Jump to content

ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 48

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 48

కాలిఫోర్నియాలో ఎన్సినిటాస్‌లో

“గురూజీ, మీకు ఆశ్చర్యం కలిగించే ఒక్క సంగతి! మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మేము ఈ ఎన్సినిటాస్ ఆశ్రమం నిర్మించాం; మీరు తిరిగి వచ్చిన శుభసందర్భంగా అందించే ‘స్వాగత బహుమానం’ ఇది.” శ్రీలిన్, సిస్టర్ జ్ఞానమాత, దుర్గా మా, మరికొందరు భక్తులు ముసిముసిగా నవ్వుకుంటూ నన్నొక ద్వారంగుండా, చెట్లనీడ పరుచుకున్న దారి వెంబడి నడిపించారు.

నీలి సముద్రంలోకి ప్రవేశించబోయే బ్రహ్మాండమైన ఓడమాదిరిగా ముందుకు పొడుచుకువచ్చినట్టున్న ఒక భవనాన్ని చూశాను. మొదట నోట మాటరాలేదు; ఆ తరవాత “ఆహాలూ, ఓహోలూ!” అటుతరువాత సంతోషాన్నీ కృతజ్ఞతనూ వ్యక్తం చెయ్యడానికి మనిషికి చాలనంత పద జాలాన్ని ఉపయోగిస్తూ ఆశ్రమమంతా పరిశీలించాను - అసాధారణంగా విశాలంగా ఉన్న పదహారు పెద్ద గదులు; ప్రతి గదీ మనస్సును ఆకట్టు కొనేటట్టు తీర్చిదిద్ది ఉంది.

పై కప్పు నంటేటంతగా ఎత్తయిన - పెద్దపెద్ద కిటికీలుగల బ్రహ్మాండమైన హాలు, పచ్చలూ మాణిక్యాలూ నీలాలు అందంగా అమర్చినట్టుగా పచ్చిక, సముద్రం, ఆకాశంగల వేదికమీద నిలిచినట్టుగా ఉంది. ఆ హాలులో పెద్ద నిప్పుగూటికి పైనున్న బడ్డీమీద క్రీస్తు , బాబాజీ, లాహిరీమహాశయులు, శ్రీయుక్తేశ్వర్‌గార్ల బొమ్మలు అమర్చి ఉన్నాయి; ప్రశాంతమైన ఈ పాశ్చాత్యదేశపు ఆశ్రమంమీద వారు ఆశీస్సులు కురిపిస్తున్నట్టు అనిపించింది నాకు.

ఆ హాలుకు సూటిగా కింద, కొండ ముందుభాగంలోనే అనంతమైన ఆకాశానికీ సముద్రానికీ ఎదురుగా ధ్యానగుహలు రెండు నిర్మించి ఉన్నాయి. మైదానాల్లో ఎండ కాచుకునే ప్రదేశాలు, నాపరాయి పరిచిన దారులు, ప్రశాంతమైన పొదరిండ్ల కూ గులాబీతోటలకూ ఒక యూకలిప్టస్ తోటకూ, కొన్ని ఎకరాల మేర విస్తరించిన పండ్లతోటకూ వెళ్తాయి.

సాధువుల ఉత్తమ, వీరోచితాత్మలు ఇక్కడికి వచ్చుగాక! (ఆశ్రమ ద్వారాల్లో ఒకదానిమీద వేలాడదీసిన, “నివాసంకోసం ఒక విన్నపం”లో ఇలా ఉంది; ఇది ‘జెంద్ - అవెస్తా’ లోంచి ఎంపిక చేసినది); వారు మాతో చెయ్యీ చెయ్యీ కలిపి సాగుతూ, భూమిలా సమృద్ధమై, ఆకాశంలా ఉదాత్తమైన తమ శుభాశీస్సులు మాకు అందిస్తూ ఉందురు గాక!

కాలిఫోర్నియాలో ఎన్సినిటాస్‌లో ఉన్న పెద్ద ఎస్టేటు, శ్రీ జేమ్స్ జి. లిన్, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు ఇచ్చిన కానుక. శ్రీ లిన్ 1932 జనవరిలో దీక్ష తీసుకున్నప్పటినించి నిష్ఠగా సాధన చేస్తూ వస్తున్న క్రియాయోగి. (విస్తృతంగా చమురు వ్యాపారం చేసే సంస్థకు అధిపతిగా, ప్రపంచమంతటిలోకి బృహత్తరమైన అన్యోన్య అగ్నిభీమా వినిమయ సంస్థకు అధ్యక్షుడుగా) అంతులేని బాధ్యతలుగల అమెరికా వ్యాపారస్తుడు శ్రీ లిన్; అయినప్పటికీ ఈయన, ప్రతిరోజూ చాలా సేపు గాఢంగా కియాయోగ ధ్యానం చెయ్యడానికి వీలు చేసుకుంటారు. అటువంటి సంతులిత జీవితం గడుపుతూ ఈయన, అచంచల ప్రశాంతిని ప్రసాదించే సమాధిస్థితిని అందుకొన్నారు.

నేను భారతదేశంలోనూ యూరప్‌లోనూ ఉన్న కాలంలో (జూన్ 1935 నుంచి అక్టోబరు 1936 వరకు) శ్రీ లిన్,[1] ఎన్సినిటాస్ ఆశ్రమ నిర్మాణాన్ని గురించిన సమాచారం నాకు అందకుండా ఆపడానికి, కాలిఫోర్నియా నుంచి నాతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవాళ్ళతో కలిసి, ప్రేమపూర్వకంగా పన్నాగం పన్నారు. ఆశ్చర్యం, ఆనందం!

అమెరికాలో ఉన్న తొలిరోజుల్లో నేను, సముద్రపు ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించడానికి అనువయిన చిన్న స్థలంకోసం కాలిఫోర్నియా తీరాన్ని గాలించాను. అనుకూలమైన ప్రదేశం కనిపించినప్పుడల్లా నా ప్రయత్నాన్ని విఫలం చెయ్యడానికి ఏదో ఒక ఆటంకం తప్పకుండా వస్తూ ఉండేది. ఇప్పుడు ఎన్సినిటాస్‌లో ఆహ్లాదకరమైన అనేక ఎకరాల భూమిని తిలకిస్తూ, “సముద్రతీరంలో ఒక ఆశ్రమం” అంటూ చాలాకాలం కిందట శ్రీ యుక్తేశ్వర్‌గారు చెప్పిన జోస్యం ఫలించడం సవినయంగా చూశాను.

కొన్ని నెలల తరవాత, 1937 ఈస్టర్‌లో, కొత్త ఆశ్రమప్రదేశంలోని పచ్చికబయలులో మొట్టమొదటి ఈస్టర్ ప్రభాతసేవ జరిపాను. సనాతన పారశీక పురోహితులలా, అనేక వందలమంది విద్యార్థులు, ప్రతి నిత్యం అద్భుతంగా, ఆకాశంలో తూర్పున ఉదయించే సూర్యబింబాన్ని భక్తిపరవశులయి తిలకించారు. పడమటివేపు, గంభీర ప్రస్తుతితో ఘోషిస్తూ ఉంది పసిఫిక్ మహాసముద్రం; దూరాన పయనిస్తున్న తెల్లటి చిన్న పడవ, ఒంటిగా ఎగురుతూ పోతున్న ఒక సముద్ర పక్షి. “క్రీస్తూ నువ్వు పునరుత్థానం చెందావు!” వాసంత రవిబింబంతో మాత్రమే కాదు, పరమేశ్వరుడి శాశ్వతోషస్సుతో.

అనేక మాసాలు ఆనందంగా గడిచిపోయాయి. పరిపూర్ణ సౌందర్యా కీర్ణమైన ఎన్సినిటాస్‌లో, చాలాకాలం కిందట నేను పథకం వేసుకున్న, ‘కాస్మిక్ ఛాంట్స్’ (విశ్వగీతాలు) రచన పూర్తిచేశాను. భారతీయ గీతాలు చాలావాటికి ఆంగ్లపదాలూ, పాశ్చాత్య స్వరసంకేతాలూ సమకూర్చాను. వాటిలో కొన్ని: శంకరాచార్యులవారి “నిర్వాణ షట్కం” (నో బర్త్ నో డెత్); పురాతన సంస్కృత మంత్రం “బ్రహ్మానందం పరమసుఖదం” (హిమ్ టు బ్రహ్మ); టాగూరు రాసిన “మందిరే మమ కే ఆసిత్న ఛే?” (హూ ఈజ్ ఇన్ మై టెంపుల్!); ఇవి కాక నేను సొంతంగా కూర్చిన పాటలు కొన్ని: “ఐ విల్ బి దైన్ ఆల్వేస్” (నే నెప్పుడూ నీ వాడిగా ఉంటాను), “ఇన్ ది లాండ్ బియాండ్ మై డ్రీమ్స్” (నా కలల కావలి లోకంలో), “కం ఔట్ ఆఫ్ ది సైలెంట్ స్కై” (మౌన గగనం నుంచి వెలుపలికి రా), “లిసెన్ టు మై సోల్ కాల్” (నా ఆత్మ పిలుపును అలకించు), “ఇన్ ది టెంపుల్ ఆఫ్ సైలెన్స్” (శాంతి మందిరంలో). [2]

ప్రాచ్యదేశాల కీర్తనలకు పాశ్చాత్యుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వివరిస్తూ నా మొట్టమొదటి ప్రముఖ అనుభవాన్ని ఉల్లేఖిస్తూ ఆ పాటల పుస్తకానికి తొలిపలుకు రాశాను. సందర్భం ఒక బహిరంగోప న్యాసం; కాలం, ఏప్రిల్ 18, 1926; స్థలం, న్యూయార్కులో కార్నెగీ హాలు.

“ఓ గాడ్ బ్యూటిఫుల్” (హే హరిసుందర!) అన్న పూర్వకాలపు కీర్తన ఒకటి పాడమని శ్రోతల్ని అడుగుదామనుకుంటున్నాను,” అని ఏప్రిల్ 17న, శ్రీ ఆల్విన్ హన్సికర్ అనే అమెరికన్ విద్యార్థికి చెప్పాను.[3]

ప్రాచ్యదేశాల పాటలు అమెరికన్లకు సులువుగా అర్థంకావని, నేనన్నదానికి అభ్యంతరం చెప్పాడు శ్రీ హన్సికర్.

“సంగీతం సర్వప్రపంచ భాష,” అని జవాబిచ్చాను. “ఆ ఉదాత్త కీర్తనలో ఉన్న ఆత్మోత్తేజక భావాన్ని అనుభూతి కావించుకోడంలో అమెరికావాళ్ళు విఫలం చెందరు.”


మర్నాడు రాత్రి, “ఓ గాడ్ బ్యూటిఫుల్” అన్న పాటలోని భక్తిపూరితమైన స్వరాలు ఒకేసారి మూడువేల కంఠాల్లోంచి వెలువడి, గంట సేపటికి పైగా వినవచ్చాయి. ప్రియమైన న్యూయార్కు వాసులారా, అసంతృప్తి చెందకండి! మీ హృదయాలు సరళమైన ఈ కీర్తనలో ఆనందతరంగితాలయాయి. భగవంతుడి దివ్యనామాన్ని ప్రేమతో గానం చేసిన భక్తులకు ఆ రాత్రి, దివ్యమహిమవల్ల జబ్బులు నయమయాయి.

1939 లో, బోస్టన్‌లో ఉన్న సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని చూడడానికి వెళ్ళాను. బోస్టన్ కేంద్రం నాయకుడైన డా॥ ఎం. డబ్ల్యు. లూయిస్ నాకు, కళాత్మకంగా అలంకరించిన ఒక మందిరంలో బస ఏర్పాటుచేశాడు. డా॥ లూయిస్ చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు: “గురూజీ, మీరు అమెరికాలో ఉన్న తొలిరోజుల్లో ఈ నగరంలో, స్నానాల గది లేని ఒంటిగదిలో ఉన్నారు. అయితే, బోస్టన్ నగరంలో విలాసవంతమైన నివాసాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి మీకు తెలియాలని అనుకున్నాను!

కాలిఫోర్నియాలో అనేక సంవత్సరాలు వివిధ కార్యకలాపాలతో కులాసాగా గడిచిపోయాయి. ఎన్సినిటాస్‌లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కోలనీ[4] ఒకటి 1937 లో ఏర్పడింది. కోలనీలో జరిగే అనేక కార్యకలాపాలు, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశయాల్ని అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇస్తాయి. ఎన్సినిటాస్, లాస్ ఏంజిలస్ కేంద్రాల్లో ఉండేవాళ్ళ కోసం పండ్లూ కూరగాయలు పండించే తోటలు పెంచడం జరుగుతున్నది.

కోలనీ కార్యకలాపాల్లో, ఎన్. ఆర్. ఎఫ్. ఆశయాల్ని అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇవ్వడం, ఎన్సినిటాస్ కేంద్రంలోనూ లాస్ ఏంజిలస్ కేంద్రంలోనూ ఉండే ఎస్. ఆర్. ఎఫ్. నివాసుల ఉపయోగార్థం తాజా కూరగాయలు పండించే విస్తృత వ్యవసాయపథకాన్ని అమలుపరచడం కూడా జరుగుతున్నది.

“ఈశ్వరుడు సమస్త దేశజనుల్నీ ఒకే రక్తంతో సృష్టించాడు.”[5] “ప్రపంచ సోదరత్వం” అన్నది పెద్ద మాటే; కాని మానవుడు తనను ప్రపంచ పౌరుడిలా పరిగణించుకొని తన సానుభూతులను విధిగా విస్తరింపజేసుకోవాలి. “ఇది నా అమెరికా, నా ఇండియా, నా ఫిలిపైన్స్, నా యూరప్, నా ఆఫ్రికా” వగైరాలు నిజంగా అర్థంచేసుకున్నవాడు సుఖమయ జీవనానికి అవకాశం పొందకుండా ఉండడు.

శ్రీయుక్తేశ్వర్‌గారి దేహం, భారతదేశంలో తప్ప మరెక్కడా నివసించనప్పటికీ, ఆయన ఈ సోదరభావ సత్యాన్ని ఎరుగుదురు:

“ప్రపంచం నా నివాసభూమి.”

  1. పరమహంసగారి మహాసమాధి తరవాత శ్రీ లిన్ (రాజర్షి జనకానంద) సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు అధ్యక్షులుగా పనిచేశారు. గురువుగారిగురించి శ్రీ లిన్ ఇలా అన్నారు: “సాధుపుంగవుని సాంగత్యం ఎంత దివ్యమైనదని! నా జీవితంలో లభించినవాటన్నిటిలోకీ, పరమహంసగారు నా మీద కురిపించిన దీవెనలే విలువయినవిగా గుండెలో పదిలపరుచుకుంటాను.”

శ్రీ లిన్ 1955 లో మహాసమాధి చెందారు. ( ప్రచురణకర్త గమనిక ).

  • “కాస్మిక్ ఛాంట్స్” లో ఉన్న చాలా పాటలకు పరమహంస యోగానందగారు రికార్డింగులు ఇచ్చారు. ఈ రికార్డులు, లాస్ ఏంజిలస్‌లో ఉన్న ఎస్. ఆర్. ఎఫ్. లో దొరుకుతాయి. (ప్రచురణకర్త గమనిక ).
  • గురునానక్ పాటలోని పదాలు ఇలా ఉంటాయి:

    హే హరిసుందర, హే హరిసుందర

    వనోం వనోం మే శ్యామల శ్యామల
    గిరీ గిరీ మే ఉన్నత ఉన్నత
    సరితా సరితా చంచల చంచల
    సాగర సాగర గంభీర హే!

    సేవక జన కే సేవ సేవ పర్
    ప్రేమికజన కే ప్రేమ ప్రేమ పర్
    దుఃఖిజనోంకే వేదన వేదన
    యోగిజనోంకే ఆనంద హే!

    హే హరిసుందర హే హరిసుందర
    తేరే చరణ్‌పర్ సిర్ నమో!

  • ఇప్పుడిది బాగా వర్ధిల్లుతున్న ఆశ్రమ కేంద్రం; ఇక్కడి భవనాల్లో అసలు ప్రధాన ఆశ్రమమూ, సన్యాసులకూ సన్యాసినులకూ వేరువేరు ఆశ్రమాలూ భోజన సదుపాయాలూ, సభ్యులకూ స్నేహితులకూ ఆకర్షవంతమైన ఏకాంత స్థలమూ ఉన్నాయి. రాజమార్గంవేపు ఉన్న విశాల భూమికి అభిముఖంగా వరసగా తెల్లటి స్తంభాలున్నాయి. వీటికి మకుటాయమానంగా, స్వర్ణదళాల లోహ పద్మాలున్నాయి. భారతీయ కళలో పద్మం, “మెదడులోని వెయ్యిరేకుల వెలుగుల తామరపువ్వు” అనే విశ్వచేతనాకేంద్రానికి (అంటే సహస్రారానికి) చిహ్నం.
  • యాక్ట్స్ 17 : 26 (బైబిలు).