ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం : 3

రెండు శరీరాలున్న

సాధువు

“నాన్నగారూ, నన్నెవరూ బలవంతం చెయ్యకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చేటట్లయితే, కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా?”

ప్రయాణాలు చెయ్యడమంటే నాకున్న గాఢమైన అభిలాషకు, మా నాన్నగారు ఎప్పుడోకాని అడ్డుచెప్పేవారు కారు. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలూ యాత్రాస్థలాలూ చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు. మామూలుగా, ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు; మేమందరం, మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే ప్యాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్ళం. రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి, మా ఇంట్లో ఉన్న దేశదిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది.

నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు. ఆ మర్నాడు నన్ను పిలిచారు; బెరైలీ నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే ప్యాసు, కొన్ని రూపాయి నోట్లు, రెండు ఉత్తరాలు ఇచ్చారు.

“కాశీలో కేదార్‌నాథ్ బాబు అని, మా స్నేహితుడున్నాడు; అతనికి ఒక సంగతి తెలపవలసి ఉంది. దురదృష్టవశాత్తు, అతని ఎడ్రసు పోయింది. కాని మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామీ ప్రణవానంద గారని ఆ ఊళ్ళోనే ఉన్నారు; ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజెయ్యగలవనుకుంటాను. ఆ స్వామీ నేనూ ఒకే గురువుగారి శిష్యులం; ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు. ఆయన దర్శనంవల్ల నీకు మేలు కలుగుతుంది. ఈ రెండో ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చెయ్యడానికి పనికొస్తుంది.”

“ఇదుగో, ఇకనుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోవడాలేవీ కుదరవు-- గుర్తుంచుకో!” అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి.

నా కుండే పన్నెండేళ్ళ వయస్సుకు సహజమైన ఉత్సాహంతో (అయితే, కొత్త దృశ్యాలు కొత్త ముఖాలూ చూడ్డంలో నా కున్న ఆనందాన్ని, కాలం ఎన్నడూ తగ్గించలేదు) బయలుదేరాను. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను. ముందుతలుపు తెరిచి ఉంది. రెండో అంతస్తులో ఉన్న పొడుగాటి, విశాలమైన గదిలోకి దారి తీశాను. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న, కొంచెం లావుపాటి మనిషి ఒకాయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదికమీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు. ఆయన తలా, ముడతలులేని ముఖమూ శుభ్రంగా నున్నగా ఉన్నాయి. ఆయన పెదవులమీద, పరమానందానుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతున్నది. పరిచయంలేని చోటికి చొరబడ్డానన్న సంకోచం నా లోంచి తొలగించడానికి ఆయన, ఒక పాత స్నేహితుడిలాగే పలకరించారు.

“బాబా ఆనంద్ (సంతోషం నాయనా!).” స్వాగత సూచకమైన ఈ పలకరింపు, నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టు ఉంది. నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను.

“ప్రణవానంద స్వామిగారు మీరేనాండీ?” ఆయన తల ఊపారు. “నువ్వు భగవతి బాబుగారి కొడుకువా?” ఆయన మాటలు, నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే, బయటికి వచ్చేశాయి. నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయ పత్రం ఆయనకు అందించాను; కాని అదింక అనవసరమే అనిపించింది.

“కేదార్‌నాథ్ బాబుగారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే, నీ కోసం.” ఈ స్వాములవారు తమ దివ్యదృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు.

“నేను రెండు పెన్షన్లు అనుభవిస్తున్నాను, నీకు తెలుసా! ఒకటి మీ నాన్నగారి సిఫార్సువల్ల వచ్చినది- ఒకప్పుడు నేను ఆయన దగ్గిర రైల్వే ఆఫీసులో పనిచేశాను; రెండోది పరమేశ్వరానుగ్రహంవల్ల వచ్చినది. ఆయన సేవలో, జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తిచేశాను.”

ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు. “పరమేశ్వరుడి దగ్గరి నుంచి మీకు వచ్చేది ఎలాటి పెన్షనండీ? ఆయన డబ్బేమయినా మీ ఒళ్ళో పడేస్తాడా?”

ఆయన నవ్వారు. “అంటే, గాఢమైన ప్రశాంతి అన్నమాట- ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం. ఇప్పుడు నేను డబ్బుకోసం ఆశ పడను. నా కున్న కొద్దిపాటి భౌతికావసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ రెండో పెన్షను కున్న ప్రాముఖ్యం నీకు ముందుముందు తెలుస్తుంది.”

మా సంభాషణను చటుక్కుని తుంచేసి, స్వామివారు గంభీరమైన నిశ్చలరూపులుగా మారిపోయారు. ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది. మొట్టమొదట, ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి; తరవాత మందగించాయి. ఆయన అంత మితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను. మా నాన్న గారి స్నేహితుణ్ణి కలుసుకోడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు. నా కక్కడ ముళ్ళమీద కూర్చున్నట్టు ఉంది. ఇంక ఏం తోచక, రవ్వంత విసుగుదలతో, మే మిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో, చుట్టూ కలయజూశాను. ఆయన కూర్చున్న బల్లకింద పావుకోళ్ళు నా కంటపడ్డాయి.

“చిన్నబాబూ![1] గాభరాపడకు. నువ్వు చూడదలిచినాయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు.” ఆ యోగి నా మనస్సులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు - ఆ సమయంలో అది, ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణ కార్యం కాదు.

మళ్ళీ ఆయన, అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు. ముప్ఫయి నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచీ తెలిపేసరికి స్వామివారు లేచారు.

“కేదార్‌నాథ్ బాబుగారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను,” అన్నారాయన. ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించింది. అప్పుడు నాలో, నమ్మజాలనంత ఆశ్చర్యం పెల్లుబికింది; నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి; “కబురు చెప్పడానికి ఎవరినీ పంపించకుండానే, నాన్నగారి స్నేహితుణ్ణి ఇక్కడికి పిలిపించడం ఎలా వీలైంది? నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్వాములవారు నాతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదే!” ఇక నేను, మంచీ మర్యాదా చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగాను. సగం మెట్లు దిగేసరికి సన్నగా, చామన చాయగా, మధ్య తరహా ఎత్తు ఉన్న ఒకాయన్ని కలిశాను. ఆయన తొందరలో ఉన్నట్టున్నారు.

"కేదార్‌నాథ్ బాబుగారు మీరేనా?” నా గొంతులో ఉద్రేకం నిండింది.

“ఔను. నువ్వు భగవతి బాబుగారి కొడుకువి కదూ- నన్ను కలుసుకోడానికి ఇక్కడ కాచుకొని ఉన్నావు కదూ?” స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారాయన.

“ఏమండీ, మీ రిక్కడికి రావడం ఎలా జరిగింది?” చెప్ప శక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతిపోయి నట్టయింది; విస్మయం కలిగింది.

“ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు ఒక గంట కిందట నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామిగారు నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో నే నక్కడ ఉన్నట్టు ఆయనకు ఎలా తెలిసిందో నాకు తెలియదు.”

“భగవతి బాబుగారబ్బాయి మీ కోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు. మీరు నాతో వస్తారా?” అన్నారు. నేను సంతోషంగా సరే నన్నాను. మే మిద్దరం చెయ్యీ చెయ్యీ పట్టుకుని వస్తూ ఉండగా, పావు కోళ్ళతో నడుస్తున్న ఆ స్వామివారు, ఈ గట్టి బూట్లతో నడిచే నా కన్న చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కరిగించింది.

“మా ఇల్లు చేరుకోడానికి మీకు ఎంతసేపు పడుతుంది?” అంటూ చటుక్కున ఆగి అడిగారు నన్ను, ప్రణవానందులు.

“సుమారు అరగంట.” “నా కిప్పుడు వేరే పని ఉంది. అప్పుడాయన చూసిన చూపులోని మర్మం నా కర్థం కాలేదు. ‘మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి. మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు. భగవతి బాబుగా రబ్బాయీ నేనూ అక్కడ మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం.’

“ ‘అలా కాదు,’ అని నేను అడ్డు చెప్పేలోగానే ఆయన టకటకా దూసుకు వెళ్ళిపోయి గుంపులో మాయమై పోయారు. నేను వీలయినంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను.”

ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టింపయింది. ఈ స్వామీజీ, మీకు ఎంతకాలం నుంచి తెలుసునని అడిగాను.

“కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం. కాని ఈమధ్య కలవ లేదు. మళ్ళీ ఇవాళటికి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను.”

“నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను! నాకుగాని మతిపోతోందా? మీకు ఆయన కలలో కనిపించారా లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి, ఆయన చెయ్యి ముట్టుకుని, ఆయన అడుగుల చప్పుడు విన్నారా?”

“నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు!” కోపంతో ఆయన ముఖం జేవురించింది. “నీతో అబద్ధమేమీ చెప్పడం లేదు. నువ్విక్కడ నా కోసం కాసుకుని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్లే తెలుసుకోగలిగానని అర్థమవడం లేదూ?”

“అదేమిటి? ఆయన- ఆ ప్రణవానంద స్వామిగారు సుమారు ఒక గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటినుంచి నా కళ్ళముందు నుంచి కదలలేదు!” అంటూ మొత్తం కథంతా ఆయనకు బడబడా చెప్పేశాను. స్వామీజీకీ నాకూ జరిగిన సంభాషణ కూడా చెప్పాను. ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి. “మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా, కలగంటున్నామా? నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనే లేదు! ఈ స్వామి ఒట్టి మామూలు మనిషే అనుకున్నాను. ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకుని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తోంది.” మే మిద్దరం కలిసి ఆ స్వాములవారి గదిలోకి ప్రవేశించాం. ఆయన బల్లకింద ఉన్న పావుకోళ్ళ వేపు చూపించారు కేదార్‌నాథ్‌బాబు.

“ఇవిగో, స్నానాల రేవులో ఈ పాంకోళ్ళే వేసుకున్నారీయన,” అంటూ గుసగుసలాడారు. “ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగోస్త్రం కట్టుకుని ఉన్నారు.”

వచ్చినాయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా, స్వాములవారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు.

“ఇదంతా చూసి ఆశ్చర్యపోతా వెందుకు? ఈ దృగ్విషయిక ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు. నేను ఈ క్షణంలోనే, దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకుని వాళ్ళతో మాట్లాడగలను. ఆ విధంగానే వాళ్ళు, సంకల్ప మాత్రం చేత, స్థూల పదార్థంవల్ల కలిగే ప్రతీ అవరోధాన్ని అధిగమించ గలరు.”

ఈ స్వాములవారు తమకు గల దూరదర్శన, దూరశ్రవణ[2] శక్తుల్ని గురించి నాకు తెలియజెప్పడం, నా కిశోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు. కాని దాంతో, నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది. భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వర్ గారు– అప్పటికింకా నేను ఆయన్ని కలుసుకోనే లేదు– అనే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవనిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానందగారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగ లేదు. నాకు ఎదురుగా ఉన్నాయన అసలైన ప్రణవానందగారా, లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయనవైపు చూశాను.

“నే నెరిగిన వాళ్ళందరిలోకి లాహిరీ మహాశయులు చాలా గొప్ప యోగి. మానవరూపం ధరించిన దేవుడే ఆయన.”

తమ సంకల్పమాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు, ఆయన గురువుగారికి సాధ్యంకాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నాను. “గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను. నేను రోజూ రాత్రి మరో శిష్యుడితో బాటు, ఎనిమిది గంటల సేపు ధ్యానంలో ఉండేవాణ్ణి. పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పనిచేయవలసి ఉండేది. ఆ గుమాస్తా పనులు చెయ్యడానికి నాకు ఇబ్బంది అనిపించి, నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకొన్నాను. ఎనిమిది గంటల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా, ధ్యానం చేసేవాణ్ణి. అద్భుతమైన ఫలితాలు కలిపించాయి; బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనస్సును ప్రకాశింప జేశాయి. అయితే నాకూ, ఆ భగవంతుడికీ మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది. మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా, పరమాత్మలో తిరుగు విధంగా చివరికి ఐక్యమయే అవకాశం నాకు లభించనట్టు కనిపించింది. నాటి సాయంత్రం లాహిరి మహాశయుల దర్శనానికి వెళ్ళి ఆయన సహాయం కోసం అర్థించాను. రాత్రి తెల్లవార్లూ నేను ఆయన్ని బతిమాలుతూనే ఉన్నాను.

“గురుదేవా, నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను!”

“నే నేం చెయ్యగలను? నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చెయ్యాలి.”

“ప్రభూ-గురుదేవా! నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ భౌతిక శరీరంలో నేను దైవాంశ చూడగలుగుతున్నాను. కాని మిమ్మల్ని విశ్వరూపంలో దర్శించే భాగ్యం కలిగేటట్టు అనుగ్రహించండి!”

“లాహిరీ మహాశయులు ఆశీర్వాద ముద్రతో చెయ్యి చాపారు. అప్పుడింక వెళ్ళి ధ్యానం చెయ్యి. నీ గురించి బ్రహ్మ[3]కు మనవి చేశాను.” “అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తపించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను. ఆనాటి నుంచి మరెన్నడూ, ఆనందమయుడైన ఆ సృష్టికర్త, ఏ మాయావరణం మాటునా నాకు కనుమరుగు కాలేదు.”

ప్రణవానందగారి ముఖం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది; నాలోని భయం పలాయనం చేసింది. ప్రణవానందగారు మరో రహస్యం చెప్పారు నాకు.

“కొన్ని నెలల తరవాత మళ్ళీ ఒకసారి లాహిరీ మహాశయుల దగ్గరికి వెళ్ళాను. నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను.

“గురుదేవా, నే నింక ఆఫీసులో పని చెయ్యలేను. దయ ఉంచి నన్ను ఈ చెరనుంచి విడుదల చెయ్యండి. బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు.”

“మీ కంపెనీ నించి పెన్షనుకు దరఖాస్తు పెట్టు.”

“నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షనుకు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను?” “నీకు ఏది అనిపిస్తే అది.[4]

“ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను. సర్వీసు పూర్తికాక ముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షను కోరడానికి కారణా లడిగాడు డాక్టరు.”

“పనిచేస్తుంటే, నా వెన్నులో, నన్ను వివశుణ్ణి చేసే సంచలనం పుడుతోంది. అది నా శరీరమంతటా వ్యాపించి, నా విధులు నేను నిర్వర్తించుకోడానికి అనర్హుణ్ణి చేస్తోంది.”

“అలా అన్న మీదట, ఆ డాక్టరు, ఇంక నన్నేమీ అడక్కుండా నాకు పెన్షను మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు. అది త్వరలోనే వచ్చింది. నాకు తెలుసు; లాహిరీ మహాశయుల దివ్యసంకల్పం ఆ డాక్టరుద్వారాను- మీ నాన్నగారితో సహా- రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది. దాంతో వాళ్ళంతట వాళ్ళు, మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసావహించి, ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించడానికి వీలుగా, నన్ను విముక్తుణ్ణి చేసి స్వేచ్ఛాజీవితం ప్రసాదించారు.”

ఈ అసాధారణ విషయం వెల్లడించిన తరవాత ప్రణవానంద స్వామివారు చాలాసేపు, మామూలు అలవాటు ప్రకారం, మౌనంలో ఉండి పోయారు. నేను సెలవు తీసుకొంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్నిలా ఆశీర్వదించారు:

“నీ జీవితం భౌతిక సుఖాల్ని విడిచిపెట్టి యోగసాధన మార్గంలో సాగుతుంది. నిన్ను మళ్ళీసారి మీ నాన్నగారితో చూస్తాను.” తరవాత కొన్నేళ్ళకు ఈ రెండు జోస్యాలూ ఫలించాయి.

చీకటి ముసురుతూ ఉండగా, కేదారనాథ్‌బాబు నా పక్కన నడుస్తూ వచ్చారు. మా నాన్న గారిచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను. దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుకున్నారు.

“వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు. ప్రణవానంద స్వామిగారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక్కదాని కోసమయినా ఎదురు చూడ్డం ఎంత సంతోషించవలసిన విషయం! కాని అది అసంభవం! నేను కాశీ వదిలి వెళ్ళలేను. నా కింకా రెండు శరీరాలు లేవు కదా!”

  1. కొందరు భారతీయ సాధువులు నన్ను ‘చోటా మహాశయా’ అని పిలిచేవారు. దానికి “చిన్నబాబు” అని అర్థం.
  2. మనస్తత్వశాస్త్రం ద్వారా యోగులు వెల్లడించిన శాస్త్రనియమాల చెల్లుబడిని గురించి భౌతికశాస్త్రం, దాని పద్ధతిలో అది రూఢి చేస్తోంది. ఉదాహరణకు, మానవుడికి దూరదర్శన శక్తులున్నాయన్న సంగతి, 1934 నవంబరు 26 తేదీన రాయల్ యూనివర్సిటీ ఆఫ్ రోమ్ అనే విశ్వవిద్యాలయంలో నిరూపించడం జరిగింది. డా|| గిసేవ్ కాలిగారిస్ అనే స్నాయనిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త (న్యూరో సైకాలజీ ప్రొఫెసరు) ఒక వ్యక్తి శరీరంలో నిశ్చితమైన కొన్ని భాగాలు చేత్తో ఒత్తాడు. అప్పుడా వ్యక్తి, గోడకు అవతల ఉన్న వ్యక్తుల్నీ, వస్తువుల్నీ సూక్ష్మమైన వివరాలతో సహా వర్ణించి చెప్పాడు. చర్మం మీద నిశ్చతమైన కొన్ని చోట్ల సంచలనం కలిగిస్తే, ఆ వ్యక్తికి అతీంద్రియానుభూతులు కలుగుతాయనీ, మరో విధంగా చూడలేని వస్తువుల్ని చూడగలుగుతాడనీ డా: కాలిగారిస్, అక్కడి ప్రొఫెసర్లకు చెప్పాడు. ఆ వ్యక్తి, గోడవతల ఉన్న వస్తువుల్ని చూసేటట్టు చెయ్యడానికి ప్రొ॥ కాలిగారిస్, అతని రొమ్ముకు కుడివేపు ఒకచోట పదిహేను నిమిషాల పాటు చేత్తో ఒత్తాడు. శరీరంలో కొన్ని నిశ్చిత స్థానాల్ని సంచలింపజేసినప్పుడు మనుషులు, కొన్ని వస్తువుల్ని, అంతకు పూర్వం తాము చూసినా చూడకపోయినా, ఎంత దూరమైనవాటి నయినా చూడగలుగుతారని డా|| కాలిగారిస్ అన్నాడు."
  3. సృష్టికర్త రూపంలో ఉన్న భగవంతుడు ; ‘విస్తరించడం’ అనే అర్థంలో, సంస్కృతంలో వాడుకలో ఉన్న ‘బృహ్’ అనే ధాతువునుంచి వచ్చినది. ఎమర్సస్ రాసిన ‘బ్రహ్మ’ అనే పద్యం, 1857 లో ‘అట్లాంటిక్ మంత్లీ’ అన్న పత్రికలో ప్రచురించినప్పుడు పాఠకులు దిగ్భ్రమచెందారు. దానికి ఎమర్సన్ సరదాగా నవ్వుకొని,“ ‘బ్రహ్మ’కి బదులు ‘యెహోవా’ అని అనుకోమనండి; అప్పుడిఁక ఏమీ గందరగోళం అనిపించదు”అన్నాడు
  4. గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మానుభవం కలిగేది మొదట వెనుబామనే గద్దెమీద; తరవాత మెదడులో. ఆనందమనే వెల్లువ మనల్ని ముంచెత్తుతుంది; కాని యోగి అయినవాడు, దాని సూచనలు బయటికి కనబడకుండా అదుపుచేయడం నేర్చుకుంటాడు. నిజానికి, మేము కలుసుకొన్నప్పటికే ప్రణవానందగారు జ్ఞానపూర్ణులైన గురువులు. కాని అంతకు అనేక సంవత్సరాల ముందే ఆయన ఉద్యోగ జీవనంలో చివరి రోజులు గడిచాయి; అప్పటికాయన నిర్వికల్ప సమాధిలో తిరుగులేకుండా కుదురుకోలేదు. పరిపూర్ణం, అచంచలం అయిన అచేతనావస్థలో ఉన్నప్పుడు, ప్రాపంచిక విధుల్లో ఏది నిర్వర్తించడానికన్నా, యోగికి కష్టం అనిపించదు. పదవీవిరమణ చేసిన తరవాత, ప్రణవానందగారు, ప్రణవగీత అన్న గ్రంథం రాశారు. బెంగాలీ, హిందీ భాషల్లో ఉన్న ఈ వ్యాఖ్యాన గ్రంథం, భగవద్గీత మీద అపార పాండిత్య స్ఫూర్తితో రచించినది. ఒకటికి మించి ఎక్కువ దేహాల్లో కనిపించే శక్తి ఒక సిద్ధి (యోగశక్తి): దీన్ని గురించి పతంజలి యోగసూత్రాల్లో చెప్పాడు. ఒకే మనిషి రెండుచోట్ల ఉండడమనే దృగ్విషయం అనేక యుగాలుగా, అనేకమంది సాధువుల జీవితాల్లో కళ్ళకు కడుతూనే వచ్చింది.