ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం: 2

మా అమ్మ మరణం,

విచిత్రమైన రక్షరేకు

మా అమ్మకున్న కోరికల్లోకల్లా పెద్దది, మా అన్నయ్యకి పెళ్ళి చేసెయ్యాలన్నది. “అనంతుడి పెళ్ళాం మొహం కంటబడినప్పుడు ఈ భూమిమీదే స్వర్గం చూస్తాను!” తమ వంశం పరంపరాభివృద్ధిగా సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చెయ్యడం తరచుగా వింటూ ఉండేవాణ్ణి.

అనంతుడి పెళ్ళికి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను పదకొండేళ్ళవాణ్ణి. అమ్మ కలకత్తాలో ఉండి, పెళ్ళి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తోంది. నేనూ నాన్నగారూ మట్టుకే, ఉత్తరభారతదేశంలో ఉన్న బెరైలీలో ఉండేవాళ్ళం. అక్కడ రెండేళ్ళున్న తరవాతే, నాన్నగారిని లాహోరు బదిలీ చేశారు.

అంతకుముందు, మా అక్కలిద్దరికి రమకి ఉమకి- పెళ్ళిళ్ళయినప్పుడే చూశాను, వివాహవైభవం. కాని అనంతుడు ఇంటికి పెద్దకొడుకవడంవల్ల, ఈ పెళ్ళికి తలపెట్టిన ఏర్పాట్లు భారీఎత్తున సాగుతున్నాయి. రోజూ ఎక్కడెక్కడినుంచో, వచ్చే చుట్టా లనేకమందికి అమ్మ కలకత్తాలో స్వాగతమిస్తోంది. 50 ఆమ్హరస్ట్ వీథిలో కొత్తగా మేము తీసుకున్న పెద్ద ఇంట్లో, వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటుచేసింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. విందు భోజనాలకి కావలసిన పదార్థాలు, అన్నయ్య ఆడపెళ్ళి వారింటికి తరలివెళ్ళడాని కొక అందమైన పల్లకీ, రంగు రంగుల దీపాల తోరణాలు, భారీసైజు అట్ట ఏనుగులు, ఒంటెలు, ఇంగ్లీషు-స్కాటిష్-భారతీయ వాద్యబృందాలు, వృత్తిరీత్యా వినోదమిచ్చే కళాకారులు, ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు.

పెళ్ళి సమయానికి వెళ్ళి మా వాళ్ళందరితోనూ కలవాలని నేనూ మా నాన్నగారూ మంచి ఉత్సాహంగా ఉన్నాం. కాని ఆ వివాహమహాత్సవం నాటికి కొన్నాళ్ళముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు అనుభూతమైంది.

బెరైలీలో ఒకనాటి అర్ధరాత్రి. మా బంగళా వసారాలో నేను, మా నాన్నగారి పక్కన పడుకుని ఉండగా, మా మంచానికున్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ రెపరెపమనేసరికి నాకు మెలకువ వచ్చింది. పలచని ఆ తెరలు పక్కకి ఒత్తిగిలాయి. ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను.

“మీ నాన్నగారిని లేపు!” ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది. “మీరు నన్ను చూడాలంటే, తెల్లారగట్ల నాలుగు గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చెయ్యండి!” ఛాయామాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది.

“నాన్నా! నాన్నా! అమ్మ చచ్చిపోతోంది!” నా గొంతులోంచి వెలువడ్డ భయార్తస్వరం. నాన్నగారిని వెంటనే లేపేసింది. వెక్కివెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకి చెప్పాను.

“అదంతా నీ భ్రమ; దాన్నేం పట్టించుకోకు,” అన్నారు నాన్నగారు. కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో అన్నారాయన. “మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది. చెడ్డకబురు ఏమైనా వస్తే రేపు బయల్దేరి వెళ్దాం లే!” “ఇప్పుడు బయల్దేరకపోతే, తరవాత మిమ్మల్ని మీరు క్షమించుకో లేరు.” నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికించింది, “నేనూ మిమ్మల్ని ఎన్నడూ క్షమించను!”

విషాదపూర్ణమైన ఆ ఉదయం, స్పష్టమైన కబురు తెచ్చింది: “అమ్మకి జబ్బుచేసి ప్రమాదస్థితిలో ఉంది; పెళ్ళి వాయిదా పడింది; వెంటనే వచ్చెయ్యండి.”

మాకు మతి చెడిపోయింది. ఇద్దరం బయలుదేరాం. దారిలో బండి మారేచోట ఒక ఊళ్ళో మా మామయ్యల్లో ఒకాయన మమ్మల్ని కలుసుకున్నాడు. భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మావేపు వస్తోంది. మొదట చిన్నగా కనిపించినదే రానురాను పెద్దదవుతూ వచ్చింది. మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా, చటుక్కున రైలుపట్టాల కడ్డంగా పడిపోవాలనిపించింది. అప్పుడే అమ్మకి దూరమైపోయినందువల్ల, ఆవిడలేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది. ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు, అమ్మ ఒక్కర్తే అన్నంతగా ప్రేమించాను నేను. చిన్నతనంలో నా కెదురైన చిన్నచిన్న బాధలన్నిటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకొన్న ఆవిడ నల్లటి కళ్ళే.

“అమ్మ ఇంకా బతికుందా!” మామయ్యని, ఈ ఒక్క చివరి ప్రశ్న అడగడంకోసం ఆగాను.

నా ముఖంలో ఉన్న నిరాశని అర్థంచేసుకోడానికి అట్టేసేపు పట్ట లేదాయనకి. “లేకేం? బతికే ఉంది!” అన్నారు. కాని ఆయన మాట, ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను.

మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం, దిగ్ర్భాంతి కలిగించే మృత్యు వైచిత్ర్యాన్ని దర్శించడానికే అయింది. నేను కుప్పలా కూలి పోయాను; ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడింది. నా మనస్సు సమాధానపడ్డానికి కొన్నేళ్ళు పట్టింది. నా ఆర్తనాదాలు స్వర్గ ద్వారాల్ని భేదించి చివరికి ఆ జగజ్జననినే పిలుచుకువచ్చాయి. నా పచ్చిపుండ్లను చివరికి మాన్పగలిగినవి చల్లని ఆ తల్లి పలుకులే:

“జన్మజన్మలుగా, అనేకమంది తల్లుల వాత్సల్యరూపంలో నిన్ను కనిపెట్టుకొని ఉన్నదాన్ని నేను! నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను, మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను, రెండింటినీ నా చూపులో చూడు!”

ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది. ఆ వెంటనే నేనూ నాన్నగారూ బెరైలీకి తిరిగి వచ్చేశాం. అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ - బంగారు వన్నెలో మిసిమిచెందే మెత్తని పచ్చిక నేల ఉంది. దానికి నీడనిచ్చేది పెద్ద ‘సేవాలి’ వృక్షం. నేను ప్రతిరోజూ పొద్దున విచారగ్రస్తుడినయి ఆ చెట్టు దగ్గిరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి. కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది. తెల్లటి ఆ ‘సేవాలి’ పుష్పాలు, పచ్చని గడ్డితో నిండిన గద్దెమీద, మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్టుగా పరుచుకుంటున్నాయని. నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా, ఉషస్సులోంచి బయల్వెడలుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని, తరచు గమనిస్తూ ఉండేవాణ్ణి. భగవంతుడికోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది. హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కొంటున్నట్టు అనిపించేది.

ఒకసారి, మా చుట్టం ఒకాయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకొని బెరైలీలో మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు. ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి, స్వాముల్ని [1]గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను.

“హిమాలయాలకి పారిపోదాం.” ఒక రోజున, బెరైలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు- ద్వారకా ప్రసాద్‌తో అన్నాను నేను. కాని నా మాటలకు “అతనికి నా మీద సానుభూతి లేకపోయింది. నాన్న గారిని చూడ్డానికి అప్పుడే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు. అయితే అనంతు అన్నయ్య, ఏదో కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండా, నన్ను అదే పనిగా వెక్కిరించడం మొదలుపెట్టాడు.

“నీ కాషాయ వస్త్ర మేదిరా? అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి! కాని ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఆ మాటలే నా ఊహకొక స్పష్టమైన రూపం ఇచ్చాయి: నే నొక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్టు, బహుశా అవి, నా పూర్వ జన్మ స్మృతులను మేల్కొలిపి ఉండవచ్చు: ఏమైనప్పటికీ, ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను.

ఒకరోజు పొద్దున, ద్వారకతో కబుర్లుచెబుతూ ఉంటే, కొండమీంచి మంచుబండ అతివేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది. ఆ తరవాత నా నోట వెలువడిన వాగ్దారను అతడు కొంతమట్టుకే శ్రద్ధగా ఆలకించాడు; కాని నేను మాత్రం, నా మాటలనే గుండెనిండుగా వింటున్నాను.

ఆవేళ మధ్యాహ్నం నేను, హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను. అనంతుడు పంతంపట్టి నన్ను తరుముకొచ్చాడు; నేను విచారంగా, బెరైలీకి తిరిగి రావలసివచ్చింది. మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్ర అల్లా, పొద్దుటిపూట మామూలుగా ఆ ‘సేవాలి’ చెట్టుదగ్గరికి వెళ్ళడం మట్టుకే. నేను పోగొట్టుకొన్న ఇద్దరు తల్లులకోసం - ఒకరు మానవరూపంలో ఉన్నవారు, మరొకరు దేవతా రూపంలో ఉన్నవారు- నా గుండె వలవలా ఏడ్చింది.

అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూడ్చలేనిది. తరవాత జీవించిన నలభై ఏళ్ళలోనూ నాన్నగారు మళ్ళీ పెళ్ళి చేసుకో లేదు. ఈ పిల్లలకి తల్లీ - తండ్రి తామే అయారు. కష్టసాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో, ఆయనలో గుర్తించదగినంత మార్దవం పెరిగింది; ఆయన దగ్గర చనువు పెరిగింది. కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు. ఆఫీసువేళల తరవాత, ఒక మునిమాదిరిగా, తమ గదిలోకి వెళ్ళిపోయి, ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధనచేస్తూ ఉండేవారు. మా అమ్మపోయిన చాలా కాలానికి, నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండేటట్టుగా, చిన్నచిన్న పనులు చూడటానికని ఒక ఇంగ్లీషు నర్సును పెడదామని ప్రయత్నించాను. కాని నాన్నగారు తల తిప్పేశారు. “నాకు సేవ అన్నది మీ అమ్మతోనే అంతమైంది.” ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళలో, జీవితకాలమంతా నెలకొన్న అనురాగం ఉంది. “మరో ఆడది ఎవరూ సేవ చేయ్యడానికి నేను ఒప్పుకోను.”

అమ్మ పోయిన పద్నాలుగు నెలల తరవాత, ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసింది. చనిపోయే సమయంలో ఆవిడమంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు. ఆవిడ చెప్పినవి అతడు రాసి పెట్టాడు. అయితే ఆ సంగతి, ఒక ఏడాది లోనే నాకు చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ, అన్నయ్య ఆలస్యం చేశాడు. అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోడానికి త్వరలోనే తను, బెరైలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితిలో, ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు.

“ముకుందా, నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టంలేక ఇన్నాళ్ళూ వెనకాడుతూ వచ్చాను.” అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది. “ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగసన దోసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను. అయినా, నీలో దైవసంబంధమైన ఉత్సాహం పెల్లుబుకుతూ ఉంది. ఈమధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నే నొక కచ్చితమైన తీర్మానం చేసుకున్నాను. మనఃపూర్తిగా నేను చేసిన వాగ్ధానాన్ని ఇక ఏ మాత్రం వాయిదా వెయ్యగూడదనుకున్నాను.” ఒక చిన్న పెట్టె, అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య.

“నాయనా, ముకుందా! నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి!” అంది అమ్మ. “నువ్వు పుట్టిన తరవాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు పసిపాపగా నా చేతుల్లో ఉన్నప్పుడే, నీకు నిర్ణయమైన జీవిత మార్గమేదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది. అప్పుడు నిన్ను, కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనక నేను దాదాపు, మరుగుపడి ఉన్నాను. గాఢమైన ధ్యానంలో మునిగిఉన్న లాహిరీ మహాశయుల్ని సరిగా చూడలేకపోయాను కూడా.

“మహాగురువులు నిన్ను గమనించాలనీ, నిన్ను ఆశీర్వదించాలనీ- ఒకవైపు నిన్ను జోకొడుతూ- ప్రార్థిస్తున్నాను. మౌనంగా, భక్తిపూర్వ కంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరీ మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశారు. అక్కడున్నవాళ్ళు నాకు దారి ఇచ్చారు; పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను. లాహిరీ మహాశయులు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా, నీ నుదుటిమీద చెయ్యి పెట్టారు.

“చిట్టి తల్లీ , నీ కొడుకు యోగి అవుతాడమ్మా! ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను, ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు.”

“సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థనను మన్నించి నందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది. నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు, వారు నాకు చెప్పారు. నువ్వు వారి మార్గాన్నే అనుసరిస్తావని.”

“తరవాత, నీకు ఒక మహాతేజస్సు కనిపించిన సంగతి నాకూ. మీ అక్క - రమకీ తెలుసు బాబూ! నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చుని ఉండడం, పక్కగదిలోంచి మేము చూశాం. నీ చిన్నారి మొహం ధగధగా వెలిగింది; నీ గొంతులో, భగవంతుణ్ణి అన్వేషించడానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది.”

“నీ దారి లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటివల్ల తెలుసుకున్నాను. నాయనా! నా జీవితంలో జరిగిన వాటిలో అన్నిటికన్న విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రూఢి చేసింది. ఆ సంఘటనే, ఈ అంతిమ సమయంలో నేనీ ఉత్తరం రాయించడానికి ప్రేరేపిస్తోంది.

“అదేమిటంటే, పంజాబులో ఒక సాధువుతో జరిగిన సంభాషణ. మన మందరం లాహోరులో ఉంటుండే రోజుల్లో, ఒకనాడు పొద్దున, పని వాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు: ‘అమ్మగారూ, విచిత్రమైన సాధు[2] వొకడు వచ్చాడు. “ముకుందుడి తల్లిని చూడాలి నేను” అంటున్నాడు.

“ఎంతో సరళమైన ఈ మాటలే, నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది. వెంటనే నేను ఆయన్ని కలుసుకోడానికి వెళ్ళాను. ఆయన కాళ్ళకు మొక్కుతూ, నా ఎదురుగా ఉన్నాయన నిజంగా దైవసాక్షాత్కారం పొందినవాడేనని గ్రహించాను.

“అమ్మా, ఈ లోకంలో నువ్విక ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మహాగురువుల కోరిక. మళ్ళీసారి జబ్బుచేసినప్పుడు, నీ కది ప్రాణాంతకమవుతుంది.”[3] తరవాత ఆయన మౌనం వహించారు. ఆ సమయంలో నా కేమీ భయం వెయ్యకపోగా, ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది. చివరికి మళ్ళీ ఇలా అన్నాడాయన:

“ఒక వెండి రక్ష రేకును నువ్వు జాగ్రత్తగా దాచాలి. అది నీకు ఈ రోజు ఇవ్వను; నా మాటల్లో నిజం నీకు తెలియడానికి, ఆ రక్షరేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో, దానంతట అది నీ చేతుల్లో రూపుగడుతుంది. నువ్వు చనిపోయేముందు, ఆ రక్షరేకును ఒక ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్దకొడుకు- అనంతుడితో చెప్పి, ఆ తరవాత దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి. ఆ రక్ష రేకుకు అర్థమేమిటో, మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది. అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నిటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడికోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి. కొన్నేళ్ళపాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక - దాని ప్రయోజనం నెరవేరిన తరవాత- అది మాయమైపోతుంది. అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కణ్ణించి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే.”

“ఆయనకు నేను భిక్ష[4] వెయ్యబోయాను; ఎంతో గౌరవ ప్రపత్తులతో ఆయనకు ప్రణామం చేశాను. కాని ఆయన భిక్ష తీసుకోకుండానే, దీవించి వెళ్ళిపోయాడు. మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా, ఆ సాధువు చెప్పినట్టే, నా అరచేతులు రెంటికీ మధ్య రక్షరేకు వెలిసింది. నా చేతులకది చల్లగా, నున్నగా తగలబట్టే ఆ సంగతి తెలిసింది. రెండేళ్ళకు పైగా నేను దాన్ని బహుజాగ్రత్తగా దాచాను. ఇప్పుడిక అనంతుడి దగ్గర ఉంది. నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు; కనక, నా కోసం నువ్వు బాధపడకు నాయనా, వెళ్ళొస్తాను. జగన్మాత నిన్ను కాపాడుతుంది.”

ఆ రక్షరేకు నా అధీనంలోకి రావడంతోనే ఒకానొక తేజపుంజం నా మీదికి ప్రసరించింది; అణగిఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేల్కొన్నాయి. ఆ రక్షరేకు గుండ్రంగా, ప్రాచీనకాలంనాటిదిగా చిత్రంగా ఉంది. దానినిండా సంస్కృత లిపిలో ఏవో అక్షరాలున్నాయి. తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూఉన్న నా పూర్వజన్మల గురువుల దగ్గరినుంచి అది వచ్చిందని గ్రహించాను. వాస్తవానికి, దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది; కాని రక్షరేకు మహిమను పూర్తిగా ఎవరూ బయట పెట్టగూడదనుకుంటాను.[5] అయితే, చివరికి ఈ రక్షరేకు, నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో, అది ఆ విధంగా పోవడం నాకొక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కర లేదు. [6] కాని, హిమాలయాలు చేరడానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు, తన రక్షరేకు రెక్కలమీద ప్రతిరోజూ దూరదూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు.

  1. స్వామి శబ్దానికున్న మూలార్థం, “తన ఆత్మ (స్వ)తో ఏకీభూతుడైనవాడు" అని.
  2. సన్యాసి; సాధన చేసేవాడు లేదా ఆధ్యాత్మిక శిక్షణమార్గాన్ని అనుసరించేవాడు.
  3. తన జీవితకాలం స్వల్పమైనదన్న రహస్యజ్ఞానం అమ్మకు ఉండేదన్న సంగతి ఈ మాటలద్వారా నేను కనిపెట్టినప్పుడు, అనంతుడి పెళ్ళికి ఏర్పాట్లు అంత తొందరగా చెయ్యాలని ఆవిడ పట్టుపట్టడం ఎందుకో మొదటిసారిగా తెలుసుకున్నాను. పెళ్ళికిముందే ఆవిడ చనిపోయినా, తల్లిగా సహజంగా ఆవిడకు ఉండే కోరిక, ఆ వివాహకాండ చూడాలనే.
  4. సాధువులకు సాంప్రదాయికంగా, గౌరవభావంతో సమర్పించేది.
  5. (ఈ విధమైన) రక్షరేకన్నది అతీంద్రియ శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే వస్తువు. దీని రూపం అశాశ్వతమైనది; అటువంటి వస్తువులు చివరికి ఈ లోకంలోంచి అంతర్ధానమై తీరవలసిందే (చూడండి అధ్యాయం 43). ఈ రక్షరేకు మీద ఒక మంత్రం చెక్కి ఉంది. శబ్దానికి వాక్కుకీ- అంటే, మానవ కంఠ స్వరానికి- ఉండే శక్తుల్ని గురించి భారతదేశంలో జరిపినంత గాఢ పరిశీలన మరోచోట ఎక్కడా జరగలేదు. విశ్వమంతటా ప్రతిస్పందించే ఓంకార నాద స్పందనకు (బైబిల్‌లోని “శబ్దం” లేదా “అనేక సముద్రాల ఘోష”) సృష్టిస్థితిలయాలనే మూడు రూపాలు లేదా గుణాలు ఉన్నాయి (తైత్తిరీయోపనిషత్తు 1 : 8). మనిషి ఒక మాట పలికినప్పుడల్లా, ఓంకారానికున్న ఈ మూడు గుణా లోనూ ఒకదాన్ని కార్యరూపంలోకి తెస్తున్నాడన్నమాట. మానవు డెప్పుడూ సత్యమే పలకాలని పవిత్ర గ్రంథా లన్నింటిలోనూ నిర్ణయించిన విధికి [సత్యం వద] ఆధారభూతమైన న్యాయహేతువు ఇదే.

    ఆ రక్షరేకు మీది సంస్కృత మంత్రాన్ని సరిగా ఉచ్చరించినట్లయితే, ఆధ్యాత్మికంగా, లాభదాయకమైన స్పందనశక్తి దానికి ఉంటుంది. ఆదర్శప్రాయంగా నిర్మించిన సంస్కృత వర్ణమాలలో యాభై అక్షరాలుంటాయి. ప్రతి అక్షరానికి నిర్దిష్టంగా స్థిరమైన ఉచ్చారణ ఒకటి ఉంటుంది. లాటిన్ భాష ప్రాతిపదికగా ఏర్పడిన ఆంగ్ల వర్ణమాల సంగతి వేరు. దీంట్లో ఉండే ఇరవయ్యారు అక్షరాలూ వివిధ ధ్వనుల భారాన్ని మొయ్యలేక సతమతమవుతూ ఉంటాయి. వీటినిగురించి జార్జి బెర్నార్డ్ షా, మంచి తెలివిగా, సహజ హాస్య స్ఫోరకంగా ఒక వ్యాసం రాశాడు. తనకు అలవాటయిన నిర్దాక్షిణ్య ధోరణిలో శ్రీ షా (“ఇంగ్లీషు భాష కొక ఇంగ్లీషు వర్ణమాలను ప్రవేశ పెట్టడానికి అంతర్యుద్ధ మొకటి జరగవలసి వచ్చినా... నేను దానికి బాధపడను.”) నలభై రెండు అక్షరాల కొత్త వర్ణమాలను చేబట్టాలని కోరాడు (విల్సన్ రాసిన ‘ది మిరాక్యులస్ బర్త్ ఆఫ్ లాంగ్వేజ్’ అన్న గ్రంథానికి రాసిన తొలిపలుకు చూడండి). ఆ మాదిరి వర్ణమాల, పరిపూర్ణత విషయంలో, సంస్కృత వర్ణమాలకు చేరువగా వస్తుంది. సంస్కృత వర్ణమాలలో యాభై అక్షరాలుండడంవల్ల ఉచ్చారణలో తప్పులు రానివ్వదు.

  6. సింధు లోయలో బయల్పరిచిన కొన్ని సీళ్ళ మూలంగా, సంస్కృత వర్ణమాలను భారతదేశం సెమిటిక్ మూలాల నుంచి “ఎరువు తెచ్చుకుంది” అంటూ కొందరు పండితులు ఇప్పుడు చేస్తున్న వాదాన్ని విడిచిపెట్టేట్టు చేయడం జరిగింది. మొహంజో-దారో, హరప్పాలలో ఇటీవల బయల్పరిచిన కొన్ని గొప్ప హైందవ నగరాలు, “కేవలం ఉజ్జాయింపుగా ఊహించడానికి మాత్రమే వీలయిన యుగానికి మనల్ని తీసుకుపోగల మహత్తర సంస్కృతి కొకదానికి భారత భూమిలో పూర్వ చరిత్ర ఒకటి ఉండి ఉండాలి” అని సాక్ష్యమిస్తున్నాయి (సర్ జాన్ మార్షల్, 'మొహంజో-దారో అండ్ ది ఇండస్ సివిలిజేషన్', 1931). ఈ భూమి మీద, నాగరిక మానవుడికి మహోజ్జ్వలమైన ప్రాచీన చరిత్ర ఉందన్న హిందూవాదం నిజమయినట్లయితే, ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృత భాషే అత్యంత పరిపూర్ణమైన భాష అని చెప్పడానికి వీలవుతుంది. ఏషియాటిక్ సొసైటీ వ్యవస్థాపకుడు సర్ విలియం జోన్స్ ఇలా అంటాడు: “సంస్కృత భాషకి- దాని ప్రాచీనత విషయం ఏమైనా- దానికి అద్భుతమైన ఒక నిర్మాణక్రమముంది; అది గ్రీకు భాష కంటె పరిపూర్ణమైనది. లాటిన్ కంటె విస్తృతమైనది; ఈ రెండిటికంటె ప్రశస్తంగా పరిష్కృతమైనది.” ‘ఎన్ సైక్లో పేడియా అమెరికానా’ అన్న విజ్ఞాన సర్వస్వ గ్రంథ సంపుటంలో ఇలా ఉంది, “ప్రాచీన కావ్యాధ్యయనాన్ని పునరుద్ధరించిన తరవాత, పద్దెనిమిదో శతాబ్ది ఉత్తరభాగంలో, (పాశ్చాత్య పండితులు) సంస్కృత భాషాధ్యయనం ప్రారంభించడాన్ని మించిన ప్రముఖమైన సంఘటన సంస్కృతి చరిత్రలో మరొకటి లేనే లేదు. భాషాశాస్త్రం, తులనాత్మక వ్యాకరణం, తులనాత్మక పురాణ కథాశాస్త్రం, మతశాస్త్రం ... అన్నవాటి ఉనికికే ఆధారభూతమైనది కాని, అధ్యయనం వల్ల వాటిని గాఢంగా ప్రభావితం చేసినది కాని, సంస్కృత భాషావిష్కారమే.”