ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 5
అధ్యాయం : 5
“గంధబాబా”
అద్భుతాల ప్రదర్శన
“ఈ లోకంలో ప్రతిదానికీ ఒక ఋతువన్నది ఉంది. ఉద్దిష్టమైన ప్రతిదానికీ ఒక సమయమంటూ ఉంది.”[1]
సాలమన్ రాజు[2]కున్న ఈ జ్ఞానం, నన్ను నేను ఓదార్చుకోడానికి, నాకు లేదు. నేను ఇంట్లోంచి వచ్చేసి ఇప్పుడు ఏ విహారయాత్రకు వెళ్ళినా, నా కోసం విధి నిర్ణయించి పెట్టిన గురుదేవుల ముఖం ఎక్కడయినా కనిపిస్తుందేమోనని పట్టిపట్టి పరిశీలనగా చూసేవాణ్ణి. అయినప్పటికీ నా హైస్కూలు చదువు పూర్తి అయేవరకు ఆయన దగ్గరికి నాకు దారి ఏర్పడలేదు.
అమర్‌తో బాటు నేను హిమాలయాలకి పారిపోవడానికి శ్రీయుక్తేశ్వర్‌గారు నా జీవితంలోకి ప్రవేశించిన సుదినానికి మధ్య రెండేళ్ళు గడిచాయి. ఈ నడిమి కాలంలో నేను కొందరు సాధువుల్నీ- “గంధబాబా”, “టైగర్ స్వామి”, సగేంద్రనాథ్ భాదురీ, మాస్టర్ మహాశయుల్నీవంగదేశపు విఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త అయిన జగదీశ్ చంద్ర బోస్‌నూ కలుసుకొన్నాను.
నేను “గంధబాబా” గారిని కలుసుకోడానికి భూమికలుగా చెప్పదగ్గ అంశాలు రెండున్నాయి. వాటిలో ఒకటి మధురమైనదీ మరొకటి వినోదకరమైనదీ.
“దేవుడు సరళమైనవాడు. తక్కినదంతా జటిలమైనది. ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువలకోసం వెతక్కు.”
“నేను కాళికాదేవి[3] ఆలయంలో విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలబడి ఉన్నప్పుడు, ఈ దార్శనిక నిష్కర్షలు మృదువుగా నా చెవిని పడ్డాయి. తిరిగి చూసేసరికి, ఒక పొడుగాటాయన కనిపించాడు; ఆయన ధరించిన - లేదా ధరించని - వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధువని తెలిసింది.
“మీరు, నా ఆలోచనల్లో ఉన్న వ్యాకులతను నిజంగా కనిపెట్టారు!” అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వు నవ్వాను. కాళికాదేవిలో సంకేతితమైన మాదిరిగా, ప్రకృతిలోని కృపా-భయానక రూపాల జటిలత నా కంటె తెలివైన బుర్రలనే తబ్బిబ్బు చేసింది.”
“ఈమె మర్మాన్ని విప్పి చెప్పగలవాళ్ళు బహు కొద్దిమంది! జీవితం మన ముందుంచే మంచి చెడ్డలు, ప్రతి ఒక్కడి తెలివినీ పరీక్షించే స్ఫింక్స్[4] చేసే మాదిరి జటిలమైన యక్ష ప్రశ్న. మానవులు చాలామంది, దాని పరిష్కారానికి ప్రయత్నించకుండానే జీవితాలను కోల్పోతారు; థీబ్స్ రోజుల్లో మాదిరిగా ఇప్పటికీ అదే దండన. కాని అక్కడక్కడ, ఓటమి నంగీకరించని మహోన్నత శిఖరంలా ఒక్కొక్కడు ఒంటరిగా నిలుస్తాడు. ద్వైతంలో ఉన్న మాయ[5]లో నుంచి అఖండమైన అద్వైత సత్యాన్ని చేజిక్కించుకొంటాడు.”
“మీరు దృఢ విశ్వాసంతో చెబుతున్నారండి.”
“నేను చాలాకాలం, చిత్తశుద్ధిగా అంతఃపరిశీలన అభ్యసించాను; జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గమిది. ఆత్మపరీక్ష చేసుకోడం, తన ఆలోచనల్ని నిర్విరామంగా పరిశీలనచేసుకోడం కఠోరమైన విదారక అనుభవం. అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గు చేస్తుంది. కాని నిజమైన ఆత్మవిశ్లేషణ, ద్రష్టలను తయారుచేయడానికి గణితశాస్త్రీయంగా పనిచేస్తుంది. ‘ఆత్మాభివ్యక్తి’ విధానం పేరిట సాగే వైయక్తికాభిప్రాయ ప్రకటనలు, దేవుణ్ణిగురించీ విశ్వాన్ని గురించీ తమకు తోచిన వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు చేయడానికి తమకు హక్కుందని విశ్వసించే అహంకారుల్ని తయారుచేస్తాయి.”
“అటువంటి దురహంకార పూరితమైన మౌలికత సమక్షం నుంచి సత్యం వినమ్రంగా వెళ్ళిపోతుందనడంలో సందేహం లేదు.” చర్చ నాకు ఆహ్లాదకరంగా ఉంది.
‘‘మనిషి, బడాయిల్లోంచి బయటపడేవరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు. అనేక శతాబ్దాలుగా పంకిలమై ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచ మాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది. మనిషి మొదట, తనలోని శత్రువులతో జరిపే పెనుగులాటముందు, యుద్ధ భూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి! ప్రచండ బలప్రయోగంతో జయించడానికి, ఇవేమీ మానవ రూపంలో ఉన్న శత్రువులు కావు! విషవాయువుల్ని వెళ్ళగక్కే అస్త్రాలను బహునేర్పుగా అమర్చుకొని, అంతటా కమ్ముకొని, నిర్విరామంగా పనిచేస్తుండే, తామసిక కామాలనే ఈ యోధులు, మనల్ని అందరినీ హతమార్చడానికి చూస్తుంటారు. తన ఆదర్శాల్ని భుస్థాపితం చేసి సాధారణ ప్రారబ్ధానికి తలవంచినవాడు ఆలోచనాశూన్యుడు. అతడు నిర్వీర్యుడుగానూ, మూర్ఖుడుగానూ, అనుమానకరుడుగానూ తప్ప మరో రకంగా కనిపిస్తాడా?”
“అయ్యా, దిగ్భ్రమ చెందిన జనసామాన్యం మీద మీకు సానుభూతి లేదా?” ఆ సాధువు ఒక్క క్షణం మౌనం వహించాడు; తరవాత వక్రంగా సమాధాన మిచ్చాడు.
“సర్వ సుగుణాలకి నిలయుడై అగోచరుడైన భగవంతుణ్ణి ఒక పక్కా, అటువంటి వేమీ లేనట్టు కనిపించే మానవుణ్ణి మరొక పక్కా ప్రేమించడమన్నది, తరచు దిగ్భ్రమ కలిగిస్తూ ఉంటుంది! వ్యూహానికి తగ్గట్టుగానే ఉంటుంది బుద్ధికుశలత. అంతఃపరిశోధన, మానవులందరి మనస్సుల్లోని ఏకత్వాన్ని- అంటే స్వార్థపరత్వమనే దృఢబాంధవ్యాన్ని - బయట పెడుతుంది. కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మానవుల్లో సోదరభావం వెల్లడి అవుతున్నది. సమత్వాన్ని చూపించే ఈ ఆవిష్కారాన్ని అనుసరించి నివ్వెరపాటుతో కూడిన వినమ్రత వస్తుంది. ఆత్మకున్న, అన్వేషణయోగ్యమైన స్వాస్థ్యదాయక శక్తుల్ని గమనించకుండా ఇది, తోటివాళ్ళ మీద కనికరంగా మారుతుంది.”
“ప్రపంచం అనుభవించే దుఃఖాల్ని గురించి ప్రతి యుగంలోని సాధువులూ మీలాగే బాధపడ్డారండి.”
“ఇతరుల జీవితాల్లో కనిపించే దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయినవాడు ఒట్టి డాంబికుడు.” గంభీరంగా ఉన్న ఆ సాధువు ముఖం గమనించగలిగినంతగా ప్రశాంతమయింది. “శస్త్రంతో ఆత్మ విచ్ఛేదన చేసుకోడం అభ్యసించినవాడు, విశ్వజనీనమైన అనుకంపను విస్తరింపజేయడం తెలుసుకుంటాడు. చెవులు ఊదరగొడుతూ, అధికార పూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది. అటువంటి నేలలో దైవప్రేమ పుష్పిస్తుంది. చివరికి జీవుడు మరెందుకూ కాకపోయినా- “ఎందుకని? ప్రభూ, ఎందుకని?” అంటూ ఆక్రోశించడానికి సృష్టికర్త వేపు తిరుగుతాడు. బాధ అనే దారుణ కళా ఘాతాలు మానవుణ్ణి చివరికి, కేవలం సౌందర్యంతోనే ఆకర్షించే పరమాత్మ దగ్గరికి తోలతాయి.”
నేనూ ఆ సాధువూ కలకత్తా కాశీఘాట్ ఆలయంలో మాట్లాడుకుంటున్నాం; అద్భుత సౌందర్యానికి పేరుగన్న ఆ దేవాలయాన్ని దర్శించడానికే నేను వెళ్ళాను. అనుకోకుండా తారసపడ్డ ఈ పరిచయస్థుడు అలంకార ప్రాయమైన మందిరం ఘనతను ఒక్క చేతి విదిలింపుతో కొట్టిపారేశాడు.
“ఇటికలూ సున్నమూ, మన చెవులకు సోకే స్వరాలేవీ ఆలపించవు; తన ఉనికిని తెలిపే మానవగానం ఒక్కదానికే గుండె తెరుచుకుంటుంది.”
భక్త బృందాలు ఇటూ అటూ సాగుతున్న గుమ్మందగ్గర, మాకు ఆహ్వానమిస్తున్న ఎండలోకి ఇద్దరం నడిచాం.
“నువ్వు చిన్న వాడివి.” ఆ సాధువు సాలోచనగా నన్ను పరిశీలించాడు. “భారతదేశం కూడా చిన్నదే. సనాతన ఋషులు[6], ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి, నిర్మూలించడానికి శక్యంకాని పద్ధతులు ఏర్పరిచి ఉంచారు. వాళ్ళ సనాతన సూక్తులు ఈనాటికీ ఈ దేశానికి చాలు. భౌతికవాదం ఎన్ని కుతర్కాలు చేసినప్పటికీ, ఇవి పాతబడి పోలేదు; అనాగరికమూ కాలేదు. శిక్షణాత్మకమైన ఈ బోధలు భారతదేశాన్ని ఇప్పటికీ తీర్చి దిద్దుతున్నాయి. వేలకొద్ది సంవత్సరాలుగా - తత్తరపాటు పండితులు కాలగణన చేయడానికి ఖాతరుచేసే దానికంటె మిన్నగానే- సంశయాత్మక మైన కాలమే వేదాల విలువను రుజువుచేసింది. దాన్ని నువ్వు వారసత్వంగా తీసుకో.” మంచి వాగ్ధార గల ఆ సాధువుకు నేను, భక్తి పురస్సరంగా వీడ్కోలు చెబుతూ ఉండగా, భవిష్యద్దర్శనం ఒకటి వెల్లడించా డాయన:
“ఈవేళ నువ్విక్కణ్ణించి వెళ్ళిన తరవాత, నీకు అసామాన్యమైన అనుభవం ఒకటి కలుగుతుంది.”
నేను దేవాలయ ఆవరణనుంచి బయటికి వచ్చి, తరవాత ఎక్కడికి వెళ్ళాలో నిశ్చయించుకోకుండా తిరుగుతున్నాను. వీధి మలుపు తిరుగుతూ ఒక పాత స్నేహితుడికి ఎదురు పడ్డాను – వాడు ఎల్లాటివాడంటే, అల్లాటి వాళ్ళ సంభాషణ శక్తులు కాలాన్ని ఖాతరు చేయకుండా అనంతంగా సాగుతూనే ఉంటాయి.
“నిన్ను తొందరగా విడిచి పెడతాలే,” అంటూ నాకు మాట ఇచ్చాడు వాడు, “మనం విడిపోయినప్పటి నించి ఇప్పటి దాకా ఇన్నేళ్ళూ జరిగిన సంగతులన్నీ చెప్పేటట్టయితే!” అన్నాడు.
“ఎంత విపరీతం! నే నిప్పుడు వెళ్ళిపోవాలి.”
కాని వాడు నా చెయ్యి పట్టేసుకుని, కొన్ని సంగతులు టూకీగా, నా చేత బలవంతాన చెప్పిస్తున్నాడు. ఆవురావురుమంటున్న తోడేలులాగున్నాడు వీడు, అనిపించింది సరదాగా. నేను ఎక్కువసేపు మాట్లాడిన కొద్దీ, వాడు ఇంకా చెప్పమంటూ పీకుతున్నాడు. వీణ్ణి నేను మర్యాదగా తప్పించుకొనే ఉపాయం చెయ్యమని, మనస్సులో కాళికాదేవికి మనవి చేసుకున్నాను.
మా స్నేహితుడు చటుక్కున వెళ్ళిపోయాడు. అమ్మయ్య, అనుకుని నేను నడక మరింత జోరుచేశాను, ఈ వదరుబోతు పీడ మళ్ళీ తిరగబెడుతుందేమో నన్న భయంతో, వెనకాల తొందరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి నా వేగాన్ని పెంచాను. వెనక్కి తిరిగి చూడ్డానికి ధైర్యం చెయ్యలేదు. కాని మావాడు మళ్ళీ ఒక్క ఉదుటున ఉరుక్కొచ్చి నన్ను కలుసుకుని సరదాగా నా భుజం పట్టుకున్నాడు.
“గంధబాబా గురించి నీకు చెప్పడం మరిచిపోయాను; అదుగో ఆ ఇంటికే దయచేశారాయన,” అంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఇంటిని చూపించాడు. “ఆయన్ని తప్పకుండా కలుసుకో; సరదాగా ఉంటుంది. అసామాన్యమైన అనుభవమేదైనా కలగొచ్చు నీకు. వస్తా,” అంటూ ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు.
కాశీఘాట్ ఆలయం దగ్గర సాధువు, సరిగ్గా ఇలాగే చెప్పిన జోస్యం నా మనస్సులో మెదిలింది. కుతూహలంతో నేను ఆ ఇంట్లోకి ప్రవేశించాను. విశాలమైన ఒక హాలులోకి నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ, నారింజవన్నె తివాసీ మీద అక్కడక్కడకొందరు బాసెనపట్టు వేసుకుని కూర్చుని ఉన్నారు. భక్తిభావంతో గుసగుసలాడుతున్న మాటలు నా చెవిని పడ్డాయి:
“చిరతపులి చర్మం మీద గంధబాబాని చూడు. వాసనలేని పువ్వుకు దేనికైనా ఆయన, సహజమైన వాసన తెప్పించలరు. వాడిపోయిన పువ్వును దేన్నయినా, తాజాగా విచ్చుకొన్నట్టు చెయ్యగలరు; లేదా, మనిషి చర్మంలోంచి ఆహ్లాదకరమైన పరిమళం రప్పించగలరు.”
నేను సూటిగా సాధువు వేపు చూశాను; ఆయన చురుకైన చూపు నా మీద నిలిచింది. ఆయన బొద్దుగా ఉన్నారు; గడ్డం పెంచాడు. ఒంటి చాయ నలుపు. పెద్దపెద్ద కళ్ళు మెరుస్తున్నాయి.
“అబ్బాయి, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు, ఏదైనా సువాసన కావాలా?” “ఎందుకండి?” ఆయన నన్నలా అడగడం కుర్రతనంగా అనిపించింది నాకు.
“అలౌకిక రీతిలో సువాసనలను ఆస్వాదించే ఆనుభవం పొందడానికి.”
‘‘వాసనల కోసం దేవుణ్ణి వాడుకోడమా?”
“అయితేనేం? దేవుడు ఎలాగా పుట్టిస్తాడు కదా, సువాసనలు.”
“ఔననుకోండి; కాని ఆయన, మనం తాజాగా వాడుకోడానికి తరవాత పారెయ్యడానికి వీలయిన సున్నితమైన పూలు సృష్టిస్తాడు. మీరు సృష్టించగలరా పువ్వులు?”
“ఆ; కాని మామూలుగా సువాసనలే సృష్టిస్తాను చిన్నబాబూ!”
“అయితే సెంటు ఫ్యాక్టరీవాళ్ళ వ్యాపారం పడిపోతుంది.”
“వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకోనిస్తాలే! భగవంతుడి శక్తిని కళ్ళకి కట్టించడమే నా ఉద్దేశం.”
“అయ్యా, భగవంతుణ్ణి రుజువు చెయ్యడం అవసరమాండీ? ఆయన ప్రతి దాంట్లోనూ ప్రతిచోటా అద్భుత శక్తులు చూపించడం లేదా?”
“ఔననుకో. కాని మనం కూడా, ఆయనకు గల అనంతమైన సృజనశక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకి కట్టించాలి.”
“మీరీ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండీ?”
“పన్నెండేళ్ళు.”
“సూక్ష్మోపాయాలతో సెంట్లు తయారు చెయ్యడానికా! మహాశయా, కొన్ని రూపాయలు పెడితే పూల అంగట్లో దొరికే సువాసనల కోసం మీరు పన్నెండేళ్ళు వృథాచేస్తూ వచ్చారని నా కనిపిస్తోంది.” “పూలు వాడిపోతే సువాసనలు పోతాయి.”
“చావుతోనూ సువాసనలు పోతాయి. కేవలం శరీరానికే ముచ్చట గొలిపేది నే నెందుకు కోరుకోవాలి?”
“వేదాంతిగారూ, నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తోంది. నీ కుడి చెయ్యి ఇలా చాపు.” ఆశీర్వదిస్తున్న భంగిమ కనబరిచాడాయన.
నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను. నా ఒంటిని తాకేటంత దగ్గరిలో మరొక రెవరూ లేరు. నేను చెయ్యి చాపాను. ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు.
“నీకు ఏం వాసన కావాలి?”
“గులాబి.”
“అదే వచ్చుగాక.”
నా అరచేతి మధ్యలోంచి ఘాటుగా గులాబి వాసన రావడంతో ఆశ్చర్యపోయాను. దగ్గరిలో ఉన్న ఒక పూలకుండీలోంచి, వాసనలేని పెద్ద పువ్వు ఒకటి తీశాను.
“వాసనలేని ఈ పువ్వుకి మల్లి పువ్వు వాసన తెప్పించవచ్చాండీ?”
“అదే వచ్చుగాక.”
వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లిపువ్వు వాసన వచ్చింది. అద్భుత శక్తులు చూపే ఆయనకి ధన్యవాదాలు చెప్పి, ఆయన శిష్యుడి పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఆ శిష్యుడు చెప్పాడు- గంధబాబాగారి సరైన పేరు స్వామీ విశుద్ధానందగారట. ఈయన టిబెట్టులో ఉండే ఒక యోగి దగ్గర, ఆశ్చర్యకరమైన అనేక యోగరహస్యాలు తెలుసుకొన్నారట. ఆ టిబెట్టుయోగి వయస్సు వెయ్యేళ్ళకు మించిందని నాకు నమ్మకంగా చెప్పాడు. “ఆయన శిష్యులైన గంధబాబాగారు అన్ని సమయాల్లోనూ, ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగా, కేవలం మాటలతో వాసనలు సృష్టించరు.” గురువుగారిని చూసుకొని గర్విస్తూ మాట్లాడాడు ఆ శిష్యుడు. “వ్యక్తుల స్వభావాల్లోని వైవిధ్యానికి తగ్గట్టుగా ఈయన పద్ధతి చాలా మారుతూ ఉంటుంది. ఈయన అద్భుతమైన వ్యక్తి! కలకత్తా మేధావుల్లో చాలామంది ఈయన అనుచరులు.”
నేను వాళ్ళలో కలవగూడదని మనస్సులో తీర్మానించుకున్నాను. అక్షరాలా “అద్భుతమైన” వ్యక్తి అనిపించుకునే గురువంటే నాకు కిట్టదు. గంధబాబాగారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. మెల్లగా ఇంటి మొహం పట్టి నడుస్తూ, ఆనాడు జరిగిన మూడు సంఘటనల గురించీ ఆలోచన సాగించాను.
నేను గుమ్మంలోకి వెళ్ళే సరికి మా అక్క ఉమ ఎదురయింది.
“బలే షోగ్గా తయారవుతున్నావు, సెంట్లు పూసుకుంటూ;”
ఒక్క పలుకు కూడా పలకకుండా, ఆమెకు చెయ్యి వాసన చూపించాను.
“ఎంత మంచి గులాబివాసనో! దీనికి అసాధారణమైన ఘాటు ఉంది.”
దీంట్లో “ఘాటైన అసాధారణత” ఉందని అనుకుంటూ నేను, చడీ చప్పుడూ లేకుండా, అలౌకిక పద్ధతిలో సుగంధబంధురం చేసిన పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాను.
“ఓహ్, మల్లిపువ్వు నాకు చాలా ఇష్టం!” అంటూ పువ్వులాగేసుకుంది ఉమ. తీరా చూస్తే, అది వాసనలేని పువ్వుల్లో ఒక రకం. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. కాని దాంట్లోంచి, మాటిమాటికీ మల్లిపువ్వు వాసనే వాసన చూస్తూంటే ఆమె ముఖంలో వినోదంతో కూడిన విస్మయం ఆవరించింది. దాంతో నా అనుమానాలు తొలగిపోయాయి; ఆ వాసనలు నా ఒక్కడికే అలా అనిపించేటట్టుగా, గంధబాబాగారు నన్ను స్వయం సమ్మోహన స్థితికి గురిచేశారేమో అనుకున్నాను కాని, అలా జరగలేదని తెలిసిపోయింది.
తరవాత ఒకసారెప్పుడో, అలకనందుడనే మా స్నేహితుడు, ఈ గంధబాబాకి ఒక అపురూపశక్తి ఉందన్నాడు. ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది ప్రజలకే కనక ఆ శక్తి ఉండి ఉంటే ఎంత బాగుండునో అనిపించింది.
“ఒకసారి బర్ద్వాన్‌లో గంధబాబాగారి ఇంటికి వచ్చిన వందమంది అతిథుల్లో నేనూ ఉన్నాను,” అంటూ అలకనందుడన్నాడు. “అదొక బ్రహ్మాండమైన ఉత్సవం. ఈ యోగికి, గాలిలోంచి వస్తువులు సృష్టించే శక్తి ఉందని పేరు. అంచేత నేను నవ్వుతూ, ఆ ఋతువులో దొరకని టాంజిరీన్ నారింజలు సృష్టించమని ఆయన్ని కోరారు. తక్షణమే, అరిటాకు విస్తళ్ళలో వడ్డించిన లూచీలు (రొట్టెలు) పైకి ఉబ్బి, వాటిలో ఒలిచి పెట్టిన టాంజిరీన్ నారింజలు ఉన్నాయని రుజువుచేశాయి. రుచి ఎలాగుంటుందో ఏమోనని సంశయిస్తూ నేను కొరికి చూశాను కాని, రుచి చాలా బాగుందనిపించింది.”
కొన్నేళ్ళ తరవాత నేను, ఈ గంధబాబాగారు వాటిని ఎలా సృష్టించేవారన్న విషయం, నా అంతస్సాక్షాత్కారం వల్ల తెలుసుకున్నాను. ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవడం ఎంత విచారకరమైన విషయం!
మానవుడు ప్రతిక్రియ చూపే, శబ్దస్పర్శరూపరసగంధ సంబంధమైన ఇంద్రియోత్తేజకాలు, ఎలక్ట్రాన్ ప్రోటాన్లలోని స్పందన తారతమ్యాల వల్ల పుడతాయి. పర్యాయక్రమంలో, ఈ స్పందనలను ప్రాణం– అంటే “లైఫ్ ట్రాన్‌లు” క్రమబద్ధం చేస్తాయి. ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు; లేదా వేరువేరు పంచతన్మాత్రలతో జ్ఞానపరంగా భరితమైన-పరమాణువుల కంటె కూడా సూక్ష్మతరమైన శక్తులు.
గంధబాబాగారు, కొన్ని నిర్దిష్ట యోగాభ్యాసాలవల్ల తనను తాను ప్రాణశక్తికి సరిచేసుకొని, లైఫ్ ట్రాన్‌లు (ప్రాణాణువులు) తమ స్పందనాత్మక నిర్మితిని మరో రకంగా మార్చుకోడానికి అనువుగా ప్రచోదన ఇచ్చి, కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నాడు. ఆయన చూపించిన వాసన, పండు, తదితర అలౌకిక శక్తులు, ప్రాపంచిక స్పందనాల వాస్తవ వస్తురూప కల్పనలే కాని సమ్మోహనంవల్ల ఉత్పన్నం కావించిన ఆంతరిక సంవేదనలు కావు.
చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు, మత్తుమందు ఇస్తే అపాయానికి గురికాగల వ్యక్తుల విషయంలో, సమ్మోహన శక్తినే ఒక విధమైన మానసికమైన మత్తుమందుగా ఉపయోగిస్తారు. కాని ఇది, తరచుగా సమ్మోహన స్థితికి గురి అయే వాళ్ళకి హాని చేస్తుంది. కొంతకాలం గడిచేసరికి, వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి, మెదడులోని కణాల్ని అస్తవ్యస్తం చేస్తుంది. సమ్మోహనమన్నది ఇతరుల చేతనా పరిధిలోకి అనధికారంగా ప్రవేశించడం.[7] దీని తాత్కాలిక దృగ్విషయాలకీ దివ్యసాక్షాత్కారం పొందినవాళ్ళు చూపే అద్భుత శక్తులకూ పోలిక లేదు. భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు, సృజనాత్మక విశ్వస్వాప్నికుడికి అనుగుణంగా శ్రుతి కలిపి, తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకువస్తారు.
గంధబాబాగారి లాటివాళ్ళు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసినవే అయినా, అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి. వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడంవల్ల ఇవి, దేవుడికోసం జరిపే తీవ్రమైన అన్వేషణను పక్కలకి మళ్ళిస్తాయి.
అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనను గురువులు నిరసించారు. అబూ సయీద్ అనే పారశీక మార్మికుడు, నీటిమీదా గాలిలోనూ అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుతశక్తుల్ని చూసుకొని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడు.
“నీళ్ళలో కప్ప కూడా హాయిగానే ఉంటుంది!” అంటూ మెత్తని మందలింపుతో ఎత్తిపొడిచాడు అబూ సయీద్, “కాకీ రాంబందూ గాలిలో సులువుగా ఎగురుతాయి. సైతాను తూర్పునా పడమటా కూడా ఒకేసారి కనిపిస్తాడు. నిజమైన మానవుడు ఎవడంటే, తన తోటివాళ్ళలోనే ధార్మిక జీవనం గడుపుతూండేవాడూ, క్రయవిక్రయాలు సాగిస్తూనే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మరిచిపోనివాడూ!”[8] మరో సందర్భంలో ఈ పారశీక దేశికోత్తముడు, ధార్మిక జీవనాన్ని గురించి తనకుగల అభిప్రాయాలు ఇలా చెప్పాడు: “నీ మనస్సులో ఉన్నది పక్కకి పెట్టెయ్యడం (స్వార్థంతో కూడిన కోరికలు, ఆశయాలు); నీ చేతిలో ఉన్నది ఉదారంగా ఇతరులకు ఇవ్వడం, ఆపదలు పిడుగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడూ చలించక పోవడం!”
కాశీఘాట్ గుడిదగ్గర తటస్థపడ్డ సమదర్శి అయిన మునికాని, టిబెట్టులో శిక్షణపొందిన యోగికాని, గురువుకోసం నాకుగల ఆకాంక్షను తీర్చలేదు. నా హృదయానికి, ప్రేరణలకోసం, అధ్యాపకుడు అవసరం లేకపోయింది; “ధైర్యం వహించు!” అంటూ దానంతట అది కేక వేసింది. అది అరుదుగా నిశ్శబ్దంలోంచి వెలువడేది కావడంవల్ల గట్టిగా మారుమోగింది. చివరికి నేను మా గురువుగారిని కలుసుకున్నప్పుడు, ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయతవల్ల నే నిజమైన మానవుడి ప్రమాణాన్ని ఉద్బోధించారు.
- ↑ ‘ఎక్లిసియాస్టిస్..’ : : 1 (బైబిలు, కింగ్ జేమ్స్ పాఠం).
- ↑ క్రీ. పూ. పదోశతాబ్దిలో ఇజ్రాయిల్ దేశాన్ని పాలించిన వీర ప్రభువు. పరిపాలనలో అతడు చూపిన వివేకాన్నిబట్టి, ధర్మాన్నిబట్టి ఈనాటికీ అతడి పేరు జ్ఞాని అనే మాటకు పర్యాయపదంగా ప్రసిద్ధిచెందింది.
- ↑ కాళికాదేవి, ప్రకృతిలోని శాశ్వత నియమానికి ప్రతీక. సాంప్రదాయికంగా ఈమెను, నేలమీద పడుక్కొని ఉన్న శివదేవుని- లేదా అనంతుని. రూపం మీద నిలబడి ఉన్న చతుర్భుజ మూర్తిగా చిత్రిస్తారు. ఎందుచేతనంటే, ప్రకృతి-అంటే దృగ్విషయక ప్రపంచం- కార్యకలాపాలు నిర్గుణ బ్రహ్మనుంచి ఉత్పన్నమవుతాయి. ఈమె నాలుగు చేతులూ నాలుగు మౌళిక లక్షణాలకు ప్రతీకలు: వాటిలో రెండు శుభంకరమైనవి, రెండు వినాశకరమైనవి; ద్రవ్యానికి అంటే సృష్టికి- మౌలికమైన ద్వంద్వం.
- ↑ గ్రీకు పురాణ కథలో వచ్చే రాక్షసి. దీని తల స్త్రీది; శరీరం సింహానిది కాని, కుక్కది కాని; రెక్క లుంటాయి. ఈ రాక్షసి, థీబ్స్ అనే ప్రాచీన గ్రీకు నగరంలో, వచ్చేపోయేవారిని యక్షప్రశ్నలు వేసి, జవాబు చెప్పలేని వాళ్ళను తినేసేదని ప్రసిద్ధి.
- ↑ విశ్వభ్రాంతి; దీనికి వాచ్యార్థం “కొలిచేది” అని. మాయ అనేది సృష్టిలోని ఇంద్రజాల శక్తి; దీనివల్ల అమేయం, అఖండం అయిన పరమాత్మలో పరిమితులూ, విభాగాలూ కనిపిస్తూ ఉంటాయి.
‘మాయ’ను గురించి ఎమర్సన్ ఈ కింది పద్యం రాశాడు (దాన్ని అతడు Mala అన్న వర్ణక్రమంలో రాశాడు)
అభేద్యమైన దాన్ని కల్పిస్తుంది మాయ,
లెక్కలేనన్ని సాలెగూళ్ళు ఆల్లుతూ;
ఉల్లాసకరమైన దాని చిత్రరూపాలు విఫలంకా వెన్నడూ,
ఒకదాని మీ దొకటి పడుతుంటాయి, తెరమీద తెరలా:
మోసపోవడానికి తపించేవాణ్ణి
తప్పకుండా నమ్మిస్తుంది ఈ మోహకారిణి. - ↑ ఋషు లంటే “ద్రష్టలు” అని అర్థం; కచ్చితంగా కాలనిర్ధారణ చేసి చెప్పడానికి వీలులేనంత సనాతనమైన వేదాలకు కర్తలు వీరు.
- ↑ పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చేతననుగురించి సాగించిన పరిశీలనలు చాలవరకు, అవచేతన మనస్సుకూ, మనోవ్యాధి చికిత్సాశాస్త్రం ద్వారానూ మనోవైజ్ఞానిక విశ్లేషణద్వారానూ నయంచేసే మనోవ్యాధులకూ పరిమితమైనవి. సామాన్య మానసిక స్థితులకూ వాటి భావోద్రేక, సంకల్ప విషయిక అభివ్యక్తులకూ మూలాన్ని గురించి, మౌలిక నిర్మాణాన్ని గురించి జరిగిన పరిశోధన చాలా స్వల్పం; నిజంగా మౌలికమయిన ఈ విషయాన్ని భారతీయ దర్శనశాస్త్రం ఉపేక్షించలేదు. సాంఖ్య యోగ శాస్త్రాల్లో సామాన్య మానసిక సవరణల్లోని వివిధ సంబంధాలనూ బుద్ధి, అహంకారం, మనస్సు అన్నవాటి స్వాభావిక ప్రకార్యాలనూ సునిశితంగా వర్గీకరించడం జరిగింది.
- ↑ “క్రయవిక్రయాలు సాగిస్తూనే దేవుణ్ణి ఎన్నడూ మరవకపోవడం!” అంటే, పనిచేసే చెయ్యీ ధ్యానించే హృదయమూ కలిసి సామరస్యంగా పనిచెయ్యాలన్న ఆదర్శం ఇందులో కనబడుతుంది. హిందువులు ఏర్పరచుకొన్న లక్ష్యం, అకర్మణ్యతతోనూ సమాజ విరుద్ధమైన ఆత్మసంకోచనంతోనూ కూడుకొన్న పిరికితనపు “పలాయనం” అని కొందరు పాశ్చాత్య రచయిత లంటారు. అయితే, వేదాల్లో చెప్పిన ప్రణాళిక ప్రకారం మానవ జీవితానికి ఏర్పరచిన నాలుగు ఆశ్రమాలూ జనులందరూ ఆచరించడానికి అనువైన విధంగా, సమతూకంగా రూపొందించినవి; వీటిలో సగంకాలం అధ్యయనానికి గృహస్థాశ్రమ విధులు నిర్వర్తించడానికి, తక్కిన సగంకాలం దైవచింతనా, ధ్యానసాధనలు సాగించడానికి కేటాయించడం జరిగింది.
ఆత్మలో సుస్థిరుడై ఉండడానికి, మనిషికి ఏకాంతం అవసరం; కాని తరవాత, లోకానికి సేవచేయడం కోసం గురువులు, ప్రపంచంలోకి తిరిగి వస్తారు. పైకి కనిపించే విధంగా ఏ పనీ చెయ్యని సాధువులు సైతం, తమ ఆలోచనల ద్వారానూ పవిత్ర స్పందనల ప్రసారంద్వారానూ ప్రపంచానికి అత్యంత అమూల్యమైన బహుమానాలు ప్రధానం చేస్తూ ఉంటారు. వివేక శూన్యుడైనవాడు ఎంతో శ్రమిస్తూ సాగించే మానవసేవా కార్యకలాపాలవల్ల కలిగే మేలుకన్న, వీరివల్ల ప్రపంచానికి ఇంకా ఎక్కువ విలువైన మేళ్ళు చేకూరతాయి. మహాపురుషులు, ఎవరి పద్ధతిలో వాళ్ళు, తరచుగా తీవ్రమైన ప్రతిఘటనను కూడా లెక్క చెయ్యకుండా, తోటివారిని ఉత్తేజపరచడానికి ఉద్ధరించడానికి నిస్స్వార్ధంగా శ్రమిస్తూ ఉంటారు. హైందవ ధార్మికాదర్శం కాని, సామాజికా దర్శం కాని ఏ ఒక్కటీ కేవలం నకారాత్మకం కాదు. మహాభారతంలో, “సకలో ధర్మః” అని
చెప్పిన ‘అహింస’, సకారాత్మకమే కావడానికి కారణం, ఇతరులకు సహాయం చెయ్యనివాడు ఏదో ఒక విధంగా వాళ్ళకి హానే చేస్తున్నాడన్న భావన దాంట్లో ఉంది.
కర్మ ప్రవృత్తి మానవ ప్రకృతిలోనే సహజంగా ఉందని చెబుతుంది భగవద్గీత (అధ్యా. 3 : శ్లో. 4-8). సోమరితనం కేవలం “దుష్కర్మ ప్రవృత్తి”.
న కర్మణా మనారంభా న్నైష్కర్మ్యం పురుషో౽శ్నుతే,
న చ సస్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి || (4)
నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవళః కర్మ సర్వ ప్రకృతిజై ర్గుణైః || (5)
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్
ఇంద్రియార్ధాన్ విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే || (6)
యక్‌స్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే౽ర్జున,
కర్మేంద్రియైః కర్మయోగ మసక్తస్స విశిష్యతే !! (7)
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః,
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః || (8)