ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం : 49

1940-1951 మధ్యకాలం

“నిజానికి మేము, ధ్యానం విలువ గ్రహించడమే కాకుండా, మా అంతశ్శాంతిని ఏదీ భంగం చెయ్యజాలదని తెలుసుకున్నాం. గత కొద్ది వారాలుగా, మా ప్రార్థన సమావేశాలు జరుగుతున్న సమయాల్లో, మేము విమాన దాడి హెచ్చరికలు విన్నాం, ఆలస్యంగా పేలే బాంబుల చప్పుళ్ళు ఆలకించాం; అయినప్పటికీ మా విద్యార్థులు సమావేశమయి, చక్కని మా ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా ఆనందిస్తున్నారు.”

ఈ ధైర్య సందేశలేఖ రాసినవారు, లండన్ ఎస్. ఆర్. ఎఫ్. కేంద్రం నాయకుడు. రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించక ముందటి సంవత్సరాల్లో యుద్ధ బీభత్సం చెలరేగుతున్న ఇంగ్లండు నుంచి యూరప్‌దేశాలనుంచి నాకు వచ్చిన అనేక ఉత్తరాల్లో అది ఒకటి. లండన్ నుంచి వెలువడ్డ ప్రాచ్య జ్ఞానగ్రంథమాల (ది విజ్డం ఆఫ్ ది ఈస్ట్ సిరీస్) సంపాదకుడు డా॥ ఎల్. కాన్మర్ - బింగ్ , 1942లో నాకు ఇలా రాశాడు:

“నేను ‘ఈస్ట్-వెస్ట్’ పత్రిక చదివినప్పుడు, మనం, పైకి రెండు భిన్న లోకాల్లో కనిపించేవాటిలో ఉంటూ, ఎంత దూరస్థుల్లా గోచరిస్తూ ఉండేవాళ్ళమో గ్రహించాను. అందం, క్రమం, శాంతి, శుభం నాకు లాస్ ఏంజిలస్ నుంచి సమకూరుతున్నాయి. హోలీ గ్రెయిల్ (పవిత్ర పాన పాత్ర) ఆశీస్సులతోనూ ఉపశమనంతోనూ నిండిన ఓడ, రేవులోకి వచ్చినట్టుగా, ముట్టడిలో చిక్కుకున్న ఈ నగరానికి వచ్చాయి. తాటితోపు, విశాల సాగరసీమలూ, పర్వతదృశ్యాలతో ఎన్సినిటాస్‌లో ఉన్న ఆలయం, వాటినన్నిటిని మించి, ఆ ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావ సంపన్నులైన స్త్రీపురుషుల సౌభ్రాత్రం- ఏకత్వ భావనలో లీనులై, సృజనాత్మక కృషిలో నిమగ్నులై, దైవచింతనలో పరిపూర్ణులైన జనాన్ని - నేను ఒక కలలో మాదిరిగా చూస్తున్నాను... వేకువకోసం వాచ్‌టవర్ మీద కాసుకొని ఉండి ఈ ఉత్తరం రాస్తున్న ఒక సామాన్య సైనికుడు, సత్సంగ సభ్యులందరికీ శుభాకాంక్షలు పంపుచున్నాడు.”

ఎస్. ఆర్. ఎఫ్. కార్యకర్తలు, కాలిఫోర్నియా హాలీవుడ్ లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్ రెలిజియన్స్ (సర్వధర్మ సమన్వయ ఆరాధన మందిరం) ఒకటి నిర్మించి 1942 లో ప్రారంభోత్సవం జరిపారు. తరవాత మరో ఏడాదికి, కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోలో ఒకటి, 1947 లో లాంగ్ బీచ్‌లో ఒకటి ఎస్. ఆర్. ఎఫ్. ఆలయాలు స్థాపించడం జరిగింది.[1]

ప్రపంచంలో అందమైన ప్రదేశాల్లో ఒకటయిన లాస్ ఏంజిలస్‌లోని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో, పుష్పాకీర్ణమైన అద్భుతలోకం ఒకటి, 1949లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు ప్రదానం చెయ్యడం జరిగింది. పన్నెండెకరాల ఆ స్థలం, పచ్చవన్నె కొండలు చుట్టిఉన్న సహజమైన నాట్యరంగస్థలంలా ఉంది. పర్వతశిఖరం మీద నీలకాంతమణి మాదిరిగా ఉన్న విశాలమైన సహజ సరోవరం ఒకటి ఉండడంవల్ల, ఆ సంస్థానానికి ఎస్. ఆర్. ఎఫ్. సరోవరాలయం (లేక్ ష్రైన్) అన్న పేరు వచ్చింది. అక్కడ చిత్రమైన డచ్చి గాలిమరల ఇంట్లో ప్రశాంతమైన ఒక ప్రార్థనాలయం ఉంది; ఒక దిగుదల తోట దగ్గర, పెద్ద నీటిచక్రం ఒకటి నిదానంగా తిరుగుతూ గానంచేస్తూ ఉంటుంది. చైనానుంచి వచ్చిన రెండు పాలరాతి విగ్రహాలు- ఒకటి బుద్ధుడిది, రెండోది క్వాన్ యిన్‌దిన్ (క్వాన్‌యిన్ , జగన్మాతకు చైనావారు కల్పించిన మూర్తి)- ఆ స్థానాన్ని అలంకరించాయి. సౌమ్యమైన ముఖమండలంతో, జీరాడుతున్న బట్టలతో ఉన్న నిలువెత్తు క్రీస్తు విగ్రహం ఒకటి, ఒక జలపాతానికి పైనున్న కొండమీద ఉంటుంది; రాత్రిపూట దానికి బ్రహ్మాండంగా దీపాలంకరణ చేస్తారు. మందిరంలో కృష్ణభగవానుడిదీ ఇతర ప్రవక్తలవీ విగ్రహాలు ఉన్నాయి.

సరోవరాలయం దగ్గర, గాంధీమహాత్ముల ప్రపంచశాంతి స్మారక చిహ్నం (మహాత్మాగాంధీ వరల్డ్ పీస్ మెమోరియల్) ఒకటి 1950 లో, అమెరికాలో ఎస్. ఆర్. ఎఫ్. ముప్ఫయ్యో వార్షికోత్సవ[2] సందర్భంగా ఏర్పాటయింది. భారతదేశం నుంచి పంపిన, గాంధీమహాత్ముల చితాభస్మంలో కొంతభాగం, వెయ్యేళ్ళనాటి ఒక రాతిపెట్టె (sarcophagus) లో భద్రపరచడం జరిగింది.

1951 లో హాలీవుడ్‌లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రం ఒకటి ఏర్పాటయింది. కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్, శ్రీ గుడ్విన్ జె. నైట్, కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా, శ్రీ ఎం. ఆర్. ఆహూజా, నాతోబాటు ప్రారంభోత్సవ ప్రార్థన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ కేంద్రం స్థానంలోనే ‘ఇండియా హాలు’ ఉంది; ఇది 250 మంది కూర్చోడానికి వీలయిన సమావేశ సదనం. వివిధ ఎస్. ఆర్. ఎఫ్. కేంద్రాలకు కొత్తగావచ్చే వాళ్ళు తరచుగా, యోగవిద్యగురించి తదుపరి పరిజ్ఞానం కలిగించమని కోరుతూంటారు. ఒక్కొక్కప్పుడు నాకు ఈ ప్రశ్న వినవస్తూ ఉంటుంది: ‘కొన్ని సంస్థలు నొక్కి వక్కాణిస్తున్నట్టుగా, యోగవిద్య, దగ్గరలో ఉన్న గురువు మార్గదర్శకత్వంలో సాధన చెయ్యవలసిందే తప్ప, అచ్చులో వచ్చింది చదువుకొని సరిగా అధ్యయనం చేసి ఫలితాలు సాధించడానికి వీలు కాదన్నది నిజమేనా?” అని.

అణుయుగంలో, యోగవిద్యను, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల మాదిరి బోధనపద్ధతిలో నేర్పవలసిందే, లేకపోతే విముక్తిదాయకమైన ఆ శాస్త్రం మళ్ళీ, ఎంపికచేసిన కొద్దిమందికే పరిమితమయిపోతుంది. ప్రతి విద్యార్థీ దివ్యజ్ఞానంతో పరిపూర్ణతాసిద్ధి పొందిన ఒక గురువును దగ్గర పెట్టుకుని ఉంటే, నిజంగా అది అమూల్యమైన వరమే; కాని ప్రపంచంలో “పాపులు” చాలామంది, సాధువులు కొద్దిమంది. అటువంటప్పుడు మరి, నిజమైన యోగులు రాసిన బోధనలను తమ ఇళ్ళలో చదువు కోకపోయినట్లయితే, జనబాహుళ్యానికి యోగవిద్య ఎలా సాయపడుతుంది?”

దానికి ప్రత్యామ్నాయమేమిటంటే, “సగటు మనిషి”ని ఉపేక్షించి, అతనికి యోగశాస్త్ర పరిజ్ఞానం కలిగించకుండా వదిలెయ్యడం. నవశకానికి నిర్ణీతమైన దైవప్రణాళిక ఆ మాదిరిది కాదు. చిత్తశుద్ధిగల క్రియాయోగు లందరినీ తమ లక్ష్యసాధనకు చేసే కృషిలో పరిరక్షిస్తూ మార్గదర్శిత్వం వహిస్తూ ఉంటానని బాబాజీ మాట ఇచ్చారు.[3] మానవులు, పరమేశ్వరుని సంతానంగా తమ హోదాను పునఃస్థాపన చేసుకోడానికి సరయిన కృషి చేసినప్పుడు, వాళ్ళకోసం శాంతిసౌభాగ్యాల లోకం కాసుకొని ఉంటుంది; ఆ లోకాన్ని అవతరింపజేయడానికి అవసరమైన క్రియాయోగులు, పదుల్లో కాదు; లక్షల్లో ఉండాలి.

పాశ్చాత్య ప్రపంచంలో సెల్ఫ్ రియలైజేషన్ సంస్థ ఒకటి - “ఆధ్యాత్మిక మధుకోశం” స్థాపించే కర్తవ్యం నాకు విధించినవారు, మా గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారూ, నా పరమేష్ఠి, గురుదేవులు బాబాజీ. ఈ పవిత్ర ధర్మాన్ని సఫలం కావించడంలో కష్టాలు ఎదురుకాక మానవు.

“నిజం చెప్పండి పరమహంసగారూ, కృషి ఫలించిందంటారా?” అంటూ, ఒకనాడు సాయంత్రం, శాన్‌డియాగో ఆలయం నాయకుడైన డా॥ లాయిడ్ కెనెల్, నన్ను టూకీగా ఇలా ప్రశ్నించాడు. ఆయన అడగ దలిచింది ఏమిటో నేను అర్థంచేసుకున్నాను. “మీరు అమెరికాలో హాయిగా ఉన్నారా? యోగవిద్యావ్యాప్తిని అరికట్టాలని చూసే అప్రాజ్ఞులు ప్రచారంచేసే అబద్ధాల మాట ఏమిటి? దిగ్భ్రమలూ , హృదయ వేదనలూ, నడిపించలేని ధ్యానకేంద్రనాయకులూ, బోధనకు అలవికాని విద్యార్థులూ, మాట ఏమిటి?” అని అడుగుతున్నాడన్న మాట.

“దేవుడి పరీక్షకు గురి అయేవాడు ధన్యుడు!” అని జవాబిచ్చాను. “నా మీద బరువు మోపాలని అప్పుడప్పుడు గుర్తుచేసుకుంటూ వచ్చాడాయన.” అప్పుడు నేను విశ్వాసపాత్రులందరినీ, అమెరికా హృదయాన్ని దీపింపజేసే, ప్రేమనూ, భక్తినీ, అవగాహననూ తలుచుకున్నాను. మెల్లగా ఒత్తిపలుకుతూ, నే నింకా ఇలా చెప్పాను: “కాని నా జవాబు, ఔననే; వెయ్యిసార్లు చెబుతాను ఔనని! ఆధ్యాత్మిక బంధమనే ఏకైక శాశ్వత బంధంలో సన్నిహితమై ఉన్న, ప్రాచ్య పాశ్చాత్యఖండాల్ని రెండింటినీ చూడాలని నేను కన్న కలలకన్న కూడా మిన్నగా, నా కృషి ఫలిస్తూ వచ్చింది.”

పాశ్చాత్యదేశాల విషయంలో గాఢమైన ఆసక్తి చూపించిన భారతీయ మహాగురువులు ఆధునిక పరిస్థితుల్ని బాగా అర్థంచేసుకున్నారు. దేశాలన్నిటిలోనూ ప్రాచ్య, పాశ్చాత్యాల విశిష్ట సద్గుణాల సమన్వయం ఇంకా బాగా జరగనిదే, ప్రపంచం మెరుగుపడదని వారికి తెలుసు. ప్రతి భూగోళార్ధానికీ రెండోదాంట్లోని సర్వోత్కృష్ట సంతానం చాలా అవసరం.

ప్రపంచయాత్ర చేసినప్పుడు నేను, ప్రజల బాధల్ని గమనిస్తూ ఎంతో దిగులుపడ్డాను. ప్రాచ్యదేశాల్లో బాధ అన్నది ముఖ్యంగా, భౌతికతలంలోది; పాశ్చాత్యదేశాల్లో అది ముఖ్యంగా ఆధ్యాత్మిక తలంలోది. అసంతులిత నాగరికతల బాధాకరమైన ఫలితాల్ని దేశాలన్నీ అనుభవిస్తున్నాయి.[4] భారతదేశమూ తక్కిన తూర్పుదేశాలూ అమెరికావంటి పడమటి దేశాల లోకవ్యవహార దక్షత అలవరుచుకోవడంవల్ల గొప్పగా లాభం పొందగలవు. అందుకు భిన్నంగా, పాశ్చాత్యులు, జీవితానికున్న ఆధ్యాత్మిక ప్రాతిపదికను, ముఖ్యంగా మానవుడికి దేవుడితో స్పృహతో కూడిన ఐక్యానుసంధానం జరగడంకోసం పురాతనకాలంలో భారతదేశం రూపొందించిన శాస్త్రీయపద్ధతుల్ని గాఢంగా అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది.

సర్వసమగ్ర నాగరికత అనే ఆదర్శం అపోహ ఏమీ కాదు. అనేక వేల సంవత్సరాలపాటు భారతదేశం, ఆధ్యాత్మిక తేజస్సుకూ విస్తారమైన భౌతిక సంపత్తికి కాణాచిగా ఉండేది. భారతదేశం సుదీర్ఘ చరిత్రలో, గత 200 సంవత్సరాల పేదరికమూ కర్మానుసారంగా కలిగిన తాత్కాలిక అవస్థ. “భారతదేశ సంపదలు” అన్నది,[5] శతాబ్దాల తరబడిగా ప్రపం చంలో వినవస్తున్న నానుడి. సమృద్ధి అన్నది- భౌతికమూ ఆధ్యాత్మికమూ కూడా- విశ్వధర్మం లేదా సహజ ఋజువర్తన అనే ఋతానికి ప్రత్యక్షాభివ్యక్తి. దైవానికికాని, సుసంపన్నమైన ప్రకృతి అనే, ఆయన దృగ్విషయ దేవతకుకాని పిసినారితనం లేదు. పారంపర్యంగా వచ్చే ప్రతి జన్మలోనూ మానవుడు, భౌతిక పరిస్థితుల ద్వారానూ వాటిమీద ఆధిపత్యం ద్వారానూ పరమాత్మను అభివ్యక్తం చెయ్యడానికి వీలయిన అనంతమైన మార్గాల్ని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోడానికని ఈ భూమికి ఆకృష్టుడయాడని హిందూ పవిత్రగ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి. ప్రాచ్యపాశ్చాత్యాలు రెండూ ఈ మహాసత్యాన్ని వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్నాయి; తాము కనిపెట్టిన వాటిని అవి ఒకదానితో ఒకటి సంతోషంగా పంచుకోవాలి. భగవంతుడికి భూమిమీద గల తన సంతానం – దారిద్ర్యం, రోగం, ఆత్మజ్ఞానరాహిత్యం లేని ప్రపంచ నాగరికతను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటే సంతోషంగా ఉంటుందన్న విషయంలో సందేహానికి తావు లేదు. మానవుడికి తన ఆత్మశక్తుల విషయంలో ఏర్పడ్డ మరుపే (తన స్వతంత్రేచ్ఛను[6] దుర్వినియోగం చేసినందువల్ల కలిగిన ఫలితం) ఇతర రకాల బాధలన్నిటికీ మూలకారణం. “సమాజం“” అనే మానవత్వారోపితమైన ఊహకు వర్తింప


. జేసిన చెడులను ప్రతి మానవుడి[7] లోనూ వాస్తవికంగా చూపించవచ్చు. ఆదర్శరాజ్యం (Utopia) అనేది పౌర సద్గుణంతో పుష్పించే ముందు ప్రతి హృదయంలోనూ మొలకెత్తాలి. ఆంతరిక సంస్కరణలు సహజంగా బాహ్యమైన వాటికి దారి తీస్తాయి. తనను తాను సంస్కరించుకున్న వాడు వేలాది జనాన్ని సంస్కరిస్తాడు.

మానవుడికి ఊర్ధ్వగతికి ఉత్ప్రేరణ కలిగిస్తూ, కాలపరీక్షకు నిలిచి ఉన్న ప్రపంచ పవిత్ర గ్రంథాలన్నిటి సారమూ ఒక్కటే. నా జీవితంలో అన్నిటికన్న ఆనందంగా గడిపిన కాలాల్లో ఒకటి, బైబిలు కొత్త నిబంధన గ్రంథంలో కొంత భాగానికి, “సెల్ఫ్ రియలైజేషన్” కోసం నేను నా వ్యాఖ్యానం చెబుతూ రాయించడంలో గడించింది. ఇరవై శతాబ్దాల పాటు హానికరమైన అపార్థానికి గురిఅయిన క్రీస్తు మాటల్లో అనేకమైనవాటి నిజమైన అర్థాల్ని తరచి చూడ్డంలో, నాకు దారి చూపించమని ఆయన్ని గాఢంగా ప్రార్థించాను.

ఒకనాడు రాత్రి, నేను మౌనప్రార్థనలో మునిగి ఉన్నాను. ఎన్సినిటాస్ ఆశ్రమంలో నేను కూర్చునే గది, ఇంద్రనీలమణి కాంతితో నిండిపోతూ వచ్చింది. పుణ్యమూర్తి ఏసుప్రభువు తేజోమయరూపాన్ని దర్శిం చాను. ఆయన, పలచని గడ్డంతో, మీసకట్టుతో, సుమారు పాతికేళ్ళ యువకుడిలా కనిపించాడు; మధ్యలో పాపిడి తీసిఉన్న పొడుగాటి జుట్టుకు వెనక, ధగధగ మెరిసే బంగారువన్నె తేజఃప్రభ ఏర్పడి ఉంది.

ఆయన నేత్రాలు శాశ్వత అద్భుతకాంతితో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్నాయి; నేను చూస్తూ ఉండగానే అవి అనంతరీతులుగా మారిపోతున్నాయి. ఆయన అభివ్యక్తిలో ప్రతి ఒక్క దివ్యపరిణామంతో, ఆయన అందించిన జ్ఞానాన్ని నేను, సహజావబోధం ద్వారా అవగాహన చేసుకున్నాను. ఆయన భవ్యదృష్టిలో, అనేకకోట్ల లోకాల్ని భరించే శక్తి నాకు అనుభూతమయింది. ఆయన నోటిదగ్గర ఒక పవిత్ర పానపాత్ర (Holy Grail) ప్రత్యక్షమయింది; అది కిందికి దిగుతూ నా పెదవుల దగ్గరికి వచ్చి, మళ్ళీ తిరిగి ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది. కొన్ని క్షణాల తరవాత ఆయన మధురమైన వాక్కులు పలికారు; అవి, నా గుండెలోనే పదిలపరుచుకోవలసినంత వ్యక్తిగతమైనవి.

1950 లోనూ 1951 లోనూ నేను, కాలిఫోర్నియాలో మొజావే ఎడారి దగ్గర ఉన్న, ఎస్. ఆర్. ఎఫ్. ఆశ్రమంలో చాలాకాలం గడిపాను. అక్కడే నేను, భగవద్గీత అనువాదం చేసి, యోగంలో వివిధ మార్గాల్ని చూపించే వివరమైన వ్యాఖ్యానం[8] ఒకటి రాశాను. భారతదేశపు పవిత్ర గ్రంథాల్లోకల్లా సర్వోత్కృష్టమైన ఈ మహా గ్రంథం, ఒక యోగప్రక్రియను (భగవద్గీతలో చెప్పిన ఒకే ఒకటి; దాన్నే బాబాజీ సులువుగా ‘క్రియాయోగం’ అన్నారు), కంఠోక్తిగా రెండు[9]సార్లు ప్రస్తావిస్తూ, ఆచరణ సాధ్యమూ నీతిపరమూ అయిన ఉద్బోధను ప్రసాదించింది. మన స్వప్నలోక మహాసాగరంలో ఊపిరి అనేది, మానవరూపాలూ తదితర భౌతిక వస్తురూపాలూ అనే వైయక్తిక తరంగాల చైతన్యాన్ని ఉత్పాదించే ఒక విశిష్ట మాయామేయ ఝంఝు. మానవుణ్ణి, తన ప్రత్యేక అస్తిత్వమనే బాధాకరమైన స్వప్నంలోంచి మేల్కొలపాలంటే కేవలం తాత్త్విక, నైతిక జ్ఞానం ఒక్కటి చాలదని తెలుసుకొని, కృష్ణభగవానుడు, యోగి తన శరీరాన్ని స్వాధీనంచేసుకొని ఇచ్ఛానుసారంగా, శుద్ధశక్తిగా మార్చడానికి వీలయిన పవిత్రశాస్త్రాన్ని ఉపదేశించాడు. ఈ అద్భుత యోగశక్తి సామర్థ్య నిరూపణావకాశం, అణుయుగానికి మార్గదర్శులైన ఆధునికశాస్త్రవేత్తల సైద్ధాంతికావగాహనకు అతీతమైనదేమీ కాదు. అన్ని రకాల పదార్థమూ శక్తిగా మార్చడానికి వీలయినదని రుజువయింది.

మానవజాతి సర్వసాధారణంగా ఆశించదగింది కాబట్టి, హిందూ పవిత్ర గ్రంథాలు, యోగశాస్త్రాన్ని కీర్తించాయి. దైవభక్తిలో అతీంద్రియ శక్తులు పొందిన, హిందువులుకాని మార్మికయోగుల విషయంలో మాదిరిగా, ఔపచారిక (formal) యోగపద్ధతులేవీ ఉపయోగించకపోయినప్పటికీ శ్వాసరహస్యం అప్పుడప్పుడు వెల్లడి అవుతూ వచ్చింది; ఇది నిజం. క్రైస్తవ, ముస్లిం మతాలవంటి ఇతర మతాల అనుయాయులైన సాధువులు కొందరు ఊపిరిలేకుండా, కదలికలేకుండా సమాధి (సవికల్ప సమాధి)[10] స్థితిలో ఉండగా, నిజంగా గమనించడం జరిగింది. ఆ స్థితి రానిదే ఏ ఒక్కడూ, దైవసాక్షాత్కార సాధనలో ప్రథమ దశలలోకి ప్రవేశించలేడు. (అయితే సాధువు, అత్యున్నతమైన ‘నిర్వికల్ప సమాధి’కి చేరిన తరవాత మాత్రం, అతడిక తిరుగులేకుండా ఈశ్వరుడిలో ప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడు ఊపిరి తీసుకోకపోయినా, తీసుకుంటున్నా, నిశ్చలంగా ఉన్నా, పనిచేస్తున్నా సరే).

బ్రదర్ లారెన్స్ అనే 17 శతాబ్ది క్రైస్తవ మార్మికుడు, ఒక చెట్టును చూస్తూండడంవల్ల తనకు, దైవసాక్షాత్కారంలో తొలి అనుభూతి కలిగిందని చెప్పాడు. దాదాపు మనుషులందరూ చెట్టును చూసినవాళ్ళే; కాని కొద్దిమందే, చెట్టుద్వారా, చెట్టును సృష్టించినవాణ్ణి దర్శించారు. చాలామంది, నిర్ని రోధమైన భక్తిశక్తుల్ని ఆవాహన చెయ్యడంలో బొత్తిగా పనికిరానివాళ్ళు; కాని ప్రాచ్యదేశాల్లోనయితే నేమి, పాశ్చాత్యదేశాల్లో నయితే నేమి, అన్ని మతమార్గాల్లోనూ కనిపించే కొద్దిమంది ‘ఏకాంతు’లకు – అంటే, ఏకైక హృదయాభిలాషగల సాధువులకు మాత్రమే ఆ శక్తి అప్రయత్నంగా అలవడింది. అయినప్పటికీ సామాన్య మానవుడికి[11] దైవానుసంధానావకాశం లేకుండా చెయ్యలేదన్న మాట. ఆత్మస్మరణకు అతనికి కావలసినవల్లా, క్రియాయోగ ప్రక్రియా, నిత్యజీవితంలో నైతిక నియమపాలనా, “ఈశ్వరా, నిన్ను తెలుసుకోడానికి తపించిపోతున్నాను!” అంటూ, చిత్తశుద్ధితో మొరపెట్టుకోగల సామర్థ్యమూ.

సగటు మనిషి తన భావావేశ పరిధికి బాహ్యంగా ఉంటాడు కాబట్టి దేవుణ్ణి భక్తి ప్రపత్తుల ద్వారా చేరడానికి ప్రయత్నించడం కంటె, ప్రతి రోజూ సాధన చెయ్యడానికి వీలయిన ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా చేరడానికి ప్రయత్నించడం మేలని యోగవిద్య తెలుపుతుంది. అందువల్ల దీనికి, విశ్వజనీనమైన ఆకర్షణ ఉంది.

భారతదేశంలో గొప్ప జైనగురువుల్ని “తీర్థంకరులు” (మార్గ దర్శులు) అంటారు; అలా అనడానికి కారణం, దిగ్భ్రమలో మునిగి ఉన్న మానవజాతి, సంసార కర్మ చక్రభ్రమణంలో జననమరణాల పునరావృత్తి అనే తుఫాను సముద్రాల్ని దాటిపోవడానికి వీలయిన దారిని వాళ్ళు చూపిస్తారు కనక. సంసారం (అంటే, దృగ్విషయిక ప్రవాహంలో “ప్రవహిస్తున్న”), కనీస నిరోధమార్గాన్ని అనుసరించడానికి మనిషిని ప్రేరేపిస్తుంది. “కాబట్టి ప్రపంచానికి స్నేహితుడైనవాడల్లా దేవుడికి శత్రువు.”[12] దేవుడికి స్నేహితుడవాలంటే మానవుడు, ప్రాపంచిక మాయాజాలాల్లో, తనలో ఎప్పుడూ దౌర్బల్యానికి దోహదంచేసే దుష్కర్మ ఫలాల్ని తప్పకుండా జయించాలి. కఠోర కర్మసూత్రాన్ని గురించిన జ్ఞానం, దాని బంధాలనుంచి విడివడి, చరమ విముక్తికి మార్గం కనుక్కోడానికి చిత్తశుద్ధితో అన్వేషించేవాణ్ణి ప్రోత్సహిస్తుంది. మానవుల కర్మ దాస్యం, మాయవల్ల అంధకారమయమైన ముషస్సుల్లోని కోరికల్లో సాధు కొని ఉంది కాబట్టి, యోగి ప్రమేయం పెట్టుకునేది మనోనిగ్రహంతోనే.[13] కర్మసంబంధమైన అజ్ఞానం తాలూకు వివిధకోశాల్ని విసర్జించిన తరవాత మానవుడు, తనను స్వస్వరూపంలో దర్శిస్తాడు.

భూమిమీద మానవుడి మజిలీకి ఏకెక ప్రయోజనం జీవన్మరణాల నిగూఢ రహస్యాన్ని ఛేదించడమే; ఈ నిగూఢ రహస్యం, శ్వాసతో గట్టిగా ముడిపడి ఉంది. ఊపిరి లేకపోవడమంటే, చావు లేకపోవడం, ఈ సత్యాన్ని తెలుసుకొని, భారతదేశపు సనాతన ఋషులు ఊపిరికి ఏకైక కీలకాన్ని కనిపెట్టి, ఊపిరిలేకుండా ఉండడానికి సంబంధించిన సునిశిత, సహేతుక శాస్త్రం ఒకటి రూపొందించారు.

ప్రపంచానికి అందించడానికి భారతదేశం దగ్గర మరేదీ లేకపోయినా రాజోచితంగా ఇయ్యగల ‘క్రియాయోగం’ ఒక్కటే చాలు.

శరీరానికి ఆత్మకూ మధ్య సూక్ష్మమైన లంకెగా పనిచేయడానికి. దేవుడు ఊపిరిని కల్పించాడన్న సంగతి హిబ్రూ ప్రవక్తలకు బాగా తెలుసన్న విషయాన్ని వెల్లడించే ఘట్టాలు కొన్ని బైబిలులో ఉన్నాయి. ‘జెనిసిస్’ లో ఇలా ఉంది: “ప్రభువైన దేవుడు నేలమీది మట్టిలోంచి మనిషిని చేసి అతని ముక్కుల్లోకి ప్రాణవాయువు ఊదాడు. అప్పుడు మనిషి, జీవించే ఆత్మ అయాడు.[14] మానవశరీరం, “నేలమీది మట్టి”లో కూడా కనిపించే రసాయనిక, ఖనిజ పదార్థాలతో ఏర్పడినది. అజ్ఞాన మానవుల్లో, ఊపిరి (వాయురూపశక్తి) ద్వారా శరీరానికి ఆత్మ ప్రసరణ చేసే ప్రాణశక్తి ప్రవాహాలే కనక లేకపోయినట్లయితే, రక్తమాంసాలు గల మానవదేహం, తన కార్యకలాపాల్ని ఎన్నడూ కొనసాగించగలిగి ఉండేది కాదు; శక్తినీ చలనాన్నీ ప్రదర్శించగలిగీ ఉండేది కాదు. మానవ శరీరంలో పంచప్రాణాలుగా, అంటే సూక్ష్మ ప్రాణశక్తులుగా పనిచేసే ప్రాణశక్తి ప్రవాహాలు సర్వవ్యాప్తమయిన ఆత్మతాలూకు ఓంకార స్పందనకు అభివ్యక్తులు.

ఆత్మ అనే మూలస్రోతస్సు నుంచి వెలువడి మాంసకణాల్లో ప్రకాశించే ప్రాణం ప్రతిబింబం, లేదా సత్యాభాసం ఒక్కటే, మానవుడికి తన శరీరంతో అనుబంధం ఉండడానికి కారణం; సహజంగా అతడు ఒక మట్టిముద్దకు ఆదరపూర్వకంగా నివాళి అర్పించలేడు. ఎవరయినా ఒకరు తన భౌతికరూపమే తానని తప్పుగా గుర్తిస్తున్నారంటే, దానికి కారణం, ఆత్మనుంచి వచ్చే ప్రాణశక్తి ప్రవాహాలు - మానవుడు కార్యాన్నే (ఫలితాన్నే) కారణంగా అపార్థంచేసుకునేటంత గాఢమైన శక్తితో, ఊపిరిద్వారా మాంసంలోకి ప్రవేశించడం. శరీరానికి సొంత ప్రాణం ఒకటి ఉందని దేహారాధనపరత్వంతో ఊహించడం.

మానవుడి చేతనస్థితి, శరీర శ్వాసల స్పృహ. నిద్రలో చురుకుగా ఉండే అతని అవచేతనస్థితి, శరీర శ్వాసలనుంచి మానసికంగానూ తాత్కాలికంగానూ కలిగే వేర్పాటుతో ముడిపడి ఉన్నది. “మనుగడ” అనేది శరీరంమీదా శ్వాసమీదా ఆధారపడి ఉందన్న భ్రాంతినుంచి విముక్తి పొందినది అతని అధిచేతన స్థితి.[15] దేవుడు ఊపిరిలేకుండానే జీవిస్తాడు; అతని రూపంలోనే తయారైన ఆత్మ, ఊపిరిలేని స్థితిలోనే మొట్టమొదటి సారిగా తన ఉనికిని తాను తెలుసుకుంటుంది.

పరిణామాత్మక కర్మవల్ల ఆత్మకూ శరీరానికి ఉన్న ఊపిరి లంకెను తెంపినప్పుడు “చావు” అనే హఠాత్పరిణామం సంభవిస్తుంది. భౌతిక కణాలు వాటికి సహజమైన శక్తిహీనతను తిరిగి పొందుతాయి. అయితే క్రియాయోగికి ఈ ఊపిరి లంకె, కర్మఫలావశ్యకమైన కఠోర ప్రమేయంవల్ల కాకుండా, శాస్త్రీయవిజ్ఞానంవల్ల ఇచ్ఛానుసారంగా విడివడుతుంది. యథార్థ అనుభవం ద్వారా యోగి, సారభూతమైన తన అశరీరత్వాన్ని ముందే ఎరిగి ఉంటాడు; భౌతికదేహం మీద భరోసా ఉంచమన్న దుర్బోధ మనిషి చెవిని పడిందంటూ మృత్యుదేవత వేలెత్తి చూపడం, అతని విషయంలో జరగదు. జన్మ తరవాత జన్మ చొప్పున ప్రతి మనిషి తన దైవత్వ లక్ష్యం వేపు సాగుతూనే ఉంటాడు. (ఆతని నడక ఎంత అడ్డాదిడ్డిగా ఉన్నా అతని పద్ధతిలో అతను నడుస్తాడు). మానవుడి పురోగతిలో ఆటంకం కానటువంటి మృత్యువు, అతడు తన మాలిన్యాన్ని క్షాళనం చేసుకోడానికి వీలయిన సూక్ష్మలోకపు అనుకూలతరమైన పరిసరాన్ని అతనికి సమకూరుస్తుంది. “మీ గుండెలో గాభరా కలగనివ్వకండి... నా తండ్రి ఇంట్లో చాలా భవనాలున్నాయి.”[16] ఈ లోకాన్నికాని పరలోకాన్నికాని, వ్యవస్థీకరించడంలో భగవంతుడు తన ప్రతిభను వ్యయం చేసేసుకోడానికి అవకాశం లేదు; వీణలు మీటడానికి మించి, మనలో ఆసక్తి పెరగడానికి ఆయన మరేమీ ప్రస్తావించడు.

మరణం అనేది మనుగడను మట్టుపెట్టేదీ జీవితం నుంచి చరమ పలాయనమూ కాదు; అమరత్వానికి ద్వారమూ కాదు. ప్రాపంచిక సుఖాల్లో మునిగి తన ఆత్మనుంచి పలాయనమైనవాడు, సూక్ష్మలోకపు సూక్ష్మాకర్షణల మధ్య దాన్ని తిరిగి వశం చేసుకోలేడు. అక్కడతడు కేవలం సూక్ష్మతర అనుభూతులనూ, మౌలికంగా ఏకైకమయిన సుందర శివాల ఇతోధిక సంవేదనశీలమైన అనుభవాల్నీ కూడబెట్టుకుంటాడు. సంఘర్షించే ఆ మానవుడు, ఈ స్థూలప్రపంచమనే దాగర మీదే, ఆధ్యాత్మిక అభిన్నత అనే అక్షయ సువర్ణాన్ని సుత్తితో సాగగొట్టాలి. దురాశా పూరితమైన మృత్యువుకు స్వీకారయోగ్యమూ ఏకైక బహూకృతీ అయిన- కష్టపడి సంపాదించిన బంగారు నిధిని చేతబెట్టుకొని మానవుడు, భౌతిక పునర్జన్మల ఆవృత్తులనుంచి చరమ విముక్తి సాధిస్తాడు.

చాలాకాలంపాటు నేను పతంజలి యోగసూత్రాలనూ, హిందూదర్శన శాస్త్రానికి సంబంధించిన గూడార్థమయమైన ఇతర గ్రంథాలనూ బోధించడానికి, ఎన్సినిటాస్‌లోనూ లాస్ ఏంజిలస్‌లోనూ తరగతులు నిర్వహించాను.

“దేవుడసలు ఆత్మనూ శరీరాన్నీ ఎందుకు కలపాలి?” అంటూ ఒకనాడు సాయంత్రం, తరగతిలో ఒక విద్యార్థి అడిగాడు. “సృష్టి అనే పరిణామశీలమైన నాటకానికి నాంది పలకడంలో ఆయన ఉద్దేశించిన ప్రయోజనం ఏమిటి?” అనేకమంది ఇతరులు కూడా అలాటి ప్రశ్నలు వేశారు; వాటికి పూర్తిగా సమాధానాలు చెప్పడానికి తత్త్వవేత్తలు ప్రయత్నించి విఫలులయారు.

“కొన్ని రహస్యాల్ని అనంతకాలంలో ఛేదించడానికి వదిలి పెట్టు,” అంటూండేవారు శ్రీయుక్తేశ్వర్‌గారు, చిరునవ్వు నవ్వుతూ. “మానవుడి పరిమిత తార్కికశక్తులు, ఎవరివల్లా సృష్టికాని (స్వయంభువు) కేవల పరబ్రహ్మకు గల అనూహ్యమైన ఉద్దేశాల్ని ఎలా అవగాహన చేసుకో గలుగుతాయి?[17] దృశ్య జగత్తులో కార్యకారణ నియమంచేత బద్ధుడైన మానవుడిలో ఉన్న వివేకశక్తి, ఆద్యంతరహితుడూ కారణరహితుడూ అయిన దేవుడి చిక్కుముడిని చూసి గాభరాపడుతుంది. మానవుడి వివేకం సృష్టి రహస్యాల్ని భేదించలేకపోయినప్పటికీ భగవంతుడే భక్తుడికోసం, ప్రతి రహస్యాన్నీ చివరికి వెల్లడి చేస్తాడు.”

జ్ఞానంకోసం చిత్తశుద్ధితో తపన చెందేవాడు, దైవపథకంలోని ఓనమాలు కొన్ని సవినయంగా సాధనచేస్తూ అన్వేషణ ప్రారంభిస్తాడు; అంతేకాని జీవితంలోని “ఐన్‌స్టైన్ సిద్ధాంతం” తాలూకు సునిశిత గణిత రేఖాచిత్రం తనకు కావాలని ముందే కోరడు.

“మానవుడెవడూ (అంటే, కాలం అనే మాయ[18]కు సంబంధించిన సాపేక్షతలు గల మర్త్యుడెవడూ), ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు; పరమపిత హృదయస్థానంలో ఉన్న ఏకైక ఔరసపుత్రుడు (అంటే, ఓంకార స్పందన ద్వారా భౌతిక దృగ్విషయాల్ని అన్నిటినీ నడిపించే ప్రతిబింబిత కూటస్థ చైతన్యం, లేదా బహిర్ముఖంగా ప్రక్షేపించిన పూర్ణసిద్ధ జ్ఞానం, ఏకత్వ వైవిధ్యాన్ని వ్యక్తీకరించడానికి ‘హృదయస్థానం’ నుంచి లేదా అస్పష్టదైవం అగాధాల్లోంచి వెలువరిచినటువంటిది) ఆయన ఉనికిని ప్రకటించాడు” (రూపొందించాడు, లేదా సాక్షాత్కరింపజేశాడు).[19]

“నిజంగా, నిజంగా చెబుతున్నాను మీకు,” అంటూ వివరించాడు ఏసుక్రీస్తు, “తండ్రి చేస్తుండగా చూస్తున్నది తప్ప కొడుకు తనంతట తాను ఏమీ చెయ్యలేడు; ఆయన చేసేది ఏదయినాసరే కొడుకు కూడా చేస్తాడు (కనక).”[20]

దృగ్విషయిక లోకాల్లో దేవుడు తనంతట తానుగా ప్రదర్శించే త్రిగుణాత్మక ప్రకృతిని హిందూ పవిత్ర గ్రంథాల్లో ప్రతీకాత్మకంగా చెప్పడం జరిగింది- సృష్టికర్తగా బ్రహ్మ, స్థితికారకుడుగా విష్ణువు, లయకారకుడుగా శివుడు. ఈ మూర్తిత్రయం కార్యకలాపాలు స్పందనశీల సృష్టి అంతటా అనంతంగా ప్రకటితమవుతూనే ఉన్నాయి. కేవల పరబ్రహ్మ మానవుడి మనోగోచర శక్తులకు అతీతమైంది కనక, నైష్ఠిక హిందువు ఆయన్ని త్రిమూర్తుల పావనరూపాల్లో ఆరాధిస్తాడు.[21]

అయితే భగవంతుడి విశ్వ సృష్టి - స్థితి - లయ కారక స్వరూపం ఆయన పరమావస్థ కాని, కనీసం ఆయన మూలప్రకృతికాని కాదు (ఎంచే తంటే, సృష్టి అన్నది ఆయన లీల, సృజనశీల క్రీడ).[22] నియమబద్ధమైన అణుప్రవాహంలో వ్యక్తమయిన ఆయన బాహ్యప్రకృతి, ఆయన్ని బయల్పరచకుండా కేవలం వ్యక్తీకరించడం మట్టుకే చేస్తుంది కనక, త్రిమూర్తుల రహస్యాలనన్నిటినీ గ్రహించినప్పటికీ కూడా, ఆయన అంతర్నిగూఢ మూలస్వరూపాన్ని అవగాహన చేసుకోడం సాధ్యం కాదు. “కొడుకు తండ్రి దగ్గరికి చేరినప్పుడే”[23] ఈశ్వరుడి చరమ ప్రకృతి తెలుస్తుంది. విముక్త మానవుడు స్పందనశీల లోకాల్ని అధిగమించి స్పందన రహిత మూలతత్త్వంలోకి ప్రవేశిస్తాడు.

పరమ రహస్యాల్ని వెల్లడిచెయ్యమని కోరినప్పుడు గొప్ప ప్రవక్తలందరూ మౌనం వహించారు. “సత్యమంటే ఏమిటి?” అని పిలేట్ అడిగినప్పుడు, క్రీస్తు జవాబు చెప్పలేదు. పిలేట్ లాంటి బుద్ధివాదులు ఆడంబరంగా వేసే పెద్దపెద్ద ప్రశ్నలు, తీవ్రమైన జిజ్ఞాసతో వేసినవి కావడం అరుదు. అలాటి వ్యక్తులు సాధారణంగా, ఆధ్యాత్మికమైన విలువల[24] గురించి దృఢవిశ్వాసం లేకపోవడమన్నది. “నిష్కపట మనస్తత్త్వానికి” గుర్తుగా పనికిమాలిన పొగరుబోతుతనంతో మాట్లాడుతూ ఉంటారు.

“సత్యానికి సాక్షిని కావాలన్న ధ్యేయంతోనే నేను పుట్టాను; ఈ కారణంవల్లే నే నీ లోకంలోకి వచ్చాను. సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడూ నా స్వరం వింటాడు.”[25] ఈ మాటల్లో క్రీస్తు ఎంతెంతో ఇమిడ్చి చెప్పాడు. దేవుడి పుత్రుడు కేవలం ‘తన జీవితం’ వల్ల “సాక్షిగా నిలుస్తాడు.” అతడు సత్యరూపుడవుతాడు; అతడు దాన్ని కూడా వివరించడానికి పూనుకుంటే, అది ఉదారంగా చేసిన అత్యుక్తి అవుతుంది.

సత్యమన్నది ఒక సిద్ధాంతం కాదు, తత్త్వశాస్త్రంలో ఉన్న చింతనా విధానం కాదు, బుద్ధిపరమైన అంతర్‌జ్ఞానమూ కాదు. సత్యమనేది, వాస్తవానికి కచ్చితమైన అనురూపం. మానవుడి దృష్టిలో, సత్యం, ఆత్మరూపమైన తన వాస్తవ ప్రకృతిని గురించిన అచంచల జ్ఞానం. ఏసుక్రీస్తు, తన జీవితంలో ప్రతి చర్య ద్వారా, ప్రతి మాట ద్వారా, తన అస్థిత్వ సత్యాన్ని ఈశ్వరుడే తనకు మూలమన్న సంగతి మనకు తెలుసునని నిరూపించాడు. తనను సర్వవ్యాప్తమైన కూటస్థ చైతన్యంగా పూర్తిగా గుర్తించుకొన్న అతడు, సులువుగా తుదిపలుకుగా ఇలా చెప్పాడు; “సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడూ నా స్వరం వింటాడు.” అని.

బుద్ధుడు కూడా అధిభౌతిక పరమతత్త్వాల్ని వివరించడానికి నిరాకరించాడు; భూమిమీద మానవుడికున్న కొద్ది క్షణాలనూ, నైతిక ప్రకృతిలో పరిపూర్ణత సాధించడానికి వినియోగించడం మంచిదని పొడిమాటల్లో చెప్పాడు. చైనాదేశపు మార్మికుడు లావో-ట్జు సరిగా చెప్పాడు. “తెలిసినవాడు దాన్ని చెప్పడు; చెప్పినవాడికి అది తెలిసి ఉండదు.” భగవంతుడి చరమరహస్యాలు “చర్చకు పెట్టడానికి వీలయిన” విషయాలు కావు. ఆయన గూఢ సంకేతలిపిని అర్థం చేసుకోడమన్నది, మనిషి మరో మనిషికి నేర్పలేని కళ; ఇక్కడ దేవుడొక్కడే గురువు. “నిశ్చలంగా ఉండి, నేను దేవుణ్ణని తెలుసుకో.”[26] ఈశ్వరుడి సర్వవ్యాపిత్వాన్ని ఎన్నడూ కాదనకుండా, ఆయన పలుకులను గంభీర మౌనస్థితుల్లోనే మనం వినగలం. సృజనాత్మక ఓంకార స్పందన విశ్వమంతటా ప్రతిధ్వనించే అది నాదబ్రహ్మం. తనతో అనుసంధానం పొందిఉన్న భక్తుడికోసం, గ్రహణానుకూలమయిన పదాలుగా, అప్పటికప్పుడు మార్పుచెందుతుంది.

మానవ హేతుబుద్ధి గ్రహించుకోగలిగినంతవరకు, సృష్టికి గల దివ్యప్రయోజనాన్ని వేదాల్లో వివరించడం జరిగింది. ప్రతి మనిషి ఆత్మగా, భగవంతుడు సృష్టించినవాడేననీ, ఆ ఆత్మ తన కేవల వ్యక్తిత్వాన్ని తిరిగి పొందేముందు, అనంతత్వానికున్న ఒకానొక ప్రత్యేక లక్షణాన్ని విశిష్టంగా అభివ్యక్తం చేస్తుందనీ ఋషులు చెప్పారు. ఆ విధంగా దివ్య వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక యథార్థం ప్రాప్తించిన మానవులందరూ దేవుడికి సమాన ప్రీతిపాత్రులు.

ప్రపంచదేశాలకు పెద్దన్న అయిన భారతదేశం ప్రోదిచేసుకున్న జ్ఞానం సర్వమానవాళికీ చెందే వారసత్వం. యావత్ సత్యం లాగే వైదిక సత్యం, భగవంతుడిదే కాని, భారతదేశానిది కాదు. వేదాల దివ్యగంభీర సత్యాల్ని గ్రహించుకోగల పరిశుద్ధ పాత్రలవంటి మనస్సులుగల మహా ఋషులు, ఈ భూమిమీద పుట్టిన మానవజాతి సభ్యులేకానీ, సర్వమానవాళికీ సేవచేయడానికి మరో లోకంలో ఎక్కడో పుట్టినవాళ్ళేమీ కారు. సత్యనిష్ఠమైన లోకంలో జాతినిబట్టి కాని, దేశాన్నిబట్టి కాని చూపించే భేద భావాలు అర్థంలేనివి; అక్కడ కావలసిన ఏకైక యోగ్యత, దాన్ని అందుకోడానికి ఆధ్యాత్మిక అర్హత మాత్రమే.

దేవుడంటే ప్రేమ, సృష్టికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక ప్రేమ లోనే పాదుకోగలదు. ఆ చిన్న ఆలోచన, పాండిత్యమండితమైన తర్క వితర్కాలకన్న ఎక్కువగా మానవ హృదయానికి ఊరట కలిగించడం లేదూ? ప్రతి సాధువూ సత్యగర్భంలోకి చొచ్చుకుపోయి దివ్యమైన విశ్వ ప్రణాళిక ఒకటి ఉంటుందనీ అది సుందరమైనదనీ ఆనందమయమయినదీ ద్రువపరుస్తాడు. దేవుడు తన ఉద్దేశాల్ని యెషయా ప్రవక్తకు ఈ మాటల్లో చెప్పాడు:

“నా నోటినుంచి వెలువడ్డ మాట (సృజనాత్మకమైన ఓంకార నాదం) నా దగ్గరికి వృథాగా తిరిగి రాదు; నేను ఆశించినది చేస్తుందది. నేను దాన్ని దేంట్లోకి పంపితే, అది వర్ధిల్లుతుంది. అతడు ఆనందంగా బయటికి వెళ్తాడు. అతన్ని శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది. కొండలూ గుట్టలూ నీ ముందు విరిగిపడుతూ గానం చేస్తాయి; భూమి మీది చెట్లన్నీ చప్పట్లు కొడతాయి.”[27]

“నువ్వు ఆనందంగా బయటికి వెళ్ళాలి, నిన్ను శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది.” కష్టజీవులైన ఇరవయ్యో శతాబ్ది మనుషులు ఆ అద్భుత వాగ్దానాన్ని ప్రగాఢమైన ఆకాంక్షతో వింటారు. దాంట్లో ఉన్న సంపూర్ణ సత్యం, దివ్య ఔరసత్వాన్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోడానికి దృఢసంకల్పంతో శ్రమించే ప్రతి దైవభక్తుడూ సాక్షాత్కరింప జేసుకోగలిగింది.

ప్రాచ్యపాశ్చాత్యదేశాల్లో క్రియాయోగం నిర్వహించే పాత్ర ఇప్పుడిప్పుడే మొదలయింది. [మానవ దైన్యాన్ని అంతనూ జయించడానికి నిర్దిష్టమైన, శాస్త్రీయమైన ఆత్మసాక్షాత్కార సాధన ప్రక్రియ ఒకటి ఉందని మానవులందరూ తెలుసుకోవాలి! ధగధగ మెరిసే రత్నాల మాదిరిగా భూమి అంతటా వ్యాపించి ఉన్న వేలాది మంది క్రియాయోగులకు ప్రేమపూర్వకమైన భావతరంగాల్ని ప్రసారం చేస్తూ, కృతజ్ఞతతో నేను తరచు అనుకుంటూ ఉంటాను:

“ఈశ్వరా, ఈ సన్యాసికి పెద్ద సంసార మిచ్చావుకదయ్యా!”

 1. లాంగ్ బీచ్ ప్రార్థనాలయం 1967 నాటికి బాగా పెరిగింది. ఆ సంవత్సరంలో ప్రార్థన సమావేశం, కాలిఫోర్నియాలోని పుల్లర్‌టన్‌లో ఏర్పాటయిన విశాలమైన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆలయానికి మారింది. (ప్రచురణకర్త గమనిక).
 2. ఈ వార్షికోత్సవం జరిగేటప్పుడు నేను, 1950 ఆగస్టు 27 న లాస్ ఏంజిలస్‌లో పవిత్రమైన గులాబి - దీపోత్సవం ఒకటి నిర్వహించాను; అప్పుడే 500 మంది విద్యార్థులకు క్రియాయోగ దీక్ష ఇచ్చాను.
 3. పరమహంస యోగానందగారు కూడా. ఈ జీవితం ముగిసిన తరవాత ‘క్రియావంతులు’ (సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పాఠాలు చదివి క్రియాయోగ దీక్ష తీసుకున్న విద్యార్థులు) అందరి ఆధ్యాత్మిక ప్రగతిని పైనుంచి గమనిస్తూనే ఉంటామని ప్రాచ్య పాశ్చాత్యదేశాల్లోని తమ శిష్యులకు చెప్పారు. ఈ చక్కని వాగ్దానంలోని సత్యం, ఆయన మహాసమాధి జరిగిన నాటినించి ఈనాటి వరకు, ఆయన సర్వాంతర్యామి మార్గదర్శిత్వం తెలిసి వచ్చిన క్రియాయోగులు అనేక మంది రాసిన ఉత్తరాల్లో రుజువయింది. (ప్రచురణకర్త గమనిక).
 4. ఆ స్వరం సముద్రఘోషలా నన్ను చుట్టుముట్టింది:

  “విధ్వంసమై నీ భూమి
    శకలాలుగా చెదిరపోయిందా?

  అవిగో, అన్నీ నీకు దూరంగా పారిపోతున్నాయి. నువ్వు నాకు దూరంగా పోతున్నావు కనక:

  నీ దగ్గర్నించి తీసుకున్నవన్నీ నేను
              నీకు హాని కలిగించాలని కాదు,
  వాటిని నువ్వు నా చేతులమీదగా పొందజూడాలని,
              పసివాడిలా పొరబడి నువ్వు

  ఏవి పోయాయని తలుస్తున్నావో, వాటినన్నిటినీ భద్రపరిచాను ఇంట్లో.

  లే, నా చెయ్యి బిగబట్టుకో, రా ఇక!”

  -ఫ్రాన్సిన్ థాంప్సన్, ‘ది హౌండ్ ఆఫ్ హెవెన్’లో

 5. భారతదేశం 18 శతాబ్దివరకు ప్రపంచంలో అన్ని దేశాలకన్న సంపన్న దేశమని చారిత్రకాధారాలు నిరూపిస్తున్నాయి. పైగా, తొలికాలపు ఆర్యులు ఆసియాలో మరో చోటినించో, యూరప్‌నుంచో భారతదేశం మీదికి “దండెత్తి వచ్చా” రంటూ చెప్పే ఇప్పటి పాశ్చాత్య చారిత్రక సిద్ధాంతాన్ని హైందవ సాహిత్యంలో కాని, సంప్రదాయంలో కాని ఏదీ నిరూపించడానికి ఉపకరించదు. ఊహాప్రాయమైన ఈ ప్రయాణం మొదలైన స్థానాన్ని పండితులు నిర్ధారణ చేసి చెప్పలేక పోతున్నారు; ఈ సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భారతదేశం హిందువులకు బహుపురాతన కాలంనుంచి నివాసస్థానంగా ఉంటూ వస్తున్నదన్న విషయాన్ని సూచిస్తూ, వేదాల్లో ఉన్న అంతస్సాక్ష్యాన్ని, అవినాశ్ చంద్ర దాస్‌గారు రాసిన ‘ఋగ్వేదిక్ ఇండియా’ [ఋగ్వేదకాలపు భారతదేశం] అన్న గ్రంథంలో వివరించడం జరిగింది. ఇది చాలా అసాధారణమైన గ్రంథం; హాయిగా చదివిస్తుంది: దీన్ని 1921 లో కలకత్తా విశ్వవిద్యాలయంవాళ్ళు ప్రచురించారు. భారతదేశం నుంచి వలసపోయినవాళ్ళు యూరప్‌లోనూ ఆసియాలోనూ వివిధ ప్రదేశాల్లో స్థిరపడి, ఆర్యభాషనూ జానపదవిజ్ఞానాన్నీ వ్యాప్తిచేస్తూ వచ్చారని ప్రొఫెసర్ దాస్ వాదం. ఉదాహరణకు, లిథూనియా భాషకు చాలా విధాలుగా, సంస్కృతంతో పోలిక కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. సంస్కృతమేమీ దాని కాంట్ అనే తాత్త్వికుడు, లిథూనియా భాషకుగల శాస్త్రీయమైన నిర్మాణాన్ని చూసి అప్రతిభుడయాడు. “భాషాశాస్త్రానికే కాకుండా చరిత్రకు కూడా సంబంధించిన అనేక రహస్యాల్ని ఛేదించే కీలకం అందులో ఉంది.” అన్నాడాయన.

భారతదేశ సంపదలగురించి ప్రస్తావిస్తూ బైబిలు (II క్రానికిల్స్ 9 : 21.10,, “తార్షీష్” ఓడలు, “బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు” మాత్రమే కాకుండా, అల్గం (చందనం ) చెట్లకొయ్య, రత్నాలు కూడా సమృద్ధిగా, ఓఫిర్ (బొంబాయి సముద్రతీరంలో ఉన్న సోపారా) నుంచి తెచ్చి

సాలమన్ రాజుకు ఇచ్చాయని చెబుతోంది. గ్రీకు రాయబారి మెగస్తనీస్ (క్రీ.పూ 4 శతాబ్ధి), భారతదేశ సౌభాగ్యాన్ని గురించి వివరంగా రాసి పెట్టాడు. రోమన్లు, అప్పట్లో బ్రహ్మాండమైన నౌకాబల సంపన్నంగా ఉన్న భారతదేశం నుంచి చేసుకునే దిగుమతుల నిమిత్తం, ఏడాదికి ఐదు కోట్ల సెస్టెర్సులు (5,000,000 డాలర్లు) ఖర్చు పెట్టేవారని ప్లినీ (క్రీ. శ. 1 శతాబ్ది) అంటాడు. సుసంపన్నమైన భారతీయ నాగరికత గురించి, సువ్యాప్తమైన విద్యను గురించి, అద్భుతమైన ప్రభుత్వపాలన గురించి చైనా యాత్రికులు వివరంగా రాశారు. ఫాహియాన్ (ఐదో శతాబ్ది) అనే చైనా పురోహితుడు, భారతదేశ ప్రజలు హాయిగా, విశ్వాసపాత్రులుగా, భోగభాగ్యాలతో వర్ధిల్లుతున్నారని చెబుతున్నాడు. శామ్యుల్ బీల్ (Samuel Beal), “బుద్ధిస్ట్ రికార్డ్స్ ఆఫ్ ది వెస్టర్న్ వరల్డ్” అనే పేరుతో, పాశ్చాత్య ప్రపంచ బౌద్ధ లిఖిత పత్రాల గురించి (ఇక్కడ భారతదేశమే. చైనావాళ్ళకు “పాశ్చాత్య ప్రపంచం”) రాసిన గ్రంథం చూడండి. టన్నల్, లండన్ , అలాగే, థామస్ వాటర్స్, (Thomas Watters) అనే ‘యువాన్ చ్వాంగ్స్ ట్రావెల్స్ ఇన్ ఇండియా’ అనే పేరుతో, యువాన్ చ్వాంగ్ భారతదేశ యాత్రలగురించి రాసిన గ్రంథం కూడా చూడండి; క్రీ. పూ. 629- 45, రాయల్ ఏషియాటిక్ సొసైటీ). కొలంబస్ 15 శతాబ్దిలో నూతన ప్రపంచాన్ని కనిపెట్టే సందర్భంలో, నిజానికి అతడు అన్వేషిస్తున్నది, భారతదేశానికి మరింత దగ్గరి వర్తకమార్గం. భారతదేశంనుంచి ఎగుమతి అయే - పట్టుబట్టలు, నునుసన్నని బట్టలు (“నేసిన” గాలి, “కంటబడని పొగమంచు” అన్న వర్ణనలకు సరిగా తగినవి), నూలు అద్దకం బట్టలు, బ్రోకేడ్లు, కసీదాలు, కంబళ్ళు, కత్తులూ, చాకులూ వంటి కోత సామగ్రి, దంతం, దంతం నగిషీ సామగ్రి పరిమళ తైలాలు, ధూపసామగ్రి, చందనం కర్ర, మట్టిపాత్రలు, ఓషధులు, లేపనాలు, నీలిమందు, బియ్యం, మసాలా వస్తువులు, పగడాలు, బంగారం, ముత్యాలు, కెంపులు, పచ్చలు, వజ్రాలు కొనుక్కోవాలన్న లాలస, యూరప్‌కు అనేక శతాబ్దాలపాటు ఉండేది. విజయనగర సామ్రాజ్య మంతటా కనిపించే అతులిత వైభవాన్ని చూసినప్పుడు తమకు కలిగిన ఆశ్చర్యాన్ని గురించి పోర్చుగల్లు, ఇటలీదేశాల వర్తకులు రాసి పెట్టారు. ఆ సామ్రాజ్య రాజధాని వైభవాన్ని వర్ణిస్తూ, అరేబియా రాయబారి రజాక్ , “భూమిమీద దానికి సమానమైన చోటు మరేదీ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,” అంటూ రాశాడు.

భారతదేశ సుదీర్ఘ చరిత్రలో మొట్టమొదటిసారిగా 16 శతాబ్దిలో, దేశమంతా హైందవేతరుల పాలనలో పడింది. టర్కీదేశపు బాబరు 1524 లో భారతదేశం మీద దాడిచేసి ముస్లిం రాజవంశాన్ని స్థాపనచేశాడు. ఈ ప్రాచీన భారతదేశంలో స్థిరపడ్డ కారణంగా కొత్తరాజులు, ఇక్కడి సంపదల్ని బయటికి తీసుకు వెళ్ళలేదు. అంతఃకలహాలవల్ల బలహీనమైపోయినప్పటికీ, సంపన్నమైన భారత

దేశం, 17 శతాబ్దిలో అనేక యూరప్ దేశాలకు ఎర అయింది; చివరికి ఇంగ్లండు పాలకదేశంగా పరిణమించింది. 1947 ఆగస్టు 15 న భారతదేశం ప్రశాంతంగా స్వాతంత్ర్యం పొందింది.

చాలామంది భారతీయులకున్నట్టుగానే నాకు కూడా, ‘ఇప్పుడిక చెప్పవచ్చు’ ననిపించే కథ ఒకటి ఉంది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో, కాలేజిలో నాకు తెలిసిన యువకులు కొందరు నా దగ్గరికి వచ్చి, ఒక విప్లవోద్యమానికి నాయకత్వం వహించమని నన్ను కోరారు. దానికి జవాబుగా, “మన ఆంగ్ల సోదరుల్ని చంవడంవల్ల భారతదేశానికి మేలేమీ జరగబోదు. దీనికి స్వాతంత్ర్యం వచ్చేది, ఆధ్యాత్మిక శక్తివల్లే కాని, తుపాకిగుండ్ల ద్వారా కాదు,” అని చెబుతూ దాన్ని నిరాకరించాను. ఆయుధాలు తీసుకువస్తున్న జర్మనీ ఓడల్ని నమ్ముకున్నారు మా స్నేహితులు; వాటిని బ్రిటిష్ వాళ్ళు, బెంగాలులో డైమండ్ హార్బర్ దగ్గర అటకాయించడం జరుగుతుందని నేను వాళ్ళకి చెప్పాను. అయినప్పటికీ ఆ యువకులు తమ పథకాలు సాగించారుకాని, చివరికి నేను చెప్పినట్టే జరిగింది. కొన్నేళ్ళ తరవాత మా స్నేహితులు జైలునుంచి విడుదల అయారు. వాళ్ళలో చాలామంది హింసాత్మక చర్యల మీద తమకున్న దృఢ విశ్వాసాల్ని వదలుకొని, గాంధీమహాత్ముల ఆదర్శవంతమైన రాజకీయోద్యమంలో చేరారు. చివరికి, విశిష్ట “యుద్ధాన్ని” శాంతియుతంగా జయించిన భారతదేశ విజయాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు. దురదృష్టవశాత్తు దేశం, భారత పాకిస్తానులుగా చీలిపోవడం, ఆ తరవాత దేశంలో కొన్నిచోట్ల - కొద్దికాలమే అయినా- రక్తపాతం జరగడం అన్నవి, ఆర్థిక కారణాల వల్ల జరిగినవే కాని, ప్రధానంగా మతోన్మాదం వల్ల జరిగినవి కావు. (పొరపాటున, అప్రధాన కారణాన్ని ప్రధాన కారణంగా చూపెట్టడం జరుగుతోంది). పూర్వకాలంలో మాదిరిగానే ఇప్పటికీ కూడా, అసంఖ్యాకులైన హిందువులూ ముస్లిములూ సామరస్యంగా ఇరుగుపొరుగుల్లోనే నివసిస్తున్నారు. ఈ ఉభయ మతానుయాయుల్లోనూ, అనేకమంది, “మతశాఖారహిత” గురువైన కబీరు (1450-1518) కు శిష్యులయారు; ఈనాటి వరకు కూడా ఆయనకు లక్షలాది మంది అనుయాయులుగా, ఉంటూ వస్తున్నారు (కబీర్ పంథీలు). అక్బరు చక్రవర్తి ముస్లిం పాలనకాలంలో భారతదేశమంతటా మతవిశ్వాస స్వాతంత్ర్యం వీలయినంత ఎక్కువగా ఉండేది. ఈనాటికీ, 95% మంది, నిరాడంబర జనుల్లో తీవ్రమైన మతవైషమ్యం లేదు. నిజమైన భారతదేశం, ఒక గాంధీ మహాత్ముణ్ణి అర్థం చేసుకొని ఆయన్ని అనుసరించగల భారతదేశం కనిపించేది, అశాంతితో నిండిన పెద్ద నగరాల్లో కాదు: 70,000 ప్రశాంతమైన పల్లెల్లో , అక్కడ పంచాయతుల (స్థానిక పాలన మండలులు) ద్వారా సరళంగా, న్యాయంగా పరిపాలన జరగడమన్నది అత్యంత ప్రాచీనకాలంగా సాగుతూవస్తున్న సంప్రదాయం. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ఈనాడు ఎదురవుతున్న సమస్యల్ని కాలక్రమంలో, మహాపురుషులు పరిష్కరిస్తారు, అటువంటివాళ్ళని భారతదేశం కనకపోవడం లేదు

 • “ స్వేచ్ఛగా సేవిస్తాం మనం
    స్వేచ్ఛగానే ప్రేమిస్తాం కనక; మన సంకల్పంలో ఉంది
    ప్రేమించడమో మానడమో; ఇందులోనే, మనం నిలిచినా కూలినా.
    కొందరు పతనమయారు, అవిధేయతకు పాల్పడి పతనమయారు
    ఆ నాకంనుంచి లోతయిన నరకంలోకి, ఎంత పతనం
    ఎంత ఉన్నతానంద స్థితినించి ఎంత విషాదస్థితికి!”

  – మిల్టన్, ‘పేరడైజ్ లాస్ట్’

 • దృగ్విషయిక లోకాలన్నీ రూపొందడానికి కారణమైన దైవలీల, లేదా “విలాసక్రీడ” ప్రణాళిక, సృష్టికీ స్రష్టకూ ఉన్న అన్యోన్యాశ్రయ సంబంధాల్లో ఒకటి. మానవుడు దేవుడి కివ్వగలిగిన ఒకే ఒక కానుక ప్రేమ; ఆయన అపారకృపకు పాత్రుడు కావడానికి అదొక్కటి చాలు. “మీరు నావన్నీ దొంగిలించేశారు, మొత్తం ఈ దేశంతో సహా; నా మందిరంలో ఆహారముండేటందుకు పదోవంతు పన్నులన్నీ ఈ గిడ్డంగికి తీసుకురండి; ఇప్పుడే ఇక్కడే నాకు నిరూపించండి అన్నారు అతిథుల దేవుడు (యోహోవా). నేను మీ కోసం స్వర్గమందిరం కిటికీలు కనక తెరవకపోతే, మీకు ఆశీస్సు కురిపించకపోతే దాన్ని స్వీకరించడానికి మీకు చాలినంత చోటే ఉండదు.” మలాకి 3:9 -10 (బైబిలు)
 • ప్రస్తుతం లాస్ ఏంజిలస్ నుంచి వచ్చే ‘సెల్ఫ్ రియలైజేషన్ మేగజైన్’ లోనూ, ‘యోగదా మేగజైన్’ లోనూ - యోగదా ఆశ్రమం, దక్షిణేశ్వరం, పోస్టు ఆరియాదా, 24 పరగణాలు, పశ్చిమ బెంగాలు - ధారావాహికంగా ప్రచురణ అవుతోంది.

  భగవద్గీత, భారతదేశానికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర గ్రంథం. అందులో శ్రీకృష్ణుడు తన శిష్యుడైన అర్జునుడికి చేసిన ఉపదేశం ఉంది. ఆధ్యాత్మిక మార్గదర్శిత్వానికి ఉపకరించే ఆయన మాటలు, సత్యాన్వేషకులు ఆచరణలో పెట్టడానికి ఉపయుక్తమైనవి; కాలావధి లేనివి.

 • భగవద్గీత 4:29; 5:27-28.
 • 26 అధ్యాయం చూడండి. సవికల్ప సమాధిలో ఉండగా కనిపించిన క్రైస్తవ మార్మికుల్లో చెప్పుకోదగినావిడ, ఆవిలా వాస్తవ్యురాలైన సెంట్ తెరిసా. ఆవిడ శరీరం, కదపడానికి వీలులేకుండా ఎంత స్థిరంగా బిగిసిపోయేదంటే, వాళ్ళ మఠంలో, ఆవిణ్ణి చూసి ఆశ్చర్యపోయిన సన్యాసినులు, ఆవిడ భంగిమను మార్చడానికి కాని, బాహ్యస్పృహ కలిగించడానికి కాని అశక్తులయేవారు.
 • “సామాన్య మానవుడు”. ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు ఆధ్యాత్మిక కృషి ఆరంభించవలసిందే. “వెయ్యిమైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది,” అన్నాడు లావో-ట్జు. “మంచిని గురించి, ‘అది నా దగ్గరికి రాదు’ అని మనస్సులో ఎవరినీ అనుకోనియ్యకు. ఒక్కొక్క నీటిబొట్టుతోనే కుండ నిండుతుంది; బుద్ధిమంతుడు కొద్దికొద్దిగా ప్రోది చేసుకుంటున్నప్పటికీ చివరికి మంచితో నిండిపోతాడు,” అంటూ బుద్ధుడు చెప్పింది పోల్చి చూడండి.
 • జేమ్స్ 4 : 4 (బైబిలు).
 • “యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా,
    యోగినో యత చిత్తస్య యుజ్జ్యతో యోగమాత్మనః.

    యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా,
    యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి.

    సుఖమాత్యంతికిం యత్తద్ బుద్ధి గ్రాహ్యమతీంద్రియం,
    వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః,

    యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః,
    యస్మిన్‌స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే.

    తం విద్యాద్దుఃఖ సంయోగవియోగం యోగసంజ్ఞితం
    స నిశ్చయేన యోక్తవ్యో యోగో౽నిర్విణ్ణచేతసా.

  - భగవద్గీత 6 : 19-24

 • జెనిసిన్ 2 : 7 (బైబిలు)
 • నీ నరనరాల్లో సముద్రమే ప్రవహించనంతవరకు, నువ్వు ఆకాశాంబర దారివై నక్షత్రజాల కిరీటాన్ని ధరించి యావత్ప్రపంచానికి నువ్వే ఏకైక వారసుడిగా నిన్ను దర్శించుకోనంతవరకు. అంతకన్న మిన్నగా, ప్రతి ఒక్కడూ నీలాగే ఏకైక వారసులయినవాళ్ళు ఉన్నారు కాబట్టి; పిసినిగొట్టువాళ్ళు బంగారాన్నీ, రాజులు తమ రాజదండాల్నీ చూసుకొని ఆనందించేటట్టుగా నువ్వు దేవుణ్ణి కీర్తిస్తూ సంబరపడుతూ ఆనందానుభూతి పొందేవరకు... నీ నడకా, నీ బల్లా నీకు పరిచయమై ఉన్నంతగా, అన్ని యుగాల్లోనూ దైవలీలలతో నీకు పరిచయం కలిగేటంతవరకు; ప్రపంచ సృష్టికీ మూలమైన - ఛాయామాత్ర శూన్యంతో నీకు అత్యంత సన్నిహితంగా పరిచయం ఏర్పడేటంతవరకు నువ్వు ఈ లోకంలో సమ్యగానందానుభూతి ఎన్నడూ పొందలేవు.” – థామస్ ట్రాహర్న్, ‘సెంచరీస్ ఆఫ్ మెడిటేషన్స్’ (ధ్యాన శతకాలు)లో.
 • యోహాను 14 : 1-2 (బైబిలు).
 • “నా ఆలోచనలు నీ ఆలోచనలు కావు, నీ మార్గాలు నా మార్గాలు కావు, అన్నాడు ప్రభువు. భూమికన్న ఆకాశం ఎత్తులో ఉన్నట్టే, నా మార్గాలు నీ మార్గాలకన్న ఉన్నతమైనవి, అలాగే నీ ఆలోచనల కన్న నా ఆలోచనలూను.” యెషయా 35 : 8–9. ‘ది డివైన్ కామెడీ'లో డాంటీ ఇలా ధ్రువపరిచాడు.

  “ఆయన కాంతితో ప్రకాశమానమైన
   ఆ స్వర్గంలో నేను ఉండివచ్చాను, అక్కడ నేను చూసినవి చెప్పాలంటే
   తిరిగి వచ్చినవాడికి, దానికి నేర్పూ లేదు, ఎరుకా లేదు;
   చిరకాంక్షాతప్తుడైనవాడికి అది చేరువవుతున్నప్పుడు
   మన బుద్ధి ఎంత గాఢంగా ఆనందమగ్నమవుతుందంటే,
   తాను వచ్చిన దారిని అది మళ్ళీ పట్టుకోలేదు.
   అయినా, ఆ దివ్యరాజ్యాన్ని గురించిన జ్ఞానమేదైనా
   భద్రపరచుకోడానికి, జ్ఞాపకశక్తిలో ఉన్నంతవరకు
   ఈ పాట ముగిసేవరకు నా గానానికి విషయమవుతుంది.”

 • వెలుగులోంచి చీకటిలోకి మళ్ళీ చీకటిలోంచి వెలుగులోకి సాగుతుండే ప్రపంచ దివారాత్ర చక్రం, సృష్టిమాయతో లేదా పరస్పర విరుద్ధ స్థితులతో ముడిపడి ఉన్నదన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది. (రోజులో సంధికాలాలైన సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్ని, ధ్యానానికి, శుభప్రదమైనవని, అందుకే భావిస్తారు). యోగి ఈ ద్వంద్వరూపాత్మక ఆవరణాన్ని ఛేదించుకొని అతీంద్రియ ఏకత్వాన్ని దర్శిస్తారు.
 • యోహాను 1: 18.
 • యోహాను 5 : 19 (బై బిలు).
 • ‘సత్, తత్, ఓం’ లేదా, పిత, పుత్రుడు, పరిశద్ధాత్మ అనే త్రయరూప సత్యానికి భిన్నమైన భావన ఇది. బ్రహ్మ - విష్ణు - శివులు పరమేశ్వరుడి త్రయభావాన్ని, స్పందనశీలమైన సృష్టిలో అంతర్నిహితమైన ఉన్న కూటస్థ చైతన్యమనే ‘తత్’ను లేదా, పుత్రుణ్ణి సూచిస్తారు. త్రిమూర్తుల “భార్యలు”గా చెప్పే ‘శక్తులు’, స్పందన ద్వారా విశ్వాన్ని నిలిపే ఏకైక మూలకారణ శక్తి అయిన ‘ఓం’కారానికి లేదా, పరిశద్ధాత్మకు సంకేతాలు.
 • “ఓ ప్రభూ... అన్నిటినీ నువ్వు సృష్టించావు; అవన్నీ నీ ఆనందంకోసం సృష్టి అవుతున్నాయి.” - రివలేషన్ 4 : 11 (బైబిలు).
 • యోహాను 14: 12.
 • “మంచిని ప్రేమించు; అదొక్కటే స్వేచ్ఛగా ఉన్నది;
   అదే నేర్పగలదు నీకు, ఎలా పైకి పోవాలో
   తరంగిత ఘంటానాదం కన్న, పైకి;
   ఆ మంచె నీరసమై ఉంటే.
   స్వర్గమే దానికోసం కిందికి వంగుతుంది. - మిల్టన్, ‘కేమస్’

 • యోహాను 18 : 37 (బైబిలు).
 • సామ్స్, 46:10 (బైబిలు).
 • యెషయా 55: 12.