ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం : 4

హిమాలయాలకు పారిపోతుంటే

ఆటంకం

“ఏదో ఒక చిన్న వంక పెట్టి నీ తరగతి గదిలోంచి బయటికి వచ్చెయ్యి. ఒక గుర్రబ్బండి కుదుర్చుకో. మా సందులోకి వచ్చేసి, మా ఇంట్లోవాళ్ళెవరి కంటా పడని చోట ఆగు!”

నాతోబాటు హిమాలయాలకి రావాలనుకున్న మా హైస్కూలు స్నేహితుడు– అమర్ మిత్తర్‌కి నే నిచ్చిన చివరి సూచన లివి. మేము పలాయనానికి నిర్ణయించుకున్నది ఆ మరుసటి రోజు. మా అన్నయ్య అనంతుడు నన్నొక కంట కనిపెడుతూ ఉండటంవల్ల ముందు జాగ్రత్తలు అవసరమయాయి. ఇంటినుంచి పారిపోవాలన్న సంకల్పం నా మనస్సులో ఉన్నట్టు అనుమానించి, ఎలాగయినా సరే నా ప్రయత్నాలు చెడగొట్టాలని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. రక్షరేకు నన్ను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరుస్తూ నాలో గుప్తంగా పనిచేస్తూ ఉంది. దివ్యదర్శనాల్లో తరచు నాకు కనిపిస్తూండే గురుదేవుల ముఖాన్ని హిమాలయ మంచు ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట దర్శించగలనని నా ఆశ.

మా నాన్న గారు కలకత్తాకి శాశ్వతంగా బదిలీ అయిన తరవాత మా కుటుంబం అక్కడే ఉంటోంది. పితృస్వామికమైన భారతీయ ఆచారం ప్రకారం అనంతుడు తన భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఇంట్లో మిద్దెమీది ఒక చిన్న గదిలో నేను ప్రతి రోజూ ధ్యానం చేసుకుంటూ నా మనస్సును దైవాన్వేషణకు ఆయత్తం చేసుకుంటూ ఉండేవాణ్ణి. మరపురాని ఆ రోజు, అపశకునంలాంటి వానను వెంటబెట్టుకొని వచ్చింది. రోడ్డు మీద బండిచక్రాల చప్పుడు వినిపించింది. అమర్ వచ్చేశాడని నేను, గబగబా ఒక దుప్పటీ, చెప్పుల జోడూ, రెండు అంగోస్త్రాలూ, ఒక జపమాలా, లాహిరీ మహాశయుల ఫొటో, భగవద్గీత పుస్తకమూ కలిపి మూటకట్టి మా మూడో అంతస్తు కిటికీలోంచి బయటికి విసిరేశాను. చకచకా మెట్లు దిగేసి మా మామయ్య పక్కనుంచే వెళ్ళిపోయాను. ఆయన గుమ్మం దగ్గర చేపలు కొంటున్నాడు.

“ఏమిటోయ్ సంబరం?” అంటూ నన్ను అనుమానంగా చూశాడు. నేను ఏ మాత్రం తొణక్కుండా ఆయనవేపు ఒక చిరునవ్వు విసిరి సందులోకి నడిచాను. నా మూట తీసుకొని, పన్నాగానికి కావలసినంత జాగ్రత్తా పాటిస్తూ, వెళ్ళి అమర్‌ని కలుసుకొన్నాను. అక్కణ్ణించి మేము చాందినీ చౌక్ అనే బజారుకు వెళ్ళాం. ఇంగ్లీషువాళ్ళు వేసుకొనే బట్టలు కొనుక్కోడం కోసమని మేము, మావాళ్ళు సాదరు ఖర్చుల కిచ్చిన డబ్బులు కొన్ని నెలలపాటు కూడబెట్టుకొంటూ వచ్చాం. మా అన్నయ్య తెలివయినవాడు; చాలా సులువుగా, మా మీద డిటెక్టివ్ పని చెయ్యగలడు. ఈ సంగతి తెలిసి మేము, యూరోపియన్ వేషాలు వేసుకొని అతని కన్ను కప్పాలని అనుకొన్నాం.

స్టేషనకు వెళ్ళే దారిలో మేము, మా చుట్టం- జ్యోతిస్ ఘోష్ కోసం ఆగాం; అతన్ని నేను జతీన్‌దా అనే పిలిచేవాణ్ణి. అతను కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినవాడు; హిమాలయాల్లో ఒక గురువును సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. మేము సిద్ధంగా ఉంచిన కొత్త సూటు సింగారించుకొన్నాడు అతను. మా ఎత్తు బాగా పారిందని మురిసి పోయాం! గాఢమైన ఒక ఉత్సాహం మా గుండెల్ని ఆవరించింది. “మనకింక కావలసినవల్లా కేన్వాసు బూట్లు,” అని అంటూ, అడుగున రబ్బరు వేసిన బూట్లు అమ్మకానికి పెట్టిన దుకాణానికి మా స్నేహితుల్ని తీసుకువెళ్ళాను. “తోలుతో చేసినవన్నీ జంతువుల్ని చంపగా తయారయినవే కనక, ఈ పవిత్ర యాత్రలో మన దగ్గర అలాటివి ఉండకూడదు.” అన్నాను, నా భగవద్గీతకున్న తోలు అట్టా, ఇంగ్లండులో తయారైన నా సోలా టోపీ (హెల్మెట్) కి ఉన్న తోలుపట్టీలు తీసి పారెయ్యడానికి నేను వీధిలో ఆగాను.

స్టేషనులో మేము బర్ధ్వాన్‌కు టిక్కెట్లు కొన్నాం. హిమాలయాల దిగువ కొండల్లో ఉన్న హరిద్వారం చేరడానికి అక్కడ రైలు మారాలని నిర్ణయించుకొన్నాం. మాలాగే ఆ రైలుబండి కూడా ఉరకడం మొదలు పెట్టగానే, నాలో ఉన్న ఆశాభావాలను స్నేహితులకు వెల్లడించాను.

“ఒక్కసారి ఊహించుకోండి! గురువులు మనకి దీక్ష ఇస్తారు. మనం సమాధిస్థితి అనుభవం పొందుతాం. అప్పుడు మన శరీరాలకు వచ్చే దివ్యమైన ఆకర్షణ శక్తి వల్ల హిమాలయాల్లో ఉండే క్రూర మృగాలు మన దగ్గిరికి సాధుజంతువుల్లా వస్తాయి. మన లాలింపుకోసం ఎదురుచూస్తూ పులులు, పెంపుడు పిల్లుల్లా ఉంటాయి!”

ఆలాంకారికంగానూ అక్షరాలా కూడా- రెండు విధాలా సమ్మోహ పరిచే విధంగా భావిస్తూ భవిష్యత్తును చిత్రిస్తూ నేనన్న ఈ మాటలకు, అమర్ పెదవులమీద ఉత్సాహంగా చిరునవ్వు విరిసింది. కాని జతీన్‌దా చూపు తప్పించాడు; వెనక్కి పరుగులు తీస్తున్న నేలవేపు, కిటికీలోంచి చూపు సారించాడు.

‘‘ఉన్న డబ్బు మూడు వాటాలు చెయ్యాలి.” చాలాసేపు మౌనంగా ఉన్న తరవాత జతీన్‌దా చేసిన సూచన ఇది. “బర్ద్వాన్‌కు మనం ఎవరి టిక్కెట్టు వాళ్ళే కొనుక్కోవాలి. అలాగయితే, మనమందరం కలిసి పారి పోతున్నామన్న సంగతి స్టేషనులో ఎవరూ కనిపెట్టలేరు,” అన్నాడు.

నేను ఏమీ అనుమానించకుండా, అతని సూచనకు ఒప్పుకొన్నాను. మునిమాపువేళకు మా బండి బర్ద్వాన్‌లో ఆగింది. జతీన్‌దా టిక్కెట్ల ఆఫీసులోకి వెళ్ళాడు. అమరూ నేనూ ప్లాట్‌ఫారం మీద కూర్చున్నాం. పదిహేను నిమిషాల సేపు అలా కాసుకొని ఉండి, అప్పుడింక వృథాగా వాకబులు మొదలు పెట్టాం. అన్ని వేపులా వెతుకుతూ – ఎంతో గాభరాగా – జతీన్‌దా కోసం పేరు పెట్టి అరవడం మొదలు పెట్టాం. కాని అతను, ఆ చిన్న స్టేషను చుట్టూ ఆవరించిన చీకటిలో కలిసిపోయాడు.

నేనొక విచిత్రమైన స్తబ్ధతకు లోనయ్యాను. నా ధైర్యం పూర్తిగా సడలిపోయింది. నిరుత్సాహపరిచే ఈ దుర్ఘటనను దేవుడే కలగజేస్తాడా? ఆయన్ని చేరుకోడం కోసం మొట్టమొదటి సారిగా ఎంతో జాగ్రత్తగా పథకం వేసుకొని ఇంటినుంచి పారిపోవడానికి నేను కూర్చిన కల్పనాత్మకమైన సన్నివేశం దారుణంగా భగ్నమయింది.

“అమర్, మనం ఇంటికి వెళ్ళిపోదాం.” పసిపిల్లవాడిలా ఏడుస్తూ అన్నాను నేను. “జతీన్‌దా ఇంత తెగించి వెళ్ళిపోవడం మనకి అపశకునం. ఈ ప్రయాణం దెబ్బతినక మానదు.” అన్నాను.

“దేవుడిమీద నీకున్న ప్రేమ ఇదేనా? ఒక దగాకోరు స్నేహితుడి చిన్న పరీక్ష కే నిలబడలేవా?” అన్నాడు అమర్.

ఇది దేవుడు పెట్టిన పరీక్ష అన్న సంగతి అమర్ మాటల్లో ధ్వవించడంతో నా గుండె కుదుటపడింది. సీతాభోగ్ (అమ్మవారి నైవేద్యం) కూ, మోతీచూర్ (మిఠాయి బూందీ) కూ బర్ద్వాన్ పెట్టింది పేరు; అప్పటికి అవి తిని సేద దీర్చుకున్నాం. మరికొన్ని గంటల్లో, బెరైలీమీదుగా హరిద్వారం వెళ్ళడానికి బండి ఎక్కాం. మర్నాడు మొగల్ షరాయిలో బండ్లు మారడానికి ప్లాట్‌ఫారం మీద కాసుకొని కూర్చుని చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం.

“అమర్, కాసేపట్లో రైల్వే ఉద్యోగులు వచ్చి మనని గుచ్చిగుచ్చి ప్రశ్నలు వెయ్యవచ్చు. మా అన్నయ్య తెలివిని నేను ఏ మాత్రం తక్కువగా అంచనా వెయ్యడం లేదు. ఫలితం ఏమైనా సరే, నేను మాత్రం అబద్ధం ఆడను,” అన్నాను.

“ముకుందా, నేను నిన్ను కోరేదల్లా నిబ్బరంగా ఉండమని. నేను మాట్లాడుతుంటే నువ్వు నవ్వకు- ఉలకకు. పలకకు!”

ఇంతలోనే ఒక యూరోపియన్ అధికారివచ్చి నన్ను నిలదీశాడు. ఒక తంతి కాయితం నా ముందు ఆడించాడు; దాంట్లో విషయం నేను వెంటనే గ్రహించగలిగాను.

“మీరు కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోతున్నారా?”

“లేదు!” ప్రశ్నించడానికి అతను ఎన్నుకొన్న మాటలు, నేను గట్టిగా జవాబివ్వడానికి వీలు కలిగించినందుకు నాకు సంతోషమయింది. అయితే ఆచార విరుద్ధమయిన నా ప్రవర్తకు కారణం కోపం కాదు, “దైవం కోసం కలిగిన అత్యధిక నిస్పృహ” అని నాకు తెలుసు.

అప్పుడా ఉద్యోగి అమర్ వేపు తిరిగాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యా జరిగిన వాగ్వాదం వింటూంటే, ప్రజ్ఞా ప్రదర్శనంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు ఉంది. దాంతో, గంభీరంగా ఉండమని మా వాడిచ్చిన సలహా పాటించడం చాలాకష్టమయిపోయింది.

“మూడో వా డెక్కడ?” కంఠస్వరంలో తన అధికారం పూర్తిగా ధ్వనించేటట్టు అడిగాడాయన. “ఊఁ– నిజం చెప్పండి!” అనీ రెట్టించాడు.

“అయ్యా, మీరు కళ్ళజోడు ధరించినట్టు కనిపిస్తోంది మరి; ఇక్కడున్నది మే మిద్దరమేనని తెలియడం లేదా?” అంటూ అమర్ నిర్భయంగా చిరునవ్వు నవ్వాడు. “నే నేమీ మాంత్రికుణ్ణి కాను; మూడోవాణ్ణి ఇక్కడ ప్రత్యక్షం చెయ్య లేను,” అన్నాడు.

ఈ మొండి జవాబుకు చిరాకు కలిగినట్టుంది ఆ ఉద్యోగికి; మరో వేపు నుంచి దాడి మొదలుపెట్టాడు. “నీ పేరేమిటి?”

“నన్ను. థామస్ అంటారు. మా అమ్మ ఇంగ్లీషుది; మా నాన్న క్రైస్తవమతం పుచ్చుకున్న భారతీయుడు.”

“మీ స్నేహితుడి పేరేమిటి?”

“థాంప్సన్ అని పిలుస్తాను.”

అంతవరకు నాలో అణిచిపెట్టుకున్న కులుకు, దాంతో పై స్థాయికి చేరుకొంది. అదృష్టవశాత్తు, అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా కూత కూస్తున్న రైలుబండి వేపు నడిచాను నేను, వాళ్ళతో చెప్పకుండానే. ఎదుటివాళ్ళ మాటల్ని సులువుగా నమ్మే స్వభావంగల ఆ ఉద్యోగితోబాటు అమర్ కూడా నా వెంట వచ్చాడు. ఉపకారబుద్ధితో ఆయన, యూరోపియన్లు కూర్చునే పెట్టెలోకి ఎక్కించాడు మమ్మల్ని. సగం ఇంగ్లీషు పుట్టుక పుట్టిన కుర్రవాళ్ళిద్దరు, నాటు మనుషులకోసం కేటాయించిన పెట్టెలో కూర్చుని ప్రయాణం చెయ్యాలేరు అన్న ఆలోచనతో ఆయన మనస్సు నొచ్చుకున్నట్టుంది. ఆయన మర్యాదగా నిష్క్రమించిన తరవాత నేను సీటుకు చేర్లబడి కడుపుచెక్కలయేలా నవ్వాను. మంచి అనుభవజ్ఞు డయిన ఒక యూరోపియన్ అధికారిని బోల్తా కొట్టించామన్న ఉల్లాసభరిత మైన సంతృప్తి అమర్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ రైల్వే ఉద్యోగి తెచ్చిన తంతి కాయితం, ప్లాట్‌ఫారం మీద దొంగచాటుగా చదివేశాను. మా అనంతన్నయ్య దగ్గరినుంచి వచ్చిందది. దాంట్లో ఇలా ఉంది: “ఇంగ్లీషు దుస్తులు వేసుకున్న బెంగాలీ అబ్బాయిలు ముగ్గురు ఇంటినుంచి పారిపోయి, మొగల్ షరాయి మీదుగా హరిద్వారం వెళ్తున్నారు. నేను వచ్చేవరకు వాళ్ళ నక్కడ ఆపుచెయ్యండి. మీ సహాయానికి తగిన పారితోషికం దొరుకుతుంది.”

“అమర్, గుర్తులు పెట్టిన టైమ్‌టేబుళ్ళు మీ ఇంట్లో వదిలెయ్యొద్దని చెప్పానా నీకు?” అంటూ యద్దేవా చేస్తూ చూశాను. “అక్కడ మా అన్నయ్య కొకటి కనిపించి ఉంటుంది.”

మావాడు సిగ్గుపడుతూ, తప్పు ఒప్పుకొన్నాడు. మేము బెరైలీలో కాసేపు ఆగాం. అక్కడ మా కోసం ద్వారకాప్రసాద్[1] కాసుకొని ఉన్నాడు అనంతన్నయ్య ఇచ్చిన తంతి చేత్తో పట్టుకొని. మమ్మల్ని అక్కడ ఆపెయ్యడానికి గట్టిగా ప్రయత్నించాడు ద్వారక. అయితే మేమిలా పారిపోవాలన్న ప్రయత్నం, ఏదో సరదాకి తలపెట్టింది కాదని వాడికి నచ్చజెప్పాను. మాతోబాటు వాణ్ణికూడా హిమాలయాలకి వచ్చెయ్యమన్నాం; కాని కిందటి సారిలాగే, వాడు రానన్నాడు.

ఆ రాత్రి మా బండి ఒక స్టేషనులో ఆగి ఉండగా, మరో రైల్వే ఉద్యోగి వచ్చి అమర్‌ని లేపాడు. నే నప్పుడు సగం నిద్రలో ఉన్నాను. ఆయన కూడా, ఈ “థామస్,” “థాంప్సన్”ల సంకరజాతి ఆకర్షణలకు లోబడి మోసపోయాడు. ఆ రైలుబండి, తెల్లవారగట్లకు మమ్మల్ని విజయవంతంగా, హరిద్వారం చేర్చింది. రాచఠీవితో నిలిచిన కొండలు దూరంనుంచి, మమ్మల్ని రమ్మని పిలుస్తున్నాయి. స్టేషనులోంచి బయటికి దూసుకువచ్చి స్వేచ్ఛగా సంచరిస్తున్న నగర ప్రజల్లోకి వచ్చి పడ్డాం. అనంతన్నయ్య ఎలాగా మా యూరోపియన్ వేషం పసిగట్టేశాడు కనక, మేము చేసిన మొట్టమొదటి పని, బట్టలు మార్చేసి దేశవాళీ దుస్తులు వేసుకోడం. పట్టుబడిపోతామన్న కించ నా మనస్సులో పీకుతూనే ఉంది.

వెంటనే హరిద్వారం విడిచి వెళ్ళిపోవడం మంచిదని, అక్కడికి ఉత్తరాన ఉన్న ఋషీకేశం వెళ్ళడానికి టిక్కెట్లు కొనుక్కున్నాం. చిరకాలంగా ఎంతోమంది మునీశ్వరుల పాదస్పర్శతో పునీతమైన భూమి ఋషీకేశం. అప్పటికే నేను బండి ఎక్కేశాను; అమర్ మాత్రం వెనకబడి, ఇంకా ప్లాట్‌ఫారంమీదే ఉన్నాడు. ఒక పోలీసు కేకలో వాడు ఠకీమని అక్కడాగిపోయాడు. మాకు ఇష్టంలేకపోయినా మా సంరక్షకుడిగా వెంటదగిలిన ఆ పోలీసు అధికారి, మమ్మల్ని ఒక పోలీసు స్టేషను బంగళాకు నడిపించి, మా దగ్గర ఉన్న డబ్బు స్వాధీనం చేసుకున్నాడు. మా అన్నయ్య వచ్చేదాకా మమ్మల్ని అక్కడ ఆపుచేసి ఉంచడం తన విధి అని మర్యాదగా చెప్పాడు.

తప్పించుకు తిరుగుతున్న మేము చేరదలచిన గమ్యం హిమాలయాలని తెలిసి ఆ అధికారి ఒక విచిత్రమైన కథ చెప్పాడు.

“సాధువులంటే మీకేదో వెర్రి వ్యామోహం ఉన్నట్టు కనిపిస్తోంది. నిన్ననే నే నొక సాధువును చూశాను; ఆయనకంటె గొప్పవాణ్ణి మీ రెన్నటికీ చూడలేరు. నేనూ, నాతో పనిచేసే మరో ఆఫీసరూ, ఐదురోజుల క్రితం మొదటిసారిగా ఆయనకి తారసపడ్డాం. ఒక ఖూనీకోరు కోసం తీవ్రంగా గాలిస్తూ గంగ ఒడ్డున పహరా కాస్తున్నాం మేము. వాడు బతికుండగానన్నా సరే, చచ్చినా సరే పట్టి తెమ్మని మాకు హుకుము జారీ అయింది. యాత్రికుల్ని దోచుకోడానికి వాడు సాధువులా మారువేషాలు వేస్తాడని పేరు. మాకు కొంచెం దూరంలో, ఆ నేరస్తుడి పోలికలకు సరిపోయే మనిషి ఒకడు కనిపించాడు. ఆగమని మేము హెచ్చరిక చేసినా ఆ మనిషి ఖాతరు చేయ్యలేదు. అతని మీదపడి పట్టుకోడానికి మేము పరిగెత్తాం. అతని వెనకాలకి వెళ్ళి నా గొడ్డలితో, మంచి బలంగా ఒక్క వేటు వేశాను. దాంతో అతని కుడిచెయ్యి దాదాపు పూర్తిగా ఊడిపడేటంతగా తెగిపోయింది.

“నోరు విప్పి అరవడం కాని, దారుణమైన ఆ దెబ్బవేపు చూడ్డం కాని చెయ్యకుండా, ఆ మనిషి ఇంకా చురుగ్గానే నడిచిపోతూండడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మేము ఆయన ఎదటికి ఉరికేసరికి, నిదానంగా ఇలా అన్నాడు:

“మీరు గాలిస్తున్న ఖూనీకోరు నేను కాదు.”

“దేవుడిలాటి ఒక ఋషిని గాయపరిచానని తెలిసేసరికి అవమానంతో కుంగిపోయాను. ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకొని, పెద్ద ధారగా చిమ్ముతున్న రక్తాన్ని అరికట్టడానికి నా తలపాగా తీసి ఇచ్చాను.

“నాయనా, ఇది నీ వల్ల పొరపాటున జరిగిందని తెలుస్తోంది.” అంటూ ఆ సాధువు నా మీద దయతో ఇలా అన్నాడు: ‘వెళ్ళు; నిన్ను నువ్వు తిట్టుకోకు. ప్రేమమయురాలయిన ఆ జగన్మాత నన్ను జాగ్రత్తగా చూసుకుంటోందిలే!’ వేలాడుతున్న చేతిని మొండి భుజంలోకి తోశాడాయన. ఆశ్చర్యం! అది వెంటనే అతుక్కుపోయింది; రక్తస్రావం కూడా చిత్రంగా ఆగిపోయింది.

“మూడు రోజులు పోయాక నా దగ్గరికి రండి- అదుగో, ఆ చెట్టు కింద ఉంటాను; గాయం పూర్తిగా మానిపోవడం మీరే చూస్తారు. అప్పుడిక మీరు పశ్చాత్తాపపడనక్కర్లేదు.”

“నిన్న నేనూ, నాతోబాటు పనిచేసే ఆఫీసరూ కలిసి ఆయన చెప్పిన చోటికి ఆత్రంగా వెళ్ళాం. సాధువు అక్కడ ఉన్నాడు. తన చెయ్యి పరీక్షగా చూడనిచ్చాడు మమ్మల్ని. దాని మీద ఒక మచ్చా లేదు, గాయమయిన జాడా లేదు!”

“నేను ఋషీకేశం మీదగా హిమాలయ నిర్జన ప్రదేశాలకి వెడుతున్నాను. అంటూ ఆ సాధువు తొందరగా బయలుదేరి వెళ్తూ మమ్మల్ని దీవించాడు. ఆయన పవిత్రతవల్ల నా జీవితం ఉచ్చస్థితి నందుకున్నట్టు అనిపిస్తోంది.”

ఆ అధికారి ఎంతో భక్తి ఉట్టిపడేలా తన మాటలు ముగించాడు; ఆయనకు కలిగిన అనుభవం, ఆయన్ని సమూలంగా కదిలించినట్లు కనిపిస్తోంది. ఆ విషయం మా మసస్సుల కెక్కే విధంగా ఆయన, అద్భుతమయిన ఆ వార్త పత్రికలో అచ్చయిన కాయితం ఒకటి నా చేతికిచ్చాడు. జనంలో సంచలనం కలిగించడానికే ప్రాముఖ్యమిచ్చే వార్తాపత్రికను (దురదృష్టవశాత్తు, భారతదేశంలో కూడా ఇవి లేకపోలేదు) మామూలయిన స్వానుకూలపద్ధతిలో అతిశయోక్తిగా రాశారు. అందులో: దాదాపు ఆ సాధువు తల తెగ్గొట్టినంత పని జరిగిందని సూచించారు.

తనను పీడించినవాణ్ణి క్రీస్తు మాదిరిగా క్షమించగలిగేటంతటి ఒక మహాయోగి దర్శనాన్ని పోగొట్టుకున్నందుకు నేను అమరూ విచారించాం. భారతదేశం, గత రెండు శతాబ్దులుగా, భౌతిక సంపత్తి విషయంలో పేదగానే ఉన్నప్పటికీ తరగని గనివంటి దివ్య సంపత్తి మాత్రం దానికి ఉంది; ఈ పోలీసాయనవంటి లౌకిక మానవులకు కూడా, ఆధ్యాత్మికంగా “ఆకాశాన్నంటే మేడలు,” సందర్భవశాత్తు దారి పక్కనే ఎదురు పడుతుంటాయి.

అటువంటి అద్భుతమైన కథ చెప్పి మా విసుగు పోగొట్టినందుకు ఆ అధికారికి మేము ధన్యవాదాలు చెప్పాం. తాము మాకంటే అదృష్టవంతు డన్నది అతని సూచన కావచ్చు : తాను అప్రయత్నంగా, మహానీయుడైన ఒక సాధువును కలుసుకొన్నాడు; కాని మేము చిత్తశుద్ధితో చేసిన అన్వేషణ, ఒక మహాగురువు పాదసన్నిధిని కాకుండా, అసభ్యమైన ఒక పోలీసు స్టేషనులో ముగిసింది.

హిమాలయాలు అంత దగ్గరలో ఉన్నా కూడా మేము బదిలీలుగా ఉన్నందువల్ల మా కవి ఎంతో దూరమయాయి. స్వేచ్ఛకోసం నా మనస్సు ఉరకలు వేస్తోందని అమర్‌తో చెప్పాను.

“అవకాశం వచ్చినప్పుడు చల్లగా జారుకుందాం. పవిత్రమైన ఋషీకేశానికి కాలినడకన వెళ్ళగలం.” ప్రోత్సాహకరంగా చిరునవ్వు నవ్వాను.

కాని, మా కొక బలమైన ఆధారంగా ఉన్న డబ్బును వాళ్ళు మా దగ్గరినుంచి తీసేసుకోగానే నా జతగాడు నిరాశావాదిగా మారిపోయాడు.

“అల్లాటి ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో కనక మనం నడక మొదలెట్టామంటే, చివరికి మనం చేరేది సాధువులుండే చోటికి కాదు- పెద్ద పులుల పొట్టల్లోకి!”

మరి మూడు రోజులకి అనంతుడూ, అమర్ వాళ్ళ అన్నయ్యా వచ్చారు. అమర్ అయితే, తేలికపడ్డ మనస్సుతో వాళ్ళన్నయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నేను మాత్రం సమాధాన పరుచుకోలేదు. అనంతన్నయ్యకి ముట్టినవల్లా తీవ్రమైన నిందలకు మించి మరేమీ లేదు.

“నీ మనస్సు కెలా అనిపిస్తుందో నాకు తెలుసురా!” అంటూ మా అన్నయ్య నన్ను సముదాయిస్తూ అన్నాడు. “నేను నిన్ను కోరేదల్లా ఒకటే– కాశీలో మంచి జ్ఞాని ఒకాయన ఉన్నాడు; ఆయన్ని కలుసుకోడానికి నాతో కాశీ రమ్మనీ, నీ కోసం బెంగపెట్టుకున్న నాన్న గారిని చూడ్డానికి కలకత్తా వచ్చి కొన్నాళ్ళు ఉండమనీను. కావలిస్తే తరవాత సాగిద్దువుగాని, ఇక్కడ గురువు కోసం వెదకడం.”

ఈ విషయం దగ్గర అమర్, మా మాటల్లో కలగజేసుకుని, నాతో మళ్ళీ హరిద్వారం వచ్చే ఉద్దేశమేమీ తనకి లేదని ఖండితంగా చెప్పాడు. కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నాడు వాడు. కాని నాకు తెలుసు, నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మాననని.

మేమంతా కాశీ వెళ్ళే రైలు ఎక్కాం. అక్కడ నా ప్రార్థనకు సాటిలేని, తక్షణ ఫలితం కనిపించింది.

అనంతన్నయ్య తెలివిగా, ముందే ఒక పథకం వేసి ఉంచాడు. హరిద్వారం వచ్చే లోపున, దారిలో కాశీలో ఆగి ఒక పండితుణ్ణి కలుసుకొని, తరవాత నాతో మాట్లాడేటందుకు ఏర్పాటు చేశాడు. నేను సన్యాసి[2]ని కావాలన్న ఉద్దేశం విరమించుకొనేటట్టు చెయ్యడానికి ప్రయత్నిస్తానని ఆ పండితుడూ ఆయన కొడుకూ అనంతన్నయ్యకి మాట ఇచ్చారు.

అన్నయ్య నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. పండితుడుగారి కొడుకు యువకుడే; ముంగిట్లోనే నన్ను మంచి ఉత్సాహంగా పలకరించాడు. నాకు సుదీర్ఘమైన వేదాంతోపన్యాసం ఇచ్చాడు. తనకు, దివ్యదృష్టి వల్ల నా భవిష్యత్తు తెలుసునని నొక్కి చెప్పి, సన్యాసిని కావాలన్న నా ఉద్దేశాన్ని చులకనగా కొట్టిపారేశాడు.

“నీ మామూలు బాధ్యతల్ని విడిచిపెట్టాలన్న పట్టుమీదే కనక నువ్వు ఉన్నట్లయితే, నీ కెప్పుడూ దురదృష్టమే దాపురిస్తుంది; దేవుణ్ణి దర్శించ లేవు! ప్రాపంచిక అనుభవాలు పొందనిదే నీ పూర్వకర్మ[3]ను ఒక్క నాటికి తప్పించుకోలేవు,” అన్నాడాయన.

అందుకు సమాధానంగా, భగవద్గీత[4]లో చెప్పిన అమృత వాక్కులు నా నోటినుంచి వెలువడ్డాయి. “ఎంతో దుష్కర్మ మూటగట్టుకున్నవాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే, అతడు వెనక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడయి శాశ్వత శాంతి నందుకుంటాడు. నన్ను నమ్ముకున్న భక్తు డెవడూ నశించడు. ఇది నిశ్చయమని తెలుసుకో!”

అయితే ఆ యువకుడు అంత గట్టిగా జోస్యం చెప్పేసరికి నాలో విశ్వాసం కొద్దిగా సడలింది. అప్పుడు గుండెనిండా భక్తి నింపుకొని మనస్సులో దేవుణ్ణి ఇలా ప్రార్థించాను:

“దయ ఉంచి నా మానసిక ఆందోళన పోగొట్టు- ఇక్కడే, ఇప్పుడే జవాబు చెప్పు- నన్ను సన్యాసిగా బతకమంటావా, సంసారిగానా? నీ ఉద్దేశం చెప్పు”

ఈ పండితుడుగారి ఇంటి ఆవరణకు వెలువల ప్రసన్న వదనుడయి ఉన్న ఒక సాధువును గమనించాను. దివ్యదృష్టి కలవాణ్ణని చెప్పుకొనే ఈయనకూ నాకూ తీవ్రంగా జరిగిన సంభాషణను ఆయన వినే ఉంటా డన్నది- నన్ను తన దగ్గరికి పిలవడంతో అర్థమయింది. ప్రశాంతమైన ఆయన కళ్ళలోంచి బ్రహ్మాండమైన శక్తి ఒకటి వెలువడుతున్నట్టు నాకు అనుభూతి కలిగింది. “బాబూ, ఆ అజ్ఞాని మాటలు చెవిని పెట్టకు. నీ ప్రార్థనకి జవాబుగా, ఈ జన్మలో నీకు నిర్ణయమయిన ఏకైక మార్గం సన్యాసమేనని నీకు నమ్మకంగా చెప్పమని భగవంతుడు నాతో అంటున్నాడు.”

కచ్చితమైన పరిష్కారంలా వచ్చిన ఈ సందేశాన్ని వినగానే నాకు ఆశ్చర్యమే కాదు - కృతజ్ఞతాభావం కూడా పెల్లుబికింది. సంతోషంగా చిరునవ్వు నవ్వాను.

“ఆ మనిషి దగ్గర్నించి వచ్చెయ్యి!” అంటూ ముంగిట్లోంచి “అజ్ఞాని” నన్ను పిలుస్తున్నాడు. ఋషితుల్యుడయన నా మార్గదర్శకుడు ఆశీర్వాద సూచకంగా చెయ్య ఎత్తి మెల్లగా వెళ్ళిపోయాడు.

“నువ్వెంత పిచ్చివాడవో ఆ సాధువు అంత పిచ్చివాడు.” ఇంత మనోహరమైన వ్యాఖ్య చేసినవాడు తల నెరిసిన పండితుడు. ఆయనా, ఆయన కొడుకూ నా వేపు సానుతాపంగా చూస్తున్నారు. “అతను కూడా దేవుడికోసం అనిశ్చితమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచిపెట్టేశాడని విన్నాను.”

నేను ఆ వేపునుంచి తిరిగిపోయాను. ఈ ఇంటివాళ్ళతో నే నింకేమీ మాట్లాడదలుచుకోలేదని అన్నయ్యతో చెప్పేశాను. దాంతో అతను నిరుత్సాహపడి, వెంటనే వెళ్ళిపోవడానికి ఒప్పుకొన్నాడు. వెంటనే మేము కలకత్తా వెళ్ళే రైలు ఎక్కాం.

“డిటెక్టివుగారూ, నేను ఇద్దరు స్నేహితులతో కలిసి పారిపోయానని మీరు ఎలా కనిపెట్టారూ?” అని అడుగుతూ, సరదాగా నాకు కలిగిన ఆసక్తిని మా తిరుగు ప్రయాణంలో అన్నయ్యదగ్గర బయటపెట్టాను. అతను కొంటెగా నవ్వాడు.

“మీ బళ్ళో, అమర్ క్లాసులోంచి వెళ్ళిపోయాడనీ మళ్ళీ రాలేదనీ, తెలిసింది. మర్నాడు పొద్దున వాళ్ళింటికి వెళ్ళి, గుర్తులు పెట్టిన రైల్వే టైమ్ టేబులు బయటికి లాగాను. సరిగ్గా అప్పుడే, అమర్ వాళ్ళ నాన్నగారు బండిలో బయటికి వెళ్ళబోతూ బండివాడితో మాట్లాడుతున్నారు.

“మా అబ్బాయి ఈ పూట బడికి వెళ్ళడానికి నాతో రాడు. మాయమైపోయాడు!” అంటూ బాధగా అన్నారాయన.

“మీ అబ్బాయిగారూ మరో ఇద్దరూ తెల్ల దొరల బట్టలు వేసుకుని హౌరా స్టేషనులో రైలెక్కారని నాకు తెలిసిన బండివాడు చెప్పగా విన్నానండి. వారి తోలు బూట్లు బండివాడికి బహుమతిగా ఇచ్చారట కూడా!” అన్నాడు ఆ బండివాడు.

“దాంతో నాకు మూడు ఆధారాలు దొరికాయి. టైమ్ టేబులూ, ముగ్గురు కుర్రాళ్ళూ, ఇంగ్లీషువాళ్ళ దుస్తులూ.”

ఉల్లాసమూ విసుగుదలా కలిసిన మనస్సుతో, అన్నయ్య బయట పెట్టే సంగతులు వింటున్నాను. బండివాడి విషయంలో మేము చూపించిన ఔదార్యం కొద్దిలో అస్థానపతితమైందన్నమాట.”

“నేను వెంటనే వెళ్ళి టైమ్ టేబుల్‌లో అమర్, గీతలు పెట్టిన ఊళ్ళ స్టేషను మాస్టర్లందరికి టెలిగ్రాములు ఇచ్చాననుకో,” అంటూ చెబుతూ పోయాడు అన్నయ్య. “బెరైలీ దగ్గర టిక్కు పెట్టాడు అతను. అంచేత, అక్కడున్న మీ స్నేహితుడు - ద్వారకకి తంతి ఇచ్చాను తరవాత, కలకత్తా చుట్టు పక్కల వాకబు చేసిన మీదట తెలిసింది ఏమిటంటే మన జతీన్‌దా ఒకరోజు రాత్రల్లా ఇంటికే రాలేదనీ, మర్నాడు పొద్దున యూరోపియన్ వేషంలో దిగాడనీ తెలిసింది. వాణ్ణి వెతికి పట్టుకుని, భోజనానికి రమ్మని పిలిచాను. నేనొక స్నేహితుడి మాదిరిగా పిలిచేసరికి వాడు కాదనలేక ఒప్పుకొన్నాడు. దారిలో, వాడికి ఏ మాత్రం అనుమానం రానియ్యకుండా ఒక పోలీసు స్టేషనులోకి తీసుకువెళ్ళాను. అంతకుముందే నే నక్కడ, భయంకరంగా కనిపించే ఆఫీసర్లని ఏరి కోరి ఉంచాను. మేము వెళ్ళగానే వాళ్ళు వాణ్ణి చుట్టుముట్టారు. వాళ్ళ వాడి చూపులకు తట్టుకోలేక జతీన్‌దా, తన వింత నడవడికి సంజాయిషీ చెప్పుకోడానికి ఒప్పుకున్నాడు.”

“ఆధ్యాత్మికమైన ఉత్సాహంతో మనస్సు తేలిపోతూండగా, హిమాలయాలకు వెళ్ళాలని బయల్దేరాను,” అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. గొప్ప గురువుల్ని కలుసుకోగల అవకాశం దొరుకుతుందన్న ఆశతో నా మనస్సు నిండిపోయింది. కాని ముకుందుడు , “హిమాలయ గుహల్లో మనం ఆనందంలో తన్మయులమై ఉన్నప్పుడు , పెద్దపులులు మంత్రానికి కట్టుబడ్డట్టుగా అయిపోయి, పెంపుడు పిల్లుల్లా మనచుట్టూ కూర్చుంటాయి,” అని అనేసరికి నా ఉత్సాహమంతా నీరుగారిపోయింది; నుదుట చెమట పట్టేసింది. “అప్పుడేం గతి?” అని వాపోయాను. “ఒకవేళ పులుల క్రూర స్వభావం మా ధ్యానసమాధి శక్తి ప్రభావవల్ల మారకపోతే మమ్మల్ని అవి, పెంపుడు పిల్లుల్లా దయతో చూస్తాయా?” అన్న ఆలోచన నాలో కలిగింది. ఏదో ఒక పులి పొట్టలోకి నేను బలవంతాన ప్రవేశించినట్టు మనస్సుకు అనిపించింది. అది కూడా పూర్తి శరీరంతో కాదు, శరీరంలోని ఒక్కొక్క భాగమే విడివిడిగా!”

ప్రయాణం మధ్యలో జతీన్‌దా మాతో చెప్పకుండా మాయమైనందుకు అప్పుడు నాకు కలిగిన కోపం, ఇప్పుడు వచ్చిన నవ్వుతో ఎగిరి పోయింది. అన్నయ్య రైల్లో ఇచ్చిన ఉల్లాసకరమైన ఈ వివరణ, జతీన్‌దా నాకు కలిగించిన బాధనంతనీ పోగొట్టేసింది. కాని ఉన్నమాట చెప్పాలి; ఒక్క రవ్వ తృప్తిలాంటిది కూడా కలిగింది నాకు: జతీన్‌దా కూడా పోలీసుల బెడద తప్పించుకోలేకపోయినందుకు! “అనంతదా,[5] నువ్వు గూఢచారివై పుట్టావు!” అంటూ తమాషాగా నేను చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు. “జతీన్‌దా ప్రవర్తనకు కారణం, ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమేకాని మమ్మల్ని మోసం చెయ్యాలని కాదని తెలిసి నాకు సంతోషమయింది,” అని అతనితో చెబుతాను.

కలకత్తాలో ఇంటిదగ్గర నాన్న గారు, కనీసం నా హైస్కూలు చదువు పూర్తయే దాకా నయినా తిరిగే కాళ్ళని నిలకడగా ఉంచుకోమని నా మనస్సులో నాటుకొనేటట్లుగా చెబుతూ బతిమాలారు. నేను లేని సమయంలో, వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని- ఋషితుల్యులైన స్వామీ కేవలానందగారు[6] - అనే పండితు లొకరు రోజూ మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు.

“వీరు నీకు సంస్కృతం నేర్పుతారు,” అని నాకు చెప్పారు నాన్నగారు.

బాగా చదువుకొన్న దార్శనికుని దగ్గర నాకు శిక్షణ ఇప్పించి నట్లయితే, ఆధ్యాత్మికమయిన నా ఆకాంక్షలను తృప్తిపరచ వచ్చునని నాన్నగారు ఆశించారు. కాని ఆయన అనుకొన్నది సూక్ష్మంగా తారుమారయింది : మా మాస్టరుగారు నాకు, బుద్ధికి పదును పెట్టేశుష్క విషయాలు బోధించకపోగా- అందుకు భిన్నంగా- భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షను ప్రజ్వలింపజేశారు. నాన్నగారికి తెలియని విషయమేమిటంటే, స్వామీ కేవలానందగారు లాహిరీ మహాశయుల ఉత్కృష్ట శిష్యులన్న సంగతి. సాటిలేని ఆ మహాగురువులకు శిష్యులు వేలకొద్దీ ఉండేవారు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డూ ఆపూ లేనిది కనక, వాళ్ళని ఆయనవైపు ఆకర్షించింది. లాహిరీ మహాశయులు తరచుగా, కేవలానందగారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని నాకు తరవాత తెలిసింది.

మా ట్యూషన్ మాస్టరుగారి ముఖం, సమృద్ధిగా పెరిగిన వంకు లొంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్టుండేది. నల్లటి ఆయన కళ్ళు, కల్లాకపటం తెలియని పసిపిల్లవాడి కళ్ళ మాదిరిగా నిర్మలంగా ఉండేవి. ఆయన పలచని శరీరంలోని కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచననీ గాంభీర్యాన్నీ ప్రదర్శించేవి. ఎప్పుడూ సౌమ్యంగా, ఎప్పుడూ ప్రేమగా ఉండే ఆయన, అనంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మే మిద్దరం కలిసి అనేక గంటలకాలం గాఢమైన క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతూండేవాళ్ళం.

కేవలానందగారు ప్రాచీన శాస్త్రాల్లో, అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో, అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులు. ఆయన పాండిత్యమే ఆయనకు “శాస్త్రి మహాశయ” అన్న బిరుదు సంపాదించింది. అందరూ ఆయన్ని మామూలుగా ఆ పేరుతోనే పిలుస్తూండేవారు. కాని సంస్కృత పాండిత్యం సంపాదించడంలో నా అభివృద్ధి గమనించదగ్గదేమీ కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారీ యోగాన్ని గురించీ లాహిరీ మహాశయుల గురించీ మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. ఒక రోజున మా మాస్టరుగారు, నా కోరిక మన్నించి లాహిరీ మహాశయుల సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంఛించిన విషయం ఒకటి చెప్పారు.

“అరుదైన అదృష్టం వల్ల, లాహిరీ మహాశయులకు సమీపంలో పదేళ్ళపాటు ఉండే అవకాశం నాకు కలిగింది. రోజూ రాత్రిపూట నా యాత్రకు గమ్యస్థానం, కాశీలో వారి నివాసగృహం. గురువుగారెప్పుడూ మేడమీద మొదటి అంతస్తులో, ముందరున్న చిన్న గదిలో ఉంటూండే వారు. ఆయన ఒక కొయ్యబల్ల మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉండేవారు. ఆ బల్లకి వెనకాల, చేర్ల బడ్డానికి ఒక చెక్క కూడా లేదు. ఎదురుగా ఆయన శిష్యులు, పుష్పమాలాలంకారం మాదిరిగా అర్ధచంద్రాకారంగా కూర్చొనేవారు. ఆయన కళ్ళు బ్రహ్మానందంతో మిలమిలా మెరుస్తూ కదులుతుండేవి. అవి ఎప్పుడూ, దూరదర్శన శక్తిగల అంతశ్చక్షువు ద్వారా శాశ్వతానంద గోళంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ, సగం మూసుకొని ఉండేవి. ఆయన ఏకబిగిని మాట్లాడటమన్నది అరుదు. ఆయన చూపు, సందర్భానుసారంగా, తమ సహాయం అవసరమున్న ఒక శిష్యుడి మీద కేంద్రీకరించి ఉండేది , అప్పుడు హిమపాతంలా వచ్చిపడే కాంతిని పోలిన ఉపశమన వాక్కులు ధారగా వెలువడుతుండేవి.

“ఆ మహాపురుషుల చూపుతో నాలో, వర్ణించడానికి శక్యం కాని ఒకానొక ఆనందం వెల్లివిరుస్తుండేది. అనంతత్వమనే ఒకానొక మహాపద్మంలోంచి వెలువడ్డ మాదిరిగా, ఆయనలోంచి వచ్చే సుగంధం నాలో నిండిపోయేది. మేము రోజుల తరబడి మాట్లాడుకోకపోయినప్పటికి, ఆయన సన్నిధిలో ఉండడమే, నా అస్తిత్వాన్నంతనూ మార్చేసిన మహత్తరమైన అనుభవం. కంటికి సోకని అడ్డంకి ఏదయినా నా ఏకాగ్ర తకు భంగం కలిగించేలా ఎదురయినట్లయితే, నేను మా గురువుగారి పాదాల దగ్గర ధ్యానం చేసేవాణ్ణి. అక్కడ నాకు, చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులు కూడా అందుబాటులోకి వచ్చేవి. ఆయనకంటే తక్కువస్థాయి గురువుల దగ్గర మాత్రం ఆలాటి అనుభూతులు కలిగేవి కావు. ఆ మహానుభావులు ఒక సజీవమైన దేవాలయం; దాని రహస్య ద్వారాలు, భక్తితో ప్రవేశించే శిష్యులందరి కోసం తెరుచుకొని ఉండేవి.

“లాహిరీ మహాశయులు, పవిత్ర గ్రంథాల్ని గురించి పుస్తక పాండిత్యంతో వ్యాఖ్యానించేవారు కారు. అప్రయత్నంగానే ఆయన, ‘దివ్య గ్రంథాలయం’లోకి మునిగేవారు. ఆయనలోని సర్వజ్ఞత్వమనే నీటి బుగ్గలోంచి మాటలనురుగూ ఆలోచనల తుంపరలూ పైకి చిమ్ముకొస్తూ ఉండేవి. అనేక యుగాలకు పూర్వం వేదాల్లో[7] మరుగుపడి ఉన్న గాఢమైన దార్శనిక శాస్త్రాన్ని బయల్పరిచే అద్భుతమైన కీలకం ఆయన దగ్గర ఉండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వివిధ చేతన స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు, ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారం తెలిపేవారు. “నేను ఆ స్థితుల్లోకి ప్రవేశించి నాకు గోచరించింది. చెబుతాను మీకు,” అనే వారు. కేవలం గ్రంథాలు బట్టీపట్టేసి తమ అనుభవంలోకి తెచ్చుకోని భావాల్ని వెల్లడించే ఉపాధ్యాయులకూ ఆయనకూ చాలా తేడా ఉండేది.

“ ‘నీకు తోచిన అర్థాన్నిబట్టి శ్లోకాలు వ్యాఖ్యానించు’, అంటూ మితభాషులయిన గురువుగారు దగ్గురున్న ఒక శిష్యుడితో తరచుగా అంటూండేవారు. ‘నువ్వు సరయిన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనల్ని నేను ప్రేరేపిస్తాను,’ అనేవారు. ఈ ప్రకారంగా లాహిరీ మహాశయుల అనుభూతులు అనేకం గ్రంథస్థం కావడం జరిగింది. వాటిమీద ఎందరో శిష్యులు పెద్దపెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు.

“గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువుగారు ఎన్నడూ చెప్పలేదు. ‘మాటలన్నవి కేవలం పైపై తొడుగులు,’ అనే వారాయన. ‘ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు.’ ”

“శిష్యుడికి ఏ సమస్య ఎదురయినా సరే, దానికి పరిష్కారంగా ఆయన, క్రియాయోగం సాధన చెయ్యమని సలహా ఇచ్చేవారు.”

“మీకు దారి చూపించడానికి నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా, ఈ యోగకీలకానికున్న సామర్థ్యం పోదు. సిద్ధాంతపరమైన ఆవేశాల సముదాయంగా తలచి, కట్టుదిట్టంగా కవిలెకట్టలో దాచిపెట్టి, తరవాత మరిచిపోవడానికి వీలయినది కాదు ఈ యోగపద్ధతి. క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా ముక్తిమార్గంలో ముందుకు సాగు; నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి ఇమిడి ఉంది.”

“నా మట్టుకు నేను, పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో, స్వయంకృషితో ముక్తి సాధించడానికి రూపొందిం చిన సాధనాల్లో, అన్నిటికంటె పటిష్ఠమైనది క్రియాయోగమేనని భావిస్తాను,” అంటూ గంభీరమైన ప్రమాణ వాక్యంతో ముగించారు కేవలానందగారు. “మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు, క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరీ మహాశయుల భౌతిక శరీరంలోనూ, ఆయన శిష్యుల్లో కొందరిలోనూ, మనకు కళ్ళకు కట్టే విధంగా రూపుదాల్చాడు.”

కేవలానందగారు గురువుగారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహిరీ మహాశయులు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది. ఋషితుల్యులైన మా మాస్టరుగారు ఒకనాడు నా కా కథ మళ్ళీ చెప్పారు. ఆయన కళ్ళు, మా కెదురుగా బల్లమీదున్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమయి ఉన్నాయి.

“గురువుగారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అతనికోసం ఏమయినా చెయ్యాలనిపించింది. తమలోనే పరమాత్ముడు ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువుగారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడయి సేవ చేస్తున్నాడే, అటువంటి ఇతని కళ్ళలోనే వెలుగు లేకపోవాలా, అనిపించింది. ఒక రోజున రాముతో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. కాని అతడు, చేత్తో చేసిన ఒక తాటేకు విసనికర్రతో, గంటల తరబడి ఓపికగా, గురువుగారికి విసురుతూ కూర్చున్నాడు. చివరి కతడు గదిలోంచి బయటికి వెళ్ళిన తరవాత నేనూ వెనకాలే వెళ్ళాను.

“రామూ, నీకు కళ్ళుపోయి ఎంతకాలమయింది?”

“నేను పుట్టినప్పుడేనండి! ఒక్క క్షణమయినా సూర్యుణ్ణి చూసే అదృష్టం నా కళ్ళకి పట్టలేదండి,” అన్నాడు.

“సర్వశక్తి సంపన్నులయిన గురువుగారు నీకు సాయం చెయ్య గలరు. ఒకసారి ఆయనకి మనవి చెయ్యి,” అన్నాను. “మర్నాడు రాము, బిడియపడుతూ లాహిరీ మహాశయుల దగ్గరికి వెళ్ళాడు. తనకున్న ఆధ్యాత్మిక సర్వసమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోడం, దాదాపు అవమానకర మనిపించేటంతగా భావించాడతడు.

“ ‘స్వామీ, విశ్వాన్నంతనీ ప్రకాశింపజేసేవాడు మీలో ఉన్నాడు. అంతకంటె తక్కువ కాంతితో వెలిగే సూర్యుణ్ణి చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడి వెలుగు నా కళ్ళలోకి వచ్చేటట్టు చెయ్యమని ప్రార్థిస్తున్నాను.’ అన్నాడు.”

“ ‘రామూ, నన్ను ఇరకాటంలో పెట్టడానికి, ఎవరో ఈ ఎత్తు వేశారు. నయం చేసే శక్తి నాకు లేదు,’ అన్నారాయన.”

“ ‘అయ్యా, మీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చెయ్యగలడండి.’

“ ‘అది వేరే సంగతి, రామూ! పరమాత్ముడి శక్తికి పరిమితి లేదు! అటు నక్షత్రాల్నీ, ఇటు శరీరంలో జీవకణాల్నీ నిగూఢమైన తన ప్రాణశక్తితో ప్రజ్వలింపజేసే పరమాత్ముడు నీ కళ్ళకి తప్పకుండా వెలుగు ఇవ్వగలడు,’ అంటూ గురువుగారు, రాము ముఖంలో కనుబొమల మధ్య ఉండే బిందువు[8]ను స్పృశించారు.

“ ‘నీ మనస్సును ఏడు రోజులపాటు అక్కడ కేంద్రీకరింపజేసి ఉంచి, తరచుగా రామ[9] నామం జపిస్తూ ఉండు. సూర్యుడి తేజోబింబం నీ కోసం ప్రత్యేకంగా ఉదయిస్తుంది,’ అన్నారు. “ఒక్క వారంలో అది జరిగింది. రాము మొట్టమొదటిసారిగా ప్రకృతిమాత సుందరముఖాన్ని దర్శించాడు. మునులందరి కన్న మిన్నగా అతను ఆరాధించే రాముడి నామాన్నే పురశ్చరణ చెయ్యవలసిందిగా సర్వజ్ఞులైన గురువుగారు తమ శిష్యుడికి సూచించారు. రాము విశ్వాసమన్నది భక్తితో దున్నిన నేల; అందులో గురువుగారి, శక్తిమంతమూ, శాశ్వతమూ అయిన రోగనివారణ బీజం మొలకెత్తింది.” అంటూ కేవలానందగారు ఒక్క క్షణంపాటు మౌనం వహించారు; తమ గురువుగారి మహిమను మళ్ళీ ప్రస్తుతించారు.

“లాహిరీ మహాశయులు చేసిన అద్భుతచర్య లన్నిటిలోనూ స్పష్టమయే విషయం ఏమిటంటే, తానే వాటికి కారకశక్తి ననుకొనే అవకాశం అహంకారానికి [10]ఎన్నడూ ఇయ్యకపోవడం. లాహిరీ మహాశయులు, చికిత్సాకారకమైన మూలశక్తికి తమను తాము అర్పించుకొన్నవారు; అందువల్లే ఆయన, ఆ శక్తిని స్వేచ్ఛగా తమగుండా ప్రసరించేటట్టు చేశారు. “లాహిరీ మహాశయుల ద్వారా రోగాలు నయమయిన శరీరాలు కూడా అనేకం, చిట్టచివరికి చితిమంటలకు ఆహుతి కాక తప్పలేదు. కాని మౌనంగా ఆయన కలిగించిన ఆధ్యాత్మిక జాగృతీ, ఆయన తీర్చిదిద్దిన క్రీస్తుమాదిరి శిష్యులూ ఎన్నటికీ నశించని అద్భుత మహిమలని చెప్పాలి.”

నేను సంస్కృత పండితుణ్ణయితే కాలేదు కాని అంతకన్న దివ్యమైన వాక్యపదీయం బోధించారు నాకు కేవలానందగారు.

 1. ఇతన్ని గురించి 26 పుటలో వచ్చింది.
 2. సన్యాసం = సమ్ +ని+ అస్ (తోసివెయ్యడం). అన్ని కర్మలనూ కర్మఫలాలనూ భగవంతుడికి అర్పించడం.
 3. ఈ జన్మలో కాని, పూర్వజన్మలో కాని చేసిన వెనకటి పనులకు ఫలితాలు; ‘చేయడం’ అనే అర్థంలో, ‘కృ’ అనే సంస్కృత ధాతువునుంచి వచ్చింది -
 4. అధ్యా. 9 : శ్లో. 30-31.
 5. అతన్ని నే నెప్పుడూ అనంత-దా అనే పిలిచేవాణ్ణి. తమ్ముళ్ళుగాని చెల్లెళ్ళుగాని అన్నగారిని సంబోధించేటప్పుడు, అతని పేరుకు చివర ‘దా’ అన్న గౌరవ వాచకం చేరుస్తారు.
 6. మేము కలుసుకొనే నాటికి కేవలానందగారు సన్యాసం తీసుకోలేదు. ఆయన్ని మామూలుగా “శాస్త్రి మహాశయ” అని పిలుస్తూండేవారు. కాని లాహిరీ మహాశయ, మాస్టర్ మహాశయ (అధ్యాయం : 9) అనే పేర్లు వచ్చినప్పుడు గందరగోళం లేకుండా ఉండాలని మా సంస్కృతం మాస్టరుగారి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆయనకి సన్యసించిన తరవాత వచ్చిన ‘స్వామీ కేవలానంద’ అన్న పేరే వాడుతున్నాను. ఇటీవల బెంగాలీలో ఆయన జీవిత చరిత్ర వెలువడింది. ఆయన గృహస్థనామం అశుతోష్ చటర్జీ.
 7. సనాతనమైన నాలుగు వేదాలకు, ఇప్పటికీ 100 పై చిలుకు ప్రస్థాన గ్రంథాలున్నాయి. ఎమర్సన్ తన ‘జర్నల్’లో వైదిక భావనకు ఈ విధంగా జోహార్లు అర్పించాడు : “అది ఉష్ణం మాదిరిగాను, రాత్రి మాదిరిగాను, అలలులేని కడలి మాదిరిగాను మహత్తరమైనది. ఇందులో ప్రతి ధార్మిక భావనా ఉంది; ఉదాత్త కవితాహృదయం గల ప్రతి కవి మనస్సులోనూ పర్యాయక్రమంలో మసిలే మహత్తరమైన నీతులన్నీ ఉన్నాయి.... ఈ గ్రంథాన్ని ఉపేక్షించగూడదు. నా మట్టుకు నే నొక్కణ్ణి, అరణ్యంలోనో సరస్సులో ఒక నావలోనో ఉన్నట్లయితే ప్రకృతిమాత ఇప్పుడు నన్నొక బ్రాహ్మణ్ణి చేస్తుంది; అనంతమైన ఆవశ్యకత, శాశ్వతమైన నష్టపరిహారం, అగాధమైన శక్తి, అఖండమైన మౌనం...ఇదీ దాని ఉద్గోష. శాంతి, పరిశుద్ధత, సంపూర్ణ పరిత్యాగం అన్న సర్వవ్యాధి చికిత్సకాలు, పాపాలన్నిటినీ పరిహరించి, నన్ను అష్టదేవతల ఆనంద ధామానికి తీసుకు వెళ్తాయని అది చెబుతూంది.
 8. “ఒంటి” కన్ను లేదా జ్ఞాననేత్రం ఉండే స్థానం. మామూలుగా మరణ సమయంలో మనిషిలో ఉన్న చైతన్యాన్ని పవిత్రమైన ఆ స్థానానికి లాగెయ్యడం జరుగుతుంది. చనిపోయినవాళ్ళ కళ్ళు పైకి తిరిగి ఉండడానికి కారణం ఇదే.
 9. రామాయణమనే సంస్కృత కావ్యంలో ప్రధాన పాత్ర అయిన పవిత్రమూర్తి.
 10. ఈ అహంకారం (అంటే, “నేను చేస్తున్నాననే భావన”) అన్నది ద్వంద్వానికి లేదా, మనిషికీ అతన్ని సృష్టించినవాడికీ మధ్య గోచరించే వేరుపాటుకు, మూలకారణం. ఈ అహంకారం మానవుల్ని మాయలో పడేస్తుంది; దానివల్ల కర్తే (అహం) ‘కర్మ’గా మిథ్యారూపంలో కనిపిస్తాడు. ఒకరు సృష్టిస్తే ఏర్పడ్డవాళ్ళు తామే సృష్టికర్తలమని ఊహించుకుంటారు.

  “నైవ కించి త్కరో మీతి యుక్తో మన్యేత తత్త్వవిత్,
  పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్ర న్నశ్న న్గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ..

  ప్రపలన్ విసృజన్ గృహ్ణ న్నున్మిష న్నిమిషన్నపి,
  ఇంద్రియా ణీంద్రియార్దేషు వర్తంత ఇతి ధారయన్.

  సత్యాలన్నిటిలోకి పరమమైన సత్యాన్ని నమ్మినవాడు, “నా అంతట నేనేమీ చెయ్యడం లేదు,” అనుకొంటాడు; “ఇంద్రియాలలో ఇంద్రియాధీనమైన ప్రపంచం చేస్తున్నదే ఇదంతా,” అని నమ్ముతాడు .

  గీత, అధ్యా. 5 : 3-9

  ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః
  యః పశ్యతి తథా౽త్మాన మకర్తారం సపశ్యతి

  నిజానికతడు, అంతటా జరిగేవి ప్రకృతి అలవాటు ప్రకారం జరిగేవని, ప్రతినిధిగా కాక, ఆచరణ ద్వారా ఆత్మ అభ్యాసం కోసం ఉద్దేశించినవనీ గమనిస్తాడు .

  అధ్యా. 13 : 10

  అజో౽పి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో౽పి సన్
  ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవా మ్యాత్మ మాయయా.

  నేను పుట్టుక లేనివాణ్ణి చావులేనివాణ్ణి నాశరహితుణ్ణి సర్వజీవులకూ అధిపతినీ అయినప్పటికీ మూల విస్తృతిలో తేలి ఆడే ప్రకృతి రూపాలమీద నేను ముద్రించిన మాయవల్లా, నా ఇంద్రజాలంవల్లా నేను వస్తూ పోతూ ఉంటాను.

  అధ్యా. 4 : 6

  దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
  మా మేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే.

  నన్ను మరుగుపరుస్తూ, వివిధ లీలలు ప్రదర్శించే దివ్యమైన తెరను ఛేదించుకొని పోవడం కష్టసాధ్యం; అయినా నన్ను కొలిచేవాళ్ళు దాన్ని ఛేదించుకొని ముందుకు పోగలుగుతారు.

  అధ్యా. 7 : 14