్ళకి వినోదం కలిగిద్దువు గాని!’

“ఋషుతుల్యులైన ఆ గురువుగారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు. చాలాకాలం వాడకం లేక, తుప్పుపట్టి బెట్టుపట్టిన ఆత్మ ద్వారాల్ని తెరిచినవారు ఆయన. నా శిక్షణ నిమిత్తమై త్వరలోనే మే మిద్దరం కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాం.”

తుఫానులా సాగిన, తమ జీవితాన్ని గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞులమై నేనూ, చండి ఆ స్వామివారి పాదాలకు మొక్కాం. ఆయన దర్శనం కోసం, చలిచలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకొని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని నేనూ నా స్నేహితుడూ సంతోషించాం.

  1. ‘సొహాంగ్’ అన్నది ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు పెట్టుకొన్న పేరు! జనసామాన్యంలో మాత్రం ‘టైగర్ స్వామి’ గానే ప్రసిద్ధులు.
  2. ‘‘రాజా - బేగం” - ఆడపులికి, మగపులికి కలిపి ఉండేటంత ఉగ్రత దీనికి ఉందని సూచించడానికి ఈ పేరు పెట్టారు.